March 12, 2011

చేతులు చాచి ఆహ్వానించడానికో జబ్బు!

మొన్నామధ్య నేనూ ఒక స్నేహితురాలూ మా సహజధోరణిలో ఒరకడ్డంగా మాట్లాడుకుంటూండగా సందర్భవశాత్తూ నా లోపలి కోరిక ఒకటి మాటలు తొడుక్కుని బయటకు దొర్లిపోయింది. “నాకెపుడూ క్షయ లాంటి ఏదో శాశ్వతమైన జబ్బు రావాలని వుంటుందిఅన్నాను. వేరే ఎవరితోనయినా మాటంటే హాఫ్ బ్రాకెట్‌‍తో యికిలించే స్మైలీ బదులు, కాపిటల్ “O” తో హాచ్చెరపడిపోతున్న ఎమోటికాన్ ఒకటి వచ్చిపడేది. అథమం, అనునయంగా నా మానసికారోగ్యాన్ని గురించి వాకబు చేసినా చేసేవారు. కానీ చెప్పానుగా యిద్దరం కాస్త ఒరకడ్డమని, ఒకే సజ్జనీ. “నాకూ అంతేఅని సంబరపడటమే గాక, కానీ నాలా తనకు శాశ్వతంగా పీడించే జబ్బు వద్దనీ, “గట్టి జబ్బు, అంటే కొన్ని నెలల్లో యిక పోతామని ముందే తెలిసి అందరూ ప్రేమగా చూసుకునే జబ్బు కావాలనీ, వినడానికి గ్రాండ్గా వుండాలనీ”... యిలా కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా ఇచ్చారు. వీటి ఆధారంగా కాస్త ఆలోచించి, “గీతాంజలిలాంటి సినిమాల్నీప్రార్థనలాంటి నవలల్నీ గుర్తు తెచ్చుకుని, “లుకేమియాని ప్రతిపాదించాను. తన మనసులో మాట పసిగట్టినట్టు ఆనందంగా అంగీకరించారు. “యిప్పటిదాకా మందు కనిపెట్టని అలాంటి జబ్బయితే మనమెంత విలువైన వాళ్లమో చుట్టుప్రక్కల వాళ్లకు తెలిసొచ్చి అపురూపంగా చూసుకుంటారనీఉత్సాహంగా యిలా యేవో ఊహల్ని చిత్రాల్లోకి పేనుకుంటూ చెప్పుకుపోయారు. నావంతుగా నేనుమరీ తెగే దాకా సాగలాగకూడదనీ, చుట్టుప్రక్కల వాళ్లలో జాలి అంతా ఖర్చయిపోయిఇంకా చచ్చి చావదేం!’ అని కోప్పడేంత దాకా రాకముందే చచ్చిపోవాలనీతోచిన కొన్ని జాగ్రత్తలు చెప్పాను.

కానీ నా జబ్బు ఎంపిక వెనుకనున్నవి యిలాంటి రొమాంటిక్ కారణాలు కావు. కాస్త ప్రాక్టికల్ కారణాలు. నాకు రచయితల రచనల్నే గాక, వాళ్ల జీవిత చరిత్రల్నీ పట్టించుకునే అలవాటుంది. నాకు తెలిసిన పాశ్చాత్య రచయితల్లో చాలామంది ట్యుబర్క్యులోసిస్ (క్షయ) వ్యాధితోనే మరణించారు. కాఫ్కా, చెకోవ్, శామ్యూల్ జాన్సన్, కామూ, జాన్ రస్కిన్, రూసో, గోర్కీ, మపాసా, డి.హెచ్. లారెన్స్, జార్జి ఆర్వెల్, సోమర్సెట్ మామ్... యిలా ఒకరు కాదు యిద్దరు కాదు! బుద్ది పుట్టి వెతికితే వికీపీడియాలో పెద్ద జాబితానే కనిపించింది. మొదట్లో నేను అభిమానించే కాఫ్కా, చెకోవ్ లు నలభయ్యో పడిలోనే చనిపోవడం గురించి బాధపడుతూ దరిద్రగొట్టు జబ్బు పొట్టనపెట్టుకోకపోతే యింకెన్ని రచనలు చేసేవారోఅనుకునేవాణ్ణి. కానీ ఇపుడిపుడే ఏమనిపిస్తోందంటే, వాళ్లు అసలంటూ రచనా వ్యాసంగాన్ని నిబద్ధంగా అంటిపెట్టుకు వుండటానికి జబ్బు కూడా కొంత కారణమేమోనని. దీని కారణంగానే కాఫ్కా ఉద్యోగం నుంచి విరివిగా సెలవలు తీసుకుని ఎక్కువకాలం శానిటోరియాల్లో గడపాల్సి వచ్చింది, తత్ఫలితంగా బోలెడంత ఖాళీ దొరికింది. నిజంగా రచనలు చేయడానికి ఖాళీని ఎంతవరకూ ఉపయోగించుకున్నాడన్నది అప్రస్తుతం. తన చుట్టూ మధ్యతరగతిలాగా మామూలు వృత్తి సంసార జీవితాల్లో యింకిపోకుండా, ప్రపంచాన్ని బయటి నుండే సావకాశంగా పరికించే అవకాశం దొరికింది జబ్బు వల్ల. శామ్యూల్ జాన్సన్, డి.హెచ్. లారెన్స్ విషయంలోనూ ఇంతే. జబ్బే లేకుంటే కామూ రాతల జోలికి పోకుండా ఎంచక్కా పుట్బాల్ ఆటగాడిగా కుదురుకునేవాడు. రచనా వ్యాసంగానికి ఒకరకంగా ఆదర్శ స్థితి అనదగ్గ సంరంభరహితమైన సన్యాసి తరహా జీవితాన్ని వీళ్లలో చాలామందికి తప్పనిసరి చేసింది జబ్బు.

ఇదే నా ఎంపికకి కారణం. ఇక్కడ (అంటే భూమ్మీద) రచయితగా మాత్రమే మసలుకోవడమంటే కష్టం. దాంతో పాటూ ఏదో ఒకటి చేయాలి. కోరేది శుద్ధంగా ఒక్క రాయడం మాత్రమే అయి, అది తప్ప వేరే పనైనా కషాయం పొలమార్చుకున్నంత చేదు కలుగుతున్నపుడు, పరిస్థితి యింకా దుర్భరం. చుట్టుప్రక్కల వాళ్లు మీరేం చేస్తున్నారని అడిగాక, “రాస్తుంటానుఅన్న సమాధానం వచ్చిందే తడవు, ఎందుకో హఠాత్తుగా తెలుగుభాష అర్థం కాని వాళ్లయిపోతారు. “దాంతోపాటూ?” అనో, “అంటే నా ఉద్దేశ్యం ఉద్యోగం అండీ?!” అనో, “ఒహో! పత్రికలో పనిచేస్తుంటారు?” అనో అడుగుతుంటారు. కాబట్టి చచ్చినట్టు ఉద్యోగమైతే విలువైన సమయాన్ని రాక్షసబల్లిలా నమిలి మ్రింగేస్తుందో దాని పేరే కృతజ్ఞత చూపిస్తూ నెమరువేసుకోవాలి. ఇంట్లో వాళ్లయితేవెధవకి యింకా చిన్నతనం పోలేదని సమాధానపడి, సణుగుళ్లను పట్టించుకోకపోవడం అలవాటు చేసుకుంటారు. ఇదంతా పక్కనపెట్టి, పోనీ నిజంగా ఉద్యోగం అవసరం లేకుండా బ్రతకగలిగే స్థితి వచ్చినా, మరింకదేని జోలికీ పోక రచనకే అంకితమయ్యే ఆత్మనిగ్రహం వుంటుందా అంటే అదీ అనుమానమే. ఆరోగ్యవంతమైన ఒక రచయితకి జీవిక గురించి ఆలోచించకుండా రోజుల్ని బేఫికరుగా గడిపే అవకాశం వచ్చిందా, వాడికి ప్రపంచంలో రాయడం తప్ప అన్నీ పనికొచ్చే విషయాలు గానే కనిపించడం మొదలుపెడతాయి. అందుకే, యిలా వెంటనే చంపేయకుండా, అలాగని అందర్లా మరీ సుఖంగా బతనివ్వకుండా వాయిదాలపద్ధతిలో పీడించే రోగం వచ్చిందా... యిక రాత తప్ప ఏమీ గుర్తు రాదు.

యిలాంటి జబ్బుకి యెలాగూ నగరజీవితం అచ్చిరాదు. కల్లోలంగా కాలుష్యంగా కుత్సితంగా, ప్రకటనల హోర్డింగులతో, ట్రాఫికు లైట్లతో, మీటర్ ఆటోలతో, పొగతో, ఇంటివోనర్లతో, రోడ్డు మీద పదేళ్లుగా తిరుగుతున్నా ఎన్నడూ పునరావృతం కాని అపరిచిత మొహాలతో... అనునిత్యం మన భుజాల మీద అటూయిటూ కాళ్ళేసి పీకనొక్కుతూ కూడా తన బరువుమోయమని పీక్కుతినే నగర జీవితాన్ని వదిలి, సుఖంగా పల్లెటూరికో పోతాం. ఎక్కడైతే పగళ్లు పిచికల్తో పాడతాయో, మధ్యాహ్నాలు మాగన్నుగా జోగుతాయో, సాయంత్రాలు తెలిసిన మొహాల్తో పలకరిస్తాయో పల్లెటూళ్లలోకి పోతాం. చుట్టుప్రక్కలవాళ్లు మీరేం చేస్తున్నారని అడిగితేనాకు ఫలానా రోగమండీ, ఏం చేయనుఅని చెప్పి వాళ్లని బోలెడు సంతృప్తి పరచవచ్చు (అపుడు కూడారాస్తుంటానుఅన్న సమాధానం దిగమింగాల్సి వచ్చినా, ఉద్యోగం పేరు కన్నా రోగం పేరైనా నయమే). ఇంట్లోవాళ్ళు పాపం మంచివాళ్లు. మనకి రెక్కలున్నంత కాలమూ మన మంచి కోసమే ఎగరమని గూట్లోంచి ఎగదోస్తారు. రెక్కలు కాస్తా విరిగిపోతే ఎలాగూ సాకుతారు. యిక ఆత్మనిగ్రహమూ అవసరం లేదు. ఎందుకంటే, అపుడు రాయడం తప్ప పెద్దగా మరేమీ చేయలేము కాబట్టి.

పైన ఏవో ప్రాక్టికల్ కారణాలన్నాను కదూ. Well, this is about as practical as I can get. I want Tuberculosis, and I want it now! :)

.

10 comments:

 1. Well one of the side effects of the so called human evolution - they now have a cure for tuberculosis. :)

  You better look for another malady!

  ReplyDelete
 2. ha ha ha .. What a reason to be writer.. :-) you dont need those complicated problems though.. All you need is an unsolved headache like chalam to pull you out from other things. :-)

  ReplyDelete
 3. Anonymous10:10 PM

  “నాకెపుడూ క్షయ లాంటి ఏదో శాశ్వతమైన జబ్బు రావాలని వుంటుంది” -
  సరదాగా రాసినట్లున్నా, అంతర్లీనంగా మీ వ్యక్తిత్వరీత్యాగా మీరేర్పరుచుకున్న ప్రతిభ,ఆసక్తి [ అదే రచనా వ్యాసంగం] పట్ల మీ అనురక్తి చక్కగా వెల్లడి చేశారు. దిశానిర్దేశం కూడా ఎంచుకున్నారు. అయితే, "సంరంభరహితమైన సన్యాసి తరహా జీవితాన్ని" ఒక జబ్బు వలన గడిపి [తద్వారాగా రచనలు చేసిన] రచయితల జాబితా [తెలుగువారివీ చేరిస్తే కాస్త సంపూర్ణమయ్యేదేమో] ఇచ్చినట్లే, మీ అభిప్రాయం "ఆరోగ్యవంతమైన ఒక రచయితకి జీవిక గురించి ఆలోచించకుండా రోజుల్ని బేఫికరుగా గడిపే అవకాశం వచ్చిందా, వాడికి ప్రపంచంలో రాయడం తప్ప అన్నీ పనికొచ్చే విషయాలు గానే కనిపించడం మొదలుపెడతాయి." అన్నదాన్ని బలపరచటానికో ఉదాహరణ ఇస్తే [మీరేనంటారా కొంపదీసి? ;)] బావుండేది.

  రచన రాయటం - అర్థం చేసుకోవటం రెండూ వైయుక్తికం కనుక, అది సూనృతం, జీవితానుభవం కావాల్సిందేనన్న పట్టింపు నాకు లేవు కనుకా, మీ రచన నిగూఢంగా తెలిపిన సాధారణ జీవితం పట్ల మీ నిరాసక్తిని, రచనల పట్ల మక్కువనీ మాత్రం గ్రహించి - అంతా మీరకున్నట్లే జరగాలని అభిలషిస్తున్నాను. :)

  ReplyDelete
 4. Anonymous9:38 PM

  Its so interesting, is it not, that the observer wants to be totally free of the experiences that he wishes to note, analyse and reflect and yet so very difficult to achieve.

  Leaving alone the practical dificulties of being able to achieve that, will there be any substance in the reflections if they are not tinged by the varying hues of the glasses worn?

  ఊపిరాడకుండా బరువేస్తున్న భేతాళుని మేలు మనం మరిచిపోతామేమో ఒకోసారి. ముఖ్యంగా ఎడతెగని పోరాటంలో తనమునకలవుతూ విధివశాత్తో,రెక్కల సత్తువ పుణ్యమా అనో ఒక్కసారిగా గుండెల నిండా తీసుకోగలిగిన ప్రాణవాయువుల హాయిని నిజంగా అనుభూతించి ప్రతిఫలింప చేయగలగిన అనుభవైక్య సత్యసౌందర్యం ఒడ్డున కూర్చుని నిర్వికారంగా చూసే వారికి సాధ్యమేనా అన్నది అనుమానమే.

  స్థితప్రజ్ఞత (సంరంభ రాహిత్యం అని మీరన్నది ఇదేనేమో అనుకుంటున్నా...సన్యాసి, ఆదర్శ స్థితి అన్నారు కాబట్టి) రచనా వ్యాసంగానికి మూలపట్టైన స్ఫందన-ప్రతిస్ఫందనలను కాలరాసేస్తుందేమో?

  కాకపొతే తోటి వారంతా బడిలో పాఠాలు నేర్చుకుంటుంటే రోజుల తరబడి ఇంటిపట్టున చెట్టు కింద హాయిగా కుర్చీ వేసుక్కూర్చుని నీరెండన "నూరీ, నూరీ........"అంటూ వచ్చే రేడియో పాటలోని సౌందర్యం నుంచి భాధ్యతలను తూకం వేసి మరీ ఇతరులకు బట్వాడా చేసేసి మనసు వాటానికి ఎటు పొతే అటు పొమ్మని వదిలేసిన గాలిపటంలా జీవితం ఏ కొమ్మకు తగుల్తుందో, యే మాన్జాతో పెనవేసుకుని తన ఉనికినే కోల్పోతుందో అని గమనించటంలో ఉన్న ఆనందం వరకు అనుభవించిన నేను మీ ఈ టపాలోని అంతర్లీనమైన స్వేచ్చేచ్చను అభినందించగలను. ఆ స్వేచ్చ మీకు కలగాలని అభిలషిస్తూ....

  ReplyDelete
 5. "కాకపొతే తోటి వారంతా బడిలో పాఠాలు నేర్చుకుంటుంటే రోజుల తరబడి ఇంటిపట్టున చెట్టు కింద హాయిగా కుర్చీ వేసుక్కూర్చుని నీరెండన "నూరీ, నూరీ........"అంటూ వచ్చే రేడియో పాటలోని సౌందర్యం "

  Ahhh. There I find another soul like me. ఈ స్పేస్ టైం కంటిన్యుయం లో మీరెక్కడున్నారో అప్పుడు, కానీ అప్పుడే అదే అనుభూతి(డిట్టో వర్డ్ టు వర్డ్) తీయటి మాధుర్యం ముందు గుండెని తడిపి, తరవాత వళ్ళంతా నింపేసిన అనుభవం ఇప్పటికీ గుర్తుంది. నూరీ నూరి యే కాదు, ఇంకా అలాంటివే కొన్ని. ముఖ్యంగా "నీరెండ"న కళ్ళు మూసి అందులోకి జారుకోవటం. ఊళ్ళో మధ్యాన్నానికి ముందు, పొలం లో గడ్డి వాము, నీరెండ, తీయటి సంగీతం అవి నా జీవితంలో గతించిన, ఇంకెప్పటికీ తిరిగిరాని క్షణాలు.

  సారీ, వ్యాఖ్య పెద్దదయిపోయింది. కాని ఒక్కసారి తేనెతుట్టి కదిలింది.

  ReplyDelete
 6. @ Anonymous,

  మీ కామెంటు నాకు చాలా నచ్చింది. ముఖ్యంగా ఈ పోలిక: "ఊపిరాడకుండా బరువేస్తున్న భేతాళుని మేలు మనం మరిచిపోతామేమో ఒకోసారి" చాలా బాగుంది.

  ప్రపంచ సంరంభం నుంచీ బయటకుపోయి నిలబడితే అనుభవాలకు బహిష్కృతులమై రచనల్లో చేవ తగ్గుతుందన్నది పూర్తి నిజం కాదేమో. అసలు దాన్నుండి బయటకు పోవడమన్నదే లేదేమో. ఎక్కడకు పోయినా ఏదో ఒక రీతిన, ఏదో ఒక సాంద్రతతో, అది మన చుట్టూ అల్లుకునే వుంటుంది. దాన్నుంచి కాదు బయట పడాలని ఆశించేది — ప్రతీ రోజూ ఆ మునుపటి రోజుకు నకల్లా మారి, జీవితాన్నొక అసంకల్పిత ప్రతీకార్య చర్యలా మార్చేసే అలవాటనే మృతప్రాయమైన స్థితి నుంచి. ఆ స్థితి జీవితాన్ని కుదమట్టంగా అణగదొక్కేస్తుంది. సార్థకమైన రోజుల్ని కూడిక వేస్తే ఏడాదికి ఏ వారమో జీవిస్తాం. జీవితానికి ఏ ఏడాదో...! దీనికి భిన్నంగా నిర్వాపారంగా వుండే సన్యాసి తరహా జీవన విధానం (సన్యాసి తరహా స్థితప్రజ్ఞత కాదు) రచయిత మనసుని నెమ్మదింప జేస్తుంది. క్రమేపీ అలాంటి మనసు ఏ చిరుస్పందనకైనా, అపుడే అంటకత్తెర పడ్డ మెడ మీద మసలే గాలిలాంటి ఏ చిరు తాకిడికైనా, ప్రతిస్పందించే స్నిగ్ధత్వాన్ని పొందుతుంది. యిక అనుభవాలంటారా... అవి ఏ జీవితానికైనా తప్పవు, ఎంత సన్యాసి తరహా జీవితానికైనా. అనుభవైశ్వర్యమనేది దాన్ని గుర్తించగల మనసు నైశిత్యం మీద ఆధారపడివుంటుందేమో.

  I don't want to be free from the experiences I wish to note. I just want to be free first, and then note whatever experiences that are my lot. Cause, however peripheral it may be, no life is denied experiences.

  ReplyDelete
 7. "అంటకత్తెర పడ్డ మెడ మీద మసలే గాలిలాంటి ఏ చిరు తాకిడికైనా,..."

  ఓహ్! ఈ మాటలకి నా మనస్సు రెక్కలు తొడిగి ఎక్కడికో ఎగిరిపోయింది!

  ReplyDelete
 8. Anonymous12:09 AM

  కుమార్ గారు....సేం పించ్ అయితే మరి :-)

  మెహెర్ గారు,
  మెడ మీద అంటకత్తెర.....సూపర్, నా ట్యూబ్లైట్ వెలగటానికి ఓ నిముషం పడ్డా!!

  ఉమ్.....అయితే బాదరబందీ లేని జీవితం కావాలంటారు.....అలాటి జీవితం ఇచ్చే మనఃస్థితికై మీకు ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు.

  ReplyDelete
 9. మెహెర్ గారు,అక్షరాలపై మీకున్న ప్రేమ బాగుంది . మొన్నెపుడో ఒకరి రచన చదివాక మీరు రాసింది చటుక్కున గురుతోచ్చింది , :) .మీరు చదివారో లేదో గానీ లింకు ఇస్తున్నాను చూడండి .
  http://poddu.net/?q=user/49

  ReplyDelete
 10. విజయగారు, ఈ కథ ఇదివరకూ చదివాను. పంచుకున్నందుకు కృతజ్ఞతలు!

  ReplyDelete