December 21, 2008

ఫ్లాబర్ - పానుగంటి

నా దగ్గర ఉన్న "మేడం బొవరీ" నవల నోర్టాన్ క్రిటికల్ ఎడిషన్ వాళ్ళు ప్రచురించింది, గనుక దానికి అనుబంధంగా నవలా నేపథ్యం వివరాలు, విశ్లేషణాత్మక వ్యాసాలు గట్రా ఇచ్చారు. వాటిలో ఫ్లాబర్ తన ప్రియురాలు లూయీ కొలెట్‌కు రాసిన ఉత్తరాలు కొన్ని ఉన్నాయి. ఇవి "మేడం బొవరీ" రచనా సమయంలో రాసినవి. ఈ క్రింది ఉత్తరంలో ఈ నవలా స్వరూపం ఎలా ఉండాలనుకుంటున్నాడో చెప్తున్నాడు ఫ్లాబర్:
Crossiet, January 16, 1852

There are in me, literally speaking, two distinct persons: one who is infatuated with bombast, lyricism, eagle flights, sonorities of phrase and the high points of ideas; and another who digs and burrows into the truth as deeply as he can, who likes to treat a humble fact as respectfully as a big one, who would like to make you feel almost physically the things he reproduces; this latter person likes to laugh, and enjoys the animal sides of man . . .

-- ఉత్తరం ఇంకా ఉంది; ప్రస్తుతానికి ఇక్కడ ఆపుతున్నాను. నేనీ ఉత్తరాన్ని నిన్ననే చదివాను. ఉత్తరం మొదట్లో ఫ్లాబర్ తనకీ రకం లక్షణాలు గల శైలి పట్ల మక్కువ ఎక్కువ అని పేర్కొన్నాడు:

Bombast: అంటే విషయాన్ని మించిన గాఢత గల పదాలు వాడటం.

Lyricism: అంటే పదాలలో లయ.

Sonorities of phrase: పదాల ఎన్నికలో శ్రావ్యతకు ప్రాధాన్యత.

-- ఇవన్నీ సరే మరి "eagle flights" అంటే ఏమిటి? మామూలుగా అయితే ఈ మెటఫోర్‌కు అర్థం నాకు తట్టేది కాదు. అయితే అంతకు కొన్ని రోజుల ముందే నేను పానుగంటి వారి "సాక్షి" వ్యాసాలు మొదలు పెట్టాను. దానికి ఉపోద్ఘాతం రాసిన మధునాపంతుల సత్యనారయణ శాస్త్రి గారు సందర్భానుసారంగా పానుగంటి వారి వాక్యాలు కొన్నింటిని ఊటంకించారు. ఇక్కడ పానుగంటి వారు గద్య సాహిత్యంలో భవిష్యత్తులో రావాల్సిన మార్పుల్ని సూచిస్తూ ఇలా అంటున్నారు:

"చిత్రములైన శైలీ బేధములు, మన భాషలో మిగుల నరుదుగా నున్నవని వేరే చెప్పనేల? రైమని పేక చువ్వ పైకెగిరినట్లున్న శైలి భేదమేది? కాకి పై కెగిరి యెగిరి రెక్కలు కదలకుండ జందెపు బెట్టుగ సాపుగ వాలుగ దిగునప్పటి లఘుపతన చమత్కృతి కనబరచు శైలి పద్ధతి యేది? తాళము వాయించునప్పటి తళుకు బెళుకులు, టింగుటింగులు, గలగలలు, జలజలలు గల శైలి యేది?. . . భయంకరమయును మనోహరమై, మహాశక్తి సక్తమయ్యు మార్దవమై, ధారాళమయ్యు విశాలమై, స్వభావ సమృద్ధమయ్యు సరసాలంకార భూయిష్ఠమై, సముద్ర ఘోషము గలదయ్యు సంగీత ప్రాయమై. . . చదువరులకు గనుకట్టై, వాకట్టై, మదిగట్టై తల పులిమినట్లు శ్వాసమైన సలుపకుండ జేసినట్లు, ముష్టివాని చిప్పనుండి మూర్ధాభిషిక్తుని కిరీటము వరకు, భూమి క్రింది యరల నుండి సముద్రములోని గుహల వరకు, నెవరెస్టు కొండ నుండి యింద్ర ధనుస్సు రంగుల వరకు, మందాకినీ తరంగ రంగద్ధంసాంగనా క్రేంకారముల నుండి మహాదేవసంధ్యా సమయ నాట్య రంగమున వరకు మనోవేగముతో నెగురు శక్తి కల చిత్ర విచిత్ర శైలి భేదము లింక నెన్నియో భాషలో బుట్టవలసియున్నవి."

-- ఈయనది మరీ మోమాటం యవ్వారం లాగుంది; లేకపోతే ఓ ప్రక్కన చదువరులకు "గనుకట్టై, వాకట్టై, మదిగట్టై తల పులిమినట్లు శ్వాసమైన సలుపకుండ" జేయునట్టి ఇలాంటి వచనం తనే రాసేస్తూ, మళ్ళా ఏదో "బుట్టవలసియున్నవి" అంటాడేమిటి! ఒక్కసారి పై పేరాను గట్టిగా పైకి చదువుకుంటే తెలుస్తుంది ఆ గద్యంలోని మజా.

అయితే మనక్కావాల్సిన విషయం ఇది కాదు. ఇందులో ఆయన ఓ శైలీ లక్షణాన్ని సూచిస్తూ "కాకి పైకెగిరి యెగిరి రెక్కలు కదలకుండ జందెపు బెట్టుగ సాపుగ వాలుగ దిగునప్పటి లఘుపతన చమత్కృతి" అంటూ ఓ పోలిక వాడాడు. ఎందుకో ఈ పోలిక నాకు బాగా గుర్తుండిపోయింది. తత్ఫలితంగానే నిన్న ఫ్లాబర్ "eagle flight" అనగానే అతనేమంటున్నాడో చప్పున అర్థమైపోయింది. అంటే, గ్రద్ద ఆకాశంలో పైకంటా ఎగిరాక రెక్కలు అల్లార్చడం మానేసి సాపుగా వాలుగా క్రిందకు జారే గమనంలో ఎలాంటి లయాత్మకమైన సౌందర్యం ఉంటుందో అలాంటి సౌందర్యం గల వచనం అన్నమాట. (పానుగంటి కాకి అన్నాడు, ఫ్లాబర్ గ్రద్ద అన్నాడు; కాని ప్రాథమికంగా పోలిక ఒకటే కదా.) ఫ్లాబర్ ఎలాంటి వివరణ ఇవ్వకుండా క్లుప్తంగా "eagle flight" అని వాడి ఊరుకోవడాన్ని బట్టి బహుశా ఇది ఫ్రెంచి సాహిత్యంలో వచన సౌందర్యాన్ని వర్ణించేటపుడు సాధారణంగా వాడే మెటఫోరే అయి ఉంటుంది. కాని పానుగంటి కూడా అచ్చంగా అదే మెటాఫోర్‌ని వాడటం, అది కూడా వచన సౌందర్యాన్ని సూచించేందుకే వాడటం నాకు విశేషమనిపించింది. ఇంతే సంగతి.

ఇక ఫ్లాబర్ ఉత్తరంలో ఇందాక ఇస్తానన్న మిగతా సగం కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఇది ఫ్లాబర్ రచనా దృక్పథంలో వస్తువుది ఎంత అల్పమైన స్థానమో చెప్తుంది:

What seems beautiful to me, what I should like to write, is a book about nothing, a book dependent on nothing external, which would be held together by the strength of its style, just as the earth, suspended in the void, depends on nothing external for its support; a book which would have almost no subject, or at least in which the subject would be almost invisible, if such a thing is possible. The finest works are those that contain the least matter; the closer expression comes to thought, the closer language comes to coinciding and merging with it, the finer the result. I believe that the future of Art lies in this direction. I see it, as it has developed from its beginnings, growing progressively more ethereal, from the Egyptian pylons to Gothic lancets, from the 20,000-line Hindu poems to the effusions of Byron. Form, as it is mastered, becomes attenuated; it becomes dissociated from any liturgy, rule, yardstick; the epic is discarded in favor of the novel, verse in favor of prose; there is no longer any orthodoxy, and form is as free as the will of its creator . . .

It is for this reason that there are no noble subjects or ignoble subjects; from the standpoint of pure Art one might almost establish the axiom that there is no such hing as subject, style in itself being an absolute manner of seeing things.

ఈ పేరాలో ఒక వాక్యంలో ఫ్లాబర్, పానుగంటి లక్ష్మీనరసింహారావుల ఆలోచనల్లో ఒక సామ్యం కనిపిస్తోంది. "verse [discarded] in favor of prose" అంటూ ఫ్లాబర్ వచనానికి, కవిత్వానికి మధ్య హద్దుల్లేని భవిష్యత్తుని ఊహించాడు. అదెలా ఉంటుందో తన వచనంతోనే నిరూపించి చూపాడు కూడా. తను ఊహించిన భవిష్యత్తుకు తనే ఒక పునాది వేశాడు; ఒక పరంపరకు ఆద్యుడయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కాఫ్కా, ప్రౌస్ట్, నబకొవ్, జాయిస్‌ల వచనంలో బోలెడంత కవిత్వం ఉంటుంది. నేను వాళ్ళ వచనాన్ని కవిత్వం చదివినంత ఉత్తేజంతో పైకే చదువుకున్న సందర్భాలు బోలెడున్నాయి. పైన పానుగంటి వాక్యాల్ని మళ్ళీ చదివితే, ఆయన కూడా వచనాన్ని కవిత్వపు స్థాయికి తీసుకువెళ్ళడం గురించే మాట్లాడుతున్నాడని బోధపడుతుంది. అయితే ఆయన ఊహించిన భవిష్యత్తు తెలుగులో సాకారం కాలేదు. ఒకరో ఇద్దరో వచనంలో కవితా మాధుర్యాన్ని చూపడానికి ప్రయత్నిచిన వాళ్ళున్నా, అది పరంపరగా మారింది లేదు; ఇపుడిక సాధ్యం కాదేమో కూడా. దానికి నాకు కనిపిస్తున్న ఒక కారణం: చాలా తొందరగా శిథిలావస్థకు చేరిపోతున్న తెలుగు భాష. ఎంత తొందరగా అనేదానికి ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఈ మధ్య చదివిన చాలా మంది రచయితలు పంతొమ్మిదో శతాబ్దం వాళ్ళే. ఇటీవలే పూర్తి చేసిన "సెంటిమెంటల్ ఎడ్యుకేషన్" 1850ల్లో ప్రచురితమైన నవల. కానీ నా పఠనం ఏ అవాంతరాలు లేకుండా సాఫీగా సాగిపోయింది. పంతొమ్మిదో శతాబ్దపు ప్రెంచి సమాజాన్ని నా కళ్ళ ముందున్నట్టే చూశాను; పాత్రలతో, సంఘటనలతో మమేకమయ్యాను. ఎందుకంటే, ఆ ప్రపంచం ఇప్పుడు కాలంతో పాటు అదృశ్యం అయిపోవచ్చుగాక, ఆ భాష మాత్రం అలాగే ఉంది. నన్ను కాల ప్రవాహాన్ని దాటించి గత శతాబ్దపు ఆవలిగట్టుకు తీసుకెళ్ళడానికి పటిష్టమైన వంతెనగా ఇంగ్లీషు బాష ఇంకా అలానే నిలిచి ఉంది, ఆ వంతెనను అలా నిలబెట్టిన మూల స్తంభాలే నిఘంటువులు. ఇదే మెటఫోర్ తెలుగుకు అన్వయిస్తే, ఇక్కడ మూలస్తంభాలు సరిగా లేని వంతెన క్రమంగా క్రుంగిపోతోంది; ఆవలిగట్టైతే ఉంది, కాని నన్నక్కడకు తీసుకుపోయే వంతెనే శిథిలమైపోయింది. 1850ల్లోని ఇంగ్లీషు భాష నన్ను పెట్టని ఇబ్బంది 1920ల్లోని తెలుగు భాష పెడుతోంది.

ఇక సమకాలీన తెలుగు రచనల్లోని వచనం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. జనరంజక రచనలపేరిట వచ్చే పిప్పిని వదిలేసి, కళాత్మక రచనలుగా పేర్కొనబడుతున్న రచనల్నే ఉదాహరణగా తీసుకుంటాను. ఇది "మునెమ్మ" అనే నవలలోని ఒక పేరా:
అప్పుడు చెరువు నీళ్లలో ఊరివాళ్ళం ఓ పది మందిమి ఈదులాడుతున్నాం. వాళ్ళలో నేనూ ఒకడిని. అప్పుడు నా వయసు ఇరవై ఏండ్లు. మేమంతా రొమ్ములోతు నీళ్ళలో నిలబడి, నోటి నిండా నీళ్ళు తీసుకుని తలలు పైకెత్తి, ఆ నీళ్ళను పిచికారీ చేసినట్లు ఆకాశంలోకి చిమ్మితే ఆ నీటి బిందువులపైన సాయంకాలపు సూర్య కిరణాలు పడి ఇంద్రధనుస్సులు ఏర్పడుతున్నాయి. దిగువ వీధి సాంబశివుడు మా అందరిలో పెద్దవాడు. వాడి ఛాతీ మీద, దవడల మీద కండరాలు దిట్టంగా ఉంటాయి. వాడు నోటి నిండా నీళ్ళు తీసుకుని, పైకి చిమ్మితే ఏర్పడే ఇంద్రధనస్సులో ఏడు రంగులు ఎంత స్పష్టంగా కనబడతాయని. అలాంటి ఇంద్రధనస్సును వాడు మా అందరి కోరికను మన్నిస్తూ అప్పటికే ఇరవైసార్లు చూపించాడు. వాడు మరోసారి నోట్లో నీళ్ళు పోసుకుని పైకి చిమ్మబోతూ గబుక్కున ఆగి, "ఇదేవి జూసినారు. అట్ట జూడండి. ఆ రంగులు జూడండి" అంటూ చెరువు కట్టవైపు చేయి చూపించాడు.

సులభమైన శైలి పేరిట హెమింగ్వేకు పేలవమైన అనుకరణలతో, మేజిక్ రియలిజం పేరిట అర్థం లేని కల్పనలతో ఇలాంటి నిస్సారమైన వచనం రాసి దీన్ని గొప్ప కళ అని నమ్మమంటే నిజంగా ఏమనాలో అర్థం కాదు.
.

December 14, 2008

ఓ సాయంత్రపు చిట్టా

సుబ్బిగాడు నేనూ మేట్నీ నుండి ఆటోలో వస్తూంటే, అప్పటికప్పుడు మెదిలిన ఆలోచనతో, మలేషియన్ టౌన్‌షిప్ దగ్గర ఆపమన్నాను; ఇద్దరం కలిసి టౌన్‌షిప్ ఎదురుగా పెద్ద గుట్ట మీదున్న గుడికి బయల్దేరాం. ఈ ఆకస్మిక విహారానికి సుబ్బిగాడు మొన్నెప్పుడో ఆ గుడికి వెళ్దామని అడగడం ఒక కారణమైతే, ఇప్పుడే చూసిన చెత్త సినిమా హాంగోవర్ నుండి ఇది మమ్మల్ని కాస్త బయట పడేయగలదేమోనన్న ఆశ మరో కారణం. పైకి ఎక్కే దారిలో మాకెదురైన రెండు మూడు ప్రేమ జంటల్ని చూసి సుబ్బిగాడు నకిలీ నిట్టూర్పులు విడిచాడు; నేను నవ్వాను. పైన పెద్దగా జనం లేరు. గుడి తలుపులు మూసి ఉన్నాయి. గుడి వెనుక ఉన్న పెద్ద రాతి బండ మీద ఇద్దరం సాగిలబడ్డాం. గుట్ట క్రింద కాస్త దూరంలో కొత్తగా ఏదో టౌన్‌షిప్ కడుతున్నారు. ఏటవాలు కప్పులతో పదుల సంఖ్యలో ఉన్న డూప్లెక్సులు మా ముందు వరసాగ్గా పేర్చి ఉన్నాయి. వాటి మధ్యలో ఆకాశానికి లేచి నాలుగైదు అపార్ట్‌మెంట్ టవర్లు కూడా నిర్మాణంలో ఉన్నాయి. ఆ సాయంత్రపు మసక వెలుగులో కూడా చాలా దూరంలో ఉన్న నేమ్‌బోర్డు మీద "ఫార్ట్యూన్ ఫీల్డ్స్" అన్న పేరుని మేం కూడబలుక్కుంటూ చదవగలిగాం; మా నిశితమైన కంటి చూపుని మేమే పొగుడుకున్నాం. ఈ "ఫార్ట్యూన్ ఫీల్డ్స్"కి వెనుకగా, క్షితిజరేఖ మీద, సూర్య బింబం అస్తమించే పనిలో ఉంది. కాషాయపుటెరుపు రంగులో ఉన్న ఆ బింబపు కాంతి ఎంత మృదువుగా ఉందంటే కళ్ళు ఏ మాత్రం బైర్లు కమ్మకుండా దాన్ని తదేకంగా ఎంతసేపైనా చూస్తూండిపోవచ్చు. అయితే ఇలా కాంక్రీటు మేడల మీద కన్నా, ఇదే బింబం, ఏవైనా రెండు పచ్చిక నిండిన కొండల మధ్య అస్తమిస్తూ కనిపిస్తే ఈ దృశ్యం ఇంకెంత హృద్యంగా ఉండేదో కదా అనిపించింది. కళ్ళ ముందు చేయి ఉంచి, ఆ బింబాన్ని బొటన వేలి క్రింద పెట్టి, ఆకాశంలోకి ఓ జానెడు కొలత కొలిస్తే ఎంత దూరం ఉంటుందో ఆ మాత్రపు దూరంలో ఒక జెట్ విమానం వెళ్తూంది. దాని వెనుక తెల్లని వాయుమేఘం తోకలా విస్తరించుకుంటోంది. ఇద్దరం ఆ విమానం గురించి కాసేపు మాట్లాడుకున్నాం. అది నియంత్రణ తప్పి తిన్నగా మేం కూర్చున్న గుట్ట మీదకు దూసుకొస్తే ఎలా ఉంటుందో ఊహించమన్నాను; సుబ్బిగాడు నావన్నీ వెధవ ఊహలని తిట్టాడు. తర్వాత, మా కంటి చూపుని మరింత పరీక్షించాలని, దూరంగా ఉన్న ఓ హోర్డింగ్ మీద పెద్ద అక్షరాలతో రాసి ఉన్న సెల్‌నెంబరు చదవడానికి ప్రయత్నించాం. ఆ నెంబర్లో వరుసగా ఐదు ఆర్లున్నాయి. అవి లెక్కపెట్టడానికి కాస్త కష్టమైంది. కాసేపటికి మా సంభాషణ నుండి తేరి చూస్తే అప్పటికే సూర్య బింబం అదృశ్యమైపోయి ఉంది. అది లేని శూన్యతతో అక్కడ బూడిద రంగు ఆకాశం బోసిపోయి కనిపిస్తోంది. అయితే పైన జెట్ విమానపు తోక పైన మాత్రం ఇంకా సూర్య కాంతి పడి మెరుస్తూనే ఉంది. మాకు అస్తమించిన సూర్యుడు ఆ విమానంలోని పైలట్‌కి ఇంకా అస్తమించలేదన్నమాట. మేం చూడలేని సూర్యుణ్ణి అతనింకా చూస్తున్నాడన్నమాట. జెట్ విమానపు గమనాన్ని పరికిస్తూ ఇద్దరం రాతి మీద వెల్లకిలా పడుకున్నాం. ఇలాంటి ప్రాకృతికమైన నిశ్శబ్దంలో, ప్రేమలో ఉన్న వారెవరైనా ప్రేయసిని గుర్తు చేసుకోవడం సహజమనుకుంటా. సుబ్బిగాడు వాడి మరదలి గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. వాడు ఆ అమ్మాయి గురించి ఎక్కువ మాట్లాడేది నాతోనే. పాపం వాడి దగ్గర వాడి ప్రేమను సాకల్యంగా వర్ణించగలిగినన్ని పదాలు లేవు; కాని వాటిని వెతుక్కోవటానికి వాడు పడే ప్రయాసలో, వాడి నట్టడంలో, తడబాటులో, ఆ ప్రేమ అందం ఇంకా ఇనుమడిస్తుంది. కొన్నిసార్లు లోపల్నించీ వెల్లువెత్తుతున్న ప్రేమ తీవ్రతకూ, దానికి వీడు అరువిచ్చే సాదాసీదా పదాలకూ మధ్య సంధి కుదరక, తడబడి, "నేన్చెప్పలేన్రా బాబూ" అని ఇబ్బందిగా నవ్వేస్తాడు. అయితే అంతకుముందు వాడిన సవాలక్ష పదాల కన్నా ఈ ఒక్క పదం వాడి ప్రేమ గాఢతను సంపూర్ణంగా వ్యక్తం చేస్తుంది. నేను "ఊ" కొట్టాల్సిన చోట "ఊ" కొట్టాను. తోచిన చోట సలహా ఇచ్చాను. ఆసక్తిగా వింటున్నానని తెలియజేయడానికి (నిజంగానే వింటున్నాను), కొన్ని అర్థమైనా సరే ఆపి వివరమడిగాను. మా సంభాషణ అంతా పూర్తయ్యాక, ఇదంతా విన్నందుకు నా పట్ల వాడిలో ఉండే కృతజ్ఞత కన్నా, చెప్పినందుకు వాడి పట్ల నాలో ఎక్కువ కృతజ్ఞత ఉంటుందనిపించింది. ఆ సరికే సినిమా తాలూకూ తలపోటు వదిలిపోయింది. ఎంతైనా ప్రేమ కదా . . . దేన్నైనా ఆహ్లాదంగా మార్చేస్తుంది. వెళ్దామంటే వెళ్దామనుకున్నాం. సోమరి సంతృప్తితో బండ దిగి క్రిందికి నడవడం మొదలుపెట్టాం.

November 10, 2008

రోడ్డు మీద కోక్‌ టిన్నుని లాగి పెట్టి తన్నడంలో exhilaration

ఆనందంగా ఉండటం మనిషికి ఒక నైతిక బాధ్యత అట. నిన్న రాత్రి ఓ బోర్హెస్‌ వాక్యం చెప్పింది. కొన్ని వాక్యాలు ఊరికే లోపలికి వెళ్ళి ఊరుకోవు. వెళ్ళాక లోపల దేన్నో కదిపేసి కుదిపేసి పెద్ద కలకలం రేపేస్తాయి. ఆనందం మనిషి జీవిత పరమార్థమని, మన ప్రతీ చర్యలోనూ పైపై పూతల్ని తొలగించుకుంటూ పోతే లోపల కనిపించేది ఆనందం పట్ల కాంక్షే అనీ నాకు తెలుసు. కాని "ఆనందంగా ఉండటం, ఆనందాన్ని వెతుక్కోవటం మనిషి కనీస బాధ్యత'' అని నేనెవరి దగ్గరా ఇంతవరకూ వినలేదు. "ఆనందో బ్రహ్మ'' అంటూ మనవాళ్ళు చెప్పిన దాంట్లో కూడా ఎందుకనో అది ఓ ఆదర్శం అన్నట్టే వినిపించింది గానీ, అదో నైతిక బాధ్యత అన్నంత ఖచ్చితత్వం ధ్వనించలేదు. అందుకే అనుకుంటా ఆ వాక్యం అంతగా కొట్టొచ్చినట్టు కనిపించింది. వెంటనే పుస్తకం మూసి బయటకు వచ్చేశాను. బయట శీతాకాలం అర్థ రాత్రి చల్లగా ఆహ్వానం పలికింది. రూమ్‌ తలుపు దగ్గరకు జారేసి, వంటి చుట్టూ వెచ్చగా హత్తుకునేట్టు స్వెటర్‌ జిప్‌ పైకి లాక్కుని బయటకి నడిచాను. ఎందుకో ఆ వాక్యాన్ని వెంటనే వదిలేయాలనిపించలేదు. దాన్ని కరిగిపోనీకుండా పూర్తిగా నాలోకి జీర్ణం చేసుకోవాలనిపించింది. దాని గురించి కాసేపు ఆలోచించాలనిపించింది. నిరంతరాయమైన ఆలోచనకి అన్ని విధాల అనుకూలమైన పరిసరాలు వున్నాయి అప్పుడు నా చుట్టూ: హైదరాబాద్‌ అంతా నిద్రపోతున్న నిశ్శబ్దం, నిర్మానుష్యమైన రోడ్డు, జనావాసాల్లేకుండా అటూ ఇటూ రాళ్ళ గుట్టలు, నన్ను నాలోకి మరింత ఒదిగిపోయేలా చేస్తున్న చలి, ఆలోచనల విరామంలో పరాకుగా తలెత్తినప్పుడల్లా వీథి లైట్ల చాటు నుంచీ "నేను నీతోనే వస్తున్నానంటూ'' ఆత్మీయంగా పలకరిస్తున్న నిమ్మతొనంత చందమామ . . . ఇంకేం కావాలి. ఇంకా చెప్పాలంటే, అడపాదడపా రోడ్డు వారన లుంగ చుట్టుకు పడుకున్న కుక్కల నిద్రని నేను చెడగొడుతున్నానేమో గాని, నన్ను నా ఆలోచనల్నీ భంగపరచడానికి అక్కడే అడ్డంకులూ లేవు. వాహనాలు కూడా అప్పుడొకటి ఇప్పుడొకటి తప్ప రాకపోవడంతో రోడ్డు మధ్యనే నడుస్తున్నాను. కాళ్ళు, ఆలోచనలు నా ప్రమేయమేమీ లేకుండానే వాటి తోవన అవి సాగిపోతున్నాయి. ఆనందంగా ఉండటం మనిషి కనీస బాధ్యత అట. ఎందుకో ఇది తిరుగులేని స్టేట్‌మెంట్‌లా అనిపించింది. పైగా ఆ స్టేట్‌మెంట్‌ని ఇచ్చిన మనిషే దానికి తిరుగులేని సాక్ష్యంలా కనిపించాడు: Borges. చదవటం, రాయటం మాత్రమే తన జీవితమనుకున్న మనిషికి కళ్ళు పోతే ఎలా ఉంటుంది. పిచ్చెక్కి పోదూ. అయినా ప్రతీ చోటా నవ్వుతూనే కనిపిస్తాడు. రాతల్లో కూడా చాలా సరదా మనిషిలా స్ఫురిస్తాడు. అంధత్వం ఖాయమైపోయాకా పెద్ద పెద్దవి రాయడం మానేసాడట; చిన్న చిన్న కథలు, కవితలూ అయితే కలం కాగితాల సహాయం లేకుండానే మెదడులో నిలుపుకోవచ్చని అవి మొదలుపెట్టాడట. పేరాలకు పేరాలు, పంక్తులకు పంక్తులు మెదళ్ళో మోసుకుంటూ చేతి కర్ర సాయంతో బ్యునోస్‌ ఎయిర్స్‌ వీథుల్లో తిరిగేవాడట. మరీ మనిషి చెప్పాడంటే ఒప్పుకుని తీరాల్సిందే కదా. అయినా ఇది చాలా కనీస విషయం. ఆనందంగా ఉండక ఏడుస్తూ బతుకుతామా. అంతే, కొన్నిసార్లు అన్నీ తెలుసున్నా అంతా మర్చిపోతాం. లోపలే నిలవున్న దాని కోసం ఎక్కడెక్కడో వెతుకుతూంటాం. మన ఆనందమూ మన పెంపుడు కుక్క లాంటిదే. పాపం అది మన దృష్టిని ఆకర్షించాలని తోకూపుకుంటూ, కాళ్ళ సందుల్లోంచి అటూ ఇటూ జొరబడిపోతూ, వేళ్ళు నాకేస్తూ, నానా తంటాలు పడిపోతూంటుంది. మనం చేయాల్సిందల్లా దాని వైపు ఆహ్వాన సూచకంగా చేయి సాచటమే. కాస్త ధ్యాస దాని వైపు మళ్ళిస్తే చాలు, ముందరి కాళ్ళు రెండూ పైకెత్తి మన చుట్టూ అల్లుకుపోతుంది. ఒక్కసారి తల విదిలించుకో, "just snap out of it" అనుకో . . . అంతా ఆనందమే. అది తెలిసీ ఇన్ని రోజులు దిగాలుగా ఉన్నాను. కాని ఇప్పుడు నేను ఆనందంగా ఉండటానికి అడ్డేమిటి అని ప్రశ్నించుకుంటే, చిత్రంగా, ఒక్క సమాధానమూ తట్టడం లేదు.

