April 29, 2009

దేవదాసు గురించి, కాశ్యప్ గురించీ...కేవలం రెండు సినిమాలతో అనురాగ్ కాశ్యప్ అభిమానిగా మారిపోయాను. మొన్న "దేవ్.డి" నిన్న "గులాల్".
"దేవ్.డి" ఎందుకు నచ్చిందంటే చెప్పలేను, అని చెప్పలేను. ఎందుకంటే మొదలుపెట్టాకా చెప్పక తప్పదుగా. మొట్టమొదటి కారణం, ఎట్టకేలకు దేవదాసు జీవితానికి ఒక సుఖాంతం లభ్యమవడం.


దేవదాసు నాకు తొలిసారి పరిచయమయింది వెండితెర మీద కాదు, పుస్తకపు పేజీల్లో. పదవతరగతిలో ఈ శరత్‌బాబు నవలను చక్రపాణి అనువాదంలో చదివాను. ముగింపుకు చేరనంతవరకూ బానే నచ్చింది. విషాదభరితమైన ఆ ముగింపు మాత్రం నచ్చలేదు. ఇది ఆ వయసుకు సహజమే అనుకుంటా. చిన్నతనంలో మన చుట్టూ వున్న ప్రపంచం కూడా మనం అదుపులో వుంచుకోగలిగేంత చిన్నదే అయి ఉంటుంది. విధి అనేది ఒకటుంటుందని అది మనుషుల జీవితాల్తో అష్టాచెమ్మా ఆడుకోగలదనీ అప్పటికింకా తెలీదు. బహుశా అందుకే, విధివంచితులైన ఈ నవల్లోని పాత్రలు నా ఆదరాన్ని పొందలేకపోయాయి. ముఖ్యంగా దేవదాసు: వాణ్ణీ, వాడి పొగరునీ, నిర్ణయలేమినీ, అయోమయాన్నీ, సెల్ఫ్‌పిటీనీ, స్వీయవినాశధోరణినీ చాలా అసహ్యించుకున్నాను. అయితే ఈ విషయంలో నేనే కాదు, స్వయానా రచయిత కూడా పాపం అతన్ని అసహ్యించుకున్నాడనుకుంటా. అందుకే ముగింపులో ఇలాంటి వాక్యాలు రాయగలిగేడు:


"ఈ కథ చదివితే బహుశా మీకు కూడా నా మాదిరిగానే దుఃఖం కలగవచ్చు. అయినా దేవదాసు వంటి దౌర్భాగ్యులతో, నిగ్రహం లేని వారితో, పాపిష్టులతో యెప్పుడైనా మీకు పరిచయం కలిగితే, వాళ్ళ కోసం మీరు కొంచెం ప్రార్థించండి. కనీసం అతని వంటి చావు మాత్రం యెవ్వరికీ రాకూడదని కోరండి! మరణం వల్ల పెద్ద నష్టమేమీ లేదు. కాని, ఆ సమయంలో ప్రేమపూరితమైన కరస్పర్శ లలాటానికి సోకాలి; ఆఖరికి ఒకటైనా కరుణాపూరిత ముఖాన్ని చూస్తూ ఈ జీవితం అంతం కావాలి; చివరికి ఒక్కరి కంటి నుంచైనా కన్నీటి బిందువు రాలటం చూసి ప్రాణాలు వదలాలి. చాలు, ఇంతకంటే పెద్దకోరికలు అనవసరం!" — ["దేవదాసు"కు చక్రపాణి అనువాదం నుంచి]


కనీసం తమ పుట్టుకకు కారణమైన రచయితల ఆదరాభిమానాల్ని కూడా పొందలేని ఇలాంటి పాత్రలంటే నాకు జాలి, అసహ్యమూను. అలాగే ఆ రచయితలపై కోపం కూడా. ఎందుకు ఇలాంటి దురదృష్టవంతులైన జీవాల్ని పుట్టించాలి? పోనీ పుట్టించారు సరే, ఎందుకు వారికి ప్రేమాభిమానాల్ని నిరాకరించి అనాధల్ని చేసి అందరి ద్వేషానికీ బలిపెట్టాలి? — అనిపిస్తుంది. ఒక్క దేవదాసనే కాదు, ఇలాంటి పాత్రలు చాలా వున్నాయి. "అల్పజీవి"లో రావిశాస్త్రి చేతిలో పడి సుబ్బయ్య, "అసమర్థుని జీవయాత్ర"లో గోపీచంద్ చేతిలో పడి సీతారామారావూ ఇలాగే బాధపడ్డారు. అయితే దీనికి భిన్నంగా ఎలాంటి సద్గుణాలూ లేకపోయినా కేవలం రచయితలు చూపించిన అభిమానం వల్ల పాఠకుల అభిమానానికి నోచుకున్న పాత్రలూ వున్నాయి. తెన్నేటిసూరి "చెంఘిజ్ ఖాన్" నవల ద్వారా నరహంతకుడైన "చెంఘిజ్ ఖాన్", మార్కెజ్ "లవ్ ఇన్ ద టైమ్ ఆఫ్ కలరా" నవల ద్వారా నీతి బాహ్యుడైన ఫ్లొరెంటినో, ఫ్లాబర్ "సెంటిమెంటల్ ఎడ్యుకేషన్" నవల ద్వారా అసమర్థుడైన ఫ్రెడరిక్ ఇలానే నా అభిమానాన్ని పొందగలిగారు.


