November 18, 2007

చట్టం ముందు


చట్టం ముందు ఒక ద్వారపాలకుడు నిలబడి ఉంటాడు. పల్లెటూరి మనిషి ఒకడు ఈ ద్వారపాలకుని దగ్గరకు వచ్చి చట్టం లోపలికి అనుమతి ఇవ్వమని అర్థిస్తాడు. కాని ద్వారపాలకుడు తాను అతనికి ఇప్పుడు అనుమతి ఇవ్వలేడని అంటాడు. ఆ మనిషి కొంత ఆలోచించి, అయితే తర్వాత ఎపుడైనా లోపలికి అనుమతి లభించవచ్చా అని అడుగుతాడు. ‘అది సాధ్యమే,’ ద్వారపాలకుడంటాడు, ‘కాని ఇప్పుడు కాదు.’ చట్టపు ద్వారం నిత్యం మాదిరే తెరచి ఉండి, ద్వారపాలకుడు పక్కకు తొలగటంతో, ఆ మనిషి గుమ్మం మీదుగా వంగి లోపలికి తొంగి చూస్తాడు. ఇది గమనించిన ద్వారపాలకుడు నవ్వి ఇలా అంటాడు: ‘నీకు అంత కుతూహలం వుంటే, నా నిషేదాన్ని అతిక్రమించి లోపలకి వెళ్ళే ప్రయత్నం చేయి. కాని ఒకటి గుర్తుంచుకో: నేను శక్తిమంతుడిని. అయితే నేను చాలా అధమ స్థాయి ద్వారపాలకుడ్ని మాత్రమే. లోపల ఇలా గది నుండి గదికి ప్రతీ ద్వారం వద్దా ద్వారపాలకులు నిలబడి ఉంటారుప్రతీ ఒకడూ మునుపటి వాడి కన్నా శక్తిమంతుడు. మూడవ ద్వారపాలకుడు కంటపడితే చాలు, నేనే భరించలేను.’ పల్లెటూరి మనిషి ఇలాంటి కష్టాలను ఊహించ లేదు; చట్టం అందరికీ అన్ని సమయాల్లోనూ అందుబాటులో ఉండి తీరాలని అతననుకుంటాడు. కాని ఇక్కడఇలా ఉన్నికోటు ధరించిన, మొనదేలిన పెద్ద ముక్కుతో, సన్నని పొడవైన నల్లని తార్తారు గెడ్డంతో ఉన్న ఈ ద్వారపాలకుణ్ణి కొంత దగ్గిరగా పరీక్షించిన మీదటప్రవేశానికి అనుమతి లభించేంత వరకూ ఎదురుచూడటమే మంచిదన్న నిర్ణయానికి వస్తాడు. ద్వారపాలకుడు అతనికి పీట ఇచ్చి ద్వారానికి వారగా కూర్చోనిస్తాడు. అక్కడే అతడు రోజుల తరబడి, సంవత్సరాల తరబడి కూర్చుంటాడు. పదే పదే లోపలికి అనుమతినీయమని అడుగుతూ తన అభ్యర్థనలతో ద్వారపాలకుణ్ణి విసిగిస్తాడు. ద్వారపాలకుడు తరుచూ ఆ మనిషిపై క్లుప్తమైన దర్యాప్తులు నిర్వహిస్తాడు, అతని ఇంటి గురించీ తక్కిన వివరాల గురించీ అడుగుతాడు, కానీ ఆ ప్రశ్నలు గొప్ప వాళ్ళడిగే ప్రశ్నల్లా నిరాసక్తంగా ఉంటాయి, చివరకు మాత్రం ఎప్పుడూ ఇంకా ఆ మనిషికి అనుమతి లేదంటూనే ముగిస్తాడు. తన ఈ ప్రయాణ నిమిత్తం పెక్కు సామాగ్రితో సమృద్ధిగా వచ్చిన ఆ మనిషి, తాను తెచ్చుకున్నదంతా, అదెంత విలువైనదైనా, ద్వారపాలకునికి లంచంగా వాడేస్తాడు. ద్వారపాలకుడు అన్నింటినీ అంగీకరిస్తాడు, కాని అంగీకరిస్తూ ఇలా అంటాడు: ‘ఇంకా ఏదో ప్రయత్నించకుండా వదిలేశావని నువ్వనుకోకుండా ఉండటానికి మాత్రమే, దీన్ని తీసుకుంటున్నాను.’ ఈ అనేక సంవత్సరాల కాలంలో, ఆ మనిషి నిరంతరాయంగా ద్వారపాలకుణ్ణి పరిశీలిస్తూనే ఉంటాడు. అతను తక్కిన ద్వారపాలకుల సంగతే మరిచిపోతాడు, ఈ మొదటివాడే చట్టంలో తన ప్రవేశానికి ఏకైక అడ్డంకిగా కనిపిస్తాడు. అతను తన దురదృష్టాన్ని నిందించుకొంటాడు, ప్రారంభ సంవత్సరాల్లో బిగ్గరగానే గానీ, తర్వాత, వయసు మళ్ళే కొద్దీ, తనలో తాను గొణుక్కోవటంతో సరిపెట్టుకుంటాడు. అతనిలో పిల్లచేష్టలు మొదలవుతాయి, సంవత్సరాల తరబడి పరిశీలన వల్ల ద్వారపాలకుని కాలరు మడతలోని నల్లులను కూడా గుర్తించటం మొదలుపెట్టి, వాటిని కూడా ద్వారపాలకుని మనసు మార్చటంలో తనకు సాయపడమని అడుగుతాడు. ఆఖరుకు అతని కంటి చూపు మందగిస్తుంది, తన చుట్టూ ప్రపంచం చీకటి బారుతుందో లేక తన కళ్ళే తనను మోసం చేస్తున్నాయో అర్థం కాదు. అయినప్పటికీ, ఆ చీకటిలో, అతను చట్టపు ప్రవేశ ద్వారం నుంచి నిరంతరాయంగా వెలువడుతున్న ఒక కాంతి పుంజాన్ని దర్శించగలుగుతాడు. ఇప్పుడిక అతని జీవితం ఆఖరు గడియలను సమీపిస్తుంది. చనిపోయేముందు, ఇన్ని సంవత్సరాల అతని అనుభవాలూ మనసులో సమీకృతమై ద్వారపాలకుణ్ణి ఇంతవరకూ అడగని ఒకే ఒక్క ప్రశ్నగా రూపుదిద్దుకుంటాయి. బిర్రబిగుస్తున్న శరీరాన్ని ఇక నిటారుగా లేపలేక, అతను ద్వారపాలకునికి సంజ్ఞ చేస్తాడు. వారి మధ్య ఎత్తులలోని వ్యత్యాసం ఇప్పుడా మనిషికి ప్రతికూలంగా పరిణమించటంతో, ద్వారపాలకుడు అతని వైపు కిందకు వంగాల్సి వస్తుంది. ‘ఇప్పుడేం తెలుసుకోవాలి, నీకు తృప్తి అన్నది లేదు కదా!’ అంటాడు ద్వారపాలకుడు. ఆ మనిషి ఇలా అడుగుతాడు, ‘ప్రతి ఒక్కరూ చట్టాన్ని చేరాలని పరితపిస్తారు. మరి, ఇన్నేళ్ళలో, ఇక్కడ నేను తప్ప వేరెవరూ ప్రవేశానికి అనుమతి అడగలేదెందుకు?’ ద్వారపాలకునికి ఆ మనిషి అవసాన దశలో ఉన్నాడని అర్థమవుతుంది. తన మాటలు క్షీణిస్తున్న అతని వినికిడిని చేరేట్టుగా, గట్టిగా ఇలా గర్జిస్తాడు: ‘వేరెవరూ ఇక్కడ అనుమతి పొందలేరు. ఎందుకంటే ఈ ద్వారం ఉద్దేశించబడింది నీ ఒక్కడి కోసమే. ఇపుడిక వెళ్ళి దాన్ని మూసేస్తాను.’ ”

** ** **

"చట్టం ముందు" (Before the law)—కాఫ్కా జీవించి ఉండగా ప్రచురింపబడిన కొద్ది రచనల్లో ఇది ఒకటి. దీన్ని తరువాత ఆయన తన మాగ్నం ఓపస్ నవల "ది ట్రయిల్"లో ఒక అంతర్భాగాన్ని చేసాడు. ఆ నవల మొత్తానికి "కీ" ఇక్కడ ఉంటుందంటారు. గట్టిగా రెండు పేజీలుండని ఈ రచన పై పుస్తకాల కొద్దీ విశ్లేషణలు చేయబడ్డాయి. అవన్నీ వదిలేస్తే—don't you just love the paradox of the story!

1 comment:

  1. ఏదో అర్దమయింది. ఏమీ అర్దమవ్వలేదు.


    || "ఇక్కడ వేరెవరూ అనుమతింపబడలేరు. ఎందుకంటే ఈ ద్వారం నీ కొరకు మాత్రమే కేటాయించబడింది. ఇపుడిక దీన్ని మూసివేయబోతున్నాను." ||


    అపుడయితే ఎందుకు వెళ్లనివ్వలేదు. :(

    ReplyDelete