బహుశా ఆ దిగులంతా ఇంకా ఏ దారో నిశ్చయించుకోలేకపోవడం వల్ల వచ్చిన దిగులేమో; రెండుగా చీలిపోయిన రోడ్డు ముందు నిలబడి, ఒక దారిలో పోతే మరోదారిలోని అందాలు కోల్పోతానేమో అని బాధ పడే వాడికి కలిగే దిగులు లాంటిదేమో. "సిటీ స్లికర్స్‌'' అని చాన్నాళ్ళ క్రితం చూసిన సినిమా గుర్తొస్తోంది. అందులో బిల్లీ క్రిస్టల్‌ న్యూయార్క్‌ నగరంలో, నచ్చని ఉద్యోగంలో, కలతల సంసారంతో యాంత్రికంగా జీవితాన్ని గడిపేస్తుంటాడు. అతని నలభయ్యో పుట్టిన రోజుకి బహుమతిగా అతని ఇద్దరి స్నేహితులూ ఒక విహార యాత్ర ప్లాన్‌ చేస్తారు. వాళ్ళిద్దరూ కూడా బిల్లీలాగే మిడ్‌లైఫ్‌ క్రైసిస్‌తో బాధపడుతూంటారు. ఆ యాత్ర ప్రకారం యాత్రికులందరూ కొన్నాళ్ళ పాటు కౌబాయ్స్‌లా ఆవులు మేపుతూ గడపాలి. (నాకు సరిగా గుర్తు లేదు; అంతే అనుకుంటా.) మొదట ముగ్గురూ ఇక్కడ కుదురుకోలేకపోతారు. కాని నెమ్మదిగా నెమ్మదిగా ఈ క్యూబికల్సూ, కాన్ఫరెన్సులూ లేని జీవితం వాళ్ళకు నచ్చటం మొదలౌతుంది. అక్కడ వీళ్ళకి ఒక ముసలి వాడైన కౌబాయ్‌ తారసపడతాడు. బిల్లీ క్రిస్టల్‌కి అతను బాగా నచ్చుతాడు. జీవితం పట్ల తనలో లేని నిబ్బరం అతనిలో చూస్తాడు. ఒక సన్నివేశంలో ఇద్దరూ కౌబాయ్‌ వేషాల్లో ప్రక్కన ప్రక్కన గుర్రాల మీద వెళ్తూంటారు. హఠాత్తుగా ఆ కౌబాయ్‌ బిల్లీ వైపు తిరిగి "నీకు జీవిత రహస్యం ఏంటో తెలుసా?'' అంటాడు.

బిల్లీ చాలా ఉద్విగ్నతతో "ఏమిటి!?'' అని అడుగుతాడు.

కౌబాయ్‌ నిశ్శబ్దంగా తన చూపుడు వేలు ఎత్తి చూపిస్తాడు.

బిల్లీ: (అర్థం కానట్టూ మొహం పెట్టి) ఏమిటి, నీ వేలా?

కౌబాయ్‌: ఒకే విషయం . . . కేవలం ఒకే విషయం . . . దానికి బద్దుడవై ఉండిపో. జీవితం సులభమైపోతుంది.

బిల్లీ: అది సరే . . . కాని ఆ ఒక్క విషయమూ ఏమిటి?

కౌబాయ్‌: అదేంటో నువ్వే తేల్చుకోవాలి.

-- మనదీ ఇంచుమించు ఇదే బాధ. ఇంకా ఆ ఒక్కటీ ఏమిటన్నది నిర్ధుష్టంగా తేలడంలేదు. ఒక వేళ తేలినా, ఆ దారినే గుడ్డిగా నమ్మేసి "ఇదే జీవితం'' అని నిశ్చింతగా వెళిపోగలమా. అలా వెళిపోయినా ఆ దారికి సమాంతరంగా లక్షా తొంభై మార్గాలు ఊరిస్తూంటే మళ్ళా ఏదో కోల్పోయామనిపించదా. కాని ఏదో ఒకటి పట్టుకోక తప్పదని మాత్రం తెలుసు. చార్లీ కఫ్‌మన్‌ 'అడాప్టేషన్‌' సినిమాలో ఓ పాత్ర అంటుంది:

"There are too many ideas and things and people. Too many directions to go. I was starting to think that the reason it matters to care so passionately about something is that it whittles the world down to a more manageable size."

--కాబట్టి ఏదో ఒక దాన్ని పట్టుకోకపోతే ఈ బృహత్‌ ప్రపంచం మన మతి పోగొట్టేస్తుంది. అయినా నిన్న మొన్నటి దాకా నాకో పట్టుగొమ్మ ఉందనే అనుకున్నాను. చాలా అందమైన పట్టుగొమ్మ అది. మానవ అస్తిత్వ సమస్యకు అదే ఒక్కగానొక్క పరిష్కారమని నాకు ఎరిక్‌ఫ్రామ్‌ చెప్పక ముందే తెలుసు. దాని పేరు ప్రేమ. ఎంత నిజమో కదా. జీవితాన్ని అర్థవంతం చేసుకోవాలంటే ప్రేమించాలి. అంతే, మరో దారి లేదు. ఈ ప్రేమ అనేది లేకపోతే మనిషిగా ఈ భూమ్మీద మన ఉనికిని భరించడం చాలా కష్టమై ఉండేది. స్నేహితులో, ప్రేయసీ ప్రియులో, భార్య భర్తలో, తండ్రీ కొడుకులో, అన్నా చెల్లెళ్ళో, సాటి మనుషులో . . . ఇలా బంధాలేవైనా మనందరి మధ్య ఈ ప్రేమ అనే భావన లేకపోతే మానవ అస్తిత్వం భరించలేనంత దుర్భరమైపోయి ఉండేది. అసలు మనుషులకు ఇంత అర్థం లేని అస్తిత్వాన్ని అంటగట్టినందుకు నష్టపరిహారంగానే ఈ ప్రేమను ఇచ్చాడేమో దేవుడు. అయితే ఇక్కడో చిన్న ఇబ్బంది ఉంది. ఎరిక్‌ఫ్రామ్‌ ఈ ప్రేమను మనుషులకు మాత్రమే ఉద్దేశించమన్నాడో లేదో నాకు తెలియదు కానీ, మనుషులకు మాత్రమే ఉద్దేశిస్తే కొన్ని సమస్యలుంటాయి. మనుషులతో ప్రేమ షరతులతో కూడి ఉంటుంది. మనం మథర్‌ థెరిసాలం కాదు గనుక కొన్ని షరతులతో మాత్రమే అవతలి వారికి ప్రేమను ఇవ్వగలం. కొన్ని షరతులతో మాత్రమే అవతలి వారి నుండి ప్రేమను పొందగలం. అలాగాక బేషరతుగా ప్రేమ కావాలనుకుంటే మాత్రం ఈ వ్యవహారంలోంచి మనుషుల్ని పక్కన పెట్టేయక తప్పదు. అక్కడే నా పట్టుగొమ్మ విరిగిపోయింది. నాకు మరో ఆసరా కావాల్సి వచ్చింది. బహుశా ఆ ఒక్కటీ ఏమిటన్నది నా కిప్పుడిప్పుడే నిర్ధుష్టంగా స్పష్టమవుతుందేమో. ఏ షరతులూ లేని ప్రేమ, నా వరకూ, కళతోనే సాధ్యమవుతుంది. అది ఎంత ఇచ్చినా తీసుకుంటుంది; అంతకు అంత తిరిగి ఇస్తుంది. అది ప్రేమ మాత్రమే అడుగుతుంది. ప్రేమను మాత్రమే ఇస్తుంది.

ఇలా నా ఆలోచనల్ని ఫోర్త్‌ఫేజ్‌ నుండి సైబర్‌ టవర్స్‌ దాకా నడిపించాకా అర్థమైంది: మన ఆనందాలకు మనుషుల్ని ఆధారభూతాలుగా నిలుపుకోవడం ఎంత నిష్పలమో, దుఃఖదాయకమో, కొండొకచో ప్రమాదకరమో; నాలోనే ఉండి, నేను అనుమతి ఇస్తే చాలు నన్ను మొత్తంగా కమ్మేద్దామని ఎదురుచూస్తున్న ఆనందాన్ని కాదని బయట దేబిరించడం ఎంత వెర్రితనమో. చౌరస్తా దగ్గర కూడా పెద్దగా జనం లేరు. నియాన్‌ లైట్ల వెలుగులో సన్నగా మంచు కురవడం కనిపిస్తోంది. ఏమో అది మంచో, దుమ్ము కణాలో . . . ఇక్కడ దేన్నీ నమ్మలేం. ఓ మూల చాయ్‌ దుకాణం ఇంకా తెరిచే ఉంది. ఎందుకో అలవాటు లేకపోయినా తాగాలనిపించింది. అర్థం పర్థం లేకుండా ముప్పిరిగొంటున్న ఆనందాన్ని నాతో నేను సెలబ్రేట్‌ చేసుకోవాలనిపించింది. చాయ్‌ తాగి వెనక్కి నడిచాను. కొన్నిసార్లు, మనం అస్సలు సిద్ధంగా లేనపుడు, ఉధృతమైన ఆనందం చెప్పా పెట్టకుండా దాడి చేస్తుంది. మన ఉనికికి అతీతమైన ఆనందమది. ఆ ఆనందానికి మన శరీరం సరిపోదు. బద్దలైపోతామనిపిస్తుంది. వెన్నులోంచి మొదలై వళ్ళంతా జలదరించిపోతుంది. పిచ్చిగంతులేయాలనిపిస్తుంది. అదృష్టవశాత్తూ ఆ ఖాళీ రోడ్డు మీద నేను పరిగెత్తినా, పిచ్చి గంతులేస్తూ, పిచ్చి పాటలు పాడినా ఎవ్వరూ పట్టించుకునే వాళ్ళు లేరు. చందమామ మనోడే. అర్థం చేసుకున్నట్టు చల్లగా నవ్వుతున్నాడు.
.

November 4, 2008

A quote from "Franny and Zooey"

రాత్రి "ఫ్రానీ అండ్‌ జోయీ'' పూర్తి చేసాను. ఇంకా పుస్తకం తల్లోనే గింగిరాలు తిరుగుతోంది. మత్తు దిగాక మళ్ళా ఎప్పుడైనా పరిచయం చేస్తాను. కొన్నిసార్లు అసలీ పుస్తకాల్ని పరిచయం చేసే కార్యక్రమమే చాలా నిష్పలంగా అనిపిస్తుంది. ఎందుకంటే, ఒక పుస్తకాన్ని ఆ పుస్తకం కన్నా గొప్పగా ఎవరు పరిచయం చేయగలరు? కొన్నాళ్ళ క్రితం నా కిష్టమైన కథల్లో ఒకటైన మధురాంతకం రాజారాం కథ "కమ్మ తెమ్మెర''ని పరిచయం చేద్దామనుకున్నాను. ఎంత ప్రయత్నించినా ఏవో అకడెమిక్‌ పరిశీలనల్లాంటివే నమోదు చేయగలిగాను గానీ కథలోని మేజిక్‌ మాత్రం బయటకు లాగలేకపోయాను. పైగా రాయకూడనిదేదో రాసి చదవగోరే వాళ్ళకు ఆ కథను దూరం చేస్తానేమో అనిపించింది కూడా. కథంతా ఇక్కడ రాస్తే తప్ప దాన్ని సమర్థవంతంగా పరిచయం చేయలేననిపించింది. ఆ ప్రయత్నం మానుకున్నాను. ఇప్పుడు శాలింజర్‌ని, అతని పుస్తకాల్ని పరిచయం చేయాలన్నా ఇదే ఇబ్బంది. శాలింజర్‌ని ఎందుకు చదవాలో క్లుప్తంగా చెప్పాలంటే, శాలింజర్‌ని అతని వచనం కోసం చదవాలి. అతని వచనం దేన్నీ వదలదు, పాత్రల్లో ప్రతీ చిన్న కదలికను, ప్రతీ పరాకు భంగిమను, వాళ్ళ పెదవి కొసల చిర్నవ్వుల్నీ, రెప్పపాటులో మాయమయ్యే నొసటి చిట్లింపుల్నీ, అన్నింటినీ ఒడుపైన పదాల్తో పట్టేసుకుంటుంది. అయితే కొన్నిసార్లు, చాలా కొన్నిసార్లు, ఈ పదాల పోహళింపు మరీ గాఢమైపోయి దృశ్యం మరుగున పడిపోయే సందర్భాలూ లేకపోలేదు. కాని ఎక్కడా అభాసుపాలు కాకుండా ఏదో దాన్ని రక్షిస్తుంది. బహుశా ప్రేమేమో. నిజం! ప్రేమే. అతను తన రచన పట్ల చూపిస్తున్న ప్రేమ, రాయడం అన్న వ్యాసంగం పట్ల అతను చూపిస్తున్న మమకారం, అందులో అతను పొందుతున్న ఆనందం మనకూ కలుగుతాయి. మనమూ దాన్ని ప్రేమించకుండా ఉండలేం. అంతేకాదు, అతని వాక్యాలు కేవలం దృశ్యాన్ని నిర్మించి ఇచ్చేవి కావు; పనిలో పనిగా పాత్ర స్వభావాన్నీ మనకు పట్టిచ్చేస్తాయి. — హ్హు! ఇక్కడ నేనేం మాట్లాడతున్నానో నాకే అర్థం కావడం లేదు, అందుకే అన్నాను ఈ పరిచయాలు నిష్పలమని. దీనికి బదులు ఇంచక్కా ఓ పేరాడు వచనం మొహాన పడేస్తే చదివేవాళ్ళు చదువుకుంటారు కదా! ఈ పేరా చదవండి. ఇక్కడ జోయీ బాత్రూంలో అద్దం ముందు నిలబడి గెడ్డం గీసుకుంటున్నాడు:

At the moment, Zooey had just finished squeezing lather cream onto the end of a shaving brush. He put the tube of lather, without re-capping it, somewhere into the enamel background, out of his way. He passed the flat of his hand squeakily back and forth over the face of the medicine-cabinet mirror, wiping away most of the mist. Then he began to lather his face. His lathering technique was very much out of the ordinary, although identical in spirit with his actual shaving technique. That is, although he looked into the mirror while he lathered, he didn't watch where his brush was moving but, instead, looked directly into his own eyes, as though his eyes were neutral territory, a no man's land in a private war against narcissism he had been fighting since he was seven or eight years old. By now, when he was twenty-five, the little stratagem may well have been mostly reflexive, just as a veteran baseball player, at the plate, will tap his spikes with his bat whether he needs to or not. Nonetheless, a few minutes earlier, when he had combed his hair, he had done so with the very minimum amount of help from the mirror. And before that he had managed to dry himself in front of a full-length mirror without so much as glancing into it.

—చదివిన వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది. ". . . as though his eyes were neutral territory, a no man's land in a private war against narcissism he had been fighting since he was seven or eight years old.'' ఈ వాక్యంతో పాత్ర గురించి ఎంత సూక్షంగా చెప్తున్నాడో కదా. ఇలాంటి పటిమ ఉన్న వాక్యాలతో నిండిన వచనం నాకు కవిత్వం కూడా ఇవ్వలేని కిక్‌ ఇస్తుంది. బహుశా, ముందే ఎక్కడో చెప్పినట్టు, నేను అల్పసంతోషిని.

శాలింజర్‌ నవ్విస్తాడు కూడా. ఆ హాస్యంలో కాస్త ముళ్ళపూడి శైలి కనిపిస్తుంది: మామూలు విషయాన్ని బడాయి పదాలతో సజాయించి చెప్పటం; మరికాస్త, శాలింజర్‌కు మాత్రమే ప్రత్యేకమైన శైలి కనిపిస్తుంది: పసి పిల్లల్ని వాళ్ళకు తెలియకుండా గమనిస్తుంటే మనకు భలే నవ్వొస్తుంది కదా. శాలింజర్‌ ఏంటంటే, తన పాత్రలన్నింటిలోనూ ఇలా పసితనమే చూస్తాడు. ఒక్కోసారి ఆ పాత్రల్లో పసితనం మనకు నవ్వు తెప్పిస్తే, ఒక్కోసారి మనలోనే ఆ పసివాళ్ళని చూసి నవ్వుకుంటాం. మొత్తానికి నవ్వుతాం. శాలింజర్‌ పుస్తకాన్ని పెదవులు ఒక్కసారి కూడా విచ్చుకోకుండా ఎవడైనా పూర్తి చేసేడంటే, వాణ్ణి పొలంగట్టునున్న తుమ్మ కంపతో పోల్చవచ్చు. శాలింజర్‌ హాస్యపు శైలికి ఈ పుస్తకం అంకితం పేజీ ఓ ఉదాహరణగా ఇస్తున్నాను. తన ఎడిటర్‌ విలియం షాన్‌కి పుస్తకం అంకితం ఇస్తూ ఇలా రాస్తాడు:

As nearly as possible in the spirit of Matthew Salinger, age one, urging a luncheon companion to accept a cool lima bean, I urge my editor, mentor and (heaven help him) closest friend, William Shawn, genius domus of The New Yorker, lover of the long shot, protector of the unprolific, defender of the hopelessly flamboyant, most unreasonably modest of born great artist editors, to accept this pretty skimpy-looking book.

సరే, ఏదో కోట్‌ ఇస్తానని మళ్ళా ఇదంతా ఎందుకు చెప్తున్నాను. విషయానికొచ్చేస్తాను. ఈ కోట్‌ పుస్తకం చివర్లో వస్తుంది. ఎందుకో నాకు గట్టిగా తగిలింది. సందర్భం ఏమిటంటే, తన చుట్టూ ఉన్న philistine ప్రపంచంతో వేగలేక తనకిష్టమైన రంగస్థల నటనకు స్వస్తి చెప్పి ఇంటికి వచ్చేస్తుంది ఫ్రానీ. అంతేకాదు, పెద్ద ఆధ్యాత్మిక సంఘర్షణలో పడి కుమిలిపోతూంటుంది కూడా. అప్పుడామె అన్నయ్య జోయీ ఆమెకీ సలహా ఇస్తాడు:

"[. . .] But the thing is, you raved and you bitched when you came home about the stupidity of audiences. The goddam 'unskilled laughter' coming from the fifth row. And that's right, that's right—God knows it's depressing. I'm not saying it isn't. But that's none of your business, really. That's none of your business, Franny. An artist's only concern is to shoot for some kind of perfection, and on his own terms, not anyone else's. You have no right to think about those things, I swear to you. Not in any real sense, anyway. You know what I mean?"

శాలింజర్‌ రచనల లక్ష్యాన్ని కూడా మనం ఈ వాక్యంలో చదువుకోవచ్చు. శాలింజర్‌ని చదవాలన్నా కూడా అతను నిర్దేశించిన షరతుల్ని అంగీకరించే చదవాలి. లేదంటే, అతని జోలికి వెళ్ళ కూడదు.
.

October 29, 2008

Notes on the narrative of "Crime and Punishment"

చాలా క్లాసిక్‌ రచనలకి నేటి అకడెమిక్‌ విమర్శకులిచ్చే ఉపోద్ఘాతాలు అస్సలు సంబంధం లేకుండా ఉంటాయి ('మేడం బొవరీ'కి ముందు మాట రాస్తూ అక్రమ సంబంధాల్లో నైతికానైతికతలను చర్చించడం లాంటివి). అయితే 'క్రైమ్‌ అండ్ పనిష్మెంట్‌'కు నా దగ్గర ఉన్న వర్డ్స్‌వర్త్‌ క్లాసిక్‌ ఎడిషన్‌లో కాస్త రచనకు సంబంధం ఉన్న ఉపోద్ఘాతం ఉంది. ఈ ఉపోద్ఘాతంలో "క్రైమ్‌ అండ్‌ పనిష్మెంట్‌'' కు దాస్తొయెవ్‌స్కీ ప్రస్తుత శిల్పాన్ని ఎలా ఎన్నుకున్నాడో చర్చించారు. దీన్ని రాసింది కీత్‌ కరబైన్‌. దీన్ని చదువుతుంటే, ఒక రచన తనకు మాత్రమే ప్రత్యేకమైన శిల్పాన్ని ఎలా కోరుతుందో అర్థం అయింది. తపన ఉన్న రచయితలు ఆ రచన కోరే శిల్పాన్ని దానికి అందించడానికి ఎంత కష్ట పడతారో మరోసారి ఋజువైంది. ఈ ఉపోద్ఘాతం ప్రకారం "క్రైమ్‌ అండ్‌ పనిష్మెంట్‌''కు దాస్తొయెవ్‌స్కీ ఎన్నుకున్న కథన విధానం అంతకు మునుపు లేనిది. ఈ ఉపోద్ఘాతం నుండి నాకు అర్థమైంది ఇక్కడ రాయదలచుకున్నాను. ఆ కథనం విశిష్టత తెలుసుకోవాలంటే, ముందు నవల ఇతివృత్తం కాస్త తెలుసుకోవాలి:

పీటర్స్‌బర్గ్‌ నగరంలో రస్కోల్నికోవ్‌ అనే పేద విద్యార్థి ఫీజులు కట్టలేదన్న కారణంగా యూనివర్శిటీ నుండి బహిష్కరణకు గురౌతాడు. అతను నగరంలో ఓ లాడ్జీలో చిన్న ఇరుకైన గదిలో అద్దెకుంటాడు. యజమానురాలు పరమ గయ్యాళి. రస్కొల్నికోవ్‌ తల్లి, చెల్లి సొంత ఊళ్ళో ఉంటారు. కటిక పేదరికంతో బతుకీడుస్తుంటారు. తమ కొడుకు యూనివర్శిటీ చదువు పూర్తి చేసుకుని ఓ ప్రభుత్వోద్యోగం సంపాదిస్తే తమ దశ మారుతుందని వాళ్ళ ఆశ. వాళ్ళకి తెలీదు అతన్ని యూనివర్శిటీ నుండి తొలగించేశారని. మరోప్రక్క, జరుగుబాటుకే నానా తంటాలు పడుతున్న తల్లిని డబ్బులడగాలంటే రస్కోల్నికోవ్‌కు కూడా మనసొప్పదు. ఒక పూట తిని, మరో పూట తినకా ఎలాగో నెట్టుకొస్తుంటాడు. చివరికి ఓ నిశ్చయానికొస్తాడు. అతనికి పొరుగులో తాకట్టు వ్యాపారం చేసే ఓ పిసినారి ముసల్ది ఉంటుంది. పేదవాళ్ళకు అధిక వడ్డీకి అప్పులిచ్చి తర్వాత వాళ్ళని హింసిస్తుంటుంది. రస్కోల్నికోవ్‌ ఈమెను చంపి డబ్బు దోచుకోవాలనుకుంటాడు. ఈ హత్య చేయాలన్న ఆలోచనకు సమర్థనగా అతను కొన్ని సిద్ధాంతాలను కూడా సమకూర్చుకుంటాడు (నేను సారాన్ని రాస్తున్నాను): "నెపోలియన్‌, కింగ్‌ సాల్మన్‌ లాంటి గొప్పవాళ్ళు తమ జాతికి ఉపకారం చేయడానికి లక్షల మందిని చంపేశారు. అయినా ఏ అపరాధ భావమూ లేకుండా, పైపెచ్చు కీర్తితో జీవించారు. ఇప్పుడు నేను నా పేద కుటుంబం కోసం, మున్ముందు ఎంతో భవిష్యత్తు ఉన్న నా కోసం, ఎలాగు రేపో మాపో చచ్చిపోయే ఈ దుష్టురాలైన ముసలిదాన్ని చంపేస్తే తప్పేముంది?'' -- ఇలా ఆలోచిస్తాడు. ఒక్కసారి ఆమెను చంపి డబ్బు దోచుకున్నాక దాంతో యూనివర్శిటీ చదువు పూర్తి చేసుకుని, కుటుంబాన్ని గట్టెక్కించి, విదేశాలకు పోయి, మిగిలిన జీవితమంతా నిజాయితీగా, ఇతరులకు సేవ చేస్తూ బతుకుతూ, తన నేరానికి ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చునన్నది అతని ఆలోచన. ఇలాంటి ఆలోచనలతో తనకు తాను ధైర్యాన్ని కల్గించుకుంటాడు. పథకాన్ని పక్కాగా సిద్ధం చేసుకున్నాక, ఓ రోజు ఆ ముసల్ది ఒంటరిగా ఉన్న సమయం చూసి గొడ్డలితో తలపై మోది ఆమెను చంపేస్తాడు. అయితే అనూహ్యంగా అదే సమయంలో ముసలిదాని చెల్లెలు అక్కడకు రావడంతో తప్పని సరై ఆమెను కూడా చంపేస్తాడు. ఈ రెండు హత్యలు, దోపిడీ సవ్యంగానే జరుగుతాయి. అతనిపై ఎవ్వరికీ ఎలాంటి అనుమానమూ కలగదు కూడా. కాని హత్య తరువాతి క్షణం నుంచి హంతకుని మనస్సాక్షి అతనికి వ్యతిరేకంగా పని చేయడం మొదలు పెడుతుంది. ఇక్కడ నేర ప్రభావం నేరస్తునిపై ఎలా ఉంటుందో చూపించడం దాస్తొయెవ్‌స్కీ ప్రధాన లక్ష్యం. హత్య మరుక్షణం నుంచీ రస్కోల్నికోవ్‌ మిగతా ప్రపంచంతో వేరై పోతాడు. మానసికంగా చిన్నాభిన్నమైపోతాడు. పిచ్చితనపు అంచులకు చేరిపోతాడు. మనుషులతో తనకు తెగిపోయిన లంకెను తిరిగి స్థాపించుకోవాలంటే తన నేరాన్ని చట్టం ముందు ఒప్పుకోవడమొక్కటే మార్గంగా అతనికి తోస్తుంది. చట్టం కన్నా మనస్సాక్షి శక్తివంతమైనదని అతనికి అర్థమౌతుంది. చివరికి పోలీస్‌ స్టేషన్‌కి వెళ్ళి లొంగిపోతాడు. ఇదీ క్లుప్తంగా కథ సారాంశం.