ఏమైతేనేం, శరత్‌బాబు తనపై మోపిన దురదృష్టకరమైన దుఃఖాంతమైన జీవితానికి తోడు అతని నిరాదరణను కూడా భరించిన దేవదాసు, పాఠకునిగా నా అభిమానాన్ని పొందలేకపోయాడు; కాస్త జాలినీ, బోలెడు అసహ్యాన్నీ మాత్రమే మూటగట్టుకోగలిగాడు. 1953 తెలుగు సినిమా చూసినప్పుడు కూడా ఆ పాత్రపై నాది అదే భావన. పైగా అందమైన సావిత్రి మొహంపై నాగేశ్వర్రావు జువ్వ పుచ్చుకుని కొట్టడం చూసి కోపం పెరిగింది కూడా. ("అందమైన" అన్నది ఎంత చచ్చు మూగ విశేషణమై చతికిలబడుతుందో కదా సావిత్రి పక్కన చేర్చేసరికి!)


ఆ తర్వాత సంజయ్‌లీలాభన్సాలీ ద్వారానే దేవదాసును మళ్ళీ కలుసుకోవడం. ఈ సినిమాలో అన్నీ ఉన్నాయి. ఐశ్వర్య, మాధురీ, షారుక్, భారీ సెట్లూ, మార్‌డాలాలు, డోలారేలు అన్నీ ఉన్నాయి, కానీ ఆత్మే లేదు. చివరకు భారీ నేపథ్య సంగీతంతో షారుక్ భారీ చావు చస్తూన్నప్పుడు కూడా, నా దృష్టంతా స్లోమోషన్‌లో పరిగెత్తుకుంటూ వస్తూన్న ఐశ్వర్యారాయ్ భారీ చీరచెంగు మీదే వుంది తప్ప, ఆ సన్నివేశం అనుభూతికి తేవాల్సిన విషాదం నాలో లేశమాత్రమూ కలగ లేదు. ఈ సినిమా నన్నేరకం గానూ కదిలించలేకపోయింది.


మళ్ళీ ఇప్పుడు అనురాగ్ కాశ్యప్ దేవదాసు కథ ఎత్తుకున్నాడు. అంతేకాదు, బిమల్‌‍రాయ్ నుండి భన్సాలీ దాకా చేద్దామంటే ఎవ్వరికీ చెయ్యి ఒప్పని పని చేశాడు. దేవదాసు జీవితాన్ని సుఖాంతం చేశాడు. అలాగని కాశ్యప్‌కి దేవదాసుపై గుడ్డి ప్రేమేం లేదు. ఛీత్కరించుకోవాల్సిన చోట ఛీత్కరించుకుంటూనే, అక్కున చేర్చుకోవాల్సిన తరుణంలో అక్కున చేర్చుకుంటాడు. అతను దేవదాసులో మార్పుతేవడానికి చంద్రముఖి, పార్వతుల్నే వాడుకున్నాడు; ముఖ్యంగా పార్వతిని. శరత్‌బాబు పాత పార్వతిలా ఈ కొత్త పార్వతికి దేవదాసు పడుతున్న తపనంతా తన కోసమే అన్న భ్రమలు లేవు. అతని ప్రేమంతా అహంపైనే అన్న నిజాన్ని గుర్తిస్తుందామె:


[In Devdas' room]
पार्वति: [zipping her purse] तुम मुझसॆ प्यार नही करतॆ, तुम किसीसॆ भी प्यार नही कर सकतॆ सिवाय खुद कॆ। तुम्हॆ ना... इस शीशे सॆ शादी कर लॆना चाहिये।
दॆवदास: Don't feed me that psychological crap, okay?
पार्वति: [coming near him] इतना नशा मत किया करॊ... कई चीजॆं इतनॆ अच्चॆ लगनॆ लगतॆ हैं कि बाकी सब बुरे लगनॆ लगतॆ हैं।


