May 26, 2009

"అనుక్షణికం" నచ్చని విధం

అవుటాఫ్ ది బ్లూ "అనుక్షణికం" మొదలు పెట్టాను. "హిమజ్వాల" తరువాత ఇంకెప్పుడూ వడ్డెర జోలికి వెళ్ళి నడ్డి మీద వడ్డింపులు పుచ్చుకోకూడదనుకున్నాను గానీ, అంతర్జాలంలో అక్కడక్కడా ఈ పుస్తకాన్ని గురించిన హడావిడి చూసాక మళ్ళీ కాస్త మనసు లాగింది. మొదటి అధ్యాయంలో శ్రీపతి పాత్ర పరిచయం వరకూ బానే నడిచింది. ఉస్మానియా కళాశాల వర్ణన అయితే—కనీసం చదివేటప్పుడు కథని మనోఫలకంపై మరింత స్పష్టంగా ఊహించుకునేందుకు వీలుగానైనా—వచ్చే ఆదివారం ఓసారి కళాశాలకి వెళ్ళి చూడాలనిపించేంత బాగుంది. రచయిత, శ్రీపతి ముసుగులో, స్వప్నరాగలీనకు మానవాతీతమైన మార్దవాన్ని ప్రసాదించబూనడమూ ఎలాగో భరించేశాను. (మచ్చుకి, "షి ఈజ్ టూ సబ్‌లైమ్ టు బి డ్రాగ్డ్ ఇంటూ దిస్ రెచెడ్ బిజినెస్" అనేదో అంటాడు శ్రీపతి ఓ చోట; "అంతుందా" అనుకున్నాన్నేను.) స్త్రీ అవయువాల వర్ణనకు ప్రబంధకాలపు తుప్పుపట్టిన పదాల జోలికి పోకుండా బొడ్డుకి సింపిల్‌గా బొడ్డు అనీ, చనుగుబ్బల్ని ఎంచక్కా చనుగుబ్బలే అనీ వాడడం హాయిగా వుంది. కొన్ని క్రియలకు వుండే అనవసరమైన సాగదీతలు కత్తిరించి, చిర్నవ్వు నవ్వడాన్ని "చిర్నవ్వి" అనీ, స్నానం చేయడాన్ని "స్నానించి" అనీ క్లుప్తీకరించడమూ బానే అనిపించింది. మరైతే సమస్య ఎక్కడ? చదివినంత సేపూ ఏదో కొడుతూనే వుంది. "ఇంకో పది పేజీలు గడిస్తే చాలు, పుస్తకాన్ని పక్కన పెట్టేస్తావు చూడు నువ్వు; పందెమా?" అని అంతరాత్మ అనుక్షణం బెదిరిస్తూనే వుంది.

అసలు రచయిత అవుట్‌లుక్‌తోనే—అంటే అతను చుట్టూ ప్రపంచాన్ని స్వీకరించే విధానంతోనే—జీవితం పట్ల అతని దృక్పథంతోనే—నాకు ఎక్కడో ఇబ్బంది వున్నదనుకుంటా. అదేమిటన్నది యింకా స్పష్టం కాలేదు. బహుశా ఈ పుస్తకాన్ని ముగించగలిగితే స్పష్టమవుతుంది. అసలు దీన్ని ముగించడమంటూ జరిగితే, ఆ ప్రయాసకు తోడ్పడగలిగేది, అరవై-డెబ్భై దశకాల పట్ల నాకున్న గమ్మత్తు నోస్టాల్జియా మాత్రమే.

పాత్రలతో మరో ఇబ్బంది. నేను ఇప్పటివరకూ చదివిన మూడు అధ్యాయాల్లోనూ పాత్రలు పుట్టలోంచి చీమల్లా ఒకదాంతర్వాతొకటి పుట్టుకొస్తూనే వున్నాయి. గుర్తు పెట్టుకొనేందుకు ఓపికను మించిన ఏకాగ్రత కేటాయించాల్సి వస్తుంది. పైగా పాత్రల వర్ణన వరకూ బానే వుంది; కానీ పాత్రల పుట్టుపూర్వోత్తరాలు వాళ్ళ కులాలు, తండ్రుల పేర్లు, తండ్రుల ఉద్యోగ ఉపాధులు ఆర్థిక స్థితిగతులతో సహా చెప్పడం అవసరమా అనిపించింది. రచయిత కేవలం పాఠకునిలో వాస్తవికతా భ్రమను సాధించడానికి ఇలా ఇబ్బడిబుబ్బడిగా వివరాలు ధారపోస్తున్నాడా; లేక ప్రస్తుతానికి వూళ్ళూ, పేర్లూ, ఉద్యోగాలుగా మాత్రమే వున్న ఈ కార్డ్‌బోర్డు తండ్రి పాత్రలన్నీ దరిమిలా ఎక్కడైనా సందర్భానుసారం చైతన్యాన్ని సంతరించుకుంటాయా అన్నది అర్థం కావడం లేదు. కేవలం వాస్తవికతను ప్రతిఫలింపజేయడానికే ఇన్ని నిర్జీవ వివరాల్ని కుప్పపోయవలసి వస్తే అది రచయిత అశక్తతకు తార్కాణం అంటాడు విమర్శకుడు జేమ్స్‌వుడ్. దాదాపుగా దీనికే అతను "హిస్టీరికల్ రియలిజం" అని ఓ పేరు కూడా పెట్టాడు. అయితే, అతను ఉదహరించిన రచయితలందరూ పాత్రల్ని వాస్తవికంగా సృజించే సామర్థ్యం లేక, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు, తమ రచనల్లో ఇలాంటి డొల్ల వివరాల్ని ధారాళంగా వెదజల్లి దానికి మేజిక్ రియలిజం అంటూ వల్లకాడంటూ రకరకాల ముసుగులు తొడిగి తప్పించుకుంటారు. చండీదాస్ విషయంలో మాత్రం ఈ వివరాల ధారపోత కథకో వాస్తవిక వాతావరణాన్ని కల్పించడానికే అన్నట్టు వుంది. అయితే ఈ కార్డ్‌బోర్డు పాత్రల వెల్లువతో రచనలో గాఢత పలచబడిపోతుంది. "పసలపూడి కథలు"లోనూ ఇలాగే వాతావరణ కల్పన కోసం అవసరానికి మించి కుప్పపోసిన అడ్డగోలు వివరాలు చిర్రెత్తించాయి.

