March 15, 2012

మిత్రభేదం (ఐదవభాగం)

ముందుమాట | మొదటిభాగం | రెండవభాగం | మూడవభాగం | నాలుగవభాగం | ఆరవభాగం |
ఏడవభాగం | ఎనిమిదవభాగం | తొమ్మిదవభాగం | పదవభాగం | ఆఖరిభాగం | పూర్తి కథ pdf |      

తండ్రి చేతుల్లోంచి లాంతరు తీసుకుని బాలా శేషూని కాళ్ళు కడుక్కోవడానికి  పెరట్లోకి తీసుకెళ్లాడు.  బొప్పాయి ఆకుల మీదా, నూతిపళ్ళెంలో బోర్లించిన పాత్రల మీదా చినుకులు వేర్వేరు స్థాయిల్లో దరువేస్తున్నాయి. శేషు పెరటి చూరు క్రింద వున్న బకెట్లోంచి నీళ్ళు దొలుపుకుంటూ, యేదో గుర్తొచ్చినట్టు, ఒరే మర్చిపోయా, ఆ బయటి గొడుగు భద్రి గాడిది. తర్వాత వాడికిచ్చేయాలి, అన్నాడు.

ఓ కలిసావేమిటి. యేవంటున్నాడు? బాలా గుమ్మానికి జారబడుతూ అడిగాడు.

ఆడేంట్రా బాబూ! మన భద్రి గాడేనా అనిపించింది. ఎలా వుండేవోడు! ఇపుడు నోరిప్పితే ఆళ్ళీళ్ళ మీద కసి తప్ప యింకోటి రావటం లేదు. ఇందాక వాడూ సూదావోడూ చూడాలి, నేను లేకపోతే మాటల్తోనే పీకలు కోస్సుకునేలా వున్నారు.

పీకలు కోస్సుకునేవాళ్ళే నయం. కనీసం ఆ చనువైనా చూపిస్తారు. మనోళ్ళలో యింకా చిత్రమైన రకాలున్నారు. మన నారిగాడున్నాడనుకో, సెంటర్లో నగలకొట్టు పెట్టాడు; ఆడంతటాడు పలకరించడూ, పొరబాట్న మనం కొట్టుకెళ్ళినా యెంతో మర్యాదగా  ‘ఏవండీ, యేం చూపించమంటారండీ’ అని అతి మర్యాదగా మాట్లాడతాడు. మొదట్లో యేదో హాస్యానికంటున్నాడు కామోసనుకున్నా. తర్వాత అర్థవైంది, మనల్ని దూరం పెట్టడానికి ఆడికా ‘అండీ’ అనే పిలుపో ఆయుధమని. మళ్ళీ చిన్నప్పుడెంత కలుపుగోలుగా వుండేవాడూ? అందుకే కాలమహిమ అంటారేమో. అది  తల్చుకోవాలేగాని, యెంత దిట్టమైన వాణ్ణయినా వంగదీసేస్తుంది. యెంత అణగారిపోయినవాణ్ణీ లేపి నిల్చోబెడుతుంది.

ఎవరి సంగతో తెలియదు గానీ, నువ్వు మాత్రం మారిపోయావురా బాలిగే! మాటలు నేర్చావు. నీ వుత్తరాలు చదివినపుడు అదే అనిపించేది. చిన్నప్పుడు యెంత యెర్రెంకన్నలా వుండేవాడివిరా! ఎలా బతుకుతావో అనుకునేవాణ్ణి. ఇప్పుడు రచయితవీ, చదువుకున్న బళ్ళోనే పాఠాలు చెప్తున్నావూ... సామిరంగా!

ఏం పాఠాలు చెప్పడంలేరా బాబూ, మా నాన్న వింటే నవ్వుతాడు, యేదో బతకలేక బడిపంతులు వుద్యోగమని! ఆయనకి యింజనీర్లూ డాక్టర్లూ తప్ప మనుషులానరు, అంటూ దండెం మీంచి తువ్వాలు తీసి శేషూకి అందించాడు.

ఇద్దరూ పెద్దగదిలోంచి వెళ్తుంటే, ప్రక్కన వంటగదిలో సూర్రావుగారి అలికిడి వినపడింది. నాన్నా, యేంటి చీకట్లో? అంటూ బాలా లాంతరు యివ్వటానికి లోపలికి వెళ్ళాడు. ఆయన భోజనాల విషయం ప్రస్తావించినట్టుంది, నువ్వు తినేయి, మేవిద్దరం కలిసి తర్వాత తింటాం! అంటూ బయటకొచ్చాడు. ఇద్దరూ కలిసి బాలా గది వైపు నడిచారు.

