May 22, 2013

తాత్త్విక చింతనాఫలాలు ఆర్.వసుంధరాదేవి రచనలు

స్త్రీ రచయితల పట్ల నాకున్న ఫిర్యాదును ఈ మధ్య ఒకసారి మాటల సందర్భంలో నా మిత్రుని దగ్గర వ్యక్తం చేశాను. స్త్రీ రచయితలు మనిషికీ మనిషికీ మధ్య మానవ సంబంధాల్నే (man in relation to man) ఇతివృత్తంగా తీసుకుంటారు; మనిషికీ అతణ్ణి ఆవరించిన విశ్వానికీ మధ్య సంబంధాన్ని (man in relation to universe) పరిగణనలోకి తీసుకునే వారు చాలా అరుదు — కనీసం మగ రచయితలతో పోల్చినపుడు. మానవ జీవితానికి అర్థమూ, అంతట్నీ పెర్‌స్పెక్టివ్‌లో కుదురుకునేట్టు చేసే అంతిమ సత్యమూ, దృగ్గోచర ప్రపంచపు నికరమైన చెల్లుబాటు పట్ల సంశయాలు, జీవితానికి ఆవలా ఈవలా ఉన్న చీకట్లూ… ఇలాంటి ప్రశ్నల గురించి మగ రచయితలు సతమతమైనంతగా స్త్రీ రచయితలు కారు; వాళ్ళు ఎక్కువగా కుటుంబ జీవితాలు, సామాజిక జీవితాలు, ఆడమగా మధ్య అనుబంధాల ఈక్వేషన్లూ… వీటితోనే సరిపెట్టుకుంటారు. (వాళ్లు స్త్రీ వాదులైతే వాళ్ళ పరిధి మరింత కురచగా ఈ చివరి ఇతివృత్తానికే పరిమితమవుతుంది.) ఈ ఇతివృత్తాల్లో ఒకటి ఎక్కువా ఇంకోటి తక్కువా అని కాదు, కానీ మగ రచయితలు ఈ పరిధిని దాటినంతగా స్త్రీ రచయితలు దాటరని నా ఫిర్యాదు. దీనికి ఋజువుగా, మనిషికీ అతని చుట్టూ విశ్వానికీ మధ్య సంబంధాన్ని చర్చించే శాస్త్రమైన తత్త్వశాస్త్ర పరంపరలో, ఒక్క స్త్రీ తత్త్వవేత్త పేరూ లేకపోవటాన్ని సూచించాను. నా మిత్రుడు ఇలాంటి వాదనను ఇప్పుడే కొత్తగా వింటున్నట్టు, సాలోచనగా, “నిజానికి మగాళ్ళ కన్నా ఆడాళ్ళకే తత్త్వవేత్తలు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళే ప్రకృతికి మనకన్నా దగ్గరగా ఉంటారు. వాళ్ళ నెలసరి ముట్లూ, మనిషిని మోసి జన్మనిచ్చే గర్భధారణానుభవం ఇవన్నీ వారిని మనకన్నా ప్రకృతికి సన్నిహితుల్ని చేస్తాయి. మరెందుకు అలా జరగదో!” అన్నాడు. బహుశా వారు ప్రకృతికి మరీ అంత సన్నిహితంగా మమేకం కావటం వల్లనే, దాన్నించి విడివడి, దాన్ని ఆబ్జెక్టివ్‌గా పరిశీలించలేరేమో అనిపించింది. ఈ అంశంపై మా మాటలు ముగుస్తుండగా, నా మిత్రుడు నాకు ఆర్. వసుంధరా దేవి రచనల్ని చదవమని సూచించాడు. అవి ఇప్పుడు పెద్దగా బయట లభ్యం కావటం లేదు. అదృష్టవశాత్తూ రెండు కాపీలు దొరికితే చదివాను. ఒకటి “రెడ్డెమ్మ గుండు” అనే నవల, రెండు “గాలి రథం” అనే కథా సంపుటి.

