June 29, 2014

మూలింటామె గురించీ, నామిని గురించీ…


నామినితో రెండేళ్ల క్రితం ఫోన్లో మాట్లాడినపుడు మాటల్లో ఆయన తన మీద వచ్చిన ఏదో విమర్శను ప్రస్తావిస్తూ, “నన్ను విమర్శించాల్సినేటివి వేరే ఉన్నాయి మెహెరూ. పల్లెటూళ్ళంటే నా కథల్లో ఉన్నట్టు ఎప్పుడూ ఇచ్చకాలే ఉంటాయా, పల్లెటూళ్లో అందరూ మంచి మనుషులే ఉంటారా, పల్లెటూళ్లో క్రూరత్వాలేం జరగవా, మరి అవెప్పుడూ నేను చూపించలేదే, నన్ను ఆ మాట ఎవరూ అడగరే?” అన్నారు. అప్పుడాయన మనసులో ‘మూలింటామె’ ఉందో లేదో నాకు తెలీదు. ‘మూలింటామె’ చదివాకా మాత్రం ఇది ఆ ఎవరూ అడగని ప్రశ్నకు ఆయనిచ్చిన సమాధానం అనిపించింది.

పల్లెటూళ్లు ఒక్కోచోట నిజంగానే చాలా క్రూరంగా ఉంటాయి. మనం మన రొమాంటిక్ మెదళ్లతో ఇక్కడ నగరాల్లోంచి చూస్తూ ఎన్నో సమ్మోహనమైన దృశ్యాల్ని రచించుకుంటామే గానీ, నిజంగా అక్కడికి వెళ్తే కొన్ని అంశాల్లో ఆ మానసికమైన ఉక్కపోతను రెండు రోజులైనా భరించలేము. నీది ఒద్దికైన, పద్ధతి తప్పని జీవితమై, if you can keep up every appearance that’s stipulated through the very air there, అప్పుడు అక్కడ మనటం చాలా సులువు. ఏ మాత్రం తోవ మళ్లిన జీవితమైనా సరే నిన్ను పల్లెటూరితో పోలిస్తే నగరమే ఆదుకుని అక్కున చేర్చుకుంటుంది. అక్కున చేర్చుకోకపోయినా, కనీసం పట్టుకుని పొడవదు. అక్కడి కాంక్రీటు సమూహాల్లో నీకై కేటాయించిన మూల, నీ పట్ల చూపబడే సుఖవంతమైన నిర్లక్ష్యాన్ని వెచ్చగా అనుభవిస్తూ జీవించేయొచ్చు.

ఈ ఏడాది మొదట్లో కినిగె పత్రిక ఇంటర్వ్యూ కోసం నామినికి ఫోన్ చేశాను. అప్పుడే ఆయన “మూలింటామె” పుస్తకం పూర్తి చేసిన సంతోషంలో ఉన్నారు. ఆయన రాసే పద్ధతి అదే పనిగా వేసిన వాక్యం తీయటం తీసిన వాక్యం మళ్లా వేయటంగా ఉండదు. కాబట్టి తాను ఊహించని సంగతేదో జరిగినట్టు సంబరంగా ఉంది గొంతు. తర్వాత రెండు మూడు రోజులకు నా ఈమెయిల్లో ‘మూలింటామె’ పిడిఎఫ్ ఫైలు వచ్చి చేరింది. స్పైరల్ బైండు చేయించి తెచ్చుకుని చదివాను.

“ఒక మంచి శుక్రోరం. సందల గూకతా” ఉండగా కథ మొదలవుతుంది. కథ మొదలయ్యేటప్పటికే మూలింటామె మనవరాలు రూపావొతి మొగుణ్ణీ పిల్లల్నీ వదిలేసి ఒక అరవమాదిగోడితో లేచిపోయి ఉంటుంది. ఆ సంగతి నెమ్మదిగా ఊరంతా పాకుతుంది. కొందరు ఊరోళ్లు కలిసి తిరుపతి వెళ్లి ఆమెను వెనక్కి తీసుకురావాలని చూసినా ఆమె రానంటుంది. దాంతో ఇక ఆమె తల్లి (మూలింటామె కూతురు)తో సహా అందరూ ఆమెను చచ్చిందానిగా జమకట్టేస్తారు. మూలింటామె మాత్రం మనసులోంచి తీసేయలేకపోతుంది. ఆమె ఫోటోను ఎదరపెట్టుకుని మూలింటామె చెప్పుకున్న స్వగతం చదివితీరాలి. సాహిత్యంలో అంత కదిలించే మాటలు అన్ని కొన్ని పేజీల్లో ఎక్కడైనా తగలటం అరుదు.

