April 27, 2013

కాశీకి పోయాడు వేంకటశాస్త్రి…

ఒకప్పుడు ఈఫిల్ టవరూ, ఈజిప్టు పిరమిడ్లూ మొదలైన ప్రపంచ వింతలు పుస్తకాల్లో ఛాయాచిత్రాలుగా మాత్రమే చూట్టానికి దొరికేవి. ఖండాలూ, దేశాలూ పాఠ్యపుస్తకాల్లో రేఖాచిత్రాలుగా మాత్రమే ఊహకందేవి. కనీసం సామాన్యులకు. ఇప్పుడలా కాదు. గూగుల్ వాడి మాప్స్‌లోకి వెళితే ఖండాలూ, దేశాలనన్నింటినీ ఏరియల్ వ్యూలో మనకు తోచినంత ఎత్తు నుంచి చూడవచ్చు. వెండితెర మీద నాయికా నాయకులతో పాటూ మనమూ ఈఫిల్ టవరెక్కిన అనుభూతి పొందవచ్చు. యూట్యూబ్‌లోకి వెళ్ళి పేరు కొట్టడం తరువాయి ఈజిప్టు పిరమిడ్లు కళ్ళ ముందు నిలుస్తాయి. కానీ ఎంతమంది అలా ఒక్కసారైనా చూసి ఉంటారు? అద్భుతాలు అందుబాటులోకి వస్తున్నాయి. కానీ చిత్రంగా… వాటికి ఒకప్పుడున్న మంత్రముగ్ధత్వం కనుమరుగవుతోంది.

ఒకప్పటి దూరాలు ఇప్పుడు లెక్కలోకి రావు. పెరిగిన జీవన ప్రమాణాల పుణ్యాన అనండి, ప్రయాణ సౌకర్యాల పుణ్యాన అనండి; చిన్నపుడు ఎక్కడో చదివి, ఏదో విని, ఊహల్లో మాత్రమే నిర్మించుకున్న ప్రదేశాలన్నింటినీ ఇప్పుడు పెద్ద ప్రయాస లేకుండానే చూసొచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పటికీ చాలామంది ఏదో పనుంటే తప్ప ప్రయాణం చేయరు. బహుశా దూరాలు దూరాలుగా ఉన్నపుడే ప్రదేశాల పట్లా, వాటి వైపు ప్రయాణాల పట్లా ఆకర్షణ మిగిలి ఉంటుందేమో. అలనాటి తరాలకు అది ఉంది.

కాశీకి వెళ్ళినవాడూ కాటికి వెళ్ళినవాడూ ఒకటే అని సామెత. ఒకప్పుడు కాశీ మనకు అంత దూరమన్నమాట. తిరుపతి కవుల్లో చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి తాను చేసిన కాశీయాత్ర గురించి రాసుకున్న పుస్తకమిది. నిజానికి రచనా నిర్మాణాన్ని బట్టి చూస్తే ఆయన కాశీయాత్ర గురించి పుస్తకం రాయాలనుకోలేదని అర్థమవుతుంది. ఆయన ఒక వ్యాసం రాయదల్చుకున్నారు. ‘కాశీయాత్ర’ అనే ఈ రచన పెద్ద వ్యాసం మాత్రమే. కానీ పుస్తక కర్తలు దానితో పాటు చెళ్ళపిళ్ళ వారి ఆయన ప్రసిద్ధ గ్రంథం “కథలు గాథలు” (ఎమెస్కో ద్వారా రెండు సంపుటాల్లో లభ్యం)లో లేని మరికొన్ని వ్యాసాల్ని చేర్చి ఒక పుస్తకం అయ్యేంత విషయం సమకూర్చారు.

ఆయన 1890లో తన పంతొమ్మిదేళ్ళ వయస్సులో ఈ యాత్ర చేశారు. ఈ యాత్రకి ఆయన చెప్పుకున్న కారణాలు:

1. కాశీ వెళ్ళీ అక్కడ పండితుల దగ్గర సంస్కృత వ్యాకరణం నేర్చుకోవాలన్న కోరిక ఆయనకు ఎప్పట్నించో ఉంది.

2. అప్పట్లో ఇక్కడ విద్యార్థులకు నిషిద్ధమైన, పైపెచ్చు చాలా ఖరీదైన తాంబూలం కాశీ సత్రాల్లో విరివిగా లభించేది. అది చెళ్ళపిళ్ళ వారికి ఎలాగో అలవాటయింది. కాశీలో అయితే లోటు ఉండదు కదాని.

