May 2, 2013

మరపురాని శిల్ప విన్యాసం: సూర్యుడి ఏడో గుర్రం

హిందీలో అరవయ్యేళ్ల క్రితం (1952) వెలువడిన ఈ పుస్తకం తెలుగులో మూడేళ్ళ క్రితం (2009) వచ్చింది. వంద పేజీలు కూడా లేని ఈ చిన్న పుస్తకం పూర్తి చేయటానికి ఒక పూట కన్నా ఎక్కువ పట్టదు. కానీ చదివిన గుర్తు మాత్రం ఎప్పటికీ పోదు. దానికి కారణం కథ చెప్పటానికి ఎన్నుకున్న శిల్పం. రచయిత ధర్మవీర్ భారతి ఈ శిల్పం “యథార్థంగా పాతశైలే, ఎంత పాతది అంటే ఇప్పటి పాఠకులకు కొంచెము అపరిచితంగా కనబడేటంత పాతది” అని వినమ్రంగా చెప్పుకున్నా, దీని శిల్ప శైలి పంచతంత్రం, అలిఫ్‌లైలా లాంటి కథలను అనుసరించినదని పీఠికలు రాసిన వారంతా తేల్చి చెప్పినా, ఆ శిల్పాన్ని వినియోగించుకున్న తీరు అపూర్వమే అనిపిస్తుంది. అప్పుడే కాదు, బహుశా ఇప్పటి పాఠకులకు కూడా.

ఒకదానితో ఒకటి సంబంధమున్న విడి విడి కథల కదంబం ఇది. ఈ కదంబాన్ని కలిపే దారంలాంటి పాత్ర మాణిక్ ముల్లా. అతనే తన జీవితంతో ఏదో రకంగా ముడివడివున్న ఈ కథలన్నీ చెపుతాడు. కానీ అతను ఈ కథలు చెప్పేది మనకు (పాఠకులకు) కాదు. తోచనపుడు తన గదికి వచ్చిపోయే కుర్రాళ్ళకు. ఈ కుర్రాళ్ళలో ఒకడు ఎదిగాక మాణిక్ ముల్లా చేత చెప్పించుకున్న ఈ కథల్ని, అతని చేత చెప్పించుకున్న సన్నివేశాల్తో సహా మనకు నేరేట్ చేస్తాడు.