రెడ్డెమ్మగుండు (నవల):


“భారతి” పత్రికలో ప్రచురితమైన ఈ నవల 1985లో ముద్రితమైంది. అంతా పదార్థమయమే అనే భౌతికవాదానికి (మెటీరియలిజం) ఒక ఎదురు సమాధానంగా ఈ నవలను రాశారు. నవల ప్రారంభమయ్యే సరికి శివరావు అనే పేరా సైకాలజీ శాస్త్రవేత్త రెడ్డెమ్మ గుండు అనే ఊరికి బస్సులో ప్రయాణిస్తుంటాడు. ఆ రెడ్డెమ్మగుండు స్థల పురాణం ఏమిటంటే, రెండు వందలేళ్ళ కిందట ఆ ఊళ్ళో ఒక అందాల ఆడపడుచు రెడ్డెమ్మ ఉండేది. ఆమె ఒకసారి చేలో కాపలా కాస్తుండగా ఆమె అందాల్ని చూసి మోహించిన ఒక నవాబు గుర్రంపై ఆమె వెంట పడతాడు. ఆమె పారి పోయి ఒక పెద్ద గుట్ట మీద ఉన్న గుండు చాటున దాక్కుంది. మరి కన్పించలేదు. ఆమె ఇంట్లో వాళ్ళు వచ్చి చూసేసరికి ఆ రాతి గుండులో చిన్న చీలిక ఉంది. రెడ్డెమ్మ అందులోంచి మాట్లాడుతుంది. ఇక ఎన్నడూ బయటకు రాకుండా అందులోనే విగ్రహంగా వెలిసి అందరి కోరికలు తీరుస్తూ పూజలందుకుంటుంది.

శివరావు ఒక అమెరికన్ ఫౌండేషన్ తరపున ఇక్కడకు వారం రోజుల పాటు పరిశోధనకు వస్తాడు. “మనుషులు తాము ఏర్పరుచుకున్న నమ్మకం నుంచీ, రూపం నుంచీ వరాలు పొందుతున్న వైనం పరిశోధించే” పని అతనికి అప్పగించబడింది. దీంతో పాటూ అతనికి మరో లక్ష్యం కూడా ఉంది. మనిషికి అనుభవాల్నించి కొన్ని అనుభూతులు పుడతాయి; ఆ అనుభూతుల్ని ఆ అనుభవాలు లేకపోయినా పుట్టించాలన్నది శివరావు బృహత్ ప్రయత్నం. శివరావు బుద్ధి ప్రైమసీ మీద, మానవ మేధ శక్తుల మీదా అపరిమితమైన నమ్మకం ఉన్నవాడు. మహత్తులనేవి ప్రత్యేకంగా ఏవీ లేవని, ఇంకా ప్రాయోగికంగా నిరూపితంగాని భౌతిక దృగ్విషయాలే మహత్తులనీ అతను భావిస్తాడు. అతనిది సత్యాన్వేషణే గానీ, అది ఒక తాత్త్వికుని సత్యాన్వేషణ కాదు, శాస్త్రజ్ఞుని సత్యాన్వేషణ, నియత ప్రయోగాలతో ఫలితాలతో సంబంధమున్న అన్వేషణ.

అతను ఆ పల్లెటూళ్ళో ఉన్న వారం రోజుల్లోనూ అతనికి ఎదురైన వ్యక్తులూ, అనుభవాలూ అతని దృక్పథాన్ని ఏ రకంగా మార్చాయన్నదీ, చివరకు అతను తెలుసుకున్న సత్యం అతణ్ణి ఏ పర్యవసానానికి తీసుకెళ్ళిందన్నదీ మిగతా కథ. ఇక్కడ అతణ్ణి ప్రభావితం చేసిన ముఖ్యమైన వ్యక్తి రెడ్డెమ్మ పునర్జన్మేమో అనిపించే మరో పద్దెనిమిదేళ్ళ అమ్మాయి రెడ్డెమ్మ. మిగతా పాత్రల్లో హేతువాదానికి మూఢంగా కట్టుబడిన ఒక యువకుడు చిన్నూ, మనిషిని హేతువుకు అతీతమైన అంశ నడిపిస్తుందని నమ్మే అతని మేనమామ నారాయణ స్వామీ ముఖ్య పాత్రలు. ఉన్న పాత్రల్లో నారాయణ స్వామి ఆసక్తికరమైన పాత్ర అనిపిస్తాడు.