ఇవన్నీ వదిలేస్తే ఇప్పటివరకూ చదివినంతలో "అనుక్షణికం" హిమజ్వాలతో పోలిస్తే మెరుగ్గానే తోస్తోంది; కథనంలో పరిణతి కనిపిస్తోంది. వడ్డెర కాస్త సహాయపడితే పుస్తకం పూర్తి చేసేయగలననిపిస్తోంది. హెల్ప్ మీ చండీదాస్! నేన్నిజంగానే పూర్తి చేయాలనుకుంటున్నాను!

7 comments:

 1. నేనూ ఆర్నెల్లనుంచీ కసరత్తు చేస్తున్నాను.

  ReplyDelete
 2. భూదేవంత సహనం అంటారే, అది నాలోనూ పుష్కలంగా ఉందని ఇది పూర్తి చేసిన రోజు మొదటిసారి గుర్తింపు పొంది, నాకు నేనే సర్టిఫికేటిచ్చుకున్నాను. :) సాంతం చదింవాక మీరు కూడా మీకోటిచ్చుకుని నాకోటిస్తారు.

  ReplyDelete
 3. నేనింకా 'చీకట్లోంచి చీకట్లోకి' షాక్ నుంచి తేరుకోలేదు.. అప్పుడప్పుడు చదువుదామా అని మనసు పీకుతూ ఉంటుంది.. అంతలోనే గత అనుభవం గుర్తొస్తుంది. అన్నట్టు 'స్నానించి' లాంటి ప్రయోగాల మీద రంగనాయకమ్మ విరుచుకు పడ్డారు అప్పట్లో.. ఓ పుస్తకం కూడా రాసినట్టు జ్ఞాపకం... మీరు పుస్తకం పూర్తీ చేశాక మరో టపా రాయండి.. నాలాంటి వాళ్ళ కోసం...

  ReplyDelete
 4. thanks inta mandi ikkada intala hechharistunnaduku konni samvastraluga "himajwala" chadavalani anukuntunnanu, chadavaka pustakam size kuda oka karanam aa karananni alage continue cheyadam correct lagundi

  ReplyDelete
 5. నేను " హిమజ్వాల " నవలను ఓ 15 ఏళ్ళక్రితం ఒక సారి కాదు రెండు సార్లు చదివాను...! నాకు చాలా చాలా బాగా నచ్చిన పుస్తకం అది..! యండమూరి పదే పదే ఆ నవలలోని కొన్ని వాక్యానాలును తను రాసే నవల్లో ఉదహరిస్తూ ఉండేవాడు, బహుశ నచ్చకపోవడమన్నది అది మీ సమస్య, కాని నవలది కాదనుకుంటా..!

  ReplyDelete
 6. మంచిదే కదా కమల్ గారూ! "హిమజ్వాల" నచ్చితే ఆ సమస్య మీదీ యండమూరిదీ. అంతేకానీ, నాదీ కాదు మీరన్నట్టు నవలదీ కాదు. :)

  ReplyDelete
 7. Anonymous1:13 PM

  అట్టహాసంగా ఉండేలా ఉన్న ఈ వ్యాఖ్యలను చదుతుంటే నేనూ ఓ వడ్డెరగా మరింత ఆసక్తి పెరుగుతోంది..
  త్వరలోనే హిమజ్వాలను అనుక్షణాలను చదివి చీకట్లోంచి మళ్లీ చీకట్లోకి వెళ్లి బయటకు వస్తా..కామెంట్ అప్పుడే రాస్తా...దుర్గాప్రసాద్ బండారు వడ్డెర హైద్రాబాద్

  ReplyDelete