దాస్తొయెవ్‌స్కీ ఈ నవలను "రష్యన్‌ హెరాల్డ్‌'' పత్రికకు సీరియల్‌గా పంపించాలనుకున్నాడు. 1865 ఏప్రిల్‌ ప్రాంతంలో రాయడం మొదలుపెట్టాడు. నిజానికి ఈ సమయంలో దాస్తొయెవ్‌స్కీ పూర్తిగా అప్పుల్లో మునిగిపోయి ఉన్నాడు. పైగా ఎపిలెప్సీతో (మూర్ఛరోగం) చాలా జబ్బుపడి బాధపడుతున్నాడు. అతనికి ఈ నవల ప్రచురణ వల్ల వచ్చే ఆదాయం చాలా అవసరం. కాని నవంబరులో హఠాత్తుగా అంతవరకూ రాసిన నవలంతా మొత్తం కాల్చిపడేశాడు. ఇలా కాల్చేయడానికి కారణాన్ని ఓ స్నేహితునికి రాసిన ఉత్తరంలో ఇలా పేర్కొన్నాడు: "నవంబరు చివరకు నవలంతా ఇంచుమించు పూర్తయిపోయి సిద్ధంగా ఉంది; కానీ, నేను దాన్ని పూర్తిగా కాల్చిపడేసాను . . . అది నాకే నచ్చలేదు. ఒక కొత్త శిల్పం, కొత్త పథకం నన్ను ఉత్తేజపరచింది. నేను మొత్తం మొదట్నించీ మళ్ళీ పని మొదలు పెట్టాను.''

అయితే నవల అసలు ప్రతి కాలిపోయినా, దాని చిత్తు డ్రాఫ్టులు, కొన్ని నోటు పుస్తకాలు మనకు మిగిలాయి. వాటి ప్రకారం తెలిసేదేమిటంటే, దాస్తొయెవ్‌స్కీ ఈ నవలను మొదట ఉత్తమ పురుష కథనంలో (ఫస్ట్‌పెర్సన్‌ నేరేషన్‌లో) రాశాడు. ఈ నేరేషన్‌లో లక్షణం ఏమిటంటే ఇక్కడ ప్రధాన పాత్ర రెండు అంశలుగా విడిపోతుంది. ఒకటి: కథను మనకు చెప్తుంది, కథపై వ్యాఖ్యానిస్తుంది; రెండోది: కథలో పాల్గొంటుంది, సంఘటనల్ని అనుభవిస్తుంది. అంటే కథలో ప్రత్యక్షంగా పాల్గొంటున్న అంశ ఒకటైతే, అదే సమయంలో కథను మనకు చెప్తూ దానిపై వ్యాఖ్యానిస్తున్న అంశ మరొకటి. ఈ రెండు విషయాలూ సమాంతరంగా ఒకే సమయంలో జరిగిపోతూంటాయి. ఇలా ఉత్తమ పురుష కథనంలో రాసిన నవల మొదటి డ్రాఫ్టును దాస్తొయెవ్‌స్కీ కాల్చేయడానికి ఒక కారణం ఉంది. ఈ కథకు ఆ నేరేషన్‌ నప్పదు. ఎందుకంటే, నవలలో చాలా భాగం రస్కోల్నికోవ్‌ దాదాపు పిచ్చితనపు అంచుల్లో ఉంటాడు. ఇలాంటి స్థితిలో కథానాయకుడు ఒక ప్రక్కన పిచ్చితనంలోకి జారిపోతూనే మరో ప్రక్క మనకు స్పష్టంగా కథ ఎలా చెప్పగలడు? ఈ పద్ధతిలో ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరకదు. అయితే ఫస్ట్‌ పెర్సన్‌లోనే మరో పద్ధతి కూడా ఉంది: "ఫస్ట్‌పెర్సన్‌ కన్‌ఫెషనల్‌'' పద్ధతి. దీన్ని తెలుగులో 'ఉత్తమ పురుష వృత్తాంత పద్ధతి' అనవచ్చును. అంటే, ఈ పద్ధతిలో ఉత్తమ పురుష కథకుడు జరుగుతున్న కథనాన్ని జరుగుతున్నట్టు మనకు సత్వరం బదిలీ చేయడం ఉండదు. ఎప్పుడో గతంలో జరిగిపోయిన దాన్ని ఇప్పుడు తన జ్ఞాపకంలోంచి వెలికి తీసి వృత్తాతంలాగా చెప్పుకోవడం కనిపిస్తుంది. దాస్తొయెవ్‌స్కీ ఈ పద్ధతి గురించి కూడా ఆలోచించాడు. ఈ పద్థతిలో ఈ కథంతా రస్కోల్నికోవ్‌ గతం నుండి గుర్తు తెచ్చుకుని చెప్తున్నట్టు ఉంటుంది. ఈ పద్ధతి ప్రకారం రస్కోల్నికోవ్‌ గతంలోని తన అస్తవ్యస్త మానసిక స్థితిని ప్రస్తుత దృక్కోణం నుంచి సమీక్షించి, కథను స్పష్టంగా చెప్పే వీలుంటుంది. అయితే ఇందులో ఒక ఇబ్బంది ఉంది. తను చేసిన దారుణ హత్య గురించి, అప్పటి తన బాధాకరమైన మానసిక స్థితి గురించి ఇప్పుడు రస్కోల్నికోవ్‌ ఎందుకు గుర్తు చేసుకోవాలనుకుంటాడు? ఎందుకు దాన్ని కెలికి వెలికి తీయాలనుకుంటాడు? ఈ పద్ధతిలో ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరకదు. కాబట్టే, ఉత్తమ పురుష కథనంలో కథ సాగదనిపించి దాస్తొయెవ్‌స్కీ తన మొదటి డ్రాఫ్టును కాల్చిపారేశాడు. తప్పని సరై మరో కొత్త నిర్ణయానికొచ్చాడు: "the story must be narrated by the author and not by the hero''. కథను ప్రధాన పాత్ర కాక రచయిత చెప్పడమంటే అది ప్రథమ పురుష కథనం (థర్డ్‌ పెర్సన్‌ నేరేషన్‌) అన్నమాట. అంటే కథను ఎవరో మూడో వ్యక్తిలా రచయితే చెప్పడం అన్నమాట. ఇలాంటి కథనం దాస్తొయెవ్‌స్కీ కాలానికి కొత్తదేం కాదు. మరి దాస్తొయెవ్‌స్కీని అంత ఉత్తేజపరచిన కొత్త శిల్పం ఏమిటి? దీని సమాధానం ఆయన నోటు పుస్తకంలో ఉంది: "Narration from the point of view of the author, a sort of invisible but omniscient being, who doesn't leave his hero for a moment.'' అంటే రచయిత ఒక అదృశ్యమైన, కాని సర్వవ్యాప్తమైన అంశగా నిత్యం తన కథానాయకుణ్ణి అనుసరిస్తాడన్నమాట. దీన్ని మనం "సర్వసాక్షి కథనం'' (Omnipresent narration) అంటున్నాం. సర్వసాక్షి కథనాన్ని అది వరకూ చూడని ఎత్తులకు తీసుకెళ్ళిన రచయిత దాస్తొయెవ్‌స్కీ అంటూ ఈ ఉపోద్ఘాతం రాసిన కీత్‌ కరబైన్‌ ఇలా రాశారు:

"This astonishing, shifting formulation as the (subjective) author's point of view fades into the more abstract and detached 'ominiscient being', and then in a doubling back tethers the omniscient author to the hero's side, foreshadows, as we shall see, the lineaments of a revolutionary 'new form' in the history of the novel—one that is central to the novel's power and scope and to its direct grasp upon its readers."

"నవలా చరిత్రలోనే విప్లవాత్మకమైన'' ఈ కొత్త శిల్పం గురించి కీత్‌ ఇచ్చిన వివరణ ఇది:

సర్వసాక్షి కథనానికి దాస్తొయెవ్‌స్కీ దిద్దిన కొత్త మెరుగేంటో ఈ నవల తొలి వాక్యం లోనే కనిపిస్తుంది: "జూలై తొలి రోజుల్లో బాగా ఉక్కపోతగా ఉన్న ఓ సాయంత్రం, ఒక యువకుడు ఎస్‌. ప్లేస్‌లో తను అద్దెకుంటున్న ఇరుకైన గది లోంచి బయటకు వచ్చి, నెమ్మదిగా, ఏదో తటపటాయిస్తున్నట్టు, కె. బ్రిడ్జి వైపు నడవసాగాడు.'' ఈ వాక్యంలో కథకుడు మనకు తెలిసిన సర్వసాక్షి కథకుడే. ఈ సర్వసాక్షి కథకుడు ఇక్కడ తన ప్రధాన పాత్రకు ఒక స్థలాన్ని (ఇరుకు గది, ఎస్‌. ప్లేస్‌), ఒక కాలాన్ని (ఉక్కపోత సాయంత్రం, జూలై తొలిరోజులు) ఇస్తున్నాడు. పాత్ర గురించి అంతా అథారిటేటివ్‌గా చెప్తున్నాడు. కాని, "ఏదో తటపటాయిస్తున్నట్టు'' అన్న పదాల్లో మాత్రం తన అథారిటీని తగ్గించుకుని, అనిశ్చితిని, సందిగ్ధతను వ్యక్తం చేస్తున్నాడు. ఈ అనిశ్చితే దాస్తొయెవ్‌స్కీ సర్వ సాక్షి కథనానికి దిద్దిన కొత్త మెరుగు: "Dostoyevsky is the first novelist to have fully accepted and dramatized the principle of uncertainity or indeterminacy in the presentation of character." ఇక్కడ రచయితగా దాస్తొయెవ్‌స్కీ తను చిత్రీకరిస్తున్న రస్కోల్నికోవ్‌ పాత్రపై తనే సందిగ్ధత వ్యక్తం చేయడం ద్వారా అతని అస్తవ్యస్త మానసిక స్థితిని మనకు సూక్షంగా తెలియజేస్తున్నాడు.

రోగంతో బాధ పడుతూ, తనకు అత్యవసరంగా డబ్బులు అవసరమై కూడా, కేవలం నిర్మాణం సరిగ్గా కుదరలేదన్న కారణంగా సగం రాసిన నవలని కాల్చి పడేసేడంటే, రచన పట్ల దాస్తొయెవ్‌స్కీ తపన నన్ను చాలా హత్తుకుంది. అంతేకాదు, ఒక కథ తనకు కావాల్సిన శిల్పాన్ని ఎంత తీవ్రంగా డిమాండ్‌ చేస్తుందో, ఆ డిమాండ్‌ని అందించడానికి రచయితకు ఎంత ఓపిక, ఎంత ఆలోచన ఉండాలో ఈ వృత్తాతం చాలా చక్కగా చెప్తుంది. కథకు సంబంధించినంత వరకూ వస్తువే విధానాన్ని నిర్దేశిస్తుంది. తన వస్తువును సమర్థవంతంగా చిత్రీకరించడం కోసం ఏకంగా ఒక కొత్త నేరేటివ్‌ విధానాన్నే తయారు చేసుకోగలిగాడు దాస్తొయెవ్‌స్కీ. నిజానికి విధానంతో పోలిస్తే వస్తువు విలువ చాలా స్వల్పం. చరాచర సృష్టిలో కథకు దేన్నైనా వస్తువుగా ఎన్నుకోవచ్చు. కాని విధానమే దానికి విలువను ఆపాదించేది. అయితే "form" presupposes a "material" కాబట్టి అంతవరకే వస్తువు విలువ.

October 26, 2008

ప్రిమెచ్యూర్‌ నొస్టాల్జియా

ఇవాళెందుకో రాయాలనిపిస్తోంది. ఏదో ఒకటి రాయాలనిపిస్తోంది. బహుశా బాధ వల్లననుకుంటా. "కుంగ్‌ఫూ పాండా'' సినిమాలో ఆ పాండా గాడంటాడు, "I eat when I am upset'' అని; అలాగే "I write when I am upset'' అనుకుంటా. ఎందుకు అప్‌సెట్‌ అన్నది అప్రస్తుతం. రాయడం మాత్రం ఓ తక్షణావసరం. దురదొచ్చినప్పుడు కారణాలు వెతకం, గోక్కుంటామంతే. ప్రస్తుతం ఈ రాయాల్సిన అవసరమూ అలాంటిదే. ఇది లోపల్నించీ ఉధృతంగా తన్నుకొస్తున్న తోపుడు. ఎందుకో ఈ మధ్య నాలో ఇలా చాలా తోసుకు వస్తున్నాయి. "మమ్మల్నీ కాస్త పట్టించుకోరా మగడా'' అంటూ సవాలక్ష విషయాలు నా అంతర్నేత్రం ముందు కుప్పి గంతులేస్తున్నాయి. బహుశా ఆడియన్స్‌ ఎవరూ లేరనుకోవడం వల్ల వచ్చిన ఉత్సాహమనుకుంటా.

మామూలుగా అయితే నాకేదన్నా బాధ కలిగితే చౌదరిగాడి సహాయం తీసుకుంటాను. అలాగని వాడితో నా బాధలేం చెప్పేయను; వాడి మాటలు (ఇంకా కాస్త ప్రేమగా చెప్పాలంటే "వాగుడు'') వింటానంతే; బాధంతా హుష్‌కాకీ అయిపోతుంది. ఇప్పుడు వాడిక్కడ లేడు. కాబట్టి అక్షరాలే దిక్కు. సరే, ఏం రాయాలి? పోయి పోయి కష్ట పెట్టే విషయాన్ని గురించే రాస్తే ఆరిపోతున్న కుంపటిని పుల్లెట్టి మరీ కెలికినట్టుంటుంది. మళ్ళీ బాధ రాజుకుంటుంది. కాబట్టి ససేమిరా దాని జోలికి పోకూడదు. నాకో అమ్మాయి చెప్పింది: మనల్నేదన్నా బాధ పెడ్తూంటే మనం అంతకన్నా పెద్ద బాధ సృష్టించు కోవాలంట. పెద్ద గీత ముందు చిన్న గీతలాగా మొదటి బాధ తగ్గిపోతుందట. ఈ లాజిక్కేంటో నాకు అర్థం కాలేదు. అయినా ఇప్పుడంతకన్నా మరో దారి కనిపించడం లేదు. అందుకే, ఉత్త పుణ్యానికి ఇప్పుడో పెద్ద బాధ నా నెత్తిన వేసుకుందామనుకుంటున్నాను. బాధంటే ఆషామాషీ బాధ కాదు, "మన సంస్కృతి'' గురించిన బాధ.

No, not for the heck of it. ఏదో ఒకటి నెత్తిన వేసుకోవాలి కదా అని వేసుకుంటున్నది కాదు. నిజంగా ఇది నన్ను కొద్ది రోజులుగా బాధ పెడతోంది. అంటే మరీ మొదటి బాధంత ఉధృతమైంది, వ్యక్తిగతమైందీ కాదు; గుండెల్లో ఏదో అగ్నిపర్వతం ఆగి ఆగి లావా కక్కుతున్నట్టనిపించే బాపతు భారీ బాధ కాదు. ఇది వేరే రకం. ఈ బాపతు బాధలు మనిషిని ఉక్కిరి బిక్కిరి చేసేయవు. ఆలోచనల పొలిమేరల్లోనే తచ్చాడుతూ ఆదమరిచి ఉన్నప్పుడు చిలిపిగా ఓ పోటు పొడిచి వెళిపోతుంటాయి. అసలు "మన సంస్కృతి''కి ఇప్పుడు నన్ను పోటు పొడవాల్సినంత అవసరమేమొచ్చింది? నాకీ మధ్యన నా బ్లాగు "ఎబౌట్‌ మీ''లో చేర్చడానికి రోజుకొక విశేషణం తడుతోంది. ఇప్పుడే మరొకటి తట్టింది. దానికి "hopelessly neurotic'' అని కూడా చేర్చాలి. అందుకే ఇలా పిసరంత విషయాల్ని కూడా పీక్కుని లాక్కుని కొండంత చేసుకుంటుంటాను. ఇప్పుడు నా బాధకి వెతగ్గా వెతగ్గా మూడు మూలాలు కనిపిస్తున్నాయి: 1) అట్లతద్ది 2) నా కొలీగ్‌తో సంభాషణ 3) తిలక్‌ కవిత. అయితే నా బాధకు నేనీ మూలాలపై పూర్తి దోషం ఆరోపించలేను. అసలు ఈ మూడింటికీ పరస్పర సంబంధం ఉందో లేదో కూడా తెలీదు. బాధ వీటి వల్ల కాదు. ఇవి నాలో రేకెత్తించిన ఆలోచనల వల్ల. ఇప్పుడు నేనా ఆలోచనల్ని పదాల్లోకి జల్లెడ పట్టొచ్చు, పట్టలేకపోవచ్చు; కానీ ప్రయత్నమైతే చేయాలనుకుంటున్నాను.

కొన్ని రోజుల క్రితం అట్లతద్ది పండగ జరిగింది. ఎక్కడ జరిగిందని గట్టిగా అడిగితే, బహుశా, కేలెండర్లలోనే జరిగిందని సమాధానం చెప్పాలేమో. ఆ రోజు అట్లతద్ది అని నా క్కూడా తెలీదు. మా కొలీగ్‌ ఒకావిడ చెప్తే తెలిసింది. రాత్రి ఫోన్ చేసినపుడు మళ్ళా అమ్మ గుర్తు చేసింది. అమ్మమ్మ యధావిధిగా అట్లు, పానకం తయారు చేసిందట. పానకం అన్న మాట చెవిన పడగానే తియ్యగా నోరూరింది. కానీ ఆ "అట్లతద్ది'' అన్న పదం ఇక్కడ ఈ నగరంలో దారుణంగా విలువ కోల్పోయినట్టనిపించింది. చాలా పరాయి పదంలా ధ్వనించింది. పొలంగట్లపై చెట్టాపట్టాలేసుకు తిరిగిన బాల్య స్నేహితుణ్ణి సంవత్సరాల విరామం తర్వాత, హఠాత్తుగా, స్కైస్క్రేపర్ల మధ్య చూస్తే ఎలా ఉంటుంది? వాడెంత పరాయిగా అనిపిస్తాడు? — కానీ బహుశా ఇది అర్థం పర్థం లేని పోలిక. మనిషి వేరు, పదం వేరు. మనిషి స్థల కాలాల స్వభావాన్ని (జ్ఞాపకాల్లో తప్ప) తనలో నిలుపుకోలేడు. అంతా వెనక వదిలేయాల్సిందే. ఏ స్థలానికి ఆ స్థలం, ఏ కాలానికి ఆ కాలం అతణ్ణి లొంగదీస్సుకుంటుంది. లొంగిపోవాలి కూడా, తప్పదు. కాదని మొండికేస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది—స్టార్‌ హోటల్‌ రెస్టారెంట్‌లో చేత్తో తినడం లాగా, ఫేడెడ్‌ జీన్సుల మధ్య బెల్‌బాటమ్‌ లాగా. కానీ "అట్లతద్ది'' అనేది ఓ పదమే కదా. దానికేం తెలుసు పాపం స్థల కాలాల్తో పాటూ పరిణామం చెందాలని. అందుకే, దేనికీ లొంగని మొడితనంతో, నాలో కొన్ని బాల్యపు జ్ఞాపకాల్ని కెలికి వదిలేసింది.

అట్లతద్ది అంటే ఆలమూరులో కొన్ని వేకువ జాము ఉదయాలు గుర్తొస్తాయి నాకు. బయట ఆడవాళ్ళ కేరింతల వల్ల పెందలాడే మెలకువ వచ్చేసేది. ఆ కేరింతల్లో అమ్మ గొంతూ ఉండేది. అమ్మ చీకటి పోకుండానే లేచి చుట్టు ప్రక్కల ఆడవాళ్ళతో కలిసి ఏవో ఆటలాడేది. కానీ వాళ్ళు ఆడే ఆటలేంటో నాకు అప్పుడూ తెలీదు, ఇప్పుడూ తెలీదు. ఎందుకంటే, మేం లేచేటప్పటికే ఆ ఆటలు దాదాపు ముగింపుకొచ్చేసేవి. ఒకవేళ తొందరగానే లేచినా అమ్మ మమ్మల్ని ఆ ఆటల్లో చేరనిచ్చేది కాదు. ఆడవాళ్ళు కొన్ని విషయాల్లో మగవాళ్ళని ఊరికే బయటకు నెట్టేస్తుంటారు; బహుశా ఇది అలాంటి ఓ అర్థం పర్థం లేని విషయమనుకుంటా. అయితే అమ్మ అలా చిన్నపిల్లలా ఆడుకోవడం భలే ఉండేది.