— పాత పార్వతిలో వేదనంతా ఈ విషయాన్ని గుర్తించలేకపోవడం వల్లనే. ఈ విషయాన్ని గుర్తించడంతోనే కొత్త పార్వతి కథ సుఖాంతమైపోతుంది. సినిమాలో ఇక ఆమె కనిపించదు. ఈ సినిమాలో నాకు నచ్చిన మరో విషయం చంద్రముఖి. పాత దర్శకుల పద్దతిలో దేవదాసుకీ అతని వినాశనానికీ మధ్య చంద్రముఖిని కేవలం ఓ in between పాత్రలా మిగిలిపోనీయకుండా, ఆమెకు ఓ వ్యక్తిత్వాన్ని ఆ వ్యక్తిత్వానికి ఓ అర్థవంతమైన గతాన్నీ ఇచ్చాడు అనురాగ్ కాశ్యప్. ప్రేమికుని ద్వారా వంచనకు గురై, చెయ్యని తప్పుకి కుటుంబం వెళ్ళగొడితే; ఆమె ప్రేమ పైనా, విలువలపైనా, మనుషులపైనా నమ్మకాన్ని కోల్పోయి వేశ్యగా స్థిరపడుతుంది. ఖాళీ సమయాల్లో కాలేజీకి వెళ్ళి డిగ్రీ చదువుతుంది. ఇంకా ఖాళీ దొరికితే రంగుకాగితాలతో ఎగరలేని పక్షుల్ని తయారు చేస్తూ వుంటుంది. ఇలాంటి సమయంలో ఆమెకు దేవదాసు తారసపడతాడు. శరీరమే తప్ప ప్రేమ ఇస్తానన్నా తీసుకోవడానికి ఎవరూ కనుచూపుమేరలో కనిపించని సమయంలో, ఆమెకు, సముద్రం అంత ప్రేమ దొరికినా ఇంకా కావాలని గునిసే దేవదాసు తారసపడతాడు. సహజంగానే ప్రేమ పుడుతుంది.


అనురాగ్‌కాశ్యప్ తన పాత్రల్ని ఎంత రోతపుట్టించే పరిసరాల్లోకి నెడతాడంటే, అక్కడ ప్రేమ లాంటి సున్నితమైన భావనలు చిత్రమైన సాంద్రతను సంతరించుకుంటాయి. ఇందులో దేవదాసు చంద్రముఖిల ప్రేమ నాకు నచ్చింది. భారతీయ సినిమాల్లో బహు అరుదుగా తారసిల్లే సహజ సుందరమైన సంభాషణలు ఇందులో కొన్ని ఉన్నాయి (అదృష్టవశాత్తూ కాశ్యప్ పాత్రలు మణిరత్నం పాత్రల్లా గూఢచారుల్లా పొదుపుగా మాట్లాడుకోవు. వాగే పాత్రలూ ఉంటాయి; మూగ పాత్రలూ ఉంటాయి.) :


[Mens toilet. Devdas pissing.]
चंदा: [coming near him] Stop feeling sorry for yourself. You can't love anyone. Just accept it.
दॆवदास: It's mens toilet. You mind getting out?
चंदा: जब सॆ मैनॆ accept किया है, ठीक हॊगई हूं।
दॆवदास: [Zipping] तू ठीक है?
चंदा: तुम केहतॆ हॊ मै ठीक नही हूं? You like to believe I am hiding lot of pain.
दॆवदास: You are not?
चंदा: अब नहीं।
दॆवदास: [Smiling] Lair!
[Scene changes. Both enter Chanda's flat. Chanda's face with a bright smile.]
चंदा: Okay!
दॆवदास: क्या okay?
चंदा: जॊ तुम कहॊ... तुम boss हॊ...
दॆवदास: इतना खुश क्यॊं हॊ रही हॊ?
चंदा: तॊ क्या करूं, बोलो?
दॆवदास: [Taking off his jacket] Whatever, just don't ... irritate me.
चंदा: [Hurt. Mumbles] Slut!
दॆवदास: कान हैं मेरे, सम्झी?
चंदा: Thank you.
दॆवदास: [Grabbing her by hand] तुम उसकी [पार्वती की] side क्यॊं लॆ रही हॊ?
चंदा: सही तॊ बॊलती है वॊ...
दॆवदास: क्या सही बॊलती?
चंदा: वॊ खुश है, she has moved on.
दॆवदास: I like that word, you know, "moved on". So easy!
चंदा: करतॆ हैं। मैनॆ किया है।
दॆवदास: Yeah.. to coke... that's your solution to everything... isn't it... aah?
[Wriggles out of his hands. Goes into another room. And before shutting the doors, says...]
चंदा: Good Night.


తెరపై చూస్తున్నప్పుడు "जॊ तुम कहॊ... तुम boss हॊ..." అనడంలో చంద్రముఖి ప్రేమంతా కనిపిస్తుంది. సినిమాలో పాటలు కూడా సన్నివేశాల మధ్య ఒద్దికగా ఇమిడిపోయి బాగున్నాయి. "నయన్ తర్‌సే", "ఎమోషనల్ అత్యాచార్" నచ్చాయి.


"గులాల్" నిన్ననే చూశాను. ఈ కథకు ఏదన్నా నవల ఆధారమా అన్న అనుమానం కలిగింది చూశాక. ఎందుకంటే ఏదన్నా పుస్తకపు దన్ను లేకుండా ఇలా కథనీ పాత్రల్నీ పౌరాణిక స్థాయికి తీసుకెళ్ళడం చాలా కష్టం. కొద్ది ఫ్రేముల్లో మాత్రమే చూపించినా ఆ పాత్రలకు స్పష్టమైన వ్యక్తిత్వాన్ని ఇవ్వగలడు అనురాగ్ కాశ్యప్. నాకు చాలా నచ్చింది. అయితే రాసే ఓపిక ఇప్పుడు లేదు కాబట్టి మళ్ళీ ఎప్పుడన్నా....


