April 11, 2009

వీస్వావ షింబోర్‌స్కా [Wislawa Szymborska]

ఆ మధ్య ఓ పత్రికకు పని చేస్తున్నపుడు "తొలి చూపు ప్రేమ"పై ఒక సెంటర్‌స్ప్రెడ్ ఆర్టికల్ రాయమన్నారు. దానికి కొసరుగా ఏదన్నా మంచి ఆంగ్ల కవిత దొరికితే అనువదించి ప్రచురిద్దామన్నారు. దాంతో అంతర్జాలంలో పడి తలమునకలై వెతికాను. ప్రేమికులకు సత్వర సహాయం అందించేందుకు సర్వసన్నద్ధంగా ఉండే వేలాది వెబ్‌సైట్లలో ఒక దాంట్లో ఈ "లవ్ ఎట్ ఫస్ట్ సైట్" అనే కవిత దొరికింది. కవిత చాలా నచ్చింది. ముఖ్యంగా కవితలో కవయిత్రి పోషించిన దేవుడి పాత్ర నచ్చింది. "Who knows, perhaps a ball already / in the bushes, in childhood?" వాక్యం మరీ నచ్చింది. కవయిత్రి గురించి ఏమీ తెలియదు. పేరు గూగుల్‌లో అతికించి గాలిస్తే నోబెల్ బహుమతి పొందిన పోలిష్ కవయిత్రి అని తెలిసింది. నేను చదివింది ఆంగ్లానువాదం.

సరే బావుంది కదాని, అసలు వ్యాసం పూర్తయిన తర్వాత, ఓ పూట కుస్తీ పట్టి ఈ కవితను తెలుగులో అనువదించాను. అనువాదకుల స్వేచ్ఛాచాపల్యాన్ని వ్యతిరేకించేవాణ్ణి కాబట్టి మామూలుగానే పదానికి పదం అనువదించి తీసుకొచ్చాను. దాన్ని చూసిన అసోసియేట్ ఎడిటర్ కంగారుపడి, "మూలరచయితకు నిబద్ధత" సంగతి దేవుడెరుగు ముందు పాఠకుల సంగతి ఆలోచించమన్నాడు; అలాగే మొత్తం కవితను ప్రచురించడానికి స్థలం కూడా సరిపోదన్నాడు. దాంతో, ఇదిగో, ఇలా మార్చి కుదించి రాశాను:

తొలి చూపు ప్రేమ
ఒక ఆకస్మిక భావన తామిద్దర్నీ ఏకం చేసిందని
వారనుకున్నారు.
తాము ఒకరికొకరు అపరిచితులమని,
మునుపు తమ మధ్య ఏమీ జరగలేదని,
వారనుకున్నారు.
ఈ వీధులు, ఈ మెట్లు, ఈ వరండాలు, ఈ జనసమ్మర్థం,
ఎక్కడిదీ కలిసే అవకాశం?

కానీ నిజానికి,
ఇంకా పూర్తిగా ఓ రూపాన్ని సంతరించుకోని విధి —
వారిని దగ్గర చేసాననిపించి వెంటనే దూరం నెట్టేస్తూ,
వారి మార్గాల్ని కలిపినట్టే కలిపి మధ్యలోనే కత్తిరించేస్తూ,
ముసిముసిగా నవ్వుకుంటూ —
అందినట్టే అంది అందనంత దూరం జారిపోతుంది;
కొన్ని గుర్తులున్నాయి, కొన్ని సూచనలందాయి —
కాని ప్రయోజనమేముంది — అంతా అర్థం కాని రహస్యలిపి.

గుడి గంటల మీద, తలుపు గడియల మీద,
ఒకరి చేతి ముద్రను మరొకరి చేయి తాకింది.
ఒకరు చదివిన గ్రంథాలయపు పుస్తకం మరొకరి చేతుల్లోకి మళ్ళింది.
ఒక రాత్రైతే ఇరువురిదీ ఒకే కల —
ఆ తర్వాత మెలకువలో మరిచిపోయింది.

నిజానికి ప్రతీ ప్రారంభమూ
ఒక కొనసాగింపు మాత్రమే.
నిజానికి విధి రాతల పుస్తకం
తెరుచుకునేది ఎప్పుడూ మధ్యలోంచే.

ఇప్పుడీ తర్జుమాని, దీని అసలు ప్రతిని ఇక్కడ ఇవ్వడం ద్వారా, ఒక మంచి రచయితని వేలాదిమంది పాఠకుల ముందు (ఆ పత్రిక సర్క్యులేషన్ వేలల్లో ఉంది మరి) చులకన చేసి నిలబెట్టిన పాపాన్ని కడిగేసుకుంటున్నాను. అఫ్‌కోర్స్, కవిత క్రింద నామకః "స్వేచ్ఛానువాదం" అని వేసాం. కానీ పేరాలకు పేరాలు ఎత్తేసి, అందమైన ఇమేజరీని భ్రష్టు పట్టించిన పాపం ఎక్కడికిపోతుంది? "రివాల్వింగ్ డోరు", "రాంగ్ నంబరూ", "డోర్ బెల్సూ", "సూట్‌కేసూ". . . ఇవి మన స్థానికతకు పనికిరావన్నారు మా అసోసియేట్ ఎడిటర్. కానీ ఒక విదేశీ కవిత అనువాదం మన స్థానికతకు సరిపోయేలా వుండాల్సిన అవసరమేంటో, వుండకపోతే వచ్చే నష్టమేంటో నాకర్థం కాలేదు. ఎలెక్స్ హేలీ రాసిన "రూట్స్" నవలని నేను సహవాసి అనువాదంలో చదివాను. నేటివిటీ లేకపోవడం నా పఠనానుభూతినేమీ భంగపరచలేదు మరి. అనువదించేటప్పుడు, అది అనువాదం అన్న భావన రానీయకుండా ఉండటం కోసం, మూలాన్ని మెతకబార్చటం పెద్ద గొప్పని నేననుకోను. అయితే — ఒప్పుకోకపోవడవేఁ ! — చిన్నప్పుడు మార్క్‌ట్వైన్ రచనలకు నండూరి రామ్మోహనరావుగారి అనువాదాలైన "రాజు–పేద", "టామ్‌సాయర్", "హకల్‌బెరీఫిన్" నవలలు చదివి చాలా ఆనందించాను; కానీ అవి గొప్ప అనువాదాలా అన్నది అనుమానమే. అవి మార్క్‌ట్వైన్ మార్కు హాస్యాన్ని సరిగా అందిస్తున్నాయా లేదా అన్న అనుమానం అలానే ఉండిపోయింది. అది తీర్చుకోవడానికే మొన్నీ మధ్య "హకల్‌బెరీఫిన్" ఇంగ్లీషు పుస్తకాన్ని కొన్నాను. ఇంకా మొదలుపెట్టాలి. అయినా ఈ అనువాదాల విషయంలో ఓ ఖచ్చితమైన దృక్పథాన్ని అంటిపెట్టుకుని వుండడం వెర్రితనమని నాకనిపిస్తుంది. ఒక అనువాదం విషయంలో స్వేచ్ఛని అవలంబించవచ్చా, లేక మూలానికి బద్ధులమై ఉండాలా అన్నది ఆ మూలం స్వభావాన్నిబట్టి నిశ్చయించాలన్నది నా అభిప్రాయం. పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రంలా నబొకొవ్‌కి, డాస్టొయెవ్‌స్కీకీ ఒకటే మూస అవలంబిస్తామంటే పద్ధతి కాదు.

సరే ఇంతకీ వీస్వావ షింబోర్‌స్కా ఇప్పుడెందుకు గుర్తొచ్చిందంటే, ఇవాళ ఈ బ్లాగులో ఆవిడ ప్రస్తావన చూసాను. ఇందులో ఒక ఊటంకింపులో తాను విమర్శకురాలిని కాదు, పాఠకురాలిని మాత్రమేనంటూ, ఎప్పటికీ పాఠకురాలిగా మాత్రమే ఉండాలనుకుంటున్నానంటూ చెప్పడం నచ్చింది. ఇదే బ్లాగులో మరో చోట మరో ప్రస్తావన కూడా ఉంది; ఇక్కడ, తాను స్వయానా కవయిత్రి అయివుండీ, కవిత్వానికి వ్యతిరేకంగా వచనాన్ని, నాటకాన్నీ సమర్థించడం ఆశ్చర్యాన్ని కలిగించింది:

"కవులు కవిత్వం గురించి రాసేటప్పుడు చూపించే అలవాటైన ధోరణిలో ఏదో కాస్త నాకు అసహనం కలిగిస్తుంది. మిగతా ప్రక్రియలకు పూర్తిగా అసాధ్యమైన ఏవో రహస్యాలను కవిత్వం ఇంకా దాచిపెట్టుకుంది అన్నట్టు రాస్తారు వాళ్ళు. కవులెప్పుడూ కవిత్వాన్ని [గణితంలోలాగా] సారస్వతానికి చెందిన ఆల్ఫా, ఒమేగాల్లాగా పరిగణించడానికి అలవాటుపడిపోయారు; గతంలో ఈ నమ్మకాన్ని బలపరచిన ఘట్టాలు వున్నాయి కూడా. కాని అదంతా పాత కథ. కవిత్వం సజీవమే, ఇదేమీ తక్కువరకం ప్రక్రియ కూడా కాదు. అయితే పరిగణనలోను, దృక్పథంలోనూ దీనికి వచనాన్ని, నాటకాన్ని మించిన ఏదో నిర్ద్వంద్వమైన ఆధిక్యాన్ని కట్టబెట్టాలనుకోవడం నాకు అవివేకమనిపిస్తుంది."

సులభమైన పదాల్లో గంభీరమైన అర్థాన్ని ఇమిడ్చి రాయగలిగే షింబోర్‌స్కా కవితా సంపుటులు పోలండ్‌లో పాపులర్ నవలల్ని మించి అమ్ముడుపోతాయట. ఈవిడదే మరో మంచి కవిత "ట్రూ లవ్".

4 comments:

 1. తెలుగు బ్లాగుల్లో మొదటిసారిగా Szymborska గురించి వినడం/చదవడం సంతోషంగా ఉంది. 1996లో నోబెల్ బహుమతి వచ్చేవరకు ఆవిడ పేరు కూడా నేను వినలేదు. జర్మన్ పేపర్లు ఆవిణ్ణి ఆకాశానికెత్తివేయడం, ఆ సంవత్సరంలోనే తెలుగు discussion group ఒక దానిలో (తెలుసా) వేలూరి గారు ఆవిడ కవితలు, ఒకటి రెండు తెలుగు అనువాదాలు పోస్ట్ చేస్తే ఆవిడ గురించి కుతూహలం పెరిగింది. ఆవిడ రాసినదంతాచదివానని చెప్పను కానీ, అప్పట్లో మా university library లో ఆవిడ రచనలు చదువుతూ చాలా సమయం గడిపాను. నాకు కవిత్వం గురించి తెలిసిందీ, ఆసక్తీ తక్కువ కాబట్టి పెద్దగా మాట్లాడలేను కానీ, ఆవిడ వ్యాసాలు బాగుంటాయి.

  ఫణీంద్ర-గారు, మీరొకవేళ చూసుండకపోతే, (ఖాళీసీసాల) స్మైల్ గారు ఆవిడ కవితలు రెండో, మూడో బాగా అనువదించారు.

  -- శ్రీనివాస్

  ReplyDelete
 2. ప్రధాన అంశం అయిన ఈ కవయిత్రిని గూర్చి ఇదే తెలియటం, కానీ మీరిచ్చిన వివరాలు, శ్రీనివాస్ గారి వ్యాఖ్య ఆసక్తి కలగజేస్తున్నాయి. కనుక నేనింకా చేయాల్సిన పఠనం లిస్ట్ లో రాసుకున్నాను.

  ఇకపోతే అనువాదం మీద రక రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ మధ్యన చదివి నచ్చి గుర్తుంచుకున్నదిది.

  తిరుపతి వెంకటకవుల భావానువాదానికి ప్రాముఖ్యతనిస్తూ ఇలా అంటారు.

  ''ఒక్కెడ జక్కగా పదము నొక్కెడ జేర్చిన ముచ్చటా మరిం
  కొక్కెడ నున్న దున్నయటులుంచిరచించిన ముచ్చటా మరిం
  కొక్కెడ నున్న దానసగముంచిన మేలగు, దెల్గుసేయుచో
  మక్కికి మక్కి యన్నటులు మార్చిన గావ్యముశ్రావ్యమెట్లగున్‌''

  గుర్తు చేసారు కనుక ఖాళీసీసాలు తీసి మళ్ళీ చదవటం మొదలుపెట్టాను.

  వ్యాసానికి నెనర్లు.

  ReplyDelete
 3. Anonymous5:43 PM

  మెహెర్ గారూ.. కిస్లోవస్కీ అనే పోలిష్ దర్శకుడు ఈ కవిత లోని వస్తువు ఇన్ స్పిరేషన్ తో కొన్ని సినిమాలు తీసారు.సినిమా అని అనలేం కానీ.. కొన్ని సినిమాల్లో సన్నివేశాలు అని చెప్పొచ్చు. రెడ్ సినిమాలో ఒక ప్రేమజంట..a short film about love లో కొంత.. blind chance సినిమాలో కొంత..

  ReplyDelete
 4. I've just seen "A Short Film About Love". In Youtube. Haven't found any connection to the poem. But captivating movie. Thank you.

  ReplyDelete