December 23, 2007

పుస్తక పఠనం – 2007

హిందూ లిటరరీ సప్లిమెంట్ చూసాక ఈ ఆలోచన తట్టింది. ప్రముఖులు ఈ సంవత్సరం తాము చదివిన పుస్తకాల్ని పరిచయం చేసారందులో. ఆఫ్ట్రాల్ మనకూ ఓ పత్రిక ఉంది కదా రాసిపడేద్దామని రాస్తున్నాను.

నాకు సంబంధించినంత వరకూ, పుస్తకాల పరంగా, 2007 కాస్త మందకొడి సంవత్సరమనే చెప్పాలి. కారణాలేమైతేనేం, తక్కువే చదివాను. అయితే కొత్త సంవత్సరం మాత్రం పుస్తక సంవృద్ధం కాబోతోందనడానికి అన్నీ అనుకూల సూచనలే కనిపిస్తున్నాయి; మొన్న హైదరాబాదులో జరిగిన జాతీయ పుస్తక ప్రదర్శనలో, "యులిసెస్" నుండి "స్వారోచిష మనుచరిత్రము" వరకూ చాలా పెద్ద గంపనే నెత్తికెత్తుకున్నాను. (ఫిగెరెటివ్‌గా కాదు, లిటరల్‌గానే గంపెడుంటాయ్!)

తెలుగు

"చంఘిజ్ ఖాన్", తెన్నేటి సూరి:

ఈ పుస్తకం నాకు కొత్త కాదు, ఈ పుస్తకానికి నేను కొత్త. నాకు పదేళ్ళప్పటినుండీ ఈ పుస్తకం మా ఇంట్లోనే ఉండేది; పదిహేనేళ్ళకే ఐదారుసార్లు నెమరేసి ఉంటాను. కాని పాఠకుడిగా కొంత పరిణితి సాధించాకా దీన్ని చదవడం ఇదే మొదటిసారి. అందుకే 'పుస్తకానికి నేను కొత్త' అన్నది. (పాఠకుడికీ పరిణితి కావాలి—రచనకు రచయిత ఉద్దేశించిన లక్ష్యాన్ని ఆకళింపు చేసుకుని చదవలిగే పరిణితి.)

నవల విషయానికొస్తే—పాశ్చాత్య చరిత్రకారులచే కర్కశమైన నియంతగా, నర హంతకుడిగా చిత్రీకరింపబడిన మంగోల్ వీరుడు చంఘిజ్ ఖాన్‌ను, మరో కోణంలోంచి చూపే ప్రయత్నం చేస్తుందీ నవల. అయితే ఈ నవల యొక్క చారిత్రక పార్శ్వం నాకు ఏనాడూ పెద్దగా ఆసక్తిని కలిగించలేదు. రచయిత కూడా ఈ చారిత్రకతను తన కథకు చక్కని నేపథ్యంగా మలచుకున్నాడేగానీ కథాగమనంలో అతిగా జొరబడనీయలేదు. సాధారణంగా చారిత్రక నవలల్లో కనిపించే (ఒకరకంగా అనివార్యమనిపించే) భారీ ఎత్తు నేపథ్యపు వర్ణనలేవీ ఇందులో కనిపించవు. రచయిత తన రచనా పటిమతో, కథను చారిత్రక నేపథ్యంలోంచి లాక్కొచ్చినట్టు కనిపించనీయకుండా, కథా గమనంతో పాటూ క్రమంగా చాప క్రింద నీరులా నేపథ్యాన్ని ఆవిష్కరింపజేస్తాడు.

నన్నీ నవలలో ముఖ్యంగా ఆకర్షించింది రచయిత యొక్క సన్నివేశ పరికల్పనా చాతుర్యం. ఏయే సంఘటనలు తన కథను చక చకా లాక్కుపోతాయో రచయితకు స్పష్టంగా తెలుసు; వాటినే సన్నివేశాలుగా మలచుకున్నాడు. పైకి ఇదంతా చాలా సులభమైన అల్లికలా కనిపించినా తరచి చూస్తే కనిపిస్తుంది—అక్కడ కష్టమేమిటో.

కథను సంక్షిప్తంగా చెప్పాలంటే, మంగోల్ తండా నాయకుడు యాసుకై గోబీ యెడారి లోని మిగతా తండాలన్నింటినీ జయించి తన ఏకచత్రాధిపత్యం క్రిందకు తీసుకు వస్తాడు. పాలన సుభిక్షంగా సాగుతుందన్న దశలో శత్రువులు అతడికి విషమిచ్చి చంపేస్తారు. గోబీ యెడారి కథ మళ్ళా మొదటికొస్తుంది: ఆధిపత్య కాంక్షతో తండాలన్నీ పరస్పరం కలహపడటం ఆరంభిస్తాయి. ఇలాంటి కల్లోల పరిస్థితుల్లో గద్దెనెక్కిన యాసుకై కుమారుడు టెమూజిన్ (చంఘిజ్ ఖాన్), తన తండా ఉనికిని ఎలా కాపాడుకున్నాడు, చెల్లాచెదురైన తండాలన్నింటినీ తిరిగి తన అధీనంలోకి ఎలా తెచ్చుకున్నాడు అన్నది అసలు కథ. ఉప కథగా టెమూజిన్ తమ్ముడు చమూగా కథ కూడా ఉంటుంది. చముగాకూ టెమూజిన్‌కూ మధ్య అనుబంధం ప్రేమ-ద్వేషాల సమ్మిశ్రమం. శాంతి కాముకుడైన చమూగాకు తన అన్న హింసా ప్రవృత్తి నచ్చదు; అలాగని అవ్యాజమైన సోదర ప్రేమ అతన్ని పూర్తిగా ద్వేషించేలాగూ చేయలేకపోతుంది. తమ్ముడిలో ఈ ద్వైధీభావనను గమనిస్తూ వచ్చిన టెమూజిన్, తను గెలుచుకున్న నైమాన్ తండాను తమ్ముడికి ధారాదత్తం చేసి సర్వాధికారాల్నీ కట్టబెడతాడు. చమూగా ఉప్పొంగి పోతాడు. ఇక తన ఆదర్శాల ప్రకారం తన రాజ్యాన్ని తీర్చిదిద్దుకోవాలనుకుంటాడు. కత్తులూ, కటార్లూ నిత్యం హస్త భూషణాలుగా తిరిగే తండా ప్రజల చేత నాగళ్ళు పట్టించి వ్యవసాయం చేయిస్తాడు; తను పుస్తకాల్లో చదువుకున్న చైనా మొదలైన పొరుగు దేశాల నాగరికతల స్ఫూర్తిగా, సంచార జీవనాన్ని మరిగిన తన తండా ప్రజలను స్థిర జీవనానికి పరిమితం చేస్తాడు; వారిచే యుద్ద విద్యలు మాన్పించి శాస్త్రీయ విధ్యా విధానాన్ని ప్రవేశ పెడ్తాడు. చమూగా దార్శనికుడనీ, సంస్కర్త అనీ పొగుడుతూనే, పొరుగు తండాల నాయకులు అతని తండాలోకి రహస్యంగా గూఢచారుల్ని చొప్పిస్తారు. అతని చుట్టూ చేరి, అతనికి పురి ఎక్కించి, సొంత అన్న టెమూజిన్ మీదకే యుద్దానికి ఉసిగొల్పాలని చూస్తారు. కాని అతను తన ప్రజలచేత కత్తి పట్టించేదిలేదని భీష్మించడంతో, అతన్నే పదవీచ్యుతుడ్ని చేస్తారు. చివరకు టెమూజినే తన తమ్ముడ్ని ప్రాణాపాయం నుండి ఆదుకోవలసి వస్తుంది. ఈ అవమానం భరించలేక అతను ఆత్మహత్య చేసుకుంటాడు. సిద్ధాంతం ఎంత మంచిదైనా అలవిమాలిన చోట దాని ప్రయోగం ఎలా అభాసుపాలవుతుందో చమూగా వృత్తాంతం చెపుతుంది.

ఈ నవల యొక్క ఉద్దేశ్యం రాక్షస నియంతగా పేరుపడ్డ చంఘిజ్ ఖాన్‌లోని మానవీయకోణాన్ని దర్శింపజేయడమే కాదు; ఈ నవలా రచనాకాలంనాటి (రెండవ ప్రపంచ యుద్ధం తరువాతి) ప్రపంచ రాజకీయ పరిస్థితులను మైక్రోకాస్మిక్ వ్యూలో చూపించడం కూడా బహుశా రచయిత ఉద్దేశ్యం అయి ఉండొచ్చు. ఈ విషయకంగా రచయిత బ్రహ్మాండంగా సఫలీకృతమయ్యాడు. దీనికి తోడు అద్భుతమైన ఇమేజరీ!—ఈ నవల యొక్క దృక్చిత్ర పరిపుష్టతతో పోల్చి చూస్తే "గ్లాడియేటర్" లాంటి చిత్రాల ఇమేజరీ ఎందుకూ కొరగాదనిపిస్తుంది. గోబీ యెడారి, సారీకిహార్, మంచు తుఫాన్లూ, బంజర్ల జీవనం—మనకు ఊహామాత్రంగానైనా తెలియని లోకం—అంతా స్ఫటిక స్పష్టతతో మన కళ్ళముందు సాక్షాత్కరింపజేస్తాడు రచయిత. కరాచర్, యాసుకై, తుఘ్రల్‌ఖాన్—వీళ్ళంతా రక్తమాంసాలతో సజీవంగా మన కళ్ళముందు నడుస్తారు,మాట్లాడతారు, కత్తులు దూస్తారు, కుట్రలు పన్నుతారు, ప్రాణాలు విడుస్తారు.

నా పై వ్యాఖ్యానాన్ని మీకు సోదాహరణంగా నిరూపించదలచి, ఇపుడే ప్రక్క అలమారలోంచి ఈ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకుని, పుటల్ని బొటనవ్రేలితో ఒత్తి పట్టి పరంపరగా వదుల్తూ, ఇచ్ఛ వచ్చిన చోట తెరిచిచూస్తే కంటబడిన కొన్ని యాదృచ్చిక వాక్యాలివి. చిత్తగించండి:

"ఆ యెడారిగుర్రపు డెక్కలవెంట లేస్తున్న మంచుదూగర, భూమిమీది నుంచి వాయుపథంలోకి వ్యాపించుతూ, పోయిన పొడుగునా మైదానానికి అడ్డంగా తెల్లటి వెండితెర సెల్లాను చుట్టవిప్పి అడ్డం పడుతున్నట్టు విచిత్రంగా కనిపించుతోంది. అంత వడిగా పరిగెత్తుతూ వుండటంచేత, గుర్రానికి వొళ్ళు వేడెక్కి చలి బాధ తీరి మరింత సర్దాగా, తోక కుచ్చు యెగబెట్టుకుని నాలుగు కాళ్ళ మీదా లేచి నిలబడి పరుగు తీస్తుంది."
* * *
""అబికా!"—అన్నాడు కళవళించిపోతున్న గొంతును కూడదీసుకుని. అబికా చివాల్న కనులు విప్పింది. రెండు కనుకొలకులవెంటా సూత్రం తెగిన ముత్యాల పేరుల్లా బొటబొటా కన్నీరొలికిపోయింది.""

Now you know what I mean! ఇలాంటి పుస్తకాల్ని గాలికొదిలేసి, మనం "మైదానం", "అసమర్థుడి జీవయాత్ర"ల్లాంటి చెరుకుపిప్పిని మేటి క్లాసిక్స్‌గా గౌరవించడం చూస్తుంటే, వాటి రచయితల్ని ఆకాశానికెత్తి కొలవడం చూస్తుంటే—are we worshipping the false gods అన్న అనుమానం వస్తుంది; దీనంతటి వెనుకా నా బుల్లి మెదడుకు అర్థంకాని ఏదో పెద్ద conspiracy theory దాగి ఉండాలనిపిస్తుంది. ("మైదానం" మంచి నవలేనేమో; గొప్ప నవల మాత్రం కాదు. అలాగే, "సంఘ పరిణామక్రమం – వ్యక్తి ప్రతిస్పందన" అనో వ్యాసం రాసిపడేస్తే పోయేదానికి, గోపీచంద్ అనవసరంగా "అసమర్థుని జీవయాత్ర" రాసి, పాపం అనవసరంగా సీతారామారావు మీద కక్ష తీర్చుకున్నాడనిపిస్తుంది.)

"చంఘిజ్ ఖాన్" నవల—శైలి పరంగా, శిల్ప పరంగా, ఇమేజరీ పరంగా, కథా పరంగా, ఆ కథ వెనుకాల రచయిత ఉద్దేశ్య పరంగా—ఏ రకంగా చూసినా మేటి నవల. "విశాలాంధ్రా" వారు ఈ మధ్యనే పునర్ముద్రించారు. చదవకపోతే వెంటనే చదవండి.

"రక్తరేఖ (నా డైరీ)", గుంటూరు శేషేంద్ర శర్మ:

ఈ పుస్తకం శేషేంద్ర శర్మ తన కవితా ప్రస్థానపు నేపథ్యంలో రాసుకున్న రాండమ్ నోట్స్‌ను, ఒకే చోట కూర్చి ప్రచురించిన సంకలనం. ముఖ్యంగా కవిత్వాన్ని ఒక శాస్త్రంగా ఎలా అభ్యసించాలో, ఆ అవసరమేమిటో చెపుతుంది. వచనాన్ని ముక్కలు ముక్కలుగా విరగొట్టేసి అదే కవిత్వమని మురిసిపోతూన్న కుహనా కవులందరూ తప్పక చదవాల్సిన పుస్తకం. కవిత్వపు లక్షణాల్ని నిశితంగా పరిశీలించి, de-construct చేసి విశదీకరిస్తాడు రచయిత. ఉదాహరణకు ఈ క్రింది పేరా చదవండి:

"'నదీం పుష్పోడుపవహాం' అని ఒక వాక్య శకలం. ఇది మన కళ్ళకు తెచ్చే దృశ్యంలో సారభూతమైన ఆత్మ—ప్రవహించే అందం; సౌందర్య లహరి. అదే సృష్టిలో ఎడతెగకుండా ప్రవహించే జీవనది. ఆ దృశ్యంలో ఇదే దర్శించాడు మహర్షి వాల్మీకి. —ఇది చదివినపుడు నాకు బోదిలేర్ వాక్యాలు గుర్తుకొస్తాయి: "The flowing streams even are as though asleep. The universal ecstacy of created things does not express itself in any sound." వాల్మీకి వాక్య శకలానికి అర్థం పూలపడవలు మోసే నది అని. ఈ చిన్న మాట లోతుల్ని ఆవిష్కరించడానికి ఒక మాటల సమూహం తెచ్చుకోవాలి. "గట్ల మీది చెట్లు రాల్చిన పూలు పడవల్లా తమ ప్రవాహాల్లో తేలిపోతున్న నదులు," అని చెపితేగాని కవి ఉద్దేశించిన మొత్తం చిత్రం ఆవిష్కృతం కాదు. కానీ ఈ చిత్రాన్ని ఆవిష్కరించిన మాటల గుంపంతా కవిత్వం కాదు. దృశ్యానికి జీవం ఇచ్చే ప్రవాహిమ ఏదయితే ఉందో దాన్ని పట్టి ఇచ్చే, "గ్రథన కౌశలం"తో బంధింపబడిన నాలుగు మాటలు కవిత్వం అవుతాయి. పూలపడవలు అన్నపుడు కవిత్వపు శీర్షోదయం అయింది; మోసే నదులు అన్నపుడు గుండెకాయతో సహా మొండెమూ ఉద్భవించింది. పూలు, పడవలు, నదులు అన్న వస్తువుల్లోగానీ వాటిని చెప్పే శబ్దాల్లోగానీ కవిత్వం లేదు. ఆ శబ్దాలతో కవి ఒక సృష్టి చేస్తాడు; ఆ సృష్టే కవిత్వం. Graham Hough అనే ప్రసిద్ధ సాహిత్వ శాస్త్రవేత్త ఇలా అన్నాడు: "There is no reality for a man until he has created it in symbolic form. Art is one of the systems of symbolic forms." శబ్దాలూ అర్థాలూ వట్టిమాటలూ కవిత్వం కావు. కవిత్వానికి కవి సృష్టి కావాలి, ఆ సృష్టి లేని శబ్దార్థాలు కవిత్వం కావు అన్నట్లయితే—ఏమిటా సృష్టి? ఆ సృష్టి స్వరూప స్వభావాలేమిటి? అని ప్రశ్న ఉదయిస్తుంది..."

కవిత్వం రాయాలన్న ఆసక్తి నాకు లేకపోయినా, కవిత్వాన్ని మరింత నిశిత దృష్టితో చదవడానికి, అర్థం చేసుకోవడానికి కొంత తోడ్పడుతుందని కొన్నాను. "కొంత" కాదు, చాలా ఉపయోగ పడింది. కవితా నిర్మాణానికి ఇంత పరిశీలన, పరిశోధన అవసరపడతాయా అన్న అబ్బురపాటును కలిగించింది. కొన్ని చోట్ల రచయిత యొక్క didactic prose, ఇతర తెలుగు కవుల్నందర్నీ ఒకే గాటన కట్టి విమర్శించడం కొంత ఇబ్బందిని కలగజేసినా, ఆయన కవిత్వాన్ని పెద్దగా చదవలేదు గనుక, అది సముచితమైన స్వాతిశయమేనా లేక అనుచిత ఆడంబరమా అన్నది నిర్ణయించే అర్హత నాకు లేదు. మొత్తంగా మంచి పుస్తకం. కవిత్వ సాధకులకైతే "పెద్ద బాలశిక్ష"లాంటి తప్పనిసరి పుస్తకం. [తొలి ప్రచురణ: 1974]

"తెరవని తలుపులు", కాశీభట్ల వేణుగోపాల్:

ప్రస్తుతం తెలుగులో, రచయితల తామర తంపరలో, తనకంటూ ప్రత్యేకమైన శైలీ సంవిధానాలు కలిగిన ఏకైక రచయిత కాశీభట్ల వేణుగోపాల్. ఆయన రచనలు—నేనూ చీకటి, తపన, దిగంతం, మంచు పూవు మొదలైనవి—ఆయన మాత్రమే రాయగలిగేవి. కథకు వాతావరణాన్ని అల్లడంలో, పాత్రల అంతర్లోకపు చీకట్లని నగ్నంగా వెలిచేసి చూపించడంలో ఆయన కలం నిశితమైనది, నిర్థాక్షిణ్యమైనది. "తెరవని తలుపులు" ఆయన ఐదో నవల.

తనకు నిమిత్తంలేని బాటలో ఏమరుపాటుగా జీవితాన్ని చివరిదాకా జీవించేసి, మృత్యువు ముంగిట తెప్పరిల్లి, చుట్టూ ఆవరించి ఉన్న తనదికాని జీవితాన్ని చూసుకుని బిత్తరపోయిన వ్యక్తి కథ ఇది. ఇక అప్పుడు కళ్ళెం పుచ్చుకుందామన్నా, అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయి ఉంటుంది. జీవితం, నడి సంద్రంలో చిల్లు పడ్డ నావ చందాన మిగిలిఉంటుంది. కథ సరిగ్గా ఈ మునక దశలో ప్రారంభమౌతుంది.

కథానాయకుడు యాభైరెండేళ్ళ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు. అతని చుట్టూ ఉన్న ఏ అనుబంధం ప్రేమ పునాదిగా ఏర్పడింది కాదు. భార్యా భర్తలిరువురూ "ఒకే చూరు క్రిందకొచ్చి చేరిన అపరిచిత కాందిశీకులు"; తండ్రీ కొడుకులిరువురూ వైరి పక్షాల ఎదురుబొదురు శతఘ్నులు; సంఘంతో కూడా అతని ప్రతీ సంబంధం యాంత్రికమే. వీటికి తోడు వ్యసనాలతో తూట్లు పడ్డ శరీరం. అతని డాక్టర్ స్నేహితుడు, అతిగా పొగ త్రాగడం వల్ల అతని కాళ్ళు పుచ్చి పోయాయని (టి.ఒ.ఎ), యాంప్యుటేషన్ చేసి కాళ్ళు తీసేయక తప్పదనీ చెప్తాడు. మరుసటి రోజు ఆపరేషన్ అనగా, ముందు రోజు అతను విస్కీతో పాటు నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంటాడు.

కథ ఇంతే. నిజానికి కాశీభట్ల వేణుగోపాల్ రచనల్లో వేటికీ చెప్పుకోదగ్గ కథ ఉండదు. కానీ పాత్రల అంతశ్చేతనా ప్రవాహ తరంగాల్ని ఏక్యురేట్‌గా నమోదు చేయడంలోనూ, పాత్రలని ఆవరించి ఉన్న వాతావరణాన్ని సమగ్రంగా అక్షరీకరించడంలోనూ అతని ప్రతిభ, అతని రచనల్ని ఆసక్తిగా చదివేలా చేస్తుంది. ఈ నవల స్థాయి అతని ముంగటి నవలలు "నేనూ చీకటి", "తపన"లతో పోలిస్తే నిమ్నమే అయినా, స్వతహాగా చూస్తే మంచి నవలే. [తొలి ప్రచురణ: 2004]

"కొమ్మ కొమ్మకో సన్నాయి", వేటూరి సుందర్రామ్మూర్తి:

ఇది పలువురు సినీ ప్రముఖులపై వివిధ సందర్భాల్లో వేటూరి రాసిన వ్యాస సంపుటి. వేటూరి వచనం రాస్తే ఎలా ఉంటుందీ అన్న ఆసక్తే నన్నీ పుస్తకానికి పురికొల్పింది. ఎలా ఉంది?—షడ్రుచుల విందుగా ఉంది! "కావేరీ తీరపు కొబ్బరి తోటల్లో అసుర సంధ్యా కాంతులు వైరాగ్య వర్ణాలతో కషాయ దీధితులు చిందే వేళ, 'సారమతి' వంటి రాగాలు త్యాగబ్రహ్మ నోట వెలువడినట్లు, రమేష్ నాయుడు గారి మానస సరోవర స్వరహంసికలు చేసిన అవ్యక్త మధుర కలకలారావాలు చిరంతనానందనిధులై శ్రోతల హృదయాల్లో నిలిచిపోయాయి"—ఇలాంటి వచనాన్ని అలవోకగా రాయగలిగినవాడు, నేలబారు సినీ గీతాల్ని విడిచిపెట్టి, నిజమైన సాహితీ సృజనకు నడుం కట్టి ఉంటే, తెలుగు సాహిత్యపు జవసత్వాలు మరో వంద రెట్లు పెరిగి ఉండేవనిపిస్తుంది. అయితే, ఆయన సినీగీత రచయిత కాకపోయి ఉంటే, నిత్యం జనం నోళ్ళలో నానుతూండే ఏకైక సాహితీ ప్రక్రియ యొక్క నాణ్యత మరో వెయ్యి రెట్లు పడిపోయి ఉండేది. అంతే కదా మరి; ఆయనే సినీ గీత రచయిత కాకపోయిఉంటే, "హృదయ లయల జతుల గతుల థిల్లానా"ల్నీ "క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్ణిద్రగానా"ల్నీ అవధరించే వినితరించే అదృష్టం మనకెక్కడ లభించి ఉండేది? మంచి పుస్తకం.

"మల్లాది రామకృష్ణ శాస్త్రి కథలు":

ఈ పుస్తకం పై ఇదివరకే ఒక పోస్టు రాసి ఉన్నాను (థాంక్ గాడ్!) కనుక ఇపుడేమీ రాయబోవడం లేదు. Suffice it to say: they are gems... little little gems.

"హిమ జ్వాల", వడ్డెర చండీదాస్:

నేను ఈ సంవత్సరం చదివిన పుస్తకాల్లో నా సహనాన్ని మిల్లీమీటర్ల వరకూ పరీక్షించిన పుస్తకంగా దీన్ని చెపుతాను. ఎంతో ఉత్సాహంతో, ఎన్నో అంచనాలతో దీనిని సమీపించి దారుణంగా భంగపడ్డాను. గహన భావనల్ని ఘనీభవింపజేసి పదాల్లో పేర్చే రచయితలంటే నాకిష్టమని ఇక్కడే ఎక్కడో చెప్పాను; కానీ తేలికైన సంగతిని కూడా గహనం చేసి గందరగోళపరిచే ప్రతిభ వడ్డెర చండీదాస్ దగ్గిర పుష్కలంగా ఉంది. దీని సంక్షిప్త వర్ణనగా ఒకే వాక్యం సరిపోతుంది: an utter chaos pointing out to no where. కథన్నాక ఎటోకటు తీసుకుపోక పోతుందా అన్న ఆశతో రెండు అధ్యాయాలు ఎదురు చూసాను; కాని, గమ్యమేదీ కనుచూపుమేరలో కానరానీయకుండా జాగ్రత్త పడుతూ, అనంతంగా సా...గు...తూ...నే ఉంది. ఈ మానసిక మబ్బుకంతా ఎప్పుడో, ఎక్కడో ఒక అర్థాన్నీ, గమ్యాన్నీ కల్పిస్తాడేమో రచయిత; కానీ, నా దురదృష్టమో అదృష్టమో, అందాకా పోయే ఓపిక నాకు లేకపోయింది. "ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ౠ, ఎ, ఏ"ల్లాంటి 16 అమాయక అక్షరాలపై కత్తి గట్టి వాటిని నిర్మూలించబూనటంలో రచయిత చూపిన శ్రద్ధ, కాస్త నవల plotting పై కూడా పెట్టి ఉంటే ఇది నిజంగా మంచి నవల అయ్యుండేది. [తొలి ప్రచురణ: 1969]

ఇంగ్లీషు

"ఎ రూమ్ విత్ ఎ వ్యూ", ఇ.ఎమ్. ఫోస్టర్:

ప్రేమ కథ. సాధారణంగా అమ్మాయిలకు నచ్చే "ఫీల్ గుడ్" ప్రేమ కథ. చదివినంతసేపూ బాగుందనిపిస్తుంది; చదివాక మర్చిపోతాం. సంవత్సరం మొదట్లో చదివాను. ఇపుడు గుర్తుకు తెచ్చుకుందామంటే "ప్రేమ కథ" అని తప్పించి మరేమీ స్ఫురణకు రావడం లేదు. కనీసం కథాసంక్షిప్తాన్ని పరిచయం చేద్దామన్నా, కళ్ళెదుటే ఉన్నా, పుస్తకం మళ్ళీ తెరవాలనిపించడం లేదు. [తొలి ప్రచురణ: 1908]

"లొలీటా", వ్లదీమర్ నబొకొవ్:

"Lolita, light of my life, fire of my loins. My sin, my soul. Lo-lee-ta: the tip of the tongue taking a trip of three steps down the palate to tap, at three, on the teeth. Lo. Lee. Ta.

