February 3, 2008

వీడ్కోలు

రైలు కూత పెట్టింది. కిటికీ బయట వంగినిల్చొని, ఆమెతో ఆత్మీయ సంభాషణలో నిమగ్నమై ఉన్న అతను, తెప్పరిల్లి పరిసరాల స్పృహలోకి వచ్చాడు. ప్లాట్‌ఫాం, జనసందోహం, కళవళం. అప్పటిదాకా ప్రయత్నపూర్వకంగా చైతన్యపు వెలిఅంచులకు నెట్టేసిన ఓ అనివార్యమైన ఆలోచన, ఇపుడు చొరవగా చొరబడి అతని మస్తిష్కమంతా నల్లని నీడలా విస్తరించింది: ఆమె వెళిపోతుంది. నిజానికి ఆమె వెళిపోతుంది అన్న ఆలోచన కంటే, రైలు వెళ్ళిపోయిన మరు క్షణం ప్లాట్‌ఫాం మీద తాను ఒంటరిగా మిగిలి ఉంటానన్న స్ఫురణే అతనిలోని సత్తువనంతా పిండేస్తుంది. అరగంట క్రితం ఆటోలో స్టేషన్‌కు వస్తుంటే, తన ఎడమ భుజంపై బరువుగా వాలిన ఆమె శిరస్సు పరిమళం; తన గరుకు చెంపపై ఆమె వాయువిగళిత శిరోజాల చక్కిలిగిలి. పది నిముషాల క్రితం వరకూ ప్లాట్‌ఫాం మీది సిమెంటు బెంచీలో జంటగా కూర్చుని, వేళ్ళలో వేళ్ళు జొనిపి చేతులు ముడేస్తే — అరచేతుల్లో పట్టిన చిరుచెమటలు; ప్రక్క బెంచీలో వాళ్ళమ్మ వళ్ళో ముభావంగా, అలౌకికంగా బొటనవ్రేలు చప్పరిస్తూన్న రెండేళ్ళ అపరిచితుడి దృష్టిని ఆకర్షించడానికి, నవ్వించడానికి తాము పోటాపోటీగా పడ్డ పాట్లు. — ఇపుడు కొద్ది క్షణాల్లో ఈ రాక్షస వాహనం ఆమెనీ, ఆమెతనాన్నీ తన నుండి దూరంగా తీసుకు పోతుంది. తను మళ్ళీ వచ్చిన దారినే, శూన్యం జతగా, ఇంటికి వెళ్ళాలి.

ఆమె వేరే ధ్యాసలో ఏదో మాట్లాడుతుంది. అతని కనుగుడ్లపై కన్నీరు పొర కట్టడం ప్రారంభమైంది. చేత్తో తుడిచేసుకునే వాడే కాని, ఆమె ఇంకా తన కన్నీటిని గమనించక పోయి ఉంటే, ఆ చర్యతో ఆమె ధ్యాస తన కళ్ళ పైకి మరలు తుందేమోనని సంకోచించాడు. ఈ దీనావస్థ తనపై తనకు కలిగించిన జాలి, కన్నీటి ఊటను మరింత ఉధృతం చేసింది. మట్టం ఏ క్షణమైనా కనురెప్పల చెలియలికట్టను దాటి చెంపల పైకి తొణికేలా ఉంది. అతన్ని రక్షిస్తూ, ఆమె ప్రక్కన కూర్చున్న వారెవరో ఆమెను ఏదో వివరం అడిగారు. అటువైపు తిరిగింది. అతను తనివితీరా కళ్ళు తుడుచు కున్నాడు. అదే క్షణంలో రైలు ఓ సందిగ్ధమైన కదలిక ఇచ్చి, ఆగి, మరలా కదిలింది. చుట్టు ప్రక్కల కిటికీల దగ్గిర మూగిన జనాల్లో సందడి పెరిగింది. వీడ్కోలు వచనాలు — కొన్ని ఆ క్షణానికై ముందే దాచి పెట్టుకున్నవీ, కొన్ని ఆశువుగా బయల్పడినవీ — వికీర్ణ శకలాలుగా అతని చెవిని తాకుతున్నాయి: "చేరగానే ఫోన్..."; "టాబ్లెట్స్ జాగ్రత్తగా..."; "అంకుల్న డిగానని..."; "ఏసేహీ కభీ, ఈద్ కా చాంద్...". అతనికి మాట పెగలడం లేదు. ఆమె ఆశింపుగా అతని కళ్ళలోకి చూస్తుంది. అతను ప్రతిగా కిటికీ ఊచలపై ఉన్న ఆమె చేయిపై తన చేయి వేసి, రైలుతో పాటు నడవడం ప్రారంభించాడు. ఇరువురి చూపులు స్థిరంగా ముడి పడి పోయాయి. రైలు వడి పెరిగింది. అతని వడి పెరిగింది. జనాలు తగులు కుంటున్నారు. అతను మాత్రం చేతిపై నుండి చేయి తీయకుండా, నడకా పరుగూ కలిపి తోసుకు వస్తున్నాడు.. "ఆగిపో" — ఆమె జాలిగా చెప్పింది. అతను చేయి తీసేసి నిలిచి పోయాడు. రైలు అతన్ని వదిలి ముందుకు కదిలి పోయింది. ఆమె, దూరమై పోతూ, ఊచలకు మొహం అదిమి పెట్టి తొంగి చూస్తుంది. ఎదుట పట్టాలు అతనికి ఎడంగా ఒంపు తిరిగి ఉండటం వల్ల మలుపులో ఆమె కిటికీ మాయమై పోయింది. కిటికీ ఊచల మధ్య నుండి బయటకు సాచిన చేయి వీడ్కోలు సూచకంగా ఇంకా గాల్లో ఊగుతూ కనిపిస్తుంది. క్షణం క్రితం తన చేతిలో ఉన్న చేయి, ఇపుడు దూరంగా అసంబద్దంగా గాల్లో ఊగుతూ.... ఇదేమన్నా మార్చలేని విధా? తను తల వంచి తీరాలా? రైలు వడి ఇంకా అందుబాటులోనే ఉంది. ఉన్నపాటున పరిగెత్తి అందిన భోగీలోకి ఎక్కేస్తే. టికెట్...? హూ గివ్సె షిట్. — తెగింపు ఓ కొలిక్కి రాక ముందే రైలు అతన్ని దాటుకుని ముందుకు వెళిపోయింది. చివరి భోగీ వెనుక తాపడమై ఉన్న ఎర్రని విద్యుత్‌దీపం అతని పిచ్చి ఆలోచనల్ని వెక్కిరిస్తున్నట్టు వెలిగి ఆరుతుంది. అతను కాసేపలాగే చిత్ర ప్రతిమలా నిలబడి, నిట్టూర్చి, వెనుదిరిగాడు. ప్లాట్‌ఫాం, జనసందోహం, కళవళం.

0 స్పందనలు:

మీ మాట...