May 10, 2009

చిట్టచివరి స్నేహితుడు

కూతురు ఆఫీసు పని ముగించుకుని యింటికి చేరేసరికి ముసలాయన వంటగది బాల్కనీలో వున్నాడు. పేము కుర్చీలో ముందుకు వంగి కూర్చుని, చేతులు రెయిలింగ్‌కు చాచి, వీధిలోకి ఏటవాలుగా తొంగి చూస్తున్నాడు. సాయంత్రపు ఎండలో ఆయన ముగ్గుబుట్ట జుట్టు అక్కడక్కడా పసుపు ఛాయతో మెరుస్తోంది.
ఆమె హాండ్‌బాగ్ డైనింగ్‌ఛైర్‌కు వేలాడేసి వంటగదిలోకి నడిచింది. ఫ్రిజ్‌లోంచి నీళ్ళ బాటిల్ తీస్తూ అడిగింది: "ఏంటి నాన్నా ఎండలో కూర్చున్నావ్?"

వినికిడి సన్నగిల్లిన ఆయన చెవులకు ఏదో అలికిడైనట్టనిపించింది తప్ప ప్రశ్న వినపడలేదు; మూలవాటుగా తల తిప్పి "వచ్చావా" అంటూ తల పంకించి యథాప్రకారం వీధి వైపు చూపు మరల్చాడు.

ఆమె "హ్మ్!" అని నిట్టూర్చి, బాటిల్ తీసుకుని బాల్కనీలోకి నడిచింది. ఆమెకు యాభైనాలుగేళ్ళు. అన్నేళ్ళ జీవితాన్ని చూసిన అలసట ఆమె కళ్ళ కింద నలిగిన చర్మపు సంచీల్లో స్ఫుటమౌతోంది. మధ్యకి తీసిన పాపిట మొగలో ఓ తెల్లని సిగపాయ బయల్దేరి చెవి వెనక కలిసిపోయింది. నీళ్ళు త్రాగడానికి చుబుకం పైకెత్తినా యింకా డబల్‌చిన్ కనిపిస్తూనే వుంది. నాలుగు గుక్కలు తాగిన తర్వాత బాటిల్ రెయిలింగ్ మీద ఆన్చి, మూత బిగిస్తూ, ముసలాయన్ని వుద్దేశించి యిందాకటి ప్రశ్నే మరలా రెట్టించింది.

ఈసారి వినిపించిందేమో; ముసలాయన వీధి మొగ మీంచి ఆమె వైపుకు, ఆమె మీంచి అటుపక్కన ఆకాశంలో వున్న సూర్యునివైపుకు తల తిప్పి చూసాడు. మరలా మునుపటిలా వీధి మొగ వైపుకు చూపు మరలుస్తూ సమాధానమిచ్చాడు: "ఎండేముందమ్మా... ఐదయిపోయింది కదా. చల్లబడిందిలే కాస్త". ఇలా అంటూనే చెమట వల్ల మెడకంటుకుపోయిన లాల్చీ కాలర్‌ను చీదరగా వదులు చేసుకున్నాడు.

ఆమె చిన్నగా నవ్వింది; పై పెదవిపై మీసం కట్టిన చిరుచెమట మెరిసింది. తనూ ఆయన చూస్తున్న వైపే చూపుసారిస్తూ, "ఏంటి అంత దీక్షగా చూస్తున్నావ్?" అని అడిగింది.

ఆయన అదే ప్రశ్న కోసం ఎదురుచూస్తున్నట్టు, కుర్చీలో భారంగా వెనక్కు వాలాడు. "ఈ కుర్రాడమ్మా..., ఇంకా రాలేదు. రోజూ పొద్దున్న నువ్వు ఆఫీసుకు వెళ్తున్నావనగా వచ్చేసేవాడు కదూ! ఇవాళేంటో మరి! సాయంత్రమైంది, పత్తా లేడు," ఫిర్యాదు చేస్తున్నట్టు చెప్పాడు.

"ఓహ్ శేఖర్ కోసమా!" అందామె ఏదో గుర్తొచ్చినట్టు; "మర్చిపోయాన్నానా చెప్పడం. శేఖర్ యివాళ సాయంత్రంజేసి వస్తానన్నాడు. సామాను సర్దుకోవాలట. రేపొద్దున్న వాళ్ళ వూరెళ్ళిపోతున్నాడు. ఇవాళొచ్చి చివరి జీతం తీసుకుంటానన్నాడు..." ఈ సంగతి చెప్తూ చెప్తూ క్రింద గేటు మీదుగా వెళ్తూన్న కూరగాయల బండివాణ్ణి చూసింది. "బాబూ కూరగాయలూ!" అంటూ కేకేసింది. అతను పైకి చూడగానే చేతితో ఆగమని సైగ చేసి, "నాన్నా కిందకి వెళ్తున్నా. నువ్వూ లోపలికి వచ్చేసేయ్. ఎండ మొహానికి కొట్టడం లేదూ!" అంటూ లోపలికి వెళ్ళింది.

