March 15, 2008

What we talk about really when we talk about reality

రియాలిటీ. వాస్తవికత. ఈ పదం చాలామంది సాహిత్య విమర్శకుల చేతిలో నమ్మకమైన కొలత బద్ద; దీంతో ఏ రచననైనా కొలిచి విలువ కట్టొచ్చని వారు విశ్వసిస్తారు. ఎంతటి రచయితలూ ఈ అస్త్రం తమపై ఎక్కుపెట్టబడేసరికి నిరుత్తరులై తలవంచుతారు. మరి నిజంగా రచనలకు ఇది అంత ప్రామాణికమైన కొలతా? తిరుగులేని అస్త్రమా? ఫలానా రచనలో వాస్తవికత లోపించిందీ లేదా ఫలానా రచన వాస్తవానికి అద్దం పట్టింది అని తీర్మానించి, దాని పరంగా రచన విలువను తూకం కడుతున్నపుడు, ఈ విమర్శకులు ఏ “వాస్తవికత” గురించి మాట్లాడుతున్నారు? కాస్త నిశితంగా ఆలోచిస్తే ఈ ప్రశ్నలకు తట్టే సమాధానం ఇది: వారు కేవలం ఆ రచన తమ స్వీయ వాస్తవికత (Subjective reality)కు దగ్గిరగా వచ్చిందీ లేనిదీ, లేదా సామూహికంగా ఏది వాస్తవికతగా అంగీకరింప బడిందో దాన్ని ప్రతిబింబించిందీ లేనిదీ మాత్రమే చెప్తున్నారు. ఎందుకంటే, వస్తుగత వాస్తవికత (Objective reality)ను ఎవరూ గ్రహించలేరు. ఉండటమైతే దాని ఉనికి ఉంది; కాని స్వీయ చేతనా పరిధుల్ని ఛేదించి దాన్నెవరూ దర్శించలేరు. ఎందుకనేది — కాసేపీ పడికట్టు పదాల్ని వదిలేసి — ఒక ఉదాహరణ ద్వారా పరిశీలిద్దాం:

ఒక అరణ్య మార్గం గూండా ముగ్గురు వ్యక్తులు నడుస్తున్న సందర్భాన్ని ఊహిద్దాం. మొదటివాడు పట్టణం నుండి వచ్చిన యాత్రికుడు. రెండవాడు వృక్షశాస్త్రజ్ఞుడు. మూడవవాడు స్థానిక గ్రామపు రైతు. మొదటివాడైన పట్టణ యాత్రికుడి దృష్టంతా తన గమ్యం మీద ఉంటుంది. అక్కడ తనకు సరైన విడిది సౌకర్యం లభిస్తుందో లేదో, అక్కడ సరైన హోటళ్ళున్నాయో లేవోనన్న విచికిత్సతో నిండివున్న అతని మస్తిష్కంలో, చుట్టూ దారి కిరువైపులా బారులు తీరి వున్న వృక్ష సౌందర్యం ఎలాంటి కదలికా కలిగించదు. అతనికి సంబంధించినంత వరకూ చెట్లు చెట్లే, మొక్కలు మొక్కలే; అంతకన్నా వాటికి ఏ విలువా ఉండదు. రెండోవాడైన వృక్షశాస్త్రజ్ఞుడికి ఈ అరణ్యమంతా మిక్కిలి ఆసక్తిని కలిగిస్తుంది. నడిచేటపుడు అటూ ఇటూ చూసుకుంటూ, అవ్యవధానంగా ఫలానా ఫలానా వృక్షాల శాస్త్రీయనామాల్ని మనసులో మననం చేసుకుంటూ నడుస్తాడు. అతనికి సంబంధించినంత వరకూ ఆ అరణ్యపు పరిసరాలన్నీ వృక్షాలుగా, మొక్కలుగా, పొదలుగా, పాదులుగా ఖచ్చితమైన విభజనతో ఉంటాయి; నియమిత జాతులుగా ఉపజాతులుగా వర్గీకరించబడి ఉంటాయి. మర్రిచెట్టుకూ రావిచెట్టుకూ తేడా తెలియని యాత్రికుని వాస్తవికత అతనికి అర్థం కాదు. అలాంటి ఉదాసీనత అతనికి సంబంధించినంత వరకూ అనూహ్యం, విచిత్రం, అసంగతం. చివరిగా, మూడోవాడైన రైతు యొక్క మానసిక ప్రపంచం పై ఇరువురికన్నా భిన్నమై ఉంటుంది. అతడిక్కడే పుట్టి పెరిగినవాడు. అతనికి ఇక్కడ ప్రతీ చెట్టూ, ప్రతీ తొర్రా, ప్రతీ కొమ్మా, ప్రతీ ఊడా సుపరిచితమే. ఆ అరణ్యం అతనిలో యాత్రికునికి మల్లే ఉదాసీనతా కలిగించదు, వృక్షశాస్త్రజ్ఞుడికి మల్లే శాస్త్రీయపరమైన ఆసక్తీ రేకెత్తించదు. ఆ అరణ్యం అతని వ్యక్తిగత అనుభూతులతో ముడిపడి ఉంటుంది; అతన్ని బాల్య స్మృతులలో ఓలలాడిస్తుంది. ఆ అరణ్యం అతనిలో ఉద్దీపింపజేసే సున్నితమైన భావోద్వేగాల్ని పట్టణ యాత్రికుడూ, వృక్షశాస్త్రజ్ఞుడూ ఎన్నటికీ అర్థం చేసుకోలేరు.

