January 11, 2008

"దృశ్యం Vs ఆలోచన" పోస్టుపై వివరణ

To: నాగరాజు పప్పు,

మీ వాఖ్య నాకు చాలా ఉత్సాహాన్నిచ్చింది—మనం గౌరవించే వారి మన్ననలందుకుంటుంటే కలిగే ఉత్సాహం. (మీ "సౌందర్యం లో సౌఖ్యానుభూతి", "వాక్యం రసాత్మకం కావ్యం" వ్యాసాల్ని చాలా ఆసక్తితో చదివాను. పోతే, ఈ "దృశ్యం Vs ఆలోచన" పోస్టు ఇప్పుడు రాసింది కాదు. Blogger లో పేరాగ్రాఫ్ ఇండెంట్ వస్తుందో రాదో పరీక్షించదలచి ఈ పాత పోస్టు మీద ప్రయోగించి చూసాను. అది మరలా ఇలా "కూడలి"లో ప్రత్యక్షమవుతుందని ఊహించలేదు. (అందుకే సమాధానంలో ఈ జాప్యం; క్షమించండి.)

ఇక విషయానికొస్తే—మీరే కాదు పై పోస్టుకి వ్యాఖ్యానించిన వారిలో చాలామంది నన్నొక చోట (తప్పుగా) తప్పు పట్టారు. మీ వ్యాఖ్య చదివాకాగాని ఎక్కడ తప్పు పడుతున్నారో, ఇంత సులభ గ్రాహ్యమైన, స్వయం నిరూపితమైన విషయం ఎందుకు అంగీకరింపబడటంలేదో నాకు అర్థం కాలేదు. నా పోస్టులో నేను "దృశ్యం" అన్న పదాన్ని వాడింది మీరనుకున్నట్టు సీనరీ, లాండ్‌స్కేప్ వర్ణనల్ని సూచిస్తూ కాదు; ఆ పదానికి నేనంత సంకుచితార్థాన్ని నిర్దేశించలేదు. ఏ విశాలార్థాన్ని వ్యక్తీకరించడానికి ఆ పదాన్ని వాడానో మీకు విశదపరచడానికి, నేను మరలా అయాన్‌రాండ్ సహాయాన్నే తీసుకుంటున్నాను. అయాన్‌రాండ్ తన సాహిత్యవ్యాసాల సంకలనం "రొమాంటిక్ మేనిఫెస్టో"లో రచనా శైలి విషయమై తన అభిప్రాయాల్ని వెల్లడి చేస్తూ, ఒక డిటెక్టివ్ నవలా రచయిత Mickey Spillane శైలికీ, మరో సీరియస్ రచయిత Thomas Wolfe శైలికీ పోలిక తెస్తుంది. వారి రచనల్లోంచి న్యూయార్క్ నగర వర్ణనకు సంబంధించిన రెండు వచన భాగాల్ని ఇలా ఉదహరిస్తుంది:

First excerpt:

Nobody ever walked across the bridge, not on a night like this. The rain was misty enough to be almost fog-like, a cold gray curtain that separated me from the pale ovals of white that were faces locked behind the steamed-up windows of the cars that hissed by. Even the brilliance that was Manhattan by night was reduced to a few sleepy, yellow lights off in the distance.Some place over there I had left my car and started walking, burying my head in the collar of my raincoat, with the night pulled in around me like a blanket. I walked and I smoked and I flipped the spent butts ahead of me and watched them arch to the pavement and fizzle out with one last wink.


Second excerpt:

That hour, that moment, and that place struck with a peerless co-incision upon the very heart of his own youth, the crest and zenith of his own desire. The city had never seemed as beautiful as it looked that night. For the first time he saw that New York was supremely, among the cities of the world, the city of the night. There had been achieved here a loveliness that was astounding and incomparable, a kind of modern beauty, inherent to its place and time, that no other place nor time could match. He realized suddenly that the beauty of other cities of the night—of Paris spread below one from the butte of Sacré-Coeur, in its vast, mysterious blossoms of nocturnal radiance; of London with its smoky nimbus of fogged light, which was so peculiarly thrilling because it was so vast, so lost in the illimitable—had each its special quality, so lovely and mysterious, but had yet produced no beauty that could equal this.

[పై రెండు ఉదాహరణల్నీ నిశితంగా చదవకుండా మీరు క్రిందికి రావొద్దు.]

