August 26, 2007

దృశ్యం Vs. ఆలోచన

ఇవాళ ఉదయం హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్‌లో లోకల్‌ట్రెయిన్‌కోసం వెయిట్‌చేస్తుంటే నామైండ్‌లో ఓ చిన్న బల్బులాంటిది వెలిగింది, ఓకొత్త ఊహ స్ఫురించింది. అదేమిటో వివరించాలంటే విషయాన్ని కొద్దిగా ముందునుండీ ప్రారంభించాలి.

స్టేషన్‌కి వస్తూ వస్తూ ఇవాళ బ్లాగ్‌లో ఏమిరాయాలా అన్నవిషయమై ఆలోచనలో పడ్డాను. ఏదైనా తెలుగుపుస్తకంపై రివ్యూలాంటిది రాస్తే ఎలా ఉంటుందీ అని ఆలోచించాను. ఏ పుస్తకంపై రాయాలో, ఎలా మొదలుపెట్టాలో కూడా ఆలోచించిపెట్టుకున్నాను. తరువాత స్టేషన్‌కి చేరుకుని, మెట్లెక్కి ఫ్లాట్‌ఫాం పైకి అడుగుపెట్టి, జనాల మధ్య నిలబడి, వాళ్ళమ్మ చంకనుంచీ నన్ను వెక్కిరిస్తున్న ఓ పసిదాన్ని బదులు వెక్కిరించి, ఎండవేడికి ఫ్లాట్‌ఫాం పైన ఇనుపకప్పు నుండి సెగలుగా వస్తున్న ఉక్కపోత భరించలేక, దూరంగా చెట్లక్రిందకుపోయి కూర్చున్నాను.

ఇపుడు ప్రశాంతంగా, బ్లాగ్‌లో రాయాలనుకున్న పుస్తక సమీక్షపై కొన్ని పాయింట్లు ఆలోచించి పెట్టుకుందామని మస్తిష్కకవాటం తెరిచిచూసేసరికి... లోపల ఖాళీ వెక్కిరించింది. ఎంత గింజుకున్నా 5 నిముషాలక్రితం నేను రివ్యూ రాద్దామనుకున్న పుస్తకం ఏమిటో జ్ఞప్తికి రాలేదు! నా జ్ఞాపకశక్తిపై నాకే జాలేసింది. జ్ఞాపకాల బాక్‌ట్రాకింగ్ మొదలుపెట్టాను. ప్లాట్‌ఫాంపై ఉక్కపోత, పసిదాని వెక్కిరింత, టికెట్ కౌంటర్ దగ్గర క్యూ, స్టేషన్ బయట మెట్లెక్కుతుంటే గాజుతలుపులో కనిపించిన నా ప్రతిబింబం... ఇలా నేను రూం దగ్గర బయల్దేరేటపుడు చెప్పులు వేసుకోవడం వరకూ చాలా దూరం మస్తిష్కపు ఇరుకు దారుల్లో వెనక్కి ప్రయాణించగలిగాను. (ఇదివరకూ వీడియోక్యాసెట్‌ప్లేయర్లో సినిమాచూస్తూ రివైండ్‌బటన్ నొక్కినపుడు కార్లు వెనక్కి పరిగెడుతూ, మనుషులు వెనక్కి మెట్లెక్కుతూ వింతవింతగా దృశ్యాలు కనిపించేవి చూడండి, అలాగన్నమాట.) ఇలా జ్ఞాపకాల తిరగమోతద్వారా దృశ్యాలనైతే పునర్జీవితం చేసుకోగలిగానుగానీ, ఆలోచనల్ని పూర్తిగా రికలెక్ట్ చేసుకోలేకపోయాను. దృశ్యజ్ఞాపకాల ఎక్యురేట్ రికలెక్షన్ 80% వరకూ ఉంటే ఆలోచనకు సంబంధించిన జ్ఞాపకాల రికలెక్షన్ 20% మాత్రమే ఉంది. అంతేకాదు, ఇలా జ్ఞప్తికి తెచ్చుకున్న 20% ఆలోచనల్లోకూడా, అవి కొన్ని దృశ్యాలతో ముడిపడి ఉండటంవల్లనే తిరిగి జ్ఞాపకం చేసుకోగలిగాను. ఇలా ఆలోచనా ప్రవాహంలో వెనక్కు ఈదుదామని ఎంతప్రయత్నించినా రెండు నిముషాల క్రిందటి జ్ఞాపకంకన్నా ఎక్కువదూరం వెళ్ళలేకపోయాను. అక్కడితో లింకు తెగిపోతుంది. ఇక ఎంత మొండిగా ట్రై చేసినా విశృంఖలమైన శాఖలుగా విడివడి ఎటుపడితే అటుపోతుందే తప్ప, అవసరమైన పాయింట్‌ని ట్రాక్‌చేసి పట్టుకోలేకపోతుంది. (అసలిలా ఆలోచనల్ని వెనక్కి తవ్వితీయాలని యత్నించేదికూడా ఆలోచనే కదా! I sense a terrible glitch here in this stream of thought, but don't know exactly what it is.)

