October 29, 2008

Notes on the narrative of "Crime and Punishment"

చాలా క్లాసిక్‌ రచనలకి నేటి అకడెమిక్‌ విమర్శకులిచ్చే ఉపోద్ఘాతాలు అస్సలు సంబంధం లేకుండా ఉంటాయి ('మేడం బొవరీ'కి ముందు మాట రాస్తూ అక్రమ సంబంధాల్లో నైతికానైతికతలను చర్చించడం లాంటివి). అయితే 'క్రైమ్‌ అండ్ పనిష్మెంట్‌'కు నా దగ్గర ఉన్న వర్డ్స్‌వర్త్‌ క్లాసిక్‌ ఎడిషన్‌లో కాస్త రచనకు సంబంధం ఉన్న ఉపోద్ఘాతం ఉంది. ఈ ఉపోద్ఘాతంలో "క్రైమ్‌ అండ్‌ పనిష్మెంట్‌'' కు దాస్తొయెవ్‌స్కీ ప్రస్తుత శిల్పాన్ని ఎలా ఎన్నుకున్నాడో చర్చించారు. దీన్ని రాసింది కీత్‌ కరబైన్‌. దీన్ని చదువుతుంటే, ఒక రచన తనకు మాత్రమే ప్రత్యేకమైన శిల్పాన్ని ఎలా కోరుతుందో అర్థం అయింది. తపన ఉన్న రచయితలు ఆ రచన కోరే శిల్పాన్ని దానికి అందించడానికి ఎంత కష్ట పడతారో మరోసారి ఋజువైంది. ఈ ఉపోద్ఘాతం ప్రకారం "క్రైమ్‌ అండ్‌ పనిష్మెంట్‌''కు దాస్తొయెవ్‌స్కీ ఎన్నుకున్న కథన విధానం అంతకు మునుపు లేనిది. ఈ ఉపోద్ఘాతం నుండి నాకు అర్థమైంది ఇక్కడ రాయదలచుకున్నాను. ఆ కథనం విశిష్టత తెలుసుకోవాలంటే, ముందు నవల ఇతివృత్తం కాస్త తెలుసుకోవాలి:

పీటర్స్‌బర్గ్‌ నగరంలో రస్కోల్నికోవ్‌ అనే పేద విద్యార్థి ఫీజులు కట్టలేదన్న కారణంగా యూనివర్శిటీ నుండి బహిష్కరణకు గురౌతాడు. అతను నగరంలో ఓ లాడ్జీలో చిన్న ఇరుకైన గదిలో అద్దెకుంటాడు. యజమానురాలు పరమ గయ్యాళి. రస్కొల్నికోవ్‌ తల్లి, చెల్లి సొంత ఊళ్ళో ఉంటారు. కటిక పేదరికంతో బతుకీడుస్తుంటారు. తమ కొడుకు యూనివర్శిటీ చదువు పూర్తి చేసుకుని ఓ ప్రభుత్వోద్యోగం సంపాదిస్తే తమ దశ మారుతుందని వాళ్ళ ఆశ. వాళ్ళకి తెలీదు అతన్ని యూనివర్శిటీ నుండి తొలగించేశారని. మరోప్రక్క, జరుగుబాటుకే నానా తంటాలు పడుతున్న తల్లిని డబ్బులడగాలంటే రస్కోల్నికోవ్‌కు కూడా మనసొప్పదు. ఒక పూట తిని, మరో పూట తినకా ఎలాగో నెట్టుకొస్తుంటాడు. చివరికి ఓ నిశ్చయానికొస్తాడు. అతనికి పొరుగులో తాకట్టు వ్యాపారం చేసే ఓ పిసినారి ముసల్ది ఉంటుంది. పేదవాళ్ళకు అధిక వడ్డీకి అప్పులిచ్చి తర్వాత వాళ్ళని హింసిస్తుంటుంది. రస్కోల్నికోవ్‌ ఈమెను చంపి డబ్బు దోచుకోవాలనుకుంటాడు. ఈ హత్య చేయాలన్న ఆలోచనకు సమర్థనగా అతను కొన్ని సిద్ధాంతాలను కూడా సమకూర్చుకుంటాడు (నేను సారాన్ని రాస్తున్నాను): "నెపోలియన్‌, కింగ్‌ సాల్మన్‌ లాంటి గొప్పవాళ్ళు తమ జాతికి ఉపకారం చేయడానికి లక్షల మందిని చంపేశారు. అయినా ఏ అపరాధ భావమూ లేకుండా, పైపెచ్చు కీర్తితో జీవించారు. ఇప్పుడు నేను నా పేద కుటుంబం కోసం, మున్ముందు ఎంతో భవిష్యత్తు ఉన్న నా కోసం, ఎలాగు రేపో మాపో చచ్చిపోయే ఈ దుష్టురాలైన ముసలిదాన్ని చంపేస్తే తప్పేముంది?'' -- ఇలా ఆలోచిస్తాడు. ఒక్కసారి ఆమెను చంపి డబ్బు దోచుకున్నాక దాంతో యూనివర్శిటీ చదువు పూర్తి చేసుకుని, కుటుంబాన్ని గట్టెక్కించి, విదేశాలకు పోయి, మిగిలిన జీవితమంతా నిజాయితీగా, ఇతరులకు సేవ చేస్తూ బతుకుతూ, తన నేరానికి ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చునన్నది అతని ఆలోచన. ఇలాంటి ఆలోచనలతో తనకు తాను ధైర్యాన్ని కల్గించుకుంటాడు. పథకాన్ని పక్కాగా సిద్ధం చేసుకున్నాక, ఓ రోజు ఆ ముసల్ది ఒంటరిగా ఉన్న సమయం చూసి గొడ్డలితో తలపై మోది ఆమెను చంపేస్తాడు. అయితే అనూహ్యంగా అదే సమయంలో ముసలిదాని చెల్లెలు అక్కడకు రావడంతో తప్పని సరై ఆమెను కూడా చంపేస్తాడు. ఈ రెండు హత్యలు, దోపిడీ సవ్యంగానే జరుగుతాయి. అతనిపై ఎవ్వరికీ ఎలాంటి అనుమానమూ కలగదు కూడా. కాని హత్య తరువాతి క్షణం నుంచి హంతకుని మనస్సాక్షి అతనికి వ్యతిరేకంగా పని చేయడం మొదలు పెడుతుంది. ఇక్కడ నేర ప్రభావం నేరస్తునిపై ఎలా ఉంటుందో చూపించడం దాస్తొయెవ్‌స్కీ ప్రధాన లక్ష్యం. హత్య మరుక్షణం నుంచీ రస్కోల్నికోవ్‌ మిగతా ప్రపంచంతో వేరై పోతాడు. మానసికంగా చిన్నాభిన్నమైపోతాడు. పిచ్చితనపు అంచులకు చేరిపోతాడు. మనుషులతో తనకు తెగిపోయిన లంకెను తిరిగి స్థాపించుకోవాలంటే తన నేరాన్ని చట్టం ముందు ఒప్పుకోవడమొక్కటే మార్గంగా అతనికి తోస్తుంది. చట్టం కన్నా మనస్సాక్షి శక్తివంతమైనదని అతనికి అర్థమౌతుంది. చివరికి పోలీస్‌ స్టేషన్‌కి వెళ్ళి లొంగిపోతాడు. ఇదీ క్లుప్తంగా కథ సారాంశం.