అక్కడ ఉన్నవీ, ముగ్గురికీ కనపడుతున్నవీ ఒకే రకమైన చెట్లు, ఒకే రకమైన మొక్కలు — ఒకే రకమైన వస్తుగత వాస్తవికత; కానీ దానిని ముగ్గురిలో ఏ ఒక్కరూ యథాతథంగా స్వీకరించ లేకపోతున్నారు. చెట్టు, పొద, మొక్క లాంటి పూర్తి objective పదార్థాలు కూడా ముగ్గురిలో విభిన్నమైన స్వకీయ ప్రతిస్పందనల్ని రేకెత్తిస్తున్నాయి; స్వీయ వాస్తవికతను కల్పిస్తున్నాయి. ఇక్కడ మనం మూడు వేర్వేరు ప్రపంచాల్ని చూస్తున్నాం; మూడు వేర్వేరు వాస్తవికతల్ని చూస్తున్నాం: ఒకటి ప్రకృతిని ప్రకృతిగానే చూసేది; మరొకటి ప్రకృతిని శాస్త్రీయ దృక్కోణంలో చూసేది; ఇంకొకటి ప్రకృతిని వ్యక్తిగత అనుభూతుల, జ్ఞాపకాల కటకం ద్వారా దర్శించేది. వీటికి మనం ఇంకొన్ని ఉదాహరణల్ని కూడా జత చేయవచ్చు: ఓ కుక్కతో నడుస్తున్న గుడ్డివాడు, తన యజమానితో నడుస్తున్న కుక్క, హృద్యమైన అస్తమయ దృశ్యం కోసం అన్వేషిస్తున్న చిత్రకారుడు, పెట్రోలయిపోయిన కారుతో నిలబడి ఉన్న అమ్మాయి... ఇలా ప్రతీ వ్యక్తిలోనూ ఇవే పరిసరాలు వేర్వేరు స్వీయ వాస్తవికతలుగా వక్రీభవించి ప్రతిఫలిస్తాయి. మరి మనం వస్తుగత వాస్తవికతను గ్రహించే మార్గమే లేదా? — అంటే లేదు (ఇందాకా చెప్పినట్టు మనం మన మస్తిష్కమనే చెరసాలలో జీవిత ఖైదీలం); కాని దానికి కాస్త దగ్గిరగా వచ్చే మార్గం ఉంది. ఎలా అంటే — నవ్వకండి — ఇపుడు పైన వివరించిన వేర్వేరు వ్యక్తుల స్వీయ వాస్తవికతల్ని స్వీకరించి, ఒక పరీక్షనాళికలో వేసి, బాగా గిలక్కొడితే వచ్చే మిశ్రమం సోకాల్డ్ వస్తుగత వాస్తవికతకు కాస్త దగ్గిరగా రావొచ్చు. దీన్ని సామూహిక వాస్తవికత (Collective reality) అందాం. అయితే ఈ సామూహిక వాస్తవికత యొక్క గుణం ఎప్పుడూ స్థిరంగా ఉండదు. ఇపుడు పైన ఉదహరించిన పరిసరాల్లోంచి ఒక పిచ్చివాడు కూడా నడుస్తూ వెళ్ళాడనుకోండి; మనకు లభించే మిశ్రమంలో కాస్త పిచ్చితనం కూడా వచ్చి చేరుతుంది. మరి విమర్శకులు “వాస్తవికత” అన్న పదాన్ని వాడుతున్నపుడు ఈ అస్థిరమైన, అమూర్తమైన “సామూహిక వాస్తవికత” అనే అర్థంలో వాడుతున్నారా? అసలు రచయితలు ఈ సామూహిక వాస్తవికతపై ఆధారపడి తమ రచనలు చేయాలా?

ఒక్కసారి ఊహించండి: రద్దీ రహదారి పై నడుస్తున్నపుడో, క్రిక్కిరిసిన థియేటర్లో కూర్చున్నపుడో... మీ చుట్టూ తలలు! కొన్ని హెల్మెట్లలోనూ, కొన్ని టోపీల క్రిందా, కొన్ని బట్టతలలతోనూ, కొన్ని బారెడు జడలతోనూ... వేల వేల తలలు! వీటన్నింటిలోనూ వేల వేల ప్రపంచాలు! అంటే, ఒక్క ప్రపంచానికి వేల వేల వెర్షన్లు. ఒక ప్రపంచపు వాస్తవికత మరో ప్రపంచపు వాస్తవికత కాదు. ఈ విషయం తెలిసి కూడా కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డులో కుర్రాడొకడు తెగ మథన పడిపోతుంటాడు. విషయమేవిటంటే — వాడు అదే హౌసింగ్‌బోర్డులో రెండు వీథుల కవతల, ముంగిట నిత్యమల్లె చెట్టు ఉండే ఓ ఇంట్లోని అమ్మాయితో నిండా ప్రేమలో మునిగిపోయాడు. (నిజానికి ఆ అమ్మాయి కోసమే అక్కడ మకాం పెట్టాడు.) ఆ అమ్మాయి పాటికి ఆ అమ్మాయి తన జీవితం తను జీవించేస్తుంటుంది. ఆ పిల్ల లోకల్‌ట్రైన్ దిగి హడావిడిగా తన ఉద్యోగానికి నడిచిపోతుంటే మనవాడు ఇవతలి ప్లాట్‌ఫాం మీద నిల్చొని తెగ ఆశ్చర్యపడిపోతుంటాడు. ఆశ్చర్యం ఎందుకంటే — ఆ అమ్మాయి నడుస్తుంటే ప్లాట్‌ఫాం పై ఎవ్వరి తలలూ ఆమె వైపు తిరగవు; ఎవరూ తమ పనులు మాని ఆమె వంకే నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోరు. ఆశ్చర్యమే కాదు; ఆమె వెళిపోయాక, ఆమె నవ్వులన్నీ తన గైర్హాజరీలో అర్హత లేని మొహాల ముందు వ్యర్థంగా ఖర్చయిపోతున్నాయని తెగ ఇదయిపోతుంటాడు కూడా. ఆమె బేరం అడుతుంటే విసుగ్గా బదులిచ్చే షాపువాడ్నీ, సాక్షాత్తూ ఆమె టికెట్‌కౌంటర్ దగ్గర నిలబడితే కనీసం తల కూడా ఎత్తకుండా టికెట్ కొట్టిచ్చేసే రైల్వే ఉద్యోగినీ చూసి వాడు విస్తుపోతుంటాడు. కాని ఇలాంటపుడే, వాడి భావుకత్వపు డిప్ప మీద హేతువు ఒక్క పీకు పీకి, “రేయ్! ఆ అమ్మాయి నీక్కనిపించినంత వాస్తవంగా వేరెవరికీ కనిపించదురా. ఆ అమ్మాయి నవ్వితే ఇక్కడ నీ మనసులా ఇంకెవ్వరి మనసులూ మతాబా రవ్వలై రాలి పడవురా” అంటూ ఓ నిష్ఠుర నిజాన్ని వాడి ముందు పడేస్తుంది. అప్పుడు చూడాలి వాడి మొహం! — హేతువే గనక మూర్తీభవించి వాడి ముందుకొస్తే “నీకు పనేంటే అసలిక్కడా” అంటూ మీద పడి రక్కేస్తాడు. కాని హేతువు హేతువే; నిజం నిజమే. వాడి వాస్తవిక ప్రపంచానికి ఆ అమ్మాయి అధిదేవత; మిగతా ప్రపంచానికి ఆమె ఒక అమ్మాయి, అంతే.