She was Lo, plain Lo, in the morning, standing four feet ten in one sock. She was Lola in slacks. She was Dolly at school. She was Dolores on the dotted line. But in my arms she was always Lolita."

...ఇలా మొదలౌతుంది అసహ్యం కలిగించే హంబర్ట్ హంబర్ట్ యొక్క పీడోఫిలిక్ స్వగతం. ఇక్కడ నేను "అసహ్య"మనే విశేషణాన్ని వాడింది హంబర్ట్ - ద పిడోఫైల్‌కే గాని అతని స్వగతానికి కాదు, అతని స్వగతానికి నబొకొవ్ అరువిచ్చిన వచనానికి కాదు. ఏం వచనమది! పిచ్చి పట్టినట్టు చదివిందే చదివి ఒక్కో వాక్యాన్నీ ఎన్నిసార్లు చదివాను! పుస్తకం కొన్నది గత సంవత్సరం చివర్లోనే; కాని ఇప్పటికే ఇది మూడో రివిజన్! The cadentical succession of those "most precise words" (le mot juste), those scrupulously built images... ఏ రచయితా (కాఫ్కాను మినహాయిస్తే) తను సృజించిన ప్రపంచాన్ని నా కింత స్పష్టంగా చూపించలేదు.

కొన్ని కథలు సంక్షిప్త వర్ణనలకు లొంగవు—లొలీటా అలాంటి కథే. సున్నితమైన కథాంశం నా అసమర్థత వలన మీకు మరోలా కనిపిస్తే, మిమ్మల్ని ఒక మంచి పుస్తకానికి విముఖుల్ని చేసిన వాడ్నవుతాను; కాబట్టి ఆ పని చేయను. ఫేస్ వాల్యూతో తీసుకుంటే, ఇక్కడ ఒక నలభై యేళ్ళ పీడోఫైల్ ఒక పన్నెండేళ్ళ పసిదాన్ని చెరబట్టి ఆమె అమాయకపు బాల్యాన్ని చిధ్రం చేయడాన్ని సవిస్తారంగా సమర్థించుకుంటున్నట్టు కనిపిస్తుంది. కానీ నబొకొవ్ యొక్క మిగతా నేరేటర్ల లాగానే హంబర్ట్ కూడా un reliable narrator—వాళ్ళని ఫేస్ వాల్యూతో తీసుకోలేం. నిజమైన కథ వీళ్ళు మనకి చెప్పేది కాదు; వీళ్ళు మనకి చెప్పనిది. నబొకొవ్ (లేదా హంబర్ట్) లొలీటా పరంగా కథ ఎక్కడా చెప్పక పోయినా, మనకు వినిపించేది మాత్రం ఆ ఆవలి తీరపు జాలి ఆక్రందనలే. సోకాల్డ్ సామాన్య పాఠకుడు (నిజానికి సోమరి పాఠకుడు) "లొలీటా" జోలికి వెళ్ళక పోవడమే మంచిది; వాడికి ఇందులో బూతు తప్ప మరేమీ కనిపించదు.

"లొలీటా" కథకు ప్రేరణ ఏమిటని అడిగితే నబకొవ్ తను దిన పత్రికలో చదివిన ఒక వార్తాంశాన్ని ప్రస్తావించాడు: ఒక చింపాంజీ చేతికి కుంచెనిచ్చి దాని సంరక్షకులు దాన్ని కొన్ని నెలల పాటు దువ్వగా-దువ్వగా అది అతికష్టం మీద ఒకే బొమ్మ గీయగలిగిందట: దాని బోనుకున్న ఇనుప చువ్వలు! ఈ కోణం లోంచి ఆలోచిస్తే హంబర్ట్ మీద కొంత జాలి కూడా కలగకపోదు: ఇక్కడ హంబర్ట్ కూడా తను చిక్కుకున్న ఇరుకు బోనునే విశాలంగా, అందంగా వర్ణించుకుంటున్నాడు.

నబొకొవ్ రచయితే కాక ప్రసిద్ద లెపిడోప్టెరిస్టు (సీతాకోకచిలుకల పై పరిశోధకుడు) మరియు చదరంగపు క్రీడాకారుడు కూడా: ఈ కోణం లోంచి చూస్తే ఈ నవల, లొలీటా అనే పన్నెండేళ్ళ అల్లరి సీతాకోక చిలుకను కేంద్రంగా పెట్టి అల్లిన చదరంగపు పజిల్‌లా అనిపిస్తుంది. ("లొలీటా" నవల ఒక అందమైన పజిల్ అని నబొకొవ్ కూడా చెప్పుకున్నాడు.) ఇది నా ఆల్‌టైమ్ ఫేవరెట్ల జాబితాలోని పుస్తకం. ఇప్పటికి మూడుసార్లు చదివాను; చచ్చేలోగా ఇంకెన్ని సార్లో ఊహకందదు. [తొలి ప్రచురణ: 1955]

"లవ్ ఇన్ ద టైమ్ ఆఫ్ కలరా", గాబ్రియెల్ గార్సియా మార్కెజ్:

ఈ రచయితను ఆయన మాగ్నమ్ ఒపస్ నవల "ఒన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సొలిట్యూడ్"(నూరేళ్ళ ఒంటరితనం)తోనే తొలి పరిచయం చేసుకుందామనుకున్నాను. కాని ఈలోగానే, ఈ నవలపై ప్రముఖ రచయిత థామస్ పింఛన్ రాసిన వ్యాసం చదివి నిలవలేకపోయాను; ఆ నవలా నాయకుడిది కొద్దిగా నా కేసే అనిపించింది: ప్రేమతో జబ్బు పడిన వ్యక్తి అతను. ఎంతగా అంటే, తన ప్రేయసి ఒంటి పరిమళాన్ని తనలోకి ఇముడ్చుకోవాలనే వెర్రి తాపత్రయంతో, ఆమె పరిమళంతో సరిపోలే పూల రేకుల్ని తిని వాంతి చేసుకునేంత! కథాంశాన్ని స్థూలంగా చెప్పాలంటే ప్రేమని శాశ్వతత్వ ప్రాతిపదికన సాధన చేసే, immortalగా భావించి జీవించే వ్యక్తి కథ ఇది. నిజానికి యౌవనంలో అందరూ ఇలాగే భావిస్తారు. కానీ వయస్సు పెరిగే కొద్దీ ఆ తీవ్రత తగ్గి ప్రేమక్కూడా దాని హద్దులూ, పరిమితులూ ఉంటాయన్న సత్యం (సత్యమేనా!) అవగతమౌతుంది. ఇక్కడే మన కథానాయకుడు కొంత మొండితనాన్ని ప్రదర్శిస్తాడు.

కథా వివరాల్లోకి వస్తే: కొలంబియాలో ఒక కాల్పనిక తీరపట్టణంలో, వడ్డీ వ్యాపారం చేసుకుంటూ బ్రతికే ఒక విధవరాలి కుమారుడు ఫ్లొరెంటినో అరిజా. తన తొలి యౌవన దినాల్లో, అతను ఒక వర్తకుడి కుమార్తె ఐన ఫెర్మినా దాజా పై మనసు పడతాడు. ప్రయత్నం మీద ఆమె మనసునూ గెలుచుకుంటాడు. ఆమె తండ్రి ఈ సంగతి తెలిసి, కూతురి మనసు మార్చడానికి కొన్నాళ్ళు విదేశాల్లోని బంధువులింటికి తీసుకుపోతాడు. తిరిగి వచ్చేసరికి, ఫెర్మినాకు తను "ప్రేమ" అనుకున్న ఆకర్షణ భ్రమలు తొలగిపోతాయి. ఫ్లొరెంటినోను తిరస్కరిస్తుంది. తండ్రి ప్రోద్భలంతో, సంఘంలో పలుకుబడి ఉన్న ఒక వైద్యుడ్ని పెళ్ళి చేసుకుంటుంది. ఫ్లొరెంటినో మొదట ఖిన్నుడైపోతాడు; కాని ఏనాటికైనా ఆమెను తిరిగి చేరుకునే అవకాశం వస్తుందనే నమ్మకంతో, వేచి ఉండటానికే నిశ్చయించుకుంటాడు. (ఈ నిరీక్షణాక్రమంలో సుమారు 600 మంది స్త్రీలతో శారీరక సంపర్కం పెట్టుకున్నా, తన మనసు మాత్రం ఫెర్మినాకే అంకింతం కాబట్టి, తను పవిత్రుడననే, బ్రహ్మచారిననే నమ్ముతాడు.) చివరకు, అక్షరాలా యాభై-ఒక్కసంవత్సరాల తొమ్మిదినెలల నాల్గురోజుల నిరీక్షణ తర్వాత, అతను ఎదురు చూస్తున్న శుభ ఘడియ సమీపిస్తుంది: ఫెర్మినా భర్త చనిపోతాడు. భర్త కర్మకాండ జరిగిన రోజునే ఆమెను కలుస్తాడు. అప్పటికే డెబ్భైయ్యోపడిలో వున్న ఆమెతో తిరిగి తన ప్రేమ ప్రస్తావన తెస్తాడు:

"Fermina," he said, "I have waited for this opportunity for more than half a century, to repeat to you once again my vow of eternal fidelity and everlasting love."

భూతాన్ని చూసినట్టు చూసి, "చచ్చే వరకూ నీ మొఖం మళ్ళీ నాకు చూపించొద్దు అవతలికి పొమ్మ"ని చీదరించుకుంటుంది ఫెర్మినా. ఇక ఇక్కడినుంచీ, తన జీవితపు ఈ మలి సంధ్యలో, తిరిగి తన ప్రేయసి మనసు గెలుచుకోవడమనే పరీక్షను అతను ఎలా ఎదుర్కున్నాడు, విజయం సాధించాడా లేదా అన్నది మిగతా కథ.

ఇంత అవాస్తవికమైన పాత్రను మన ముందుంచి కూడా, తన రచనా నైపుణ్యంతో, అతన్ని మన అభిమానానికీ జాలికీ ప్రేమకూ పాత్రుడ్ని చేస్తాడు రచయిత. శిల్ప విషయకమైన వైవిధ్యం కథకు అదనపు సొబగు. కథనం వరుస క్రమంలో సాగకుండా, కథా-కాలగతి లో ముందు వెనుకలకు కప్పగెంతులేస్తూ చలాగ్గా పరిగెడుతుంది. (మొదటి అధ్యాయం ఫెర్మినా భర్తతో ఫ్రారంభమై, అతని మరణంతో, తర్వాత ఫ్లొరెంటినో ప్రేమ ప్రస్తావనతో అంతమౌతుంది.) గాబ్రియెల్ గార్సియా మార్కెజ్ దగ్గర మాజిక్ రియలిజం మాటేమోగానీ, పాఠకుల్ని మంత్ర ముగ్దుల్ని చేయగల మాజిక్ టూల్ మాత్రం ఒకటి ఉంది: అతని శైలి. అతని వచనంలో ఏదో తెలుగుదనపు తడి అనుభవానికి వస్తుంది. వచనం మనకు దూరంగా ఉండి కథను చూపించదు; మనను గాఢంగా హత్తుకుపోయి కథను అనుభూతింపజేస్తుంది.

ప్రేమ యొక్క విశ్వరూప సందర్శనం కావాలంటే ఈ పుస్తకం తప్పక చదవండి. మరొక సూచన: ఈ పుస్తకాన్ని చదవాలంటే ముందుగా మీరు సమకూర్చుకోవాల్సింది—సమయం; 350 పేజీల పుస్తకాన్ని ఏకబిగిన చదవడానికి సరిపడినంత సమయం. ఎందుకంటే, మొదలు పెట్టాక మధ్యలో ప్రక్కన పెడతానంటే ససేమిరా ఒప్పుకోదీ పుస్తకం. [తొలి ప్రచురణ: 1985]

"నో ఒన్ రైట్స్ టు ద కల్నల్", గాబ్రియెల్ గార్సియా మార్కెజ్:

ఇది డెబ్బై పేజీల చిన్న నవలిక. ఒక పరాధీన దేశంలో, సైనిక పాలనలో దేశీయుల తిరుగుబాట్లు, పాలకుల అణిచివేతలు ఈ కథకు నేపథ్యం. కానీ నేపథ్యం ఎక్కడా కథా పరిధిని మించి వర్ణించబడదు. వృద్ధ కల్నల్, ఉబ్బస వ్యాధి గ్రస్తురాలైన అతని భార్యా కటిక దారిద్ర్యంతో, ఇంట్లోని వస్తువులు ఒక్కొటిగా అమ్ముకుంటూ రోజులు వెళ్ళదీస్తుంటారు. కథా ప్రారంభానికి ముందే, వీరి ఒక్కగానొక్క కొడుకు, రహస్యంగా విప్లవ సాహిత్యం పంచిపెడుతున్నాడన్న ఆరోపణతో, ప్రభుత్వంచే కాల్చివేయబడతాడు. ప్రతి శుక్రవారం లాంచీలో పట్టణాన్ని చేరుకునే తపాలా కోసం, ఆ తపాలాలో తనకు రావలసి ఉన్న యుద్ధ పింఛను మంజూరు-ఉత్తర్వు కోసం, కల్నల్ గత పదిహేనేళ్ళుగా ఎదురుచూస్తూ ఉంటాడు; కథ ముగిసే పర్యంతం ఎదురు చూస్తూనే ఉంటాడు. దీనికి తోడు కొడుకు వాళ్ళకు వదిలివెళ్ళిన ఒకే ఒక ఆస్తి—పందెపు కోడిపుంజు. మరో రెండునెలల్లో ఊళ్ళో జరగబోతున్న కోళ్ళ పందాలకి దాన్ని సిద్ధం చేయడమా, లేక, తమ పోషణే కష్టమౌతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, ఎవరికైనా అమ్మివేయడమా అన్నది ఆ వృద్ధ దంపతుల మరో సమస్య. కథ మొదటి నుండి చివరి వరకూ దాదాపు ఏమీ జరగదు; అంతటా వర్ణింపసఖ్యం కాని పారభౌతిక శూన్యత పరచుకొని ఉంటుంది. అయితే ఈ శూన్యత ఏమీలేనితనంతో ఏర్పడింది కాదు—నలువైపులా అదమబడుతున్న అధిక పీడనపు శూన్యత. ఈ శూన్యత ప్రతీ నిస్సారమైన, అప్రధానమైన అల్పాంశాన్నీ అదనపు స్పష్టతతో మన కళ్ళ ముందు ప్రత్యక్షపడేలా చేస్తుంది. నిజానికి ఈ కథలో కాస్త నిప్పు రాజేయడానికి, చిన్న మెలిక తిప్పడానికి చాలా అవకాశాలు ఉన్నాయి; కానీ రచయిత ఉద్దేశపూర్వకంగా ఆ పని చేయడు. ఎందుకంటే, నేను పైన వర్ణించిన దృశ్య సంచయం కాదు ఇక్కడ కథ; అసలుకథ ఈ శూన్యతే.

"లవ్ ఇన్ ద టైమ్ ఆఫ్ కలరా" నవల రచయిత తన అరవయ్యోపడిలో రాసింది కాగా, ఈ నవలిక ఇరవయ్యవపడి ఉత్తరార్థంలో రాసింది. (అరవైలలో ప్రేమ కథ, ఇరవైలలో వృద్ధుల కథ!) బహుశా అందుకే ఈ రెండింటిలో శైలీ శిల్పాలలో చాలా తేడా కనిపిస్తుంది: పై నవల చతురమైన శిల్ప విన్యాసంతో సాగిపోయేది కాగా, ఈ నవలికలో deliberate గా శిల్పం ప్రక్కకు తొలగించబడింది. పై నవలలో గాబ్రియెల్ మార్కెజ్ యొక్క సొంత శైలి ప్రస్ఫుటమౌతుంది; ఈ నవలికలో ఆయన తన అభిమాన రచయితగా పేర్కొన్న హెమింగ్వే ప్రభావం అధికంగా కనిపిస్తుంది. వచనంలో, నేను పై నవలకు పేర్కొన్న తడి, హత్తుకుని చెప్పే ఆప్యాయత కనిపించవు. హెమింగ్వే రకం పొడి-పొడి మాటల శైలి నాకంతగా రుచించదు; అందుకే ఈ రెండింటిలో ఒక దాన్ని ఎన్నుకొమ్మంటే నేను "లవ్ ఇన్ ద టైమ్ ఆఫ్ కలరా"నే ఎన్నుకుంటాను. But in its own right, it is one splendidly written book. [తొలి ప్రచురణ: 1958]

"ద అవుట్ సైడర్", అల్బెర్ట్ కామూ:

యండమూరి "అంతర్ముఖం" చదివేసాం కదా ఇంకేం చదువుతాంలే అని దీన్ని వాయిదా వేస్తూ వచ్చాను. కానీ గత సంవత్సరం(2006) కామూ మరో నవల "ద ఫాల్" చదివాక దీనిపై ఆసక్తి పెరిగింది.

కథను క్లుప్తంగా చెప్పాలంటే—తను చేసిన హత్యకుగాక, తల్లి కర్మకాండ రోజున తను ఏడవనందుకు ఉరిశిక్ష పడుతుంది కథానాయకుడు మీర్‌సాల్ట్‌కు.

తరాలనుండీ మనకు దిగుమతవుతున్న సంప్రదాయక (conventional) మాయపొరలను విచ్చదీసుకు చూడగలిగితే ప్రపంచంలోని అబ్సర్డిటీ అంతా నగ్నంగా మన కళ్ళబడుతుంది. కాని అలా చూడ గలిగే ధైర్యం కొంతమందికే ఉంటుంది. మీర్‌సాల్ట్‌కు ఉంది. నవలకు తన చివరి మాటలో కామూ ఆ పాత్రని ఇలా విశ్లేషిస్తాడు:

“[T]o get a more accurate picture of his character, or rather one which conforms more closely to his author’s intentions, you must ask yourself in what way Meursault doesn’t play the game. The answer is simple: he refuses to lie. Lying is not only saying what isn’t true. It is also, in fact especially, saying more than is true and, in the case of human heart, saying more than one feels. We all do it, every day, to make life simpler. But, contrary to appearances, Meursault doesn’t want to make life simpler. He says what he is, he refuses to hide his feelings and society immediately feels threatened.”

"Saying more than one feels"—అదీ అసలు లోపం. ఒకసారి, "ద టైమ్స్" పత్రిక వారు "ప్రపంచంలో లోపం ఏమిటి?" (What's wrong with the world?) అన్న అంశంపై వ్యాసాలు రాసి సమర్పించాల్సిందిగా కోరుతూ పలువురు రచయితలకు కబురు పంపించారట. దానికి సమాధానంగా ప్రముఖ రచయిత జి.కె.చెస్టర్‌టన్ నుండి అందిన క్లుప్తమైన కంట్రిబ్యూషన్ ఇది:

Dear Sirs,

I am

Sincerely yours,
GK Chesterton.

బ్రతుకు బండి ఏ సంఘర్షణా లేకుండా సాఫీగా దొర్లిపోవడానికి మనం చాలా సార్లు నమ్మని వాటిని నిజమని ఒప్పుకుంటాం; అనుభూతించని భావాల్ని ముఖంపై పులుముకుంటాం; లేని బాధతో కన్నీరు కారుస్తాం, ఉన్న ఆనందాన్ని అణగదొక్కుకుంటాం; నటిస్తాం. కాని మీర్‌సాల్ట్ ఇలా నటించడానికి అంగీకరించడు. "He refuses to play the game." ఫలితంగా ప్రపంచం ద్వారా చట్టబద్ధంగా హత్య చేయబడతాడు.

ఈ నవలలో నేను పదే పదే గుర్తు చేసుకొనేదీ, ప్రపంచాన్ని నూతన దృక్కోణంలో చూపించే శక్తిగలదీ అయిన వాక్యం ఒకటుంది [అమెరికన్ ట్రాన్స్‌లేషన్ లోనిది]. ఉరి తీయబోయే ముందురోజు రాత్రి, తనను దైవపు శరణు వేడుకొమ్మని నచ్చచెప్పబోయిన జైలు మతగురువు పై విరుచుకుపడి బయటకు తరిమేసాక, మీర్‌సాల్ట్ స్వగతం ఇలా సాగుతుంది:

“As if that blind rage had washed me clean, rid me of hope, for the first time, in that night alive with signs and stars, I opened myself to the gentle indifference of the world. Finding it so like myself—so like a brother, really—I felt that I had been happy and was happy again.”

ఎందుకో ఎన్ని సార్లు చదివినా ప్రతీసారీ కొత్త అర్థాన్ని వినిపింపజేస్తుంది ఆ వాక్యం—ముఖ్యంగా 'gentle indifference' అన్న పదబంధం.

ముందే "అంతర్ముఖం" చదివి ఉండటం నా "అవుట్ సైడర్" పఠనానుభవాన్ని కొంత పాడు చేసిందనే చెప్పాలి. ఏదీ subtle గా ఉంటే మనకు ఎక్కదు: బాలకృష్ణ "నీ ఇంటి కొచ్చా... నట్టింటి కొచ్చా" అని అరుస్తూ తలల్ని కొబ్బరి బొండాలు చెక్కినట్టు చెక్కేస్తుంటే కానీ మనలో రౌద్ర రసం పలకదు; హీరోయిన్ నడుమును ముందుకూ వెనక్కూ ఆడిస్తూ, నానా కచ్చాళీ చేస్తే తప్ప మన నరాల్లో సెన్సువల్ ఫీలింగ్ జాగృతమవదు—మొద్దుబారిన మెదళ్ళకి మొద్దుబారిన కళే కావాలి. "అంతర్ముఖం" నా ఉద్దేశ్యంలో "అవుట్ సైడర్"ని అలా మొద్దుబార్చి రాసిన వెర్షనే. యండమూరి ఆ నవలకి తాను పడిన కష్టమంతా మరో సొంత ఐడియాకి పెట్టుంటే మనకో ఒరిజినల్ నవల లభించి ఉండేది—"ఆనందో బ్రహ్మ" లాంటిది.

మీర్‌సాల్ట్ స్వగతానికి రచయిత సమకూర్చిన భావ రహితమైన శైలిని "stripped to bare essentials" అని చెప్పొచ్చు; వచనానికి అనవసరమైన హంగులేవీ ఉండవు. "Mother died today. Or may be yesterday, I don't know" ఇలా ప్రారంభమయ్యే అతని స్వగతం మొదటి రెండు వాక్యాల్లోనే అతని గురించి చాలా చెప్పేస్తుంది. మంచి నవల. చదవాలనుకునే వారికి నా సలహా ఏంటంటే, "ద అవుట్‌సైడర్" గా వెలువడిన బ్రిటిష్ ట్రాన్స్‌లేషన్ కన్నా "ద స్ట్రేంజర్" పేరుతో వెలువడిన అమెరికన్ ట్రాన్స్‌లేషన్ చదవండి; ఆ అనువాదం మీర్‌సాల్ట్ పాత్రకు నప్పే informal tone తో సాగుతుంది. [తొలి ప్రచురణ: 1942]

"ఇన్విజిబుల్ మాన్", హెచ్.జి. వెల్స్:

ఇది ఏ పది-పదిహేనేళ్ళ లోపులోనో చదివివుంటే అద్బుతమనిపించేదేమో. కానీ ఇపుడు, కాఫ్కాయెస్క్ డార్క్‌నెస్ పరిచయమయ్యాక, ఇలాంటివన్నీ చిన్న పిల్లల సరుకనిపిస్తున్నాయి. ఈ కథలో తెలివైన plotting ఉంది; దానికోసమైనా మరోమారు చదవాలి.

"ఎటోన్‌మెంట్", ఇయాన్ మెక్ఇవాన్:

నేను ఈ సంవత్సరం చదివిన నవల్లలో నాకు బాగా నచ్చిన నవల. అత్యుత్తమమైన శిల్పం, ఎక్కడా బిగి సడలని కథనం. ఈ నవల యొక్క ప్రధాన కథాంశం—problems of perception. ఒకే సంఘటనను (సంఘటనలోని ఫిజిక్స్‌ను, మెటాఫిజిక్స్‌ను) వేర్వేరు వ్యక్తులు, వేర్వేరు దృక్కోణాలలో ఎలా పరికిస్తారో/అర్థం చేసుకుంటారో, ఈ భిన్నత్వం వల్ల మనుష్యుల మధ్య అపార్థాలు ఎలా ఏర్పడతాయో చూపించడం నవల యొక్క ఉద్దేశ్యం.

కథాకాలం: రెండవ ప్రపంచ యుధ్ధకాలం. స్థలం: సర్రేహిల్స్, లండన్. ఒక వేసవికాలపు మందకొడి మధ్యాహ్నం, పదమూడు సంవత్సరాల బైరనీ టల్లిస్, తమ ఎస్టేటు పై అంతస్తు కిటికీ గూండా క్రింద ఫౌంటెన్ దగ్గిర ఒక దృశ్యాన్ని చూస్తుంది: యుక్త వస్కురాలైన తన సోదరి సిసీలియా టల్లిస్‌కూ, తమ తండ్రి వితరణతో వైద్య విద్యనభ్యసిస్తున్న పనివాడి కుమారుడు రాబీ టర్నర్‌కూ మధ్య అక్కడ జరిగిన ఒక చిలిపి తగాదాలో, ఆమె పసి మనసు ఏదో కీడు ఎంచుతుంది. ఈ చిన్ని అపార్థం ఆ భవిష్య ప్రేమికులిరువురి జీవితాల్లోనూ ఎలాంటి వేదనాభరితమైన పరిణామాలకు దారితీసిందనేది అసలు కథ.