మొదటి ఉదాహరణలో రచయిత పాత్రతో పాటు వెళ్తున్నాడు. పాత్ర చూసింది చూస్తున్నాడు; మనకు చూపిస్తున్నాడు. అతడు మన ఎదుట పరుస్తున్నవన్నీ concrete visual facts. ప్రతీ వివరం ఒక దృశ్యాన్ని మన ముందు ఉంచుతుంది. అయితే రచయిత తను అనుకున్న దృశ్యాన్ని ప్రతిష్టించడానికి ఎన్నుకున్న ఈ వివరాలు కేవలం దృశ్య ప్రతిష్టాపనకే పరిమితం కావడం లేదు, అక్కడితో ఆగిపోవడం లేదు; ఇంకా ముందుకు పోయి, ఒక సున్నితమైన భావచిత్రాన్ని మనకు స్ఫురింప జేస్తున్నాయి: న్యూయార్క్ నగరం, నగరంలో ఒంటరిదనం, ఒంటరిదనంలో వెచ్చదనం, వెచ్చదనంలో సౌకర్యం... ఇవేమీ రచయిత మనకు నేరుగా చెప్పడం లేదు; తదనుగుణమైన దృశ్యవివరాల్ని కచ్చితంగా చిత్రిక పట్టడం ద్వారా వాటి వెనకాల ఉన్న ఈ మెటాఫిజికల్ ఎమోషన్స్ సున్నితంగా మనచే అనుభూతింప జేస్తున్నాడు. ఇలాంటి వచనం పాఠకుడి నుండి పూర్తి ఏకాగ్రతను ఆశిస్తుంది. ఇక్కడ ఏ దృశ్య వివరం మిస్సయినా పాఠకుడు ఒక అనుభూతిని మిస్సవుతాడు. నేను నా పోస్టులో "దృశ్యం" అన్న పదాన్ని ఈ అర్థంతో వాడాను; కథా పరిసర చిత్రణకు సంబంధించిన డొల్ల వర్ణనల్ని ఉద్దేశించి కాదు. (ఇది డిటెక్టివ్ నవలా రచయిత Mickey Spillane శైలి.)

రెండో ఉదాహరణలో రచయిత ఏదీ చూపించడం లేదు; అంతా తనే చొరబడి చెప్పేస్తున్నాడు. న్యూయార్క్ నగరం "బ్యూటిఫుల్", "లవ్లీ", "థ్రిల్లింగ్" అంటూ విశేషణాల్ని గుమ్మరించేస్తున్నాడే తప్ప, ఎందుకు బ్యూటిఫుల్లో ఎలా థ్రిల్లింగో చెప్పడం లేదు; సంబంధిత visual facts ని మన కందీయడం లేదు. ఫలితంగా మనదాకా చేరేది ఓ మబ్బు చిత్రం; మనకు మిగిలే అనుభూతి శూన్యం. ఇక్కడ పాఠకుడు పెద్ద ఏకాగ్రత పెట్టనక్కర్లేదు; పేరా పైనుంచి క్రిందకోసారి చూపు దొర్లించేసినా అర్థమైపోతుంది—రచయిత న్యూయార్క్ నగరాన్నేదో పొగుడుతున్నాడని. (ఇది Thomas Wolfe రచన.)

అయాన్‌రాండ్ ఇక్కడ మొదట ఉదాహరణను సమర్థిస్తూ, రెండో ఉదాహరణను నాసిరకం శైలిగా నిర్థారించడం నాకూ సబబుగానే తోచింది. కాని తను సమర్థించిన మార్గాన్ని తను కూడా కాస్త అనుసరించి చూపిస్తే మరింత సబబుగా ఉండేది; పాపం "అట్లాస్" మోత బరువు మరో ఐదొందల పేజీలైనా తగ్గి ఉండేది.