రెండో భాగం (‘కొన బాగం’)లో మూలింటామె కొడుకు నారాయుడికి మళ్లీ పెళ్ళి జరుగుతుంది. కోడలు వంసత, కానీ లావుగా ఉంటుందని అందరూ పందొసంత అని పిలుస్తారు. ఈ పాత్ర అప్పటికే శిథిల దృశ్యంలా ఉన్న కథలోకి తుఫానులా ప్రవేశిస్తుంది. నవల మొదటి భాగంలో తన పెంపుడు పిల్లులతో పాటు కళ్లెదుటే కనపడిన మూలింటామె పాత్ర ఈ రెండో భాగం వచ్చేసరికి వెనక్కి వెళ్లిపోతుంది. లేచిపోయిన రూపావతికి పక్కా వ్యతిరేకం ఈ పందొసంత పాత్ర. మొగుడి ముందే రంకుమొగుణ్ణి మెంటైన్ చేస్తుంది. కానీ వాడు ఆషామాషీ అరవమాదిగోడు కాక బుల్లెట్ మీద తిరిగే డబ్బులున్న కులమున్న గుడుగుడు చంద్రడు కాబట్టి అందుకు చుట్టూ ఉన్నవాళ్ల చేత శభాష్ అని కూడా అనిపించుకుంటుంది. దీనికి మొగుడు నారాయుడూ అడ్డం చెప్పడు. పందొసంత వచ్చీ రాగానే ఇంటి చుట్టూతా ఉన్న చెట్లు బేరంపెట్టి కొట్టేయిస్తుంది. బంకు తెరుస్తుంది. చిట్టీలేయిస్తుంది, వడ్డీకి డబ్బులిస్తుంది. మొగుడికి తాగుడు నేర్పిస్తుంది. అతని చేత ఎడ్లూ ఎడ్లబండీ అమ్మించి, మోపెడు కొనిపిస్తుంది. పొలం కూడా బేరానికి పెడుతుంది. కానీ పొలం రిజిస్ట్రేషనుకి మూలింటామె సంతకం కావాల్సొస్తుంది. అప్పుడు గానీ ఈ రెండో భాగంలో మూలింటామె పాత్ర మళ్లా మన ఎదుటికి రాదు. ఆమె చేత సంతకం పెట్టించేందుకు బీమారం నుంచి ఆమె అక్క ఎర్రక్క బయల్దేరి వస్తుంది. ఆమె, పందొసంతా కలిసి మూలింటామెకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తారు. ఆమె ససేమిరా అనటంతో ఆమె పెంపుడు పిల్లులకు ఎలుకలమందు పెట్టి చంపేస్తారు. మూలింటామె అట్లే లేచి వెళ్ళి వొడిశాకు కోసుకుని తిని చనిపోతుంది. తర్వాతెపుడో, ఆమెను పూడ్చిన దిబ్బ మీద పడి మనవరాలు రూపావొతి గుండెలు బాదుకుంటూ ఏడవటం చూశామని కొందరంటారు, ఆమె తిరుపతి కొండల మీంచి దూకి చనిపోయిందని కొందరంటారు.

నేను చదవటం మొదలుపెట్టాక మొదటిభాగం అంతా ఒక్క ఊపులో, ఆయన ఎలా ‘ఉమాదం’తో ఆన్చిన పెన్ను పైకెత్తకుండా రాసి ఉంటాడో అలానే, చదివేశాను. ‘సత్యం శివం సుందరం’ అంటారు మనవాళ్లు. సత్యం అందినాక ఇక అదే సౌందర్యం. దాని కోసం వేరే ప్రయత్నం అక్కర్లేదు. రచనలకి సంబంధించి సత్యం అంటే జీవితం, సౌందర్యం అంటే సౌష్టవం. జీవితం నాడి పట్టుకోగలిగాక ఇక దాన్ని రచనలోకి తెచ్చేటపుడు రచనాసౌష్టవం విషయమై ప్రత్యేకించి ప్రయత్నించనక్కర్లేదు. అందుకే ఈ నవల మొదటిభాగం అంతా అలా అప్రయత్నంగానే కుదిరిపోయి ఒక్క వాక్యం కూడా పక్కకు తీయలేనంత సౌష్టవాన్ని అందుకుంది. జీవితం నామిన్ని రాతగాడిగా నియమించుకుని అంతా చెప్పి రాయించుకున్నట్టు సాగిపోయింది. ఇది నా ఒక్కడి అనుభవం మాత్రమే కాదు, నాకు తెలిసిన చాలామంది ఈ పుస్తకం గురించి మాట్లాడినప్పుడు మొదటిభాగంలో ఆపకుండా చదివించే గుణం గురించి కూడా మాట్లాడారు.

రెండోభాగం మాత్రం నాకు అలా సాగిపోలేదు. కాస్త ఇబ్బందిగా అనిపించింది. మొగుడూ భార్య మిండగాడూ అనే ఈక్వేషనూ, దాని చుట్టూ అల్లిన సన్నివేశాలూ దానికేమన్నా కారణమా అని ఆలోచించాను. అదైతే అస్సలు కాదు. ఎందుకంటే మానసికంగా నేను మర్యాదస్తుడ్ని కాదు, మధ్యతరగతివాణ్ణి అంతకంటే కాదు (అలాంటి మనుషులు, సన్నివేశాలు అసంభవమూ కావు). మరి ఏంటి తేడా అని ఆలోచిస్తే బహుశా నేను ఒంటబట్టించుకున్న Flaubertian సూత్రాలు నాకు అడ్డువస్తున్నాయేమో అని తట్టింది.

అదే నామినికి చెప్పాను, “కొన బాగంలో రచయిత సమక్షం తెలుస్తుండీ” అని. ఆయన చొప్పున, “రచయిత సమక్షం అంటే ఏంది మెహెరూ… అది లేంది ఎక్కడ? మరి నేను పుస్తకం మొదులుపెట్టటమే ‘మంచి శుక్రోరం’ అని మొదలుబెట్టినాను కదా. అది ‘మంచి శుక్రోరం’ ఎట్టయ్యింది. రచయిత చేప్తేనే కదా అయ్యింది. మరి అక్కడ లేని రచయిత రెండోభాగంలో ఎట్ట వచ్చేసినాడు? రచయిత దూరటం దూరకపోవటం అయ్యన్నీ దొంగ మాటలబ్బా. అంతా చేప్పేది రచయితే కద” అని అన్నాడు. నామినిలో నేను గౌరవించే అంశాల్లో ఇదొకటి. ఆయనది దత్తు తెచ్చుకున్న జ్ఞానం కాదు. సొంతంగా తన కళతో తాను పడిన యాతనలోంచి తేల్చి తెచ్చుకున్న జ్ఞానం (శ్రీపాద లాగా.) ‘రచయిత రచనలో దూరకూడదు, దేవుళ్ళా వెనకే ఉండి అంతా నడిపించాలి’ అని Flaubert అంటే ‘అబ్బో రచయిత అంటే దేవుడి మాదిరి’ అని పొంగిపోయి ఏం ప్రశ్నించకుండా ఒప్పేసుకుంటాం కదా. అంటే ఇప్పుడు నామిని సడెన్‌గా నా ముందు ఇంతింతై ఉబ్బిపోయి వామహస్తం పైకెత్తి ఈ మాటలు ప్రవచించి నా కళ్లు తెరిపించేశాడని కాదు గానీ, అప్పటికే సత్యంలో దిటవైన పునాది లేక వట్టి మాటల పేర్పుగా డొల్లబారుతున్న ఆ సూత్రం నామిని స్టేట్మెంటుతో ఇంకో ఎదురు దెబ్బ తినిందని మాత్రం ఒప్పుకోవాలి.

ఐనా మరి రెండోభాగంతో నేను కొంత ఇబ్బంది పడిన మాట మాత్రం వాస్తవం. తర్వాత మేం ఫోన్‌లో మాట్లాడుకున్న మాటల్లో అది తెలియజేస్తూనే వచ్చాను. కానీ స్పష్టంగా కాదు. ఎందుకంటే ఆ రెండోభాగంలో ఇబ్బంది ఏంటన్నది నాకూ తెలియదు, ఆయనకీ తెలియదు. మాట్లాడుకోవటమైతే చాలాసార్లు మాట్లాడుకుంటున్నాం. ఆయన నా ‘రచయిత సమక్షం’ అన్న అభ్యంతరాన్ని అలా తీసిపారేసిన తర్వాత నాకు మళ్లీ ‘వ్యంగ్యం’ అన్న కాచ్‌వర్డు దొరికింది. దాంతో ఆయన్ని ఎదుర్కోవటం మొదలుపెట్టాను. రెండోభాగంలో రచయిత వ్యంగ్యం తీవ్రంగా, కోస్తున్నట్టు ఉంటుంది. ఈ భాగం గురించి మా మాటల్లో ఎపుడు ప్రస్తావనకు వచ్చినా నేను ఒక్కసారైనా ఈ సంగతి గొణిగేవాణ్ణి. ఇక ఆయన విని విని విసిగి వేసారి ఒక మాట అన్నారు. “మొదటి భాగం దేవుడు చెప్తున్నాడు, రెండో భాగం సైతాను చెప్తున్నాడు. ఇక అట్ట అనేసుకోండి” అని. ఏ రచయితైనా తన రచన వెనుక ప్రేరణలూ, ఉద్దేశాల గురించి ఎల్లపుడూ స్పష్టమైన అవగాహనతోనూ, స్టడీగైడ్సుతోనూ సిద్ధంగా ఉంటాడని చెప్పలేం. రచయితల్ని, ముఖ్యంగా నామిని లాంటి రచయితల్ని, నిర్దేశించేది ఇంట్యూషన్. నామిని తన రచన గురించి అన్న ఈ మాట తిన్నగా ఆయన ఇంట్యూషన్నించి తన్నుకొచ్చిన మాటగా అనిపించింది. ఇది నిజానికి చాలా విశదమైన విషయం. నామిని రచయితగా తన రచనల వెనుక అదృశ్యం కావటానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఫస్ట్‌పెర్సన్‌లో చెప్పినా, థర్డ్‌పెర్సన్‌లో చెప్పినా కథ చెప్పేది ఎప్పుడూ నామినే. ఇక్కడ నామిని అంటే రచనాసూత్రాలకు బద్ధుడైన రచయిత నామిని కాదు (అలాంటివాడెవడూ లేడు); రక్తమాంసాలూ రాగద్వేషాలతో సజీవంగా చలించిపోయే మానవమాత్రుడు నామిని. మనకు ఇన్ని కథలు చెప్పింది ఈ నామినే. ఇప్పుడు మూలింటామె కథ చెప్తోందీ ఈ నామినే.

ఇక ‘మొదటిభాగం దేవుడు చెప్తున్నాడు, రెండో భాగం సైతాను చెప్తున్నాడు’ అన్న ఆయన మాట నాకు ‘మూలింటామె’ని ఇంకాస్త బాగా అర్థం చేసుకోవటానికి సాయపడింది. ఆ మాటని నేను ఎలా తర్జుమా చేసుకున్నానంటే: మొదటిభాగాన్ని నడిపించింది ప్రేమ, రెండోభాగాన్ని నడిపించింది ద్వేషం అని. ఈ నవలలో ఎప్పుడూ ప్రత్యక్షంగా పాఠకుల ముందుకు రాని రూపావొతిపై నామిని ప్రేమా, రూపావతిని తిరగేస్తే పుట్టిన పందొసంతపై ఆయన ద్వేషమూ కొట్టొచ్చినట్టు తెలుస్తూనే ఉంటాయి. మరి అలా ఒక రచయిత తన పాత్రలపై ప్రేమ ద్వేషాలు కలిగి ఉండొచ్చా అంటే, ఆ రచయిత వాటిని తాను కల్పించిన పాత్రలుగా గాక, తన మనోనేత్రం ఎదుట రక్తమాంసాలతో కదలాడుతున్న మనుషులుగా చూడగలవాడైనపుడు, ఉండొచ్చా ఉండకూడదా అన్న మాటే రాదు, ఉండి తీరతాయీ అని చెప్పాల్సొస్తుంది. నామిని తన పాత్రల్ని అలా మనుషుల్లాగే చూశాడు. మనుషులు కాబట్టే, వాళ్లని చెప్పుతో కొట్టేసి తనకు నచ్చినట్టు మార్చలేక, అవి ఎలా మసలుకుంటే అలా చూసి రాశాడు. ఆ రాయటం మాత్రం రచనాసూత్రాలకు బద్ధుడై, రచయితగా తాను జోక్యం చేసుకోకూడదని చెప్పి, ఒక తెచ్చిపెట్టుకున్న తాటస్థ్యం(detachment)తో రాయలేకపోయాడు. ప్రేమ కలిగినపుడు ప్రేమిస్తూ రాశాడు, ద్వేషం కలిగినపుడు ద్వేషిస్తూ రాశాడు. స్వచ్ఛమైన ప్రేమ ఎప్పుడూ గుంభనంగా ఉంటుంది, ద్వేషం మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇక్కడా అదే జరిగింది. మొదటిభాగంలో రూపావొతి మీద రచయిత ప్రేమ కనపడలేదు గానీ, రెండోభాగంలో పందొసంత మీద ద్వేషం మాత్రం కొట్టొచ్చినట్టు కనపడింది. నిజానికి ఆ ద్వేషం పందొసంత మీద కూడా కాదు. నామిని ఇప్పటి దాకా పల్లెటూళ్లలో తాను ఏ కోణం చూపించలేదనుకున్నాడో, ఆ కోణం పైన, ఆ క్రూరత్వంపైన, ఆయనకి ద్వేషం. ఆ క్రూరత్వానికి మూర్తీభవించిన ఉదాహరణల్లాంటి రంజకం, మొలకమ్మ, ఎర్రక్క, పందొసంత లాంటి మనుషుల పట్ల పరమ కచ్చతో రగిలిపోతూ కథ చెప్తున్నాడు. ఆపుకోలేని ద్వేషం తారాస్థాయికి చేరినపుడు వ్యంగ్యంలోకి దిగిపోతుంది. ఈ వ్యంగ్యమే మొదటిసారి చదివినపుడు నన్ను ఇబ్బంది పెట్టింది. ఎందుకంటే నేను Flaubert ని చదువుకుని ‘రచయిత కథలో కనపడకూడదు’ అన్న సూత్రాన్ని ఒంటబట్టించుకున్నవాణ్ణి. పండిత పాఠకుణ్ణి. నాలాంటోళ్లని చూసి విసిగిపోయే అనుకుంటా జెడి శాలింజర్ తన ఒక పుస్తకాన్ని ఇలా అంకితమిచ్చాడు:
“ఈ ప్రపంచంలో ఇంకా అమెచ్యూర్ పాఠకుడు అనేవాడు ఎవడైనా – కనీసం చదివి తన మానాన తాను పోయేవాడు ఎవడైనా – మిగిలి ఉంటే, నేను చెప్పలేనంత అనురాగంతోనూ కృతజ్ఞతతోనూ వాణ్ణి నా భార్యా పిల్లలతో పాటూ నాలుగోవంతుగా ఈ పుస్తకాన్ని అంకితం తీసుకొమ్మని కోరుతున్నాను.”
నామిని ప్రతి పుస్తకం లాగే ఈ ‘మూలింటామె’ కూడా అలాంటి పాఠకుల కోసమే. పైన చెప్పిన బేగేజీ అంతా పక్కనపెట్టి రెండోసారి చదివినపుడు ‘మూలింటామె’ను మరింత దగ్గరగా ఆస్వాదించగలిగాను. రెండోసారి కాబట్టి, కథ ఏమవబోతోందో అన్నట్టు చదవాల్సిన ఇది లేకపోవటంతో, నింపాదిగా చిన్న చిన్న వివరాల్ని ఆస్వాదిస్తూ చదవగలిగాను. అలాంటివి ఇందులో ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి, మూలింటామె తలపోటు టాబ్లెటుతో పాటూ దాన్ని చుట్టివుండే కాగితాన్ని కూడా నోట్లో వేసుకుని నమలడం, అదేంటని అడిగితే “మాత్ర కంటే మించిన సత్తుమానం కాతికంలో వుంటింది” అని చెప్పడం; మాలమ్మాయి గురివి మూలింటామె ఇంటికొచ్చి “ఈ నాలుగూళ్లలో ఏ ఆడదన్నా మాలదాని చేతికి కుంచమిచ్చి కొలుచుకోమంటాదా! మీ మనవరాలు తప్ప” అని చెప్పటం; పిల్లుల్ని చంపటానికి వచ్చినవాడితో మూలింటామె చెప్పే బ్రిటిషు కాలం నాటి పిట్టకథ…. జీవితంలోంచి అరుదుగా మాత్రమే సాహిత్యంలోకి వచ్చే ఇలాంటి చిన్న చిన్న సంగతులెన్నో కలిసే తనని పుస్తకం రాసేలా చేశాయని నామిని కూడా తల్చుకున్నారు. ఇలా అంటే మహా చిత్రం కదా మన మహా రచయితలకి! మరివాళ్లు ఏదో మహా ఉద్దేశం ఉంటే తప్ప పుస్తకం రాసే జోలి పెట్టుకోనే పెట్టుకోరు కదా! అసలు ఎవడన్నా పర్యావరణం గురించీ, ప్రపంచీకరణ ఫలితాల గురించీ, జీవకారుణ్యం గురించీ ఏదన్నా రాసేద్దామని గొప్ప ఉద్దేశంతో ఓ నవల మొదలెట్టాడంటే వాడికన్నా దొంగరచయిత ఇంకోడు ఉంటాడా! రచయిత చేత కలం పట్టించేది అతని అనుభవం వడ కట్టిన జీవితం. ఇక అందులోంచి వెయ్యి మంచి ఉద్దేశాలెవరన్నా ఏరుకున్నారంటే అది వాళ్ల వెసులుబాటు. దానికి రచయితకీ ఏం సంబంధం లేదు.

అసలు నిజమైన రచయితకు పుస్తకం రాయటానికి ఏ ఉద్దేశమూ ఉండదు చాలాసార్లు. అతని జీవిత విస్తారంలో క్రమేణా ఏవో కొన్ని మూలకాలు ఒక అదృశ్యబిందువు దగ్గర దట్టంగా గుమికూడతాయి. అవన్నీ అక్కడ క్రిక్కిరిసిపోయి ఇక నిభాయించుకునే వీలు లేక అతని మీద పడతాయి. అతను నిలదొక్కుకోలేక ఆ పళంగా వచ్చి కాగితం మీద పడతాడు. ‘మూలింటామె’ నవలకు ఉద్దేశం ఆపాదించటం సులువు. అలా ఆపాదిస్తూ వాడేది ఎంత పెద్ద పదమైనా కావొచ్చు. కానీ అది ఎంత పెద్ద పదమైతే ఆ మాట అంత అబద్ధం. ‘ఈ నవల్లో నామిని పిల్లులంటే తనకున్న ఇష్టం చూపెట్టుకున్నాడూ’ అను, కొంత నిజం ఉంది. కానీ ‘ఈ నవల్లో నామిని జీవకారుణ్యం గురించి చెప్పినాడు’ అను, అంతకన్నా సత్యదూరమైన మాట ఇంకోటి ఉండదు. ఎందుకంటే మనం వాడే పెద్ద పెద్ద పదాలన్నీ నిజానికి భ్రష్టుపట్టిపోయిన పదాలు. వట్టి జీవకారుణ్యం ఏం ఖర్మ, ప్రపంచీకరణ గురించి మాట్లాడొచ్చు, మార్కెట్ శక్తుల గురించి మాట్లాడొచ్చు, పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడొచ్చు. వీటిల్లో ఏదో ఒక దాన్ని మనసులో ఉద్దేశంగా పెట్టేసుకుని నామిని ఈ నవల మొదలెట్టాడూ అనొచ్చు. తిన్నగా నామిని ముందే బుకాయించో మొహమాటపెట్టో ఆయన్నే ఒప్పించొచ్చు. కానీ ఆర్టిస్టు మనసు ఎలా పనిచేస్తుందన్నదానిపై అవగాహన ఉన్నవాళ్లెవరూ ఆ వాగుడు వాగరు.

*

నామినితో మాట్లాడినపుడు ఆయన పదే పదే ఇష్టంగా తల్చుకునే రచనలు రెండు అని గమనించాను. ఒకటి దాస్తోయెవ్‌స్కీ ‘క్రైం అండ్ పనిష్మెంటు’, రెండోది ఆల్బెర్ట్ కామూ ‘అవుట్‌సైడర్’. మూలింటామె విషయంలో నామినిపై అవుట్‌సైడర్ ప్రభావం కొంత కనిపిస్తుంది. ప్రభావం అంటున్నానంటే మనవాళ్లు కథల్ని సన్నివేశాలూ, పాత్రల స్వభావాల్తో సహా దించేసే తంతు గురించి కాదు నేచెప్పేది. ఒక రచన సారం మనలో ఇంకినపుడు దాని ప్రభావం వల్ల అంతకుముందు చూచాయగా మాత్రమే స్ఫురణ పొలిమేరల్లో తచ్చాడే రూపరహిత అంశాలు ఒక రూపాన్ని సంతరించుకుని ముందుకు రావటం గురించి చెప్తున్నాను. అలా చూసినపుడు కామూ నవలకీ, నామిని నవలకీ కొన్ని పోలికలు కనపడతాయి. ముఖ్యంగా ‘అవుట్‌సైడర్’ కథానాయకుడు మీర్‌సాల్టుకూ, మూలింటామె పాత్రకూ మధ్య. తను చేసిన హత్యకు గాక, తల్లి చనిపోయినపుడు సరిపడా విషాదం బయటకు చూపించనందుకు మీర్‌సాల్టుకు శిక్ష పడుతుంది. సమాజం యొక్క దున్నపోతు స్వభావం ఎలా ఉంటుందన్నది కోర్టులో మీర్‌సాల్టుకు వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పిన వ్యక్తుల మనస్తత్వాల్లో వ్యక్తమవుతుంది. సమాజం మీర్‌సాల్టును వెంటపడి ఎంత వేధిస్తుందో మూలింటామెనూ అంతే వేధిస్తుంది. అయితే ఇక్కడ పోలికేమిటంటే… మీర్‌సాల్టూ, మూలింటామె ఇద్దరూ క్రూరత్వాన్ని నిలువరించటానికి వాడే ఆయుధం ఉదాసీనతే. ఆఖర్లో పందొసంతా, ఎర్రక్కా కలిసి మూలింటామె ప్రాణంగా “నా చిన్నామున్నులూ, కానాచ్చులూ, కొండాచ్చులూ” అని పిలుచుకునే పిల్లుల్ని ఎలకలమందు పెట్టి చంపి శవాల్ని చేటలో వేసుకొచ్చి ఆమె కళ్ల ముందు ఆడించినా “తోడబుట్టిన అక్కకు చేతులెత్తి దండంబెట్టి నోరు తెరవకుండా, కండ్లు మూసు”కుంటుంది. వొడిశాకు తినేసి ప్రాణాలు వదిలేస్తున్నప్పుడు కూడా దొంగ ఏడుపులు ఏడుస్తున్న “అక్కకల్లా చేతులెత్తి దండం బెట్టి కడగా పొమ్మన్నట్టు చూసింది”. ‘అవుట్‌సైడర్’లో మీర్‌సాల్టుకు ఇక ఉరిశిక్షఖాయమనగా, తనని పశ్చాత్తాపపడమని వచ్చిన క్రైస్తవ ఫాదరీని చెడామడా తిట్టేసి వెళ్లగొట్టేస్తాడు. అందరూ వెళ్లిపోయాక జైలు గది నిశ్శబ్దంలో తన మనసులో ఇలా అనుకుంటాడు:
“As if that blind rage had washed me clean, rid me of hope, for the first time, in that night alive with signs and stars, I opened myself to the gentle indifference of the world. Finding it so like myself—so like a brother, really—I felt that I had been happy and was happy again.”
తన కోపం అంతా బయటకు కక్కేయడం వల్ల కలిగిన తేటదనంతో, ఇక ఏ ఆశా మిగలి లేదని అర్థమవగా, నిస్సత్తువగా జైలు గదిలో చప్టా మీద కూలబడతాడు. నక్షత్రపు రాశులతో వెలుగుతున్న ఆ రాత్రిలో మొట్టమొదటిసారి ప్రపంచపు “దయాపూరితమైన ఉదాసీనత”ను చూడగలుగుతాడు, దానికి తనను సమర్పించేసుకుంటాడు. మూలింటామె ఉదాసీనత ఇలాంటిదే. మీర్‌సాల్టు తన ఆక్రోశం అంతా ఒక్కసారైనా వెళ్లగక్కుకున్నాకనే ప్రపంచపు “gentle indifference”ను చూడగలుగుతాడు, అది తనలోనూ చూసుకుంటాడు. బహుశా స్త్రీ కాబట్టి, భారతీయస్త్రీ కాబట్టి మూలింటామె ఆ మాత్రం కూడా ఎక్కడా బయటపడదు. మన ప్రపంచం ఇన్ని అసంగతపు (అబ్సర్డు) లెక్కల మీద నడుస్తుందని ‘అవుట్‌సైడర్’ నవల ప్రతిపాదిస్తే, మనం మానవావరణలో నమ్మకంగా వేసే అడుగుల కిందే ఎన్నో క్రూరత్వాలు ఆవలిస్తూ అవకాశం కోసం కాచుక్కూచోవటం ‘మూలింటామె’లో కన్పిస్తుంది. సారంలోనే కాక, సౌష్టవం విషయంలోనూ రెండు నవలలకూ పోలికలున్నాయి. రెండు నవలలూ రెండేసి భాగాలుగా విడగొట్టి ఉంటాయి. రెండూ దాదాపు అంతే స్లిమ్‌గా ఉంటాయి.

*

నెంబర్ వన్ పుడింగి’ తర్వాత నామినికి చాలామంది అంతిమనివాళులు అర్పించారు; రచయితగా అస్తమించాడన్నారు, గోర్కీ అన్నవాళ్లే గోరీలు కట్టేశారు. కానీ జీవితంతో కాంటాక్టు నిలుపుకున్నంతవరకూ ఏ రచయితా వట్టిపోడు, చచ్చిపోడు. నామిని వరకూ ఈ ‘మూలింటామె’ దానికి ఋజువు. ఎంతో జీవితాన్ని, ఎంతో సౌష్టవంగా వెలిబుచ్చిన నవల ఇది.

నామిని పట్ల నామిని రచనల్ని మించిన గౌరవం నాకు. ఎందుకంటే కళాకారుని మూర్తిమత్వం శుద్ధంగా వ్యక్తమయ్యేది అతని సృజన ఒక్కదాంట్లోనే కాదు. ఆ కళ పట్ల కలిగి ఉన్న అభిప్రాయాల్లోనూ, వాటికి నిబద్ధుడై ఏ మొహమాటాలకూ లొంగకుండా నడుచుకోవటంలోనూ కూడా వ్యక్తమవుతుంది. నాకు తెలుగునేల మీద తారసపడిన – ఒంటిచేతి వేళ్లతో లెక్కపెట్టదగిన – కళాకారుల్లో నామిని ఒకడు.

*

(కినిగె పత్రికలో ప్రచురితం)

0 స్పందనలు:

మీ మాట...