నవల నేరేషన్ పద్ధతిని "Third Person Limited"గా చెప్పవచ్చు: ప్రతీ అధ్యాయం ఏదో ఒక పాత్రను దగ్గిరగా అనుసరిస్తూ, ఆ పాత్ర దృక్కోణంలోంచి కథను చూపిస్తుంది. పుస్తకపు రెండో భాగం పూర్తిగా రెండో ప్రపంచ యుద్ధపు నేపథ్యంలో, స్పీల్‌బర్గ్ "సేవింగ్ ద ప్రైవేట్ ర్యాన్", రోమన్ పొలాన్‌స్కీ "ద పియానిస్ట్" లాంటి సినిమాల దృశ్యాలతో పోటీపడే ఇమేజరీతో సాగుతుంది. కథలో ఎవరు ఎవరికి ప్రాయశ్చిత్తం (Atonement) చేసుకుంటున్నారన్నది నవల చివరి ట్విస్టు. ఇక ఈ పుస్తకానికి కొసరు తీపి (ఐస్‌క్రీంపై చెర్రీ ముక్కలా) ఏమిటంటే, ఇందులో అద్భుతమైన వర్ణనతో కూడిన ఒక మైథున సన్నివేశం ఉంది. ("శృంగారం" దానికి చాలా లేత పదం!) నేనిప్పటి వరకూ చదివిన ఏ పుస్తకంలోనూ (ఆ మాటకొస్తే చూసిన ఏ సినిమాలోనూ కూడా [believe me; I have seen a lot of them]) దీనికి సాటిరాగలిగే సన్నివేశం నాకు తటస్థించలేదు. ఆ శైలిలోని clinical precision!—నాకు తెలిసి, సమకాలీన ఇంగ్లీషు రచయితల్లో శైలి పరంగా ఇయాన్ మెక్ఇవాన్‌తో పోటీ పడగలవారెవరూ లేరు. [తొలి ప్రచురణ: 2001]

"ఎండ్యూరింగ్ లవ్", ఇవాన్ మెక్ఇవాన్:

"ఎటోన్‌మెంట్" నవలలో ఈ రచయిత యొక్క విశ్వరూప విన్యాసాల్ని చవి చూసాక, దానితో పోల్చి చూస్తే, ఈ నవల కొంత వెల వెల బోయినట్టే కనిపిస్తుంది. ఇందుకు ముఖ్య కారణం బహుశా ఈ నవలకు రచయిత ఎన్నుకున్న వస్తువు కావచ్చు. పై నవల 'problems of perception'లాంటి వస్తు సాంద్రత కల్గిన అంశం చుట్టూ అల్లుకోబడింది కాగా, ఈ నవల 'Erotomania' అనే మానసిక వ్యాధిని ఆధారంగా చేసుకుని అల్లబడింది.

అపుడపుడు పేపర్లలో చదువుతుంటాం—తమ అభిమాన తారల్ని వారు ఏ షూటింగ్‌కి వెళ్ళినా వెంబడించే వారిని గురించి, వారి ఇంటి చుట్టూ తచ్చాడే వారిని గురించి, ఇంకా శృతిమించి ప్రహరీ గోడలు దూకి వారి పడగ్గదిలోకి దూరిపోయేవారిని గురించి (ముఖ్యంగా హాలివుడ్‌లో); లేదా ఇష్టపడ్డ అమ్మాయిని నిరంతరం వెంబడించే వారిని గురించి. వీరిని మామూలుగా మనం స్టాకర్లంటాం. మానసిక శాస్త్ర పరిభాషలో 'ఎరటోమానియాక్స్' అంటారు. మామూలు ప్రేమాభిమానాలకీ, ఈ ఎరటోమానియా (లేదా క్లీరెంబాల్ట్ సిండ్రోమ్)కూ మధ్య విభజన రేఖ చాలా సున్నితమైనది. ప్రేమ యొక్క ఈ వికృత పార్శ్వాన్ని మన ముందు పరుస్తుందీ నవల.

జో రోస్‌కు అన్నీ సానుకూలతలే—తనను ప్రేమించే భార్యా, తను ప్రేమించే ఉద్యోగం, భద్ర జీవితం. సంతాన లేమి తప్ప ఆ దంపతులిరువురికీ వేరే ఏ లోటూ లేదు. ఒక ఆహ్లాదకరమైన నీరెండ ఉదయాన, భార్యతో కలిసి పిక్నిక్‌లో ఉండగా, జో సమక్షంలో ఒక బెలూన్ ప్రమాదం జరుగుతుంది: బెలూన్ గంపలో ఒక పిల్లవాడు ఉండగా, గాలికి అది తాళ్ళు త్రెంచుకుని పైకి లేచిపోతుంది. జోతో కలిసి మరో నలుగురు అతి కష్టం మీద ఆ పిల్లవాడ్ని రక్షించగలుగుతారు. కాని ఈ ప్రయత్నంలో సమన్వయలోపం వల్ల, వారిలో ఒకరు బెలూన్‌తో కట్టిన తాళ్ళతో పాటు ఆకాశంలోకి లేచిపోయి, పట్టు జారి క్రిందపడి మరణిస్తారు. జో తో పాటూ ఈ రక్షక బృందంలోని ఒక యువకుడు, జెడ్‌పారీ, ఈ సంఘటన ద్వారా జో రోస్‌కూ తనకూ మధ్య ఏదో అతీంద్రియమైన అనుబంధం ఏర్పడిందని భావిస్తాడు; ఈ బెలూన్ ప్రమాదం, అప్పటి వరకూ అపరిచితులైన తననూ జోనూ ఏకం చేయడానికి, దైవం అల్లిన అల్లికలో ఒక భాగమని నమ్ముతాడు. ఇక్కడితో జో రోస్ జీవితంలో విషాద ఘట్టానికి తెరలేస్తుంది. జెడ్ యొక్క మానసిక రుగ్మత జో ప్రశాంత జీవితంలో ఎలాంటి అల్లకల్లోలాన్ని రేపిందీ అన్నది తదుపరి కథ. నేను చదివిన నవలలన్నింటిలోకీ మంచి బిగువైన నేరేషన్ కలిగిన ప్రధమాధ్యాయం దీనికి ఉంది. ఈ నవల ఇదే పేరుతో, ప్రస్తుత జేమ్స్‌బాండ్ డానియెల్ క్రైగ్ కథానాయకుడిగా, సినిమాగా కూడా తీయబడింది. [తొలి ప్రచురణ: 1998]

"లవింగ్", హెన్రీ గ్రీన్:

ఈ నవల పరిచయాన్ని ఇక్కడ 'గుంపులో గోవిందా'గా కానిచ్చేయడానికి ఎందుకో మనసొప్పడం లేదు. దీని గురించి విడిగా ఎప్పుడైనా పరిచయం చేస్తాను. ఇక్కడ మాత్రం ఒక్క వ్యాఖ్యానంతో సరిపెడతాను: ఇంగ్లీషు భాషని హెన్రీ గ్రీన్ ఉమయోగించుకున్న తీరున ఉపయోగించుకున్న రచయితలు నాకింతదాకా తారసపడలేదు. [తొలి ప్రచురణ: 1945]

"ద మాన్ హూ వజ్ థర్స్‌డే", జి.కె.చెస్టర్‌టన్:

ఈ సంవత్సరం నా బెస్ట్ డిస్కవరీ—జి.కె. చెస్టర్‌టన్, ద ప్రిన్స్ ఆఫ్ పేరడాక్స్. కాఫ్కా, బోర్హెస్ మొదలైన రచయితల అధివాస్తవిక సాహిత్యానికి పునాది వేసిన ఆద్యుడాయన. ఉదాహరణగా ఆయన చిన్న కథ "The Angry Street" ను సంక్షిప్తంగా పరిచయం చేస్తాను:

గత నలభై సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఒకే వీధి గూండా తన ఆఫీసుకు వస్తూ పోతూన్న ఒక ఉద్యోగి, ఒక రోజు, యధావిధిగా ఆఫీసునుండి వస్తూ, వీధి అమరికలో చిత్రమైన మార్పు గమనిస్తాడు. రోజూ నమ్మకంగా తనను ఓల్డ్‌గేట్ రైల్వేస్టేషన్ దాకా తీసుకుపోయే వీధి, ఇప్పుడు తన ముందు ఊర్థ్వ దిశన, ఏటవాలుగా ఆకాశంలోకి పోతూ కనిపిస్తుంది! ఆశ్చర్యపోయిన ఉద్యోగి, వీధి ప్రక్కన నిలబడి మానవాతీత వ్యక్తిలా గోచరిస్తూన్న ఒక ఆగంతకుడ్ని, సందేహిస్తూనే "ఏమిటీ వైపరిత్య"మని అడుగుతాడు. బరువైన నిశ్శబ్దం తర్వాత, "నువ్వేమిటని అనుకుంటున్నావ్" అని ఎదురు ప్రశ్న వేస్తాడా ఆగంతకుడు. "ఇది బంప్టన్ స్ట్రీట్ అఫ్‌కోర్స్... ఇది ఓల్డ్‌గేట్ స్టేషన్‌కు వెళ్తుంది," నమ్మకంగా సమాధానమిస్తాడు ఉద్యోగి. "అప్పుడప్పుడూ ఇది అక్కడికి వెళ్తూంటుంది; కానీ ఇపుడు మాత్రం ఇది స్వర్గానికి పోతుంది." గంభీరంగా నమ్మబలుకుతాడు ఆగంతకుడు; "స్వర్గానికా! ఎందుకు?!" అంటూ బిత్తరపోయిన ఉద్యోగికి ఇలాంటి ఒక హేతుబద్ధమైన సమాధానం కూడా ఇస్తాడు:

"'It is going to heaven for justice,' he replied. 'You must have treated it badly. […] You have worked this street to death, and yet you have never remembered its existence. If you had owned a healthy democracy, even of pagans, they would have hung this street with garlands and given it the name of a god. Then it would have gone quietly. But at last the street has grown tired of your tireless insolence; and it is bucking and rearing its head to heaven. Have you never sat on a bucking horse?'"

పోతున్న మతిని బలవంతాన కూడదీసుకుంటూ, "ఇదంతా నాన్సెన్స్. వీధులు తాము ఎక్కడికి చేరుకోవాలో అక్కడికే చేరుకుంటాయి. ఒక వీధి ఎప్పుడూ తనకు నిర్దేశించిన గమ్యానికే చేరాలి," దిటవుగా సమాధానమిస్తాడు ఉద్యోగి.

"వీధుల గురించి నువ్వెందుకలా అనుకుంటున్నావ్?" అమాయకంగా ప్రశ్నిస్తాడు ఆగంతకుడు.

నషాళానికంటిపోతూంటే ఇలా విరుచుకుపడతాడా ఉద్యోగి: "ఎందుకంటే ఎప్పుడూ అలాగే జరుగుతుంది కాబట్టి... అలాగే జరగడం చూసాను కాబట్టి! రోజు తర్వాత రోజు, సంవత్సరం తర్వాత సంవత్సరం, ఈ వీధి ఎప్పుడూ ఓల్డ్‌గేట్ స్టేషన్‌కే పోయింది కాబట్టి!"

సమాధానంగా అంతే తీవ్రతతో విరుచుకు పడతాడు ఆగంతకుడు: "మరి నువ్వు? ...వీధి నీ గురించి ఏమనుకుంటుందనుకున్నావ్? ఈ వీధి నిన్ను బతికున్న వాడికిందే జమ కడుతుందనుకుంటున్నావా? నువ్వసలు బతికే ఉన్నావా? రోజు తర్వాత రోజు, సంవత్సరం తర్వాత సంవత్సరం, నువెళ్ళేదీ ఓల్డ్‌గేట్ స్టేషన్ కే కదా?"
* * *
ఒకరకంగా ఈ కథ కాఫ్కా "మెటమార్ఫసిస్", బోర్జెస్ "సర్క్యూలర్ రూయిన్స్" లాంటి కథలకు ప్రథమ సంకేతంగా చెప్పవచ్చు. (బోర్జెస్ తనపై చెస్టర్‌టన్ ప్రభావాన్ని అంగీకరించాడు కూడా.) జి.కె. చెస్టర్‌టన్ రచనలన్నింటిలో ప్రాచుర్యం పొందిన రచన "The Man Who Was a Thursday" (గురువారం మనిషి) కూడా ఇదే కోవలోకి వస్తుంది.

కథా సంక్షిప్తం:— లండన్ పొలిమేరల్లోని సాఫ్రన్ పార్క్ ప్రాంతంలో, భీతిగొలిపే వర్ణ మిశ్రమాల్ని పడమటి ఆకాశానికి పులిమి సూర్యుడు దిగులుగా అస్తమిస్తున్న ఓ అసుర సంధ్యా సమయంలో, అప్పటి వరకూ ఆ ప్రాంతానికి తిరుగులేని కవిగా చెలామణీ అవుతున్న అరాచక వాద(అనార్కిష్టు) కవి గ్రెగొరీకి తొలి ప్రతిఘటన ఎదురవుతుంది: అక్కడో కొత్త కవి ప్రవేశిస్తాడు. సైధ్థాంతిక సంవాదం రూపేణా వారివురి నడుమా ఆధిపత్యపోరు మొదలవుతుంది. ఆ కొత్త కవి, గాబ్రియెల్ సైమ్, గ్రెగొరీ అరాచకవాద సిధ్థాంతాన్ని లోప భూయిష్టమని దృష్టాంత సహితంగా నిరూపించడమే కాకుండా, అసలు గ్రెగొరీకి తన అనార్కిజమ్ పట్ల కూడా నిబద్ధత లేదని ఉంటే ఇలా కవిత్వం చెపుతూ కూర్చోడని ఎద్దేవా చేస్తాడు. ఈ భంగపాటుతో గ్రెగరీ ఉడికిపోతాడు. కాసేపటి తర్వాత ఒంటరిగా దొరికిన సైమ్‌ని ఆపి, అన సిధ్థాంతం పట్ల తనకెంత నిబద్ధత ఉందో చూపిస్తాను రమ్మని తనతో తీసుకు పోతాడు. తానిపుడు బయట పెట్టబోయే రహస్యాన్ని పోలీసులకు చెప్పవద్దని మాట తీసుకుని, సైమ్‌ను భూఅంతర్భాగంలో నిర్మించబడిన తమ అరాచకవాదుల అడ్డాకు తీసుకుపోతాడు గ్రెగొరీ. తానేమీ ఆషామాషీ అనార్కిష్టును కాదనీ, తనకు తన సిద్థాంతంపై చిత్తశుద్ధి ఉందనీ, అది నిరూపించడానికే సైమ్‌ను ఇలా తీసుకొచ్చానని అంటాడు గ్రెగొరీ. అతని మాటల ద్వారా 'కేంద్రీయ అరాచకవాదుల మండలి' అనేది ఒకటుందని, దాని అధ్యక్షుడి (మారు)పేరు 'ఆదివార'మనీ, అతని క్రింద ఆరువారాల పేర్లతో ఆరుగురు ఉపాధ్యక్షులున్నారనీ, వీరిలో కొద్దిరోజుల క్రితమే మరణించిన 'గురువారం' స్థానాన్ని భర్తీ చేయడానికి, కొద్ది క్షణాల్లో అక్కడ హాజరవబోతున్న మండలి సమావేశంలో, నూతన ఉపాధ్యక్షుడి ఎన్నిక జరగబోతుందనీ సైమ్‌కు తెలుస్తుంది. అంతేకాదు, ఆ ఎన్నిక కేవలం లాంఛనమనీ, అందులో ఎన్నుకోబడబోయేది తానేనని వినయంగా ఒప్పుకుంటాడు గ్రెగొరీ. ఇదంతా తాపీగా విన్న సైమ్ తనకు కూడా ఒక రహస్యం ఉందని, గ్రెగొరీ రహస్యాన్ని తాను బయటపెట్టనని మాట ఇచ్చాడు కాబట్టి, తనకు కూడా అతను అలాంటి మాట ఇవ్వాలని కోరతాడు. గ్రెగొరీ భోళాగా మాట ఇచ్చేసాక, తాను అరాచకవాదుల ఆటకట్టించడానికి నియమితుడైన స్కాట్‌లాండ్‌యార్డ్ పోలీస్ డిటెక్టివ్‌నని చావు కబురు చల్లగా బయటపెడతాడు సైమ్. బిత్తరపోయిన గ్రెగొరీ ఈ వాస్తవాన్ని జీర్ణించుకునే లోపలే అక్కడకు మిగతా సభ్యులు రావడం, ఎన్నికకు ప్రారంభ ఉపన్యాసాలు మొదలవడం జరిగిపోతుంది. ఇంకా షాక్‌లోనే ఉన్న గ్రెగొరీ, ఒక పోలీసుకు తమ అరాచకవాదుల అసలురంగు బయటపడనీయకూడదన్న ఉద్దేశ్యంతో, అసలీ అరాచకవాదుల కూటమి అంతా ఉత్తుత్తి హడావుడే తప్ప పసలేదన్న అభిప్రాయాన్ని సైమ్‌కు కలగజేసేవిధంగా, ఉభయతారకమైన ఉపన్యాసాన్ని ప్రారంభిస్తాడు. కానీ ఈ ఉపన్యాసం ద్వారా తన కామ్రేడ్స్‌కు తనపై ఎలాంటి చులకన భావాన్ని కలగజేసుకుంటున్నాడో గ్రహించలేకపోతాడు. ఉపన్యాసానికి కొంత వ్యతిరేకత ఎదురైనా, ఎన్నిక ఫలితం ముందే నిర్దేశించబడింది కాబట్టి, అందరూ అయిష్టంగానే గ్రెగొరీ ఎన్నికకు సంసిద్దులౌతారు. "ఉపాధ్యక్షుడిగా గ్రెగొరీ ఎన్నికపై ఎవరికైనా అభ్యంతరం ఉందా" అంటూ లాంఛనంగా అడిగిన ప్రశ్నకు, సభ నిశ్శబ్దంలోంచి, "నాకు ఉంది" అంటూ అనూహ్యంగా సైమ్ పైకి లేస్తాడు; "కామ్రేడ్స్" అంటూ ఉరిమి తన ఉత్తేజవంతమైన ఉపన్యాసాన్ని ప్రారంభిస్తాడు. అరాచకవాదపు ఉత్కృష్టతను చాటి చెప్తూ గ్రెగొరీని తూర్పారబడుతూ ప్రవాహఝరితో ప్రసంగించి (నిజంగా ఏం ఉపన్యాసం!), గ్రెగొరీ నోరెళ్ళబెట్టి చూస్తూండగానే, చప్పట్లతో ఈలలతో హర్షాతిరేకమైన కేకలతో, 'కేంద్రీయ అరాచకవాద మండలి'కి నూతన ఉపాధ్యక్షుడిగా, 'గురువారం' పదవికి ఏకపక్షంగా ఎన్నికవుతాడు. ఇలా, ఒక పోలీస్ డిటెక్టివ్ అరాచకవాదుల కోటలో పాగా వేస్తాడు.

కాని ముందున్నది ముసళ్ళ పండగని సైమ్‌కు 'ఆదివారా'న్ని, ఇతర ఐదువారాల్ని కలిసేదాకా తెలియదు. పులుల బోనులోకి వచ్చిపడ్డ కుందేల్లా కుదేలైపోతాడు. ముఖ్యంగా 'ఆదివారం' అతనికి రాక్షసుడిలా, తన రహస్యాన్ని ఏ క్షణాన్నైనా బయటకు లాగి చిత్రవధ చేసేట్టు కనిపిస్తాడు. ప్రాణాలు చిక్కబట్టుకుని, ఆ అరాచకవాదుల గుంపు నగర వినాశనానికి రహస్యంగా పన్నుతున్న కుట్ర ఏమిటో తెలుసుకునే ప్రయత్నంలో, క్రమంగా, ఒక చిత్రమైన సంగతి బయటపడుతుంది: ఒక్కొరుగా—సోమవారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం, శనివారం—తనతో కలిపి ఆరువారాలూ పోలీసు గూఢచారులేనన్న నిజం అతనికి తెలుస్తుంది. నెమ్మదిగా వీరంతా ఒక్కటై, అసలు ఇంతమంది శత్రు గూఢచారుల్ని తన అనుచరులుగా నియమించుకున్న ఈ 'ఆదివారం' ఎవరూ? ఇందులో అంతరార్థం ఏమిటీ? అన్నది తెలుసుకోవడానికి నడుంబిగిస్తారు. ఇక్కడి వరకూ కేవలం ఒక డిటెక్టివ్ కథలా కనిపించిన నవల ఇకనుండి నడక మార్చి (నా వర్ణనకు అందని) ఒక మెటాఫిజికల్ థ్రిల్లర్‌గా రూపాంతరం చెంది, చివరకు అనూహ్యమైన తాత్విక, ఆధ్యాత్మిక పర్యవసానానికి పయనిస్తుంది. గొప్ప నవల. ఈ నవల యొక్క మెటాఫిజికల్ ఇంప్లికేషన్స్‌ని పూర్తిగా అవగతం చేసుకోవాలంటే మరోమారు చదవాలేమో.

చెస్టర్‌టన్ సాహిత్యం చాలా వరకూ వెబ్‌లో లభిస్తుంది. "ఫాదర్ బ్రౌన్" స్టోరీస్, ఇంకా ఆయన వ్యాస సంకలనం పుస్తకాలుగా ప్రస్తుతం ప్రచురణలో ఉన్నాయి. చెస్టర్‌టన్‌దంతా ఆనందమయ ప్రపంచం; ఇక్కడ మానసిక సంక్లిష్టతలూ, అస్థిత్వపు అర్థాన్వేషణలూ కనిపించవు. నాకు చాలా చాలా నచ్చాడు. [తొలి ప్రచురణ: 1908]

"రాబర్ట్ బ్రౌనింగ్", జి.కె.చెస్టర్‌టన్:

ఇది బ్రౌనింగ్ కవిపై చెస్టర్‌టన్ రాసిన లిటరరీ బయోగ్రఫీ లాంటది. అయితే బ్రౌనింగ్ కన్నా చెస్టర్‌టన్ మీద ఆసక్తే నన్నీ పుస్తకానికి ఆకర్షితుడ్ని చేసింది. చెస్టర్‌టన్ ప్రధాన పనిముట్లు—paradox & parallelism—ఇక్కడ మరింతగా పదునుదేరి తమ సత్తా చూపిస్తాయి. ఎటువంటి సంక్లిష్ట భావనకైనా తగు సమాంతర సాదృశ్యాన్ని వెతికి తెచ్చి, విషయాన్ని సరళ పరిచి చెప్పడంలోని చెస్టర్‌టన్ యొక్క ప్రతిభ, ఈ పుస్తకాన్ని మేధావుల మేతగా మిగిలిపోనీయకుండా, అందరికీ అర్థమయ్యే రీతిలో విశదపరుస్తుంది. ఉదాహరణకు—బ్రౌనింగ్ కవి కాదు; తత్వవేత్తా, తార్కికవాదీ మాత్రమే అని వాదించిన విమర్శకుల విమర్శలపై చెస్టర్‌టన్ ప్రతిస్పందన ఇది:

Mr. William Sharp, in his Life of Browning, quotes the remarks of another critic to the following effect: "The poet's processes of thought are scientific in their precision and analysis; the sudden conclusion that he imposes upon them is transcendental and inept."

This is a very fair but a very curious example of the way in which Browning is treated. For what is the state of affairs? A man publishes a series of poems, vigorous, perplexing, and unique. The critics read them, and they decide that he has failed as a poet, but that he is a remarkable philosopher and logician. They then proceed to examine his philosophy, and show with great triumph that it is unphilosophical, and to examine his logic and show with great triumph that it is not logical, but "transcendental and inept." In other words, Browning is first denounced for being a logician and not a poet, and then denounced for insisting on being a poet when they have decided that he is to be a logician. It is just as if a man were to say first that a garden was so neglected that it was only fit for a boys' playground, and then complain of the unsuitability in a boys' playground of rockeries and flower-beds.

ఈ ఒక్క చివరి వాక్యపు జోడింపుతో పాఠకుడికి పై సంక్లిష్టత అంతా అరటిపండు ఒలచి పెట్టినట్టు అర్థమైపోతుంది. ఇదే నేను పైన చెప్పిన 'తగు సమాంతర సాదృశ్యాల్ని వెతికి తేవడం'లోని అర్థం. ఇది ఒక రాండమ్ ఉదాహరణ మాత్రమే. ప్రతీ పేజీలోనూ ఇలాంటి సరళమైన విశ్లేషణలు అద్బుతమైన శైలికి తోడయి, సాధారణంగా సాహితీ విమర్శక గ్రంథాల్లో మనకు ఎదురయ్యే దుర్భేద్యతనూ రసహీనతనూ నివారించి, పఠనాన్ని నల్లేరు పై బండి నడకలా సాగిపోయేలా చేస్తుంది. ముఖ్యంగా బ్రౌనింగ్, ఎలిజబెత్ బారెట్‌ల మధ్య ప్రణయానికి సంబంధించిన అధ్యాయమైతే, ఏ కాల్పనిక ప్రేమ కథా సాటిరాని శైలితో, వర్ణనతోసాగుతూ పాఠకుల్ని మంత్రముగ్దుల్ని చేసి చదివిస్తుంది. ఇంతేకాక ఈ పుస్తకంలో, సాహిత్యకారుడుగా బ్రౌనింగ్ విశిష్టతను వివరిస్తూనే, అన్యాపదేశంగా, అంతర్లీనంగా చెస్టర్‌టన్ తన సాహిత్య దృక్పథాన్ని కూడా మనకు పరిచయం చేస్తాడు. నిజానికి నేనీ పుస్తకాన్ని చదవగోరింది అందుకే. పైగా ఒక రచయిత జీవిత చరిత్ర మరో అద్భుతమైన రచయిత చేత రాయబడే సందర్భం సాహితీ చరిత్రలో అరుదుగా సంభవిస్తుంది; అలాంటి అవకాశాన్ని ఎలా నిరాకరించడం. అందుకే, సాధారణంగా జీవిత చరిత్రల్నీ సాహిత్య విమర్శల్నీ విసుక్కునే నేను, ఈ పుస్తకాన్ని మాత్రం చాలా ఆసక్తిగా సమీపించాను. ప్రస్తుతం "చార్లెస్ డికెన్స్" మీద చెస్టర్‌టన్ రాసిన మరో విమర్శనాత్మక గ్రంథాన్ని ఎప్పుడు చదువుదామాని ఉవ్విళ్ళూరుతున్నాను. ఇవికాక చెస్టర్‌టన్ యొక్క "ఫాదర్ బ్రౌన్ స్టోరీస్"(డిటెక్టివ్ కథలు), "సెలెక్టెడ్ ఎస్సేస్" కూడా సగం-సగం పూర్తయి, నా అలమారలోంచి తమ పని కానియ్యమని నన్ను తొందర పెడుతున్నాయ్. [...] దేవుడా నాకు రెండు కళ్ళూ ఒక మెదడే ఎందుకిచ్చావ్!

