May 25, 2011

కాఫ్కా - బ్లూ అక్టేవో నోట్‌బుక్స్ నుంచి...

ఎట్టకేలకు మా సైన్యాలు దక్షిణద్వారం గుండా నగరంలోకి చొరబడటంలో సఫలమయ్యాయి. నా దళవిభాగం మాత్రం నగరశివార్లలోని ఒక తోటలో, సగం కాలిపోయిన చెర్రీ చెట్ల మధ్య మకాం వేసి, తదుపరి ఆదేశాల కోసం ఎదురుచూస్తోంది. కానీ ఎప్పుడైతే దక్షిణద్వారం నుంచి పెద్దగా జయభేరుల మ్రోత విన్నామో, యిక మమ్మల్నేదీ పట్టివుంచలేకపోయింది.  అస్తవ్యస్థంగా ఎవడికి ముందు దొరికిన ఆయుధాలు వాడు తీసుకుని, ప్రతీవొక్కడూ సహచరుని చుట్టూ చేయి వేసి, మా యుద్ధ నినాదం కహీరా కహీరా!ను అరుచుకుంటూ, బురదనేలల గూండా బారులు తీరి నగరం వైపు నడిచాం. దక్షిణద్వారం వద్ద మాకు కనపడిందల్లా శవాలూ, పసుపు పొగా నేల అంతా వ్యాపిస్తూ అన్నింటినీ కనుమరుగు చేస్తూ. కానీ మేం కేవలం అంతా ఐపోయాక వచ్చిన దండుగా మిగిలిపోదల్చుకోలేదు, దాంతో వెంటనే, యింకా యుద్ధపు తాకిడి తగలని యిరుకైన ప్రక్క సందుల్లోకి మళ్ళాం. మొదటి యింటి తలుపు నా గొడ్డలి క్రింద తునకలైంది. మేమెంత ఉన్మాదంతో గదిలోకి చొరబడ్డామంటే మొదట కాసేపు అయోమయంలో ఒకరిచుట్టూ ఒకరం కలదిరిగాం. పొడవైన ఖాళీ నడవా గూండా ఒక ముసలివాడు మా వైపు వచ్చాడు. వింతైన ముసలివాడు అతనికి రెక్కలున్నాయి. వెడల్పాటి, విచ్చుకున్న రెక్కలు, వాటి అంచులు అతని కన్నా ఎత్తు వున్నాయి. అతనికి రెక్కలున్నాయి!నేను నా సహయోధుల వైపు అరిచాను. మేం కాస్త వెనక్కు తగ్గాం, వెనక నుంచి తోసుకొస్తున్న వాళ్ళు ఎంత వీలుపడనిస్తే అంతవరకూ. ముసలివాడన్నాడు, “నువ్వు ఆశ్చర్యపడుతున్నట్టున్నావు. మా అందరికీ రెక్కలున్నాయి, కానీ అవి మాకు ఒనగూర్చింది ఏమీ లేదు, వాటిని పెరికేసుకునే వీలుంటే అలాగే చేసివుండేవాళ్ళం.” “నువ్వు ఎందుకు ఎగిరిపోలేదు?” అడిగాన్నేను. మా నగరాన్నించి బైటకి ఎగిరిపోవాలా? మా యింటిని విడిచిపెట్టి? మృతుల్నీ, దేవతల్నీ విడిచిపెట్టి?”


[Translated from Kafka's "Blue Octavo Note Books"]

15 comments:

 1. Thank you.. Nice Translation

  ReplyDelete
 2. This comment has been removed by the author.

  ReplyDelete
 3. వంశీ గారు,

  ఆంగ్ల మూలం:

  At last our troops succeeded in breaking into the city through the Southern gate. My contingent encamped in a suburban garden, among half-burnt cherry trees, waiting for orders. But when we heard the high clangor of the trumpets from the southern gate, nothing could hold us any longer. With whatever weapons each of us had snatched up, in disorder, each with an arm round his comrade, yelling our battle cry of "Kahira Kahira," we trotted in long columns through the marshes toward the city. At the Southern gate all we found now were corpses and yellow smoke, billowing over the ground and hiding everything from sight. But we did not want merely to be the rear guard and at once turned into narrow streets that had hitherto remained unscathed by the battle. The door of the first house splintered under my ax, and so wildly did we push into the hall that at first we were churning around each other in confusion. An old man came towards us out of a long empty passage. A strange old man--he had wings. Wide, outspread wings, the tips taller than himself. "He has wings," I called out to my brotehrs-in-arms, and those of us in front fell back somewhat, as far as we could for those behind, who were pushing on. "You are amazed," the old man said. "We all have wings, but they have not been of any avail to us and if we could tear them off, we would do so." "Why did you not fly away?" I asked. "Fly away out of our city? Leave home? Leave the dead and the gods?"
  ==========================

