November 23, 2014

నరేష్ నున్నా "అపరిచితం" నవలపై నా ప్రసంగం

"అపరిచితం" నవల మీద తెలుగు యూనివర్శిటీలో జరిగిన ఒక ప్రోగ్రాంలో నేను చదివిన ప్రసంగపాఠం ఇది:--


"అపరిచితం" గురించి మాట్లాట్టానికి ముందు... నరేష్ నున్నా రచనల మీద నా జనరల్ ఇంప్రెషన్ ఏంటో చెప్దాం అనుకుంటున్నాను. ఆమధ్య ‘అపరిచితం’ చదివాకా ఒక వ్యాసం రాయాలని అనుకున్నాను. దానికి పేరు ఆలోచిస్తే నాకు తట్టింది: the naresh nunna problem. నరేష్ నున్నాతో ఇబ్బంది. ఒక రచయితగా ఆయన్ని ఎంత ఇష్టపడతానో అంత ఇష్టపడను. నరేష్ నున్నా రచనల్ని నాలుగేళ్లుగా చదువుతున్నాను. కథలూ, కవితలు, రివ్యూలు, సినిమా రివ్యూలూ... ఫేస్బుక్ పోస్టులతో సహా నరేష్ ఏ అక్షరం ముక్క రాసినా తప్పిపోనివ్వను; కానీ నాకు నచ్చిన రచయితల జాబితాలో ఆయన పేరు చేర్చటానికి సంకోచిస్తాను.

ప్రతీ పుస్తకం నిజానికి ఒక సమక్షం. పుస్తకం రూపమూ, అక్షరాల వరుసలూ, కాగితం వాసనా ఇలా భౌతికమైన సమక్షమే కాదు. పుస్తకానికి ఒక ఆత్మిక సమక్షం కూడా ఉంటుంది. అది పుస్తకంలోంచి వ్యక్తమయ్యే ఆ రచయిత sense of life కి సంబంధించినది. ఒక పుస్తకాన్ని ఇష్టపడ్డామంటే ఆ రచయిత ఎసెన్షియల్ సమక్షాన్ని ఇష్టపడటమే. “ఎసెన్షియల్ సమక్షం” అని ఎందుకంటున్నానంటే, పుస్తకానికి బయట ఆ రచయితని మనం సోషల్గా కలుసుకున్నప్పుడు మనకి తెలిసేది అతని సూపర్‌ఫిషియల్ సెల్ఫ్ మాత్రమే. కానీ రచన వెలువడేది అతని అంతరంగపు అట్టడుగుతలం నుంచి. అది అతని అసలు సెల్ఫ్.

నరేష్ నున్నా రచనల్లోంచి వ్యక్తమయ్యే ఈ ఎసెస్షియల్ సెల్ఫ్ చాలా ఘాటైన స్వభావం కలది. ఎందుకంటే, నరేష్ నేరేటర్లందరూ నరేషే. వాళ్లది చాలా స్ట్రాంగ్ వాయిస్. వాడికి నచ్చేవీ నచ్చనివీ ఉంటాయి. వాడు హైలీ జడ్జిమెంటల్. వాడు ఎక్కడా దాక్కోడు, నేరేషన్ వెనుక నక్కటానికి ట్రై చేయడు, తన సమక్షాన్ని less imposing గా మార్చటానికి ట్రై చేయడు. సో, నరేష్ పుస్తకాల సమక్షమంటే నరేష్ నేరేటర్ల సమక్షమే. ఆ సమక్షాన్ని నేను ఇష్టపడను. It’s as if i am in a unpleasant company. Why is it unpleasant… అంటే నాకు ఎప్పుడూ అస్పష్టమైన కారణాలే తట్టాయి. ఇక్కడా అవే రాసుకున్నాను.

Despite his seemingly modern syntax and etc, at the heart ఆయనొక భావకవి. భావకవులతో, వాళ్ల సెన్స్ ఆఫ్ లైఫ్‌తో, నేను ఎంపతైజ్ కాలేని లక్షణాలు నరేష్ లోనీ ఉన్నాయి.

భావకవులు చాలామందిలో వాళ్ళు ప్రపంచాన్ని చూసే తీరులో ఒక snobbish quality ఉంటుంది. ప్రపంచాన్ని they don’t take it as it is. They choose. And their choice is affected by what they think as higher taste or high plane of life.

అలాగే భావకవుల ‘అమలిన శృంగారం’ కాన్సెప్టు నరేష్ లోనూ కనపడుతుంది. నరేష్ తన వచనాన్ని తన నాయికల వైపు ఎంత దట్టంగా మోహరించినా, అందులో సెక్స్ ఉండదు.

అలాగే స్త్రీని భావకవులు ఒక ethereal, mysterious being గా చూడ్డానికి ఇష్టపడతారు. నరేష్ కూడా అంతే. నరేష్ లో ఈ స్త్రీ అనే సబ్జెక్టు ఆల్మోస్ట్ ఒక మోనోమానియాలాగా ఉంటుంది. ఆయన స్త్రీలో ప్రపంచాన్ని చూసుకోగలడు. దానికి భిన్నంగా... నాకు స్త్రీ అనేది... she is just part of the whole deal. సృష్టిలో being కి ఉన్న అనేకానేక ప్రొజెక్షన్స్ లో స్త్రీ ఒకటి మాత్రమే.

పై లక్షణాలన్నీ నరేష్ నేరేటర్ల స్వభావంలో అప్రయత్నంగా “వ్యక్తం అయ్యేవి” మాత్రమే ఐతే, నాకు పెద్ద ఇబ్బంది ఉండేది కాదేమో. కానీ ఆ నేరేటర్లు.. they are vehemently expressive about them, వాళ్లు వాటిని చాటుతారు, అగ్రెసివ్‌గా డిఫెండ్ చేసుకుంటారు. ఎవర్నుంచి? పాఠకుల్నుంచి. నరేష్ నున్నా text లో పాఠకుల అవేర్నెస్, పాఠకుల రియాక్షన్ పట్ల అంచనా ఎప్పుడూ వుంటుంది (పాఠకుల్ని దృష్టిలో పెట్టుకుని రాయటం కాదు, that’s different).

ఇలాంటి నేరేటర్ల సమక్షం... it’s rather irksome to me.

So.. ఇదీ నాకు ఆయన రచనలతో ఉన్న ఇబ్బంది.

కానీ నరేష్‌ రచనల్లో నన్ను మంత్రముగ్ధుణ్ణి చేసేదేంటంటే, రూపకాల్ని పుట్టించగలిగే ఆయన కపాసిటి. మళ్ళీ అందులో ఏ ఒక్కటీ క్లీషేల బరువుతో ఉన్నది కాదు. అవి జెన్యూన్ గా ఆయన sensory experience నుంచి పుట్టినవి.

నేనిందాక అన్నానే, స్త్రీ అనే సబ్జెక్టు ఆయన mono mania అని. కానీ ఈ మెటఫోర్స్ దగ్గరకి వచ్చేసరికి దానికి అవతల ఉన్న నరేష్ కనిపిస్తాడు. ఒక రసార్ధ్రమైన మనసున్న మనిషిని చూపిస్తాయి ఆ మెటఫోర్స్. అవి.. somehow... ఏదైతే నేనిందాక అన్‌ప్లెసెంట్ సమక్షం అన్నానో, దాని అవతల నుంచి వస్తాయి. తనలో ఏ ప్లేన్ నుంచి ఆయన ఈ మెటఫోర్స్ ని సృష్టిస్తాడో గానీ, I absolutely love that part of him.

* * *

ఇక అపరిచితం విషయానికొస్తే...

"అపరిచితం" ఫస్ట్ డ్రాఫ్ట్ వెర్షన్ లాంటిది ఒకటి పంపించారు నాకు చదవమని. ప్రతీ డ్రాఫ్ట్ వెర్షన్లోనూ ఉండే లోపాలు అందులోనీ ఉన్నాయి. కానీ, ఈ ఫైనల్ వెర్షన్ లో లేని thematic unity అందులోనే బాగుందనిపించింది. బహుశా ఈ రచనని ఒక పుస్తకంగా అచ్చేసేందుకు వీలయ్యేటన్ని పేజీల్లో విస్తరించటానికి, ఆయన ఈ యూనిటీని త్యాగం చేసి, కొన్ని ఇర్రిలవెంట్ ఎపిసోడ్స్ ని ఇరికించారేమో అనిపించింది.

ఉదాహరణకి... ఇందులో కర్నాటక కాంపులూ - అక్కడ స్కార్లెట్ కథా, రాజ్‌బీర్ పాయల్ వీళ్ల కథ.. ఇవన్నీ అసలు కథతో సంబంధం లేని అంశాలు. అయినా వీటికి రిలవెన్స్ ఉందీ అని మనం అంగీకరించాల్సివస్తే... అప్పుడు ఇది నవల కాదు, memoir (స్మృతిరచన) అనుకోవాల్సొస్తుంది. పేరు ఏదైతేనేం అనొచ్చు కానీ, ఇది స్మృతి రచన ఐనపుడు, దీని గురించి మాట్లాడటానికి వేరే సెట్ ఆఫ్ క్రైటెరియా అవసరమవుతుంది.

ఇక, నరేష్‌ భాష గురించి కొంత మాట్లాడాలనుకుంటున్నాను:-

నరేష్‌కీ ఆయన భాషకీ మధ్య ఉన్నది ఒక పారడాక్సికల్ రిలేషన్‌షిప్. ఆయన భాషని చాలా ఎక్కువ నమ్ముతూనే, చాలా తక్కువ నమ్ముతాడు.

ఉదాహరణకి తక్కువ నమ్మకం ఎక్కడంటే.... ఒక్కోచోట, తను చేరవేయాలనుకున్న దృశ్యాన్ని ఒక ఖచ్చితమైన మెటఫోర్ తో చేరవేశాక కూడా, మళ్ళీ తానే అపనమ్మకంతో దానికి చిన్న చెల్లి లాంటి ఇంకో తోకని తగిలిస్తాడు. దానివల్ల చెప్పదల్చుకున్నది పాఠకుని మనసులో లోతుగా దిగటం అటుంచి, ఈ అనవసరమైన multiplication of emotion వల్ల, needless accumulation వల్లా... అనుభూతిని ఖచ్చితంగా చేరవేయగలిగే ఆ మొదటి మెటఫోర్ సాంద్రత కూదా పల్చబడుతుంది. కొన్ని ఉదాహరణలిస్తాను:

తాగుడు అలవాటు లేదని నేరెటర్ని ప్రవాసి ఎత్తిపొడుస్తూ ఏదో అంటే... తాగుబోతువాళ్ళంటే తనకు చులకన లేదని చెప్తూ.. నిన్ను నేనెందుకు చులకన చేస్తాను.. ఇంతటివాణ్ణీ... అంటూ ఆయన ఎంతటివాడో ఇలా చెప్తాడు:
“పుప్పొడి రేణువుల్లో అనేకానేక పూలవనాల సారాన్నో, జల ప్రళయంలో ఒకానొక వానచినుకు మూలాన్నో... ఇంకా... ఇంకా విశ్వానంత చైతన్యపు inscape ని ఇసుక రేణువలోనో దర్శించే నీ మూడో కంట్లో నేనొక నైతికాల నలుసెందుకవుతాను కవీ!!” అంటాడు.
ఇక్కడ పుప్పొడి రేణువుల్లో పూలవనాల సారం, జలప్రళయంలో ఒకానొక వానచినుకు మూలం.. అంటే మైక్రో లోంచి మాక్రోనీ, మాక్రో లోంచి మైక్రోనీ చూడగలిగే ద్రష్టత్వం... అని చెప్పటం... నిజానికి మొదటి రెండు మెటఫోర్స్ బాలెన్స్‌డ్ సిమ్మెట్రీతో ఆ భావాన్ని చేరవేస్తున్నాయి. మూడోది అనవసరం.

అలాగే ఇంకో ఉదాహరణ... చాన్నాళ్లు ఆమెని చూడకపోవటం వల్ల ఆమె రూపం తన జ్ఞాపకంలో ఎలా మారిందో తల్చుకుంటాడు.
“ఆమె ముఖం గుర్తు తెచ్చుకోవాలని చాలా సార్లు కళ్లు మూసుకున్నాను. చిమ్మచీకట్ల దిగుడుబావి లోలోతుల్లో నీటిచెమ్మ తొణికినట్టు, కారుమబ్బులకి అందని ఆకాశవీధిలో వెలుతురు దిష్టిచుక్క మెరిసినట్టు.. ఏదో నమ్మకమైన భ్రాంతిలాంటినవ్వులా మాత్రమే ఆమె రూపం గుర్తుండిపోయింది.”
నిజానికి మొదటి మెటఫోర్ చెయ్యాల్సిన పని చేసేసింది. “చిమ్మచీకట్ల దిగుడుబావి లోలోతుల్లో నీటిచెమ్మ తొణికినట్టు” కాలక్రమేణా ఆమె జ్ఞాపకచిత్రం తన ఖచ్చితమైన రూపాన్ని కోల్పోయింది. మనకి అలా జరుగుతుంది... ఒక జ్ఞాపకాన్ని మనం పదే పదే వాడటం వల్ల.. అందులో డిటెయిల్స్ అన్నీ మాసిపోయి అలుక్కుపోతాయి. ఆ భావాన్ని మొదటి మెటఫోర్ చాలా అందంగా చేరవేసింది. ఇక “కారుమబ్బులకి అందని ఆకాశంలో దిష్టిచుక్క మెరిసినట్టు” అన్న రెండో మెటఫోర్ కూడా మొదటిదాని పనే చేస్తోంది, కానీ అంతకన్నా ఇనెఫిషియంట్‌గా చేస్తోంది. దాన్ని జత చేయటం వల్ల మొదటి మెటఫోర్ యునీక్నెస్ పల్చబడిపోతుంది. ఇలా ఎందుకు చేయటం అని ఆలోచిస్తే... కారణం భాషని తక్కువ నమ్మటమేమో అనిపిస్తుంది.

భాషని ఎక్కడ ఎక్కువ నమ్ముతాడనిపిస్తుందంటే... ఆయన తన text లో ఎక్కడా ఖాళీలు వదలడు. భాషపై అతి నమ్మకంతో, అంటే తాను అనుభూతించినదంతా వ్యక్తం చేయగల శక్తి భాషకి ఉన్నదన్న నమ్మకాన్ని దాని మీద పెట్టి, పాఠకుడు వచ్చి నింపుకోగలిగే పొయెటిక్ శూన్యాల్నీ ఖాళీల్ని వాడికి వదలకుండా... అంతా తన వైపు నుంచే చెప్పాలనుకుంటాడు. అలా చెప్పగలిగే శక్తి భాషకి ఉందనుకుంటాడు. దీని వల్ల... ఒక్కోసారి బెల్లం మీద మూగిన ఈగల్లా.. అనుభూతి మీద ఆయన పదాలు మూగేస్తాయి. ఫలితంగా ఏ భాషైతే ఒక వారధిగా పన్చేయాలో, అదే ఒక తెరలాగా అడ్డం పడుతుంది.

ఇంకోటి, ఆయన వాక్యాన్ని ఒక స్ట్రిక్ట్ యూనిట్‌గా తీసుకుంటాడు. అంటే ఒక అనుభూతి మొదలైందంటే, అది ఆ వాక్యం ముగిసేలోగా దాని అంతు చూడాలి. అందుకోసం ఆయన వాక్యాల లెంగ్త్ పెరిగిపోతుంది. అంటే, He tries to cram in as much as he can in to one sentence. The result is... తెలుగుకు అసహజమైనన్ని క్లాజులతో ఆ వాక్యం పెద్దదవుతుంది. ఇలాంటి వాక్యాల్ని మధ్యలో పుల్‌స్టాపులు perilous balance తో పట్టి ఉంచుతాయి. కానీ.. ఎప్పుడైతే వాక్యాన్ని ఒక యూనిట్‌గా తీసుకున్నామో... అప్పుడు మనం భావాన్ని in terms of language చూట్టం మొదలుపెడ్తాం... in terms of linguistic possibility. ఫలితంగా భావ ప్రవాహంలో స్మూత్ ఫ్లో మిస్సవుతుంది. ఇలాంటి well packed వాక్యాలు.. విడిగా మంచి కోటబుల్ కోట్స్ ఐతే అవ్వొచ్చు. కానీ సొంత సెంచరీ కోసం చూసుకునే బాట్స్‌మన్స్ లాంటివి అవి. చదువరిని మొత్తంలో సంలీనం కానీయవు. పుల్‌స్టాపులు ఎదుర్రాళ్లలాగా తగిలి అడ్డుపడతాయి.

In spite of all this... ఆయన ఒక జెన్యూన్ ఆర్టిస్ట్, అండ్ ఇన్వెంటర్. మొదటి చెప్తే రెండోది చెప్పక్కల్లేదు. అసలైన ఆర్టిస్టు తన కళని అంతరంగపు లోతుల్లోంచి తీసుకొస్తాడు. ప్రతీ అంతరంగమూ తనకే ప్రత్యేకమైన కొలతలు కలిగివుంటుంది కాబట్టి.. అక్కణ్ణించి బయటకొచ్చే కళ కూడా ప్రత్యేకమైన పద్దతినీ, form నీ డిమాండ్ చేస్తుంది. అప్పుడు సహజంగానే వాళ్ళు ఆ form కోసం తపనపడి వెతుక్కుంటారు. ఫలితంగా ఇన్వెంటర్లు అవుతారు. నరేష్ పద్ధతీ, form ఆయన సొంతంగా వెతుక్కున్నది. తెలుగులో రాయబడిన ఇంకే పేజీల్లో ఎదురుకానిది. ఏదీ అరువుతెచ్చుకున్నది కాదు. ఆయన తన ఇన్‌స్ట్రుమెంట్‌ని ఇంకా పెర్ఫెక్షన్ వైపు తీసుకెళ్తున్నారని.. ప్రతీ సక్సెసివ్ రచన వల్లా తెలుస్తుంది. కాబట్టి.. I am happy that I am here & I’m happy that there is so much more to come.

*

November 17, 2014

లోయల్లో ఊయల
భరత్‌నగర్లో లోకల్‌రైలు దిగి ఫ్లాట్‌ఫాం చివరికి వచ్చి పట్టాలు దాటి తుప్పలమధ్య బాటలోంచి నడిస్తే వచ్చే సిమెంటురోడ్డు. వీధిలైటు పసుపుగా పరుచుకున్న చోట నిల్చున్నాను. రమణ బండి మీద వచ్చి నన్ను పికప్ చేసుకోవాలి. తర్వాత మందుబాటిలూ స్టప్ఫూ తీసుకుని, ఆయన బొమ్మలేసుకోవటానికని కొత్తగా అద్దెకుతీసుకున్న స్టూడియో చూట్టానికి వెళ్లాలి.

కాల్ చేస్తే దార్లో ఉన్నా అన్నాడు. వెయిటింగ్ ఇంతసేపని తేలినాకా మెదణ్ణి దేన్తోనో ఆక్యుపై చేసుకోవాలిగా. చుట్టూ చూస్తే… నగరపు ఈ మూల కిక్కిరిసిన నివాసాలు. కాసేపు నా రచయిత చొక్కా తగిలించుకుని అవలోకించాను. అపుడు అలవాటు తెర చప్పున జారి పరిసరాలు మేల్కొంటాయి. కానీ ఒళ్ళు దగ్గరపెట్టుకోపోతే ఏవో దొంగ కంక్లూజన్లు కిట్టించేస్తావు, దగ్గర పెట్టుకుంటే నిజంగానే ఏదో నిజం నీ తలుపు తట్టొచ్చు. అలా చుట్టూ ఆవరించి ఉన్న ఇళ్ళని – రెండుమూడు గదుల ఆస్బెస్టాస్ కప్పుల ఇళ్ళ నుంచీ, మధ్యతరగతి లైఫ్‌సేవింగ్స్ ఫలితమై కింది వాటాల్ని ఫామిలీలకి అద్దెకిచ్చే నిటారు అంతస్తుల ఇళ్ళదాకా అన్నింటినీ – చూస్తోంటే, నా సోమరి మెదడు ఏదో ఆపద్ధర్మంగా అందిన సారాంశాన్ని కక్కేయబోతోందని పసిగట్టి ఆపేసాను. రోడ్డువారన నిలబడి మాట్లాడుకుంటున్న కుర్రాళ్ళ గుంపుకేసి చూపుతిప్పితే, సాహిత్యవర్ణనలకు నప్పేట్టు ఒద్దికైనమూసల్లో ఇమడకుండా అంతా కలగాపులగంగా కనపడి, విసుగొచ్చి, ఇదంతా కట్టిపెట్టేసి, రమణగారి కొత్త పాషన్‌ప్లస్సు ఎప్పుడు వీధి మలుపు ఎపుడు తిరుగుతుందా అని చూడటంలో పడ్డాను. ఆయన కంటోర్స్‌తో సరిపోలని రెండుమూడు ఆకారాలు వచ్చి నన్ను దాటుకుంటూ పోయాకా, నిస్సందేహంగా ఆయనదైన సిల్హౌటు బండి మీద మలుపు తిరిగింది. ముఖం మొత్తాన్ని వెలిగించే (కానీ అయిందానికీ కాందానికీ చవగ్గా వాడేసే) తన సిరినవ్వుతో పలకరించి బండి చుట్టుతిప్పాడు.

వెనక ఎక్కాకా ఇద్దరం సందులూగొందుల్లోంచి పోతున్నాం. మాటలవుతున్నాయి. “నేను తాగాలని ప్లాన్ చేసుకునేం రాలేదు. ఆ ప్రోగ్రాం లేకపోయినా ఓకే” అన్నాను. ఇంటి దగ్గర బయల్దేరేటపుడు విద్య చేసిన హెచ్చరిక కొంత కారణమైతే, ప్రస్తుతం నా జేబులో ఆయనకి తీర్చాల్సిన మూడువేలూ మినహాయిస్తే విద్య శాంక్షను చేసిన నూట పది మాత్రమే ఉన్నాయి (ఒక వంద కాయితం, ఒక పది కాయితం). అందులో రైలుటికెట్టుకి పది తీసేస్తే, ఈ సిట్టింగుకి నా తరపున పెట్టుకోగలిగే ఖర్చు వందరూపాయలు మాత్రమే. అందుకే అలా మొహమాటపడ్డాను.

కానీ ఆయన ఒకటనుకున్నాక వెనక్కి తగ్గే రకం కాదు. వైనుషాపు ముందు ఆగాక లెక్కపెట్టనవసరం లేని వందనోట్లు కొన్ని జేబులోంచి తీసి లెక్కపెడుతుంటే నేను నా వందా తీసి ఆయన చేతిలో పెట్టాను. మొహమాటంగా నవ్వుతూ “నిజానికి అవసరమే కూడా” అన్నాడు. కటకటాల కౌంటర్లోంచి చేయి పెట్టి ఏదో బ్రాండ్ పేరు అడిగి నావంక చూసి ఓకేనా అన్నాడు. నాకు ప్రిఫరెన్సులు లేవు గనుక వినపడకపోయినా సరే అనేశాను. తర్వాత అది జిన్ అని అర్థమైంది. ఎపుడూ తాగలేదు. ఐనా ఆడవాళ్ళ మందు అని దానికున్న పేరు ఇదివరకూ వినుంటం వల్ల, ఎలాగూ తాగింతర్వాత రైలెక్కి ఇంటికి వెళ్ళటం అనే ఫీటు గురించి అప్పటికే కాస్త వర్రీ అవుతున్న మూలాన, ఇదీ మంచిదేలే మరీ అవుటైపోయే పరిస్థితి రాకుండా అనుకున్నాను.

నాకు మందు ఏదన్నది పెద్ద ముఖ్యం కాదు. మరీ అంత మందుకి మరిగిన నాలిక కాదు. పక్కన తింటానికి మంచి స్టప్ఫు లేదంటే మాత్రం పెగ్గు దిగదు. రమణ అలాక్కాదు, వట్టి నీళ్లు కలుపుకుని సిగరెట్టు నంజుకుంటూ తాగేస్తాడు. అందుకే బజ్జీబండి దగ్గర బైకు ఆపాకా స్టప్ఫు విషయంలో ఎక్కడ పీనాసిగా చుట్టబెట్టేస్తాడోనని భయం పట్టుకుంది. పోనీ నేను చేయాడిద్దామా అంటే పదికాయితమే ఉంది. అందుకే తెగించి, ఇంకో అప్పు జమకని పక్కన పెట్టుంచిన రెండువేల లోంచి కొంత వాడేద్దామని, “లేపోతే ఇక్కడ ఏటీఎం ఏవన్నా ఉంటే పోదాం పదండి” అన్నాను. “ఎందుకండీ మీరు జస్ట్ ఏం కావాలో చెప్పండి” అన్నాడు. అప్పటికే కలిపున్న పిండి చూసి పకోడీ వేయమన్నాం. ఇంకా పునుకులూ, వడలు. బండివాళ్ళిద్దరూ తెలంగాణ జంట అని రమణగారికి తెలిసిపోయిందో, మరి ఈ వ్యవహారాల్లో ఆయన అంతేనో తెలీదుగానీ, నాతో మాట్లాడే ఎటూకాని యాస వదిలేసి పూర్తిగా తన యాసలోకి దిగిపోయాడు (“ఉల్లిగడ్డ ఏషినవే?”).

