August 25, 2009

జయ మొదటి కథ

" హమ్మయ్య! తెల్లారింది"

— జయరాం

ఈ మధ్య మోకాలి నొప్పులు బాగా ఎక్కువయ్యాయి. ఒక ఫర్లాంగు దూరం నడిచేటప్పటికే సత్తువ అయిపోతోంది. దగ్గర్లోని చెత్త కుండీ పైన గంగడోలును ఆన్చి తనివి తీరా కండూతి ఉమశమింపచేసుకున్న తర్వాత, ఓపిక చేసుకుని గుడి పక్కకొచ్చి నిలబడ్డాను. గుళ్ళోంచి ఏవో భక్తి పాటలు అనుకుంటా, వస్తున్నాయి. పూజారి గారబ్బాయి రేడియోలో వార్తలు వింటున్నాడు. ఇంకా రోడ్లు అన్నీ నిర్మానుష్యం గానే ఉన్నాయి. మార్కెట్టు వీధి అంతా నిన్నటి కూరగాయల కుళ్ళిన తుక్కుతో నిండి ఉంది. మనసు లాగింది గానీ, వెళ్ళబుద్ధేయయలేదు అటు. పూజారి గారింట్లో ఏం ప్రసాదం చేసారో ఏంటో? జనం వచ్చి ఉంటే ఈ పాటికి ప్రసాదం దొరికేది. ఏదీ? ఈ జనాలింకా లేస్తే కదా!

ఎండ తీవ్రత పెరిగేసరికి గుడికి జనం రాక మొదలయ్యింది. జన సమ్మర్థం తగ్గిన కాసేపటికి అరటి ఆకుల్లో చిన్న ముద్దలా ప్రసాదాన్ని నా వైపుగా విసిరాడు పూజారి గారబ్బాయి. మిగిలిన ప్రసాదం అంతా ఎవడో సైకిలు మీద వచ్చి, గిన్నెలో పెట్టుకుని డబ్బులిచ్చి తీసుకెళ్ళాడు. పెద్ద పూజారి గారున్నప్పుడు ఇలాంటివి జరిగేవి కావు. ఆయన నన్ను సొంత బిడ్డలా చూసుకొనేవారు. ఇంటి దగ్గరకు వస్తే చద్దన్నం, గుడికొస్తే ప్రసాదం విడువకుండా పెట్టేవారు. దాంతో వీధులన్నీ తిరగాల్సిన పని ఉండేది కాదు. ఒక సారి రథం ఊరేగింపు రోజు నా కాలికి దెబ్బ తగిలితే ఇంటికి తీసుకు వచ్చి కట్టు కట్టిన పుణ్యాత్ముడాయన. కానీ పూజారి గారు చనిపోయిన తర్వాత గుడి కళే తప్పిపోయింది. నా సంగతి సరే సరి. ఇంటికి వస్తే తరిమి పంపించటం, గుళ్ళో మిగిలిన ప్రసాదం అమ్ముకోవటం. తప్పదు, ఇక దీనికి అలవాటు పడాలి.

సందుల్లోంచి వెళుతుంటే ఆకతాయి పిల్లల బెడద ఎక్కువైపోతోంది. మీదకు రాళ్ళు రువ్వటం, కర్రతో కొట్టటం వీళ్ళు చేసే పనులు. అప్పుడప్పుడు అనిపిస్తుంది, నేను శాంతంగా ఉండబట్టే కదా వీళ్ళు నన్ను అపహాస్యం చేస్తున్నారని. కానీ నేను చేయగలిగింది ఏం లేదు. వీరి మీదకు వెళితే రోజూ దొరికే ముద్ద కూడా దొరకదు.

*——*——*

మిట్ట మధ్యాహ్నం. సూర్యుడు చండ్ర నిప్పులు కురిపిస్తున్నాడు. బాగా దాహం వేసింది. టీ కొట్టు సుబ్బి గాడి దగ్గరకు పోబోయాను. వాడు చీపురు కట్ట పట్టుకుని కసిరాడు. ఆ కుండలో నీళ్ళు తాగనిస్తే వాడి సొమ్మేమన్నా పోతుందా? హుఁ! ఇంక చెరువు నీరే గతి. దానికేమో రోడ్డు దాటాలి. అదో పెద్ద ఇబ్బంది. బళ్ళు ఒక్కటీ ఆగవు. సర్లే చిన్న బళ్ళే కదా వస్తున్నవి అని దాటబోయాను. రయ్యిమని దూసుకొచ్చాడెక్కడి నుంచో ఓ కుర్ర వెధవ బండి మీద. పక్కకు తప్పుకునే సమయమే ఇవ్వలేదు. పక్కటెముక అదిరిపోయింది. అతి కష్టం మీద లేవగలిగాను. చుట్టు పక్కల జనం పోగయ్యారు, చోద్యం చూడటానికి. తప్పు చేసిన వాడిని వదిలేసి నా మీద పడ్డారు. అక్కడి నుండి తప్పించుకొనేసరిలి తల ప్రాణం తోకకొచ్చింది.

చెరువులో సగం మేర నీరు ఎండి పోయి నెర్రెలు కనిపిస్తున్నాయి. మిగతా సగం దాదాపు బురద గుంట లాగా తయారయ్యింది. కానీ తప్పదు కదా, అక్కడ తప్ప ఇప్పుడు ఇంకెక్కడా నీరు దొరకదు. తనివి తీరా తాగి, యాధాలాపంగా ఆ నీటిలో నా ముఖం చూసుకున్నా. ఆశ్చర్యమేసింది. అసలు నేనేనా అని అనుమానమొచ్చింది. మొహం మసి బొగ్గులా తయారయ్యింది. దవడ చుట్టూ చర్మం తప్ప మాంసమే లేదు. ముఖంలో అప్పటికీ ఇప్పటికీ మారనివి ఒక్కటే..."కొమ్ములు". సరైన తిండి దొరికితే కదా!

మనుషులు కూడా మారిపోయారు. పూర్వం జంతువుల పట్ల కాసింత దయ, కారుణ్యం ఉండేవి. అంతెందుకు, మా తాత చెబుతుండేవాడు, తనని ఒక పాలేరు ఎంతో ప్రేమగా చూసుకొనేవాడని, పండగలకి అందంగా ముస్తాబు చేయించేవాడని. ఇంకా తనతో పాటు కొట్టంలో ఉన్న ఆవులు వట్టి పోయినా వాటిని కడ దాకా కంటికి రెప్పలా చూసుకొన్నాడే తప్ప ఏనాడూ కబేళాకు అమ్మేయటం గానీ, వాటి మానాన వాటిని వదిలేయటం గానీ చేయలేదట. కానీ ఇప్పుడు, మనుషులకు టీవీలూ, రేడియోలే ఎక్కువైపోయాయి. జంతువుల సంగతి దేవుడెరుగు, సాటి మనుషుల గురించే ఆలోచించటం మానేసారు. ఏ రోడ్డు మీద చూసినా గొడవలు, కొట్లాటలు.

ఇందాకటి మీద నొప్పి ఇప్పుడు బాగా ఎక్కువయ్యింది. నీడన విశ్రాంతి తీసుకుంటే నయం. అగ్రహారం దాకా నడిచేసరికి నొప్పి మరింత పెరిగింది. రావి చెట్టు దగ్గరికి వచ్చేటప్పటికి అప్పుడే అక్కడ నాలాంటి నేస్తాలు రెండు వచ్చి చేరాయి. మాలా దిక్కు తెలీకుండా ఆ ఊళ్ళో తిరిగే ఆంబోతులన్నిటికీ మంచి నేస్తం ఆ రావి చెట్టు. అదొక్కటే ఊళ్ళో మిగిలిన పెద్ద చెట్టు కూడా. దెబ్బ తగిలిన వైపు నేలకు తగలకుండా జాగ్రత్తగా నడుం వాల్చాను.

రోడ్డు మీదకి దృష్టి మరల్చేసరికి, పూజారి గారి మనవడు కాబోలు, పెద్ద బంతితో ఆడుకుంటూ రోడ్డు మీదకొచ్చాడు. పిల్లలెంత ముద్దుగా ఉంటారు! అది ఏ జంతువైనా సరే, సృష్టిలోని అమాయకత్వమంటూ ఏవన్నా మిగిలితే శిశువుల ముఖాల్లోనే మిగిలుందనిపిస్తుంది.

ఇంతలో దూరంగా పెద్ద బండి వస్తూ కనిపించింది. ఇందాక నన్ను గుద్దినట్టు ఆ పిల్లాడ్నిగుద్దితే! ఆ పసి ప్రాణం తట్టుకోగలదా? ఆఁ... ఈ మనుషులు ఇట్టే తప్పుకుంటారు ఆ బళ్ళ నుండి. నాలా కాదు.

బండి పిల్లవాని వెనుక నుండి వస్తోంది.

ఒక వేళ చూడక పోతే?

ఇంక ఆగలేకపోయాను. ముందు నుండి వెళ్ళి గట్టిగా అదమాయిస్తే ఆ పిల్లాడు తప్పుకుంటాడు కదా. మరి నేను వెంటనే తప్పుకోగలనా? ఆలోచించడానికి సమయం లేదు. లేని సత్తువ తెచ్చుకుని పరిగెట్టాను, నన్ను చూసి పిల్లాడైతే తప్పుకున్నాడు, నాకు సమయమే లేక పోయింది. బండి తనతో పాటు కొంత దూరం ఈడ్చుకొని పోయింది. నొప్పి ఇంకా మెదడుకి చేరలేదు. కానీ ఇదే ఆఖరు అని అర్థమవుతోంది. చుట్టూ జనం చేరారు. ఇందాక కొట్టటానికి వచ్చిన వారు ఇప్పుడు జాలిగా చూస్తున్నారు. చావే వీళ్ళలో కరుణ కలిగిస్తుందా? మరి జీవచ్ఛవంగా బ్రతకటం?

ప్రాణం పోవటం తెలుస్తోంది. దృష్టి మందగిస్తోంది. ఇక వినికిడిశక్తి కూడా కోల్పోతున్నాననగా, అప్పుడే గుంపుని తోసుకుంటూ వచ్చి నా ముందు నిలబడ్డ పూజారి కొడుకు కరుగ్గా అన్న మాటలు నా చెవుల్ని చివరిసారి తాకాయి: " వెధవ ముండ! రోజూ ఇంత ప్రసాదం ముద్ద పడేస్తూనే వుంటాను. ఇప్పుడు నా బిడ్డనే చంపబోయింది. ఇంటి ముందు చచ్చి చండాలం చేసింది."

*——*——*

[నా రెండో తమ్ముడు జయరాం పీజీ చేస్తున్నాడు. మొదటిసారి కథ రాసే ప్రయత్నం చేసాడు. చదివిన వారు స్పందనో, సలహానో తెలియజేస్తారని ఆశిస్తున్నాను.]

9 comments:

 1. కథ చాలా బాగుంది.. జయరాం కి అభినందనలు.. రాస్తూ ఉండమని నా మాటగా చెప్పండి..

  ReplyDelete
 2. మెచ్చుకోదగిన తొలి ప్రయత్నం.
  ఇంచుమించు ఇదే ఇతివృత్తంతో రానారె ఒక మంచి కథ రాశారు. ఈమాటలో ప్రచురితమీందనుకుంటా.

  ReplyDelete
 3. I am not much into stories, but your brother seems to write with ease. Convey my wishes to him, please.

  If he wishes to open a telugu blog and adds it to koodali, please warn him of half baked intellectuals and pseudo critics. They just trivialize the very experience of a simple act that blogging is.

  ReplyDelete
 4. ముద్రణలో వచ్చే చాలా కథలకంటే మెరుగు. ఒకటి రెండు చోట్ల తప్ప కథనం సూటిగా ఉంది. అంత ఒరిజినాలిటీ కనిపించలేదు గానీ (జంతువు స్వగతం, అపార్థం) మొదటి కథ కనక సరిపెట్టుకోవచ్చు. రాస్తూ ఉండమని చెప్పండి.

  ReplyDelete
 5. కవితలు, కథ, సమీక్షలు ఇలా దొరికిన రచనలు చదవటం, నాకు తోచిన పదాలతో కవితలవంటివి రాసుకోవటం, అక్షరం పట్ల అపారమైన మక్కువ, అనురక్తి మినహా నాకు మరే అర్హత లేదు విమర్శ/సలహా ఇవ్వటానికి. ఇది స్పందన మాత్రమే. కథ పాతదే అయినా కథనం, ముగింపు వలన మనసుకి తడి తగిలింది. పది రోజుల క్రితం చదివినపుడు దాదాపు పదేళ్ళ క్రితం నేను సిడ్నీలో చదివిన కథ గుర్తుకు వచ్చింది. ఇతివృత్తం ఒకటి కాదు కాని, జంతువు, స్వగతం, మరణం అన్న అంశాల వలన. యాధృచ్చికం కావచ్చు కాని నిన్న "జాతర" అన్న పదం కొరకు జాలం లో వెదుకుతుంటే ఆ కథకి లింక్ దొరికింది. http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/goddu---jayampu-krsna

  మీ తమ్ముడికి అభినందనలు.

  ReplyDelete
 6. Anonymous12:40 PM

  Mehar garu Mee thammuni katha bagundi, jyayaram ki naa abinandanalu

  ReplyDelete
 7. Anonymous12:41 PM

  bagundi sir...

  ReplyDelete