  జెర్మన్ మూలం:

  Endlich gelang es unsern Truppen, beim Südtor in die Stadt einzubrechen. Meine Abteilung lagerte in einem Vorstadtgarten unter halb verbrannten Kirschbäumen und wartete auf Befehle. Als wir aber den hohen Ton der Trompeten vom Südtor hörten, konnte uns nichts mehr halten. Mit den Waffen, die jeder zunächst faßte, ohne Ordnung, den Arm um den Kameraden geschlungen, »Kahira Kahira« unsern Feldruf heulend, trabten wir in langen Reihen durch die Sümpfe zur Stadt. Am Südtor fanden wir schon nur Leichen und gelben Rauch, der über dem Boden schwelte und alles verdeckte. Aber wir wollten nicht nur Nachzügler sein und wendeten uns gleich in enge Nebengassen, die bisher vom Kampf verschont geblieben waren. Die erste Haustür zerbarst unter meiner Hacke, so wild drängten wir in den Flur ein, daß wir uns zuerst umeinanderdrehten. Ein Alter kam uns aus einem langen leeren Gang entgegen. Sonderbarer Alter – er hatte Flügel. Breit ausgespannte Flügel, am Außenrand höher als er selbst. »Er hat Flügel«, rief ich meinem Kameraden zu, und wir vordern wichen etwas zurück, soweit es die hinten Nachdrängenden erlaubten. »Ihr wundert euch«, sagte der Alte, »wir alle haben Flügel, aber sie haben uns nichts genützt und könnten wir sie uns abreißen, wir täten es.« »Warum seid ihr nicht fortgeflogen?« fragte ich. »Aus unserer Stadt hätten wir fortfliegen sollen? Die Heimat verlassen? Die Toten und die Götter?«

  ReplyDelete
 4. This comment has been removed by the author.

  ReplyDelete
 5. వంశీ గారు,

  శ్రద్ధగా మూలమూ, అనువాదమూ చదివి చేసిన మీ సూచనలకు కృతజ్ఞతలు.

  అయితే చిన్న ఇబ్బంది. నేను చేసిన అనువాదం కేవలం ఆంగ్లప్రతి చూసి చేసింది కాదు. పైన ఆంగ్లప్రతికి దిగువన జర్మన్ మూలం యిచ్చానే, దాన్ని కూడా పరిశీలించి, రెంటినీ సమన్వయించుకుంటూ చేసాను. నాకు వున్నట్టుండి జర్మనెక్కడ వచ్చి చచ్చింది అంటారా: గూగుల్ వాడి మక్కికి మక్కీ మెషీన్ ట్రాన్స్‌లేషన్ ఎందుకు పనికొచ్చినా పనికి రాకపోయినా, ఆంగ్లేతర రచనల్ని ఆంగ్లానువాదకులు ఎంత నిబద్ధతతో అనువదించారో తెలుసుకునేందుకు పనికివస్తుంది. యిక్కడ కాఫ్కా రచనని ఆంగ్లానువాదం చేసిన వారు కాస్త సొంత స్వేచ్ఛ తీసుకున్నారనిపించింది.

  ఆ రకంగా మీరు చేసిన నాలుగు సూచనల్లో రెండు వర్తించవు, ఒకటి నా పొరబాటు.

  >>> 1) ఒక దండు బయలుదేరాక , దానికి రక్షణగా నిలిచే దండు "రేర్ గార్డ్" కాబట్టి,

  అవును, "రేర్ గార్డ్" అన్న అర్థాన్నిచ్చే పదం నేను చేసిన అనువాదంలో లేదు. కానీ కాఫ్కా మూలంలో కూడా అది లేదు. అక్కడ కాఫ్కా వాడిన అసలు జర్మన్ పదం "Nachzügler". ఈ పదానికి గూగుల్ వాడూ, యితర జెర్మన్ డిక్షనరీలు ఉమ్మడిగా చూపిస్తోన్న ఆంగ్లానువాదం "stragglers". మీరన్నట్టు "రేర్ గార్డ్"కు అర్థం, ముందు వెళ్ళిన ఒక దండుకు "రక్షణగా నిలిచే దండు" అనే వస్తుంది. కానీ కాఫ్కా వాడిన "stragglers"కు అర్థం అది కాదు. ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ వాడి ప్రకారం:

  Straggler/ 'stæglǝ(r)'/ noun [usually pl.] a person or an animal that is among the last or the slowest in a group to do sth, for example, to finish a race or leave a place.

  కాబట్టి దీనికి "వెనుకబడ్డ దండు" అనేది బాగానే సరిపోతుందనిపిస్తుంది.

  2) అవును, మీరన్నట్టు "బురద నేల" కన్నా "చిత్తడి నేల" బాగా సరిపోతుంది. నాకు తట్టలేదు. సరి చేస్తాను.

