July 15, 2009

శాలింజర్‌‍కో సమర్థన

జె.డి. శాలింజర్‌ అంటే చాలామంది పాఠకులకు "కేచర్ ఇన్ ద రై" రచయితగానే మిగిలిపోయాడు. ఆయన తొలి రచనలైన "కేచర్ ఇన్ ద రై", "నైన్ స్టోరీస్"ని బాగా ఇష్టపడే పాఠకులు, ఎందుకో తర్వాతి రచనలైన "ఫ్రానీ అండ్ జోయీ", "రైస్ హై ద రూఫ్ బీమ్ కార్పెంటర్స్, సేమోర్: ఎన్ ఇంట్రడక్షన్" పుస్తకాల దగ్గరకొచ్చేసరికి బిగుసుకుపోతారు. పాఠకులనే కాదు విమర్శకులు, తోటి రచయితలు కూడా వాటిని తీసి పడేయడం చూసాను. శాలింజర్‌ తొలి రచనల్ని— ముఖ్యంగా "నైన్ స్టోరీస్"ని— బాగా ఇష్టపడి, కథారచనలో అవి తనకు మార్గం చూపించినవిగా పేర్కొన్న జాన్ అప్‌డైక్ కూడా 1961లో "ఫ్రానీ అండ్ జోయీ" విడుదలవగానే సమీక్షలో ఇలా తన నిరుత్సాహాన్ని వ్యక్తం చేసాడు.

కానీ నాకు "కేచర్ ఇన్ ద రై" కన్నా (ఇంకా మాట్లాడితే "నైన్ స్టోరీస్" కన్నా కూడా) తర్వాతి రచనలే ఎక్కువిష్టం. ముఖ్యంగా "ఫ్రానీ అండ్ జోయీ", "రైస్ హై ద రూఫ్ బీమ్..." ఈ రెండూ పుస్తకాలూ చాలా నచ్చుతాయి. కొన్ని పుస్తకాలు ఒకసారి చదివింతర్వాత ఇక మన అల్మరాలో శాశ్వతమైన చావు చచ్చిపోతాయి. మళ్ళీ వాటి జోలికెళ్ళం. గోడలకు నిర్జీవంగా వేలాడే గతానికి చెందిన పతకాల్లా అవలా పడుంటాయంతే. కానీ కొన్ని పుస్తకాలు ఒకసారి చదవడంతో పూర్తి కావు. వాటిలోని చైతన్యం చచ్చిపోదు. మళ్ళీ మళ్ళీ చదబోతున్నామన్న యెరుకతో అందాకా అలా పక్కన పెడతామంతే. పైన పేర్కొన్న రెండు పుస్తకాలూ నా వరకూ అలాంటివే. వాటిలో కథకన్నా రచయిత సొంత గోడు ఎక్కువనీ, వాటిలోని పాత్రలు మానవాతీతంగా ఉంటాయనీ, అవి మామూలు పాఠకులకు ఉద్దేశించినవిగా ఉండవనీ చాలామంది ఫిర్యాదు. నాకైతే శాలింజర్‌ ఈ పుస్తకాల్లో అలా తన సొంత గోడు వెళ్ళబోసుకోగలిగేంత నమ్మకాన్ని పాఠకులకు ఆపాదించడం నచ్చింది. ఎవరైనా మన దగ్గర నమ్మకంతో తమ లోపలి సంగతులు చెప్పుకుంటున్నప్పుడు శ్రోతలుగా మనం వాళ్లకు ఇవ్వగలిగిన కనీస స్థాయి ప్రతిస్పందన అదే నమ్మకం. శాలింజర్‌ తర్వాతి రచనలు పాఠకుల నుంచి ఓ స్థాయి ఇంటిమసీని ఆశిస్తాయి. కాస్త నమ్మకాన్ని అడుగుతాయి. మనం సానుకూలంగా స్పందిస్తేనే ఆ పుస్తకాలు నచ్చుతాయి. నీ గోడు నాకేల అనుకుంటే, అపనమ్మకంతో ప్రారంభిస్తే- అంతా సెల్ఫ్ ఇండల్జెన్సే అనిపిస్తుంది. ఎందుకోమరి నా వరకూ నేను శాలింజర్‌కి మొదట్నించీ పూర్తి నమ్మకాన్ని ఇచ్చేసాను. అతను ఏం చెప్పినా చెవులొగ్గి వినేసే సంసిద్ధతతోనే ప్రతీ పుస్తకాన్నీ ప్రారంభించాను. అదీగాక అతని అందమైన వచనం, కొంత దాస్తూ కొంత చూపిస్తూ మార్మిక సౌందర్యంతో సాగే కథనం . . . అందుకే—"కేచర్ ఇన్ ద రై" నుంచి "రైస్ హై ద రూఫ్ బీమ్ . . ." దాకా— అతను నన్ను పాఠకునిగా ఎక్కడా కోల్పోలేదు.

