March 12, 2012

మిత్రభేదం (రెండవభాగం)

ముందుమాట | మొదటిభాగం | మూడవభాగం | నాలుగవభాగం | ఐదవభాగం | ఆరవభాగం |
ఏడవభాగం | ఎనిమిదవభాగం | తొమ్మిదవభాగం | పదవభాగంఆఖరిభాగం | పూర్తి కథ pdf |            

బురద చిమ్ముకుంటూ వచ్చి ఆగింది బస్సు. ఈ రూటు బస్సుకు యెప్పటి ఆనవాయితీగానే లోపల చాలా తక్కువమంది ప్రయాణికులున్నారు. వెనకాల యెవరూ లేని చోటుకు వెళ్ళి కిటికీ ప్రక్కన కూర్చున్నాడు. బస్సు కదిలాక బయట వాన తెరలోంచి అస్పష్టంగా కనిపిస్తున్న దృశ్యకదంబానికి కళ్ళప్పగించాడు. రోడ్డు వారన నిర్విరామంగా కవాతుచేస్తున్న కొబ్బరి చెట్లూ, వాటికావల భూమి మీద పచ్చని ముఖమల్ వస్త్రంలా పరుచుకున్న పంటపొలాలూ, వీటన్నిటినీ చూస్తే అసలు మధ్యలో యిన్నేళ్ళ కాలం గడవనేలేదనిపిస్తోంది; కానీ ఆ కొబ్బరి చెట్ల బోదెలకు అంటించి వున్న యిటీవలి సినిమాల పోస్టర్లు, పొలాల మధ్య కొత్తగా మొలిచిన కోళ్ళ ఫారాలూ, గడిచిన కాలాన్ని గుర్తు చేస్తున్నాయి.  పరిసరాల్లోని యీ మార్పుల్ని చూస్తూ, వీటి మధ్య మసలుకునే వ్యక్తుల్లో కాలం యెలాంటి మార్పులు తెచ్చివుంటుందో అని ఆలోచించాడు. అసహనంగా నిట్టూర్చి సీటులో వెనక్కివాలాడు.

రేణుకాదేవితో  స్నేహం కాగానే అతను తొందర్లోనే సుబ్బరాజుగారి మేడ యెక్కే అవకాశం వస్తుందనుకున్నాడు. తన యింటికి తీసికెళ్ళి ఆమెకు చేసిన మర్యాదకు గాను ప్రతిమర్యాద అందకపోదు అని వేచి చూసాడు. కానీ అటువంటి ఆహ్వానం యేదీ రాలేదు. ఆమె మాత్రం బడి నుండి వచ్చేటపుడు కాసేపైనా అతని యింటి దగ్గర ఆగి, వాళ్ళ నాన్న కుండలు చేస్తూంటే దగ్గర కూచోవటమో, లేదంటే వాళ్ళమ్మతో వంటింట్లో గడపడమో చేసి వెళ్తూండేది. చూసి చూసి, చివరకో రోజు బడి నుండి వస్తున్నపుడు వుండబట్టలేక అడిగేసాడు.  రేణుకాదేవి అదేం భాగ్యమన్నట్టు వెంటనే ఒప్పుకుంది. శేషుకు మరో అనుచర స్నేహితుడైన బాలా కూడా ఆ రోజు వాళ్ళతోనే వున్నాడు. బాలా అనబడే ఈ బాలచంద్ర వూరి తపాలాబంట్రోతు గారబ్బాయి. సాధుజీవి, నెమ్మదస్తుడూను. కానీ తన యీ సద్గుణాల పట్ల యేమంత దర్పమూ మమకారమూ లేవు సరికదా, అవంటే అసహనం. అతని దృష్టిలో శేషు ఒకపూర్ణపురుషుడు.  రోజల్లా అతని కూడానే తిరుగుతూంటాడు. అలా తిరగడం వల్ల రేపోమాపో తనూ శేషులా అయిపోతాడని నమ్మకం. శేషూకి కూడా నిత్యం యెవరో ఒకరు వెంట లేకపోతే తోచదు.  ఆ సాయంత్రం రేణుకాదేవి మేడకు తీసికెళ్ళమంటే అంత తొందరగా ఒప్పుకుంటుందనుకోలేదు. ఒప్పుకోగానే యెందుకో యెవరన్నా తోడుంటే బాగుండుననిపించింది. బాలాని కూడా వెంట తీసికెళ్ళాడు.