మొత్తానికి ఈ రెండు సినిమాలతో "it's time we move over mute Maniratnams and weird Vermas" అనిపించాడు అనురాగ్ కాశ్యప్.

April 22, 2009

ప్రేమికుడు/ పడవ/ సముద్రం/ చందమామ/ తీరపు ఇసుక/ పొలాలు/ కిటికీ రెక్క/ ప్రేయసి

ఈ బ్రౌనింగ్ కవితలో ఊపిరి బిగబట్టించేంత అందం ఉందని తెలుసు. కానీ అందం ఎక్కడుందో ఎంత తరచి చూసినా, ఎన్ని సార్లు చదివినా అర్థం కాదు. విషయం చిన్నదే: ఓ ప్రేమికుడు రాత్రి వేళ పడవలో సముద్రం దాటి ఒడ్డు చేరుకుంటాడు; తీరాన్నే మైలు నడిచి పొలాలు దాటి ప్రియురాలి ఇంటి కిటికీ రెక్క తడతాడు; లోపల నీలి కాంతితో అగ్గిపుల్ల ఒకటి వెలుగుతుంది; ఆ తర్వాత, ఒకదానికొకటి కొట్టుకుంటున్న గుండెల సవ్వడి కన్నా మంద్రంగా, భయ సంతోషాలు కలిసిన ఆమె స్వరం వినిపిస్తుంది. అంతే! కానీ చాలా కొన్ని అక్షరాల్లో దృశ్యాన్ని, భావాన్నీ ఇంత తీవ్రంగా అనుభూతికి తేగలగడం బ్రౌనింగ్ నైపుణ్యం. ఇప్పుడే ఈ కవిత మీద బ్రిటిష్ విమర్శకుడు ఎఫ్. ఆర్. లీవిస్ రాసిన ఈ విశ్లేషణ చదివాను.

"Meeting at Night" by Browning

I.
The grey sea and the long black land;
And the yellow half-moon large and low;
And the startled little waves that leap
In fiery ringlets from their sleep,
As I gain the cove with pushing prow,
And quench its speed i' the slushy sand.

II.
Then a mile of warm sea-scented beach;
Three fields to cross till a farm appears;
A tap at the pane, the quick sharp scratch
And blue spurt of a lighted match,
And a voice less loud, thro' its joys and fears,
Than the two hearts beating each to each!

April 17, 2009

మేపెల్ ఆకు గిరికీలు కొడ్తూ రాలడమో...


రాయడానికి అస్సలేమీ లేనపుడు, అయినా కాస్సేపు అక్షరాల సాంగత్యంలో గడపాలనిపించినపుడు, ఉత్తమమైన ఉపాయం అనువాదం. స్వతంత్ర రచనలో, మన భావాన్ని మన వాక్యాల్లో పట్టుకోగలిగినపుడు చాలా ఆనందం కలుగుతుంది; అనువాదంలో, వేరే వాళ్ళ భావాన్ని మన వాక్యాల్లో పట్టుకోవడంలో, అంత కాకపోయినా కొంత ఆనందం కలుగుతుంది. అలాగే మొదటి దాంతో పోలిస్తే సహజంగానే రెండో దాంట్లో అలసట, అయోమయం తక్కువ. అందీ అందక విసిగించే జింకల్లాంటి భావాల్ని పట్టుకోవడానికి మస్తిష్కారణ్యంలో పడి వాక్యాల వేటకుక్కల్ని వదలనక్కర్లేదు. మూలంలోని వాక్యాల రూపంలో చేయవలసిన పని ఫలానా అని ముందే ఓ దిశానిర్దేశం వుంటుంది.
అనువాదం అనగానే గుర్తొచ్చిన పేరా యిది. రెండ్రోజుల క్రితం చదివిన "ద పొటాటో ఎల్ఫ్" అనే కథలోనిది. రచయిత నబొకొవ్. ఇదే ఎందుకు గుర్తొచ్చింది? బహుశా నబొకొవ్ యిలాంటి పేరాలు అరుదుగా రాయడం వల్ల కావచ్చు. అరుదుగా రాయడం అంటే ఇంత అందమైన వచనం అరుదుగా రాయడమని కాదు. నబొకొవ్ వచనమంతా అందంగానే వుంటుంది. ఇందులో వున్న ప్రత్యేకత వేరు. నబొకొవ్ ఉత్తమపురుషలోనే కథనాన్ని నడిపినా, "నేను" అంటూ కథ చెప్పే పాత్రకి ఎప్పుడూ తన వ్యక్తిత్వం, తన అభిప్రాయాలు అరువివ్వడు; కథలో ఎప్పుడూ కలగజేసుకోడు. ఇక ప్రథమపురుష (third-person) కథనంలో అయితే సమస్యే లేదు; కనిపించనే కనిపించడు. నిశ్శబ్దంగా, గంభీరంగా వచనపు తెరవెనకే నక్కిపోయి వుంటాడు. "ఎందుకంత గంభీరత్వం, ఒక్కసారి కథలోకి వచ్చి ఒళ్ళు విరుచుకోవచ్చు కదా" అని ఒక్కోసారి విసుక్కోబుద్దేస్తుంది కూడా. ఈ పేరాలో అదే చేస్తున్నాడు. అందుకే అరుదైన పేరా అంటున్నాను. (అయితే ఈ ఒళ్ళు విరుచుకున్న సందర్భం కథ మొత్తం చదివినవాళ్ళకే అర్థమవుతుంది):