మీరూ ప్రయత్నించి చూడండి: బహుశా మీరిపుడు మీకంప్యూటర్ ముందు కూర్చుని నా బ్లాగ్ చదివే సాహసం చేస్తూండిఉంటారు. ఒకసారి బాక్‌ట్రాకింగ్ మొదలుపెట్టండి... వెనక్కి, వెనక్కి... ఇంకా వెనక్కి. నా అంచనా ప్రకారం, ఒక పదినిముషాల క్రితం మీ కళ్ళముందు ఏ దృశ్యం ఉందో మీరు ఖచ్చితంగా రికలెక్ట్ చేసుకోగలరు. మరి పదినిముషాల క్రితం మీ ఆలోచన? ప్రొద్దున్న బాత్రూంలో స్నానంచేస్తూ మీరేం ఆలోచించారు... అద్దం ముందు తలదువ్వుకుంటూ? కష్టంకదూ.

ఇదే ఇంతకుముందు నామైండ్‌లో సదరు బల్బు వెలగడానికి కారణమైన కరంటు: చాలావరకూ మన చేతనాతలంపై చెరగనిముద్రలు వేసిపోయేవి ఆలోచనలు కాదు... దృశ్యాలు (images). ఇదే నాకు స్ఫురించిన విషయం. ఇంతలో ట్రైనొచ్చేసింది. పుస్తక సమీక్ష సంగతి ప్రక్కనపడేసి, నాకు సంబంధించినంతవరకూ విశిష్టమైన ఈ బుల్లిసైజు డిస్కవరీనే బ్లాగ్‌లో రాసిపడేద్దామని డిసైడయ్యాను.

ప్రతీవిషయాన్ని సాహిత్యపు దృక్కోణంలో చూడటానికి ప్రయత్నించడం నాకున్న అలవాటు. కాబట్టి ఈ విషయాన్ని కూడా సాహిత్యానికి అన్వయించి చూసాను. 'ఒక రచన చదివిన తరువాత, చాలాకాలం వరకూ మన జ్ఞాపకంలో నిలిచిపోయేవి అందులోని దృశ్యపరమైన అంశాలా లేక రచయిత వ్యక్తంచేసిన ఆలోచనలూ, అభిప్రాయాలూ, భావనలూ ఇవన్నీనా?' ఎపుడో పదేళ్ళ క్రితం చదివిన యండమూరి వీరేంద్రనాథ్ "ఆనందోబ్రహ్మ" నుండీ మొదలుకొని ఈ మధ్యే చదివిన Gabriel García Márquez "Love in the time of Cholera" వరకూ నేను చదివిన చాలా పుస్తకాలను ఒకసారి పునఃస్మరణ చేసుకున్నాను. వాటి పేర్లను తలచుకోగానే నా మస్తిష్కంలో మొదట మెదిలినవి - ఆయా రచయితలు వారి రచనలలో వ్యక్తంచేసిన భావాలూ, వాళ్ళ సిధ్థాంతాలూ, ఆలోచనలూ, అభిప్రాయాలూ... ఇవేమీ కాదు. కేవలం దృశ్యాలు.

