December 6, 2013

కాశీభట్లతో పునః కరచాలనం: “కాలం కథలు”

‘నేనూ చీకటి’ నవల ఆంధ్రప్రభలో ధారావాహికంగా ప్రచురితం అవుతున్నప్పుడు నేను కాశీభట్ల పేరు మొదటిసారి అచ్చులో చూశాను. అప్పటి నా పదిహేనేళ్ల బుర్రకి ఆ రచన అంతగా అర్థం కాలేదు. తర్వాతెప్పుడో డిగ్రీ పూర్తయిన కొత్తల్లో స్వాతి మాసపత్రిక అనుబంధ నవలగా వచ్చిన ‘దిగంతం’ పాఠకునిగా నాకో కనువిప్పు. అది ఎల్లకాలం నికరంగా నిలిచే కనువిప్పులకు ఆస్కారముండే వయసు కాకపోవచ్చు. కానీ పరిధీ, విస్తృతుల్లో పరిమితమైన ఆధునిక తెలుగు సాహిత్యంపై ఓ మాదిరి అవగాహన రావటానికి ఆ మాత్రం వయసు చాలనే ఇప్పటికీ అనుకుంటాను. అప్పట్లో నేను ఓ పక్కేమో. . . పేజీలు చకచకా తిప్పించేసి, పూర్తి చేశాకా మనసులో ఏ మాత్రం నిలవని పాపులర్ సాహిత్యాన్ని రీముల్లెక్కన హరాయించుకుంటున్నాను; మరోపక్క మేథో స్థాయిని అప్‌గ్రేడ్ చేసుకోవాలనే ఒకే ఒక్క చవకబారు కారణంతో క్లాసిక్ సాహిత్యంగా పిలవబడే (చలం, బుచ్చిబాబు, గోపీచంద్, తిలక్, ముళ్లపూడి. . .) రచనల్ని పట్టుబట్టి చదువుకుంటూ వస్తున్నాను. అలాంటప్పుడు కాశీభట్లను చదవటం – ఆయన ‘నేనూ చీకటి’కి ముందు మాట రాస్తూ కవి శేషేంద్ర అంటాడే అలా – నా పఠనా ప్రపంచంలో ఒక బౌద్ధిక భూకంపాన్నే సృష్టించింది.

అలాంటి శైలీ, ఇతివృత్తమూ, దృక్పథాలు నేను అదివరకూ ఎక్కడా చూడనివి. అప్పటి నా పఠనా ప్రపంచంలో నన్ను ఆ స్థాయిలో ఆకట్టుకున్న రచయితలెవరూ లేరు. అసలు ఈ మనిషి కూడా నాతో పాటూ సమకాలీనంగా భూమ్మీద బతుకుతున్నాడా అనిపించేది. ఇందాక చెప్పిన రెండు నవలల్తో పాటూ, అతని రచనలన్నీ ఏవి తారసపడితే అవి చదివేశాను. అంటే ఎన్నో లేవు, ‘తపన’, ‘మంచుపూవు’, ‘తెరవని తలుపులు’ మొదలైన నవలలూ, ‘కాశీభట్ల వేణుగోపాల్ కథలు’, ‘ఘోష’ అనే రెండు కథా సంపుటాలూ.

కానీ నాకు త్వరలోనే ఒక ఇబ్బంది ఎదురైంది. ఏ మాత్రం సొంత గొంతుకలేని వాళ్ల పుస్తకాలు వరసగా ఎన్ని చదివినా చదివిందే చదువుతున్నామనే భావన కలగకపోవచ్చు, ఎందుకంటే వాళ్ల పుస్తకాలు కలిగించే ప్రభావం తక్కువ కావటంతో, వాళ్ల రెండో పుస్తకం చదివేసరికే మొదటి పుస్తకం తాలూకు పఠనానుభూతి ఆవిరైపోయి ఉంటుంది. కానీ కాశీభట్లకే ప్రత్యేకమైన ఆ శైలి ప్రభావం నుంచి అంత తొందరగా బయటపడటం కష్టం. దాంతో మరుసటి నవలకి వచ్చేసరికి గత నవల కలగజేసిన ప్రభావాన్ని మించిందేదో ఆశించడం, అది అక్కడ అందకపోవడంతో నిరాశ చెందటం. . . ఇలా ప్రతీ రెండో నవలకీ కాశీభట్ల పలచబడి పోసాగాడు. ఆయన్ని ఆయనే పదే పదే కాపీ కొట్టుకుంటున్నాడన్న భావన కలగసాగింది. ఒక పాఠకునిగా నేను చాలా త్వరగా saturation point (సంతృప్త స్థితి) కి చేరుకున్నాను.

చైతన్య స్రవంతి శైలి బుచ్చిబాబు, వడ్డెర చండీదాస్, అంపశయ్య నవీన్ వగైరా చాలామంది రచయితలు వాడారు. కానీ వాళ్ల చేతుల్లో అది ఓ అరువుతెచ్చుకున్న పరాయి సరుకుగానే మిగిలిపోయింది. కానీ సంస్కృతాంధ్రాంగ్ల భాషల్లో మంచి పట్టూ, దగ్గరి పరిచయమూ ఉన్న కాశీభట్ల చేతిలో అది కవిత్వ స్థాయిని అందుకుంది. దాన్ని పూర్తిగా చైతన్య స్రవంతి శైలి అని అనలేం, it’s like an elliptical soliloquy (గొణిగే స్వగతం). దాని ప్రేరణ ఎక్కణ్ణించి వచ్చినా, ఆయన దాన్ని తనదే అనిపించేట్టుగా సొంతం చేసుకోగలిగాడు. అయితే ఒక్కోసారి పెద్ద ఇన్సిరేషన్ లేని తావుల్లో కూడా దాన్ని, బహుశా కేవలం అది తన మార్కు శైలి అన్న కారణాన, వాడుతూ పోవటంతో, రాన్రానూ ఒక తెచ్చిపెట్టుకున్నతనం కనిపించసాగింది. చివరకు తన ఇతివృత్తాల పట్ల ఆయనకున్న భావోద్వేగభరితమైన అనుబంధంలోని నిజాయితీని కూడా ఈ శైలి కారణంగా శంకించాల్సిన పరిస్థితి. ఆయన ఎంత సన్నిహితమైన కథను ఎంత నిజాయితీగా చెప్తున్నా, ఈ అరిగిపోయిన శైలి పాఠకునిగా నాకూ, ఆ కథకూ మధ్య – ఆవలి దృశ్యాన్ని వంకర చేసి చూపించే నొక్కుల గాజుతెరలా – అడ్డుపడటం మొదలైంది.

ఆయన ఇతివృత్తాలు కూడా రాన్రానూ చాలా పరిమితమైన జీవితానుభవపు పరిధిలోనే తన్నుకులాడుతున్నాయని అనిపించింది. చెప్పిన కథల్నే తిరగేసి మరగేసి మళ్లీ మళ్లీ చెప్తున్నాడనిపించింది. ఉదాహరణకు ఒక మూసని ఇలా చెప్పుకోవచ్చు: కొన్ని పాత్రలుంటాయి, ఆ పాత్రలన్నింటి మధ్యా సామాజిక వర్గాలకతీతమైన సుహృద్భావ వాతావరణం ఉంటుంది, పాత్రలన్నీ తమ తమ వ్యక్తిగత జీవితాల్లో ఏవో క్రైసిస్‌ని ఎదుర్కొంటూ ఉంటాయి, కథ నేరేట్ చేసే ముఖ్య పాత్ర సభ్యసమాజపు భద్రజీవితం నుంచి అడపాదడపా దూకి అరాచక చీకటి జీవితపు అగాథాల్లోకి షికారెళ్లి వస్తూంటుంది, ఉన్నట్టుండి కథలో ఏదో ఒక పాత్ర చనిపోతుంది, మిగతా పాత్రలన్నీ maudlin sentimentalityని ప్రదర్శిస్తూ గుంపుగా దగ్గరగా జరుగుతాయి, వాళ్ల వాళ్ల క్రైసిస్‌లు రచయిత బలవంతం మీద ఎలాగో ఒక కొలిక్కి వస్తాయి…. ఇదే ఇతివృత్తాన్ని నేను ఒక నాలుగైదు రచనల్లో చూపించగలను. అలాగే ఈ పాత్రలు చాలాసార్లు రచయిత తాలూకు మేథస్సును ఏ మొహమాటం లేకుండా అరువు తెచ్చుకుంటాయి. ఒక ఉదాహరణ: ‘నేనూ చీకటి’ నవల్లో వేశ్య గౌరీమనోహరి కాఫ్కా, అయాన్‌రాండుల్ని చదువుతుంది. ‘ఏం వేశ్యలు కాఫ్కాని చదవకూడదా?’ అనొచ్చు. ఆ సాహిత్యం చదవగలిగిన అమ్మాయి ఆ స్థితిలో ఉండే ఖర్మ మన సమాజంలో ఎప్పుడూ లేదనే అనుకుంటాను. రచయిత తన రచనలకు నిజ జీవిత వాస్తవికతను ప్రమాణంగా తీసుకోనంతవరకూ ఎన్ని అసంభవ కల్పనలైనా చేయవచ్చు, అతని ఇష్టం. కానీ దాన్ని ప్రమాణంగా తీసుకున్నాకా కూడా ఇలాంటి నాటకీయతను జోడిస్తే, ఆ కాల్పనిక ప్రపంచాలు తమ verisimilitude (విశ్వసనీయత)ను కోల్పోతాయి.

ఆయన రచనల్లో కనిపించే దృక్పథంతో కూడా నాకు ఇబ్బంది మొదలైంది. సంఘం అంగీకరించని వ్యక్తి చీకటి కోణాల పట్ల morbid interest విసిగించసాగింది. ఆత్మాశ్రయ చెరసాలలో చిక్కుకుపోయిన చాలామంది అరాచక వ్యక్తుల్లో సంఘపు కట్టుబాట్లపై పనిమాలా వెళ్లి దాడి చేయాలనే ప్రగాఢ వాంఛ ఉంటుంది. ఈ అడాలసెంట్ రెబెలియన్ (కుర్రతనపు తిరుబాటు ధోరణి) కాశీభట్ల కథానాయకుల్లో ఎక్కువ కనిపిస్తుంది. ఆయన పాత్రలు చుట్టూ ప్రపంచాన్ని శత్రువుగా తమ ఎదుట నిలుపుకుంటాయి. దాన్నుంచి తమని తాము వెలివేసుకోవడం ద్వారా, వేరుపడటం ద్వారా తమ వ్యక్తిత్వాలకు గుర్తింపును సంపాదించుకుంటాయి. వయసు అంకె మారే క్రమంలో చాలామంది ఈ దశల్లోంచి ప్రయాణిస్తారు. బహుశా నేను అలాంటి దశల్లో ఉండగా కాశీభట్ల నన్ను ఆకట్టుకున్నాడేమో. చాలామంది ఈ దశను దాటి ముందుకు సాగిపోతారు. దాన్ని ప్రపంచంతో లౌక్యంగా రాజీపడటం అనండి, అంతకన్నా పరిణిత (లేదా అదిగాక వేరే) సత్యమేదో గ్రహింపుకు రావటం అనండి… కారణం ఏదైనా కావచ్చు. మొత్తానికి కాశీభట్ల అనే స్టేషన్‌లో కాసేపాగిన నా బండి మళ్లీ ముందుకు కదిలిపోయింది.

ఇలా నెమ్మదిగా కాశీభట్ల నాకు దూరమైపోతుండగా – ఇంత ఉపోద్ఘాతాన్నీ దాటి ఇప్పుడు అసలు విషయానికి వస్తే – ‘కాలం కథలు’ నాకు మళ్లీ ఆయన్ని కొత్తగా పరిచయం చేశాయి.

‘కాలం కథలు’ మొత్తం 68 వ్యాసాల సంకలనం. దాదాపు అన్నీ రెండేసి పేజీల వ్యాసాలే. ఇవి తొలిగా ఎక్కడ ప్రచురితమయ్యాయో ఆ వివరాలు ఎక్కడా ఇవ్వలేదు (ఇచ్చుంటే బాగుండేది). కానీ  వ్యాసాలలో అడపాదడపా వచ్చే ప్రస్తావనల్ని బట్టి ఇవన్నీ దాదాపు పదేళ్ల క్రితం ఏవో పత్రికల్లో (కొన్ని విపులలో) ధారావాహికంగా వచ్చాయని తెలుస్తోంది. అంటే నేను ఇందాకట్నించీ  ఏ రచనల్ని ఉద్దేశించి అన్ని ఫిర్యాదులు లేవనెత్తానో, అవి రాస్తున్న కాలంలోనే ఆయన ఈ వ్యాసాలూ రాశారు. మరి ఇవి కొత్తగా, వేరేగా ఎందుకున్నాయి? కాశీభట్ల ఈ వ్యాసాల కోసం తనది కాని ముసుగేదన్నా వేసుకున్నాడా? లేక సదరు కాల్పనిక రచనల్లోని నేరేటర్లే కేవలం fictional ముసుగులై ఉండి, ఇక్కడ కనిపించేదే ఆయన అసలు ముఖమా? లేక – ఆయన తన నేరేటర్లకీ తనకూ పెద్ద దూరం ఏం లేదని అంటూంటాడు గనుక – ఆయనకున్న బహుముఖాల్లో రెండూ భాగమేనా?

ఇక్కడ కాశీభట్ల మార్కు శైలి మాత్రమే కాదు, కాశీభట్ల మార్కు ప్రాపంచిక దృక్పథం కూడా లేదు. ప్రపంచం పట్ల రగిలిపోతూ, దాని ముందు తన వైయక్తిక వైవిధ్యాన్ని జస్టిఫై చేసుకోవాలనే పెంకితనంతో వేయినాల్కల అగ్గి ఊస్తున్న దుందుడుకు డ్రాగన్‌ ఇక్కడ లేదు. దానికి బదులు, ప్రపంచంతో సామరస్యమైన ఒడంబడిక చేసుకుని వాత్సల్యపు కళ్లతో అలౌకికంగా గడ్డి నెమరేస్తున్న ఆవు కనిపిస్తుంది. ఎలాగూ పోలిక కోసం ఆవు దాకా వచ్చాం కాబట్టి, కొండొకచో అల్లరిగా చెంగనాలాడే దూడ కూడా కనిపిస్తుందని చెప్పేసుకోవచ్చు. ఉదాహరణకి “వైయక్తిక యుద్ధాలు” అనే వ్యాసంలో పాఠకులతో సరదాగా మాట్లాడే ఈ గొంతు గమనించండి:
“ఎవరో వస్తారని ఏమో చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా
నిజం మరచి నిదురపోకుమా” 
అని ఓ సినీ కవి హెచ్చరించి, ఒరేయ్ మామూలు మనిషీ! ఈ యుద్ధం నీది, నీ యుద్ధం నువ్వే చేయాలి… లే పోరాడు, పోరాటం లేకపోతే బతుకుబండి సాగదు అన్చెప్పాడు. 
అదే విషయం మన గీత కూడా చెప్పింది. 
ఏ గీతా? మీ పక్కింటమ్మాయి పొడవాటి చెవి లోలాకులూ.. పొట్టి జుత్తూ, ప్యాంటూ షర్టూ వేసుకుని ఎమ్మే ఇంగ్లీషు చదివి ఎలిమెంటరీ స్కూల్లో తెలుగు పాఠాలు చెబుతుందే ఆ పిల్లా? అనడక్కండి.. ఆ గీత కాదు.. భగవద్గీతండీ (అబ్బో వీడు మళ్లీ యింకో సంస్కృత శ్లోకంతో మన్నేడిపించేస్తాడ్రా బాబో అనుకుంటున్నారా? కరక్టే ఏడవండి) 
ఆత్మ సంయమ యోగంలో ఈ శ్లోకం చూడండి –
“ఉద్ధరేదాత్మ నాత్మానం నాత్మానమవసాదయేత్
ఆత్మైవ హ్యాత్మనో బన్ధురాత్మైవ రిపురాత్మవః” 
అంటే, ‘నాయినా! నిన్ను నువ్వు ఉద్ధరించుకో, నిన్ను నువ్వు అధోగతి పాల్చేసుకోకూ.. నీకు నీవే బంధువ్వి, నీకు నీవే శత్రువు కూడానూ తెలిసిందా’ అని… అంటే శాస్త్రాలూ, దేముళ్లూ, సాములోళ్లూ, గురూగార్లూ ఎందరున్నా… చూపుడు వేల్తో అదో అదే నీ దారి అని అన్చూపుతారే తప్ప నిన్ను మోసుకెళ్లరు… ఆ దారెంబడ నడిచి ఛావల్సింది నువ్వే. అని కదా! సో… అందువలన… ఇస్లియే… కాబట్టి మన మన జీవిత యుద్ధాలు మనమే చేసుకొనవలెను.
ఇలాంటి గొంతు ‘నేనూ చీకటి’ రచయిత నుంచి నా వరకూ అనూహ్యం. ఈ వ్యాసాలన్నీ ఆయనకు జీవితంలో తారసపడిన వ్యక్తుల, అనుభవాల నెమరువేతలు. ఇవి పత్రికలో ఫీచర్‌గా విడివిడిగా వచ్చినపుడు పెద్ద ఆసక్తి రేపి ఉండవు. కానీ వీటన్నింటినీ ఇలా కలిపి చదువుకోవటం బాగుంది. నేను చాలామంది రచయితల దగ్గర ఒకటి గమనించాను. మామూలు కాల్పనిక రచనల విషయంలో వాళ్ల శైలి ఎలా ఉన్నా, సొంత జీవితం గురించి రాసేటప్పుడు మాత్రం వాళ్ల వచనం అన్ని పెట్టుడు అలంకారాల్నీ వదిలేసుకుంటుంది. వాక్యాలు అడ్డురాకుండా అదృశ్యమైపోతాయి. చెప్పదల్చుకున్న/ చూపదల్చుకున్న విషయం సూటిగా స్వచ్ఛంగా మన ముందు సాక్షాత్కరిస్తుంది. ఈ పుస్తకంలో వచనం అలాంటిదే. అలాగే ఇలాంటి సింహావలోకనాల్లో సహజంగా ఉండే సమాధానపడే ధోరణి, అన్నీ దాటి వచ్చేశాకా ఉండే స్థిమితం… ఇవి వచనానికి ఒక నింపాదితనాన్ని ఇస్తాయి. అందుకే, ముందుమాటలో జగన్నాథశర్మ “వేణుగోపాల్ వచనం వర్షంలా నను తడిపేసింది.. చలిలా వణికించేసింది.. ఎండలా మండించేసింది” అంటుంటే, ఐతే ఆయన ఎఫెక్టు కోసం ఏదో సంబంధం లేనిదైనా మాట్లాడుతూండి ఉండాలి, లేదా మా ఇద్దరిలో ఒకరు ఈ పుస్తకం చదవకపోయైనా ఉండాలి, అనిపించింది. దీనికి మరో ముందు మాట రాసిన వాడ్రేవు వీరలక్ష్మీదేవి మాత్రం పుస్తక సారాన్ని అలవోకగా పట్టుకున్నారు.