3. పెళ్ళిళ్ళల్లో వరుడు కాశీయాత్రకి బయల్దేరతాననడం, వధువు తరుపు బంధువులు గడ్డం కింద బెల్లం పెట్టి వద్దని బతిమాలటం సంప్రదాయం ఒకటి ఉంది. ఎలాగూ అది ఉంది కదా, పెళ్ళయ్యాక అలా ఒకసారి వెళ్ళినట్టు ఉంటుందని. (పెళ్ళయిన కొన్ని రోజులకే ఆయన కాశీ బయల్దేరారు.)

అప్పట్లో కాశీయాత్ర అంటే ఎంత పెద్ద తతంగమో ఈ పుస్తకంలో తెలుస్తుంది. ఇప్పుడు కనపడటం లేదు గానీ, మొన్నామధ్య వరకూ కూడా అమెరికా నుంచి ఎవరైనా బంధువులు తిరిగి వస్తుంటే, ఒక విమానం బొమ్మేసి “స్వదేశాగమన శుభాకాంక్షలు” పేరుతో పత్రికల్లో ప్రకటనలు ఇచ్చేవారు. మరి అప్పట్లో కాశీ వెళ్ళినవాళ్ళు తిరిగి ఊరు చేరితే బంధువులంతా ఏకంగా భాజాబజంత్రీలతో స్వాగతమిచ్చి ఇంటికి తీసుకెళ్ళేవారట. దీన్ని బట్టి ఇప్పుడు అమెరికా కన్నా, అప్పుడు కాశీ ఎక్కువ దూరమన్నమాట.

అష్టావధానాలు చేసుకుంటూ, చిత్ర కవిత్వాలు చెపుతూ డబ్బులు కూడవేసుకుని కాశీకి వెళ్ళారు చెళ్ళపిళ్ళ. వెళ్ళినపుడు రైలు ప్రయాణంలో వెళ్ళటంతో ఆ అనుభవాలు పెద్దగా రాసుకోలేదు గానీ, వచ్చేటప్పటి అనుభవాల్ని విస్తారంగా రాశారు. కాశీయాత్ర “గ్రంథాన్ని” ఆశించి వచ్చేవారిని ఇది నిరాశపరచవచ్చు; కానీ కాశీయాత్ర “వ్యాసాన్ని” మాత్రమే ఆశించి చదివితే నచ్చుతుంది. సంపాదకులు విలువైన పాదసూచిలు, అవసరమైన ఫొటోలూ జత చేశారు.

ఇందులో కాశీయాత్రతో పాటూ అనుబంధంగా మరో నాలుగు వ్యాసాలు ఇచ్చారు. అందులో రెండు (‘శృంగారవర్ణనము’, ‘శతావధానము’) తిరుపతి వేంకటకవులు అన్న సంతకంతో వచ్చినవి, గ్రాంథికంలో ఉన్నాయి. మరి రెండు (‘సిగ్గూ – బిడియమూ’, ‘మా విద్యార్థి దశ – నాటి కవిత్వం’) చెళ్ళపిళ్ళ పేరు మీద వచ్చినవి, వ్యావహారికంలో ఉన్నాయి. ఈ చివరి రెండు వ్యాసాలు ఒక్కోసారి అసలు కన్నా కొసరు ముద్దు అనేంతగా అలరిస్తాయి. చెళ్ళపిళ్ళ వారికి కబుర్లు చెప్పటం బాగా వచ్చు. ఊరికే శాఖాచంక్రమణం చేస్తూ పోవడం అలవాటు. లేకపోతే సిగ్గూ బిడియాల మీద పదమూడు పేజీల వ్యాసమా! ‘మా విద్యార్థి దశ – నాటి కవిత్వం’ అన్న వ్యాసం ఆయన పాండిత్య సౌధాలు విడిచి కవిత్వ వనాల వైపు నడిచిన పరిణామదశ గురించి చెపుతుంది. ఈ పుస్తకానికి మకుటాయమానం.

