August 25, 2009

జయ మొదటి కథ

" హమ్మయ్య! తెల్లారింది"

— జయరాం

ఈ మధ్య మోకాలి నొప్పులు బాగా ఎక్కువయ్యాయి. ఒక ఫర్లాంగు దూరం నడిచేటప్పటికే సత్తువ అయిపోతోంది. దగ్గర్లోని చెత్త కుండీ పైన గంగడోలును ఆన్చి తనివి తీరా కండూతి ఉమశమింపచేసుకున్న తర్వాత, ఓపిక చేసుకుని గుడి పక్కకొచ్చి నిలబడ్డాను. గుళ్ళోంచి ఏవో భక్తి పాటలు అనుకుంటా, వస్తున్నాయి. పూజారి గారబ్బాయి రేడియోలో వార్తలు వింటున్నాడు. ఇంకా రోడ్లు అన్నీ నిర్మానుష్యం గానే ఉన్నాయి. మార్కెట్టు వీధి అంతా నిన్నటి కూరగాయల కుళ్ళిన తుక్కుతో నిండి ఉంది. మనసు లాగింది గానీ, వెళ్ళబుద్ధేయయలేదు అటు. పూజారి గారింట్లో ఏం ప్రసాదం చేసారో ఏంటో? జనం వచ్చి ఉంటే ఈ పాటికి ప్రసాదం దొరికేది. ఏదీ? ఈ జనాలింకా లేస్తే కదా!

ఎండ తీవ్రత పెరిగేసరికి గుడికి జనం రాక మొదలయ్యింది. జన సమ్మర్థం తగ్గిన కాసేపటికి అరటి ఆకుల్లో చిన్న ముద్దలా ప్రసాదాన్ని నా వైపుగా విసిరాడు పూజారి గారబ్బాయి. మిగిలిన ప్రసాదం అంతా ఎవడో సైకిలు మీద వచ్చి, గిన్నెలో పెట్టుకుని డబ్బులిచ్చి తీసుకెళ్ళాడు. పెద్ద పూజారి గారున్నప్పుడు ఇలాంటివి జరిగేవి కావు. ఆయన నన్ను సొంత బిడ్డలా చూసుకొనేవారు. ఇంటి దగ్గరకు వస్తే చద్దన్నం, గుడికొస్తే ప్రసాదం విడువకుండా పెట్టేవారు. దాంతో వీధులన్నీ తిరగాల్సిన పని ఉండేది కాదు. ఒక సారి రథం ఊరేగింపు రోజు నా కాలికి దెబ్బ తగిలితే ఇంటికి తీసుకు వచ్చి కట్టు కట్టిన పుణ్యాత్ముడాయన. కానీ పూజారి గారు చనిపోయిన తర్వాత గుడి కళే తప్పిపోయింది. నా సంగతి సరే సరి. ఇంటికి వస్తే తరిమి పంపించటం, గుళ్ళో మిగిలిన ప్రసాదం అమ్ముకోవటం. తప్పదు, ఇక దీనికి అలవాటు పడాలి.

సందుల్లోంచి వెళుతుంటే ఆకతాయి పిల్లల బెడద ఎక్కువైపోతోంది. మీదకు రాళ్ళు రువ్వటం, కర్రతో కొట్టటం వీళ్ళు చేసే పనులు. అప్పుడప్పుడు అనిపిస్తుంది, నేను శాంతంగా ఉండబట్టే కదా వీళ్ళు నన్ను అపహాస్యం చేస్తున్నారని. కానీ నేను చేయగలిగింది ఏం లేదు. వీరి మీదకు వెళితే రోజూ దొరికే ముద్ద కూడా దొరకదు.

*——*——*

మిట్ట మధ్యాహ్నం. సూర్యుడు చండ్ర నిప్పులు కురిపిస్తున్నాడు. బాగా దాహం వేసింది. టీ కొట్టు సుబ్బి గాడి దగ్గరకు పోబోయాను. వాడు చీపురు కట్ట పట్టుకుని కసిరాడు. ఆ కుండలో నీళ్ళు తాగనిస్తే వాడి సొమ్మేమన్నా పోతుందా? హుఁ! ఇంక చెరువు నీరే గతి. దానికేమో రోడ్డు దాటాలి. అదో పెద్ద ఇబ్బంది. బళ్ళు ఒక్కటీ ఆగవు. సర్లే చిన్న బళ్ళే కదా వస్తున్నవి అని దాటబోయాను. రయ్యిమని దూసుకొచ్చాడెక్కడి నుంచో ఓ కుర్ర వెధవ బండి మీద. పక్కకు తప్పుకునే సమయమే ఇవ్వలేదు. పక్కటెముక అదిరిపోయింది. అతి కష్టం మీద లేవగలిగాను. చుట్టు పక్కల జనం పోగయ్యారు, చోద్యం చూడటానికి. తప్పు చేసిన వాడిని వదిలేసి నా మీద పడ్డారు. అక్కడి నుండి తప్పించుకొనేసరిలి తల ప్రాణం తోకకొచ్చింది.

చెరువులో సగం మేర నీరు ఎండి పోయి నెర్రెలు కనిపిస్తున్నాయి. మిగతా సగం దాదాపు బురద గుంట లాగా తయారయ్యింది. కానీ తప్పదు కదా, అక్కడ తప్ప ఇప్పుడు ఇంకెక్కడా నీరు దొరకదు. తనివి తీరా తాగి, యాధాలాపంగా ఆ నీటిలో నా ముఖం చూసుకున్నా. ఆశ్చర్యమేసింది. అసలు నేనేనా అని అనుమానమొచ్చింది. మొహం మసి బొగ్గులా తయారయ్యింది. దవడ చుట్టూ చర్మం తప్ప మాంసమే లేదు. ముఖంలో అప్పటికీ ఇప్పటికీ మారనివి ఒక్కటే..."కొమ్ములు". సరైన తిండి దొరికితే కదా!

మనుషులు కూడా మారిపోయారు. పూర్వం జంతువుల పట్ల కాసింత దయ, కారుణ్యం ఉండేవి. అంతెందుకు, మా తాత చెబుతుండేవాడు, తనని ఒక పాలేరు ఎంతో ప్రేమగా చూసుకొనేవాడని, పండగలకి అందంగా ముస్తాబు చేయించేవాడని. ఇంకా తనతో పాటు కొట్టంలో ఉన్న ఆవులు వట్టి పోయినా వాటిని కడ దాకా కంటికి రెప్పలా చూసుకొన్నాడే తప్ప ఏనాడూ కబేళాకు అమ్మేయటం గానీ, వాటి మానాన వాటిని వదిలేయటం గానీ చేయలేదట. కానీ ఇప్పుడు, మనుషులకు టీవీలూ, రేడియోలే ఎక్కువైపోయాయి. జంతువుల సంగతి దేవుడెరుగు, సాటి మనుషుల గురించే ఆలోచించటం మానేసారు. ఏ రోడ్డు మీద చూసినా గొడవలు, కొట్లాటలు.

ఇందాకటి మీద నొప్పి ఇప్పుడు బాగా ఎక్కువయ్యింది. నీడన విశ్రాంతి తీసుకుంటే నయం. అగ్రహారం దాకా నడిచేసరికి నొప్పి మరింత పెరిగింది. రావి చెట్టు దగ్గరికి వచ్చేటప్పటికి అప్పుడే అక్కడ నాలాంటి నేస్తాలు రెండు వచ్చి చేరాయి. మాలా దిక్కు తెలీకుండా ఆ ఊళ్ళో తిరిగే ఆంబోతులన్నిటికీ మంచి నేస్తం ఆ రావి చెట్టు. అదొక్కటే ఊళ్ళో మిగిలిన పెద్ద చెట్టు కూడా. దెబ్బ తగిలిన వైపు నేలకు తగలకుండా జాగ్రత్తగా నడుం వాల్చాను.