కట్టించుకుని బయల్దేరాం. సందుమలుపు తిరిగేటపుడు కొండగుర్తులు చెప్పాడు, “ఇదిగో ఎస్బీఐ బాంకుకీ ఐన్‌స్టీన్ స్కూలుకి మధ్యనున్న సందండీ” అని. నాకు అసలు బజ్జీబండి దాకా ఎలా వచ్చామో కూడా గుర్తు లేదు, కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయలేదు. వీధిలైట్ల వెలుగుల్లోంచీ, వాటిని పంక్చువేట్ చేసే చీకట్లలోంచీ ఒక బుల్లి కూడలికొచ్చి ఆగాం. రమణగారి ఇంటిఓనరు ఇల్లు మలుపు దగ్గర ఉంది. ఈయనకి అద్దెకిచ్చింది మాత్రం రోడ్డు అవతల ఇరుకుగేటు దాటి వెళ్తే తప్ప కనపడని ఖాళీస్థలంలో వేసిన రేకుల షెడ్డులో రెండోగది. పక్కగదిలో ఎవరో రొట్టెలు తయారు చేస్తారట. గది తలుపు తీయగానే ఆమూల నించి ఈమూలకి పరిచిన (ఫెవికాల్తో నేలకి అంటించిన) కార్పెట్ కనిపించింది. ఈ గదిలో ఇదివరకూ కోళ్ళను ఉంచేవారట. వాటి ఎండిన రెట్టలతో గదంతా నిండిపోతే, ఈయన ఎంత కడుక్కున్నా పోకపోయేసరికి, ఆఫీసుకారిడార్లలో పరిచేలాంటి ఈ తివాచీ తెచ్చి అంటించాడు. మాటల్లో పడి యథాలాపంగా గుమ్మం దగ్గర పడున్న రెండు పెయింటింగ్స్ దాటొచ్చేశాక, ఆయన వాటిని చూపించి “ఎలా ఉన్నాయో చూస్తూండండి. నేను మీకు స్ప్రయిటు తెస్తా” అని వెళ్ళాడు. మూణ్ణాలుగు రోజుల్లో వచ్చే మహిళాదినోత్సవం సందర్భంగా ఏదో గ్రూపుఎగ్జిబిషన్ ఉంటే దానికి తన వంతుగా వేస్తున్నవి. పేరు పత్రికల్లో నానటం కోసం. మనసు నుంచి వచ్చిన సబ్జెక్టు కాదు. ఆయన మిగతా పెయింటింగ్స్‌లో ఉండే మజా లేదు.

ఈ తెలియనిగది సమక్షంలో చతికిలపడ్డాను. తివాచీ మీద వేళ్లకి అందే పీచుని పీకుతూ కాసేపూ, పాతపేపర్లు తిరగేస్తూ కాసేపూ, ఉన్న ఒకే ఒక్క అల్మరాలో (నిజానికి అది వంటగట్టు) ఆయన పేర్చుకున్న కుంచెల్నీ రంగుల్నీ కెలుకుతూ కాసేపు కూర్చున్నాను. ఆయన చెప్పింతర్వాతే నా ముక్కుకి తెలిసిన కోళ్ళవాసన, ఇప్పుడు మేం తెచ్చిన పొట్లాల్లోంచి వ్యాపిస్తోన్న కమ్మని నూనెవాసనతో రిప్లేస్ అవుతోంది. పేపర్లో క్రైంపేజీల కోసం వెతికాను, దొరక్క సినిమా పేజీల్లో రబ్బరు నడుములూ బొడ్డుల వైపు చూస్తూ కాలక్షేపం చేశాను.

ఆయన వచ్చాకా పేపర్లు పరిచి వాటి మీద పొట్లాలు విప్పి బాచీమటాలేస్కుని కూర్చున్నాం. మోడరేట్ ఫీస్టు. ఎపుడూ ఛీర్స్ సంగతి మర్చిపోతాను. ఎలాగుందో చూద్దామని ఓ సగంమూతడు రా జిన్ను ముందే నోట్లో పోసుకున్నా. చల్లటి బిట్టర్‌స్వీటు స్పిరిట్టు నాలికంతా ఇంకుతూ పోయి గొంతుద్వారం దగ్గర మంటగా అణిగింది. తాగటం కన్నా తిండి మీదే ఎక్కువ శ్రద్ధ పెట్టే నా తత్వం ఆయనకు అలవాటైపోయింది. సగం స్టప్ఫు నావైపే నెట్టేస్తాడు. గ్రౌండ్ వర్కు అంతా సిద్ధం, ఇక ఇక్కణ్ణించీ చుక్కల్లోకీ హేజీ పాలపుంతల్లోకీ ఎగరటమే తరువాయి. “చెప్పండి కబుర్లు” అన్నాడు.

(బహువచనం నుంచి బయటపడలేకపోవటానికి ఆయన తరపు నుంచి బహుశా నా మేధావితనంపై ఆయనకున్న తగని భ్రమలో మరోటో కారణం కాగా, నా తరపు నుంచీ నాకన్నా నాలుగేళ్ళు పెద్దయిన ఆయన వయసూ, ఆయన కళామూర్తిమత్వంపై నాకున్న గౌరవం, నా ప.గో.జీ తనమూ కారణం.)

గాల్లోకి లేచే ముందు నేల మీద తక్కుతా తారట్లాడే గాలిపటంలా కాసేపు సాగింది సంభాషణ. ఆ మహిళాదినోత్సవం పెయింటింగ్స్‌కి నేను తెలుగులో పొయెటిగ్గా రాసిన కాప్షన్ల గురించి మెచ్చుకున్నాడు. ఆ పెయింటింగ్స్‌లో నాకనిపించిన తేడాల్ని (మరీ స్పెసిఫిగ్గా చెప్పేంత అవగాహన లేదు కాబట్టి) మూగవాడి సైగల్లా పైపైన చెప్పటానికి ప్రయత్నం చేశాను. కానీ ఆయన అర్థం చేసుకోగలడు. దట్స్ ద థింగ్. తర్వాత ఆయన ఆర్ట్ ప్రపంచం మీద ఆయన, నా లిటరరీ ప్రపంచం మీద నేనూ గాసిప్ చెప్పుకుని, ఆయన పెయింటింగ్‌కి సంబంధించి అందుకున్న సత్యాల్ని నేను రచనకి, నేను రచన గురించి అందుకున్న సత్యాల్ని ఆయన పెయింటింగుకీ అన్వయించుకుంటూ, నా మీదున్న గురితో ఆయన తన మీద నమ్మకం పెంచుకుంటూ, ఆయన మీదున్న గురితో నేను నా మీద నమ్మకం పెంచుకుంటూ… చాలా మాట్లాడుకున్నాం.

సంభాషణ ఇనెవిటబుల్‌గా మా దరిద్రం వైపూ, డబ్బుసమస్య వైపూ వచ్చింది. ఇది మా రెగ్యులర్ టాపిక్కు. ప్రపంచాన్ని ఎలా జయించాలి, ఎలా సంపాదించాలి అన్నది. నాలో ఇంకా మొలకెత్తుతున్నదే గానీ, రమణగారిలో మాత్రం కరడుగట్టిన రాక్షసకాంక్ష. కానీ ఆ జయించటమూ, సంపాదించటమూ అన్నవి మళ్లా తన లెక్కల్లోనే జరగాలి అనే పట్టింపు చూస్తే ముచ్చటేస్తుంది. జయించటానికి ఆయన వైపున్న సైన్యమల్లా ఈ కొన్ని కుంచెలూ రంగులూ మాత్రమే. కానీ ఎన్నిసార్లు దెబ్బపడినా మొండిగా లేచే మెంటల్‌తనం ఉంది. కాన్వాసు ముందు ఉన్నంతసేపూ ఎలాగూ అక్కడ ఎంత మజా పొందుతున్నాం అన్న దానిమీదే దృష్టి ఉంటుంది. కానీ కాన్వాసు దాటి పక్కకు వచ్చినప్పుడల్లా ఇంటద్దె అనీ, పిల్లలకి అనుకోకుండా వచ్చిపడే జ్వరాలనీ, వాళ్ల స్కూలు ఫీజులనీ ఇలా మనుగడ బాధలు చుట్టుముడుతుంటే, సర్వైవల్ ఆటలో ముందుకెళ్లటానికి మనుషులంతా ఆధారపడే సవాలక్ష నైపుణ్యాల్లో తన ఈ కళ కూడా కేవలం ఒకటి మాత్రమే అన్నట్టు చూడక తప్పదేమో. కానీ ఒకలా చూస్తే ఆర్టిస్టు ప్రివిలేజ్డ్ ప్లేయరు. వాడి ఆటకి నియమాలు వాడే నిర్దేశించుకుంటాడు. పైగా ఈ ఆటని బతకటానికి ఆడేవాళ్ళ మందలో ఒకడు కాదు, ఆనందించటానికి ఆడే అతికొద్దిమందిలో వాడు ఒకడు. కానీ ఆటలో గెలవకముందే కూత ఆగిపోతే అనే డౌటు పట్టి నన్ను చంపుతుంది. అదే అన్నాను.

“నిజమేనండీ, ఎలాగైనా సంపాదించాలి. ఒక్కోసారి భయమేస్తుంది. ఉన్నట్టుండి నాకేదైనా అయి చనిపోతే విద్య పరిస్థితి ఏంటని…” అన్నాను.

ఈ భయానికి కొంత పూర్వరంగం ఉంది. చావుని తల్చుకుని నేనెప్పుడూ పెద్ద భయపడలేదు, కానీ ఇప్పుడు నా చావు తర్వాత విద్య జీవితాన్ని ఊహించుకోవటానికి భయపడుతున్నాను. ఇదంతా నిజానికి విద్యే నాలో (అప్రయత్నంగానే) ఎక్కిస్తుందేమో. ఆరోగ్యం మీద నా అశ్రద్ధ తనకు మరీ విసుగుతెప్పించినపుడల్లా అంటుంది: “నీకేదన్నా అయితే తర్వాత నేనుండనురా. నాకింకేం లైఫ్ ఉంది. చచ్చిపోతానంతే” అని. నిజమే, తనకి నేను తప్ప అబ్సొల్యూట్‌గా ఎవరూ లేరు. ఎంత లేరంటే, నేను లేకపోయిం తర్వాత తను బతకాల్సిరావటాన్ని నేనే ఊహించలేను. నన్ను పాలించే రాణిని, ఎవరి పంచనో దిక్కులేకుండా. కానీ జరిగేది అదే. తన కుటుంబం మొత్తాన్ని శాశ్వతంగా శత్రువుల్ని చేసుకుని ఇటు నా కుటుంబానికీ చేరువ కాలేక… ఎటూ కాని ఈ స్థితిలోకి తెచ్చి… నేన్నిజంగా ఆమెను తీసుకొచ్చి మంచే చేశానా అనిపిస్తుంది. ఏం చేయాలి అంటే జవాబు తెలిసిందే: కనీసంలో కనీసం, సంపాదించాలి. అపుడనిపిస్తుంది, అసలైన పురుషార్థం భార్యాపిల్లల కోసం కూడబెట్టడమేనని. కానీ ఈ రాతలతో ఏం రాలతాయి. నిజంగా ఇంకేదైనా చేసి సంపాదించగలిగితే ఖచ్చితంగా అదే చేయాలి. ఒకప్పుడు నాకు చావుభయమంటే రాయాల్సినవి రాయకుండా చచ్చిపోవటమనే. కానీ ఇప్పుడు నా తదనంతరం అన్నీ అమర్చిపెట్టకుండా చచ్చిపోతానేమోనన్నదే పెద్ద భయమైపోయింది. ఇదంతా తల మీదకి ఒత్తిడిని దించుతుంది. క్రూరమైన దయావిహీనమైన భావాల్నైనా ఆసరా తీసుకోవాలనిపిస్తుంది. మొన్నొకసారి నా ఆరోగ్యం మాటొచ్చి మళ్ళీ తను అదే మాట అనబోతే, “నేనంటూ లేకపోయాక, నువ్వేమైతే నాకేవిటే” అన్నాను. అది నన్నామె అర్థం చేసుకునే ట్రాన్స్‌ఫరెంట్ క్షణాల్లో ఒకటి. “నువ్వెంత స్వార్థపరుడివిరా!” అని అనగలిగింది.

అంతకుముందు ఓ రోజు రాత్రి నన్ను నేను హింసించుకుంటూ కల్పించుకున్న వికృతోహల ప్రభావం కూడా ఆ మాట వెనుక ఉండొచ్చేమో ఆమెకు తెలీదు, నాకూ తెలీదు. ఆ రోజు ఆమె పక్కనే పడుకున్నాను. చిన్నపిల్లలా సగంనోరు తెరిచి ఒత్తిగిలి పడుకుంది. ఎలాగో తన ప్రపంచం మొత్తానికి నన్నే కేంద్రకం చేసేసుకున్న జీవి. ఆ కేంద్రకం కూలిపోతే? నేనిలా ఇక నిద్ర లేవకుండా చచ్చిపోతే? తెల్లవారేకా ఆమె మామూలుగా లేచి, నేను యథావిధిగా రాత్రి పొద్దోయేదాకా ఏదో పుణుక్కుని ఆలస్యంగా పడుకుని ఉంటాననీ, అందుకే ఇంకా లేవలేదనీ అనుకుంటూ, తాను లేచి స్నానాలవీ కానిచ్చేసి, టిఫిన్ చేయటంలో పడి, ఈలోగా నన్నులేపి మొహం కడిగించేస్తే వేడిగా తింటాను కదా అని బెండ్రూంలోకి వచ్చి, ఎంత పిలిచినా పలక్కపోతే కుదిపి, నిరోధంలేని దేహపు కదలికల వల్ల నెమ్మదిగా మొదలైన అనుమానాన్ని తనే మళ్ళీ బయటకి అదిలిస్తూ, కానీ అది పెనుభూతమై పెరుగుతుంటే ఏమీ చేయలేక, అర్థం విప్పార్చుకుంటున్న నిజాన్ని వెనక్కు మళ్ళించలేక, నన్ను అటూయిటూ కదిపి, నాడి పట్టుకుని చూసి, అప్పటికే చల్లబారిన నా ఛాతీకేసి చెవి ఆన్చి, జీవం ఖాళీ చేసి వెళ్ళిపోయింతర్వాత మిగిలిన పదార్థమాత్రపు దేహంలో రక్తసంచలనాలూ లబ్‌డబ్‌లూ ఏమీ లేని గడ్డకట్టిన నిశ్శబ్దాన్ని మాత్రమే వినగలిగి, తనొక శవంతో ఉన్నానని అర్థమై, బహుశా క్షణమాత్రం పాకే లేకి భయానికి లజ్జితురాలై, దాన్ని కప్పిపుచ్చేందుకు ఒక్కసారి కవటాలు వదిలేస్తే వచ్చిపడిన ప్రేమావేశం నా చల్లటి దేహంపై ఫెటిల్లున కన్నీరై పగిలి, బరువుమాత్రమే మిగుల్చుకున్న నా తలని తన వళ్ళోకి తీసుకుని, చెంపలుకారేలా ఏడ్చి, ఆ ఏడుపు అందరికీ వినపడుతుందనీ, వినపడాలనీ, ఎవరో ఒకరు చెంతనుండాలనీ… స్టవ్ మీద మాడిపోతున్న ఉప్మా, అపార్ట్‌మెంటు కారిడార్ల నిండా పాకుతున్న ఏడుపు, కాసేపు ప్రేమతోనూ, కాసేపు తన స్థితి తలుచుకుని, కాసేపు ఈ శవాన్ని ఏం చేయాలనీ…. ఉత్త కట్టెలాంటి శరీరాన్ని డిస్పోస్ చేయటానికి ఎంత ఖర్చవుతుంది, ఏటీఎంలో ఉన్నదెంత, చుట్టూ నా పరిచయస్తులూ, స్నేహితులూ తనకి ఏమీ కాని వారు, ఈలోగా రింగవుతున్న ఫోను లిఫ్ట్ చేస్తే తను వారం క్రితం జాకెట్లు కుట్టడానికిచ్చిన టైలరావిడ కుట్టడం పూర్తయిందనీ వచ్చి తీసుకెళ్లమనీ అంటుంటే, ఈ వినాశనపు సూచనైనా లేని ఓ గతంలోకి పోర్టల్ తెరుచుకున్నట్టయి, వీలైతే ఫోన్లోంచి దూరి అక్కడికి వెళిపోవాలనిపిస్తుంటే, ఆ దారిని ఈ చావుతో కలుషితం చేయబుద్దేయక, రేపు వచ్చి తీసుకుంటానని చెప్పి పెట్టేసి, చాపమీద నిటారుగా పడుకోబెట్టి తెల్లటిగుడ్డతో కప్పివున్న నా వైపు చూస్తూ…. కళ్ళు నిండాయి నాకు, ఆ చిన్నగా నోరు తెరిచి సన్నగా గురకపెడుతున్న బుజ్జితల్లిని చూసుకుంటూ, ఇదంతా చెరిపేసుకుని, ఎప్పటికో పడుకుంటాను. తెల్లారి లేచాకా ఇదంతా ఏమీ చెప్పకుండా సందర్భం కల్పించిమరీ కామెడీగా అంటాను, “నువ్వు మాత్రం సుమంగళిగానే చచ్చిపోవే బాబూ” అని.

ఈ భయమే రమణ గారి ముందు ఆ మాటల్లో బయటపడింది. అవి ఆయనకూ తగిలాయి. తన జీవితంలోకి చూసుకునేలాగా. “అవునండీ” అని వాళ్లావిడ గురించీ, పిల్లల గురించీ తల్చుకున్నారు. “నాకేమన్నా ఐతే విజయ నిజంగా దిక్కులేని పరిస్థితిలో కెళిపోతుంది. పిల్లలు రోడ్డు మీద బతుకుతూ గవర్నమెంటూ స్కూళ్ళలో చదివీ చదవకా అల్లరిచిల్లరగా… అసలు ఊహించుకుంటేనే భయంగా ఉంటుంది.”

“నిజంగా మనం బతికున్నప్పుడు వాళ్ళు గవర్నమెంటు స్కూళ్ళల్లోనే చదువుతున్నా ఫర్లేదనిపిస్తుంది కానీ, మనం లేకుండా మాత్రం వాళ్ళని అలా ఊహించుకోలేం” అన్నాను.

తన ఆలోచన తాలూకు కొనసాగింపునే విన్నట్టు వెంటనే తలూపి ఒప్పుకున్నాడు.

చెల్లెల్ల పెళ్ళికి పెద్ద వడ్డీల్తో తెచ్చిన అప్పుల బరువు ఆయన మీద పడి ప్రతీ నెలా సంపాదన లోంచి పాతికవేలు వడ్డీలే గుంజుకుంటుంటే ఏ నెలకా నెలే టైట్‌రోప్ వాకింగ్ చేస్తున్నారు. నా మాటలు ఆయనలో నిద్రాణంగా ఉన్న భయాన్ని లేపాయి. ఆ భయం నాకన్నా తీవ్రంగా ఉండి ఉంటుంది. ఏడాది క్రితం అనుకుంటా, ఒకరోజు నేను ఎందుకో వాళ్ల ఇంట్లో ఉన్న సందర్భంలోనే ఆయనకి ఉన్నట్టుండి ఛాతీ నెప్పి విపరీతంగా వచ్చింది. ఇంట్లో వాళ్ళు హార్ట్ ట్రబులేమన్నానేమో అని భయపడ్డారు, కన్నీరుపెట్టుకున్నారు. ఎక్కడో పెద్ద ప్రయివేటు హాస్పిటల్లో తెలిసినవాళ్ల ద్వారా కార్టియాక్ చెకప్పుకి వెళ్ళాం ఇద్దరం. ఆ రోజంతా ఏవో టెస్టులతో హాస్పిటల్లోనే గడిచిపోయింది. ఆయన్ని సెక్షన్నుంచి సెక్షన్ కి తిప్పుతూ చెకప్స్ ఏవో చేస్తూనే ఉన్నారు. ఛాతీకి సెన్సర్లు తగిలించి ట్రెడ్మిల్ మీద పరిగెత్తించటం, ఇంకా అలాంటివి. భయమేమన్నా ఉంటే అది ఆయన మొహం మీద కనపడనీయలేదు, నాతో పంచుకోలేదు కూడా. ఉత్కంఠ మాత్రం ఉందనిపించింది. రిజల్ట్స్ కోసం ఆ తెల్లటి కారిడార్లలో ఎదురుచూస్తూ కూర్చున్నప్పుడు ఆయనన్న మాటల్నిబట్టి సిగరెట్టూ మందూ మోతాదు తగ్గించటం గురించి నిజంగా ఆలోచిస్తున్నట్టే కనపడింది. సాయంత్రానికి రిజల్టు వచ్చింది. స్ట్రోక్ అయితే కాదు గానీ, ఆయన గుండె దగ్గర కొలెస్టరాల్ శాతం మాత్రం ఎక్కువుందని తేలింది. మందులూ, ఎక్సర్సయిజూ చెప్పారు. బయటైతే పడ్డాడు, కానీ ఆ సంఘటన చావెంత చేరువో గుర్తు చేసిందనుకుంటా. ఈమధ్యే తాగితాగి చిన్నవయసులో చచ్చిపోయిన దళితకవి గురించి రెండుమూడుసార్లు ప్రస్తావిస్తే అలా అనిపించింది.

వ్యసనంలో సీనియారిటీ పరంగా చూస్తే ఎక్కువ భయపడాల్సింది ఆయనే. కానీ చచ్చిపోయాకా వెనక మిగిలేవాళ్ల పరిస్థితిలో దైన్యత విషయానికొస్తే నా పరిస్థితే అధ్వాన్నమనిపించింది. కానీ ఇదంతా భూమ్మీద మసిలేవాళ్ళకి తప్పని తాపత్రయమే తప్ప ఎవరు చచ్చిపోయినా తోటివాళ్ల బతుకు ఆ చిన్న కుదుపు తర్వాత అలా సాగిపోతూనే ఉంటుందేమో. ఐనా మన దగ్గరివాళ్ళెప్పుడూ మన ఆధ్వర్యంలోనే బాగున్నారని నమ్మాలనుకుంటాం. ఒకవేళ ఇప్పుడలా ఉన్నట్టు లేకపోయినా వాళ్ళని బాగుండే స్థితికి తీసుకెళ్లగలమని నమ్ముతాం.

ఎన్ని పెగ్గులు దాటినా జిన్ను తాగటానికి తియ్యగా బానే ఉంది గానీ, తలకైతే ఎక్కటం లేదు. నిద్రలేమితో ఉన్నవాడ్ని పట్టివూపే మత్తులా ఉందంతే. కానీ రమణగారు తన కుటుంబం గురించి మాట్లాడుతున్నప్పుడు నా కళ్ళల్లో తాగుబోతుకన్నీళ్ళు చిప్పిల్లాయి. మా రెగ్యులర్ సిట్టింగుల్లోలా ఈరోజు పాలపుంతల్లోకి ఎగరలేదు. స్టప్ఫు ఎప్పుడో అయిపోయింది. మందుకూడా కావొచ్చింది. కాసేపు కూర్చుంటే తాగింది సక్రమంగా ఎక్కి ఇంకాస్త బెటర్ మూడ్లోకి వెళ్ళేవాళ్లమేమో. ఒక తీరైన ముగింపుకి చేరినట్టుండేది. కానీ నా ఆఖరు రైలు పదిన్నరకి. బస్సుల్లో వెళ్లొచ్చు గానీ, ఈ స్థితిలో బస్సులవీ మారాలంటే భయం. ఆయన్ని తొందరపెట్టాను.

పేపర్ల అంచులు దాటి తివాచీ పీచులో ఇరుక్కుపోయిన తిండి తునకల్తో సహా అనీ పేపర్లలో చుట్టబెట్టి ఏరి బయటపడేశాం. ఆయన తన 12 X 6 స్టూడియోకి తాళం వేశాడు. ఇద్దరం బండి ఎక్కి బయల్దేరాం. ఇందాకటి సిమెంటు రోడ్డు మీదకు తెచ్చి దింపాడు. నా జేబులో పదికాయితమే మిగిలింది. ఎందుకన్నా మంచిదని చిల్లర అడిగాను, ఆ ఫూలిష్ మనిషిని. ఏ వందైతే నిజంగా అవసరమే అన్నాడో అందులో ఓ యాభైపదులు తీసి మళ్ళీ నాకే ఇచ్చాడు. తుప్పలబాట మధ్య నుంచి తూలి నడుస్తూ మధ్యలో ఆగి, కాళ్ల మీద చిమ్ముతుందేమో అన్న లెక్కకూడా ఉండని ఈ డెలిషస్ స్థితిలో ఉచ్చతన్నించి, పట్టాలెక్కి ఫ్లాట్‌ఫాం మీదకొచ్చాను. లంచ్‌బాక్సులు భుజాల్నేసుకుని ఆఖరి రైలు కోసం ఎదురుచూస్తున్న కొందరు ఓవర్‌టైం జీవులు తప్ప పెద్దగా జనం లేరు. ఏ క్షణాన రైలొచ్చేస్తుందో అన్న కంగారుతో టికెట్‌కౌంటరు వైపు త్వరగా నడుస్తున్నాను. సోబరుగా ఉన్నోడి కంటే కూడా జాగ్రత్తగా అడుగులు వేస్తూ.