కథనం ఎక్కువగా తాత్త్విక సంభాషణల ద్వారానే జరుగుతుంది. ఫ్రాయిడ్ నుంచి జార్జిశాంతాయనా దాకా, క్వాంటం ఫిజిక్సు నుంచి అద్వైతం దాకా అన్నీ ఈ సంభాషణల్లో చర్చకు వస్తాయి. ఈ సంభాషణలన్నీ ఈ నవలకు రచయిత నిర్దేశించిన అంతిమ పర్యవసానం వైపు డయలెక్టికల్‌ ధోరణిలో సాగుతుంటాయి. ఇందులోని పాత్రలకు వారి వారి సైద్ధాంతిక నమ్మకాలకు మించి వేరే వ్యక్తిత్వమంటూ ఏదీ ఉండదు. (ఆ సైద్ధాంతిక నమ్మకాలు కూడా వారి స్థానిక ఐడెంటిటీస్‌కి అసాధ్యమనిపించే ఎత్తుల్లో ఉంటాయి.) పాత్రలన్నీ కొన్ని కొన్ని ఐడియాస్‌కు ప్రతినిధులు మాత్రమేనని చెప్పవచ్చు. Conflict is not between characters but their ideas.

ఈ రచనలో నవలా ధోరణి తక్కువ. నవలా శిల్పాన్ని పట్టించుకోదు. తాత్త్విక వ్యాసంలా సాగిపోతుంది. కాబట్టి దీన్ని అలా భావించి చదివితేనే ఆకట్టుకుంటుంది. తెలుగులో తత్త్వశాస్త్రం మీదే నాన్‌ఫిక్షన్ రచనలు చేసిన వారి కన్నా స్పష్టంగా ఆర్. వసుంధరాదేవి వచనం ఆయా తాత్త్విక భావనల్ని వ్యక్తీకరించగలదు. ఉదాహరణకి నారాయణస్వామి పాత్ర ఒక్క వాక్యంలో ఎగ్జిస్టెన్షియలిజాన్ని ఇలా వివరిస్తాడు:
“ఎక్సిస్టెన్షియలిజం మనిషి ఏకాకి అంటూ మన మామూలు దేవుణ్ణి తోసి పారేసి; మనిషి ఒంటరి తనాన్ని గుర్తించి; అతను తన జీవితానికి అర్థం తానే వెతుక్కోవాలనీ, తనవైన విలువల్ని తానే నిర్మించుకుకోవాలనీ తీర్మానించి; మనిషికి అనంతమైన స్వేచ్ఛనీ, అనంతమైన బాధ్యతనీ కూడా ఇచ్చి అతనికి పట్టం కట్టిన నిజమైన మానవతావాదం కదా!”
శివరావు పాత్ర కొన్ని పేరాల్లో జార్జి శాంతాయనా తత్త్వ సారాంశాన్ని వ్యక్తం చేస్తాడు:
“ఈ శతాబ్దపు ప్రారంభంలో జార్జి శాంతాయనా అన్న దార్శనికుడు … ప్రవృత్తి అన్నది హేతుబుద్ధికి శత్రువు కాదన్నాడు. సహజ ప్రవృత్తులతో సంబంధం లేని ఆలోచన మనిషిని పిచ్చివాడిగా చేస్తుంది. ఆలోచనతో సంబంధం లేని ప్రవృత్తులు మనిషిని జంతువుగా దిగజారుస్తవి. ఈ రెండింటి కలయికే మనిషి. సహజప్రవృత్తులు మానసిక చైతన్యపు పరిధిలోనికి వచ్చి సామరస్యం పొందటమే హేతుబుద్ధి అన్నాడు.
“శాస్త్రీయ విజ్ఞానం అంటే మనిషి అనుభవంలో కన్పిస్తున్న కొన్ని నియతుల్ని క్రోడీకరించటం మాత్రమేననీ, ప్రపంచాన్ని శాసించే అనుల్లంఘ్యమైన చట్టాలు కావనీ అతనికి బాగా తెలుసు. అయినా కూడా బుద్ధి, అది సాధించే విజ్ఞానం మాత్రమే మనిషిని ముందుకు తీసుకెళ్ళ గల శక్తి కలిగినవని అతని నమ్మకం. 
“అతను భౌతిక వాది. మనిషిలో పుట్టే ప్రతి ఊహకీ, చలనానికీ, చైతన్యానికీ కూడా ఏదో భౌతికమైన హేతువు వుంటుందని అతని విశ్వాసం. మానసిక పరిణామాలకు మూల కారణాలైన భౌతిక నియమాలను కనుక్కున్నప్పుడే మనస్తత్వశాస్త్రం సాహిత్య స్థాయి నుంచీ విజ్ఞానశాస్త్రపు పరిధిలోకి వెళ్ళ గలదని అన్నాడతను…”