ఉదాహరణకు యండమూరి "ఆనందోబ్రహ్మ"ను తలచుకోగానే నా మెంటల్ ప్రొజెక్టర్ (మస్తిష్కపు వెండితెర)పై ఈ దృశ్యాలు కదలాడటం మొదలుపెట్టాయ్: కొత్తగా తమ ఇంట్లో అద్దెకుదిగిన మందాకినిని, ఆమె సామాన్లు సర్దుకుంటుంటే, మొదటిసారి సోమయాజి గది గుమ్మంలోంచి పరికించడం; వరండాలో నిద్రపోయిన సోమయాజికి తెలవారుజామున ఎందుకో మెలుకువవచ్చి చూస్తే ముంగిట్లో ముగ్గు దిద్దుతున్న మందాకిని; వెన్నెలరాత్రి పెంకుటింటి చూరునీడలో నిల్చుని సోమయాజికి చివరిసారి వీడ్కోలుపలుకుతున్న మందాకిని, ఆమె చెంపపై కన్నీటి బిందువు - ఇవే ఇప్పటిదాకా స్పష్టంగా నాతోఉండిపోయాయి.

బుచ్చిబాబు "చివరకు మిగిలేది"లో: కధాప్రారంభంలో, సాయంత్రం కాలువవొడ్డున గడ్డిలో పడుకుని, గడ్డిపరకలు పెరుకుతున్న దయానిధి; ఒక వర్షపురాత్రి దయానిధి ముఖాన్ని కప్పేసిన అమృతం చీకటికురులూ; చివరి అధ్యాయంలో, రాయలసీమలో, దయానిధి ఇంటిముందు చేయి (తల?) విరిగిపోయిఉన్న అతని తల్లి శిలావిగ్రహం.

Ayn Rand "Atlas Shrugged"లో: కధానాయిక Dagny Taggart రైల్లో ప్రయాణిస్తుంటే కిటికీ లోంచి, వేగంగా వెనక్కి కదలిపోతూ, కనిపిస్తున్న టెలిగ్రాఫిక్ పోల్స్; కార్మికుల సమావేశంలోంచి అర్థాంతరంగా పైకిలేచి 'I am going to stop the engine of this world' (or something to that effect) అని వెళిపోతున్న John Galt; అట్లాంటిస్‌కు హెలికాఫ్టర్‌లో పయనమౌతున్న Dagny కి, క్రింద ఏరియల్‌వ్యూలో, ఒకే ఊడ్పులోఆరిపోతూ కనిపించిన న్యూయార్క్‌నగరం లైట్లు.

చలం "మైదానం": ఒక మిట్టమద్యాహ్నపువేళ నేరుగా రాజేశ్వరిఇంట్లోకి దూసుకువచ్చి, ఆమెను తన కౌగిలిలో ఊపిరాడకుండా నలిపేస్తున్న అమీర్; కాలువలో నగ్నంగా ఈతకొడ్తూన్న అమీర్, రాజేశ్వరి.

Dostoevsky "Crime & Punishment": తన ఇరుకుగదిలో, దాదాపు పిచ్చితనపు అంచులకు చేరిపోయి, జ్వరంతో వణుకుతున్న Raskolnikov; తన నేరాన్ని ఒప్పేసుకుని లొంగిపోవడానికి సిద్దమై పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కుతున్న Raskolnikov; వికటంగా నవ్వుతున్న Svidrigáilov.

... ... ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలా ప్రతీపుస్తకంలోనూ నాకు ఇప్పటివరకూ గుర్తుండిపోయినవి ఆయా రచయితల ఆలోచనలూ, సిద్థాంతలూ కావు. కేవలం images మాత్రమే.