అయాన్‌రాండ్ ఈ రెండో వచన భాగాన్ని ఉదహరిస్తూ, రచయితే రచనలో చొరబడి అంతా చెప్పేయడాన్ని నిరసిస్తుంది. కాని చిత్రంగా ఆమె తన ప్రసిధ్ధ నవలలో అదే తప్పు చేస్తుంది. ప్రతీ పాత్రలోకీ తనే జొరబడి, ప్రతీ పాత్ర నోటివెంటా తనే బయల్పడి, చివరాఖరికి పాత్రల్ని ఒకదానికొకటి కార్బన్ కాపీల్లా చేసి వదిలిపెడుతుంది. (నిజానికి వాళ్ళిలా కనిపించడానికి ఆమె సిధ్థాంతంలోని ఇరుకుదనం కూడా కొంత కారణం కావచ్చు. జాన్‌గాల్ట్, ఫ్రాన్సిస్కో, హాంక్ రియర్డెన్ = మంచి వాళ్ళు; జేమ్స్ టాగర్ట్, ఒరైన్ బొయేల్, లిలియన్ రియర్డెన్ = చెడ్డవాళ్ళు—ఇలా ఆమె తన పాత్రల్ని [చందమామ కథల్లోలా] మంచి వైపుకో, చెడు వైపుకో చాలా సులభంగా నెట్టేస్తుంది. నిజంగా ప్రపంచం అంత సులభంగా లెక్కతేలిపోతే ఎంత బావుంటుందో కదా! బహుశా అందుకే, మొత్తం నవల్లోకి నాకు కాస్త వాస్తవికంగా కనిపించే పాత్ర—ఎడ్డీ విల్లర్స్! ఏ సిధ్థాంతం అయినా మానవాళికి ఉపయోగపడాలంటే అది మొదట మానవ స్వభావాన్ని యథాతథంగా అంగీకరించాలి, మానవాళి వైవిధ్యాన్నంతా తనలో కలుపుకోవాలి; అంతేకాని ముందో సిధ్థాంతపు గిరి గీసేసి అందులో మానవాళిని బలవంతంగా ఇరికిద్దామంటే, ఇలాంటి అపరిపక్వ సిధ్థాంతాలే బయటపడతాయి. సరే ఇదంతా సైధ్థాంతిక పార్శ్వం కాబట్టి వదిలేద్దాం.)

ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది—రచయిత తన రచనలో చొరబడి అంతా చెప్పేయడం చాలా సులభం; తొక్క వలిచిన అరటిపళ్ళే కావాలనే పాఠకులకి ఈ పద్థతి బాగా నప్పుతుంది. కాని రచయిత తెరవెనుక నిలబడి రచనతో స్వతంత్రంగా మాట్లాడించడం కష్టం; ఇది కొంతమంది రచయితలకే సాధ్యం. (వీర్ని మచ్చుకు తర్వాత ఉదహరిస్తాను.) అయాన్‌రాండ్ తన కళ లక్ష్యం పరిపూర్ణ మానవుడ్ని సృజించడం అని చెప్పుకుంది. ఇక్కడ నాకు దుస్సహ మనిపించింది ఏమిటంటే, ఆమె "పరిపూర్ణ మానవులు" ఎందుకో అతిగా వాగుతుంటారు; మలబద్దకపు మొహాలేసుకుని పేజీలకు పేజీలు ఉపన్యాసాలు దంచుతుంటారు. (If I am condemned as a living embodiment of "Ellsworth Toohey" for making such statements, so be it. Any philosophical doctrine that excludes the ineluctable human frailties from its functional realm and regards them with contempt [without compassion], is, ultimately, doomed to fail in its practical execution.—Oh! I am going back again to all that philosophical mumbo jumbo.... Let’s skip it.) మరలా మన చర్చకొచ్చేద్దాం. మీరు "అట్లాస్ ష్రగ్డ్" నవలంతటిలో జాన్‌గాల్ట్ స్పీచ్ సమ్మరీ మాత్రం గుర్తుందని రాసారు. నిజానికి ఆమె "వర్చ్యూ ఆఫ్ సెల్ఫిష్‌నెస్" చదివినా మీ దగ్గిర మిగిలే సారం దాదాపు అదే. మరి ఒక వర్క్ ఆఫ్ ఆర్ట్‌గా "అట్లా ష్రగ్డ్"కీ, ఒక వ్యాస సంపుటిగా "వర్చ్యూ ఆఫ్ సెల్ఫిష్‌నెస్"కీ తేడా ఏం లేదా? నిజంగా మీకు అందులో దృశ్యాలేం గుర్తు లేవంటే ఒక నవలగా అది దాని ఫెయిల్యూరు. (ఫిలాసఫికల్ మేనిఫెస్టో అంటే ఒప్పుకుంటాను. అయితే, "Art has an end in itself" అని నమ్మిన అయాన్‌రాండ్ మరి తన ఆర్టును ఇలా సిద్థాంతపు బాకాగా ఎందుకు వాడుకుందో నాకర్థం కాదు.) అందుకే నేను మరలా అదే వక్కాణిస్తున్నాను: ఒక కళాత్మక రచన కలకాలం నిలవాలంటే కావాల్సింది సారవంతమైన ఇమేజెస్; ఐడియాస్ కాదు.

