December 14, 2008

ఒక సాయంత్రం

సుబ్బిగాడు నేనూ మేట్నీ నుండి ఆటోలో వస్తూంటే, అప్పటికప్పుడు మెదిలిన ఆలోచనతో, మలేషియన్ టౌన్‌షిప్ దగ్గర ఆపమన్నాను. ఇద్దరం కలిసి టౌన్‌షిప్ ఎదురుగా పెద్ద గుట్ట మీదున్న గుడికి బయల్దేరాం. ఇలా యీ సడెన్ షికారుకి సుబ్బిగాడు మొన్నెప్పుడో ఆ గుడికి వెళ్దామని అడగడం ఒక కారణమైతే, ఇప్పుడే చూసిన చెత్త సినిమా తెప్పించిన తలపోటు నుండి ఇది మమ్మల్ని కాస్త బయట పడేయగలదేమోనన్న ఆశ మరో కారణం. పైకి ఎక్కే దారిలో మాకెదురైన రెండు మూడు ప్రేమ జంటల్ని చూసి సుబ్బిగాడు కావాలని నిట్టూర్చాడు, నేను నవ్వాను. పైన పెద్ద జనం లేరు. గుడి తలుపులు మూసి ఉన్నాయి. గుడి వెనుక ఉన్న పెద్ద రాతి బండ మీద ఇద్దరం సాగిలబడ్డాం. ఈ గుట్ట క్రింద కాస్త దూరంలో కొత్తగా ఏదో టౌన్‌షిప్ కడుతున్నారు. ఏటవాలు కప్పులతో పదుల సంఖ్యలో ఉన్న డూప్లెక్సులు మా ముందు వరసాగ్గా పేర్చి ఉన్నాయి. వాటి మధ్యలో ఇంకా ఎత్తుగా పైకి లేచి నాలుగైదు అపార్ట్‌మెంట్ టవర్లు కూడా నిర్మాణంలో ఉన్నాయి. ఆ సాయంత్రపు వెలుగులో కూడా చాలా దూరంలో ఉన్న నేమ్‌బోర్డు మీద "ఫార్ట్యూన్ ఫీల్డ్స్" అన్న పేరుని మేం కూడబలుక్కుంటూ చదవగలిగాం, మా చురుకైన కంటి చూపుని మేమే పొగుడుకున్నాం. ఈ "ఫార్ట్యూన్ ఫీల్డ్స్"కి వెనుకగా, దిగంతం మీద, సూర్యబింబం అస్తమించే పనిలో ఉంది. కాషాయపుటెరుపు రంగులో ఉన్న ఆ బింబపు కాంతి ఎంత మృదువుగా ఉందంటే- కళ్ళు ఏ మాత్రం బైర్లు కమ్మకుండా దాన్ని ఎంతసేపైనా చూస్తూండిపోవచ్చు. కళ్ళ ముందు చేయి ఉంచి, ఆ బింబాన్ని బొటన వేలి క్రింద పెట్టి, ఆకాశంలోకి ఓ జానెడు కొలత కొలిస్తే ఎంత దూరం ఉంటుందో ఆ మాత్రపు దూరంలో ఒక జెట్ విమానం నిశ్శబ్దంగా వెళ్తూంది. దాని వెనుక తెల్లని వాయుమేఘం తోకలా విప్పారుతోంది. ఇద్దరం ఆ విమానం గురించి కాసేపు మాట్లాడుకున్నాం. అది కంట్రోల్ తప్పి తిన్నగా మేం కూర్చున్న గుట్ట మీదకు దూసుకొస్తే ఎలా ఉంటుందో ఊహించమన్నాను. సుబ్బిగాడు నావన్నీ పనికిమాలిన ఊహలని తిట్టాడు. తర్వాత, మా కంటి చూపుని మరింత పరీక్షించుకోవాలని, దూరంగా ఉన్న ఓ ఖాళీ  హోర్డింగ్ మీద పెద్ద అక్షరాలతో రాసి ఉన్న సెల్‌ నెంబరు చదవడానికి ప్రయత్నించాం. ఆ నెంబర్లో వరుసగా ఐదు ఆర్లున్నాయి. అవి లెక్కపెట్టడానికి కాస్త కష్టమైంది. కాసేపటికి మా మాటల్లోంచి తేరుకుని చూస్తే సూర్య బింబం అక్కడ లేదు. ఇప్పుడు అక్కడ బూడిద రంగు ఆకాశం బోసిపోయి కనిపిస్తోంది. అయితే పైన జెట్ విమానం మాత్రం ఇంకా సూర్య కాంతి పడి బంగారపు పలుకులాగ మెరుస్తూనే ఉంది. మాకు అస్తమించిన సూర్యుడు ఆ విమానంలోని పైలట్‌కి ఇంకా అస్తమించలేదన్నమాట, మాకు కనపడని సూర్యుణ్ణి అతనింకా చూస్తున్నాడన్నమాట. జెట్ విమానం వెళ్తున్న దారిని గమనిస్తూ ఇద్దరం రాతి మీద వెల్లకిలా పడుకున్నాం. ఇలాంటి ప్రాకృతికమైన నిశ్శబ్దంలో, ప్రేమలో ఉన్నవారెవరైనా ప్రేమిస్తున్నవాళ్ళని గుర్తు చేసుకోవడం సహజమేమో. సుబ్బిగాడు వాడి మరదలి గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి గురించి వాడు ఎక్కువ మాట్లాడేది నాతోనే. పాపం వాడి దగ్గర వాడి ఇష్టాన్ని సాకల్యంగా వర్ణించగలిగినన్ని పదాలు లేవు. కాని వాటిని వెతుక్కోవటానికి వాడు పడే ప్రయాసలో, ఆ నట్టడంలో, తడబాటులో, ఆ ప్రేమ అందం ఇంకా ఇనుమడిస్తుంది. కొన్నిసార్లు లోపల్నించీ తన్నుకొస్తున్న ప్రేమ తీవ్రతకూ, దానికి వీడు అరువిచ్చే సాదాసీదా పదాలకూ మధ్య పొందిక కుదరక, తడబడి, "నేన్చెప్పలేన్రా బాబూ" అని ఇబ్బందిగా నవ్వేస్తాడు. అయితే అంతకుముందు వాడిన బోలెడన్ని పదాల కన్నా ఈ ఒక్క పదం వాడి ప్రేమ లోతును సంపూర్ణంగా వ్యక్తం చేస్తుంది. నేను ఊకొట్టాల్సినచోట ఊకొట్టాను. తోచినచోట సలహా ఇచ్చాను. ధ్యాసపెట్టి వింటున్నానని తెలియజేయడానికి (నిజంగానే వింటున్నాను), కొన్ని అర్థమైనా సరే ఆపి వివరమడిగాను. మా సంభాషణ అంతా పూర్తయ్యాక, ఇదంతా విన్నందుకు నా పట్ల వాడిలో ఉండే కృతజ్ఞత కన్నా, చెప్పినందుకు వాడి పట్ల నాలో ఎక్కువ కృతజ్ఞత ఉంటుందనిపించింది. అప్పటికిక సినిమా వల్ల వచ్చిన తలపోటు పోయింది. ప్రేమ గురించి కదా మాట్లడుకుందీ... మనసు తేటగా, ఖాళీగా ఉంది. వెళ్దామంటే వెళ్దామనుకున్నాం. తృప్తిగా, తీరుబడిగా బండ దిగి కిందకి నడిచాం.

November 10, 2008

రోడ్డు మీద కోక్‌ టిన్నుని లాగి పెట్టి తన్నడంలో exhilaration

ఆనందంగా ఉండటం మనిషికి ఒక నైతిక బాధ్యత అట. నిన్న రాత్రి ఓ బోర్హెస్‌ వాక్యం చెప్పింది. కొన్ని వాక్యాలు ఊరికే లోపలికి వెళ్ళి ఊరుకోవు. వెళ్ళాక లోపల దేన్నో కదిపేసి కుదిపేసి పెద్ద కలకలం రేపేస్తాయి. ఆనందం మనిషి జీవిత పరమార్థమని, మన ప్రతీ చర్యలోనూ పైపై పూతల్ని తొలగించుకుంటూ పోతే లోపల కనిపించేది ఆనందం పట్ల కాంక్షే అనీ నాకు తెలుసు. కాని "ఆనందంగా ఉండటం, ఆనందాన్ని వెతుక్కోవటం మనిషి కనీస బాధ్యత'' అని నేనెవరి దగ్గరా ఇంతవరకూ వినలేదు. "ఆనందో బ్రహ్మ'' అంటూ మనవాళ్ళు చెప్పిన దాంట్లో కూడా ఎందుకనో అది ఓ ఆదర్శం అన్నట్టే వినిపించింది గానీ, అదో నైతిక బాధ్యత అన్నంత ఖచ్చితత్వం ధ్వనించలేదు. అందుకే అనుకుంటా ఆ వాక్యం అంతగా కొట్టొచ్చినట్టు కనిపించింది. వెంటనే పుస్తకం మూసి బయటకు వచ్చేశాను. బయట శీతాకాలం అర్థ రాత్రి చల్లగా ఆహ్వానం పలికింది. రూమ్‌ తలుపు దగ్గరకు జారేసి, వంటి చుట్టూ వెచ్చగా హత్తుకునేట్టు స్వెటర్‌ జిప్‌ పైకి లాక్కుని బయటకి నడిచాను. ఎందుకో ఆ వాక్యాన్ని వెంటనే వదిలేయాలనిపించలేదు. దాన్ని కరిగిపోనీకుండా పూర్తిగా నాలోకి జీర్ణం చేసుకోవాలనిపించింది. దాని గురించి కాసేపు ఆలోచించాలనిపించింది. నిరంతరాయమైన ఆలోచనకి అన్ని విధాల అనుకూలమైన పరిసరాలు వున్నాయి అప్పుడు నా చుట్టూ: హైదరాబాద్‌ అంతా నిద్రపోతున్న నిశ్శబ్దం, నిర్మానుష్యమైన రోడ్డు, జనావాసాల్లేకుండా అటూ ఇటూ రాళ్ళ గుట్టలు, నన్ను నాలోకి మరింత ఒదిగిపోయేలా చేస్తున్న చలి, ఆలోచనల విరామంలో పరాకుగా తలెత్తినప్పుడల్లా వీథి లైట్ల చాటు నుంచీ "నేను నీతోనే వస్తున్నానంటూ'' ఆత్మీయంగా పలకరిస్తున్న నిమ్మతొనంత చందమామ . . . ఇంకేం కావాలి. ఇంకా చెప్పాలంటే, అడపాదడపా రోడ్డు వారన లుంగ చుట్టుకు పడుకున్న కుక్కల నిద్రని నేను చెడగొడుతున్నానేమో గాని, నన్ను నా ఆలోచనల్నీ భంగపరచడానికి అక్కడే అడ్డంకులూ లేవు. వాహనాలు కూడా అప్పుడొకటి ఇప్పుడొకటి తప్ప రాకపోవడంతో రోడ్డు మధ్యనే నడుస్తున్నాను. కాళ్ళు, ఆలోచనలు నా ప్రమేయమేమీ లేకుండానే వాటి తోవన అవి సాగిపోతున్నాయి. ఆనందంగా ఉండటం మనిషి కనీస బాధ్యత అట. ఎందుకో ఇది తిరుగులేని స్టేట్‌మెంట్‌లా అనిపించింది. పైగా ఆ స్టేట్‌మెంట్‌ని ఇచ్చిన మనిషే దానికి తిరుగులేని సాక్ష్యంలా కనిపించాడు: Borges. చదవటం, రాయటం మాత్రమే తన జీవితమనుకున్న మనిషికి కళ్ళు పోతే ఎలా ఉంటుంది. పిచ్చెక్కి పోదూ. అయినా ప్రతీ చోటా నవ్వుతూనే కనిపిస్తాడు. రాతల్లో కూడా చాలా సరదా మనిషిలా స్ఫురిస్తాడు. అంధత్వం ఖాయమైపోయాకా పెద్ద పెద్దవి రాయడం మానేసాడట; చిన్న చిన్న కథలు, కవితలూ అయితే కలం కాగితాల సహాయం లేకుండానే మెదడులో నిలుపుకోవచ్చని అవి మొదలుపెట్టాడట. పేరాలకు పేరాలు, పంక్తులకు పంక్తులు మెదళ్ళో మోసుకుంటూ చేతి కర్ర సాయంతో బ్యునోస్‌ ఎయిర్స్‌ వీథుల్లో తిరిగేవాడట. మరీ మనిషి చెప్పాడంటే ఒప్పుకుని తీరాల్సిందే కదా. అయినా ఇది చాలా కనీస విషయం. ఆనందంగా ఉండక ఏడుస్తూ బతుకుతామా. అంతే, కొన్నిసార్లు అన్నీ తెలుసున్నా అంతా మర్చిపోతాం. లోపలే నిలవున్న దాని కోసం ఎక్కడెక్కడో వెతుకుతూంటాం. మన ఆనందమూ మన పెంపుడు కుక్క లాంటిదే. పాపం అది మన దృష్టిని ఆకర్షించాలని తోకూపుకుంటూ, కాళ్ళ సందుల్లోంచి అటూ ఇటూ జొరబడిపోతూ, వేళ్ళు నాకేస్తూ, నానా తంటాలు పడిపోతూంటుంది. మనం చేయాల్సిందల్లా దాని వైపు ఆహ్వాన సూచకంగా చేయి సాచటమే. కాస్త ధ్యాస దాని వైపు మళ్ళిస్తే చాలు, ముందరి కాళ్ళు రెండూ పైకెత్తి మన చుట్టూ అల్లుకుపోతుంది. ఒక్కసారి తల విదిలించుకో, "just snap out of it" అనుకో . . . అంతా ఆనందమే. అది తెలిసీ ఇన్ని రోజులు దిగాలుగా ఉన్నాను. కాని ఇప్పుడు నేను ఆనందంగా ఉండటానికి అడ్డేమిటి అని ప్రశ్నించుకుంటే, చిత్రంగా, ఒక్క సమాధానమూ తట్టడం లేదు.