ఈ నమ్మకాన్ని మనం అందరు రచయితలకీ ఇవ్వం. కొందరికే ఇస్తాం. ఎందుకలా? కొందరు రచయితలు తమ పుస్తకాల మొదటి కొన్ని పేజీల్తోనే మన నమ్మకాన్ని ఎలా సంపాదించేసుకోగలరు? మరికొందరు (నా విషయంలో వడ్డెర చండీదాస్‌లా) అవే కొన్ని పేజీల్లో మనల్ని పూర్తి విముఖుల్ని ఎలా చేసేయగలరు? నాకు తెలిసి దీని సమాధానం: నిజాయితీ. నిజాయితీ అంటే రచయితకు ఒక రచన చేయడంలో తన ఉద్దేశ్యం పట్ల వుండవలసిన నిజాయితీ. నిజానికి రచనల అంచనాకు ఇది చాలా ప్రాథమిక స్థాయి కొలమానం మాత్రమే. కానీ ఇది పునాదిగా లేని రచనలేవీ పాఠకుల నమ్మకాన్ని సంపాదించుకోలేవు. అలాగే ఈ నిజాయితీ అనేది సార్వజనీనమైన కొలమానం కూడా కాదు; ప్రపంచంలో అన్ని కొలతల్లాగే ఒక వైయక్తిక కొలమానం. పాఠకుడు పాఠకుడికీ, రచయిత రచయితకీ మారే కొలమానం. ఒక రచయితకు రచనల ద్వారా సమాజంలోని అసమానతల్ని ప్రశ్నించడం ప్రధానోద్దేశ్యం కావొచ్చు. ఇంకో రచయితకు రచనల ద్వారా ఫలానా అణగారిన వర్గం తరపున జెండా పట్టడం ఉద్దేశ్యం కావొచ్చు. మరో రచయితకు తన చైతన్యంలో ప్రతిఫలించిన పరిసర ప్రపంచపు ప్రత్యేక తత్త్వాన్ని రచనల్లో అద్దం పట్టాలన్నది ఉద్దేశ్యం కావొచ్చు. వేరే రచయితకు కేవలం రాయడంలో—రచనను నిర్మించడంలో—ఉండే ఆనందాన్ని పొందటం ముఖ్యోద్దేశ్యం కావొచ్చు. ఈ వేర్వేరు ఉద్దేశ్యాల పట్ల అనురక్తీ, సానుభూతీ వున్న వేర్వేరు రకాల పాఠకులు వాటిని ఆదరిస్తారు. కాబట్టి ఇలా ఉద్దేశ్యమేదైనా దానిపట్ల పూర్తి నిజాయితీ ఉండటమన్నది రచన నిలబడటానికి ప్రాథమిక పునాది. ఆ నిజాయితీ లేనప్పుడు చదివేవాడు అనుభవజ్ఞుడైన పాఠకుడైనా మామూలు పాఠకుడైనా, ఎక్కడో తేడా కొడ్తుందని పట్టేసుకుంటాడు. ఆ తేడా ఫలానా అని తెలుసుకునేంత పరిణతి ఆ పాఠకునికి లేకపోయినా అతను ఆ రచనకి దూరమైపోవడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది.