"Every seperate day in the year is a gift presented to only one man—the happiest one; all other people use his day, to enjoy the sunshine or berate the rain, never knowing, however, to whom that day really belongs; and its fortunate owner is pleased and amused by their ignorance. A person cannot foreknow which day exactly will fall to his lot, what trifle he will remember forever: the ripple of reflected sunlight on a wall bordering water or the revolving fall of a maple leaf; and it often happens that he recognizes his day only in retrospection, long after he has plucked, and crumpled, and chucked under his desk the calendar leaf with the forgotten figure."

"సంవత్సరంలో ప్రతీ ఒక్క రోజూ కేవలం ఒకే మనిషికి—అత్యంత ఆనందకరమైన మనిషికి—సమర్పితమైన బహుమతి; మిగతా జనమంతా అతని రోజుని, సూర్యకాంతిలో సుఖించడానికో లేక వర్షంలో విసుక్కోవడానికో, వాడుకుంటారు; ఆ రోజు నిజంగా ఎవరికి చెందిందో ఎప్పటికీ తెలుసుకోరు; అదృష్టవంతుడైన దాని యజమాని వాళ్ళ అమాయకత్వానికి ముచ్చటపడతాడు, వినోదిస్తాడు. ఏ రోజు తన ఖాతాలోకి జమ కాబోతోందో, ఏ అల్పవిషయాన్ని తాను శాశ్వతంగా గుర్తుంచుకోబోతున్నాడో ఏ వ్యక్తీ ముందే తెలుసుకోలేడు: నీటి చెలమ అంచునున్న గోడపై ప్రతిబింబించిన సూర్యకాంతి తరంగాలో లేక ఓ మేపెల్ ఆకు గిరికీలు కొడ్తూ రాలడమో. . . ; చాలాసార్లు అతను తన రోజేదో గుర్తించేది సింహావలోకనంలోనే; మర్చిపోయిన అంకెగల కేలండర్ కాగితాన్ని చింపి, నలిపి, మేజా కింద గిరవాటేసిన చాన్నాళ్ళ తర్వాతనే."

కథలో ముఖ్య పాత్ర సర్కస్‌లో ఒక మెజీషియన్ దగ్గర పనిచేసే మరుగుజ్జు. అంతకు ముందురోజు రాత్రే తొలిసారి శృంగారంలో పాల్గొంటాడు. ఆమెను ప్రేమిస్తాడు. ఆమె కూడా తనని ప్రేమిస్తుందనే నమ్మకంతో, తెల్లారి ఆమె ఇంటి నుండి బయటపడి, ఒక కొత్త రోజులోకి ఒక కొత్త జీవితంలోకి అడుగు పెడ్తాడు. ఆమె తనను ప్రేమించడం లేదని, జాలి చూపించిందని, అంతేకాదు ఆ రాత్రే తనను విడిచి శాశ్వతంగా వెళిపోతుందని తెలిసేదాకా రోజంతా ఆనందంగానే గడుపుతాడు. (విచిత్ర సోదరుల్లో కమల్ హాసన్ గుర్తొస్తాడు.) అతని మొత్తం జీవితానికి ఆ ఒక్క రోజే ఆనందకరమైన రోజు, ఆ ఒక్క రోజే అతనికి బహుమతిగా సమర్పితమైన రోజు. కథ విషాదాంతం. నాకు నచ్చింది. కానీ చిత్రంగా నబొకొవ్‌కి నచ్చలేదట. పాతికేళ్ళ వయస్సులో రాసిన ఈ కథ గురించి నబకొవ్ తన డెబ్భైఅయిదోయేట ఇలా అన్నాడు: ". . . but all in all it is not my favorite piece, and if I include it in this collection it is only becasue the act of retranslating it properly is a precious personal victory that seldom falls to a betrayed author's lot."
ఇంతకీ నాకే బహుమతిగా ఇచ్చిన రోజులు ఏమై వుంటాయి? సింహావలోకనంలో, నబొకొవ్ అన్నట్టే, కొన్ని అనుకోని దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకి: నున్నగా మేటేసిన లంక ఇసుకలో కాలిముద్రలు పడేలా, ఆ కాలి ముద్రలు ఓ పెద్ద పేరుగా రూపుదిద్దుకునేలా పరిగెత్తడం. పైన వంతెన మీద పోయేవాళ్ళు—సైకిళ్ళ మీంచి, స్కూటర్ల మీంచి, బస్సు కిటికీల్లోంచీ—విచిత్రంగా క్రిందకి చూడడం. ఆ రోజు ఏ తేదీనో, ఏ నెలో, ఏ సంవత్సరమో కూడా గుర్తులేదు. కానీ ఇప్పుడు నాకు తెలుసు ఆ రోజు నాదని.

