June 16, 2011

మల్లెల యువరాజు (తమిళ జానపద కథ)

ఒకానొక రాజ్యంలో ప్రజలంతా రాజుని మల్లెల యువరాజుఅని పిలిచేవారు. ఎందుకంటే అతనెప్పుడు నవ్వినా మల్లెల పరిమళం మైళ్లవరకూ వ్యాపించేది. కానీ అతను తనంతటతాను నవ్వాలి. ఎవరూ కితకితలు పెట్టకూడదు. బలవంతపెట్టకూడదు. అలా జరిగితే మల్లెల పరిమళం రాదు.
       మల్లెల యువరాజు పాలించే రాజ్యం చిన్నది. సార్వభౌముడైన మరో మహారాజుకి విధేయుడై సామంతునిగా వుండేవాడు. ఆ మహారాజుకి ఈ వార్త చేరింది. కేవలం నవ్వడం ద్వారా మల్లెల పరిమళాన్ని వెదజల్లే ఈ వింతను తనే స్వయంగా చూడాలనుకున్నాడు. యువరాజుని తన రాజధానికి అతిథిగా ఆహ్వానించి, పురప్రముఖులంతా ఆహూతులుగా కొలువుదీరిన నిండుసభలో, నవ్వమని అడిగాడు. కానీ ఆజ్ఞాబద్ధుడై నవ్వడం యువరాజుకు చేతకాదు. ఎంతో ప్రయత్నించినా నవ్వలేకపోయాడు. మహారాజు దీన్ని అవమానంగా భావించాడు. మా ఆజ్ఞ ధిక్కరిస్తున్నాడు! మమ్ము పరిహసిస్తున్నాడు!అనుకున్నాడు. నవ్వే వరకూ యువరాజుని శివార్లలోని చెరసాలలో బంధించమని ఆదేశాలిచ్చాడు.
       చెరసాలకు సరిగ్గా ముందున్న గుడిసెలో ఒక అవిటివాడున్నాడు. వాడి ప్రేమలో పడిన రాజ్యపు పట్టపురాణి వాణ్ణి కలవడానికి ప్రతీ రాత్రీ రహస్యంగా గుడిసెకు వచ్చేది. ఆమె రాకపోకల్ని తన ఊచల కిటికీ నుండి గమనించాడు మల్లెల యువరాజు. ఇది నాకు సంబంధం లేని విషయంఅనుకుంటూ, తానేమీ చూడనట్టే మసలుకున్నాడు. ఒక రాత్రి రాణి రావడం కాస్త ఆలస్యమైంది. అవిటివాడు కోపం పట్టలేకపోయాడు. ఆమె రాగానే మీదపడి చితగ్గొట్టాడు. మొండి చేతులతో పొడుస్తూ, కుంటి కాళ్లతో తన్నాడు. ఆమె ఒక్కమాట అనకుండా దెబ్బలన్నీ భరించింది. వెంట తెచ్చిన రాచభోజ్యాలు అతనికి వడ్డించింది. ఆమె చేతి ముద్దలు తింటూంటే తన క్రూరత్వానికి పశ్చాత్తాపం కలిగింది వాడికి. నిన్ను కొట్టినందుకు బాధగా లేదా?” అనడిగాడు. ఆమె నవ్వుతూ అంది, “ఎందుకు బాధ! ఆనందంగా వుంది. ఒక్కసారే పద్నాలుగులోకాలూ చూసొచ్చాను!
       వాళ్ళిద్దరూ యిలా మాట్లాడుకుంటున్న గుడిసె బయట చూరు క్రింద చీకట్లో ఓ మూలగా పేద చాకలి వాడొకడు చలికి మునగదీసుకుని కూర్చున్నాడు. వాడి గాడిద ఎక్కడో తప్పిపోయింది. నాలుగు రోజులుగా దాని కోసం వెతకని చోటు లేదు. యిక ఎప్పటికీ దొరకదేమోనని దిగాలుగా వున్నాడు. యిపుడు రాణి అన్న మాటలు వినగానే, వాడికో ఆలోచన తోచింది, “ఈ మడిసి పద్నాలుగు లోకాలూ చూసొచ్చి వుంటే, ఈమెకి నా గాడిద ఏడనో కనపడే వుంటది!వాడు గుమ్మం వైపు తలతిప్పి లోపలికి వినపడేట్టు బిగ్గరగా అడిగాడు, “ఓయమ్మా! నా గాడిదనెక్కడన్నా చూసావా?”
       చెరసాల కిటికీ నుంచి యిదంతా వింటున్న మల్లెల యువరాజు, నవ్వు పట్టలేకపోయాడు. తెరలు తెరలుగా వెలువడిన నవ్వు చుట్టూ రాత్రిలోకి పాకింది. గాలిలో కొన్ని మైళ్ల మేర మల్లెల పరిమళం వ్యాపించింది. తెలవారడానికి యింకా కొన్ని గంటలు వుండగానే, చెరసాల భటులు పరుగుపరుగున వెళ్ళి మహారాజుకి నవ్వు సంగతీ, మల్లెల పరిమళం సంగతీ విన్నవించారు. పొద్దుపొడిచేదాకా ఆగలేకపోయాడు మహారాజు. వెంటనే మల్లెల యువరాజుని రాజభవనానికి రప్పించుకుని అడిగాడు, “స్వయానా మాకోసం నవ్వమని అడిగినపుడు నువ్వు ససేమిరా అన్నావు. యిప్పుడు నిన్ను, అదీ అర్థరాత్రివేళ, నవ్వించగలిగేంతటి గొప్ప సంగతేం జరిగింది?”
       యువరాజు తన నవ్వుకు కారణాన్ని దాయాలని చాలా ప్రయత్నిచాడు. కానీ రాజు పట్టుపట్టడంతో చివరకు నిజం చెప్పేసాడు. విషయంతా విన్న తరవాత మహారాజు రెండు ఆజ్ఞల్ని జారీ చేశాడు. ఒకటి మల్లెల యువరాజుని సాదరంగా అతని రాజధానికి పంపించడం, రెండు తన పట్టపురాణిని పట్టికెళ్ళి సున్నపు బట్టిలో కాల్చి చంపించడం. 

*  ——   *  ——   *

This is translated from a Tamil folktale `The Jasmine Prince' collected in A.K. Ramanujan’s “Folktales from India”. I have read only the first six tales. Some are good, like this one; and others are so-so. (I loved the 3rd para of this story especially, which seems like a story within the story. And I liked too the indifference rest of the story is maintaining towards it.) I am particularly fascinated by how amoral all these tales are. They deny you any moral vantage point to judge from. I liked it. I wish that tradition had sustained, without Victorian morality of  the British strangling it in the midway.


28 comments:

 1. ఇది కూడా బాగా వచ్చింది.

  Agree with your concluding remarks.
  I wonder if you've read Burton's translations of Arabian Nights. Many tales are full of such amorality.

  ReplyDelete
 2. I have Burton's Arabian Nights with me for quite some time. Persistent recommendation of Borges made me buy it. But haven't started reading yet. Have to, soon.

  ReplyDelete
 3. You probably have a single volume which is still good.
  Burton's complete translation was published as 17 volumes - the language is reasonably archaic, but because they are unabridged (and Burton swears he did not bring his British sensibilities to edit/censor the original in anyway), the width and breadth of imagination in there is breathtaking. And I am sure a lot of it is social commentary too on the lifestyle at that time - so a lot of social history.

  ReplyDelete
 4. Yes, I have only one book with some 400 pages without any notes (and which doesn't speak of any abridgment, Liar!), and it has only 700 nights. Will try to get the full version. Thank you for the valuable info. Borges, in his essay "The Translators of The Thousand and One Nights", mentioned the delicious extravagance of Burton's translation, and how it suits the original. And he mentioned too, how some previous and successive translators like Galland and Mardrus toned down the pungency of the tales, or made them more "respectable", according to their sensibilities. He rated Burton's translation above them all. Thanks again.

  ReplyDelete
 5. చా...లా బాగుందండీ..

  ReplyDelete
 6. >>> I wish that tradition had sustained, without Victorian morality of the British strangling it in the midway.

  ద్రౌపది, రాధ,రేణుక.. అప్సరసలకున్న మినహాయింపు తీసేయగలిగితే ఇంకా బోలెడు కథలు. ఏ రాణీ ప్రేమ పురాణమైనా so called morality ని కాదనేవే కదా! Victorian morality ప్రభావం సాహిత్యం మీద అంత పడిందంటారా? మసి పూసి మారేడు కాయ చేసి పురాణాలు, పాతివ్రత్యం అనకపోతే పాపం, చలానికి ఇంత గుర్తింపూ, వ్యతిరేకతా వచ్చేది కాదేమో అనిపిస్తుంది. :)
  నేను చిన్నప్పుడు చదివిన పాకెట్ సైజ్ పావలా పుస్తకాలలో "సుగంధి" అనే ఓ కథ గుర్తొచ్చింది. ఆ పిల్ల నవ్వితే బంగారు పువ్వులు రాలుతాయి. కథ కొంచెం వెరే లెండి. :)

  ReplyDelete
 7. అవును. I can't summon forth any historical back-up. It's my intuition. విక్టోరియన్ మొరాలిటీ పునాదుల మీద — దాని విద్యావ్యవస్థ, దాని కచేరీల వ్యవస్థ అన్నీ యిముడ్చుకుని — పైకి లేచిందే కదా మన "great middle class". Killer of the culture!

  ReplyDelete
 8. రాణి బూడిదయిపోవటం చివుక్కుమంది.
  మీరు రాసిన ఆ చివరి పారా ఆలోచింప చేసింది.

  మీ ప్రకారం రచయిత సమాజానికి అద్దం పట్టడమేనా చేయాల్సింది?

  ఇంతకు ముందు వేరే వ్యాసంలో ఉటంకించిన విరాగితనమా మీరు అంటున్న ఈ ఎమొరాలిటీ?

  పైగా great middle class is the killer of the culture అంటున్నారు. నేనేమో మధ్యతరగతి వాళ్ళే మన సంస్కృతికి దర్పణాలు అన్న అభిప్రాయంలో ఉన్నాను. కొంచం వివరించగలరా?