*********

పుస్తకాల జోలికి రాగానే నాకో "indescribable itch" కల్గుతూంటుంది. దాని ఫలితమే ఇంత పెద్ద పోస్టు. కానీ అత్యుత్సాహంతో ఇలా అన్ని పుస్తకాల్నీ ఒకే చోట సమీక్షించబోయి అన్ని పుస్తకాలకీ అన్యాయం చేసానా అనిపిస్తుంది. పుస్తకానికో పోస్టు రాసే మరింత సమగ్రమైన ఫలితం వచ్చి ఉండేది. ఉదాహరణకి "చంఘిజ్ ఖాన్" నవలకి నా నోస్టాల్జియా అంతా కలిపి మరో పేజీ రాయవచ్చు; "లొలీటా" గురించి మరో పది పేజీలు రాసినా తక్కువే; చెస్టర్‌టన్ "ఫాదర్ బ్రౌన్" కథల్ని అసలు ముట్టుకోనే లేదు. కాని ఏంచేస్తాం!—ఈ సారికిలా కానిచ్చేద్దాం. ఇకనుండి, దిగబెట్టకుండా, ఎప్పుడు చదివిన పుస్తకానికి అప్పుడే పోస్టు రాసేస్తే సరి.

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
;

December 7, 2007

భ్రమలు వీడే క్రమం

My life, as I see it, won’t get any validation from this world. What shall I do then: transgress this triviality and go on living as I see it; or, distrusting my own instincts, shall I submit myself to this world? (Dairy ’86—87)

* * *


"ఏవైనా సరే ఈ సినిమాలో అయిటం నంబరుండాల్సిందే," మాధవ్ నెత్తిన సుత్తి మోదినట్టు మరోమారు ఉద్ఘాటించాడు నిర్మాత సాంబశివరావు.

మాధవ్ నిస్సహాయంగా నా వైపు చూసాడు. అతని చూపు పట్టుకుని, సాంబశివరావు తనూ నా వైపు తిరిగి నన్నూ వాదంలోకి గుంజాడు, "ఏం రవిగారూ, ఇరవైయేళ్ళ పైబడి ఇండస్ట్రీని చూస్తన్నాం మనం—నిర్మాతగా నేనూ, రైటర్‌గా మీరూ; మీరైనా చెప్పండి ఇతగాడికి—ఏది క్లిక్కైద్దో, ఏది క్లిక్కవ్వదో; నా మాటలు చెవికెక్కట్లేదల్లే ఉంది."

అప్పటి వరకూ విజయవంతంగా తాటస్థ్యాన్ని అవలంబించిన నాకు, ఇక తప్పేది లేదులా ఉంది. అయినా ఎవర్ని సమర్థించాలో ఆట్టే ఎంచి చూడక్కర్లేదు: మాధవ్ నిన్న లేడు; ఇవాళ ఉన్నా, రేపుంటాడా లేదా అన్నది దేవుడికే ఎరుక; కానీ సాంబశివరావ్ రెండు దశాబ్దాలకు పైగా ఇక్కడే పాతుకుపోయి ఉన్నాడు. అంతేకాక, ఆరేడేళ్ళుగా అతని నిర్మాణ సంస్థకి నేను దాదాపు ఆస్థాన రచయిత హోదాను అర్జించుకున్నాను; కాబట్టి చాలా సులభమైన ఛాయిస్. సిగరెట్ నుసి యాష్‌ట్రేకి తాటించి, మాధవ్ వైపు తిరిగి అనునయంగా అందుకున్నాను, "ప్రొడ్యూసర్‌గా ఆయన ఆబ్లిగేషన్స్ ఆయనకుంటాయ్—మనం అర్థం చేసుకోవాలి. అసలాయనంటూ లేకపోతే ఈ ప్రొడక్టే లేదు కదా—"

మధ్యలో మాట తెగొట్టి సాంబశివుడు జొరబడ్డాడు, "కాదా మరి!" నాతో అని; మరలా మాధవ్ మీదికి లంఘించాడు, "నిన్నెంచుకున్న కాణ్ణించీ అందరూ చెవినిల్లుకట్టుకు పోరతన్నారయ్యా: 'ఇన్‌స్టిట్యూట్‌నుండొచ్చినోడు, ఎక్స్‌పీరియన్సు లేదు, డైరక్టర్ని చేసి చేతిలో నాలుక్కోట్లు సినిమా పెట్టుక్కూర్చున్నావ్—బుగ్గైపోతావ్‌రోయ్' అంటా నా డ్రైవర్ కాణ్ణించి ప్రతీవోడూ ఇయ్యే బెదిరింపులు; ఇయన్నీ నీ దాకా రానిచ్చానా. ఏదో వర్తున్నోడివనిపించి పెత్తనమంతా నీకే వదిలేసేను; ఆ నమ్మకానికి నువ్వు గౌరవమియ్యాలా లేదా! నమ్మకం మాటొదిలేయ్ పోని, డబ్బులు పెడతన్నోడ్ని—కొంత నా మాటా ఆలకించాలి కదా. నేనేవడిగాను—స్టోరీ మార్చమన్నానా, కేరెక్టరైజేషను మార్చమన్నానా; ఓ అయిటం నంబరే కదా!—పెట్టేస్తే పోయేదానికి ఏదో విజనూ, గ్లిజరినూ అంటావేందయ్యా!" ఆయాసంతో ఆగి ఓ పెగ్ ఎత్తి నోట్లో బోర్లించుకున్నాడు.

"అది కాదు సర్," గొంతు వెనక ఎంత లావాని అదిమి పెడుతున్నాడో—మాధవ్ మాటలు నొక్కి పట్టినట్టు స్ఫుటంగా వస్తున్నాయ్," స్క్రీన్-ప్లే అంతా సటిల్‌గా ఒక ఫ్లోలో పోతుంది; ఇప్పుడు మధ్యలో ఈ ఐటెమ్-సాంగ్ దూర్చామంటే లౌడ్‌గా, వెకిలిగా ఉంటుంది—ఇమడదు."

ఈ సరికే విస్కీ ప్రభావం మొదలైనట్టుంది—సాంబశివరావు తన చూపుడు వేలును ఇరుసుగా దూర్చి గ్లాస్‌ని టేబిల్‌పై గింగిరాలు తిప్పుతున్నాడు. మాధవ్ మాట్లాడటం ఆపగానే గ్లాసు ఆపి, శబ్దంతో టేబిల్ పై బోర్లించాడు. ముఖ-భంగిమను వెకిలిగా వంకర చేసి, కాసేపు నిశ్శబ్దంగా మాధవ్ వైపు నవ్వి ఇలా మొదలు పెట్టాడు: "స్క్రీన్-ప్లే... హి-హి... స్క్రీన్-ప్లే గురించి నాకు చెప్తున్నావా నువ్వు! ఇరవైయేళ్ళు!—ఏం ఏమీ తెలియకుండానే నెట్టుకొచ్చామనుకుంటున్నావా. స్క్రీన్-ప్లే అంటే నీకు ఇన్‌స్టిట్యూట్‌లో నేర్పినట్టుండదిక్కడ—మాధవా—నేన్నేర్పుతానుండు స్క్రీన్-ప్లే నీకు. ఏంటి 'ఫ్లో-ఫ్లో' అంటావ్ మాటాడితే; అదే 'ఫ్లో'లో హీరో బార్‌కెళ్ళినట్టు పెట్టు; తాగి బార్‌గర్ల్‌తో డాన్సాడినట్టు టిస్టిద్దాం... య్యోవ్, టెక్నిక్ తెలవాలేగానీ ఎలాగైనా కిట్టించచ్చయ్యా."

"నా హీరో తాగడు; తాగినా డాన్స్ చేయడు."

"ఏం రోగవఁటా!" ఉరుముతూ పైకి లేచాడు; కాని, మద్యం ప్రభావంతో, నిలదొక్కుకోలేక టేబిల్ మీదకు తూలబోయాడు. నేను గభాల్న లేచి పొదివి పట్టుకున్నాను; "ఉండవయ్యా రవీ, నాకేం కాదు; ఎన్నిసార్లు పడలేదు, ఎన్నిసార్లు లేవలేదు," అంటూ నా భుజాలు పట్టుకుని ఒద్దికగా కూర్చుండబెట్టాడు; "ఇదిగో మాధవా—చాలా సహించేను; చాలా ఫిర్యాదులొస్తన్నాయ్. నిన్నటికి నిన్న, లాంగ్‌షాట్ నుండి జూమిన్ పోదామని కెమెరామన్ అంటే, క్లోజప్ కట్ చేయమన్నావంట; సర్థి చెప్పబోతే గఁయ్‌మని ఆయన మీదకి లేచావంట. నాకన్నీ తెలస్తానే ఉంటాయ్. ఏం ఆయన కన్నా ఎక్కువ తెల్సా నీకు. క్లోజప్ పెడితే లైటింగ్ సెటప్పంతా మార్చొద్దా; ఇలోగా హీరోయిన్, మహాతల్లి!, మేకప్ వేనెక్కిందంటే గంటగ్గానీ దిగిరాదు—ఎంత టయిం వేస్టు! ఎవడి డబ్బులు ఎవడు తింటన్నట్టయ్యా నాకు తెలవకడుగుతాను! ఏం తమాషాకిందుందా!" ఇలోగా చేతిలో పళ్ళెంతో మా క్యూబికల్‌లోకి వచ్చిన వెయిటర్‌ని వేలెత్తి చూపిస్తూ, "ఇదిగో ఈడ్ని డైరెక్టర్‌గా పెట్టి సినిమా తీసుకోగల్ను నేను; నాకు నువ్వే అవసరం లేదు; నిన్ను చూసెవడూ కొనడు సినిమాని."

మాధవ్ పాలముఖం జేవురురంగు లోకి మారిపోయింది. మరో క్షణంలో బద్దలయ్యేవాడే—నేను టేబిల్ క్రింద నుండి అతని తొడపై అర్థ సూచకంగా నొక్కి, సాంబశివరావ్‌తో, "మీరెళ్ళండి సార్... నేన్నచ్చచెబ్తాను," అన్నాను. మాధవ్ గిరుక్కున తల తిప్పి నా వంక ద్రోహిని చూసినట్టు చూస్తున్నాడు.

సాంబశివరావు తూలుకుంటూ, టేబిల్ వెనక నుండి దారి చేసుకుంటూ, "చెప్పవయ్యా, నువ్వు చెప్పు—ఇలా అయితే మన సినిమా థియేటర్లలో ఆడే మాటేమో గానీ; ఎవడూ కొనక, ప్రివ్యూ థియేటర్లో ఆడుద్ది వంద రోజులూ. ఆ తర్వాత బయ్యర్ల # #లు పట్టుకొని బ్రతిమాలుకోవాల్నేను. అర్థవఁయ్యేట్టు చెప్పు కాస్త డైరెక్టర్‌గారికి," అంటూ; సెర్వ్ చేసి వెళిపోతున్న వెయిటర్‌ని ఆగమని, అతని భుజంపై ఊతంగా నడుస్తూ బయటికి వెళిపోయాడు.

తుఫాను వెలిసిన నిశ్శబ్దం ఆవరించింది కాసేపు మా ఇద్దర్నీ. మాధవ్ నిస్పృహగా టేబిల్ మీద మోచేతుల్తో వాలి, తలను అర చేతుల్లో ఇరికించుకున్నాడు. నేను గ్లాసులోకి విస్కీ వంపి రెండు ఐస్-క్యూబ్స్ వేసుకున్నాను. అర్థరాత్రి దాటుతున్నా ఇంకా బార్‌లో జనసమ్మర్థం తగ్గలేదు: కొన్ని మాటలు, కొన్ని నవ్వులు, కొన్ని వాదనలు—కలగాపులగంగా ఏకమైపోయి, మేం కూర్చున్న క్యూబికల్‌లోకి అస్పష్ట శకలాలుగా రాలి పడుతున్నాయి. అతను బొటన వేళ్ళతో ఇరు కణతలూ నులుముకొంటూ, తల వంచుకునే, స్వగతంలా మాట్లాడటం ప్రారంభించాడు, "అక్కడ జూమిన్ షాట్ వాడితే ఆ డైలాగ్‌ని అనవసరంగా ఎంఫసైజ్ చేసినట్టవుతుంది; ఆ డైలాగ్‌కి అంత సీన్ లేదు; అందుకే క్లోజప్ కట్ చేయమన్నాను," హఠాత్తుగా తలెత్తి నా కళ్ళల్లోకి చూస్తూ, ఆవేశంగా, "ఈ తిక్కనాకొడుక్కి—ప్రొడక్షన్ టైమ్ పెరిగిపోతుందని ఏడవడమే తప్ప—అక్కడ స్క్రీన్ టైమ్ అనవసరంగా సాగలాగితే ఎంత ఎబ్బెట్టుగా ఉంటుందో అర్థం కాదేం," సాంబశివరావ్ నిష్కృమించిన దిశగా చేయి ఎక్కు పెట్టి గాల్లో పొడుస్తూ అరిచాడు.

నేను చేదుగా ఓ గుటకేసి గ్లాస్ టేబిల్ మీద పెడుతూ అన్నాను, "మేటరది కాదు; నీకూ తెలుసు. వాడు ప్రొడ్యూసర్; నువ్వు వాడికి పని చేస్తున్నావ్—"

"తొక్కలో ప్రొడ్యూసర్, నేనేం వాడికి పన్చేయట్లేదు; నా కథకు పన్చేస్తున్నాను," విసురుగా అన్నాడు.

"కానీ నీ కథ తెరదాకా రావాలంటే వాడు డబ్బు పెట్టాలి."

ఆ విషయం అప్పుడే స్ఫురించినట్టు నీరుగారి నిస్త్రాణగా వెనక్కి వాలిపోయాడు, "ఛ! మీకు తెలియద్సార్—ఆ స్క్రీన్-ప్లేకి నేనెంత కష్ట పడ్డానో; సిడ్‌ఫీల్డ్‌కి పాఠం చెప్పే స్క్రిప్టది. నిజానికి నాకు ఐటెమ్-సాంగ్స్‌తో ఏ ప్రాబ్లెమ్ లేదు. కానీ ఈ పర్టిక్యులర్ స్టోరీ ఒక కన్సిస్టెంట్ టోన్‌తో, ఫీల్‌తో వెళ్తుంది. పాత్రల కేరెక్టరైజేషన్‌కి ఒక యూనిటీ ఉంది. ఇపుడు సినిమా మధ్యలో నా హీరో అబ్‌రప్ట్‌గా—వాడి గంభీరత్వం, గ్రేస్, ఎలిగెన్స్... అంతా వదిలేసి బార్‌గర్ల్‌తో తైతక్కలాడతాడా! ఆర్టిస్టిక్ ఇంటెగ్రిటీ అనేది ఒకటుంటుంది సార్!"

"ఆ మాటే ఇందాకనాల్సింది—నువ్వేదో ఇంగ్లీష్‌లో బూతుల్తిడుతున్నావనుకొని పీకుచ్చుకొనేవాడు," సంభాషణని తేలిక చేయ ప్రయత్నించాను.

"హుఁ," జీవం లేని నవ్వొకటి అతని పెదాలపై ఉల్కలా మెరిసి మాయమైంది. నేను రెండో పెగ్‌తో గ్లాసెత్తబోతుంటే అన్నాడు: "నాక్కూడా కొంచెం పోయండి." "నువ్వు తాగవు కదా!" ఆశ్చర్యంగా అడిగాను. "పోయండి సార్... లేకపోతే నిద్ర పట్టదివాళ," బ్రతిమాలుతూ గ్లాసుతో నా ముందు చేయిజాచాడు. గ్లాసు సగం నింపగానే, 'రా' అలాగే ఎత్తి నోట్లో పోసేసుకున్నాడు. ఇంత వరకూ రుచి తెలియదనుకుంటా—మింగలేక, కక్కలేక; ఆ చేదును కాసేపలాగే అంగిలిలో పుక్కిలింత పట్టి, దీర్ఘశ్వాసతో ధైర్యాన్ని కూడదీసుకుని, ఒకే గుటకతో లోపలికి మింగేసాడు. మొహం వికారంగా వంకర్లు త్రిప్పి, గ్లాసు మరలా నా ముందు పెట్టాడు—నింపమన్నట్టు. "టేకిటీజీ! స్టఫ్ తీసుకో ముందు," అదిలించాను. తల అడ్డంగా ఊపుతూ, పోయమన్నట్టు గ్లాసు నా ముందు ఊగించాడు. గత్యంతరం లేక మరలా నింపాను. దాన్ని కూడా ఒకే గుటకలో త్రాగేసి, "ఊ! ఇక చెప్పండి—ఈ ఐటమ్-సాంగ్‌ని ఎక్కడ అతకెయ్యచ్చో," అంటూ కులాసాగా కుర్చీలో వెనక్కి వాలాడు. నేను తలకెక్కిన మద్యపు మత్తు విదిల్చుకుంటూ, మేధోమథనానికి ఉపక్రమించాను: పాట ఎక్కడ వస్తే బాగుంటుందో (కనీసం ఎబ్బెట్టుగా ఉండకుండా ఉంటుందో) వివరించాను. హీరోయే బార్‌కెళ్ళి త్రాగాడనడం కన్నా, స్నేహితుల బలవంతం మీద త్రాగినట్టు; అక్కడ కూడా బార్‌గర్లే అతని మీద పడి, రెచ్చగొట్టి డాన్సాడించినట్టు పెడదామని సూచించాను. ఇలా కాసేపు నా ధోరణిలో నేను ఈ సన్నివేశాన్ని సవివరంగా విస్తరించుకు పోతూ, మధ్యలో ఎందుకో అనుమానం వచ్చి అతన్ని తేరిపార పరకాయించి చూసాను. అతను "ఊఁ" కొడుతున్నాడే కాని వినడం లేదు; అసలతనిక్కడ లేడు—నాకు అందని ఏవో అతీతమైన అందలాల్లోంచి నన్ను చులకనగా అధివీక్షిస్తున్నట్టు పెదాలపై సన్నని అపహాస్యపు చిరునవ్వొకటి కదలాడుతుంది. ఇక సాగేలా లేదనిపించి, "పద వెళ్దాం," అంటూ లేచాను. అతను భారంగా పైకి లేచాడు. బిల్ చెల్లించి బయట పడే పర్యంతం—లాంజ్‌లో, తర్వాత పొడవైన కారిడార్ గూండా—అతను నావెనకే తూలుకుంటూ, నిశ్శబ్దంగా పెంపుడు జంతువులా అనుసరించాడు.

బయట వాతావరణం చలిగా ఉంది. నిర్మానుష్యమైన రోడ్డుని ఓ కుక్క సావకాశంగా దాటుతుంది. పైన "నిర్వాణా బార్ అండ్ రెస్టారెంట్" పేరుతో మలచబడిన నియాన్ దీపపు కాంతులు, ప్రక్కన పార్కింగ్‌లో మరో రెండు కార్లతో జత కట్టి నిల్చున్న నా హోండాసిటీ పై వేర్వేరు వర్ణాల్తో వెలుగులు చిమ్ముతున్నాయి . కార్ తాళం తీయబోతుంటే వెనక నుండి, "రవీ," అని పిలిచాడతను. వెనక్కి తిరిగాను: "వాడికంటే తెలీదనుకోవచ్చు; కానీ నీకు తెలుసుగా క్రాప్ట్ గురించి; నీకు తెలుసుగా అక్కడ ఇలాంటి పాట పెడితే ఎంత ఎగతాళిగా ఉంటుందో—మరి నేను లోపల అంతలా గొంతు చించుకుంటుంటే నాకు సపోర్ట్‌గా కనీసం ఒక్క మాటైనా ఎందుకు మాట్లాడలేకపోయావ్?"

నేను నాటకీయంగా నిట్టూర్చి, "మళ్ళీ మొదటికొచ్చావా; వాడికి చెప్పి లాభం లేదు మాధవ్. వాడు వినే—"

"యూ–ఫకింగ్–హిపోక్రాట్," ప్రతీ పదాన్నీ కసిగా ఒత్తి పలుకుతూ అన్నాడు.

"ఏయ్!!"

"ఏం? పౌరుషమా? నిజంగా అదే నువ్వు—ఎవడి నెత్తికి నీడ పడదామాని నీ కళని గొడుగు చేసి వాడుకునే లుచ్చావి. ఆ తింగరి వెధవ, సాంబశివరావ్, వాడి నుండి అంత కన్నా ఏమీ ఆశించలేం... వాడికంతే తెలుసు, మరి నీకు... యునో వాట్ క్రాప్ట్ ఈజ్—అవునా కాదా; చెప్తే వాడు వింటాడా వినడా అన్నది పక్కనబెట్టి, కనీసం నువ్వు నమ్మింది చెప్పాలా వద్దా? అక్కడ నువ్వు నేనూ మేటర్ కాదు; వాడి క్రింద మనం పన్చేస్తున్నామా అన్నది కూడా మేటర్ కాదు; కళ—దటీజ్ ఆల్ దట్ మేటర్స్. యాజే క్రాప్ట్స్‌మన్, యు హావ్ టు డిఫెండ్ ద క్రాప్ట్; అది తెలియనపుడు నీ పెన్‌కి మూత పెట్టి మూల పడేయ్; వాడకు." : మద్యపు మత్తు వలన అతిశయించిన ఆంగికంతో, చేతులు ఊపుతూ, మధ్య-మధ్యలో తర్జని నా వైపు ఎత్తి పొడుస్తూ, అతను నన్నిలా ముప్పేట ముట్టడిస్తుంటే; చేష్టలుడిగి చూడటం తప్ప నాకు మరేం చేతకాలేదు. అతను నా నుండి ఏదో హింసాత్మకమైన ప్రతిస్పందనను ఆశిస్తూ నా కళ్ళల్లోకి ఉద్వేగంగా చూస్తున్నాడు. నాకు కోపం కలగలేదు; "పద వెళ్దాం," అంటూ అతని భుజంపై చేయి వేసి కారు వైపు లాగబోయాను.

"యె ఛీ!" విదిలించుకున్నాడు; "నీకన్నా వాడే నయం—కనీసం నమ్మిందేదో ధైర్యంగా బయటకి చెప్తున్నాడు. కానీ నువ్వలా కాదే—ఓ నానెంటిటీ లాగా, మబ్బులాగా... ఇలా మన ఇన్‌స్టింక్ట్స్‌ని చంపేసుకు బతికే బతుకూ ఓ బతుకేనా; నువ్వు నిజంగా బతుకుతున్నావనే నమ్ముతున్నావా! నో; శవానివి నువ్వు, నడిచే శవానివి... జోంబీ... జోంబీస్ వాట్ దే కాల్ యూ," అంటూ చేతివేళ్ళని పంజాలు మడిచి ముఖం ప్రక్కల గుండ్రంగా ఆడిస్తూ; ముఖాన్ని వికృతమైన వంకర్లు తిప్పుతూ; ఏదో సి-గ్రేడ్ హాలీవుడ్ హారర్‌లోని జోంబీలాగా, వెకిలిగా, "బూ" అంటూ నన్ను వెక్కిరించడం ప్రారంభించాడు. దీనికి తోడు—అక్కడ, రెప్పపాటులో తళుకు-బెళుకుగా రంగులు మారిపోతూన్న నియాన్ దీపపు వెలుగులు; అతని ముఖంపై ఎరుపుగా, పచ్చగా, పసుపుగా, నీలంగా అలుముకొంటూ అతన్ని మరింత భయానకంగా చూపిస్తున్నాయి.

సహనం సడలిపోతుంటే, "కారెక్కుతావా లేదా," చిరాగ్గా అన్నాను.

"నేనెక్కను. ఐ 'మ్ గొనా వాక్ మై హోమ్ టుడే. నువ్వు ఫో! ... పోయి మళ్ళీ నీ గోరీలో దూరి పడుకో," అంటూ నిరసనగా వెనుదిరిగాడు.

నిట్టూర్చి, కారులో కూర్చున్నాను. అర్థమౌతుంది: ఈ రాత్రి ఇక్కడో ఆత్మహత్య జరగబోతుంది. రేపు షూటింగ్ స్పాట్‌కి నడచి వచ్చేది మాధవ్ కాదు, అతని శవం; ఇరవైయేళ్ళ క్రితపు స్వానుభవం. నాలాగే మరో జోంబీ తయారవుతుంది. అయితే—అది resurrection కానీ, putrefaction కానీ—మాధవ్ రేపు తిరిగి రావడం మాత్రం ఖాయం.

కారు రోడ్డు ఎక్కించి వెనక్కి తిరిగి చూసాను. మాధవ్ దూరంగా, చిన్నగా; వీధి దీపాల వెలుగు-చీకట్లలో, రోడ్ మీంచి పుట్‌పాత్ మీదకి పుట్‌పాత్ మీంచి రోడ్ మీదకు చేతులు పక్షి రెక్కల్లా బారజాచి పరిగెడుతున్నాడు. "బూ" అంటూ ఇంకా లీలగా వినవస్తుంది అతని గొంతు. కారు అద్దాలెత్తి మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేసాను.

