June 18, 2009

:-)

ఈ బ్లాగు మొదలుపెట్టినపుడు నాకు నేనే పకడ్బందీగా కొన్ని నియమాలు విధించుకున్నాను. అవేంటంటే: ఇందులో చస్తే నా గురించి రాయకూడదు. రోజువారీ జ్ఞానోదయాల గురించీ, రొడ్డకొట్టుడు జీవిత సత్యాల గురించీ అస్సలు రాయకూడదు.

మొదటి నియమం చవట నిర్ణయం అని ఈసరికే అర్థమైంది. రాస్తుంది నేను కాబట్టి ఈ రాతల్లో నేను వుండటం అనివార్యం. అసలు నా రాతల్లోనే గాక, వేరే వాళ్ళ రాతల్లోంచి ఎత్తుకొచ్చి ఇక్కడ వుంచిన కొటేషన్లలో కూడా నేను వుంటాను. అది తప్పదు. అయితే ఇదివరకట్లా, నా నిస్సారమైన జీవితాన్ని వైభవోపేతమని నన్ను నేను భ్రమింపజేసుకునేందుకు బ్లాగుని ఓ సాధనంగా వినియోగించదలచుకోలేదు. ఎవర్ని మాయ చేద్దామని ఆ అవస్థంతా! నా జీవితం ఎవరి జీవితంతోనూ పోటీ పడలేదు. నా రోజులో సింహభాగం—కనీసం విలువైనదిగా నేను గుర్తించే భాగం—పుస్తకాల సమక్షంలోనూ, లేదా పుస్తకాల్ని గురించిన ఆలోచనలతోనూ గడుస్తుంది. ఈ రెండూ లేని రోజు, అది మరొకవిధంగా ఎంత రంజుగా గడిచినా, నాకు సంపూర్ణమనిపించదు. మరైతే, జీవితం మరోవిధంగా వున్నప్పుడేమో తిరస్కరిస్తూ, ఇలావుంటే నిస్సారం అని ఆరోపించడం అన్యాయం కాదూ. Well, then, my life is happening too; in its own lonesome way.

రెండో నియమం: రోజువారీ జ్ఞానోదయాల గురించీ, రొడ్డకొట్టుడు జీవిత సత్యాల గురించీ రాయకూడదు. మొదట ఈ జ్ఞానోదయాల గురించి కొంత చెప్తాను. జీవితంలో జ్ఞానోదయాలు (జాయిస్ భాషలో చెప్పాలంటే ఎపిఫనీస్) వుండవు. ఇంకా సరిగా చెప్పాలంటే: వుంటాయి గానీ వాటికి పర్యవసానాలు వుండవు. అంటే సినిమాల్లోనో పుస్తకాల్లోనో చూపించినట్టు ఈ జ్ఞానోదయాలకు జీవిత గమనాన్ని మార్చేసేంతటి శక్తి వుండదు. నా మట్టుకు నాకు ఇలాంటి జ్ఞానోదయాలు ఇబ్బడిముబ్బడిగా కలుగుతూంటాయి. అంటే, హఠాత్తుగా ప్రపంచాన్ని గురించి, లేదా జీవితాన్ని గురించి, లేదా నన్ను గురించిన పరమ సత్యాలు నా ముందు విశ్వరూప సాక్షాత్కారం చేస్తుంటాయి. హఠాత్తుగా ఈ ప్రపంచంతో సామరస్యంగా బతకడమెలాగో తెలిసిపోతుంది; ఏదో ఆకస్మిక క్షణంలో జీవితపు మూల స్వరూపం మొత్తం మనోనేత్రం ముందు రూపుకట్టేస్తుంది; ఉన్నట్టుండి నేనెంత స్వార్థపరుణ్ణో అర్థమైపోతుంది. కానీ ఏం లాభం. ఏవీ నిలబడవు. నిలుపుకోలేను. కొంతకాలానికి మళ్ళీ యథావిధిగా వెనకటి మడ్డి మనిషిగానే మిగుల్తాను. ఇది నాకే కాదు చాలామందికి జరుగుతుంది. ఈ జ్ఞానోదయాలు కలిగించిన అవగాహనని మనం ఎక్కువసేపు నిలుపుకోలేము. ఇలాంటి క్షణికమైన జ్ఞానోదయాల వల్ల కలిగే ఆవేశంతో ఇక్కడ ఏదో రాసి మాత్రం ఏం ప్రయోజనం. (ఇలాంటి తాత్కాలిక జ్ఞానోదయాలతో కొందరు రచయితలు పుస్తకాలే రాసేస్తారు, ఆ పుస్తకాల్లోని సారాంశమంతా ఆ రచయితల్లోనూ వుంటుందని భ్రమపడి పాఠకులు మోసపోతారు కూడా; ఇది వేరే విషయం.)