ముసలాయన చూపు యింకా కూతురు వదిలి వెళ్ళిన శూన్యంలోనే పాతుకుపోయి వుంది. లిప్తమాత్రంలో తేరుకుని, "మరి నాకు చెప్పాడు కాదేం?" అంటూ ఆమె వెళ్ళిన వైపు శక్తి కొద్దీ అరిచాడు.

"ఎవరూ, శేఖరా? చెప్పేవుంటాడు. నీకు వినపడి వుండదు," క్రమంగా కృశిస్తూన్న గొంతు హాల్లోంచి జవాబిచ్చింది. కాని అది ఆయనకు వినపడలేదు.

క్షణాల్లో పదేళ్ళు పైబడినట్టు అయిపోయింది ఆయన వాలకం. రెయిలింగ్ ఆసరాతో నెమ్మదిగా కుర్చీలోంచి లేచాడు. ఆయనకు ఎనభయ్యేడేళ్ళు. అవసరానికి మించిన చర్మాన్ని అస్థిపంజరంపై వదులుగా ఆరేసినట్టు ముడతలతో బక్కగా బలహీనంగా వున్నాడు. పళ్ళు లేని చప్పిడి దవళ్ళు ఏదో నవుల్తూన్నట్టు కదుల్తున్నాయి. నీలం గళ్ళ లుంగీ మీదకు తెల్లని లాల్చీ తొడుక్కున్నాడు. లుంగీ క్రింద నుంచి ఎడమ పాదానికున్న సిమెంట్‌కట్టు కనిపిస్తోంది. ఆ కాలిమీద వీలయినంత తక్కువ బరువు మోపుతూ కుంటి నడకతో లోపలికి బయల్దేరాడు.

యుగాలనిపించిన కొన్ని క్షణాల పర్యంతం వంటగదిని దాటి, డైనింగ్ టేబిల్ దగ్గరకు చేరుకున్నాడు. కుర్చీ వీపుకు తగిలించి వున్న హాండ్‌బాగ్‌ని తీసి, "ఎక్కడ పడితే అక్కడే పడేస్తుంది," అని గొణుక్కుంటూ పక్కన గోడకున్న హాంగర్‌కి తగిలించాడు. ఫేన్ స్విచ్ నొక్కాడు. కరెంట్ లేదు. నిట్టూర్చి కుర్చీ లాక్కుని నింపాదిగా కూర్చున్నాడు. డైనింగ్ టేబిల్ మీద రెండు చేతులూ వూతంగా నిలబెట్టి మధ్యలో ముఖం ఆన్చి ఆలోచనలో నిమగ్నమయ్యాడు. చీకట్లో ఫ్లాట్‌ఫాం అంచు దగ్గర నిలుచున్నపుడు ఎదుట వెళ్తూన్న రైలు కిటికీల్లోంచి క్షణానికొకటిగా మారుతూ కనిపించే దృశ్యాల్లా, ఆయన మనోనేత్రం ముందు యిటీవలి గతానికి చెందిన కొన్ని దృశ్యాలు చకచకా కదలసాగాయి. వాటన్నింటిలోనూ శేఖర్ వున్నాడు. కొన్నింటిలో అస్పష్టంగా తను కూడా వున్నాడు: ఒక దృశ్యంలో శేఖర్ మంచంపై తన కాళ్ళ దగ్గర కూర్చుని వార్తాపత్రిక సంపాదకీయం గట్టిగా చదివి వినిపిస్తున్నాడు; ఒక చోట విసిగిస్తున్న తన దవడలు బలవంతంగా విప్పదీసి టానిక్‌చెంచా నోట్లో యిరికించడానికి ప్రయత్నిస్తున్నాడు; యింకొక చోట తనకు సవ్యంగా వినిపించేట్టు బిగ్గరగా మాట్లాడుతూ, ఆ గొంతుకు తగ్గ ఆంగికంతో చేతులూపుతున్నాడు; మరొక చోట, తాము కూర్చున్న పార్కు బెంచీ ముందు నుంచీ వాళ్ళ నాన్నతో పాటూ బుడి బుడి అడుగుల్తో జాగింగ్ చేస్తున్న పసిదాని తోవకి వూతకర్ర అడ్డం పెట్టి, నవ్వుతున్నాడు; యింకో దృశ్యంలో, బయట కారిడార్‌లో లిఫ్టు దగ్గర నుంచొని, బటన్ నొక్కి, తనవైపు వీడ్కోలు సూచకంగా చేయి వూపుతున్నాడు.

ముసలాయన తల విదిల్చి ఈ స్మృతులనించి తెప్పరిల్లాడు. కుర్చీలో వెనక్కి జారగిల బడ్డాడు. ఆయనకీ పరిసరాలు వుక్కపోతగా అనిపించాయి. డైనింగ్ టేబిల్ మధ్య స్టాండు మీద బోర్లించిన గాజు గ్లాసుల్ని ఒక్కొక్కటే తీసి గోడకేసి బద్దలుగొట్టాలనిపించింది. ఇంతలో తలుపు తెరుచుకుని కూతురు గుమ్మంలో ప్రత్యక్షమైంది. ఆమె చంకలోంచి ముందుకులాగి పట్టుకున్న కొంగు నిండా ఏవో కూరగాయల బరువుంది. వస్తూన్నదల్లా తండ్రిని చూడగానే గడప దగ్గర ఆగి, సందడిగా నవ్వుతూ బయటికి తొంగి చూసి, "రా శేఖరూ! యిదిగో, పొద్దుట్నించీ నాన్న నీకోసం వెయిటింగు," అంటూ లోపలికి వచ్చింది; వంటగదిలోకి వెళ్తూ "క్రింద కూరగాయలు బేరమాడుతూంటే ఎదురొచ్చాడు నాన్నా," అంటూ తండ్రికి వివరమందించింది. ముసలాయన చూపు అప్పుడే లోనికి ప్రవేశించిన శేఖర్ మీద వుంది: గుమ్మం పక్కనున్న జోళ్ళ స్టాండులో జోళ్ళు విదులుస్తూ, "ఏం తాతగారూ, నా కోసం చూస్తున్నారా?" అంటూ పలకరించాడు. ముసలాయనకి యిప్పుడు గ్లాసులు గోడకేసి కాక శేఖర్‌కేసి కొట్టాలనిపించింది. సమాధానం యివ్వలేదు. శేఖర్ వచ్చి ముసలాయనకు ఎడంగా వున్న డైనింగ్ కుర్చీలో కూర్చున్నాడు. అతనికి యిరవైమూడేళ్ళు. తల్లుల పోలిక రావడం వల్ల సున్నితమైన అందాన్ని సంతరించుకునే ముఖాల కోవకు చెందుతుంది అతని ముఖసౌష్టవం. క్రిందా పైనా బరువైన కనుపాపల్తో నవ్వితే చికిలించుకునే కళ్ళు, దట్టమైన కనుబొమ్మలు; కణతల్ని కప్పేసి, వెనక్కి దువ్విన దుబ్బు జుట్టు; నూనూగు మీసాలు; వెడల్పాటి కింది పెదవి; గోధుమ రంగు శరీరం. . . .

"ఏంటి కొడతారా, అలా చూస్తున్నారు?" భయంగా మొహం పెట్టి అడిగాడు శేఖర్.

ముసలాయన ముభావంగా చూపులు గ్లాసు స్టాండు వైపు మళ్ళించాడు.

"నాన్నా! వచ్చాడు కదా... బయల్దేరండిక పార్కుకి, మళ్ళా చీకటి పడుతుంది," వంటగదిలోంచి గిన్నెల మోత నేపథ్యంగా కూతురి గొంతు వినిపించింది.

ముసలాయనకి అదను దొరికినట్టైంది; కుర్చీలోంచి లేచి, "నీరసంగా వుందమ్మా, కాస్త నడుం వాలుస్తాను," అంటూ తన పడగ్గది వైపు నడిచాడు.

"అయ్యో! అదేంటి నాన్నా... యిప్పటి దాకా ఎండనపడి కూర్చుని మరీ ఎదురు చూసి తీరా అతనొచ్చాక పడుకుంటానంటారేమిటి?" అంది కూతురు.

"పోనీ లెండాంటీ, పడుకోనీయండి. ఎండలో కూర్చున్నారా? అందుకే అయ్యుంటుందీ నీరసం," అన్నాడు శేఖర్, పడగ్గదిలోకి వెళ్తూన్న ముసలాయన్ని చూస్తూ.

ముసలాయనకి శేఖర్ ఆటకట్టించగల మాటేదీ తట్టలేదు. దాంతో, దానికి బదులుగా, తలుపు దఢాలున శబ్దం వచ్చేట్టు మూసి లోపలికొచ్చేశాడు. కిటికీని కప్పివుంచిన సిల్కు తెరలు అసలే క్షీణిస్తున్న సాయంత్రపు వెలుగుని మరింత మసకగా లోపలికి వడగడుతున్నాయి. ముసలాయన మంచం హెడ్‌బోర్డుకు తలగడ నిలువుగా వత్తిపెట్టి దాని మీద ఏటవాలుగా జారగిలబడ్డాడు. ఎదురుగా గోడకున్న గడియారం వైపు చూసాడు. టైము సరిగ్గా ఐదున్నర అయింది. తర్వాతిక చేసేదేం లేక, ఆ గడియారాన్నే చూస్తూ కూర్చున్నాడు. క్రమేణా ఆయన చర్మచక్షువులు అంతర్ముఖమై ముందున్న గడియారం మసకబారింది; ఆ స్థానంలో, పక్కనే టౌన్‌షిప్‌లో వున్న "సీనియర్ సిటిజన్ క్లబ్" దృశ్యం వచ్చి చేరింది. అక్కడ జరిగే లాఫింగ్ సెషన్స్ గుర్తు రాగానే ముసలాయన ముఖం చేదు తిన్నట్టు చిట్లింది. రేపణ్ణించీ అక్కడికెళ్ళాలేమో! కానీ తనకు చీదర. అక్కడంతా పాసిపోయిన వాతావరణం. వర్తమానం లేదు. భవిష్యత్తన్న మాటే రాదు. ఎప్పుడు చావొచ్చి వీపు చరుస్తుందోనన్న భయాన్ని, లేక యింకా వచ్చి చావదేమన్న ఒంటరితనపు వైరాగ్యాన్నీ తాత్కాలికంగానైనా దిగమింగడానికి అందరూ చెట్టపట్టాలేసుకుని గతాభిముఖంగా నిలబడి వున్మాదుల్లా పగలబడి నవ్వుతారు. సంభాషణలన్నీ వాతావరణ వివరాల్తోనో, పిల్లల ఆగడాల్తోనో, రోగాల బేరీజుల్తోనో, కాస్త రంగు పులిమి గతంలోంచి ఎత్తుకొచ్చిన పిట్ట కథల్తోనో నిండి వుంటాయి. ఎవరి ప్రత్యేక వ్యక్తిత్వాల్ని వాళ్ళు విసర్జించేసి, ఏదో ఓడమునిగితే దీవికి ఈదుకుంటూ చేరిన ప్రమాద బాధితుల్లాగా ఒకరినొకరు పిరికిగా కరచుకుపోవడం.... ముసలాయన తల అడ్డంగా విదిలించాడు. కళ్ళముందు గడియారం మళ్ళీ రూపం తొడుక్కుంది. టైం ఐదూ-ముఫ్ఫయైదయింది. తలుపు తెరుచుకుంది. శేఖర్ బయటే లెక్కపెట్టుకున్న డబ్బు జీన్స్‌ఫాంట్ ముందు జేబులో కుక్కుకుంటూ వచ్చి, మంచం మీద ముసలాయన కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ముసలాయన వెంటనే గడియారం కేసి తల తిప్పేసుకున్నాడు. శేఖర్ యిక వుండబట్టలేకపోయాడు: "ఏంటీ, పెద్ద సీరియస్‌నెస్సు? ఏమైందివాళ మీకు? ఎవరి మీద కోపం?"

ముసలాయన గడియారం వంక చూస్తూనే, దొంగ నిట్టూర్పొకటి విడిచి, బదులిచ్చాడు: "మాకెవరి మీద కోపం వుంటుందిరా? అయినా మా కోపంతో ఎవరికి నిమిత్తం? పేషెంట్‌కి నయమైపోయింది. మేల్‌నర్సు డ్యూటీ అయిపోయింది. ఇవాళ జీతం తీసుకుని చక్కా చెక్కేస్తున్నారు, అయ్యగారు. మధ్యలో మాదేముంది?"

"ఏంటి, వెటకారమా?"

ముసలాయన గడియారాన్ని పరిశీలించడం మానలేదు.

"అంటే ఈ నాలుగు నెలలూ నేనిక్కడ చేసింది డ్యూటీ అంటారు," శేఖర్ గొంతు గంభీరంగా వుంది.

ముసలాయన సెకన్ల ముల్లుపై దృష్టి కేంద్రీకరించాడు.

"అయితే నేనో నర్సుని, అంతేనన్నమాట," కాస్త అసహనంగా, నర్సన్న మాట ఒత్తి పలుకుతూ అన్నాడు శేఖర్.

ఎట్టకేలకు తను ఆశించిన ఎఫెక్టు సాధించగలిగాననిపించాక — తన అక్కసు వెళ్ళగక్కేందుకు సరైన పునాది ఏర్పడిందని నిశ్చయమయ్యాక — ముసలాయన గడియారం మీంచి శేఖర్ వైపు తల తిప్పాడు; జారగిలబడ్డవాడల్లా ముందుకు వంగి, "ఆ మాట నేనేమీ అనలేదురా! నీ పద్ధతులలా వున్నాయి మరి. రేపెళ్ళిపోతున్న వాడివి, ముందో మాట నాకు చెప్పొద్దూ? మీ ఆంటీకి చెప్తే సరిపోతుందా? జీతం యిచ్చేది ఆవిడ గనుకనా? అప్పుడు మరేమనుకోవాలి నన్నూ-నిన్నూ; పేషెంటూ-నర్సూ అనుకోక?" తల పైకి తాటిస్తూ గొడవకొస్తున్న గొంతుతో అడిగాడు.