* * *

November 18, 2007

చట్టం ముందు

చట్టం ముందు ఒక కాపలావాడు నిలబడి ఉంటాడు. ఒక పల్లెటూరి మనిషి కాపలావాడి దగ్గరకు వచ్చి చట్టం లోపలికి వెళ్ళటానికి అనుమతిని ఇవ్వమని బతిమాలతాడు. కాని కాపలావాడు తాను ఇప్పుడు అనుమతి ఇవ్వలేనని అంటాడు. ఆ వచ్చిన మనిషి కాసేపు ఆలోచించి, అయితే తర్వాత ఎపుడైనా అనుమతి దొరుకుతుందా అని అడుగుతాడు. ‘అవకాశం ఉంది, కానీ ఇప్పుడు కాదు,’ అంటాడు కాపలావాడు. ఎప్పటిలాగే తెరుచుకొని ఉన్న చట్టం తలుపుల్లోంచి, కాపలావాడు పక్కకు జరగటంతో, ఆ మనిషి లోపలికి తొంగి చూస్తాడు. కాపలావాడు ఇది గమనించి నవ్వి అంటాడు: ‘నీకు అంత ఆత్రంగా వుంటే, నా మాట కాదని లోపలకి వెళ్ళే ప్రయత్నం చేయి. కాని ఒకటి గుర్తుంచుకో: నేను చాలా బలవంతుడ్ని. కానీ నేను చివరి అంచె కాపలావాడ్ని మాత్రమే. లోపల ఇలా గది నుండి గదికి ప్రతీ తలుపు దగ్గరా ఒక్కో కాపలావాడు నిలబడి ఉంటాడు — ప్రతీ ఒక్కడూ మునుపటివాడి కన్నా బలవంతుడే. మూడవ కాపలావాడి ముందు నిలబడటానికి నాకే ధైర్యం చాలదు.’ పల్లెటూరి నుంచి వచ్చిన మనిషి ఇలాంటి కష్టాలను ఊహించ లేదు; చట్టం అందరికీ అన్ని సమయాల్లోనూ అందుబాటులో ఉండి తీరాలని అతని ఉద్దేశం, కాని ఇక్కడ ఇలా ఉన్నికోటు వేసుకొని, మొనదేలిన పెద్ద ముక్కుతో, సన్నని పొడవైన నల్లని తార్తారు గెడ్డంతో ఉన్న ఈ కాపలావాడ్ని కాస్త దగ్గరగా పరిశీలించిన మీదట, అనుమతి దొరికేంత వరకూ ప్రవేశం కోసం ఎదురుచూడటమే మంచిదన్న నిర్ణయానికి వస్తాడు. కాపలావాడు అతనికి ఒక పీట ఇచ్చి తలుపుకి వారగా కూర్చోనిస్తాడు. ఆ మనిషి అక్కడే రోజుల తరబడి, సంవత్సరాల తరబడి కూర్చుంటాడు. పదే పదే లోపలికి అనుమతి ఇవ్వమని అడుగుతూ అభ్యర్థనలతో కాపలావాడ్ని విసిగిస్తాడు. అప్పుడప్పుడూ కాపలావాడు ఆ మనిషిని ఆరా తీస్తాడు, అతని ఇంటి గురించీ మిగతా విషయాల గురించీ అడుగుతాడు, కానీ అవన్నీ గొప్పవాళ్ళు అనాసక్తంగా అడిగే ప్రశ్నల్లా ఉంటాయి, ఎంత మాట్లాడినా చివరకు మాత్రం ఎప్పుడూ ఇంకా ఆ మనిషికి అనుమతి దొరకలేదంటూనే ముగిస్తాడు. ఈ ప్రయాణం కోసం చాలా సరంజామాతో సమృద్ధిగా వచ్చిన ఆ మనిషి, తాను తెచ్చుకున్నదంతా, అదెంత విలువైనదైనా, కాపలావాడికి లంచాలు ఇవ్వటానికి వాడేస్తాడు. కాపలావాడు అన్నీ బానే పుచ్చుకుంటాడు, కాని పుచ్చుకుంటూ: ‘ఇంకా ఏదో ప్రయత్నించకుండా వదిలేసానే అని నువ్వనుకోకుండా ఉంటానికి మాత్రమే దీన్ని పుచ్చుకుంటున్నాను,’ అనటం మానడు. ఈ అనేక సంవత్సరాల కాలంలో, ఆ మనిషి నిరంతరాయంగా కాపలావాడ్ని పరిశీలిస్తూనే ఉంటాడు. అందులో పడి మిగతా కాపలావాళ్ళ సంగతే మరిచిపోతాడు, ఈ కాపలావాడొక్కడే చట్టంలో తన ప్రవేశానికి ఏకైక అడ్డంకిగా కనిపిస్తాడు. తన దురదృష్టానికి తన్ను తానే తిట్టుకుంటాడు, వచ్చిన కొత్తల్లో బిగ్గరగానే తిట్టుకుంటాడు, కానీ తర్వాత, వయసు మళ్ళే కొద్దీ, తనలో తాను గొణుక్కోవటంతో సరిపెట్టుకుంటాడు. అతనిలో పిల్లచేష్టలు మొదలవుతాయి, సంవత్సరాల తరబడి అదే పనిగా చూడటం వల్ల కాపలావాడి కాలరు మడతలోని నల్లులను కూడా గుర్తుపట్టి, వాటిని కూడా కాపలావాడి మనసు మార్చటంలో సాయం చేయమని అడుగుతాడు. రాన్రానూ అతని కంటి చూపు మందగిస్తుంది, చుట్టూ ప్రపంచమే మసక బారుతోందో లేక తన కళ్ళే తనను మోసం చేస్తున్నాయో అర్థం కాదు. కానీ, అంత చీకటిలో కూడా, అతను చట్టపు ప్రవేశ ద్వారం నుంచి అవిరామంగా వెలువడుతున్న ఒక కాంతి పుంజాన్ని దర్శించగలుగుతాడు. ఇప్పుడు అతనిక ఎంతో కాలం బతకడు. చనిపోయేముందు, ఇన్ని సంవత్సరాల అనుభవాలూ మనసులో కూడుకొని కాపలావాడ్ని ఇంతవరకూ అడగని ఒకే ఒక్క ప్రశ్నగా రూపుదిద్దుకుంటాయి. బిర్రబిగిసిన శరీరాన్ని నిటారుగా లేపలేక, అతను కాపలావాడికి సైగ చేస్తాడు. వారిద్దరి ఎత్తుల్లో వచ్చిన తేడా వల్ల కాపలావాడు అతని వైపు వంగాల్సి వస్తుంది. ‘ఇప్పుడేం తెలుసుకోవాలి, నీకు తృప్తి అనేదే లేదు కదా!’ అంటాడు కాపలావాడు. ‘ప్రతి ఒక్కరూ చట్టంలో ప్రవేశం కోసం పరితపిస్తారు. మరి, ఇన్నేళ్ళలో, ఇక్కడ నేను తప్ప ఇంకెవరూ వచ్చి ప్రవేశానికి అనుమతి అడగలేదెందుకు?’ అని అడుగుతాడు ఆ మనిషి. అతనికి ఆఖరు గడియలు సమీపించాయని కాపలావాడు గ్రహిస్తాడు, వినికిడి మందగిస్తున్న అతని చెవుల్లోకి చేరేట్టు, గట్టిగా ఇలా అరుస్తాడు: ‘ఇంకెవ్వరూ ఇక్కడ నుంచి లోపలకు వెళ్ళలేరు, ఎందుకంటే ఈ తలుపు ఉన్నది నీ ఒక్కడి కోసమే. ఇపుడిక దాన్ని మూసేస్తున్నాను.’”

November 13, 2007

"వచన రచనకు మేస్త్రి రామకృష్ణ శాస్త్రి"

. . . అంటూ పుస్తకం చివరి అట్ట మీద రచయితను ఉద్దేశించి వాడిన నామ-విశేషణాన్ని చూసి, ప్రాస కోసం వాడిన అతిశయోక్తి కామోసనుకుంటూ, కాస్త అపనమ్మకంతోనే "మల్లాది రామకృష్ణ శాస్త్రి కథలు" మొదటి సంపుటాన్ని ప్రారంభించాను. మొదట చదివిన కథ: "కామకోటి". (విషయ-సూచిక వరుస ప్రకారం ఇది మొదటి కథ కాదు; బహుశా కథాశీర్షిక చూసి కక్కుర్తి పడి ఉంటానన్న మీ అంచనా తప్పని బుకాయించను.) ఆ కథ ప్రారంభంలో, నేరేటర్ కథ ఎత్తుకొంటున్న సందర్భంలో, ఒక పేరా ఇలా కొనసాగుతుంది:
"...క్లబ్బు నుండి అప్పుడే యింటికి వస్తున్నాను; గుమ్మానికి పెడల్ డీకొట్టకుండా, కాలితో ఆచుకుని, సీటు దిగకుండా... పని అయిపోయినా చిగురు దమ్ముల పస తెలిసిన రసికుణ్ణి గనుక పెదవులకు అంటే చురుకును సహించుకుంటూ, శేషరూపలేశమైన సిగరెట్-కన్యను బలవంతాన మరో రెండు వలపులు వలచి... మేనకకు ఉద్వాసన చెప్పి తప్పించుకున్న గాధేయుడి దర్జాతో లోపల ప్రవేశించాను."
ఈ ఒక్క పేరా సరిపోయింది నాకు—నేనొక నిపుణుడి చేతుల్లో ఉన్నానన్న నిశ్చింతను కలిగించడానికి.
సృజన-శిఖరపు పాదం దగ్గిర తడబడుతూ తచ్చట్లాడుతున్న ఒక ఔత్సాహిక ఆరోహకుడిగా, ఇలాంటి దృశ్య-చిత్రాల్ని ఆవిష్కరించడానికి తెర వెనుక ఎలాంటి ప్రయత్నం అవసర పడుతుందో నాకు ఇప్పుడిపుడే అనుభవానికొస్తుంది. అలాంటిది; ఆయనిక్కడ అలవోకగా, effortless precision తో చేస్తున్న వచన విన్యాసాలు చూస్తుంటే మూగ సంభ్రమంతో నోరెళ్ళబెట్టక తప్పింది కాదు.
బహుశా ఈ అలవోకడ కేవలం దృగ్గోచర భ్రమే కావచ్చు, ఆయన కూడా అక్షర యాగంలో చెమటోడ్చి ఉండొచ్చు; కానీ, what matters is, ఆ కష్టం ఆయన వచనంలో ఎక్కడా మచ్చుకు కూడా కనిపించదు: అంతా ఈల పాటలా తేలికగా సాగిపోతుంది.
మరొక ఉదాహరణ తర్వాతి కథ "రాజసూయం"లోంచి:
"...కారులో మొదటనే ఆమె ఎక్కి కూర్చున్నది: ఎక్కడనో పుట్టి ఏ మూలకో మాయమయే వెలుగు, ఆమె పరాకున తల కదిలించినపుడల్లా చెవుల రవలకు ఒరసి... జిల్లున తళుకు కొడుతూన్నది: కారు సాగించడానికి తంటాలు పడుతూ... చుట్టి ప్రదక్షిణంగా పరిశీలించబోతున్నపుడల్లా ఆ మెరుపు అతని చూపుకు తగిలి... బెడిసి పోతూన్నది..."
ఇక్కడ రచయిత కన్వే చేయదలచుకున్న దృశ్యం: రాత్రి పూట, రోడ్డు మీద అతడు కారు రివర్స్ చేయడానికి ప్రయత్నిస్తూ తల వెనక్కి త్రిప్పినపుడల్లా, ప్రక్క సీట్లో కూర్చున్న ఆమె చెవులకున్న రవ్వల దుద్దులపై ఎక్కడి నుండో ఓ కాంతి కిరణం పడి పరావర్తనం చెంది అతని చూపులకు మెరుపు కొడుతుంది.
ఇపుడు మరలా ఇంకోసారి పై పేరా చదవండి—
ఏ మాత్రం జటిలత్వం లేకుండా, బాషను మైనం ముద్దలా తన ఇఛ్చానుసారంగా మలచుకొంటూ; రచయిత తన మస్తిష్కంలో రూపు దిద్దుకున్న ఒక దృశ్య-చిత్రాన్ని ఎంత తేలికగా మన దాకా బదిలీ చేయగలిగాడో కదా!
ఈ సరికే మీకు అర్థమై ఉంటుంది—ఒక పాఠకుడిగా నేను అల్ప సంతోషినని: ఒక రచన నుండి నాకు నీతి అక్కర్లేదు; సో కాల్డ్ "భావుకత" అక్కర్లేదు; రచన ద్వారా విజ్ఞానాన్నీ, విషయ సంగ్రహణనూ ఆశించను; నా వ్యక్తిగత అభిప్రాయాల, సిద్థాంతాల, వాదాల సమర్థింపునూ ఆశించను—ఒక ముక్కలో తేల్చి చెప్పితే—ఒక రచనలో చక్కనైన శిల్పం, స్పష్టమైన చిత్ర సంచయం చాలు నాకు. వీటి ప్రామాణికంగానే నేను ఏ [కాల్పనిక] రచన యోగ్యతకైనా తూకం కడతాను. పదాల్లోకి రామని మొండికేస్తున్న గహమైన భావోద్వేగాల్ని (abstract emotions) చెవి మెలిపట్టి లాక్కొచ్చి అక్షరాల వరుసలో పేర్చి కూర్చుండబెట్టగలిగే కలంకుశ ధారులైన రచయితలన్నా; కలాన్ని కుంచె మాదిరి వాడుకొంటూ అక్షరాల్తో బొమ్మలల్లగలిగే చిత్రకార-రచయితలన్నా—నాకు మిక్కిలి గౌరవం. మల్లాది రామకృష్ణ శాస్త్రి అచ్చంగా అలాంటి రచయితే.
ఇక్కడ అప్రస్తుతమైనా ఒక విషయాన్ని ప్రస్తావించదలిచాను: యాదృఛ్చికంగా, శైలిలో సమీప సారూప్యత గల ఇరువురు రచయితల్ని ప్రస్తుతం నేను ఒకేసారి చదవడం సంభవించింది: మల్లాది రామకృష్ణ శాస్త్రి ఒకరు కాగా, మరొకరు బ్రిటిష్ రచయిత Henry Green (1905–1973). ఆయన శైలికి ఉదాహరణగా నేను ప్రస్తుతం చదువుతున్న ఆయన నవల "Loving" నుంచీ ఒక పేరా క్రింద ఇస్తున్నాను. ఇక్కడ, అలతి పదాలతో నాయకానాయికల (Charlie Raunce, Edith)మధ్య ఒక చుంబన దృశ్యం ఎంత సజీవంగా, మనోజ్ఞంగా ఆవిష్కృతమైందో చూడండి:
‘Oh Edie,’ he gasped moving forward. The room had grown immeasurably dark from the storm massed outside. Their two bodies flowed into one as he put his arms about her. The shape they made was crowned with his head, on top of a white sharp curved neck, dominating and cruel over the blur that was her mass of hair through which her lips sucked at him warm and heady.
‘Edie,’ he muttered breaking away only to drive his face down into hers once more. But he was pressing her back into a bow shape. ‘Edie,’ he called again.
ఈ ఇరువురు రచయితల్లోనూ నాకు కామన్‌గా కనిపించిన అంశమేమిటంటే: వచనంలో వారు ఉద్దేశ్యపూర్వకంగా వదిలేసే ఖాళీలు. అంటే—ఒక దృక్చిత్రాన్ని ఆవిష్కరించడానికి వారు ఎక్కువ పద-వివరాల్ని వినియోగించరు; పదాల అధిక మోతాదు వల్ల దృశ్యం ఉక్కిరి బిక్కిరై, పాఠకుని దాకా చేరేసరికి అంతా అలుక్కు పోయి మొదటికే మోసం వస్తుంది. దీనికి విరుగుడుగా, వీరిరువురూ తమ వచనంలో కాలిక్యులేటెడ్‌గా కొన్ని ఖాళీలను [పాఠకుడి పూరణకే] వదిలేస్తారు; కొన్ని దృశ్య-వివరాల్ని విడిచి పెట్టేస్తారు. దీని పర్యవసానంగా, వారి వచనం చదువుతుంటే—వారు పదాల్ని పేర్చి ఒక దృశ్యాన్ని సమకూర్చినట్టుండదు; ముందే సజీవంగా ఉన్న ఒక దృశ్యం పై, మరింత స్పష్టత కోసం మాత్రమే, అక్కడక్కడా పదాల్ని వెదజల్లినట్లుంటుంది. దీని వల్ల దృశ్యం, తద్వారా రచన, రచయితకు అతీతంగా [విడివడి] తమకంటూ ఒక స్వతంత్ర అస్థిత్వాన్ని కలిగి ఉన్నట్టూ; ఆ సజీవ ప్రపంచాన్ని మనదాకా చేర్చడానికి, తమ కేవలం పదాల మాధ్యమం ద్వారా శ్రమ పడుతున్న మన సహాయకులు మాత్రమే అయినట్టూ అనిపిస్తుంది. ఇక్కడ; ఇలా రచయిత మెదడులో ఊపిరి పోసుకున్న ఒక దృశ్యానికి కాంక్రీట్ రూపాన్నియ్యడానికి, ఆ దృశ్యానికి ఆయువు పట్టైన అంశాల్ని ఎక్యురేట్‌గా ఎన్నిక చేసుకోవడంలోనే రచయితల అసలు నైపుణ్యం బయట పడుతుంది. ఆ నేర్పు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి రచనల్లో స్పష్టంగా ద్యోతనమవుతుంది. అయితే—ఆయన తన బహుముఖ ప్రతిభలో ఈ పార్శ్వాన్ని, తన కథా గమనానికి ఎంత వరకూ అవసరమో అంతే వినియోగించుకున్నారు. అయినా ఇలాంటి దృక్చిత్రాలు కథకో రెండు-మూడున్నా చాలదా అనిపించింది నాకు—ఉన్నాయి కూడా.
శిల్పం విషయానికొస్తే, శాస్త్రి గారి కథలన్నీ శిల్ప పరంగా సరళంగా సాగిపోయేవే; శిల్ప సంక్లిష్టత దాదాపు ఎక్కడా కనిపించదు. ప్రతీ కథా సముచితమైన శిల్ప సంవిధానాన్ని కలిగి ఉంటుంది. (శిల్ప విశ్లేషణకు పూనుకుంటే ప్రతీ కథకీ విడిగా చేయాలి—సాధ్యం కాదు కాబట్టి ఇక్కడ వివరించడం లేదు.)
శాస్త్రి గారి కథలు చదువుతుంటే తెలుగు ఎంత సజీవమైన, స్వతంత్రమైన భాషో నాకు పూర్తిగా జ్ఞానోదయమైంది. ఈ పుస్తకం—తెలుగు భాషతో ఏమేం చేసే అవకాశం ఉందో [అన్ని పాజిబిలిటీస్‌నీ] కళ్ళ ముందు నిలిపి నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది; ఈ భాష మరీ అంత తుప్పుపట్టిన పనిముట్టేం కాదనీ, పనితనం తెలిసినవాడి చేతిలో పడితే ఎలాంటి బృహత్ సాహితీ లక్ష్యానికైనా అందివచ్చే దమ్మున్న భాషనీ నమ్మిక కలిగించింది; అంతే కాదు, ముఖ్యంగా, సిసలైన తెలుగు నుడికారపు రుచేంటో నాకు చూపించింది. రచయితలకి ఈ నుడికారం (Idiom) అనేది—దారి తెలియని ఊళ్ళో ఊరు మరిగిన వీధి-పిల్లాడి తోడు లాంటిది; విషయాన్ని చుట్టి త్రిప్పి చెప్పే కష్టాన్ని తప్పించి దగ్గరి-త్రోవల దారి చూపిస్తుంది. తెలుగు నుడికారం శాస్త్రి గారి కథల్లో కొత్త సొబగుల్ని అద్దుకుంది. నుడికారమే కాదు—రూపకాలంకారాదుల వాడుక లోనూ కిటుకులు తెలిసిన ఘటికుడాయన. కానీ వీటన్నింటినీ ఇక్కడ ఉదహరించబోవడం లేదు. ఎందుకంటే వాటిని Original context లోంచి ఎత్తుకొచ్చి ఇక్కడ విడిగా చూపిస్తే ఔచిత్యం అర్థం కాదు; తెలుసుకోవాలంటే మీరు కథలు చదివి తెలుసుకోవాల్సిందే.
పద-చిత్రాలంటే పడి చచ్చేవారూ (నాలా); లయబద్దంగా పాటలా సాగిపోయే వచనపు వన్నె మరిగిన వారూ (మళ్ళీ నాలానే); తీరైన కథాసంవిధానపు రుచి ఎరిగిన వారూ; జీవత్వంతో తొణికిసలాడే పాత్రలంటే ముచ్చట పడేవారూ; అక్షర-లక్షల విలువైన అచ్చ తెనుగు నుడికారాన్ని ఆస్వాదించగోరే వారూ—ఇలా ఎవరి అభిరుచికి తగ్గట్టు వారికి ఎంతో కొంత ఇక్కడ సలక్షణంగా లభ్యమౌతుంది. ఇక కథల్లో నీతినీ, సమాజ హితాన్నీ తరచి చూసేవారు ఈ వైపుకు రాకపోవడమే మంచిది—ఈ కథల ఔచిత్యం వారి గుడ్డి ఎడ్డి కొలమానాలకి అందదు.
ఇక శాస్త్రి గారిలో నాకు చికాకు తెప్పించిన అంశమేమంటే, his entire preoccupation with one particular subject (almost verging on to mono-mania): వేశ్యలు/సానులు/దేవదాసీలు/మేజువాణీలు—ఇంచుమించు ప్రతీ కథా వీటి చుట్టూతానే తిరుగుతుంది. రచయిత వేశ్యావృత్తిని ఒక కళగా, సామాజికావసరంగా సమర్థించడం కూడా కనిపిస్తుంది. (తన నేరేటర్‌ల ముసుగులోంచి రచయితే తన అభిప్రాయాల్ని వెల్లడి చేస్తున్నట్టయితే.) ఇక్కడ రచయిత యొక్క నైతిక దృష్ఠిపై నాకేమీ అభ్యంతరం లేదు; అతడి వ్యక్తిగత అభిప్రాయాలపై ఆసక్తీ లేదు. కానీ ఈ మోనో మానియా వల్ల వస్తు వైవిధ్యం మృగ్యమై; ప్రతీ కథా మరో కథకు, వస్తు పరంగా, దాదాపు నకల్లా కనిపిస్తుంది. అఫ్‌కోర్స్, చాలామంది రచయితలు చివరకు ఏదో ఒక సబ్జెక్ట్‌కి మోనో మానియాక్స్ గానే తేల్తారు. (నిజానికి—తమని తాము 'జాక్-ఆఫ్-ఆల్'గా నిరూపించుకో దలచి, ఏ సబ్జెక్ట్‌నీ లోతుగా తరచి చూడకుండా, ప్రతీ దాన్నీ పైపైనే పాముకుంటూ పోయేకన్నా—ఇలా ఏదో ఒక సబ్జెక్ట్‌కే అంకితమైపోయి, దాని అంతు చూడ తలపెట్టడం కూడా వాంఛనీయమేనేమో.) కానీ తను ఎన్నుకున్న సబ్జెక్ట్ దగ్గిర, ఇలా పుంఖానుపుంఖాలుగా కథలు తవ్వుకున్నా తరగని లోతు ఉందా లేదా అన్నది రచయితే ముందుగా తేల్చుకోవాల్సిన విషయం; శాస్త్రి గారు ఎన్నుకొన్న వస్తువులో ఆ గాఢత లేదని నా అభిప్రాయం. పర్యవసానంగా ఆయన కథల్లో వస్తు పరంగా ఈ పౌనఃపున్యం అధికంగా కనిపిస్తుంది. శాస్త్రి గారితో మరో చికాకేమిటంటే—ఊరకే పాఠకుల్ని బిత్తర పరచాలన్న ఉత్సాహం. (ఉదా: జంతువులతో రతికి ఉబలాటపడే యువకుడి కథ "శహన".) ఇలా రాసిన కొన్ని [తక్కువ] కథల్లో ఆ షాక్‌వాల్యూ తప్ప వేరే ఏ విలువా కనిపించదు.
శాస్త్రి గారి రచనల్లో నేను గమనించిన ఇంకో లోపం: విరామ చిహ్నాల వాడుకలో విచ్చలవిడితనం. Ellipsis (...) అవసరమైన చోట Em dash (—) వినియోగం; 'పుల్‌స్టాప్' పెట్టవలసిన చోట Ellipsis తో వాక్యాన్ని సాగదీయడం; అనవసరంగా 'కామా'ల వినియోగం; సంభాషణల్ని Quotes (" ") తో వేరు పరచకపోవడం—వీటి వల్ల వచనానికి వాటిల్లే నష్టం పరిమితమే అయినా, చదువరికి మాత్రం ఇవి పాయసంలో పలుకు రాళ్ళ లాంటి ఇబ్బందిని కలగజేస్తాయి.
శాస్త్రి గారి రచనల్ని చదవగోరే పాఠకులకు చిన్న సూచన: చదివేటపుడు ప్రక్కనో నిఘంటువుని ఉంచుకోవడం మంచిది—అంటే వచనం అంత కఠినంగా ఉంటుందని కాదు. (కఠినమైనా—సన్నివేశాన్ని, సందర్భాన్ని బట్టి అర్థం [చూచాయగానైనా] అవగతమైపోతూనే ఉంటుంది.) కాని తెలుగు భాషలోని మాధుర్యం, తేటదనం, రిచ్‌నెస్ మీకు సంపూర్ణతతో సాక్షాత్కరించాలంటే; నిఘంటువు యొక్క అదనపు సహాయం అవసర పడొచ్చునని నా ఉద్దేశ్యం. (మృదంగ వాయిద్యకారుడికి "మార్దంగికుడు" అనే అందమైన ధ్వని ఉన్న పదం ఉందని నాకు తెలియదు, మీకు తెలుసా.)
ఈ కథల సంపుటి ప్రతులు—మీది హైదరాబాద్ అయితే—"విశాలంధ్రా"లో లభ్యమౌతున్నాయి. (వెల:రూ.150/-) ఇక హెన్రీ గ్రీన్ విషయంలో మీకా ఛాయిస్ లేదు; వెతికి వెతికి "హిమాలయా"లో ఉన్న ఒకే ఒక్క పుస్తకాన్ని నేను దొరకబుచ్చుకున్నాను. (వింటేజ్ క్లాసిక్స్ విడుదల చేసిన మూడు నవలల [Loving, Living, Party Going] సంపుటి. వెల:రూ.800/-) అది కూడా ఆయన్ని గ్రాహం గ్రీన్‌తో పొరబడి తెచ్చినట్టున్నారు—పుస్తకం ఆ వరుసలో మూలుగుతుంది.

October 15, 2007

సరిహద్దుకిరువైపులా

అతడు:

నా ముక్కు పుటాల్లోంచి వేడి ఆవిర్లు పొంగు కొస్తున్నాయ్ ఆమెనిలా చూస్తూంటే. ఇవాళెందుకో కోరికల తుఫానులో దేహం చిగురుటాకులా వణికిపోతోంది. శరీరంలో ఒకే అంగాన్ని ఇరుసుగా చేసి కాంక్ష నా అస్తిత్వాన్నంతటినీ గానుగ తిప్పుతోంది. సుజాత మాత్రం తనపాటికి తను సోఫాలో కూర్చుని చీరకు డిజైన్ కుట్టుకుంటోంది. నిజానికి, బాహ్యపరిశీలనకు, నేను కూడా నా పాటికి ఎదుట టి.వి.లో ప్రసారమౌతున్న క్రికెట్‌మ్యాచ్‌కి అంకితమైపోయినట్లే కనిపిస్తాను; కాని అసలు విషయం అదికాదు — వాంఛ వేయిపడగలెత్తి కాటేస్తే వంటినిండా విషపు సంచలనంతో కమిలి పోతూన్నాను. మరే పరిస్థితుల్లోనైనా ఉన్నపళాన ఆమెను నా చేతుల్లోకి లాక్కొని కోరిక పండించుకొనేవాణ్ణే. కానీ ఇపుడు పరిస్థితి వేరు — శారీరకంగా సమీపంగానే ఉన్నా ఇద్దర్నీ వేరుపరుస్తూ యోజనాల అదృశ్య దూరాలు బారలు చాస్తున్నాయి. కారణం, చిన్న పోట్లాటవల్ల నాల్గురోజుల్నించీ ఇద్దరి మధ్యా మాటల్లేవు. చూపుల కలయిక కూడా అరుదైపోయింది. పొరబాట్న కలిసినా తడబడి వెంటనే తలో దిక్కుకూ మరలిపోతున్నాయి. పొడిమాటలు, మొండి నిశ్శబ్దాలు. ఇంట్లో దాదాపు ప్రచ్ఛన్నయుధ్ధ వాతావరణం అలుముకొని ఉంది. ఇప్పటిదాకా తనవైపు నుండి గానీ, నావైపు నుండి గానీ ఎటువంటి సంధి ప్రయత్నాలూ లేవు. ఇలా ఎంతోకాలం కొనసాగదనీ, ఇంకో రెండు-మూడు రోజుల్లో కలిసిపోతామనీ తెలుసు; కానీ పరిస్థితి చూస్తుంటే రెండు-మూడు రోజులంటే వల్లకాదనిపిస్తోంది; ఆమె నాకు ఇపుడే ఈ క్షణమే కావాలనిపిస్తోంది.