సరే వాడి సంగతి వదిలేద్దాం. ఇందాక మన చుట్టూ ఉన్న వేల వేల తలల గురించీ వాటిలో వసించే వేల వేల ప్రపంచాల గురించీ చెప్పుకుంటున్నాం కదా. వీళ్ళందరిలో తన ప్రపంచానికి tangible రూపం ఇయ్యగలిగేవాడు కళాకారుడొక్కడే. మిగతా ప్రపంచాలన్నీ ఆయా వ్యక్తులతో పాటూ మృతి చెంది మృత్తిక పొరల్లో లీనమై పోవాల్సిందే. కేవలం కళాకారుడొక్కడే తన ప్రపంచానికి అమరత్వాన్ని ఆపాదించగలడు (I am thinking about the ultimate range of Valmiki and Shakespeare now). మరి ఈ ఉత్కృష్టమైన వరాన్ని పొందిన రచయిత కేవలం సోకాల్డ్ సామూహిక వాస్తవికత యొక్క ఆమోదం పొందే ప్రయత్నంలో, తన సృజన దానిని ప్రతిబింబించి తీరాలన్న బాహ్య ఒత్తిడికి లొంగి తనదైన ప్రపంచపు వైవిధ్యాన్ని, అద్వితీయతనూ డైల్యూట్ చేసి బయట పెట్టాలా? ఉదాహరణకి నేను ఇంతకుముందు ప్రస్తావించిన పాగల్‌గాడి సంగతే తీసుకుందాం. వాడే ఓ ప్రేమ కథ రచించాడనుకుందాం. ప్రేమ పై వాడి దృక్కోణం వేరు. ప్రేమకు సంబంధించినంత వరకూ వాడి వాస్తవికత వేరు. అతడు తన ప్రేమను కేవలం ఆమెకూ తనకూ నడుమ వ్యవహారంగా సరిపుచ్చడు; మధ్యలో మొత్తం సృష్టి యంత్రాంగాన్నే ఇరికిస్తాడు. సృష్టిలో ప్రతీ మామూలు ఉదంతం, ప్రతీ యాదృఛ్చిక ఘటనా తామిరువుర్నీ చేరువ చేయడానికే (లేదా దూరం చేయడానికే) సంభవిస్తున్నాయని నమ్ముతాడు. అకాలంగా వాన కురిసినా, పూర్ణ చంద్రుడు వెన్నెల గుడి కట్టినా, సూర్యుడు ఆకాశానికి అందమైన రంగులు పులిమి అస్తమిస్తున్నా, చుక్క రాలినా, పూలు రాలినా అన్నీ తన ప్రేమకు అందమైన నేపథ్యాన్నివ్వడానికే జరుగుతున్నాయని నమ్ముతాడు. విశ్వపు ఆలనా పాలనా చూసే హస్తమేదో తమ ఇద్దర్నీ జతగా ముందే రాత రాసి పెట్టిందని విశ్వసిస్తాడు. అతడీ ప్రపంచాన్ని యథాతథంగా స్వీకరించడు; తన ప్రేమ మాధ్యమం ద్వారా వడగట్టి ఆ వక్రీభవించిన వెర్షన్‌నే స్వీకరిస్తాడు. అది వాడి వాస్తవికత. ఇపుడు వాడు సృజించే ప్రేమకథ ఈ రియాలిటీతోనే ఉంటుంది; సృష్టిని ఈ mystic view తోనే మన ముందుంచుతుంది. ఇపుడిందులో వాస్తవికత లేదని ఎవరైనా అంటే.... ఏ వాస్తవికత? ఎవడి వాస్తవికత?

నేనిక్కడ రచయిత తనదైన వాస్తవికతనే ప్రతిబింబిస్తూ రచనలు చేయాలన్న అపూర్వమైన విషయాన్నేం ప్రతిపాదించడం లేదు; ఎందుకంటే ప్రతీ రచయితా ప్రత్యేక ప్రయత్నమేమీ లేకుండానే తన వాస్తవికతనే చిత్రిస్తాడు. అయితే తన ఈ వాస్తవికత అందరికీ ఆమోదయోగ్యం కాదు కదా అన్న అదృశ్య ఒత్తిడికి లొంగి తన రచన యొక్క గాఢతను పలచబరచుకో కూడదని చెప్తున్నాను. తను చూసినట్టు అందరూ ఈ ప్రపంచాన్ని చూడరేమోనన్న సంశయంతో తన దృక్కోణాన్ని మసకబార్చుకో కూడదని చెప్తున్నాను. ఎందుకంటే మనకు కావాల్సింది అతని ప్రత్యేకమైన వాస్తవికతే; అతని ప్రత్యేకమైన దృక్కోణమే. మనకు కావాల్సింది — తనదైన ప్రపంచానికి కల్పన జోడించి అతను అందించగలిగే స్వయం సమృద్ధ ప్రపంచమే (Self-contained World). అతని రచనలు రియాలిటీని ప్రతిబింబించనక్కర్లేదు; తన subjective realityని ప్రతిబింబిస్తే చాలు. వాటిలో లాజిక్ ఉండనవసరం లేదు; తమదైన internal logic చూపించగలిగితే చాలు. A writer has no obligation to any reality except his own.