  3) మీరు సూచించిన ప్రత్యామ్నాయాల్లో "చూసి" అనేది అదనంగా వస్తోంది. "సహయోధుల వైపు" అనేదే ఎందుకో అక్కడ సరిపోతోందనిపిస్తోంది. రెక్కలున్న ఓ ముసలవాణ్ణి చూసిన ఆశ్చర్యంలో ఆ సైనికుడు "సహయోధుల వంక చూసి" అరవడం కంటే, "సహయోధుల వైపు" గుడ్డిగా అరిచాడన్నదే నప్పుతుంది.

  4) మీరు నాలుగో పాయింటులో ఎత్తి చూపిన వాక్యం దగ్గర నేనొకలా మోసపోయా. నిజానికి ఆంగ్ల మూలం ప్రకారం "అస్తవ్యస్థంగా" అందుకునేవి ఆయుధాలన్న అర్థంతోనే తొలుత అనువదించాను. కానీ నేను చూసిన జర్మన్ ప్రతిలో వాడు కామా తప్పించడం వల్ల, ఆ తప్పు గూగుల్ వాడి అనువాదంలోనూ పడి, నేను పొరబడి మార్చాను. ఇప్పుడు మరో రెండు చోట్ల జర్మన్ ప్రతులు చూస్తే అక్కడ కామా వుందని తెలుస్తోంది. అట్లాగే మారుస్తున్నాను.

  "అనియతం" అనే పదాన్ని నాకు చాలాసార్లు డిక్షనరీలు "random"కు అనువాదంగా చూపించినప్పుడే వాడలేకపోయాను. కృతకంగా అనిపించింది. అది నెగెటివ్ వర్డ్ కదా. "నియతం కానిది". "random" అలాక్కాదు.

  ***

  [continued...]

  ReplyDelete
 6. నిజానికి పై ఆంగ్లానువాదంపై నాకు మరో పెద్ద అనుమానం వుంది. కాఫ్కా రాసిన జర్మన్ ప్రతిలో సైనికుడు తలుపు బద్ధలు గొట్టింది కాలితో అని వుంది, ఆంగ్లానువాదకుడు మాత్రం గొడ్డలితో అని రాసాడు. కానీ అంత పెద్ద తప్పు చేయగలడని నమ్మలేక, (మరోప్రక్క గూగుల్ వాణ్ణీ నమ్మలేక,) అలాగే అనువదించేశాను.

  యికపోతే, ఈ "భావం/ సారాల" అనువాదలంటే నాకు మంట. యిది విలువైనవి వదిలేసి, సులువైనవి అనువదించటానికి అనువాదకులు చెప్పే సాకు అని ఈ మధ్య కొన్ని అనువాదాల్నీ, వాటి మూలాల్నీ తరచి చూసిన తర్వాత అర్థమైంది. అనువాదాల విషయంలో నా ఆలోచనల్ని చెపుతూ యిదివరకూ ఓ పోస్టు రాసాను. అందులో చివరికీ నిశ్చయానికొచ్చాను: "ఈ అనువాదాల విషయంలో ఓ ఖచ్చితమైన దృక్పథాన్ని అంటిపెట్టుకుని వుండడం వెర్రితనమని నాకనిపిస్తుంది. ఒక అనువాదం విషయంలో స్వేచ్ఛని అవలంబించవచ్చా, లేక మూలానికి బద్ధులమై ఉండాలా అన్నది ఆ మూలం స్వభావాన్నిబట్టి నిశ్చయించాలన్నది నా అభిప్రాయం. పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రంలా నబొకొవ్‌కి, డాస్టొయెవ్‌స్కీకీ ఒకటే మూస అవలంబిస్తామంటే పద్ధతి కాదు." ఫలానా రచయిత గొంతు తెలుగులో అయితే ఎలా వుండవచ్చన్నది పాఠకునిగా పసిగట్టి, ఆ తీరున అనువదించడమే పద్ధతి తప్ప, అన్నిటికీ ఒకటే తీరు శోభించదని అర్థం చేసుకున్నాను. అనువాదాలు అనువాదాల్లా ధ్వనించడంలో పెద్ద తప్పేమీ లేదనిపిస్తుంది. అవి ఒకరకంగా ఉపయోగపడతాయి కూడా. ముఖ్యంగా మనకు పరిచయంలేని వాతావరణం గల రచనని తెలుగు చేస్తున్నపుడు, అనువాదంలా ధ్వనించే భాషలోని కొత్తదనం ఆ పరిచయంలేనితనాన్ని చక్కగా స్ఫురింపజేస్తుంది.