ఇక జీవిత సత్యాలు ఇక్కడ ప్రవచించకూడదన్న నిశ్చయానికి కారణం: సార్వజనీనమైన జీవిత సత్యాలంటూ ఏవీ లేకపోవడం, ఎవరి జీవిత సత్యాలు వాళ్ళకే వుండడం, ఇవి చర్చలతోనూ వాదనలతోనూ తెగేవి కాకపోవడం. నా విలువలు నాకున్నప్పుడు, అవి నిజమని నమ్మకంగా తెలిసినపుడు, వాటినిక్కడ బ్లాగులో చర్చకి పెట్టడమో, ఇంకెవరికో వాటిని నిరూపించబూనడమో వ్యర్థం కదా. మనం నమ్మేది మనం నమ్ముతాం. మన నమ్మకాలు ప్రపంచాన్ని మార్చేయనక్కర్లేదు కదా. అలా ప్రపంచాన్ని మంచికో చెడుకో మార్చేయాలని చూసే మనుషుల నమ్మకాలు ఎంతటి వినాశ కారకాలో హిట్లర్, స్టాలిన్‌లాంటి వాళ్ళ కారణంగా రక్తసిక్తమైన ప్రపంచ చరిత్రే చెపుతూంది. "ఓ ప్రక్క ’మంచికో చెడుకో’ అంటూ మళ్ళా చెడు ఉదాహరణలే చెప్పి వదిలేస్తావేం; మరి గాంధీ, వివేకానందుల మాటేంటీ" అని ఎవరైనా అడగొచ్చు. గాంధీకి తన నమ్మకం పట్ల ఎంత చిత్తశుద్ధి వుందో హిట్లర్‌కీ తన నమ్మకం పట్ల అంతే చిత్తశుద్ధి వుంది. ఇదంతా విశ్వంలోని సమస్త వ్యవహారాల్లాగే బొమ్మాబొరుసూ వ్యవహారం. అంతా వ్యక్తుల్ని బట్టి మారుతుంది. వ్యక్తిగా నేనేంటో నాకు తెలుసు కాబట్టి నా నమ్మకాలు ప్రపంచాన్నో, లేక ఈ బుల్లి బ్లాగ్ప్రపంచాన్నో, ఏదో మంచి పర్యవసానానికి నడిపించేంత సత్తా వున్నవి కావని మాత్రం చెప్పగలను. ప్రపంచంలో చాలా వైపరీత్యాలకి ఒకరి నమ్మకాలు మరొకరి మీద రుద్దబోవడమే మూలకారణమని చెప్పగలను. నమ్మకాలు రుద్దబోవడం అటుంచి, కనీసం వ్యక్తం చేసుకోవడం కూడా శుద్ధ దండగని చెప్పగలను. నమ్మకాలన్నవి చప్పుడు చేయకుండా ఎవరికి వారే ఆచరించుకోవడానికి మాత్రమే అని చెప్పగలను. ఇందాక చెప్పినట్టే ఈ జ్ఞానోదయాన్ని కూడా నేను మరికాసేపట్లో మరిచిపోబోతానని ఈ కీబోర్డు గుద్ది మరీ చెప్పగలను.