మీరు డాస్టొయెవ్‌స్కీ "క్రైమ్ & పనిష్మెంట్" చదివారా. వందేళ్ళ క్రితం దాన్ని చదివిన పాఠకులకు "రస్కోల్నికొవ్ బాధ ప్రపంచానికి బాధ" అనిపించి ఉండేది; కాని ఇప్పటి పాఠకులకు రస్కోల్నికోవ్ బాధ అతని బాధగానే మిగిలిపోతుంది. ఇక "చివరకు మిగిలేది" ఉదాహరణనే తీసుకుంటే, ఆ నవలలో వ్యక్తి పై సంఘం మోపే అదృశ్య ఒత్తిడి ప్రధానాంశం. రచయిత నవల్లో చాలా చోట్ల—కథానాయకుడు దయానిధి ద్వారా గానీ, తనే నేరుగా గానీ—స్వంత అభిప్రాయాల్నీ, వ్యాఖ్యానాల్నీ చొప్పిస్తుంటాడు. అప్పటి సమాజంలో వ్యక్తిపై సంఘం పొసెసివ్‌నెస్ చూస్తే, లేటుగా పుట్టి మనం చాలా అదృష్టవంతులం అనిపిస్తుంది నాలాంటి వాళ్ళకి. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో వ్యక్తిపై సంఘపు ఒత్తిడి అంతగా లేదు. ఒక వ్యక్తి ఒంటరి ద్వీపంలా మిగిలి పోదల్చుకుంటే సంఘం ఇదివరకట్లా అతన్ని కుమ్మటానికి కొమ్ములు రువ్వడం లేదు; అతని మానాన అతన్ని వదిలేస్తుంది. మరికొంత కాలానికి ఈ వ్యక్తి స్వాతంత్రపు పరిధి మరింత విస్తృత మౌతుంది. ఒక పాతికేళ్ళ భవిష్యత్తులో, ఇంకా "చివరకు మిగిలేది" ప్రచురణలో ఉండి, ఇంకా దాన్ని చదివే నూతన తరం పాఠకులు ఉన్నారన్న హైపోథెటికల్ సందర్భాన్ని మనం ఊహించ గలిగితే, వారు దయానిధి వేదననంతా చూసి "What the hell is the matter with this guy" అని చికాకు పడి తీరతారన్న విషయం తట్టడానికి మనం బృహస్పతులం కానవసరం లేదు. ఎందుకంటే, ఆ తరానికి సంబంధించినంత వరకూ సంఘం–వ్యక్తుల మధ్య సంఘర్షణ అనేది ఏలియన్ థీమ్; expired idea. అందుకే, నా దృష్టిలో "చివరకు మిగిలేది"లో చివరి దాకా మిగిలే సత్తువ ఉన్నదేమన్నా ఉంటే అది అందులోని ఇమేజరీ మాత్రమే. (మళ్ళీ చెపుతున్నాను—ఇక్కడ ఇమేజరీ అంటే సీనిక్ వర్ణనలు కావు; రచయిత తన కథ యొక్క మెటాఫిక్స్‌ని పాఠకుడి దాకా చేరవేయడానికి ఎన్నుకున్న సముచిత దృశ్య సంచయం.)

నేనిందాక—తెర వెనుక ఉండి రచనచేత మాట్లాడించే రచయితలు చాలా తక్కువమంది ఉంటారని చెపుతూ, మచ్చుకి వారిని తర్వాత పరిచయం చేస్తానన్నాను. Here comes my బ్రహ్మాస్త్రం: కాఫ్కా. నేన్నిజానికి మీకింత విస్తారంగా ఈ వివరణ ఇయ్యనవసరం లేదు; ఓ కాఫ్కా పుస్తకాన్ని మీ చేతిలో పెట్టేస్తే చాలు—అదే నా తరపున మాట్లాడుతుంది; నా వాదనను ఋజువులతో నిర్థారిస్తుంది. అది ప్రస్తుతం కుదరదు కనుక, ఆయన రచనల్ని కొన్నింటిని సంక్షిప్తంగా క్రింద పరిచయం చేస్తున్నాను:

కాఫ్కా అసంపూర్ణ నవల "The Trial"లో, ఒక బాంక్ ఉద్యోగి జోసెఫ్ కె. ఒక "శుభోదయాన" నిద్ర లేవగానే పోలీసుల చేత అరెస్టు చేయబడతాడు. అతనికి తన నేరమేమిటో అర్థం కాదు; ఎవరూ చెప్పరు. అతను మాత్రం తన నేరమేదో ఉండే ఉంటుందన్న నమ్మికతో, నవలంతా, అదేమిటో తెలుసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. చివరకు తెలుసుకోకుండానే చట్టం చేతిలో మరణిస్తాడు. మరో అసంపూర్ణ నవల "The Castle"లో ఒక లాండ్ సర్వేయరు కె., ధారాపాతంగా మంచు కురుస్తున్న ఓ అర్థ రాత్రి, ఒక గ్రామంలోకి ప్రవేశిస్తాడు. ఆ రాత్రికి ఒక సత్రంలో తల దాచుకుందామని ప్రయత్నించబోతే, ఆ గ్రామం మొత్తాన్ని అజమాయిషీ చేసే కోటకు (Castle) చెందిన ఒక ఉద్యోగి, కె.కు గ్రామంలోనికి అనుమతి ఎవరిచ్చారని ప్రశ్నిస్తాడు. కోట అధికారులే తనను ఈ గ్రామానికి లాండ్ సర్వేయరు గా నియమించారని, రమ్మని కబురు పంపారని సమాధానమిస్తాడు కె. తక్షణం కోట అధికారులను ఫోనులో సంప్రదించి, అలాంటి అనుమతిని ఎవరూ ఎవరికీ ఇవ్వలేదంటాడు ఉద్యోగి. ఇది మొదలుకొని నవల చివరివరకూ కె. కోట అధికారుల నుండి లాండ్ సర్వేయరుగా తన ఆమోదం కోసం ప్రయత్నిస్తూనే ఉంటాడు. కానీ కనీసం కోటలోకి కూడా ఎప్పుడూ వెళ్ళలేక పోతాడు. అతని ప్రయత్నాలు ఇంకా కొనసాగుతుండగానే నవల ముగింపుకొస్తుంది.

వీటి కథాంశాలు పైకి కనబడేవి కావు. నిజానికి తరచి చూస్తే రెండింటి కథాంశాలూ ఒకటే; క్లుప్తంగా ఇలా వివరించ వచ్చు: మానవ అస్థిత్వానికి అర్థం లేదు. అర్థమేదో ఉందన్న అన్వేషణలో మనం పడే నిష్పలమైన సంఘర్షణే ఈ అస్థిత్వానికి కడకు మిగిలే అర్థం. అస్థిత్వానికి అర్థమే లేదంటే ఇక మిగిలేది జీవితమంత పొడవైన ఖాళీ; భీతి గొలిపే శూన్యత. ఇక్కడ కాఫ్కా కథానాయకులిరువురూ ఈ ఖాళీని, తమ అస్థిత్వాలకు అర్థాన్ని అన్వేషించడంతోనే పూరిస్తున్నారు.

మరో కథ: "Josephine, or the mouse folk". ఇది అంతర్లీనంగా సమాజానికీ, కళాకారుడికీ మధ్య భాంధవ్యాన్ని చర్చించే కథ. బహిర్ దృష్టికి కనిపించేది మాత్రం జోసెఫైన్ అనే ఎలుక గాయని కథ. కథను ఎలుకల గుంపులో మరో ఎలుక మనకు చెప్తుంది. (First Person Plural narration)

జోసెఫైన్ తన పాటల ద్వారా ఎలుకల గుంపును ఉద్దరిస్తున్నానని భావించే ఎలుక. ఎలుకల గుంపు కలతల్లో, కష్టాల్లో ఉన్నపుడు తన పాటల ద్వారా వాటికి స్వాంతన చేకూరుస్తున్నానని భావిస్తుంటుంది ఆ ఎలుక. ఎలుకల గుంపుకు మాత్రం జోసెఫైన్ పాటల గొప్పదనమేంటో అర్థం కాదు. అయినా అవి జోసెఫైన్ కళని ఆదరిస్తాయి. జోసెఫైన్ తమ రక్షణకూ, ఆదరానికి హక్కుదారని భావించి గౌరవమిస్తాయి. అయితే, నిజంగా విపత్తులు వచ్చినప్పుడు జోసెఫైన్ పాటల వల్ల తమకు అంతగా ఒరిగేదేం లేదని మిగతా ఎలుకలకు తెలుసు. నిజానికి ఆ ఎలుకల గుంపు విపత్తుల ముంగిట కోరుకునేది పరిష్కారాన్ని కాదు; ఆ విపత్తు కారణంగా తామంతా ఒక గుంపుగా దగ్గరకు జేరడం, ఆ దగ్గిరదనంలోని వెచ్చదనపు సౌకర్యాన్ని అనుభవించడం, భోరున ఏడుస్తూ తమ మాసకిస్టిక్ టెండెన్సీస్‌ని తృప్తి పరచుకోవడం—ఇవే వాటికి కావాలి. ఇలా తమను దగ్గరకు జేర్చడానికి మాత్రమే వాటికి జోసెఫైన్ పాటలు అవసర పడతాయి; తమ మాసకిస్టిక్ టెండెన్సీస్‌ని తృప్తి పరిచే పరికరంగా మాత్రమే అవి జోసెఫైన్‌ని చూస్తాయి. కాని జోసెఫైన్ తన స్థానం ఇంకా గొప్పదని, తను హక్కుదారైన ఆ స్థానాన్ని తనకు ఇచ్చి తీరాలని ఆశిస్తుంది. సమస్యల నుండి తన పాటల ద్వారా ఎలుకల గుంపుకు నిశ్చింత కలిగిస్తున్నాను కాబట్టి తనకు రోజూవారీ పనుల నుండి మినహాయింపులు కావాలని వగైరా డిమాండ్లు చేస్తుంది. మిగతా ఎలుకల గుంపు మాత్రం, చివరకు సమస్యలు తీరేది తమ ప్రయత్నం, తమ త్యాగాల వల్లనే అని, దీనికి అన్యాయంగా జోసెఫైన్ క్రెడిట్ కొట్టేస్తుందని దాన్ని ద్వేషిచడం మొదలు పెడతాయి. ఇది స్థూల కథ.