శ్రీపాదపట్నంలో తొలి రెండంతస్తుల మేడ సుబ్బరాజుగారిదే. ఏటిగట్టుకు సమాంతరంగా వుండే రాజవీధిలో యేటికెదురుగా వుంటుంది. చూడగానే, యీ మేడ అసలెప్పుడన్నా కొత్తగా వుండేదా అనిపిస్తుంది.  గోపీ చందనం పూత చాలా చోట్ల వెలిసిపోయింది.  గోడల మీద చెక్కుబళ్ళు పదునుపోయి బండబారాయి.  పై అంతస్తు మీది పెంకులు నాచు పట్టి నల్లబడిపోయాయి. కానీ యీ వడలినతనమే మేడకో వింత అందాన్నిచ్చేది. మేడ వున్నది రెండంతస్తులే అయినా చాలా యెత్తుండేది. ఇదివరకటి రోజుల్లో అయితే వూరివాళ్ళెవరూ యీ మేడకన్నా యెత్తుగా యిల్లు కట్టరాదన్న అలిఖిత శాసనం కూడా చెలామణీలో వుండేదట. ఒక్క జనార్దనస్వామి గుడిగోపురం మాత్రమే దీన్ని మించిన యెత్తు వుండేది. అది యీ మేడ ప్రక్కనే వుంటుంది. దాన్ని సుబ్బరాజుగారి వంశపూర్వీకులు కట్టించారు. ఈ గుడి వుండటం వల్ల యేడాదిలో యే చిన్న పర్వదినమైనా ఆ వీధంతా భక్తజన సందోహంతోనూ, పూజాద్రవ్యాలు అమ్మే దుకాణాల సందడితోనూ కళకళ్లాడుతుంది.

అలాంటి ప్రత్యేకతలు యేమీ లేని యీ రోజు మాత్రం ఆ వీధి నిస్తేజంగానే వుంది. సాయంత్రపు యెండకి వీధిలో అర్థభాగాన్ని మేడ నీడ కప్పేసివుంది.  ఎత్తరుగుల నడుమ మెట్లెక్కుతున్నపుడు శేషు గుండె గుబగుబలాడింది. మోకాలెత్తు గడప దాటి లోపల అడుగుపెట్టగానే, వుయ్యాల బల్ల మీద సుబ్బరాజుగారు మధ్యాహ్నపు కునుకు తీస్తూ కనిపించారు. కుర్రాళ్ళిద్దరూ స్థాణువులైనట్టు గుమ్మంలోనే ఆగిపోయారు. రేణుకాదేవి ఫర్లేదన్నట్టు శేషు చొక్కా పట్టుకుని లోపలికి లాగింది.  గోడవారగా పై అంతస్తులోకి కట్టిన పచ్చని చెక్క మెట్ల వైపు నడిచారు.

రేణూ! మీ తాతకి చెప్పకుండా పైకి వెళ్ళొచ్చా శేషు గొంతులోకి బింకం తెచ్చుకుని గుసగుసగా అడిగాడు.

ఫర్లేదు, యేవీ అనరు పదా! అంటూ మెట్లెక్కింది రేణు. బాలా మాత్రం శేషు ప్రక్కన వుంటే శేషూకే ధైర్యం చెప్పగల ధీరుడైపోతాడు. కాబట్టి వుత్సాహంగానే మెట్లెక్కేసాడు. పై అంతస్తులో మెట్లు చేరే చోట ఓ మూలకి రేణు గది వుంది. గదిలో ప్రవేశించగానే శేషులో వుత్సాహం అతిశయించింది. కిటికీ దగ్గరికి పరిగెత్తుకెళ్ళి వూచల మధ్య ముఖం యిరికించేసాడు. కిటికీ అవతల గుమికూడిన పావురాలు వులిక్కిపడి యెగిరిపోయాయి. అతను  వూరిని అంత పైనుండి యెపుడూ చూడలేదు. ఈ కొత్త యెత్తులోంచి చూస్తే,  రోజు చూసే రాజవీధి కూడా అపరిచితంగా కనిపిస్తుంది. ఒరే బాలిగే యిల్రారా! మనం ఆ రావి చెట్టుకన్నా పైనున్నాంరోయ్,  అంటూ యేటి గట్టున వున్న రావిచెట్టుని వూచల్లోంచి చేతులు పెట్టి చూపిస్తూ చెప్పాడు.

బాలా గది కలయజూస్తున్నాడు. అతణ్ణి కిటికీ కన్నా రేణు గది ఆకట్టుకుంది. అక్కడవున్న పెద్ద పందిరి మంచం వైపు వెళ్ళి, నువ్వొక్కర్తివే పడుకుంటావా యిక్కడ? కింద పడిపోవా? అని అడుగుతున్నాడు.