(Published in Kinige Patrika under the a pseudonym)

September 23, 2014

చినతల్లికి, నాన్న


బండి మీద వెళ్ళేటప్పుడు ఇదివరకు కూడా కనపడేవి కొన్ని హోర్డింగులు. జాలికళ్ళతో ఒక పసిపిల్లో పిల్లోడో కెమెరా వైపు చూస్తుంటారు, పక్కన కేప్షన్ ఉంటుంది, బండిజోరు తగ్గించమని సూచిస్తూ “మీ కోసం మీ కుటుంబం ఎదురుచూస్తోంది” అనో ఇంకోటో. అలాంటి ప్రకటనలు చూసినపుడు నేను వాటిల్లో క్రియేటివిటీ గురించి ఆలోచించేవాణ్ణి. “వీళ్లు భలేగా ఎమోషనల్ స్పాటు చూసి కొడుతున్నార”ని అనుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు నువ్వొకడివి వచ్చి నన్ను నాన్నని చేసి నిలబెట్టాకా, అలాంటివి తిన్నగా నన్ను అడ్రెస్ చేస్తున్నాయి. బండి నడిపేటపుడు ఇదివరకట్లా ఎదర వున్న దాన్నల్లా దాటేసిపోవాలనే తొందర ఉంటం లేదు. ఇలా చిన్నచిన్న విషయాలు మొదలుకొని నా జీవితాన్ని ప్రభావితం చేస్తున్నావు నువ్వు. చాపకిందనీరు లాంటిది నీ మోహరింపు.

నువ్వు రాకముందు తండ్రిహోదా పట్ల నాకు కేవలం ఎవల్యూషనరీ ఇంట్రెస్టు మాత్రమే వుండేది. తండ్రి కావటం అంటే ఒక మనిషి జీవపరిణామ దశలన్నింటినీ అతిదగ్గరగా పరికించే అవకాశమని మాత్రమే తోచేది. అప్పుడు కూడా ఆ మనిషి ఒక స్త్రీయే కావాలనుకునేవాణ్ణి. నా బిడ్డలకోసమని నేను ఏరివుంచుకున్న పేర్లన్నీ అమ్మాయిలవే (అందుకే నీ పేరు పెట్టే అవకాశాన్ని పూర్తిగా అమ్మకే వదిలేశాను). అక్కలూ చెల్లెళ్ళూ మరదళ్ళూ మేనకోడళ్ళూ ఎవరూ లేకపోవటం వల్ల నాకు ఆడాళ్ళు ఎందుకు అలా ఉంటారు అనేది ఎప్పుడూ గోడ ఆవలి రహస్యమే. వారి స్నిగ్ధమైన ప్రపంచాలకి (జడరిబ్బన్ల, పూలదండల, డాన్స్‌క్లాసుల, సాయిబాబాగుడుల, హాండ్‌బాగుల, స్కూటీల ప్రపంచానికి) మొట్టమొదటి ఆంతరంగికుడిగా ఉండగలగటం నా దృష్టిలో అద్వితీయమైన పదవి. ఆ లోటు అలాగే ఉంది. కానీ అది అదే, నువ్వు నువ్వే.

ఆ ఎవల్యూషనరీ ఇంట్రెస్టు కూడా ఇప్పుడేం లేదు. సరే నువ్వంటూ ఉన్నావు గనుక, నీ ఎదుగుదల అంటూ నా కళ్ళ ముందు జరుగుతోంది గనుక, ఆ ముచ్చటా తీరుతున్నా, నన్ను నీ వైపు పట్టిలాగే కారణాల్లో అది వెయ్యోవంతు కూడా కాదు. మరి ఏమిటీ అంటే, అవేంటో తెలిస్తే ఇదంతా రాసే సందర్భమే కలిగేది కాదేమో. లేదూ, నిజానికి ఇదంతా బడాయేనేమో, మనిషిని కాబట్టి బుద్ధి కలిగించే అహంభావం వల్ల దీన్నంతట్నీ కేవలం ఒక జంతుసహజాతంగా చూడలేకపోతున్నానేమో. For all i know, ఇప్పటికైతే నీ మీద ఇష్టం నువ్వు ఒక కీ ఇవ్వకుండా ఆడే బొమ్మవి కావటం వల్లనే మాత్రమేనేమో.

నీ మీద నా ఇష్టం పూర్తిగా మానసికమైనదే కాదు; నాకు నువ్వో స్నిగ్ధమైన చర్మంతో కప్పివున్న చిన్ని అవయవాల చలిమిడిముద్దగా కూడా నచ్చుతావు. నీ చర్మం క్వాలిటీని స్నిగ్ధమని సరిపెట్టేయలేము. కాలపు కరుకురాపిడికి అది మున్ముందు నాకు నిగూఢమూ, నానుంచి భిన్నమూ, మరో అన్‌టచబుల్ సమక్షమూ అవుతుందని తెలుసు. ప్రస్తుతానికైతే నిన్నెత్తుకున్నప్పుడు నన్ను నేనే మోస్తున్నట్టు ఉంటుంది. ఎంత పీల్చినా సారం ముక్కుతో పాటూ తీసుకెళ్దామంటే పట్టుబడని నీ వాసన బాగుంటుంది. ఎత్తుకున్నప్పుడు నీ మెడలో ముక్కుదూర్చి పీలుస్తూంటాను. కానీ నువ్వు నా గడ్డం పెట్టే చక్కిలిగిలికి నవ్విస్తున్నాననుకుని నవ్వేస్తూ ఉంటావు. ఈమధ్య నీకు కింద వో రెండు పళ్ళు మొలిచాయి. దాంతో ఇప్పటికే నా పేలవమైన పెన్నుకి వర్ణనాతీతమైన నీ నవ్వు ఇప్పుడింకా అందని దూరమైపోయింది.

ప్రస్తుతానికి నువ్వో pure animal వి. ఇది రాస్తున్నప్పుడు కూడా, నాకు దూరంగా నేల మీద దొర్లాడుతున్న నువ్వు నా వైపు పాక్కొచ్చి ఈ కాగితం చింపటానికి ట్రై చేస్తున్నావు. అది కుదరనివ్వకపోవటంతో, నా జుట్టుని పట్టుకుని కిందకు గుంజే ప్రయత్నంలో పడ్డావు, అదైన తర్వాత ఇప్పుడు నా పక్కకు వచ్చి నిన్నూ నీ మొహాన్ని నా భుజంకేసి రాసుకుంటున్నావు. ఊరికే చెంగనాలు కడుతూ మధ్యమధ్యలో తల్లిని ఒకసారి ఒరుసుకుని మళ్లీ వెళ్ళిపోయే దూడకన్నా ఏమంత భిన్నం కాదు నువ్విప్పుడు. (ఆ తల్లికన్నా నేనూ ఏమంత భిన్నం కాదు. సుమతీసూక్తికి భిన్నంగా నాకు పుత్రోత్సాహం కలిగించటానికి నీ కేవలమైన ఉనికే సరిపోతుంది; చివరకు ఫేస్బుక్లో పెట్టిన నీ ఫొటోకి వచ్చిన లైకులు కూడా సరిపోతున్నాయి.)

అయినా నీ వైనాల్లో ఒక వ్యక్తిత్వాన్ని చదవటానికి విపరీతంగా ప్రయత్నిస్తుంటాం మేం. నాకన్నా ముఖ్యంగా అమ్మ. నీ అన్ని చర్యలూ తనకి ఉద్దేశపూర్వకమైనవిగా కనపడతాయి. ఆ ఉద్దేశాల్ని గెస్ చేయాల్సిన అవసరం కూడా లేదన్నట్టు, విశదంగా తెలిసిపోతున్న విషయాల్లా మీ అమ్మ చదివి చెప్పేస్తూంటుంది. నేను మాత్రం ఇంకా నీ చర్యలకి బయటి ఉద్దీపనల్నే తప్ప, నీ లోపలి ఉద్దేశాల్ని కారణంగా చూడలేకపోతున్నాను. నువ్వు నాలిక బయటపెట్టి ఆడిస్తున్నప్పుడు తనని వెక్కిరిస్తున్నావంటుంది మీ అమ్మ. కొత్తగా వచ్చిన నీ పళ్ళ పదును మీద సరదాగా నాలిక ఆడిస్తున్నావంటాను నేను. ఇలాంటి నీ వేషాల్లో ఏమాత్రం తేడాగా అనిపించినా అది సహజమేనని ఇంటర్నెట్లో వెతికి ఖాయం చేసుకునేదాకా ఇద్దరికీ మనశ్శాంతి ఉండదు.

కానీ నా మనసంతా ఇలా రంగురంగుల బెలూన్లమయం మాత్రమే కాదు. వాటిని గుచ్చి పేల్చే శంకలూ ఉన్నాయి. అప్పుడప్పుడూ ఏమనిపిస్తుందంటే, ఇన్ని కోట్లమంది లోకజ్ఞులూ సజ్జనులూ ఋజువర్తనులూ ఐన మగవాళ్ళున్న లోకంలో, నువ్వు ఇలాంటి ఒక మగవాడి హయాంలోకే వాడినే తండ్రిగా చేస్తూ ఎందుకు ఊడిపడ్డావా అని. అప్పుడు నీ మీద ఒక తటస్థమైన జాలి కలుగుతుంది. ఎందుకంటే, అలా ఎలా కుదిరిందో చెప్పలేనుగానీ, నేను ఒక సామాజిక మానవునిగా ఎదగలేదు. కనీసం పైపై అప్పియరెన్సెస్ వరకూ పద్ధతైన సంసారి వేషాన్ని ఎలాగో నెట్టుకొస్తున్నాను గానీ, నా మనసు ఏ విలువనూ అబ్సొల్యూట్‌ అని నమ్మదు, ప్రతి అవధికీ కన్నాలు తవ్వి అవతలికి దూరుదామని చూస్తుంది. ఇలాగుండటంపై నాకు ఏ ఫిర్యాదులూ లేవు సరికదా గొప్పగా కూడా ఫీలవుతుంటాను. కానీ ఈ స్థితికి వచ్చే క్రమంలో మనసు చేసిన ప్రయాణం సురక్షితమైంది కాదు. అది ఆవలించే లోయల పైన బార్బ్‌డ్‌వైరు మీదుగా దొమ్మరి నడక. ఇప్పటికీ చాలా డెలికేట్ బాలెన్సే. అలాంటి ప్రయాణం నువ్వు చేయటం నాకు ఇష్టం లేదు. ఈ స్థితికి నువ్వు చేరటం ఇష్టం లేదు. అదికూడా కేవలం ఇలాంటి ఒక నేను నీ తండ్రినవ్వటం అన్న కారణంగా జరగటం అస్సలు ఇష్టం లేదు. లోకపు లౌక్యపుటిరుసుకి ఏ రాపిడీ లేకుండా కందెన సులువుతో ఒదిగి సాగిపోవాలి నీ జీవితం. (ఒక్కోసారి నువ్వు పుడుతూనే నాలో ఎక్కడో స్టాప్‌వాచీని క్లిక్ చేశావనిపిస్తుంది. నాకు ఎంతో టైం లేదు. మరీ నిన్ను అయోమయపరిచేంత బొహేమియన్ వాతావరణం ఏం లేకపోయినా, ఉన్న కాస్త అస్తవ్యస్తాన్నీ చక్కదిద్దుకుని నిన్ను లోకరీతికి అనుగుణంగా పెంచగలిగే నాన్నలాగా మారిపోవాలి. క్లాక్ ఈజ్ టికింగ్!)

అలాగని మళ్ళీ నువ్వు అందరుపిల్లల్లాగా పెరగటం కూడా ఊహించుకోలేను. ఆ పసుపురంగు స్కూలు బస్సుల కిటికీల్లోంచి కనిపించే అనేక యూనిఫారాల్లో ఒక యూనిఫాంగా నువ్వు మారటం నాకిష్టం లేదు. నాన్ననో ధృవనక్షత్రంగా చూసే అమ్మ మరీ నాన్న లోకంలోకి ఇమ్మెర్స్ అయిపోయి అవును వీణ్ణి బడికిపంపవద్దంటూ వంతపాడటం మొదలుపెట్టింది గానీ, నాన్నకైనా బుద్ధుండాలిగా. స్కూలుకి పంపక ఏం చేయను. నగరంలో బతక్క ఏం చేయను. ఈమధ్య నిన్ను ఎత్తుకుని బయటకు తీసుకెళ్ళినపుడు మరీ అనిపిస్తుంది. నువ్వు నా భుజం మీద చుబుకం ఆన్చి వచ్చే పోయే కార్లనో, బైకుల్నో చూస్తూంటావు. గట్టిగా హార్న్ వినపడినప్పుడల్లా ఉలికిపడతావు, అహ, పడేవాడివి, ఇప్పుడు అలవాటుపడిపోయి అటు మామూలుగా చూస్తావు. నిన్ను అలా తీసుకెళ్ళి నా బాల్యాన్ని ఆవరించిన దృశ్యాల్లాంటివి చూపించాలని ఉంటుంది. బాటంతా గొద్దెలమయం చేసే మేకలమందల్నో, అష్టాచెమ్మా ముగ్గులు గీసున్న రామాలయం గచ్చునో, మాగన్ను మధ్యాహ్నాలు చల్లగా గలగలల సందడి చేసే రావిచెట్టునో, నత్తలు రథం ముగ్గులేస్తున్న ఆఖరి కోనేటిమెట్టునో, కోసిన పొలంలో గడ్డిమేటు వెనుక కుంగే మెత్తటిబింబాన్నో చూపించాలని ఉంటుంది. నా బాల్యానికి అవన్నీ ఉన్నాయి. నిన్ను మాత్రం ఒక కరుకైన లోకంలోకి తీసుకొచ్చి పడేశాను. ఇది ట్రాఫిక్‌ వల్లనూ, కాంక్రీటు వల్లనూ మాత్రమే కరుకైన లోకం కాదు. శివార్లలో గొంతులుకోసే ముఠాలు తిరిగే లోకం, తల నుంచి గోనెసంచులు వేలాడే పిల్లలు చెత్తకుప్పల్లో ఇనుపచువ్వలు పుచ్చుకుని పాలిథీన్ కాగితాలు ఏరుకునే లోకం, లిప్తమాత్ర యథాలాపపు డ్రైవింగ్ వల్లనే పుచ్చెలు పగిలి చచ్చే అవకాశాలతో కిక్కిరిసిన లోకం, భుక్తిరీత్యా నిత్యం కదుల్తూనే తప్ప నిలకడగా నిలబడిన మనుషులు అరుదుగా కనిపించే ప్రాగ్మాటిక్ లోకం.

మరి ఇలాంటి చోట్ల పిల్లలు పుట్టటం లేదా ఆరోగ్యవంతంగా పెరగడం లేదా అనొచ్చు. ఆమధ్య కొన్నాళ్లపాటు చిత్రమైన రీతుల్లో సమాధానపడేవాణ్ణి. సృష్టిలో ప్రతీదీ ఆ నూటపద్దెనిమిది రసాయనికమూలకాలతో నిర్మితమైనదే కదా. మరి, అవే మూలకాల్లో కొన్నింటితో తయారైన చెట్టుని అందమనీ, ఇంకొన్నింటితో తయారైన కాంక్రీటు భవనాన్ని వికారమనీ ఎందుకు అనుకోవాలీ అనీ ఇలా. కానీ అందమూ వికారమూ కాదు అసలు డిస్టింక్షను. సహజమూ అసహజమూ, ఇంకోలా చెప్తే ప్రకృతిసహజమూ మానవనిర్మితమూను. ప్రకృతి పరివృతమై పెరిగిన బాల్యం ఆలోచనకి కలిగించే విశాలత్వం వేరు. ఎదిగాకా అది చుట్టూ లేకపోయినా, మెదడులో ఒక పచ్చటి విశాలమైన అర అలా ఉండిపోతుంది. అది ఎంత రద్దీలోనైనా నిమ్మళాన్ని ఇస్తుంది. ఎంత ఇరుకులోనైనా వెసులుబాటు ఇస్తుంది. నీకు అది లేదు. నువ్వు కంప్లయిన్ కూడా చేయలేవు. ఎందుకంటే నీకు ఇది తప్ప ఇంకోటేదీ తెలియదు. ఎంపికకి అవకాశం లేదు. అదింకా విషాదం. నిజంగా నువ్వే నా మొట్టమొదటి ప్రయారిటీవైతే వెంటనే ఊరెళిపోయి ఏ కిరాణాషాపో పెట్టుకోవాలి. కానీ ఇందాక చెప్పినట్టు ఎదిగే క్రమంలో ఎక్కడో నేనిలా నగరాటవిలో మాత్రమే శరణులభించే మృగంగా మారిపోయాను.

ఇవి చాలవన్నట్టు ఇంకో పెద్ద గుంజాటన ఉంది. బహుశా వీటన్నింటికీ అదే మూలమై నన్నిలా రాయిస్తుందేమో. నాకు నాన్న అనే శాల్తీ లేకపోవటం వల్ల నిన్ను పెంచటానికి నాకు ఒక మోడల్ లేకుండా పోయింది. అది మంచో చెడో నికరంగా చెప్పలేను గానీ, అది అలా ఉంది. ఒక చెడు ఎగ్జాంపుల్ ఉండుంటే మంచి వైపు వెళ్ళటం సులువయ్యేది, ఒక మంచి ఎగ్జాంపుల్ ఉండుంటే అనుసరించేవాణ్ణి. ఇప్పుడు నా రోడ్డు నేనే వేసుకోవాలి. నువ్వింకా పాకగలిగే చిన్నిప్రపంచంలో మాత్రమే ఉన్నావు కాబట్టి అదింకా పెద్ద కన్సెర్న్ కాదు. కానీ కొన్ని భయాలు. I fucked up so many relationships. I want us to be a success.

August 27, 2014

నాకు నచ్చిన పది పుస్తకాలు (ఫేస్బుక్ పోస్ట్)

I was tagged by Ismail Suhail Penukonda & Indrani Palaparthy to pick 10 books that mean much to me. I love lists & this is about books! In my list I haven't picked the books as they asked, but picked writers and then one of their books. This list is not according to the order of preference (but i can nominate "Kafka Diaries" for the first spot easily). I posted this list as a comment to Ismail garu's post yesterday, and just now realized that i've listed there not 10 but 11 books. Gone through the list again, but couldn't take out anyone, so it will remain.
--
Felt like adding a ‘why’ to the task:


త్రిపుర ‘కథలు’:— పాఠకుణ్ణి ఇంత చేరువగా తీసుకుని కథలు చెప్పిన రచయిత తెలుగులో మరెవరూ నాకు తగల్లేదు. ఎంత చేరువగా అంటే, పాఠకునితో తనకు ఒక intimate shared past ఉన్నట్టు భుజం మీద చెయ్యేసి, కాబట్టి అన్నీ వివరించి చెప్పాల్సిన అవసరం లేదన్నట్టు గుసగుసగా గొణుగుతూ చెప్పే కథలవి. సోకాల్డ్ మహారచయితలెందరో రచనా సర్వస్వాలే రాసి సంపాదించుకోలేని గొంతు త్రిపుర ఈ కొన్ని కథల్లో సాధించుకున్నారు. కథల్లో నాకు బాగా నచ్చినవి ఈ క్రమంలో: ‘చీకటి గదులు’, ‘జర్కన్’, ‘ప్రయాణికులు’, ‘గొలుసు - చాపం - విడుదల భావం’. పెద్దగా నచ్చని, త్రిపుర మార్కు లేవని అనిపించే, కథలు: ‘వలసపక్షుల గానం’ (సగం కథ కాఫ్కా అనువాదం), ‘హోటల్లో’, ’సుబ్బారాయుడి రహస్య జీవితం’. అలాగే, కొన్ని ఇంటర్వ్యూల్లో త్రిపుర చెప్పిందాన్ని బట్టి కాఫ్కాని నేనెందుకు ఇష్టపడతానో అందుకే ఇష్టపడిన మనిషి ఆయనే అనిపిస్తుంది. ఆయన ఆమోదముద్ర చూసింతర్వాతనే Celine, Kerouac లాంటి రచయితలు నాకు పరిచయమయ్యారు. వీలుండీ ఆయన్ని కలవలేకపోవటం ఒక పెద్ద లిటరరీ రిగ్రెట్.


చలం ‘అమీనా’:— చలం కథకునిగా కన్నా కూడా వ్యక్తిగా ఎక్కువ ఇష్టం. ఐతే చలంలోని కథకుడు నాకు బాగా నచ్చిన చోటు మాత్రం ‘అమీనా’నే. పైన “పాఠకుణ్ణి చేరువగా తీసుకుని కథ చెప్పడం” అన్నానుగా – అది చలం ఈ రచనలో చేసినట్టు ఎక్కడా చేయలేదు. ఇక్కడ చలం మొపాసా కాదు, డిహెచ్ లారెన్సు కాదు, ఠాగూరూ కాదు; ఇక్కడ చలం చలమే! ఈ పుస్తకం గురించి బ్లాగులో రాశాను: http://loveforletters.blogspot.in/2011/05/blog-post_06.html


శ్రీపాద ‘అనుభవాలూ జ్ఞాపకాలూను’:— I like it for its poetry, music & language. నాకాయన అభిప్రాయాలూ అవీ పెద్దగా ఏం పట్టలేదు. ఇందులో కనపడిన జీవితం నచ్చింది. ఆ జీవితాన్ని చెప్పటంలో ఆయన భాష నచ్చింది. కామా తర్వాత కామాకి ఒక్కో పైసంగతి వేస్తూ ఆయన వాక్యాన్ని సంగీతమయంగా సాగించే పద్ధతి బాగుంటుంది.


తెన్నేటి సూరి ‘చంఘిజ్ ఖాన్’:— ఈ పుస్తకం పట్ల నాకున్నది సెంటిమెంటల్ వాల్యూ అని చెప్పాలేమో. ఏదో ఊరు బదిలీ అయినపుడు అమ్మ లైబ్రరీ డిపాజిట్ వదిలేసుకుని దగ్గర ఉంచేసుకున్న పుస్తకం. నాకు ఊహ తెలిసినప్పణ్ణించీ ఇంట్లోనే ఉంది. చాలాసార్లు చదివాను. “సూటూ బోడ్గా బట్ టెంగ్రీ టెమూజిన్ ఖాఖాన్” అని అరుస్తూ, కత్తి ఒర (మొలతాడు) లోంచి తాతయ్య పడక్కుర్చీకర్ర బయటకు లాగి, పొలోమంటూ వెళ్ళి ఏ బియ్యంబస్తా మీదో, కొబ్బరిమాను మీదో పడి కత్తిపోట్లు పొడవటం లాంటి ఎన్నో హీరోయిక్ డీడ్స్ కి కావాల్సిన ఇమేజినేషన్ని మెదడులో నింపిందీ పుస్తకం.


నామిని ‘నా కుశాల నా మనేద’: — The whole of Namini is the sum of his writings. అంతగా సాహిత్యానికి తన్ను తాను ఇచ్చేసుకున్నాడు. ‘నా కుశాల నా మనేద’ అనేది వైకుంఠం గీసిన ముఖచిత్రంతో ఇటీవల వెలువడిన ఎడిషన్ లో కొత్తగా చేర్చిన రచన. It’s a long musing over death. మిగతా నామిని రచనలన్నీ చిన్న నిడివిగల ప్రదర్శనలు (నవలల్ని మినహాయించి). కానీ దాదాపు యాభై పేజీల ఈ రచన మాత్రం ఒక శాక్సాఫోన్ ఆర్టిస్టు ఎక్కడా తడబాటు లేకుండా ఒకే ఎమోషనల్ కంటెంటును ఎక్కడా సాగదీసినట్టు అనిపించకుండా పాడిన పాటలాగా భలే సాగుతుంది.


Kafka Diaries:— నేనీ పుస్తకాన్ని దొబ్బుకొచ్చాను, కానీ ఎప్పుడూ పశ్చాత్తాపపడలేదు. ప్రపంచపు ప్రాణమయ సారాంశానికి మన జీవితాన్ని ఎంత దగ్గరగా తీసుకెళ్లచ్చో చెప్పిన పుస్తకం; సాహిత్యాన్ని ఎంత దగ్గరగా తీసుకెళ్లచ్చో కూడా చెప్పిన పుస్తకం. ఈ పుస్తకాన్ని వరుసగా చదవక్కర్లేదు, పూర్తిగా కూడా చదవక్కర్లేదు. మనలో కాఫ్కా అంశ ఏదైనా ఉంటే అదే ఖాళీల్ని పూరించుకుంటుంది, మిగతాది తనకు తానే రాసుకుంటుంది.


Flaubert ‘Sentimental Education’:— "నా తరం మనుషుల మోరల్ హిస్టరీ రాయాలనుకున్నాను" అని చెప్పుకున్నాడు ఫ్లాబె ఈ రచన గురించి. నా వరకూ ఇది నా ఆత్మ తాలూకు రొమాంటిక్ హిస్టరీ అనిపిస్తుంది. “దీవిలో ఒంటరిగా చిక్కుబడిపోతే దగ్గరుండాలనుకునే పుస్తకాల జాబితా” అంటారు కదా, అలా రెండే పుస్తకాలు పట్టుకెళ్ళే వీలుంటే ’కాఫ్కా డైరీల’తో పాటూ ఈ పుస్తకాన్నీ తీసుకువెళ్తాను. ఎందుకంటే, ఫ్లాబె ఈ పుస్తకాన్ని ఎలాగో జీవితమంత సంక్లిష్టంగానూ గానూ నిర్మించగలిగాడు. పుస్తకంలో ఎన్నో మూలల్ని అలా చదివి వదిలేయక పట్టి ఊహించుకుంటే ఇంకెన్నో కథలు ఆవిష్కృతమవుతాయి.


Borges ‘Selected Nonfiction’:— జీవితమనేది కాఫ్కాకి రాయటం కోసం ఒక సాకు ఐతే, బోర్హెస్ కు చదవటం కోసం. If we could make a map of his mental life, then the region covered is not so much about his lived life as his reading life. ఒక పాఠకుని జీవితం కూడా ఈక్వల్ గా సృజనాత్మకమనీ, స్వయం సమృద్ధమనీ చెప్తుంది బోర్హెస్ నాన్ ఫిక్షన్. ఆయన కాల్పనిక రచనలు కూడా పఠనాజీవితం మధ్యలో పఠనం ఆధారంగానే ఆడుకున్న ఆటల్లాంటివి.


Dostoevsky ‘Brothers Karamazov’:— For the sheer feverish absorption it induces in the reader. దేవుడు చచ్చిపోయాడని టెంకిజెల్ల కొట్టినట్టు చెప్పి జీవితపు ఎసెన్సిషయల్ ఏకాకితనానికీ, ఏడ్చే మూలలేనితనానికీ సంసిద్ధపరచిన పుస్తకమిది. ఇవాన్ కరమజవ్ ని మనలో గుర్తించటం, లేదా అతన్ని మనమీదకు ఆవహింపజేసుకోవటమూ ఒక శాపం. అనుభవించాను.


Salinger ‘Franny And Zooey’:— అమాయకత్వం చేయి వదిలి, కాపట్యపు రద్దీ మధ్య దారి తప్పి దిక్కుతోచక, తిరిగి జ్ఞానరాహిత్యపు సాంత్వన కోసం అంగలార్చే శరణార్థి రచనలు సలింజర్ వి. అలాగే ఆయన వచనాన్ని చదవటం అంటే చెక్కిన వజ్రాన్ని వేళ్ల మధ్య ఎత్తిపట్టుకుని లోపలి ప్రతిఫలిత వర్ణకేళిని చూడటం లాంటిది. ఆయనలోని ఈ రెండు అంశాల పక్వదశ ఈ పుస్తకంలో కనిపిస్తుంది.


Nabokov ‘The Gift’:— This book is like a compendium of the values that Nabokov believed in his real life. He presented them like they are. ఏ ఫిక్షనల్ తొడుగులూ లేకుండా. “Nabokov at his vulnerable best”. ఇలా ఇంకెక్కడా అనిపించడు. ఈ పుస్తకం గురించి నేను రాసిన వ్యాసం ఇక్కడ: http://www.scribd.com/…/2327836…/Essay-on-Nabokov-s-the-Gift

July 18, 2014

జీవించిన గంట

మిసెస్ లూసీ మల్లార్డ్‌కి గుండెజబ్బు ఉందని ముందే తెలుసు కాబట్టి, ఆమె భర్త చనిపోయాడన్న వార్తని వీలైనంత సున్నితంగా తెలియజేయటానికి జాగ్రత్తపడ్డారు అందరూ.

ఆమెకు ఈ వార్తను ఆమె అక్క జోసెఫీన్ సగంసగం వాక్యాల్లో, అరకొర సూచనల్తో చెప్పింది. ఆమె భర్తకు స్నేహితుడైన రిచర్డ్ కూడా అక్కడే ఉన్నాడు. అతను పొద్దున్న న్యూస్‌పేపరు ఆఫీసులో ఉన్నప్పుడే రైలు ప్రమాదం తాలూకు వార్త అందింది, ఆ మృతుల జాబితాలో మొదట ఉన్నది బ్రెంట్లీ మల్లార్డ్‌ పేరే. ఆ వార్తని మరో టెలిగ్రాంతో ఖాయపర్చుకునేంతవరకూ మాత్రమే రిచర్డ్ అక్కడ ఆగాడు. అది అందగానే, ఈలోగా తనంత జాగ్రత్తా అక్కరా లేని మరెవరైనా స్నేహితుని ద్వారా ఈ దుర్వార్త ఆమెకు చేరకుండా నివారించేందుకు, ఉరుకులుపరుగుల మీద బయల్దేరాడు.

మామూలుగా ఇలాంటి వార్త విన్న చాలామంది స్త్రీలలాగా ఆమె దాని అర్థాన్ని అంగీకరించలేనట్టు చేష్టలుడిగిపోలేదు. వెంటనే విహ్వలంగా ఏడుస్తూ తన అక్క చేతుల్లో వాలిపోయింది. శోకపు తుఫాను సద్దుమణిగాక, అలాగే లేచి ఒంటరిగా తన గదిలోకి నడుచుకుపోయింది. వెంట ఎవర్నీ రానివ్వలేదు.

లోపల తెరిచిన కిటికీ ముందు ఒక సౌకర్యవంతమైన కుర్చీ వేసి ఉంది. తన శరీరాన్ని ఆవహించిన అసలట ఆత్మలోకి కూడా చొచ్చుకుపోతున్నట్టు బరువుగా అనిపించి కుర్చీలో వాలిపోయింది.

కిటికీలోంచి చెట్ల చిటారుకొమ్మలు వసంతపు చిగుర్లతో అల్లల్లాడుతూ ఆమె కంటపడ్డాయి. రుచికరమైన వర్షపు వాసనేదో గాలిలో మసలుకుంటోంది. కింద వీధిలో చిల్లరవ్యాపారి తోపుడుబండి మీద సరుకుల్ని బిగ్గరగా అమ్ముకుంటున్నాడు. దూరాన ఎవరో పాడుతున్న పాట వినీవినపడనట్టు ఆమె చెవుల్ని తాకుతోంది. చూరు దూలాల్లో గూడుకట్టిన పిచ్చుకలు ఉండుండి కిచకిచమంటున్నాయి.

కిటికీ ఎదురుగా పశ్చిమదిక్కున మేఘాలు ఒకదాన్నొకటి కలుస్తూ, ఒకదానిపై ఒకటి పేరుకుంటున్నాయి. వాటి మధ్య ఖాళీల్లోంచి ఆకాశం అతినీలంగా కనిపిస్తోంది.

ఆమె కుర్చీ మెత్త మీద తల వేలాడేసి కదలకుండా కూర్చుంది, అప్పుడప్పుడూ మాత్రం వెక్కుతోంది, ఏడ్చి ఏడ్చి నిదరపోయి కలల్లో కూడా వెక్కే పసివాడి లాగా.

ఆమె వయసు తక్కువే, మంచి ఛాయతో ప్రశాంతంగా కనిపించే ముఖమామెది, ఆ ముఖం మీది రేఖలు నిగ్రహాన్నీ, ఒకలాంటి స్థైర్యాన్నీ కూడా సూచిస్తాయి. కానీ ఇప్పుడు మాత్రం ఆమె కళ్లు మందకొడిగా ఉన్నాయి, దూరాన మేఘాల మధ్య ఆకాశాన్ని చూస్తున్నాయి. కానీ ఆ చూపు ఆలోచించటాన్ని కాదు, ఆలోచనలు స్తంభించిపోవటాన్ని సూచించేది.

ఆమె వైపు ఏదో వస్తోంది, ఆమె దాని కోసం ఎదురుచూస్తోంది, భయపడుతూనే. ఏమిటది? ఆమెకి తెలియదు; ఇదని పేరుపెట్టేందుకు అందనిది. కానీ అది ఆకాశంలోంచి మొదలై, గాలిలో ఆవరించి ఉన్న పరిమళాలూ సవ్వడులూ రంగుల గూండా, ఆమె వైపు రావటం ఆమెకు తెలుస్తోంది.

ఇప్పుడు ఆమె గుండెలు కలవరంగా ఎగసిపడుతున్నాయి. తనను ఆవహించబోతున్నదేమిటో ఆమె క్రమేణా గుర్తించగలుగుతోంది, ఆమె తన సంకల్పబలంతో దాన్ని వెనక్కి తరిమేందుకు ప్రయత్నిస్తోంది — ఆమె తెల్లని సన్నని చేతుల్లో ఆ చేవ లేకపోయినా. ఇక ఆమె వల్లగాక పట్టుసడలగానే, చిన్నగా తెరుచుకున్న ఆమె పెదాల మధ్య నుంచి ఒక పదం బయటపడింది. ఆమె ఆ పదాన్ని తన ఊపిరి కన్నా సన్నగా పదే పదే గొణిగింది: “విముక్తి, విముక్తి, విముక్తి!” అంతకుముందున్న మందకొడితనమూ, ఆ తర్వాత ఆక్రమించిన భీతీ క్రమంగా ఆమె కళ్లను వీడి వెళ్లిపోయాయి. ఇప్పుడా కళ్ళు సూటిగా వెలుగుతున్నాయి. ఆమె నాడి వేగంగా కొట్టుకుంది, ప్రవహిస్తున్న రక్తం ఆమె దేహంలో ప్రతీ అంగుళాన్ని వెచ్చబరిచి నిమ్మళింపజేసింది.

తనను పట్టిఊపుతున్నది రాక్షసానందమేమో అన్న ప్రశ్న ఆమెకు రాలేదు. ఒక స్పష్టమైన ఉన్నతమైన దృష్టి ఆ సంశయాన్ని పనికిరానిదిగా కొట్టిపడేసింది. ఆమెకు తెలుసు తాను మరలా ఏడుస్తానని, ఆ మృదువైన దయగల చేతులు నిర్జీవంగా ఛాతిమీద విశ్రమించి కనపడినప్పుడూ; తనను ఎప్పుడూ ప్రేమగా తప్ప మరోలా చూడని ఆ ముఖం జడంగా పాలిపోయి చచ్చిపోయి కనపడినప్పుడూ… తాను మరలా ఏడుస్తుంది. కానీ ఆ శోక క్షణాలకు ఆవలగా ఇక అచ్చంగా తనకు మాత్రమే చెందిన సంవత్సరాలెన్నో బారులు తీరి కనపడుతున్నాయి. వాటిని స్వాగతిస్తూ ఆమె తన చేతుల్ని విశాలంగా బారజాచింది.

ఆ రాబోయే సంవత్సరాల్లో తాను ఇంకెవరి కోసమూ బతకనక్కర్లేదు; తనకోసమే బతుకుతుంది. తమకే పరిమితమైన ఇష్టాయిష్టాల్ని తోటి మనిషిపై రుద్దే హక్కు తమకుందని భావిస్తారు స్త్రీ పురుషులు. అలాంటి గుడ్డిమొండితనమేదీ ఇక తన ఇష్టాయిష్టాల్ని అణచబోదు. దాని వెనుక ఉద్దేశం దయగలదైనా క్రూరమైనదైనా అదేమీ దాని దోషాన్ని తక్కువచేయదని ఆమె ఈ క్లుప్త ప్రకాశక్షణాల్లో గ్రహించింది.

అయినా అతడ్ని ఆమె ప్రేమించింది, కొన్నిసార్లు. ప్రేమించలేదు, చాలాసార్లు. ఇప్పుడీ లెక్కల్తో ఒరిగేదేముంది! తాను తనకే చెందటమనే ఈ భావనతో పోలిస్తే, అర్థంకాని చిక్కుప్రశ్నలాంటి ఆ మాయదారి ప్రేమ విలువ ఏపాటిది! ఈ స్వాధీనభావం తన అస్తిత్వపు అత్యంత బలమైన వాంఛ అని ఆమె అప్పటికప్పుడు గ్రహించింది.

“విముక్తి! శరీరానికీ మనసుకూ విముక్తి!” అని గొణుక్కుంటోంది.

ఇంతలో జోసెఫీన్ తలుపు బయట వంగి నోటిని తాళపుకన్నం దగ్గర పెట్టి తనను లోనికి రానివ్వమని బతిమాలుతోంది. “లూసీ తలుపు తీయి! మా అమ్మ కదూ; తలుపు తీయి– నువ్విలాగే ఉంటే ఆరోగ్యం పాడు చేసుకుంటావు. ఏం చేస్తున్నావు లూసీ? దయచేసి తలుపు తీయి.”

“వెళ్లిక్కణ్ణించి. నేనేం ఆరోగ్యం పాడు చేసుకోవటం లేదు.” నయం; సాక్షాత్తూ జీవనామృతాన్నే తాగుతుంటే, ఈ తెరిచిన కిటికీ నుంచి!

ఆమె ఊహలు ముందున్న రోజుల్లోకి కేరింతలుకొడుతూ పరిగెడుతున్నాయి. వసంతపు రోజులు, వేసవి రోజులు, అన్ని రకాల రోజులూ ఇక ఆమె సొంతం. జీవితం చిరాయువు కావాలని చిన్నగా ప్రార్థించింది. నిన్నటికి నిన్న చిరాయువుగా జీవించటమన్న ఊహకే వణికిన ఆమె!

అక్క అదేపనిగా బతిమాలిన మీదట ఆమె తాపీగా లేచి తలుపు తీసింది. ఆమె కళ్లు విజయసంభ్రమంతో మెరుస్తున్నాయి, తనకు తెలియకుండానే విజయదేవతకు మల్లే నడుస్తోంది. నడుస్తూ వచ్చి అక్క నడుం చుట్టూ చేయి వేసింది, ఇద్దరూ కలిసి మెట్లు దిగుతున్నారు. రిచర్డు మెట్ల కింద ఎదురుచూస్తున్నాడు.

ఈలోగా ముందుగుమ్మం తలుపుని ఎవరో బయట నుంచి తెరుస్తున్న చప్పుడు వినిపించింది. బ్రెంట్లీ మల్లార్డ్ లోపలికి వచ్చాడు; ప్రయాణపు అలసటతో, తన సూట్‌కేసును హుందాగా పట్టుకుని, చంకలో గొడుగు పెట్టుకుని. అతను ప్రమాదస్థలానికి చాలా దూరంలో ఉన్నాడు, అసలు ప్రమాదం జరిగిందన్న సంగతే అతనికి తెలియదు. రాగానే అందిన స్వాగతం చూసి అతను ఆశ్చర్యపోయాడు, జోసెఫీన్ కెవ్వున అరిచింది, రిచర్డు ఒక్క ఉదుటున ముందుకు కదిలాడు, ఆ కదలటంలో తన భార్య కనుమరుగైంది.

డాక్టర్లు వచ్చాకా ఆమె చావుకి కారణం గుండెపోటని తేల్చారు — ఆనందం తట్టుకోలేక వచ్చిన గుండెపోటని.

* * *

(ఇది కేట్ చోపిన్ 1894లో రాసిన “The Story of an Hour” అన్న కథకు అనువాదం. కినిగె పత్రికలో వేరే పేరు మీద ప్రచురితమైంది.)

June 29, 2014

మూలింటామె గురించీ, నామిని గురించీ…


నామినితో రెండేళ్ల క్రితం ఫోన్లో మాట్లాడినపుడు మాటల్లో ఆయన తన మీద వచ్చిన ఏదో విమర్శను ప్రస్తావిస్తూ, “నన్ను విమర్శించాల్సినేటివి వేరే ఉన్నాయి మెహెరూ. పల్లెటూళ్ళంటే నా కథల్లో ఉన్నట్టు ఎప్పుడూ ఇచ్చకాలే ఉంటాయా, పల్లెటూళ్లో అందరూ మంచి మనుషులే ఉంటారా, పల్లెటూళ్లో క్రూరత్వాలేం జరగవా, మరి అవెప్పుడూ నేను చూపించలేదే, నన్ను ఆ మాట ఎవరూ అడగరే?” అన్నారు. అప్పుడాయన మనసులో ‘మూలింటామె’ ఉందో లేదో నాకు తెలీదు. ‘మూలింటామె’ చదివాకా మాత్రం ఇది ఆ ఎవరూ అడగని ప్రశ్నకు ఆయనిచ్చిన సమాధానం అనిపించింది.

పల్లెటూళ్లు ఒక్కోచోట నిజంగానే చాలా క్రూరంగా ఉంటాయి. మనం మన రొమాంటిక్ మెదళ్లతో ఇక్కడ నగరాల్లోంచి చూస్తూ ఎన్నో సమ్మోహనమైన దృశ్యాల్ని రచించుకుంటామే గానీ, నిజంగా అక్కడికి వెళ్తే కొన్ని అంశాల్లో ఆ మానసికమైన ఉక్కపోతను రెండు రోజులైనా భరించలేము. నీది ఒద్దికైన, పద్ధతి తప్పని జీవితమై, if you can keep up every appearance that’s stipulated through the very air there, అప్పుడు అక్కడ మనటం చాలా సులువు. ఏ మాత్రం తోవ మళ్లిన జీవితమైనా సరే నిన్ను పల్లెటూరితో పోలిస్తే నగరమే ఆదుకుని అక్కున చేర్చుకుంటుంది. అక్కున చేర్చుకోకపోయినా, కనీసం పట్టుకుని పొడవదు. అక్కడి కాంక్రీటు సమూహాల్లో నీకై కేటాయించిన మూల, నీ పట్ల చూపబడే సుఖవంతమైన నిర్లక్ష్యాన్ని వెచ్చగా అనుభవిస్తూ జీవించేయొచ్చు.

ఈ ఏడాది మొదట్లో కినిగె పత్రిక ఇంటర్వ్యూ కోసం నామినికి ఫోన్ చేశాను. అప్పుడే ఆయన “మూలింటామె” పుస్తకం పూర్తి చేసిన సంతోషంలో ఉన్నారు. ఆయన రాసే పద్ధతి అదే పనిగా వేసిన వాక్యం తీయటం తీసిన వాక్యం మళ్లా వేయటంగా ఉండదు. కాబట్టి తాను ఊహించని సంగతేదో జరిగినట్టు సంబరంగా ఉంది గొంతు. తర్వాత రెండు మూడు రోజులకు నా ఈమెయిల్లో ‘మూలింటామె’ పిడిఎఫ్ ఫైలు వచ్చి చేరింది. స్పైరల్ బైండు చేయించి తెచ్చుకుని చదివాను.

“ఒక మంచి శుక్రోరం. సందల గూకతా” ఉండగా కథ మొదలవుతుంది. కథ మొదలయ్యేటప్పటికే మూలింటామె మనవరాలు రూపావొతి మొగుణ్ణీ పిల్లల్నీ వదిలేసి ఒక అరవమాదిగోడితో లేచిపోయి ఉంటుంది. ఆ సంగతి నెమ్మదిగా ఊరంతా పాకుతుంది. కొందరు ఊరోళ్లు కలిసి తిరుపతి వెళ్లి ఆమెను వెనక్కి తీసుకురావాలని చూసినా ఆమె రానంటుంది. దాంతో ఇక ఆమె తల్లి (మూలింటామె కూతురు)తో సహా అందరూ ఆమెను చచ్చిందానిగా జమకట్టేస్తారు. మూలింటామె మాత్రం మనసులోంచి తీసేయలేకపోతుంది. ఆమె ఫోటోను ఎదరపెట్టుకుని మూలింటామె చెప్పుకున్న స్వగతం చదివితీరాలి. సాహిత్యంలో అంత కదిలించే మాటలు అన్ని కొన్ని పేజీల్లో ఎక్కడైనా తగలటం అరుదు.

రెండో భాగం (‘కొన బాగం’)లో మూలింటామె కొడుకు నారాయుడికి మళ్లీ పెళ్ళి జరుగుతుంది. కోడలు వంసత, కానీ లావుగా ఉంటుందని అందరూ పందొసంత అని పిలుస్తారు. ఈ పాత్ర అప్పటికే శిథిల దృశ్యంలా ఉన్న కథలోకి తుఫానులా ప్రవేశిస్తుంది. నవల మొదటి భాగంలో తన పెంపుడు పిల్లులతో పాటు కళ్లెదుటే కనపడిన మూలింటామె పాత్ర ఈ రెండో భాగం వచ్చేసరికి వెనక్కి వెళ్లిపోతుంది. లేచిపోయిన రూపావతికి పక్కా వ్యతిరేకం ఈ పందొసంత పాత్ర. మొగుడి ముందే రంకుమొగుణ్ణి మెంటైన్ చేస్తుంది. కానీ వాడు ఆషామాషీ అరవమాదిగోడు కాక బుల్లెట్ మీద తిరిగే డబ్బులున్న కులమున్న గుడుగుడు చంద్రడు కాబట్టి అందుకు చుట్టూ ఉన్నవాళ్ల చేత శభాష్ అని కూడా అనిపించుకుంటుంది. దీనికి మొగుడు నారాయుడూ అడ్డం చెప్పడు. పందొసంత వచ్చీ రాగానే ఇంటి చుట్టూతా ఉన్న చెట్లు బేరంపెట్టి కొట్టేయిస్తుంది. బంకు తెరుస్తుంది. చిట్టీలేయిస్తుంది, వడ్డీకి డబ్బులిస్తుంది. మొగుడికి తాగుడు నేర్పిస్తుంది. అతని చేత ఎడ్లూ ఎడ్లబండీ అమ్మించి, మోపెడు కొనిపిస్తుంది. పొలం కూడా బేరానికి పెడుతుంది. కానీ పొలం రిజిస్ట్రేషనుకి మూలింటామె సంతకం కావాల్సొస్తుంది. అప్పుడు గానీ ఈ రెండో భాగంలో మూలింటామె పాత్ర మళ్లా మన ఎదుటికి రాదు. ఆమె చేత సంతకం పెట్టించేందుకు బీమారం నుంచి ఆమె అక్క ఎర్రక్క బయల్దేరి వస్తుంది. ఆమె, పందొసంతా కలిసి మూలింటామెకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తారు. ఆమె ససేమిరా అనటంతో ఆమె పెంపుడు పిల్లులకు ఎలుకలమందు పెట్టి చంపేస్తారు. మూలింటామె అట్లే లేచి వెళ్ళి వొడిశాకు కోసుకుని తిని చనిపోతుంది. తర్వాతెపుడో, ఆమెను పూడ్చిన దిబ్బ మీద పడి మనవరాలు రూపావొతి గుండెలు బాదుకుంటూ ఏడవటం చూశామని కొందరంటారు, ఆమె తిరుపతి కొండల మీంచి దూకి చనిపోయిందని కొందరంటారు.

నేను చదవటం మొదలుపెట్టాక మొదటిభాగం అంతా ఒక్క ఊపులో, ఆయన ఎలా ‘ఉమాదం’తో ఆన్చిన పెన్ను పైకెత్తకుండా రాసి ఉంటాడో అలానే, చదివేశాను. ‘సత్యం శివం సుందరం’ అంటారు మనవాళ్లు. సత్యం అందినాక ఇక అదే సౌందర్యం. దాని కోసం వేరే ప్రయత్నం అక్కర్లేదు. రచనలకి సంబంధించి సత్యం అంటే జీవితం, సౌందర్యం అంటే సౌష్టవం. జీవితం నాడి పట్టుకోగలిగాక ఇక దాన్ని రచనలోకి తెచ్చేటపుడు రచనాసౌష్టవం విషయమై ప్రత్యేకించి ప్రయత్నించనక్కర్లేదు. అందుకే ఈ నవల మొదటిభాగం అంతా అలా అప్రయత్నంగానే కుదిరిపోయి ఒక్క వాక్యం కూడా పక్కకు తీయలేనంత సౌష్టవాన్ని అందుకుంది. జీవితం నామిన్ని రాతగాడిగా నియమించుకుని అంతా చెప్పి రాయించుకున్నట్టు సాగిపోయింది. ఇది నా ఒక్కడి అనుభవం మాత్రమే కాదు, నాకు తెలిసిన చాలామంది ఈ పుస్తకం గురించి మాట్లాడినప్పుడు మొదటిభాగంలో ఆపకుండా చదివించే గుణం గురించి కూడా మాట్లాడారు.