నిజానికి 'Atlas Shrugged', 'Crime & Punishment', 'చివరకు మిగిలేది ' మొదలైన రచనల్లో దృశ్యసంబంధమైన వివరాలకన్నా; రచయితల సిద్థాంతప్రవచనాలూ, అభిప్రాయాలే ఎక్కువ భాగాన్ని ఆక్రమిస్తాయి. But I remember the images in their novels more vividly than their ideas. 'అట్లాస్‌ష్రగ్గ్‌డ్' మొదటిసారి చదివినపుడు అయాన్‌రాండ్ ఐడియాస్‌కీ, ఆమె ఆబ్జెక్టివిజం సిద్థాంతానికీ నేను చాలా ప్రభావితుడ్నయ్యాను. అవి చాలాకాలం నాతోనే ఉండిపోతాయని భావించాను. కానీ అలా జరగలేదు. ఇపుడు ఆ నవలలోని సిద్థాంతపరమైన భాగాలన్నీ, నా దృష్టిలో కేవలం పేరాలకు పేరాలు అనవసరంగా కూరిన అర్థంలేని చెత్తగానే మిగిలిపోయాయి.ఈ జ్ఞానోదయం, నాలో ఇప్పుడిప్పుడే వేళ్ళూనుకుంటున్న ఒక అభిప్రాయాన్ని మరింత బలపరిచింది: రచన అంటే రచయిత తన మెదడులోని అభిప్రాయాల, భావాల, సిద్థాంతాల చెత్తనంతా కాగితంపై కుప్పేసి ఒలకబోయడంకాదు. నా దృష్టిలో రచన అంటే 'రచయిత తన అంతరంగ ప్రపంచాన్ని స్పష్టమైన చిత్రాలతో ఆవిష్కరించడం.' అలాంటి రచనలే చిరకాలం, కడవరకూ మనతో మన జ్ఞాపకాల్లో మిగిలేవి.

Finally, what I want to say here is that from a work of art (literature at least), what remains with us forever is not the ideas, it is the images. Images outlast the ideas. (Of course, here I am talking only about fiction.)

7 comments:

 1. Nagaraju Pappu12:09 PM

  మీ బ్లాగులో టపాలెప్పుడు వస్తాయా అని కాచుకుని కూచేనేవాళ్ళలో నేనొకడిని. మీరు ఇంతకు ముందు రాసిన పుస్తక సమీక్షలమీద ఒక వ్యాఖ్య రాద్దామనుకొన్నాను - అది ఇంకా సగంలోనే ఉంది. ఈ లోపే మీరు మరో టపా రాసేసారు. ఇలా అయితే ఎలా?

  మీరు చెప్తున్నది చదవంగానే, నాకు షెర్లాక్‌హోమ్స్ నవలలో ఒక దృశ్యం గుర్తుకు వస్తోంది. ఏదో ఒక నవలలో (సైన్ ఆఫ్ ఫోర్?) వాట్సన్ మీలాగే, ఏదో ఒక ఫొటో చూస్తూ ఆలోచన స్రవంతిలో పడిపోతాడు. హోమ్స్ వాట్సన్ ని కొంత సేపు గమనించి, ఆయన ఆలోచనలనన్నిటినీ మీలాగే రివర్స్-ఇంజీనిరింగ్ చేసి వాట్సన్ నోరు వెళ్ళబెట్టిస్తాడు.

  ఇక రెండోది - మీరు చెప్పిన కారణాలవల్లనే, ఏనిషియెంట్ ఇండియన్ టీచింగ్ పద్దతిలో - విశువల్ మీడియం కంటే, ఆడిటరీ మీడియం మీద ఎక్కువగా ఆధారపడతారు. ఎందుకంటే, విశువల్ మీడియంలో 'డిస్ట్రాక్షన్' ఎక్కువ.

  ఎక్కడ్ అనానిమస్స్ గారు చెప్పిందే ఒక పాయింటే. నాకైతే, ఎవైనా నవలల్లో దృశ్యాలు అస్సలు గుర్తుండవు. నన్ను ఆకట్టుకొన్నేవి, ఎక్కువకాలం గుర్తుండేవి - రచయిత ఉపయోగించిన ఆలోచనలన్నిటిమధ్య ఉండే సిమాంటిక్ రిలేషన్స్ మాత్రమే. నాకు సీనరీ అస్సలు గుర్తుండదు. అట్లాస్ ష్రగ్గడ్‌ లో జాన్ గాల్ట్ స్పీచ్ సమ్మరీ అంతా గుర్తుంది కాని, మీరు చెప్పిన ఏ దృశ్యమూ నాకు గుర్తులేదు. నాకు గుర్తుండేది ఒక రచనలోని ఎనెర్జీ.