అట్లతద్దికి మరో విశేషం ఉయ్యాళ్ళు. ఆలమూరు మధ్యలో ఒక చెరువుండేది. చెరువు చాలా పెద్దది. చెరువుకు తూర్పు దిక్కున మా "చిన్నబడి'', దాని ప్రక్క ఓ రావిచెట్టు; పడమట దిక్కున మొక్కల్తో, తుప్పల్తో, కొబ్బరి చెట్లతో, మధ్య మధ్య పాముల పుట్టల్తో నిండిన ఖాళీ ప్రదేశం; ఉత్తరాన సంతోషిమాత గుడి, చిన్న పార్కు; దక్షిణాన ఊరివాళ్ళ తాటాకు గుడిసెలు, మట్టిగోడల పెంకుటిళ్ళు ఉండేవి. అట్లతద్దికి కొన్ని రోజుల ముందు నుంచే మా బడి పక్కన ఉన్న రావి చెట్టుకు పండగ కళ వచ్చేసేది; అట్లతద్ది ఉయ్యాళ్ళు కట్టేది దానికే. ఆ చెట్టు విశాలమైన ఖాళీ స్థలంలో, మొత్తం ఆకాశాన్ని కప్పేస్తూ చాలా పెద్దదిగా ఉండేది. దాని కొమ్మలకి బలమైన తాళ్ళతో ఉయ్యాళ్ళు కట్టేవారు. అవి చాలా పొడవైన ఉయ్యాళ్ళు. వాటిలో ఊగడం ఆడవాళ్ళ వంతైతే, వాటిని ఊపడం మగవాళ్ళ వంతు. ఉయ్యాల ఊపడానికి ఓ పద్ధతి ఉండేది. ఆ ఉయ్యాల పీటకి కట్టి ఓ పొడవాటి తాడు క్రిందకు వేలాడుతూండేది. ఊపేవాళ్ళు తమ తలల మీంచి ఉయ్యాల వెనక్కి పోగానే, ఆ తాడుని రెండు చేతుల్తో దొరక పుచ్చుకుని, ఉయ్యాల ఉధృతంతో పాటూ గాల్లో కొంత పైకి లేచి, మళ్ళా క్రిందకు బలంగా గుంజేవారు. ఈ గుంజుడు ఎంత బలంగా ఉండేదంటే, కొమ్మని కేంద్ర బిందువుగా చేసుకుని ఉయ్యాల ఓ భారీ లోలకంలా ఇంచుమించు 180 డిగ్రీల కోణంలో ఊగేది. అయితే ఇక్కడో ప్రమాదం ఉంది. ఉయ్యాల కడ కంటా సాగినపుడు ఊగేవాళ్ళు సరిగ్గా చెరువు మధ్యకొస్తారు. ఏ మాత్రం పట్టు జారినా చెరువులోకెళ్ళి పడతాం. కానీ అదెవర్నీ భయపెట్టేది కాదు. నిజానికి ఆ ప్రమాద సూచన ఉయ్యాల ఊగడంలో కాస్త సాహసపు ఎలిమెంట్‌ని కూడా జత చేసి ఆ అనుభవాన్ని మరింత పసందుగా మార్చేదనుకుంటా. పరికిణీవోణీ లేసుకున్న ఆడవాళ్ళు భయం బిగబట్టిన మొహాల్తో ఉయ్యాల ఊగుతుంటే, వాళ్ళ చేత ఎలాగైనా వెర్రికేకలు పెట్టించాలన్న ఉత్సాహంతో అబ్బాయిలు మరింత రెచ్చిపోయి ఊపేవారు. అయితే అమ్మాయిలు వెర్రి కేకలు పెట్టడంలో కూడా ఏదో ముచ్చటైన ఆడతనాన్ని చూపించేవారు. సాధారణంగా అబ్బాయిలెవ్వరూ ఉయ్యాల ఊగేవారు కాదు. అప్పటికి మేమింకా పదేళ్ళలోపు వాళ్ళం కాబట్టి మాకు మినహాయింపు నిచ్చారనుకుంటా. నేను ఎప్పుడూ ఒక్కణ్ణీ ఊగలేదు. మొదటిసారి నా పైతరగతి వాడెవడో నన్ను వళ్ళో కూర్చోపెట్టుకోవడం గుర్తుంది. ఇద్దరం ఎదురుబొదురుగా కావలించుకుని పీట మీద కూర్చున్నాం. ఊపడం మొదలుపెట్టారు. మొదట కాసేపు మాత్రమే పరిసరాల అవగాహన ఉంది. కాసేపు మాత్రమే క్రింద దూరమై దగ్గరవుతున్న భూమిని కళ్ళు తెరిచి చూడగలిగాం. తర్వాత వాణ్ణి నేనూ, నన్ను వాడూ కరిచి పట్టుకుని కళ్ళు మూసేసుకున్నాం. వడి ఎంతగా పెరిగిపోయిందంటే, ఇంకాస్త పెరిగితే మా ఉయ్యాల వెళ్ళిందారిన మళ్ళీ వెనక్కి రాకుండా పైకిపోయి ఆ కొమ్మకి గుండ్రంగా లుంగలు చుట్టేసుకుంటుందేమోనని భయమేసింది. చెవుల్ని ఝమ్మని ఒరుసుకుపోయేగాలి, రావి ఆకుల గలగలలు, భూమ్మీద దగ్గరవుతూ దూరమవుతూ వినిపిస్తున్న జనం కోలాహలం . . . ఉయ్యాల ఆగేకనే జారిపోయిన గుండె తిరిగి యధాస్థితికి వచ్చి చేరేది. ఉయ్యాల దిగిన కాసేపటి వరకూ భూమి కూడా ఉయ్యాలూగుతున్నట్టు అనిపించేది. ఈ సంబరం చల్లారేకా ఇంటికి వెళ్తే బెల్లం తీపి, మిరియాల ఘాటు కలిసిన రుచితో పానకం, అందులో ముంచుకుని తినడానికి బోలెడన్ని అట్లు. ఈ సంరంభం అంతా చూస్తే, అట్లతద్ది ఏడాదిలో వచ్చే ఏ పండక్కీ తీసిపోదనిపించేది. అట్లతద్దనే కాదు; నాగుల చవితి, సుబ్రహ్మణ్యషష్టి, రథ సప్తమి, శివరాత్రి . . . ఇలా ఇప్పుడు కేవలం కేలండర్‌కి మాత్రమే పరిమితమైపోతున్న చాలా పండగలు, ఆ వూళ్ళో నా చిన్నతనంలో చాలా ఘనంగా జరిగేవి. ప్రతీ పండగకీ ఏదో ఒక అందమైన తంతు ఉండేది. ఊరంతా అందులో మునిగి తేలేది.

నాగుల చవితికి పాముల పుట్టల్లో పాలు పోసేవారు. పాముల పుట్టలు నేనిందాక చెప్పిన చెరువుకే ఆవలిగట్టున ఉండేవి. తుప్పలు, పిచ్చిమొక్కల మధ్య ఉండే వాటి దగ్గరకు కాలిబాటమ్మటా నడుస్తూ వెళ్ళాలి. పొద్దున్నే ఆడవాళ్ళు కొత్త బట్టల్తో, మెడ క్రింద గంధపు పూతల్తో, పండగ కళ నిండిన మొహాల్తో, చెంబుల్లో పాలు తీసుకుని వచ్చేవారు. పుట్ట కన్నాల్లో కొంతమంది పాలుపోసేవారు, కొంతమంది గుడ్లు జారవిడిచేవారు. వాళ్ళలా గుడ్లు వేసి వెళ్ళగానే—కూర వండుకోవటానికి అనుకుంటా—కొంతమంది కుర్రాళ్ళు కన్నాల్లో చేతులు పెట్టి గుడ్లు బయటకు తీసి పట్టుకెళిపోయేవారు. ఆ పుట్టల్లో పాములుండటం నేను ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడింకో జ్ఞాపకం రాజుకుంటోంది. ఈ పుట్టల దగ్గరకు వెళ్ళే దారిలోనే నేను మొట్ట మొదటి సారి అత్తిపత్తి ఆకుల్ని చూసింది. ముట్టుకోగానే భలే ముడుచుకుపోయేవి. అప్పుడు నా కూడా ఎవరున్నారో గుర్తులేదు గానీ, ఓ రోజు మధ్యహ్నమంతా కూర్చుని ఆ దారిలో ఉన్న అత్తిపత్తి మొక్కలన్నింటినీ ముడుచుకుపోయేలా చేసాం.

సుబ్రహ్మణ్య షష్టి ఆలమూరులో కన్నా తాతయ్య వాళ్ళ ఊరు అంగరలో బాగా జరిగేది. ముఖ్యంగా తీర్థం చాలా ఘనంగా జరిగేది. గుడి దరిదాపుల్లో ఉన్న వీథులన్నీ కళ్ళకింపైన సందడితో కళకళలాడేవి. బుడగలు, వేణువులు, కమాను వాయిద్యాలు, రంగురంగుల ప్లాస్టిక్‌ కళ్ళ జోళ్ళు, బుల్లి తుపాకులు, బుల్లి కార్లు, బుల్లి బయోస్కోపులు, దేవుళ్ళ పటాలు, విగ్రహాలు, ఇలా ఎటుచూడు రంగులే! వీటి మధ్య ఖర్జూరం, జీళ్ళ కొట్లు తప్పనిసరిగా ఉండేవి. జీళ్ళ కొట్లంటే గుర్తొస్తోంది. ఏదో బేరమాడటానికన్నట్టూ కొట్టు ముందుకెళ్ళే వాళ్ళం. కొట్టు ముందు బల్ల మీద మా తలంత ఎత్తులో జీళ్ళు గుట్టలుగా పోసి ఉండేవి. కొట్టువాడు మేకు కేసి జీడి పాకం సాగదీసే పనిలో పరాకుగా ఉండటం చూసి, చేతికందినన్ని జీళ్ళు నొక్కేసి జేబులో వేస్సుకునేవాళ్ళం. జేబులో డబ్బులున్నా సరే, కొనే తాహతున్నా సరే, ఇలాంటివేవో చేయకపోతే మా తీర్థ విహారానికి సార్థకత లభించేది కాదు. ఎందుకంటే, జీళ్ళ కన్నా ముఖ్యంగా మాక్కావల్సింది దొంగతనంలోని సాహసపు రుచి. ఈ తీర్థం జరిగినన్నాళ్ళూ ఊరి స్వభావమే మారిపోయేది. ఊరు కూడా రక్త మాంసాలు, జవజీవాలు ఉన్న సజీవాంశలా కనిపించేది. పండగలో మాతో పాటూ ఊరు కూడా పాల్గొన్నట్టనిపించేది.

ఇక రథ సప్తమి. రథ యాత్రకి ఓ రెండు వారాల ముందే రథసప్తమినాడు జనార్దన స్వామి గుడి ఎదుట పెద్ద గోడౌన్‌లో ఉంచిన రథాన్ని బయటకు తీసేవారు. ఆలమూరు జనార్దన స్వామి రథం చాలా పెద్దది. రథ యాత్రప్పుడు అడ్డం రాకుండా కరెంటు తీగల్ని కూడా కత్తిరించేవారు. అది గోడౌన్లో ఉన్న సంవత్సర కాలమూ దాంట్లో పావురాలే నివాసం ఉండేవి. దాంతో బయటకు తీసేసరికి రథమంతా వాటి రెట్టల్తో నిండిపోయి ఉండేది. బయటకు తీసి శుభ్రంగా కడిగి సిద్ధం చేసేవారు. రథం అలా బయట ఉన్న రోజులంతా బడి అయిపోయిన తర్వాత పిల్లలందరం అక్కడికే చేరేవాళ్ళం. రథమెక్కి ఆడుకునే వాళ్ళం. రథం మొత్తం ఐదంతస్థులుగా ఉండేది. క్రింద నుండి పైకి పోయే కొలదీ అంతస్తుల ఎత్తు తగ్గేది. పెద్ద వాళ్ళు పై అంతస్తుల్లోకి రావలంటే పాక్కుంటూ రావాల్సిందే. చిన్న వాళ్ళం కాబట్టి సులభంగా జొరబడిపోయి ఆడుకునే వాళ్ళం. దొంగ - పోలీసు లాంటి ఆటలు ఆడటానికి అది భలే చోటు. ఏ అంతస్తులో దాక్కున్నామో తెలుసుకోవడానికి పోలీసు చాలా కష్టపడాలి. తెలుసుకున్నా ముట్టుకోవడం కష్టమే. ఆ రథం నిర్మాణం అంతా ఓ labyrinth లా ఉండేది.

ఇక శివరాత్రికైతే శివాలయం దగ్గర మరో సందడి: దేవాలయం ఆవరణలో "భక్త జన సందోహాన్ని'' ఉద్దేశించి మైకు చేసే హడావిడి; సీతాకోకచిలకలు బారులు తీరినట్టూ చంచలమైన వరుసలో పరికిణీవోణీలు, పంజాబీలు, చీరలు; కర్పూరం, అగరబత్తుల వాసన; కొబ్బరికాయలు పెఠేల్మని చిట్లుతున్న చప్పుడు; తల మీద శఠగోపం మెత్తని స్పర్శ, గర్భగుడి ఎదుటనున్న నంది నెత్తి మీద చూపుడు వేలు, బొటన వేలూ గోపురం కట్టి మధ్య నుంచీ చూస్తే అభిషేకాలందుకుంటున్న లింగ దర్శనం; రాత్రైతే ఆలయం ముందు ప్రదర్శించే నాటకాల్ని చూస్తూ జాగారం . . . . ఓ బాల్య మిత్రురాలి సాంగత్యం గుర్తొస్తోంది. నంది వర్థనం పూల చెట్టు క్రింద ఆమెతో ఉప్పుల కుప్ప ఆడిన క్షణాల్లోనే అనుకుంటా, స్త్రీత్వంతో నా జీవిత కాలపు ప్రణయానికి తొలి ముహూర్తమెక్కడో పడిపోయింది. ఇప్పటికీ నా మెదడులో నంది వర్థనం పూలకీ ఆమె జ్ఞాపకానికీ ఆ లంకె అలాగే ఉండిపోయింది. ఆ పువ్వుని గట్టిగా వాసన పీలిస్తే చాలు, నా లోపల ఆమె జ్ఞాపకం ప్రాణం పోసుకుంటుంది. అహ! వాసన కూడా పీల్చక్కర్లేదు, ఇక్కడ కారు టైర్ల క్రింద చితికి చిధ్రమైపోయి జాలిగా ఛస్తున్న ఓ పువ్వుని చూసినా చాలు, ఎందుకో ఆమె గుర్తొస్తుంది. చాలా చిత్రం కదూ! వర్తమానంలో, ఈ క్షణాల్లో, మనం ఏవి ముఖ్యమనుకుంటామో అవేమీ మన వెంటరావు. నిజంగా ఏవి ముఖ్యమో ఆ క్షణాల్ని పరాకుతోనే దాటేస్తాం. కాని మన జ్ఞాపకం మనకే తెలియకుండా అన్నింటినీ వడగట్టి, తనకు విలువైనవేవో ఏరుకుని, చాలా జాగ్రత్తగా పదిలపరచుకుంటూ వస్తుంది. పరీక్ష గెలిచిన రోజో, ఉద్యోగంలో పదోన్నతి దొరికిన రోజో గుర్తుండిపోతాయనుకుంటాను; కానీ, బస్టాండ్‌లో దక్కించుకున్న వాలు కంటి చూపులో, గోదావరి ఇసుక తిన్నెల్లో కొట్టిన పల్టీలో మాత్రమే గుర్తుంటాయి.

ఇంతకీ ఈ అట్లతద్ది జ్ఞాపకాలు నన్ను బాధ పెట్టాయంటే నేను స్థల కాలాలు రెండింటిలో స్థలాన్ని తప్పు పట్టలేను; కాలాన్నే తప్పు పట్టాలి పడితే. నేను ఇప్పుడు హైదరాబాదులో కాక ఆలమూరులోనే ఉన్నా, ఆలమూరులో అట్లతద్ది ఉండకపోవచ్చు. అసలా రావి చెట్టు ఉందా కొట్టేశారా అన్నదీ అనుమానమే. అట్లతద్దనే కాదు, నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్టి ఇలా చాలా అందమైన పండగలన్నీ కేలెండర్లలోనే మిగిలిపోతున్నాయి. ఎందుకు వదిలేస్తున్నాం వీటన్నింటినీ? ప్రపంచీకరణ జరుగుతోంది, అంతా ఏకమైపోతోంది, ఇలా కొన్ని వదిలేయక తప్పదంటారు సరే. కానీ, నాకు తెలిసి, ఆ సంగమ స్థలికి అందరూ తమ తమ సంస్కృతుల్ని వెంటబెట్టుకునే వస్తున్నారు. హాలోవిన్లు, టమాటా ఫెస్టివల్లూ, బీటిల్సూ, వాల్ట్‌విట్మానూ, కామిక్‌ బుక్సూ, బుల్‌ ఫైటింగులూ, అందరూ అన్నీ తమ కూడా తెచ్చుకుంటున్నారు. మనమే అన్నీ వెనక విడిచేసి వస్తున్నాం. ఈ ప్రపంచీకరణ అన్న గోదాలోకి అందరూ ఘనమైన సంస్కృతుల దన్నుతో గర్వంగా వచ్చి చేరుతుంటే, మనమే సంస్కృతిలేని అనాధల్లా బేల మొహాల్తో హాజరవుతున్నాం. నేనిక్కడ "ఎందుకు?'' అని ప్రశ్నించటం లేదు, "అయ్యో ఎందుకిలా'' అని బాధపడుతున్నానంతే. డార్విన్‌ 'నేచర్‌ సెలక్షన్‌ థియరీ'నే ఇక్కడా అన్వయించుకోవాలేమో: ప్రకృతి తన పురోగమనానికి అనుకూలమైన సంస్కృతుల్ని ఎన్నుకొని, మిగతా వాటినన్నింటినీ నిర్దాక్షిణ్యంగా చిదిమేస్తుందేమో. బాధే అయినా ఇది అంగీకరించక తప్పదేమో. అయినా బాధ పడటమే ఇక్కడి నా ఉద్దేశ్యం కనుక బాధ పడుతున్నాను.

ఇక నన్ను బాధ పెట్టిన రెండో కారణం, ఇటీవల నా కొలీగ్‌ నాతో మాట్లాడిన కొన్ని మాటలు. ఆయనకో యాభయ్యేళ్ళుంటాయి, మంచి రచయిత, పదాలతో బొమ్మ కట్టించడం అంటే సరదా పడతాడు. మా సంభాషణ తెలుగు భాష గురించి సాగింది. వాళ్ళ ఇరవై రెండేళ్ళ అబ్బాయికి ఐ.బి.ఎం లో ఉద్యోగం. ఆ కుర్రాడు తెలుగు కేవలం మాట్లాడగలడు; చదవడం, రాయడం రాదు. ఆయన ఈ విషయంలో కాసేపు బాధ పడ్డాడు. తర్వాత తేరుకుని, ఇంచుమించు ఈ అర్థం వచ్చేట్టు మాట్లాడాడు: "అయినా ఏం ఫర్లేదు ఫణీ! మా తరం అయిపోయింది. తెలుగు పూర్తిగా లేకపోవడమన్నది మేము చూడం. మేము చూడాల్సినవన్నీ చూసేసాం. శ్రీశ్రీని చూసాం, తిలక్‌ని చూసాం. శ్రీశ్రీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడంటే ఆడవాళ్ళు వంటి మీద నగలు ఒలిచి ఇచ్చేయడం కూడా ఈ కళ్ళతో చూసాన్నేను. దేనికి విలువ అందాలో దానికి విలువ అందిన కాలం మాది,'' అంటూ ముగించాడు. నాకు వెంటనే కడుపులో ఖాళీ ఏర్పడిపోయి నేను లోపలికి కుంచించుకుపోతున్న భావన కలిగింది. ఏమని పేరు పెట్టాలి, అప్పటి నా భావనకు? మనం ఎప్పుడో బతికిన గతం గురించి ఆపేక్ష పడటాన్ని "నోస్టాల్జియా'' అనొచ్చు. కాని మనకెప్పుడూ పరిచయమే లేని గతం పట్ల ఆపేక్ష కలిగితే, దాన్నేమనాలి? నాకు నిజంగా ఆ కాలం పట్ల ఆపేక్ష కలిగింది. ఇక్కడ కాక, అక్కడ బతికుంటే బాగుండేదనిపించింది. ఆ కాలం . . . ఏ సంక్లిష్టతలూ లేని కాలం . . . నాకిప్పుడు "ఐ విష్‌ ఐ వజె ఫంక్‌ రాకర్‌'' పాట వరసలు గుర్తొస్తన్నాయి:

When the head of state didn't play guitar
Not everybody drove a car
When music really mattered and when radio was king
When accountants didn't have control
And the media couldn't buy your soul
And computers were still scary and we didn't know everything

Oh I wish I was a punk rocker with flowers in my hair
In seventy-seven and sixty-nine revolution was in the air
I was born too late into a world that doesn't care
Oh I wish I was a punk rocker with flowers in my hair

అఫ్‌కోర్స్‌, తల్లో పూలు అక్కర్లేదు, పైగా నేను పాడితే గాడిదలు వంతపాటకి సిద్ధమౌతాయి. ఇవన్నీ కాదు గానీ, ఆ కాలంలో నిజంగానే ఏదో ఉంది; ఈ కాలంలో లేనిది. ఆ కాలంలో మెయిన్‌ స్ట్రీమ్‌ లైఫ్‌ నచ్చకపోతే పక్కకి వెళిపోయి అవుట్‌సైడర్‌గా బతికే సౌలభ్యం ఉంది. ఈ వెధవ కాలంలో చివరకు సమాజానికి అవుట్‌ సైడర్‌గా బతకాలన్నా చాలా కష్టం. ఎందుకంటే, ఇక్కడ అవుట్‌ సైడర్లకీ, బొహేమియన్లకీ కూడా ప్రత్యేకమైన సమాజాలున్నాయి. వాళ్ళకోసం ప్రత్యేకమైన ఉత్పత్తులున్నాయి. వాళ్లకు టీ-షర్టులు, చిరిగిన జీన్సులు, చెదిరిన క్రాఫుల్లాంటి ప్రత్యేకమైన ఎటిక్వెటీ, వాళ్ళనుద్దేశించి ప్రత్యేకంగా సినిమాలు, పాటలు, పాషన్లు . . . ఇలా వాళ్ళ మీద ఆధారపడి భారీ ఉత్పత్తి జరుగుతుంది. వరకడ్డంగా బతికేస్తున్నామని సంబరపడిపోయేవాళ్ళు కూడా చివరకు వినియోగదారుల మందలో మరో గొర్రెగానే మిగులుతారు.

మొన్నా మధ్య "రావిశాస్త్రి రచనా సాగరం'' పుస్తకాన్ని కొన్నాను. పుస్తకం మొదట్లో 1935 నుండీ 1941 వరకూ రావిశాస్త్రిగారు తన టీనేజ్‌లో రాసుకున్న డైరీ ఎంట్రీలు ముద్రించారు. అవి చదువుతున్నప్పుడూ నాలో అదే నోస్టాల్జియా లాంటి భావన. ఆ డైరీల నుంచి మచ్చుకు కొన్ని రాండమ్‌ ఉదాహరణలు:

ఆదివారం, 1934 - సెప్టెంబరు 29: ఇవాళ పొద్దున్న ఏడున్నర గంటలకి లేచాను. యుద్ధం వొస్తే ఈ ఊరు మీద కూడా బాంబులు వేస్తారని అనుకుంటున్నారు. కొలువులో గవ్వల్తో తేళ్ళు చేసేను. రోడ్డు అదీ వేసి మనుష్యుల్ని బళ్ళనీ వాట్నీ పెట్టేను. చాలా పెద్ద వర్షం పడింది. పొద్దున్న, 'ది స్కూల్‌ బోయ్‌ ప్రిన్స్‌' చదివీసేను. ఇది కూడా చాలా బాగుంది. పెద్ద నాన్నగారు కాణీ ఇచ్చేరు. ఇవాళ గాన సభ ఏమీ బాగు లేదట.

సోమవారం, 1935 - నవంబర్‌ 25: సాయంత్రం కవి షష్టిపూర్తికి వెళ్లేను. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి హిందీ ప్రచారము అణచెయ్యాలని చెప్పేడు. ఉన్నవ లక్ష్మీనారాయణ దానికెగెనిష్టుగా చెప్పేడు. శివ శంకర శాస్త్రి, బుచ్చి సుందర్రావు ఎటు కాకుండా చెప్పేరు. కందాళ సర్వేశ్వర శాస్త్రి చెప్పేడు. పురిపండా అప్పల స్వామి హిందీకి ఎగెనిష్టు గానే చెప్పేడు . . . చిట్టి పొద్దున్నొచ్చి సాయంత్రం వెళిపోయింది. నాన్నగారు ఊరి నుంచి వచ్చీసేరు. జామిపళ్ళు తెచ్చేరు.

బుధవారం, 1938 - సెప్టెంబరు 7: కాలేజీకి విశ్వనాథ సత్యన్నారాయణ గారు వచ్చి ఉపన్యాసం ఇచ్చేరు. ఆంధ్ర ప్రశస్తిలోవి, కిన్నెరసానిలోవి పద్యాలు చదివేరు. చాలా బాగున్నాయి. ఇంటికి వచ్చి భోజనం చేసి బాబ్జీ కోసం క్రిష్ణ సైకిలు మీద వాల్తేరు వెళ్ళేను. వాడి స్నేహితుల కోసం వడలు, జీడిపప్పు పాకం పట్టుకొని వెళ్ళేను, వాడికిచ్చీసేను. మరో రెండు రూపాయలు కూడా ఏమైనా కొనడానికి ఇచ్చేను. మళ్ళా పందొమ్మిదో తారీఖున వస్తాడట. కోమటి వాడు తన తమ్ముడికి ఒక ఫ్యాంట్‌ ఇచ్చీమని ఇచ్చేడుట... 'వినోదిని' కొన్నాను. నా కథ పడ్డాది. బొమ్మ కూడా వేసేడు.

శుక్రవారం, 1939 - సెప్టెంబరు 1 : సుభాష్‌ చంద్రబోసు కాకినాడ వెళ్తున్నాడు. వాల్తేరు స్టేషన్‌లో విద్యార్థుల మందరం వెళ్ళి చూసేం. టిపికల్‌ బెంగాలీబాబు. అంత ఎమోషనల్‌గా మాట్లాడలేడు. జర్మనీ పోలెండుతో యుద్ధం ప్రారంభించింది. పై వారెవరైనా పోలండుని ఎదుర్కొంటే వాళ్ళకి ఇంగ్లీషు వాళ్ళు, ఫ్రెంచి వాళ్ళు సహాయం చేయడానికి ఇదివరకూ సంధి జరిగింది. ఇప్పుడేమవుతుందో తెలియదు.

శుక్రవారం, 1941 - ఏప్రిల్‌ 4 : సాయంత్రం బీచీని నేనూ దువ్వూరి నరసింహం కూర్చున్నాం. రాత్రి 'ముసాఫిర్‌' సినీమాకి వెళ్దామన్నాడతను. సరేనన్నాను నేను. కాని రాత్రి వెళ్తూ ఉంటే భాస్కర్రావు కనిపించి 'ముసాఫిర్‌' వెళిపోయిందన్నాడు. 'బంధన్‌' సినిమాకి వెళ్ళేం. కొల్లావాడు కూడా వచ్చేడు. రాత్రి భాస్కర్రావింట్లోనే పడుకున్నాను. ఇవాళ నవమి సంబరాల్లో కలియుగ పురాణం అనే వేషం చాలా బాగుంది. రాత్రి నలుగురాడవాళ్ళని సోల్జర్లు పాడు చేయబోయారట. ఒక సోల్జర్ని మన వాళ్ళు చితక తన్నీసేరట.

ఈ డైరీ ఎంట్రీలు చదువుతుంటే, ఆయన ఇందులో నమోదు చేసిన వివరాలన్నింటి నేపథ్యంలోనూ, ఆయన ప్రయత్నమేమీ లేకుండానే, ఓ ("అందమైన'' అనలేను గానీ) ఆకర్షణీయమైన కాలం రూపం పోసుకుంది; అస్పష్టంగా, ఆవిరి పట్టిన గాజు పలకకు ఆవలనున్న దృశ్యంలా, తెలిసీ తెలియకుండా నన్ను కవ్వించింది. అక్కడ బతికుంటే బాగుండుననిపించింది. ఆ కాలానికి విశిష్టత ఏంటంటే అక్కడ పట్టుకోవడానికి ఏదో ఆసరా ఉంది. జీవితాల్ని అల్లుకోవడానికి ఏదో ఆలంబన ఉంది. నేషనలిజమో, మార్క్సిజమో, నక్సలిజమో, వల్లకాడో. . . ఏదైతేనేం, ఒక యుద్ధముంది; భ్రమైతేనేం, వాళ్ళకు శత్రువులున్నారు. వాళ్ళు చాలా నమ్మకంతో, చాలా తేలికగా తమ జీవితాల్ని మిథ్యా సమరాలకు తర్పణాలుగా అర్పించేశారు. తమ జీవితాల్ని అర్థవంతంగా గడిపామన్న నమ్మకంతో ఆనందంగా చచ్చిపోయారు. వాళ్ళకా అనుకూలత ఉంది. కానీ నాకేం ఉంది? నా తరం ముందు పెద్ద ఖాళీ ఉంది. "ఫైట్‌ క్లబ్‌'' సినిమాలో టైలర్‌ డర్డన్‌ మాటల్లో చెప్పాలంటే:

"I see all this potential, and I see it squandered. God damn it, an entire generation pumping gas, waiting tables; slaves with white collars. Advertising has us chasing cars and clothes, working jobs we hate so we can buy shit we don't need. We are the middle children of history man! No purpose, no place. We have no Great War. No Great Depression. Our Great War is a spiritual war . . . our Great Depression is our lives."

అంతో ఇంతో ఇది నిజమనే చెప్పాలి. టైలర్‌ డర్డన్‌ ఒక చార్మింగ్‌ బాస్టర్డ్‌. సమస్యను చాలా బాగా ఎత్తి చూపుతాడు. కాని దానికి చూపించే పరిష్కారమే వింతగా ఉంటుంది. ప్రస్తుత యాంత్రిక ప్రపంచంలో మనల్నీ ఒక యంత్రంగా ఒదిగిపోయేట్టు సిద్ధం చేసే సోకాల్డ్‌ "సెల్ఫ్‌ ఇంప్రూవ్‌మెంట్‌'' పద్ధతుల్ని అతను వ్యతిరేకిస్తాడు. ఇలా సమస్యను అంచనా కట్టడం వరకూ బాగానే ఉంది. కాని, సమస్య "A'' అనుకుంటే, దానికి పరిష్కారం "~A'' అంటాడు. అక్కడే అతనితో ఇబ్బంది. ఇప్పుడు మనకి కావాల్సింది "సెల్ఫ్‌ ఇంప్రూవ్‌మెంట్‌'' కాదు, "సెల్ఫ్‌ డిస్ట్రక్షన్‌'' అని వాదిస్తాడు. ఇది చాలా ప్రమాదకరమైన వాదన. ఇలాంటి వాదనల ఫలితం తర్వాత్తర్వాత అమెరికాకే అనుభవానికొచ్చింది. సెప్టెంబరు 11న, ట్విన్‌టవర్స్‌ శిథిలమయ్యే కొద్ది క్షణాల ముందు, విమానం కాక్‌పిట్‌లోంచి వాటిని చివరి సారి చూసిన వాళ్ళు టైలర్‌ డర్డన్‌ లాంటి వాళ్ళే. టైలర్‌ డర్డన్‌ వినడానికి చాలా ఇంపుగా వాదిస్తాడు; అనుసరిస్తే గుడిపించేస్తాడు.

అయితే, "వ్యక్తిత్వ వికాసం'' కాదు, "వ్యక్తిత్వ విధ్వంసం'' కావాలి అన్న అతని వాదనలోని రెండో భాగాన్ని వదిలేస్తే, అతని వాదన నిజంగా సమంజసమే. ప్రస్తుతం ఒక ఉద్యమంగా చెలామణీ అవుతున్న "వ్యక్తిత్వ వికాసం'' నిజంగా ఒక జాడ్యమే. ఈ జాడ్యపు పర్యవసానాలు ఇంకా బయటపడలేదు గానీ, ఎటు చూసినా రోగ పీడితులే. ఈ ఉద్యమకారులు—మనం "ఎఫెక్టివ్‌ పీపుల్‌''గా మారడానికి ఏ 7 అలవాట్లు అలవరచుకోవాలో చెప్తారు; విజయం సాధించాలంటే ఏ 5 మెట్లు ఎక్కాలో బోధిస్తారు. ముందే పోసిన మూసల్లో సామరస్యంగా ఒదిగిపోయేలా మనకు తర్ఫీదునిస్తారు, దువ్వుతారు. ఈ వ్యక్తిత్వ వికాస పుస్తకాలన్నీ ప్రాథమికంగా ఒకే ప్రాతిపదిక మీద మొదలౌతాయి: పుస్తకం తెరిచిన చదువరి ఎలాంటివాడైనా, వాడు మారాలి. ప్రతీ మనిషికీ ఒక unique identity ఉంటుందన్న సంగతి, ఈ వైవిధ్యం సృష్టి స్వభావం అన్న సంగతి ఇలాంటి పుస్తకాలు రాసేవాళ్ళకి గుర్తుండదనుకుంటా. ఇవి విజయం సాధించడమే, లేదా "నెంబర్‌వన్‌'' కావడమే (దేవుడికే తెలియాలి అదేంటో) మనిషి జీవిత పరమార్థంగా చెప్తాయి. ఆ ప్రయాణంలో మనిషి తనమైన తనే యుద్ధం చేసుకోవాలంటాయి; తనలోని ప్రత్యేక వ్యక్తిత్వాన్ని (లేదా వాళ్ళ భాషలో "బలహీనతల్ని'') చంపేసుకోమంటాయి. ఎక్కడకో చేరుకుంటే తప్ప ఆనందం లభ్యం కాదన్న భ్రమని చాప క్రింద నీరులా పాఠకుల మనసుల్లోకి ఎక్కిస్తాయి. "లక్ష్యం'', "గమ్యం'' లాంటి పదాలు రెండు మూడు వాక్యాలకోసారి వీటిల్లో తగుల్తుంటాయి. —అయినా నేను విషయం మళ్ళుతున్నట్టున్నాను.

నా కొలీగ్‌ ఆ మాటలన్నపుడు నాకు చాలా దిగులేసింది. సగం దిగులు నేను బతకవలసిన కాలంలో బతకటం లేదనిపించడం వల్ల. మరి సగం దిగులు నా ఆలోచనలు ఈ రీతిలో సాగడం చూసి. అంటే, పాతికేళ్ళ వాణ్ణి, ఎంత తక్కువ అంచనా వేసినా ఇంకో నలభయ్యేళ్ళు నిక్షేపంలా బతక వలసిన వాణ్ణి, అప్పుడే గతం పట్ల—అది కూడా నాకు అస్సలు పరిచయమే లేని గతం పట్ల—ఆపేక్ష పడుతున్నానంటే, ఏదో తేడా ఉన్నట్టే కదా.

సరే, ఇక మూడో కారణం: ఒక తిలక్‌ కవిత. ముందు తిలక్‌తో నా స్నేహం గురించి కాస్త చెప్పుకోవాలి. మాది ఆరేళ్ళ స్నేహం. ఆరేళ్ళ క్రితం హైదరాబాద్‌ వచ్చిన కొత్తలో "అమృతం కురిసిన రాత్రి'' కొన్నాను. ఇప్పటికీ దాంతో నా స్నేహం పాతబడలేదు. పాతబడకపోవడానికి కారణం తిలక్‌ నాకు ఇప్పటికీ పూర్తిగా పరిచయం కాకపోవడమనుకుంటా. అసలెప్పటికీ పూర్తిగా పరిచయం కాడేమో కూడా. అంతా తెలిసిపోయాడనుకున్న తరుణంలో అంత వరకూ చూడని తళుకేదో చూపిస్తాడు; మళ్ళీ కొత్త కోణంలో ప్రత్యక్షమవుతాడు. తిలక్‌ ఓ పూల తోటలాంటి వాడు. పూలతోటని ఎప్పటికీ పూర్తిగా పరిచయం చేసుకోలేం. అంతా తెలిసిపోయిందనుకున్న తరుణంలో, తెల్లారి లేవగానే, ఏదో మూల ఓ కొత్త మొగ్గ కనిపించి మురిపిస్తుంది. బహుశా ఈ సాదృశ్యం కూడా సరైంది కాదేమో. ఈ సందర్భంలో కొత్త మొగ్గలు వికసించేది తోటలో కాదు; కొత్త మొగ్గలు నాలో వికసిస్తున్నాయి, వాటి ప్రతిబింబాల్నే తోటలో చూసుకుంటున్నాను.

బయటకొస్తే చచ్చిపోతానేమోననే మార్బిడ్‌ భయంతో చాలా కాలం తనను తాను ఓ ఇరుకు గదిలో బంధించుకున్న ఈ వ్యక్తి ఇలా "నవ నవాలైన ఊహా వర్ణార్ణవాల''ను ఎలా అక్షరబద్ధం చేసాడా అనిపిస్తుంది; కొన్ని పంక్తుల నిర్మాణంలో, డిగో మారడోనా "దైవ హస్తం'' లాగా, ఏవన్నా అతీంద్రియ హస్తం సహాయపడిందా అనిపిస్తుంది. ఉదాహరణకి "అదృష్టాధ్వగమనం'':

"ఇప్పటికీ ఈ చీకటి మొగలో
నిలిచి పాడుతున్న నా కోసం
కుబుసం విప్పిన గోధుమ వన్నె తాచు
మొగలి పొదల నుండి పడగ విప్పి ఆడుతుంది
ప్రాగ్దిశా సుందరి ఖండ చంద్ర పరిదీపిత కపోలాల హసిస్తుంది
నా గుండెలపై శుక్రతార కిరణం సూటిగా వచ్చి వాలుతుంది.''

కవిత చివరి పంక్తి పూర్తికాగానే నిజంగానే నక్షత్రపు మెత్తని వెలుగులాంటి మధుర భావనేదో సూటిగా వచ్చి గుండెలపై వాలిన అనుభూతి కలుగుతుంది.

ఇంతకీ నన్ను బాధపెట్టిన—సరిగ్గా చెప్పాలంటే చికాకు పరచిన—కవిత పేరు "మన సంస్కృతి''. నిజానికి దీన్ని కవిత అనే కన్నా, కవిత అనే ముసుగు తొడుక్కున్న రెటోరిక్‌ అని చెప్పొచ్చు:

మన సంస్కృతి

మన సంస్కృతి నశించిపోతూందన్న
మన పెద్దల విచారానికి
మనవాడు పిలక మాని క్రాపింగ్‌ పెట్టుకున్నాడనేది ఆధారం
మనగలిగినదీ
కాలానికి నిలబడ గలిగినదీ వద్దన్నా పోదు
మరణించిన అవ్వ నగలు
మన కాలేజీ అమ్మాయి ఎంత పోరినా పెట్టుకోదు
యుగ యుగానికీ స్వభావం మారుతుంది
అగుపించని ప్రభావానికి లొంగుతుంది
అంతమాత్రాన మనని మనం చిన్నబుచ్చుకొన్నట్లు ఊహించకు
సంతత సమన్వయావిష్కృత వినూత్న వేషం ధరించడానికి జంకకు
మాధుర్యం, సౌందర్యం, కవితా
మాధ్వీక చషకంలో రంగరించి పంచి పెట్టిన
ప్రాచేతస కాళిదాస కవి సమ్రాటులనీ,
ఊహా వ్యూహోత్కర భేదనచణ
ఉపనిషదర్థ మహోదధినిహిత మహిత రత్నరాసుల్నీ
పోగొట్టుకునే బుద్ధి హీనుడెవరు?

ఎటోచ్చీ
విధవలకీ వ్యాకరణానికీ మనుశిక్షాస్మృతికీ గౌరవం లేదని
వీరికి లోపల దిగులు
వర్తమానావర్త ఝంఝూ వీచికలికి కాళ్ళు తేలిపోయే వీళ్ళేం చెప్పగలరు?
అందరూ లోకంలో శప్తులూ పాపులూ
మనం మాత్రం భగవదంశ సంభూతులమని వీరి నమ్మిక
సూర్యుడూ చంద్రుడూ దేవతలూ దేవుళ్ళూ
కేవలం వీరికే తమ వోటిచ్చినట్లు వీరి అహమిక
ఇది కూపస్థ మండూకోపనిషత్తు
ఇది జాతికీ ప్రగతికీ కనబడని విపత్తు
మన వేషం, మన భాషా, మన సంస్కృతీ,
ఆది నుండీ, ద్రవిడ బర్బర యవన తురుష్క హూణుల నుండీ,
ఇచ్చినదీ పుచ్చుకున్నదీ ఎంతైనా ఉన్నదనీ
అయిదు ఖండాల మానవ సంస్కృతి
అఖండ వసుధైక రూపాన్ని ధరిస్తోందనీ,
భవిష్యత్‌ సింహ ద్వారం
తెరుస్తోందనీ,

గ్రహించలేరు పాపం వీరు
ఆలోచించలేని మంచి వాళ్ళు
ఏ దేశ సంస్కృతి అయినా ఏనాడు కాదొక స్థిర బిందువు
నైక నదీ నదాలు అదృశ్యంగా కలిసిన అంతస్సిధువు.

- 1965

అసలే పై రెండు బాధలతో అచేతనంగా సతమతమవుతున్న నన్ను ఈ కవిత ఇన్నాళ్ళూ లేనిది ఎందుకో కాస్త రెచ్చగొడుతున్నట్టనిపించింది. "తిలక్‌ చెప్తోందంతా నిజమేనా'' అనిపించింది కాసేపు. నాకు తెలుసు, "అయిదు ఖండాల మానవ సంస్కృతి అఖండ వసుధైక రూపాన్ని ధరిస్తోందనీ, భవిష్యత్‌ సింహ ద్వారం తెరుస్తోందనీ''; నేను దానికి సిద్ధమయ్యే ఉన్నాను, "సంతత సమన్వయావిష్కృత వినూత్న వేషం ధరించి'' ఠీవిగానే నించొన్నాను; జంకేమీ లేకుండా బాబుగాళ్ళకి బాబుగాడిలా ఈ వేషం ధరించగలను, నటించగలను. కానీ ఎంతైనా వేషం వేషమే కదా, నటన నటనే కదా. Deep down inside, I know that I am fucking faking it. (ఇప్పుడూ ఈ నాల్గక్షరాల ఇంగ్లీషు బూతు పదానికి రెండక్షరాల్లోనే అచ్చ తెలుగు ప్రత్యామ్నయం ఉన్నా, ఇది వాడినంత అలవోకగా దాన్ని వాడలేకపోతున్నాను. ఇదేదో ఆలోచించాలి. "అంతరించిపోతున్న అచ్చ తెలుగు బూతులు'' అని ఒక వ్యాసం రాస్తే క్లారిటీ వస్తుందేమో. మెటీరియల్‌ కూడా వెతక్కోనక్కర్లేదు, నాలిక చివర ఉంటుంది.)

ఈ కవిత చదువుతున్నపుడు "నిజమేనా'' అనిపించింది ఎక్కడంటే, మనం నిజంగానే "మాధుర్యం, సౌందర్యం, కవితా మాధ్వీక చషకంలో రంగరించి పంచి పెట్టిన ప్రాచేతస కాళిదాస కవి సమ్రాటులనీ, ఊహా వ్యూహోత్కర భేదనచణ ఉపనిషదర్థ మహోదధినిహిత మహిత రత్నరాసుల్నీ'' పోగొట్టుకోకుండా దాచుకుంటున్నామా, మన వెంట తెచ్చుకుంటున్నామా? ఈ ప్రశ్నకి సమాధానంగా నలభయ్యేళ్ళు దాటిన అంకుల్స్‌ అందరూ "మేమున్నాం'' అని ముందుకు రావొచ్చు; ఏమో మరి, నాదాకా అయితే ఇవేమీ రావడం లేదు. మొన్నా మధ్య సీటీ సెంట్రల్‌ లైబ్రరీలో, డస్ట్‌ ఎలర్జీ ఉన్న వాళ్ళు తలచుకోవడానిక్కూడా జంకే తెలుగు పుస్తకాల సెక్షన్‌లో, మూల అరల్లో మూలుగుతూ నిర్లక్ష్యం కాబడుతున్న కొన్ని తెలుగు మెదళ్ళని రాండమ్‌గా పలకరిస్తున్నాను. అవన్నీ సల్ఫర్‌ ప్రభావం వల్ల పసుపుబారి, పెళుసై పేజీలు విరిగిపోతున్న పుస్తకాలే. వెతుకులాటలో కట్టమంచి రామలింగారెడ్డిగారు "కళా పూర్ణోదయం'' గురించి రాసిన పుస్తకం ఒకటి కనిపించింది. అంతకుముందే వినివుండటం వల్ల ఆసక్తిగా తెచ్చుకుని చదివాను. తర్వాత "కళాపూర్ణోదయం'' ఎలాగైనా చదవాలనిపించింది. విశాలాంధ్రాకెళ్ళి వెతికి పట్టుకున్నాను. కానీ అందులో టీకా తాత్పర్యాలేవీ లేవు. కేవలం రచన ఉంది. టీకాతాత్పర్యాలతో పుస్తకాలేవన్నా ఉన్నాయా అని అడిగితే ప్రచురణలో లేవన్నాడు షాపువాడు. సరే ఎలాగో దీంతోనే కుస్తీ పడదామని అదే కొనితెచ్చుకున్నాను. కొన్ని రోజులు కష్టపడ్డాను. ఆ పుస్తకంతో నా కష్టం భుజం మీద నాగలేసుకు బీడు భూమిని దున్నినట్టే ఉంది (వెధవ ఉదాహరణ! చివరికి ఇక్కడ కూడా "ploughing through'' అనే ఇంగ్లీషు పదబంధం మీద ఆధారపడ్డమే! నా మెదడు నెర్రెలు బారిపోతోంది. ఆపద్ధర్మంగానైనా తెలుగు జాతీయాల పుస్తకం ఒకటి తెచ్చుకుని బట్టీ పట్టాలి.) సరే ఇలా కొన్ని రోజులు తంటాలు పడ్డాను. నా దగ్గర ఉన్న శబ్దరత్నాకరం ఏ మాత్రం అక్కరకు రాలేదు. చివరకు ఈ పుస్తకం నా వరకూ కళా అసంపూర్ణోదయంగానే మిగిలిపోయింది. ఇలా ఓ తెలుగు రచనకే దిక్కు లేకపోతే, ప్రాచేతస కాళిదాస కవి సమ్రాటుల్నీ, ఉపనిషదర్థ మహోదధుల్నీ ఒంటరిగా ఈదడం నా వల్లనవుతుందా? వాటిలో నిహితమైన రత్న రాసుల్ని ఏ సహాయమూ లేకుండా వెలికితీయగలనా? మరి నిజంగానే తిలక్‌కు బుద్దిహీనులెవ్వరూ కనపడలేదా?

నన్ను బాధ పెట్టిన ఈ మూడు కారణాలకూ ఏదో సంబంధం ఉందని తెలుస్తోంది. నేనేదో కోల్పోతున్నాను, ఈసరికే కోల్పోయాను కూడా. కొన్ని అనుభవించి కోల్పోయాను, కొన్ని అనుభవించకనే కోల్పోయాను. అందుకే ఇప్పుడిలా శిథిలాల మధ్య నిలబడి జ్ఞాపకాల పునాదులపై అక్షరాల ఇటుకల్తో మళ్ళీ అంతా పేర్చుకుంటున్నాను; పేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. అందులో సేద తీరుతున్నాను. అయినా నేను కాస్త అతిగా బాధపడుతున్నానేమో. బహుశా నేను కాస్త తేడానేమో. బహుశా అందరూ జీవిత రహదారుల్లో ముందుకు చూస్తూ ముందుకు నడిచే వాళ్ళైతే, నేను వెనక్కి చూస్తూ ముందుకి నడిచే బాపతేమో. ఏం చేస్తాం. మన మౌలిక నిర్మాణమే అలా ఏడిచింది. మారాలంటే గోరోజనం ఎక్కువాయె! ఈ జన్మకిలా కానిచ్చేద్దాం.

(సరే, చిన్న గీత ముందు పెద్ద గీత గీసాను. మొదటి బాధ తగ్గినట్టే కనిపిస్తుంది. మరి ఇప్పుడీ రెండో బాధ సంగతేం చేయాలి. దీని ప్రక్కన ఏ పెద్ద గీత గీస్తే ఈ గీత చిన్నదౌతుంది. ఆ అమ్మాయినే అడగాలి.)

August 18, 2008

రాయల ప్రపంచ అట్లాసు ఆధారంగా తాత్త్విక మీమాంస (పార్టు -2)

నా ముందు పోస్టులో ఈ ప్రపంచంలో ప్రతీ విషయాన్ని జస్టిఫై చేయగల ఒకే అంతస్సూత్రం గురించి, ఈ ప్రపంచాన్ని స్పష్టంగా చూపించగల ఒకే ఒక్క vantage point గురించీ ఏదో రాసేను. మొన్నో రోజు అట్లాసు తిరగేస్తుంటే అలాంటి అంతస్సూత్రం పట్టుబడిన క్షణమేదో నా మీదగా పాకిపోయినట్టనిపించింది. క్షణకాలం పాటు ఆ vantage point దగ్గర నిలబడ్డ అనుభూతి కలిగింది. క్షణం పాటే; మళ్లీ అంతా మామూలే. దీన్నే జాయిస్‌ epiphanic moment అంటాడేమో. విషయానికొస్తే, ఆ అట్లాసులో సౌరమండలాన్ని గురించి ఒక పేజీ ఉంది. అందులో సూర్యుడు, నవగ్రహాల సాపేక్ష పరిమాణాల్ని అర్థమయ్యేలా చూపించడానికి వరుసగా (ప్రక్క ప్రక్కన) వాటి బొమ్మలు వేసారు. అందులో సూర్యుడి ప్రక్కన భూమి ఎలా ఉందంటే, ఒక ఫుట్‌ బాల్‌ ప్రక్కన సగ్గుబియ్యం గింజ పెట్టినట్టు ఉంది. ఆ ప్రక్కనే మన పాలపుంత బొమ్మ వేశారు. ఈ పాలపుంతలో ఉజ్జాయింపుగా పదివేల కోట్ల నక్షత్రాలు ఉంటాయట. వీటిలో సూర్యుడెక్కడ ఉన్నాడో చిన్న బాణం గుర్తుతో సూచించారు. ఆ బాణం గుర్తు సూచించిన చోట కంట్లో నలుసంత కనపడీ కనపడనట్టున్నాడు సూర్యుడు. మన పాలపుంత ఆసియా ఖండమంతా పెద్దది అనుకుంటే, అందులో ఓ చోట గుండు సూది గుచ్చినంత స్థలం మన సౌర కుటుంబం ఆక్రమిస్తుందట. ఈ పాలపుంత లాంటి గెలాక్సీలు ప్రస్తుతం మనకి తెలిసి (అంటే మనకు టెలిస్కోపులో కనపడేవి) మరో పది కోట్లున్నాయి.

ఆ పేజీలోనే క్రింద సూర్యుడి జీవిత కాలం గురించి చిన్న పేరా రాసారు. సూర్యుడు ఇప్పటికే నడి వయస్సు కొచ్చేసిన నక్షత్రమట. వయస్సు పెరిగే కొద్దీ దీని ఆకృతి మారుతుందట. ఒక ఐదు బిలియన్‌ సంవత్సరాల తర్వాత, సూర్యుని కేంద్రకంలో ఉన్న హైడ్రోజన్‌ అంతా హీలియంగా మారిపోయాక, సూర్యుడు ఉబ్బడం మొదలుపెడతాడట. ఎంతగానంటే, ఇప్పుడున్న పరిమాణానికి మరో నూటయాభై రెట్లు పెరిగిపోతాడట. ఒక్కసారి ఊహించండి, మనం రోజూ చూసే ఆకాశంలో రోజూ చూసే సూర్యుడు నూటయాభై రెట్లు పెరిగిపోతే...! కాని ఇది ఒక ఊహే. ఎందుకంటే అది చూడటానికి మనం ఉండం కదా. మాడి మసై పోతాం. సరిగ్గా ఈ పేరా చదువుతున్నపుడే ఇందాక నేనన్న ఎపిఫానిక్‌ మూమెంట్‌ లాంటిది అనుభూతికొచ్చింది.