********

ఈ వ్యాసంలోని ముగ్గురు వ్యక్తుల ఉదాహరణ, కార్నెల్ విశ్వవిద్యాలయంలో కాఫ్కా "మెటమార్ఫసిస్"ను విశ్లేషిస్తూ, వ్లదీమర్ నబొకొవ్ ఇచ్చిన ఉపన్యాసం నుండి స్వీకరించబడింది.

12 comments:

 1. భైరవభట్ల కామేశ్వర రావు11:47 AM

  ఈ టపా నాకు కాస్త గందరగోళంగానే ఉంది. మీరిచ్చిన ఉదాహరణబట్టి చూస్తే మీరక్కడ చెప్పినవి వేరువేరు దృక్కోణాలు (perspectives). అవెప్పుడూ చూసేవాళ్ళమీదే ఆధారపడి ఉంటాయి (Perspectives are always Subjective by definition). వాటిని "స్వీయ వాస్తవికత" అనడం ఎందుకో అర్థం కాలేదు.
  రచయితలూ విమర్శకులగురించీ చెప్పడం ముఖ్యోద్దేశమైతే, వాళ్ళకి సంబంధించిన ఉదాహరణలిచ్చి ఉంటే మరి కొంత స్పష్టంగా ఉండేదేమో.

  ReplyDelete
 2. To: Kameshwara Rao,

  "Subjective Reality" or "Subjective perspective", whatever the name you give it, that doesn't change a thing. I called it "Subjective Reality" because there is a thing called "Objective Reality" that most of the critics consciously or unconsciously follow as a standard for criticism. I wanted to say that it doesn't exist.

  "మీరక్కడ చెప్పినవి వేరువేరు దృక్కోణాలు (perspectives)."

  ఈ ప్రపంచంలో దృక్కోణాలే తప్పించి వేరే ఏవన్నా ఉంటాయని మీరనుకుంటున్నారా?

  In this post I wanted to say that there is nothing called "reality", and critics who use words like "lack of reality" against a work of art are not proving anything.

  Yeah... may be I should have given more examples. But I have given one. I thought it would suffice.

  ReplyDelete
 3. భైరవభట్ల కామేశ్వర రావు11:48 AM

  Hmm...Let me try to explain what (objective) reality means to me, pardon me if I sound like Plato here.

  Infact, your example itself is a very good example of objective reality, not subjective one. Let's take the botanist. Do any two botanists look at the landscape exactly the same way? The answer is obvious, No! But why are we giving it as an example that a botanist would think that way? Because there is a high probability that a typical botanist would think in similar lines. In other words, there is a certain commonality of how different botanists would think about the same landscape. And we are using that to easily communicate what we want to communicate.

  Now, let us extend this to all the human beings. There is a certain commonolity in the perception among majority of humans towards objects, for example when people see a tree or think about a tree. That is what I think is called reality. So it is not a union(like what the article suggests) but an intersection of the understanding/perspective of majority of the humans. In addition to this, we also give more importance to the sceintific understanding, though is limited to a minority, and make it as part of reality.

  I never came across a serious critisism that undermines a literary work just because it is a fiction or fantasy or away from reality.

  ReplyDelete
 4. To: భైరవభట్ల కామేశ్వర రావు,

  ఆబ్జెక్టివ్ రియాలిటీ అన్న పదాన్ని నిఘంటువులో ఒకసారి తరచి చూడండి. మీరు ఆబ్జెక్టివ్ రియాలిటీ అంటున్నది ఆ అర్థానికి తగదు. This vague term "Certain commonality" can never be objective reality. ఇప్పుడు మీరు ఆబ్జెక్టివ్ రియాలిటీ అంటున్న దానికే నేనో పేరు ఇచ్చాను: Collective reality (సామూహిక వాస్తవికత), లేదా Mixed reality (మిశ్రమ వాస్తవికత). ఆబ్జెక్టివ్ రియాలిటీ అన్నది ఎప్పుడూ మన దృక్కోణానికి అతీతంగానే ఉంటుంది. You cannot perceive it.

  "There is a certain commonality in the perception among majority of humans towards objects, for example when people see a tree or think about a tree. That is what I think is called reality."

  This is what I call "Common reality". This can never substitute "Reality".

  "I never came across a serious criticism that undermines a literary work just because it is a fiction or fantasy or away from reality."

  Common! You must be complete alien to criticism then. I see it everywhere. Juks of it actually.

  ఒక వేళ లా ఆర్టికల్ ఈ sense రప్పించలేక పోయిందంటే, మీరొకసారి నేను దీనికి జత చేసిన లింకు చూడండి. అదింకా విశదీకరిస్తుంది.

  ReplyDelete
 5. భైరవభట్ల కామేశ్వర రావు11:51 AM

  Now, we are getting into 'real' philosophy, a discussion on definition of words :-)

  Are you talking about the definition "Objective reality refers to anything that exists as it is, independent of any conscious awareness of it".

  Here if the meaning of the word 'independent' is taken as something "outside of" conscious awareness, something that consious awareness does not and cannot know, then I agree with what you say. There is no such thing as "Objective reality". Infact I say it is meaningless, more appropriately useless. So it cannot be a correct/useful definition.

  If we take the meaning of 'independent' as something that does not vary with consious awareness then we get to the definition what I have given, something that is constant/common for all(/majority) humans.

  I don't undestand why you call "certain commonolity" as vague, because that is the very basis for the success of human communication.

  I have already stated the difference between the "Collective" or "Mixed" reality that you talked about and my definition of objective reality. Your definition talks about "union", mine talks about "intersection".

  ReplyDelete
 6. కామేశ్వరరావు గారూ,

  "Certain commonality" అన్న పదాన్ని అస్పష్టం అని ఎందుకంటున్నానంటే ఈ commonality అనేది ఎప్పుడూ certain గా ఉండదు. పైన ఇచ్చిన ఉదాహరణలో పరిసరాల్లోంచి ఒక పిచ్చివాడు నడుస్తూ పోతే మీరన్న "కామనాలిటీ'' ఎలా మారుతుందో నేను చెప్పాను. మీరు "union" కాదు, "intersection" అనడం నాకంతగా అర్థం కాలేదు. మీ నుంచి మరింత వివరణ కావాలి (తెలుగులో అయితే బావుంటుంది).