  ReplyDelete
 9. భావకుడన్ గారు,

  "రచయిత సమాజానికి అద్దం పట్టాల"న్నది నా ఉద్దేశ్యం కాదు. నేను ఎక్కడ ఆ అర్థం వచ్చేట్టు మాట్లాడానో గుర్తు రావటం లేదు. రచయిత తన అంతర్లోకానికి అద్దం పట్టాలని మాత్రం అనుకుంటాను. (అది బహిర్లోకంతో విభేదిస్తుంది. అసలు బహిర్లోకమనేది ఏదీ లేక, వున్నా తెలీక, మనకు గ్రాహ్యమయ్యేదంతా మన అంతర్లోకంతో పాటూ మన తోటి మనుషుల అంతర్లోకాల ఉజ్జాయింపు సారాంశం మాత్రమేనేమో కూడా. యిదంతా వ్యక్తుల తాత్త్విక మూలాల్లోకి పోతుంది. యిక అప్పుడు ఎవరి నమ్మకాలు వారివవుతాయి.)

  నేను అంటున్న "ఎమొరాలిటీ" విరాగితనం కాదు. వైరాగ్యం అంటే ఇహం పట్ల ఏ రాగమూ లేకపోవడం కదా. "ఎమొరాలిటీ" అంటే ప్రపంచాన్ని నైతికం - అనైతికం అనే చట్రాల్లేకుండా చూడగలగటం. (వైరాగ్యం వల్ల యిదీ వస్తుందేమో, కానీ వైరాగ్యమంటే యిదే కాదు.) తెలుగులో ఈ పదానికున్న సమానార్థకాలకు వాడుకపరంగా negative connotations ఏర్పడిపోయాయి. యిపుడు "నీతిబాహ్యం" అన్నా "immoral" అనే అర్థమే వస్తుంది. "amoral"కు తెలుగులో వేరే పదం లేదు. కానీ ఆంగ్లంలో "amoral", "immoral" రెండూ వేర్వేరు అర్థాల్నిచ్చే పదాలు. బహుశా మొదటిదాన్ని తెలుగులో "అధినైతికం" అనే పదంతో సూచించవచ్చునేమో.

  Artist is ideally an amoral being. In the act of creation, he dispenses with moral distinctions. His private morals as a person don't affect his creations in any palpable way. Nothing is taboo for him to pick up. And that amoral outlook, I reckon, comes naturally to persons with either aristocratic or proletariat upbringing. But not to a person coming from middle class. Even if, as an artist, he achieves that amoral ideal in his creations, he is all too conscious of a transcendence, a crossing of the barrier (like in Chaa.So); where as, an artist with aristocratic origins (like Proust) or proletariat origins (like Namini), don't even see any transcendence in it. Because, he is not even conscious of any such distinctions like "moral" and "immoral" to begin with. Or, even if he is conscious of them, he doesn't feel in anyway obligated to them — either to concur or to refute.

  And what do I mean when I said that the "great middle class is killer of the culture"? First I should tell you that, in the present context, I am not using the terms "aristocratic", "proletariat" and "middle class" as representing economical distinctions. I am considering each of them as representing a set of values and aspirations typical to those social entities. And in the case of "middle class", their values are petty, and their aspirations are dwarfish and vulgar.

  మన చుట్టూ మధ్యతరగతిని చూస్తే విశదమయ్యేదే కదా యిదంతా. వారి విలువలు మెటీరియలిస్టు విలువలు. చదువు జ్ఞానం కోసం కాదు, జీవిక కోసం. జీవిక ఆనందం యివ్వనక్కర్లేదు, జీతం యిస్తే చాలు. పెళ్ళి ప్రేమ ఫలితం కాదు, సాంప్రదాయికమైన కట్టుబాటు. కళలు జీవితానందానికి ప్రతీకలు కాదు, కాలక్షేపాలు. భాష పట్ల ఆప్యాయత లేదు. "నా భాషకున్న పరిమితులే నా ప్రపంచానికున్న పరిమితులు" అనే విట్గన్‌స్టెయిన్ మాటల్లో అర్థం కూడా బోధపడదు. ఏదీ మూలాల్తో అర్థం చేసుకోనక్కర్లేదు, పైపైన తడిమేస్తే చాలు. జీవితం పట్ల యే తాత్త్వికావగాహ అవసరం లేదు. ఆ అన్వేషణ చేసే గాయాలంటే బెరుకు. తప్పుకుపోయినా పోయేదేం లేదు. పరంపరగా తిరుగుతున్న మర చక్రాల క్రింద మందతో పాటూ దూరి ఎవరూ వేలెత్తి చూపడానికి వీల్లేకుండా అవి ఎటు చేరిస్తే అటు చేరి ఒక శుభక్షణాన నిద్రలో చచ్చిపోతే చాలు. వీళ్ళలో నాకు సంస్కృతి వినాశకులు కనిపిస్తున్నారే తప్ప, పరిరక్షణ మాట అటువుంచి, అదొకటివుందన్న స్పృహ వున్నవారు కూడా నాకు కనపడటం లేదు.

  ReplyDelete
 10. amoral - నైతికాతీత అనవచ్చేమో.

  May be a very basic question. "Artist is ideally an amoral being." - Why? Why cannot morals (believed by an artist) be reflected in his art?

  "And in the case of "middle class", their values are petty, and their aspirations are dwarfish and vulgar." - As compared to ?

  మీరు మధ్యతరగతి లక్షణాలుగా వివరించినవి చాలా మటుకు ఎగువ మధ్యతరగతి, ధనవంతుల (ఆర్థిక) వర్గాలలో కూడా (typically) కనిపిస్తాయి నాకు, మన దేశంలో. కాదంటారా? మరి అవన్నీ ఉన్నవాళ్ళని "మధ్యతరగతి" అనడంలో ఔచిత్యమేమిటి?

  Is the life of so-called middle-class people, not part of the culture? Is culture exclusively formed by some set of people in a society?

  ReplyDelete
 11. కామేశ్వరరావు గారు,

  Your “why” can be answered pretty easily. Artist is ideally amoral, because God is fundamentally amoral. That’s the beauty of his creation, this Universe, isn’t it? Imagine a God with a strictly personal moral code, who promptly punishes you for any transcendence. ఊహించండి, వాడి నైతికానైతికాల కోడ్ ఏమిటో మీకు తెలీదు. మీ ప్రతీ అబద్దానికీ కాస్త దూరంలో మిమ్మల్ని బురదగుంటలో పడదోస్తాడు, మీ ప్రతీ దురాలోచనకి నెత్తి మీద కాకి చేత రెట్టేయిస్తాడు. అలాంటి ప్రపంచంలో బితుకు బితుకూమంటూ మసలుకోవడం నాకైతే నచ్చదు. మన ప్రపంచాన్ని అలాంటి ప్రపంచం అనుకోవడం అంతకన్నా నచ్చదు. For me God lets you be. (If any atheistic impulse protests, you can replace the word with Nature, this benign nature.)

  రచయిత ఒక ప్రపంచాన్ని అల్లుతాడు, పాఠకునిగా నేను లోపలికి వెళ్తాను. I would like to delve in there like I want to. Free style! Without any sign posts dictating the proceedings and telling me “this is the proper way”, and “there you have to take a turn”, “Danger ahead, stop right there”. ప్రతీ రచయితకీ వ్యక్తిగా కొన్ని నైతికానైతిక విభజనలుంటాయి, కానీ వాటిని తన కాల్పనిక ప్రపంచంలో చొప్పించి వెదజల్లుతున్నాడంటే, అతను వ్యక్తిగా ప్రపంచాన్ని, ఈ నైతికాతీతమైన ప్రపంచాన్ని (ఈ పదమే బాగుంది), సొంత నమ్మకాలు ఏమాత్రం లోపలికి రానిస్తాయో ఆ మాత్రమే స్వీకరించి, ఆ పాక్షికత్వంతోనే వ్యక్తీకరిస్తున్నాడని అర్థం. I would rather be in a fictional world where every breeze is allowed to seep through. Where nothing is labelled.

  * — * — *

  ReplyDelete
 12. >>> మీరు మధ్యతరగతి లక్షణాలుగా వివరించినవి చాలా మటుకు ఎగువ మధ్యతరగతి, ధనవంతుల (ఆర్థిక) వర్గాలలో కూడా (typically) కనిపిస్తాయి నాకు, మన దేశంలో. కాదంటారా? మరి అవన్నీ ఉన్నవాళ్ళని "మధ్యతరగతి" అనడంలో ఔచిత్యమేమిటి?

  దేనికైనా మినహాయింపులు చూపించవచ్చన్నది వేరే చెప్పనక్కర్లేదు. మీరు కూడా అందుకే “చాలా మటుకు”అన్నది జత చేశారు. నేను ఆర్థిక ప్రమాణాల ఆధారంగా చేసిన వర్గీకరణ కాదని చెప్పాను. పోనీ అది వదిలేయండి.