దాస్తొయెవ్‌స్కీ ఈ నవలను "రష్యన్‌ హెరాల్డ్‌'' పత్రికకు సీరియల్‌గా పంపించాలనుకున్నాడు. 1865 ఏప్రిల్‌ ప్రాంతంలో రాయడం మొదలుపెట్టాడు. నిజానికి ఈ సమయంలో దాస్తొయెవ్‌స్కీ పూర్తిగా అప్పుల్లో మునిగిపోయి ఉన్నాడు. పైగా ఎపిలెప్సీతో (మూర్ఛరోగం) చాలా జబ్బుపడి బాధపడుతున్నాడు. అతనికి ఈ నవల ప్రచురణ వల్ల వచ్చే ఆదాయం చాలా అవసరం. కాని నవంబరులో హఠాత్తుగా అంతవరకూ రాసిన నవలంతా మొత్తం కాల్చిపడేశాడు. ఇలా కాల్చేయడానికి కారణాన్ని ఓ స్నేహితునికి రాసిన ఉత్తరంలో ఇలా పేర్కొన్నాడు: "నవంబరు చివరకు నవలంతా ఇంచుమించు పూర్తయిపోయి సిద్ధంగా ఉంది; కానీ, నేను దాన్ని పూర్తిగా కాల్చిపడేసాను . . . అది నాకే నచ్చలేదు. ఒక కొత్త శిల్పం, కొత్త పథకం నన్ను ఉత్తేజపరచింది. నేను మొత్తం మొదట్నించీ మళ్ళీ పని మొదలు పెట్టాను.''