ఈ పుస్తకాన్ని ఆయన “కథలు – గాథలు” కు ప్రవేశికగా భావించవచ్చు. అందులో ఉన్న రుచులు మీ జిహ్వకు నచ్చుతాయో లేదో తెలుసుకోవాలంటే, ఈ పుస్తకాన్ని మచ్చుగా తీసుకోవచ్చు. చెళ్ళపిళ్ళ వచనం బాగుంటుంది. సామెతలు, నుడికారాలు ఎడాపెడా వెదజల్లి ఉంటాయి. వాక్యాల ధోరణి నోటి మాటలు విన్నట్టు ఉంటుంది. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారికి నివాళిగా మల్లాది రామకృష్ణశాస్త్రి రాసిన ఒక వ్యాసం ఇలా మొదలవుతుంది:

“… ఈ శతాబ్దంలో, వచనరచనకు పెట్టినది పేరు… ఒక్క యిద్దరికే…
శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారూ, శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారూ!
వేంకటశాస్త్రిగారు, కబుర్లలో ఎన్నో కథలు చెప్పారు: సుబ్రహ్మణ్యశాస్త్రిగారు, కథలుగా ఎన్నో కబుర్లు చెప్పారు.
ఇద్దరూ, విన నేర్పున్నవారు:
చెప్పే తీరు వారికే చేతనౌ!
వారి వచనము, తెలుగువారికి, తెలుగు తనానికి నారాయణ కవచము!
వేంకటశాస్త్రిగారి వచనము చదవకపోతే, తెలుగువారికి తెలుగు రాదు!
శ్రీపాదవారి కథలు వినివుండకపోతే – తెలుగుల ఉనికి అయోమయం!”

(చెళ్ళపిళ్ళను గురించి రాయటానికి పూనుకుని చెళ్ళపిళ్ళను పొగిడారంటే సంశయించవచ్చు. కానీ శ్రీపాదను గురించి రాయటానికి పూనుకుని చెళ్ళపిళ్ళను పొగిడారంటే మాత్రం, నమ్మాలి.)

పుస్తకానికి మూడు ముందు మాటలున్నాయి. ఒకటి సంపాదకుడు రాసిందీ, రెండోది రచయిత శ్రీరమణ రాసిందీ, మూడోది విశ్వనాథ తన గురువైన చెళ్ళపిళ్ళ గురించి ఎపుడో తన అసంపూర్ణ ఆత్మకథలో రాసుకున్నదీను. ఇవన్నీ కలిసి చెళ్ళపిళ్ళ మూర్తిమత్వాన్ని మనోఫలకంపై అచ్చువేస్తాయి. ముఖ్యంగా విశ్వనాథ ముందుమాట కాని ముందుమాట బాగుంది. పుస్తకం ముద్రణ బాగుంది. ముఖచిత్రమూ, వెనుక అట్టా ముచ్చటగా ఉన్నాయి.

మనకు చరిత్రకారులు లేని లోటు అప్పటికీ ఇప్పటికీ ఉంది. గతకాలం ఒక క్రమపద్ధతిలో నమోదు కాని ఆ లోటును ప్రస్తుతం ఇలాంటి స్వీయచరిత్రలే తీరుస్తున్నాయి. కానీ పాక్షికంగానే. రెండు తరాల వెనుక తెలుగులో స్వీయచరిత్రలన్నీ దాదాపు బ్రాహ్మణులవే. బ్రాహ్మణ జీవితాల్ని దాదాపు అన్ని కోణాల్నించీ సమగ్రంగా పట్టి చూపిస్తున్న స్వీయచరిత్రలు బానే లభ్యమవుతున్నాయి (శ్రీపాద ‘అనుభవాలూ జ్ఞాపకాలూను’, దువ్వూరి స్వీయచరిత్ర, ఆదిభట్ల ‘నా యెరుక’ ఇత్యాది). కానీ మరి మిగతా కులాల జీవిత చిత్రాల మాటేమిటి? క్షత్రియులు, కోమట్లూ, మాలలూ, మాదిగలూ… వీరందరూ ఎలా బతికారు? ఎలా తెలిసేది? కానీ గుడ్డిలో మెల్లగా ఇవైనా లభ్యమవుతున్నందుకూ, వీరి జీవితాల నేపథ్యంలో ప్రస్తావనామాత్రంగానైనా మిగతా వర్గాల వారి సంగతులు తెలుస్తున్నందుకూ సంతోషించాలి.

కాశీయాత్ర (మరికొన్ని రచనలు)
రచన: చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిసంపాదకుడు: మోదుగుల రవికృష్ణప్రచురణ తేదీ: 24 డిసెంబరు 2012ధర: రూ. 100/-;

*

(పుస్తకం.నెట్‌లో ప్రచురితం)