  "I don't understand why you call "certain commonality" as vague, because that is the very basis for the success of human communication. "

  మనుషుల మధ్య కమ్యూనికేషన్‌ విజయవంతం అని మీరనడం మీ ఆశావాదాన్ని సూచిస్తోంది. కాని నేను నమ్మను. ఇప్పుడే కాదు మానవ జాతి అంతరించిపోయే వరకూ ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య పూర్తి స్థాయి కమ్యూనికేషన్‌ సాధ్యం కాదు. అది కూడా నేను చెప్పిన సబ్జెక్టివ్‌ రియాలిటీ కారణంగానే. (హెరాల్డ్‌ పింటర్‌ని చదవండి; you will know how futile human communication really is.)

  ఐన్‌స్టీన్‌ తన సాపేక్ష సిద్ధాంత నిరూపణకు చాలా విపరీతమైన ఉదాహరణలిచ్చాడంటారు (శూన్యంలో అనంతంగా జారిపోయే ఎస్కలేటర్‌ వగైరా). అలాగే నేనూ ఓ విపరీతమైన ఉదాహరణ ఇస్తున్నాను. ఇది నేను పై వ్యాసంలో ఇచ్చిన ఉదాహరణకే ఓ కొనసాగింపనుకోండి:

  ReplyDelete
 7. [continued...]

  ఒక అడవిలో ఓ చెట్టుంది. పెద్ద పెద్ద కొమ్మలతో, ఊడలతో చాలా రూరం విస్తరించి ఉంటుంది. ఆ ప్రక్కనే పల్లెటూళ్ళో ఓ పిల్లాడున్నాడు. ఆ పిల్లాడి తల్లి పురుట్లోనే చచ్చిపోయింది. నాన్నకి తాగొచ్చి వీణ్ణి తన్నడం సరదా. నాన్న కల్లు దుకాణంలో కనపడ్డాడంటే పిల్లాడికి అర్థమైపోయేది, ఆ రాత్రి తన వీపు మీద బాజా మోగుతుందని. భయపడి అడవిలోకి పారిపోయేవాడు. ఆ రాత్రి అడవిలో ఆ చెట్టు కొమ్మల్లోనే పడుకొనేవాడు. ఆకుల మధ్య కనిపించే చుక్కల్ని చూస్తూ, గాలికి అవి చేసే వింత సవ్వడి వింటూ రాత్రి గడిపేవాడు. నిశ్చింతగా నిద్రపోయేవాడు. అక్కడ అతనికి చాలా భద్రంగా ఉన్న భావన కలిగేది. అతని మనస్సులో, అతనికే తెలియకుండా, అమ్మ ఉంటే ఆ చెట్టులానే ఉండేదన్న నమ్మకం స్థిరపడిపోయింది. తెల్లారి లేచి వెళ్ళలేక వెళ్ళలేక అడవి వదిలి ఊరికి వెళ్ళేవాడు.

  ఆ అడవి పల్లెటూరిని మిగతా ప్రపంచంతో వేరు చేస్తుంది. ఆ అడవి వల్ల పల్లె ప్రజలందరూ డాక్టరు లాంటి అత్యవసర సదుపాయాలక్కూడా చుట్టు తిరిగి చాలా దూరం వెళ్ళాలి. అయినా ఎలాగో నెట్టుకొచ్చేవారు. చాలా సంవత్సరాల తరవాత, అడవి లోంచి రోడ్డు తొలిస్తే పల్లెటూరిని మిగతా ప్రపంచంతో సులభంగా కలపవచ్చని ఒక ఇంజనీరుకి తోచింది. అడవిలో రోడ్డు నిర్మాణానికి అనుకూలంగా ఉన్నచోట ఒకే ఒక్క అడ్డు ఆ పెద్ద చెట్టు. పల్లెటూరి నుంచి కొంతమంది యువకులను పిలిచాడు చెట్టు కొట్టించడానికి. వాళ్ళల్లో ఆ పిల్లవాడు కూడా ఉన్నాడు. అతనిప్పుడు మీసాలొచ్చిన యువకుడు. తను కొట్టాల్సింది ఈ చెట్టునని తెలిసి కొట్టనన్నాడు. అంతేకాదు, ఎవర్నీ కొట్టానివ్వనన్నాడు. ఇంజనీరుకీ అతనికీ మధ్య వాదన పెరిగింది.

  ఇప్పుడు ఏ సక్సెస్‌ఫుల్‌ హ్యూమన్‌ కమ్యూనికేషన్‌ చెట్టుకు సంబంధించినంతవరకూ యువకుడి దృక్కోణాన్ని ఆ ఇంజనీరు వరకూ బదిలీ చేయగలదు; వాళ్ళ రియాలిటీ లు ఏరకంగా intersect కాగలవు? ఆ యువకుడికే తెలియదు ఆ చెట్టును తాను అమ్మ అనుకుంటున్నాడని. (ఇది నేను స్వీయవాస్తవికతకు ఉదాహరణగా చెప్పటంలేదు. కమ్యూనికేషన్‌ ద్వారా మన దృక్కోణాని అవతలి వారికి బదిలీ చేయగలమన్న మీ అనుకోలుకు సమాధానంగా రాస్తున్నాను.) You can never truly communicate with anybody in this world; because subjective reality gets into your way.