శాస్త్రీయ పదజాల నిర్మాణంలో పేలవంగా వెనుకబడ్డ తెలుగు భాషలో ఈ సంగతుల గురించి రాయటం కష్టం. అది ఈ రచయిత అనాయాసంగా చేసారనిపిస్తుంది.

నిజానికి ఇది తాత్త్విక నవల కాదు, తత్త్వ శాస్త్రం గురించి మాట్లాడే నవల మాత్రమే. కానీ ఆ మాట్లాడటం తెలుగులో ఒక్క స్త్రీ రచయితలు మాత్రమే కాదు, ఏ రచయితా మాట్లాడనంత ఎక్కువ మాట్లాడుతుంది.

గాలి రథం (కథా సంపుటి):


ఈ కథా సంపుటి చదివాక, నవలా మాధ్యమంతో పోలిస్తే కథా మాధ్యమంలోనే వసుంధరాదేవి సౌకర్యవంతంగా కుదురుకోగలరేమో అనిపించింది. ఆవిడ మనసులో బాగా నలిగిన సన్నిహితమైన ఇతివృత్తాలకు ఈ కథాసంపుటి ప్రాతినిధ్యం వహిస్తుందనిపించింది. ఈ కథాసంపుటిలో (బహుశా వసుంధరాదేవి మొత్తం రచనా సంచయంలో) మృత్యువు ప్రధాన ఇతివృత్తం. మృత్యువు జీవితానికి చాలా దగ్గరగా సమాంతరంగా పొంచి ఉండటమన్న విషయాన్ని ఆమె కథల్లోని పాత్రలు జీర్ణించుకోలేవు. (ఈ పొంచి ఉండటాన్ని నిరూపించటానికన్నట్టు ఆమె తన కథల్లో చావుని ఎప్పుడు మన ముందుకు తెచ్చినా మనల్ని ఏ మాత్రం ప్రిపేర్ చేయని కొన్ని అమాయకమైన వాక్యాల తర్వాత ఆకస్మికంగా క్రూరంగా ముందుకు తెస్తుంది.) ఈ సంపుటిలోని తొమ్మిది కథల్లోనూ ఐదు కథల్లో మృత్యువుదే ప్రధాన పాత్ర. వీటిల్లో ఈ సంపుటికి తలమానికమైన కథ “పెంజీకటికవ్వల”.

