August 11, 2009

నబొకొవ్ సమాచారం మరికొంత


మూణ్ణాల్రోజులుగా ఇంటి దగ్గరేమో నబొకొవ్‌ని చదవటం, ఆఫీసులోనేమో నబొకొవ్ గురించి చదవటం. పెద్దగా పనేం లేకపోవటంతో, అంతర్జాలంలో నబొకొవ్ సమాచారాన్ని జల్లెడ పట్టే పని మీదేసుకున్నాను. ఈ వెతుకులాటలో నాలాంటి కొందరు నబొకోవియన్లని—అహ! కాదు—నా కన్నా ముదిరిపోయిన నబొకోవియన్లని కలుసుకుని ఆనందించాను. కొన్ని మంచి లింకులు కూడా దొరికాయి. వాటితో పాటు కొన్ని నా దగ్గరున్నవీ కలిపి ఇక్కడ ఇస్తున్నాను :
♣ ఇక్కడ నబొకొవ్ జీవితాన్ని ఆయన రచనా వ్యాసంగపు నేపథ్యంలో ఆసక్తికరంగా వివరించారు. ఆయన రాతప్రతులూ, చేత్తో వేసిన బొమ్మలూ కూడా కలిపి ముచ్చటగా వున్నాయీ పేజీలు.
♣ సిసలైన ఏ రచయితైనా కొన్ని షరతుల తోడుగానే పాఠకుల్ని తన ప్రపంచంలోకి అనుమతిస్తాడని నా భావన. ఇదే మామూలు రచయితల్నుంచి కళాకారుల్ని వేరు చేస్తుందని నా నమ్మిక. వారిని సమీపించాలంటే, వారి రచనల్ని అంగీకరించాలంటే, పూర్తి స్థాయిలో ఆస్వాదించాలంటే, చదువరులు కొన్ని షరతులకు తలూపక తప్పదు. నబొకొవ్ ఇంటర్వూలు నబొకొవ్‌ని ఎలా సమీపించాలో చెప్తాయి. "స్ట్రాంగ్ ఒపీనియన్స్" పేరుతో పుస్తకంగా వెలువడిన ఈ ఇంటర్వూలన్నీ అంతర్జాలంలో దొరుకుతున్నాయి
♣ పై ఇంటర్వూల సంపుటిలో లేని "పారిస్ రివ్యూ" ఇంటర్వూ ఇక్కడ ఇస్తున్నాను. ఇందులో నబొకొవ్ తన విమర్శకుల గురించి, మాతృభూమి రష్యా గురించి, రచనా వ్యాసంగపు అలవాట్ల గురించి, "poshlost" (రసలుబ్ధతకు ఆయన రష్యన్ నుంచి అరువు తెచ్చిన పదం) గురించి, జాయ్స్ బోర్హెస్‌ల గురించి, ఇతర పఠనాభిరుచుల గురించి, కోర్నెల్ యూనివర్శిటీలో తన బోధన పద్ధతులూ వగైరాల గురించీ మాట్లాడుతున్నాడు. విలువైన ఇంటర్వూ.
♣ నా దగ్గర నబొకొవ్ "కలెక్టెడ్ స్టోరీస్" పుస్తకం వుంది. ఒక్కో కథ చదవటం ఈ లింకులో ఇచ్చిన విశ్లేషణ చూడటం ఆనందంగా వుండేది. అన్ని సార్లూ ఈ విశ్లేషణల్ని అంగీకరించానని చెప్పులేను గానీ, మనం చదివిన వాటిపై ఇంకొకరి అభిప్రాయాలు తెలుసుకోవటమూ బాగుంటుంది కదా.
♣ నబొకొవ్ శతజయంతి సందర్భంగా న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు ఆయన ఇంటర్వూలు, ఆయన రచనలపై సమీక్షలు, ఆయన స్వయంగా చేసిన కొన్ని సమీక్షలూ కలిపి ఓ చోట ఇచ్చారు. (ఉచిత రిజిస్ట్రేషన్ అవసరం అనుకుంటా.)
♣ ఈ సైటు పూర్తిగా నబొకొవ్‌కి అంకితం.
♣ రోజర్ బాయ్‌లాన్ అనే రచయిత రాసిన ఈ వ్యాసం అంతర్జాలంలో నేను నబొకొవ్ మీద చదివిన పరిచయాల్లో అత్యుత్తమమైనదని చెప్పగలను.
♣ మైకేస్ షేబాన్ అనే యువరచయిత పీటర్స్‌బర్గ్‌లో నబొకొవ్ ఇంట్లో (ఇప్పుడు మ్యూజియం) ఇచ్చిన ఉపన్యాసం నాకు నబొకొవ్ పట్ల వున్న అభిమానాన్ని అచ్చంగా అందంగా మాటల్లో పెట్టింది.