రోడ్డు మీదకి దృష్టి మరల్చేసరికి, పూజారి గారి మనవడు కాబోలు, పెద్ద బంతితో ఆడుకుంటూ రోడ్డు మీదకొచ్చాడు. పిల్లలెంత ముద్దుగా ఉంటారు! అది ఏ జంతువైనా సరే, సృష్టిలోని అమాయకత్వమంటూ ఏవన్నా మిగిలితే శిశువుల ముఖాల్లోనే మిగిలుందనిపిస్తుంది.

ఇంతలో దూరంగా పెద్ద బండి వస్తూ కనిపించింది. ఇందాక నన్ను గుద్దినట్టు ఆ పిల్లాడ్నిగుద్దితే! ఆ పసి ప్రాణం తట్టుకోగలదా? ఆఁ... ఈ మనుషులు ఇట్టే తప్పుకుంటారు ఆ బళ్ళ నుండి. నాలా కాదు.

బండి పిల్లవాని వెనుక నుండి వస్తోంది.

ఒక వేళ చూడక పోతే?

ఇంక ఆగలేకపోయాను. ముందు నుండి వెళ్ళి గట్టిగా అదమాయిస్తే ఆ పిల్లాడు తప్పుకుంటాడు కదా. మరి నేను వెంటనే తప్పుకోగలనా? ఆలోచించడానికి సమయం లేదు. లేని సత్తువ తెచ్చుకుని పరిగెట్టాను, నన్ను చూసి పిల్లాడైతే తప్పుకున్నాడు, నాకు సమయమే లేక పోయింది. బండి తనతో పాటు కొంత దూరం ఈడ్చుకొని పోయింది. నొప్పి ఇంకా మెదడుకి చేరలేదు. కానీ ఇదే ఆఖరు అని అర్థమవుతోంది. చుట్టూ జనం చేరారు. ఇందాక కొట్టటానికి వచ్చిన వారు ఇప్పుడు జాలిగా చూస్తున్నారు. చావే వీళ్ళలో కరుణ కలిగిస్తుందా? మరి జీవచ్ఛవంగా బ్రతకటం?

ప్రాణం పోవటం తెలుస్తోంది. దృష్టి మందగిస్తోంది. ఇక వినికిడిశక్తి కూడా కోల్పోతున్నాననగా, అప్పుడే గుంపుని తోసుకుంటూ వచ్చి నా ముందు నిలబడ్డ పూజారి కొడుకు కరుగ్గా అన్న మాటలు నా చెవుల్ని చివరిసారి తాకాయి: " వెధవ ముండ! రోజూ ఇంత ప్రసాదం ముద్ద పడేస్తూనే వుంటాను. ఇప్పుడు నా బిడ్డనే చంపబోయింది. ఇంటి ముందు చచ్చి చండాలం చేసింది."

*——*——*

[నా రెండో తమ్ముడు జయరాం పీజీ చేస్తున్నాడు. మొదటిసారి కథ రాసే ప్రయత్నం చేసాడు. చదివిన వారు స్పందనో, సలహానో తెలియజేస్తారని ఆశిస్తున్నాను.]

August 11, 2009

నబొకొవ్ సమాచారం మరికొంత


మూణ్ణాల్రోజులుగా ఇంటి దగ్గరేమో నబొకొవ్‌ని చదవటం, ఆఫీసులోనేమో నబొకొవ్ గురించి చదవటం. పెద్దగా పనేం లేకపోవటంతో, అంతర్జాలంలో నబొకొవ్ సమాచారాన్ని జల్లెడ పట్టే పని మీదేసుకున్నాను. ఈ వెతుకులాటలో నాలాంటి కొందరు నబొకోవియన్లని—అహ! కాదు—నా కన్నా ముదిరిపోయిన నబొకోవియన్లని కలుసుకుని ఆనందించాను. కొన్ని మంచి లింకులు కూడా దొరికాయి. వాటితో పాటు కొన్ని నా దగ్గరున్నవీ కలిపి ఇక్కడ ఇస్తున్నాను :
♣ ఇక్కడ నబొకొవ్ జీవితాన్ని ఆయన రచనా వ్యాసంగపు నేపథ్యంలో ఆసక్తికరంగా వివరించారు. ఆయన రాతప్రతులూ, చేత్తో వేసిన బొమ్మలూ కూడా కలిపి ముచ్చటగా వున్నాయీ పేజీలు.
♣ సిసలైన ఏ రచయితైనా కొన్ని షరతుల తోడుగానే పాఠకుల్ని తన ప్రపంచంలోకి అనుమతిస్తాడని నా భావన. ఇదే మామూలు రచయితల్నుంచి కళాకారుల్ని వేరు చేస్తుందని నా నమ్మిక. వారిని సమీపించాలంటే, వారి రచనల్ని అంగీకరించాలంటే, పూర్తి స్థాయిలో ఆస్వాదించాలంటే, చదువరులు కొన్ని షరతులకు తలూపక తప్పదు. నబొకొవ్ ఇంటర్వూలు నబొకొవ్‌ని ఎలా సమీపించాలో చెప్తాయి. "స్ట్రాంగ్ ఒపీనియన్స్" పేరుతో పుస్తకంగా వెలువడిన ఈ ఇంటర్వూలన్నీ అంతర్జాలంలో దొరుకుతున్నాయి
♣ పై ఇంటర్వూల సంపుటిలో లేని "పారిస్ రివ్యూ" ఇంటర్వూ ఇక్కడ ఇస్తున్నాను. ఇందులో నబొకొవ్ తన విమర్శకుల గురించి, మాతృభూమి రష్యా గురించి, రచనా వ్యాసంగపు అలవాట్ల గురించి, "poshlost" (రసలుబ్ధతకు ఆయన రష్యన్ నుంచి అరువు తెచ్చిన పదం) గురించి, జాయ్స్ బోర్హెస్‌ల గురించి, ఇతర పఠనాభిరుచుల గురించి, కోర్నెల్ యూనివర్శిటీలో తన బోధన పద్ధతులూ వగైరాల గురించీ మాట్లాడుతున్నాడు. విలువైన ఇంటర్వూ.
♣ నా దగ్గర నబొకొవ్ "కలెక్టెడ్ స్టోరీస్" పుస్తకం వుంది. ఒక్కో కథ చదవటం ఈ లింకులో ఇచ్చిన విశ్లేషణ చూడటం ఆనందంగా వుండేది. అన్ని సార్లూ ఈ విశ్లేషణల్ని అంగీకరించానని చెప్పులేను గానీ, మనం చదివిన వాటిపై ఇంకొకరి అభిప్రాయాలు తెలుసుకోవటమూ బాగుంటుంది కదా.
♣ నబొకొవ్ శతజయంతి సందర్భంగా న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు ఆయన ఇంటర్వూలు, ఆయన రచనలపై సమీక్షలు, ఆయన స్వయంగా చేసిన కొన్ని సమీక్షలూ కలిపి ఓ చోట ఇచ్చారు. (ఉచిత రిజిస్ట్రేషన్ అవసరం అనుకుంటా.)
♣ ఈ సైటు పూర్తిగా నబొకొవ్‌కి అంకితం.
♣ రోజర్ బాయ్‌లాన్ అనే రచయిత రాసిన ఈ వ్యాసం అంతర్జాలంలో నేను నబొకొవ్ మీద చదివిన పరిచయాల్లో అత్యుత్తమమైనదని చెప్పగలను.
♣ మైకేస్ షేబాన్ అనే యువరచయిత పీటర్స్‌బర్గ్‌లో నబొకొవ్ ఇంట్లో (ఇప్పుడు మ్యూజియం) ఇచ్చిన ఉపన్యాసం నాకు నబొకొవ్ పట్ల వున్న అభిమానాన్ని అచ్చంగా అందంగా మాటల్లో పెట్టింది.
♣ నబొకొవ్ జీవితచరిత్రకారుడు, ఆయన రచనలపై విలువైన పరిశోధనలు చేసిన నిపుణుడూ అయిన బ్రైన్ బోయ్డ్ నుంచి ఈ ఇంటర్వూ కొత్త పాఠకులకు ఉపయుక్తం.
♣ ఇంకో నబకోవియన్.
♣ నబొకొవ్ భార్య వెరా జీవితచరిత్రపై ఒక సమీక్ష. ఆ పుస్తకం నుంచి కొన్ని భాగాలు.
♣ నబొకొవ్ 1964లో పుష్కిన్ కావ్యం "యెవ్‌జెనీ ఒనెజిన్"ని రష్యన్ నుంచి ఆంగ్లంలోకి అనువదించి ప్రచురించాడు. అనువాదం విషయంలో నబొకొవ్‌కి ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయి. అనువాదం అనువాదంలానే ధ్వనించాలనీ, అంతేగానీ సంక్షిప్తానువాదం, స్వేచ్ఛానువాదాల్లాంటివి అర్థం లేని ప్రక్రియలనీ ఆయన నమ్మాడు. ఆ ప్రకారంగానే "యెవ్‌జెనీ ఒనెజిన్"కావ్యాన్ని లయా, శ్రావ్యతా అన్నీ పక్కన పెట్టి మక్కికి మక్కి అనువదించాడు; దాంతో పాటు అనువాదాన్ని వివరిస్తూ కావ్యానికి నాలుగింతలున్న నోట్సుని జత చేసి ప్రచురించాడు. తన అనువాదం ముఖ్య లక్ష్యం పాఠకుల్ని ఆ కావ్యపు మూలం చదివే దిశగా ప్రేరేపించడమని ఆయనే చెప్పాడు. అయితే ఈ రచనపై విమర్శకుడు ఎడ్మండ్ విల్సన్ చాలా తీవ్రంగా విరుచుకు పడ్డాడు. నిజానికి అప్పటి వరకూ వాళ్ళిద్దరూ చాలా మంచి స్నేహితులు. కొత్తగా అమెరికా వచ్చిన నబొకొవ్‌కి అక్కడి సాహితీ ప్రపంచాన్ని పరిచయం చేయటంలో విల్సన్ చాలా సాయపడ్డాడు. నబొకొవ్ కూడా రష్యన్ భాష నేర్చుకోవటంలో విల్సన్‌కు సాయపడ్డాడు. ఇద్దరి స్నేహాన్ని నిరూపించే ఉత్తరాలు తర్వాత్తర్వాత పుస్తకంగా కూడా ప్రచురితమయ్యాయి. కానీ ఈ ఒక్క సమీక్షతో అంతా తారుమారయిపోయింది. నబొకొవ్ కూడా ఊరుకోలేదు. విల్సన్ తన రచనను గాక తన రష్యన్ భాషా పాఠవాన్నే ప్రశ్నించడంతో గట్టిగానే సమాధానమిచ్చాడు. ఈ ఉదంతంతో ఇక వీళ్ళ మధ్య స్నేహం ముగిసిపోయింది. ఓ ఇంటర్వూలో దీనిపై అడిగిన ప్రశ్నకు నబొకొవ్ ఇలా సమాధానమిచ్చాడు:
[Q] You say you are not interested in what critics say, yet you got very angry with Edmund Wilson once for commenting on you, and let off some heavy field guns at him, not to say multiple rockets. You must have cared.
[A] I never retaliate when my works of art are concerned. There the arrows of adverse criticism cannot scratch, let alone pierce, the shield of what disappointed archers call my "self-assurance." But I do reach for my heaviest dictionary when my scholarship is questioned, as was the case with my old friend Edmund Wilson, and I do get annoyed when people I never met impinge on my privacy with false and vulgar assumptions—as for example Mr. Updike, who in an otherwise clever article absurdly suggests that my fictional character, bitchy and lewd Ada, is, I quote, "in a dimension or two, Nabokov's wife." I might add that I collect clippings—for information and entertainment.
♣ ఆడమ్ తిర్ల్వెల్ కూడా నేను మొన్న ఇచ్చిన వీడియోని చూసినట్టున్నాడు. వ్యాసంలోని ఓ పేరాలో అతను నబొకొవ్‌తో వచ్చే చిన్న ఇబ్బందిని ఇలా ప్రస్తావించాడు:
"But this is a problem, in particular, when the novelist one loves is so obvious in his contempts as Nabokov. For let's be honest: as Nabokov's admirer, it becomes difficult to maintain a love of Stendhal and Henry James, or adopt a love of Faulkner or Dostoevsky. You are, however, allowed to like Raymond Queneau; and this is something. When it comes to the more minute level of technique, you are not allowed to use too much dialogue; nor are you meant to venture into the genre of the historical novel; nor vary your prose with essayistic elements."
తొలుత ఈ సమస్య నాక్కూడా ఎదురైంది. అయితే పఠనాభిరుచుల్లో నబొకొవ్ ప్రేమలన్నీ నా ప్రేమలుగా చేసుకోగలిగినంత సులభంగా, ఆయన ద్వేషాలన్నీ నా ద్వేషాలుగా చేసుకోలేనని మాత్రం ఇప్పుడు తెలుస్తోంది. భవిష్యత్తులో ఈ అభిరుచులేవన్నా మారతాయేమో గానీ, ప్రస్తుతానికి ఆయన తృణీకరించిన వాళ్ళలో దాస్తొయెవ్‌స్కీ, అల్బెర్ట్‌కామూ, హెన్రీ జేమ్స్‌లు నాకు ఇష్టమే. రెణ్ణెల్ల క్రితం హెన్రీ జేమ్స్ "ఆస్పెర్న్ పేపర్స్" చదివాను. చాలా ఆకట్టుకుంది. ముందు ముందు ఆయనవి చాలా చదువుతానని చెప్పగలను. దాస్తొయెవ్‌స్కీ "క్రైమ్ అండ్ పనిష్మెంట్", "బ్రదర్స్ కరమొజొవ్" నా మీద చాలా ప్రభావం చూపిన పుస్తకాలు. అలాగే అల్బెర్ట్ కామూ "స్ట్రేంజర్", "ద ఫాల్" కూడా. ఇక్కడొక నబొకోవియన్ పఠనాభిరుచుల్లో ఆయన ఇష్టాయిష్టాల్ని జాబితాలాగా తయారు చేసాడు.
చివరగా నబొకొవ్ వీడియో మరొకటి:

August 6, 2009

Stumbling, stuttering Nabokov

"I think like a genius, I write like a distinguished author, and I speak like a child." — Nabokov


ఈ వీడియో ఇంటర్వూ చూసాకా పై మాటలు నిజమే అనిపించాయి. అక్షరాల్లో స్పష్టంగా, ఖచ్చితంగా, కొండొకచో గీరగా కూడా ధ్వనించే నబొకొవ్, ఇక్కడిలా మాటల్లో నట్టుతూ నట్టుతూ సమాధానాలివ్వడం చూట్టానికి సరదాగా వుంది. ఓ పక్క తన చేతిలోని ఇండెక్స్ కార్డులపై ముందే రాసిపెట్టుకున్న సమాధానాల్ని దొంగ చూపులు చూసుకుంటూ చదువుతూ కూడా, మరోపక్క ఆశువుగా సమాధానాలిస్తున్నట్టూ భ్రమింపచేయటానికి ఆయన పడుతోన్న శ్రమ చూస్తే ముచ్చటేసింది. (ఆయన తన నవలలన్నీ కూడా ఇలాంటి ఇండెక్స్ కార్డుల మీదే రాసేవాడు.) అసలు మొత్తం ఇంటర్వూలో చాలావరకూ ఏం జరుగుతోందో, ఎవరు ఏం అడుగుతున్నారో ఆయనకు అర్థమవుతున్నట్టే లేదు. ఆయన దృష్టంతా చేతిలో కార్డుల పైనే వుంది. అందుకే రాత ఇంటర్వూలతో పోలిస్తే ఈ ఇంటర్వూ చాలా చప్పగా సాగింది. మనం మనలా సహజంగా వుండటమంటే సులువే, ఎప్పుడూ చేసేదే; కానీ కెమెరాలు ముందు పెట్టి సహజంగా వుండటానికి ప్రయత్నించమంటే కష్టమైపోదూ. నబొకొవ్‌లో ఆ ఇబ్బంది మరీ కొట్టొచ్చినట్టు తెలిసిపోతోంది. అలాగే విమర్శకుడు ట్రిలింగ్ కూడా సహజత్వాన్ని మరీ అసహజంగా అనుకరిస్తున్నట్టనిపించింది; ఆయన శ్రద్ధ ఇంటర్వూ మీద కన్నా, చేతిలో సిగరెట్‌ని ఎంత దర్పంగా కాల్చగలనన్నదాని మీదే ఎక్కువ వున్నట్టుంది. అలాగే ఇంటర్వూ మధ్యలో ముగ్గురూ హఠాత్తుగా లేచి పక్కన సోఫాల్లోకి మారటం కూడా కృతకంగా వుంది — ముందే "కీ" ఇచ్చిన మర ఆడుతున్నట్టు.

నిజానికి ఈ ఇంటర్వూ ఇలా మాటల్లో గాక అక్షరాల్లో సాగి వుంటే (నబొకొవ్ తన ఇంటర్వూలన్నింటికీ సమాధానాలు నోటితో గాక, అక్షరాల్లో రాసి ఇచ్చేవాడు), కొన్ని ప్రశ్నలకు నబొకొవ్ ఇచ్చిన సమాధానాలు వేరేగా వుండేవని నా కనిపించింది. ముఖ్యంగా "లొలీటా" ప్రధానంగా ప్రేమ కథ అన్న ట్రిల్లింగ్ వాదనని నబొకొవ్ మరో సందర్భంలో అస్సలు ఒప్పుకునేవాడు కాదు. "లొలీటా" ఇతివృత్తం ప్రేమా కాదు, సెక్సూ కాదు; బ్రిటిష్ రచయిత మార్టిన్ అమిస్ ఓ చోట చెప్పినట్టు "లొలీటా" ప్రధాన ఇతివృత్తం క్రూరత్వం.

ఆ సంగతి వదిలేస్తే, నబొకొవ్ మాట్లాడటంలో తన ఇబ్బందుల్ని ఓ ఇంటర్వూలో ఇలా చెప్పాడు:
Q: I notice you "haw" and "er"a great deal. Is it a sign of approaching senility?
Not at all. I have always been a wretched speaker. My vocabulary dwells deep in my mind and needs paper to wriggle out into the physical zone. Spontaneous eloquence seems to me a miracle. I have rewritten— often several times— every word I have ever published. My pencils outlast their erasers.
Q: What about TV appearances?
Well (you always begin with "well" on TV), after one such appearance in London a couple of years ago I was accused by a naive critic of squirming and avoiding the camera. The interview, of course, had been carefully rehearsed. I had carefully written out all my answers (and most of the questions), and because I am such a helpless speaker, I had my notes (mislaid since) on index cards arranged before me—ambushed behind various innocent props; hence I could neither stare at the camera nor leer at the questioner.
By the way, how I wish I had a privileged mind like that! You know, that awe-inspiring audacity, to be able to say things like: "... not even the shadow of my shadow." :P
అవును మళ్ళీ నబొకొవ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను? ఎందుకంటే, మొన్నే "Pnin" మొదలు పెట్టాను. మొదలు పెట్టింది తడవు మళ్ళీ Nabokovian sphere of gravity లో పడిపోయాను. అదీ సంగతి!