April 15, 2009

"పఠనమంటే ఆనందం కలిగించేదిగా వుండాలి."


బోర్హెస్ ఇంటర్వూ ఒకటి వెబ్‌లో చదివాను. ఈ వాక్యాలు మెదడులో నమోదయ్యాయి:

"నాతండ్రి తన గ్రంథాలయాన్ని నాకు చూపించాడు. నాకది అంతులేనిదిగా కనిపించింది. ఆయన అందులో ఏం కావాలిస్తే అది చదువుకోమన్నాడు, కాని ఏదైనా విసిగిస్తే వెంటనే దాన్ని పక్కన పెట్టేయమన్నాడు. అంటే నిర్బంధ పఠనానికి వ్యతిరేకం అన్నమాట. పఠనమంటే ఆనందం కలిగించేదిగా వుండాలి. [. . .]


[. . .]నేను నా జీవితాన్ని చదవడానికీ, రాయడానికీ అంకితం చేసాను. నావరకూ ఇవి రెండూ సమానమైన ఆనందాన్నిచ్చే ప్రక్రియలే. రచయితలు రాయడంలో [ప్రసవ] వేదన గురించి మాట్లాడితే నాకు అర్థం కాదు; నావరకూ రాయడం ఒక అవసరం. నేనే రాబిన్సన్ క్రూసో అయితే నా ఒంటరి ద్వీపంలో రాసుకుంటూ వుండిపోతాను. వయసులో వున్నపుడు, నేను సైనికులైన నా పూర్వీకుల జీవితం గురించి ఆలోచించేవాణ్ణి; ఆ జీవితమంతా సాహసాల్తో నిండి సుసంపన్నంగా తోచేది, మరి నా జీవితం... ఒక పాఠకుని జీవితం, అప్పుడప్పుడు తీవ్రంగా, ఒక పేద జీవితమని అనిపించేది. కాని ఇప్పుడు నేను దాన్ని నమ్మను; ఒక పాఠకుని జీవితం కూడా వేరే ఎవరి జీవితంతోనైనా సమానంగా సమృద్ధమైనదే."


* * *


"ఈ వయస్సులో [85 సం.లు] ఎవరికీ సమకాలికులుండరు. వాళ్ళంతా చనిపోయి వుంటారు. నా సమయంలో చాలా భాగం నేను ఒంటరిగానే గడుపుతాను; కానీ ఈ విషయంలో నాకు ఫిర్యాదులేవీ లేవు. నా సమయాన్ని భవిష్యత్ ప్రణాళికలతో నింపుకుంటున్నాను. అయితే, అఫ్‌కోర్స్, ఆ భవిష్యత్తు ఏ క్షణంలోనైనా ముగింపుకు వచ్చేయవచ్చు. నాకు వయసులో వున్న స్నేహితులు చాలా మంది ఉన్నారు; కానీ వాళ్ళు తమ సమయాన్ని నాకు కేటాయించలేరు, ఇది సహజమే. "


* * *


ప్రశ్న: మీరు జీవితంలో ఆనందాలకు ఎంత కృతజ్ఞులై వున్నారో, వేదనలకూ అంతే కృతజ్ఞులై వున్నారని చెప్పారు. మీకు ప్రాప్తించిన అంధత్వాన్ని కూడా ఇలానే సమర్థించారు. మీకు కలిగిన వేదనల పట్ల, అంధత్వం పట్ల కృతజ్ఞత ఎందుకు?


ఎందుకంటే ఒక కళాకారునికి (. . .) సంభవించే ప్రతీదీ అతని కళకు కావాల్సిన ముడిసరుకే; ఒక్కోసారి ఇది చాలా బాధాకరం. ఆనందానికి వేరే ఏమీ అక్కర్లేదు; దానికదే పరమార్థం. కానీ వేదన మాత్రం మరో రూపంలోకి బదిలీ అయితీరాలి; అది సౌందర్యపు ఔన్నత్యాన్ని పొందితీరాలి. కళాకారుడు తనకు ప్రాప్తించే ప్రతీ వేదననీ మూసలోకి మలిచేందుకు పనికొచ్చే మన్నుగా భావించాలి; అతనికి లభించే బహుమతులన్నీ క్రూరమైనవే అయినా, వాటిని ఈ భావనతోనే అనుభూతి చెందాలి.

April 11, 2009

వీస్వావ షింబోర్‌స్కా [Wislawa Szymborska]

ఆ మధ్య ఓ పత్రికకు పని చేస్తున్నపుడు "తొలి చూపు ప్రేమ"పై ఒక సెంటర్‌స్ప్రెడ్ ఆర్టికల్ రాయమన్నారు. దానికి కొసరుగా ఏదన్నా మంచి ఆంగ్ల కవిత దొరికితే అనువదించి ప్రచురిద్దామన్నారు. దాంతో అంతర్జాలంలో పడి తలమునకలై వెతికాను. ప్రేమికులకు సత్వర సహాయం అందించేందుకు సర్వసన్నద్ధంగా ఉండే వేలాది వెబ్‌సైట్లలో ఒక దాంట్లో ఈ "లవ్ ఎట్ ఫస్ట్ సైట్" అనే కవిత దొరికింది. కవిత చాలా నచ్చింది. ముఖ్యంగా కవితలో కవయిత్రి పోషించిన దేవుడి పాత్ర నచ్చింది. "Who knows, perhaps a ball already / in the bushes, in childhood?" వాక్యం మరీ నచ్చింది. కవయిత్రి గురించి ఏమీ తెలియదు. పేరు గూగుల్‌లో అతికించి గాలిస్తే నోబెల్ బహుమతి పొందిన పోలిష్ కవయిత్రి అని తెలిసింది. నేను చదివింది ఆంగ్లానువాదం.

సరే బావుంది కదాని, అసలు వ్యాసం పూర్తయిన తర్వాత, ఓ పూట కుస్తీ పట్టి ఈ కవితను తెలుగులో అనువదించాను. అనువాదకుల స్వేచ్ఛాచాపల్యాన్ని వ్యతిరేకించేవాణ్ణి కాబట్టి మామూలుగానే పదానికి పదం అనువదించి తీసుకొచ్చాను. దాన్ని చూసిన అసోసియేట్ ఎడిటర్ కంగారుపడి, "మూలరచయితకు నిబద్ధత" సంగతి దేవుడెరుగు ముందు పాఠకుల సంగతి ఆలోచించమన్నాడు; అలాగే మొత్తం కవితను ప్రచురించడానికి స్థలం కూడా సరిపోదన్నాడు. దాంతో, ఇదిగో, ఇలా మార్చి కుదించి రాశాను:

తొలి చూపు ప్రేమ
ఒక ఆకస్మిక భావన తామిద్దర్నీ ఏకం చేసిందని
వారనుకున్నారు.
తాము ఒకరికొకరు అపరిచితులమని,
మునుపు తమ మధ్య ఏమీ జరగలేదని,
వారనుకున్నారు.
ఈ వీధులు, ఈ మెట్లు, ఈ వరండాలు, ఈ జనసమ్మర్థం,
ఎక్కడిదీ కలిసే అవకాశం?

కానీ నిజానికి,
ఇంకా పూర్తిగా ఓ రూపాన్ని సంతరించుకోని విధి —
వారిని దగ్గర చేసాననిపించి వెంటనే దూరం నెట్టేస్తూ,
వారి మార్గాల్ని కలిపినట్టే కలిపి మధ్యలోనే కత్తిరించేస్తూ,
ముసిముసిగా నవ్వుకుంటూ —
అందినట్టే అంది అందనంత దూరం జారిపోతుంది;
కొన్ని గుర్తులున్నాయి, కొన్ని సూచనలందాయి —
కాని ప్రయోజనమేముంది — అంతా అర్థం కాని రహస్యలిపి.

గుడి గంటల మీద, తలుపు గడియల మీద,
ఒకరి చేతి ముద్రను మరొకరి చేయి తాకింది.
ఒకరు చదివిన గ్రంథాలయపు పుస్తకం మరొకరి చేతుల్లోకి మళ్ళింది.
ఒక రాత్రైతే ఇరువురిదీ ఒకే కల —
ఆ తర్వాత మెలకువలో మరిచిపోయింది.

నిజానికి ప్రతీ ప్రారంభమూ
ఒక కొనసాగింపు మాత్రమే.
నిజానికి విధి రాతల పుస్తకం
తెరుచుకునేది ఎప్పుడూ మధ్యలోంచే.

ఇప్పుడీ తర్జుమాని, దీని అసలు ప్రతిని ఇక్కడ ఇవ్వడం ద్వారా, ఒక మంచి రచయితని వేలాదిమంది పాఠకుల ముందు (ఆ పత్రిక సర్క్యులేషన్ వేలల్లో ఉంది మరి) చులకన చేసి నిలబెట్టిన పాపాన్ని కడిగేసుకుంటున్నాను. అఫ్‌కోర్స్, కవిత క్రింద నామకః "స్వేచ్ఛానువాదం" అని వేసాం. కానీ పేరాలకు పేరాలు ఎత్తేసి, అందమైన ఇమేజరీని భ్రష్టు పట్టించిన పాపం ఎక్కడికిపోతుంది? "రివాల్వింగ్ డోరు", "రాంగ్ నంబరూ", "డోర్ బెల్సూ", "సూట్‌కేసూ". . . ఇవి మన స్థానికతకు పనికిరావన్నారు మా అసోసియేట్ ఎడిటర్. కానీ ఒక విదేశీ కవిత అనువాదం మన స్థానికతకు సరిపోయేలా వుండాల్సిన అవసరమేంటో, వుండకపోతే వచ్చే నష్టమేంటో నాకర్థం కాలేదు. ఎలెక్స్ హేలీ రాసిన "రూట్స్" నవలని నేను సహవాసి అనువాదంలో చదివాను. నేటివిటీ లేకపోవడం నా పఠనానుభూతినేమీ భంగపరచలేదు మరి. అనువదించేటప్పుడు, అది అనువాదం అన్న భావన రానీయకుండా ఉండటం కోసం, మూలాన్ని మెతకబార్చటం పెద్ద గొప్పని నేననుకోను. అయితే — ఒప్పుకోకపోవడవేఁ ! — చిన్నప్పుడు మార్క్‌ట్వైన్ రచనలకు నండూరి రామ్మోహనరావుగారి అనువాదాలైన "రాజు–పేద", "టామ్‌సాయర్", "హకల్‌బెరీఫిన్" నవలలు చదివి చాలా ఆనందించాను; కానీ అవి గొప్ప అనువాదాలా అన్నది అనుమానమే. అవి మార్క్‌ట్వైన్ మార్కు హాస్యాన్ని సరిగా అందిస్తున్నాయా లేదా అన్న అనుమానం అలానే ఉండిపోయింది. అది తీర్చుకోవడానికే మొన్నీ మధ్య "హకల్‌బెరీఫిన్" ఇంగ్లీషు పుస్తకాన్ని కొన్నాను. ఇంకా మొదలుపెట్టాలి. అయినా ఈ అనువాదాల విషయంలో ఓ ఖచ్చితమైన దృక్పథాన్ని అంటిపెట్టుకుని వుండడం వెర్రితనమని నాకనిపిస్తుంది. ఒక అనువాదం విషయంలో స్వేచ్ఛని అవలంబించవచ్చా, లేక మూలానికి బద్ధులమై ఉండాలా అన్నది ఆ మూలం స్వభావాన్నిబట్టి నిశ్చయించాలన్నది నా అభిప్రాయం. పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రంలా నబొకొవ్‌కి, డాస్టొయెవ్‌స్కీకీ ఒకటే మూస అవలంబిస్తామంటే పద్ధతి కాదు.

సరే ఇంతకీ వీస్వావ షింబోర్‌స్కా ఇప్పుడెందుకు గుర్తొచ్చిందంటే, ఇవాళ ఈ బ్లాగులో ఆవిడ ప్రస్తావన చూసాను. ఇందులో ఒక ఊటంకింపులో తాను విమర్శకురాలిని కాదు, పాఠకురాలిని మాత్రమేనంటూ, ఎప్పటికీ పాఠకురాలిగా మాత్రమే ఉండాలనుకుంటున్నానంటూ చెప్పడం నచ్చింది. ఇదే బ్లాగులో మరో చోట మరో ప్రస్తావన కూడా ఉంది; ఇక్కడ, తాను స్వయానా కవయిత్రి అయివుండీ, కవిత్వానికి వ్యతిరేకంగా వచనాన్ని, నాటకాన్నీ సమర్థించడం ఆశ్చర్యాన్ని కలిగించింది:

"కవులు కవిత్వం గురించి రాసేటప్పుడు చూపించే అలవాటైన ధోరణిలో ఏదో కాస్త నాకు అసహనం కలిగిస్తుంది. మిగతా ప్రక్రియలకు పూర్తిగా అసాధ్యమైన ఏవో రహస్యాలను కవిత్వం ఇంకా దాచిపెట్టుకుంది అన్నట్టు రాస్తారు వాళ్ళు. కవులెప్పుడూ కవిత్వాన్ని [గణితంలోలాగా] సారస్వతానికి చెందిన ఆల్ఫా, ఒమేగాల్లాగా పరిగణించడానికి అలవాటుపడిపోయారు; గతంలో ఈ నమ్మకాన్ని బలపరచిన ఘట్టాలు వున్నాయి కూడా. కాని అదంతా పాత కథ. కవిత్వం సజీవమే, ఇదేమీ తక్కువరకం ప్రక్రియ కూడా కాదు. అయితే పరిగణనలోను, దృక్పథంలోనూ దీనికి వచనాన్ని, నాటకాన్ని మించిన ఏదో నిర్ద్వంద్వమైన ఆధిక్యాన్ని కట్టబెట్టాలనుకోవడం నాకు అవివేకమనిపిస్తుంది."

సులభమైన పదాల్లో గంభీరమైన అర్థాన్ని ఇమిడ్చి రాయగలిగే షింబోర్‌స్కా కవితా సంపుటులు పోలండ్‌లో పాపులర్ నవలల్ని మించి అమ్ముడుపోతాయట. ఈవిడదే మరో మంచి కవిత "ట్రూ లవ్".