ఈ కథలో ప్రధాన పాత్ర జయలక్ష్మి. వసుంధరాదేవి కథల్లోని చాలా ప్రధాన పాత్రల్లాగే జయలక్ష్మి అస్తిత్వపు మౌలిక ప్రశ్నల విషయంలో అందరూ సమాధానపడిపోయే రీతిగా అలవోకగా సమాధాన పడలేని పాత్ర. మనలో ప్రతీ ఒక్కరికీ చావు just around the corner ఉందని తెలుసు గానీ, మనస్ఫూర్తిగా నమ్మం. మరపుతో బతికేస్తాం. ఇలా అందరూ చాలా సహజంగా అంగీకరించేసే విషయాల్ని జయలక్ష్మి అంగీకరించ లేకపోతుంది. In that sense, she is a neurotic genius among healthy mediocrities (ఆమె భర్తను ఇలాంటి మీడియోక్రటీకి ముఖ్యమైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు.) ఆమెకు రాన్రానూ మృత్యువు పెద్ద ప్రశ్నయి కూచుంటుంది. కథ మొదలవటానికి ఏడాది క్రితం, తడిసిన బట్టల తీగ వల్ల ఆమె విద్యుద్ఘాతానికి గురవుతుంది. అప్పటి నుంచీ ఆమెలో “చావు, బ్రతుక్కి ఇంత దగ్గర్లో ఉందేమిటి?” అన్న కంగారు మొదలవుతుంది. ఆ దగ్గరితనాన్ని ఇంకా కొట్టిచ్చినట్టు కట్టెదుట ఉంచే సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. చిన్నపుడు తాతయ్య చివరి క్షణాల్లో తన కోసం విమానం వచ్చిందంటూ చనిపోవటం, సర్కస్‌కి వెళ్తే అక్కడ ఒక పసి పాప చేసే ప్రమాదకరమైన ఫీట్లకు చప్పట్లు కొట్టని మనుషుల క్రూరత్వం, పక్కింటి స్కూలు కెళ్ళే పాప అసంబద్ధంగా చనిపోవటంలో ఒంటరితనం, కాన్సర్ ఆసుపత్రిలో ఉన్న బంధువుని సందర్శించటానికి వెళ్లినపుడు అక్కడ ఎల్లెడలా వ్యాపించి ఉన్న చావు స్వరూపం, చిన్నపుడు ఒక చనిపోతున్న బల్లి చావుని ఎదుర్కోవటంలో ప్రదర్శించిన భావరహిత గాంభీర్యం… ఇలా వర్తమాన సంఘటన కొన్నీ, గత జ్ఞాపకాలు కొన్నీ ఆమెపై విపరీతమైన ప్రభావం చూపిస్తాయి. తన చుట్టూవాళ్ళు చావుని అంత సులభంగా ఎలా అంగీకరిస్తున్నారో అర్థం కాదు. అందరూ, చివరకు చనిపోయేవాళ్లు కూడా, చాలా నమ్మకంగా పుట్టిన వాళ్లకు చావు తప్పదన్న సహజాత స్పృహతో, చావుని సహజ ధర్మంగా అంగీకరించగలుగుతున్నారు. “నేను దేన్నీ నమ్మగల శక్తి లేని దాన్ని. నేను ఎలా వెళ్లేది? ఈ పెంజీకటిలో నాకు రక్షణ, మార్గమూ ఏవి” అని ఆమె తల్లడిల్లుతుంది. చివరకు ఆమెకు కూడా చిన్నపాటి గుండెనొప్పి రావటంతో అది సమస్యను మరింత ముందుకు తెచ్చి నిలబెడుతుంది. “నేను ఇంతవరకూ ఏమీ అనుభవించలేదే. తెలుసుకోలేదే, జీవించలేదే! నేను చచ్చిపోవటం ఏమిటి?” అనుకుంటుంది. “నేను లేకున్నా వీళ్లందరూ యిలాగే బ్రతికుండి, భోంచేసి, తిరుగుతూ, నవ్వుతూ ఉంటారా! […] ఇండ్లూ, వూరూ, భూమీ, ఆకాశం… ఈ ఆకాశం ఇంత స్వచ్ఛంగా, నీలంగా, అనంతంగా వుంటే, దాన్ని చూస్తూ యీ క్రింద నేనుండనా? […] నాకంటే ముంసలివాళ్లు, అప్రయోజకులు, మూర్ఖులు — ఇందరూ వుంటూంటే నేను మాత్రం వుండకుండా పోవాలా?” లాంటి ఆలోచనలు చుట్టుముడతాయి. అసలు ఈ “నేను” ఎవరనే ప్రశ్నా ఎదురవుతుంది.
“నేను అంటే ఈ కనిపించే శరీరం —
కాని నా రక్తం పారుదల నాకు తెలియదు. నా శరీరం పెరుగుదల నాకు తెలియదు. నరాల ద్వారా తెలిసే కొంత విషయం తప్ప నిజానికి ఈ శరీరం నాకు తెలియదు. కొంత అదుపు వున్నా, అది నా ఆజ్ఞకు లోబడి ఉండలేదు. అది నేను ఎలా అవుతాను!” 
“నేను అంటే నా మనసు —
కాని నాకు అనేకమైన ఆలోచనలు నిరంతరం వస్తూనే వుంటాయి. ఎప్పుడు, ఎందుకు, ఎక్కణ్ణించి వస్తున్నవో తెలియదు. అవి తోచాకనే నావి అంటున్నాను. అవి ‘నావి’ ఎలాగౌతాయి?” 
“నా అనుభవాలు —
మరుపు తెరల్లోకి జారి మాయమైపోతున్నాయి.
మిగిలిన వాటిని మిగుల్చుకుంటున్న ‘యిష్టం’ నేనా? అదీ నా చేతిలో లేదే! అనుకుంది.”
మళ్ళీ ఏదన్నా మహాశక్తి ప్రత్యక్షమై తిరిగి జీవించే అవకాశం ఇస్తే అపుడు ఎంతో తెలివితో, ప్రతీ క్షణాన్నీ ఆస్వాదిస్తూ బతుకుతాను అనుకుంటుంది. కానీ అప్పుడు “జీవితాన్ని ఏ క్షణం దగ్గర మార్చి మలుపు తిప్పు”కోవాలో ఆమెకు తోచదు. “ప్రతి క్షణమూ అంతకుముందు గడచిన కాలానికి, ఏర్పడిన మనస్థితికీ వారసత్వం వహించి అనుల్లంఘ్యం అయి కన్పించింది. ఎన్నిమార్లు ఈ అవకాశం వచ్చినా ఈ మనసు యిలాగే ప్రవహిస్తుంది!”