రెండోభాగం మాత్రం నాకు అలా సాగిపోలేదు. కాస్త ఇబ్బందిగా అనిపించింది. మొగుడూ భార్య మిండగాడూ అనే ఈక్వేషనూ, దాని చుట్టూ అల్లిన సన్నివేశాలూ దానికేమన్నా కారణమా అని ఆలోచించాను. అదైతే అస్సలు కాదు. ఎందుకంటే మానసికంగా నేను మర్యాదస్తుడ్ని కాదు, మధ్యతరగతివాణ్ణి అంతకంటే కాదు (అలాంటి మనుషులు, సన్నివేశాలు అసంభవమూ కావు). మరి ఏంటి తేడా అని ఆలోచిస్తే బహుశా నేను ఒంటబట్టించుకున్న Flaubertian సూత్రాలు నాకు అడ్డువస్తున్నాయేమో అని తట్టింది.

అదే నామినికి చెప్పాను, “కొన బాగంలో రచయిత సమక్షం తెలుస్తుండీ” అని. ఆయన చొప్పున, “రచయిత సమక్షం అంటే ఏంది మెహెరూ… అది లేంది ఎక్కడ? మరి నేను పుస్తకం మొదులుపెట్టటమే ‘మంచి శుక్రోరం’ అని మొదలుబెట్టినాను కదా. అది ‘మంచి శుక్రోరం’ ఎట్టయ్యింది. రచయిత చేప్తేనే కదా అయ్యింది. మరి అక్కడ లేని రచయిత రెండోభాగంలో ఎట్ట వచ్చేసినాడు? రచయిత దూరటం దూరకపోవటం అయ్యన్నీ దొంగ మాటలబ్బా. అంతా చేప్పేది రచయితే కద” అని అన్నాడు. నామినిలో నేను గౌరవించే అంశాల్లో ఇదొకటి. ఆయనది దత్తు తెచ్చుకున్న జ్ఞానం కాదు. సొంతంగా తన కళతో తాను పడిన యాతనలోంచి తేల్చి తెచ్చుకున్న జ్ఞానం (శ్రీపాద లాగా.) ‘రచయిత రచనలో దూరకూడదు, దేవుళ్ళా వెనకే ఉండి అంతా నడిపించాలి’ అని Flaubert అంటే ‘అబ్బో రచయిత అంటే దేవుడి మాదిరి’ అని పొంగిపోయి ఏం ప్రశ్నించకుండా ఒప్పేసుకుంటాం కదా. అంటే ఇప్పుడు నామిని సడెన్‌గా నా ముందు ఇంతింతై ఉబ్బిపోయి వామహస్తం పైకెత్తి ఈ మాటలు ప్రవచించి నా కళ్లు తెరిపించేశాడని కాదు గానీ, అప్పటికే సత్యంలో దిటవైన పునాది లేక వట్టి మాటల పేర్పుగా డొల్లబారుతున్న ఆ సూత్రం నామిని స్టేట్మెంటుతో ఇంకో ఎదురు దెబ్బ తినిందని మాత్రం ఒప్పుకోవాలి.

ఐనా మరి రెండోభాగంతో నేను కొంత ఇబ్బంది పడిన మాట మాత్రం వాస్తవం. తర్వాత మేం ఫోన్‌లో మాట్లాడుకున్న మాటల్లో అది తెలియజేస్తూనే వచ్చాను. కానీ స్పష్టంగా కాదు. ఎందుకంటే ఆ రెండోభాగంలో ఇబ్బంది ఏంటన్నది నాకూ తెలియదు, ఆయనకీ తెలియదు. మాట్లాడుకోవటమైతే చాలాసార్లు మాట్లాడుకుంటున్నాం. ఆయన నా ‘రచయిత సమక్షం’ అన్న అభ్యంతరాన్ని అలా తీసిపారేసిన తర్వాత నాకు మళ్లీ ‘వ్యంగ్యం’ అన్న కాచ్‌వర్డు దొరికింది. దాంతో ఆయన్ని ఎదుర్కోవటం మొదలుపెట్టాను. రెండోభాగంలో రచయిత వ్యంగ్యం తీవ్రంగా, కోస్తున్నట్టు ఉంటుంది. ఈ భాగం గురించి మా మాటల్లో ఎపుడు ప్రస్తావనకు వచ్చినా నేను ఒక్కసారైనా ఈ సంగతి గొణిగేవాణ్ణి. ఇక ఆయన విని విని విసిగి వేసారి ఒక మాట అన్నారు. “మొదటి భాగం దేవుడు చెప్తున్నాడు, రెండో భాగం సైతాను చెప్తున్నాడు. ఇక అట్ట అనేసుకోండి” అని. ఏ రచయితైనా తన రచన వెనుక ప్రేరణలూ, ఉద్దేశాల గురించి ఎల్లపుడూ స్పష్టమైన అవగాహనతోనూ, స్టడీగైడ్సుతోనూ సిద్ధంగా ఉంటాడని చెప్పలేం. రచయితల్ని, ముఖ్యంగా నామిని లాంటి రచయితల్ని, నిర్దేశించేది ఇంట్యూషన్. నామిని తన రచన గురించి అన్న ఈ మాట తిన్నగా ఆయన ఇంట్యూషన్నించి తన్నుకొచ్చిన మాటగా అనిపించింది. ఇది నిజానికి చాలా విశదమైన విషయం. నామిని రచయితగా తన రచనల వెనుక అదృశ్యం కావటానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఫస్ట్‌పెర్సన్‌లో చెప్పినా, థర్డ్‌పెర్సన్‌లో చెప్పినా కథ చెప్పేది ఎప్పుడూ నామినే. ఇక్కడ నామిని అంటే రచనాసూత్రాలకు బద్ధుడైన రచయిత నామిని కాదు (అలాంటివాడెవడూ లేడు); రక్తమాంసాలూ రాగద్వేషాలతో సజీవంగా చలించిపోయే మానవమాత్రుడు నామిని. మనకు ఇన్ని కథలు చెప్పింది ఈ నామినే. ఇప్పుడు మూలింటామె కథ చెప్తోందీ ఈ నామినే.

ఇక ‘మొదటిభాగం దేవుడు చెప్తున్నాడు, రెండో భాగం సైతాను చెప్తున్నాడు’ అన్న ఆయన మాట నాకు ‘మూలింటామె’ని ఇంకాస్త బాగా అర్థం చేసుకోవటానికి సాయపడింది. ఆ మాటని నేను ఎలా తర్జుమా చేసుకున్నానంటే: మొదటిభాగాన్ని నడిపించింది ప్రేమ, రెండోభాగాన్ని నడిపించింది ద్వేషం అని. ఈ నవలలో ఎప్పుడూ ప్రత్యక్షంగా పాఠకుల ముందుకు రాని రూపావొతిపై నామిని ప్రేమా, రూపావతిని తిరగేస్తే పుట్టిన పందొసంతపై ఆయన ద్వేషమూ కొట్టొచ్చినట్టు తెలుస్తూనే ఉంటాయి. మరి అలా ఒక రచయిత తన పాత్రలపై ప్రేమ ద్వేషాలు కలిగి ఉండొచ్చా అంటే, ఆ రచయిత వాటిని తాను కల్పించిన పాత్రలుగా గాక, తన మనోనేత్రం ఎదుట రక్తమాంసాలతో కదలాడుతున్న మనుషులుగా చూడగలవాడైనపుడు, ఉండొచ్చా ఉండకూడదా అన్న మాటే రాదు, ఉండి తీరతాయీ అని చెప్పాల్సొస్తుంది. నామిని తన పాత్రల్ని అలా మనుషుల్లాగే చూశాడు. మనుషులు కాబట్టే, వాళ్లని చెప్పుతో కొట్టేసి తనకు నచ్చినట్టు మార్చలేక, అవి ఎలా మసలుకుంటే అలా చూసి రాశాడు. ఆ రాయటం మాత్రం రచనాసూత్రాలకు బద్ధుడై, రచయితగా తాను జోక్యం చేసుకోకూడదని చెప్పి, ఒక తెచ్చిపెట్టుకున్న తాటస్థ్యం(detachment)తో రాయలేకపోయాడు. ప్రేమ కలిగినపుడు ప్రేమిస్తూ రాశాడు, ద్వేషం కలిగినపుడు ద్వేషిస్తూ రాశాడు. స్వచ్ఛమైన ప్రేమ ఎప్పుడూ గుంభనంగా ఉంటుంది, ద్వేషం మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇక్కడా అదే జరిగింది. మొదటిభాగంలో రూపావొతి మీద రచయిత ప్రేమ కనపడలేదు గానీ, రెండోభాగంలో పందొసంత మీద ద్వేషం మాత్రం కొట్టొచ్చినట్టు కనపడింది. నిజానికి ఆ ద్వేషం పందొసంత మీద కూడా కాదు. నామిని ఇప్పటి దాకా పల్లెటూళ్లలో తాను ఏ కోణం చూపించలేదనుకున్నాడో, ఆ కోణం పైన, ఆ క్రూరత్వంపైన, ఆయనకి ద్వేషం. ఆ క్రూరత్వానికి మూర్తీభవించిన ఉదాహరణల్లాంటి రంజకం, మొలకమ్మ, ఎర్రక్క, పందొసంత లాంటి మనుషుల పట్ల పరమ కచ్చతో రగిలిపోతూ కథ చెప్తున్నాడు. ఆపుకోలేని ద్వేషం తారాస్థాయికి చేరినపుడు వ్యంగ్యంలోకి దిగిపోతుంది. ఈ వ్యంగ్యమే మొదటిసారి చదివినపుడు నన్ను ఇబ్బంది పెట్టింది. ఎందుకంటే నేను Flaubert ని చదువుకుని ‘రచయిత కథలో కనపడకూడదు’ అన్న సూత్రాన్ని ఒంటబట్టించుకున్నవాణ్ణి. పండిత పాఠకుణ్ణి. నాలాంటోళ్లని చూసి విసిగిపోయే అనుకుంటా జెడి శాలింజర్ తన ఒక పుస్తకాన్ని ఇలా అంకితమిచ్చాడు:
“ఈ ప్రపంచంలో ఇంకా అమెచ్యూర్ పాఠకుడు అనేవాడు ఎవడైనా – కనీసం చదివి తన మానాన తాను పోయేవాడు ఎవడైనా – మిగిలి ఉంటే, నేను చెప్పలేనంత అనురాగంతోనూ కృతజ్ఞతతోనూ వాణ్ణి నా భార్యా పిల్లలతో పాటూ నాలుగోవంతుగా ఈ పుస్తకాన్ని అంకితం తీసుకొమ్మని కోరుతున్నాను.”
నామిని ప్రతి పుస్తకం లాగే ఈ ‘మూలింటామె’ కూడా అలాంటి పాఠకుల కోసమే. పైన చెప్పిన బేగేజీ అంతా పక్కనపెట్టి రెండోసారి చదివినపుడు ‘మూలింటామె’ను మరింత దగ్గరగా ఆస్వాదించగలిగాను. రెండోసారి కాబట్టి, కథ ఏమవబోతోందో అన్నట్టు చదవాల్సిన ఇది లేకపోవటంతో, నింపాదిగా చిన్న చిన్న వివరాల్ని ఆస్వాదిస్తూ చదవగలిగాను. అలాంటివి ఇందులో ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి, మూలింటామె తలపోటు టాబ్లెటుతో పాటూ దాన్ని చుట్టివుండే కాగితాన్ని కూడా నోట్లో వేసుకుని నమలడం, అదేంటని అడిగితే “మాత్ర కంటే మించిన సత్తుమానం కాతికంలో వుంటింది” అని చెప్పడం; మాలమ్మాయి గురివి మూలింటామె ఇంటికొచ్చి “ఈ నాలుగూళ్లలో ఏ ఆడదన్నా మాలదాని చేతికి కుంచమిచ్చి కొలుచుకోమంటాదా! మీ మనవరాలు తప్ప” అని చెప్పటం; పిల్లుల్ని చంపటానికి వచ్చినవాడితో మూలింటామె చెప్పే బ్రిటిషు కాలం నాటి పిట్టకథ…. జీవితంలోంచి అరుదుగా మాత్రమే సాహిత్యంలోకి వచ్చే ఇలాంటి చిన్న చిన్న సంగతులెన్నో కలిసే తనని పుస్తకం రాసేలా చేశాయని నామిని కూడా తల్చుకున్నారు. ఇలా అంటే మహా చిత్రం కదా మన మహా రచయితలకి! మరివాళ్లు ఏదో మహా ఉద్దేశం ఉంటే తప్ప పుస్తకం రాసే జోలి పెట్టుకోనే పెట్టుకోరు కదా! అసలు ఎవడన్నా పర్యావరణం గురించీ, ప్రపంచీకరణ ఫలితాల గురించీ, జీవకారుణ్యం గురించీ ఏదన్నా రాసేద్దామని గొప్ప ఉద్దేశంతో ఓ నవల మొదలెట్టాడంటే వాడికన్నా దొంగరచయిత ఇంకోడు ఉంటాడా! రచయిత చేత కలం పట్టించేది అతని అనుభవం వడ కట్టిన జీవితం. ఇక అందులోంచి వెయ్యి మంచి ఉద్దేశాలెవరన్నా ఏరుకున్నారంటే అది వాళ్ల వెసులుబాటు. దానికి రచయితకీ ఏం సంబంధం లేదు.

అసలు నిజమైన రచయితకు పుస్తకం రాయటానికి ఏ ఉద్దేశమూ ఉండదు చాలాసార్లు. అతని జీవిత విస్తారంలో క్రమేణా ఏవో కొన్ని మూలకాలు ఒక అదృశ్యబిందువు దగ్గర దట్టంగా గుమికూడతాయి. అవన్నీ అక్కడ క్రిక్కిరిసిపోయి ఇక నిభాయించుకునే వీలు లేక అతని మీద పడతాయి. అతను నిలదొక్కుకోలేక ఆ పళంగా వచ్చి కాగితం మీద పడతాడు. ‘మూలింటామె’ నవలకు ఉద్దేశం ఆపాదించటం సులువు. అలా ఆపాదిస్తూ వాడేది ఎంత పెద్ద పదమైనా కావొచ్చు. కానీ అది ఎంత పెద్ద పదమైతే ఆ మాట అంత అబద్ధం. ‘ఈ నవల్లో నామిని పిల్లులంటే తనకున్న ఇష్టం చూపెట్టుకున్నాడూ’ అను, కొంత నిజం ఉంది. కానీ ‘ఈ నవల్లో నామిని జీవకారుణ్యం గురించి చెప్పినాడు’ అను, అంతకన్నా సత్యదూరమైన మాట ఇంకోటి ఉండదు. ఎందుకంటే మనం వాడే పెద్ద పెద్ద పదాలన్నీ నిజానికి భ్రష్టుపట్టిపోయిన పదాలు. వట్టి జీవకారుణ్యం ఏం ఖర్మ, ప్రపంచీకరణ గురించి మాట్లాడొచ్చు, మార్కెట్ శక్తుల గురించి మాట్లాడొచ్చు, పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడొచ్చు. వీటిల్లో ఏదో ఒక దాన్ని మనసులో ఉద్దేశంగా పెట్టేసుకుని నామిని ఈ నవల మొదలెట్టాడూ అనొచ్చు. తిన్నగా నామిని ముందే బుకాయించో మొహమాటపెట్టో ఆయన్నే ఒప్పించొచ్చు. కానీ ఆర్టిస్టు మనసు ఎలా పనిచేస్తుందన్నదానిపై అవగాహన ఉన్నవాళ్లెవరూ ఆ వాగుడు వాగరు.

*

నామినితో మాట్లాడినపుడు ఆయన పదే పదే ఇష్టంగా తల్చుకునే రచనలు రెండు అని గమనించాను. ఒకటి దాస్తోయెవ్‌స్కీ ‘క్రైం అండ్ పనిష్మెంటు’, రెండోది ఆల్బెర్ట్ కామూ ‘అవుట్‌సైడర్’. మూలింటామె విషయంలో నామినిపై అవుట్‌సైడర్ ప్రభావం కొంత కనిపిస్తుంది. ప్రభావం అంటున్నానంటే మనవాళ్లు కథల్ని సన్నివేశాలూ, పాత్రల స్వభావాల్తో సహా దించేసే తంతు గురించి కాదు నేచెప్పేది. ఒక రచన సారం మనలో ఇంకినపుడు దాని ప్రభావం వల్ల అంతకుముందు చూచాయగా మాత్రమే స్ఫురణ పొలిమేరల్లో తచ్చాడే రూపరహిత అంశాలు ఒక రూపాన్ని సంతరించుకుని ముందుకు రావటం గురించి చెప్తున్నాను. అలా చూసినపుడు కామూ నవలకీ, నామిని నవలకీ కొన్ని పోలికలు కనపడతాయి. ముఖ్యంగా ‘అవుట్‌సైడర్’ కథానాయకుడు మీర్‌సాల్టుకూ, మూలింటామె పాత్రకూ మధ్య. తను చేసిన హత్యకు గాక, తల్లి చనిపోయినపుడు సరిపడా విషాదం బయటకు చూపించనందుకు మీర్‌సాల్టుకు శిక్ష పడుతుంది. సమాజం యొక్క దున్నపోతు స్వభావం ఎలా ఉంటుందన్నది కోర్టులో మీర్‌సాల్టుకు వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పిన వ్యక్తుల మనస్తత్వాల్లో వ్యక్తమవుతుంది. సమాజం మీర్‌సాల్టును వెంటపడి ఎంత వేధిస్తుందో మూలింటామెనూ అంతే వేధిస్తుంది. అయితే ఇక్కడ పోలికేమిటంటే… మీర్‌సాల్టూ, మూలింటామె ఇద్దరూ క్రూరత్వాన్ని నిలువరించటానికి వాడే ఆయుధం ఉదాసీనతే. ఆఖర్లో పందొసంతా, ఎర్రక్కా కలిసి మూలింటామె ప్రాణంగా “నా చిన్నామున్నులూ, కానాచ్చులూ, కొండాచ్చులూ” అని పిలుచుకునే పిల్లుల్ని ఎలకలమందు పెట్టి చంపి శవాల్ని చేటలో వేసుకొచ్చి ఆమె కళ్ల ముందు ఆడించినా “తోడబుట్టిన అక్కకు చేతులెత్తి దండంబెట్టి నోరు తెరవకుండా, కండ్లు మూసు”కుంటుంది. వొడిశాకు తినేసి ప్రాణాలు వదిలేస్తున్నప్పుడు కూడా దొంగ ఏడుపులు ఏడుస్తున్న “అక్కకల్లా చేతులెత్తి దండం బెట్టి కడగా పొమ్మన్నట్టు చూసింది”. ‘అవుట్‌సైడర్’లో మీర్‌సాల్టుకు ఇక ఉరిశిక్షఖాయమనగా, తనని పశ్చాత్తాపపడమని వచ్చిన క్రైస్తవ ఫాదరీని చెడామడా తిట్టేసి వెళ్లగొట్టేస్తాడు. అందరూ వెళ్లిపోయాక జైలు గది నిశ్శబ్దంలో తన మనసులో ఇలా అనుకుంటాడు:
“As if that blind rage had washed me clean, rid me of hope, for the first time, in that night alive with signs and stars, I opened myself to the gentle indifference of the world. Finding it so like myself—so like a brother, really—I felt that I had been happy and was happy again.”
తన కోపం అంతా బయటకు కక్కేయడం వల్ల కలిగిన తేటదనంతో, ఇక ఏ ఆశా మిగలి లేదని అర్థమవగా, నిస్సత్తువగా జైలు గదిలో చప్టా మీద కూలబడతాడు. నక్షత్రపు రాశులతో వెలుగుతున్న ఆ రాత్రిలో మొట్టమొదటిసారి ప్రపంచపు “దయాపూరితమైన ఉదాసీనత”ను చూడగలుగుతాడు, దానికి తనను సమర్పించేసుకుంటాడు. మూలింటామె ఉదాసీనత ఇలాంటిదే. మీర్‌సాల్టు తన ఆక్రోశం అంతా ఒక్కసారైనా వెళ్లగక్కుకున్నాకనే ప్రపంచపు “gentle indifference”ను చూడగలుగుతాడు, అది తనలోనూ చూసుకుంటాడు. బహుశా స్త్రీ కాబట్టి, భారతీయస్త్రీ కాబట్టి మూలింటామె ఆ మాత్రం కూడా ఎక్కడా బయటపడదు. మన ప్రపంచం ఇన్ని అసంగతపు (అబ్సర్డు) లెక్కల మీద నడుస్తుందని ‘అవుట్‌సైడర్’ నవల ప్రతిపాదిస్తే, మనం మానవావరణలో నమ్మకంగా వేసే అడుగుల కిందే ఎన్నో క్రూరత్వాలు ఆవలిస్తూ అవకాశం కోసం కాచుక్కూచోవటం ‘మూలింటామె’లో కన్పిస్తుంది. సారంలోనే కాక, సౌష్టవం విషయంలోనూ రెండు నవలలకూ పోలికలున్నాయి. రెండు నవలలూ రెండేసి భాగాలుగా విడగొట్టి ఉంటాయి. రెండూ దాదాపు అంతే స్లిమ్‌గా ఉంటాయి.

*

నెంబర్ వన్ పుడింగి’ తర్వాత నామినికి చాలామంది అంతిమనివాళులు అర్పించారు; రచయితగా అస్తమించాడన్నారు, గోర్కీ అన్నవాళ్లే గోరీలు కట్టేశారు. కానీ జీవితంతో కాంటాక్టు నిలుపుకున్నంతవరకూ ఏ రచయితా వట్టిపోడు, చచ్చిపోడు. నామిని వరకూ ఈ ‘మూలింటామె’ దానికి ఋజువు. ఎంతో జీవితాన్ని, ఎంతో సౌష్టవంగా వెలిబుచ్చిన నవల ఇది.

నామిని పట్ల నామిని రచనల్ని మించిన గౌరవం నాకు. ఎందుకంటే కళాకారుని మూర్తిమత్వం శుద్ధంగా వ్యక్తమయ్యేది అతని సృజన ఒక్కదాంట్లోనే కాదు. ఆ కళ పట్ల కలిగి ఉన్న అభిప్రాయాల్లోనూ, వాటికి నిబద్ధుడై ఏ మొహమాటాలకూ లొంగకుండా నడుచుకోవటంలోనూ కూడా వ్యక్తమవుతుంది. నాకు తెలుగునేల మీద తారసపడిన – ఒంటిచేతి వేళ్లతో లెక్కపెట్టదగిన – కళాకారుల్లో నామిని ఒకడు.

*

(కినిగె పత్రికలో ప్రచురితం)

June 16, 2014

తెరిచున్న గుమ్మం

“అత్త వస్తుంది, మీరు కూర్చోండి మిస్టర్ నటెల్. ఈలోగా నాతో కబుర్లు చెప్పితీరాలి,” అందా పదిహేనేళ్ల ఆరిందా.

ఇంటావిడ వచ్చేలోగా ఈ పిల్లతో మర్యాదపూర్వకంగా ఏదో ఒకటి మాట్లాడక తప్పలేదు నటెల్‌కు. కానీ లోపల్లోపల – అసలు ఇలా అపరిచితుల ఇళ్లకు పలకరింపులకు హాజరవటం వల్ల తన నరాలజబ్బుకు కలిగే మంచేమన్నా ఉందా అని సందేహపడ్డాడు. దాని విరుగుడు కోసమే అతను పట్టణం వదిలి ఈ మారుమూల పల్లెకు మకాం మార్చింది.

ఇక్కడకు వచ్చేముందు అతని అక్క ఇక్కడున్న తన పరిచయస్తులందరికీ ఫోన్ చేసి చెప్పింది. “లేదంటే నీ సంగతి నాకు బాగా తెలుసు. ఇల్లు వదిలి బయటకు వెళ్లవు, ఎవ్వరినీ పలకరించవు. ఒక్కడివీ లోపలే మగ్గిపోతావు, ఇంకా దిగులు పెంచుకుంటావు” అన్నది.

“మీకిక్కడ ఎంతమంది తెలుసు?” అడిగింది ఆరిందా.

“ఎవ్వరూ తెలియదు. మా అక్కగారు నాలుగేళ్ల క్రితం దాకా ఇక్కడే ఉండేవారు. ఆవిడ కొంతమంది పేర్లు చెప్పి కలుసుకొమ్మంది. వాళ్లతో ముందే ఫోన్లో మాట్లాడింది,” అన్నాడు నటెల్.

“అయితే మీకు మా అత్త గురించి ఏమీ తెలియదన్నమాట,” సాగదీస్తూ అడిగింది ఆ పిల్ల.

“పేరూ, చిరునామా మాత్రమే తెలుసు,” అన్నాడు. ఈ మిసెస్ సాపల్టన్ వివాహితా, లేక విధవరాలా అన్న మీమాంసలో ఉన్నాడతను. ఇంటి వాతావరణం చూస్తే మాత్రం అక్కడక్కడా మగవాళ్లు మసిలే సూచనలు కనపడుతున్నాయి.

“ఐతే పాపం మూడేళ్ల క్రితం అత్తకు జరిగిన ఘోరం గురించి మీకు తెలీదన్నమాట,” అంది దవడ వేలాడేసి మూతిని సున్నాలా చుట్టి.

“ఏమైంది?” ఘోరం అనే మాటకి అతని నరాలు గుంజాయి. ఈ ప్రశాంతమైన పచ్చని ప్రదేశంలో ఆ మాట అతికినట్లనిపించలేదు.