గత పోస్టులో నేను నన్నొక మెగలోమానియాక్‌గా అభివర్ణించుకున్నాను. నిజానికి నేనే కాదు, మనుషులంతా మెగలోమానియాక్‌లే. విశ్వంలో తమ ఉనికి గురించి అతిగా ప్రాముఖ్యతనిచ్చుకోవడం వల్లే ఇన్ని సందేహాలు, సంశయాలు. కాని మనకంత సీన్‌ లేదు. ఈ సూర్యుణ్ణే తీసుకోండి. ఈ మండే పదార్థం లేకపోతే మనం లేము. భూమిపై మానవ జాతి ఆవిర్భావానికి, మనుగడకు ఇది ఆయువుపట్టు. కాని అనంత విశ్వపు కాలగమనంతో పోల్చి చూస్తే ఈ సూర్యుని జీవితకాలం అనేది చాలా స్వల్ప కాలికమైన విషయం; సూర్యుని పుట్టక గిట్టుక అనేవి పెద్ద లెక్కలోకి రాదు. A mere fleeting phenomena. దీనిలో ఉన్న హైడ్రోజన్‌ అణువులన్నీ పూర్తిగా హీలియంగా మారిపోతే సరి, దీని పనైపోతుంది. దాంతో పాటే మన పనైపోతుంది. ఒక్కసారి ఈ కోణంలోంచి ఆలోచిస్తే మానవ జన్మ ఎంత చిన్న విషయమో, ఎంత యాదృచ్ఛికమో అర్థమౌతుంది.

ఉదాహరణకి, ఇంట్లో బ్రెడ్‌ని వాడకుండా మూల వదిలేసేమనుకోండి; కొంతకాలానికి దానిమీద బాక్టీరియా, శిలీంధ్రాలు పుడతాయి. ఆ బ్రెడ్డు మీద ఆధారపడి బతుకుతుంటాయి. మనం ఆ బ్రెడ్‌ పాకెట్‌ని బయటపడేస్తే, దాంతో ఆ బ్రెడ్‌ మీద శిలీంధ్రాలూ అంతరించిపోతాయి. బ్రెడ్‌ మీద బతకడానికి అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయి కనుక శిలీంధ్రాలు పుట్టాయి. అలాగే భూమ్మీద బతకడానికి అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయి కనుక మనం మనుషులం పుట్టాం. ఒక మనిషికి సంబంధించినంత వరకూ తన నిలవ రొట్టె, దాని మీద బతికే శిలీంధ్రాల మనుగడ ఎంత అల్పమైన విషయమో, అలాగే ఈ విశాల విశ్వానికి సంబంధించినంత వరకూ ఈ భూమి, ఈ భూమ్మీద బతికే మనుషుల మనుగడ అంతే అల్ప విషయం. హఠాత్తుగా మన గెలాక్సీలో ఏ మూలనో సంభవించిన పెద్ద పేలుడు రేపు సౌర కుటుంబాన్ని తాకి భూమి అంతా చిన్నాభిన్నమైపోయినా మన ల్ని పట్టించుకునే నాథుడెవడూ లేడు. Because, this universe— this mad, irrational universe— don't give a shit about you and your tiny little existence.

అయితే రొట్టె మీద శిలీంధ్రాలకి మనకీ తేడా ఏంటంటే, అవి తమ జన్మ మూలాల గురించి, తమ ఉనికి పరమార్థం గురించీ ఆలోచించవు. మనిషికి మెదడు ఉంది కనుక ఆలోచిస్తాడు. ఈ ఆలోచనే మనిషి మెగలోమానియాకు అసలు కారణం. ఈ మెదడే సృష్టిలో మనిషి అస్తిత్వం కేవలం యాదృచ్ఛికమన్న నిజాన్ని మన చేత అంగీకరించకుండా చేస్తుంది. మనకి మనం ఆపాదించుకున్న ప్రాముఖ్యతే మన అసలు విలువేంటో తెలీకుండా మరుగు పరుస్తుంది. సృష్టి కాలగమనంతో సాపేక్షంగా పోల్చి చూస్తే భూమ్మీద మానవజాతి ఆవిర్భవించడానికి, అంతరించడానికీ మధ్య ఉన్న కాలం, మనకి ఒక సంవత్సరంలో అరసెకను ఎంత చిన్నదో అంత కన్నా చిన్నది. మన భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఒక రోజు పడుతుంది. మన పాలపుంత తన చుట్టూ తాను తిరగడానికి 22 మిలియన్‌ సంవత్సరాలు పడుతుందట. భూమ్మీద మనిషి ఆవిర్భవించి మాత్రం 6 మిలియన్‌ సంవత్సరాలే అవుతుంది. అంటే పాలపుంత తన చుట్టూ తాను ఒక రౌండ్‌ కొట్టే సరికే మానవ జాతి పుట్టడం అంతరించిపోవడం కూడా పూర్తయిపోతాయన్నమాట.

ఇందాక నేను చెప్పిన vantage point ఇదే. ఒక్కసారి ఇక్కడకొచ్చి నిలబడండి, చాలా వరకూ అర్థమైపోతుంది. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి తత్త్వ శాస్త్ర పుస్తకాల్లో మునిగి తేలాల్సిన అవసరం లేదనుకుంటా. రాయల ప్రపంచ అట్లాసు తిరగేస్తే చాలు; ప్రపంచం అర్థమైపోతుందని చెప్పను గానీ, ప్రపంచం అర్థం వెలకాల్సినంత గొప్పదేం కాదని అర్థమవుతుంది; అసలు దీనికంతా ఓ అర్థమూ పాడూ లేకపోయినా అంత బాధపడాల్సిందేమీ లేదని ఓదారుస్తుంది.

మన అదృష్టం ఏంటంటే, ఈ తాత్కాలిక (transient) ప్రపంచంలో మన ఉనికి అర్థ రహితం అన్న స్పృహ (awareness) మనకి నిత్యం ఉండదు. కొన్ని కొన్ని ఆకస్మిక క్షణాల్లోనే మనకి ఆ స్పృహ కలుగుతుంది. మిగతా సమయమంతా ఒకరకమైన మరుపుతో జీవితాన్ని గడిపేస్తాం. ఈ మరుపు నిజానికి ఒక వరం. ఈ మరుపే మన చేత చదువులు చదివిస్తుంది, ఉద్యోగాలు చేయిస్తుంది; పెళ్ళిల్లు, ప్రత్యుత్పత్తి, పిల్లల పెంపకం ఇవన్నీ చాలా ముఖ్యమైన విషయాలని నమ్మిస్తుంది. ఇవన్నీ అలవాటుగా చేసుకొని మనం మన ఉనికిలో అర్థరాహిత్యాన్ని మర్చిపోగలుగుతాం. అందుకే అన్నాను habit is heaven అని. అలవాటు నుంచి బయటకొచ్చి బతకాలనుకుంటే మనది చాలా ఒంటరి బతుకైపోతుంది. దాన్ని మన చుట్టూ మనుషులూ సపోర్ట్‌ చేయరు; మన చుట్టూ ఉన్న విశ్వం కూడా ఎలాంటి కాంపెన్సేషనూ చూపదు, సరికదా భయపెడుతుంది. కాని, బుజ్జగించి నిద్రపుచ్చే అలవాటనే అబద్దం కంటే, భయపెట్టినా నిజమే కావాలనే వాళ్ళు కొంతమంది ఉంటారు- శ్యామ్యూల్‌ బెకెట్‌ లాంటి వాళ్ళు. వాళ్ళ విషాదం ఈ ప్రపంచంలో అన్ని విషాదాల్లోకీ అర్థవంతమైన విషాదం.

"పుట్టుక, చావు అనే రెండు చీకటి తీరాల్ని కలుపుతూ కట్టిన వెలుగు వంతెనే జీవితం'' అంటాడు కాఫ్కా. ఒకసారి ఈ వంతెనెక్కేకా చివరిదాకా నడిచి తీరాలి. వదిలి వచ్చిన తీరం పట్ల బెంగా లేదు, వెళుతున్న తీరంపై ఆశాలేదు. అసలక్కడేముందో కూడా ఎవరికీ తెలీదు. ముందు వెనకల చీకటే. కాబట్టి వంతెన మీద నడిచే కాస్త కాలాన్ని worthwhile చేసుకోవడమే మనం చేయగలిగింది. కాని ఏం చేస్తే ఇది worthwhile అయినట్టు? వందేళ్ళు బతకమని మనల్ని ఈ ప్రపంచంలో పడేశారు బానేవుంది; what do we do now? ఈ వంతెన అన్న మెటాఫోర్‌ కన్నా "మ్యూజింగ్స్‌''లో చలం ఇంకో మంచి మెటాఫోర్‌ ఇస్తాడు.

"రేపు చచ్చే నేను— ఈ స్టేషన్లో ఎక్కి పక్క స్టేషన్లో దిగిపోయే నేను— సుఖంగా కూచోక, రైలు పెట్టెలు యెందుకు ఊడుస్తూ యీ నాలుగు నిమిషాలు గడపాలి? నాకేం తెలీదు— ఈ రైలు యెక్కడికి పోతుందో, ఏమవుతుందో. ఇది శాశ్వతమనీ, దీనికో గమ్మస్థానం వుందనీ నాకు రూఢీ యేమిటి? ఇది యే బ్రిడ్జి మీద, ఏ బాంబుల క్రింద బోల్తా పడుతుందో! నేనెందుకు నా కాలాన్ని సౌఖ్యాన్ని త్యాగం చేయాలి?''

ఇక్కడ చలం కోపం సామ్యవాదులు, సంఘ సేవకుల పట్ల. పుట్టుక అనే స్టేషన్లో ఈ జీవితం అనే రైలెక్కాం; చావు అనే స్టేషన్లో రైలు దిగిపోతాం. ఒక్కసారి దిగాక ఈ రైలుతో మనకే నిమిత్తం ఉండదు. ఇప్పుడు ఉన్న కాస్త సమయాన్ని నాకు నచ్చినట్టు గడపక సోషలిష్టులు చెప్పినట్టు రైలుని, రైల్లో మిగతా ప్రయాణికుల్నీ ఉద్దరిస్తూ ఎందుకు గడపాలి- అన్నది చలం ప్రశ్న. నిజమే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు గడపొచ్చు. చలం తోటి ప్రయాణికుల భార్యల్ని బుట్టలో వేసుకోవడంలో (లేదా "ఉద్దరించడంలో'') గడిపాడు. శ్రీశ్రీ స్లీపర్‌ క్లాస్‌ వాళ్ళని నిద్రలేపి "పదండి ముందుకు పదండి తోసుకు'' అంటూ ఎ.సి. కంపార్ట్‌మెంటు వాళ్ళమీదికి ఉసిగొల్పడంలో బిజీ అయ్యాడు. కృష్ణ శాస్త్రి రైల్లో ఇంతమంది అమ్మాయిలుండగా రైల్లో లేని ఊర్వశి కోసం వెక్కి వెక్కి ఏడుస్తూ గడిపాడు. వడ్డెర చండీదాస్‌ ప్రయాణికుల్నందర్నీ మొత్తంగా బహిష్కరించి బాత్రూంలో తలుపేసుకుని గడిపాడు. అలాగే మీరు మీ లాప్‌ టాప్‌ మీద మీటింగ్‌కి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ తయారు చేస్తూ గడపొచ్చు. ఇంకొకరు తోటి ప్రయాణికులతో పిచ్చాపాటీ మాట్లాడుతూ గడపొచ్చు. మరొకరు నిద్రపోతూ గడపొచ్చు. మరొకరు పల్లీలు నవుల్తూ గడపొచ్చు. నాకైతే తలుపు దగ్గర నుంచొని ప్రయాణించడం ఇష్టం. ఒకసారి ఢిల్లీ నుండి హైదరాబాద్‌ దాకా పూర్తి ప్రయాణాన్ని రిజర్వేషన్‌ ఉన్నా తలుపు దగ్గరే నుంచుని/కూర్చునే ప్రయాణించాను. నాకు కిటికీ సీటు కూడా సరిపోదు. ఊచలు అడ్డు రావడం ఇష్టం ఉండదు. కిటికీలోంచి ప్రదేశాల్ని చూడటం ఏదో టీవీలోంచి చూసినట్టుంటుంది. అలా కాదు, నాకా ప్రదేశాల్లో భౌతికంగా ఉన్న అనుభూతి కావాలి. తలుపు దగ్గరే అది సాధ్యమౌతుంది. నిజంగా మనం ఎపుడూ చూడని ప్రదేశాల్లోంచి వాటికి మాత్రమే ప్రత్యేకమైన ఫ్లేవర్నేదో మనలోకి తీసుకుంటూ వాటి మధ్య నుంచి వేగంగా దూసుకుపోవడం భలే అనుభూతి. రైల్లోనే అది సాధ్యం. అందుకేనేమో, నాకు రైల్లో ఉన్న ఛార్మ్‌ ఇంకెందులోనూ కనపడదు. మార్సెల్‌ ప్రోస్ట్‌ ఐతే ఇంకా అల్ప సంతోషి (లేదా— అఫ్‌కోర్స్— మనందరికన్నా తీవ్రమైన భావనా శక్తి ఉన్న వ్యక్తి). అందుకే, కేవలం రైల్వే టైంటేబిల్స్‌ చదవడంలోనే ఆ ఆనందం కలుగుతుందంటాడు: "Oh! the sweet caress of all those names of villages and towns in the railway timetables, the charming evocation of lands of lightness and life that I will never visit. . . ."

నాకు రాహుల్‌ సాంకృత్యాయనంత ధైర్యం లేదుగాని ఉంటే నా జీవితాన్ని ఫలవంతం చేసుకోవడానికి నేను వెంటనే చేయాల్సిన పనొకటుంది. ఉద్యోగాన్ని వదిలేసి దేశ దిమ్మరి. . . కాదు కాదు, ప్రపంచ దిమ్మరి కావడం. నా ఉద్దేశ్యం యాత్రికుడిలాగా కాదు; బైనాక్యులరో, కెమెరానో చేతపుచ్చుకుని, హోటళ్ళలో తింటూ, అవుట్‌ సైడర్‌గా కాదు. ఎక్కడి కెళ్తే అక్కడ ఇమిడిపోవాలి. కృష్ణ శాస్త్రి "ఆకులో ఆకునై, పూవులో పూవునై. . .'' అంటాడు చూడండి, అలా కలిసిపోవాలి. At the fatal end, I should feel at home with the world that I had lived in. ప్రపంచాన్ని చూడటం కాదు, తెలుసుకోవాలి. అది నా ఐడియల్‌ జీవితం. నా ఉద్దేశ్యంలో అదే జీవితం పరమార్థం. నాకే కాదు, ఎవరికైనా ప్రపంచాన్ని తెలుసుకోవడమే హైయ్యస్ట్‌ ఐడియల్‌. నబకోవ్‌ తనకో రచయితగా ఓ గొప్ప రచన పూర్తి చేసినప్పటికన్నా, లెపిడోప్టెరిస్టుగా ఓ సీతాకోక చిలుక జాతిని ఖచ్చితంగా నిర్థారించగలిగినప్పుడే ఎక్కువ ఆనందం కలుగుతుందంటాడు. రచయిత కేవలం ప్రపంచానికి అద్దం పడతాడు. శాస్త్రవేత్త మాత్రం ప్రపంచం చూపించే భ్రమా పూరితమైన అద్దాల్ని ఛేదించి లోపలికి దూసుకుపోతాడు. ఎలా చూసినా శాస్త్రవేత్తల తరువాతే కళాకారుల స్థానం. ఈ ప్రపంచంలో పుట్టి ఈ ప్రపంచాన్ని తెలుసుకోకుండానే చచ్చిపోతే ఎలా? అయితే మళ్ళీ ఇందులోనూ తికమక ఉంది. ప్రపంచాన్ని తెలుసుకోవడానికి స్థలం మనకు సహాయపడుతుంది గానీ, కాలం మనకు సహాయపడదు.

స్థల, కాలాలంటూ రెండూ ఏవో చాలా దగ్గరి విషయాలన్నట్టూ చెప్తారు గానీ రెంటికీ చాలా దూరముంది. ఈ భూమ్మీద మనం స్థలాన్నే జయించగలం, కాలాన్ని జయించలేం. ఈ ప్రపంచంల్లో స్థలాన్నే తెలుసుకోగలం, కాలాన్ని తెలుసుకోలేం. ఉదాహరణకి, ఇంట్లో మా అమ్మ చిన్నప్పటి ఫోటో ఒకటి ఉంటుంది. ధవళేశ్వరం బాలికోన్నత పాఠశాలలో పదవతరగతి పూర్తయిన తర్వాత తీయించుకున్న గ్రూప్‌ ఫోటో. టీచర్ల వెనుక వరసగా నిలుచున్న అమ్మాయిల మధ్య, రెండు జళ్ళతో, పరికిణీ-ఓణీ వేసుకుని నుంచునుంటుంది. భలే ముద్దొస్తుంది. వీలైతే ఒక్కసారి వాళ్ళ క్లాసులోకి వెళ్ళి అందరిముందూ పదిహేనేళ్ళ ఆ రెండు జెళ్ళ పిల్లని గట్టిగా "అమ్మా'' అని పిలవాలనుంటుంది; బిత్తరపోయిన ఆ మొహాన్ని ఓసారి చూడాలనుంటుంది. చూడలేను కదా. అలాగే మా మొండిదాన్ని కూడా. ఓ పదిహేనేళ్ళ వెనక్కి పోయి, బహుశా అప్పటికి పదేళ్ళున్న తనని స్కూలు కెళ్తుంటే ఆపి, చాక్లెట్లు ఏవో ఇచ్చి మంచి చేసుకుని "మరో పదిహేనేళ్ళ తర్వాత నేన్నీకు పది పేజీల ప్రేమ లేఖ రాయబోతున్నాను దయచేసి ఒప్పుకోవే'' అని బతిమాలాలని ఉంటుంది. ఇప్పుడు జీవితాన్నే ఇచ్చేస్తానన్నా నా కక్కర్లేదంటుంది, కనీసం చాక్లెట్‌కయినా లొగుతుందేమో చూడాలి. అలాగే సరిగ్గా 1912 ఆగస్టు పదమూడో తారీకున జర్మనీలో ప్రేగ్‌ పట్టణానికి వెళ్ళాలనుంది. యథాతథంగా ఆ రోజు రెండింటికి ఆఫీసు నుండి వస్తున్న కాఫ్కాను అటకాయిస్తాను. "ఈ రాత్రి మీ ఫ్రెండ్‌ మాక్స్‌ ఓ విందు ఇవ్వబోతున్నాడు. అక్కడ మీరు మీ హృదయాన్ని కాస్త జాగ్రత్తగా దాచుకోండి, లేదంటే ఓ అమ్మాయి ఎత్తుకె ళ్ళిపోగలదు'' అని హెచ్చరిస్తాను. మళ్ళీ 2008కి తిరిగి వచ్చేసి, నా దగ్గరున్న కాఫ్కా డైరీలు తిరగేసి, ఆ ఎంట్రీ దగ్గర కాఫ్కా తనకు వీధిలో ఎదురైన ఓ అద్భుతమైన సైకిక్‌ గురించేమన్నా ప్రస్తావించాడేమో చూస్తాను. ఇదీ కాకపోతే తిన్నగా పదమూడో శతాబ్దానికి గోబీ ఎడారి వెళిపోవాలనుంది. వెళ్ళి చంఘీజ్‌ ఖాన్‌ సైన్యంలో రిక్రూట్‌ అయిపోతాను. గుర్రాలు, గుడారాలు, తార్తారు పడుచులు, చీనా చక్రవర్తి మీద యుద్ధాలు- భలే ఉంటుంది కదూ. మేధావుల అజమాయిషీ చూసి చూసి విసుగెత్తింది; ఇప్పుడు భవన నిర్మాణాల్లో కూలీలు, హోటళ్ళలో వెయిటర్లు, ఆటో డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులూ అప్పుడు సైన్యాధ్యక్ష పదవుల్లో ఉంటే ఓ సారి చూడాలనుంది. (బలవంతుడు బలహీనుణ్ణి దోచుకునే అప్పటి సమాజాన్ని బార్బేరియన్‌ సమాజం అన్నారు. కాని ఇప్పుడూ బలవంతుడు బలహీనుణ్ణి దోచుకుంటూనే ఉన్నాడు. కాకపోతే ఇదంతా ఇంటెలెక్చువల్‌ బార్బేరియనిజం.) సరే ఇలా చాలా ఆశలున్నాయి. కానీ ఏం చేస్తాం! ఈ ప్రపంచంలో బతకడానికి ఏ స్థలాన్నైనా ఎంచుకోవచ్చు, కాని కాలాన్ని మాత్రం ఎంచుకోలేం. We are all prisoners of time. ఆగండాగండి! నిజానికి ఇది కూడా సరైన వాదన కాదేమో. కాలమే కాదు, స్థలం కూడా మన చేతుల్లో లేదేమో. ఎందుకంటే, ప్రపంచంలో మనం ఎక్కడైనా బతకగలం, కాని విశ్వంలో మాత్రం భూమిపైనే బతకగలం. I guess then, we are all prisoners of space too. నువ్వు ఫలానా 1980ల్లో పుట్టి 2060 దరిదాపుల వరకూ (Oh! the greedy me!) ఫలానా భూమ్మీద బతుకు అని పడేస్తే చచ్చినట్టు బతకాలన్నమాట. ఎన్నుకునే అవకాశం ఇసుమంత కూడా లేదన్న మాట.

August 10, 2008

How I messed up an essay అను తడబడిన తాత్త్విక మీమాంస

కాఫ్కా కథొకటుంది. పేరు `ద గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనా'. చైనా గోడ నిర్మాణం ఆ కథకు నేపథ్యం. చైనా ఉత్తర భాగం నుంచీ దక్షిణ భాగం వరకూ కొన్ని వేల మైళ్ళు ఈ గోడ కట్టాలి. చైనా చక్రవర్తి ఆజ్ఞతో లక్షలమంది కూలీలు కలిసి ఆ గోడను కడుతూంటారు. కాని దాన్ని ఒక తీరుగా మొదట్లో మొదలుపెట్టి చివరికంటా కట్టుకుపోరు. మధ్యలో అక్కడ కాస్తా ఇక్కడ కాస్తా ముక్కలు ముక్కలుగా కడుతూంటారు. ఎలాగో చెప్తాను: ఒక ఇరవై మంది కూలీల గుంపు కలిసి ఇటు నుండి ఓ ఐదొందల మీటర్ల పొడవు గోడ కడతారు. ఇంతలో అటు నుండి అంతే పొడవు గోడను మరో ఇరవై మంది కూలీల గుంపు కట్టుకుంటూ వస్తారు. తర్వాత ఈ రెండూ అతికి కడతారు. అయితే అతుకులు కలిపిన తరువాత మళ్ళీ గోడను అక్కడ నుంచే కొనసాగించరు. కూలీలను వేరే చోటకు తరలించి అక్కడ వేరే ముక్క ప్రారంభిస్తారు. చక్రవర్తి రాజధాని నుండే ఈ పనంతా పర్యవేక్షిస్తూంటాడు. ఈ అతుకులు ఎక్కడ కలపాలి, గోడ ఎంత ఎత్తు కట్టాలి, ఒక ముక్క కట్టిన తర్వాత కూలీలను మళ్ళీ వేరే ముక్క కట్టడానికి ఎక్కడకు పంపాలి— ఇవన్నీ చక్రవర్తికి మాత్రమే తెలుస్తాయి. చక్రవర్తి నుంచి వచ్చే ఆదేశాల అనుసారంగా కూలీలు కడుతూపోతూంటారు.

వరసగా కాకుండా ఇలా ముక్కలు ముక్కలుగా ఎందుకు కడతారన్న దానికి నేరేటర్‌ ఓ కారణం చెపుతాడు. గోడ ఒకటీ రెండూ కాదు కొన్ని వేల మైళ్ళు కట్టాలి. అన్ని వేల మైళ్ళు అంత పెద్ద గోడను వరసాగ్గా కడుతూ పోతే పూర్తి కావడానికి చాలా కాలం పడుతుంది. అది పూర్తి కాక మునుపే కూలీల జీవితం పూర్తయిపోతుంది. చివరకు వాళ్ళు ఆ పనిని పూర్తి చేయలేకపోయామే అన్న అసంతృప్తితోనే చనిపోతారు. అలా కాకుండా ముక్కలు ముక్కలుగా కట్టారనుకోండి, ఒక ఐదువందల మీటర్ల ముక్కను ఐదు సంవత్సరాల్లో కట్టేస్తారు. ఇలాగైతే వారికి ఏదో పూర్తి చేసామన్న సంతృప్తి మిగులుతుంది. చనిపోయే ముందు తమ జీవితమంతా దేనికి ఖర్చయిందీ అని వెనక్కి తిరిగి చూసుకుంటే సమాధానంగా ఒక కాంక్రీట్‌ ఎవిడెన్స్‌లాగా వారి ముందు పూర్తయిన ఓ గోడ కనిపిస్తుంది.