♣ నబొకొవ్ జీవితచరిత్రకారుడు, ఆయన రచనలపై విలువైన పరిశోధనలు చేసిన నిపుణుడూ అయిన బ్రైన్ బోయ్డ్ నుంచి ఈ ఇంటర్వూ కొత్త పాఠకులకు ఉపయుక్తం.
♣ ఇంకో నబకోవియన్.
♣ నబొకొవ్ భార్య వెరా జీవితచరిత్రపై ఒక సమీక్ష. ఆ పుస్తకం నుంచి కొన్ని భాగాలు.
♣ నబొకొవ్ 1964లో పుష్కిన్ కావ్యం "యెవ్‌జెనీ ఒనెజిన్"ని రష్యన్ నుంచి ఆంగ్లంలోకి అనువదించి ప్రచురించాడు. అనువాదం విషయంలో నబొకొవ్‌కి ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయి. అనువాదం అనువాదంలానే ధ్వనించాలనీ, అంతేగానీ సంక్షిప్తానువాదం, స్వేచ్ఛానువాదాల్లాంటివి అర్థం లేని ప్రక్రియలనీ ఆయన నమ్మాడు. ఆ ప్రకారంగానే "యెవ్‌జెనీ ఒనెజిన్"కావ్యాన్ని లయా, శ్రావ్యతా అన్నీ పక్కన పెట్టి మక్కికి మక్కి అనువదించాడు; దాంతో పాటు అనువాదాన్ని వివరిస్తూ కావ్యానికి నాలుగింతలున్న నోట్సుని జత చేసి ప్రచురించాడు. తన అనువాదం ముఖ్య లక్ష్యం పాఠకుల్ని ఆ కావ్యపు మూలం చదివే దిశగా ప్రేరేపించడమని ఆయనే చెప్పాడు. అయితే ఈ రచనపై విమర్శకుడు ఎడ్మండ్ విల్సన్ చాలా తీవ్రంగా విరుచుకు పడ్డాడు. నిజానికి అప్పటి వరకూ వాళ్ళిద్దరూ చాలా మంచి స్నేహితులు. కొత్తగా అమెరికా వచ్చిన నబొకొవ్‌కి అక్కడి సాహితీ ప్రపంచాన్ని పరిచయం చేయటంలో విల్సన్ చాలా సాయపడ్డాడు. నబొకొవ్ కూడా రష్యన్ భాష నేర్చుకోవటంలో విల్సన్‌కు సాయపడ్డాడు. ఇద్దరి స్నేహాన్ని నిరూపించే ఉత్తరాలు తర్వాత్తర్వాత పుస్తకంగా కూడా ప్రచురితమయ్యాయి. కానీ ఈ ఒక్క సమీక్షతో అంతా తారుమారయిపోయింది. నబొకొవ్ కూడా ఊరుకోలేదు. విల్సన్ తన రచనను గాక తన రష్యన్ భాషా పాఠవాన్నే ప్రశ్నించడంతో గట్టిగానే సమాధానమిచ్చాడు. ఈ ఉదంతంతో ఇక వీళ్ళ మధ్య స్నేహం ముగిసిపోయింది. ఓ ఇంటర్వూలో దీనిపై అడిగిన ప్రశ్నకు నబొకొవ్ ఇలా సమాధానమిచ్చాడు:
[Q] You say you are not interested in what critics say, yet you got very angry with Edmund Wilson once for commenting on you, and let off some heavy field guns at him, not to say multiple rockets. You must have cared.
[A] I never retaliate when my works of art are concerned. There the arrows of adverse criticism cannot scratch, let alone pierce, the shield of what disappointed archers call my "self-assurance." But I do reach for my heaviest dictionary when my scholarship is questioned, as was the case with my old friend Edmund Wilson, and I do get annoyed when people I never met impinge on my privacy with false and vulgar assumptions—as for example Mr. Updike, who in an otherwise clever article absurdly suggests that my fictional character, bitchy and lewd Ada, is, I quote, "in a dimension or two, Nabokov's wife." I might add that I collect clippings—for information and entertainment.
♣ ఆడమ్ తిర్ల్వెల్ కూడా నేను మొన్న ఇచ్చిన వీడియోని చూసినట్టున్నాడు. వ్యాసంలోని ఓ పేరాలో అతను నబొకొవ్‌తో వచ్చే చిన్న ఇబ్బందిని ఇలా ప్రస్తావించాడు:
"But this is a problem, in particular, when the novelist one loves is so obvious in his contempts as Nabokov. For let's be honest: as Nabokov's admirer, it becomes difficult to maintain a love of Stendhal and Henry James, or adopt a love of Faulkner or Dostoevsky. You are, however, allowed to like Raymond Queneau; and this is something. When it comes to the more minute level of technique, you are not allowed to use too much dialogue; nor are you meant to venture into the genre of the historical novel; nor vary your prose with essayistic elements."
తొలుత ఈ సమస్య నాక్కూడా ఎదురైంది. అయితే పఠనాభిరుచుల్లో నబొకొవ్ ప్రేమలన్నీ నా ప్రేమలుగా చేసుకోగలిగినంత సులభంగా, ఆయన ద్వేషాలన్నీ నా ద్వేషాలుగా చేసుకోలేనని మాత్రం ఇప్పుడు తెలుస్తోంది. భవిష్యత్తులో ఈ అభిరుచులేవన్నా మారతాయేమో గానీ, ప్రస్తుతానికి ఆయన తృణీకరించిన వాళ్ళలో దాస్తొయెవ్‌స్కీ, అల్బెర్ట్‌కామూ, హెన్రీ జేమ్స్‌లు నాకు ఇష్టమే. రెణ్ణెల్ల క్రితం హెన్రీ జేమ్స్ "ఆస్పెర్న్ పేపర్స్" చదివాను. చాలా ఆకట్టుకుంది. ముందు ముందు ఆయనవి చాలా చదువుతానని చెప్పగలను. దాస్తొయెవ్‌స్కీ "క్రైమ్ అండ్ పనిష్మెంట్", "బ్రదర్స్ కరమొజొవ్" నా మీద చాలా ప్రభావం చూపిన పుస్తకాలు. అలాగే అల్బెర్ట్ కామూ "స్ట్రేంజర్", "ద ఫాల్" కూడా. ఇక్కడొక నబొకోవియన్ పఠనాభిరుచుల్లో ఆయన ఇష్టాయిష్టాల్ని జాబితాలాగా తయారు చేసాడు.
చివరగా నబొకొవ్ వీడియో మరొకటి:

2 comments:

 1. Valuable compilation of valuable info.
  thanks a bunch

  ReplyDelete
 2. "నేనేం ఇష్టపడినా, చుట్టుపక్కలవాళ్ళు కాస్త పిచ్చేమో అని సందేహించేంత గాఢంగా ఇష్టపడుతూంటాను"

  అచ్చంగా నాలాగే అన్నమాట :)

  ఇక మనం ఇష్టపడేవాళ్ళ ఇష్టాల్ని మన ఇష్టాలుగా చేసుకోవడం గురించి...Hmm... ఇన్నాళ్లూ ఇది సబ్-కాన్షస్ గానే జరిగిపోయింది, మీర్రాసింది చదివాకే... "కదా" అనుకున్నా :)

  ReplyDelete