బహుశా ఆ దిగులంతా ఇంకా ఏ దారో నిశ్చయించుకోలేకపోవడం వల్ల వచ్చిన దిగులేమో; రెండుగా చీలిపోయిన రోడ్డు ముందు నిలబడి, ఒక దారిలో పోతే మరోదారిలోని అందాలు కోల్పోతానేమో అని బాధ పడే వాడికి కలిగే దిగులు లాంటిదేమో. "సిటీ స్లికర్స్‌'' అని చాన్నాళ్ళ క్రితం చూసిన సినిమా గుర్తొస్తోంది. అందులో బిల్లీ క్రిస్టల్‌ న్యూయార్క్‌ నగరంలో, నచ్చని ఉద్యోగంలో, కలతల సంసారంతో యాంత్రికంగా జీవితాన్ని గడిపేస్తుంటాడు. అతని నలభయ్యో పుట్టిన రోజుకి బహుమతిగా అతని ఇద్దరి స్నేహితులూ ఒక విహార యాత్ర ప్లాన్‌ చేస్తారు. వాళ్ళిద్దరూ కూడా బిల్లీలాగే మిడ్‌లైఫ్‌ క్రైసిస్‌తో బాధపడుతూంటారు. ఆ యాత్ర ప్రకారం యాత్రికులందరూ కొన్నాళ్ళ పాటు కౌబాయ్స్‌లా ఆవులు మేపుతూ గడపాలి. (నాకు సరిగా గుర్తు లేదు; అంతే అనుకుంటా.) మొదట ముగ్గురూ ఇక్కడ కుదురుకోలేకపోతారు. కాని నెమ్మదిగా నెమ్మదిగా ఈ క్యూబికల్సూ, కాన్ఫరెన్సులూ లేని జీవితం వాళ్ళకు నచ్చటం మొదలౌతుంది. అక్కడ వీళ్ళకి ఒక ముసలి వాడైన కౌబాయ్‌ తారసపడతాడు. బిల్లీ క్రిస్టల్‌కి అతను బాగా నచ్చుతాడు. జీవితం పట్ల తనలో లేని నిబ్బరం అతనిలో చూస్తాడు. ఒక సన్నివేశంలో ఇద్దరూ కౌబాయ్‌ వేషాల్లో ప్రక్కన ప్రక్కన గుర్రాల మీద వెళ్తూంటారు. హఠాత్తుగా ఆ కౌబాయ్‌ బిల్లీ వైపు తిరిగి "నీకు జీవిత రహస్యం ఏంటో తెలుసా?'' అంటాడు.

బిల్లీ చాలా ఉద్విగ్నతతో "ఏమిటి!?'' అని అడుగుతాడు.

కౌబాయ్‌ నిశ్శబ్దంగా తన చూపుడు వేలు ఎత్తి చూపిస్తాడు.

బిల్లీ: (అర్థం కానట్టూ మొహం పెట్టి) ఏమిటి, నీ వేలా?

కౌబాయ్‌: ఒకే విషయం . . . కేవలం ఒకే విషయం . . . దానికి బద్దుడవై ఉండిపో. జీవితం సులభమైపోతుంది.

బిల్లీ: అది సరే . . . కాని ఆ ఒక్క విషయమూ ఏమిటి?

కౌబాయ్‌: అదేంటో నువ్వే తేల్చుకోవాలి.

-- మనదీ ఇంచుమించు ఇదే బాధ. ఇంకా ఆ ఒక్కటీ ఏమిటన్నది నిర్ధుష్టంగా తేలడంలేదు. ఒక వేళ తేలినా, ఆ దారినే గుడ్డిగా నమ్మేసి "ఇదే జీవితం'' అని నిశ్చింతగా వెళిపోగలమా. అలా వెళిపోయినా ఆ దారికి సమాంతరంగా లక్షా తొంభై మార్గాలు ఊరిస్తూంటే మళ్ళా ఏదో కోల్పోయామనిపించదా. కాని ఏదో ఒకటి పట్టుకోక తప్పదని మాత్రం తెలుసు. చార్లీ కఫ్‌మన్‌ 'అడాప్టేషన్‌' సినిమాలో ఓ పాత్ర అంటుంది:

"There are too many ideas and things and people. Too many directions to go. I was starting to think that the reason it matters to care so passionately about something is that it whittles the world down to a more manageable size."

--కాబట్టి ఏదో ఒక దాన్ని పట్టుకోకపోతే ఈ బృహత్‌ ప్రపంచం మన మతి పోగొట్టేస్తుంది. అయినా నిన్న మొన్నటి దాకా నాకో పట్టుగొమ్మ ఉందనే అనుకున్నాను. చాలా అందమైన పట్టుగొమ్మ అది. మానవ అస్తిత్వ సమస్యకు అదే ఒక్కగానొక్క పరిష్కారమని నాకు ఎరిక్‌ఫ్రామ్‌ చెప్పక ముందే తెలుసు. దాని పేరు ప్రేమ. ఎంత నిజమో కదా. జీవితాన్ని అర్థవంతం చేసుకోవాలంటే ప్రేమించాలి. అంతే, మరో దారి లేదు. ఈ ప్రేమ అనేది లేకపోతే మనిషిగా ఈ భూమ్మీద మన ఉనికిని భరించడం చాలా కష్టమై ఉండేది. స్నేహితులో, ప్రేయసీ ప్రియులో, భార్య భర్తలో, తండ్రీ కొడుకులో, అన్నా చెల్లెళ్ళో, సాటి మనుషులో . . . ఇలా బంధాలేవైనా మనందరి మధ్య ఈ ప్రేమ అనే భావన లేకపోతే మానవ అస్తిత్వం భరించలేనంత దుర్భరమైపోయి ఉండేది. అసలు మనుషులకు ఇంత అర్థం లేని అస్తిత్వాన్ని అంటగట్టినందుకు నష్టపరిహారంగానే ఈ ప్రేమను ఇచ్చాడేమో దేవుడు. అయితే ఇక్కడో చిన్న ఇబ్బంది ఉంది. ఎరిక్‌ఫ్రామ్‌ ఈ ప్రేమను మనుషులకు మాత్రమే ఉద్దేశించమన్నాడో లేదో నాకు తెలియదు కానీ, మనుషులకు మాత్రమే ఉద్దేశిస్తే కొన్ని సమస్యలుంటాయి. మనుషులతో ప్రేమ షరతులతో కూడి ఉంటుంది. మనం మథర్‌ థెరిసాలం కాదు గనుక కొన్ని షరతులతో మాత్రమే అవతలి వారికి ప్రేమను ఇవ్వగలం. కొన్ని షరతులతో మాత్రమే అవతలి వారి నుండి ప్రేమను పొందగలం. అలాగాక బేషరతుగా ప్రేమ కావాలనుకుంటే మాత్రం ఈ వ్యవహారంలోంచి మనుషుల్ని పక్కన పెట్టేయక తప్పదు. అక్కడే నా పట్టుగొమ్మ విరిగిపోయింది. నాకు మరో ఆసరా కావాల్సి వచ్చింది. బహుశా ఆ ఒక్కటీ ఏమిటన్నది నా కిప్పుడిప్పుడే నిర్ధుష్టంగా స్పష్టమవుతుందేమో. ఏ షరతులూ లేని ప్రేమ, నా వరకూ, కళతోనే సాధ్యమవుతుంది. అది ఎంత ఇచ్చినా తీసుకుంటుంది; అంతకు అంత తిరిగి ఇస్తుంది. అది ప్రేమ మాత్రమే అడుగుతుంది. ప్రేమను మాత్రమే ఇస్తుంది.

ఇలా నా ఆలోచనల్ని ఫోర్త్‌ఫేజ్‌ నుండి సైబర్‌ టవర్స్‌ దాకా నడిపించాకా అర్థమైంది: మన ఆనందాలకు మనుషుల్ని ఆధారభూతాలుగా నిలుపుకోవడం ఎంత నిష్పలమో, దుఃఖదాయకమో, కొండొకచో ప్రమాదకరమో; నాలోనే ఉండి, నేను అనుమతి ఇస్తే చాలు నన్ను మొత్తంగా కమ్మేద్దామని ఎదురుచూస్తున్న ఆనందాన్ని కాదని బయట దేబిరించడం ఎంత వెర్రితనమో. చౌరస్తా దగ్గర కూడా పెద్దగా జనం లేరు. నియాన్‌ లైట్ల వెలుగులో సన్నగా మంచు కురవడం కనిపిస్తోంది. ఏమో అది మంచో, దుమ్ము కణాలో . . . ఇక్కడ దేన్నీ నమ్మలేం. ఓ మూల చాయ్‌ దుకాణం ఇంకా తెరిచే ఉంది. ఎందుకో అలవాటు లేకపోయినా తాగాలనిపించింది. అర్థం పర్థం లేకుండా ముప్పిరిగొంటున్న ఆనందాన్ని నాతో నేను సెలబ్రేట్‌ చేసుకోవాలనిపించింది. చాయ్‌ తాగి వెనక్కి నడిచాను. కొన్నిసార్లు, మనం అస్సలు సిద్ధంగా లేనపుడు, ఉధృతమైన ఆనందం చెప్పా పెట్టకుండా దాడి చేస్తుంది. మన ఉనికికి అతీతమైన ఆనందమది. ఆ ఆనందానికి మన శరీరం సరిపోదు. బద్దలైపోతామనిపిస్తుంది. వెన్నులోంచి మొదలై వళ్ళంతా జలదరించిపోతుంది. పిచ్చిగంతులేయాలనిపిస్తుంది. అదృష్టవశాత్తూ ఆ ఖాళీ రోడ్డు మీద నేను పరిగెత్తినా, పిచ్చి గంతులేస్తూ, పిచ్చి పాటలు పాడినా ఎవ్వరూ పట్టించుకునే వాళ్ళు లేరు. చందమామ మనోడే. అర్థం చేసుకున్నట్టు చల్లగా నవ్వుతున్నాడు.
.