  కొందరి రచనలు చెప్పదల్చుకున్న భావాన్ని వారికున్న శైలిలో చెపుతాయి. మరికొందరిలో వారి శైలే భావాన్ని చెపుతుంది. రెంటినీ విడదీయలేము. యిలాంటి రచనల విషయంలో భావాన్ని అనువదిస్తున్నామంటూ మూలంలోని పదాల ఎంపికనీ, వాక్య నిర్మాణాన్నీ, శైలినీ నిర్లక్ష్యం చేస్తే ఆ అనువాదం వట్టి నిరర్థక రచన అవుతుంది. ఉదాహరణకి "పొద్దు"లో ఆ మధ్య నికొలాయ్ గొగోల్ "Dead souls"కి "మృతజీవులు" పేరిట ధారావాహికంగా వచ్చిన అనువాదం. గొగోల్ "డెడ్ సోల్స్"లో ఏ గుణం దాన్ని క్లాసిక్‌గా నిలబెట్టిందో అదేమీ ఆ అనువాదంలో మచ్చుకు కూడా కనిపించదు. "డెడ్ సోల్స్"లో ఏ పీడకల లాంటి వాతావరణం, గొగోల్ వాక్యాల్లో ఏ ప్రత్యేకమైన మెలిక, అతను ఎన్నుకునే ఉపమానాల్లో ఏ వింతదనం దాన్ని రష్యన్ సాహిత్యంలో యిన్నాళ్ల పాటు నిలబెట్టాయో, అవేమీ కొడవటిగంటి కుటుంబరావు అనువాదంలో వుండవు. కారణం, అనువాదకుడు "అభ్యుదయ రచయిత". మూలాన్ని అతను గొగోల్ ఉద్దేశించిన తీరులో కాక, (గొగోల్ దాన్ని నవల అని గాక, prose poem అని పిలుచుకున్నాడు)తన భావజాలం ప్రకారం వడగట్టి చదువుకున్నాడు. గొగోల్ శైలిని వదిలేసి అనువదించాడు, ఆ శైలిలేనప్పుడు యిక గొగోల్ అనేముంది, ఆ కాలంలో ప్రతీ రష్యన్ ప్రొలిటేరియన్ రచయితా చెప్తున్న కథే/ భావమే/ సారమే అందులో వుంటుంది. ఫలితంగా అది చదివిన వాళ్ళకి అందేది "Dead souls"కి ఒక soul dead version మాత్రమే.

  కాఫ్కా విషయంలో అతని శైలి ప్రాముఖ్యత ఏమిటో తెలిపే పోస్టు యిదివరకూ రాసాను. తెలుగు భాష వ్యాకరణమూ, తెలుగులో పద లభ్యతా కల్పించే వెసులుబాటును బట్టి, ఆయన వాక్యాలు వున్నవున్నట్టూ వస్తేనే బావుంటాయి.

  మీరు సూచించిన వ్యాసం యిదివరకూ చదివాను. నచ్చింది. మీరిచ్చిన లింకుల కోసం మళ్ళీ చూస్తాను.

  నాకు అనువాదాలే పనిగా పెట్టుకుని చేయాలన్న ఉద్దేశ్యమేమీ లేదు. తెలుగు భాష వనరుల్ని మరింత బాగా పరిచయం చేసుకోవటానికి వేరే భాష నుండి అనువాదాలు చేయడమన్నది మంచి కసరత్తని నా భావన. అలా ఒక ఎక్సర్‌సయిజు గానే నేను అనువాదాలు చేసేది. (కాబట్టి ఈ ఉద్దేశం నెరవేరాలన్నా, నాకు వున్నదున్నట్టు చేసే అనువాదాలే ఉపయోగపడతాయి.) ఎప్పటికైనా కాఫ్కా నవల "The Trail" అనువదించాలని మాత్రం బాగా వుంది. అది మాత్రం కసరత్తు కాదు. కాఫ్కాని చదువుతూంటే కలిగే స్వాప్నిక వాతావరణాన్ని (ఇదేదో భావుకతని సూచించేది కాదు, నిజంగా మెలకువగా వుండి కలలు కన్నట్టే వుంటాయి) తెలుగులోకి తీసుకురావాలన్నది ఆశ.

  ReplyDelete
 7. Manasa12:28 PM

  అనువాదం బాగుంది మెహెర్.

  "చిత్తడి నేలలు" - చక్కటి సూచన(వారిది), సవరణ(మీది).

  వంశీ గారి మూడవ వ్యాఖ్యతో నేనూ ఏకీభవిస్తాను. "వైపు చూసి" అన్నదే మూలంలో ఉన్న అర్థాన్ని సరిగ్గా ప్రతిఫలింపజేస్తోందని నా అభిప్రాయం. జర్మన్ నుండి గూగుల్ ఉపయోగించి ఆగ్లంలోకి అనువదించినప్పుడూ, అర్థం ఇలాగే వచ్చినట్టు తోచింది.