ఈ ఎదురుదాడి పూర్తయ్యాక శేఖర్ క్షణమాత్రం మౌనాన్ని అవలంబించాడు. తర్వాత అర్థం చేసుకున్నట్టు చిరునవ్వు నవ్వటం మొదలు పెట్టాడు. ఆ నవ్వు ముసలాయనకి నచ్చలేదు.

తర్జని ఆడిస్తూ, "వీపు విమానం మోతెక్కిపోతుందొరే, అలా నవ్వావంటే," అంటూ వెనక్కి జారగిలబడ్డాడు. కినుక మొహం పెట్టి చేతులు కట్టుకున్నాడు.

శేఖర్ అదే నవ్వు నవ్వుతూ పైకి లేచి నిల్చున్నాడు. "పదండి, పార్కు దాకా నడిచొద్దాం," అన్నాడు ఆసరాకి చేయందిస్తూ.

"నాకు ఓపిక లేదురా యివాళ," బెట్టు సడలుతున్న గొంతుతోనే అన్నాడు ముసలాయన.

"అలా కుదరదు! లేవాలి మరి, మళ్ళీ రేపు నేనుండను," శేఖర్ పట్టుబట్టాడు.

ఇక పూర్తిగా సడలిపోయాడు ముసలాయన. "ఇదో వెధవ బెదిరింపేమో మళ్ళీమాకు," అని గునుస్తూనే శేఖర్ చేయందుకుని మంచం దిగి నుంచున్నాడు.
* * *
తర్వాత కారిడార్‌లోనూ, లిఫ్టులోనూ, అపార్ట్‌మెంటు గేటు దగ్గరనుండి పార్కు గేటు దాకానూ యిద్దరూ ఈ విషయమై కీచులాడుకుంటూనే వున్నారు; "కోచింగ్ క్లాసులు పూర్తవగానే నేను వూరెళిపోతానని మీకు తెలుసు కదా"ని శేఖరూ, "నీ కోచింగ్ ఎప్పుడు పూర్తవుతుందో నాకేం తెలుస"ని ముసలాయనా, "తెలుసనుకున్నాన"ని శేఖరూ, "అనుకోవడమేమి"టంటూ ముసలాయనా వాదించుకుంటూనే వున్నారు. నిజానికి ఈ వాదులాట సగంలో వుండగానే ముసలాయనకి శేఖర్ తను వెళ్ళబోయే తేదీ ముందే చెప్పాడన్న సంగతి గుర్తొచ్చింది; అయితే, వెళిపోవాలనుకోవడమే శేఖర్ అసలు నేరంగా మనసులో ఓ రహస్య నిశ్చయానికొచ్చేసిన ఆయన, హేతువుకు నిలబడని ఈ వాదాన్ని బయటపెట్టలేక, మొండిగా శేఖర్‌దే తప్పని బుకాయిస్తూనే వున్నాడు. చివరికి శేఖరే మెట్టు దిగి తనదే తప్పని ఒప్పుకున్నాడు. కాని అతనలా ఒప్పుకోగానే అర్థమైంది ముసలాయనకి, ఈ వాదనంతా ఎంత నిష్పలమో. ఎంత వాదించినా అతను వెళ్ళిపోతున్నాడన్న నిజం ఎలానూ వీగిపోదు. ఇది గుర్తు రాగానే, ఇదివరకట్లా రాగద్వేషాల్తో మలినం కాని, స్వచ్ఛమైన, సొంతమైన దిగులు ఆవరించుకుంది ఆయన్ని.

వాళ్ళు కూర్చున్న మునిసిపల్ పార్కు చిన్నదే. మధ్యలో నీళ్ళు రాని ఫౌంటెన్; దాని చుట్టూ విశాలంగా ఎత్తు పల్లాలతో ఆవరించుకున్న పచ్చిక బయలు; ఈ పచ్చికకు చుట్టూ అంచులాగా జాగర్స్ కోసం ఎర్రమట్టితో వేసిన బాట; ఆ బాట పక్కన క్రమం తప్పని విరామాల్లో సిమెంటు బెంచీలు; ఆ బెంచీల వెనకగా, బాట పైకి వంగి చూస్తూ, నిద్ర గన్నేరు, తురాయి, మోదుగ యిత్యాది చెట్ల వరుసలు. . . . పార్కు సందర్శకులు ఈ చెట్ల కాండాల మధ్య నుంచీ కనిపిస్తున్న ట్రాఫిక్‌ని, చెట్ల చిటారు కొమ్మల మీంచీ తొంగి చూస్తున్న కాంక్రీటు భవనాల్నీ నిర్లక్ష్యం చేయగలిగితే, స్వచ్ఛమైన ప్రకృతి మధ్య వున్న భ్రమని సాధించగలిగినట్లే. సూర్యుడు భవన సముదాయాల వెనక్కి వెళిపోవడంతో ప్రస్తుతం పార్కంతా నీడలోనే వుంది. పార్కులో జనం తగుమాత్రంగా వున్నారు. సిమెంటు బెంచీలు అధిక భాగం జంటల్తో నిండి వున్నాయి. ఎదుట పచ్చిక బయల్లో కూడా కొందరు కూర్చున్నారు. కేరింతలు కొడుతున్న పసివాణ్ణి వాళ్ళ నాన్న మునివేళ్ళు పట్టుకుని ఫౌంటెన్ గట్టు మీద నడిపిస్తున్నాడు; వాళ్ళమ్మ పచ్చికలో కూర్చుని చప్పట్లు కొడుతూ ఉత్సాహపరుస్తోంది. జాగింగ్‌సూట్ వేసుకున్న ఓ నడివయస్సు బట్టతలాయన బలమైన గ్రేహౌండ్‌ను గొలుసుతో అదుపు చేయలేక దాంతో పాటూ వురుకుతున్నాడు.

"ఫిట్‌నెస్ మీద బాగా శ్రద్ధ వున్న కుక్కనుకుంటాను," శేఖర్ ముసలాయన వైపు చూసి వ్యాఖ్యానించాడు. ముసలాయన ఆలోచన నుండి తెప్పరిల్లి శేఖర్ వైపు చూసాడు; ఏమిటన్నట్టు తల ఎగరేశాడు. ఆయనకి వినపడేంత బిగ్గరగా చెప్పేసరికి ఎలాగూ అందులోని కాస్త హాస్యమూ చప్పబడిపోతుంది; కాబట్టి శేఖర్ ఏమీ లేదన్నట్టు తల వూపాడు.

"అయితే మళ్ళీ పరీక్ష రాయడానికే వస్తావనుకుంటా?" అనడిగాడు ముసలాయన.

"రావలసిన అవసరం వుండదు. పరీక్ష సెంటర్ మా వూరికి దగ్గర్లోనే యిస్తారు," శేఖర్ సమాధానమిచ్చాడు.

ముసలాయన తలపంకిస్తూ కిందికి చూసాడు. వాళ్ళిద్దరూ నిద్రగన్నేరు చెట్టు కింద వున్న ఓ సిమెంటు బెంచీ మీద కూర్చున్నారు. గాలి కదిలినపుడల్లా కాసిని ఎండుటాకులు గింగిరాలు తిరుగుతూ రాలిపడుతున్నాయి. నేల మీద పడ్డ ఆకుల్ని ముసలాయన వూతకర్రతో సర్దుతున్నాడు. శేఖర్‌కి జాలేసింది: "సెలక్టయితే మాత్రం వుద్యోగం యిక్కడే వేయించుకుంటా లెండి. దగ్గర్లోనే మకాం పెట్టేస్తాను. ముప్పొద్దులా నన్ను భరించక తప్పదు మీరు," నవ్వుతూ అన్నాడు.

"అదంతా తేలేసరికి ఎంత కాలం పడుతుంది?" ఎండుటాకులు సర్దుతూనే అడిగాడు ముసలాయన.

"ఎంత, సంవత్సరంలో అయిపోతుంది."

ముసలాయన ఓ పొడినవ్వు నవ్వి అన్నాడు, "అప్పటిదాకా నేనుండొద్దురా?"

"మొదలెట్టారా మళ్ళీ," శేఖర్ విసుగు నటించాడు.

"అదికాదురా, గత నెలగా పేపర్లో అబిట్యురీ పేజీలో ఒక్కడంటే ఒక్కడు ఎనభై దాటినవాడు కనపడలేదు. అందరూ అరవై-డెబ్భైల్లోపే. మరి నాకిప్పుడు ఎనభయ్యేడు. అసలు మొన్నటి దెబ్బకే పోవలసింది. ఆ పడింది పడింది — ఏ గచ్చుమీదనో, సింక్ మీదనో పడి తల బద్దలుగొట్టుకోకుండా — సరాసరి టబ్ నీళ్ళల్లో పడబట్టి, ఇదిగో, ఇలా చావు తప్పి కాలు సొట్టపోయింది," అంటూ వూతకర్రతో ఎడమ కాలి కట్టు మీద కొట్టుకున్నాడు.

"మీరు ముందా అబిట్యురీ పేజీల్ని ఫాలో అయ్యే వెధవలవాటు మానుకుంటే మంచిది."

"మీకు క్రికెట్ పేజీలెలాగో, మాకు అబిట్యురీ పేజీ అలాగరా. నీకు ఒరిగేదేం లేకపోయినా ఎవడెంత కొట్టాడో ఆసక్తిగా చూడవూ? ఇదీ అంతే."

"మీరు సెంచరీ కొట్టేస్తార్లెండి. ఆ విషయంలో ఏ దిగులూ పెట్టుకోకండి."

"అంత ఆశ గాని, ఆసక్తి గానీ లేవురా. ఆ వచ్చేదేదో వచ్చేస్తే ఓ పనయిపోతుంది కదా, అన్నట్టుంది ప్రస్తుతం నాకు. రేపణ్ణించీ రోజులు తల్చుకుంటే..." ఎలా పూర్తి చేయాలో తెలియక ఆగిపోయాడు.

ముసలాయన మాట్లాడబోయింది తను వెళిపోవడం గురించేనని శేఖర్‌కి తెలుసు. కాని తానిప్పుడు ఓదార్చే పాత్ర పోషిస్తే ఈ వియోగం పట్ల తనకే బాధా లేదన్న భావన కలిగించినట్లవుతుంది. అందుకే నిశ్శబ్దంగా వుండిపోయాడు. ఆయనీ ప్రస్తావన తేకుండా వుంటే బాగుండేదనిపించింది.

ఫౌంటెన్ గట్టు మీద నిలబడ్డ పసివాడు, నాన్న తన చేయి వదిలేసి దూరంగా నిలబడటంతో, చేతులు గాల్లో చాచి పిడికిళ్ళు మూసి తెరుస్తూ "దాదీ! దాదీ!" అని పిలుస్తున్నాడు. పక్కబెంచీలో కూర్చున్న అమ్మాయి, ప్రియుడు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ ఎదుట చక్కర్లు కొడుతూంటే, చేతులుకట్టుకు వెనక్కివాలి సాధికారపూర్వకమైన చిరునవ్వుతో పరిశీలిస్తోంది. ముసలాయనకి వెంటనే అర్థమైంది — రేపణ్ణించీ తానీ పార్కుకి రాడని, రాలేడని. తామిద్దరితోనూ కలిసి ఎన్నో వేడుకైన సాయంత్రాల్లో మూగదైన మూడోభాగస్వామిగా పాలుపంచుకొందీ పార్కు. ఇకమీదట ఇక్కడికెప్పుడొచ్చినా దీని మూగతనం శేఖర్ లేని లేమిని గుర్తు చేస్తూనే వుంటుంది. పక్కకి చూసాడు. శేఖర్ బెంచీ వెనక్కి తల వాల్చి నిద్రగన్నేరు కొమ్మల్లోకి చూస్తున్నాడు. ఏదో గుండెల్లోంచి మొదలై గొంతు దాకా ఎగతన్నినట్టైంది ముసలాయనకి: "ఏరా నన్ను గుర్తుంచుకుంటావా?" అనడిగాడు. మరణానంతరం ఈ యువకుని జ్ఞాపకంలో మిగలడమొక్కటే తన పూర్తి అస్తిత్వానికి సార్థకత అనిపించింది ఆ క్షణాన.

శేఖర్ ఇబ్బందిగా నవ్వి ముందుకు వాలాడు: "అలా మాట్లాడకండి."

"కాదు, చెప్పు."

"ఎందుకు మర్చిపోతాను!"

"మరి చచ్చిపోయినపుడు తప్పకుండా వచ్చిపోవాలి ఓసారి"

"ఇదిగో! మళ్ళీ చెప్తున్నా — "

"అదికాదురా... నాకు చాలామంది ఫ్రెండ్స్ వుండేవారు. కాని దాదాపు అందరూ చచ్చిపోయారు. నేను ఈ భూమ్మీద వదిలిపోతున్న ఫ్రెండువి నువ్వొక్కడివే. అందుకే, నన్ను గుర్తుంచుకో. చెప్పాలనుకున్నది చెప్పేస్తున్నా... ఈ నాలుగు నెలలూ నాకు గుర్తుంటాయి, బతికిన కొన్నాళ్ళయినా. అర్థమయిందా."

"సరే."

"మంచి వుద్యోగం సంపాదించు. అంతకన్నా ముఖ్యంగా, నువ్వంటే ప్రాణం పెట్టే వాళ్ళని నీ చుట్టూ కూడబెట్టుకో. అదే నువ్వు బతికి సాధించగలిగింది. అర్థమైందా!"

"ఊఁ." శేఖర్ పరాకుగా ఒక అరచేతి రేఖల మీద మరో చేతి చూపుడువేలితో జాడలు తీస్తున్నాడు.

ముసలాయన గట్టిగా నిశ్వసించి,"వెళ్దామా, ఇక చీకటి పడుతోంది," అని పైకి లేచాడు.