October 26, 2008

ప్రిమెచ్యూర్‌ నొస్టాల్జియా

ఇవాళెందుకో రాయాలనిపిస్తోంది. ఏదో ఒకటి రాయాలనిపిస్తోంది. బహుశా బాధ వల్లననుకుంటా. "కుంగ్‌ఫూ పాండా'' సినిమాలో ఆ పాండా గాడంటాడు, "I eat when I am upset'' అని; అలాగే "I write when I am upset'' అనుకుంటా. ఎందుకు అప్‌సెట్‌ అన్నది అప్రస్తుతం. రాయడం మాత్రం ఓ తక్షణావసరం. దురదొచ్చినప్పుడు కారణాలు వెతకం, గోక్కుంటామంతే. ప్రస్తుతం ఈ రాయాల్సిన అవసరమూ అలాంటిదే. ఇది లోపల్నించీ ఉధృతంగా తన్నుకొస్తున్న తోపుడు. ఎందుకో ఈ మధ్య నాలో ఇలా చాలా తోసుకు వస్తున్నాయి. "మమ్మల్నీ కాస్త పట్టించుకోరా మగడా'' అంటూ సవాలక్ష విషయాలు నా అంతర్నేత్రం ముందు కుప్పి గంతులేస్తున్నాయి. బహుశా ఆడియన్స్‌ ఎవరూ లేరనుకోవడం వల్ల వచ్చిన ఉత్సాహమనుకుంటా.

మామూలుగా అయితే నాకేదన్నా బాధ కలిగితే చౌదరిగాడి సహాయం తీసుకుంటాను. అలాగని వాడితో నా బాధలేం చెప్పేయను; వాడి మాటలు (ఇంకా కాస్త ప్రేమగా చెప్పాలంటే "వాగుడు'') వింటానంతే; బాధంతా హుష్‌కాకీ అయిపోతుంది. ఇప్పుడు వాడిక్కడ లేడు. కాబట్టి అక్షరాలే దిక్కు. సరే, ఏం రాయాలి? పోయి పోయి కష్ట పెట్టే విషయాన్ని గురించే రాస్తే ఆరిపోతున్న కుంపటిని పుల్లెట్టి మరీ కెలికినట్టుంటుంది. మళ్ళీ బాధ రాజుకుంటుంది. కాబట్టి ససేమిరా దాని జోలికి పోకూడదు. నాకో అమ్మాయి చెప్పింది: మనల్నేదన్నా బాధ పెడ్తూంటే మనం అంతకన్నా పెద్ద బాధ సృష్టించు కోవాలంట. పెద్ద గీత ముందు చిన్న గీతలాగా మొదటి బాధ తగ్గిపోతుందట. ఈ లాజిక్కేంటో నాకు అర్థం కాలేదు. అయినా ఇప్పుడంతకన్నా మరో దారి కనిపించడం లేదు. అందుకే, ఉత్త పుణ్యానికి ఇప్పుడో పెద్ద బాధ నా నెత్తిన వేసుకుందామనుకుంటున్నాను. బాధంటే ఆషామాషీ బాధ కాదు, "మన సంస్కృతి'' గురించిన బాధ.

No, not for the heck of it. ఏదో ఒకటి నెత్తిన వేసుకోవాలి కదా అని వేసుకుంటున్నది కాదు. నిజంగా ఇది నన్ను కొద్ది రోజులుగా బాధ పెడతోంది. అంటే మరీ మొదటి బాధంత ఉధృతమైంది, వ్యక్తిగతమైందీ కాదు; గుండెల్లో ఏదో అగ్నిపర్వతం ఆగి ఆగి లావా కక్కుతున్నట్టనిపించే బాపతు భారీ బాధ కాదు. ఇది వేరే రకం. ఈ బాపతు బాధలు మనిషిని ఉక్కిరి బిక్కిరి చేసేయవు. ఆలోచనల పొలిమేరల్లోనే తచ్చాడుతూ ఆదమరిచి ఉన్నప్పుడు చిలిపిగా ఓ పోటు పొడిచి వెళిపోతుంటాయి. అసలు "మన సంస్కృతి''కి ఇప్పుడు నన్ను పోటు పొడవాల్సినంత అవసరమేమొచ్చింది? నాకీ మధ్యన నా బ్లాగు "ఎబౌట్‌ మీ''లో చేర్చడానికి రోజుకొక విశేషణం తడుతోంది. ఇప్పుడే మరొకటి తట్టింది. దానికి "hopelessly neurotic'' అని కూడా చేర్చాలి. అందుకే ఇలా పిసరంత విషయాల్ని కూడా పీక్కుని లాక్కుని కొండంత చేసుకుంటుంటాను. ఇప్పుడు నా బాధకి వెతగ్గా వెతగ్గా మూడు మూలాలు కనిపిస్తున్నాయి: 1) అట్లతద్ది 2) నా కొలీగ్‌తో సంభాషణ 3) తిలక్‌ కవిత. అయితే నా బాధకు నేనీ మూలాలపై పూర్తి దోషం ఆరోపించలేను. అసలు ఈ మూడింటికీ పరస్పర సంబంధం ఉందో లేదో కూడా తెలీదు. బాధ వీటి వల్ల కాదు. ఇవి నాలో రేకెత్తించిన ఆలోచనల వల్ల. ఇప్పుడు నేనా ఆలోచనల్ని పదాల్లోకి జల్లెడ పట్టొచ్చు, పట్టలేకపోవచ్చు; కానీ ప్రయత్నమైతే చేయాలనుకుంటున్నాను.

కొన్ని రోజుల క్రితం అట్లతద్ది పండగ జరిగింది. ఎక్కడ జరిగిందని గట్టిగా అడిగితే, బహుశా, కేలెండర్లలోనే జరిగిందని సమాధానం చెప్పాలేమో. ఆ రోజు అట్లతద్ది అని నా క్కూడా తెలీదు. మా కొలీగ్‌ ఒకావిడ చెప్తే తెలిసింది. రాత్రి ఫోన్ చేసినపుడు మళ్ళా అమ్మ గుర్తు చేసింది. అమ్మమ్మ యధావిధిగా అట్లు, పానకం తయారు చేసిందట. పానకం అన్న మాట చెవిన పడగానే తియ్యగా నోరూరింది. కానీ ఆ "అట్లతద్ది'' అన్న పదం ఇక్కడ ఈ నగరంలో దారుణంగా విలువ కోల్పోయినట్టనిపించింది. చాలా పరాయి పదంలా ధ్వనించింది. పొలంగట్లపై చెట్టాపట్టాలేసుకు తిరిగిన బాల్య స్నేహితుణ్ణి సంవత్సరాల విరామం తర్వాత, హఠాత్తుగా, స్కైస్క్రేపర్ల మధ్య చూస్తే ఎలా ఉంటుంది? వాడెంత పరాయిగా అనిపిస్తాడు? — కానీ బహుశా ఇది అర్థం పర్థం లేని పోలిక. మనిషి వేరు, పదం వేరు. మనిషి స్థల కాలాల స్వభావాన్ని (జ్ఞాపకాల్లో తప్ప) తనలో నిలుపుకోలేడు. అంతా వెనక వదిలేయాల్సిందే. ఏ స్థలానికి ఆ స్థలం, ఏ కాలానికి ఆ కాలం అతణ్ణి లొంగదీస్సుకుంటుంది. లొంగిపోవాలి కూడా, తప్పదు. కాదని మొండికేస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది—స్టార్‌ హోటల్‌ రెస్టారెంట్‌లో చేత్తో తినడం లాగా, ఫేడెడ్‌ జీన్సుల మధ్య బెల్‌బాటమ్‌ లాగా. కానీ "అట్లతద్ది'' అనేది ఓ పదమే కదా. దానికేం తెలుసు పాపం స్థల కాలాల్తో పాటూ పరిణామం చెందాలని. అందుకే, దేనికీ లొంగని మొడితనంతో, నాలో కొన్ని బాల్యపు జ్ఞాపకాల్ని కెలికి వదిలేసింది.

అట్లతద్ది అంటే ఆలమూరులో కొన్ని వేకువ జాము ఉదయాలు గుర్తొస్తాయి నాకు. బయట ఆడవాళ్ళ కేరింతల వల్ల పెందలాడే మెలకువ వచ్చేసేది. ఆ కేరింతల్లో అమ్మ గొంతూ ఉండేది. అమ్మ చీకటి పోకుండానే లేచి చుట్టు ప్రక్కల ఆడవాళ్ళతో కలిసి ఏవో ఆటలాడేది. కానీ వాళ్ళు ఆడే ఆటలేంటో నాకు అప్పుడూ తెలీదు, ఇప్పుడూ తెలీదు. ఎందుకంటే, మేం లేచేటప్పటికే ఆ ఆటలు దాదాపు ముగింపుకొచ్చేసేవి. ఒకవేళ తొందరగానే లేచినా అమ్మ మమ్మల్ని ఆ ఆటల్లో చేరనిచ్చేది కాదు. ఆడవాళ్ళు కొన్ని విషయాల్లో మగవాళ్ళని ఊరికే బయటకు నెట్టేస్తుంటారు; బహుశా ఇది అలాంటి ఓ అర్థం పర్థం లేని విషయమనుకుంటా. అయితే అమ్మ అలా చిన్నపిల్లలా ఆడుకోవడం భలే ఉండేది.

అట్లతద్దికి మరో విశేషం ఉయ్యాళ్ళు. ఆలమూరు మధ్యలో ఒక చెరువుండేది. చెరువు చాలా పెద్దది. చెరువుకు తూర్పు దిక్కున మా "చిన్నబడి'', దాని ప్రక్క ఓ రావిచెట్టు; పడమట దిక్కున మొక్కల్తో, తుప్పల్తో, కొబ్బరి చెట్లతో, మధ్య మధ్య పాముల పుట్టల్తో నిండిన ఖాళీ ప్రదేశం; ఉత్తరాన సంతోషిమాత గుడి, చిన్న పార్కు; దక్షిణాన ఊరివాళ్ళ తాటాకు గుడిసెలు, మట్టిగోడల పెంకుటిళ్ళు ఉండేవి. అట్లతద్దికి కొన్ని రోజుల ముందు నుంచే మా బడి పక్కన ఉన్న రావి చెట్టుకు పండగ కళ వచ్చేసేది; అట్లతద్ది ఉయ్యాళ్ళు కట్టేది దానికే. ఆ చెట్టు విశాలమైన ఖాళీ స్థలంలో, మొత్తం ఆకాశాన్ని కప్పేస్తూ చాలా పెద్దదిగా ఉండేది. దాని కొమ్మలకి బలమైన తాళ్ళతో ఉయ్యాళ్ళు కట్టేవారు. అవి చాలా పొడవైన ఉయ్యాళ్ళు. వాటిలో ఊగడం ఆడవాళ్ళ వంతైతే, వాటిని ఊపడం మగవాళ్ళ వంతు. ఉయ్యాల ఊపడానికి ఓ పద్ధతి ఉండేది. ఆ ఉయ్యాల పీటకి కట్టి ఓ పొడవాటి తాడు క్రిందకు వేలాడుతూండేది. ఊపేవాళ్ళు తమ తలల మీంచి ఉయ్యాల వెనక్కి పోగానే, ఆ తాడుని రెండు చేతుల్తో దొరక పుచ్చుకుని, ఉయ్యాల ఉధృతంతో పాటూ గాల్లో కొంత పైకి లేచి, మళ్ళా క్రిందకు బలంగా గుంజేవారు. ఈ గుంజుడు ఎంత బలంగా ఉండేదంటే, కొమ్మని కేంద్ర బిందువుగా చేసుకుని ఉయ్యాల ఓ భారీ లోలకంలా ఇంచుమించు 180 డిగ్రీల కోణంలో ఊగేది. అయితే ఇక్కడో ప్రమాదం ఉంది. ఉయ్యాల కడ కంటా సాగినపుడు ఊగేవాళ్ళు సరిగ్గా చెరువు మధ్యకొస్తారు. ఏ మాత్రం పట్టు జారినా చెరువులోకెళ్ళి పడతాం. కానీ అదెవర్నీ భయపెట్టేది కాదు. నిజానికి ఆ ప్రమాద సూచన ఉయ్యాల ఊగడంలో కాస్త సాహసపు ఎలిమెంట్‌ని కూడా జత చేసి ఆ అనుభవాన్ని మరింత పసందుగా మార్చేదనుకుంటా. పరికిణీవోణీ లేసుకున్న ఆడవాళ్ళు భయం బిగబట్టిన మొహాల్తో ఉయ్యాల ఊగుతుంటే, వాళ్ళ చేత ఎలాగైనా వెర్రికేకలు పెట్టించాలన్న ఉత్సాహంతో అబ్బాయిలు మరింత రెచ్చిపోయి ఊపేవారు. అయితే అమ్మాయిలు వెర్రి కేకలు పెట్టడంలో కూడా ఏదో ముచ్చటైన ఆడతనాన్ని చూపించేవారు. సాధారణంగా అబ్బాయిలెవ్వరూ ఉయ్యాల ఊగేవారు కాదు. అప్పటికి మేమింకా పదేళ్ళలోపు వాళ్ళం కాబట్టి మాకు మినహాయింపు నిచ్చారనుకుంటా. నేను ఎప్పుడూ ఒక్కణ్ణీ ఊగలేదు. మొదటిసారి నా పైతరగతి వాడెవడో నన్ను వళ్ళో కూర్చోపెట్టుకోవడం గుర్తుంది. ఇద్దరం ఎదురుబొదురుగా కావలించుకుని పీట మీద కూర్చున్నాం. ఊపడం మొదలుపెట్టారు. మొదట కాసేపు మాత్రమే పరిసరాల అవగాహన ఉంది. కాసేపు మాత్రమే క్రింద దూరమై దగ్గరవుతున్న భూమిని కళ్ళు తెరిచి చూడగలిగాం. తర్వాత వాణ్ణి నేనూ, నన్ను వాడూ కరిచి పట్టుకుని కళ్ళు మూసేసుకున్నాం. వడి ఎంతగా పెరిగిపోయిందంటే, ఇంకాస్త పెరిగితే మా ఉయ్యాల వెళ్ళిందారిన మళ్ళీ వెనక్కి రాకుండా పైకిపోయి ఆ కొమ్మకి గుండ్రంగా లుంగలు చుట్టేసుకుంటుందేమోనని భయమేసింది. చెవుల్ని ఝమ్మని ఒరుసుకుపోయేగాలి, రావి ఆకుల గలగలలు, భూమ్మీద దగ్గరవుతూ దూరమవుతూ వినిపిస్తున్న జనం కోలాహలం . . . ఉయ్యాల ఆగేకనే జారిపోయిన గుండె తిరిగి యధాస్థితికి వచ్చి చేరేది. ఉయ్యాల దిగిన కాసేపటి వరకూ భూమి కూడా ఉయ్యాలూగుతున్నట్టు అనిపించేది. ఈ సంబరం చల్లారేకా ఇంటికి వెళ్తే బెల్లం తీపి, మిరియాల ఘాటు కలిసిన రుచితో పానకం, అందులో ముంచుకుని తినడానికి బోలెడన్ని అట్లు. ఈ సంరంభం అంతా చూస్తే, అట్లతద్ది ఏడాదిలో వచ్చే ఏ పండక్కీ తీసిపోదనిపించేది. అట్లతద్దనే కాదు; నాగుల చవితి, సుబ్రహ్మణ్యషష్టి, రథ సప్తమి, శివరాత్రి . . . ఇలా ఇప్పుడు కేవలం కేలండర్‌కి మాత్రమే పరిమితమైపోతున్న చాలా పండగలు, ఆ వూళ్ళో నా చిన్నతనంలో చాలా ఘనంగా జరిగేవి. ప్రతీ పండగకీ ఏదో ఒక అందమైన తంతు ఉండేది. ఊరంతా అందులో మునిగి తేలేది.

నాగుల చవితికి పాముల పుట్టల్లో పాలు పోసేవారు. పాముల పుట్టలు నేనిందాక చెప్పిన చెరువుకే ఆవలిగట్టున ఉండేవి. తుప్పలు, పిచ్చిమొక్కల మధ్య ఉండే వాటి దగ్గరకు కాలిబాటమ్మటా నడుస్తూ వెళ్ళాలి. పొద్దున్నే ఆడవాళ్ళు కొత్త బట్టల్తో, మెడ క్రింద గంధపు పూతల్తో, పండగ కళ నిండిన మొహాల్తో, చెంబుల్లో పాలు తీసుకుని వచ్చేవారు. పుట్ట కన్నాల్లో కొంతమంది పాలుపోసేవారు, కొంతమంది గుడ్లు జారవిడిచేవారు. వాళ్ళలా గుడ్లు వేసి వెళ్ళగానే—కూర వండుకోవటానికి అనుకుంటా—కొంతమంది కుర్రాళ్ళు కన్నాల్లో చేతులు పెట్టి గుడ్లు బయటకు తీసి పట్టుకెళిపోయేవారు. ఆ పుట్టల్లో పాములుండటం నేను ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడింకో జ్ఞాపకం రాజుకుంటోంది. ఈ పుట్టల దగ్గరకు వెళ్ళే దారిలోనే నేను మొట్ట మొదటి సారి అత్తిపత్తి ఆకుల్ని చూసింది. ముట్టుకోగానే భలే ముడుచుకుపోయేవి. అప్పుడు నా కూడా ఎవరున్నారో గుర్తులేదు గానీ, ఓ రోజు మధ్యహ్నమంతా కూర్చుని ఆ దారిలో ఉన్న అత్తిపత్తి మొక్కలన్నింటినీ ముడుచుకుపోయేలా చేసాం.

సుబ్రహ్మణ్య షష్టి ఆలమూరులో కన్నా తాతయ్య వాళ్ళ ఊరు అంగరలో బాగా జరిగేది. ముఖ్యంగా తీర్థం చాలా ఘనంగా జరిగేది. గుడి దరిదాపుల్లో ఉన్న వీథులన్నీ కళ్ళకింపైన సందడితో కళకళలాడేవి. బుడగలు, వేణువులు, కమాను వాయిద్యాలు, రంగురంగుల ప్లాస్టిక్‌ కళ్ళ జోళ్ళు, బుల్లి తుపాకులు, బుల్లి కార్లు, బుల్లి బయోస్కోపులు, దేవుళ్ళ పటాలు, విగ్రహాలు, ఇలా ఎటుచూడు రంగులే! వీటి మధ్య ఖర్జూరం, జీళ్ళ కొట్లు తప్పనిసరిగా ఉండేవి. జీళ్ళ కొట్లంటే గుర్తొస్తోంది. ఏదో బేరమాడటానికన్నట్టూ కొట్టు ముందుకెళ్ళే వాళ్ళం. కొట్టు ముందు బల్ల మీద మా తలంత ఎత్తులో జీళ్ళు గుట్టలుగా పోసి ఉండేవి. కొట్టువాడు మేకు కేసి జీడి పాకం సాగదీసే పనిలో పరాకుగా ఉండటం చూసి, చేతికందినన్ని జీళ్ళు నొక్కేసి జేబులో వేస్సుకునేవాళ్ళం. జేబులో డబ్బులున్నా సరే, కొనే తాహతున్నా సరే, ఇలాంటివేవో చేయకపోతే మా తీర్థ విహారానికి సార్థకత లభించేది కాదు. ఎందుకంటే, జీళ్ళ కన్నా ముఖ్యంగా మాక్కావల్సింది దొంగతనంలోని సాహసపు రుచి. ఈ తీర్థం జరిగినన్నాళ్ళూ ఊరి స్వభావమే మారిపోయేది. ఊరు కూడా రక్త మాంసాలు, జవజీవాలు ఉన్న సజీవాంశలా కనిపించేది. పండగలో మాతో పాటూ ఊరు కూడా పాల్గొన్నట్టనిపించేది.

ఇక రథ సప్తమి. రథ యాత్రకి ఓ రెండు వారాల ముందే రథసప్తమినాడు జనార్దన స్వామి గుడి ఎదుట పెద్ద గోడౌన్‌లో ఉంచిన రథాన్ని బయటకు తీసేవారు. ఆలమూరు జనార్దన స్వామి రథం చాలా పెద్దది. రథ యాత్రప్పుడు అడ్డం రాకుండా కరెంటు తీగల్ని కూడా కత్తిరించేవారు. అది గోడౌన్లో ఉన్న సంవత్సర కాలమూ దాంట్లో పావురాలే నివాసం ఉండేవి. దాంతో బయటకు తీసేసరికి రథమంతా వాటి రెట్టల్తో నిండిపోయి ఉండేది. బయటకు తీసి శుభ్రంగా కడిగి సిద్ధం చేసేవారు. రథం అలా బయట ఉన్న రోజులంతా బడి అయిపోయిన తర్వాత పిల్లలందరం అక్కడికే చేరేవాళ్ళం. రథమెక్కి ఆడుకునే వాళ్ళం. రథం మొత్తం ఐదంతస్థులుగా ఉండేది. క్రింద నుండి పైకి పోయే కొలదీ అంతస్తుల ఎత్తు తగ్గేది. పెద్ద వాళ్ళు పై అంతస్తుల్లోకి రావలంటే పాక్కుంటూ రావాల్సిందే. చిన్న వాళ్ళం కాబట్టి సులభంగా జొరబడిపోయి ఆడుకునే వాళ్ళం. దొంగ - పోలీసు లాంటి ఆటలు ఆడటానికి అది భలే చోటు. ఏ అంతస్తులో దాక్కున్నామో తెలుసుకోవడానికి పోలీసు చాలా కష్టపడాలి. తెలుసుకున్నా ముట్టుకోవడం కష్టమే. ఆ రథం నిర్మాణం అంతా ఓ labyrinth లా ఉండేది.

ఇక శివరాత్రికైతే శివాలయం దగ్గర మరో సందడి: దేవాలయం ఆవరణలో "భక్త జన సందోహాన్ని'' ఉద్దేశించి మైకు చేసే హడావిడి; సీతాకోకచిలకలు బారులు తీరినట్టూ చంచలమైన వరుసలో పరికిణీవోణీలు, పంజాబీలు, చీరలు; కర్పూరం, అగరబత్తుల వాసన; కొబ్బరికాయలు పెఠేల్మని చిట్లుతున్న చప్పుడు; తల మీద శఠగోపం మెత్తని స్పర్శ, గర్భగుడి ఎదుటనున్న నంది నెత్తి మీద చూపుడు వేలు, బొటన వేలూ గోపురం కట్టి మధ్య నుంచీ చూస్తే అభిషేకాలందుకుంటున్న లింగ దర్శనం; రాత్రైతే ఆలయం ముందు ప్రదర్శించే నాటకాల్ని చూస్తూ జాగారం . . . . ఓ బాల్య మిత్రురాలి సాంగత్యం గుర్తొస్తోంది. నంది వర్థనం పూల చెట్టు క్రింద ఆమెతో ఉప్పుల కుప్ప ఆడిన క్షణాల్లోనే అనుకుంటా, స్త్రీత్వంతో నా జీవిత కాలపు ప్రణయానికి తొలి ముహూర్తమెక్కడో పడిపోయింది. ఇప్పటికీ నా మెదడులో నంది వర్థనం పూలకీ ఆమె జ్ఞాపకానికీ ఆ లంకె అలాగే ఉండిపోయింది. ఆ పువ్వుని గట్టిగా వాసన పీలిస్తే చాలు, నా లోపల ఆమె జ్ఞాపకం ప్రాణం పోసుకుంటుంది. అహ! వాసన కూడా పీల్చక్కర్లేదు, ఇక్కడ కారు టైర్ల క్రింద చితికి చిధ్రమైపోయి జాలిగా ఛస్తున్న ఓ పువ్వుని చూసినా చాలు, ఎందుకో ఆమె గుర్తొస్తుంది. చాలా చిత్రం కదూ! వర్తమానంలో, ఈ క్షణాల్లో, మనం ఏవి ముఖ్యమనుకుంటామో అవేమీ మన వెంటరావు. నిజంగా ఏవి ముఖ్యమో ఆ క్షణాల్ని పరాకుతోనే దాటేస్తాం. కాని మన జ్ఞాపకం మనకే తెలియకుండా అన్నింటినీ వడగట్టి, తనకు విలువైనవేవో ఏరుకుని, చాలా జాగ్రత్తగా పదిలపరచుకుంటూ వస్తుంది. పరీక్ష గెలిచిన రోజో, ఉద్యోగంలో పదోన్నతి దొరికిన రోజో గుర్తుండిపోతాయనుకుంటాను; కానీ, బస్టాండ్‌లో దక్కించుకున్న వాలు కంటి చూపులో, గోదావరి ఇసుక తిన్నెల్లో కొట్టిన పల్టీలో మాత్రమే గుర్తుంటాయి.