సరిగ్గా ఈ పేరా దగ్గరకొచ్చేసరికి ఇది చదవబోయే వాళ్ళకి వచ్చే అనుమానమే నాకూ వచ్చేసింది. ఇదంతా ఎందుకు రాస్తున్నట్టు? బహుశా ఎందుకంటే: ఈ బ్లాగులో ఎలాంటి చచ్చుపనులైతే నేను చేయబోనని పై పేరాల్లో చెప్పానో అలాంటి చచ్చుపనే ఇక్కడ చేయబోతున్నాను. కాసేపు (నా) జీవితం గురించి నాతో నేను చర్చించుకోబోతున్నాను. నాలో నేను మథనపడబోతున్నాను. ఖర్మకాలి ఈ అంతర్మథనంలోంచి కొన్ని జీవిత సత్యాలు పైకి తేలినా తేలొచ్చు. ఆ పని చేయబోయే ముందు, "నేను మామూలుగా ఎప్పుడూ యిలాంటి ఘోరాలకి ఒడిగట్టనూ, ఈ ఒక్కసారికే ఏదో ఇలా..." అని నా (ఇసకేస్తే రాలనివ్వని) పాఠకజనసందోహానికి విన్నవించుకునేందుకు పై ఉపోద్ఘాతం అన్నమాట.

ఇక్కడ "పాఠకజనసందోహం" అన్న పదబంధాన్ని కాస్త నిర్వచించుకోవాల్సిన అవసరం వుంది. పాఠకులు అనగానే తరచూ నాకో ఊహాచిత్రం స్ఫురిస్తుంటూంది. బహుశా నాకే కాదు; ప్రతీ బ్లాగరుకూ, ఆ మాటకొస్తే ప్రతీ రచయితకూ (అనుషంగికం: నేను రచయితని కాదన్న వాళ్ళని రాయిచ్చుకు కొడతా!) ఇలాంటిదే ఏదో ఒక సొంత ఊహాచిత్రం వుంటుందని నా నమ్మిక. నా ఊహాచిత్రం ఇది: శిథిలావస్థలో వున్న ఓ పేద్ద రోమన్ కొలోసియం సంజె చీకట్లలో మునిగి వుంటుంది. దాని మైదానానికి సరిగ్గా మధ్యలో ఒక మొండెమెత్తు ఉపన్యాసపు బల్ల వుంటుంది. నేను దానిపై కులాసాగా మోచేతులాన్చి మాట్లాడుతుంటాను. నన్ను ఆవరించి వున్న కొలోసియం మెట్లపై నా పాఠకులు సుఖాసీనులై నేను మాట్లాడేది వింటూంటారు. సంజె చీకట్లలో వాళ్ళ మొహాలు నాకు కనపడవు; నా మొహం వాళ్ళకి కనపడదు. వాళ్ళు నాకంటే ఎత్తులో వుంటారు. కానీ వాళ్ళందరికీ నేనే కేంద్రబిందువు. నేను మాట్లాడేది ఏదైనా సరే, వాళ్ళు నిశ్శబ్దంగా సహానుభూతితో వింటుంటారు. నా ప్రతీ వాక్యాన్నీ పదిలంగా స్వీకరిస్తారు. చప్పట్లూ వుండవు. పిల్లికూతలూ వుండవు. కేరింతలూ వుండవు. వెక్కిరింతలూ వుండవు. నిశ్శబ్దం మాత్రమే. చెప్పేది శ్రద్ధగా వినకుండా "హయ్య వీడి గోరోజనమా!", "ఏం చూసుకుని వెధవకి!", "అంతా సొల్లు", "ఎంతసేపూ వీడి సోది వీడిదే గానీ", "ఎ కేస్ ఆఫ్ డెల్యూషన్స్ ఆఫ్ గ్రాండియర్ ఐ గెస్"... ఇలా ఒకరి చెవుల్లో ఒకరు గొణుక్కునేవాళ్ళూ, నా మాటల్ని మనస్ఫూర్తిగా గాక అపనమ్మకంగా వినేవాళ్ళూ వెంటనే ఇక్కడినుంచి బహిష్కరింపబడతారు. బహుశా ఈ వాక్యం చదివీ చదవగానే అర్థమైపోవాలి: ఎవరిక్కడ వుండాలో ఎవరు వెళ్ళిపోవాలో. వెళ్ళిపోవాలని తెలిసీ ఇంకా ఇక్కడ వున్నారంటే వాళ్ళంతా పిలవని పేరంటానికి ఎగేసుకుంటూ వచ్చిన అతిథులన్నమాట. మేమెవ్వరం వాళ్ళని పట్టించుకోనే పట్టించుకోమన్నమాట. సరే ఇంక ఈ ఉప-ఉపోద్ఘాతం వదిలి అసలు విషయానికొచ్చేస్తాను.