అయితే నవల అసలు ప్రతి కాలిపోయినా, దాని చిత్తు డ్రాఫ్టులు, కొన్ని నోటు పుస్తకాలు మనకు మిగిలాయి. వాటి ప్రకారం తెలిసేదేమిటంటే, దాస్తొయెవ్‌స్కీ ఈ నవలను మొదట ఉత్తమ పురుష కథనంలో (ఫస్ట్‌పెర్సన్‌ నేరేషన్‌లో) రాశాడు. ఈ నేరేషన్‌లో లక్షణం ఏమిటంటే ఇక్కడ ప్రధాన పాత్ర రెండు అంశలుగా విడిపోతుంది. ఒకటి: కథను మనకు చెప్తుంది, కథపై వ్యాఖ్యానిస్తుంది; రెండోది: కథలో పాల్గొంటుంది, సంఘటనల్ని అనుభవిస్తుంది. అంటే కథలో ప్రత్యక్షంగా పాల్గొంటున్న అంశ ఒకటైతే, అదే సమయంలో కథను మనకు చెప్తూ దానిపై వ్యాఖ్యానిస్తున్న అంశ మరొకటి. ఈ రెండు విషయాలూ సమాంతరంగా ఒకే సమయంలో జరిగిపోతూంటాయి. ఇలా ఉత్తమ పురుష కథనంలో రాసిన నవల మొదటి డ్రాఫ్టును దాస్తొయెవ్‌స్కీ కాల్చేయడానికి ఒక కారణం ఉంది. ఈ కథకు ఆ నేరేషన్‌ నప్పదు. ఎందుకంటే, నవలలో చాలా భాగం రస్కోల్నికోవ్‌ దాదాపు పిచ్చితనపు అంచుల్లో ఉంటాడు. ఇలాంటి స్థితిలో కథానాయకుడు ఒక ప్రక్కన పిచ్చితనంలోకి జారిపోతూనే మరో ప్రక్క మనకు స్పష్టంగా కథ ఎలా చెప్పగలడు? ఈ పద్ధతిలో ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరకదు. అయితే ఫస్ట్‌ పెర్సన్‌లోనే మరో పద్ధతి కూడా ఉంది: "ఫస్ట్‌పెర్సన్‌ కన్‌ఫెషనల్‌'' పద్ధతి. దీన్ని తెలుగులో 'ఉత్తమ పురుష వృత్తాంత పద్ధతి' అనవచ్చును. అంటే, ఈ పద్ధతిలో ఉత్తమ పురుష కథకుడు జరుగుతున్న కథనాన్ని జరుగుతున్నట్టు మనకు సత్వరం బదిలీ చేయడం ఉండదు. ఎప్పుడో గతంలో జరిగిపోయిన దాన్ని ఇప్పుడు తన జ్ఞాపకంలోంచి వెలికి తీసి వృత్తాతంలాగా చెప్పుకోవడం కనిపిస్తుంది. దాస్తొయెవ్‌స్కీ ఈ పద్ధతి గురించి కూడా ఆలోచించాడు. ఈ పద్థతిలో ఈ కథంతా రస్కోల్నికోవ్‌ గతం నుండి గుర్తు తెచ్చుకుని చెప్తున్నట్టు ఉంటుంది. ఈ పద్ధతి ప్రకారం రస్కోల్నికోవ్‌ గతంలోని తన అస్తవ్యస్త మానసిక స్థితిని ప్రస్తుత దృక్కోణం నుంచి సమీక్షించి, కథను స్పష్టంగా చెప్పే వీలుంటుంది. అయితే ఇందులో ఒక ఇబ్బంది ఉంది. తను చేసిన దారుణ హత్య గురించి, అప్పటి తన బాధాకరమైన మానసిక స్థితి గురించి ఇప్పుడు రస్కోల్నికోవ్‌ ఎందుకు గుర్తు చేసుకోవాలనుకుంటాడు? ఎందుకు దాన్ని కెలికి వెలికి తీయాలనుకుంటాడు? ఈ పద్ధతిలో ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరకదు. కాబట్టే, ఉత్తమ పురుష కథనంలో కథ సాగదనిపించి దాస్తొయెవ్‌స్కీ తన మొదటి డ్రాఫ్టును కాల్చిపారేశాడు. తప్పని సరై మరో కొత్త నిర్ణయానికొచ్చాడు: "the story must be narrated by the author and not by the hero''. కథను ప్రధాన పాత్ర కాక రచయిత చెప్పడమంటే అది ప్రథమ పురుష కథనం (థర్డ్‌ పెర్సన్‌ నేరేషన్‌) అన్నమాట. అంటే కథను ఎవరో మూడో వ్యక్తిలా రచయితే చెప్పడం అన్నమాట. ఇలాంటి కథనం దాస్తొయెవ్‌స్కీ కాలానికి కొత్తదేం కాదు. మరి దాస్తొయెవ్‌స్కీని అంత ఉత్తేజపరచిన కొత్త శిల్పం ఏమిటి? దీని సమాధానం ఆయన నోటు పుస్తకంలో ఉంది: "Narration from the point of view of the author, a sort of invisible but omniscient being, who doesn't leave his hero for a moment.'' అంటే రచయిత ఒక అదృశ్యమైన, కాని సర్వవ్యాప్తమైన అంశగా నిత్యం తన కథానాయకుణ్ణి అనుసరిస్తాడన్నమాట. దీన్ని మనం "సర్వసాక్షి కథనం'' (Omnipresent narration) అంటున్నాం. సర్వసాక్షి కథనాన్ని అది వరకూ చూడని ఎత్తులకు తీసుకెళ్ళిన రచయిత దాస్తొయెవ్‌స్కీ అంటూ ఈ ఉపోద్ఘాతం రాసిన కీత్‌ కరబైన్‌ ఇలా రాశారు:

"This astonishing, shifting formulation as the (subjective) author's point of view fades into the more abstract and detached 'ominiscient being', and then in a doubling back tethers the omniscient author to the hero's side, foreshadows, as we shall see, the lineaments of a revolutionary 'new form' in the history of the novel—one that is central to the novel's power and scope and to its direct grasp upon its readers."

"నవలా చరిత్రలోనే విప్లవాత్మకమైన'' ఈ కొత్త శిల్పం గురించి కీత్‌ ఇచ్చిన వివరణ ఇది:

సర్వసాక్షి కథనానికి దాస్తొయెవ్‌స్కీ దిద్దిన కొత్త మెరుగేంటో ఈ నవల తొలి వాక్యం లోనే కనిపిస్తుంది: "జూలై తొలి రోజుల్లో బాగా ఉక్కపోతగా ఉన్న ఓ సాయంత్రం, ఒక యువకుడు ఎస్‌. ప్లేస్‌లో తను అద్దెకుంటున్న ఇరుకైన గది లోంచి బయటకు వచ్చి, నెమ్మదిగా, ఏదో తటపటాయిస్తున్నట్టు, కె. బ్రిడ్జి వైపు నడవసాగాడు.'' ఈ వాక్యంలో కథకుడు మనకు తెలిసిన సర్వసాక్షి కథకుడే. ఈ సర్వసాక్షి కథకుడు ఇక్కడ తన ప్రధాన పాత్రకు ఒక స్థలాన్ని (ఇరుకు గది, ఎస్‌. ప్లేస్‌), ఒక కాలాన్ని (ఉక్కపోత సాయంత్రం, జూలై తొలిరోజులు) ఇస్తున్నాడు. పాత్ర గురించి అంతా అథారిటేటివ్‌గా చెప్తున్నాడు. కాని, "ఏదో తటపటాయిస్తున్నట్టు'' అన్న పదాల్లో మాత్రం తన అథారిటీని తగ్గించుకుని, అనిశ్చితిని, సందిగ్ధతను వ్యక్తం చేస్తున్నాడు. ఈ అనిశ్చితే దాస్తొయెవ్‌స్కీ సర్వ సాక్షి కథనానికి దిద్దిన కొత్త మెరుగు: "Dostoyevsky is the first novelist to have fully accepted and dramatized the principle of uncertainity or indeterminacy in the presentation of character." ఇక్కడ రచయితగా దాస్తొయెవ్‌స్కీ తను చిత్రీకరిస్తున్న రస్కోల్నికోవ్‌ పాత్రపై తనే సందిగ్ధత వ్యక్తం చేయడం ద్వారా అతని అస్తవ్యస్త మానసిక స్థితిని మనకు సూక్షంగా తెలియజేస్తున్నాడు.

రోగంతో బాధ పడుతూ, తనకు అత్యవసరంగా డబ్బులు అవసరమై కూడా, కేవలం నిర్మాణం సరిగ్గా కుదరలేదన్న కారణంగా సగం రాసిన నవలని కాల్చి పడేసేడంటే, రచన పట్ల దాస్తొయెవ్‌స్కీ తపన నన్ను చాలా హత్తుకుంది. అంతేకాదు, ఒక కథ తనకు కావాల్సిన శిల్పాన్ని ఎంత తీవ్రంగా డిమాండ్‌ చేస్తుందో, ఆ డిమాండ్‌ని అందించడానికి రచయితకు ఎంత ఓపిక, ఎంత ఆలోచన ఉండాలో ఈ వృత్తాతం చాలా చక్కగా చెప్తుంది. కథకు సంబంధించినంత వరకూ వస్తువే విధానాన్ని నిర్దేశిస్తుంది. తన వస్తువును సమర్థవంతంగా చిత్రీకరించడం కోసం ఏకంగా ఒక కొత్త నేరేటివ్‌ విధానాన్నే తయారు చేసుకోగలిగాడు దాస్తొయెవ్‌స్కీ. నిజానికి విధానంతో పోలిస్తే వస్తువు విలువ చాలా స్వల్పం. చరాచర సృష్టిలో కథకు దేన్నైనా వస్తువుగా ఎన్నుకోవచ్చు. కాని విధానమే దానికి విలువను ఆపాదించేది. అయితే "form" presupposes a "material" కాబట్టి అంతవరకే వస్తువు విలువ.

1 comment: