September 26, 2013

Updike సమీక్షా సూత్రాలు

ఒక పుస్తకాన్ని సమీక్షించే ముందు ఈ సూత్రాల్ని మనసులో పెట్టుకోవాలని అమెరికన్ రచయిత John Updike సూచించాడు. ఏదో పని పడి అనువదించాల్సి వచ్చింది, పన్లో పనిగా ఇక్కడ పెడుతున్నాను.

1. పుస్తకంలో రచయిత ఏం చేయదల్చుకున్నాడో అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి, అంతే తప్ప ఏం చేయదల్చుకోలేదో అది చేయనందుకు తప్పు పట్టొద్దు.

2. పుస్తకంలోంచి కనీసం ఒక పేరా ఐనా తెచ్చి ఉటంకించండి. దాని వల్ల సమీక్ష చదివే పాఠకుడు సొంతంగా ఒక నిర్ణయానికి వచ్చే వీలుంటుంది, ఆ పుస్తకం తన అభిరుచికి తగిందీ కానిదీ తనంత తానుగా బేరీజు వేసుకోగలుగుతాడు.

3. పుస్తకం ఇలాంటిదీ అని చెప్తున్నప్పుడు, దానికి ఋజువుగా ఆ పుస్తకంలోని మాటల్నే వాడటానికి ప్రయత్నించండి. అది కేవలం ఒక పదమే అయినా ఫర్లేదు. ఊరికే అస్పష్ట సంగ్రహాలు ఇస్తూ పోవడం కన్నా అది నయం.
4. కథా సంక్షిప్తాన్ని ఇచ్చేటపుడు జాగ్రత్త వహించండి. ముగింపును బయటపెట్టొద్దు.

5. పుస్తకం బాగా లేదని తీర్మానించినపుడు, ఎలా ఉంటే బాగుండేదో తెలిపే ఉదాహరణల్ని, ఆ రచయిత రచల్నుంచి గానీ వేరే చోట నుంచి గానీ, తెచ్చి దాన్ని నిరూపించండి. రచయిత వైఫల్యాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. వైఫల్యం నిజంగా అతనిదేనా, మీది కాదుగా?

స్పష్టమైన ఈ ఐదు సూత్రాలకూ కాస్త అస్పష్టమైన ఆరోది కూడా జత చేయవచ్చు. సరుకుకీ, దాన్ని విలువ కట్టేవాడికీ మధ్య సంబంధం కల్తీ లేనిదై ఉండాలి. ముందే నచ్చదని తెలిసిన పుస్తకాన్ని గానీ, స్నేహధర్మంగా మెచ్చుకోక తప్పదనిపించే పుస్తకాన్ని గానీ సమీక్షకు ఎంచుకోవద్దు. మిమ్మల్ని మీరు ఏ సంప్రదాయానికో పరిరక్షకులుగానో, ఏ పక్షపు ప్రమాణాల్నో అమల్లో పెట్టాల్సిన కార్యకర్తలుగానో, సైద్ధాంతిక పోరాటాల్లో యోధులుగానో, సంస్కరణాధికారులుగానో భావించుకోవద్దు. ఇతర సమీక్షకులతో మీకుండే స్పర్థల్లో భాగంగా రచయితని పావుగా వాడుకుంటూ అతణ్ణి “ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచే” ప్రయత్నాలు ఎప్పుడూ, అసలెప్పుడూ చేయొద్దు. సమీక్షించాల్సింది పుస్తకాన్ని, దాని ప్రశస్తిని కాదు. పుస్తకం మీపై జల్లే మాయకు (అది బలమైనదైనా, దుర్బలమైనదైనా) లొంగిపొండి. తెగిడి వెలివేయటం కన్నా, పొగిడి పంచుకోవడం మేలని గుర్తుంచుకోండి. సమీక్షకునికీ అతని పాఠకులకీ మధ్య గల బంధానికి ఆధారం ఏమిటంటే, చదవటంలో ఏదో ఆనందముందీ అన్న ఒక విశ్వాసం. మనలో ఏ పక్షపాతాలున్నా అవన్నీ ఈ అంతిమ పర్యవసానం వైపే మొగ్గు చూపాలి.

September 24, 2013

ఇగిరిపోయి, ఇంక ఏమీ మిగలకపోవడం

అసలు వాళ్లిద్దరిదీ మొదట్నుంచే ఎన్నో లెక్కల, సమీకరణాల బరువును మోస్తున్న సిటీ ప్రేమ. తప్పని ఉద్యోగ దూరాలతో మరింత కుంగిపోయింది. అతనిలోనైతే దాదాపు అడుగంటిపోయింది. ఆమెతో గడిపిన ఈ వారాంతంలో ఆ చేదు నిజం ఆత్మవంచనల పొరలన్నీ పెకలించుకు వచ్చి అతని ముందు మొండిగా నిలబడింది. విషయం ఇంకా గ్రహించని ఆమె మాత్రం, తిరిగి బయల్దేరే రోజు రాత్రి, ఫ్లాట్‌ఫాం మీద నిలబడివున్న అతని చేతిని రైలు కిటికీ లోంచి పట్టుకు నిమురుతూ, ఇంకా ప్రేమావరణం ఇచ్చే భద్ర భావనతోనే కబుర్లాడింది. కుదుపుతో రైలు కదిలింది, ఆమె కిటికీ అంతకంతకూ దూరమైంది. ఆమె ఎప్పట్లాగే కిటికీ ఊచల్లోంచి చేయాడిస్తూనే ఉంది. క్రమంగా ఆమె కూర్చున్న పెట్టె మిగతా పెట్టెల వరసల్లో ఒకటిగా కలిసిపోయినా, ఊగుతున్న ఆమె చేయి మాత్రం ఇంకా కనిపిస్తూనే ఉంది. ఇన్నాళ్లలో అతనికి తొలిసారి అనిపించింది – తాను ఇట్నుంచి ప్రతిగా చేయి ఊపినా ఊపకపోయినా ఆమెకి ఎలాగూ తెలియదు కదా అని. దూరంగా ఆమె చేయి ఇంకా గాల్లో ఆడుతుండగానే, అతను తన చేతుల్ని ఫాంటు జేబుల్లో దోపుకుని వెనుదిరిగాడు.