అలవాటైతే పడిపోమంటూ బాలాకి సూక్ష్మం విశద పరచి, ఆమె శేషు వుత్సాహాన్ని పంచుకోవడానికి కిటికీ దగ్గరకు వెళ్ళింది. రావిచెట్టేంటి బాబూ, యీ గది జనార్దనస్వామి రథమంత యెత్తు కూడా వుంటుంది,” అంది గొప్పగా . బాలా కూడా కిటికీ దగ్గరకు వచ్చాడు.

రథం ప్రస్తావనతో శేషూకి సొంత సమస్య ఒకటి గుర్తొచ్చింది, మనల్ని రథమెక్కనియ్యట్లేదురా జనాలు. నిరుడు పదోక్లాసోళ్ళు కొంతమంది యెక్కేసేరంట. ఆళ్ల పని బావుంది. ఈ యేడైనా యెలాగైనా యెక్కాల్రా, అని మథనపడ్డాడు. బాలా అవునన్నాడు.

తాతయ్యకి చెప్పనా, అపుడు మీరెక్కచ్చు! రేణు తాను చేయగల సాయం చెప్పింది.

వద్దమ్మోయ్ నీకో దణ్ణం! మీ తాత ముందు మా నానకి చెపుతాడు. మా నానేమో అమ్మకి చెపుతాడు. అపుడు నాకు డప్పడిపోద్ది. రథమెక్కడం కాదు కదా, తిరణాలప్పుడు బైటికి కూడా యెళ్ళనివ్వదు! ఇంతలో క్రిందెవరో బట్టతలాయన సైకిలు మీద వెళ్లడం చూసి శేషుకి అలాంటిదే యింకో బట్టతల గుర్తొచ్చింది. ఒరే మన లెక్కలోడు యిలాగే వెల్తాడ్రోయ్ సైకిలు మీద, ఆణ్ణి యిక్కణ్ణించి రాయిచ్చుకు కొట్టేసి దాంకోవచ్చు, అన్నాడు. బాలా అవునన్నాడు.

రేణూకి హఠాత్తుగా యేదో గుర్తొచ్చినట్టు అల్మరా దగ్గరకు పరిగెత్తుకెళ్ళింది. అందులోంచి పాత ఫొటో ఆల్బమ్ ఒకటి తీసింది, మా అమ్మని యెవరు చూస్తారోయ్!  అంటూ. అప్పటికే కిటికీ సంబరం తీరిపోవడంతో యిద్దరూ వెనుదిరిగారు. అంతా కలిసి పందిరి మంచం యెక్కారు. ఆల్బమ్‌లో యెక్కువ ఫొటోలేవీ లేవు. ఉన్నవాటిలో కొన్ని సగానికి చించివేసి వున్నాయి. వాటిలో దయగల కళ్ళతో, అందమైన నవ్వుతో ఒకామె వుంది. చించివేసిన అర్థభాగంలో యెవరో వున్నారన్న సంగతి ఆమె నవ్వులో తెలుస్తోంది.  ఎవరు చించేసారని అడిగాడు శేషు. మా తాతయ్య అని చెప్పింది రేణు. యెందుకూ అని అడిగితే, తాతయ్యకి నాన్నంటే యిష్టం లేదు అని మాత్రం చెప్పింది. తర్వాత ఒక్కో ఫొటో చూపిస్తూ, ఆ ఫొటో సందర్భాన్ని లీనమైపోయి వివరించడం మొదలుపెట్టింది. ఒక ఫొటోలో తాను కట్టుకున్న బుల్లి వోణీ అమ్మ పాతచీర చింపి కుట్టిందన్న సంగతీ, వూళ్ళో సర్కస్‌కి వెళ్ళినపుడు తీయించుకున్న ఫొటోలో పదే పదే తలెత్తి అమ్మ వంక చూస్తున్న తనకి సర్ది చెప్పలేక ఫొటోగ్రాఫరు అలాగే తీసేసిన సంగతీ, అమ్మ దేవగన్నేరు పూల చెట్టు దగ్గర నిలబడి ఫొటో తీయించుకున్నపుడు తనింకా పుట్టని సంగతీ... యిలా అన్నీ వుత్సాహంగా  చేతులూపుకుంటూ చెప్పింది.

ఇంతలో యేదో అలికిడి వినిపించటంతో శేషులో జంకు మొదలైంది. వెళిపోదామని తొందరపెట్టాడు. ముగ్గురూ బయల్దేరి మెట్ల మీదకొచ్చారు. క్రింద సుబ్బరాజుగారు వూరి అడ్వకేటు ఒకాయనతో యేదో మాట్లాడుతున్నారు. అలికిడి విని తలెత్తి చూసారు. శేషు ఆయన చూపు బరువును యిబ్బందిగా మోస్తూ మెట్లు దిగాడు. అయితే భయపడినట్ట్టు యేమీ జరగలేదు.