  అనీల్ గారు చెప్పినది కూడ ఈ ఎనెర్జీ గురుంచేనేమో. దీని గురించిన ఒక శ్లోకం:

  నయన దృశ్యయో ర్గగన మంతరమ్‌ - సమవలోక యన్భజ విభుంపరమ్‌

  నయనానికి దృశ్యానికి నడుమనుండే ఆకాశాన్ని భజయింపమంటున్నాడు కవి ఇక్కడ - అందులో పరమేశ్వర దర్శనం అవుతుందంటాడు. ఆలోచించండి.


  మీరు తప్పకుండా కథలు రాయాలి, మరెన్నో వ్యాసాలు రాయాలి. అమోఘమైన శైలి మీది - ఇంత అందంగా తెలుగులో వచనం రాసేవాళ్ళు, చక్కటి వచనంతో పాటు చిక్కటి విషయ వ్యక్తీకరణ, దానికి తోడుగా లోతైన ఆలోచనలు - ఇవన్నీ ఒక్కచోట కుదరడం చాలా అరుదు.

  ReplyDelete
 2. To: నాగరాజు పప్పు,

  మీకు ఈయదలచిన వివరణ నిడివి పెరగడంతో విడి పోస్టుగా రాసానండీ.

  ReplyDelete
 3. నా వరకూ ఇది సగం నిజం! కానీ నిజమే! మన మెదడులో రెండు భాగాలు ఉండటం ఎంత నిజమో అంత నిజం! కుడి భాగం చిత్రాలకి ఎక్కువ స్పందిస్తే, ఎడమ భాగం ఆలోచనలకి ఎక్కువ స్పందిస్తుంది. ఒక్కో వ్యక్తిలో ఒక్కో సమయంలో ఒక్కో భాగం చేత ఎక్కువగా ప్రభావితం చెయ్యబడతాడు. మీరు ఈ వయసులో మీ కుడి భాగం ప్రభావం లో ఉన్నారేమో!

  నేను దస్తయేవస్కీ రాసిన " " చదివా. జంపాల గారు చేసిన తెలుగు అనువాదం "తిరస్కృతులు". చాలా బాగా చేసారు. ఇంకా మూలంలో ఎంత బాగుంటుందో అనుకున్నా. సగటు జీవి అంతరంగాన్ని, ఆలోచనలని, అనుభవాలని అంత బాగా మాటల్లో వ్యక్తం చెయ్యగలగడం నేనైతే ఎక్కడా చదవలేదు. నాకు ఆ ఆలోచనలు గుర్తు లేవు. కానీ అంతరంగాన్ని అంత ప్రభావవంతంగా బహిర్గతం చేసాడు అనే విషయం గుర్తుంది. కానీ ఆ నవలలో నాయకుడు వన్యా చుట్టూ ఉన్న దృశ్యాలు గుర్తున్నాయి. ఆ దృశ్యాలు చదివేప్పుడు వన్యా ఆలోచనలతో కలిసి మరింతగా అనుభూతిని పెంచుతాయి. ఆయా పాత్రల పరిస్థితిని రచయిత ఎంచుకున్న చుట్టు ఉన్న దృశ్యాలు తారా స్థాయిలో చూపుతాయి. ఆ దృశ్యాలు ఇప్పటికీ గుర్తున్నా నా మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగించడం లేదు. నా మీద ఇప్పటికీ ఉన్న అతని ప్రభావం ఏంటంటే, అంతరంగపు వివిధ పార్శ్వాలని ఉన్నది ఉన్నట్టు బహిర్గతం చెయ్యగలగడం అనే అతని శక్తి. ఇంకా ఇప్పుడు ఆలోచిస్తే ఏమనిపిస్తుంది అంటే అతను ఆ నవలలో సిధ్హాంతాలని ప్రతిపాదించలేదు, చదువరుల మీద రుద్ధదానికి ప్రయత్నించలేదు. ఒక కథని చెప్పాడు, అప్పటి పరిస్థితులని చూపాడు, కథలోని పాత్రల అంతర్మధనాన్ని, పాత్రల మధ్య సంఘర్షణని చాలా బాగా చూపాడు.