ఈ వ్యాసాల్లో కాశీభట్ల తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఆర్తిగా, దయగా, కుతూహలంగా ఎలా స్వీకరిస్తారో కనిపిస్తుంది. ఇక్కడ ఆయన తెచ్చి కుప్పగా పోసిన ప్రపంచంతో పోలిస్తే ఆయన కాల్పనిక రచనల్లోని ప్రపంచం, ఇందాకే చెప్పినట్టు, చాలా పరిమిత వలయంలో తన్నుకులాడుకుంటున్నట్టు అనిపిస్తుంది. తనతో ప్రత్యక్ష సంబంధం ఉన్న వ్యక్తుల్ని గుర్తు చేసుకున్నంత దగ్గరితనంతోనే, తన జీవిత పట్టాల్ని అలా తాకుతూ పోయే జీవితాల్ని కూడా (మహబూబ్ నగర్‌ నుంచి వలస వచ్చే కూలీజనాన్నీ, ఆసుపత్రిలో తారసపడిన ఒక ముసలి పేషెంటునీ, మానసిక వికలాంగుడైన బిడ్డ కోసం అందర్నీ వదులుకు వచ్చిన తల్లినీ) పరామర్శిస్తాడు. స్నాప్‌షాట్లలా ఉంటాయివి. ఇంకా చిన్నతనపు జ్ఞాపకాలు, దేశాటనపు జ్ఞాపకాలూ, కలిసిన అపురూప వ్యక్తుల్నించి నేర్చుకున్న పాఠాలూ… ఇలా వ్యాసాల వస్తువులకు పరిమితి ఏం లేదు. ఆయన విస్తృత పఠనం చాలా వ్యాసాలకు పాయసానికి జీడిపప్పు సాయంలా పనికి వస్తుంది.