నా ఈ కథా సంక్షిప్తంలో "జోసెఫైన్" అని ఉన్న చోట "కళాకారుడు" అని, "ఎలకల గుంపు" అని ఉన్న చోట "సమాజం" అని తర్జుమా చేసి చదువుకుంటే మీకు కథాంశం ఏమిటో విశదపడుతుంది. ఈ పారభౌతిక కథాంశాన్ని పట్టించు కోకుండా, దృగ్గోచర కథను అనుసరించి చదివినా జోసెఫైన్ నాణ్యత గల కథగానే నిలబడుతుంది.

ఇక మరో కథ "The Burrow"లో ఒక పురుగు తన బొరియను చాలా కష్టపడి, చాలా నైపుణ్యంతో నిర్మించు కుంటుంది. లోపల అనేక గదులు ఏర్పాటు చేసుకుని, వాటిలో ప్రతికూల కాలానికి సరిపడా ఆహార నిల్వల్ని కూడబెట్టుకుని సౌకర్యంగా, వెచ్చగా జీవిస్తుంది. రోజులు కులాసాగా దొర్లిపోతున్నా యనుకున్న సమయంలో, దానికి బొరియ గోడల్లోంచి ఏదో శబ్దం వినిపించడం మొదలౌతుంది. అవతలి వైపు నుండి ఎవరో—బహుశా మరో పురుగు—గోడల్ని తొలుస్తున్న ధ్వని నిరంతరాయంగా వినిపిస్తూంటుంది. ఒక రోజు ఒక వైపు నుండి వినిపించిన ధ్వని, మరుసటి రోజు మరో వైపు నుండి వస్తుంది. ఇక దాని జీవితం దుర్భరమై పోతుంది. దీని కథాంశాన్ని క్లుప్తంగా చెప్పాలంటే: The fear of the unknown.

ఈ కథల్లో ఎక్కడా రచయిత కనపడడు, వినపడడు, చొరబడడు; నిజానికి రచయిత చెప్ప దల్చుకున్న కథ కూడా బహిర్గతం కాదు. కేవలం దృశ్యాలు; స్పష్టమైన, సారవంతమైన దృశ్యాలు. కథాంశాలు కూడా కాలగమనానికి నిలిచి ఉండేవి—కాలంతో పాటు expire అయిపోయే జనరలైజ్డ్ ఐడియాస్ కావు. సృష్టిలో ఎంత నిగూడత ఉందో, దానికి కాఫ్కా ప్రతి సృష్టిలో కూడా అంతే నిగూడత ఉంటుంది.