అయితే ఇదంతా ఇక్కడ అప్రస్తుతం. శాలింజర్‌ని తర్వాతి రచనల్ని సమర్థిస్తూ జానెట్ మాల్కమ్ అనే రచయిత్రి రాసిన వ్యాసం చదివాను. చాలా నచ్చింది. జె.డి. శాలింజర్‌ తర్వాతి రచనలన్నీ "గ్లాస్" అనే కుటుంబాన్ని కేంద్రీకరించి సాగుతాయి. వాటన్నింటిలోనూ ఈ కుటుంబంలోని ఏడుగురు పిల్లలూ ప్రత్యక్షంగానో పరోక్షంగా కనిపిస్తూంటారు. చాలామంది పాఠకులూ, విమర్శకులూ శాలింజర్‌ తర్వాతి రచనలపై చూపే వ్యతిరేకతకు అసలు కారణం ఈ కుటుంబమే. వీరి ఫిర్యాదును జాన్ అప్‌డైక్ మాటల్లో చెప్పాలంటే:

"Salinger loves the Glasses more than God loves them. He loves them too exclusively. Their invention has become a hermitage for him. He loves them to the detriment of artistic moderation."

ఒక రచయిత తన పాత్రలపై దైవాన్ని మించిన ప్రేమను చూపించడం ఒప్పుకోలేకపోతే, శాలింజర్‌ తర్వాతి రచనల్ని పట్టించుకోకపోవడమే మంచిది. తప్పదు, ఆయనకి ఈ కుటుంబం అంటే ఇష్టం, అది అంతటా కనిపిస్తుంది. ఎక్కడా దాచుకోలేదు:

"I love working on these Glass stories, I've been waiting for them most of my life, and I think I have fairly decent, monomaniacal plans to finish them with due care and all-available skill."

అవును శాలింజర్‌ ఆ పాత్రల్ని అమితంగా ప్రేమిస్తాడు. అయితేనేం? అతనే అన్నట్టు, తనకు శక్యమైన నైపుణ్యాన్నంతా వాళ్ళ సృజనకోసం వినియోగిస్తాడు కూడా; ఇక ఆనందించడానికి అడ్డేముంది. జానెట్ ఈ వ్యాసంలో ముఖ్యంగా "ఫ్రానీ అండ్ జోయీ"ని ఉదాహరణగా తీసుకుని శాలింజర్‌ని సమర్థించడానికి ప్రయత్నం చేసింది. వ్యాసం చక్కని పరిశీలనల్తో నడిచింది. శాలింజర్‌ పాత్రలకీ కాఫ్కా పాత్రలకీ పోలిక తేవడం పట్ల నా అనుమానాలు నాకున్నా, మొత్తంగా చూస్తే వ్యాసం నచ్చింది.
.

3 comments:

 1. బాగుంది. రయిజ్ థె రూఫ్ బీం చదివాను కానీ చాలా ఏళ్ళైపోయింది గుర్తు లేదు.
  మొన్నొక రెడీయో ప్రోగ్రాంఉలో విన్నాను, శాలింగర్ తన వీలునామాలో అప్పటిదాకా ప్రచురించని తన రచనలేవీ మరిక ప్రచురించకూడదు అని రాశాట్ట. దీన్ని పాటించారో లేదో తెలీదు. మొత్తానికి ఆయన పాత్రలే కాక ఆయన కూడా కొంచెం వింత మనిషే.

  అయితే శాలింగర్ కి ఉన్న నిజయితీ (తన రచన పట్ల) చండీదాస్ కి లేదంటారు?

  ReplyDelete
 2. "అయితే శాలింగర్ కి ఉన్న నిజయితీ (తన రచన పట్ల) చండీదాస్ కి లేదంటారు?"

  నిజాయితీ లేదని అనేయాలని నోటిదాకా వచ్చేసింది గానీ; అది తప్పేమో. ఈ నిజాయితీ అన్నది చాలా ప్రాథమిక కొలమానం అని పైననే చెప్పాను. రచనల విలువ అంచనా కట్టడానికి అదెంత మాత్రమూ పనికిరాదు. సర్వకాలసర్వావస్థల్లోనూ సారస్వతం పేరిట ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోయే చెత్త నుండి ఒక రాతని వేరు చేసి, దానికి సారస్వతావరణంలో ప్రవేశం కల్పించేందుకు కనీస అర్హతగా మాత్రమే ఈ కొలత పనికొస్తుంది. ఒక్కసారి లోపలకి చేరాకా దాని విలువను, వైయక్తికంగానైనా సరే, లెక్కగట్టడానికి వేరే కొలతలు కావాలి. వడ్డెర రచనలు— ఉదాహరణకి "అనుక్షణికం" నవల ఈ "నిజాయితీ" అనే కొలతను అలవోకగా దాటేస్తుంది. అందులో నిజాయితీ లేదని నేననను. బహుశా పైన బ్రాకెట్లలో వడ్డెర ప్రస్తావన అసందర్భమేమో. అయితే "అనుక్షణికం" పక్కన పెట్టేయడానికి ముఖ్యకారణాలు గత పోస్టులో చెప్పినట్టు:

  1) కొన్ని పాత్రలకి మానవాతీతమైన మార్దవాన్నిస్తూ, మరికొన్ని పాత్రల్ని గుడ్డిగా అమానుషత్వం వైపు నెట్టేయడం... సృష్టి సహజమైన middle grounds లేని extremism.

  2) అస్తవ్యస్తమైన నిర్మాణం. చాలా చోట్ల అసలీయన్ని రచయిత అనుకోవడం అనవసరమేమో అన్నంతగా లొసుగులు కనపడ్డాయి నాకు.

  అలాగే చాలా చోట్ల (తెలుగులో ఎలా చెప్పాలో తెలీటం లేదు కనుక, "వెకిలితనం" అంటే మరీ కటువుగా వుంటుంది కనుక) రచయిత bad taste కొట్టొచ్చినట్టు తెలిసిపోతుంది. ఉదాహరణకి రచయిత ప్రాపకం పూర్తిగా వున్న రవి పాత్రే తీసుకుందాం. ఇతను మావయ్య ఇంటినుండి ఆత్మాభిమానంతో గొడవ పడి వచ్చేసి, చదువు మానేసి, బయట ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటాడు. ఒక ఇంటర్వూలో ఓ కంపెనీ మేనేజర్ ఇతని పరిస్థితికి జాలిపడి, ఇతని నిజాయితీని నమ్మి, అక్కడ ఉద్యోగంలో చేరాలంటే తప్పనిసరిగా కట్టాల్సిన డిపాజిట్‌ నుండి ఇతనికి మినహాయింపునిస్తాడు. దీనికి ప్రతిగా, మేనేజర్ గదిలోంచి బయటకు వచ్చాకా, రవి అక్కడున్న గుమాస్తాని "మీ మేనేజరుకి వయసులో వున్న ఆడపిల్లలెవరూ లేరు కదా" అని ప్రశ్నిస్తాడు. ఇది హాస్యానికుద్దేశించిందిగా అనిపించలేదు నాకు. రవి పాత్రకి రచయిత దన్ను పూర్తిగా వుందని మొదట్నించీ తెలుస్తూనే వుంది. ఇప్పుడు అతనికి ఈ వెకిలితనాన్ని ఇవ్వడం నాకు రచయిత bad tasteని మాత్రమే సూచించింది.

  ఇంకోటేంటంటే, సలింగర్‌లో కూడా కొన్ని పాత్రలకి మానవాతీతమైన మార్దవాన్నిచ్చే గుణం వుంది. కానీ అది ఆ పాత్రల పట్ల రచయితకున్న hopeless loveగా మాత్రమే తోస్తుంది. తన పాత్రల్ని అవసరమైందానికంటే ఎక్కువే ప్రేమిస్తున్నాననీ, తను ఈ పాత్రలకి ఇస్తున్న సుపీరియార్టీ బయటివాళ్ళకి చిరాకు కల్గిస్తుందని సలింగర్‌కీ తెలుసు. అందుకే రచయితకు ప్రతినిధిగా చెప్పుకోదగ్గ "బడ్డీ గ్లాస్" అనే ఒక పాత్ర చేత ఇలా అనిపిస్తాడు:

  "the Glasses were a bunch of insufferably 'superior' little bastards that should have been drowned or gassed at birth."

  అలాగే వడ్డెరకి భిన్నంగా సలింగర్ కథ చెప్పడంలో సిద్ధహస్తుడు. అతని వచనం అబ్బురపరిచే స్పష్టతతో వుంటుంది. కథనం, పైనే చెప్పినట్టు, మార్మికమైన సొగసుతో వుంటుంది. సంభాషణలు చాలా ముచ్చటగా వుంటాయి.

  ReplyDelete