నేరేటర్‌ ఈ వివరణ ఇచ్చేటపుడు నేను కథలో ఈ భాగాన్ని ప్రపంచానికి అన్వయించుకున్నాను. ఆ కూలీల స్థానంలో మనల్నుంచుకుని మొత్తం సినేరియోని ప్రపంచానికి అన్వయిస్తే, ఈ ప్రపంచమూ చైనా గోడంత భారీ నిర్మాణమే. దీన్ని మొత్తంగా చూడాలనుకుంటే చూడలేం. చూడటం అంటే నా ఉద్దేశ్యం కళ్ళతో చూడటం కాదు; ఈ ప్రపంచంలో ప్రతీ విషయాన్ని జస్టిఫై చేయగల ఒకే ఒక్క అంతస్సూత్రాన్ని (సత్యాన్ని) చూడగలగడం. అల్టిమేట్‌ ట్రూత్‌ అన్నమాట. అదెలా ఉండాలంటే, అది తెలిస్తే ఇక అంతా అర్థమైపోవాలి. ఒక్కసారి ఆ vantage point దగ్గరకెళ్ళి నిలబడ్డాక ఇక అంతా స్పష్టంగా కనపడాలి. కానీ దురదృష్టవశాత్తూ ఈ ప్రపంచానికి అలాంటి పాయింటేమీ లేదు. అక్కడ గోడ కడుతున్న కూలీలకు గోడపై పూర్తి అవగాహన లేకపోయినా, కనీసం అలాంటి అవగాహన ఉన్న వాడి క్రింద పనిచేస్తున్నారు. కనీసం ఆ చైనా గోడను పర్యవేక్షిస్తూ ఓ చక్రవర్తి ఉన్నాడు. కనీసంలో కనీసం అలా ఒకడున్నాడని అక్కడ పనిచేస్తున్న కూలీలకు తెలుసు. కానీ ఈ ప్రపంచాన్ని పర్యవేక్షిస్తూ, ఆదిమధ్యాంతం దీని అనుపానులు తెలిసిన వాడొకడున్నాడన్న పూచీ కూడా మనకి లేదు. గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఇటుకలు పేరుస్తూ పోవడమే. కట్టు! కట్టు! ఎందుక్కడుతున్నావో నీకనవసరం. కట్టడం కోసమే నువ్వు పుట్టావు. కడుతూ కడుతూ చస్తావు. నీ జీవితం ఈ మహాకుడ్యంలో చిన్న భాగం, చిన్న ముక్క. నీకు కేటాయించిన స్థలంలో నీ ముక్క వరకూ నువ్వ కట్టుకో. అది అనుకున్నట్టుగా పూర్తి చేసి సంతృప్తిగా చచ్చిపో. అంతేగాని ఏకమొత్తంగా దీన్ని చూడాలనుకుంటే, అర్థం చేసుకోవాలనుకుంటే, చివరకు అసంతృప్తితోనే చస్తావ్‌!

ఇలాంటి గంభీరమైన సమస్యల్ని నెత్తికెక్కించుకుని అలసిపోవడం నాకో సరదా. నాకేంటంటే, కాస్త కావరం ఎక్కువ. Megalomaniac is the word for me. నా కక్కర్లేనివన్నీ నాకే కావాలనుకుంటాను. అయినా అనుకోకపోతే ఎలా? అరే యార్‌ ఇస్‌ దునియా మే పైదా హువే, ఫిర్‌ ఇసే పూరా జాన్‌కర్‌ హీ మర్‌నా చాహియే; హైకీ నహీ? మళ్ళీ ఇక్కడే పుడతామో, వేరే గెలాక్సీలో వేరే గ్రహం మీదే పుడతామో, అసలు పుట్టనే పుట్టమో ఎవడికి తెలుసు? ఒక్క ఛాన్సు, ఒకే ఒక్క ఛాన్సీ భూమ్మీద. కాబట్టి ఇక్కడ ఏది నిజమో— ఏది ఒకే ఒక్క నిజమో— తెలుసుకోవాలి కదా. అదీ నా మతం. కాని తెలుసుకోగలమా? ఈ ప్రపంచం అలా పూర్తిగా తెలుసుకునేందుకు వీలైన అమరికేనా? ఇంకా సరిగ్గా అడగాలంటే— మన మెదడు ఈ ప్రపంచాన్ని పూర్తిగా తెలుసుకునేందుకు వీలైన అమరికేనా?

నాకిప్పుడోటి గుర్తొస్తోంది. ఒకసారి నేనో పార్కులో పచ్చికలో కూర్చున్నాను. నా కాళ్ళ దగ్గర్నించీ ఒక బుల్లి గొంగళీ పురుగు పాకుతూపోతోంది. పచ్చ గడ్డి ఈనెల మీదగా నానా తంటాలు పడుతూ, చాలా నెమ్మదిగా పాకుతోంది. నిముషానికి చచ్చీ చెడీ ఓ పదంగుళాలు పాకగలుగుతోందేమో. నేను దాన్ని నా కాళ్ళ దగ్గర్నించీ రెండడుగుల దూరం వెళ్ళనిచ్చాను. అప్పుడు చేతికందుబాటులో ఉన్న ఓ ఎండుటాకు తీసుకుని అది వెళ్ళే దారిలో పడుకోబెట్టాను. అది అమాయకంగా దాని మీదకు ఎక్కింది. ఎక్కగానే ఆ ఎండుటాకును ఎత్తి మళ్ళా నా కాళ్ళ దగ్గరకే తెచ్చిపెట్టాను. అంటే అది ప్రయాణం ఎక్కణ్ణించీ ప్రారంభించిందో అక్కడికే తీసుకు వచ్చి పెట్టానన్నమాట. కానీ దానికీ సంగతి తెలీదు. తాను ఏ అంతరాయం లేకుండా నిర్విరామంగా పాకుతూ పోతున్నాననే అనుకుంటోంది. నాకు దాని మీద జాలేసింది. పాపం, ఐదు నిముషాలపాటు తాను పడిన శ్రమంతా వ్యర్థమైపోయిందన్న విషయం కూడా తెలీకుండా, ఎండుటాకు దిగి, మళ్ళీ పాకిన దారినే పాకుతూపోతోంది. అది వచ్చిన దారి గుర్తుపెట్టుకుంటుందా? "అరే! ఇందాక ఈ ఈనె మీంచే నడిచాను కదా, మళ్ళీ ఎదురొచ్చిందేంటిది''- అని అనుకుంటుందా? అనుకోలేదు. ఎందుకంటే దానికి వచ్చిన దారిని గుర్తు పెట్టుకునే మెదడు లేదు; మనలా వర్తమానాన్ని జ్ఞాపకాలుగా మార్చుకుని గతపు సంచీలో పోగేసుకునే మెదడు దానికి లేదు. తన చుట్టూ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి తగిన మెదడు దానికి లేదు.

ఇదే ఉదాహరణని మనిషికీ అన్వయించవచ్చుననుకుంటా. మన మెదడుకి గొంగళీపురుగు లాగే ఈ ప్రపంచాన్ని— లేదా ఇంకా విశాలంగా— విశ్వాన్ని అర్థం చేసుకునే సత్తా లేదు. కాని గొంగళిపురుగుకి రాని ప్రశ్నలు మనిషికే ఎందుకు వస్తాయి. గొంగళి పురుగెపుడూ భూమ్మీద తన ఉనికికి పూర్వాపరాలేమిటీ, మూలాలేమిటీ అని ఆలోచించదు. ఈగలు, దోమలు, ఆవులు, గేదెలు, కాకులు, గ్రద్దలు ఇవేవీ ఆలోచించవు. ఎందుకంటే వాటి మెదడుకి తమ జ్ఞాపకాల్ని విశ్లేషించి కాన్సెప్ట్స్‌గా తయారు చేసుకోగల శక్తి లేదు. వాటిలో వర్తమానం ఉన్నంత బలంగా గతం, భవిష్యత్తు ఉండవు. గొంగళి పురుగు సీతాకోక చిలుకగా తన తన భవిష్యత్తెలా ఉండబోతోందనే దాని గురించి కలలు కనదు. సీతాకోక చిలుక కూడా తన గొంగళిపురుగు గతాన్ని తల్చుకోదు. వాటికి బతకడం ఒక అలవాటంతే. గొంగళీ పురుగుకు పాకడం ఒక అలవాటు. ఆకులు తినడం ఒక అలవాటు. ఆకు కింద కకూన్‌లో పడుకుని సీతాకోక చిలకగా మారడం ఒక అలవాటు. సీతాకోక చిలకగా మారాక పూల మకరందాన్ని సేవించడం ఒక అలవాటు. అలా సేవిస్తూ సేవిస్తూ ఒన్‌ ఫైన్‌ మార్నింగ్‌ చచ్చిపోవడం ఒక అలవాటు. ప్రతీ గొంగళిపురుగు ఇదే చేస్తుంది. మనుషుల్లో కూడా చాలా మంది జీవించడాన్ని ఒక అలవాటుగా చేసేసుకుంటారు. చదువు, ఉద్యోగం, పెళ్ళి, ప్రత్యుత్పత్తి, పిల్లలకు మళ్ళా చదువు, వాళ్ళ ఉద్యోగాలు, ఒన్‌ ఫైన్‌ మార్నింగ్‌ చచ్చిపోవడం— ఇలా అలవాటు ప్రకారం బతికేస్తారు. అలవాటులో సౌకర్యం ఉంటుంది. వెచ్చదనం ఉంటుంది. Habit is heaven. కాని అలవాటు నుండి బయటకొస్తే మాత్రం ఏమంత సౌకర్యంగా ఉండదు——

(ENOUGH!! I don't feel like writing it anymore. ఇప్పుడేం రాయబుద్దేయడం లేదు. అసలు ఇదంతా ఎందుకు రాయబుద్దేసిందంటే, ఇందాకే అంతర్జాలంలో ఒక వ్యాసం చదివాను. చాలా నచ్చింది. మీకందరికీ లింక్‌ ఇద్దామనుకున్నాను. కాని ఉట్టి లింకిస్తే ఏం బావుంటుందని ఈ ఉపోద్ఘాతం మొదలుపెట్టాను. మొదలు పెట్టినపుడు ఏదో అర్థవంతమైందే రాయబోయాను. కానీ ఊహూ! రాను రాను అసలు విషయానికి దూరంగా డైగ్రెస్‌ అవుతూ పోతున్నాను. చివరికి దీన్ని చివరికంటా రాస్తే "ఈ వ్యాసానికీ నువ్విచ్చిన లింకుకీ సంబంధం ఏంటని'' మీరు గదమాయించినా గదమాయిస్తారు. నిజానికి రాసే విషయంపై నేను చాలా క్లియర్‌గా ఉన్నాను. అక్షరాల దాకా వచ్చేసరికే మెదడు మబ్బైపోయింది. ఇవాళ మూడ్‌ లేదు. కాబట్టి చుప్‌ చాప్‌ లింకిచ్చేస్తున్నాను. చదువుకోండి. చదివాకా ఇలాంటి ఆలోచనలేవైనా వస్తే మీ పాట్లు మీరు పడండి.)

August 2, 2008

రోజువారీ కవిత్వం

మా రూమ్‌కి పక్క వీధిలో ఓ కిరాణా షాపుంటుంది. చాలా చిన్నది. నెలవారీ సరుకులన్నీ అక్కడే కొనేద్దామంటే కుదరదు. మగవాళ్ళు బయటకెళ్ళి సంపాదిస్తుంటే వేణ్ణీళ్ళకు చన్నీళ్ళ తోడన్నట్టు ఆడవాళ్ళు ఇంటి ముంగిలినే షాపుగా మార్చి అమ్ముతుంటారు చూడండి, అలాంటిదన్నమాట. ముందు భాగంలో ఛాతీ ఎత్తు టేబిల్‌; దాని మీద ఓ పబ్లిక్‌ ఫోను; ఫోన్‌ పక్కన గాజు సీసాల్లో కొబ్బరుండలూ (యమ్మీ!), పల్లీ ఉండలు, చెగోడీలు, చాక్లెట్లు; టేబిల్‌ వెనకాల ఫైబర్‌ కుర్చీలో షాపు ఓనరు కమ్‌ ఇంటి ఇల్లాలు; ఆమె తలపైన తీగలకి వేలాడదీసి షాంపూ, డిటర్జెంట్‌, బ్రూ కాఫీ, గుట్కా, పెన్నుల పేకెట్లు; ఆమె వెనుక వున్న ఫ్రిజ్‌లో కూల్‌ డ్రింకులు, వాటర్‌ పేకెట్లు, పాల పాకెట్లు.... ENOUGH!! I don't feel like describing this insipid image anyway; let's get down to something more enchanting.

దీన్నైతే ఎంతసేపైనా వర్ణించొచ్చు. ఈ పిల్ల పేరు సాయి. రెండున్నరేళ్ళ వయస్సుంటుంది, రెండడుగుల ఎత్తుంటుంది, మూణ్ణాలుక్కేజీలు బరువుంటుంది. తెల్లగా, బొద్దుగా ఉంటుంది కాబట్టి నేచురల్‌గానే ముద్దుగా ఉంటుంది. ఇంకా పుట్టెంట్రుకలు తీయలేదు. అవి బంగారం రంగులో మెరిసిపోతూ, ముఖ్‌మల్‌ పోగుల్లా మెత్తగా ఉంటాయి (ఒకసారి నేనక్కడ ఫోన్‌ చేసుకుంటున్నపుడు నా కాళ్ళ దగ్గరికి వచ్చి నిల్చుంటే ఊరికే దాని తల తడిమాను; దానికి నచ్చలేదనుకుంటా కళ్ళు చికిలించి, ఏదో చేదు తిన్నట్టు ముఖం పెట్టింది). నేనీ రూమ్‌లో దిగిన కొత్తలో ఈ పిల్ల ఎప్పుడు చూడు, వాళ్ళమ్మ- అంటే ఆ షాపావిడ కూతురు- భుజం మీదే మకాం ఉండేది. ఆవిడ భుజాన్ని జాకెట్టులోంచి చప్పరిస్తూ చొంగతో తడిపేస్తూండేది. ఈ మధ్యే నడక నేర్చి ఆ వీధిని ఎక్స్‌ప్లోర్‌ చేయడం మొదలు పెట్టింది. కాని ఇంకా పూర్తిగా నడకబ్బలేదు. అందుకే ప్రతీ అడుక్కి ఫుల్‌ బాటిల్‌ తాగిందాన్లా ముందుకి వెనక్కీ ఓసారి ఊగుతుంది. ఇక పడుతుందనుకునేలోగా పట్టు దొరకబుచ్చుకుని రెండో అడుగేసేస్తుంది. వాళ్ళ ఇంట్లో దీన్ని పట్టించుకునేంత తీరికెవరికీ లేదనుకుంటా, ఈ మధ్యన ఇదెప్పుడూ రోడ్డు మీదే బలాదూరు తిరుగుతోంది. నేను రోజూ డ్యూటీకి ఆ రోడ్డు మీంచే వెళ్తాను కాబట్టి నాకు చాలాసార్లు ఎదురుపడుతోంది. ఎదురుపడినప్పుడల్లా పలకరిస్తుంటాను. మొదట్లో నేను మామూలుగా పిల్లలకిచ్చే పలకరింపే ఈ పిల్లకీ ఇచ్చేవాణ్ణి. అంటే నాలిక బయట పెట్టి వెక్కిరించడమో; వాళ్ళు వెళ్ళే దారికి కావాలని అడ్డు నిల్చుని, "ఎవరబ్బా'' అని వాళ్ళు తలెత్తి చూస్తే వెకిలి నవ్వు నవ్వడమో... ఇలాంటివన్నమాట. చాలా మంది పిల్లలు వీటికి పడిపోతారు. కానీ అబ్బే, ఈ పిల్ల కిలాంటి పిల్ల చేష్టలు అస్సలు నచ్చవు. నేను వెక్కిరిస్తే అది చూసే చూపు చూడాలి! "గ్రో అప్‌ మాన్‌!'' అన్నట్టు చాలా జాలిగా, condescending గా చూస్తుంది. ఈ చిన్న చూపు భరించలేక కాస్త మర్యాద నేర్చుకున్నాను. "హ ల్లో సాయీ'' ఛీర్‌ఫుల్‌గా అరవడమో, లేపోతే చెయ్యి ఊపడమో చేయడం మొదలుపెట్టాను. ఒక్కోసారి నవ్వుతూ రెస్పాండవుతుంది; ఒక్సోసారి మాత్రం- దాని మూడ్‌ బాగ లేకపోవడమో, ఏదన్నా ముఖ్యమైన పనిలో ఉన్నపుడో- అస్సలు పట్టించుకోదు. ఫరెగ్జాంపుల్‌, మొన్నామధ్య నేనలా వెళ్ళేప్పుడు సాయి వాళ్ళింటి బయటి గచ్చు మీద నుంచుని, ఉచ్చపోసి, ఎడం కాలితో అలుకుతుంది. ఇప్పుడేవైందే నీ పెద్దరికం అని లోపల అనుకుని, దగ్గరకెళ్ళి, "ఏయ్‌ ఏంటే వెధవ పని?'' అని అడిగాను. తలెత్తి "ఓస్‌ నువ్వేనా'' అన్నట్టు చూసి మళ్ళీ తన అలకడంలో పడిపోయింది. ఏం చెప్తాం ఇలాంటి మనుషులకి!

పిల్లల్ని పలకరించేటప్పడు పెద్ద ఇబ్బందేమిటంటే వాళ్ళతో పాటు పక్కనున్న పెద్ద వాళ్ళని కూడా మొహమాటానికి పలకరించాలి. ఉదాహరణకి బస్సులో పక్క సీటులోనో, పార్కులోనో ఎవరన్నా పిల్లలు కనిపించారనుకో, దాన్ని "చిచ్చీ బుచ్చీ'' అంటూనే పక్కనున్న పెద్ద వాళ్ళతో "ఎన్నేళ్ళండీ, అల్లరి బా చేస్తుందండీ'' అని మాట్లాడుతూండాలి. But that kills all the fun. దీని వల్ల ఆ పిల్లలు కూడా మనల్ని పెద్ద వాళ్ళతో జమ కట్టేసి మనతో జట్టు కట్టడానికి సంకోచిస్తారు. మనల్ని వాళ్ళ ప్రపంచం నుంచి వెలివేస్తారు. ఈ సాయితో నా ఫ్రెండ్షిప్‌ పెరగక పోవడానికి కారణం ఇదే. వాళ్ళమ్మతోనూ, షాపులోని వాళ్ళ అమ్మమ్మతోనూ మాట్లాడేందుకు బాచిలర్‌గాణ్ణి నాకేం టాపిక్స్‌ ఉంటాయి. అప్పటికీ షాపు కెళ్ళే అవసరం వచ్చినప్పుడల్లా ఆ షాపుకే వెళ్తూంటాను; పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళ విషయాలేవో మాట్లాడుతూ, కనిపిస్తే సాయిని పలకరిస్తూంటాను. కానీ ఇదేం బావుంటుంది. ఇద్దరిదీ మహా అయితే ముఖ పరిచయంగా మిగిలిపోతుంది. కాని బోడి ముఖ పరిచయం ఎవడిక్కావాలి! ఈ మధ్య వాళ్ళ ఇంటి పక్క ఇల్లు కూలగొట్టి మళ్ళీ కడుతున్నారు. దాని కోసం ఇసక తెచ్చి పోసారు. సాయికిదో పెద్ద ఆట స్థలం అయిపోయింది. ఇరవైనాలుగ్గంటలూ ఆ ఇసకలోనే ఉంటోంది. తవ్వుతుంది, పూడుస్తుంది, కడుతుంది, కూలదోస్తుంది, ఏదేదో చేస్తుంది. దాని బుల్లి ప్రపంచానికి ఇప్పుడా ఇసక గుట్టే పెద్ద హిమాలయాల్లా కనిపిస్తోంది. మూణ్ణాలుగు రోజులుగా నన్నసలు పట్టించుకోవటమే మానేసింది. దాన్ని దాటి వెళ్తూన్నపుడల్లా నా ఆఫీసు బేగ్‌ అవతల పడేసి దాంతో కాసేపు ఆడదామని ఉంటుంది. అంటే పెద్ద వాళ్ళు పిల్లలతో ఆడినట్టు కాదు, పిల్లలు తోటి పిల్లలతో ఆడినట్టు. అంటే, ఇసుక గూడు తవ్వడంలో దాని కష్ట సుఖాల్ని పంచుకుంటూ, గోపురం ఎంత ఎత్తుండాలో గంభీరంగా చర్చించుకుంటూ, సాధ్యాసాధ్యాల్ని ఇద్దరం బేరీజు వేసుకుంటూ, ఒక కొలీగ్‌లా దానితో కలిసి పనిచేయడమన్నమాట. కాని వాళ్ళమ్మా వాళ్ళతో పాటు వీధి జనమంతా నన్ను చిత్రంగా చూస్తారు. ఏం చేయగలం. దాని మానాన అది ఆడుకుంటూంటే నా మానాన నేను చుప్‌ చాప్‌ ఆఫీసుకి పోతుంటాను. Sometimes, it sucks to be a big man. It really does!!

July 27, 2008

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి వీలునామాపురిపండా అప్పలస్వామి గారికి,

ఇవాళ తెల్లవారేటప్పటికి నాకివాళ పక్షవాతం సందేహం కలిగింది. మీరు హైదరాబాదు నుంచి ఎప్పుడు వస్తారు?

నాగేశ్వరరావుగారికి కథల పుస్తకాలు ఇచ్చెయ్యదలచుకున్నాను. వెనక ఒకమాటు వారు సేపీకి 3.00 మూడు రూపాయలు చొప్పున బేరం చేసి స్థిర పరచుకున్నారు. ఇప్పుడు ఆ రేటున పైసలు చెయ్యండి. కుదరకపోతే మీ ఇష్టం వచ్చినట్టు పైసలు చెయ్యండి. తక్కిన పుస్తకాలున్నూ యిప్పించెయ్యండి. వారికి నాలుగు వేల చిల్లర నేను బాకీ. నవలలూ, నాటకాలూ వగైరా కాపీరైట్లూ, స్టాకు అంతా యిప్పించండి. మీకు సాధ్యమైన ధరకు యిప్పించి రుణం లేదనిపించి అదనంగా యిస్తే అది నా భార్య చేతికి ఇవ్వండి. నా కుటుంబానికి మీరే సాయం చెయ్యగలరు.

పుస్తకాల వ్యవహారం పూర్తిగా పరిష్కరించి మరీ వెళ్ళాలి మీరు. 'అనుభవాలు - 2' విశాఖపట్టణం పంపాలి. పోషకులకూ తక్కినవారికీ, రాజమండ్రిలో మైలవరపూ, వింజమూరీ, రామచంద్రపురంలో దువ్వూరీ, చావలీ, వేపా వారికి మాత్రమే యిచ్చాను. వేపావారు 116 ఇస్తామన్నారు. ఇప్పుడే కొంత ఇవ్వవచ్చు. కాకినాడ సాహిత్యవేత్తగారంటే శ్రీ పార్థసారథిగారు. వారికి నా యెడ చాలా దయ. మీరు చెపితే నాకు గాని నా కుటుంబానికి గాని వారేమైనా సాయం చేసి చేయించవచ్చు.

నా కుటుంబం చెట్టుకింద వుంది. మీరు సాయం చెయ్యండి. విశాఖలో కూడా ఏమైనా వీలవుతుందేమో చూడండి. నాగేశ్వరరావుగారి వ్యవహారం మీరే పరిష్కరించడం నా ఆశ. మీరు మిక్కిలి ఘనంగా సన్మానించారు. మీకు శ్రమ మాత్రమే కలిగించాన్నేను. శ్రీ సింహాచలంగారి స్నేహం నాకు మహా మేరువు. వారికి నా కృత జ్ఞత సరిగా చూపించలేకపోయాను.

మీకు నేను బరువైనట్టే నిశ్చయం. మీలాగ మనసిచ్చిన వారు నాకు మరొకరు లేరు. మీ రుణం తీర్చుకోలేను. అది తీర్చుకోవడానికైనా మరో జన్మం బెత్తుతాను. ఒకటి కాదు, పది, వంద ఎత్తుతాను. ఒక సామాన్యుడికి మీరూ, సింహాచలం గారూ కనకాభిషేకం చేయించారు. ఇది నాకు పరమేశ్వరుడు చేయించలేనిది. ఇలాంటి స్థితిలో నేను భారం అయిపోతున్నాను. విచారించను. అది తీర్చుకోవడానికైనా మరో జన్మ యెత్తుతాను కనక.

నాకేమీ విచారం లేదు. నా భార్య నన్ననేక విధాల కాపాడింది. చిన్నప్పణ్ణుంచీ దాన్ని కష్టపెట్టాను గాని సుఖ పెట్టలేకపోయాను. ఇప్పుడు ఇక ఆ వూసే లేదు కదా?

నిరర్థక జన్మ అయిపోయింది నాది.

రచనలయినా సాపురాసి అన్నీ జాతికి సమర్పించుకోలేకపోయిను.

పరమేశ్వరుడు మీకు సకల సుఖాలూ కలిగించాలి. సారస్వత సేవలో మీకు సాఫల్యం పూర్తిగా కలిగించాలి. మీ కలం జాతిని ఉద్ధరిస్తుంది.