  చెట్టు అనగానే "మెజారిటీ'' జనం లాగానే, మీ లాగానే, నా క్కూడా ఒక కాండం, కొన్ని శాఖలు, ఆకులు కలిగిన ఒక ఆకారం స్ఫురణకు రావచ్చు. ఇది మీ లాగానే, నాలాగానే "టిపికల్‌''గా చాలామంది మనుషులకు ఒకే "సెర్టెయిన్‌ కామన్‌'' రియాలిటీ కావచ్చు. కాని మా పక్కింటి వాళ్ళ పెరడులో వేపచెట్టొకటుండేది. వేప పళ్ళు బాగా పండిపోయి రాలిపోయాక, మేం వాటి ని నోట్లో పెట్టుకుని లోపల కాస్త కమ్మగా, కాస్త చేదుగా ఉండే గుజ్జును జుర్రుకనే వాళ్ళం. ఇది వేసవి కాలంలో ఇది మాకు ఖర్చులేని చిరుతిండి. మా దాకా రానీయకుండా పైనే కాకులు లాగించేసిన వేప కాయలు పెరడంతా రాలిపడేవి. ఇప్పుడు కూడా వేప చెట్టుని చూస్తే చాలా సార్లు నా కదే గుర్తుకు వస్తుంది. మీరంతా వేప చెట్టుకు చెప్పే లక్షణాలేవీ నాకు వాస్తవం కాదు. నాకు సంబంధించినంతవరకూ వేప చెట్టు వాస్తవికత వేరే. అది మీరెప్పటికి తెలుసుకోలేరు. నేనూ కమ్యూనికేట్‌ చేయలేను.

  ఈ "certain commonality" మాత్రమే కాదు. మీరు వాడిన "high probability", "typical", "majority" ఇవన్నీ అస్పష్టమైన పదాలే.

  మీరు నా మొదటి "తాత్త్విక మీమాంస'' పోస్టుకి ఇలా వ్యాఖ్యానించారు: "మన ఆలోచనలు, మన విశ్లేషణలూ అన్నీ మేథకి అనుగుణంగానే జరిగినప్పుడు మనం అనుకుంటున్న సత్యాలు "పరమ'' సత్యాలనుకోవడం హాస్యాస్పదమనిపిస్తోంది.''

  మీరు ''There is no such thing as 'Objective reality' " అన్నప్పుడూ నాక లాగే అనిపించింది. మన మేథకు అందనంత మాత్రాన అక్కడ వస్తుగతంగా ఒక వాస్తవికత లేదనలేం కదా. ఉదాహరణకి హిమోఫీలియా (వర్ణాంధత్వం) ఉన్న వాడిని ఇంద్రధనుస్సు ఎలా ఉంటుందని అడిగితే నలుపు తెలుపులుగా ఉంటుందని చెప్పొచ్చు. వాడి మేధస్సు ఇంద్రధనుస్సును గురించి అంతే తెలుసుకోగలుగుతుంది. ప్రక్కన ఉన్నవాడికి అది ఏడురంగుల్లో కనిపిస్తుంది. ఇప్పుడు వీడు మొదటి వాడి కన్నా ఇంద్ర ధనుస్సు యొక్క ఆబ్జెక్టివ్‌ రియాలిటీకు ఒక అడుగు దగ్గరగా వెళ్ళినట్టే కదా. (ఇది శారీరక అవకరం ప్రభావం, అని మీరనవచ్చు. ఇలాంటివే మానసిక అవకరాలు, లేదా ప్రభావాలు మన దృక్కోణాన్ని మలుస్తాయి.) నా ఉద్దేశ్యంలో రియాలిటీ ఎప్పుడూ అనంతమైన పొరలు కలిగి ఉంటుంది. ఒక్కో పొరా తొలగించుకుంటూ దానికి దగ్గరగా వెళ్ళగలమే తప్ప కేంద్రకాన్ని (పూర్తి ఆబ్జెక్టివ్‌ రియాలిటీని) ఎప్పుడూ చేరుకోలేం. ఆబ్జెక్టివ్‌ రియాలిటీ మీరన్నట్టు ''useless" కావచ్చు; కాని దాని ఉనికిని మాత్రం కాదనలేం.

  === ===== ===

  నేను ముందు వ్యాఖ్యలో రాసిన ఈ వాక్యం వళ్ళు దగ్గరపెట్టుకోకుండా రాసిందిగా మన్నించేయగలరు.

  [...] there is a thing called "Objective Reality" that most of the critics consciously or unconsciously follow as a standard for criticism. I wanted to say that it doesn't exist.

  ReplyDelete
 8. భైరవభట్ల కామేశ్వర రావు12:42 PM

  ఫణిగారు,

  ఓపికతో మీరు మీ ఆలోచనల్ని వివరించడం నాకు నచ్చింది. తెలుగులోనే నన్ను వివరణ అడిగారే అది మరీ నచ్చింది. నాకూ తెలుగులోనే సౌలభ్యమెక్కువ.
  మీరంటున్నది నాకు అర్థమయ్యిందనే అనుకుంటున్నాను. మీరు చెపుతున్నదానికీ నేను చెపుతున్నదానికీ వైరుధ్యమేమీ లేదు. ఒకే విషయాన్ని మనం రెండురకాలుగా దర్శిస్తున్నాం. నా అవగాహనని మరింత స్పష్టంగా వివరించడానికి ప్రయత్నిస్తాను. మనమిక్కడ నాలుగురకాల వాస్తవికతల గురించి మాట్లాడుతున్నాం:

  1. Objective Reality - మానవ మేధకి అతీతమైన వస్తుగతమైన వాస్తవికత. దీనికి ఉనికి ఉన్నదా లేదా? ఏమో నాకు తెలీదు. ఎవ్వరికీ తెలీదు. తెలియడం సాధ్యపడదు. మానవ జాతి అంటూ లేకపోతే, భూమి ఉంటుందా? మానవుడు అవతరించకముందు కూడా భూమి ఉందని విజ్ఞానశాస్త్రం చెబుతోంది (నిరూపిస్తోంది!). కానీ విజ్ఞాన శాస్త్రం కూడా మానవ మేధకి పరిమితమే కదా. అంచేత అది చెబుతున్న భూమి ఉనికి మానవమేధకి అతీతం కాదు. అంచేత దాన్నీ Objective reality అనలేం. "మన ఆలోచనలు, మన విశ్లేషణలూ అన్నీ మేథకి అనుగుణంగానే జరిగినప్పుడు మనం అనుకుంటున్న సత్యాలు పరమ సత్యాలనుకోవడం హాస్యాస్పదమనిపిస్తోంది." అని నేనన్నప్పుడు ఇక్కడ "పరమ" సత్యాలంటూ ఏవో ఉంటాయని నా ఉద్దేశం కాదు. అసలలాంటివి ఉన్నాయో లేవో కూడా మనం తెలుసుకోలేమని నా భావం.

