August 29, 2007

వేటూరి కల

రాత్రి ఓ కల. చిత్రంగా వచ్చిందని చెప్పను; చిత్రంగా ఉండటం కలల ప్రాథమిక లక్షణమే కాబట్టి. ఒక మబ్బు పట్టిన మధ్యాహ్నం, జనంతో క్రిక్కిరిసిన పుస్తకాల ఎగ్జిబిషన్‌లో, వేటూరి సుందర్రామ్మూర్తిగారి పాటలపుస్తకం కోసం స్టాల్స్ అన్నీ కలియదిరుగుతున్నానంట. రాబోతున్న వర్షానికి సూచనగా వీస్తున్న హోరుగాలి. నేలమీది పాలిథీన్‌కవర్లూ, చిత్తుకాగితాలూ సుళ్ళుతిరుగుతూ గాల్లోకి లేస్తున్నాయి. ఒకావిడ చీరకొంగు, నేలకు సమాంతరంగా పైకిలేచి, జెండాలావిచ్చుకుని ఎగరడం గుర్తు. ప్రతీ షాప్ ముందూ గుంపులుగా జనం. (పుస్తకాల షాపు ముందు! గుంపులుగా జనం!! Oh, the hopeful me!!!) నేనెలాగోకలాగ వాళ్ళమధ్య జొరబడి ప్రతీ స్టాల్‌లోనూ ఆ పుస్తకం గురించి ఆరా తీస్తున్నాను. అందరూ ఒకే సమాధానం: ఆయన పాటలింకా పుస్తకరూపంలో వెలువడలేదు. చివరకు విసిగి, ఆశలు వదిలేసుకుని, వెనుదిరగ నిశ్చయించుకున్నాక; ఈ స్టాల్స్ అన్నింటికీ దూరంగా, మూలగా, ఒక ఒంటరి స్టాల్ కనిపిస్తుంది. నిజానికి అది స్టాల్ కూడా కాదు; చెక్కటేబిల్‌పై పుస్తకాలుంచి, దానివెనుక చెక్క కూర్చీలో ఓ యాభై-అరవైయేళ్ళ ముసలాయన కూర్చుని ఉంటాడు. పొగమంచురంగు ఖద్దరు లాల్చీ-షరాయి, దళసరి ఫ్రేము కళ్ళజోడు, వెండిపోగుల్ని వెనక్కి దువ్వినట్టున్న కేశాలు, కూర్చున్న కుర్చీకి వ్రేలాడేసి ఉన్న బెంగాలీసంచి. నా దృష్ఠి తన దిశగా ఎప్పుడు మరలుతోందో అన్నట్లు, మరలుతుందని ముందే తెలిసినట్లు, నావైపే ప్రశాంతంగా చూస్తూంటాడు. నేనాయన వైపు చూసిన మరుక్షణం... ఆయన టేబిల్‌ముందు నించొని ఉంటాను. Time lapse. మధ్యలో ఆ టేబిల్‌దాకా నడవడం అనే ప్రక్రియని, ఈ కలతీసిన దర్శకుడెవరో ఎడిటింగ్‌లో కట్‌చేసిపడేసుంటాడు. ఆయన నిశ్శబ్దంగా ఓ లావాటి బౌండుపుస్తకాన్ని నా ముందుంచుతాడు. ముదురాకుపచ్చ రంగు అట్టమీద బంగారం రంగు అక్షరాలు. బాగా పాతది కావడంవల్ల పేజీలన్నీ లేతగోధుమవర్ణంలోకి మారిపోయి; పెళుసుగా, విరిగిపోవడానికి సిధ్ధంగా ఉంటాయి. పుస్తకాన్ని శ్రధ్ధగా, పవిత్రగ్రంధంలా నా చేతుల్లోకి తీసుకుంటాను. అంతే, అక్కడితో కలంతా శకలాలై ఎటో చెదిరిపోయింది.

బహుశా ఓనెల క్రితం "విశాలాంధ్రా బుక్‌హౌస్"లో వేటూరి పాటల పుస్తకం గురించి నేను చేసిన ఎంక్వైరీ ఈ కలకు కారణమై ఉండవచ్చు. లేదా, రాత్రి FM వింటూ, హెడ్‌ఫోన్స్ చెవుల్లోనే ఉంచుకొని నిద్రలోకిజారిపోయాను. ఇంకా పూర్తిగా సుషుప్తిలోకి చేరకుండా, పొలిమేరల్లో మగతగా తచ్చాడుతుంటే, నేపథ్యంలో ఎక్కడినుంచో సాధనాసర్గమ్ గొంతు "...రహస్య స్నేహితుడా" అని పాడుతూ లీలగా వినిపిస్తుంది. అది FM లోంచా లేక అదీ కలేనా అంటే ఇపుడు స్పష్టంగా చెప్పలేను. "సఖి"లోని ఈ పాట వేటూరి వ్రాసిందే. బహుశా ఇది కొంత కారణం కావచ్చు. ఆ పాటంటే నాకు చాలా ఇష్టం. కొన్ని చోట్ల, కొన్ని పదాలు అర్థం కాకపోయినా కూడా. ఉదాహరణకి "ఉల్లం చుక్క ఆరబోసే వయసే..." అంటే ఏమిటి? వేటూరికే తెలియాలి. కానీ ఆ పదాలకి అర్థం అవసరమంటారా? స్వరం, శబ్దం అంత గాఢమైన కౌగిలిలో ఏకమై తన్మయిస్తుంటే, అర్థం వెతకడం పాపమనిపిస్తుంది. ముఖ్యంగా పాట మధ్యలో:"నిండామునిమాపుల్లో నిద్దరోవు నీఒళ్ళో... గాలల్లే తేలిపోతానోయ్, ఇలా డోలలూగేనోయ్...." అంటూ కోరస్ మొదలౌతుందే, అది ఎప్పుడు విన్నా, ఎన్ని సార్లు విన్నా, వెన్నులోంచి ఏదో ఆనందపు వణుకు మొదలై, శరీరమంతా పాకిపోతుంది. రోమాంచితం చేస్తూ విద్యుత్ ప్రసారమేదో నరాల్లో ప్రవహించినట్లుంటుంది. సంగీతం, సాహిత్యం, గానం - ఈ మూడు కళల త్రివేణీ సంగమం ఇంత సామరస్యతతో పరిపూర్ణమవడం సినిమా సంగీతంలో చాలా అరుదైన సందర్భం. అసలిదంతా సరే, వేటూరి పాటల్తో ఇప్పటివరకూ పుస్తకమేదైనా వెలువడిందా లేక అంతా నా కలేనా?

0 స్పందనలు:

మీ మాట...