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి

* * *

ఈ ఉత్తరాన్ని పొద్దున్న సిటీ సెంట్రల్‌ లైబ్రరీలో ఏదో లేఖా సంకలనంలో చదివాను. చాలా దిగులుగా అనిపించింది. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి రాతలంటే నాకు చాలా యిష్టం. For some months, I have been digging him thoroughly. ఆయన కథలు చదువుతూ, ఆ కథల వెనుక ఆయన్ని ఊహించుకుంటే ఒక రాజసం నిండిన ఆకారం తలపుకు వస్తుంది. జీవత్వం తొణికిసలాడే పాత్రల్ని (వాటి నుదుటి రాతల్నీ) తన గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తున్న ఆయన ఠీవి చూస్తే ముచ్చటేసుకొస్తుంది. వట్టి సంభాషణలతోనే సంక్లిష్టమైన కథాగమనాన్ని అలవోకగా స్ఫురింపజేయగల ఆయన నైపుణ్యం, కొటేషన్ల మధ్య నాలుగు చుక్కలతోనే ఎంతో మాట్లాడించగల చాతుర్యం ఒక్కోసారి వళ్ళు జలదరించేలా చేస్తాయి. అక్షరాల్ని మచ్చిక చేసుకుని వాటితో సాముగిరిడీలు కొట్టించగల ఆయన దర్పం మనస్సులో గౌరవభావాన్ని తట్టి లేపుతుంది.

ఈ ఉత్తరంలో లాంటి జాలిగొలిపే పంక్తులు ఆయన సృష్టించిన పాత్రలు పలికితే అంగీకరించేవాణ్ణేమో; కాని స్వయంగా ఆయన నుండి రావడం దిగమింగలేని బాధను కలుగజేసింది. మనం గౌరవించే వాళ్ళకి ఏదైనా అవమానం జరిగితే మనలో రగిలే కోపం లాంటిది కలిగింది. కాని కోప్పడితే ఎవరి మీద పడాలి. స్థల కాలాల మీద పడాలి. వేరే జన్మ స్థలం, వేరే జీవిత కాలం శ్రీపాదని వేరే స్థాయిలో ఉంచేవేమో; ఆయన్నిలా రేట్లకు, రుణాలకూ చింతించేలా చేసేవి కాదేమో. ఆయనంటూ మరో జన్మెత్తాల్సి వస్తే అది ఎవరి రుణమో తీర్చుకోవడానికి కాదు. It would be a condescention on his part to do that. భూమ్మీద పాపం పెచ్చుమీరినపుడు దేవుడు మరో అవతారం ఎత్తుతాడంటారు. అలాగే మన జీవితాల్లో రసత్వం పూర్తిగా ఇంకిపోయి హృదయాలు నెర్రెలు బారినపుడు, కనీసం మనలో పాఠకుల జీవితాల్ని రసప్లావితం చేయడానికి ఆయన మరో జన్మ ఎత్తాలి. అది ఆయన బాధ్యత కాదు, మన భాగ్యం.

రచయిత తన చుట్టూ వున్న ప్రపంచంలోంచి అనవసరమైన పిప్పిని వేరు చేసి, అవసరమైన సారాన్ని పిండి తీసి తన రచనల్లో ఓ సమాంతర ప్రపంచాన్ని సృష్టిస్తాడు. అందులోకి పాఠకుణ్ణి ఆహ్వానిస్తాడు. ఇద్దరూ ఆ ప్రపంచాన్ని పంచుకుంటారు. ఇది నిజమైన ప్రపంచం. ఇదే శాశ్వతమైన సత్యం. In a world thickly covered with meaningless pulp, this is what the underneath essence that really counts. This is the essential world. A world sans superficiality. కానీ దేన్నైతే అనవసరమైన పిప్పి అంటున్నామో, మీనింగ్‌లెస్‌ పల్ప్‌ అంటున్నామో దానికి మనల్ని మాయలో పడేసే శక్తి ఉంది, తనే నిజమని భ్రమింపజేసే గుణం ఉంది. మన జీవితాల్లో పెద్ద విషాదం అదే. సారాన్ని వలకబోసి పిప్పిని భద్రంగా దాచుకుంటూ వస్తాం. మనం కూడగట్టుకుంది ఏమిటో ఏ చచ్చేటపుడో స్ఫురణకు వస్తుంది. అపుడిక వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక పూర్తి జీవితం వ్యర్థమైపోయిందన్న నిజం అవగతమౌతుంది. దేన్నో సమర్థంగా నిర్మిస్తూ వస్తున్నామనుకుంటాం. వెనక్కి తిరిగి చూస్తే వట్టి శిథిలాలు మాత్రమే కనిపిస్తాయి. మరిక్కడ తన మలిసంధ్యలో శ్రీపాద ఏ శిథిలాలు చూసుకొని చింతిస్తున్నాడు? నన్నడిగితే ఇదో సంధి ప్రేలాపన లాంటిది మాత్రమేనంటాను. శ్రీపాద గురించి శ్రీపాద కన్నా, ఆయన సన్నిహితుల కన్నా, సాహితీ మిత్రులకన్నా, సమకాలీనులందరికన్నా ఎక్కువ నాకు తెలుసు. నాకే కాదు ఆయన సాహిత్యాన్ని దగ్గరగా చదివిన ఏ పాఠకునికైనా తెలుస్తుంది. (ఏ రచయితనైనా వ్యక్తిగా దగ్గరగా అర్థం చేసుకునేది పాఠకులే అనుకుంటాను. మిగతా వారంతా పైపైనే చూడగలరు, అతని సారం అందేది మాత్రం పాఠకులకే. అందుకే, కాఫ్కా గురించి ఫెలిసీ కన్నా, మాక్స్‌ బ్రాడ్‌ కన్నా ఎక్కువ నాకే తెలుసనుకుంటాను.) ఇందాకే చెప్పినట్టు జీవిత సారాన్ని కప్పి ఉంచే అర్థం లేని పిప్పికి మనుషుల్ని భ్రమలో ముంచేసే శక్తి ఉంది. కొన్ని బలహీన క్షణాల్లో ఎంత ధీమంతుని చేతనైనా తనే నిజం అని ఒప్పించే శక్తి ఉంది. బహుశా అలాంటి కొన్ని బలహీన క్షణాల్లోనే ఈ ఉత్తరంలోని "నిరర్థక జన్మ అయిపోయింది నాది'' లాంటి పంక్తులు ఈ కథక చక్రవర్తి కలం నుండి వెలువడ్డాయనుకుంటా. ఒక పాఠకునిగా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి ప్రపంచం నాకు తెలుసు. అక్కడ కళకు, మానవత్వానికీ అగ్రస్థానం. అక్కడ అంకెలకు ఏ విలువా లేదు. తంగిరాల శంకరప్పను రాజ భటులు మెడపట్టి బయటకు గెంటేసినా అంత మొండిగా రాజు గారితో ఒక్కసారి చదరంగం ఆడాలని పరితపించింది ధనాన్నో అగ్రహారపు దానాన్నో ఆశించి కాదు; తన చదరంగపు కళను తాను మరో మెట్టెక్కి ఆస్వాదించడానికి. 'మార్గదర్శి' లాంటి కథల్లో కూడా ఆయన చెప్పేది డబ్బు సంపాదించడమనే కళ విలువే గానీ డబ్బు విలువ కాదు. కానీ ఏమైనా కాసేపు నాకో టైం మిషీన్‌ ఉండుంటే బాగుండుననిపించింది. నా నెల జీతం తీసుకెళ్ళి రామచంద్రపురంలో ఆయనింటి గుమ్మంలో వదిలేసి వచ్చి వుండేవాణ్ణి.

March 15, 2008

What we talk about really when we talk about reality

రియాలిటీ. వాస్తవికత. ఈ పదం చాలామంది సాహిత్య విమర్శకుల చేతిలో నమ్మకమైన కొలత బద్ద; దీంతో ఏ రచననైనా కొలిచి విలువ కట్టొచ్చని వారు విశ్వసిస్తారు. ఎంతటి రచయితలూ ఈ అస్త్రం తమపై ఎక్కుపెట్టబడేసరికి నిరుత్తరులై తలవంచుతారు. మరి నిజంగా రచనలకు ఇది అంత ప్రామాణికమైన కొలతా? తిరుగులేని అస్త్రమా? ఫలానా రచనలో వాస్తవికత లోపించిందీ లేదా ఫలానా రచన వాస్తవానికి అద్దం పట్టింది అని తీర్మానించి, దాని పరంగా రచన విలువను తూకం కడుతున్నపుడు, ఈ విమర్శకులు ఏ “వాస్తవికత” గురించి మాట్లాడుతున్నారు? కాస్త నిశితంగా ఆలోచిస్తే ఈ ప్రశ్నలకు తట్టే సమాధానం ఇది: వారు కేవలం ఆ రచన తమ స్వీయ వాస్తవికత (Subjective reality)కు దగ్గిరగా వచ్చిందీ లేనిదీ, లేదా సామూహికంగా ఏది వాస్తవికతగా అంగీకరింప బడిందో దాన్ని ప్రతిబింబించిందీ లేనిదీ మాత్రమే చెప్తున్నారు. ఎందుకంటే, వస్తుగత వాస్తవికత (Objective reality)ను ఎవరూ గ్రహించలేరు. ఉండటమైతే దాని ఉనికి ఉంది; కాని స్వీయ చేతనా పరిధుల్ని ఛేదించి దాన్నెవరూ దర్శించలేరు. ఎందుకనేది — కాసేపీ పడికట్టు పదాల్ని వదిలేసి — ఒక ఉదాహరణ ద్వారా పరిశీలిద్దాం:

ఒక అరణ్య మార్గం గూండా ముగ్గురు వ్యక్తులు నడుస్తున్న సందర్భాన్ని ఊహిద్దాం. మొదటివాడు పట్టణం నుండి వచ్చిన యాత్రికుడు. రెండవాడు వృక్షశాస్త్రజ్ఞుడు. మూడవవాడు స్థానిక గ్రామపు రైతు. మొదటివాడైన పట్టణ యాత్రికుడి దృష్టంతా తన గమ్యం మీద ఉంటుంది. అక్కడ తనకు సరైన విడిది సౌకర్యం లభిస్తుందో లేదో, అక్కడ సరైన హోటళ్ళున్నాయో లేవోనన్న విచికిత్సతో నిండివున్న అతని మస్తిష్కంలో, చుట్టూ దారి కిరువైపులా బారులు తీరి వున్న వృక్ష సౌందర్యం ఎలాంటి కదలికా కలిగించదు. అతనికి సంబంధించినంత వరకూ చెట్లు చెట్లే, మొక్కలు మొక్కలే; అంతకన్నా వాటికి ఏ విలువా ఉండదు. రెండోవాడైన వృక్షశాస్త్రజ్ఞుడికి ఈ అరణ్యమంతా మిక్కిలి ఆసక్తిని కలిగిస్తుంది. నడిచేటపుడు అటూ ఇటూ చూసుకుంటూ, అవ్యవధానంగా ఫలానా ఫలానా వృక్షాల శాస్త్రీయనామాల్ని మనసులో మననం చేసుకుంటూ నడుస్తాడు. అతనికి సంబంధించినంత వరకూ ఆ అరణ్యపు పరిసరాలన్నీ వృక్షాలుగా, మొక్కలుగా, పొదలుగా, పాదులుగా ఖచ్చితమైన విభజనతో ఉంటాయి; నియమిత జాతులుగా ఉపజాతులుగా వర్గీకరించబడి ఉంటాయి. మర్రిచెట్టుకూ రావిచెట్టుకూ తేడా తెలియని యాత్రికుని వాస్తవికత అతనికి అర్థం కాదు. అలాంటి ఉదాసీనత అతనికి సంబంధించినంత వరకూ అనూహ్యం, విచిత్రం, అసంగతం. చివరిగా, మూడోవాడైన రైతు యొక్క మానసిక ప్రపంచం పై ఇరువురికన్నా భిన్నమై ఉంటుంది. అతడిక్కడే పుట్టి పెరిగినవాడు. అతనికి ఇక్కడ ప్రతీ చెట్టూ, ప్రతీ తొర్రా, ప్రతీ కొమ్మా, ప్రతీ ఊడా సుపరిచితమే. ఆ అరణ్యం అతనిలో యాత్రికునికి మల్లే ఉదాసీనతా కలిగించదు, వృక్షశాస్త్రజ్ఞుడికి మల్లే శాస్త్రీయపరమైన ఆసక్తీ రేకెత్తించదు. ఆ అరణ్యం అతని వ్యక్తిగత అనుభూతులతో ముడిపడి ఉంటుంది; అతన్ని బాల్య స్మృతులలో ఓలలాడిస్తుంది. ఆ అరణ్యం అతనిలో ఉద్దీపింపజేసే సున్నితమైన భావోద్వేగాల్ని పట్టణ యాత్రికుడూ, వృక్షశాస్త్రజ్ఞుడూ ఎన్నటికీ అర్థం చేసుకోలేరు.

అక్కడ ఉన్నవీ, ముగ్గురికీ కనపడుతున్నవీ ఒకే రకమైన చెట్లు, ఒకే రకమైన మొక్కలు — ఒకే రకమైన వస్తుగత వాస్తవికత; కానీ దానిని ముగ్గురిలో ఏ ఒక్కరూ యథాతథంగా స్వీకరించ లేకపోతున్నారు. చెట్టు, పొద, మొక్క లాంటి పూర్తి objective పదార్థాలు కూడా ముగ్గురిలో విభిన్నమైన స్వకీయ ప్రతిస్పందనల్ని రేకెత్తిస్తున్నాయి; స్వీయ వాస్తవికతను కల్పిస్తున్నాయి. ఇక్కడ మనం మూడు వేర్వేరు ప్రపంచాల్ని చూస్తున్నాం; మూడు వేర్వేరు వాస్తవికతల్ని చూస్తున్నాం: ఒకటి ప్రకృతిని ప్రకృతిగానే చూసేది; మరొకటి ప్రకృతిని శాస్త్రీయ దృక్కోణంలో చూసేది; ఇంకొకటి ప్రకృతిని వ్యక్తిగత అనుభూతుల, జ్ఞాపకాల కటకం ద్వారా దర్శించేది. వీటికి మనం ఇంకొన్ని ఉదాహరణల్ని కూడా జత చేయవచ్చు: ఓ కుక్కతో నడుస్తున్న గుడ్డివాడు, తన యజమానితో నడుస్తున్న కుక్క, హృద్యమైన అస్తమయ దృశ్యం కోసం అన్వేషిస్తున్న చిత్రకారుడు, పెట్రోలయిపోయిన కారుతో నిలబడి ఉన్న అమ్మాయి... ఇలా ప్రతీ వ్యక్తిలోనూ ఇవే పరిసరాలు వేర్వేరు స్వీయ వాస్తవికతలుగా వక్రీభవించి ప్రతిఫలిస్తాయి. మరి మనం వస్తుగత వాస్తవికతను గ్రహించే మార్గమే లేదా? — అంటే లేదు (ఇందాకా చెప్పినట్టు మనం మన మస్తిష్కమనే చెరసాలలో జీవిత ఖైదీలం); కాని దానికి కాస్త దగ్గిరగా వచ్చే మార్గం ఉంది. ఎలా అంటే — నవ్వకండి — ఇపుడు పైన వివరించిన వేర్వేరు వ్యక్తుల స్వీయ వాస్తవికతల్ని స్వీకరించి, ఒక పరీక్షనాళికలో వేసి, బాగా గిలక్కొడితే వచ్చే మిశ్రమం సోకాల్డ్ వస్తుగత వాస్తవికతకు కాస్త దగ్గిరగా రావొచ్చు. దీన్ని సామూహిక వాస్తవికత (Collective reality) అందాం. అయితే ఈ సామూహిక వాస్తవికత యొక్క గుణం ఎప్పుడూ స్థిరంగా ఉండదు. ఇపుడు పైన ఉదహరించిన పరిసరాల్లోంచి ఒక పిచ్చివాడు కూడా నడుస్తూ వెళ్ళాడనుకోండి; మనకు లభించే మిశ్రమంలో కాస్త పిచ్చితనం కూడా వచ్చి చేరుతుంది. మరి విమర్శకులు “వాస్తవికత” అన్న పదాన్ని వాడుతున్నపుడు ఈ అస్థిరమైన, అమూర్తమైన “సామూహిక వాస్తవికత” అనే అర్థంలో వాడుతున్నారా? అసలు రచయితలు ఈ సామూహిక వాస్తవికతపై ఆధారపడి తమ రచనలు చేయాలా?

ఒక్కసారి ఊహించండి: రద్దీ రహదారి పై నడుస్తున్నపుడో, క్రిక్కిరిసిన థియేటర్లో కూర్చున్నపుడో... మీ చుట్టూ తలలు! కొన్ని హెల్మెట్లలోనూ, కొన్ని టోపీల క్రిందా, కొన్ని బట్టతలలతోనూ, కొన్ని బారెడు జడలతోనూ... వేల వేల తలలు! వీటన్నింటిలోనూ వేల వేల ప్రపంచాలు! అంటే, ఒక్క ప్రపంచానికి వేల వేల వెర్షన్లు. ఒక ప్రపంచపు వాస్తవికత మరో ప్రపంచపు వాస్తవికత కాదు. ఈ విషయం తెలిసి కూడా కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డులో కుర్రాడొకడు తెగ మథన పడిపోతుంటాడు. విషయమేవిటంటే — వాడు అదే హౌసింగ్‌బోర్డులో రెండు వీథుల కవతల, ముంగిట నిత్యమల్లె చెట్టు ఉండే ఓ ఇంట్లోని అమ్మాయితో నిండా ప్రేమలో మునిగిపోయాడు. (నిజానికి ఆ అమ్మాయి కోసమే అక్కడ మకాం పెట్టాడు.) ఆ అమ్మాయి పాటికి ఆ అమ్మాయి తన జీవితం తను జీవించేస్తుంటుంది. ఆ పిల్ల లోకల్‌ట్రైన్ దిగి హడావిడిగా తన ఉద్యోగానికి నడిచిపోతుంటే మనవాడు ఇవతలి ప్లాట్‌ఫాం మీద నిల్చొని తెగ ఆశ్చర్యపడిపోతుంటాడు. ఆశ్చర్యం ఎందుకంటే — ఆ అమ్మాయి నడుస్తుంటే ప్లాట్‌ఫాం పై ఎవ్వరి తలలూ ఆమె వైపు తిరగవు; ఎవరూ తమ పనులు మాని ఆమె వంకే నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోరు. ఆశ్చర్యమే కాదు; ఆమె వెళిపోయాక, ఆమె నవ్వులన్నీ తన గైర్హాజరీలో అర్హత లేని మొహాల ముందు వ్యర్థంగా ఖర్చయిపోతున్నాయని తెగ ఇదయిపోతుంటాడు కూడా. ఆమె బేరం అడుతుంటే విసుగ్గా బదులిచ్చే షాపువాడ్నీ, సాక్షాత్తూ ఆమె టికెట్‌కౌంటర్ దగ్గర నిలబడితే కనీసం తల కూడా ఎత్తకుండా టికెట్ కొట్టిచ్చేసే రైల్వే ఉద్యోగినీ చూసి వాడు విస్తుపోతుంటాడు. కాని ఇలాంటపుడే, వాడి భావుకత్వపు డిప్ప మీద హేతువు ఒక్క పీకు పీకి, “రేయ్! ఆ అమ్మాయి నీక్కనిపించినంత వాస్తవంగా వేరెవరికీ కనిపించదురా. ఆ అమ్మాయి నవ్వితే ఇక్కడ నీ మనసులా ఇంకెవ్వరి మనసులూ మతాబా రవ్వలై రాలి పడవురా” అంటూ ఓ నిష్ఠుర నిజాన్ని వాడి ముందు పడేస్తుంది. అప్పుడు చూడాలి వాడి మొహం! — హేతువే గనక మూర్తీభవించి వాడి ముందుకొస్తే “నీకు పనేంటే అసలిక్కడా” అంటూ మీద పడి రక్కేస్తాడు. కాని హేతువు హేతువే; నిజం నిజమే. వాడి వాస్తవిక ప్రపంచానికి ఆ అమ్మాయి అధిదేవత; మిగతా ప్రపంచానికి ఆమె ఒక అమ్మాయి, అంతే.

సరే వాడి సంగతి వదిలేద్దాం. ఇందాక మన చుట్టూ ఉన్న వేల వేల తలల గురించీ వాటిలో వసించే వేల వేల ప్రపంచాల గురించీ చెప్పుకుంటున్నాం కదా. వీళ్ళందరిలో తన ప్రపంచానికి tangible రూపం ఇయ్యగలిగేవాడు కళాకారుడొక్కడే. మిగతా ప్రపంచాలన్నీ ఆయా వ్యక్తులతో పాటూ మృతి చెంది మృత్తిక పొరల్లో లీనమై పోవాల్సిందే. కేవలం కళాకారుడొక్కడే తన ప్రపంచానికి అమరత్వాన్ని ఆపాదించగలడు (I am thinking about the ultimate range of Valmiki and Shakespeare now). మరి ఈ ఉత్కృష్టమైన వరాన్ని పొందిన రచయిత కేవలం సోకాల్డ్ సామూహిక వాస్తవికత యొక్క ఆమోదం పొందే ప్రయత్నంలో, తన సృజన దానిని ప్రతిబింబించి తీరాలన్న బాహ్య ఒత్తిడికి లొంగి తనదైన ప్రపంచపు వైవిధ్యాన్ని, అద్వితీయతనూ డైల్యూట్ చేసి బయట పెట్టాలా? ఉదాహరణకి నేను ఇంతకుముందు ప్రస్తావించిన పాగల్‌గాడి సంగతే తీసుకుందాం. వాడే ఓ ప్రేమ కథ రచించాడనుకుందాం. ప్రేమ పై వాడి దృక్కోణం వేరు. ప్రేమకు సంబంధించినంత వరకూ వాడి వాస్తవికత వేరు. అతడు తన ప్రేమను కేవలం ఆమెకూ తనకూ నడుమ వ్యవహారంగా సరిపుచ్చడు; మధ్యలో మొత్తం సృష్టి యంత్రాంగాన్నే ఇరికిస్తాడు. సృష్టిలో ప్రతీ మామూలు ఉదంతం, ప్రతీ యాదృఛ్చిక ఘటనా తామిరువుర్నీ చేరువ చేయడానికే (లేదా దూరం చేయడానికే) సంభవిస్తున్నాయని నమ్ముతాడు. అకాలంగా వాన కురిసినా, పూర్ణ చంద్రుడు వెన్నెల గుడి కట్టినా, సూర్యుడు ఆకాశానికి అందమైన రంగులు పులిమి అస్తమిస్తున్నా, చుక్క రాలినా, పూలు రాలినా అన్నీ తన ప్రేమకు అందమైన నేపథ్యాన్నివ్వడానికే జరుగుతున్నాయని నమ్ముతాడు. విశ్వపు ఆలనా పాలనా చూసే హస్తమేదో తమ ఇద్దర్నీ జతగా ముందే రాత రాసి పెట్టిందని విశ్వసిస్తాడు. అతడీ ప్రపంచాన్ని యథాతథంగా స్వీకరించడు; తన ప్రేమ మాధ్యమం ద్వారా వడగట్టి ఆ వక్రీభవించిన వెర్షన్‌నే స్వీకరిస్తాడు. అది వాడి వాస్తవికత. ఇపుడు వాడు సృజించే ప్రేమకథ ఈ రియాలిటీతోనే ఉంటుంది; సృష్టిని ఈ mystic view తోనే మన ముందుంచుతుంది. ఇపుడిందులో వాస్తవికత లేదని ఎవరైనా అంటే.... ఏ వాస్తవికత? ఎవడి వాస్తవికత?

నేనిక్కడ రచయిత తనదైన వాస్తవికతనే ప్రతిబింబిస్తూ రచనలు చేయాలన్న అపూర్వమైన విషయాన్నేం ప్రతిపాదించడం లేదు; ఎందుకంటే ప్రతీ రచయితా ప్రత్యేక ప్రయత్నమేమీ లేకుండానే తన వాస్తవికతనే చిత్రిస్తాడు. అయితే తన ఈ వాస్తవికత అందరికీ ఆమోదయోగ్యం కాదు కదా అన్న అదృశ్య ఒత్తిడికి లొంగి తన రచన యొక్క గాఢతను పలచబరచుకో కూడదని చెప్తున్నాను. తను చూసినట్టు అందరూ ఈ ప్రపంచాన్ని చూడరేమోనన్న సంశయంతో తన దృక్కోణాన్ని మసకబార్చుకో కూడదని చెప్తున్నాను. ఎందుకంటే మనకు కావాల్సింది అతని ప్రత్యేకమైన వాస్తవికతే; అతని ప్రత్యేకమైన దృక్కోణమే. మనకు కావాల్సింది — తనదైన ప్రపంచానికి కల్పన జోడించి అతను అందించగలిగే స్వయం సమృద్ధ ప్రపంచమే (Self-contained World). అతని రచనలు రియాలిటీని ప్రతిబింబించనక్కర్లేదు; తన subjective realityని ప్రతిబింబిస్తే చాలు. వాటిలో లాజిక్ ఉండనవసరం లేదు; తమదైన internal logic చూపించగలిగితే చాలు. A writer has no obligation to any reality except his own.

********

ఈ వ్యాసంలోని ముగ్గురు వ్యక్తుల ఉదాహరణ, కార్నెల్ విశ్వవిద్యాలయంలో కాఫ్కా "మెటమార్ఫసిస్"ను విశ్లేషిస్తూ, వ్లదీమర్ నబొకొవ్ ఇచ్చిన ఉపన్యాసం నుండి స్వీకరించబడింది.