  2. Subjective Reality, వ్యక్తిగత వాస్తవికత - దీనికి మీరు చాలానే ఉదాహరణలిచ్చారు. అడవిలో వెళ్ళే వాళ్ళు, మీకు తెలిసిన వేపచెట్టు ఇవన్నీ మీరంటున్న Subjective Realityకి ఉదాహరణలే. ఇది ఒకరు మరొకరికి అచ్చంగా, సంపూర్ణంగా communicate చెయ్యడం అసంభవమని నేనూ ఒప్పుకుంటున్నాను.

  3. Collective Reality, సామూహిక వాస్తవికత - మొత్తం మానవుల వ్యక్తిగత వాస్తవాలన్నీ కలిపి గిలక్కొడితే వచ్చేది. ఇది కూడా ఏ ఒక్క మానవుడూ తెలుసుకో గలిగే వాస్తవికత కాదు. మరొక్క వ్యక్తి వ్యక్తిగత వాస్తవికతనే తెలుసుకోలేం కదా, ఈ సామూహిక వాస్తవికతని ఎలా తెలుస్కోగలుగుతాం? అంచేత ఇది కూడా మానవ మేధకి అందనిదే.

  4. Common Reality, సామాన్య వాస్తవికత - ఇది నేను చెప్పినది. మిరన్నారే - "చెట్టు అనగానే "మెజారిటీ" జనం లాగానే, మీ లాగానే, నా క్కూడా ఒక కాండం, కొన్ని శాఖలు, ఆకులు కలిగిన ఒక ఆకారం స్ఫురణకు రావచ్చు. ఇది మీ లాగానే, నాలాగానే "టిపికల్‌"గా చాలామంది మనుషులకు ఒకే "సెర్టెయిన్‌ కామన్‌" రియాలిటీ కావచ్చు." - సరిగ్గా నేనన్నది అదే. ఇందులో అస్పష్టత ఏముంది? చెట్టంటే ప్రతి మనిషికీ ఉన్న సామాన్య అవగాహన ఉంటూనే, తనదంటూ ఒక ప్రత్యేక అవగాహన కూడా ఉంటుంది. నేను దాన్ని కాదనటం లేదు. నేనంటున్నదల్లా ఈ Common Reality ఉనికిని కూడా గుర్తించాలనీ, మనిషికీ మనిషికీ మధ్య communicationకి అది చాలా అవసరమనీను. మీరిచ్చిన ఉదాహరణ కథలో, మీరా ఒక్క కుర్రాడి గురించి చెప్తున్నారు, నేనా ఇంజినీరు పిలిస్తే వచ్చిన మిగతా కుర్రాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. మేధకీ మేధకీ మధ్య ఎంతటి వైవిధ్యం ఉన్నదో అంతటి సామ్యం కూడా ఉంది. ప్రస్తుత మానవుని పరిస్థితికి రెండూ కారణాలే, రెండూ అవసరాలే. ఇందులో ఒకటి ఎక్కువ మరొకటి తక్కువ కాదు. అందుకే, చాలామంది బతికే ఒకే లాటి బతుకుని మూస బతుకులని నిరసించడం సమంజసం కాదని నా ఉద్దేశం.

  ఇప్పుడు మీరు మొదట చెప్పిన విమర్శకులగురించి ఆలోచించండి (వాళ్ళు మూర్ఖులు కారన్న నమ్మకంతో). ఆ విమర్శకులు ఏ వాస్తవికత గురించి మాట్లాడుతున్నారు?

  ReplyDelete
 9. కామేశ్వరరావు గారూ,

  బ్రిలియెంట్‌! మీ వివరణలో మొదటి రెండూ (వస్తుగత వాస్తవికత, వ్యక్తిగత వాస్తవికత) నా భావనలే . అయితే మూడోదానికి, నాలుగోదానికి (సామూహిక వాస్తవికత, సామాన్య వాస్తవికత) మధ్యగల వ్యత్యాసాన్ని నేను గమనించకపోవడం వల్లే ఇంత చర్చ నడిచింది. నేను రెండింటినీ కలిపి సామూహిక వాస్తవికత అని వాడాను. అక్కడ పప్పులో కాలేసాను. మీరిప్పుడు వాటిని విడగొట్టి నేను చూడని నాలుగో కోణాన్ని బయటపెట్టారు. అయితే ఈ రెండింటి మధ్యా వ్యత్యాసం చూపవలసిన అవసరం నా వ్యాసానికి రాలేదు. నాకు అవసరమైందల్లా వ్యక్తిగత వాస్తవికత. నిజానికి మీరీ వివరణ ఇచ్చాక నా వ్యాసానికి మరింత పట్టు చేకూరినట్టయింది.

  (అయితే దానికి "సామాన్య వాస్తవికత'' అనే పేరు కన్నా "ఉమ్మడి వాస్తవికత'' అనే పేరు బాగుంటుందేమో- దుష్ట సమాసం కాకపోతే.)

  మీరు చివర్న అడిగిన ప్రశ్నకు నా సమాధానం ఇది: ఆ విమర్శకులు (అంటే ఆ వ్యాసం రాసేటపుడు నా దృష్టిలో ఉన్న విమర్శకులు) మీరన్న "సామాన్య వాస్తవికత'' గురించి మాట్లాడుతున్నారు.

  నేను నా వ్యాసంలో చూపించదలచింది వ్యక్తిగత వాస్తవికతకు, సామాన్య (ఉమ్మడి) వాస్తవికతకు మధ్య ఘర్షణ. నిజమైన కళ సబ్జెక్టివ్‌ రియాలిటీ ఆధారంగా పుడుతుంది అని నేను చెప్పదలచుకున్నాను. కళ యొక్క ఆదర్శం కమ్యూనికేషన్‌ కాదు; ప్రపంచాన్ని కళాకారుడు ఎలా చూస్తాడో ఆ దృక్కోణాన్ని, అతనికే ప్రత్యేకమైన ఆ వాస్తవికతను ఆవిష్కరించడం- అని నా అభిప్రాయం.