  నా వరకూ అయితే రచయిత దృశ్యాలని ప్రభావవంతంగా వాడుకోగలగాలి. నిడివి ఎక్కువ ఉన్న కథలని చెప్పాలనుకున్నప్పుడు చదివేప్పుడు దృశ్యాలు ఊహించుకోలేని రచన చదువరిని పూర్తిగా చదవనివ్వలేదు. కానీ అదొక్కటే చాలదు. ఆలోచనలని, భావాలని స్పష్టంగా బహిర్గతం చేయగలగడం కన్నా రచయితకి ముఖ్యమైన నైపుణ్యం ఇంకోటి లేదు. చివరకి చదువరి రచయిత గురించైనా, రచన గురించైనా గుర్తు పెట్టుకునేది అదే. ఆ రచయిత రాసినది ఇంకోటి చదివేట్టు పురికొల్పేదీ అదే.. దృశ్యాలు గుర్తు ఉండటం అనేది యాదృచ్చికమే!

  ReplyDelete
 4. నా వరకూ ఇది సగం నిజం.కానీ నిజమే! మన మెదడులో రెండు భాగాలు ఉండటం ఎంత నిజమో అంత నిజం. కుడి భాగం దృశ్యాలకి, ఊహలకి ఎక్కువ స్పందిస్తే, ఎడమ భాగం ఆలోచనలకి ఎక్కువ స్పందిస్తుంది. ఒక్కో వ్యక్తిలో ఒక్కో సమయంలో ఒక్కో భాగం చేత ఎక్కువగా ప్రభావితం చెయ్యబడతాడు. మీరు ఈ వయసులో మీ కుడి భాగం ప్రభావం లో ఉన్నారేమో...

  నేను దస్తయేవస్కీ రాసిన "The Insulted and Humiliated " చదివా. జంపాల గారు చేసిన తెలుగు అనువాదం "తిరస్కృతులు". చాలా బాగా చేసారు. ఇంకా మూలంలో ఎంత బాగుంటుందో అనుకున్నా. సగటు జీవి అంతరంగాన్ని, ఆలోచనలని, అనుభవాలని అంత బాగా మాటల్లో వ్యక్తం చెయ్యగలగడం నేనైతే ఎక్కడా చదవలేదు. నాకు ఆ ఆలోచనలు గుర్తు లేవు. కానీ అంతరంగాన్ని అంత ప్రభావవంతంగా బహిర్గతం చేసాడు అనే విషయం గుర్తుంది. కానీ ఆ నవలలో నాయకుడు వన్యా చుట్టూ ఉన్న దృశ్యాలు గుర్తున్నాయి. ఆ దృశ్యాలు చదివేప్పుడు వన్యా ఆలోచనలతో కలిసి మరింతగా అనుభూతిని పెంచుతాయి. ఆయా పాత్రల పరిస్థితిని రచయిత ఎంచుకున్న చుట్టు ఉన్న దృశ్యాలు తారా స్థాయిలో చూపుతాయి. ఆ దృశ్యాలు ఇప్పటికీ గుర్తున్నా నా మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగించడం లేదు. నా మీద ఇప్పటికీ ఉన్న అతని ప్రభావం ఏంటంటే, అంతరంగపు వివిధ పార్శ్వాలని ఉన్నది ఉన్నట్టు బహిర్గతం చెయ్యగలగడం అనే అతని శక్తి. ఇంకా ఇప్పుడు ఆలోచిస్తే ఏమనిపిస్తుంది అంటే అతను ఆ నవలలో సిధ్హాంతాలని ప్రతిపాదించలేదు, చదువరుల మీద రుద్ధదానికి ప్రయత్నించలేదు. ఒక కథని చెప్పాడు, అప్పటి పరిస్థితులని చూపాడు, కథలోని పాత్రల అంతర్మధనాన్ని, పాత్రల మధ్య సంఘర్షణని చాలా బాగా చూపాడు.