నాలో ఇలా సుడులు తిరుగుతూ చెలరేగుతున్న కాంక్షా సంవర్తానికి కేంద్రకమైకూడా తను మాత్రం — ప్రశాంతంగా, పరధ్యానంగా, అమాయకంగా, అందంగా — వళ్ళో పరుచుకున్న తన గంధం రంగు సిల్కు చీరపై మాగ్నెటా రంగు అంచుతో డైసీ పూలు అల్లుకుంటోంది. తను కూర్చున్న సోఫా నేను కూర్చున్న సోఫాకు ఎడంప్రక్కగా తొంభైడిగ్రీల లంబంలో ఉంది. మధ్య టీపాయ్, దాని పైన చిందర వందరగా న్యూస్‌ పేపర్లు. టీపాయ్‌కు ఆవలిపక్క, నాకు ఎదురుగా, అర్థంలేకుండా గోల పెడుతూన్న టెలివిజన్. తను ఒక కాలు నేలమీద ఆన్చి మరోకాలు సోఫాలో మడతేసి కూర్చుంది. వంగపండు రంగు నైటీ మీద తెలుపు రంగులో సన్నని లతల అల్లిక. వదులైన జడలోంచి ఒక పాయ ఊడి వచ్చి ఫాన్‌ గాలికి చెంపపై అందంగా, అల్లరిగా జీరాడుతోంది. నా నరాల్ని మరింత మెలితిప్పేస్తున్నది ఆమె భంగిమ: కుడిచేత్తో సూదిని వస్త్రంలో జొనిపి మరలా దారంతో వెనక్కి లాగేటపుడు (వింటినారికి శరసంధానం చేసి లాగినట్టు), నైటీ మాటున ఆ ప్రౌడ పరిపక్వ పయోధరాల లయబద్దమైన కదలిక నా గొంతులో తడార్పి, మాటిమాటికీ గుటకలు మింగేలా చేస్తుంది.

ఏం చేయాలి? ఎలా ప్రసన్నం చేసుకోవాలి? మాట్లాడాలి సరే — ఏం మాట్లాడాలి, ఎలా ప్రారంభించాలి? నాలుగు రోజుల ఈ నిశ్శబ్దాన్ని తెరదించడానికి కృతకంగా ధ్వనించని ఏ అంశం సంభాషణకు అక్కరకొస్తుంది? సంభాషణార్హమైన, సందర్భోచితమైన అంశాలను వెతుకుతూ మెదడు అరలన్నీ గజిబిజిగా కలియబెడుతున్నాను. ప్రస్తావించదగిన అంశాలకు ప్రారంభ వాక్యాలను మనసులోనే సమీక్షించి చూసుకుంటున్నాను. ఇంతలో వికెట్ పడింది: రనౌట్. అవకాశాన్ని ఒడిసిపట్టి ఆశువుగా ఓ స్టేట్‌మెంట్‌ని బయటకొదిలేసాను, "వీడికీ జన్మకి క్రీజ్‌లో బాట్ పెట్టడం తెలీదు." ప్రతిగా నిశ్శబ్దం. కనీసం ఓ ఆబ్లిగేటరీ చిరునవ్వు కూడా రాలేదు ఆమె పెదాలపై. ఓ మారు అభావంగా తల యెత్తి టి.వి. వైపు చూసి, మరలా తల దించుకుని తన పనిలో నిమగ్నమైపోయింది. అంతు తెలియని లోయలోకి అనంతంగా జారిపోతున్న భావన. నేనా వాక్యాన్ని పలికిన తీరు తనను ఉద్దేశించినట్టూలేదు, స్వగతంలానూలేదు. ఏదో ఒకటి మాట్లాడేయాలన్న తొందరలో భావోచితమైన ఉచ్ఛారణ, సరైన స్వరస్థాయి లేకుండా అపరిపక్వంగా బయటకు వదిలేసిన ఆ లజ్జాకరమైన వాక్యం గది వాతావరణంలో ఇంకా చక్కర్లు కొడుతూ నన్ను పరిహసిస్తూన్నట్లనిపించింది. వీడికీ – జన్మకి – క్రీజ్ – లో – బాట్ – పెట్టడం – తెలీదు: నేను సయోధ్యకు ప్రయత్నిస్తున్నానని అర్థమైపోతుందేమో, లోకువ కట్టేస్తుందేమో, అసలు వినబడిందాలేదా! వికెట్ పడటంతో ప్రత్యక్ష ప్రసారం ఆగి మధ్యలో ప్రకటనలు ప్రారంభమయ్యాయి. ఏదో టూత్‌పేస్ట్ ప్రకటన వస్తుంది: ఒక మూడేళ్ళ ఉంగరాల జుట్టు చిన్నిపాప విసుగ్గా, నిద్రకళ్ళు నులుముకుంటూ విశాలమైన స్నానాల గదిలోకి ప్రవేశిస్తుంది. ఇపుడు పళ్ళు తోముకోవడానికి గునుస్తున్న ఆ పాపముందు కంటైనర్లో ఉన్న టూత్‌బ్రష్‌లూ, టంగ్‌క్లీనర్లూ భారీ ఏనిమేటెడ్ ఆకారాల్లో ప్రత్యక్షమవుతాయి; పాప చుట్టూ గంతులేస్తూ డాన్స్‌చేస్తూ, మార్కెట్లోకి రుచికరమైన కొత్త టూత్‌పేస్టు వచ్చిందనీ, ఇక దంతధావనం సరదా వ్యవహారం కాబోతుందనీ అర్థం వచ్చేట్టు ఓ పాటందుకొంటాయి; పాపకు ఆ కొత్త టూత్‌పేస్టుని పరిచయం చేస్తాయి. ఇక్కడా ఏనిమేటెడ్ టూత్‌పేస్ట్‌తో కలిసి ఆ పాప భాంగ్రా స్టైల్లో తడబడుతూ వేసే స్టెప్పులంటే సుజాతకు చాలా ఇష్టం. ఈ ప్రకటన ఎప్పుడు ప్రసారమౌతున్నా పనులన్నీ ప్రక్కన పెట్టేసి టి.వి. దగ్గిరకొచ్చి ముచ్చటగా చూస్తుండిపోతుంది. ఇపుడూ అంతే, కుట్టడం ఆపి టి.వి.కి కళ్ళప్పగించేసింది. పెదాలపై సన్నని పరధ్యానపు చిరునవ్వొకటి కదలాడుతోంది. నేను ఛక్‌మని రిమోట్‌తో ఛానల్ మార్చేసాను! ఇది నా ప్రమేయమేమీ లేకుండానే ఓ అసంకల్పిత (ప్రతీకార) చర్యలా జరిగిపోయింది. హఠాత్తుగా ఛానెల్ మారడంతో పగటికలలోంచి మేల్కొన్నదానిలా కొద్దిగా తత్తరపడి, పెదాలపై చిరునవ్వు క్రమంగా కరిగిపోతూంటే, తలత్రిప్పి, గదిలో నా ఉనికిని అప్పుడే గ్రహించినట్టు నావైపు కొత్తగా చూసింది. నేను అదే సమయానికి కాంక్షాతప్త నయనాలతో బేలగా తనవైపే చూస్తూ పట్టుబడిపోయాను. మా ఇద్దరి కళ్ళూ కలుసుకున్నపుడు ఆమె పెదాల చివుర్లలో ఇంకా ఆ టి.వి. ప్రకటన తాలూకు చిరునవ్వు కొంతమిగిలేఉంది. నా మొహం పై అది పూర్తిగా మాయమైపోయింది. కళ్ళు తిరిగి వళ్ళోకి వాల్చేసింది. మొహంలో కనిపించీ కనిపించనట్టు అలుముకొంటున్న అప్రసన్నత — లేక నా భ్రమేనా...! సూదితో మరో రెండు కుట్లులాగి ఏదో గుర్తొచ్చినట్టు తలెత్తి గోడ గడియారం వైపు చూసింది. 11.00 PM: నిద్రకుపక్రమించే సమయం. చీరను సోఫాలో పడేసి పైకిలేచింది. ఆమె ముఖ కవళికల్లో, కదలికల్లో నా చూపులన్నీ తనపైనే కేంద్రీకృతమై ఉన్నాయన్న ఎరుక తేటతెల్లమౌతుంది. పైకిలేచి నాకు అభిముఖంగాఉన్న వంటగదిలోకి నడిచింది. ఇపుడామె పృష్ఠభాగంలో, రెండు పిరుదుల మధ్యా నైటీ ఇరుక్కుని, లోతుగా నితంబ విభాజక రేఖ కనిపిస్తుంది. వంటగదిలో ద్వారం ప్రక్కగా ఉన్న ఫ్రిజ్ తలుపు తెరిచి బాటిల్ ఎత్తి నీళ్ళు త్రాగుతోంది. (ప్రొఫైల్‌లో శంఖంలాంటి మెడపై గట గటా గుటకల కదలికలు.) బాటిల్ మూత బిగించి లోపలపెట్టి, ఎడమ ముంజేత్తో నోరు తుడుచుకుని, మరలా హాల్లోంచి నన్ను దాటుకుంటూ వెనక బెడ్రూంలోకి వెళ్ళిపోయింది.

నేను టి.వి. కట్టేసి బాల్కనీలోకి నడిచాను. బాల్కనీలోకి ఎందుకు; నేరుగా బెడ్రూంలోకి ఎందుకుకాదు — బహుశా, ఖచ్చితంగా చేతికందబోతోందని తెలిసిన ఆనందాన్ని కావాలని ముందుకు పొడిగించడంలో, వాయిదా వేయడంలో, ఆ విలంబంలో ఉండే ఆనందాన్ని ఆస్వాదించడానికనుకుంటా. (నేను ఈ సరికే ఒక నిశ్చయాని కొచ్చేసాను: ఏమైనా సరే ఇవాళ ఆమె నాక్కావాలి; ఎలా మభ్య పెట్టైనా సరే!) బయట చలిగా ఉంది. శీతపవనం కదిలినప్పుడల్లా వంటిమీద చలిపొక్కుల్లేస్తున్నాయి. ఎదుట బిల్డింగ్ బాల్కనీలో, పడక్కుర్చీలో ఒక ముసలాయన దగ్గుతున్నాడు. లోపల కుటుంబమంతా కలిపి — క్రికెట్‌ మ్యాచ్ అనుకుంటా, చూస్తూ — కిటికీ లోంచి కనిపిస్తున్నారు. — రగులుతున్న రిరంస నాలో పరిసర దృష్ఠిని మసకబారేలా చేస్తుంది. కళ్ళైతే దృశ్యాల్ని గ్రహిస్తున్నాయి గానీ అవి మెదడులో నమోదు కావడం లేదు. సృష్ఠి యావత్తూ నా నిశ్వాసాలకు సంకోచిస్తూ, ఉచ్ఛ్వాసాలకు వ్యాకోచిస్తున్న చిత్తభ్రమ. ఇప్పుడు నాకు నైఋతి దిశగా సుమారు పది అడుగుల దూరంలో ఆమె నిద్రపోతోంది. మధ్యలో గోడలున్నాయి, తలుపులున్నాయి; కానీ వీటన్నింటినీ దాటుకుని, ఆమెను కేంద్రంగా చేసుకుని అదృశ్య అయస్కాంత తరంగాలేవో నలుదిశలా విస్తరిస్తున్నట్టూ, ఆ కంపనాలేవో నా గుండె కంపనాలతో అనునాదం చెందుతున్నట్టూ భ్రమ కలుగుతోంది. బాల్కనీలో ఓ రెండు నిముషాలు కాలయాపన చేసాను. ఇక నాలో కొసప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న విచక్షణ పూర్తిగా చచ్చిపోయిందన్న నమ్మిక కలిగాక, నేనో నిగిడిన మాంసఖండంగా తప్ప మరేమీకాకుండా మిగిలాక, జలాంతర ప్రవాహంలో గమిస్తున్నవాడిలా — తేలికగా, తేలిపోతూ — బెడ్రూంవైపు నడిచాను. చల్లని గ్రానైట్ టైల్స్ మీద నా వెచ్చని పాదాలు ఆవిరి జాడల్ని అచ్చువిడుస్తున్నాయి. ఇదిగో స్వర్గపు ద్వారం! కర్టెన్ ప్రక్కకునెట్టి లోపలికి ప్రవేశించాను.

గది నిండా బెడ్‌లాంప్ తాలూకు నీలి కాంతి పరచుకొని ఉంది. మూసివున్న కిటికీ అద్దం బయటి వీధి దీపపు కాంతిని పల్చగా వడగట్టి మంచం ఉపరితలంపై నలుచదరంగా పరుస్తుంది. సుజాత మంచానికి ఒక చివర కుడిచేయి తలక్రింద ఒత్తుగా పెట్టుకొని పడుకుంది; ఎడమ చేయి నడుం మీదగా సాగి జఘనం దిగువన విశ్రమించింది. ఎందుకో అసంగతంగా, గదిలోని జడపధార్థాలన్నీ — గోడ మీద ఆయిల్ పెయింటింగ్, షెల్ప్‌లో పుస్తకాలు, అలారం టైంపీసు, మంచం అడుగున హవాయి చెప్పులూ — అన్నీ ప్రాణం తెచ్చుకుని నన్నే పరికిస్తున్న భావన కలిగింది. గది గోడలపై నగ్నంగా వెలుగుతున్న నీలి కాంతి నా ఇంద్రియాలపై హింసాత్మకమైన ఒత్తిడి తీసుకువస్తుంది. నేను ముందుకు కదిలాను. నా నీడ ముందుకు కదిలింది. నేను పిల్లిలా మంచంపైకి చేరాను. నా నీడ పిల్లి నీడలా మంచం పైకి చేరింది. నెమ్మదిగా అలికిడి తెలియకుండా సర్దుకుని పడుకున్నాను. ఇపుడు తన వీపుభాగం నావైపు ఉంది. తన జడ మెడ వంపులోంచి అటు ప్రక్కకి జారిపోయింది. తన వంటి పరిమళం — తనకు మాత్రమే ప్రత్యేకమైన పరిమళం, నాకు మాత్రమే దగ్గిరగా తెలిసిన పరిమళం, వడలిన సంపెంగపూల పరిమళానికి కొంచెం అటూఇటూగా ఉండే పరిమళం — నా నాసిక లోకి మెత్తగా, మత్తుగా ప్రవహిస్తుంది. మస్తిష్కమంతా మొద్దుబారిపోగా, మెలివేస్తున్న నరాల ఉద్విగ్నత ఇక ఏ మాత్రం భరించలేక — మొదట మెత్తగా తర్వాత బరువుగా — తన జబ్బపై చేయివేసి నొక్కాను.

"చేయి తియ్యి నవీన్ చిరాగ్గాఉంది"

నా మొదటి ప్రతిస్పందన ఉలికిపాటు. క్షణాల్లో తన తిరస్కారం నాలో ఇంకి, నిద్రపోతున్న అహాన్ని తట్టిలేపింది: "చిరాగ్గావుంది కాబట్టి చేయి వేయొద్దా లేక నేను చేయి వెయ్యడమే చిరాగ్గా ఉందా?"

"రెండు ఒకటే"

ఇక్కడే నన్నునేను నియంత్రించుకుని ఉండాల్సింది. ఏ శాడిస్టిక్ ఇన్‌స్టింక్ట్ ప్రేరేపించిందో, బహుశా తనది చివరిమాట కానీయకూడదన్న పంతమేమో, అనేసాను: "ఫ్రిజిడ్!" తనకు వినబడేట్టు గొణిగి అటు తిరిగి పడుకున్నాను. క్షణం నిశ్శబ్దం. నావెనుక తను మంచం మీంచి లేచిన అలికిడి.

"ఏమన్నావ్...! సేయిటెగైన్" — రొప్పుతున్న ధ్వని

సీన్ చేయొద్దు పడుకో" — నా నాలుకకు నాతో నిమిత్తంలేని స్వతంత్ర అస్థిత్వం ఉందా అన్న అనుమానం. మరలా నిశ్శబ్దం. క్షణం ప్రక్కన క్షణం. క్షణం ప్రక్కన క్షణం. క్షణం ప్రక్కన క్షణం. కాలం భౌతిక రూపం ధరించి నా ముందు దొర్లుతున్న భావన. ఇక భరించలేక తనవైపు తిరిగాను. తన సిల్హౌట్ ఆయాసంతో రొప్పుతోంది. వెనక వీధిదీపపు మసక వెలుతురు తన కేశాల అంచుల్ని రాగి రంగులో వెలిగిస్తోంది. ముప్పిరిగొంటున్న భావోద్వేగాల్ని నిభాయించుకోవడానికన్నట్లు రెండు చేతులూ నడుంపై ఆన్చి నిల్చొంది.

"నా వల్ల కాదు నవీన్ ఇలా... నేను మెషీన్ని కాదు. నాకూ... నాకూ ఫీలింగ్స్ ఉంటాయి," ఇంకా ఏదో మాట్లాడబోయింది. కానీ అప్పటికే కళ్ళు కల్హార సరస్సులై ఉబికి వస్తున్నాయి. ఎగశ్వాస ఆరంభమైంది. గొంతు లోంచి వెల్లువై పొంగుకొస్తున్న దుఃఖం ఏమీ మాట్లాడనీయడంలేదు. ముఖ కండరాలు అదుపు తప్పి వంకర్లు పోతూంటే, రెండు చేతుల్లో ముఖం దాచుకొని కుప్పలా నేల కూలిపోయింది; మోకాళ్ళను దగ్గిరగా కావలించుకొని మొహాన్ని మధ్య ఇరికించి గుక్క త్రిప్పుకోకుండా వెక్కి వెక్కి ఏడుస్తుంది. నిశీథి నిశ్శబ్దంలో ఆమె రోదన వికృతంగా ధ్వనిస్తుంది.

ఆమె ఏడవడం ప్రారంభించగానే నాలో మొదట కలిగన బిత్తరపాటు, ఇవాల్టికిక నా కాంక్ష తీరదని అర్థమై నిరాశగా, ఆమె బేలతనంపై చిరాకుగా మారి; వెంటనే, ఒక పక్క ఆమె గుండెలవిసేలా రోదిస్తుంటే మరోప్రక్క శరీర సౌఖ్యం గురించి చింతిస్తున్న నా స్వార్థం స్ఫురించి నన్ను అపరాధ భావనలోకి నెట్టేసింది. ఇపుడిక రక్తంలో ఉడుకు లేదు, నెమ్మదిగా నరాల్లో సంచలనం సద్దుమణిగింది. ఆమెను దగ్గిరకు తీసుకొని గుండెలకు హత్తుకోవాలనిపించింది — కోరికతో కాదు, ఓదార్పుతో. కాని దగ్గిరకు వెళ్ళే సాహసం చేయలేకపోయాను. క్షణం క్రితం నాకూ, ఇప్పటి నాకూ ఒక మృగానికీ మనిషికీ ఉన్నంత తేడా ఉంది; కానీ నా స్పర్శ ఆ తేడాని ఆమెకు తెలియజేయగల్గుతుందా. అందుకే — ఆమె జాలిగా, బేలగా ఏడుస్తుంటే నేనలాగే మంచం చివర కూర్చుని నిస్సహాయంగా చూస్తుండిపోయాను.

ఆమె :

రచయితలందరూ స్వార్థపరమైన మనస్తత్వమే కలిగి ఉంటారా అన్న అనుమానం వస్తుంది నవీన్‌ని చూస్తూంటే. నాల్గురోజుల క్రితం జరిగిన సంఘటన తల్చుకుంటే ఇంకా కంపరంతో వంట్లోంచి వణుకుపుడుతోంది. సాధారణంగా నవీన్ తన రచనల గురించి అవి చిత్తుప్రతి దశలో ఉన్నపుడు నాతో చర్చించడు; నేనూ వివరం అడగను. పుస్తక రూపంలో వెలువడ్డాక తెచ్చిస్తాడు. మొన్నకూడా ఒక కథల సంపుటిని, అది నగర ప్రముఖుల సమక్షంలో ఆవిష్కృతమయ్యాక, తెచ్చిచ్చి చదవమన్నాడు.

అందులో ఒక కథ పేరు "రెండో తేనె చందమామ". కథనం కథానాయకుడి స్వగతంగా ఉత్తమ పురుషలో సాగుతుంది. అతనూ అతని భార్యా వివాహం అయిన పది సంవత్సరాల తరువాత, తమ మధ్య క్రమంగా పేరుకుపోతూవస్తున్న శూన్యత, స్తబ్దతలకు తెరదించడానికి సెకండ్ హనీమూన్‌లా కాశ్మీరు విహార యాత్రకు వెళతారు. జమ్ములో ఒకరోజు విడిది తరువాత అద్దెకారులో పెహెల్‌గావ్‌కు ప్రయాణమౌతారు. మార్గమధ్యంలో మంచు తుఫాను మొదలవుతుంది. ఘాట్‌రోడ్ మీద అడుగు ఎత్తులో పేరుకుపోయిన మంచు కారుని ముందుకీ వెనక్కీ కదలనివ్వదు. చాలాసేపు కారులోనే వెయిట్ చేస్తారు. తుఫాను వెలిసాక, చుట్టూ ఎల్లలులేని తెల్లదనం ఆహ్వానిస్తుంటే, జంకుతూనే కారుదిగి బయటకు అడుగు పెడతారు. రోడ్డు అంచుకి వెళ్ళి తొంగిచూడబోతూ ప్రమాదవశాత్తూ కాలుజారి ఇద్దరూ ఒకరి మీంచి ఒకరు పొర్లుకుంటూ, జంటగా, ఏటవాలుగా మంచు లోయలోకి జారిపోతారు. అక్కడ, వణికిస్తున్న మంచుపై వళ్ళే నెగళ్ళుగా చలి కాచుకుంటూ, నిర్మానుష్యమైన ప్రకృతి మధ్య, పైన్ వృక్షాల క్రింద, మంచుపై శాలువా పరచి నిస్సిగ్గుగా, యధేచ్చగా శృంగారంలో పాల్గొంటారు. చివర్లో ఒక వర్ణన ఇలా కొనసాగుతుంది: ". . . సౌఖ్య శిఖరాన్ని చేరుతున్న ఉద్వేగంలో — కళ్ళు అరమోడ్పులై, భృకుటి ముడిపడి, వేడి ఊరుపులతో ముక్కుపుటాలు వెడల్పవుతుంటే, అధరాలు మధురమైన బాధతో అదురుతుంటే — పళ్ళన్నీ గిట్టకరచి ఓపలేని తమకంతో చివరగా ఒక్కసారి వణికింది; నా భుజం చీలిపోతుందేమో అన్నంత ఒత్తిడితో గోళ్ళతో గట్టిగా నొక్కి వదిలేసింది." — వస్తువేమీ లేక పోయినా కేవలం శైలీ సంవిధానాలతో కథను నడిపించిన నేర్పును అభినందించేదాన్నే — అక్కడ కథానాయిక నేనే కాకపోయివుంటే; భావప్రాప్తి పర్యంతం వర్ణించబడుతున్న ముఖారవిందం నాదే కాకపోతే!

నన్ను నిలువునా కుచించుకు పోయేలా చేసింది ఆయన సహోద్యోగులుగానీ, నా పరిచయస్తులుగానీ ఇది చదివితే ఏమనుకుంటారో అన్న ఆలోచన కాదు (అది కూడా, అఫ్‌కోర్స్); అసలు కారణం ఈ క్షణం వరకూ మా ఇద్దరికీ మాత్రమే సొంతమనుకున్న ఓ అందమైన జ్ఞాపకం ఇకనుండి పదిమంది పరమూ కాబోతోందన్న బాధ. అహ, నిజానికి ఒక జ్ఞాపకాన్ని కోల్పోయిన బాధ కూడా కాదు; ఎందుకో దాన్ని అలా రాయడం ద్వారా ఆ జ్ఞాపకానికి నేనిచ్చిన విలువ అతనివ్వలేదన్న భావన కల్గింది. నేను చీట్ చేయబడ్డానన్న ఉక్రోషం; నా నుండి విలువైన వస్తువునెవరో దగ్గరివాళ్ళే దోచుకున్న నిస్సహాయత. వెళ్ళి నవీన్‌ని నిలదీసాను. ఏమిటి అభ్యంతరమన్నాడు.

"అది మనిద్దరికీ మాత్రమే సంబంధించింది. దాన్ని అలా కథరాసి రచ్చ చేయడం అసహ్యంగా అనిపించలేదూ?!"

"ఓ అందమైన జ్ఞాపకాన్ని అక్షరాల్లోకి అనువదించాలనుకున్నానంతే," — అతని సమాధానం.

"అది నీకు మాత్రమే సంబంధించిన జ్ఞాపకమైతే అక్షరాల్లోకి మార్చుకో అంగట్లో అమ్ముకో నాకనవసరం; కానీ అది మనిద్దరికీ సంబంధించింది, దాన్ని బయట పెట్టే ముందు నన్ను కూడా అడిగుండాల్సింది."