ఇంతకీ ఈ అట్లతద్ది జ్ఞాపకాలు నన్ను బాధ పెట్టాయంటే నేను స్థల కాలాలు రెండింటిలో స్థలాన్ని తప్పు పట్టలేను; కాలాన్నే తప్పు పట్టాలి పడితే. నేను ఇప్పుడు హైదరాబాదులో కాక ఆలమూరులోనే ఉన్నా, ఆలమూరులో అట్లతద్ది ఉండకపోవచ్చు. అసలా రావి చెట్టు ఉందా కొట్టేశారా అన్నదీ అనుమానమే. అట్లతద్దనే కాదు, నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్టి ఇలా చాలా అందమైన పండగలన్నీ కేలెండర్లలోనే మిగిలిపోతున్నాయి. ఎందుకు వదిలేస్తున్నాం వీటన్నింటినీ? ప్రపంచీకరణ జరుగుతోంది, అంతా ఏకమైపోతోంది, ఇలా కొన్ని వదిలేయక తప్పదంటారు సరే. కానీ, నాకు తెలిసి, ఆ సంగమ స్థలికి అందరూ తమ తమ సంస్కృతుల్ని వెంటబెట్టుకునే వస్తున్నారు. హాలోవిన్లు, టమాటా ఫెస్టివల్లూ, బీటిల్సూ, వాల్ట్‌విట్మానూ, కామిక్‌ బుక్సూ, బుల్‌ ఫైటింగులూ, అందరూ అన్నీ తమ కూడా తెచ్చుకుంటున్నారు. మనమే అన్నీ వెనక విడిచేసి వస్తున్నాం. ఈ ప్రపంచీకరణ అన్న గోదాలోకి అందరూ ఘనమైన సంస్కృతుల దన్నుతో గర్వంగా వచ్చి చేరుతుంటే, మనమే సంస్కృతిలేని అనాధల్లా బేల మొహాల్తో హాజరవుతున్నాం. నేనిక్కడ "ఎందుకు?'' అని ప్రశ్నించటం లేదు, "అయ్యో ఎందుకిలా'' అని బాధపడుతున్నానంతే. డార్విన్‌ 'నేచర్‌ సెలక్షన్‌ థియరీ'నే ఇక్కడా అన్వయించుకోవాలేమో: ప్రకృతి తన పురోగమనానికి అనుకూలమైన సంస్కృతుల్ని ఎన్నుకొని, మిగతా వాటినన్నింటినీ నిర్దాక్షిణ్యంగా చిదిమేస్తుందేమో. బాధే అయినా ఇది అంగీకరించక తప్పదేమో. అయినా బాధ పడటమే ఇక్కడి నా ఉద్దేశ్యం కనుక బాధ పడుతున్నాను.

ఇక నన్ను బాధ పెట్టిన రెండో కారణం, ఇటీవల నా కొలీగ్‌ నాతో మాట్లాడిన కొన్ని మాటలు. ఆయనకో యాభయ్యేళ్ళుంటాయి, మంచి రచయిత, పదాలతో బొమ్మ కట్టించడం అంటే సరదా పడతాడు. మా సంభాషణ తెలుగు భాష గురించి సాగింది. వాళ్ళ ఇరవై రెండేళ్ళ అబ్బాయికి ఐ.బి.ఎం లో ఉద్యోగం. ఆ కుర్రాడు తెలుగు కేవలం మాట్లాడగలడు; చదవడం, రాయడం రాదు. ఆయన ఈ విషయంలో కాసేపు బాధ పడ్డాడు. తర్వాత తేరుకుని, ఇంచుమించు ఈ అర్థం వచ్చేట్టు మాట్లాడాడు: "అయినా ఏం ఫర్లేదు ఫణీ! మా తరం అయిపోయింది. తెలుగు పూర్తిగా లేకపోవడమన్నది మేము చూడం. మేము చూడాల్సినవన్నీ చూసేసాం. శ్రీశ్రీని చూసాం, తిలక్‌ని చూసాం. శ్రీశ్రీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడంటే ఆడవాళ్ళు వంటి మీద నగలు ఒలిచి ఇచ్చేయడం కూడా ఈ కళ్ళతో చూసాన్నేను. దేనికి విలువ అందాలో దానికి విలువ అందిన కాలం మాది,'' అంటూ ముగించాడు. నాకు వెంటనే కడుపులో ఖాళీ ఏర్పడిపోయి నేను లోపలికి కుంచించుకుపోతున్న భావన కలిగింది. ఏమని పేరు పెట్టాలి, అప్పటి నా భావనకు? మనం ఎప్పుడో బతికిన గతం గురించి ఆపేక్ష పడటాన్ని "నోస్టాల్జియా'' అనొచ్చు. కాని మనకెప్పుడూ పరిచయమే లేని గతం పట్ల ఆపేక్ష కలిగితే, దాన్నేమనాలి? నాకు నిజంగా ఆ కాలం పట్ల ఆపేక్ష కలిగింది. ఇక్కడ కాక, అక్కడ బతికుంటే బాగుండేదనిపించింది. ఆ కాలం . . . ఏ సంక్లిష్టతలూ లేని కాలం . . . నాకిప్పుడు "ఐ విష్‌ ఐ వజె ఫంక్‌ రాకర్‌'' పాట వరసలు గుర్తొస్తన్నాయి:

When the head of state didn't play guitar
Not everybody drove a car
When music really mattered and when radio was king
When accountants didn't have control
And the media couldn't buy your soul
And computers were still scary and we didn't know everything

Oh I wish I was a punk rocker with flowers in my hair
In seventy-seven and sixty-nine revolution was in the air
I was born too late into a world that doesn't care
Oh I wish I was a punk rocker with flowers in my hair

అఫ్‌కోర్స్‌, తల్లో పూలు అక్కర్లేదు, పైగా నేను పాడితే గాడిదలు వంతపాటకి సిద్ధమౌతాయి. ఇవన్నీ కాదు గానీ, ఆ కాలంలో నిజంగానే ఏదో ఉంది; ఈ కాలంలో లేనిది. ఆ కాలంలో మెయిన్‌ స్ట్రీమ్‌ లైఫ్‌ నచ్చకపోతే పక్కకి వెళిపోయి అవుట్‌సైడర్‌గా బతికే సౌలభ్యం ఉంది. ఈ వెధవ కాలంలో చివరకు సమాజానికి అవుట్‌ సైడర్‌గా బతకాలన్నా చాలా కష్టం. ఎందుకంటే, ఇక్కడ అవుట్‌ సైడర్లకీ, బొహేమియన్లకీ కూడా ప్రత్యేకమైన సమాజాలున్నాయి. వాళ్ళకోసం ప్రత్యేకమైన ఉత్పత్తులున్నాయి. వాళ్లకు టీ-షర్టులు, చిరిగిన జీన్సులు, చెదిరిన క్రాఫుల్లాంటి ప్రత్యేకమైన ఎటిక్వెటీ, వాళ్ళనుద్దేశించి ప్రత్యేకంగా సినిమాలు, పాటలు, పాషన్లు . . . ఇలా వాళ్ళ మీద ఆధారపడి భారీ ఉత్పత్తి జరుగుతుంది. వరకడ్డంగా బతికేస్తున్నామని సంబరపడిపోయేవాళ్ళు కూడా చివరకు వినియోగదారుల మందలో మరో గొర్రెగానే మిగులుతారు.

మొన్నా మధ్య "రావిశాస్త్రి రచనా సాగరం'' పుస్తకాన్ని కొన్నాను. పుస్తకం మొదట్లో 1935 నుండీ 1941 వరకూ రావిశాస్త్రిగారు తన టీనేజ్‌లో రాసుకున్న డైరీ ఎంట్రీలు ముద్రించారు. అవి చదువుతున్నప్పుడూ నాలో అదే నోస్టాల్జియా లాంటి భావన. ఆ డైరీల నుంచి మచ్చుకు కొన్ని రాండమ్‌ ఉదాహరణలు:

ఆదివారం, 1934 - సెప్టెంబరు 29: ఇవాళ పొద్దున్న ఏడున్నర గంటలకి లేచాను. యుద్ధం వొస్తే ఈ ఊరు మీద కూడా బాంబులు వేస్తారని అనుకుంటున్నారు. కొలువులో గవ్వల్తో తేళ్ళు చేసేను. రోడ్డు అదీ వేసి మనుష్యుల్ని బళ్ళనీ వాట్నీ పెట్టేను. చాలా పెద్ద వర్షం పడింది. పొద్దున్న, 'ది స్కూల్‌ బోయ్‌ ప్రిన్స్‌' చదివీసేను. ఇది కూడా చాలా బాగుంది. పెద్ద నాన్నగారు కాణీ ఇచ్చేరు. ఇవాళ గాన సభ ఏమీ బాగు లేదట.

సోమవారం, 1935 - నవంబర్‌ 25: సాయంత్రం కవి షష్టిపూర్తికి వెళ్లేను. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి హిందీ ప్రచారము అణచెయ్యాలని చెప్పేడు. ఉన్నవ లక్ష్మీనారాయణ దానికెగెనిష్టుగా చెప్పేడు. శివ శంకర శాస్త్రి, బుచ్చి సుందర్రావు ఎటు కాకుండా చెప్పేరు. కందాళ సర్వేశ్వర శాస్త్రి చెప్పేడు. పురిపండా అప్పల స్వామి హిందీకి ఎగెనిష్టు గానే చెప్పేడు . . . చిట్టి పొద్దున్నొచ్చి సాయంత్రం వెళిపోయింది. నాన్నగారు ఊరి నుంచి వచ్చీసేరు. జామిపళ్ళు తెచ్చేరు.

బుధవారం, 1938 - సెప్టెంబరు 7: కాలేజీకి విశ్వనాథ సత్యన్నారాయణ గారు వచ్చి ఉపన్యాసం ఇచ్చేరు. ఆంధ్ర ప్రశస్తిలోవి, కిన్నెరసానిలోవి పద్యాలు చదివేరు. చాలా బాగున్నాయి. ఇంటికి వచ్చి భోజనం చేసి బాబ్జీ కోసం క్రిష్ణ సైకిలు మీద వాల్తేరు వెళ్ళేను. వాడి స్నేహితుల కోసం వడలు, జీడిపప్పు పాకం పట్టుకొని వెళ్ళేను, వాడికిచ్చీసేను. మరో రెండు రూపాయలు కూడా ఏమైనా కొనడానికి ఇచ్చేను. మళ్ళా పందొమ్మిదో తారీఖున వస్తాడట. కోమటి వాడు తన తమ్ముడికి ఒక ఫ్యాంట్‌ ఇచ్చీమని ఇచ్చేడుట... 'వినోదిని' కొన్నాను. నా కథ పడ్డాది. బొమ్మ కూడా వేసేడు.

శుక్రవారం, 1939 - సెప్టెంబరు 1 : సుభాష్‌ చంద్రబోసు కాకినాడ వెళ్తున్నాడు. వాల్తేరు స్టేషన్‌లో విద్యార్థుల మందరం వెళ్ళి చూసేం. టిపికల్‌ బెంగాలీబాబు. అంత ఎమోషనల్‌గా మాట్లాడలేడు. జర్మనీ పోలెండుతో యుద్ధం ప్రారంభించింది. పై వారెవరైనా పోలండుని ఎదుర్కొంటే వాళ్ళకి ఇంగ్లీషు వాళ్ళు, ఫ్రెంచి వాళ్ళు సహాయం చేయడానికి ఇదివరకూ సంధి జరిగింది. ఇప్పుడేమవుతుందో తెలియదు.

శుక్రవారం, 1941 - ఏప్రిల్‌ 4 : సాయంత్రం బీచీని నేనూ దువ్వూరి నరసింహం కూర్చున్నాం. రాత్రి 'ముసాఫిర్‌' సినీమాకి వెళ్దామన్నాడతను. సరేనన్నాను నేను. కాని రాత్రి వెళ్తూ ఉంటే భాస్కర్రావు కనిపించి 'ముసాఫిర్‌' వెళిపోయిందన్నాడు. 'బంధన్‌' సినిమాకి వెళ్ళేం. కొల్లావాడు కూడా వచ్చేడు. రాత్రి భాస్కర్రావింట్లోనే పడుకున్నాను. ఇవాళ నవమి సంబరాల్లో కలియుగ పురాణం అనే వేషం చాలా బాగుంది. రాత్రి నలుగురాడవాళ్ళని సోల్జర్లు పాడు చేయబోయారట. ఒక సోల్జర్ని మన వాళ్ళు చితక తన్నీసేరట.

ఈ డైరీ ఎంట్రీలు చదువుతుంటే, ఆయన ఇందులో నమోదు చేసిన వివరాలన్నింటి నేపథ్యంలోనూ, ఆయన ప్రయత్నమేమీ లేకుండానే, ఓ ("అందమైన'' అనలేను గానీ) ఆకర్షణీయమైన కాలం రూపం పోసుకుంది; అస్పష్టంగా, ఆవిరి పట్టిన గాజు పలకకు ఆవలనున్న దృశ్యంలా, తెలిసీ తెలియకుండా నన్ను కవ్వించింది. అక్కడ బతికుంటే బాగుండుననిపించింది. ఆ కాలానికి విశిష్టత ఏంటంటే అక్కడ పట్టుకోవడానికి ఏదో ఆసరా ఉంది. జీవితాల్ని అల్లుకోవడానికి ఏదో ఆలంబన ఉంది. నేషనలిజమో, మార్క్సిజమో, నక్సలిజమో, వల్లకాడో. . . ఏదైతేనేం, ఒక యుద్ధముంది; భ్రమైతేనేం, వాళ్ళకు శత్రువులున్నారు. వాళ్ళు చాలా నమ్మకంతో, చాలా తేలికగా తమ జీవితాల్ని మిథ్యా సమరాలకు తర్పణాలుగా అర్పించేశారు. తమ జీవితాల్ని అర్థవంతంగా గడిపామన్న నమ్మకంతో ఆనందంగా చచ్చిపోయారు. వాళ్ళకా అనుకూలత ఉంది. కానీ నాకేం ఉంది? నా తరం ముందు పెద్ద ఖాళీ ఉంది. "ఫైట్‌ క్లబ్‌'' సినిమాలో టైలర్‌ డర్డన్‌ మాటల్లో చెప్పాలంటే:

"I see all this potential, and I see it squandered. God damn it, an entire generation pumping gas, waiting tables; slaves with white collars. Advertising has us chasing cars and clothes, working jobs we hate so we can buy shit we don't need. We are the middle children of history man! No purpose, no place. We have no Great War. No Great Depression. Our Great War is a spiritual war . . . our Great Depression is our lives."

అంతో ఇంతో ఇది నిజమనే చెప్పాలి. టైలర్‌ డర్డన్‌ ఒక చార్మింగ్‌ బాస్టర్డ్‌. సమస్యను చాలా బాగా ఎత్తి చూపుతాడు. కాని దానికి చూపించే పరిష్కారమే వింతగా ఉంటుంది. ప్రస్తుత యాంత్రిక ప్రపంచంలో మనల్నీ ఒక యంత్రంగా ఒదిగిపోయేట్టు సిద్ధం చేసే సోకాల్డ్‌ "సెల్ఫ్‌ ఇంప్రూవ్‌మెంట్‌'' పద్ధతుల్ని అతను వ్యతిరేకిస్తాడు. ఇలా సమస్యను అంచనా కట్టడం వరకూ బాగానే ఉంది. కాని, సమస్య "A'' అనుకుంటే, దానికి పరిష్కారం "~A'' అంటాడు. అక్కడే అతనితో ఇబ్బంది. ఇప్పుడు మనకి కావాల్సింది "సెల్ఫ్‌ ఇంప్రూవ్‌మెంట్‌'' కాదు, "సెల్ఫ్‌ డిస్ట్రక్షన్‌'' అని వాదిస్తాడు. ఇది చాలా ప్రమాదకరమైన వాదన. ఇలాంటి వాదనల ఫలితం తర్వాత్తర్వాత అమెరికాకే అనుభవానికొచ్చింది. సెప్టెంబరు 11న, ట్విన్‌టవర్స్‌ శిథిలమయ్యే కొద్ది క్షణాల ముందు, విమానం కాక్‌పిట్‌లోంచి వాటిని చివరి సారి చూసిన వాళ్ళు టైలర్‌ డర్డన్‌ లాంటి వాళ్ళే. టైలర్‌ డర్డన్‌ వినడానికి చాలా ఇంపుగా వాదిస్తాడు; అనుసరిస్తే గుడిపించేస్తాడు.

అయితే, "వ్యక్తిత్వ వికాసం'' కాదు, "వ్యక్తిత్వ విధ్వంసం'' కావాలి అన్న అతని వాదనలోని రెండో భాగాన్ని వదిలేస్తే, అతని వాదన నిజంగా సమంజసమే. ప్రస్తుతం ఒక ఉద్యమంగా చెలామణీ అవుతున్న "వ్యక్తిత్వ వికాసం'' నిజంగా ఒక జాడ్యమే. ఈ జాడ్యపు పర్యవసానాలు ఇంకా బయటపడలేదు గానీ, ఎటు చూసినా రోగ పీడితులే. ఈ ఉద్యమకారులు—మనం "ఎఫెక్టివ్‌ పీపుల్‌''గా మారడానికి ఏ 7 అలవాట్లు అలవరచుకోవాలో చెప్తారు; విజయం సాధించాలంటే ఏ 5 మెట్లు ఎక్కాలో బోధిస్తారు. ముందే పోసిన మూసల్లో సామరస్యంగా ఒదిగిపోయేలా మనకు తర్ఫీదునిస్తారు, దువ్వుతారు. ఈ వ్యక్తిత్వ వికాస పుస్తకాలన్నీ ప్రాథమికంగా ఒకే ప్రాతిపదిక మీద మొదలౌతాయి: పుస్తకం తెరిచిన చదువరి ఎలాంటివాడైనా, వాడు మారాలి. ప్రతీ మనిషికీ ఒక unique identity ఉంటుందన్న సంగతి, ఈ వైవిధ్యం సృష్టి స్వభావం అన్న సంగతి ఇలాంటి పుస్తకాలు రాసేవాళ్ళకి గుర్తుండదనుకుంటా. ఇవి విజయం సాధించడమే, లేదా "నెంబర్‌వన్‌'' కావడమే (దేవుడికే తెలియాలి అదేంటో) మనిషి జీవిత పరమార్థంగా చెప్తాయి. ఆ ప్రయాణంలో మనిషి తనమైన తనే యుద్ధం చేసుకోవాలంటాయి; తనలోని ప్రత్యేక వ్యక్తిత్వాన్ని (లేదా వాళ్ళ భాషలో "బలహీనతల్ని'') చంపేసుకోమంటాయి. ఎక్కడకో చేరుకుంటే తప్ప ఆనందం లభ్యం కాదన్న భ్రమని చాప క్రింద నీరులా పాఠకుల మనసుల్లోకి ఎక్కిస్తాయి. "లక్ష్యం'', "గమ్యం'' లాంటి పదాలు రెండు మూడు వాక్యాలకోసారి వీటిల్లో తగుల్తుంటాయి. —అయినా నేను విషయం మళ్ళుతున్నట్టున్నాను.

నా కొలీగ్‌ ఆ మాటలన్నపుడు నాకు చాలా దిగులేసింది. సగం దిగులు నేను బతకవలసిన కాలంలో బతకటం లేదనిపించడం వల్ల. మరి సగం దిగులు నా ఆలోచనలు ఈ రీతిలో సాగడం చూసి. అంటే, పాతికేళ్ళ వాణ్ణి, ఎంత తక్కువ అంచనా వేసినా ఇంకో నలభయ్యేళ్ళు నిక్షేపంలా బతక వలసిన వాణ్ణి, అప్పుడే గతం పట్ల—అది కూడా నాకు అస్సలు పరిచయమే లేని గతం పట్ల—ఆపేక్ష పడుతున్నానంటే, ఏదో తేడా ఉన్నట్టే కదా.

సరే, ఇక మూడో కారణం: ఒక తిలక్‌ కవిత. ముందు తిలక్‌తో నా స్నేహం గురించి కాస్త చెప్పుకోవాలి. మాది ఆరేళ్ళ స్నేహం. ఆరేళ్ళ క్రితం హైదరాబాద్‌ వచ్చిన కొత్తలో "అమృతం కురిసిన రాత్రి'' కొన్నాను. ఇప్పటికీ దాంతో నా స్నేహం పాతబడలేదు. పాతబడకపోవడానికి కారణం తిలక్‌ నాకు ఇప్పటికీ పూర్తిగా పరిచయం కాకపోవడమనుకుంటా. అసలెప్పటికీ పూర్తిగా పరిచయం కాడేమో కూడా. అంతా తెలిసిపోయాడనుకున్న తరుణంలో అంత వరకూ చూడని తళుకేదో చూపిస్తాడు; మళ్ళీ కొత్త కోణంలో ప్రత్యక్షమవుతాడు. తిలక్‌ ఓ పూల తోటలాంటి వాడు. పూలతోటని ఎప్పటికీ పూర్తిగా పరిచయం చేసుకోలేం. అంతా తెలిసిపోయిందనుకున్న తరుణంలో, తెల్లారి లేవగానే, ఏదో మూల ఓ కొత్త మొగ్గ కనిపించి మురిపిస్తుంది. బహుశా ఈ సాదృశ్యం కూడా సరైంది కాదేమో. ఈ సందర్భంలో కొత్త మొగ్గలు వికసించేది తోటలో కాదు; కొత్త మొగ్గలు నాలో వికసిస్తున్నాయి, వాటి ప్రతిబింబాల్నే తోటలో చూసుకుంటున్నాను.

బయటకొస్తే చచ్చిపోతానేమోననే మార్బిడ్‌ భయంతో చాలా కాలం తనను తాను ఓ ఇరుకు గదిలో బంధించుకున్న ఈ వ్యక్తి ఇలా "నవ నవాలైన ఊహా వర్ణార్ణవాల''ను ఎలా అక్షరబద్ధం చేసాడా అనిపిస్తుంది; కొన్ని పంక్తుల నిర్మాణంలో, డిగో మారడోనా "దైవ హస్తం'' లాగా, ఏవన్నా అతీంద్రియ హస్తం సహాయపడిందా అనిపిస్తుంది. ఉదాహరణకి "అదృష్టాధ్వగమనం'':

"ఇప్పటికీ ఈ చీకటి మొగలో
నిలిచి పాడుతున్న నా కోసం
కుబుసం విప్పిన గోధుమ వన్నె తాచు
మొగలి పొదల నుండి పడగ విప్పి ఆడుతుంది
ప్రాగ్దిశా సుందరి ఖండ చంద్ర పరిదీపిత కపోలాల హసిస్తుంది
నా గుండెలపై శుక్రతార కిరణం సూటిగా వచ్చి వాలుతుంది.''

కవిత చివరి పంక్తి పూర్తికాగానే నిజంగానే నక్షత్రపు మెత్తని వెలుగులాంటి మధుర భావనేదో సూటిగా వచ్చి గుండెలపై వాలిన అనుభూతి కలుగుతుంది.

ఇంతకీ నన్ను బాధపెట్టిన—సరిగ్గా చెప్పాలంటే చికాకు పరచిన—కవిత పేరు "మన సంస్కృతి''. నిజానికి దీన్ని కవిత అనే కన్నా, కవిత అనే ముసుగు తొడుక్కున్న రెటోరిక్‌ అని చెప్పొచ్చు:

మన సంస్కృతి

మన సంస్కృతి నశించిపోతూందన్న
మన పెద్దల విచారానికి
మనవాడు పిలక మాని క్రాపింగ్‌ పెట్టుకున్నాడనేది ఆధారం
మనగలిగినదీ
కాలానికి నిలబడ గలిగినదీ వద్దన్నా పోదు
మరణించిన అవ్వ నగలు
మన కాలేజీ అమ్మాయి ఎంత పోరినా పెట్టుకోదు
యుగ యుగానికీ స్వభావం మారుతుంది
అగుపించని ప్రభావానికి లొంగుతుంది
అంతమాత్రాన మనని మనం చిన్నబుచ్చుకొన్నట్లు ఊహించకు
సంతత సమన్వయావిష్కృత వినూత్న వేషం ధరించడానికి జంకకు
మాధుర్యం, సౌందర్యం, కవితా
మాధ్వీక చషకంలో రంగరించి పంచి పెట్టిన
ప్రాచేతస కాళిదాస కవి సమ్రాటులనీ,
ఊహా వ్యూహోత్కర భేదనచణ
ఉపనిషదర్థ మహోదధినిహిత మహిత రత్నరాసుల్నీ
పోగొట్టుకునే బుద్ధి హీనుడెవరు?

ఎటోచ్చీ
విధవలకీ వ్యాకరణానికీ మనుశిక్షాస్మృతికీ గౌరవం లేదని
వీరికి లోపల దిగులు
వర్తమానావర్త ఝంఝూ వీచికలికి కాళ్ళు తేలిపోయే వీళ్ళేం చెప్పగలరు?
అందరూ లోకంలో శప్తులూ పాపులూ
మనం మాత్రం భగవదంశ సంభూతులమని వీరి నమ్మిక
సూర్యుడూ చంద్రుడూ దేవతలూ దేవుళ్ళూ
కేవలం వీరికే తమ వోటిచ్చినట్లు వీరి అహమిక
ఇది కూపస్థ మండూకోపనిషత్తు
ఇది జాతికీ ప్రగతికీ కనబడని విపత్తు
మన వేషం, మన భాషా, మన సంస్కృతీ,
ఆది నుండీ, ద్రవిడ బర్బర యవన తురుష్క హూణుల నుండీ,
ఇచ్చినదీ పుచ్చుకున్నదీ ఎంతైనా ఉన్నదనీ
అయిదు ఖండాల మానవ సంస్కృతి
అఖండ వసుధైక రూపాన్ని ధరిస్తోందనీ,
భవిష్యత్‌ సింహ ద్వారం
తెరుస్తోందనీ,

గ్రహించలేరు పాపం వీరు
ఆలోచించలేని మంచి వాళ్ళు
ఏ దేశ సంస్కృతి అయినా ఏనాడు కాదొక స్థిర బిందువు
నైక నదీ నదాలు అదృశ్యంగా కలిసిన అంతస్సిధువు.

- 1965

అసలే పై రెండు బాధలతో అచేతనంగా సతమతమవుతున్న నన్ను ఈ కవిత ఇన్నాళ్ళూ లేనిది ఎందుకో కాస్త రెచ్చగొడుతున్నట్టనిపించింది. "తిలక్‌ చెప్తోందంతా నిజమేనా'' అనిపించింది కాసేపు. నాకు తెలుసు, "అయిదు ఖండాల మానవ సంస్కృతి అఖండ వసుధైక రూపాన్ని ధరిస్తోందనీ, భవిష్యత్‌ సింహ ద్వారం తెరుస్తోందనీ''; నేను దానికి సిద్ధమయ్యే ఉన్నాను, "సంతత సమన్వయావిష్కృత వినూత్న వేషం ధరించి'' ఠీవిగానే నించొన్నాను; జంకేమీ లేకుండా బాబుగాళ్ళకి బాబుగాడిలా ఈ వేషం ధరించగలను, నటించగలను. కానీ ఎంతైనా వేషం వేషమే కదా, నటన నటనే కదా. Deep down inside, I know that I am fucking faking it. (ఇప్పుడూ ఈ నాల్గక్షరాల ఇంగ్లీషు బూతు పదానికి రెండక్షరాల్లోనే అచ్చ తెలుగు ప్రత్యామ్నయం ఉన్నా, ఇది వాడినంత అలవోకగా దాన్ని వాడలేకపోతున్నాను. ఇదేదో ఆలోచించాలి. "అంతరించిపోతున్న అచ్చ తెలుగు బూతులు'' అని ఒక వ్యాసం రాస్తే క్లారిటీ వస్తుందేమో. మెటీరియల్‌ కూడా వెతక్కోనక్కర్లేదు, నాలిక చివర ఉంటుంది.)

ఈ కవిత చదువుతున్నపుడు "నిజమేనా'' అనిపించింది ఎక్కడంటే, మనం నిజంగానే "మాధుర్యం, సౌందర్యం, కవితా మాధ్వీక చషకంలో రంగరించి పంచి పెట్టిన ప్రాచేతస కాళిదాస కవి సమ్రాటులనీ, ఊహా వ్యూహోత్కర భేదనచణ ఉపనిషదర్థ మహోదధినిహిత మహిత రత్నరాసుల్నీ'' పోగొట్టుకోకుండా దాచుకుంటున్నామా, మన వెంట తెచ్చుకుంటున్నామా? ఈ ప్రశ్నకి సమాధానంగా నలభయ్యేళ్ళు దాటిన అంకుల్స్‌ అందరూ "మేమున్నాం'' అని ముందుకు రావొచ్చు; ఏమో మరి, నాదాకా అయితే ఇవేమీ రావడం లేదు. మొన్నా మధ్య సీటీ సెంట్రల్‌ లైబ్రరీలో, డస్ట్‌ ఎలర్జీ ఉన్న వాళ్ళు తలచుకోవడానిక్కూడా జంకే తెలుగు పుస్తకాల సెక్షన్‌లో, మూల అరల్లో మూలుగుతూ నిర్లక్ష్యం కాబడుతున్న కొన్ని తెలుగు మెదళ్ళని రాండమ్‌గా పలకరిస్తున్నాను. అవన్నీ సల్ఫర్‌ ప్రభావం వల్ల పసుపుబారి, పెళుసై పేజీలు విరిగిపోతున్న పుస్తకాలే. వెతుకులాటలో కట్టమంచి రామలింగారెడ్డిగారు "కళా పూర్ణోదయం'' గురించి రాసిన పుస్తకం ఒకటి కనిపించింది. అంతకుముందే వినివుండటం వల్ల ఆసక్తిగా తెచ్చుకుని చదివాను. తర్వాత "కళాపూర్ణోదయం'' ఎలాగైనా చదవాలనిపించింది. విశాలాంధ్రాకెళ్ళి వెతికి పట్టుకున్నాను. కానీ అందులో టీకా తాత్పర్యాలేవీ లేవు. కేవలం రచన ఉంది. టీకాతాత్పర్యాలతో పుస్తకాలేవన్నా ఉన్నాయా అని అడిగితే ప్రచురణలో లేవన్నాడు షాపువాడు. సరే ఎలాగో దీంతోనే కుస్తీ పడదామని అదే కొనితెచ్చుకున్నాను. కొన్ని రోజులు కష్టపడ్డాను. ఆ పుస్తకంతో నా కష్టం భుజం మీద నాగలేసుకు బీడు భూమిని దున్నినట్టే ఉంది (వెధవ ఉదాహరణ! చివరికి ఇక్కడ కూడా "ploughing through'' అనే ఇంగ్లీషు పదబంధం మీద ఆధారపడ్డమే! నా మెదడు నెర్రెలు బారిపోతోంది. ఆపద్ధర్మంగానైనా తెలుగు జాతీయాల పుస్తకం ఒకటి తెచ్చుకుని బట్టీ పట్టాలి.) సరే ఇలా కొన్ని రోజులు తంటాలు పడ్డాను. నా దగ్గర ఉన్న శబ్దరత్నాకరం ఏ మాత్రం అక్కరకు రాలేదు. చివరకు ఈ పుస్తకం నా వరకూ కళా అసంపూర్ణోదయంగానే మిగిలిపోయింది. ఇలా ఓ తెలుగు రచనకే దిక్కు లేకపోతే, ప్రాచేతస కాళిదాస కవి సమ్రాటుల్నీ, ఉపనిషదర్థ మహోదధుల్నీ ఒంటరిగా ఈదడం నా వల్లనవుతుందా? వాటిలో నిహితమైన రత్న రాసుల్ని ఏ సహాయమూ లేకుండా వెలికితీయగలనా? మరి నిజంగానే తిలక్‌కు బుద్దిహీనులెవ్వరూ కనపడలేదా?

నన్ను బాధ పెట్టిన ఈ మూడు కారణాలకూ ఏదో సంబంధం ఉందని తెలుస్తోంది. నేనేదో కోల్పోతున్నాను, ఈసరికే కోల్పోయాను కూడా. కొన్ని అనుభవించి కోల్పోయాను, కొన్ని అనుభవించకనే కోల్పోయాను. అందుకే ఇప్పుడిలా శిథిలాల మధ్య నిలబడి జ్ఞాపకాల పునాదులపై అక్షరాల ఇటుకల్తో మళ్ళీ అంతా పేర్చుకుంటున్నాను; పేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. అందులో సేద తీరుతున్నాను. అయినా నేను కాస్త అతిగా బాధపడుతున్నానేమో. బహుశా నేను కాస్త తేడానేమో. బహుశా అందరూ జీవిత రహదారుల్లో ముందుకు చూస్తూ ముందుకు నడిచే వాళ్ళైతే, నేను వెనక్కి చూస్తూ ముందుకి నడిచే బాపతేమో. ఏం చేస్తాం. మన మౌలిక నిర్మాణమే అలా ఏడిచింది. మారాలంటే గోరోజనం ఎక్కువాయె! ఈ జన్మకిలా కానిచ్చేద్దాం.

(సరే, చిన్న గీత ముందు పెద్ద గీత గీసాను. మొదటి బాధ తగ్గినట్టే కనిపిస్తుంది. మరి ఇప్పుడీ రెండో బాధ సంగతేం చేయాలి. దీని ప్రక్కన ఏ పెద్ద గీత గీస్తే ఈ గీత చిన్నదౌతుంది. ఆ అమ్మాయినే అడగాలి.)

August 2, 2008

రోజువారీ కవిత్వం

మా రూమ్‌కి పక్క వీధిలో ఓ కిరాణా షాపుంటుంది. చాలా చిన్నది. నెలవారీ సరుకులన్నీ అక్కడే కొనేద్దామంటే కుదరదు. మగవాళ్ళు బయటకెళ్ళి సంపాదిస్తుంటే వేణ్ణీళ్ళకు చన్నీళ్ళ తోడన్నట్టు ఆడవాళ్ళు ఇంటి ముంగిలినే షాపుగా మార్చి అమ్ముతుంటారు చూడండి, అలాంటిదన్నమాట. ముందు భాగంలో ఛాతీ ఎత్తు టేబిల్‌; దాని మీద ఓ పబ్లిక్‌ ఫోను; ఫోన్‌ పక్కన గాజు సీసాల్లో కొబ్బరుండలూ (యమ్మీ!), పల్లీ ఉండలు, చెగోడీలు, చాక్లెట్లు; టేబిల్‌ వెనకాల ఫైబర్‌ కుర్చీలో షాపు ఓనరు కమ్‌ ఇంటి ఇల్లాలు; ఆమె తలపైన తీగలకి వేలాడదీసి షాంపూ, డిటర్జెంట్‌, బ్రూ కాఫీ, గుట్కా, పెన్నుల పేకెట్లు; ఆమె వెనుక వున్న ఫ్రిజ్‌లో కూల్‌ డ్రింకులు, వాటర్‌ పేకెట్లు, పాల పాకెట్లు.... ENOUGH!! I don't feel like describing this insipid image anyway; let's get down to something more enchanting.