  ReplyDelete
 5. నా వరకూ ఇది సగం నిజం.కానీ నిజమే! మన మెదడులో రెండు భాగాలు ఉండటం ఎంత నిజమో అంత నిజం. కుడి భాగం దృశ్యాలకి, ఊహలకి ఎక్కువ స్పందిస్తే, ఎడమ భాగం ఆలోచనలకి ఎక్కువ స్పందిస్తుంది. ఒక్కో వ్యక్తిలో ఒక్కో సమయంలో ఒక్కో భాగం చేత ఎక్కువగా ప్రభావితం చెయ్యబడతాడు. మీరు ఈ వయసులో మీ కుడి భాగం ప్రభావం లో ఉన్నారేమో...

  ReplyDelete
 6. నేను దస్తయేవస్కీ రాసిన "The Insulted and Humiliated " చదివా. జంపాల గారు చేసిన తెలుగు అనువాదం "తిరస్కృతులు". చాలా బాగా చేసారు. ఇంకా మూలంలో ఎంత బాగుంటుందో అనుకున్నా. సగటు జీవి అంతరంగాన్ని, ఆలోచనలని, అనుభవాలని అంత బాగా మాటల్లో వ్యక్తం చెయ్యగలగడం నేనైతే ఎక్కడా చదవలేదు. నాకు ఆ ఆలోచనలు గుర్తు లేవు. కానీ అంతరంగాన్ని అంత ప్రభావవంతంగా బహిర్గతం చేసాడు అనే విషయం గుర్తుంది. కానీ ఆ నవలలో నాయకుడు వన్యా చుట్టూ ఉన్న దృశ్యాలు గుర్తున్నాయి. ఆ దృశ్యాలు చదివేప్పుడు వన్యా ఆలోచనలతో కలిసి మరింతగా అనుభూతిని పెంచుతాయి. ఆయా పాత్రల పరిస్థితిని రచయిత ఎంచుకున్న చుట్టు ఉన్న దృశ్యాలు తారా స్థాయిలో చూపుతాయి. ఆ దృశ్యాలు ఇప్పటికీ గుర్తున్నా నా మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగించడం లేదు. నా మీద ఇప్పటికీ ఉన్న అతని ప్రభావం ఏంటంటే, అంతరంగపు వివిధ పార్శ్వాలని ఉన్నది ఉన్నట్టు బహిర్గతం చెయ్యగలగడం అనే అతని శక్తి. ఇంకా ఇప్పుడు ఆలోచిస్తే ఏమనిపిస్తుంది అంటే అతను ఆ నవలలో సిధ్హాంతాలని ప్రతిపాదించలేదు, చదువరుల మీద రుద్ధదానికి ప్రయత్నించలేదు. ఒక కథని చెప్పాడు, అప్పటి పరిస్థితులని చూపాడు, కథలోని పాత్రల అంతర్మధనాన్ని, పాత్రల మధ్య సంఘర్షణని చాలా బాగా చూపాడు.

  ReplyDelete
 7. నా వరకూ అయితే రచయిత దృశ్యాలని ప్రభావవంతంగా వాడుకోగలగాలి. నిడివి ఎక్కువ ఉన్న కథలని చెప్పాలనుకున్నప్పుడు చదివేప్పుడు దృశ్యాలు ఊహించుకోలేని రచన చదువరిని పూర్తిగా చదవనివ్వలేదు. కానీ అదొక్కటే చాలదు. ఆలోచనలని, భావాలని స్పష్టంగా బహిర్గతం చేయగలగడం కన్నా రచయితకి ముఖ్యమైన నైపుణ్యం ఇంకోటి లేదు. చివరకి చదువరి రచయిత గురించైనా, రచన గురించైనా గుర్తు పెట్టుకునేది అదే. ఆ రచయిత రాసినది ఇంకోటి చదివేట్టు పురికొల్పేదీ అదే.. దృశ్యాలు గుర్తు ఉండటం అనేది యాదృచ్చికమే!

  ReplyDelete