అపుడు అకస్మాత్తుగా కలిగిన ఒక epiphanic moment (స్ఫురణ క్షణం) తర్వాత ఆమె నెమ్మదిగా కోలుకుంటుంది.
“విశ్వమంతా ఒక గొప్ప యంత్రం లాగా కదిలిపోతున్నది. గాలి, నీళ్ళు, వెల్తురు, భూమి, చెట్లు, జంతువులు, మనుష్యులు, ఏడ్పులు, నవ్వులు – అన్నీ కాలంలో నడుస్తూ, తిరుగుతూ, పరుగెత్తుతూ వున్నాయి. అవి నడవ్వలసినట్లు నడుస్తున్నవి; చేయవలసినట్లు చేస్తున్నవి; దేని సహజ ధర్మాన్ని అది నెరవేర్చుకుంటున్నది. అక్కడ ప్రశ్నలు లేవు, సమాధానాలు లేవు. అక్కడ నిండుగా ఎన్నో జీవాలు కదలాడుతున్నై. ఒకే జీవం వెల్లివిరుస్తున్నది! అక్కడ నిండుగా ఎన్నో ఆనందాలు నర్తిస్తున్నై. ఒకే ఆనందం పొర్లిపోతున్నది. ఒకటే అన్నీ, అన్నీ ఒకటే. బ్రతుకు దాన్నుంచీనే పుడుతున్నది. చావు దాన్నుంచీనే పుడుతున్నది. రెండూ ఒకటే. ఏం జరిగినా ఫరవాలేదు!”
ఇలా చావుతో సమాధాన పడుతుంది. అంతేకాదు, మనిషి మనసు స్వతస్సిద్ధంగా ఈ మీమాంసలకూ, అర్థాన్వేషణలకూ జవాబు చూపించగలిగేట్టి ఏర్పడింది కాదని కూడా తెలుసుకుంటుంది.
“మనిషికుండే పరిమితులు, జీవితానికి అర్థం, స్వేచ్ఛ – అన్నీ ద్వంద్వ స్వరూపమైన మనసుకు సంబంధించిన ప్రశ్నలు. అనవసరమైన ఆలోచనలు. కాలం కూడా మనసుకు సంబంధించిందేగాని సత్యం కాదు. మనిషికి ఈ క్షణం అనేది సత్యం; కాలం అనేది ఊహ. కాలం లేదు; అనేకమైన క్షణాలు ఉన్నాయి. ఈ క్షణానికీ మరో క్షణానికీ మధ్యన సంబంధం లేదు. ఆ సంబంధాన్ని కల్పించేది మనస్సే.”
కథ చివర్లో ఈ ఎఫిఫానిక్ మూమెంట్ మరో సంఘటన ద్వారా శాశ్వతం అవుతుంది. ప్రపంచలో వివిధ ప్రాంతాల్ని కళ్ళ ముందుంచే ‘తమాషబంగ్లా’ (బహుశా ఒక బయోస్కోప్ లాంటి సాధనం) వల్లనూ, దాన్ని ఆడించే ఒక ముసలాయన వల్లనూ, ఆమె ఎట్టకేలకు చావుతో శాశ్వతంగా సమాధానపడుతుంది. కానీ ఈ సమాధానపడటం కథకు అవసరమైన (రచయితకు అవసరంగా తోచిన) ఒక ముగింపు మాత్రమేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే, దీంతో పోలిస్తే జయలక్ష్మి ప్రశ్నలే లోతుగా, తిరుగులేనివిగా ఉంటాయి. వసుంధరాదేవి ప్రపంచాలు స్వతహాగా hopeless, doomed ప్రపంచాలు. (ఈ విషయంలో అవి మరో అసామాన్య రచయిత్రి Flannery O’Connor ప్రపంచాల్ని ఛాయామాత్రంగా స్ఫురింపజేస్తాయి.) వీటిలో ప్రమోదాంతాలు ఉన్నాయి గానీ, అవి అత్యవసరంగా హడావుడిగా తెచ్చి చేర్చిన addendum లా మాత్రమే అనిపిస్తాయి.