దరిమిలా ఇలా ఓ పది నిముషాలపాటు కొనసాగిన వాదనతో నాకు మరోసారి రూఢి అయ్యిందేమిటంటే, రచయితలతో వాదించడం కష్టం. అసలు తనకిది ఒక సమస్య లాగానే కనిపించలేదు. కాసేపు నాకు ఈస్థటిక్స్ గురించి లెక్చరిచ్చాడు; ఒక రచయితకు తన జీవితమే ముడిసరుకన్నాడు; రచన అంటే జీవితమనే బావిలోంచి కలమనే చేదతో అనుభవాల నీటిని తోడివేయడమే నన్నాడు. మరి వ్యక్తిగత అనుభవాలే రచనకు ముడిసరుకైతే ఇక ఊహాశక్తికి చోటెక్కడ అన్న అనుమానమొచ్చింది నాకు; కాని అడగలేదు. ఎందుకంటే నా సమస్య అసలది కాదు; ఏమిటన్నది వివరించి చెప్పగలిగే నేర్పు, వాక్చాతుర్యం నా దగ్గిర లేవు. అప్పటికే నా మెదడు పొరల్లో తిలక్ "ద్వైతం" గింగుర్లు తిరుగుతుంది: "నువ్వు మావూరొచ్చినపుడు/ నేను మీ వూళ్ళో వున్నాను// నువ్వు మద్రాసులో రైలు దిగే వేళకి/ నేను కలకత్తా రైలెక్కుతున్నాను...." ఇలా ఇక ఎంత వాదించినా ఇంతే, దిగంతంలో ఎక్కడో కలుస్తాయని భ్రమింప జేసే రైలు పట్టాల్లా వాదన అనంతంగా సాగిపోతూనే ఉంటుంది. అయినా నా మౌనంతో అతనికి నేను సమాధానపడ్డానన్న అపోహ కలగనియ్యడం ఇష్టం లేక, అపుడింకా నా చేతిలోనే ఉన్న అతని కథల పుస్తకాన్ని రెండు చేతుల్తో అతని ముఖం ముందు తెరచి పట్టుకుని, మధ్యలోకి చించివేసాను. విస్తుపోయి చూస్తున్న అతని చూపులకు సంతృప్తి చెంది, మౌనంగా, అతని రాతబల్ల ప్రక్కన ఉన్న డస్ట్‌బిన్‌లోకి దాన్ని విసిరేసి వచ్చేసాను. తర్వాతి రోజునుండీ మా మధ్య మాటల్లేవు; ఇదిగో, ఇలా శ్మశాన నిశ్శబ్దం.

చెవుల్లోకి ఏదో అలవాటైన జింగిల్ చొరబడుతుంటే నా ఆలోచనల్ని ప్రక్కకి విదిలించి టి.వి. వైపు చూసాను. ఆ అడ్వర్టైజ్‌మెంట్. . . ఉంగరాలజుట్టమ్మాయి. . . కుందేలు పిల్లలా భలే ఉంటుంది. చిట్టి చేతులు రెండూ పైకెత్తి, మూసిన గుప్పెట్లోంచి చూపుడువేళ్ళు బయటకి నిలబెట్టి, భాంగ్రా దరువుకి భుజాలు పైకీ క్రిందకీ ఊగిస్తూ. . . [. . .] అసలు మా ఇద్దరి మధ్యా ఇన్ని సమస్యలకూ కారణం పిల్లలు లేకపోవడమేనా! — సడెన్‌గా ఛానెల్ మారింది. ఆలోచన చెదిరింది. తలత్రిప్పి చూసాను. నేనప్పటి వరకూ అక్కడ నవీన్ ఉనికినే మర్చిపోయాను; అపుడు గమనించాను, ఆ చూపు. . . నాకు తెలుసు దాని అర్థమేమిటో: కళ్ళలో నగ్నంగా బుసలు కొడ్తూన్న కామం. కడుపు తరుక్కుపోతున్న భావన కల్గింది. ఎందుకు మా మధ్య ప్రతీ సమస్యా చివరకు పక్క మీదే సర్దుబాటవుతుంది? ఎందుకు ఎప్పుడూ పక్క మీదే అతని క్షమాపణల పర్వం మొదలౌతుంది (తప్పు తనదైనా నాదైనా)? ఎందుకు ఒక స్వచ్ఛమైన, పారదర్శకమైన మామూలు సంభాషణతో మా ఏ సమస్యా పరిష్కారం కాలేదు. అయితే నేనెప్పుడూ శృంగారాన్ని నా తురుపుముక్కగా వాడుకోలేదు; అదింకా నీచమని తెలుసు. — టై పదకొండయింది. వళ్ళోని చీరని ప్రక్కన పడేసి లేచాను. లేచి, వంటింట్లోకి వెళ్ళి, ఫ్రిజ్‌లోంచి బాటిల్‌తీసి నీళ్ళు త్రాగే పర్యంతం — చూడనక్కర్లేదు — అతని చూపులు నా వంటినే తడుము తుంటాయని తెలుసు. బాటిల్‌ని అవసరమైన దానికన్నా ఎక్కువ జాగ్రత్తతో పైకి ఎత్తాను. మూత బిగించేటపుడు అవసరమైన దానికన్నా గట్టిగా బిగించాను. హాల్లోంచి అతన్ని దాటి వెళ్ళేప్పుడు కళ్ళను అతనివైపు మరలకుండా ప్రయత్నపూర్వకంగా నియంత్రించుకున్నాను.

బెడ్‌రూమ్‌లోకి వచ్చి మంచంవార ఒత్తిగిలి పడుకున్నాను. మూసిన కిటికీ అద్దం మీద ఆవలి వైపున్న కాశీరత్నం తీగె ఛాయా రూపంలో గుబులుగా కదులుతుంది. ఎందుకో ఒక కన్నీటి చుక్క జారి నాసిక అంచున తడబడుతూ నిలిచింది. తుడుచుకోవాలనిపించలేదు. ఇపుడేం జరగబోతోందో తెలుసు. ఇలా చాలాసార్లు జరిగింది. నా అస్తిత్వం ముందు పెద్ద ప్రశ్నార్థకాన్ని నిలబెట్టే ఘర్షణలు, అతనికి కేవలం చిలిపి తగాదాల్లా కనిపిస్తాయి. నా శరీరం కోసం అతని దేబిరింపులు, నేను నా శరీరం తప్ప మరేమీ కాదేమోనన్న నూన్యతను కలుగజేస్తాయి. "అతనో కళాకారుడు, అతనికి విశాలత్వం కావాలి, అతని స్పేస్ అతనికి ఇవ్వాలి" అని నేను వెనక్కి తగ్గుతూ వస్తున్నాను; కానీ ఆ ప్రయత్నంలో ఇక్కడ నాకే చోటు లేకుండా పోతోందన్న సంగతి గమనించలేకపోయాను. మరో కన్నీటి చుక్క తరుముకొచ్చింది. నాసిక అంచున నిలిచిన మొదటి కన్నీటి చుక్కని కలసి "ఛలో దూకేద్దా"మంది. రెండూ జతగా క్రిందకు రాలిపోయాయి. - ఇపుడు వస్తాడు. "సుజీ" అంటాడు. "సారీ" అంటాడు. మాట కలుపుతాడు. నన్ను తడుముతాడు. నా చలివిడి ముద్ద శరీరంపై సరీసృపమై ప్రాకుతాడు. ఆటవిక లయ ఆగి పోయాక, ఆత్రం తీరిపోయాక అలసటగా అటు తిరిగి పడుకుంటాడు. అసలు నేను నిజంగా భావప్రాప్తి పొంది ఎన్నాళ్ళయింది? అడిగితే, డిమాండ్ చేస్తే తట్టుకోగలడా?

కర్టెన్ కదిలిన అలికిడి. కన్నీళ్ళు తుడుచుకోవా లనుకున్నాను; కానీ నేను మెలకువగా ఉన్నానని అతనికి తెలియడం ఇష్టంలేక మెదలకుండా పడుకున్నాను. ఎందుకో నా మీద నాకే భయం కలుగుతూంది. నాకు తెలుస్తుంది — ఇవాళ నాకు అతీతంగా; నా సత్తువతో, స్థైర్యంతో నిమిత్తం లేకుండా నేనతన్ని వ్యతిరేకించబోతున్నాను. కానీ అది నాలోనే మరో నాకు ఇష్టం లేదు. (అలాగని ఇదేమీ మమతల పొదరిల్లు కాదు, కూలిపోతోందేమో అని కలవరపడటానికి; కానీ ఇది కాకపోతే ఏదీ అన్నది స్పష్టంగా తెలియడం లేదు.) ఎందుకీ స్థితి తెచ్చుకున్నాను. . . కానీ మరోదారి నా చేతుల్లో ఉందా. . . [. . .] హఠాత్తుగా నా చేతనా తలాన్ని పెల్లగించుకుని బాల్యపు జ్ఞాపక చిత్రమొకటి మొకటి జలలా ఉబికి వచ్చింది: మా మండువా లోగిలి పెంకుటింట్లో, ఓ మసక వెలుతుటి గదిలో, నవ్వారు మంచం మీద అమ్మ ఒడిలో తల పెట్టుకొని నేను జ్వరంతో పడుకుని ఉన్నాను. అమ్మ నా తల నిమురుతూ జ్వరం నుండి నా దృష్ఠి మరల్చడానికి ఏదో కథ చెప్తుంది. నానమ్మ క్రింద కూర్చుని పొత్రంలో కషాయానికి అల్లం నూరుతూ, "పిల్లది మరీ అబ్బర"మంటూ ప్రేమగా విసుక్కుంటూంది. నాన్న తన ఆదుర్దా నాకు కనిపించనీయకుండా గది బయటే పచార్లు చేస్తున్నాడు. — అదీ పొదరిల్లంటే, నా సామ్రాజ్యం, నేను మహా రాణి; నా చుట్టూ రక్షణగా ప్రేమ ఆప్యాయతల కోటగోడ ఉంది. అదే ఇక్కడ లోపించింది. స్పష్టంగా ఇదీయని వివరించలేని అభద్రతా భావన. పెళ్ళయి పదేళ్ళయినా ఇంకా ఇదే నా జీవితం అంటే నమ్మకం కలగడంలేదు; సొంత జీవితాన్ని ఎక్కడో పోగొట్టుకుని, అద్దెకో జీవితాన్ని తెచ్చుకుని జీవిస్తున్న దిగులు. "రిక్లెయిమ్ యువర్ లైఫ్" — ఏదో టి.వి. ప్రకటనకు టాగ్‌లైన్. . . క్లెయిమ్ చేసుకోనా ఇప్పుడు . . . లేక ఈసరికే చేయి దాటిపోయిందా?

భుజం మీద — వెచ్చగా, అసౌకర్యంగా — అతని చేయి పడింది.భూమ్మీద ఇన్నేళ్ళ నా మనుగడలో అంత జుగుప్సాకరమైన పధార్థమేదీ నా శరీరాన్ని స్పృశించలేదనిపించింది. అసహ్యాన్ని గొంతులోనే అణుచుకుంటూ, చిరాగ్గా ఉంది తీసేయమన్నాను.

"చిరాగ్గావుంది కాబట్టి చేయి వేయొద్దా లేక నేను చేయి వేయడమే చిరాగ్గా ఉందా?" — వెటకారాన్ని ప్రశ్నగా మార్చి అడిగాడు.

ఎందుకు మాట్లాడిస్తావ్. . . నిశ్శబ్దాన్ని వినలేవా. . . .

"రెండూ ఒకటే," పూడుకుపోతున్న గొంతును పెగుల్చుకుని ఆ మాత్రం బయటకు అనగలిగాను.

అపుడు వినబడింది — తనలో తను గొణుక్కుంటూ అన్న మాట. నన్ను గాయ పరచాలని అన్నాడో లేక నిజంగా అతని అభిప్రాయమదేనో తెలీదు; నాకు మాత్రం సూటిగా తగిలింది: విషంలో ముంచి వదిలిన బాణంలా, నిర్దయగా గుండె లోతుల్ని కెలుకుతూ. . . [. . .] నేను జడురాలినా. నాకు స్పందనలు లేవా. అసలతనికి తెలుసా ఎలా స్పందింపజేయాలో— మనసునైనా, శరీరాన్నైనా. దిగ్గున లేచి నిల్చొన్నాను. ఉద్వేగంతో కాళ్ళు వణుకుతున్నాయి. అతను అటుతిరిగి పడుకుని ఉన్నాడు. అతనన్నది స్పష్ఠంగానే వినబడినా, అతను మళ్ళీ అదే మాట రెట్టిస్తే తట్టుకునే శక్తి ఇప్పుడు నాలో లేదని తెలిసినా, మళ్ళీ ఆ మాట అనొద్దని మనసులోనే కోరుకుంటూ , సవాలు చేస్తున్నట్టు మళ్ళీ ఆ మాట అనమన్నాను.

సీన్ చేయకుండా పడుకోమన్నాడు. దిసీస్ ఇట్. . . డెడ్ ఎండ్ . . . "గొప్ప విభాజక క్షణం". ఈ క్షణం తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవిత విస్తారంలో పదేళ్ళ ఖాళీ కనబడబోతూంది. కారణమిదని సమాధానపడేందుకు ఏమీ మిగల్చని ఖాళీ. అర్థం పర్థం లేని ఖాళీ. అతను నా వైపుకు తిరిగాడు. నీళ్ళు నిండిన నా కళ్ళు అతని చిత్రాన్ని మసకబార్చాయి. ఏదో మాట్లాడబోయాను, కానీ స్వర తంత్రులు మొండికేసాయి. అతని ముందు బలహీనంగా, బేలగా బయటపడ కూడదని ఎంత ప్రయత్నించినా కెరటంలా పొంగుకొస్తున్న దుఃఖం సహకరించడంలేదు. కాళ్ళు పట్టు వదిలేసినయ్. అలాగే నేలకూలిపోయాను. గుండె తెరిపి పడేదాకా ఏడిచాకా, వెక్కిళ్ళ మధ్య, నా అంతిమ నిర్ణయాన్ని అతనికి చెప్పాను: "నాకు డైవోర్స్ కావాలి."

***************

అతడు (లేదా) నేను:

ఇపుడిలా తనులేని ఏకాంతంలో టేబిల్‌లాంప్ వెలుగులో నా రాతబల్ల ముందు కూర్చుని, అసలీ కథ నేనెందుకు రాస్తున్నానూ అని తర్కించుకుంటే, సమాధానంగా 'ప్రోస్ట్' కొటేషన్ ఒకటి స్ఫురణకు వస్తుంది: "కేవలం కళ ద్వారానే మనం మననుండి విముక్తులమై మరొకరి కళ్ళతో వీక్షించగలం". బహుశా ఈ కథ ఆమె కళ్ళతో నన్ను నేను చూసుకొనే ప్రయత్నమేమో.

ఆమె వెళిపోయిన తర్వాత రెండు రోజులవరకూ నాకేం అర్థంకాలేదు. తన చర్య అర్థరహిత మనిపించింది. నేను అప్పటివరకూ విడాకులకు దారి తీసేంతటి సమస్యలేవీ మా మధ్య లేవనే భావిస్తూ వచ్చాను. ఆ సమయంలో ఈ హఠాత్పరిణామం నన్ను నిర్ఘాంతపరిచింది; ఒకరకమైన ఆలోచనారహిత స్తబ్దత నన్నావరించింది. మొదట ఈ కథ కేవలం నా వెర్షన్ వరకూ మాత్రమే రాద్దామని ప్రారంభించాను. కానీ రాస్తున్నకొద్దీ నిజానికి నా తరపున రాయడానికేమీ లేదని అర్థమైంది; అసలు కథంతా ఆమె తరపునే ఉందనిపించింది. నెమ్మదిగా మొత్తం సంఘటనను ఆమె దృక్కోణంలోంచి పరికించడానికి ప్రయత్నించాను. ఒక భర్తగా ఆమె తరపునుండి నేనెపుడూ ఆలోచించ లేకపోయాను, ఐ టుక్ హెర్ ఫర్ గ్రాంటెడ్; కానీ ఒక రచయితగా నాకు నేను ఎలాంటి మినహాయింపులూ ఇచ్చుకోలేదు. అప్పటివరకూ ఏ మాటకైతే ఆమె ప్రతిస్పందనను విపరీతమనీ అసంగతమనీ భావించానో నిజానికి ఆ మాటకూ ఆమె ప్రతిస్పందనకూ సంబంధం లేదనీ, చాలాకాలంగా లోపల్లోపలే కూడగట్టుకుంటూ వస్తున్న ఆక్రోశం లావాలా పెల్లుబికి బయటకు పొర్లడానికి అది కేవలం ఒక చివరి ఉద్దీపన మాత్రమేననీ అర్థమైంది. అసలు కారణం: మేమిరువురం ఒక కుటుంబం అన్న భావనను నేనామెకు కల్పించ లేకపోయాను; అది నా ఓటమి.

ఇపుడు నా ముందో బృహత్తర లక్ష్యం ఉంది: నా భార్యని తిరిగి గెలుచుకోవడం. ఎలా అంటే ఏమో. . . పక్కా ప్రణాళికలాంటిదేమీ లేదు. . . క్షమాపణ లేఖ దగ్గర్నించీ కాళ్ళు పట్టుకోవడందాకా అన్ని స్ట్రాటజీలూ పరిశీలనలో ఉన్నాయి. కానీ ఇలా మాత్రం నావల్ల కాదు: ఇంట్లో ప్రతీమూల, ప్రతీ వస్తువూ, ప్రతీ గాలివాటు పరిమళం ఆమె లేని శూన్యతను ఎత్తిచూపి గుండె బరువును పెంచుతున్నాయి. నిన్న అర్థరాత్రి కలత నిద్రలో తనింకా నా ప్రక్కనే ఉందని భ్రమిస్తూ, కాసేపు ఖాళీ పరుపు తడుముకొని తుళ్ళిపడి లేచాను. తర్వాత మంచపు ఆ ఖాళీ అర్థభాగం నన్ను మరిక నిద్ర పోనీయలేదు. మొన్న అంతే — ఆఫీసు నుండి వచ్చి, పరధ్యానంగా తాళం తీసి లోపల అడుగు పెడుతూ, "ఐయామ్ హోమ్" అంటూ చీర్‌ఫుల్‌గా, అలవాటుగా అరిచాను. బాల్కనీ రెయిలింగ్ మీంచి పావురం ఒకటి హడిలి ఎగిరిపోయింది. దాని రెక్కల తాటింపు తప్ప అంతా నిశ్శబ్దం. ఇక వంటగదిలోకైతే, అడుగు పెట్టినప్పుడల్లా చిన్నసైజు నెర్వస్ బ్రేక్‌డవున్ లాంటిది అనుభవానికొస్తుంది. నాకు తెలియకుండానే ఆమె నా జీవితంతో ఎంతగా పెనవేసుకుపోయిందో ఇపుడర్థమవుతుంది. ఇపుడామెను వెనక్కి రమ్మని ప్రాధేయపడానికి నాకే అహపు అడ్డుగోడలూ అవరోధం కాదు. "ఏమనుకున్నా సుజాతే కదా" అన్న ధీమాతో ఉన్నాను ప్రస్తుతం. అండ్ చివరిగా... ఈ కథ ఖచ్చితంగా ప్రచురణకోసం కాదు (అఫ్‌కోర్స్).

— నవీన్ .

September 3, 2007

"నేను సాహిత్యాన్ని": కాఫ్కా

(ఈ వ్యాసం ఏడేళ్ల క్రితం 2007లో రాసింది. కాఫ్కా మీద తర్వాత 2013లో ఇంకా సమగ్రంగా "శిలువ మోసిన రచయిత"  పేరిట ఇంకో వ్యాసం రాశాను. ముందు అది చదవండి.) 

"నేను సాహిత్యాన్ని" (I am literature) - ఈ వ్యాఖ్యను కాఫ్కా అహంతోనో, మితిమీరిన ఆత్మవిశ్వాసంతోనో చేయలేదు. ఆయన డైరీలను (The Diaries of Franz Kafka) చదివినవారికి ఈ విషయం సులభంగానే అర్థమౌతుంది. తన అస్తిత్వానికి పరమార్థం సాహిత్యమేనని నిజంగా నమ్మాడాయన. అందుకే ఏ సాహితీ స్రష్టా సాహసించని ఆ స్టేట్‌మెంట్‌ని ఇవ్వగలిగాడు. సాహిత్యాన్ని జీవితంలో ఒక భాగంగా మాత్రమే దర్శించటంలో ఆయన విఫలమయ్యాడు. తన జీవితాన్నే సాహిత్యమయం చేసుకున్నాడు. ఆయన దృష్ఠిలో తన కలం కాగితంపై నర్తించని రోజుకి అర్థమేలేదు. It is as if he was doomed to write.

"నా మస్తిష్కంలో నేను కలిగివున్న అద్భుతప్రపంచం... చినిగి ముక్కలైపోకుండా ఎలా దానికి స్వేచ్ఛనందియ్యాలి, ఎలా నేను స్వేచ్ఛ పొందాలి. దాన్ని నాలోనే నిలుపుకోవడం లేదా సమాధి చేసేయడం కన్నా, శకలాలుగా చిధ్రమైపోయినా వెలికి తీసుకురావడమే వేయింతలు సబబైన మార్గమనిపిస్తుంది. నా జన్మహేతువిదే, ఇంతమేరకు నాకు స్పష్టంగా తెలుసు." -- (కాఫ్కా డైరీల నుండి)

మనకు ఇష్టుడైన ఒక రచయితనూ, అతని పట్ల మనకున్న ఇష్టాన్నీ పరిశీలనాత్మక దృక్పథంతో విశ్లేషించి చెప్పడం కష్టం. రచయితపట్ల మనకున్న అభిమానం; అతన్ని నిష్పాక్షికంగా, ఆబ్జెక్టివ్‌గా పరిశీలించగలిగే దృక్కోణాన్ని మసకబారుస్తుంది, కాబట్టి నేనా ప్రయత్నం చేయబోను. ఇక్కడ కేవలం కాఫ్కా పట్ల నా అభిమానాన్ని మాత్రమే వ్యక్తం చేసుకోదలిచాను.

ఫ్రాంజ్ కాఫ్కా (1883-1924) బొహేమియా రాజధాని ప్రేగ్‌లో, ఒక మధ్యతరగతి జర్మన్ యూదు (Jews) కుటుంబంలో జన్మించాడు. తండ్రి హెర్మన్ కాఫ్కా ఒక వ్యాపారస్థుడు. తండ్రీ తనయుల మధ్య అనుబంధం సంక్లిష్టమైనది. వ్యాపారాత్మక దృక్పథం, ఆర్భాటపూరితమైన మనస్తత్వం, దుందుడుకు స్వభావంగల తండ్రికి కాఫ్కా ఎన్నడూ చేరువకాలేకపోయాడు. అలాగే అంతర్ముఖుడు, సున్నిత మనస్కుడైన కాఫ్కాతోనూ అతని తండ్రి ఎపుడూ సన్నిహితంగా మెలగలేకపోయాడు. (కాఫ్కా యొక్క 'జడ్జ్‌మెంట్' కథలోని తండ్రి పాత్రలో హెర్మన్ కాఫ్కా ఛాయలు గమనించవచ్చు.) కానీ ఎన్ని విభేదాలున్నా, ఎన్ని ప్రచ్ఛన్నయుద్ధాలు కొనసాగినా కాఫ్కా తన జీవితకాలంలో చాలాభాగం తల్లిదండ్రులతో కలసి నివసించడానికే మొగ్గుచూపాడు. కాఫ్కాకు ఆరేళ్ళు వచ్చేటప్పటికే ఇద్దరు తమ్ముళ్ళూ (ఒకరు 15 నెలలకు, మరొకరు 6 నెలలకు) చనిపోయారు. ఇక మిగిలింది ముగ్గురు చెల్లెళ్ళు. చిన్నతనంలో తల్లికూడా తండ్రికి వ్యాపారవ్యవహారాల్లో సహాయపడుతూ, ఎక్కువ సమయం ఇంటి బయటే గడపవలసిరావడంతో కాఫ్కా నౌకర్ల సంరక్షణలో పెరుగుతూ, తన చెల్లెళ్ళతోనే సన్నిహితంగా మెలిగేవాడు. ముఖ్యంగా చిన్న చెల్లెలు Ottla తో అతనిది గాఢమైన అనుబంధం.

చదువులో కాఫ్కా చురుకైన విద్యార్థి. రసాయన శాస్త్రంపై ఆసక్తి ఉన్నా తండ్రి ఇచ్ఛమేరకు న్యాయశాస్త్రం చదివి 1906 లో పట్టభద్రుడయ్యాడు. ఈ యూనివర్సిటీ రోజుల్లోనే కాఫ్కాకు సహవిధ్యార్థి, భావిరచయిత మాక్స్‌బ్రాడ్‌తో పరిచయమైంది. ఆ తదుపరి వీరిరువురూ జీవితాంతం సన్నిహిత మిత్రులుగా మెలిగారు. చదువు పూర్తయిన తరువాత కాఫ్కా బొహేమియా రాజ్యపు 'కార్మికుల ప్రమాద భీమా సంస్థ'లో ఉద్యోగిగా చేరాడు. ఉద్యోగ విధుల్ని శ్రద్ధగానే నిర్వర్తించినా; కాఫ్కా ఈ ఉద్యోగాన్ని కేవలం తన ప్రాథమిక అవసరాలను తీర్చే 'రొట్టెకూడు ఉద్యోగం'(bread job)గానే భావించాడు. అతని ఆసక్తి అంతా సాహితీ సృజన మీదనే. ఉద్యోగ విధులు మధ్యాహ్నం రెండు గంటలకే సమాప్తమౌతుండటంతో, అతని రచనావ్యాసంగం నిరాటాంకంగా కొనసాగటానికి అవకాశం కలిగింది.

కాఫ్కా తల్లిదండ్రులిరువురివీ సహజమరణాలు కాగా, చెల్లెళ్ళతో సహా కుటుంబసభ్యులు చాలామంది, రెండవ ప్రపంచయుద్ధ సమయంలో, హిట్లర్ నియంతృత్వంలో యూదులపై పెచ్ఛరిల్లిన మారణకాండలో, కాన్సెన్‌ట్రేషన్ క్యాంపుల్లో మృతి చెందారు. కాఫ్కా మాత్రం ముందే, 1924 లో 41 సంవత్సరాల వయస్సులో, ఊపిరితిత్తుల వ్యాధి(Tuberculosis) కారణంగా మరణించాడు.