ఇదేరా నా అడ్డా, అంటూ లోపలికి తీసుకెళ్ళాడు బాలా. అది అతను చదువుకోవడం, రాసుకోవడం చేసే గది. ఒక మూల మేజాబల్ల మీద కొవ్వొత్తి వెలుగుతోంది. దాని వెలుగు  గది గోడల్నిండా అతిశయించిన నీడల్ని అలుకుతోంది. కొవ్వొత్తి చుట్టూ నిఘంటువులూ, తెల్ల కాగితాలూ, పెన్నుల కుండీ యిత్యాది సరంజామా వుంది. గదిలో రెండు గోడల్ని అద్దాల బీరువాలు ఆక్రమించి వున్నాయి. వాటి నిండా క్రిక్కిరిసిన వరుసల్లో పుస్తకాలు కనిపిస్తున్నాయి.

శేషూ తలుపు ప్రక్క గోడకి ఆనుకుని వున్న సోఫాలో కూలబడ్డాడు. గది మొత్తం కలయజూస్తూ, వార్నీ, యిదే పెద్ద గ్రంథాలయంలా వుంది కదరా నాయనా! అన్నాడు.

బాలా తన పుస్తకాల్ని గర్వంగా చూసుకున్నాడు. మేజాబల్లకి వున్న కుర్చీని సోఫా వైపు తిప్పుకుని కూర్చున్నాడు.

ఇవన్నీ చదివేసావారా నువ్వు! ఆశ్చర్యంగా అడిగాడు శేషు.

అన్నీ యెక్కడ చదువుతాంరా బాబు! కొన్ని అసలు యెప్పుడూ చదవనేమో కూడా. కానీ యిలా పుస్తకాల మధ్య వుంటే ప్రశాంతంగా వుంటుంది.

ఒహో! అంటూ శ్రద్ధగా ఓసారి వాటన్నింటినీ తేరిపార చూసి, వెంటనే యే వుపోద్ఘాతం లేకుండా అడిగేసాడు, సర్లేగాని, రేణూ యెలా వుందిరా?

వస్తుందని తెలిసి యెలా వస్తుందా  అని చూసిన ప్రశ్న యెదురయినట్టు నవ్వి, చెప్పడం మొదలుపెట్టాడు బాలా. ప్రస్తుతం ఆ మేడలో రేణుకాదేవి, యిదివరకటి వంటావిడా మాత్రమే వుంటున్నారు. ఆవిణ్ణి కొడుకులు వదిలేస్తే, రేణు తనతో తెచ్చేసుకుంది. వయసుమళ్ళి పోవడం వల్ల ఆవిడ చేసే సాయమేవీ పెద్ద వుండదు. పైగా రేణూయే అడపాదడపా ఆవిడకు వండిపెడుతుంది. సుబ్బరాజుగారు పోయాక రేణూ తండ్రి తరపు బంధువులు కొంతమంది వూళ్ళో కొచ్చారు. ఆస్తికి యెర వేద్దా మనుకున్నట్టున్నారు. కానీ రేణూ యెవర్నీ దగ్గరకు చేరనీయలేదు. కొందరు నమ్మకస్తులైన పాత పాలేర్లనీ, సుబ్బరాజుగారి మీద గౌరవం వున్న కౌలుదార్లనీ మాత్రం వెంట నిలబెట్టుకుంది. ఆస్తి వ్యవహారాలన్నీ తనే చూసుకుంటుంది. ఏది వస్తుందీ, యేది పోతుందీ అన్న అజాపజా పకడ్బందీగానే పట్టించుకుంటుంది. కానీ పెద్దగా బయటకెపుడూ రాదు. సాయంత్రాలు బుద్ధిపుడితే ఆలయ ప్రధానార్చకుల యింటికో, హత్యకేసులో సుబ్బరాజు గారికి సాయం చేసిన అడ్వకేటు యింటికో వెళ్ళి వస్తూంటుంది. ఆ అడ్వకేటు గారు యీ మధ్య ఆమెకు పెళ్ళి సంబంధాలు చూస్తున్నారట. బాలా వెళ్ళినపుడు చెప్పింది. అతను ఆమెకు పుస్తకాలవీ తీసికెళ్లి యిస్తుంటాడు. అతనితో కూడా యేవో కొన్ని కుశలప్రశ్నలే తప్ప పెద్ద మాట్లాడదు. అలాగని అదంతా యేదో మొక్కుబడి మర్యాదలానూ కనిపించదు...

బాలా చెప్పుకుంటూ పోతున్నాడు గానీ, కావాల్సిన వివరం రాకపోవడంతో, శేషూ అడ్డంపడ్డాడు, నా గురించి యెప్పుడన్నా అడుగుతుందా.

లేదురా... యెప్పుడూ అడగలేదు. ఇలా అన్నపుడు బాలా నవ్విన నవ్వులో కాస్త సానుభూతి కూడా మిళితమైనట్టు అనిపించింది; నీ గురించని కాదు, అసలు చిన్నప్పటి విషయాలే పెద్ద మాట్లాడదు.

రేపు ఫంక్షన్‌కి నేనొస్తున్నానో లేదో కూడా అడగలేదా?

ఊహు!

శేషూ లిప్తమాత్రం పరాకులో పడ్డాడు. వెనువెంటనే తట్టినట్టు, అసలింతకీ తను వస్తుందంటావారా?” అన్నాడు

నేనైతే పిలిచాన్రా, వస్తుందనే అనుకుంటున్నాను.

అనుకోవడమేంట్రా బాబూ!

అతని ఆదుర్దా చూసి బాలాకి నవ్వొచ్చింది, అరే, నేనేం చేయన్రా...! అయినా రాకపోతే మాత్రం యేవైంది? మనిద్దరం కలిసి మేడలోకి వెళ్ళి కలుద్దాం. పెద్దాయనేం లేరుగా అప్పట్లోలా జంకటానికి, అన్నాడు.

శేషూ అతికించుకున్న నవ్వొకటి ప్రదర్శిస్తూ తలపంకించాడు. అప్పుడనిపించింది, తనకు యెందుకు ఆ వూహ రాలేదా అని. ఎందుకు ఆమె ఫంక్షనుకి రావడం మీదే అంతలేసి ఆశలు పెట్టుకుని ఆదుర్దా పడుతున్నాడు? ఆమె దగ్గరకే వెళ్ళి కలవచ్చుగా? మరుక్షణమే ఒక వుజ్జాయింపు జవాబు కూడా తట్టింది: భయమేమో! వెంటనే తన్ని తాను కసురుకుని ఆ ఆలోచన తోసిపారేసాడు.  బాలా నవ్వు వినపడి ఆలోచనల్లోంచి తేరి చూసాడు.

వస్తుందిలేరా బాబూ, నువ్వలా ఆముదం మొహం పెట్టేయకు చూళ్ళేక చస్తన్నాం! అయినా నన్ను అంటున్నావు గానీ వొరే శేషుగా, నువ్వే మారిపోయావురా! ఇప్పుడు నువ్వే నాకు యెర్రెంకన్నలా కనిపిస్తున్నావు.

నీకంత యెటకారంగా వుంది నాకొడకా!

నిజంరా! అసలు నీ వుత్తరాలు చూస్తే అనిపిస్తూందీ మధ్యన, ఆ శేషూ యీ శేషూ ఒకడేనా, లేక వాడెక్కడన్నా తప్పిపోతే ఆ స్థానంలోయెవడో దూరి శేషూగా చెలామణీ అవుతున్నాడా అని! బాలా యీ వూహతో తనకి తానే చక్కిలిగింతలు పెట్టుకున్నట్టు నవ్వేసుకుంటున్నాడు.

ఇంక చాలు మూస్తావా.

నిజంరా బాబూ, అసలు నీకో లోపలి లోకం అంటూ వుండేది కాదేమో అనిపించేది చిన్నప్పుడు. ఎప్పుడూ చాటింపు డప్పులా మోగుతూనే వుండేవాడివి. నీ నుంచి వుత్తరాలు అందుకోవడం మొదలెట్టాకనేరా, నీ లోపల కూడా ఆలోచనలూ, అంతర్మథనాలూ, అపరాధభావనలూ వగైరా అవుతూంటాయని  తెలిసింది.

నీ యబ్బా, మనుషులన్నాకా మారకుండా వుంటార్రా! మళ్ళీ నీకు వుత్తరం ముక్క రాస్తే చెప్పిచ్చుక్కొట్టు!

అలాగని కాదురా! ఏమో, నువ్వయితే మారవనుకున్నాను!

మారకుండా యెలా వుంటాంరా? నేచెప్తున్నా వినూ... సిటీ నీకు యేం నేర్పినా నేర్పకపోయినా భయం నేర్పుద్ది. ఇక్కడ మనూళ్ళో వున్నన్నాళ్ళు మనం యేదంటే అదన్నట్టూ జబర్దస్తీగా నడిచింది. అక్కడ, చెప్తే నమ్మవుగానీ, చేపని నీళ్ళలోంచి తీసి బయటపడేస్తే యెలా కొట్టుకుంటుందో అలా కొట్టుకున్నాన్రా కొత్తల్లో. ఇంకా నేను కాబట్టి నెట్టుకొచ్చాను గానీ, నీలాంటోడైతే వుక్కిరిబిక్కిరైపోయేవోడు. అంతా యేదో పరుగుపందెంలా వుండేది. నెగ్గుకురాగలిగితేనే మనకి వాల్యూ! సర్దుకోవడానికి చాన్నాళ్ళు పట్టింది. ఆ సర్దుకోవడంలోనే నీకు తెలిసిన శేషుగాడు తీవ్రంగా గాయాల పాలయ్యాడు! గుండె దగ్గర నాటకీయంగా చేత్తో తడుముకుంటూ, ముఖంలో నకిలీ బాధని వ్యక్తపరుస్తూ అన్నాడు. అయినా లోపలి బరువైన నిజాన్ని తేలిక చేసి చెప్పే ప్రయత్నం పేలవంగా బయటపడిపోతూనే వుంది.

బాలా సంభాషణ తేలిక చేసే ప్రయత్నం చేసాడు, కానీ యిన్నేళ్ళు సిటీలో వున్నావు, ఒక్కమ్మాయిని పడగొట్టలేకపోయావురా, అదే ఆశ్చర్యం! అన్నాడు పరాచికంగా.

నేను పడగొట్టడం మాట దేవుడెరుగు. మళ్ళీ లేవలేకుండా పడగొట్టించుకున్నాను కదరా. మర్చిపోయావా? అన్నాడు శేషు నిర్వేదంగా, నగరంలో తన విఫల ప్రేమ నొకదాన్ని గుర్తుచేస్తూ.

తాను సంభాషణ తేలిక చేయబోయి మరింత బరువెక్కించానని అర్థమైంది బాలాకి. సరదాగా అడిగా లేరా. అయినా ప్రేమ అన్నాకా ఢక్కామొక్కీలు యేవోటి తప్పుతాయేంటి!

ఒరే, దాన్ని యిపుడు ప్రేమ అని కూడా అనలేను. నువ్వో వుత్తరంలో రాసావే, సమీకరణాల ప్రేమ అని, అలాంటిదంతే. కానీ మంచి పాఠం మాత్రం నేర్పింది. ముందే పునాదులవీ సరిచూసుకుని మొదలయ్యేవన్నీ చెల్లిపోయే ప్రేమలే. చేవ వున్న ప్రేమకి, ప్రేమలో పడ్డాకనే పునాదుల గొడవ గుర్తొస్తుంది.

ప్రేమ తాత్త్వికుడివైపోయావురా!

నీ బొంద! ఇందులో తత్త్వవేమీ లేదు. ఇంకా సులువుగా చెప్పనా. రాసిపెట్టుండాలి, అంతే!

రేణూ రాసిపెట్టుందంటావ్?

నీకోటి చెప్పనా ఒరే, యీ వూరొదిలేసి వెళ్ళాకా కొత్తలో నాకసలు తను గుర్తొచ్చేదే కాదు. అంటే, ప్రత్యేకంగా యేమీ గుర్తొచ్చేది కాదు. మీరంతా యెలాగో అలాగే. మరిప్పుడు? అదే నే చెప్పేది. రాసి పెట్టుంటే, చేరాల్సిన చోటికి యెన్ని చుట్టుతిరుగుళ్ళు తిరిగైనా సరే చేరుకుంటాం.

అస్సలు గుర్తే రానిదల్లా వున్నపళాన యేం మారిందంటావు.

ఏమో చెప్పలేను. ఉన్నపళాన కూడా కాదు. ఇక్కడ దేన్నో సగంలోనే విడిచి వెళ్ళిపోయినట్టు అనిపించడంతో మొదలైంది. అదల్లా, మెల్లమెల్లగా, యిక్కడే అంతా వుండిపోయింది అనిపించడం దాకా వచ్చింది. ఒక వాక్యానికి పుల్‌స్టాపు పెడితేనే తప్ప కొత్త వాక్యం మొదలుపెట్టలేం కదా! బహుశా అలాగేమో.

అయితే పుల్‌స్టాపో, కామానో రేపు తేల్చేసుకుని వెళ్ళడానికి వచ్చావన్నమాట!

అంతా మా తల్లి దయ, అంటూ నాటకీయంగా చేతులు దోసిలి పట్టి యింటికప్పు వైపు చూసాడు.

తర్వాత వాళ్ళ సంభాషణ మరుసటి రోజు వుత్సవ యేర్పాట్ల మీదకు మళ్ళింది.  బాలా అంతా సిద్ధమైనట్టేనని చెప్పాడు. ఆహ్వానపత్రికల పంపిణీ వారం క్రితమే పూర్తయిపోయింది. తాము చిన్నప్పుడు పాఠాలు విన్న తరగతి గదిలోనే రేపు వుత్సవ నిర్వహణ కూడా. మధ్యాహ్నమే బాలాతో పాటు యింకో నలుగురు స్నేహితులు బడికి వెళ్ళి గోడలకి రంగు కాగితాల అలంకరణ మొత్తం పూర్తి చేసేసారు. సౌండు సిస్టం యేర్పాటూ, వంటవాళ్ళ పురమాయింపూ అన్నీ అయిపోయాయి.  రేపు వుపాధ్యాయుల్ని యెవరెవరు యెక్కణ్ణించి తోడ్కొని రావాలో అంతా నిర్ణయమైపోయింది. వాళ్ళకి బహుకరించే సన్మాన పతకాలూ, కప్పే దుశ్శాలువలూ అన్నింటి కొనుగోలూ పూర్తయిపోయింది. ఇంక పూల దండలవీ తెచ్చే కార్యక్రమం మాత్రం రేపు తెస్తే తాజాగా వుంటాయని వాయిదా వేసారు.

బాలా యీ వివరాలు చెప్పేటపుడు ప్రసంగవశాత్తూ పాత స్నేహితులు కొందరి ప్రస్తావన వస్తే వాళ్ళిపుడేం చేస్తున్నారో అడిగి తెలుసుకున్నాడు శేషు. తనకు తెలిసిన వివరాలు చెప్పుకొచ్చాడు బాలా. పదోతరగతి తర్వాత వున్నట్టుండి బుద్ధిమంతుడైపోయిన కోటావోడు  బాంకు వుద్యోగం సంపాయించాడు;  త్రిమూర్తులు గాడు యెరువుల కంపెనీ డీలర్షిప్ తీసుకున్నాడు, యెనిమిదయ్యేసరికే దుకాణానికి ముందు నుంచి షట్టరేసేసి వెనక గదిని పేకాట అడ్డాగా మార్చేస్తాడు; సత్తిరెడ్డిగాడు డబ్బు మూడింతలయ్యే పథకమంటూ ఆ మధ్య వూళ్ళో తెగ హడావిడి చేసాడు, కానీ కొన్నాళ్ళకి పథకం పెట్టిన అసలువాళ్ళు బిచాణా యెత్తేయడంతో డబ్బు కట్టినవాళ్ళంతా వీడి మీద పడ్డారు, ప్రస్తుతం వూళ్ళో లేడు, బహుశా రేపు వుత్సవాని క్కూడా రాడు; శంకూ గాడిలో అప్పటి పరికిణీల యావ యే మాత్రం సన్నగిల్లలేదు సరికదా అది యిప్పుడు కొంగుల యావగా పరిణతి చెందింది, యీ వుత్సవాహ్వన పత్రికల పంపిణీ సందర్భంగా కలిసిన పాత స్నేహితురాళ్ళు కొందరితో పునఃపరిచయాలు కల్పించుకునే ప్రయత్నంలో తలమునకలుగా వున్నాడు;  అబ్బులు గాడు వాళ్ళమ్మ చనిపోయాకా నాన్నతో గొడవపడి వూరొదిలి వెళ్ళిపోయాడు, యిపుడు యెక్కడ యేం చేస్తున్నాడో తెలియదు; వాడే కాదు, మిగతావాళ్ళల్లో కూడా చాలామంది జీవిక కోసం వూరొదిలి నగరాలకు వలసపోయారు. బాలా యీ వివరాలన్నీ చెప్తుంటే శేషూ సోఫాలో జారగిలబడి, చిన్నప్పటి లాగూలేసుకున్న ఒక్కొక్క స్నేహితుడి చిత్రాన్ని మనోఫలకంపై తెచ్చుకుని, వాళ్ళిపుడు యిలాంటి పెద్దరికపు వ్యవహారాల్లో మునిగితేలుతున్న మీసాల ఆసామీల్లా యెలా మారివుంటారో వూహించుకోవడానికి ప్రయత్నించాడు.

కబుర్లతో, బల్లమీద కొవ్వొత్తి లాగానే, కాలం కూడా కనపడకుండా కరిగిపోయింది. కాసేపటికి సూర్రావుగారు గదిలోకి రావడంతో స్నేహితులిద్దరూ మళ్ళీ యీ లోకంలోకొచ్చి పడ్డారు.  ఆయన చేతిలో బత్తాయి తొనలున్న  పళ్ళెం వుంది. దాన్ని శేషూకిస్తూ, ఒరే బాబు అందాకా యివి తినండర్రా, యిప్పట్లో యెలాగూ భోయనాలకి లేచేలా లేరు,” అన్నాడు.

పెద్ద ఆకలేం వేయటం లేదండి. అయినా మీరెందుకివన్నీ! అంటూ శేషూ పళ్ళెం పుచ్చుకున్నాడు.

తప్పదు కదరా. సుధ అత్తారింటికి వెళిపోయిందగ్గర్నించీ ఆడ పనైనా మగ పనైనా యింట్లో వున్నది మేవిద్దరమేనాయె! వీడేమో పెళ్ళి చేసుకొమ్మని యెంత చెప్పినా వినడు, నవ్వుతూనే అన్నాడు.

నాన్నా మొదలెట్టావా!

బాలా గొంతులో తృణీకారానికి ఆయన వళ్ళుమండింది. అది కాదురా, ఇప్పుడు నీకు వున్నట్టుండి పిల్లని తెచ్చి పెళ్ళి చేసేస్తా అనడం లేదు. కానీ నువ్వు అసలు పెళ్ళే చేసుకోనంటున్నావు, అదీ నాకు నచ్చంది. ఎంతసేపూ రాతలేనా.  అవేమైనా అలిసిపోయి యింటికి వస్తే నీకో ముద్ద వండి పెడతాయా, రేపొద్దున్న నాలాంటి అవస్థ వచ్చిన రోజున తోడుంటాయా?  రాసుకోవడానికి పెళ్ళి అడ్డం లాంటి పిచ్చి మాటలు మాట్లాడమాక. నీకన్నా మహ మహా రచయితలంతా సుఖంగా పెళ్ళిళ్ళు చేసుకుని కాపురాలు వెలగబెట్టిన వాళ్ళే. ఏరా శేషూ నువ్వు  చెప్పరా వాడికి!

నేను మొదట్నించీ చెప్తూనే వున్నానండీ, పెళ్ళి అనేది జీవితంలో తప్పనిసరని, అన్నాడు శేషూ  బాలాని ఓరగా చూస్తూ, నోటి దగ్గర యెత్తి పట్టుకున్న బత్తాయి తొన వెనకాల్నించి కొంటెగా నవ్వు నవ్వుతూ.

ఎక్కువ చేస్తున్నావన్నట్టు అతని వైపో చూపు విసిరి, తండ్రిని అనునయపూరితమైన గొంతుతో, నాన్నా యిప్పుడవసరమా అదంతా. ఇంతకీ నువ్వు భోజనం చేశావా లేదా, అని అడిగాడు బాలా, పెళ్ళి విషయం మీంచి ఆయన ధ్యాస మళ్ళించడానికి.

ఆ యెత్తుగడే పనిచేసిందో, లేక ఆయనకే నీరసం వచ్చిందో, ఆ విషయం వదిలేసాడు, నా భోయనం అయిపోయింది. మీరు కూడా యింత ముద్ద తినేసిం తర్వాత కవుర్లు చెప్పుకోవచ్చు కదరా! నువ్వంటే యింటి పట్టునే వున్నావు. వీడు పొద్దంతా ప్రయాణంలోనే గడిపాడు. ఆకలేయదూ!?

చేసేస్తాం కాసేపట్లో, నువ్వెళ్ళి పడుకో యిక. తొమ్మిదయిపోతోంది, అంటూ సర్ది చెప్పాడు. ఆయన సణుక్కుంటూ వెళ్ళిపోయాడు.

ఆయన వెళ్లగానే శేషు, మొత్తానికి ఆయన్ని బానే బుట్టలోపడేసావురా, అన్నాడు. అతనికి తెలుసు, బాలా పైకి యే కారణం చెప్పినా, పెళ్ళి వద్దనడానికి వేరే కారణం వుందని. మూడేళ్ళ క్రిందట అతని రచనల్ని అభిమానిస్తూ ఒక అమ్మాయి వుత్తరాలు రాయడం మొదలుపెట్టింది. బాలా ఆమెతో ప్రత్యుత్తరాలు కొనసాగించాడు. క్రమేణా, ఆమెను చూడకుండానే, వుత్తరాల్లో వ్యక్తమైన మూర్తితో ప్రేమలో పడిపోయాడు. ఒక యేడాదిలా గడిచిం తర్వాత, నగరం వెళ్ళి ఆమెను కలిసాడు. అక్కడవరకే తెలుసు.  అప్పటిదాకా తన ప్రేమ పరిణామాల్ని ఠంచనుగా శేషూతో వుత్తరాల్లో పంచుకున్నవాడల్లా, వెళ్ళి ఆమెను కలిసాకా యేమైందో మాత్రం రాయలేదు. అంతేగాక, అసలు ఆ అమ్మాయి సంగతి ప్రస్తావించడమే మానేసాడు. అతను ఆమెను కలవటానికి నగరం వచ్చినపుడు శేషూ విదేశాల్లోవుండటంతో, వాళ్ళన్నయ్య యింట్లో కొన్ని రోజులుండి వెళ్ళాడు. అన్నయ్య తరువాత చెప్పిన వివరాల ప్రకారం బాలాకి అక్కడ బాధాకరమైన అనుభవమేదో యెదురయివుంటుందని శేషూ వూహించాడు.  ఇక అతను కూడా ఆ విషయాన్ని గురించి కుతూహలం కనపరచటం మానేసాడు. పోనీ యిప్పుడు ముఖాముఖీ యేవన్నా బయటపడతాడేమో చూద్దామనిపించింది, అయితే రాసుకోవడానికి అడ్డమని పెళ్ళి చేసుకోవట్లేదని చెప్పావన్నమాట ఆయనతో? అన్నాడు.

ఇందులో బుట్టలోపడేయడమేం లేదురా. అదే నిజమైన కారణం. రచన నా జీవితం అనుకున్నాను. అది సవ్యంగా సాగాలంటే నాకో నిర్మలమైన వంటరితనం కావాలి. అది మీకెవరికి చెప్పినా వెటకారంగా వుంటుంది,” కాస్త వుక్రోషంగా అన్నాడు బాలా.

రాసుకోవడం కోసం పెళ్ళి మానేయడమనేది వుత్త అబద్ధమని శేషుకి తెలుసు. కానీ యీ విషయంలో బాలా ఒక చొరబడలేని గోడలా అనిపించాడు. గట్టిగా దొలచదల్చుకోలేదు. అతనికి సౌకర్యమైన సంభాషణ వైపు మళ్ళించాడు, పోన్లే... ఆ రాతలైనా బాగా సాగుతున్నాయా పోనీ, అన్నాడు. రచయితల్ని వాళ్ళ రచనా వ్యాసంగానికి సంబంధించిన కుశలప్రశ్నలడగడం ప్రమాదమని శేషూకి యింకా తెలియదు. ముఖ్యంగా తానిలా ప్రయాణపు అలసటతోనూ, ఆకలి మీదా వున్నపుడు.

బాలా వుత్సాహంగా రచనా ప్రణాళికల్ని వివరించడం మొదలుపెట్టాడు. అసలు నేను యీ మధ్యే నిజమైనవి రాయడం మొదలుపెట్టినట్టు అనిపిస్తుందిరా. అంటే నాకు మనసుకు బాగా దగ్గరైన  —  నేను ఆప్యాయంగా చెప్పగలిగిన యితివృత్తమేంటో యీ మధ్యనే తెలుసుకున్నా అనిపిస్తోంది. యేంటో తెలుసా? శ్రీపాదపట్నం! నీకెప్పుడైనా అనిపించిందా, శ్రీపాదపట్నం ఒక అనిర్వచనీయమైన యింద్రజాలాన్ని పొదువుకున్న వూరని?

శేషూకి బాలా అంటున్నదేమిటో పూర్తిగా అర్థం కాలేదు, ఎవరి వూరు ఆళ్ళకి అలాగే అనిస్తుందేమోరా.

ఏమో అది నేను చెప్పలేను. నా యితివృత్తం పూర్తిగా శ్రీపాదపట్నం కూడా కాదేమో. శ్రీపాదపట్నంలో మన బాల్యమేమో. చిన్నప్పుడు మనకి తెలీదు, పోనీ నాకు తెలీదు. కానీ యెదుగుతున్న కొద్దీ యేదో మార్మిక సౌందర్యం విశదమవటం మొదలైంది. ఈ వూరి వీధులూ, యిక్కడి పాతమేడలూ, పావురాల మూక, యేరూ, గుడీ, కోనేటి మెట్లూ... అన్నింటికన్నా ముఖ్యంగా యీ పరిసరాల మధ్య మన బాల్యం, మన స్నేహాలూ...! ఎప్పుడూ యిదే వూళ్ళో వున్న నాకే అది స్ఫురించిందంటే, నీకు యింకా స్పష్టంగా తెలియాలి. ఎందుకంటే నువ్వు చాన్నాళ్ళు దీనికి దూరమయ్యావు కాబట్టి. అవునా కాదా?

శేషూ తలూపాడు. అయితే మన వూరి మీద కథ రాయబోతున్నావన్నమాట, అన్నాడు.

ఒకటి రాసాను కూడా. అది యెవరికి చూపించినా చూపించకపోయినా నీకు మాత్రం చూపిద్దామనే అనుకున్నా, అంటూ మేజాబల్ల సొరుగు తెరిచి వెతుకుతున్నాడు; కానీ  అనుకున్నట్టు రాయగలిగానో లేదో నాకే తెలియడం లేదురా. నువ్వే చదివి చెప్పాలి, అంటూ అట్టవేసి కుట్టి వున్న ఒక కాగితాల బొత్తాన్ని బయటికి తీసి శేషూకి అందించాడు.

శేషూ దాన్ని తెరిచేలోగానే బాలా మళ్ళీ అడ్డొచ్చాడు, ఒరే... చదవడం మొదలుపెట్టేముందు నీకొకటి చెప్పాలి. శ్రీపాదపట్నం నాకు సంబంధించినంతవరకూ వాస్తవం కాదు, వాస్తవాన్ని మించిన వాస్తవం. అలాంటి భావాన్ని చెప్పటానికి వాడే ప్రక్రియని సాహిత్యంలో మేజిక్ రియలిజం అంటారు. ఆ శైలిలో రాయాలని ప్రయత్నించాను. రాయగలిగానో, అభాసుపాలయ్యానో నువ్వే చెప్పాలి. ఎందుకంటే కథలో వాతావరణం నీకు తెలిసిందే కాబట్టి.

సరేలేరా బాబూ! ముందే అంత బెదరగొట్టకు. నాకసలే చదివే అలవాటు పోయి చాన్నాళ్ళయింది.

అంతే, యింకే లేదులే. చదువుతూ వుండు, యీలోగా నేను భోజనాలవీ సిద్ధం చేసి వస్తా, అంటూ బాలా గదిలోంచి బయటికి వెళ్ళాడు.

శేషూ సోఫాలోంచి లేచి బాలా ఖాళీ చేసిన కుర్చీలో కూర్చున్నాడు. మేజా బల్ల మీద కొవ్వొత్తి వెలుగులో కాగితాల బొత్తాన్ని తెరిచాడు. కథ పేరు ‘రంగు వెలిసిన రాజుగారిమేడ కథ’. శేషూ నిజంగానే సాహిత్యం చదివింది చాలా తక్కువ. ఈ కథలో వున్న  శైలికీ ఆడంబరానికీ మామూలుగా అయితే సగంలోనే చదవడం మానేసేవాడు. రాసింది స్నేహితుడే కావడంతోపాటూ, శ్రీపాదపట్నంలో జరుగుతోన్న కథ కావటంతో శ్రద్ధగా చదివాడు. బాలా చెప్పినట్టే శ్రీపాదపట్నాన్ని మేజిక్ రియలిజంతో చూపిస్తూ కథ ప్రారంభమవుతుంది. శేషూకి ఆ మేజిక్కేదో కాస్త అతి అయినట్టు కూడా అనిపించింది. రాజుగారి మేడలో ఒక అమ్మాయి వంటరిగా వుంటుంది. ఆమెకు మృత్యుగడియలు ఆసన్నమైనాయని సూచన తెలుస్తుంది. ఆమె యెవరికీ వుద్దేశించని సందేశాల్ని పావురాల ద్వారా పంపించడం మొదలుపెడుతుంది. వాటిని అందుకున్న ఒక కుమ్మరివాడు ఆమెను కలవాలని వస్తాడు. వాళ్ళిద్దరి మధ్యా అగాధ పతనంలాంటి అనుబంధం ప్రారంభమవుతుంది. అతనామెను విడిచి వెళ్ళలేక పూర్తిగా దాసుడైపోతాడు. చివరకో వెన్నెల రాత్రి, పీడకలలాంటి సంఘటనా క్రమంలో, ఆమెను రక్షించడానికి చేసిన ప్రయత్నం వికటిస్తుంది. ఆమె మాయమైపోతుంది. అతను పిచ్చివాడిగా మిగులుతాడు.

శేషూకి కథ చదివిం తర్వాత మనసంతా చేదుగా అయిపోయింది. లోపల యిప్పటికే సద్దుమణిగిన ఒక పాత బాధని పనిగట్టుకుని కెలుక్కున్నట్టయింది. ఇలా విషాదాంతాలయ్యే కథలు చదవటం అతనికిష్టం లేదు. కథలో అమ్మాయి పాత్రని మనస్ఫూర్తిగా ద్వేషించాడు. ఆమె రేణుకాదేవి లాంటి పరిసరాల్లోనే, పరిస్థితుల్లోనే వుంది. కానీ యిద్దరి మనస్తత్వాలు అతకటం లేదు. తనలా కుమ్మరి కులానికి చెందిన కుర్రవాడొకడున్నాడు. కానీ అతను తానే అనుకోవటానికి లేదు. చప్పున ఒక సంగతి స్ఫురించింది — బహుశా బాలా యేదో చెప్పబోయి సొంత కథ చెప్పుకున్నాడేమో; కథలో ఆ అమ్మాయి పావురాల ద్వారా పంపే సందేశాలు, బాలాకి అతని వుత్తరాల ప్రేయసి పంపిన సందేశాలకు ప్రతీకలేమో! కానీ యీ కథ బాలా ప్రేమకథని విశదం చేయటం లేదు సరి కదా, యింకా అయోమయపరుస్తోంది.

0 స్పందనలు:

మీ మాట...