[ఏదీ "అసలు విషయం" అంటారా? ఇక్కడ లేదు. ఇంతే సంగతి. నిన్నరాత్రి ఏదో ఉద్వేగంతో, నిజంగానే ఏదో రాయాలని ఇది మొదలు పెట్టాను. అర్థరాత్రిదాకా రాసి ఆవలింతలు కమ్మేస్తుంటే పడుకున్నాను. పొద్దున్న తెలివి తెచ్చుకుని రాసింది చదువుకుంటే, ఏం రాయబోయానో గుర్తుతెచ్చుకుంటే, జడుపొచ్చింది. అది రాయడం నిజంగా ఆత్మహత్యా సదృశం మరి. రాయాల్సిన విషయం కాదు, రాసుకోవాల్సిన విషయం. అందుకే ఇక్కడతో ఆపేస్తున్నాను. మరి ఈ తలాతోకాలేని గోలంతా ఇక్కడెందుకు ప్రచురించడం అంటే: ఇంతరాసాకా డిలీట్ చేయబుద్దేయలేదు. పైగా తలాతోకా లేకపోయినా ఈ ఉపోద్ఘాతం స్వతంత్రంగా నా బ్లాగు గురించేదో చెప్తుందనిపించింది. అందుకే పబ్లిష్ బటన్ నొక్కేయాల్సిందేనని తీర్మానించేశాను.

అసలిది రాయడం మొదలు పెట్టడానికి ఈ బ్లాగులో చదివిన పోస్టు కొంత ప్రేరణ. జపాన్ వాళ్ళు వ్యాసాన్ని Zuihitsu అంటారట. ఇందులో "hitsu" అంటే కుంచె అనీ, "zui" అంటే అనుసరించడం అనీ అర్థం; అంటే జపాన్ వాళ్ళు వ్యాసానికి "కుంచెను అనుసరించడం" అనే అర్థమిచ్చుకున్నారన్నమాట. బహుశా ఒక చిత్రకారుడు ఏ లాఘవంతో, ఎంత అలవోకగా, చిత్తరువు అంతిమరూపం పట్ల నిస్సంకోచమైన ధీమాతో తన కుంచెని కాన్వాసుపై పోనిస్తాడో, అదే తరహాలో ఆలోచనని పోతున్న దారిలో పోనిస్తూ అక్షరాలతో దాన్ని అనుసరించడమే వ్యాస లక్షణమన్నది ఈ పేరు వెనుక అంతరార్థం అయివుంటుంది. కానీ నేను నిజంగా ఈ వ్యాసం పూర్తిచేయడమంటూ జరిగితే, ఇందాక బ్లాగులో రచయిత చెప్పినట్టు ఓ self-indulgent chaos or a sermon బయటపడేదేమో. మిమ్మల్ని మరెప్పుడైనా దానికి బలిచేస్తా.]

0 స్పందనలు:

మీ మాట...