కాశీభట్ల నవలల్లో కనిపించే ఫిర్యాదులన్నీ సంఘంతో అస్సలు కత్తు కలవని ఒక ఉలిపికట్టె నుంచి వస్తున్నట్టు అనిపిస్తే, ఈ వ్యాసాల్లో చెదురుమదురుగా వినిపించే ఫిర్యాదులన్నీ పార్కు బెంచీల మీద కూర్చుని తోటి రిటైర్డు స్నేహితుల్తో వాపోయే ఒక పెద్దాయన నుంచి వస్తున్నట్టు ఉంటాయి. ఈ పెద్దాయన ఈ మధ్య చదువులు మరీ వ్యాపారాలైపోవడాన్ని గురించీ, మానవసంబంధాలు పల్చబడటాన్ని గురించీ, మాయావతి పుట్టిన రోజుకి అంత ఖర్చు పెట్టడాన్ని గురించీ కూడా వాపోతూ కనిపిస్తాడు.

ప్రతీ వ్యాసానికీ చివర బోల్డ్ ఫాంటులో కొన్ని వాక్యాలు జత చేసి ఉన్నాయి. ఇవి ఎప్పుడో రాసిన ఈ వ్యాసాల్లోని విషయాలపై ఇప్పుడు జత చేసిన క్లుప్త వ్యాఖ్యానాలు. బహుశా పుస్తకం విడుదలకు ముందు రచయిత ప్రూఫులు చూస్తున్నపుడు, రాసినవి కాబోలు. కొన్ని బాగా అతికినట్టు సరిపోయాయి. మరికొన్ని అప్పటి వ్యాసంలో అసమగ్రంగా మిగిలిపోయిన జీవిత గాథలకు సరైన ముక్తాయింపునిచ్చాయి. కొన్ని మాత్రం మంచి వ్యాసానికి అనవసరమైన మొక్కుబడి తోకల్లా ఉన్నాయి (తలత్ మొహమూద్ ని మొదటిసారి విన్నపుడు పొందిన అనుభూతి గురించి రాసిన వ్యాసం చివర ఈ పోస్టు స్క్రిప్టు: “యాంత్రికత్వం మనలోని సున్నితత్వాన్ని కరకుగా చెరిపేస్తున్న నేటి జీవన నేపథ్యంలో, మంచి సంగీత సాహిత్యాల అవసరం ఎంతైనా ఉంది.” ఇలాంటివి వ్యాసం కలిగించే అనుభూతికి కొత్తగా ఏం జతచేయవు, platitudinous గా అనిపిస్తాయి). “పోగేకో” అన్న వ్యాసంతో మొదలుకొని ఉన్న చివరి నాలుగు వ్యాసాల్లో డీటీపీ ఆపరేటర్లు బహుశా దస్తూరీ అర్థం గాక వదిలేసిన ఖాళీలు సరిదిద్దబడక అలాగే కనిపిస్తున్నాయి.

మొత్తానికి, కాశీభట్లని ఇప్పటిదాకా విడవకుండా వెంట వస్తున్న పాఠకులకు ఇందులో కొత్త కాశీభట్ల కనిపిస్తాడు. అసలాయన్ను చదవకుండా కేవలం విని, జడిసి దూరంగా ఉండే పాఠకులకు కాస్త ధైర్యం చేయదగ్గ కాశీభట్ల కనిపిస్తాడు.

(కినిగె పత్రికలో ప్రచురితం)

1 comment:

  1. Anonymous5:40 AM

    he is a great writer sir
    ------------------------
    buchi reddy gangula

    ReplyDelete