“ఈ అక్టోబరు సాయంత్రం బయట చల్లగా ఉన్నా ఆ గుమ్మం ఎందుకు తెరిచి ఉంచామో తెలుసా?” అంటూ వారనున్న గదిలో, బయట పచ్చికబయల్లోకి తెరుచుకున్న గుమ్మం వైపు చూపించింది.

“అక్టోబరు వచ్చిందన్నమాటే గానీ వాతావరణం వెచ్చగానే ఉంది. ఇంతకీ ఆ గుమ్మానికీ నువ్వు చెప్తున్న ఘోరానికీ ఏమన్నా సంబంధం ఉందా?” అన్నాడు నటెల్.

“మూడేళ్ల క్రితం ఇదే రోజు, ఆ గుమ్మంలోంచే ఆవిడ భర్త, ఇద్దరు తమ్ముళ్లూ వేటకు వెళ్లారు. తుపాకులు ఊపుకుంటూ తుళ్లుతూ వెళ్లారు. అడవిలో ఏరు దాటుతుండగా ఒక ఊబి వాళ్లని లోపలికి లాగేసింది. ముగ్గురూ ఒకేసారి… పోయారు. శవాలు కూడా చిక్కలేదు.”

ఈ విషయం చెప్తుంటే ఆ పిల్ల గొంతులో ఆరిందాతనం మాయమై గద్గదమైంది. “పాపం అత్త! పిచ్చిదైపోయింది. ఇంకా వాళ్లు తిరిగి వస్తారనే నమ్ముతోంది. వాళ్లతో పాటూ వెళ్ళి చచ్చిపోయిన వేటకుక్కతో సహా ముగ్గురూ ఎలా వెళ్లినవాళ్లు అలాగే అదే గుమ్మం గుండా వెనక్కు వస్తారని ఆమె ఆశ. అందుకే ప్రతీ ఏటా ఈ రోజు దాన్ని అలాగే తెరిచి ఉంచుతుంది. నన్ను కూర్చోపెట్టి వాళ్లెలా వెళ్లారో పూసగుచ్చినట్టు చెప్తూంటుంది. ఆమె భర్త తెల్లని కోటు భుజం మీద వేసుకున్నాడు, తమ్ముళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకుని నడిచారు, చిన్న తమ్ముడు రోనీ ‘బెర్టీ ఎందుకలా గెంతుతావ్…’ అన్న పాట పాడుతూ వెళ్లాడు, అతను అత్తని ఏడిపించటానికి ఆ పాట పాడతాడు, ఆ పాట అంటే అత్తకు అస్సలు ఇష్టం ఉండదు. మీకు తెలుసా, ఇలాగా నిశ్శబ్దంగా ఉన్న సాయంత్రాలు నాకు గుబులుగా ఉంటుంది, ఆ గుమ్మంలోంచి వాళ్లు నిజంగా నడుచుకుంటూ వచ్చేస్తారేమో అని–”

ఆ ఊహకే వణికిపోతున్నట్టు మాట్లాడటం ఆపేసింది. అప్పుడే వాళ్ల అత్త మిసెస్ సాపల్టన్ లోపలికి వచ్చింది. అతణ్ణి అలా కూచోబెట్టినందుకు క్షమాపణలు చెప్పాక అంది, “వెరా మిమ్మల్నేం విసిగించటం లేదు కదా?”

“లేదు. ఏవో కబుర్లు చెప్తోంది.”

“ఆ గుమ్మం తెరిచి ఉంచితే మీకేం ఇబ్బంది లేదనుకుంటాను. మా ఆయన, ఇద్దరు తమ్ముళ్లూ వేట నుంచి రావాలి. వాళ్లకు ఈ గుమ్మం లోంచి రావటం అలవాటు. ఇవాళ బురదగుంటల్లోకి పోయారు. ఇక వచ్చి మొత్తం తివాచీలన్నీ పాడు చేస్తారు.”

తర్వాత ఆమె ఈ వాతావరణంలో బాతుల వేట ఎంత బాగుంటుందో చెప్పటం మొదలుపెట్టింది. నటెల్ కు గాభరా పెరిగిపోతుంది. వీలైనంత తొందరగా ఈ సంభాషణ భూతాల మీంచి పక్కకు మళ్లితే బాగుండుననిపించింది. ఆమె మాట్లాడేది తనతోనే ఐనా, మధ్య మధ్యలో ఆమె దృష్టి తనను దాటుకుని ఆ గుమ్మం వైపుకు మళ్లుతూండటం అతను గమనించకపోలేదు. సరిగ్గా తాను ఈ రోజే పలకరించటానికి రావటం ఖర్మకాక మరేమిటి.

“నా విషయంలో డాక్టర్లందరూ ఒకే మాటన్నారు. పూర్తి విశ్రాంతి తీసుకోమన్నారు, ఏ రకమైన మానసికాందోళననూ దరి చేరనీయవద్దన్నారు, ఒత్తిడి నుంచి వీలైనంత దూరంగా ఉండమన్నారు,” అని ప్రకటించాడు నటెల్. అస్సలు పరిచయం లేని వాళ్లు కూడా మన అనారోగ్యానికి సంబంధించిన వివరాలు కోసం తపించిపోతుంటారన్న భ్రమలో పడి కొట్టుకునే చాలామందిలో అతనూ ఒకడు. “పథ్యం విషయంలో మాత్రం తలో మాటా అన్నారు,” అంటూ కొనసాగించాడు.

ఆవలింతని అతికష్టం మీద దిగమింగిన గొంతుతో, “అవునా?” అంది మిసెస్ సాపల్టన్. ఉన్నట్టుండి ఆమె ముఖకవళికల్లో అప్రమత్తత వచ్చింది. కానీ అది నటెల్ చెప్తున్న విషయం గురించి కాదు.

“హమ్మయ్యా వచ్చేసారు!” అంది గట్టిగా, “పోనిలే కరెక్టుగా టీ సమయానికి చేరుకున్నారు. చూట్టానికి మొత్తం బురదలో స్నానం చేసినట్టున్నాయే వాలకాలు!”

నటెల్ ఉలిక్కిపడ్డాడు, తర్వాత సానుభూతి పంచుకునే ముఖంతో మేనకోడలు వెరా వైపు చూశాడు. ఆ పిల్ల మిడిగుడ్లేసుకుని బిక్కచచ్చిపోయినట్టు తెరిచిన గుమ్మం వైపు చూస్తోంది. వెన్నుపూస నుంచి జలదరింపు పైకి పాకుతుంటే, అతను కూడా ఆమె చూస్తున్న వైపే తిరిగాడు.

చిక్కబడుతోన్న సంధ్య చీకట్లలోంచి మూడు ఆకారాలు పచ్చిక బయలుపై నడుస్తూ గుమ్మం వైపు వస్తున్నాయి; వాళ్లందరూ తుపాకులు మోస్తున్నారు, వాళ్లలో ఒకరి భుజం మీద తెల్లని కోటు ఉంది. వాళ్ల అడుగుల్లో అడుగులేస్తూ ఒక వేట కుక్క అనుసరిస్తోంది. నిశ్శబ్దంగా వారు ఇంటికి చేరువవుతున్నారు. ఉన్నట్టుండి వాళ్లలో ఒక గొంతు బిగ్గరగా “బెర్టీ ఎందుకలా గెంతుతావ్…” అని పాడటం మొదలుపెట్టింది.

నటెల్ వెర్రి వేగంతో తన ఊతకర్ర, టోపీ చేతుల్లోకి తీసుకున్నాడు. హాలు తలుపు, గులకరాళ్లు పరిచిన బాట, బయటి గేటూ… ఇవి మాత్రమే అతని ఉన్మత్త పలాయనంలో గుర్తున్న కొన్ని మజిలీలు. అతన్ని తప్పించబోయి రోడ్డు మీద ఎదురొచ్చిన సైకిలతను పక్కనున్న తుప్పల్లోకి పోయాడు.

“ఇదిగోనే వచ్చేశాం. బురదగానే ఉంది గానీ, కాస్త ఆరింది. ఇంతకీ ఎవరతను మేం వస్తూంటే అలా పరిగెత్తుకెళ్ళిపోయాడు?”

“చాలా చిత్రమైన మనిషి. పేరు మిస్టర్ నటెల్. తన రోగాల గురించి తప్ప ఇంకేం మాట్లాడడు. ఏంటో మీర్రావటం చూసాడో లేదో కనీసం వీడ్కోలు కూడా చెప్పకుండా ఏదో దెయ్యాన్ని చూసినట్టు పరిగెత్తాడు.”

“దెయ్యాన్ని కాదు, బహుశా కుక్కని చూసి అనుకుంటా,” అంటూ చెప్పడం మొదలుపెట్టింది మేనకోడలు నెమ్మదిగా, “ఆయనకి కుక్కలంటే చాలా భయమని చెప్పాడు నాతో. ఒకసారి ఒక కుక్కల గుంపు ఆయన వెంటపడితే గంగానది ఒడ్డునున్న స్మశానం లోకి పారిపోయాడట. పరిగెడుతుంటే కొత్తగా తవ్విన ఒక సమాధి గోతిలో పడిపోయాడట. ఆ రాత్రంతా ఆయన్ని బయటకు రానివ్వకుండా కుక్కలు ఆ గోతి చుట్టూనే మొరుగుతూ తిరిగాయట. ఎవరైనా జావకారిపోతారు అలాంటి పరిస్థితి వస్తే.”

అప్పటికప్పుడు కథలల్లటం ఆమె ప్రత్యేకత.

* * *


(సాకీ కథ “ఓపెన్ విండో”కు అనువాదం. కినిగె పత్రికలో వేరే పేరు మీద ప్రచురితమైంది.) 

June 10, 2014

Some aphorisms from Nicolás Gómez Dávila

Some thoughts from the Don, particularly about writing:—


The writer who has not tortured his sentences tortures his reader.
తన వాక్యాల్ని హింస పెట్టనివాడు, పాఠకుల్ని హింసపెడతాడు.

A sentence should be hard like a rock and should shake like a branch.
వాక్యం గట్టి రాయిలాగా ఉండాలి, కొమ్మలాగా ఊగాలి.

Nothing is so important that it does not matter how it is written.
ఎలా రాశారూ అన్నది అప్రాముఖ్యం అయ్యేంతటి ముఖ్యమైన విషయం ఏదీ లేదు.

Only he who suggests more than what he expresses can be reread.
తాను వ్యక్తీకరించిన దాని కన్నా ఎక్కువ సూచించే రచయితనే మళ్లీ మళ్లీ చదవగలం.

The writer’s talent lies not in describing a person, a landscape, or a scene, but in making us believe he did.
ఒక మనిషినో, ప్రదేశాన్నో, సన్నివేశాన్నో వర్ణించటంలో లేదు రచయిత ప్రతిభ, వర్ణించినట్టు నమ్మించటంలో ఉంది.

We call the beauty of a language the skill with which some write it.
మనం అందమైన భాష అనేది నిజానికి కొందరు రచయితలు దాన్ని వాడుకోవటంలో చూపించిన ప్రతిభని మాత్రమే.

Avoid repeating a word is the favorite rule of rhetoric of those who do not know how to write.
పదాల పునరుక్తి కూడదన్న రచనా సూత్రం - రాయడమెలాగో ఎలాగో తెలీని వాళ్లకు అత్యంత అభిమాన పాత్రం.

The writer who does not insist on convincing us wastes less of our time, and sometimes even convinces us.
మనల్ని ఒప్పించేందుకు పట్టుబట్టని రచయిత మన సమయాన్ని తక్కువ వ్యర్థం చేస్తాడు, ఒక్కోసారి ఒప్పించేస్తాడు కూడా.

Words arrive one day in the hands of a patient writer like flocks of doves.
ఓర్పు గల రచయిత చేతుల్లోకి పదాలు పావురాల గుంపుల్లాగా వచ్చి వాలతాయి.

To write honestly for the rest, one must write fundamentally for oneself.
తక్కినవారి కోసం నిజాయితీగా రాయదల్చుకున్నవాడు, ముందు తన కోసం తాను రాసుకోవాలి.

Words are born among the people, flourish among writers, and die in the mouth of the middle class.
పదాలు జనం మధ్య పుడతాయి, రచయితల చేతుల్లో వృద్ధి చెందుతాయి, మధ్య తరగతి నోళ్లలో చస్తాయి.

Phrases are pebbles that the writer tosses into the reader’s soul. The diameter of the concentric waves they displace depends on the dimensions of the pond.
రచయిత పాఠకుని మనసులోకి విసిరే గులకరాళ్లు పదాలు. అవి పుట్టించే తరంగాల అడ్డకొలత ఎంతనేది ఆ చెరువు వైశాల్యాన్ని బట్టి ఉంటుంది.

When he believes he says what he wants, the writer only says what he can.
రచయిత తాను చెప్పాలనుకున్నది చెప్తున్నానని ఎంత నమ్మినా నిజానికి తను చెప్పగలిగేది మాత్రమే చెప్తాడు.

To write for posterity is not to worry whether they will read us tomorrow. It is to aspire to a certain quality of writing. Even when no one reads us.
రాబోయేతరం కోసం రాయటమంటే, వాళ్లు రేపు మనల్ని చదువుతారో లేదో అని వ్యాకులపడటం కాదు. రచనను ఒక స్థాయికి తీసుకెళ్లాలని ఆశించటం. ఎవరూ మనల్ని చదవకపోయినా సరే.

A man does not communicate with another man except when the one writes in his solitude and the other reads him in his own.
Conversations are either a diversion, a swindle, or a fencing match.
ఒక మనిషి తన ఏకాంతంలో రాసిందాన్ని మరో మనిషి తన ఏకాంతంలో చదువుకున్నప్పుడు మాత్రమే ఒకరికొకరు అర్థం కావటమనేది సాధ్యం. సంభాషణల వల్ల జరిగేదల్లా పక్కదారిపట్టడమూ, దగాచేయటమూ, లేదా కర్రసామూ మాత్రమే.

Confusion is the normal result of a dialogue.
Except when a single author invents it.
సంభాషణ ఫలితం ఎప్పుడూ అయోమయమే.
దాన్ని కల్పించింది ఒకే రచయిత ఐతే తప్ప.

The traditional commonplace scandalizes modern man.
The most subversive book in our time would be a compendium of old proverbs.
సంప్రదాయకమైన సాధారణత్వం అంటే ఎదురు తిరుగుతాడు ఆధునికుడు. కానీ మన కాలపు ఫక్తు అరాచకమైన పుస్తకం కూడా కేవలం పాత సామెతల సంకలనం మాత్రమే.

To understand a text, one must walk around it slowly, since no one gets in except through invisible posterns.
ఒక రాతని అర్థం చేసుకోవాలంటే దాని చుట్టూ నెమ్మదిగా తచ్చాడాలి, ఎందుకంటే ఎవరైనా లోపలికి వెళ్లగలిగేది అదృశ్య ద్వారాల ద్వారా మాత్రమే కాబట్టి.

Political activity ceases to tempt the intelligent writer, when he finally understands that there is no intelligent text that will succeed in ousting even a small-town mayor.
ఎంత వివేకం గల రచనైనా ఒక చిన్న టౌను మేయర్ని కూడా గద్దె దించలేదన్నది అర్థమయ్యాకా, వివేకవంతుడైన రచయిత ఇక రాజకీయ పరిస్థితి పట్ల స్పందించటం మానేస్తాడు.

“Social” is the adjective that serves as a pretext for all swindles.
“సామాజికం” అనేది అన్ని దోపిడీలకూ సాకుగా పనికొచ్చే విశేషణం.

Journalists and politicians do not know how to distinguish between the development of an idea and the lengthening of a sentence.
భావాన్ని విస్తరించటానికీ, వాక్యాన్ని సాగదీయటానికీ మధ్య తేడా రాజకీయనాయకులకూ జర్నలిస్టులకూ అర్థం కాదు.

http://don-colacho.blogspot.in/
http://don-colacho.blogspot.in/2010/01/art-of-writing.html

May 23, 2014

చైనా గోడ

(కాఫ్కా "ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా"కు నా అనువాదం)


చైనా గోడ నిర్మాణం ఉత్తరం హద్దు దాకా పూర్తయిపోయింది. ఆగ్నేయం నుంచి ఒక భాగమూ, నైరుతి నుంచి ఒక భాగమూ వచ్చి ఇక్కడ కలిశాయి. వీటిని ఇరు వైపుల్నుంచీ కట్టుకుంటూ వచ్చిన రెండు భారీ శ్రామిక బృందాలూ (ఆగ్నేయ బృందం, నైరుతి బృందం), ఎవరి భాగంలో వాళ్ళు మళ్ళా ఇలా విడి విడి భాగాలుగా కట్టుకుంటూ వచ్చే పద్ధతినే పాటించారు. ఇదెలా జరిగేదో చెప్తాను: ఇరవయ్యేసి మంది శ్రామికులు ఒక గుంపుగా పని చేసేవారు, వీళ్ళంతా కలిసి, ఉదాహరణకి, ఒక ఐదొందల గజాల గోడ కట్టారనుకుందాం, ఈ లోగా అటు వైపు నుంచి ఇలాంటి గుంపే ఇంకొకటి ఇంతే పొడవు గల గోడ కట్టుకుంటూ వచ్చి, దాన్ని దీనితో కలిపేది. కానీ, ఇలా కలపటం అయ్యాకా, ఈ వెయ్యి గజాల గోడ పూర్తయిన చోట నుంచి మళ్లీ నిర్మాణం మొదలయ్యేది కాదు; దానికి బదులు ఈ రెండు గుంపుల్నీ వేరే దూర ప్రదేశాలకు బదిలీ చేసేవారు, వాళ్ళు మళ్ళీ అక్కడ కూడా ఇదే పద్ధతిలో గోడ కట్టాలి. ఈ పద్ధతి వల్ల సహజంగానే మధ్య మధ్యలో చాలా పెద్ద ఖాళీలు మిగిలిపోయాయి, అవన్నీ తర్వాతెప్పుడో ఒక్కొక్కటిగా పూడ్చుకుంటూ వచ్చారు, కొన్ని ఖాళీలైతే గోడ పూర్తయిపోయిందంటూ అధికారికంగా ప్రకటించిన తర్వాత కూడా ఇంకా పూడుస్తూనే ఉన్నారు. అసలు ఇప్పటికీ కొన్ని ఖాళీలు అలాగే ఉండిపోయాయని కొందరంటారు, కానీ ఈ గోడ నిర్మాణం మొదలైందగ్గర్నించీ పుట్టుకొస్తున్న లెక్కలేనన్ని పుకార్లలో ఇవి కూడా ఒకటి, వీటి నిజానిజాల్ని నిగ్గు తేల్చటం చాలా కష్టం, ఏ ఒక్క మనిషి వల్లో అయ్యే పని కాదు, ఈ నిర్మాణపు భారీతనం అలాంటిది మరి.

గోడని ఇలా విడి విడి భాగాలుగా కట్టే పద్ధతి చాలామందికి విడ్డూరంగా తోచవచ్చు. వరుసగా కట్టుకుంటూపోతే ఏమైంది? అసలు ఈ గోడ ఉద్దేశమే ఉత్తరం వైపున్న తండాల వాళ్ళ నుంచి రక్షణ కోసమని కదా, మరి ముక్కలు ముక్కలుగా ఉండే గోడ రక్షణ ఎలా ఇవ్వగలదు? రక్షణ ఇవ్వడం అటుంచి, అసలు దానికే రక్షణ ఉండదు కదా. నిర్జన బయళ్ళలో ఒంటిగా నిలబడి ఉండే ఇలాంటి గోడ భాగాల్ని ఆ తండాల వాళ్ళు చాలా సులువుగా ఎన్నిసార్లు కట్టినా కూల్చేయగలరు, పైగా ఈ గోడ నిర్మాణం కలగజేసిన ఆందోళనతో ఆ తండాలవాళ్ళు చాలా వేగంగా, మిడతదండుల్లా, తమ విడిదుల్ని ఒకచోట నుంచి ఒకచోటికి మారుస్తూనే వుండేవారు, దాంతో గోడ కట్టిన మాకన్నా కూడా బహుశా వీళ్ళకే దాని ఆనుపానుల పట్ల ఖచ్చితమైన అవగాహన ఉండేదేమో అనిపించేది. అయినప్పటికీ ఈ నిర్మాణానికి ఈ పద్ధతి తప్ప మరోటి అనుసరించే వీల్లేదనిపిస్తుంది. ఎందుకో తెలియాలంటే ముందొకటి అర్థం చేసుకోవాలి: గోడ కట్టింది శతాబ్దాల పాటు నిలిచి రక్షణగా ఉండటానికి; కాబట్టి కట్టుబడిలో నిశితమైన శ్రద్ధా, శతాబ్దాల తరబడి మానవాళి సముపార్జించిన నిర్మాణ కౌశలాన్నంతా వాడటమూ, నిర్మించేవారిలో మొక్కవోని దీక్షా – ఇవన్నీ ఈ పనికి తప్పనిసరి అర్హతలు. శారీరకమైన పనులకు మామూలు శ్రామికులు – డబ్బులిస్తే పనిచేసే మగవాళ్ళూ, ఆడవాళ్ళూ, చిన్నపిల్లలూ – సరిపోతారు; కానీ వీళ్ళలో ఏ నలుగురు శ్రామికుల్ని పర్యవేక్షించాలన్నా నిర్మాణశాస్త్రం లోతుగా తెలిసిన నిపుణుడు ఒకడు కావాలి, అతను పనికి పూర్తిగా అంకితమైపోయి అందులో తన హృదయాన్ని చొప్పించగలవాడై ఉండాలి. పని స్థాయి ఒక్కో మెట్టూ పెరిగే కొద్దీ దాని పట్ల బాధ్యతా పెరగాలి. అలాంటి వ్యక్తులు ఉన్నారు కూడా – గోడ నిర్మాణానికి అవసరమైనంత ఇబ్బడిముబ్బడిగా లేకపోయినా, పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.

ఈ పనేం అంత అల్లాటప్పాగా తలపెట్టింది కాదు. మొదటి రాయి ఇంకా పేర్చక మునుపు, యాభై ఏళ్ళ క్రితం నుంచే, మొత్తం చైనాలో ఏ ప్రాంతాల చుట్టూ గోడ కట్టబడుతుందో ఆ ప్రాంతాలన్నింటిలోనూ నిర్మాణ కళని, అందులో మళ్ళా ముఖ్యంగా తాపీ పనిని, ఒక ముఖ్యమైన విజ్ఞాన శాస్త్రంగా ప్రకటించారు, దీనితో అంతో ఇంతో సంబంధమున్న ఇతర శాస్త్రాలే గుర్తింపుకు నోచుకున్నాయి. నాకు ఇప్పటికీ జ్ఞాపకమే, బాగా చిన్నపిల్లలం, నడక నేర్చి కూడా ఎంతో కాలమై ఉండదు, మా గురువుగారి పెరడులో ఉన్నాం, గులకరాళ్ళతో ఒక గోడ కట్టమని ఆదేశించారు; మా తంటాలు మేం పడ్డాకా, గురువుగారు తన అంగ వస్త్రాన్ని నడుం చుట్టూ బిగించి, ఒక్క ఉదుటున ఆ గోడ మీదికి దూసుకెళ్ళారు, అది కూలిపోక ఏం చేస్తుంది, అప్పుడిక మా పేలవమైన కట్టుబడికి ఆయన మమ్మల్ని ఎన్ని తిట్లు తిట్టారంటే, మేం ఏడ్చుకుంటూ తలోదిక్కూ పరిగెత్తి మా అమ్మానాన్నల వళ్లో తలదాచుకున్నాం. చిన్న సంఘటనే, కానీ ఆ కాలపు స్వభావానికి అద్దం పట్టే సంఘటన.

ఇరవయ్యేళ్ళ వయస్సులో నేను తుది పరీక్షల్లో ఉత్తీర్ణుణ్ణయిన సమయంలోనే గోడ నిర్మాణం మొదలవటం నా అదృష్టమనే చెప్పాలి. అదృష్టమని ఎందుకంటున్నానంటే, నాకన్నా ముందు ఉత్తీర్ణులయిన చాలామంది యువకులు, తమకు అందుబాటులో ఉన్న విజ్ఞానమంతా సముపార్జించి కూడా, దాన్ని వాడేందుకు తగిన తావు ఏదీ లేక, తమ మెదడులో అద్భుతమైన నిర్మాణ రచనల్ని మోసుకుంటూ, ఏళ్ళ తరబడి నిష్పలంగా తిరిగేవారు, వేలాదిమంది చివరకు అలాగే నిస్పృహలో కూరుకుపోయారు. కానీ ఒకసారి గోడ పని ప్రారంభమయ్యాకా వీళ్ళలో పర్యవేక్షకులుగా నియమితులైన వారు మాత్రం, తమకు ఇచ్చింది ఎంత దిగువ హోదా ఐనా సరే, తాము అందుకు అచ్చంగా అర్హులమేనని నిరూపించుకున్నారు. ఈ తాపీమేస్త్రీలు గోడ నిర్మాణం గురించి ఆలోచించటం ఎప్పుడూ ఆపలేదు, పునాది రాయి నేలలో పడిన క్షణం నుంచీ గోడలో తామూ ఒక భాగమైపోయినట్టు భావించారు. ఇలాంటి తాపీమేస్త్రీల్లో తమ విధుల్ని అత్యంత క్షుణ్ణంగా నిర్వహించాలన్న కోరికతో పాటూ, గోడ వెంటనే పూర్తయి తమ కళ్ళ ముందు నిలబడితే చూడాలన్న అసహనం కూడా ఉండేది. అదే వాళ్ళని ముందుకు ఉసిగొల్పేది. ఇటు శ్రామికుల్లో ఇలాంటి అసహనం ఉండేది కాదు, ఎందుకంటే వాళ్ళని ముందుకు ఉసిగొల్పేది వాళ్ళ కూలి డబ్బులే. అలాగే అటు పైస్థాయి పర్యవేక్షకులూ, మధ్యస్థాయి పర్యవేక్షకులూ కూడా, గోడ ఏయేచోట్ల ఎంతెంత పూర్తవుతోందో గ్రహించగలిగే హోదాలో ఉన్నవాళ్ళు గనుక, తమ ఉత్సాహాన్నీ విశ్వాసాన్నీ నిలబెట్టుకోగలిగేవారు. కానీ దిగువ స్థాయి పర్యవేక్షకులున్నారే, వీళ్ళు తాము నిర్వర్తిస్తున్న నేలబారు విధులకు మించిన మేధస్సు కలవాళ్ళు, వీళ్ళలో ఉత్సాహం చచ్చిపోకుండా ఉండటానికి వేరే పద్ధతి పాటించాల్సి వచ్చింది. ఎందుకంటే మరి ఇలాంటి వాళ్ళు, తమ ఇళ్ళకు వందలాది మైళ్ళ దూరంలో, నిర్జన కొండ ప్రాంతాల్లో, నెలల తరబడి, ఒక్కోసారి ఏళ్ళ తరబడి, ఇటుక మీద ఇటుక పేర్చుకుంటూ ఎన్నాళ్ళని పని చేయగలరు; ఏ ఆశా లేని ఈ కఠోర ప్రయాస వాళ్ళని నిస్పృహ వైపుకు నెడుతుంది, అంతకన్నా ముఖ్యంగా వాళ్ళ పనితీరుని కుంటుపడేలా చేస్తుంది. అదిగో అందుకే, ఇలా గోడని విడి భాగాలుగా కట్టే పద్ధతి ఎన్నుకోబడింది. ఐదొందల గజాల గోడ పూర్తి కావటానికి ఉజ్జాయింపుగా ఐదేళ్ళు పట్టేది; కానీ అప్పటికే పర్యవేక్షకులు తీవ్రంగా అలసిపోయి, ఇక తమ మీదా, గోడ మీదా, మొత్తం ప్రపంచ మీదే విశ్వాసం లేని స్థితిలో ఉండేవారు. అందుకే, వాళ్ళు రెండు గోడలు కలిపి వేయి గజాల గోడ పూర్తి చేసిన ఆనంద సంబరాల్లో ఇంకా మునిగితేలుతుండగానే, వాళ్ళని వేరే ఎక్కడో సుదూర ప్రాంతానికి బదిలీ చేస్సేవారు. అక్కడికి వెళ్ళే ప్రయాణమార్గంలో వాళ్ళు అక్కడక్కడా పూర్తయిన గోడ భాగాల్ని చూస్తారు, అధిష్టానం విడిది చేసిన శిబిరాల మీదుగా వెళ్తారు, అక్కడ వాళ్ళకి గౌరవ పతకాలు ప్రదానం చేయబడతాయి, దేశం నలుమూలల నుంచీ ఉత్సాహంగా తరలి వస్తున్న కొత్త శ్రామిక బృందాలు వాళ్ళకు ఎదురవుతాయి, గోడకి ఊతంగా నిలబెట్టేందుకు కావాల్సిన కలప కోసం అడవులు కొట్టివేయడాన్ని చూస్తారు, గోడకి ఇటుక రాళ్ళను సరఫరా చేయటానికి కొండలు పిండవటం చూస్తారు, గోడ విజయవంతంగా పూర్తి కావాలని మొక్కుకుంటూ పుణ్యక్షేత్రాల్లో భక్తులు చేస్తున్న ప్రార్థనల్ని వింటారు. ఇదంతా వాళ్ళ అసహనాన్ని చల్లార్చేది. మార్గమధ్యంలో ఇంటి దగ్గర తీసుకున్న కొద్ది కాలపు విరామమూ వాళ్ళని మరింత కార్యోన్ముఖుల్ని చేసేది; తాము గోడ గురించి చెప్తున్నపుడు వినటంలో ఊరివాళ్ళు చూపించే శ్రద్ధాసక్తులూ, అక్కడ నింపాదిగా బతికేసే ప్రతీ మామూలు పౌరుడూ ఏదో ఒక రోజు గోడ పూర్తయి తీరుతుందంటూ వ్యక్తం చేసే ఆశాభావం – ఇవన్నీ వాళ్ళ గుండె తంత్రుల్ని మీటి వారిలో నూతనోత్తేజాన్ని నింపేవి. అప్పుడిక వాళ్ళు, నిరంతరం ఆశతో వెలిగిపోయే పసిపిల్లల్లా, తమ ఇళ్ళకు వీడ్కోలు పలికేవారు; దేశమంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్న గోడ కోసం మళ్ళీ తమ వంతు పని మొదలుపెట్టాలన్న కోరిక వాళ్ళను నిలవనిచ్చేది కాదు. బయల్దేరాల్సిన సమయం కన్నా ముందే బయల్దేరిపోయేవారు; వాళ్ళను సాగనంపటానికి ఊరు ఊరంతా చాలా దూరం వెంట నడిచేది. ఎగురుతున్న జండాలతో, పతాకాలతో రోడ్లన్నీ కిటకిటలాడేవి; వాళ్ళకు తమ దేశం ఎంత గొప్పదో, సుసంపన్నమైనదో, అందమైనదో, ప్రేమాస్పదమైనదో ఇదివరకెన్నడూ లేనంతగా అర్థమయ్యేది. తోటి దేశీయుడు ప్రతీ ఒక్కడూ తమ సోదరుడే, వాళ్ళ రక్షణ కోసమే తామీ గోడ కడుతున్నారు, దీనికి వాళ్ళు జీవితాంతం కృతజ్ఞులై ఉంటారు. ఐక్యతే ఐక్యత! చెట్టాపట్టాలేసుకుని, అంతా ఒక సమూహంగా కలిసి కదులుతారు, వారి రక్త ప్రసరణ ఇక తమ దేహాలకు మాత్రమే పరిమితమై ఉండదు, అంతులేని చైనా విస్తారాల గూండా తీయగా పారుతూ, తిరిగి తిరిగి వస్తూంటుంది.

ఇదంతా దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే, గోడని విడి భాగాలుగా కట్టడంలోని ఆంతర్యం తేలిగ్గానే బోధపడుతుంది. ఇవే గాక మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఈ ఒక్క విషయం మీదే నేను ఇంత సేపు వివరణ ఇవ్వడంలో కూడా పెద్ద వింతేమీ లేదు. పైకి అంత ముఖ్యమైన విషయంగా కనిపించకపోయినా, నిజానికి గోడ నిర్మాణంలో ఇదో కీలకమైన అంశం. ఆనాటి ఆలోచనల్నీ అనుభవాల్నీ ఇప్పుడు అర్థమయ్యేలా చేయాలంటే, ఈ విషయంపై ఎంత మాట్లాడినా సరిపోదు.

మొదటగా చెప్పాల్సిందేమిటంటే, ఆ రోజుల్లో, బేబెల్ బురుజుకు[1] ఏ మాత్రం తీసిపోని నిర్మాణాలు చేపట్టబడేవి, కానీ దైవానుగ్రహం విషయంలో మాత్రం ఆ నిర్మాణానికి పట్టిన గతి వీటికి పట్ట లేదు. ఇదెందుకు చెప్తున్నానంటే, గోడ నిర్మాణం మొదలైన తొలి రోజుల్లో ఒక పండితుడు తాను రాసిన పుస్తకంలో ఈ పోలికను ప్రస్తావించాడు. అందులో ఆయన ఏమంటాడంటే, బేబెల్ బురుజు తన లక్ష్యాన్ని సాధించలేకపోవటానికి కారణం అందరూ అనుకునేది కాదట, ఇంకోలా చెప్పాలంటే, అందరికీ తెలిసిన కారణాల్లో అసలు కారణం లేదుట. ఆయన చూపించిన ఋజువులు పురాణాల పైనా, పుక్కిటి కథలపైనా ఆధారపడినవి కావట; ఆయన స్వయంగా ఆ స్థలానికి వెళ్ళి మరీ పరిశోధించాడట, తద్వారా బేబెల్ బురుజు కూలిపోవటానికి అసలు కారణం దానికి వేసిన పునాదులు బలహీనంగా ఉండటమే అని తేల్చి చెప్పాడు. ఈ విషయంలో మాత్రం ప్రాచీన కాలంతో పోలిస్తే మా కాలం ఎన్నోరెట్లు మెరుగైనదనే చెప్పాలి. మా కాలంలో దాదాపు చదువుకున్న ప్రతీ వాడూ వృత్తి రీత్యా తాపీమేస్త్రీనే, పునాదులు వేయటంలో ఆరితేరినవాడే. అయితే ఆ పండితుడు నిరూపించదల్చుకున్నది ఇది కాదు; బేబెల్ బురుజు కొత్తగా మరోసారి కట్టడానికి వీలుకల్పించేలా మానవాళి చరిత్రలో తొలిసారిగా ఒక పటిష్టమైన పునాది ఏర్పాటుకానుందనీ, అది సాక్షాత్తూ మా చైనా గోడే అనీ అంటాడాయన. ముందు గోడ నిర్మించాకా, దాన్ని పునాదిగా వాడుకుంటూ బురుజు నిర్మించవచ్చట. ఆ రోజుల్లో ఎవరి చేతుల్లో చూసినా ఆయన పుస్తకమే కనపడేది, కానీ నా మట్టుకు నాకు ఈవేళ క్కూడా ఆయన బురుజుని ఎలా కట్టాలనుకున్నాడో అర్థం కాదు. అసలు వలయాకారంలోనే లేని ఈ గోడ, మహ అయితే పావు వలయమో, అర్థవలయమో కాగల ఈ గోడ, ఒక బురుజుకి ఎలా పునాది కాగలదు? బహుశా ఏదో వేదాంతార్థంలో ఆ మాట అని ఉంటాడనుకోవచ్చు. మరి అలాగైతే, కళ్ళ ముందు ఖచ్చితమైన వాస్తవంగా కనిపించే గోడ నిర్మించడం ఎందుకు, దానికి గాను లెక్కలేనంతమంది జనం జీవితాంతం శ్రమించడం ఎందుకు? పైగా ఆ పుస్తకంలో పక్కా నిర్మాణపటాలు కూడా గీసి పెట్టి ఉండేవి (కొంత అస్పష్టమైన ప్రణాళికలే అనుకోండీ), ఈ బృహత్ నూతన కార్యక్రమానికి జనశక్తిని ఎలా చైతన్యవంతం చేయాలన్న దానిపై సవివరమైన ప్రతిపాదనలు కూడా ఉండేవి.

అప్పట్లో జనం బుర్రలు ఎన్నో చిత్రమైన ఆలోచనలతో కిక్కిరిసి ఉండేవి – అందుకు ఈ పండితుడి పుస్తకం ఒక ఉదాహరణ మాత్రమే – ఒక ఉమ్మడి లక్ష్యం కోసం అంతా కలిసికట్టుగా తమ బలాబలాల్ని సమీకరించుకునే ప్రయత్నంలో ఉండటమే దీనికి కారణం కాబోలు. మనిషి స్వభావం చంచలమైనది, సుడిగాలిలా అస్థిరమైనది, అది ఏ హద్దుల్నీ అంగీకరించదు; తనను తానే బంధించుకుంటుంది, మరుక్షణం ఆ బంధనాల్ని తెంపుకోవటానికి పిచ్చిగా గింజుకుంటుంది, ఆ ప్రయత్నంలో అన్నింటినీ విచ్ఛిన్నం చేస్తుంది, గోడల్నీ, బంధనాల్ని, ఆఖరుకు తనని తాను కూడా.

అధిష్టానం గోడని ఇలా విడిభాగాలుగా నిర్మించే పద్ధతిని ఎన్నుకున్నప్పుడు అసలు గోడ నిర్మాణాన్నే ప్రశ్నార్థకం చేసే ఇలాంటి అంశాల్ని కూడా పరిగణనలోకి తీసుకునే ఉంటుంది. అధిష్టానం మాకు – నేను చాలామంది తరపున మాట్లాడుతున్నాను – జారీ చేసిన ఆదేశాల్ని జాగ్రత్తగా పరిశీలించిన మీదట అర్థమైంది ఏమిటంటే, అధిష్టానం అనేదే ఒకటి లేకపోయుంటే మా పుస్తక పరిజ్ఞానమూ, మా మానవ మేధస్సూ అంతా కలిసినా కూడా ఓ పెద్ద ప్రణాళికలో అంతర్భాగమైన మా ఈ చిరుకార్యాలను నెరవేర్చటానికి ఎందుకూ పనికివచ్చేవి కావు. ఆ అధిష్టాన కార్యాలయంలో – అది ఎక్కడ ఉందో, అందులో ఎవరుంటారో నేను అడిగిన వారెవ్వరికీ తెలియదు – ఆ కార్యాలయంలో మానవాళి అన్ని ఆలోచనలూ - లక్ష్యాలూ, కోరికలూ - నెరవేరటాలూ అన్నీ ఎదురెదురు దిశల్లో పరిభ్రమిస్తుంటాయనిపిస్తుంది. అక్కడి అధికారులు నిర్మాణ పటాలు గీస్తున్నప్పుడు కిటికీల్లోంచి ప్రసరించే దైవిక ప్రపంచాల వెలుగులు వారి చేతులపై పడి ప్రకాశిస్తుంటాయనిపిస్తుంది.

మరి ఇంతటి శక్తివంతమైన అధిష్టానం నిజంగా తల్చుకుంటే గోడ నిర్విరామంగా కట్టుకుపోయే పద్ధతిలో ఎదురయ్యే సమస్యల్ని కూడా ఎదుర్కోగలదని ఏ తటస్థ పరిశీలకుడైనా గ్రహించగలడు. దీన్నిబట్టి గోడ విడి భాగాలుగా కట్టుకుపోయే పద్ధతిని అధిష్టానం ఉద్దేశపూర్వకంగా ఎంచుకుందన్న తీర్మానానికి రావాల్సి వస్తుంది. కానీ ఈ విడిభాగాలుగా కట్టే పద్ధతి కేవలం ఆపద్ధర్మం మాత్రమే, కాబట్టి తగినది కాదు. దీన్నిబట్టి అధిష్టానం తగని పద్ధతినే ఎంపిక చేసుకుందన్న తీర్మానానికి రావాల్సి వస్తుంది. చిత్రమైన తీర్మానమే, కాదనను. కానీ ఒక రకంగా చూస్తే దీని పక్షానా కొంత సమర్థన ఉంది. ఇప్పుడైతే దాన్ని చర్చించుకోవటంలో పెద్ద ప్రమాదమేమీ లేదు. ఒకప్పుడు మాత్రం పరిస్థితి వేరేలే ఉండేది. ఆ రోజుల్లో చాలామంది, జ్ఞానులైనవాళ్లు కూడా, ఒక సూత్రాన్ని నమ్మేవారు. అదేమిటంటే: నీ శక్తి మేరా అధిష్టానపు ఆదేశాల్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు, కానీ ఒక స్థాయి వరకూ మాత్రమే; దాన్ని దాటి ఆలోచించకు. ఈ సూత్రాన్ని ఒక పోలికతో కూడా ఉదహరించేవారు: దాన్ని దాటి ఆలోచించకు, అదేదో ప్రమాదమని కాదు; ప్రమాదమని చెప్పటానికి ఏ ఋజువూ లేదు. అయినా ఏది ప్రమాదమూ, ఏది కాదూ అన్నది కాదిక్కడ విషయం. వసంతకాలంలో నది ఎలా ఉంటుందో గుర్తు తెచ్చుకో. దాని మట్టమూ వడీ పెరుగుతుంది, చెరివైపూ ఉన్న ఒడ్డుల్ని సారవంతం చేస్తూ పారుతుంది, అయినా సముద్రాన్ని చేరే వరకూ తన దిశని ఖచ్చితంగా నిలుపుకుంటుంది, అర్హమైన అతిథి గనుక అక్కడ దానికి బ్రహ్మాండమైన స్వాగతం అందుతుంది. – ఇదిగో అధిష్టానపు ఆదేశాలపై నీ పరిశోధనల్ని ఈ మాత్రం దాకా అనుమతించుకోవచ్చు. – కానీ ఆ తర్వాత నది మట్టం ఒడ్డుల్ని ముంచెత్తేంతగా పెరుగుతుంది, దాని రూపాన్నీ పరిధుల్నీ కోల్పోతుంది, ప్రవాహ వడి తగ్గుతుంది, తన గమ్యాన్ని మర్చిపోయి ఊళ్లలోనే చిన్న చిన్న చెరువుల్ని ఏర్పరుస్తుంది, పొలాల్ని నాశనం చేస్తుంది, అయినా తన ఈ నూతన విస్తృతిని ఎక్కువకాలం నిలుపుకోలేదు, చివరికి తన ఒడ్డుల మధ్యకు వచ్చి ఒదగక తప్పదు, ఆ తరవాత వేసవి ముదిరాక పేలవంగా ఎండిపోకా తప్పదు. – ఇదిగో అధిష్టానపు ఆదేశాలపై నీ పరిశోధనల్ని మరీ ఇంత దాకా అనుమతించుకోవటం మంచిది కాదు.

గోడ కడుతున్నన్నాళ్లూ ఈ పోలికకు చాలా ప్రాముఖ్యతా ఔచిత్యమూ ఉన్నా, నా ప్రస్తుత వ్యాసం విషయంలో దాని అన్వయం చాలా పరిమితం మాత్రమే. నాది పూర్తిగా చారిత్రక దృష్టిగల పరిశోధన; ఎప్పుడో మాయమైన మబ్బుల్లోంచి ఇక ఇప్పుడు ఏ పిడుగులూ వచ్చిపడవు, కాబట్టి అప్పుటి ప్రజలు ఈ విడిభాగాల పద్ధతి గురించి ఏ వివరణలతో సరిపుచ్చుకున్నారో వాటిని దాటి నేను ముందుకు వెళ్లే వీలుంది. నా ఆలోచనాశక్తి నాపై విధించే హద్దులు ఎన్నో ఉండనే ఉన్నాయి, కానీ ప్రయాణించాల్సిన విస్తారాలు మున్ముందు ఎన్నో ఉన్నాయి.

ఎవరి నుంచి ఈ గోడ మాకు రక్షణ ఇవ్వాలి? ఉత్తరం వైపున్న తండాల నుంచి. ఇప్పుడు నేను వచ్చింది దక్షిణ చైనా నుంచి. అక్కడ ఏ ఉత్తరాదివాళ్లూ మమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు. వాళ్ల గురించి మేము ప్రాచీనగ్రంథాల్లో మాత్రమే చదువుకుంటాం; స్వభావానుగుణంగా వారు సాగించే అకృత్యాలు చదివి మా ప్రశాంతమైన లోగిళ్లలో నిట్టూర్పులు విడుస్తాం. చిత్రకారులు ఈ పాపాత్ముల్ని చాలా వాస్తవికరీతిలో చిత్రిస్తారు; తెరిచిన నోళ్లూ, పదునైన పళ్లున్న దవడలూ, వాటితో చీల్చిచెండాడబోయే తమ బాధితుల రక్తపు రుచిని ఆశిస్తూ ముందే మూతలుపడ్డ కళ్లూ ఇవన్నీ చూస్తాం. మా పిల్లలు అల్లరి చేస్తే వాళ్లకు ఈ బొమ్మలు చూపిస్తాం, అంతే, వాళ్లు వెంటనే ఏడ్చుకుంటూ మా సందిళ్లలో దూరిపోతారు. కానీ ఇంతకన్నా ఈ ఉత్తరాదివాళ్ల గురించి మాకింకేమీ తెలియదు. వాళ్లని మేం ఎప్పుడూ చూడలేదు, మా ఊళ్లలోనే ఉండిపోతే ఎప్పటికీ చూడబోము కూడా, ఒకవేళ వాళ్లు తమ అడవి గుర్రాలెక్కి శక్తి మేరా స్వారీ చేస్తూ ఇటు వైపు దూసుకువచ్చినా కూడా ఈ అంతుపొంతూ లేని విస్తారాలు దాటి మమ్మల్ని ఎప్పటికీ చేరుకోలేరు, వాళ్ల ప్రయాణం గాల్లోనే ముగిసిపోతుంది.

ఇలాంటప్పుడు మరి మేం ఎందుకు మా ఇళ్లు వదిలిపెట్టి వచ్చాం? వంతెనల కింద పారే ఏరునీ, మా తల్లుల్నీ తండ్రుల్నీ, ఏడ్చే మా భార్యల్నీ, మా సంరక్షణ అవసరమైన బిడ్డల్నీ వదిలిపెట్టి, ఎందుకు సుదూరమైన నగరంలో శిక్షణకు బయల్దేరాం, ఎందుకు మా ఆలోచనల్ని ఇంకా దూరంలో ఉత్తరాదిన ఉన్న గోడ మీదకు ఎక్కుపెట్టాం? ఎందుకు? అధిష్టానానికి ఈ ప్రశ్న. వాళ్లకు మేం తెలుసు. పెద్ద పెద్ద ఆందోళనల్లో నిమగ్నమై ఉన్న మా నాయకులకు మా గురించి తెలుసు, మా చిరు ప్రయత్నాలు తెలుసు, మేము మా చిన్న పాకల్లో గుమిగూడి కూర్చోవటం చూస్తారు, చుట్టూ కుటుంబం కూర్చొని ఉండగా ఇంటి పెద్ద వల్లించే ప్రార్థనల్ని ఆమోదించటమో తిరస్కరించటమో చేస్తారు. అధిష్టానం గురించి ఇలాంటి ఆలోచనల్ని వెల్లడించటానికి నాకు అనుమతి ఉందో లేదో తెలియదు, ఒకవేళ ఉంటే మాత్రం నా అభిప్రాయంలో అధిష్టానం అనేది చాలా కాలం నుంచే ఉందని చెప్పాలి, అదేదో ఇప్పటికిప్పుడు కొలువుదీరి ఎవరి పగటికలనో చర్చించి అంతే హడావుడిగా సభ ముగించి అక్కడ తీసుకున్న నిర్ణయాన్ని – ఆ నిర్ణయం నిన్న తమ పట్ల దయ చూపించిన దేవుళ్ల ముందు ఒక చిన్న దీపం వెలిగించటం మాత్రమే అయినా సరే, దాన్ని – అమలు చేయటానికి అదే రోజు రాత్రి ప్రజల్ని తమ పడకల్లోంచి లేపి బెత్తాలతో చీకట్లోకి తరిమింది కాదు. అధిష్టానం అనాదిగా నుంచీ ఉంటున్నదే అనీ, గోడ కట్టాలన్న నిర్ణయమూ అంతేననీ నేన్నమ్ముతాను. పాపం ఇది తెలియక తామే దానికి కారణమనుకునే ఉత్తరాదివాళ్లు! ఇది తెలియక తానే దీనికి ఆదేశమిచ్చాననుకునే మహరాజు! గోడ కట్టే మాకు తెలుసు అది నిజం కాదని, మేం నోరు మెదపం.

*

గోడ నిర్మాణం జరుగుతున్నప్పటి నుంచి ఈ రోజు దాకా కూడా నేను జాతుల తులనాత్మక చరిత్రను అధ్యయనం చేయటంలో నిమగ్నమై ఉన్నాను – ఈ పద్ధతి ద్వారా మాత్రమే కొన్ని ప్రశ్నల్ని మూలాల దాకా తరిచిచూడగలం – అలా నేను తెలుసుకున్నదేమంటే మా చైనీయులకు ఉన్న ప్రజా, రాచరికపు వ్యవస్థలు కొన్ని తమ పారదర్శకతలో తిరుగులేనివైతే, మరికొన్ని అస్పష్టతలో తిరుగులేనివి. ఈ స్థితికి, ముఖ్యంగా రెండో స్థితికి కారణమేంటో వెతకాలన్న కోరిక నన్ను ఎప్పట్నించో పట్టిపీడించేది, ఇప్పటికీను. అసలు ఈ గోడ నిర్మాణమే దీంతో ముడిపడి ఉంది.