ఎవరమ్మా వీళ్ళు,  అని మాత్రం అడిగారు.

శేషు, బాలా యిద్దరూ ఫలానా వాళ్ళ అబ్బాయిలమంటూ తండ్రుల పేర్లు చెప్పారు.

ఓ! నువ్వు కుమ్మరి సుబ్బన్న అబ్బాయివా? విష్ణు తమ్ముడివన్న మాట. యెలా చదువుతున్నావురా!  శేషుని అడిగారు.

బానే చదువుతున్నా అన్నాడు.  అన్నయ్య యెలా చదువుతున్నాడని అడిగారు. బానే చదువుతున్నాడని చెప్పాడు. హాస్టలు ఫీజుకేవైనా టైమయిందా అని అడిగారు. నాకు తెలియదని చెప్పాడు. సరే వెళ్ళండన్నారు.  రేణుకి వీడ్కోలు చెప్పి బయటపడి వూపిరి పీల్చుకున్నారిద్దరూ. శేషుకి తరువాతెపుడో తెలిసింది, అన్నయ్య కాలేజీ చదువుకు సుబ్బరాజుగారు కొంత సాయం చేసారని. ఊళ్ళో ఆయన ఔదార్యం మీద నడిచే జీవితాలు చాలానే వున్నాయి.  బయటివాళ్ళ పట్ల యెంతో దయగా వుండే ఆయన, మనవరాలి పట్ల మాత్రం అంటీముట్టనట్టు వుండటం శేషుకు ఆశ్చర్యమనిపించేది. దరిమిలా  రేణుని కలవడానికి ఆ మేడలోకి చాలాసార్లు వెళ్ళాడు. అపుడర్థమైంది తాతా మనవరాళ్ల మధ్య అనుబంధం యెంత పలుచనైనదో. ఆయన మనవరాల్ని దగ్గరకు తీసుకుని ముద్దు చేయగా అతనెపుడూ చూడలేదు. ఆమె ఒక యెదిగిన పిల్ల అన్నట్టే ప్రవర్తించేవారు. ఆమెతో మాట్లాడే కొద్ది మాటల్లో కూడా, పైకి అవి మెత్తగానే ధ్వనించినా, యేదో అస్వాభావికమైన ముక్తసరితనం స్ఫురించేది. కూతురు వల్ల ఆయనకు కలిగిన అనుభవమే మనవరాలి పట్ల యీ తెచ్చిపెట్టుకున్న వుపేక్షకు కారణమయ్యుండచ్చని శేషుకి పెద్దయ్యాక అర్థమయింది.

సుబ్బరాజుగారు కూతుర్ని చాలా గారాబంగా పెంచారు. ఇంట్లో తల్లిదండ్రుల గాఢానురాగవలయం మధ్య పెరిగిన కొందరు పిల్లల్లో బయట ప్రపంచం కూడా అంతే ప్రేయమయంగా వుంటుందన్న నమ్మకం పోగుపడుతుంది. అక్కడ వుండే కుత్సితాలకూ, క్రూరత్వాలకూ, వంచనలకూ ప్రతిగా వారిలో యెలాంటి కవచాలూ యేర్పడవు. ఎందుకంటే వారికి అప్పటిదాకా  వాటి అవసరం వచ్చి వుండదు. సుబ్బరాజుగారి కూతురు అదే అమాయకపు నమ్మకంతో బయటి ప్రపంచంలో అడుగుపెట్టింది. కాలేజీ చదువుకు పట్నానికి వెళ్ళింది. అక్కడ ఒక సహాధ్యాయి పరిచయమయ్యాడు. అతను అప్పటిదాకా జులాయిగా లెక్కలేకుండా బతికినవాడల్లా, అప్పుడపుడే వయసుతో పాటూ ముంచుకొస్తున్న తప్పనిసరి బాధ్యతల పొడకి భయపడే దశలో వున్నాడు. ఏదో ఒక ఆసరా కోసం అర్రులు చాస్తున్నాడు. యీ తరుణంలో సుబ్బరాజుగారి కూతురు కనపడింది. ఆమెను ప్రేమలో పడేయడం పెద్ద కష్టం కాలేదు. ఆమె మొదట కొన్నాళ్ళు సందిగ్ధంలో కొట్టుమిట్టాడినా, క్రమేపీ మెత్తబడింది. అతని దిశలేనితనమూ, ఆసరాలేనితనమూ ఆమెకు బోలెడు సంస్కరణావకాశాల్ని చూపించాయి. ఆ సంస్కరణాభిలాషకి తోడు, పెంపకం వల్ల వచ్చిన తీపి  ఆశావాదం కూడా జతకూడి, అతణ్ణి ప్రేమించేలా చేసింది. సుబ్బరాజుగారు మాత్రం పెళ్లికి ఒప్పుకోలేదు. కులం ఒకటే అయినా, ఆయనకు అతని కుటుంబంపై గౌరవం లేదు. ఆమె తండ్రిని యెదిరించి వివాహం చేసుకుంది. కాలం గడిచింది. లాభసాటిగా వుంటుందనుకున్న బంధం నుండి యేమీ అందకపోయేసరికి, ఆమె భర్త  క్రమేణా ఆమెపై విషాన్ని వెళ్ళగక్కడం మొదలుపెట్టాడు. ఈ సంగతి మావగారికి యెలాగో తెలుస్తుందనీ, కూతురి సంసారాన్ని చక్కబెట్టుకోవడానికైనా ఆయన దిగివచ్చి ఆర్థికసాయం చేస్తాడనీ ఆశించాడు. ఆయన యెన్నాళ్లయినా దిగిరాలేదు. అతనిలో పరిస్థితుల పట్ల అసహనంతో పాటూ, ఆమె పట్ల క్రౌర్యమూ పెరిగింది. ఆమె స్వాభిమానంతో అటు తండ్రి దగ్గరికి వెళ్ళలేక, మారతాడన్న ఆశతో యిటు భర్తని భరిస్తూ నెట్టుకురాసాగింది. కానీ పరిస్థితి అంతకంతకూ అధ్వాన్నమయిందే గానీ మెరుగవలేదు.  ఒకనాడు సుబ్బరాజుగారికి ఆమె చనిపోయిందన్న వార్త చేరింది. మాట వినని ఫలితం తెలుసుకుని కూతురు వెనక్కి వచ్చేస్తుందని ఆశించాడే గానీ, యిలా ఆమె శవంగా మారుతుందని వూహించలేదు. పట్టరాని ఆగ్రహంతో ఆ రాత్రికి రాత్రి కొందరు పాలేళ్లని వెంటతీసుకు వెళ్ళి అతణ్ణి హతమార్చాడు. వచ్చేటపుడు మనవరాలిని వెంట తెచ్చేసుకున్నాడు.  రాచరికపు న్యాయం అమలు చేసినట్టు భావించాడే తప్ప, నేరం చేసాననుకోలేదు. చట్టం నుండి కొన్ని యిబ్బందులు ఎదురయ్యాయి. అప్పటికే కాలం చెల్లిపోయిన రాచరిక పరపతి అవశేషాలన్నింటినీ వుపయోగించి, బోలెడు ఆస్తిని కరగబెట్టుకుని, యెలాగో శిక్ష నుండి బయటపడ్డాడు. కానీ జీవిత థృక్పథాన్ని సాంతం నల్లబార్చిన యీ అనుభవపు మచ్చని యెంతకాలమైనా చెరిపివేసుకోలేకపోయాడు.

కూతురు విషయంలో చేసిన తప్పులు (కనీసం ఆయన తప్పులు అనుకున్నవి), మనవరాలి విషయంలో చేయకూడదనుకున్నాడు. ఆమెతో విభిన్న వైఖరి అవలంబించడం మొదలుపెట్టాడు. ఆమెను పూర్తి పేరు పెట్టి పిలవడం, ఆమె ప్రతీ బాల్య చేష్టనూ అసలు చూడనట్టు నటించడం, సమవయస్కురాలన్నట్టు మర్యాదగా వ్యవహరించడం మొదలైనవి చేసాడు. పైగా ఆయనలో ఒక రకమైన అలసట కూడా వచ్చేసింది. ఆమె ఆలనాపాలనా దాదాపు యింటి పనివాళ్ళకు వదిలేశాడు. కానీ తాతయ్య దూరం పెట్టే కొద్దీ మనవరాలిలో ఆయన ఆశించిన స్వతంత్రత బదులు,  అల్లుకుపోగల ఆధారం కోసం అంగలార్చే లతలాంటి ఆశ్రితత్వం మొదలైంది. బయటకు బలంగా విస్తరించడానికి బదులు తనకై తాను నిర్మించుకున్న ప్రపంచంలో ముడుచుకుపోవడం మొదలుపెట్టింది. ఆ ప్రపంచంలోకి ఆమె రానిచ్చిన యేకైక అతిథి శేషు.
*     *     *
బస్సు ఆగితే శ్రీపాదపట్నం వచ్చేసిందేమోనని కంగారుపడ్డాడు. అతని వూహలు యే వేగంతో కాలాన్ని దాటుతున్నాయో, ఆ వేగంతో బస్సు దూరాన్ని దాటలేదుగా. మార్గమధ్యంలో యేదో రైసు మిల్లు దగ్గర యెవరో చెయ్యెత్తితే ఆగింది.  గొడుగు ముడుచుకుంటూ ఆ ప్రయాణికుడు బస్సు  యెక్కాడు. అతణ్ణి గుర్తుపట్టడానికి పెద్ద సమయం పట్టలేదు. సూదావోడు అని పిలవబడే సూదా వీర్రాజు. ప్రస్తుతం కండక్టరు దగ్గర టికెట్టు తీసుకునే పనిలో వున్నాడు. కాసేపట్లో తనని చూడవచ్చు, చూడకపోవచ్చు కూడా. చూడకపోతే తాను పనిగట్టుకు పలకరించాలా? చూసి గుర్తుపడితే అతనైనా పలకరిస్తాడా?  ఈ సంశయాలకు ఒక కారణం వుంది. పాఠశాలలో వాళ్ళిద్దరూ బద్ధశత్రువులు. యెనిమిదో తరగతిలో ఒకసారి బాలాగాడి చెల్లెల్ని యేడిపించాడని తెలిసి వీడితో బడి భోజన విరామంలో గొడవపెట్టుకున్నాడు. ఇద్దరూ సై అంటే సై అని యెగదోసుకుంటూ కుస్తీపట్ల దాకా వెళ్ళారు. బెంచీల మీదపడి కాసేపు  కొట్టుకున్నారు. చివరకు శేషూదే పై చేయి అయింది. కంపాక్సు బాక్సులోంచి వృత్తలేఖిని తీసి వీడి వీపు చీరేసాడు. చొక్కా మొత్తం రక్తంతో తడిసిపోయింది. సంతవీధిలో కిరాణాకొట్టు నడిపే వీళ్ళ నాన్నమరుసటి రోజు బడి మీదకి దండెత్తి వచ్చాడు. ఆ రావడం కూడా సూదావోణ్ణి చొక్కా లేకుండా తీసుకొచ్చి, గాయాలు చూపించి మరీ రంకెలేసాడు. శేషుని బడిలోంచి తీసేయకపోతే పంచాయితీ దాకా వెళ్తానని బెదిరించాడు. హెడ్మాస్టరు యీ గొడవ భరించలేక టి.సి యిచ్చి పంపేస్తానని హామీ యిచ్చేకనే బయటికి కదిలాడు. శేషు చదువు అక్కడితో అటకెక్కేదే. వాళ్ళ నాన్న వెళ్ళి సుబ్బరాజుగారికి మొరపెట్టుకుంటే, ఆయన యెలాగో గొడవ సద్దుమణిగేలా చేసాడు. కానీ హైస్కూలు పర్యంతం కుర్రాళ్ళిద్దరి మధ్యా ప్రచ్ఛన్నయుద్ధం నడుస్తూనే వుండేది.

ప్రస్తుతం టిక్కెట్టు తీసుకున్న సూదావోడు ముందు సీట్లలో కూర్చోబోతూ, తనవైపు యేవో రెండు యేకాగ్ర దృక్కులు యెక్కుపెట్టబడిన స్పృహ కలిగి, తల తిప్పి శేషు వైపు చూశాడు. భృకుటి అనిశ్చితితో క్షణమాత్రం ముడిపడి, వెంటనే కళ్ళు గుర్తింపుతో వెలిగి, పెదాలు నవ్వుతో విచ్చుకున్నాయి. శేషు కూడా నవ్వాడు. ఆ క్షణాన సూదావోడి నవ్వుకు ప్రతిగా నవ్వకపోవడం అతని పట్ల అమర్యాద కాదు, మొత్తం గతం పట్లే అమర్యాద అనిపించింది.

ఒడియమ్మా! యెవరో అనుకున్నాన్రా!  అంటూ గొడుగూపుకుంటూ వచ్చేసాడు సూదావోడు.

రారా షావుకారు!  అంటూ శేషు బాగ్ వళ్ళోకి తీసుకుని అతనికి చోటిచ్చాడు.

కూర్చుంటూనే చనువుగా శేషు భుజం చుట్టూ చేయి వేసి బిగిస్తూ,  ఏరా బాబూ! వస్తన్నావో లేదో అనుకుంటున్నా!  పరిచితమైన ముఖంపై అపరిచిత మీసాన్ని విప్పార్చి నవ్వుతూ అన్నాడు.

ఇదేదో తేడాగా వుందిరోయ్, క్లాసు క్లాసంతా వస్తుంటే ప్రత్యేకంగా నా ఒక్కడి గురించీ కంగారు పడ్డం, అది కూడా నువ్వు! అందుకే అంటారేమో ప్రేమించినోళ్ళ కన్నా పగోళ్ళు బా గుర్తుంటారని...

మరి కాదేంటి! నేనైతే ప్రామిసుగా చెప్తున్నారేయ్...  బాలిగాడు యిలా ఫంక్షనని చెప్పంగానే నాకు ఫస్టుకంటా గుర్తొచ్చింది నువ్వేరా! ఆడితో అన్నా కూడా... ఆణ్ణే అడుగు కావలిస్తే!

ఎందుకు ఆళ్ళీళ్ళని అడగడం! ఏదోలా గుర్తెట్టుకున్నావు అంతే చాలు! పన్నెండేళ్ళంటే అందరూ మర్చిపోయుంటారనుకున్నా.

అందరి సంగతీ నాకు తెలీదుగానొరే, నేను మాత్రం విస్తరేసినోణ్ణయినా మర్చిపోతానేమో గానీ, వీపు చీరేసినోణ్ణి మర్చిపోన్రోయ్! ఎదవా, నాకింకా ఆ మచ్చలున్నాయ్ తెలుసా!  మా మిసెస్ యిప్పుడికీ అంటాది, యెవరో అట్లకాడతో వాతెడితే తప్ప అంత మచ్చరాదని!

అబ్బో, పెళ్ళయిపోయిందేంట్రా! మరి అంత మర్చిపోనోడివి పెళ్ళికి పిలవలేదే! నిష్టూరంగా అడిగాడు; తాను పిలుపు ఆశించలేదనీ, పిలిచినా బహుశా వచ్చేవాడు కాదని తెలిసినా, ప్రస్తుత నూతన సుహృద్భావం ప్రకారం అలా పిలవకపోవడం అన్యాయమే అనిపించింది.

ఏదో కంగారు కంగారుగా అయిపోయిందిరా! అయినా మా విలేజెస్‌లో పెళ్ళిళ్లదేవుంది లేరా. పెద్దోళ్ళెవర్ని చూపిత్తే ఆళ్ళకి ముడేసేయడం, పిల్లల్ని కనేయడం, ఆళ్ళ  పెంపకంలో పడిపోవడం... మీ సిటీ జనం జీవితాల్లా మజా పాడూ యేవుంటదిరా?

నువ్వనుకున్నంత అక్కడేం లేదుగానీ, పెద్దోళ్ళంటే గుర్తొచ్చింది మీ బాబేం చేస్తున్నాడ్రా?

ఇంకెక్కడ బాబురా బాబు! రెండేళ్ళవుతుంది పోయి. అటూయిటూ కాకండా వరకడ్డంగా వదిలేసెళ్లిపోయాడు.

అయ్యో, యేమైందిరా?

గుండె పోటు. కొట్లో తిన్నంగా కూచునేవోడేటి, యేదో చెత్త నవుల్తానే వుండేవాడు...

శేషూకి ఆ రోజు టీచర్లు ఆపుతున్నా తన వీపు చీరాకనే బయటికి కదుల్తానని దూసుకొచ్చిన ఆయన ఆగ్రహ భంగిమలు గుర్తొచ్చాయి. ఆ సంఘటన తర్వాత అతని బాల్యపు ప్రగాఢ శత్రువుల్లో ఆయనొకడయ్యాడు. ఇపుడు పోయాడంటే మాత్రం బాధ కలిగింది,  కానొరే మీ బాబు హడలగొట్టినట్టు నన్నెవరూ హడలగొట్టలేదురా. ఆయన కంటబట్టానికి జడిసి, అమ్మ సరుకులేవన్నా తెమ్మని పంపినా సంతలోంచి వెళ్ళకుండా చుట్టుతిరిగి వెళ్ళేవాణ్ణి. మరి షాపెవరు చూసుకుంటున్నారిపుడు?

అందికే కదరా బాబు, అటూయిటూ కాకండా వదిలేసాడనేది, వూరికేనేటి?! షాపు మా అన్నయ్య లాగేసుకున్నాడు. ఇదిగో చివరికి మనకీ రైసుమిల్లుగుమాస్తా బతుకు మిగిలింది. ఇంక అలా పడతా లేత్తా పోతుంది. నా సంగతికేంట్లే గాని, నీ కవుర్లేంటి చెప్పు!  ఆ మజ్జెన ఫారిన్ కంట్రీస్ అదీ కూడా యెళ్ళొచ్చావన్నారెవరో? యిపుడేం చేస్తున్నావు?

శేషు నగరంలో తన ఉద్యోగమేమిటో చెప్పాడు. జీతమెంతో అడిగితే అది కూడా చెప్పాడు. అది వినగానే సూదావోడు ఒక విలాసవంతమైన జీవితాన్ని ప్రతిపాదించి, అలాగే నడుస్తుందో లేదో అడిగాడు. అడగడం యేదో వుబ్బేసినట్టే అడిగినా, శేషూకి అందులో కాస్త యీర్ష్యపాలు కనిపించింది. నవ్వుతూనే కాదని కొట్టిపారేసాడు. తర్వాత సూదావోడు నగరంలో యేవన్నా వుద్యోగముంటే చూడమనీ, తాను కూడా వచ్చేస్తాననీ, యీ వెదవ పల్లెటూళ్ళో వుండలేకపోతున్నాననీ యేవో చెప్పుకొచ్చాడు. అప్పటికే బస్సు వూరి పొలిమేరల్లో ప్రవేశించడంతో శేషూకి ఆ సంభాషణ మీద ఆసక్తి సన్నగిల్లింది. ఊరి చివర్నుండే సినిమా థియేటరు కనబడగానే గుర్తుపట్టి ఆనందంగా,  వార్ని! యిదింకా వుందేంట్రా... లేపేసుంటారనుకున్నా! దీని పేరేంటీ గుర్తురావట్లే? అని అడిగాడు.

దేవీ థియేటరు. అయినా యిప్పుడిందులో సినిమాలేవీ ఆట్టంలేదురా. చాన్నాళ్ళు  పాడుబెట్టేసారు. ఈ మద్దెనే పక్కన మిల్లోళ్ళు బియ్యం గోదాం కింద వాడుకుంటున్నారు!

వెనువెంటనే శ్రీపాదపట్నపు యిళ్ళూ వాకిళ్ళూ మొదలయ్యాయి. వర్షపు తాకిడికి వూరు కడుపులో కాళ్ళు ముడుచుకు పడుకున్నట్టుంది. అక్కడో గొడుగూ యిక్కడో గొడుగూ మినహాయిస్తే, దారంతా దాదాపు నిర్మానుష్యంగా వుంది. శేషు కిటికీ లోంచి ఆబగా చూస్తున్నాడు. ఒక గుడిసె ముందు అమ్మకానికి నిలబెట్టిన రాజకీయనాయకుల సిమెంటు విగ్రహాలు వివిధ భంగిమల్లో చేతులెత్తి నిలబడి వానకి తడుస్తున్నాయి. రెండు పెంకుటిళ్ళ మధ్య యిరుకు సందులో చక్రాలు లేని జట్కాబండి ఒకటి చూరునించి కారుతున్న వానధారల్లో నానుతోంది. దిరిసెన చెట్టు క్రింద వున్న సిమెంటు చప్టా కొనకి సైకిలు టైరొకటి వేలాడుతోంది.  తెలిసిన పరిసరాలు తెలియనట్టూ, తెలియని పరిసరాలూ తెలిసినట్టూ అతని జ్ఞాపకాలు తత్తరపడుతున్నాయి. బస్సు గడియారస్తంభం వీధికి తిరిగాక యిద్దరూ సీట్లోంచి లేచారు. శేషు మనసు అతని శరీరంలోంచి వురికిపోవాలని తొందరపడుతోంది. వెనకాల సూదావోడు యేదో మాట్లాడుతున్నాడు గానీ, ముక్తసరి సమాధానాలతో సరిపుచ్చుతున్నాడు. క్రిందకి దిగేందుకు యెదుటి సీట్లలో ప్రయాణికులు చేస్తున్న తాత్సారం అతనికి అసహనం కలిగిస్తోంది. కాస్త తడిస్తే తలమీద మొక్క మొలిచిపోతుందన్నట్టు దిగేముందు ప్రతీవాడూ బస్సు తలుపు దగ్గర కాసేపాగి, యే యింటి చూరు క్రింద దూరాలో  ముందే నిర్ణయించుకుని మరీ దిగుతున్నాడు. వెనక సీట్లో కూర్చుని తప్పు చేసాననిపించింది శేషుకి. చివరికి  అతని వంతువచ్చింది. చిత్తడి నేల మీద అడుగుపెట్టగానే, వెనకాల సూదావోడు యిద్దరి తలల మీదకీ గొడుగు తెరిచి, రేయ్, భద్రీ గాడి షాపిక్కడే, కలుద్దావా? అని అడిగాడు.

0 స్పందనలు:

మీ మాట...