శేఖర్ లేచాడు. ముసలాయన అలవాటు ప్రకారం శేఖర్ భుజం చుట్టూ ఓ చేయి వేసి మరో చేత్తో వూతకర్ర పట్టుకుని నడవసాగాడు. ఇదే చివరి స్పర్శ అన్న ఎరుకతో కాబోలు, వేలిముద్రలు దిగిపోతాయేమోన్నంత బలంగా శేఖర్ భుజాన్ని ఒడిసి పట్టుకున్నాడు. గేటు దాకా యిద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. దారిలో గ్రేహౌండ్, దాని బట్టతల యజమాని రెండోరౌండ్ కొడుతూ వాళ్ళకు ఎదురొచ్చారు. ప్రవేశం దగ్గర యినుప రివాల్వింగ్ గేటును తిప్పుకుంటూ వస్తున్న యిద్దరు యువకులు ఏదో జోక్ చెప్పుకుని, ఒకరి చేతిమీద మరొకరు చప్పట్లు చరుచుకుంటూ పగలబడి నవ్వుకున్నారు. గేటు గూండా ముందు శేఖర్ వెళ్ళి ముసలాయనకు చేతిసాయం అందించాడు.

రోజులాగే శేఖర్ ముసలాయన్ని ఫ్లాట్ దాకా దిగబెట్టేందుకు రోడ్డు దాటించబోతుంటే, ఆయన అలా వీల్లేదన్నాడు; శేఖర్‌ని యిక్కణ్ణించే సాగనంపి తనొక్కణ్ణీ యింటికి వెళిపోతానన్నాడు. శేఖర్ కాసేపు వాదించి, చివరకు ముసలాయన మొండిపట్టు పట్టడంతో ఒప్పుకున్నాడు. ఆటో మాట్లాడటం పూర్తయ్యాక, జాగ్రత్తగా వుండమనీ, బాత్రూం కెళ్ళేటపుడు తలుపు గెడ వేసుకోవద్దనీ, తాను వారానికోసారి ఫోన్ చేస్తుంటాననీ చెప్పి ఎక్కి కూర్చున్నాడు శేఖర్. ఆటో మలుపు తిరిగే వరకూ పుట్‌పాత్ మీద నుంచున్న ముసలాయనకి చేయి వూపుతూనే వున్నాడు.
* * *
ఏదో నేలన పడ్డ చప్పుడైతే కూతురు చిప్స్ తరగడం ఆపి వంటగదిలోంచి బయటకు వచ్చింది. ముసలాయన తలుపు దగ్గర శిలలా నిలబడి వున్నాడు. వూతకర్ర నేల మీద పడివుంది. ఆమెకు కంగారేసింది. "ఏంటి నాన్నా! ఏమైందీ? శేఖర్ ఏడీ?" అంటూ గబ గబా దగ్గరకు వచ్చింది. ముసలాయన కలలోంచి తేరుకున్నట్టూ ఆమె వైపు చూసాడు. ఆయన కళ్ళల్లో చెమ్మ తళుక్కుమంది. "ఏమైంది నాన్నా? ఒక్కడివే వచ్చేవేం?" భుజం మీద చేయివేసి గాభరాగా అడిగింది.

"నేనే అట్నుంచీ వెళ్ళిపొమ్మన్నాను," పూడుకుపోతున్న గొంతుని పెగుల్చుకుని చెప్పగలిగాడు.

ఆమెకి అర్థమైంది. ఆయనపై ప్రేమ వెల్లువెత్తింది. ఆయన్ని దగ్గరకు తీసుకుని, సందిట్లో తల ఆన్చి, వీపు రుద్దుతూ, "ఏంటిది నాన్నా పిచ్చికాకపోతే... నేనున్నాను కదా. మనిద్దరం వున్నాం కదా, ఒకరికొకరు," అని అనునయించింది.

ఇప్పుడు ఓదారుస్తోంది తనొకప్పుడు మోకాళ్ళ మీద బోర్లా పడుకోబెట్టుకుని లాల పోసిన పాపాయి కాకపోతే, ఆయన గట్టు తెంచుకుని భోరుమని ప్రవహించేసేవాడే. అహం అడ్డొచ్చింది. "ఊరుకోమ్మా, నువ్వు మరీ హడావిడి చేస్తావ్!" అని ఆమెను వదిలించుకుని నెమ్మదిగా కుంటుతూ పడగ్గది వైపు నడిచాడు.
— సమాప్తం —
ఈ కథ "పొద్దు"లో ప్రచురితం.

1 comment:

  1. 'పొద్దు' లో చదివానిది. ఇంగ్లిష్ పదాలు కొంచం ఎక్కువగా ఉన్నాయనిపించింది. మరో బ్లాగు మిత్రుడు కూడా ఇదే మాట అన్నారు. కథ, కథనం బాగున్నాయి. అభినందనలు.

    ReplyDelete