  కానైతే, రాసేటప్పుడు, రచయితకి మాత్రమే వరమయ్యే ఒక అదృశ్య దిక్సూచి, మిమ్మల్ని ఈ అభిప్రాయనికొచ్చేందుకు సాయపడిందని భావిస్తూ, దానిని గౌరవిస్తాను.

  -మానస

  ReplyDelete
 8. This comment has been removed by the author.

  ReplyDelete
 9. This comment has been removed by the author.

  ReplyDelete
 10. మీ వ్యాఖ్యలో చెప్పిన మాటలు నాకు వినబడినవి, నిలబడినవి, ఉపయోగపడినవీ కూడా. ఇక్కడ మిమ్మల్ని ఏదీ దెబ్బేసింది లేదు. ఎందుకంటే యిక్కడెవరూ దెబ్బలు వేయడం లేదు. :)

  యిక నాకు తర్వాతెపుడైనా ఉపయోగపడవచ్చనంటూ మీరు చెప్పిన భాగాన్ని పరిశీలిస్తాను. ముందు "ఈ తర్వాతెపుడైనా" అనేది నా చేత ఓ మాట చెప్పిస్తుంది. అది చెప్పేసిం తర్వాత ముందుకువెళ్తాను.

  మనలో చాలామంది జీవితానికి ఒక తప్పుడు పోలిక తెస్తారు. అది ఒక బిందువు నుండి మొదలై యింకో బిందువుకు పోతుందని నమ్ముతారు. ఈ నమ్మకంతో ఒక నష్టం వుంది. ఈ తీరున జీవితానికి అదెక్కడికో ముందుకుపోతోందన్న పోలికని ఆపాదించడం మనలో ఓ భ్రాంతిని పెంపొందింపజేస్తుంది. ఆ భ్రాంతిమయ లోచనాల్తోనే చుట్టూ వున్న అందర్నీ తూచడం మొదలుపెడతాం. తీర్మానాలకి వస్తాం. అలాంటి వ్యక్తి ఆలోచన ఎలా వుంటుందంటే: "ముందుకుపోయే ఈ జీవిత గమనంలో నేను యిక్కడ వున్నాను, యీ స్థితిలో వున్నాను, ఫలానా అభిప్రాయాలతో వున్నాను. నా తోటి వాడు అక్కడ వున్నాడు, ఫలానా స్థితిలో వున్నాడు, ఫలానా అభిప్రాయాలతో వున్నాడు. వాడు వెనకనున్నాడనుకుంటే నా దాకా చేరుకోవడం వాడి ఆదర్శం, లేదూ నేను వెనకనున్నాననుకుంటే వాడి దాకా చేరుకోవడం నా ఆదర్శం. ఏది ముందో ఏది వెనకో నిర్ణయించడానికి నా దగ్గర ఖచ్చితమైన కొలతలున్నాయి." యిదీ, తీరు! యీ తరహా ఆలోచన మజ్జాగతమైపోయిన మనుష్యసమాజం ఎపుడూ పరిగెడుతున్న దశలోనే వుంటుంది.

  Most people’s metaphorical reduction of life resembles that of a vertical hierarchy. We are ascending from stage to stage. From one floor to another. But the simple fact of the matter is: We all live (or, work at our lives) on the same floor. We just shift from one cubicle to another, until God feels the burden of management, and decides to go for a layoff. (I imagine an immortal life would be like a perpetual circling around this same floor!)

  సరే అదీ సంగతి! యిక విషయానికొచ్చేస్తాను.

  యిపుడు, మీరు నాకు చెప్పిందాంట్లో "ఒక రచనకు సంబంధించి" అని మొదలైన పేరా దగ్గర్నించీ, "అదీ లెక్క" అని పూర్తయిన తర్వాతి పేరా దాకా నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. మంచి మాటలు చెప్పారు. బహుశా యిది మీ అసలు వ్యాఖ్యకు కేవలం ఉపోద్ఘాతమనుకుంటా. అందుకే అనువాదం గురించి మామూలుగా అందరూ ఒప్పుకునే జెనరలైజ్డ్ సత్యాన్ని పునరుక్తించారు.

  >>> "...అవునా? మరి వాడిది మనం మన భాషలో రాసేప్పుడు మనవాళ్ళకే నచ్చకపోతేనో / అర్థం కాకపోతేనో?"

  అఫ్‌కోర్స్, అది అనువాదకుని పనితనంలో లోపాన్ని చెప్తుంది. అందులో అర్థం కానిదేముంది? మీ అభ్యంతరం, లేదా మీరు నాకు వివరింపజూస్తున్న విషయం ఏమిటి? అనువాదాన్ని వున్నదున్నట్టూ చేయకూడదూ, భావాన్ని బట్టీ చేయాలీ అనా? బహుశా మీరు నా వ్యాఖ్యలో కేవలం ఆ "వున్నదున్నట్టు" అన్న ముక్క పట్టుకుని ఆలోచిస్తున్నట్టున్నారు (ఆ ముక్కని పట్టుకునే గూగుల్ ట్రాన్స్‌లేషన్ల ప్రస్తావన తెచ్చారు), క్రింది వాక్యాలు చదివినట్టు లేరు:

  "ఫలానా రచయిత గొంతు తెలుగులో అయితే ఎలా వుండవచ్చన్నది పాఠకునిగా పసిగట్టి, ఆ తీరున అనువదించడమే పద్ధతి తప్ప, అన్నిటికీ ఒకటే తీరు శోభించదని అర్థం చేసుకున్నాను. "

  అనువాదానికి యింతకు మించిన విశాలమైన పరిధి ఏముంటుంది? అనువాదాన్ని మధ్యే మార్గమే లేని 2 వేర్వేరు పద్ధతులుగా విడదీసి చూడటం సరికాదు: (1) భావాన్ని మాత్రమే పట్టించుకుని వాక్యాల్నీ, పదాల ఎంపికనీ, శైలినీ నిర్లక్ష్య చేయడం. (2) వాక్యాల్నీ, పదాల ఎంపినీ, శైలినీ మాత్రమే పట్టించుకుని భావాన్ని నిర్లక్ష్యం చేయడం. యిలాంటి దృక్కోణం ఏ పొరబాటు ఆలోచన వల్ల వస్తుందంటే: ఒక రచనలో శైలి అనేది వేరూ, భావం అనేది వేరూ, రెంటికీ పరస్పరం నష్టం రాకుండా ఒకదాన్నించి ఒకటి వేరు చేసి చూడవచ్చూ అనుకోవడం వల్ల.

  continued...

  ReplyDelete
 11. Part 2

  పోనీ కొందరు రచయితల్లో అలా భావాన్నీ, శైలినీ వేరు చేసి చూడవచ్చనుకుందాం (నాకు తెలిసి వ్యాసాలు రాసే రచయితలే ఈ విభాగంలోకి వస్తారు). అపుడైనా, నేను "వున్నదున్నట్టు" అనువదించే పద్ధతి మంచిదన్నది అందరు రచయితల్నీ ఉద్దేశించి కాదు కదా? కాఫ్కా గురించి అన్నాను. మీరు నా యీ వాక్యాల్ని పట్టించుకుని వుంటే, ఈ చర్చే లేదు. "కొందరి రచనలు చెప్పదల్చుకున్న భావాన్ని వారికున్న శైలిలో చెపుతాయి. మరికొందరిలో వారి శైలే భావాన్ని చెపుతుంది. రెంటినీ విడదీయలేము." ... మరింత విడమరుస్తాను. కాఫ్కా లాంటి రచయితల్లో చెప్పదల్చుకున్న భావమంటూ వేరే ఏమీ వుండదు, సారమూ వేరే ఏమీ దొరకదు. వారిలో శైలే భావం. ఆ శైలి కల్పించే (ఆ శైలి మాత్రమే కల్పించగలిగే) వాతావరణమే అక్కడుండే భావం. శైలి అనేది రచయిత నుంచి ఏదో విడదీసి చూడాల్సిన విషయమనీ, అది అతని దృక్కోణానికి (ఆ దృక్కోణం నుంచి పుట్టే భావాలకీ) సంబంధం లేనిదనీ అనుకోవడం వల్ల వచ్చిపడే పొరబాటు అభిప్రాయాలివన్నీ. మీ కామెంట్‌లో మీరు వాడిన హాస్యాస్పదమైన వాక్యం ఒకటుంది:

  "అలా వాడుకోగలిగినప్పుడు ఎంతోటి కాఫ్కా రాసింది కానివ్వండి వారి తాతగారు రాసింది కానివ్వండి, అనువాదం అద్భుతంగా వస్తుంది. "

  కాఫ్కా రాసింది కాఫ్కా రాసినట్టు వస్తే అది అనువాదం అవుతుంది గానీ, అదేదో "అద్భుతం"గా వస్తే ఎవడిక్కావాలి? మూలంలో లేని అద్భుతాలు తేగలిగే వాణ్ణి, అనుసృజకుడూ అనవచ్చేమో. లేదా సొంతంగా రచయిత అన్న బిరుదాన్నీ యిచ్చేయచ్చు. మన భారత కవుల్ని కేవలం అనువాదకులు అనలేం కదా. అనువాదకుడు సాధ్యమైనంత వరకూ ప్రక్కకు తొలిగి, మూల రచయితకు దారి చూపిస్తాడు. అదృశ్యం కాగలిగే నేర్పు అతని ముఖ్య అర్హత. మూలంలో లేని అద్భుతాల్ని సృష్టించగలవాణ్ణి, మూలం మీద నిలబడి దానికి పై సంగతి వేయగలవాణ్ణీ చదివి అతని ప్రత్యేకత్వాన్ని అభినందించవచ్చు. కానీ విషయమేంటంటే, ఆ మూలం మనం యింకా చదవని రచనే అవుతుంది.

  మీ కామెంట్ రెండో భాగంలో కొన్ని వాక్యాలు పోలికలు ఏరి తెచ్చే ప్రయాసలో అవసరంలేని దూరాలు వెళ్లి ఆయాసపడుతున్నాయి:

  >>> కలలైనా, కథలైనా, స్వాప్నిక జగత్తైనా - కారణం భావనే. అంతటి ఆ భావాన్ని ఒడిసిపట్టుకోగలిగితే, భాష మీద పట్టు ఉన్నవాడికి మీరన్న ఆ మూల రచయిత శైలి, వాక్యం, పదాల ఎంపిక ఆ అనువాద నిర్మాణంలో ఓ పక్క గోడలుగా నిలబెట్టడం నల్లేరు మీద నట్టువాంగన నడకే.., ఆ పైన అలా నిలబెట్టిన గోడలకు వెల్ల వేయడం కూడా పెద్దపనేమీ కాదు.

  "కలలైనా, కథలైనా, స్వాప్నిక జగత్తైనా - కారణం భావనే." అవును, నేను మళ్ళీ మళ్ళీ చెప్పేదేమంటే, కొందరు రచయితల్లో ఆ భావనలు వ్యక్తమయ్యేది ఆ ప్రత్యేకమైన శైలి ద్వారానే. వాళ్ళను అనువదించేటపుడు శైలిని ప్రక్కగోడగా నిలబెట్టడం వల్ల కాదు, ఎందుకంటే అక్కడ భావానికి అదే అసలు పునాది. యిక పునాదికి వెల్లలు వేయనవసరం లేదు. దాని లక్ష్యం డాబుగా కన్పించడం కాదు. నిర్మాణాన్ని నిలబెట్టడం.

  మీరు భలే పోలికల్తో అసలు విషయానికి భలే దూరం జరగడమన్నది మరో సందర్భంలో కూడా జరిగింది. నాకు "భావం/ సారం" అంటే మంట అని యెక్కడా అనలేదు. "భావం/ సారం" ముఖ్యమంటూ శైలిని పట్టించుకోని అనువాదాలంటే మంట అన్నాను. మూలంలో విషయాన్ని వక్రీకరించిన/ పూర్తిగా వదిలేసిన అనువాదాలు కొన్ని నా దృష్టిలో వుండి ఆ మాట అనిపించాయి.

  >>> మూల రచయిత ఓ దిశలో వెడుతున్నాడని, మనమూ అదే దిశలో కళ్ళు మూసుకుని వెడితే మూలా నక్షత్రం వాడికొచ్చినన్ని కష్టాలు రావటమో, ఆ మూలకు వెళ్ళాక దిక్కు తోచక ఆగిపోటమో సంభవిస్తుంది అని నా ఘాట్టి నమ్మకం.

  అసలీ మాటకు ఏమైనా అర్థాన్ని ఉద్దేశించారా అన్న అనుమానం వస్తుంది. మూల రచయిత వెళ్ళే దిశలో వెళ్ళని వాడు అనువాదకుడెందుకు అవుతాడు? యిక్కడ మీ "కళ్ళు మూసుకుని" వెళ్ళడమన్న షరతు కీలకమైందంటారా? అవును, అపుడు అనువాదకుడు మూల రచయిత వెళ్ళే దిశలో "కళ్ళు తెరుచుకుని" వెళ్ళాలి. లేక మీ "మూలా నక్షత్రం" పోలికను చూసుకొమ్మంటున్నారా? చూసాను, అపుడు "వహ్వా!" :)

  పాఠకులకి మనమేం దారి చూపించే ప్రవక్తలం కానక్కర్లేదు. ముఖ్యంగా అది అనువాదకుల పని కాదు. వాళ్ళు, యిందాకే చెప్పినట్టు, పాపం "మూల" రచయితను వెలుగులోకి రానిస్తే చాలు. అపుడు పాఠకులకూ ప్రయాస వుండదు. అతడే యెదురేగి వాళ్ళని కలుసుకుంటాడు. ఏం చూపించాలో అతడే చూపిస్తాడు.

  ReplyDelete
 12. This comment has been removed by the author.

  ReplyDelete
 13. This comment has been removed by the author.

  ReplyDelete
 14. @ మాగంటి వంశీ మోహన్,

  చివరకు ధృవభేదాలని తీర్మానించారన్నమాట! సంతోషం! :) అయినా సరే...:

  >>> శైలి వేరు, భావం వేరు - అవి నా ప్రకారం ఖచ్చితంగా, పొరబాటు లేకుండా నీళ్ళూ పాలే...పాలూ నీళ్ళూ కలిస్తే పరస్పరంగా నష్టమో కాదో నీళ్ళపాలు తాగిన వాళ్ళు చెప్పవచ్చు..మీరనుకున్నట్టు కొందరిలో కాకుండా నాకు అందరిలో కనపడే దృశ్యమది. ఇక్కడ మీకున్న "కొందరు" లిష్టు నాకున్న "అందరి" లిష్టులోకి చేరిపోయింది కాబట్టి నా పొరబాటూ లేదు, మీ పొరబాటూ లేదు... :)

  యిందులో మీ పొరబాటని దేన్ని అంటున్నానో ఖచ్చితంగా వివరించగలను. అదో పెద్ద వ్యాసాన్ని తీసుకొస్తుంది. ఓపిక లేదు. కాబట్టి కొన్ని Proust మాటల్ని, వేరే సందర్భంలో వాటికి నా అనువాదాన్నీ ఊటంకించి ఊరుకుంటాను. (it's not like an appeal to authoritiy against your statement. Just my view on style expressed more elonquently, and by a far more accomplished man of letters.):

  "Style is not at all an embellishment as certain people think, it is not even a matter of technique, it is — like colour with painters — a quality of vision, the revelation of the private universe that each one of us can see and which others cannot see. The pleasure an artist affords us is to introduce us to one universe the more.”

  "కొందరు భావించేట్టు శైలి అనేది ఒక అలంకారం ఎంతమాత్రమూ కాదు, ఇది మెళుకువకు సంబంధించిన విషయమూ కాదు. చిత్రకారులకు వర్ణాలు ఎలాగో, అలాగే ఇది ఒక దృష్టి తత్త్వం, చూసే విధానం. మనలో ప్రతి ఒక్కరూ ఎవరికి వారు మాత్రమే చూడగలిగే — వేరెవ్వరూ చూడలేని — ఆంతరంగిక ప్రపంచపు వ్యక్తీకరణ. ఇలా మనకు ఒక ప్రపంచాన్ని అదనంగా పరిచయం చేయడమే కళాకారుడు మనకు ప్రసాదించే ఆనందం."


  పైన "శైలీభావాల"కీ, "నీళ్ళూపాల"కీ మీరు తెచ్చిన పోలిక గురించి ఒకటి చెప్పాలి. యిలా అసలు విషయాన్ని ఉపమానాల్లోకి దించి, ఆ ఉపమానాల్నుండి syllogisms లాగే వాళ్ళు చాలామంది వాటి ద్వారా ఏదో సత్యానికి చేరువవుతున్నామనుకుంటారు. నిజానికి యింకా దూరమయిపోతుంటారు. మీ పోలికా ఏవీ నిరూపించని బాపతే! (కుక్కా, చెప్పూ రెండూ కరుస్తాయి కాబట్టి, కుక్క క్షీరదం కాబట్టి, చెప్పూ క్షీరదమే లాంటి సిలాజిమ్స్ ఇవన్నీ. ఏవీ నిరూపించలేవు.)

  >>> మూలంలో లేని అద్భుతాలు తేగలగాలి అని నేనెక్కడా అనలేదే! ఒకసారి మళ్ళీ చదవండి...

  మీ ముందు కామెంటులో ("ఎంతోటి కాఫ్కా రాసింది కానివ్వండి వారి తాతగారు రాసింది కానివ్వండి, అనువాదం అద్భుతంగా వస్తుంది.") కాఫ్కా ముందు "ఎంతోటి" చేర్చడం, తర్వాత "వారి తాతగారు" చేర్చడం, అలాంటి భావనను కలగచేసింది. కాఫ్కా అంతోటి వాడిదైనా, వాడి తాతదైనా ఎలాంటి వాడిదైనా, వాడు రాసింది ఎలాంటిదైనా, మంచి అనువాదకుడి చేతిలో అనువాదం మాత్రం అద్భుతంగా వస్తుందన్నట్టు అర్థమైయింది! వివరణకు సంతోషం.

  సరే, నాకు కాఫ్కా అంటే యిష్టమని మీకు తెలుసనే అనుకుంటున్నాను. మీ రెండో కామెంటులో కూడా ఆయన్ని మరికొన్ని లేకి సర్వనామాల మధ్యన చేర్చారు, "కాఫ్కానో, ఇంకో తాతయ్యో, ఇంకో గొట్టంగాడో, చుట్టంగాడో ఎవడో రాసింది..." అంటూ! యిలాంటి అనవసరమైన చేతిచురుకు యిక్కడ (అంటే ఈ బ్లాగులో) సహించబడదని చెప్పాలి. ఆ చురుకు చుట్టూ ఎంత అవసరమైన సరుకు వున్నాసరే.

  ReplyDelete
 15. This comment has been removed by the author.

  ReplyDelete