కథలన్నీ మాణిక్ ముల్లాతో ముడిపడినట్టే, ప్రేమతో కూడా ముడిపడి ఉంటాయి. అవన్నీ మాణిక్ ముల్లా జీవితంలోని ప్రేమకథలే. కథలు వేరైనా అవన్నీ ఉమ్మడిగా ఒకే కోణాన్ని స్పృశిస్తాయి. అప్పటి సాంఘిక చట్రపుటిరుసుల్లో పడి ప్రేమలు ఎలా నలిగిపోయాయో చూపిస్తాయి. తనకు పూర్వీకులూ, సమకాలీనులూ ఐన రచయితలు ప్రేమని చిత్రించిన తీరుతో రచయిత ధర్మవీర్ భారతికి ఉన్న ఇబ్బందిని ఈ ప్రేమకథలు వ్యక్తం చేస్తాయి. పాఠకులు గాల్లో మేడల్లాంటి ప్రేమకథల్ని నమ్మడం మానేసి, సాంఘిక ఆవరణం మధ్య సాగే వాస్తవ జీవితపు ప్రేమకథల్ని నమ్మాలనీ, వాటి సాఫల్యానికి తెగించాలనీ ఆయన సూచించదల్చుకున్నాడనిపిస్తుంది. ఒక చోట మాణిక్ ముల్లా ఇలా అంటాడు:
“ప్రేమ ఆత్మలోతుల్లో నిద్రించిన సౌందర్య సంగీతాన్ని మేల్కొలుపుతుంది. మానవునిలో విచిత్రమైన పవిత్రతనూ, నైతిక నిష్టనూ, వెలుతుర్నీ నింపుతుంది. దీన్ని ఎవ్వరూ నిరాకరించటానికి వీలు లేదు. కానీ… సంప్రదాయాలూ, సాంఘిక పరిస్థితులూ, అసందర్భ బంధనాలూ వగైరాలతో వుక్కిరి బిక్కిరి అవుతున్న మనం సాంఘిక రంగంలో ఆ ప్రేమను సరియైన రూపంలో దర్శించలేకపోతున్నాము. సంఘర్షణ చేయలేక – నిస్సహాయత, పిరికితనమనే బంగారు నీరు పోసి దానిని మెరిసేట్టు చేయడానికి ప్రయత్నిస్తున్నాము. కల్పనా జగత్తులో మెదలిన భావాలలో స్వప్నాలూ, పూలూ, ఇంద్రధనుస్సులూ ఉంటాయి గాని సాహసం, పురుషార్థం ఉండవు. ఆ స్వప్నాలను యథార్థమైన సాంఘిక జీవితంలోకి దింపాలి. మనం గాలిలో నివసించటం లేదు. సమాజం మధ్య జీవిస్తున్నాము. సాంఘిక జీవితపు పునాదులూ, ఎరువూ లేని ఏ భావనా నిలవలేదు. ఎండిపోతుంది.”
కానీ అప్పటి సాంఘిక చట్రంలో ప్రేమల సాఫల్యానికి ఉన్న అడ్డంకులెన్నో ధర్మవీర్ భారతికి తెలుసు. వాస్తవ జీవితాన్ని అంటి పెట్టుకు సాగాలన్న నిబంధనతో తాను చిత్రించిన ఈ ప్రేమకథలు, అదే కారణం వల్ల నిజమైన ప్రేమను సంపూర్ణంగా స్పృశించలేకపోయాయనీ ఆయనకు తెలుసు. అందుకే చివరికి, తాను చెప్పిన ఈ కథల పట్ల మాణిక్ ముల్లా అభిప్రాయాన్ని నేరేటర్ చేత ఇలా వ్యక్తం చేయిస్తాడు:
“ఇవి ప్రేమ కథలే అయినా మాణిక్ ముల్లా మాటల ప్రకారం ఇవి ‘నేతి నేతి’ కథలు. ఉపనిషత్తుల్లో బ్రహ్మను గురించి నేతి నేతి అన్నట్లుగా – ఇది ప్రేమ కాదు ఇది ప్రేమ కాదు అని ప్రేమను గురించి వ్యాఖ్యానిస్తూ జీవితంలో ప్రేమకు గల నిజమైన స్థానాన్ని నిరూపించడమే ఈ కథల ఉద్దేశ్యం.”
ఇవి యాభైలలో కథలు కాబట్టి, అప్పటి సాంఘిక చట్రాలు ఇప్పుడు కాస్త వదులయ్యాయి కాబట్టి, ఈ ప్రేమ కథలు ఇప్పుడు కాస్త అవుట్ డేటెడ్‌గా కనిపించవచ్చు. కానీ వాటిని చెప్పటానికి రచయిత ఎన్నుకున్న శిల్పం మాత్రం పాఠకుల్ని అమితంగా ఆకట్టుకుంటుంది. రచయిత శైలిలో ఆకట్టుకునే మరో అంశం ఆయన వ్యంగ్యం. అది కూడా బండగా కాక, పాఠకుల తెలివిపై రచయితకున్న నమ్మకానికి అద్దం పడుతున్నట్టు సున్నితంగా, సునిశితంగా ఉంటుంది. వ్యంగ్యం ప్రతిభావంతమైన రచయిత చేతుల్లో పడినపుడు ఎంత సూటిగా తాకుతుందన్న దానికి ఇందులో “గుర్రపు నాడం” కథ మంచి ఉదాహరణ.

ధర్మవీర్ భారతి తన ఇరవైల యుక్త వయస్సులో రాసిన నవల ఇది. రచయితలు ఇంకా తన పనిముట్టు పదును పెట్టుకునే వయస్సులో రాసింది కాబట్టి కాబోలు, అడపాదడపా ఆ పనిముట్టు మీదనే వ్యాఖ్యానాలు చోటు చేసుకున్నాయి. అంటే కథలు ఎలా ఉండాలి, కథల శైలి ఎలా ఉంటే బాగుంటుంది లాంటి చర్చలు కూడా అడపాదడపా పాత్రల మధ్య చోటు చేసుకున్నాయి. ఇలాంటి వాటికి చోటివ్వగల శిల్పం గనుక అవి ఎక్కడా అసందర్భం అనిపించకుండా అమిరాయి.

హిందీలో మొదటి మోడర్నిస్టు నవలగా దీన్ని పరిగణిస్తారట. శ్యాంబెనగల్ దర్శకత్వంలో “సూరజ్ కా సాత్వా ఘోడా” పేరిట సినిమాగా కూడా వచ్చింది. ఆయన దీనికి ముందు మాట రాశారు కూడా.

సూర్యుడి ఏడో గుర్రం
హిందీ మూలం: ధర్మవీర్ భారతి;
తెలుగు అనువాదం: వేమూరి ఆంజనేయశర్మ
ధర: రూ. 50/-; ప్రచురణ కర్తల చిరునామా: హైదరాబాద్ బుక్ ట్రస్టు, ప్లాట్ నెం. 85, బాలాజీ నగర్, గుడిమల్కాపూర్, హైదరాబాద్ – 500 067, ఫోన్ – 23521849
*
(పుస్తకం.నెట్‌లో ప్రచురితం)

0 స్పందనలు:

మీ మాట...