వసుంధరాదేవి కథల్లో తాత్త్విక నేపథ్యం గల వాటిలో అధికం జీవితానికి అర్థం లేదనే అస్తిత్వవాదపు పునాది నుంచి పుట్టినవి. ఈ కథల్లో అర్థం కనుక్కోవాలన్న అన్వేషణతో సతమతమయ్యే పాత్రలు చివరకు అర్థం వెతకటం కన్నా యథాతథంగా అంగీకరించి ఆనందం పొందటమే ముఖ్యమనే ధోరణిలోకి వస్తాయి. రచయిత ఆభిప్రాయం కూడా ఇదే అనిపిస్తుంది. ఈ సమాధాన పడటాన్ని “పిచ్చి గీతలు” కథలో చైతన్య అనే పాత్ర ఇలా చెప్తాడు: “దేవుడను, జీవాత్మ అను, లేక వూరికే జీవితం అనో, కారణం అనో ఏమైనా అను – ఏ కారణం వలన మనకు ఈ జీవితం కలిగిందో, ఆ కారణం వలననే మనం దాన్ని నిండుగా ఆనందంతో అనుభవించవలసిన అవసరం కూడా కలిగిందని నా నమ్మకం.” సంక్లిష్టమైన తాత్త్వికాంశాల్ని ఇంత అలవోకగా కథల్లో ఇమడ్చగలగటం చూస్తే, వాటి గురించి రచయిత నిజ జీవితంలో ఎంతగా మథన పడి ఉంటారో అనిపిస్తుంది.

రచయిత జయలక్ష్మి పాత్రలాంటి slightly neurotic నేరేటర్స్‌నీ, ప్రొటాగొనిస్ట్స్‌నీ ఎన్నుకుని కథ చెప్తున్నపుడు అందులో బహుశా ఆవిడ తత్త్వమేదో జల్లెడ లేకుండా కలవడం వల్ల కాబోలు కథలకు చిత్రమైన earnestness వచ్చి చేరుతుంది; ప్రతీ వ్యక్తిలోకీ మెట్లు దిగుతూ పోయినపుడు అతని ప్రపంచపు పాతాళాల్లో ఎదురయ్యే అతనికే ప్రత్యేకమైన ఇడియోసింక్రసీస్ లాంటివి ఇలాంటి కథల్లో ఎదురవుతాయి. ఈ సంపుటిలో “పెంజీకటికవ్వల” తో పాటూ, “పండుగ”, “చెరువు దగ్గర”, “బదిలీ” కథలు ఇలాంటివే.

వీటిలో “బదిలీ” మరో మంచి కథ. ఒక్కోసారి చిన్న కారణాలే మనల్ని చెప్పేవి చెప్పకుండా, చేసేవి చేయకుండా పట్టి ఉంచి ఆపేస్తాయి; తర్వాత వాటికే భవిష్యత్తులో తీవ్రమైన ఫలితాలు బయటపడ్డాకా, అప్పుడనిపిస్తుంది, ఇదే ఇంతకుముందు తెలిసుంటే ఎంతకైనా తెగించి ఆ మాట చెప్పటమో, ఆ చేత చేయటమో చేసే వాళ్ళం కదా, పెద్ద లోటునో ప్రమాదాన్నో నివారించుకునేవాళ్ళం కదా అని. కానీ కాలం ఇర్రివర్సిబుల్. “బదిలీ” కథలో ఒక కుటుంబం ఒక ఊరికి బదిలీ అవుతుంది. ఆ ఊర్లో చిత్రంగా కనిపించే ఒక ఇంట్లో ఉండాల్సి వస్తుంది. వారి కుటుంబ పరిస్థితి అంతకంతమూ క్షీణించటం మొదలవుతుంది. రోగాలూ ఇబ్బందులూ మొదలవుతాయి. కానీ ఏదో అదృశ్యశక్తి వాళ్ళని అక్కడ పట్టి ఉంచేసినట్టు, వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆ ఊర్నించి బదిలీ చేయించుకోలేరు, ఆ ఇంటి నుంచి మారలేరు, చివరికి పెద్ద ప్రమాదం ఎదురయ్యేదాకా. This almost Kafkaesque predicament is dealt with a completely Vasundharadevian way.