  యిపుడు బహుశా మీరు మధ్యతరగతి నుంచి వచ్చారేమో కాబట్టి చుట్టూ వున్న లేకిదనాన్ని కేవలం సభ్యులకుండే సహజమైన ధోరణితో సమర్థించదలిస్తే నేను ఎదురు చెప్పను, ఋజువులు చూపించే శ్రమా పడను. నామట్టుకు నేను, ఫక్కా మధ్యతరగతివాణ్ణే అయినా, చూడగలుగుతున్నాను. యిప్పుడు అక్షయ తృతియకి నగలకొట్ల చుట్టూ తిరిగి, అమెరికాలో అల్లుళ్ళని కలిగి, సాఫ్టువేరు ఉద్యోగాల వైపు పిల్లల్ని తరిమి (ఒకప్పుడు ఎమ్.సెట్ల వైపు తరిమినట్టు), మేరేజ్ బ్యూరోల చుట్టూ తిరిగి, టీవీ సీరియళ్ల టీఆర్పీలకు దోహదపడుతూ, స్టేటస్‌ కోసం మాత్రమే కార్లూ, కాఫీ టేబిల్ కోసం పుస్తకాలూ... వీరంతా ఆర్థికంగా చూస్తే ఎగువతరగతికి చెందినవారే. కానీ మనస్తత్వం మధ్యతరగతే. నియోరిచ్ అంటారే, వాళ్ళు. (యిపుడు అమెరికాలో అల్లుళ్ళని కలిగివుండటమే పాపమా అని పై ఉదాహరణలని ఎంచి అడక్కండి. నేను వాటితో ఒక సారాంశాన్ని మాత్రమే మీకు యివ్వజూస్తున్నాను.) మీకు “మధ్యతరగతి” అన్న పదం మాత్రమే అభ్యంతరకరంగా కన్పిస్తే, దానికి బదులు philistine అనే పదం వాడుకోండి. కానీ ఈ philistinism నేను ఎక్కువ చూస్తోంది మధ్యతరగతి లోనే. దీన్ని మధ్యతరగతి మనస్తత్వం గానే పరిగణిస్తాను. అరిస్టోక్రసీ అంటే అది వేరు. దానికి అర్థం ఆర్థికంగా ఎగువతరగతి అని కాదు. A society comprised of best minds, educated minds. (అది కూడా మధ్యతరగతివాళ్ళిచ్చుకునే నిర్వచనాలతో వెలిగే విద్య కాదు.) నా నిర్వచనం ప్రకారం, మీకూ తట్టేటట్టు చెప్పాలంటే, దువ్వూరి వారి ఆత్మకథలో ఆయన మసలుకున్న, ఆప్యాయంగా మననం చేసుకున్న వర్గం అరిస్టోక్రసీ. వాళ్ళందరూ ఆర్థికంగా మధ్యతరగతి వర్గానికే చెందివున్నా కూడా. అందుకే నేను నా వ్యాఖ్యలో ఆ పదాల్ని ఆర్థిక విభజనల్ని బట్టి ఆపాదించడం లేదని చెప్పింది. And when I used the word Aristocracy, my mind picked up a society through time and space too. Say Russian Liberals before revolution, French aristocracy in the first half of 19th century.

  >>> "And in the case of "middle class", their values are petty, and their aspirations are dwarfish and vulgar." - As compared to ?

  As compared to something only my soul knows and craves for. As compared to what every poet lives and strives for. As compared to what Pushkin is talking about in this poem. It can’t be defined by negation. If you knew it, you knew it. That is it.

  అక్కడ నేను మధ్యతరగతి విలువలంటూ ఎన్యూమరేట్ చేసిన వాటికంటే వున్నతంగా నిజంగానే ఏవీ మీ అంతరాత్మకు స్ఫురించడం లేదా? ఎందుకంటే అవి అంతరాత్మకు మాత్రమే స్ఫురించే విలువలు కాబట్టి, అంతరాత్మ మాత్రమే ఎన్నగలిగే ఆశయలు కాబట్టి.

  >>> Is the life of so-called middle-class people, not part of the culture?Is culture exclusively formed by some set of people in a society?

  Of course, killer is always a part of the murder. Culture is transmitted through generations by love. Why are we withdrawing our love, what for? For a higher ideal? I can’t see any.

  ReplyDelete
 13. మీరు చెపుతున్న నిర్వచిస్తున్న సారాంశం అర్థమవుతోంది. ఒకొక్క ఈక పట్టుకు లాగాలని సమాధానం మొదలెట్టినా అది చర్చ పక్క దారి పట్టిస్తుందని ఆపేస్తున్నాను.

  మీరు చెపుతున్నవి "రచన అంటే ఇలా ఉండాలి" అనే మీ అభిప్రాయంగా, "ఐడియల్ రచన అంటే ఇదీ" అనే మీ ఇష్టంగా అనేసుకుంటే నాకు ఎలాటి ఇబ్బంది ఉండదు......ఎందుకంటే ఇష్టాయిష్టాల prescriptive కాదు కనక.

  కాని రచనా వ్యాసంగంలో నైతికాతీతాన్ని ఆశించే మీరు మీ రచనల్లో ఇంత నైతికత చూపటమే నాకు ఆశ్చర్యం వేస్తోంది (ఆ చివరి పేరా "రచన" కాదు అంటారా, అందులో నైతికత లేదు అంటారా....ఇక అప్పుడు నేను మాట్లాడటానికి ఏమీ ఉండదు)

  నైతికతను నిరసించే మీరు ఇంతగా మా మధ్యతరగతి వాళ్ళను నైతికంగా నిరసించుకోవటం ఇంకా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. (ఇక్కడ "మన" మధ్యతరగతి అని రాద్దామనుకుని ఆగిపోయాను. మీరు నమ్మే సిద్ధాంతాల ప్రకారం ఎగువ, మధ్య, కింది నిర్వచనాల ప్రకారం మీరు ఎగువతరగతివారే కదా)

  ఇంకో ఆశ్చర్యమేమంటే by your definition పై తరగతి వాళ్ళు A society comprised of best minds, educated minds. (based on "a set of values and aspirations typical to those social entities").

  కింది తరగతి వాళ్ళను by reverse A society comprised of worst minds, uneducated minds అని assume(at the risk of making an ass of myself:) చేసుకుంటున్నాను ఎందుకంటే మీరు వారందరినీ ఒకే spectrum లో ఉన్నట్టు ఉదహరిస్తున్నారు కాబట్టి. I hope you are not defining proletariat by another separate set of definitions/values.


  నాకు ఆశ్చర్యం కలిగించినదేమిటంటే మీరు అత్యంతంగా ఇష్టపడే విలువలు అసలు ఏమీ లేని వాళ్ళు (proleteriat) మీకు ఎందుకంత ఇష్టమయిపోయారో......అవి కొంతలోకొంతైనా ఉండి బ్రతుకుబండిని లాగిస్తున్న మధ్యతరగతిని ఎందుకంత ఏవగించుకుంటున్నారో అన్నది.

  నాకు మీ ఈ ఏవగింపు (Dwarfish, petty, killers) చూస్తుంటే నారదుని కథ గుర్తుకు వస్తోంది. నిత్యహరినామ సంకీర్తనా భాగ్యవంతుండ అనుకున్న ఆయన కొంతసేపు నిండుకుండను నెత్తిన పెట్టుకు చుక్క రాలనీయక నడిచే చిన్ని ప్రయాసలోనే తన సంపదను పోగొట్టుకుని రోజుకు మూడు మార్లు హరినామ సంకీర్తన చేసుకునే వ్యావసాయీకుని ఎదుట పేదవాడి నిలిచి గర్వభంగము పొందిన కథ అది. మీరు మీకున్న రసస్ఫందన అన్న సంపదను చూసుకుని అది లేని వారిని ఎవగించుకోవటం (కళ-ఆనందం, వృత్తి-జీవిక, ఎన్నారై అల్లుళ్ళు-మంచి అల్లుళ్ళు మొ మీ ఉదాహరణలు) రచనా వ్యాసంగం పూర్తి స్థాయిలో కోరుకుంటున్న మీకు ఏ విధంగా అడ్డుగోడకాగలదో ఆలోచించుకోండి. నాలాగా "నేను రాసే కవితలు ముఖ్యోద్దేశం నా మేలు కోసం మాత్రమె పాటకుల కోసం కాదు" అన్న ధోరణి కనిపించదు మీరు రచనా వ్యాసంగం మీద చూపిస్తున్న ఆసక్తి, అందుకోసం చేస్తున్న కృషి చూస్తుంటే.

  మంచి రచనా వ్యాసంగానికి కావాల్సిన జ్ఞాన సంపత్తునంతా పోగు చేసుకుంటున్న మీరు ( "I respect him for his knowledge.....no doubt about it" అన్నది నా మిత్రుల అభిప్రాయం మీ గురించి.....ఇక్కడ మీ పట్ల మీ జ్ఞానంవలన మాత్రమె ఎందుకు గౌరవం కలుగుతోంది అన్నది మీరు ఆలోచించుకోండి) ఇలాటి గా.......ట్టి అభిప్రాయాల నమూనాలలో కూరుకుపోతే మీరు రచయితగా ఎదగలేరేమో అన్న బాధతో రాస్తున్న సమాధానమిది.

  మీరన్నట్టు నిజంగా రచయితకు వైరాగ్యం కావాలి. ఎందుకంటే ఒక నమూనా పట్ల కాని సిద్ధాంతం పట్ల కాని రాగం అనే ఇంత గట్టి మూసలో మిమ్మల్ని మీరు బంధించుకుంటే ఇక మీరు అనుకున్న Artist is ideally an amoral being. In the act of creation, he dispenses with moral distinctions. His private morals as a person don't affect his creations in any palpable way. Nothing is taboo for him to pick up. స్థితికి మిమ్మల్ని తీసుకెళ్ళలేరు అనిపిస్తుంది.

  విలువల్లో మీరు కోరుకునే ఆ స్థితి శిఖరాగ్రము. ఆ శిఖరాదిరోహణ చేయాలంటే పరమ శివునికి తప్ప మిగితా మాలాటి పామరులందరికీ కింది నుంచి అడుగులు పడాల్సిందే. మాలాటి వారిని, అసలు ఆ ప్రయాసే వద్దు అనుకుని మానేసిన వారి పట్ల మీ ఇంత ఘాటు అభిప్రాయం.....ఎందుకో మంచిది కాదేమో మీ వ్యాసంగానికి అనిపించింది.

  మీరన్నట్లు నాది కూడా రచన రచయిత అంతర్లోకానికి అద్దం అన్న అభిప్రాయమే. అందుకే ఇంత చెపుతున్నాను. be careful of falling into the traps of ...isms at the start (or wherever you are currently) in the journey. Good Luck.

  one small request. please do not respond to this above comment for atleast a week. Hope you understand the reason behind my request.

  ReplyDelete
 14. మెహెర్ గారు,

  విపులంగా వివరించినందుకు కృతజ్ఞతలు. I thoroughly enjoy the passion in your words!
  రచయిత-దేవుని గురించిన మీ పోలిక నాకు నచ్చింది. మీ రసవంతమైన ఆ వివరణ, నాకర్థమయినంత మేరకు ఒక నీరస వాక్యంలో చెపితే - రచయిత నైతికత, అతని రచనల్లో మీకు అడ్డు తగలనంతవరకూ ఆ రచనని మీరు చక్కగా ఆస్వాదించ గలుగుతారు - నే సరిగానే అర్థం చేసుకున్నానా?