ఇక కాఫ్కా జీవితంలో ప్రణయపర్వాన్ని పరిశీలిస్తే - తన 29వ యేట కాఫ్కా తన స్నేహితుడు మాక్స్‌బ్రాడ్ గృహంలో ఒక విందులో ఫెలిసీ (Felice Bauer)ని మొదటిసారి కలిసాడు. బెర్లిన్‌లో ఒక డిక్టాఫోన్ కంపెనీకి ప్రతినిధిగా పని చేసే ఆమెతో తొలిపరిచయంలోనే ప్రేమలో పడిపోయాడు. చాలాభాగం ఉత్తరాల ద్వారా, అపుడపుడూ కలుసుకోవడాలతో కొనసాగిన వీరి ప్రేమాయణం రెండుసార్లు ఎంగేజ్‌మెంట్ అయినా, వివాహపు మజిలీని చేరుకోలేదు. దీనికి ముఖ్యకారణం కాఫ్కాకు సాహిత్యంపై ఉన్న మక్కువే. వివాహం తనను రచనా వ్యాసంగం నుండి దూరం చేస్తుందని భావించాడు కాఫ్కా. నిజానికి, తన యొక్క రచనా వ్యాసంగం పట్ల ఏ ఆసక్తీ చూపని, వేరే ఏ విధమైన కళాతృష్ణా కనపరచని సాధారణయువతి ఫెలిసీ పట్ల, కాఫ్కా కురిపించిన ఈ గాఢమైన అనురాగాన్ని; తను సభ్యుడిగా మనలేకపోతున్న బాహ్యప్రపంచంతో ఆయన చేసిన చివరి సంధి యత్నంగా విశ్లేషించవచ్చు. ఆయన తన లోపలి ప్రపంచానికి వెలుపలి ప్రపంచానికీ మధ్య ఒక వారధిని కోరుకున్నాడు. మానవ అస్తిత్వపు మరుగున దాగి ఉన్న చీకటిని, అర్థరాహిత్యాన్ని తరచి చూడగలిగే భయంకరమైన, నరకప్రాయమైన తన పరిశీలనాశక్తి నుండి తనకు విముక్తి కలిగించే వరంలా ఆమెను ఊహించుకున్నాడు. ఆ శక్తిని ఆమెకు ఆపాదించుకున్నాడు. కాని ఈ ఆకాంక్షల భారాన్ని ఆమె భరించలేకపోయింది. ఒకరకంగా అతని ఈ పరిశీలనాసక్తి వరమో, శాపమో అతనికే తెలియదు. తనని మిగతా ప్రపంచం నుండి వేరుచేసే సాహిత్య జీవితం వైపు మొగ్గు చూపాలో, అందులో ఒకడిగా కలిపివేసే కుటుంబజీవితాన్ని అనుసరించాలో అన్న సందిగ్ధం ఆయన్ని చివరి వరకూ వెంటాడింది. ఈ సందిగ్ధతే ఆయన్ను ఫెలిసీ నుండి వేరుచేసింది.

తరువాత 1920 లో తన 37వ యేట, వివాహితయైన చెక్ జర్నలిస్టు, రచయిత్రి మిలెనా (Milena Jesenka)తో కాఫ్కా ప్రేమలో పడ్డాడు. కాఫ్కా రచన 'ది స్టోకర్'ను చెక్ భాషలోకి అనువదించడానికి ఆయన అనుమతి కోరుతూ మిలెనా వ్రాసిన లేఖతో ఇరువురి పరిచయం ఆరంభమైంది. వీరి ప్రణయం చాలావరకూ ఉత్తరాల ద్వారానే కొనసాగింది. కలుసుకుంది ఒక్కసారే. కాఫ్కా వివాహానికి సుముఖంగానే ఉన్నా, మిలెనా తన భర్తను విడిచిరావడానికి సిద్దపడకపోవడం వల్ల వీరిరువురి బంధం ముగింపుకు చేరుకుంది.

తన జీవితపు చివరిరోజుల్లో 40 సంవత్సరాల కాఫ్కా, 25 సంవత్సరాల కిండర్‌గార్టెన్ టీచర్ డోరా డయమంట్ (Dora Diamant)తో మరోసారి ప్రేమలో పడ్డాడు. కాఫ్కా ప్రణయానుభవాలన్నింటిలో ఇది ఆయనకు సంతృప్తినిచ్చిన అనుబంధం. జీవితపు చరమాంకంలో ఆయనకు ఇక ఏ సందిగ్దాలూ లేవు. సాహిత్యమా, సంసారజీవనమా అన్న ఊగిసలాటలు లేవు. జీవితమంతా తన తీక్షణమైన మానసిక సున్నితత్వం వల్లా, శారీరక అర్భకత్వం వల్లా అపరిమితమైన వేదనను అనుభవించిన కాఫ్కా, డోరా సాంగత్యంలో స్వచ్ఛమైన ప్రశాంతతను పొందాడు. ఇరువురూ వివాహం కూడా చేసుకోవాలనుకున్నారు. తన 41వ యేట ఊపిరితిత్తులవ్యాధి తీవ్రతరమై కాఫ్కా మరణించేవరకూ డోరా ఆయనకు తోడుగానే ఉంది, ఆమె చేతుల్లోనే ఆయన తుదిశ్వాస విడిచాడు.

ప్రపంచాన్ని, అది తొడుక్కున్న మోసపూరితమైన ఆచ్ఛాదనలను తొలగించి పారదర్శకంగా, నగ్నంగా వీక్షించగలిగే సామర్థ్యం కాఫ్కా యొక్క బలం మరియు బలహీనతగా చెప్పుకోవచ్చు. ఈ సున్నితమైన మానసికస్థితి ఆయన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. మిలెనాకు రాసిన ఒక ఉత్తరంలో ఆయన తన ఊపిరితిత్తులవ్యాధి గురించి ఇలా పేర్కొన్నాడు: 'ఎపుడైతే ఆత్మ మరియు హృదయం ఇక ఎంతమాత్రం భారాన్ని మోయలేవో, అపుడు కనీసం సమంగా పంపిణీ అయ్యేట్లు చూడటానికి, ఆ భారంలో సగభాగాన్ని ఊపిరితిత్తులు తమపైకి తీసుకుంటాయి.' ఊపిరితిత్తుల సమస్యతోపాటు ఆయన తరచు నిద్రలేమి, శిరోవేదనలతో బాధపడేవాడు. కాఫ్కా మరణం తర్వాత మిలెనా ఆయననుగూర్చి ఒక ప్రత్రికలో రాసిన Obituary లో ఇలా పేర్కొంది:

"He was too clear-sighted and too wise to be able to live; he was too weak to fight, he had that weakness of noble, beautiful people who are not able to do battle against the fear of misunderstandings, unkindness, or intellectual lies."

కాఫ్కా జీవితకాలంలో ప్రచురింపబడిన రచనలు చాలా స్వల్పం. తను మరణించే ముందు స్నేహితుడు మాక్స్‌బ్రాడ్‌కు రాసిన ఉత్తరంలో చివరికోరికగా తన అముద్రిత రచనలన్నింటినీ కాల్చేయమని కోరాడు. అదే జరిగి ఉంటే 20 శతాబ్దపు మేటి రచయితల్లో ప్రథమశ్రేణి రచయితనుగురించి మనకేమీ తెలిసేదేకాదు. కాని, స్వయంగా రచయిత అయిన మాక్స్‌బ్రాడ్ ఆ రచనల విలువను గుర్తించి, తన స్నేహితుడి కోరికను మన్నించకుండా, కాఫ్కా మరణానంతరం ఆ అముద్రిత రచనలన్నింటినీ క్రమబద్దీకరించి, పరిష్కరించి ప్రచురింపబడేలా శ్రద్ద తీసుకున్నాడు. తన జీవితకాలంలో అనామక రచయితగానే మిగిలిపోయిన కాఫ్కా, మరణానంతరం పాశ్చాత్య సాహిత్యంలో పెనువిప్లవాన్ని తీసుకువచ్చిన రచయితగా సుప్రసిద్దుడయ్యాడు. సాహిత్యానికిగల పరిధుల్ని విస్తృతంచేసి ఎందరో మేటి రచయితలకు మార్గదర్శకుడయ్యాడు.

నాకు కాఫ్కా పేరు మొదటిసారి పరిచయమైంది రచయిత కాశీభట్ల వేణుగోపాల్‌గారి "నేనూ-చీకటి"ద్వారా. సాధారణంగా నేను ఒక రచయితను(చదవడానికై) ఎన్నుకొనే విధానం ఇలా ఉంటుంది: నాకు నచ్చిన ఇతర రచయితలు - వారి రచనలలోగాని, ఇంటర్వ్యూలలోగాని - మరో రచయితను తమ అభిమాన రచయితగా పేర్కొన్నపుడు, ఆ ప్రస్తావనల ఆధారంగా మాత్రమే ఒక నూతన రచయితను నా పఠనాప్రపంచంలోకి అనుమతిస్తాను. నాకు కాశీభట్ల వేణుగోపాల్‌గారి రచనలంటే ఇష్టం. ఆయన దగ్గర ఉన్న పదసంపద, వాటితో ఆయనచేసే మంత్రజాలం నన్ను అబ్బురపరుస్తాయి. కాబట్టి ఆయన సిఫారసు ఆధారపడదగినదిగానే అనిపించింది. నేను కొన్న కాఫ్కా మొదటి పుస్తకం - ఆయన జీవించి ఉండగానే ప్రచురణకునోచుకున్న మెటమార్ఫసిస్, జడ్జ్‌మెంట్, ఇన్ ద పీనల్‌కాలనీ మొదలైన కధలతోకూడిన సంపుటి. చదవడం ప్రారంభించాను. ఇక్కడ ఒక విషయం నిజాయితీగా ఒప్పుకుంటున్నాను,కాఫ్కాతో నాది తొలిచూపు ప్రేమ కాదు. కాఫ్కా మొదట నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. సాహిత్యంపై నాలో నాటుకుపోయిన స్థిరాభిప్రాయాలూ; సాహిత్యపు పరిధి, సంభావనీయతల (Possibilities) పట్ల నాకున్న అంచనాలూ... ఇవన్నీ ఆయన ఎదురుదాడికి చాలా దెబ్బతిన్నాయి. ఇదంతా నాకేం నచ్చలేదు.

అంతక్రితం సాహిత్యం ఎలా ఉండాలన్న విషయంపై నాకు నిర్థిష్టమైన అభిప్రాయాలుండేవి: సాహిత్యమంటే సౌందర్యమని భావించేవాడ్ని; ఒక రచనలో ఆ రచయిత కనిపించాలనీ, సాహిత్యం రచయిత యొక్క ఆలోచనలనూ, మనస్తత్వాన్ని ప్రతిబింబించాలనీ నమ్మేవాడ్ని; "సాహిత్యం సమాజాన్ని ప్రతిఫలించాలీ, సమాజోద్దరణకు సాధనం కావాలీ" అని బాకా ఊదేవాళ్ళని (కొంచెం అపనమ్మకంతోనే అయినా) ఒప్పుకొనేవాడ్ని. అసలు ఇంత లోతైన విషయాలదాకా ఎందుకు, చాలామంది పాఠకుల్లానే నేనూ ఒక రచనంటే అందులో పాత్రలుండాలనీ; పాత్రలకు పేర్లుండాలనీ; పాత్రల మనస్తత్వ చిత్రణ స్పష్టంగా చిత్రింపబడాలనీ; కధానేపథ్యం, పరిసరాలూ చక్కగా వర్ణింపబడాలనీ; ఇవన్నీ కాకపోయినా, కనీసం ఒక రచనకు ప్రారంభం, ఘటన, ముగింపు అనే స్పష్టమైన విభజన ఉండితీరాలనీ - ఇలా ఒక పుస్తకం తెరిచేముందు కొన్ని ప్రాథమిక అంశాలను take it for granted గా తీసుకుని ముందుకి సాగుతాను. ఇక అసలు విషయానికొస్తే, ఇక్కడ నేను మిమ్మల్ని భయపెట్టే సంగతి ఒకటి చెప్పబోతున్నాను: కాఫ్కా రచనలు పై సూత్రాలు వేటికీ 'తందానా' అంటూ తలూగించవు, సరికదా పొగరుగా కళ్ళెగరేసి వెక్కిరిస్తాయి. అందుకే ఆయన మొదట చాలా ఇబ్బంది పెట్టాడని చెప్పింది.

నేను మొదట చదివింది, బహుశా, 'మెటమార్ఫసిస్' అనుకుంటా: ఒక ఉదయాన్నే కలత కలల నిద్రనుండీ మెలకువలోకి వచ్చిన ట్రావెలింగ్‌ సేల్స్‌మెన్ గ్రెగర్ జమ్‌జా, తను తన మంచంపై ఒక పెద్ద బొద్దింకగా మారిపోయి ఉండడాన్ని గమనిస్తాడు. ఈ సంఘటనతో కధ మొదలౌతుంది. ఇక్కడ ఈ పాత్రయొక్క అసహజమైన, భీభత్సపూరితమైన పరిస్థితి పాఠకులలో కలిగించే విభ్రమ కన్నా; మరింత అయోమయాన్నీ అసౌకర్యాన్నీ కలిగించే విషయం ఏమిటంటే - రచయిత పాఠకులతోపాటూ ఈ విభ్రాంతిని పంచుకోకపోవడం, పాఠకులలో అయోమయాన్ని గుర్తించనట్టూ, గ్రెగర్ జమ్‌జా పరిస్థితిలో ఏ అసహజత్వమూలేనట్టూ నిశ్శబ్దంగా, గంభీరంగా కధ చెప్పుకుంటూ పోవడం. ఇక్కడ నాకు కలిగిన (బహుశా చాలామందికి కలిగే) ఇబ్బంది ఏమిటంటే, ఈ భీభత్సాన్ని విడమర్చిచెప్పి, నన్ను ఆదుకోవడానికి నాకు ఆసరాగా రచయిత లేడనే ఫీలింగ్. దీనికి తోడు ఆ అద్భుతమైన శైలి. ప్రతీ వాక్యం మెదడులో ఒక స్పష్టమైన చిత్రాన్ని ఆవిష్కరిస్తుంది. మీరే చెప్పండీ, మీ మస్తిష్కంలో, ఓ మసక వెలుతుటి గదిలో పెద్ద బొద్దింకను మోసుకుంటూ (ఊహిస్తూ) పుస్తకం చదవడం సులభమైన విషయమా! ఒక తుంటరి మంత్రగాడిలా తన అక్షరాలతో మన మెదడులో బొమ్మలాటాడిస్తాడు కాఫ్కా. ఈ clustrophobic effectని భరాయించలేక ఒక్కోసారి పుస్తకాన్ని గిరవాటేయాలన్నంత అసహనం కలుగుతుంది. అయినా మంత్రముగ్దులమల్లే అక్షరాలవెంట కళ్ళను పరుగుతీయిస్తూనే ఉంటాం. కాఫ్కా తన పాఠకుల్లో ఉద్దేశపూర్వకంగా కలిగించే ఈ ఇబ్బందిని మీకు పరిచయం చేయడానికి ఆయన తన డైరీలో రాసుకున్న ఈ క్రింది రచనాభాస్యాన్ని ఉదాహరణగా ఇస్తున్నాను:

"నేను ముందే ఇద్దరు స్నేహితులతో ఆదివారం విహారయాత్రకు వస్తానని అంగీకరించి ఉన్నాను. కానీ, అసలూహించని విధంగా, మేము కలవవలసిన సమయాన్ని నిద్రలోనే గడిపివేసాను. మామూలుగా నేను సమయపాలనను ఎంత ఎంత ఖచ్చితంగా పాటిస్తానో తెలిసిన నా స్నేహితులు, ఆశ్చర్యంతో నా ఇంటికి వచ్చి, కాసేపు బయట వేచిచూసారు; చూసి చూసి చివరకు మెట్లెక్కి నా తలుపు తట్టిపిలిచారు. తత్తరపాటుతో లేచి, తటాలున మంచందిగి, దిగటంతోనే సాధ్యమైనంత వేగిరంగా ముస్తాబవటానికి ప్రయత్నించాను. నేను దుస్తులు పూర్తిగా తొడుక్కుని నా గదినుండి వెలికివచ్చేసరికి, నా స్నేహితులు దృగ్గోచరమైన ఉలికిపాటుతో ఒక్కసారి వెనక్కు జరిగారు. 'ఏమిటది నీ తలవెనకాల?' అరిచారు. నేను మేల్కొన్నప్పటినుండి నా నడుమును వెనక్కి వంగనీయకుండా ఏదో అడ్డుకుంటున్న భావన కలుగుతోంది. ఇపుడు నా చేతితో దానికై తడుముకున్నాను. అప్పటివరకూ కొంత నిశ్శబ్దం వహించిన నా స్నేహితులు, నా చేయి తల వెనుకాల ఒక ఖడ్గపు పిడిపై బిగుసుకునేసరికి, 'జాగ్రత్త, దెబ్బతగిలించుకోగలవ్!" అంటూ అరిచారు. సమీపానికి వచ్చి పరిశీలించి, తిరిగి నన్ను నా గదిలోని అద్దం దగ్గరకు తీసుకొనిపోయి, నడుందాకా దుస్తులు తొలగించి వేసారు. ఒక పొడవైన, శిలువాకారపు పిడిగల పురాతన యుద్దవీరుల ఖడ్గం ఒకటి నా వీపులో తుదకంటా చొచ్చుకుపోయి ఉంది; అయితే ఆ ఖడ్గం నా చర్మానికీ, లోపలి మాంసభాగానికీ మధ్య అద్భుతమైన నైపుణ్యంతో గుచ్చబడటం వల్ల ఎలాంటి గాయమూ కాలేదు. అంతేకాదు, ఖడ్గం దించబడిన ప్రదేశంలో నా మెడపై కనీసం పుండు కూడా లేదు; నా స్నేహితులు, అక్కడ ఖడ్గం ప్రవేశించడానికి వీలైనంత నిడివితో ఒక చీలిక ఉందనీ, కాని పొడిగా ఎండిపోయి, ఏ రక్తపుజాడా కన్పించకుండా ఉందనీ తెలిపి నన్ను కుదుటపరిచారు. ప్రస్తుతం వాళ్ళు కుర్చీల పైన ఎక్కి నిల్చొని, నెమ్మదిగా, అంగుళం అంగుళం, ఖడ్గాన్ని బయటకు లాగడం మొదలుపెట్టారు; నాకు రక్తస్రావమేమీ జరగలేదు; నా మెడపై చీలిక, ఆనవాలు దొరకని సన్ననికోతగా తప్ప మరేమీ కనిపించకుండా మూసుకుపోయింది. 'తీసుకో నీ ఖడ్గం', నా స్నేహితులు నవ్వుతూ దాన్ని నాకిచ్చారు. నేను దాన్ని భారంగా నా రెండు చేతుల్లోకీ తీసుకున్నాను; చాలా అద్భుతమైన ఆయుధం అది, బహుశా క్రూసేడర్లు వాడి ఉంటారు.

ఇలా స్వప్నాల్లో బాధ్యతారాహిత్యంగా తమ ఖడ్గాలు ఝుళిపిస్తూ, అమాయకంగా శయనిస్తున్నవారిని యధేచ్ఛగా పొడుస్తూపోయే ఈ పురాతన యుద్దవీరుల విచ్చలవిడి విహారాన్ని ఎవరు సహిస్తారు?" -- (కాఫ్కా డైరీలనుండి)

కాఫ్కా కధల్లో మెటమార్ఫసిస్‌ని క్లాసిక్‌గా అభివర్ణిస్తూ ఉంటారు చాలామంది. నాకు మాత్రం దానికన్నా 'ది బర్రో' (The Burrow) బాగా నచ్చుతుంది. ఇది ఒక బొరియలోని పురుగు స్వగతం. ఈ కధ మొదటిసారి చదివినపుడు, ఎవరో మన చెవి ప్రక్కన ఎలాస్టిక్ రబ్బర్‌బాండ్‌ ఒకటి లాగి పట్టుకుని వదులుతామని (వదలకుండా) బెదిరిస్తుంటే ఎలాంటి ఉద్విగ్నత కలుగుతుందో, అలాంటి ఫీలింగ్ కల్గింది నాకు.

తన తండ్రి తనపై మోపుతున్న దారుణమైన నిందారోపణల్ని భరించలేక వంతెనపైనుండి నదిలోకిదూకి ఆత్మహత్య చేసుకునే కొడుకు కధ 'ది జడ్జ్‌మెంట్' (The Judgement). ఈ కధ రాసిన తరువాత కాఫ్కా తన డైరీలో, 1912 సెప్టెంబరు 23 తేదీన ఇలా రాసుకున్నాడు:

"ఈ కధ, 'ది జడ్జ్‌మెంట్', నేను ఒకే విడతలో 22-23 తారీఖుల మధ్య, రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల మధ్యలో రాసాను. కూర్చుని ఉండటం వల్ల నా కాళ్ళు ఎంత బిరుసెక్కిపోయినాయంటే, డెస్కు క్రింద నుండి వాటిని బయటకు తీయడమే అసాధ్యమైంది. గగుర్పొడిచే అలసట, ఆనందం... కధ నా కళ్ళ ముందే అభివృద్ది చెందిన తీరు... ఏదో నేను నీటిపై గమిస్తున్నట్టు. రాత్రిలో చాలాసార్లు నా వెన్నుపై శరీరభారాన్ని తేలికచేసుకున్నాను. ఎలా అంతా చెప్పవచ్చో, ఎలా అన్నింటికీ, అన్ని వింత ఊహల కొరకూ ఒక మహాజ్వాల వేచి చూస్తుందో, ఎలా ఆ జ్వాలలో పడి అవి ఆహుతవుతూ, మరలా ఎలా పైకి ప్రభవిస్తూంటాయో... కిటికీ బయట ఉదయపు తొలి నీలికాంతులు అలుముకోవడం, బయట వాహనమేదో కదిలిన శబ్దం, ఇద్దరు వ్యక్తులు వంతెన దాటుతున్న దృశ్యం... రెండు గంటలకు నేను చివరిసారిగా గడియారం వైపు చూసాను. పనిమనిషి మొదటిసారి గదిలోకి ప్రవేశించినపుడు నేను చివరి వాక్యం రాస్తున్నాను. గదిలో విద్యుత్‌బల్బు ఆర్పివేయడం, ఉదయపు కాంతి జొరబడటం. గుండె చివురుల్లో సన్నని మంటలు. అర్థరాత్రి దాటాక పూర్తిగా మాయమైన బడలిక. ఉద్వేగంగా నా సోదరి గదిలోకి ప్రవేశించి చదివి వినిపించడం. అంతకు ముందే, 'నేనిప్పటి వరకూ రాస్తూనే ఉన్నాను' అని పనిమనిషితో చెప్పడం. అపుడే పరిచినట్లు మడతనలగని పక్కదుప్పటి. నా నవలారచన విషయంలో నేను సిగ్గుపడవలసినంత అట్టడుగుస్థాయిలో ఉన్నానన్న నమ్మకం మరోసారి బలపడింది. రచన అంటే ఇలాగే సాగాలి: ఇలాంటి స్పష్టతతోనే; శరీరం, ఆత్మల సంపూర్ణ వికాసంతోనే." -- (కాఫ్కా డైరీలనుండి)

ఇక కాఫ్కా నవలల విషయానికికొస్తే ఆయన రాసిన మూడు నవలలూ (The Trial, Amerika, The Castle) అసంపూర్ణాలే. మూడింటినీ కలిపి 'Triology of Loneliness' అని పిలుస్తారు. వీటిని నేను ఇక్కడ పెద్దగా ప్రస్తావించబోవట్లేదు. ఎందుకంటే, వీటి గురించి నేను రాయడం మొదలుపెడితే ఈ పోస్టు పరిమాణం మరో రెండు రెట్లు పెరుతుంది. ఒకటి మాత్రం చెప్తాను: కాఫ్కా యొక్క జీనియస్ ఆయన కధల్లో కన్నా నవల్లో బాగా కనిపిస్తుంది. ఆ భావ స్పష్టత, ఆ lucidity of thought నన్ను ఎంతగా ఆకట్టుకున్నాయంటే, 'ది ట్రయల్' నవలను చదువుతూ అందులో కొన్ని పేరాల్ని, ఏదో భగవద్గీతలో పద్యాల్ని వల్లించినట్టు, గట్టిగా బయటకే చదివేసేవాడ్ని. మూడు నవలల్లో 'Amerika' డికెన్సియన్ శైలిలో, సరళమైన కథనంతో సాగిపోయే కధ కాగా, 'The Trail', 'The Castle' మాత్రం తమ సంక్లిష్టతతో మీకు నిజమైన కాఫ్కాను పరిచయం చేస్తాయి.

కాఫ్కాను ప్రతీవాదం తనలో కలుపుకోవాలని ప్రయత్నించింది. అస్తిత్వవాదులు, అధివాస్తవికతావాదులు, చివరకు క్రైస్తవమతవాదులు, సామ్యవాదులు కూడా ఆయన్ని, ఆయన రచనల్నీ తమ తమ వాదాలకు అనుగుణంగా ప్రొజెక్టు చేసుకున్నారు. చివరకు ఆయన్ని ఏ చట్రంలో ఇమడ్చాలో అర్థంకాక, 'Kafkaesque' అంటూ ఆయన శైలికి ఒక విశేషణాన్నే తగిలించి వదిలేశారు. కానీ నా అభిప్రాయం ఏమిటంటే వీటన్నింటికన్నా ముందు ఆయన బేసిక్‌గా ఒక కళాకారుడు. ఆయన రచనల్ని parables గా భావించి, వాటిలో గూడార్థాలు వెతికి చెప్పేవాళ్ళ గొడవంతా హంబక్. ఆయన రచనల్లో ఏ గూడార్థాలూ, సింబల్స్ లేవు. ఆయన తనదైన ప్రపంచానికి, తన కళానైపుణ్యాన్ని జోడించి అద్భుతమైన రచనల్ని అందించాడు. ఈ కోణంలో ఆయనను చదవండి, ఆయన విశిష్టత ఏమిటో అవగతమౌతుంది. అంతేకాదు, ఆయన్ని చదవబోయేముందు, 'సాహిత్యం ఎలా ఉండాలీ' అన్నదానిపై మీకున్న preconceptions అన్నింటినీ ప్రక్కనబెట్టేయండి. మీ పఠనానుభవం సులభతరమౌతుంది.

కాఫ్కాను ఎక్కడినుంచి చదవడం మొదలు పెట్టాలీ అన్న సందిగ్దంలో ఉన్న ఔత్సాహిక పాఠకులకు, మొదట ఆయన డైరీలనుండి ప్రారంభించమని సలహా ఇస్తాను. ఆ విధంగా ఆయన రచనలను ఏ కోణంలో చదవాలీ అన్నది అర్థమౌతుంది. అంతేకాదు, అసలు ఒక రచయితకు తన రచనావ్యాసంగం పట్ల ఉండాల్సిన నిబద్ధత ఏంటో అవగతమౌతుంది.

కాఫ్కాను గురించి కొన్ని ఆసక్తికరమైన లింక్స్:

1) సంక్షిప్త జీవిత చరిత్ర ఛాయాచిత్రాలతో.

2) 'మెటమార్ఫసిస్'పై ప్రముఖ రష్యన్-అమెరికన్ రచయిత వ్లదీమర్ నబకొవ్ యొక్క విశ్లేషణాత్మక వ్యాసం.

3) కొన్ని కాఫ్కా కొటేషన్స్.
: