March 16, 2012

మిత్రభేదం (ఆరవభాగం)

ముందుమాట | మొదటిభాగం | రెండవభాగం | మూడవభాగం | నాలుగవభాగం | ఐదవభాగం |
ఏడవభాగం | ఎనిమిదవభాగం | తొమ్మిదవభాగం | పదవభాగంఆఖరిభాగం | పూర్తి కథ pdf |   

కథ చదవడం మొదలుపెట్టి చాలా సేపయినా బాలా గదిలోకి రాకపోవడంతో, తనకు చదువుకునే యేకాంతం కల్పించడానికి రావడం లేదేమోనని బయటికి వెళ్ళాడు. పెద్దగదిలో నేల మీద లాంతరు వెలుగుతోంది. దాని చుట్టూ వెలుగు వలయంలో భోజన సామగ్రి సర్దిపెట్టి వుంది. బాలా వీధి గుమ్మం దగ్గర నిలబడి బయటకి చూస్తున్నాడు.

ఏరా వాన తగ్గిందా...?

వెనక్కి తిరిగాడు. ఆ, జల్లులా పడుతోంది. రా భోజనం చేసేద్దాం. లుంగీ యేవన్నా యివ్వనా, కట్టుకుంటావా? అంటూ లోపలికి వచ్చాడు.

శేషూ స్నానం చేసిన తర్వాత కట్టుకుంటానన్నాడు. ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు. బాలా వడ్డిస్తూ, ఆత్రుతని అణిచిపెట్టిన స్వరంతో, కథ యెలా వుందని అడిగాడు.

అసలు నువ్వేం చెప్పదల్చుకున్నావురా కథలో? కొట్టినట్టు అన్నాడు శేషు.

అదేరా బాబూ అలా అడిగావు...! నేనేం చెప్పదల్చుకున్నానో వదిలేయి, నీకేవర్థమైందో చెప్పు.

కథలో రేణుకాదేవిలా ఒకమ్మాయి వుంది. ఆ కుమ్మరోడు నేనే అయితే గనక నేనూ వున్నాను. కానీ అందులో అసలు కథంతా నీ కథే అనిపించింది. యేమో, వాడు కుండలు తయారు చేయడాన్ని కూడా కళ అన్నట్టు చెప్పడం... అదంతా నువ్వే అనిపించింది.

బాలా ఇబ్బందిగా నవ్వాడు. బహుశా సొంత అనుభవాల్ని దాటి కథ చెప్పే శక్తి యింకా నాకు రాలేదేమోరా. కథ మొదలుపెట్టినపుడు మాత్రం నా వుద్దేశ్యం అది కాదు. శ్రీపాదపట్నం గురించి రాద్దామనుకోగానే — వట్టి వూరి గురించి యేం రాస్తాం, దాన్ని నేపథ్యంగా పెట్టుకుని ఒక  కథ అల్లుకోవాలిగా — నాకు వెంటనే మీ యిద్దరి కథే గుర్తొచ్చింది. కానీ దానికి మొదలైతే వుంది గానీ, ముగింపు లేదు కదా. అందుకనో యేమో, రాయడం మొదలుపెట్టేసరికి మీ కథని పక్కకు నెట్టేసి అంతా నేనూ నా అనుభవాలూ వచ్చి ఆక్రమించేసాయి.

మొదలున్నదానికి ముగింపు లేకుండా యెలా వుంటుందిలేరా. రేపు రేణుని కలవబోతున్నాగా. తేలిపోతుందిలే, అన్నాడు శేషు. ఈ మాటలు అంటూండగా మొగ్గతొడిగిన ఒక ఆలోచనకి వుత్తేజితుడై, మళ్ళీ తనే, ఒరేయి బాలిగే, యెలాగూ నీ అనుభవాన్ని యీ కథలో ఖర్చుపెట్టేసావు కాబట్టి, యిప్పుడు మా కథ రాయగలవేమో ప్రయత్నించూ?” అన్నాడు.

బాలా ఆలోచించాడు. కానీ అసలు కథ రాయాలనుకుందే శ్రీపాదపట్నాన్ని చిత్రిద్దావని కదరా. ఆ నేపథ్యమంతా యీ కథలో ఒకసారి వాడేసుకున్నాగా? అన్నాడు.

నీ బొంద వాడుకున్నావు. మేజిక్ రియలిజమూ, గాడిదగుడ్డూ అంటూ... అదేం నాకు అర్థం కాలేదు. అయినా ఒరే, వున్నదున్నట్టు చూపిస్తే యీ వూరు అందంగా కనిపించదా? దాని కోసమని దీన్నో మంత్రాల దీవిలా చూపించాలా? నేచెప్తున్నా విను... నీకు రేణూ, నేనూ చిన్నప్పట్నించీ తెలుసు. ఇద్దరి మధ్యా యేమైందో కూడా తెలుసు. మొదలుంది ముగింపు లేదంటున్నావుగా. రేపెలాగూ రేణూని కలుస్తున్నాను. అదే నీ కథకి పతాకసన్నివేశమనుకో. బంగారం లాంటి కథవుతుంది!

ఓసోస్! కథ నీదయ్యేసరికి బంగారంలా వుంటుందని యెంత నమ్మకంరా!

ఓరి యెర్రెంకన్నా...! కథ నాదని కాదు, కథ నువ్వు రాస్తున్నావు కాబట్టి. అయినా నా కథే యెందుకవుతుందిరా. నువ్వూ వుంటావుగా అందులో, అనటమైతే అన్నాడు గానీ మళ్ళీ వెంటనే జాగ్రత్తపడ్డాడు, అలా అన్చెప్పి నన్ను సైడేస్సి నువ్వే కథకి హీరో ఐపోయావ్రోయ్!

ఆ భయమేం లేదులే. మన బాల్యాన్ని కథగా చెపితే, యెంత చక్కదిద్దినా గానీ, నా పాత్ర హీరోగా మారదు. అప్పుడు అంతా మీ హవా నడిచేదిరా. నువ్వూ, భద్రిగాడూ, కోటావోడూ, శంకూ గాడూ... మీరంతా క్లాసులో ఓ హోదాలో మసలుకునేవారు. మీ వ్యవహారాలు అసలు మా స్థాయి వాళ్ళకు అర్థం కానివీ, పాలుపంచుకుందావన్నా వీల్లేనివీను. ఒక వుదాహరణ చెప్పనా... నీకు గుర్తుందో లేదో, తొమ్మిదో తరగతిలో వుండగా క్లాసులోకి యెవడో సెక్సు బొమ్మల పుస్తకం తెచ్చాడు—

శేషు ముఖం జ్ఞాపకంతో వెలిగింది, అవును! శంకూగాడు. నీకు భలే గుర్తుందిరా? నవ్వాడు.

ఎందుకు గుర్తుండదు, మీలాగా ఒకసారైనా చూసి తరించి వుంటే మర్చిపోయేవాణ్ణేమో. చూడాలని చాలా కుతూహలంగా వుండేది. కానీ ముఖచిత్రం కూడా యెవడూ చూపించలేదు. నిన్ను కూడా అడిగాను. నాలాంటోళ్ళని తోకలా వెంటయితే తిప్పుకునేవారు గానీ, యిలాంటి రాచ వ్యవహారాల్లోకి మాత్రం తలదూర్చనిచ్చేవారు కాదు!

చెడిపోతావని చూపించి వుండంరా....

అబ్బే! చెడిపోవడానికి నీకున్న అర్హతేంటో, నాకు లేని అర్హతేంటో?

ఎహే! అయినా అందులో  బొమ్మలేవీ వుండేవి కాదు. బూతు కథలుండేవి అంతే.  ‘రంగసానో’, ‘చింతామణో’ యేదో పేరుండేది దానికి. యమ్మా, దానికే యెంత భయపడేవాళ్ళమో! యెవరికన్నా దొరికిపోతామన్న జడుపే అసలా పుస్తకానికి అంత కళ తెచ్చేదనుకుంటా. స్కూలయ్యాకా గ్రౌండులో బాదంచెట్టు వుండేదిగా, దాని చప్టా వెనక్కి చేరేవాళ్ళంరా. యెవడో ఒకడు చదివి వినిపించేవాడు. మిగతా అందరం యేదో భాగవతం విన్నట్టు వాడి చుట్టూ కూర్చునేవాళ్ళం. కాని అక్కడక్కడా కొన్ని మాటలు అర్థమవ్వక కొట్టుకు చచ్చిపోయేవాళ్ళం.  స్తనాలంటే యేంటో, వూరువులంటే యేంటో, మదనాంగమంటే యేంటో...! కానీ అవేవో మేం వినకూడని మాటలని మాత్రం తెలుసు. నాభి అంటే అదే అనే వాడొకడు, కాదురా కటి అంటే అది అని వాదించేవాడొకడు. అర్థాలు తెలియకపోవడం వల్ల యింకా రంజుగా వినిపించే వనుకుంటా. చదవడం అయిపోయింతర్వాత యెవడో ఒకడు యింటికి పట్టికెళ్ళేవాడు దాయటానికి. కానీ యెవళ్ళకీ ధైర్యం వుండేది కాదు. ‘ఒరే మా నాన కంటబడిందంటే చంపేత్తాడురా’ అనో, ‘మా అమ్మ వాతలెట్టేస్తుందిరా’ అనో మరుసటి రోజే తెచ్చేసేవాళ్ళు. చివరికి తెచ్చిన శంకూ గాడిక్కూడా భయమేరా! ఆఖరికి యేం చేసామో తెలుసా? మనూరి గ్రంథాలయంలో యింగ్లీషు విభాగం వుండేది చూడు, యెవడూ దాని జోలికి వెళ్ళేవాడు కాదు, అక్కడైతే భద్రంగా వుంటుందని బాగా మూల అరలో దాచాం. కాని రెండ్రోజులకి మళ్ళీ యెళ్ళి చూసేసరికి యెవడో నొక్కేసేడు.

మంచిపని జరిగింది. అయితే అందులో బూతు తక్కువే గానీ, మీరు దాన్ని నాకు చూపించకపోవడం వల్ల నా ఆలోచనల్లో వచ్చి చేరిన బూతే యెక్కువన్నమాట.  అందులో యేవుందో తెలియకపోవటంతో, లేనివన్నీ వున్నవాటికన్నా ఘాటుగా నేనే వూహించేసుకునేవాణ్ణి. ఆ పుస్తకాన్ని మాత్రం మర్చిపోలేన్రా బాబు. పాడు ఆలోచనల విషయంలో నా మెదడుకున్న పరిమితుల్ని బాగా విస్తరించిన పుస్తకం అది. చదవకుండానే, కనీసం చూడకుండానే!

ఒరే నువ్వు దీనికే యింత యిదయిపోతున్నావు. ఇంకా యిలాంటి వేషాలెన్ని యేసామో చెప్తే  కుళ్ళికుళ్ళేడుస్తావు! అంటూ శేషూ మరో సాహసకృత్యాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. అబ్బులు అనే కుర్రాడు శేషూతో పాటూ యెలిమెంట్రీ దాకా చదివి మానేసాడు. ఆ తర్వాత అతను చేసిన చిన్నాచితకా వుద్యోగాల్లో వూరి చివర్నున్న దేవీ థియేటరు ప్రొజెక్టరు నడిపే వుద్యోగం కూడా ఒకటి. ఆ థియేటరు వాళ్ళు కొత్త సినిమాల ప్రింట్లు యెపుడూ తెచ్చేవాళ్లు కాదు; అవి చూడాలంటే టౌను పోవాల్సిందే. అయితే పాత జానపద సినిమాలో లేకపోతే వరసపెట్టి సెక్సు పిక్చర్లో తెచ్చి వేసేవారు. ఈ రెండో రకం సినిమాల పోస్టర్లను వూరి జనం అన్ని చోట్లా అతికించనిచ్చేవారు కాదు. ఒక్క కాకాహోటలు తడికల మీద మాత్రం ఠంచనుగా మారుతూండేవి. శేషూవాళ్ళూ చాన్నాళ్ళ వరకూ యీ పోస్టర్లతోనే సరిపెట్టుకున్నారు. అటువెళ్ళినపుడల్లా  ఆ పోస్టర్ల మీద పూసిన నల్లరంగు వెనకాల యేముందో మిర్రిమిర్రి చూడటమూ, ‘దాంపత్యసుఖం’‘సృష్టి రహస్యం’ లాంటి పేర్ల వెనుక యెలాంటి కథలు వుండవచ్చో వూహించుకోవటమూ, అంతే వాళ్ళు చేయగలిగింది. కాని తొమ్మిదో తరగతికొచ్చేసరికి మాత్రం, అప్పట్లో సినిమా ప్రొజెక్టరు చూసుకునేది తమ మిత్రుడైన అబ్బులే కావడంతో, ధైర్యంగా ఒక మెట్టెక్కారు. రాత్రి సెకండ్‌షో నడిచే సమయంలో శేషు ఫలానా పుస్తకం తెచ్చుకోవాలనో, ఫలానా కుర్రాడితో కలిసి చదువుకుంటాననో యింటి నుండి బయల్దేరేవాడు. వాళ్ళమ్మ చీకటేళ తిరుగుళ్ళేంటని కసరుకొనేది గానీ, నాన్న పోన్లేవే సదువుకోటానికేగా అని వెళ్ళనిచ్చేవాడు. ఆ యింట్లో అంతకుమునుపు పెద్దకొడుకు తన సత్ప్రవర్తనతో తల్లిదండ్రుల్లో నెలకొల్పిన విశ్వాసం, యిలాంటి కీలకమైన సమయాల్లో చిన్నకొడుక్కి అక్కరకొచ్చేది. అతను సందుచివరకెళ్ళేసరికి, అక్కడ యిలాంటి వంకలే యేవో చెప్పి బయటపడిన కోటావోడు సైకిలు మీద యెదురుచూస్తూండేవాడు. శంకూగాడి యిల్లు థియేటరు దగ్గరే కాబట్టి అక్కడే కలిసేవాడు. సినిమా మొదలై అంతా లోపలికి వెళ్ళిపోయాకా గేటు దాటేవారు. పైగా సినిమాలో ‘స్టోరీ’ యెప్పుడు వుంటుందో, ‘సీన్లు’ యెప్పుడు వస్తాయో శంకూగాడు ముందే తెలుసుకునేవాడు. సరిగ్గా సీన్లు పడే సమయానికి వెళ్ళి, అవి అయిపోంగానే వెనక్కి వచ్చేసేవారు. అబ్బులుగాడు వీళ్ళ యావని అలుసుగా తీసుకుని రీలు చుట్ట మార్చడమెలాగో కూడా వీళ్ళకి నేర్పేసాడు. ఒక్కోసారి ప్రొజెక్టరు రూము వీళ్ళకప్పగించి  తాను బీడీ కాల్చుకోవడానికి క్రిందకి పోయేవాడు. మునివేళ్ళపై లేచి నిలబడో, ఫిలింబాక్సులు యెక్కో ప్రొజెక్టరు కన్నాల్లో తలలుపెట్టి చూసేవారు. మొదట్లో శేషూకి ఆ సన్నివేశాలన్నీ హింసాత్మక సన్నివేశాల్లా గుబులుపుట్టించాయి. క్రమేణా తెరపై గోధుమరంగు దేహాల ఒరిపిడికి ప్రతిగా తన వంట్లో రగులుకునే వేడి నచ్చడం మొదలైంది. రాను రానూ యీ సినిమాలు వ్యసనంలా మారిపోయాయి. కాకాహోటలు దగ్గర పోస్టరు మారడం తరువాయి, ముగ్గురికీ అబ్బులుగాడు గుర్తొచ్చేసేవాడు. ఒకసారి దొరికిపోబోయి కొద్దిలో తప్పించుకున్నారు. సరిగ్గా వీళ్ళు థియేటర్ ఆవరణలో చేరే సమయానికే శంకూ వాళ్ళ నాన్న చుట్టకాల్చుకుంటూ లోపల్నించి బయటకొచ్చాడు. ఇక్కడేం చేస్తున్నార్రా, అని గద్దించాడు. శంకూగాడు చాకచక్యంగా, యేదో కొనుక్కోవాలని చెప్పి, డబ్బులిస్తావని వచ్చా నాన్నా అన్నాడు. పుంతలో కూకున్నా పెన్ను కొనియ్యి నానా అనొచ్చేత్తావు నువ్వు, పో రేపు కొనిత్తాలే, అని గసిరాడాయన. శంకూ గాడు తన అబద్ధానికి విశ్వసనీయత కల్పించడానికి యిప్పుడే కావాలి నానా అని గునిసాడు గానీ, ఆయన టెంకిజెల్ల పీకి పొమ్మనేసరికి, దొరికిందే సందని ముగ్గురూ చక్కా బయటపడ్డారు. ఈ తంతు యెక్కువ కాలం కొనసాగలేదు. ఏ వుద్యోగంలోనూ స్థిరంగా పనిచేసే అలవాటు లేని అబ్బులుగాడు అక్కడ కూడా తొందరగానే మానేసాడు.

శేషు యీ వృత్తాంతం చెప్పటం పూర్తయ్యేసరికి, వాళ్ల భోజనాలు కూడా పూర్తయ్యాయి. బాలా వేణ్ణీళ్ళు కాచి యిచ్చి అతణ్ణి స్నానానికి పంపాడు. పెరటి మూల వున్న స్నానాలగదికి పైకప్పు లేదు. పైన ఆకాశంలో నల్లమబ్బుల మల్లయుద్ధం యింకా నడుస్తోంది. వేణ్ణీళ్ళు జారుతున్న వంటిపై చల్లని చినుకుల జల్లు చిత్రమైన స్పర్శని కలిగిస్తోంది. స్నానం చేస్తూ శేషు  గడిచిన రోజుని నెమరువేసుకున్నాడు. నగరంలో రైలెక్కడమూ, రైలు ప్రయాణమూ యివన్నీ వేరే లోకానికి చెందిన జ్ఞాపకాల్లా అనిపిస్తున్నాయి. రైలు దిగింది మొదలు ఒక కొత్తలోకంలో అడుగుపెట్టినట్టు వుంది. అంతేకాదు, రైలు దిగినప్పట్నించీ ఒక అగోచర భూతం తనను వెంబడించడం మొదలుపెట్టినట్టూ, శ్రీపాదపట్నంలో యివాళ కలిగిన ప్రతీ అనుభవమూ దాని సమక్షం వల్ల ప్రభావితమైనట్టూ అనిపించింది. ఆ భూతం కాలపురుషుడు. తానివాళ కలిసిన అందరిపై అతని ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. తరచూ తారసపడేవాళ్ళయితే మార్పు యింత స్పష్టంగా తెలియకపోవునేమో. ఈ వూరు విడిచి వెళ్ళింది మొదలు యివాళ్టి దాకా యిక్కడివాళ్ళ జీవితాల్లో గడిచిన పరిణామ దశలేవీ పరిచయం లేకపోవడంతో, మార్పు మరింత కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. వాళ్ల చిన్నప్పటి వ్యక్తిత్వాలకీ యిప్పటి వ్యక్తిత్వాలకీ సమన్వయం కుదరడం లేదు. రేణుకాదేవి కూడా యిలానే అపరిచితంగా మారిపోయివుంటుందని బుద్ధి చెప్తోంది. కానీ మనసు కసరుకుంటోంది.

శేషు స్నానం పూర్తి చేసి లోపలికి వెళ్ళేసరికి, పెద్దగదికి రెండో వైపునున్న గదిలో బాలా అతనికి పడక యేర్పాట్లు చేస్తున్నాడు. ఆ గదిలో సగానికి సగం మంచమే వుంది. గోడవార బల్ల మీద బట్టలపెట్టెలూ, యింకో మూల చెక్క బీరువా మిగతా చోటు ఆక్రమించాయి. పైన చెక్క అటక మీద యిత్తడి గుండుగలూ, తపేళాలూ బోర్లించి వున్నాయి. బాలా గూటిలో కొవ్వొత్తి వెలిగించాడు. బీరువాలోంచి లుంగీ తీసి యిచ్చి, గుడ్నైట్ చెప్పి వెళ్ళాడు.

శేషూ పక్క యెక్కి, గోడ మీద పెద్దగా పడుతున్న తన నీడ వైపు ఒత్తిగిల్లాడు. కాసేపు బయట బాలా యేదో సర్దుతున్న చప్పుడూ, తలుపులు మూస్తున్న చప్పుడూ వినిపించి ఆగిపోయింది. వాన తగ్గిపోయినా, పెంకుటింటి చూర్ల మీంచి కారుతున్న వానధారల శబ్దం యింకా వినిపిస్తూనే వుంది. ఆకలితీరటంతో పాటూ వేణ్ణీళ్ళ స్నానంతో సేదతీరడంతో, అసలే అలసటగా వున్న శరీరం త్వరగానే నిద్రకుపక్రమిస్తుందని భావించాడు. కానీ కళ్ళు మూసింది తడవు రెప్పల వెనక చీకట్లో రేణూ రూపం ప్రత్యక్షమైంది. ఈ పాటికి పడుకుని వుంటుందా! ఆ నాచుపట్టిన పాత మేడలో, పై అంతస్తునున్న కిటికీ గదిలో, పందిరిమంచం మీద — ఆమెని కలవాలని పొంచివున్న గుండె ఒకటి యిక్కడ గుబులుగా కొట్టుకుంటుందన్న యెరుక యేమాత్రం లేకుండా — ఈ పాటికి పడుకుని వుంటుందా! జ్ఞాపకాలూ, వూహలూ, కలలూ అల్లిబిల్లిగా అల్లుకోవడం మొదలుపెట్టాయి. కాసేపటికే కాలం నడుస్తున్న జాడ తెలియకుండా పోయింది.

2 comments:

  1. పొద్దున్న లేవగానే, మీ బ్లాగుకొచ్చి తరువాయి భాగం కోసం చూసాను. ఇంకా పెట్టలేదు మీరు! :-(

    ReplyDelete
  2. కామేశ్వర రావు గారు, ఇపుడే పెట్టాను. :)

    ReplyDelete