  చెట్టు అనగానే మీలాగే నాలాగే అందరికీ కాండం, శాఖలు, వేళ్ళు ఇలా కొంత సామాన్య వాస్తవికత ఉంటుంది, ఒక ఉమ్మడి దృక్కోణం ఉంటుంది. అలాగే రచన అనగానే విమర్శకులతో సహా చాలామందికి దాని రూపం (స్ట్రక్చర్‌), సారం (ఎస్సెన్స్‌) ఎలా ఉండాలో కొంత ఉమ్మడి దృక్కోణం ఉంటుంది. అంతేకాదు, కొన్ని ప్రి కన్సీవ్డ్‌ నోషన్స్‌ కూడా ఉంటాయి. చాలా శాతం రచనలు కూడా ఈ ఉమ్మడి వాస్తవికతను చూపించే ప్రయత్నమే చేస్తాయి. అంటే ప్రపంచాన్ని అందరూ ఏ దృక్కోణం లోంచి చూస్తారో ఆ దృక్కోణానికి అనుగుణంగా ఒదిగిపోయేందుకు తాపత్రయపడతాయి. చాలా పాపులర్‌ చెత్త ఈ విభాగానికే చెందుతుంది. అందుకే ఇక్కడ ఒకరికి సమాధానం ఇస్తూ 'నేను మాట్లాడేది సిడ్నీ షెల్డన్‌ గురించి, జాన్‌ గ్రిషమ్‌ గురించీ కాదని' అన్నాను. నిజమైన కళాకారుడు ఈ ఉమ్మడి వాస్తవికతపై ఆధారపడి రచనలు చేయడు. తనలోకి చూసుకుంటాడు. తన చుట్టూ వున్న ప్రపంచాన్ని తన చైతన్యం ఎలా లోనికి స్వీకరిస్తుందో అర్థం చేసుకుంటాడు. తన చైతన్య ప్రవాహంపై ఈ ప్రపంచపు ప్రతిఫలనాల ఖచ్చితమైన నమోదు అతని రచనల్లో కనిపిస్తుంది. అదే నేను నా వ్యాసంలో చెప్పింది, లేదా చెప్పదలచుకొంది.

  ఇక ఇలాంటి విమర్శ లేదని మీరనడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మీరెప్పుడూ 'మార్కిస్టు విమర్శ', 'ఫ్రాయిడియన్‌ విమర్శ' లాంటి పేర్లు వినలేదని నేననుకోను. శ్రీపాద వారిని 'ఫ్యూడలిస్టు' రచయిత అన్న విమర్శకులు నాకు తెలుసు. తిలక్‌ 'వ్యక్తి శ్రేయో వాద' రచయిత అన్న విమర్శకులు నాకు తెలుసు. కాఫ్కాను ఫ్రాయిడియన్‌ విమర్శలో బంధించాలని చూసిన మూర్ఖ విమర్శకులూ నాకు తెలుసు. అయితే వాళ్ళెవరినీ టార్గెట్‌ చేయాలని నేనీ వ్యాసం రాయలేదు; వాళ్ళని నెగ్లెట్‌ చేయగల సత్తా నాకు నేను కల్పించుకోవడానికి రాసాను. ఈ వ్యాసం ఎక్కుపెట్టిన బాణం కాదు, రక్షణకై నిర్దేశించిన కవచం. అందుకే నేను ఎవ్వరినీ ఉదహరించలేదు. పైనే చెప్పాను- నేనిక్కడెవ్వరికీ జ్ఞాన ప్రదానం చేయటం లేదు, నాకు నేను స్పష్టత తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఆ స్పష్టత దిశగా నా చేత ఓ ముందడుగు వేయించినందుకు కృతజ్ఞతలు.

  ReplyDelete
 10. భైరవభట్ల కామేశ్వర రావు12:44 PM

  హమ్మయ్యా! ఇప్పటికి నేను చెప్పాలనుకున్నది సరిగా చెప్పగలిగానన్న మాట! ఈరోజు హాయిగా నిద్రపడుతుంది! మన ఆలోచనలని మరొకరు అర్థం చేసుకున్నారని తెలిస్తే కలిగే ఆనందం బృహత్తరమైనది.
  మీరీ వ్యాఖ్యలో చెప్పిన దాంతో నేను నూటికి నూరుపాళ్ళూ ఏకీభవిస్తున్నాను. మీరన్న విమర్శలన్నీ నాకు తెలీవుకానీ కొన్ని చదివాను. అందులో చాలావాటిని నేను "సీరియస్" విమర్శలుగా పరిగణించను :-)

  విమర్శకుడికి రచయిత వ్యక్తిగత వాస్తవికతపై అవగాహన ఉండాలి. దాన్నే మనవాళ్ళు "సహృదయత" అన్నారు. ఆ వాస్తవికతని రచయిత ఎలా ఆవిష్కరించగలిగాడో అంచనా వేస్తూ, దాన్ని పాఠకుల దగ్గరకి తీసుకువెళ్ళే దిశగా సాగేదే సద్విమర్శ.

  అయితే ఇందులో రచయితకి కూడా బాధ్యత ఉంది. తన వ్యక్తిగత వాస్తవికతకి సంబంధించిన ఉమ్మడివాస్తవికత (ఈ పదమే బావుంది) కొంత ఉంటుంది. దానిపై పూర్తి అవగాహన ఆ రచయితకి ఉండాలి. దానికీ తన వ్యక్తిగత వాస్తవికతకీ మధ్యనున్న సంబంధాన్నీ తేడానీ తెలుసుకొని, దాన్ని అతి సున్నితంగా తన రచనలో ఆవిష్కరించాలి. అలా చేసినప్పుడు ఖచ్చితంగా కొందరికైనా అది చేరుతుంది. ఒక పాఠకుడు, రచయిత వ్యక్తిగత వాస్తవికతని తనదిగా అనుభవించగలిగే స్థితినే రసానుభూతి అంటారనుకుంటాను.

  ReplyDelete
 11. teresa12:45 PM

  interesting discussion!

  Hemophilia and color blindness are not the same.

  ReplyDelete
 12. To: teresa,

  Hemophilia and color blindness are not the same.

  Sorry. I was wrong there. I actually meant color blindness. Thank you.

  ReplyDelete