  మధ్యతరగతి గురించిన మీ వివరణ నాకు అర్థమయింది. మీలా దాన్ని నేను స్వంతం చేసుకోలేకపోయినా.

  "అక్కడ నేను మధ్యతరగతి విలువలంటూ ఎన్యూమరేట్ చేసిన వాటికంటే వున్నతంగా నిజంగానే ఏవీ మీ అంతరాత్మకు స్ఫురించడం లేదా?"
  - ఇది మీరు నా దగ్గరనుండి సమాధానం ఆశించి వేసిన ప్రశ్న కాదని నాకు తెలుసు. అయినా దీనికి జవాబివ్వాలనిపించింది. ఈ జవాబు మీకు ఉపయోగపడకపోవచ్చు. నా తృప్తికోసం చెపుతున్నదే. అవును, నిజంగానే ఏవీ నా అంతరాత్మకు స్ఫురించడం లేదు - ఎందుకంటే నేను కవిని కాను కాబట్టి. అయితే అలాంటి విలువల గురించి బొత్తిగా తెలియనివాడిని కాను. అవి నిజంగా ఉన్నతమైనవా కాదా అనే డోలాయమాన స్థితిలోనే కాలం గడిచిపోతోంది. బహుశా నాకు దేనిపట్లా కూడా ఒక గాఢానురక్తీ గాఢమైన అభినివేశమూ లేకపోవడమే దానికి కారణం కావచ్చు. అందుకే అవి కనిపించే వాళ్ళ రచనల్లో దాన్ని చూసి అబ్బురపడతాను. సొంతం చేసుకోవాలని (విఫల)ప్రయత్నం చేస్తూ ఉంటాను. చాలాసార్లు ఈర్ష్యపడుతూ ఉంటాను కూడా!

  ReplyDelete
 15. Very fascinating discussion. There may or may not be a reconciliation at the end of it between the two points, but as a reader, it is scintillating to me. Thanks to all 3 of you.

  ReplyDelete
 16. [1]

  భావకుడన్ గారు, కాస్త పెద్ద పనే పెట్టారు. బ్లాగింగులో యివన్నీ తప్పవనుకుంటా! :)

  సమాధానం యిచ్చేముందు వారం రోజులు ఆగమని అనడంలో మీ సదుద్దేశం అర్థమైంది. కానీ, assumptions అన్నవి వెంటనే తుడిచేయడం మంచిది. మీ వ్యాఖ్యలో వాటిని పసిగట్టడానికి మీరిచ్చినంత ఎక్కువసమయం అవసరం లేదు. ముఖ్యంగా అవి నా గురించిన assumptions అయినపుడు. ఎందుకంటే, ఎంతైనా, నా గురించి నాకు కాస్తో కూస్తో తెలుస్తుంది కదా.

  మీ వ్యాఖ్యలో రెండూ, మూడు పేరాలు అనవసరం. ఎందుకంటే అవి నన్నేదో అడుగుతున్నట్టు కనిపిస్తూనే నా తరపునుంచి సమాధానాల్ని కూడా ఊహించేస్తున్నాయి.

  >>> మీరు చెపుతున్నవి "రచన అంటే ఇలా ఉండాలి" అనే మీ అభిప్రాయంగా, "ఐడియల్ రచన అంటే ఇదీ" అనే మీ ఇష్టంగా అనేసుకుంటే నాకు ఎలాటి ఇబ్బంది ఉండదు......ఎందుకంటే ఇష్టాయిష్టాల prescriptive కాదు కనక.

  ముందు యీ రెండోపేరా గురించి చెప్తాను: సాహిత్యం విషయంలోనైనా మరే విషయంలోనైనా సార్వజనీనమైన విలువల్ని ప్రతిపాదించలేమన్నదే నా నమ్మికానూ. అయితే "రచన అంటే యిలా వుండాలి" అంటూ నా యిష్టాల్ని మీకు ప్రిస్కైబ్ చేయటానికి నేను ఏదీ చెప్పలేదు. మీ మొట్టమొదటి వ్యాఖ్యలో "మీ ప్రకారం" అంటూ మొదలెట్టి మీరు వేసిన కొన్ని ప్రశ్నలకు సమాధానం మాత్రమే యిచ్చాను. మరి "మీ ప్రకారం" అని మీరు అడిగినపుడు, నేను యిచ్చే వివరణలు "నా ప్రకారమే" వుంటాయిగా. "మీ ఇష్టంగా అనేసుకుంటే నాకు ఎలాటి ఇబ్బంది ఉండదు" అంటున్నారు. అసలు మీరడిగింది నా యిష్టమేమిటనేగా. మీరు అడిగిందానికి నేను యిచ్చిన వివరణ కేవలం మీ పూర్వాభిప్రాయాలకు అనుగుణంగా లేకపోవడమే మీక్కలిగిన ఇబ్బందా? మరి దానికి నేను బాధ్యుణ్ని కానుగా.

  అంతేగాక, నేను కేవలం "నా ప్రకారం" సాహిత్యాదర్శాలేవిటో చెప్పి ఊరుకోలేదు, తరువాత కామేశ్వరరావు గారికి యిచ్చిన జవాబులో, రచన ఆదర్శం నేననుకున్నదైతే ఎందుకు బాగుంటుందో కూడా చెప్పే ప్రయత్నం చేసాను, నాకు శక్యమైన రీతిలో. అది మీకు సమ్మతమో కాదో, సమ్మతం కాకుంటే ఎందుకు కాదో, మీరు చెప్పలేదు. అందులో మీకు సమ్మతించదగిన అంశమేదీ లేకుంటే, అవును, సాహిత్యంపై మన యిరువురికీ విరుద్ధాభిప్రాయాలున్నాయి. కాబట్టి ఏ గొడవా లేదు. :)

  >>> కాని రచనా వ్యాసంగంలో నైతికాతీతాన్ని ఆశించే మీరు మీ రచనల్లో ఇంత నైతికత చూపటమే నాకు ఆశ్చర్యం వేస్తోంది (ఆ చివరి పేరా "రచన" కాదు అంటారా, అందులో నైతికత లేదు అంటారా....ఇక అప్పుడు నేను మాట్లాడటానికి ఏమీ ఉండదు)

  మీ ఆశ్చర్యానికి సమాధానం ప్రక్కనున్న మీ బ్రాకెట్లోనే వుందిగా. అవును, వుత్త అభిప్రాయ ప్రకటనకి "రచన" అన్నంత పెద్ద పేరు ఎలా యివ్వగలం. When I say "art", I almost always mean "fiction".

  — * — * —

  ReplyDelete
 17. [2]

  మీ వ్యాఖ్యలో సాహిత్యానికి సంబంధించిన అంశం గురించి నా వివరణలు యిచ్చుకున్నాను గనుక, యిక మధ్యతరగతికి సంబంధించిన అంశానికి వస్తాను. మీ మొట్టమొదటి వ్యాఖ్యలో, "మన సంస్కృతిని హత్య చేస్తోంది మధ్యతరగతి" అని నేనెందుకన్నానో చెప్పమని మీరడిగారు. నేను నా అభిప్రాయాన్ని తగిన కారణాలతో వివరించాను. మీరిప్పుడు ఆ అభిప్రాయాలు (లేదూ అలాంటి తీవ్ర అభిప్రాయాలు) నాకెందుకుండకూడదో, అవి నా రచనావ్యాసంగానికి ఎలా చేటు తేగలవో చెప్తున్నారు. చేటు తెచ్చే అవకాశం ఎందుకు లేదో (మీరు పడుతున్న బాధ ఎందుకు నిరాధారమో) నేను వివరిస్తాను. నిజానికి దీనికి నా మొదటి వ్యాఖ్యలోనే సమాధానం వుంది. రచయిత వ్యక్తిగత నైతికవిలువలు అతని కల్పనా ప్రపంచాల్లోకి చొరబడకూడదని నేను చెప్పినపుడు, అందులోనే, రచయిత వ్యక్తిగత అభిప్రాయాలు కూడా అతని కల్పనాప్రపంచంపై ప్రభావం చూపించకూడదన్న నా భావన సూచనగా అందటం లేదూ? అటువంటప్పుడు, నేనా సాహిత్యాదర్శాన్ని గనక పాటించగలిగితే, యీ నా "గా.......ట్టి" అభిప్రాయాలు నా రచనలపై చూపించే ప్రభావం ఏమీ వుండబోదు కదా. "His private morals as a person don't affect his creations in any palpable way." అన్న నా వాక్యంలో నేను చెప్పదలచిందీ అదే.

  నా సంగతి వదిలేద్దాం; యిలా తమ వ్యక్తిగత విలువల్ని తమ కళా ప్రపంచాన్నించి వేరు చేసి అద్భుతమైన సృజనలు చేసిన రచయితలెందరో వున్నారు. టాల్‌‍స్టాయికి వివాహ బంధం మీద అంతులేని నమ్మకం వుంది. A puritanical belief almost. అయినా వివాహేతర సంబంధం పెట్టుకునే ‘అన్నా కరెనినా’ను ప్రధాన పాత్రగా పెట్టి నవల రాశాడు. కానీ నవల మొత్తం ఎక్కడా ఆ పాత్రపై తన నైతికానైతికాల రుద్దుడు కనిపించదు. Even though Anna is Tolstoy's creation, in his fictive world, she seems to live her life autonomously. మరి చివర్లో ఆమె రైలు కింద దూకి ఆత్మహత్య చేసుకునేలా ఎందుకు చేశాడూ అని మీరడగవచ్చు. కాని ఆ ఆత్మహత్యని, రచయిత తాను వ్యతిరేకించే ఆమె అనైతికత్వానికి పర్యవసానంగా ఎక్కడా చూపించడు. అలాంటి ఏ ఋజువూ మనకు ఆ రచనలో దొరకదు. ఎందుకంటే టాల్‌స్టాయి చివరిదాకా దేవుడంత హుందాగానే, దేవుడంత మార్మికంగానే ప్రవర్తిస్తాడు. కాబట్టి రచయితకు వ్యక్తిగతంగా ఎంత "గా.......ట్టి", ఘాటు అభిప్రాయాలు వున్నా, అవి అతని రచనల్ని ప్రభావితం చేసితీరనక్కర్లేదు. అలాగే, నేను ఆ ఆదర్శాన్ని పాటించగలిగితే, అలాంటివేవీ అడ్డురావు. ఆ విషయంలో be बेफिकर, if you care!