వసుంధరా దేవి వచనం పల్చటి మజ్జిగలా తేలికగా గొంతు దిగిపోతుంది. అలాగని అలవాటైన పడికట్టు పదబంధాల మీదా, నానిపోయిన వ్యక్తీకరణల మీదా ఆధారపడదు. అరుదైన మెటఫొర్లూ, అపూర్వమైన సిమిలీలూ కూడా అట్టహాసం ప్రదర్శించకుండా చదునై నిరాడంబరంగా తోటి వాక్యాల మధ్య ఒదిగిపోతాయి. ఉదాహరణకు ఈ కొన్ని వాక్యాలు:
— “జీవితం చెయ్యి జారిన చేద తాడులాగా పట్టు లేకుండా జారిపోతున్నది.” 
— “చీకట్లోనికి జారిపోబోతున్న సూర్యుడు మరణాసన్న సమయములోని చావు తెలివి లాంటి నిశితమైన చూపుతో ఇంతవరకూ తాను లక్ష్యం లేకుండా చూసిన ప్రపంచపు నిజ స్వరూపాన్ని చూస్తున్నట్లున్నాడు.” 
— “సామాన్య మానవులు అవినీతి చేతిలో ఆటబొమ్మలై ఆత్మ విశ్వాసం కోల్పోయి బియ్యం మూటలోని తుట్టపురుగుల్లాగ దొంగ బతుకులు బతికేస్తున్నారు.”
“Show, don’t tell!” అనే పాశ్చాత్య రచనా సూత్రానికి, విదేశీయమైంది ఏదైనా సరే దాసోహమనే స్వభావం గల వాళ్ళం గనుక, ఇపుడు అధిక ప్రాముఖ్యత కట్టబెడుతున్నాం కానీ, సంప్రదాయ భారతీయ కథన పద్ధతుల్ని పరిశీలిస్తే, చూపడం కన్నా చెప్పడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తుంది. వసుంధరాదేవి నేరేషన్ కూడా ఈ పద్ధతినే ఎక్కువ అనుసరిస్తుంది. ఆమె కథలన్నీ సన్నివేశ కల్పన మీద కన్నా, narrative exposition మీద ఆధారపడి సాగుతాయి. అలాగని అంతా పైపైనే చెప్పుకుపోయినట్టు అనిపించదు. అవసరమనుకున్న చోటల్లా నేరేషన్‍ను జూమ్-ఇన్ చేసి సన్నివేశాన్ని దగ్గరగా కళ్ళకు కట్టేట్టు చూపించి మళ్ళీ వెనక్కు జూమ్-అవుట్ చేసుకుని సాగిపోతుంది. ఈ పుస్తకానికి ముందుమాట రాసిన మధురాంతకం రాజారాం ఈ కథలు “కథా లక్షణాల నిర్ధిష్ట పరిమితులకు లోబడేవి కావేమోనన్న” అనుమానం వ్యక్తం చేస్తారు. ఇవి లాక్షణికంగా మంచి కథలో కాదో తెలియదు గానీ, మర్చిపోలేకపోవటం అన్న గుణానికి కథా లక్షణాల్లో ఎక్కడన్నా తావుంటే, ఈ సంపుటిలో “పెంజీకటికవ్వల” లాంటి కథలు మంచి కథలే కాదు, గొప్ప కథలు.

*

(పుస్తకం.నెట్‌లో రెండు భాగాలుగా ప్రచురితం: ఒకటి, రెండు)

0 స్పందనలు:

మీ మాట...