ఇంత చెప్పినా, మీరో వాదన లేవదీస్తే నేను చచ్చినట్టు అంగీకరించక తప్పదు: ఏది ఉత్తమమైన రచన, ఏది కాదు అన్న తీర్పు వ్యక్తిగత అభిరుచిని బట్టి మారుతుందని మీరంటే, నేను ఔననక చేసేదేం లేదు. కొంతమంది పాఠకులు తాము చదివే రచయితలు వెంట్రిలాక్విస్టులో, తోలుబొమ్మల ఆటగాళ్ళో అయితే చాలనుకుంటారు; కొంత మంది మాత్రం తమ రచయితలు విశ్వస్రష్ట తో (Alimighty) పోటీ పడాలనుకుంటారు. నేనీ విభాగపు పాఠకుడ్నే. సృష్టికర్త తన సృష్టితో అవిభాజ్యమై ఉంటూనే ఎలా నిమిత్తమాత్రత వహిస్తాడో, రచయితలూ వారి రచనల నుండి అదే డిటాచ్‌మెంట్‌తో మెలగాలని నేను కోరుకుంటాను. సృష్టికర్త తన సృజనలో ఎపుడూ వేలు పెట్టడు, చొరబడి వ్యాఖ్యానాలివ్వడు, తన పాత్రలకు తన గొంతు ఇవ్వడు, తన పాత్రలపై తన మొరాలిటీ రుద్దడు. సృజన మాత్రమే ఆయన పని; సారాన్ని గ్రహించే కష్టమంతా (పడాలనుకుంటే) మనం పడాల్సిందే. ఆయన తన సృజనకు ఆపాదించిన ఈ స్వతంత్రతే సృష్టిని ఇంత వైవిధ్యంతో, సజీవ చైతన్యంతో అలరారేలా చేస్తుంది. దీనికి విరుద్దంగా తమ పాత్రల్ని ప్రాణంలేని ప్లాస్టిక్‌బొమ్మల్లా వళ్ళో కూర్చో బెట్టుకుని తామే మాట్లాడేసే వెంట్రిలాక్విస్టు రచయితలంటే నాకు మా చెడ్డ చిరాకు. వాళ్ళ నెల తక్కువ సిధ్థాంతాలూ, పక్వానికి రాని భావాలు నాకు అవసరం లేదు. వాళ్ళు తమ రచనకు ఉద్దేశించిన అమూర్త భావాలను, కళాత్మకమైన దృశ్యాల అమరికతో మనకు సమర్పించ గలగాలి; వారి రచనలు వారితో నిమిత్తం లేకుండా తమదైన స్వతంత్ర అస్థిత్వాన్ని కలిగి ఉండాలి—ఇంతే నేను ఆశించేది. అయితే, ఇది నా వ్యక్తిగత అభిరుచిమాత్రమేనా? కార్లూ బైకులూ వచ్చాక కూడా ఎవడైనా ఎద్దులబండి నా వ్యక్తిగత అభిరుచి అన్నాడనుకోండి, బైకు మీద వెళ్ళేవాడు బైకు తన వ్యక్తిగత అభిరుచి అని చెప్పుకోవాలా లేక ఎద్దులబండి కన్నా బైక్ కార్యానుకూలత పరంగా ఉన్నతమైందన్న నిజాన్ని నొక్కి చెప్పాలా. (Clumsy metaphor... I give you that. Nevertheless, you know what I mean by it, right?)