  — * — * —

  ReplyDelete
 18. [3]

  ముందుగా మీకో మెచ్చుకోలు. You have great rhetorical powers. And your expertise at pigeonholing seems abundant. నిజానికి మీరు నా అభిప్రాయాల్లో వుందని చెప్తున్న గట్టిదనమో ఘాటుదనమో ఏదో, వాటిలో స్వతహాగా లేకున్నా, మీ భావోద్వేగభరితమైన వ్యతిరేకత వల్ల, అదేదో వాటికి ఆపాదించబడుతోంది. మీరు నా అభిప్రాయాలకు ఆపాదిస్తున్నవి ఒకటీ రెండూ మాటలు కాదు... “ఏవగింపులు”, “నిరసనలు”, “సిద్ధాంతాలు”, “ఇజాలు” యిలా బానే వున్నాయి.

  >>> నైతికతను నిరసించే మీరు ఇంతగా మా మధ్యతరగతి వాళ్ళను నైతికంగా నిరసించుకోవటం ఇంకా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

  మళ్ళీ గుర్తు చేస్తున్నాను. నేను నైతికతనూ, నీతినీ ఎక్కడా నిరసించలేదు. రచయిత కళలో నైతికాతీతుడై వుండడం ఆదర్శం అన్నాను. వ్యక్తిగత జీవితంలో నైతికానైతికాల విషయంలో అతనికంటూ ఏ గట్టి అభిప్రాయాలూ వుండకూడదని అనలేదు. యిలాంటి చోట్లనే మీరు నిజంగా నా వ్యాఖ్యని ఏమన్నా అర్థం చేసుకునే రాసారా, లేక ఏదో self-assertion కోసం రాసారా అనిపిస్తోంది. Not only that, beginning with the above sentence, your comment is unnecessarily charged with veiled rancor in some places. I don't know which sore spot in you that may have been hit by my previous comment and prompted you to stand up for the whole of the middle-class, but it certainly seems the case. Well, if there's anything like that, it was not intentional. I don't hate middle-class, I hate the vulgar values that are mostly represented by them. Values that are proving to be the death of our fragile culture.

  >>> ఇంకో ఆశ్చర్యమేమంటే by your definition పై తరగతి వాళ్ళు A society comprised of best minds, educated minds. (based on "a set of values and aspirations typical to those social entities"). ... కింది తరగతి వాళ్ళను by reverse A society comprised of worst minds, uneducated minds అని assume(at the risk of making an ass of myself:) చేసుకుంటున్నాను

  అంటే "అరిస్టోక్రసీ" అనే పదాన్ని నేను ఉత్తమ మేధోవర్గంతో నిండిన సమాజం అన్న అర్థంతో వాడాను కాబట్టి, వెంటనే దాని వ్యతిరేకార్థం ప్రొలిటేరియన్లకి ఆపాదించబడుతుందా? అలా ఎందుకు? ఒకదానికి మరొకటి ఎదురుబొదురు నిలబడివున్నాయా? యిపుడీ వ్యవస్థలన్నింటినీ ప్రాధాన్యతాక్రమాన్ని అనుసరించి ఎగువ నించి దిగువకి వుండే అంచెల అమరికలానే చూడాలా? వేర్వేలు లక్షణాల్తో మన్నే స్వతంత్ర వ్యవస్థలుగా చూడలేమా? అంతేగాక, ప్రతీదీ ఖచ్చితమైన నిర్వచనంతో వుండి తీరాలా? అన్నీ నిర్ణీత విభజనల్తో కనపడాలా? నేను మధ్యతరగతివి లేకి విలువలనుకుంటున్నా అంటే, దానికన్నా వున్నతమైన, నా జేబులో నేను దాచిపెట్టుకున్న, విలువలేమిటో మీకు నిర్వచించి చూపాలా? లేనపుడు నా అభిప్రాయాల్ని రద్దు చేసుకోవాలా?

  నేను మీకో ఉచిత సలహా యిస్తున్నాను, విలువేమన్నా తూకం తూగితే తీస్కోండి. లేదంటే నలిపి గాలికి వదిలేసేయండి. ముందు మీరు అన్నింటికీ ఖచ్చితమైన నిర్వచనాలు వుంటాయన్న, అన్నింటికీ మధ్య నిర్ణీత విభజనలు గీయవచ్చన్న — యిదంతా భాష ద్వారా పూర్తిగా వ్యక్తీకరించవచ్చన్న — నమ్మకాన్ని వీలైతే వదిలించుకోండి, అది కవిగా మీకు పనికొస్తుంది. అపుడు పంక్తుల్లో అర్థాలు పొదగడమే కాదు, పంక్తుల మధ్యనున్న ఖాళీల్లోకి కూడా అర్థాన్ని చొప్పించగలుగుతారు. నిజమైన కవిత్వం మసలుకొనేది ఆ ఖాళీల్లోనే. Wishing you the best on that front!

  సరే, ప్రొలిటేరియన్స్ గురించి నా అభిప్రాయం అడుగుతున్నారు కాబట్టి చెప్తాను. అరిస్టోక్రసీలో వున్నవి బెస్ట్ మైండ్స్ అయితే, తన్మూలంగా ప్రొలిటేరియట్‌లో వుండేవి వరస్ట్ మైండ్స్ అవవు. నా అభిప్రాయం ప్రకారం వారివి యింకా నిజమైన మనసులు. మధ్యతరగతి ఫాల్స్ విలువలు అంటించుకోని సమాజం అది. Art and truth are among values aspired by aristocratic people. But when it comes to proletariat, THEY are the art and truth itself stands by them.

  >>> నాకు ఆశ్చర్యం కలిగించినదేమిటంటే మీరు అత్యంతంగా ఇష్టపడే విలువలు అసలు ఏమీ లేని వాళ్ళు (proletariat) మీకు ఎందుకంత ఇష్టమయిపోయారో....

  నాకు తెలిసి నేను అత్యంతగా యిష్టపడే విలువలంటూ నా వ్యాఖ్యలో వేటినీ ఉదహరించలేదు. ఉదహరించలేనని వదిలేసాను. ఉదహరించలేను నిజంగా!

  ReplyDelete
 19. [4]

  >>> నాలాగా "నేను రాసే కవితలు ముఖ్యోద్దేశం నా మేలు కోసం మాత్రమె పాటకుల కోసం కాదు" అన్న ధోరణి కనిపించదు మీరు రచనా వ్యాసంగం మీద చూపిస్తున్న ఆసక్తి, అందుకోసం చేస్తున్న కృషి చూస్తుంటే.

  మీకు కనిపించేవాటికి మీరే మీరే బాద్యులు గానీ, నా వరకూ మాత్రం, నేను పాఠకుల కోసం రాయను. పాఠకులే కావాలంటే, ఈ బ్లాగింగు ద్వారాగా కన్నా ఎక్కువమందిని చేరగలిగే మాధ్యమాలు నాకు బాగానే అందుబాటులో వున్నాయి. నాక్కావాల్సింది "మంది" కాదు. నాకు కళావరణంలో మసలుకోవడం అంటే యిష్టం. సౌందర్యాన్ని సాధించడం అంటే యిష్టం. సత్యం వెంటపడి తక్కుతూ తారుతూ దేకడమైనా సరే యిష్టం. ఈ యిష్టాలన్నిటికీ నా జీవితాన్ని కేవలం ఒక అనుబంధంగా చూడటం యిష్టం. నేను రాసేది అందుకు. జీవితం మొట్టికాయలు మొడితే ముక్కుచీదుకుంటూ అక్షరాల దగ్గరకొచ్చి వాపోయే తరహా నేను కాదనుకుంటాను. నాకు రాసేటప్పుడు పాఠకుల స్పృహ వుండదు. రాసాకా కూడా, my only hope is that a few kindred souls would read it. I know some of them only by name. I don't even anticipate their responses. But the feeling, that I am putting these writings available for their perusal, suffices for me.

  >>> విలువల్లో మీరు కోరుకునే ఆ స్థితి శిఖరాగ్రము. ఆ శిఖరాదిరోహణ చేయాలంటే పరమ శివునికి తప్ప మిగితా మాలాటి పామరులందరికీ కింది నుంచి అడుగులు పడాల్సిందే.

  Oh, don't be so sure about that! మీరంటున్న “మీలాటి పామరుల” సంగతి నాకు తెలియదు గానీ, ఆ విలువల కోసం పరమశివులవ్వనక్కర్లేదని మాత్రం నాకు తెలుసు. నా పుస్తకాల అరల్లో వందల పుస్తకాలు — నేనాశించే విలువల కోసమే బతికిన మనుషుల మేధస్సులు పర్యవసించిన చిహ్నాలు — అవి చాలు ఋజువుక. అవి చాలు నాకు ఎప్పుడూ దన్నుగా వుండటానికి. వేరే ఏమీ అక్కర్లేదు. అలాంటి వ్యక్తుల్నీ కొందర్ని నా చుట్టూ పేర్చాడనుకోండి దేవుడు. అదో ఆశించని అదృష్టం. ఉన్నా చల్తా వూడినా చల్తా!

  మొత్తంగా అదీ సంగతి! యిక మధ్యతరగతి విలువల మీద నా అభిప్రాయాల్ని విశాలపరచడం గానీ, అవి నా రచనల్ని ఎలా పాడు చేయవచ్చో ఆలోచించడం గానీ వదిలేయడం ఉభయతారకం. నేను మామూలుగా నా అభిప్రాయాల్ని చర్చకు పెట్టను. అభిప్రాయాలనేవి చర్చల్తో, వాదనల్తో మారేవి కాదనుకుంటాను. మీరు నా అభిప్రాయం తెలుసుకునే ఉద్దేశ్యం కనపరిచారు కనుక వివరించానంతే! నా బ్లాగు ఉద్దేశాన్ని వివరిస్తూ రాసిన ఒక పాత పోస్టులోని మాటలివి:

  "ఇక జీవిత సత్యాలు ఇక్కడ (ఈ బ్లాగులో) ప్రవచించకూడదన్న నిశ్చయానికి కారణం: సార్వజనీనమైన జీవిత సత్యాలంటూ ఏవీ లేకపోవడం, ఎవరి జీవిత సత్యాలు వాళ్ళకే వుండడం, ఇవి చర్చలతోనూ వాదనలతోనూ తెగేవి కాకపోవడం. నా విలువలు నాకున్నప్పుడు, అవి నిజమని నమ్మకంగా తెలిసినపుడు, వాటినిక్కడ బ్లాగులో చర్చకి పెట్టడమో, ఇంకెవరికో వాటిని నిరూపించబూనడమో వ్యర్థం కదా. మనం నమ్మేది మనం నమ్ముతాం. మన నమ్మకాలు ప్రపంచాన్ని మార్చేయనక్కర్లేదు కదా. అలా ప్రపంచాన్ని మంచికో చెడుకో మార్చేయాలని చూసే మనుషుల నమ్మకాలు ఎంతటి వినాశ కారకాలో హిట్లర్, స్టాలిన్‌లాంటి వాళ్ళ కారణంగా రక్తసిక్తమైన ప్రపంచ చరిత్రే చెపుతూంది. "ఓ ప్రక్క ‘మంచికో చెడుకో’ అంటూ మళ్ళా చెడు ఉదాహరణలే చెప్పి వదిలేస్తావేం; మరి గాంధీ, వివేకానందుల మాటేంటీ" అని ఎవరైనా అడగొచ్చు. గాంధీకి తన నమ్మకం పట్ల ఎంత చిత్తశుద్ధి వుందో హిట్లర్‌కీ తన నమ్మకం పట్ల అంతే చిత్తశుద్ధి వుంది. ఇదంతా విశ్వంలోని సమస్త వ్యవహారాల్లాగే బొమ్మాబొరుసూ వ్యవహారం. అంతా వ్యక్తుల్ని బట్టి మారుతుంది. వ్యక్తిగా నేనేంటో నాకు తెలుసు కాబట్టి నా నమ్మకాలు ప్రపంచాన్నో, లేక ఈ బుల్లి బ్లాగ్ప్రపంచాన్నో, ఏదో మంచి పర్యవసానానికి నడిపించేంత సత్తా వున్నవి కావని మాత్రం చెప్పగలను. ప్రపంచంలో చాలా వైపరీత్యాలకి ఒకరి నమ్మకాలు మరొకరి మీద రుద్దబోవడమే మూలకారణమని చెప్పగలను. నమ్మకాలు రుద్దబోవడం అటుంచి, కనీసం వ్యక్తం చేసుకోవడం కూడా శుద్ధ దండగని చెప్పగలను. నమ్మకాలన్నవి చప్పుడు చేయకుండా ఎవరికి వారే ఆచరించుకోవడానికి మాత్రమే అని చెప్పగలను." కాబట్టి ఆ విధంగా ముందుకుపోదాం.

  Meanwhile, for any unchecked blurts of occasional sneering here in this blog, I promise I would apologize to every hurt heart if and when I join a Zen monastery.

  ReplyDelete
 20. కామేశ్వర రావు గారు,

  That "God - Writer" analogy is not mine. It is as old as Flaubert. I just extended it to its consequences.

  >>> రచయిత నైతికత, అతని రచనల్లో మీకు అడ్డు తగలనంతవరకూ ఆ రచనని మీరు చక్కగా ఆస్వాదించ గలుగుతారు - నే సరిగానే అర్థం చేసుకున్నానా?

  ఊ... అవును. కానీ నేను అనుకున్నది పాక్షికంగా మాత్రమే మీకు అర్థమయ్యేట్టు వ్యక్తం చేయగలిగాను. పాఠకునిగా "నాకు" అడ్డుతగలనంతవరకూ మాత్రమే కాదు; ఆ రచయిత సృష్టించే పాత్రలక్కూడా అతని నైతికత అడ్డుతగలకూడదనుకుంటాను. ఎందుకు యిది ఉన్నతాదర్శమో వివరించడానికి నా అవగాహన, వ్యక్తీకరణ సామర్థ్యమూ సరిపోవనిపిస్తోంది. కానీ మీకు మరో పద్ధతిలో సూచించగలను. చెఖోవ్‌ది "The Lady With The Dog" అనే ఒక అద్భుతమైన కథ వుంది. వీలైతే యిక్కడ చదవండి. అందులో రచయిత కల్పనా ప్రపంచాన్ని ఎలా పరుస్తున్నాడో, ఆ పాత్రల వెనుక తాను ఎలా మసలుకుంటున్నాడో చూడండి. ముఖ్యంగా ప్రధాన పాత్ర Gurov పాత్ర చిత్రణ గమనించండి. మీకు నేను చెప్పదల్చుకున్నది స్ఫురిస్తుందనే అనుకుంటున్నాను. అంతకన్నా సవివరంగా చెప్పే శక్తి ప్రస్తుతానికి నాకు వుందని అనుకోవడం లేదు.

  యిక మీ రెండో పేరాలో self-deprecating గా మీరు చెప్పింది నేను నమ్మలేనంటే మరోలా భావించవద్దు. ఎవరు కవులూ, ఎవరు కవులు కాదూ? కవితలో భావాన్ని అందుకోగలిగిన అనిర్వచనీయమైన క్షణాల్లో పాఠకునికి కవితో అబేధం ప్రాప్తిస్తుందన్నది మీరే చెప్పగా యెక్కడో విన్నట్టు గుర్తు. మరి అలాంటి క్షణాల్ని అనుభవించిన వారెవరైనా కవి అనే పదానికి అర్హులే కదా. Borges said somewhere that "Books are only occasions for poetry"; I think we can further extend the scope of this sentence without causing any compromise to its meaning. We are allowed to say that: even poets are only occasions for poetry. నేను నా వ్యాఖ్యలో కలం పట్టుకున్న వారినే కవులని ఉద్దేశించలేదు. ప్రపంచంలో కవిత్వం చూడగలవారని సవరిస్తున్నాను.

  ముందు కామెంటులో మీకు పుష్కిన్ కవిత అంటూ యిచ్చిన లింకు పన్చేయటం లేదని గమనించాను. అది యిక్కడ వుంది:

  http://loveforletters.blogspot.com/2007/08/blog-post.html

  ReplyDelete
 21. wow మెహెర్ గారు,
  మీరక్కడ కూర్చుని వడ్డిస్తుంటే నేనిక్కడ ఆరగించేస్తున్నా అదే సమయంలో.

  మీరు పెట్టుకున్న నియమాన్ని వీడి నాకు మీ నమ్మకాలను వ్యక్తపరచినందుకు ధన్యవాదాలు.

  ముందుగా మీ ప్రశ్నలకు జవాబులు చెప్పటం అవసరం....మీరు భైరవభట్లగారికి రాసిన జవాబుగురించి నేను ఊసెత్తలేదు...దానికి కారణం నాకు దవ్వూరి వారి ఆత్మకథకూ,french aristrocracy in first half of 19th century, russian liberals before revolution పూర్తిగా అపరిచితం. పుష్కిన్ పద్యానికి మీరిచ్చిన లంకె పనిచేయటంలేదు. If you knew it, you knew it. That is it. అన్నారు.

  పైగా భైరవభట్లగారి "Is the life of so-called middle-class people, not part of the culture? Is culture exclusively formed by some set of people in a society?" అన్న ప్రశ్నకు Of course, killer is always a part of the murder అన్నారు ఇదర్థమయింది కాని Culture is transmitted through generations by love. Why are we withdrawing our love, what for? For a higher ideal? I can’t see any అన్నారు, ఇదీ అర్థం కాలేదు. అర్థం కానివి, పరిచయం లేనివి ఎక్కువున్నందున దాని జోలికే పోలేదు.(ఈ సమాధానం రాస్తుండగానే మీరు పనిచేయను లంకె సరిచేసారు...థాంక్స్)


  ఇకపొతే "నేను మామూలుగా నా అభిప్రాయాల్ని చర్చకు పెట్టను. అభిప్రాయాలనేవి చర్చల్తో, వాదనల్తో మారేవి కాదనుకుంటాను. మీరు నా అభిప్రాయం తెలుసుకునే ఉద్దేశ్యం కనపరిచారు కనుక వివరించానంతే!" అన్నారు. సరే. ఇక ఆపేస్తాను.

  ReplyDelete
 22. మీ సమాధానాల్లో ఎన్నో ఆలోచించే విషయాలు దొరికాయి
  ౧. కవితల్లో పంక్తుల్లో కాకుండా నిశ్శబ్దంలోనూ అర్థాన్ని చొప్పించటం
  ౨. అభిప్రాయం-రచన-రచయిత-అంతర్లోకం-బహిర్లోకం
  ౩. నమ్మకం-చర్చలు
  ౪. రచయిత నైతికాతీతంగా రచన చేస్తూ కూడా అంతర్లోకానికి అద్దం పట్టడం....నిజంగా అంతర్లోకానికి అద్దం పట్టడమేనా? నైతికత వదిలేస్తే అతని అంతర్లోకంలో ఏమున్నదీ?
  ౬. aristrocracy and proleteriat ఎందుకు భిన్న ధృవాలు అవ్వాలి? ఒకే spectrum లో రెండు చివర్లు ఎందుకవ్వాలి.... అవి రెండూ ఉన్నతంగా మనగలిగి, మధ్యతరగతి ఆర్థికంగానూ, విలువల ప్రకారమూ మధ్యమంలో ఉండకుండా "మధ్య"తరగతి ఎలా అయింది
  ౬. మన సంస్కృతి fragile culture ఎందుకయిందీ

  ఇంకా ఇలా చాలా ఆలోచనలు రేపారు. థాంక్స్.


  -నాలాగా "నేను రాసే కవితలు ముఖ్యోద్దేశం నా మేలు కోసం మాత్రమె పాటకుల కోసం కాదు" అన్న ధోరణి కనిపించదు మీరు రచనా వ్యాసంగం మీద చూపిస్తున్న ఆసక్తి, అందుకోసం చేస్తున్న కృషి చూస్తుంటే.........ఈ వాక్యం రాసింది మీపై పూర్తి మేచ్చుకోలుతో........అక్కడ నేను "పాఠకుల కోసం" అన్నదానికి "మంది(ఎక్కువ) కోసం" అన్న అర్థాన్ని మీరు అన్వయించుకుంటే మీ ఇష్టం. ఉదా నా బ్లాగును తీసుకోండి.....నా టపాల్లో అక్షరరాక్షసాలు లేనివాటిని వేళ్ళ మీద లెక్కించ వచ్చు. నేను అవి చూసుకున్న ప్రతీసారి నన్ను నేను అనుకునే మాట you take your readers for granted ప్రతిగా నా మనసు పెంకిగా ఇచ్చే జవాబు నేను నా కోసమే రాసుకుంటున్నాను అది చదువరులకు నచ్చితే అది బోనస్ మాత్రమె అని. ఇలా అనుకున్నా అది ఉత్త rationalisation of my laziness అని నాకూ తెలుసు. అలాగే నా వాక్పట్టిలో లేని ఆంగ్ల పదాలకు సమానార్థకాలు వెతికే శ్రమ తీసుకోకుండా అలాగే ఆంగ్ల పదాలు వ్రాయటం కొంతైనా తగ్గింది అంటే మీ బ్లాగ్ ఇచ్చిన స్ఫూర్తితోనే. ఈ విషయమోచ్చేప్పటికీ నేను అనుకునే మాట....తెలుగులో రాస్తూ తెలుగు పదాలు తెలియటంలేదని చెప్పి అలా వదిలేయటం నీ చదువరులను నువ్వు అవమానించటమే ..ఆ బ్లాగు చూడు ఎన్ని మంచి పదాలు వాడతారో...అని. ఇలా "పాఠకుల కోసం" అంటే ఎక్కువ వ్యాఖ్యలనో, వీక్షణలనో, పొగడ్తలనో అన్న ఉద్దేశ్యంతో రాయలేదు... వారు చూస్తుంటారు ఒళ్ళు దగ్గరపెట్టుకుని రాయాలి అన్న స్పృహ ఉండటం రచయతకు చిన్నతనమేమీ కాదు....కాకూడదు కూడా. The readers are not taken for granted like me by you and that is evident in the work you do for your writings అన్న అర్థంతో రాసిన వ్యాఖ్య అది.

  కాపోతే ఒకటి ఒప్పుకు తీరాల్సిందే.....మంచి రచనకై "కృషి" చేసి రాసే వారందరూ పాఠకుల కోసమే ఆ కృషి చేస్తారు అన్న నా అభిప్రాయం పూర్తిగా నిజం కాదు అన్నది అర్థమయింది మీ సమాధానంతో...అవును "మంచి"కవిత లేదా రచన చేయాలన్న కోరికా, దాని కోసం కృషీ మంది పాఠకులు కాకపోయినా చిక్కనైనా కొద్ది పాఠకుల కోసమే అయినా చేయనక్కరలేదు...ఆత్మసంతృప్తి కోసంమే అలా కృషి చేసే వారుంటారు అన్నది అర్థం అయింది....very good lesson indeed


  కొన్ని వివరణలు
  -మీరు pigeon holing, rhetoric అన్నారు. అవును....మీరు వాడిన పదజాలంతో నాకు తెలిసిన సామాన్యార్థానికీ మీరు వాడుతున్నారు అనిపించినా అర్థానికి సమన్వయము కుదరలేదు అందుకే వివరణ అడిగాను.

  -అవును మీరన్నట్టు "రూల్స్ వదిలేయ్" అని చాలా మందే చెప్పారు నాకు....ఇక్కడ రూల్స్ గురించి కాదు "అంటే మీ అర్థం" అని అర్థం చేసుకునే ప్రయత్నం అని నేను అనుకునేది. ఇది మీరన్నట్టు నేను మార్చుకోలేని నమ్మకమేమో.


  -శిఖరాగ్రమంటూ ఉపమానంతో నేను చెప్పాలనుకున్నది పూరిగా చెప్పగాలిగానో లేదో తెలీదు. నేనక్కడ చెప్పాలనుకున్నది.....మీరు కోరుకుంటున్న నైతికాతీతంగా రచనలు చేయటం అన్న స్థాయి శిఖర స్థాయి ....ఆ స్థాయిని చేరుకోవాలంటే...అలానే ఆ స్థాయి రచయితగా పుట్టేసిన ఏ కొద్ది మంది రచయితలకో (పరమ శివునికో) తప్ప మిగితా వారందరికీ అది లేని స్థాయి నుంచి అది ఉన్న స్థాయి అనే స్థితి వరకు పయనం తప్పదు...అని

  ఇకపోతే నామటుకు నాకు జీవితం జెల్లకాయ నుంచి వచ్చిన స్ఫందన అయినా స్వయంభూ స్ఫందన అయినా....రెండూ ఒకటే.

  I do apologise for any rancour you perceived in my reply. Sorry.

  మొత్తానికి మధ్యతరగతి వాళ్ళు సంస్కృతికి ప్రతీకలు అన్న నా నమ్మకానికి గట్టి ప్రశ్నలే ఎదురయ్యాయి మీ టపాలోని చర్చతో.

  ReplyDelete
 23. మెహెర్ గారు,

  చెకోవ్ కథ చదివాను. శిల్ప పరంగా అద్భుతమైన కథే, సందేహం లేదు. కథనమూ, పాత్ర చిత్రణా, వర్ణనలు - అన్నీ రచయిత చాలా జాగ్రత్తగా చెక్కిన కథ.
  అయితే, నాకీ కథతో కొన్ని సమస్యలున్నాయి. మొదటిది, కాల్పనికతకి వాస్తవికతనే ముసుగు వెయ్యడం. నా దృష్టిలో - మీ రంగు వెలిసిన రాజుగారి మేడ కథలో కథానాయిక కప్పగా మారడంలో ఎంత వాస్తవికత ఉందో, ఈ కథలో Gurovలో వచ్చిన మార్పులో కూడా అంతే వాస్తవికత ఉంది. తేడా అల్లా ఇక్కడ, ఒక వాస్తవికత అనే ముసుగు ఉంది - అది తన కథనం ద్వారా రచయిత చాలా చాకచక్యంగా అల్లినది. ఎందుకీ ముసుగు?
  రెండు - కథలో కాని, పాత్రలకి కాని ఎలాంటి నైతికత అడ్డు తగలదు. నిజమే. రచయిత కూడా వాళ్ళ నైతికానైతికతల గురించి ఎలాంటి తీర్పూ, వ్యాఖ్యానమూ చెయ్యలేదు. అది కూడా నిజమే. అయితే, ఈ ప్రేమ కథంతా ఎందుకు ఇద్దరు పెళ్ళయిన (వేరువేరుగా) వాళ్ళ చుట్టూ తిప్పాడు రచయిత? Gurov స్వభావంలోని మార్పుని చిత్రించడానికి అతడూ, Anna వివాహితులే కానక్కర లేదు కదా. పాత్రల వెనక తాను మసలుకున్నాడు సరే, కాని ఆ పాత్రలని తెచ్చి వివాహేతర సంబంధమనే ఒక వాతావరణంలో పడవేసింది తనే కదా. అట్లా చెయ్యడానికి ఏమిటి కారణం?
  మూడు - 2.28, 4.5 పేరాలలో నాకు రచయిత గొంతే వినిపించింది. నేను పొరబడ్డానంటారా? పోని అదలా ఉంచండి. ఇందులోని పాత్రలు రెండూ కూడా అంతర్ బహిర్ ప్రపంచాలున్నవే. వీరి బహిర్ ప్రపంచమంతా కేవలం బూటకం. నిజాయితీగా వారు జీవిస్తున్నది అంతర్ ప్రపంచంలోనే (వారి దృష్టిలో). కథ మొత్తం ఇలాంటి రెండు పాత్రలతోనే నడపడంలో రచయిత ఏం ధ్వనిస్తున్నాడు? అసలు అంతర్ ప్రపంచమంటూ ఏమీ లేని వాళ్ళు ఉంటే, వాళ్ళ గురించి రచయిత అభిప్రాయమేమిటని అర్థం చేసుకోవచ్చు?

  కేవలం Gurov పాత్ర మీదనే దృష్టిపెట్టి, ప్రేమపై బలమైన నమ్మకముండి, దాని శక్తి Anna ద్వారా Gurovని ఎలా మార్చేసిందో మాత్రమే గమనిస్తే, కథ మహాద్భుతంగా అనిపిస్తుంది. కాని అలా కానప్పుడు, పై ప్రశ్నలు అడ్డం పడతాయి. రచయిత నైతికత కాదు, అనైతికతే కథని మొత్తం నడిపించిందా అన్న అనుమానం రాక మానదు.
  ఈ కథ చదవడంలో నా "నైతికత" గాని అడ్డు తగిలిందా అని కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించాను. కాని అలా అనిపించ లేదు. ఎందుకంటే పైన చెప్పిన మల్లెల యువరాజు కథలో రాణి "అనైతికత" నన్నే మాత్రం ఇబ్బంది పెట్టలేదు. చివర్న రాజు రాణిని సున్నబ్బట్టీలో కాల్చి చంపించకుండా, అవమానంతో తన తల నరుక్కున్నా నాకెలాంటి తేడాపడేది కాదు. ఇందులో ఉన్న "అనైతికత" కేవలం కథలో భాగం. అది కథని నడిపించ లేదు.

  >>"యిక మీ రెండో పేరాలో self-deprecating గా మీరు చెప్పింది నేను నమ్మలేనంటే మరోలా భావించవద్దు."
  I think, one day, you would realize that what I said there is neither self-deprecating nor unimaginable. But I hope it wouldn't be too soon!

  ReplyDelete
 24. [1]

  Kameswara Rao garu,

  I wonder whether your first reading of this story is not slightly affected by the present context of ours. I wonder if your observations would have been the same had you encountered the story all by yourself. Of course, it's not for me to assume. In any case, your take on the story is totally unexpected, and made me realize once again that different deductions can be drawn by different readers from the same text, and that each reader more or less invents his own version of the text. In this case, your inventions don’t correspond with mine, and I don’t know if either of our inventions correspond with the writer’s intentions.

  ముందుగా ఈ కథని నేను గ్రహించిన విధం మీరు గ్రహించిన విధంతో ఎక్కడ విభేదిస్తుందో చెపుతాను. ముఖ్యంగా ఈ కథలో వివాహేతర సంబంధం అన్న విషయాన్ని నేనొక ముఖ్య విషయంగా, కథకు ఆయువుపట్టుగా, మీరు చూసినట్టు కథని నడిపించిన విషయంగా చూడలేదు. కాబట్టి రచయితలోని అనైతికతే కథని నడిపించిందీ అన్న భావన నాలో ఎక్కడా ఉత్పన్నమవలేదు. రోమియో - జూలియట్ల ప్రేమకథకు కుటుంబవైరాలు ఎలా నేపథ్యమో, అలాగే నేను యిక్కడ గురోవ్ - అన్నాల ప్రేమకథ వారికి వైవాహికస్థితిని నేపథ్యంగా చూసాను. వాళ్ళు వివాహితులూ అన్నది యిక్కడ incidental మాత్రమే. యిది ప్రధానంగా ఒక ప్రేమ కథ అనిపించింది. కథలో నన్ను బాగా ఆకట్టుకున్నదీ, ఒక గొప్ప కథ అనిపింపజేసినదీ నాలుగోభాగం. (ఐతే ముందు మూడు భాగాలు లేకపోతే, అసలీ నాలుగో భాగం చూపగలిగే ప్రభావమే ఏదీ వుండేది కాదు.) అసలేముంది నాలుగో భాగంలో అంటే: నేపథ్యంలో కాలం నిర్దయగా గమిస్తూంటే ఎప్పటికైనా చేరువవుతారో లేదో తెలియని యిద్దరి అనిశ్చిత ప్రేమ గాథ వుంది, అది స్ఫురింపజేసే సున్నితమైన విషాదం వుంది. నాకు కథలో ఆయువుపట్టుగా వ్యక్తమైంది యిదే!

  అలాగే గురోవ్ పాత్రలో మార్పు కూడా కథకు ఆయువుపట్టు అనిపించలేదు. అసలు గురోవ్ పాత్రలో నేను పెద్ద మార్పేమీ చూడలేదు. ఒకవేళ మార్పు ఏమన్నా వున్నా అది ప్రేమలో వున్న ఏ వ్యక్తిలోనయినా కలిగే సాధారణమైన మార్పే: మిగతా అన్నింటిలోనూ నిస్సారత్వం కనిపించడం, ఏదో అద్వితీయమైన సత్యపు అజమాయిషీలోకి వచ్చిన వెచ్చదనం చుట్టూ ఆవరించడం... యిది ప్రేమలో సర్వసాధారణమైన మార్పే. అంతేతప్ప, ఏ రకంగానూ ‘అన్నా’ అతణ్ణి మార్చినట్టు నాకు కన్పించలేదు. మిమ్మల్ని గురోవ్ పాత్రని గమనించమన్నది ఎందుకంటే: అలాంటి పాత్ర, ఆడవాళ్ల పట్ల ‘తక్కువ జాతి’ అన్న అభిప్రాయం కలిగి, అక్రమ సంబంధాలతో, తేలికైన మనస్సాక్షితో, జీవితాన్ని పైపైన జీవించే ఆ పాత్ర పట్ల, మరో రచయిత నుంచైతే కాస్తయినా ఏవగింపో, లేదూ అతని అవలక్షణాల చిత్రణలో మరీ కొట్టొచ్చినట్టుండే శ్రద్ధో, లేదూ అతనిలో వచ్చే మార్పుని నాటకీయం చేయడమో కనబడేది. యిక్కడ నాకు అదేమీ కనిపించలేదు. మొదట్నించీ చివరిదాకా రచయితకు ఆ పాత్ర పట్ల సమర్థనా లేదు, వ్యతిరేకతా లేదు. అదీ నాకు నచ్చింది. అందుకే నా “రచయిత – దేవుడు పోలిక”ను మీకు సోదాహరణంగా చూపిస్తుందని మీకీ కథను సూచించింది.

  మీరన్న పేరాల్లో రచయిత గొంతు వుంది. కానీ అదేమీ అసహజమైన చొరబాటుగా కన్పించలేదు. ఎందుకంటే అది సొంతంగా ఏదో చెప్పాలనుకునే, వ్యాఖ్యానించాలనుకునే, గొంతు కాదు. కథ పరిధికి అతీతమైన భావాల్ని అసందర్భంగా ప్రకటిస్తున్న గొంతు కాదు. పాత్రల మనసుల్లో వున్న సంక్లిష్టభావాల్ని, ఆ పాత్రలు స్వయంగా అయితే ఎప్పటికీ వివరించలేనంత మెళకువగా, రచయిత చెప్తున్నాడు. ఆ సంక్లిష్టభావాల వెనుకనున్న నేపథ్యాన్నీ పునాదుల్నీ, కాసేపు పాత్రల్ని విడిచిపెట్టి, విశదపరుస్తున్నాడు. అదీ రెండుమూడు వాక్యాల్లో.

  ReplyDelete
 25. [2]

  అలాగే అంతర్-బహిర్లోకాల గురించి మీ ప్రస్తావన నాకు పూర్తిగా అర్థం కాలేదు. అంతర్లోకమంటూ ఏమీ లేనివాళ్ళు మనుషుల్లో ఎవరుంటారు. చైతన్యమున్న ప్రతీ మనిషికీ లోపల ఒక లోకం వుంటుందిగా.

  అలాగే యిందులో వాస్తవికత లేకపోవడమన్నదీ నాకు అర్థం కాలేదు. కాల్పనిక రచనలకు వేరే ఏ బయటి వాస్తవిక ప్రమాణల ఆధారంగానో అంచనావేయకూడదని నా భావన. ఒక రచన నుంచి ఎటువంటి వాస్తవికతను ఆశించవచ్చో ఆ రచనే చెపుతుంది. ఒక వాక్యమో పేరానో పేజీ మీద చేరగానే అది నిజమై కూచుంటుంది. అది ఆ రచనకు సంబంధించిన వాస్తవికతను నిర్దేశిస్తుంది. ఉదాహరణకి, “కొండ అంచున గుడిసెలో మగ్గం నేస్తున్న పద్మశాలీ వాకిట్లోకి ఒక గండభేరుండక్షి దుమ్ము లేపుకుంటూ వచ్చి వాలింది. చిరిగిన రెక్క చూపించి తనకో రెక్క నేసి పెట్టమని అడిగింది” అనే వాక్యంతో మొదలయిన కథ ఒకటీ, “కొత్త సింథాల్ సబ్బు రేపర్ తీస్తూ స్నానాలగదిలోకి వచ్చిన శివరావు దానికి మిగిలిపోయిన పాత సబ్బుముక్క అతికిస్తూ, సర్వీసింకిచ్చిన బండి ఈ సారి జేబుకెంత చిల్లుపెడుతుందో ఆలోచిస్తూ, పైకి మాత్రం ‘తరతరాల నిశీథి దాటే చిరువేకువ జాడతడే’ అంటూ కూనిరాగం తీస్తున్నాడు” అనే వాక్యంతో మొదలయిన కథ ఒకటీ వున్నాయనుకుంటే, ఈ రెండూ వేటి వాస్తవికతను అవి పరుస్తున్నాయి. ఈ రకంగా చూస్తే రేణుకాదేవి కప్పగా మారడంలోనూ అవాస్తవికత లేదు, చెఖోవ్ కథలోనూ అవాస్తవికత లేదు. మీరన్న వాస్తవికత అనే ముసుగు నాకేమీ కన్పించడం లేదు. పైగా ముందే అన్నట్టు గురోవ్‌లోనేను ఏ నాటకీయమైన మార్పూ చూడలేదు, అదీ కథానాయిక ద్వారా రావడం నాకు కనిపించలేదు.

  If you are interested, here is Nabokov's take on the story. Typically for him, he doesn’t at all give a damn about what’s the story is all about; all he talks about is minor details. Since details are, for him, divine. And I’ve recently found a discussion of the story by Harold Bloom. His is more concerned with the theme than Nabokov.

  ReplyDelete
 26. భావకుడన్ గారు,

  మీకు యిక్కడ సమాధానాలు దొరక్కపోయినా ప్రశ్నలు దొరుకుతున్నందుకు సంతోషం.

  >>> Culture is transmitted through generations by love. Why are we withdrawing our love, what for? For a higher ideal? I can’t see any.

  మీకు అస్పష్టంగా అనిపించిన పై వాక్యానికి నేను నిర్దేశించి అర్థం: సంస్కృతి బతికేది, సజీవంగా తరాలు మారేది దానిపై మనం చూపించే ప్రేమ ద్వారానే. ఆ ప్రేమని ఎందుకు మనం వెనక్కి తీసేసుకుంటున్నాం. అంతకన్నా గొప్ప ఆదర్శం కోసమా? అలాంటిదేమీ కనిపించడం లేదు.

  మీ వివరణలు కొన్ని అపోహలు తొలగించాయి. నాకూ కొన్ని ఆలోచనలు పుట్టించాయి. థాంక్స్!

  ReplyDelete
 27. మెహెర్ గారూ,

  యీ చర్చ కాదు కాని, ఇలాంటి థీం తోనే ఇంతకుముందు చదివిన కొన్ని కథల ప్రభావం ఉందనుకుంటా. గురోవ్ అన్నాల ప్రేమ నా మనసుకి హత్తుకున్నా, బహుశా ఇలాంటి ఆలోచనలు ప్రశ్నలూ వచ్చుండేవి కావు. మీరన్నట్టు గురోవ్ పాత్ర పట్ల ఏవగింపే కాదు, గురోవ్ అన్నాల ప్రేమ మహత్తరమైనదన్న భావమూ రచయిత ప్రకటించకపోవడం ప్రత్యేకతే.

  అంతర్లోకం గురించి - లోపలి లోకమంటూ లేని మనుషులు ఉంటారనే అనుకుంటున్నాను. అంటే లోపల ఏమీ దాచుకోకుండా అంతా బయటపెట్టేసేవారు. అలాంటి కొందరిని చూడబట్టి. ఏమో, అది నా భ్రమే కావచ్చు! ముఖ్యంగా, బహిర్లోకంలో అందరూ నటిస్తారు, లోపలి లోకంలోనే నిజాయితీగా ఉంటారు అన్న విషయం నాకు మింగుడుపడలేదు.

  Thanks for the links of Nabokov and Harold Bloom.

  ReplyDelete