అసలు మాకున్న అస్పష్టమైన వ్యవస్థల్లో సాక్షాత్తూ మా రాచరికం కూడా ఒకటి. బహుశా పెకింగ్ నగరంలో, రాజప్రాసాదం పరిసరాల్లో ఈ విషయమై కాస్త స్పష్టత ఉండొచ్చేమో, అందులో కూడా వాస్తవం కన్నా భ్రమల పాళ్లే ఎక్కువ. ఉన్నతస్థాయి విద్యాలయాల్లో రాజనీతిశాస్త్రం, చరిత్ర బోధించే ఉపాధ్యాయులు తమకు స్పష్టమైన అవగాహన ఉందనీ, దాన్ని విద్యార్థులకు ధారపోయగలమనీ నమ్మబలుకుతారు. అలాగే కిందిస్థాయి విద్యాలయాల్లోకి ఒక్కో మెట్టూ దిగే కొద్దీ అక్కడి ఉపాధ్యాయులూ విద్యార్థులూ తమ అవగాహన పట్ల చాలా ధీమాగా ఉండటం గమనించవచ్చు, కానీ అక్కడ మిగిలిందల్లా వందలేళ్లుగా ప్రజల మనసుల్లోకి నాటబడిన కొన్ని సూత్రాల చుట్టూ ఆకాశాన్నంటుతూ పేరుకుపోయిన డొల్ల విద్యే, ఆ సూత్రాల్లోని మూలసత్యం ఏమీ చెడలేదు, కానీ దాన్ని గుర్తించలేనంతగా చుట్టూ అయోమయపు పొగమంచు కమ్మేసింది.

కానీ నిజానికి ఈ రాచరికానికి సంబంధించిన ప్రశ్నను ఎవరినైనా అడగాలంటే ముందు అది సామాన్య ప్రజలనే అడగాలి, ఆ వ్యవస్థ అంతిమంగా ఆధారపడేది ప్రజల మీదే కదా. ఐతే ఇక్కడ ఒకటి ఒప్పుకుని తీరాలి, నేను నికరంగా ఏమైనా మాట్లాడగలిగేది నా స్వస్థలం గురించే. అక్కడ, ఏడాది మొత్తాన్నీ అందమైన వైవిధ్యంతో నింపివేసే ప్రకృతిదేవతల క్రతువుల్నీ మినహాయిస్తే, మేం అనునిత్యం ఆలోచించేది ఒక్క రాజు గురించే. కానీ వర్తమానంలో ఉన్న రాజు గురించి కాదు; ఎందుకంటే అతను ఎవరో ఏమిటో మాకు స్పష్టంగా తెలిస్తే కదా. మేం ఈ విషయమై ఏ సమాచారం దొరుకుతుందా అని నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నా – ఈ ఒక్క విషయమే మాకు ఆసక్తి కలిగించేది – చిత్రంగా ఏ సమాచారమూ దొరకదు, దేశమంతా విస్తారంగా ప్రయాణించిన యాత్రీకుల నుంచి కానీండి, ఇరుగు పొరుగు ఊళ్ల నుంచి కానీండి, లేదా కేవలం మా దరిదాపుల్లోని కాలవలే గాక పవిత్ర నదులెన్నింటి మీదో ప్రయాణం చేసిన నావికుల నుంచి కానీండి, చాలా విషయాలైతే తెలుస్తాయి, కానీ ఖచ్చితంగా ఏదీ నిర్థారణ కాదు.

 మా దేశం ఎంత విస్తారమైందంటే ఏ పోలికా దానికి న్యాయం చేయలేదు, స్వర్గాలు కూడా దాని వైశాల్యం ముందు చిన్నబోతాయి – అందులో పెకింగ్ నగరం ఒక చిన్న చుక్క లాంటిది మాత్రమే, అందులో రాజప్రాసాదం ఇంకా చిన్న చుక్క. అవటానికైతే రాజపదవి ప్రపంచంలోని అధికార శ్రేణులన్నింటిలోకీ గొప్పదని ఒప్పుకోక తప్పదు. కానీ ప్రస్తుతం ఉన్న రాజు, మాలాంటి ఒక మనిషి, మాలాగే దివాను మీద నడుం వాలుస్తాడు, అది విశాలంగా ఉండొచ్చు లేదా చాలా ఇరుకైనదీ పొట్టిదీ కూడా కావొచ్చు. మాలాగే ఒక్కోసారి అతను బద్దకంగా వళ్లు విరుచుకుంటాడు, బాగా అలిసిపోతే తన సన్ననైన నోటితో గట్టిగా ఆవలిస్తాడు. అంతకన్నా అతని గురించి ఏం తెలుసుకోగలం – ఇక్కడ వేల మైళ్లకు ఇవతల దక్షిణాన దాదాపు టిబెటన్ పర్వతాలకు దగ్గర్లో ఉన్న వాళ్లం. ఒక వేళ ఏ వార్తన్నా వచ్చినా అది అలలుగా మా దాకా చేరే సరికి ఆలస్యమైపోతుంది, ఎందుకూ పనికిరాకుండా పోతుంది. గొప్ప మేధావులూ, కానీ దుర్భుద్దిపరులూ ఐన కులీనులూ సభికులూ ఎల్లవేళలా రాజు చుట్టూ గుమికూడి ఉంటారు – స్నేహితులనీ సేవకులనీ ముసుగులు వేసుకుని శత్రుత్వంతో కుత్సితత్వంతో ఉంటారు – వాళ్లు రాజ్యాధికారానికి ప్రత్యామ్నాయశక్తులుగా పని చేస్తూ తమ విషం పూసిన బాణాలతో రాజుని గద్దె దింపటానికి అనునిత్యం శ్రమిస్తూంటారు. రాజ్యానికి అంతం లేదు, కానీ రాజు మాత్రం గద్దె నుంచి తడబడి కిందపడుతూనే ఉంటాడు, అవును, వంశాలకు వంశాలే నేలరాలి తమ ఆఖరి శ్వాసను మట్టిలోకి విడుస్తాయి. ఈ సంఘర్షణల గురించీ, యాతనల గురించీ ప్రజలకు ఎప్పటికీ తెలియదు; నగరానికి కొత్తగా వచ్చిన వాళ్లలాగా ప్రజలు బాగా కిక్కిరిసిన ఏ వీధి చివరనో ప్రశాంతంగా నిలబడి వెంటతెచ్చుకున్న చద్దిమూటలు విప్పితింటుంటే, అదే వీధికి ఎగువన చాలా దూరంలో నగరం నడిబొడ్డున ఉన్న సంతలో వాళ్ల రాజుని ఉరితీసే కార్యక్రమం సాగుతూంటుంది.

ఈ పరిస్థితిని ఒక పిట్టకథ బాగా వర్ణిస్తుంది: దాని ప్రకారం రాజు నీకోసం ఒక సందేశం పంపాడు, నీలాంటి అల్ప జీవి కోసం, రాచరికపు సూర్యునికి దూరంగా పోయి దాక్కున్న ఒక నిరర్థక నీడ కోసం; రాజు తన మరణశయ్య మీంచి కేవలం నీకోసమే ఒక సందేశం పంపాడు. అందుకోసం తన వార్తాహరుణ్ణి మంచం పక్కన మోకరిల్లమని ఆదేశించాడు; ఆ సందేశానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడంటే, దాన్ని మళ్లా తిరిగి తన చెవిలో చెప్పించుకున్నాడు. తాను విన్నది సరిగ్గానే ఉందని తలాడించాడు. అవును, తన చివరి క్షణాల్లో చుట్టూ గుమికూడిన వీక్షకుల సాక్షిగా – వారి కోసం అడ్డుగా ఉన్న గోడలన్నీ కూల్చివేయబడ్డాయి, ఆ రాజ్యపు సామంతరాజులెందరో ఎత్తుగా విశాలంగా పైకి లేచిన మెట్ల మీద నిలబడి చూస్తున్నారు – వీరందరి ముందు రాజు తన సందేశాన్ని నీకు పంపాడు. వార్తాహరుడు తక్షణమే బయల్దేరాడు; బలిష్టమైన అలుపులేని మనిషతను; అటు కుడి చేత్తోనూ ఇటు ఎడం చేత్తోనూ గుంపు మధ్య నుంచి దారి తొలుచుకుంటూ ముందుకుసాగాడు; ఎవరైనా అడ్డువస్తే చూపుడు వేలితో తన ఛాతీ వైపు చూపిస్తున్నాడు, అక్కడ ఒక సూర్యపతకం మెరుస్తోంది; వేరే ఏ మనిషికీ వీలుకానంతగా అతనికి దారి సుగమం అవుతోంది. కానీ ఆ సమూహానికి అంతం లేదు; ఎంతకీ తెగదు. ఒక్కసారి శివార్లలోని పచ్చికబయళ్ల దాకా చేరగలిగితే చాలు ఎంత వేగంగానైనా పరిగెత్తవచ్చు; త్వరలోనే నీ తలుపు మీద అతని చేతి వేళ్ల సంగీతం వినపడుతుంది. కానీ దానికి బదులు ఆ సమూహం మధ్య అతను నిష్పలంగా తన శక్తినంతా అవజేసుకుంటున్నాడు. ఇంతాజేసి ఇంకా రాజప్రాసాదపు లోలోపలి గృహాల్లోనే పెనుగులాడుతున్నాడు; ఆ సమూహం అంచుకు ఎప్పటికీ చేరుకోలేడు; ఒకవేళ చేరుకున్నా లాభం లేదు; ఆ తర్వాత సభా భవనాలు దాటాలి; సభాభవనాల తర్వాత రెండో రాజప్రాసాదం దాటాలి; ఆ తర్వాత మళ్లా మెట్లుంటాయి, మళ్లా సభాభవనాలు ఎదురవుతాయి; ఆ తర్వాత ఇంకో ప్రాసాదం; అలాగే వేలసంవత్సరాలు గడిచిపోతాయి; ఒకవేళ ఎట్టకేలకు ఎలాగో ఆఖరు సింహద్వారాన్ని పెల్లగించుకుని బయటపడినా – అది జరగటం దాదాపు అసంభవమనుకో – అతనికి ఎదురుగా రాజధాని పరుచుకుని ఉంటుంది, ప్రపంచానికే కేంద్రమైన రాజధాని, బద్దలయ్యేంతగా కిక్కిరిసిపోతూ పాకిపోయిన రాజధాని. ఒక చనిపోయిన వ్యక్తి పంపిన సందేశం తీసుకుని ఎవ్వరూ దాన్ని దాటలేరు. కానీ నువ్వు మాత్రం చీకట్లు పడుతుండగా నీ కిటికీ దగ్గర కూర్చుని ఆ సందేశం గురించి కలలు కంటావు.

మా ప్రజలు రాజు గురించి ఆలోచించటం అచ్చం ఇలాగే ఇంత ఆశారహితంగానూ ఇంత ఆశావహంగానూ ఉంటుంది. వాళ్లకు ఏ రాజు దిగిపోతున్నాడో తెలియదు, అసలు పాలిస్తున్న రాజవంశం పేరు విషయంలో కూడా అనుమానాలుంటాయి. పాఠశాలల్లో రాజవంశాల గురించీ వారసత్వక్రమం గురించీ తేదీలతో సహా చాలా బోధిస్తారు, అయినా ఎంత అనిశ్చితి వ్యాపించి ఉందంటే పెద్ద పెద్ద పండితులు కూడా ఈ విషయం మీద తర్జనభర్జనలు పడుతూనే ఉంటారు. మా ఊళ్లలో ఎప్పుడో చచ్చిపోయిన రాజులు సింహాసనాలధిరోహిస్తారు, కేవలం మా పాటల్లోనే బతికున్నాడనుకున్న ఇంకొకడు ఇటీవలే ఆస్థాన పూజారి ద్వారా ప్రకటన జారీచేస్తాడు. ఎప్పుడో చరిత్రలో కలిసిపోయిన యుద్ధాలు మాకు కొత్తవి, ఆ కబురు చెప్పటానికి పొరుగింటి ఆసామీ ఆత్రంగా పరిగెత్తుకొస్తాడు. వంచకులైన రాజోద్యోగుల మాయలో పడి దారి తప్పిన రాజుల భార్యలు అధికార దాహంతో, తీవ్రమైన లోభంతో, కట్టలుతెంచుకున్న కామంతో, తమ దుష్కృత్యాలు ప్రతీసారి కొత్తగా చేస్తూనే ఉంటారు. వాళ్లు కాలంలో గతించిపోయే కొద్దీ వాళ్ల కార్యాలు సరికొత్త రంగులద్దబడి మా ముందుకొస్తాయి. ఎప్పుడో వేల ఏళ్ల క్రితం ఒక రాణి తన భర్త రక్తం తాగి చంపేసిన సంగతిని కొత్తగా తెలుసుకుని మా పల్లె బిగ్గరగా గగ్గోలు పెడుతుంది.

అలా మా ప్రజలు చనిపోయిన రాజుల్ని బతికున్నట్టు పరిగణిస్తారు, బతికున్న పాలకుల్ని చనిపోయాడనుకుంటారు. ఒకవేళ ఎప్పుడైనా, అంటే మొత్తం మనిషి జీవితకాలంలో ఎప్పుడో ఒక్కసారి, ఒక రాజాధికారి పల్లెటూళ్లమ్మటా పర్యటన చేస్తూ మా పల్లెకి వచ్చి, ప్రభుత్వం తరపున కొన్ని ప్రకటనలు చేసి, మా పన్నుల జాబితాల్ని తనిఖీ చేసి, పాఠశాల విద్యార్థుల్ని పరీక్షించి, ఇక్కడి పరిస్థితుల గురించి మా ఊరి పూజారినడిగి తెలుసుకుని, తర్వాత, ఇక తన పల్లకీ ఎక్కి వెళ్లిపోబోయే ముందు, హాజరైన ప్రజలందరి ఎదుటా నిలబడి ఈ పర్యటనలో తనకు కలిగిన భావాల్ని గంభీరమైన భాషలో మందలింపుగా ఏకరువుపెడుతున్నప్పుడు – అప్పుడు మా అందరి ముఖాల మీదుగా ఒక చిన్న నవ్వు పాకిపోతుంది, జనం ఒకరివైపొకరు ఓరచూపులు చూసుకుంటారు, అధికారి ఎక్కడ గమనిస్తాడోనని పిల్లల వైపు వంగుతారు. వాళ్లనుకుంటారు, ఎందుకు ఈ అధికారి ఒక చనిపోయిన మనిషి గురించి బతికున్నట్టు మాట్లాడుతున్నాడు, అతనంటున్న రాజు ఎప్పుడో చచ్చిపోయాడు, ఆ రాజవంశం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది, ఈ అధికారి ఊరికే మాతో పరాచికాలాడుతున్నాడు, కానీ మనం అదేం గమనించనట్టుగానే నడుచుకుందాం, లేదంటే ఆయన్ని కించపరిచినట్టవుతుంది. కానీ మనం మాత్రం మన ప్రస్తుత పాలకునికే విధేయులమై ఉందాం, అలావుండకపోతే అది నేరం అవుతుంది. అలాగ, ఆ అధికారి పల్లకీ కదిలివెళిపోగానే, ఎప్పుడో మట్టిలో కలిసిపోయిన బూడిదలోంచి ఒక మూర్తి మా పల్లెకు పాలకునిగా పైకి లేస్తాడు.

అలాగే దేశంలో రేగుతున్న తిరుగుబాట్లూ లేదా సమకాలీన యుద్ధాలూ మా ప్రజలకు ఎంతమాత్రం పట్టవు. నేను వయసులో ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన గుర్తొస్తోంది. మా పొరుగుదే ఐనా చాలా దూరంలో ఉన్న ఒక తాలూకాలో తిరుగుబాటు చెలరేగింది. దానికి కారణం ఏమిటన్నది నాకు అంతగా గుర్తులేదు, అదంత ముఖ్యం కూడా కాదు; అక్కడి ప్రజలు కాస్త ఉద్రిక్త స్వభావులు అవటం మూలాన తరచూ తిరుగుబాట్లు చెలరేగుతూనే ఉంటాయి. సరే విషయానికొస్తే, ఒక రోజు మా తాలూకాలోంచి వెళ్తూన్న ఒక బిచ్చగాడు నా తండ్రి దగ్గరకు వచ్చి తిరుగుబాటుదారులు ప్రచురించిన కరపత్రం ఒకటి ఇచ్చాడు. ఆ రోజు ఏదో వేడుక కావటంతో మా ఇంటి గదులన్నీ అతిథులతో నిండిపోయి ఉన్నాయి, అందరికీ మధ్యలో కూర్చుని పూజారి ఆ పత్రాన్ని పరిశీలించాడు. హఠాత్తుగా అందరూ నవ్వటం మొదలుపెట్టారు, ఆ గందరగోళంలో ఆ పత్రం ఎవరో చింపేశారు, అప్పటికే చాలా బిక్ష దండుకున్న ఆ బిచ్చగాణ్ణి గుద్దులతో తన్నులతో బయటకు నెట్టేశారు, తర్వాత బయట అందమైన వాతావరణాన్ని ఆస్వాదించటానికి అతిథులంతా నిష్క్రమించారు. ఎందుకు? ఆ పొరుగు తాలూకా వాళ్ల యాస కొన్ని అంశాల్లో మా యాసకు చాలా భిన్నంగా ఉంటుంది, ఈ వ్యత్యాసం వాళ్లు రాసే పద్ధతిలో కూడా వ్యక్తమవుతుంది, అది మాకు కాస్త ప్రాచీన భాషలా అనిపిస్తుంది. పూజారి రెండు పేజీలు చదివాడో లేదో మేం ఒక తీర్మానానికి వచ్చేశాం. అదంతా పాత చరిత్ర, ఆ గాయాలు మానిపోయి చాలా కాలమైంది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, ఆ కరపత్రంలోని మాటల్లో అప్పటి వర్తమానపు భయానక పరిస్థితులు విబేధించలేని విధంగా వెల్లడైనా, మేం మాత్రం తలలు అడ్డంగా ఆడిస్తూ వెక్కిరింతగా నవ్వుతూ వినటానికి నిరాకరించాం. వర్తమానాన్ని చెరిపేయటానికి అంత సిద్ధంగా ఉంటారు మాప్రజలు.

ఇలాంటి పరిస్థితుల ఆధారంగా ఒకవేళ ఎవరైనా అసలు మాకు ఒక రాజనేవాడే లేడన్న తీర్మానానికొస్తే, అది మరీ వాస్తవదూరమేం కాదనే చెప్పాలి. ఒకటి మాత్రం వక్కాణించి చెప్తాను: మా దక్షిణాది ప్రజల్ని మించి రాజుకు విశ్వాసపాత్రులుగా ఉండేవాళ్లు బహుశా ఇంకెవరూ ఉండరు, కానీ మా విశ్వాసం వల్ల అతనికి ఏ లాభమూ లేదు. నిజమే, మా ఊరి పొలిమేరల్లో ఒక స్తంభంపై పవిత్రమైన డ్రాగను నిలబడి ఉంటుంది, అది మానవాళి మేల్కొన్న కాలం నుంచీ తన అగ్ని ఊపిరులను నివాళిసూచకంగా పెకింగ్ నగరం వైపు నిశ్వసిస్తూనే ఉంది – కానీ సాక్షాత్తూ ఆ పెకింగ్ నగరమే మాకు ఇంకో గ్రహం కన్నా అపరిచితమైంది. అసలు అలాంటి ఊరు ఉండటం సంభవమేనా? అసలు ఇళ్లు ఒకదాని పక్కన ఇంకొకటి ఉండటం, అవన్నీ కలిసి మా కొండ మీంచి చూస్తే ఎంత మేర కనపడుతుందో అంతకుమించి విస్తరించి ఉండటం సంభవమేనా, ఆ ఇళ్ల మధ్య పగలూ రాత్రన్న తేడాలేకుండా మనుషులు కిక్కిరిసి మసలుకోవటం సాధ్యమేనా? ఇలాంటి నగరం ఉందని నమ్మడం కంటే, ఆ పెకింగూ రాజూ ఒక్కరేననీ వాళ్లు యుగాల పర్యంతం సూర్యుని కింద మందకొడిగా తేలుతూ పోయే మబ్బుశకల్లాంటివారనీ చెప్తే నమ్మడం ఇంకా సులువు.

ఇలాంటి నమ్మకాల ఫలితంగా దక్కే జీవితం మొత్తం మీద చూస్తే స్వేచ్ఛకలదీ హద్దుల్లేనిదీను. అలాగని అనైతికం మాత్రం కాదు; నా ఊళ్ళో నేను గమనించినంతటి స్వచ్ఛమైన నీతినియమాలు నాకు నా ప్రయాణాల్లో ఇంకెక్కడా తారసపడలేదు. కానీ అది సమకాలీన చట్టాలకు బద్ధం కాని జీవితం, పాతకాలం నుంచీ సంక్రమించిన బలప్రయోగ దమనకాండ పద్ధతుల ప్రకారం నడుచుకునే జీవితం.

అలాగని మా తాలూకాలో ఉన్న పదివేల పల్లెటూళ్లలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పను, మా దేశంలో ఉన్న ఐదువందల తాలూకాల్లోనూ ఇంతేనని అసలే చెప్పను. కానీ ఈ విషయమైన నేను చదివిన ఎన్నో రచనల ఆధారంగా, నా స్వీయపరిశీలన ఆధారంగా – ముఖ్యంగా గోడ నిర్మాణం భారీ మానవ వనరులతో ముడిపడింది కావటం మూలాన సునిశితమైన పరిశీలకునికి అక్కడ దాదాపు అన్ని తాలూకాల నుండి వచ్చే మనుషుల మనస్తత్వాల్నీ గ్రహించే వీలు ఉంటుంది – వీటన్నింటి ఆధారంగా, నేను చెప్పగలిగేదేమిటంటే, రాజు పట్ల మా ఊళ్లో ఉన్న ధోరణే దాదాపు అన్ని చోట్లా వ్యాపించి ఉంది. అలాగని ఈ ధోరణిని ఒక సుగుణంగా ఎంచి చెప్పటం లేదు; సుగుణం కానే కాదు. నిజమే, ఒకరకంగా దీనికి బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమే, భూమ్మీదే అత్యంత ప్రాచీనమైన రాజ్యంలో పాలన సాగిస్తూ కూడా అది తన పాలితప్రాంతంలోని మూలమూలలకీ చేరుకునేలా తన అధికారాన్ని అభివృద్ధి చేసుకోవటంలో విఫలమైంది, లేదా అభివృద్ధి చేసుకోవటంలో నిర్లక్ష్యం వహించింది. కానీ మరోలా చూస్తే, ఇటుపక్క ప్రజల్లో కూడా కాస్త నమ్మకలోపమూ, ఊహాశక్తి లోపమూ కన్పిస్తాయి, వాటి కారణంగానే వాళ్లు పెకింగ్ నగరంలోని రాజరికాన్ని జడత్వం నుంచి మేల్కొలిపి దాన్ని ఒక సజీవమైన ప్రత్యక్షమైన వాస్తవంగా తమ హృదయాలకు హత్తుకోలేకపోయారు, ఇప్పటికీ ఆ రాజరికం కోరుకునేదల్లా ఒక్కసారి ఆ హృదయస్పర్శను అనుభవించి గతించిపోవటమే.

కాబట్టి ఈ ధోరణి ఖచ్చితంగా సుగుణం కాదు. కానీ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ లోపాలే మా ప్రజల్ని ఒక్కతాటిపై నిలిపే అతిపెద్ద ప్రభావాలు కూడా; మేం నిలబడిన కాళ్ల కింద నేల కూడా ఇవే అని చెప్పే ధైర్యం చేస్తాను. ఇలాంటప్పుడు ఎక్కడ లోపం ఉందో వెతికి నిర్థారించి చెప్పటమంటే, మా ఆత్మనిబ్బరాన్ని కూలదోయటమే కాదు, అంతకన్నా తీవ్రంగా, మా కాళ్ల కింద నేలని కుదిపేయటమే. ఈ కారణంతోనే ప్రస్తుతానికి ఈ ప్రశ్నల విషయమై ఇంకా ముందుకు వెళ్లి పరిశోధన సాగించటం నాకు ఇష్టం లేదు.

*


[1] బేబెల్ బురుజు (టవర్ ఆఫ్ బేబెల్): బైబిల్ కథ ప్రకారం, మహాప్రళయం తర్వాత మిగిలిన కొందరు మనుషులు బొందితో స్వర్గానికి చేరుకోవాలన్న యావతో భూమ్మీంచి ఆకాశంలోకి ఒక బురుజు నిర్మించటం మొదలుపెట్టారు; దేవుడు ఈ ప్రయత్నాలకు కోపించి, వాటిని భంగపరచటానికి వాళ్ళ భాషల్లో అయోమయం సృష్టించాడు, ఒకరినొకరు అర్థం చేసుకునే వీల్లేకుండా చేశాడు, దాంతో వీళ్ళంతా వేర్వేరు భాషలు గల వాళ్ళుగా భూమ్మీద చెల్లాచెదురయ్యారు, వీళ్ళ ప్రయత్నాలకు గండి పడింది, బురుజు నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. ‘బేబెల్’ అనే పదానికి గ్రీకు అర్థం ‘దేవుని ద్వారం’; హిబ్రూ అర్థం ‘అయోమయపరచటం’.
===

(కినిగె పత్రికలో ప్రచురితం)