సంగీతం మినహాయించి ప్రతీ కళా దృశ్య మాధ్యమం ద్వారానే మన దాకా చేరుతుంది. అంతెందుకు, మనమెవరం ఆలోచించేప్పుడు వాక్యాల్తోనూ, శబ్దాల్తోనూ, వాసనల్తోనూ ఆలోచించం; దృశ్యాల్తో ఆలోచిస్తాం. "టమాటా" అనగానే ఒక ఎరుపు రంగు గుండ్రని ఫలం మన మస్తిష్క ఫలకంపై ఎలా ప్రత్యక్షమౌతుందో, "సీతాకోక చిలుక" అనగానే దాని రెక్కలపై రంగుల అల్లిక వెంటనే మనకు ఎలా స్ఫురిస్తుందో అలాగే "ప్రేమ" అనగానే ప్రియురాలి ముఖారవిందమో, అరణ్యాల పచ్చదనమో, గాలివాటుకు ఏటవాలుగా నేలరాల్తున్న గుల్‌మొహర్ పూలజల్లో, కనీసం మనం చూసిన సినిమాలో ప్రేమ సన్నివేశమో, ఇవేమీ కాకపోతే "ప్రే" "మ" అన్న రెండు అక్షరాలో ఇలా ఏదో ఒక దృశ్యం మెదడులోనికి చొచ్చుకు వస్తుంది. టమాటా లాంటి కాంక్రీట్ వస్తువులే కాదు, ప్రేమ లాంటి ఆబ్‌స్ట్రాక్ట్ భావనలు కూడా (వ్యక్తి వక్తికీ విభిన్నంగా) కొన్ని దృశ్యచిత్రాలతో జతకట్టి ఉంటాయి. (అయితే పై ఉదాహరణలు దృశ్య మాధ్యమంపై అధికంగా ఆధారపడే వ్యక్తికి మాత్రమే వర్తిస్తాయి. ఘ్రాణ మాధ్యమం శక్తివంతంగా ఉన్న వ్యక్తికి "ప్రేమ" అనగానే ఏ మొగలిపూల వాసనో, ప్రియురాలి ఒంటి ఫెర్‌ఫ్యూమ్ పరిమళమో అనుభవానికి రావొచ్చు. శ్రవణ మాధ్యమం ప్రధానంగా ఉన్న వ్యక్తికి "ప్రేమ" అనగానే పక్షుల కిలకిలారవాలో, "బొమ్మరిల్లు" సినిమా నేపథ్య సంగీతమో వినిపించవచ్చు. కాని రచన అనేది భాష పై ఆధారపడిన కళ. భాష ద్వారా పాఠకుడికి దృశ్యాన్ని నిర్మించి ఇచ్చినంత ప్రభావవంతంగా, అతనిచే వాసనల్ని ఆఘ్రాణింప జేయలేము; శబ్దాల్ని వినిపింప జేయలేము.) కాబట్టి రచయిత సాధ్యమైనంత వరకూ మానవ మస్తిష్కపు ఈ ఫాకల్టీని ఎక్స్‌ప్లాయిట్ చేసుకోవాలి. ఇది సులభం కాదు; ఇది రచయితలకూ సులభం కాదు, పాఠకులకూ సులభం కాదు. ఆసక్తికరమైన విషయ మేమిటంటే అందరూ ప్రతీ కళకూ దాన్ని అనుభూతించగోరే వారినుండీ కొంత అభినివేశాన్ని ఆశిస్తారు—సంగీతానికి శ్రోతల నుండీ, శిల్ప చిత్ర కళలకు చూపరుల నుండీ కొంత అవగాహనను కోరతారు. పికాసో, వాన్‌గోల చిత్రాలు అందరికీ అర్థమవ్వాలని ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయరు; హరిప్రసాద్ చౌరాసియా, బాలమురళీ కృష్ణల సంగీతం అందరికీ సమానంగా ఆనందం పంచుతుందని ఎవరూ ఆశించరు. వారి వారి కళలను అర్థం చేసుకోవాలంటే ఆ విభాగంలో మనం కొంత పరిజ్ఞానం సంపాదించాలి. (ఎందుకు సంపాదించాలి అంటే—కళాకారుడి కళకూ, మన అభినివేశానికీ శృతి కుదిరినపుడు అది మన కందించే ఆనందం అలౌకికం, వర్ణనాతీతం కాబట్టి.) కాని ఎందుకో కేవలం పాఠకుల నుండే ఎవరూ ఎలాంటి పరిజ్ఞానాన్నీ ఆశించరు. రచయిత స్థాయిని పాఠకుడు అందిపుచ్చు కోవడం కాదు, రచయితే పాఠకుడి స్థాయికి దిగిరాయాలని ఆశిస్తారు. సాహిత్యం యొక్క ఈ ప్రజాస్వామికీకరణ సాహిత్యానికి ద్రోహమే చేసిందని నా అభిప్రాయం. ఈ దుష్ట సిద్థాంతపు తొలి బీజాలు "సాహిత్యం యొక్క ఏకైక లక్ష్యం సమాజహితం" అన్న వాదనతో ఏర్పడ్డాయి. సాహిత్యంకానీ, ఏ కళకానీ వాటి లక్ష్యం సమాజహితం కాదు. కళ యొక్క విశాలపరిధి ఈ ఇరుకు చట్రాల్లో ఇమడదు. (అసలు ఇంగ్లీషులోని "లిటరేచర్" అన్న పదాన్ని తెలుగులో "సాహిత్యం" అన్న పదంతో అనువదించడమే ఈ సంకుచితార్థాన్ని సూచిస్తుంది. "వాఙ్మయం" అనేది సముచితమైన పదం నా దృష్టిలో.) ఏ రచనైనా ముందు స్వతస్సిద్దంగా కళాత్మక విలువలు కలిగి ఉండాలి; మిగతావన్నీ సెకండరీ లక్ష్యాలు. శ్రీశ్రీ కూడా "కర్షకవీరుల కాయం నిండా/ కాలువకట్టే ఘర్మజలానికి/ ధర్మజలానికి/ ఘర్మజలానికి ఖరీదు లేదోయ్!" అంటూ తన "ప్రతిజ్ఞ" రాస్తున్నపుడు ముందు ప్రాస సంగతి ఆలోచించి ఉంటాడు; తర్వాతే కర్షక వీరుల సంగతి.—సరే... నేను మీకు ఇవ్వదల్చుకున్న సమాధానం ఇచ్చి చాలాసేపయింది. There is no point in rambling on like this... వదిలేద్దాం.

పోతే... ఏవిఁటండీ!—నా "పుస్తక పఠనం" పోస్టు మీద మీ వ్యాఖ్య ఇంకా ప్రొసెసింగ్ లోనే ఉందా! అయితే నాకు మీరేదో పెద్ద పనే పెట్టబోయేట్టున్నారు. కొంపదీసి "మైదానం", "అసమర్థుని జీవయాత్ర"ల్ని పునశ్చరణ చేయాల్సిన కష్టం కలిగించరు కదా! అయినా ఆసక్తిగా ఎదురుచూస్తుంటాను.
..