దీన్నైతే ఎంతసేపైనా వర్ణించొచ్చు. ఈ పిల్ల పేరు సాయి. రెండున్నరేళ్ళ వయస్సుంటుంది, రెండడుగుల ఎత్తుంటుంది, మూణ్ణాలుక్కేజీలు బరువుంటుంది. తెల్లగా, బొద్దుగా ఉంటుంది కాబట్టి నేచురల్‌గానే ముద్దుగా ఉంటుంది. ఇంకా పుట్టెంట్రుకలు తీయలేదు. అవి బంగారం రంగులో మెరిసిపోతూ, ముఖ్‌మల్‌ పోగుల్లా మెత్తగా ఉంటాయి (ఒకసారి నేనక్కడ ఫోన్‌ చేసుకుంటున్నపుడు నా కాళ్ళ దగ్గరికి వచ్చి నిల్చుంటే ఊరికే దాని తల తడిమాను; దానికి నచ్చలేదనుకుంటా కళ్ళు చికిలించి, ఏదో చేదు తిన్నట్టు ముఖం పెట్టింది). నేనీ రూమ్‌లో దిగిన కొత్తలో ఈ పిల్ల ఎప్పుడు చూడు, వాళ్ళమ్మ- అంటే ఆ షాపావిడ కూతురు- భుజం మీదే మకాం ఉండేది. ఆవిడ భుజాన్ని జాకెట్టులోంచి చప్పరిస్తూ చొంగతో తడిపేస్తూండేది. ఈ మధ్యే నడక నేర్చి ఆ వీధిని ఎక్స్‌ప్లోర్‌ చేయడం మొదలు పెట్టింది. కాని ఇంకా పూర్తిగా నడకబ్బలేదు. అందుకే ప్రతీ అడుక్కి ఫుల్‌ బాటిల్‌ తాగిందాన్లా ముందుకి వెనక్కీ ఓసారి ఊగుతుంది. ఇక పడుతుందనుకునేలోగా పట్టు దొరకబుచ్చుకుని రెండో అడుగేసేస్తుంది. వాళ్ళ ఇంట్లో దీన్ని పట్టించుకునేంత తీరికెవరికీ లేదనుకుంటా, ఈ మధ్యన ఇదెప్పుడూ రోడ్డు మీదే బలాదూరు తిరుగుతోంది. నేను రోజూ డ్యూటీకి ఆ రోడ్డు మీంచే వెళ్తాను కాబట్టి నాకు చాలాసార్లు ఎదురుపడుతోంది. ఎదురుపడినప్పుడల్లా పలకరిస్తుంటాను. మొదట్లో నేను మామూలుగా పిల్లలకిచ్చే పలకరింపే ఈ పిల్లకీ ఇచ్చేవాణ్ణి. అంటే నాలిక బయట పెట్టి వెక్కిరించడమో; వాళ్ళు వెళ్ళే దారికి కావాలని అడ్డు నిల్చుని, "ఎవరబ్బా'' అని వాళ్ళు తలెత్తి చూస్తే వెకిలి నవ్వు నవ్వడమో... ఇలాంటివన్నమాట. చాలా మంది పిల్లలు వీటికి పడిపోతారు. కానీ అబ్బే, ఈ పిల్ల కిలాంటి పిల్ల చేష్టలు అస్సలు నచ్చవు. నేను వెక్కిరిస్తే అది చూసే చూపు చూడాలి! "గ్రో అప్‌ మాన్‌!'' అన్నట్టు చాలా జాలిగా, condescending గా చూస్తుంది. ఈ చిన్న చూపు భరించలేక కాస్త మర్యాద నేర్చుకున్నాను. "హ ల్లో సాయీ'' ఛీర్‌ఫుల్‌గా అరవడమో, లేపోతే చెయ్యి ఊపడమో చేయడం మొదలుపెట్టాను. ఒక్కోసారి నవ్వుతూ రెస్పాండవుతుంది; ఒక్సోసారి మాత్రం- దాని మూడ్‌ బాగ లేకపోవడమో, ఏదన్నా ముఖ్యమైన పనిలో ఉన్నపుడో- అస్సలు పట్టించుకోదు. ఫరెగ్జాంపుల్‌, మొన్నామధ్య నేనలా వెళ్ళేప్పుడు సాయి వాళ్ళింటి బయటి గచ్చు మీద నుంచుని, ఉచ్చపోసి, ఎడం కాలితో అలుకుతుంది. ఇప్పుడేవైందే నీ పెద్దరికం అని లోపల అనుకుని, దగ్గరకెళ్ళి, "ఏయ్‌ ఏంటే వెధవ పని?'' అని అడిగాను. తలెత్తి "ఓస్‌ నువ్వేనా'' అన్నట్టు చూసి మళ్ళీ తన అలకడంలో పడిపోయింది. ఏం చెప్తాం ఇలాంటి మనుషులకి!

పిల్లల్ని పలకరించేటప్పడు పెద్ద ఇబ్బందేమిటంటే వాళ్ళతో పాటు పక్కనున్న పెద్ద వాళ్ళని కూడా మొహమాటానికి పలకరించాలి. ఉదాహరణకి బస్సులో పక్క సీటులోనో, పార్కులోనో ఎవరన్నా పిల్లలు కనిపించారనుకో, దాన్ని "చిచ్చీ బుచ్చీ'' అంటూనే పక్కనున్న పెద్ద వాళ్ళతో "ఎన్నేళ్ళండీ, అల్లరి బా చేస్తుందండీ'' అని మాట్లాడుతూండాలి. But that kills all the fun. దీని వల్ల ఆ పిల్లలు కూడా మనల్ని పెద్ద వాళ్ళతో జమ కట్టేసి మనతో జట్టు కట్టడానికి సంకోచిస్తారు. మనల్ని వాళ్ళ ప్రపంచం నుంచి వెలివేస్తారు. ఈ సాయితో నా ఫ్రెండ్షిప్‌ పెరగక పోవడానికి కారణం ఇదే. వాళ్ళమ్మతోనూ, షాపులోని వాళ్ళ అమ్మమ్మతోనూ మాట్లాడేందుకు బాచిలర్‌గాణ్ణి నాకేం టాపిక్స్‌ ఉంటాయి. అప్పటికీ షాపు కెళ్ళే అవసరం వచ్చినప్పుడల్లా ఆ షాపుకే వెళ్తూంటాను; పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళ విషయాలేవో మాట్లాడుతూ, కనిపిస్తే సాయిని పలకరిస్తూంటాను. కానీ ఇదేం బావుంటుంది. ఇద్దరిదీ మహా అయితే ముఖ పరిచయంగా మిగిలిపోతుంది. కాని బోడి ముఖ పరిచయం ఎవడిక్కావాలి! ఈ మధ్య వాళ్ళ ఇంటి పక్క ఇల్లు కూలగొట్టి మళ్ళీ కడుతున్నారు. దాని కోసం ఇసక తెచ్చి పోసారు. సాయికిదో పెద్ద ఆట స్థలం అయిపోయింది. ఇరవైనాలుగ్గంటలూ ఆ ఇసకలోనే ఉంటోంది. తవ్వుతుంది, పూడుస్తుంది, కడుతుంది, కూలదోస్తుంది, ఏదేదో చేస్తుంది. దాని బుల్లి ప్రపంచానికి ఇప్పుడా ఇసక గుట్టే పెద్ద హిమాలయాల్లా కనిపిస్తోంది. మూణ్ణాలుగు రోజులుగా నన్నసలు పట్టించుకోవటమే మానేసింది. దాన్ని దాటి వెళ్తూన్నపుడల్లా నా ఆఫీసు బేగ్‌ అవతల పడేసి దాంతో కాసేపు ఆడదామని ఉంటుంది. అంటే పెద్ద వాళ్ళు పిల్లలతో ఆడినట్టు కాదు, పిల్లలు తోటి పిల్లలతో ఆడినట్టు. అంటే, ఇసుక గూడు తవ్వడంలో దాని కష్ట సుఖాల్ని పంచుకుంటూ, గోపురం ఎంత ఎత్తుండాలో గంభీరంగా చర్చించుకుంటూ, సాధ్యాసాధ్యాల్ని ఇద్దరం బేరీజు వేసుకుంటూ, ఒక కొలీగ్‌లా దానితో కలిసి పనిచేయడమన్నమాట. కాని వాళ్ళమ్మా వాళ్ళతో పాటు వీధి జనమంతా నన్ను చిత్రంగా చూస్తారు. ఏం చేయగలం. దాని మానాన అది ఆడుకుంటూంటే నా మానాన నేను చుప్‌ చాప్‌ ఆఫీసుకి పోతుంటాను. Sometimes, it sucks to be a big man. It really does!!

March 4, 2008

అతిథి

అర్థరాత్రి ఎందుకో మెలకువ వచ్చి దుప్పటి ముసుగు తీసి చూస్తే, నా గదిలో, నా రాత బల్ల ముందు కూర్చుని, టేబిల్ లాంప్ వెలుగులో ఎవరో అపరిచితుడు పుస్తకం చదువుకుంటున్నాడు. తలుపు గడియ వేసి ఉంది. గోడ మీద గడియారం ఒంటి గంట చూపిస్తుంది. ఈ అసంబద్ద దృశ్యానికి నన్ను నేను సర్దుబాటు చేసుకోవడానికి కాస్త సమయం పట్టింది. నా రోగిష్టి మంచపు కీళ్ళను ఏ మాత్రం మూల్గనీయకుండా, ఒద్దికగా అతని వైపు ఒత్తిగిలి, శ్రద్దగా పరిశీలించాను. బూడిదరంగు పొడుగు చేతుల చొక్కాను నీలంరంగు జీన్స్ లోకి టక్ చేసుకున్నాడు. ఒక చేయి దవడకు ఊతంగా ఆన్చుకుని, మరో చేత్తో మేజాపై పుస్తకాన్ని అదిమిపెట్టి, చాలా దీక్షగా చదువుకుంటున్నాడు. టేబిల్ లాంప్ అతని ముఖ పార్శ్వపు అంచుల్ని దివ్యంగా వెలిగిస్తుంది. ఎంతసేపటి నుండి చదువుకుంటున్నాడో — సెకనుముల్లు మరో రెండు ఆవృతాలు పూర్తి చేసాక, ఉన్నట్టుండి పుస్తకం మూసి పైకి లేచాడు. తీక్షణమైన ఏకాగ్రత వల్ల కలిగిన బడలికను తీర్చుకోవడాని కన్నట్టు, వళ్ళంతా విల్లులా వెనక్కి విరుచుకుని, “హాఆఆఆయ్!” అంటూ దీర్ఘంగా ఆవలించాడు. పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని, వెనక్కి తిరిగి, అల్మారా వైపు నడిచాడు. ఈ ప్రయత్నంలో తన కాళ్ళ దగ్గిర ఉన్న ప్రయాణపు లగేజీ నొకదానిని తన్నుకుని ముందుకు తూలి పడబోయాడు. నిలదొక్కు కున్నాడు. అల్మారా చేరుకుని పుస్తకాన్ని వరుసలో సర్ది పెట్టేసాడు. ఇపుడా గూట్లోంచి ఒక్కో పుస్తకాన్నీ తీసి, టేబిల్ లాంప్ వెలుగులోకి వంచి చూసి, మరలా యధాస్థానం లో పెడుతున్నాడు. అతని వీపు భాగం నా వైపుకు ఉంది. ఇదే అదనుగా నేను నిశ్శబ్దంగా దుప్పటి వెనక్కు తొలగించి, మెల్లిగా, మంచపు అంచుపై లేచి కూర్చున్నాను. చేతికి అందుబాటులో ఆయుధ మేదైనా ఉన్నదా అని చుట్టూ పరికించాను. మంచం ప్రక్కన సన్నగా, పొడవుగా ముక్కాలి పీట ఉంది. దాని పైన ఉన్న అలారాన్ని జాగ్రత్తగా మంచం మీద పెట్టి, కొద్దిగా ముందుకు వంగుతూ పీట అడుగు భాగాన్ని అందుకుని, శబ్దం రాకుండా పైకి లేపడానికి ప్రయత్నిస్తుంటే, అతని స్వరం వినపడింది: “మీ దగ్గిర చాలా మంచి కలెక్షన్ ఉంది.” తుళ్ళిపడి అతని వైపు చూసాను. తల నా వైపే తిప్పి, నా భంగిమలో ఏ అసహజతా గమనించనట్టు, అభావంగా “ద మాన్ హూ వజె థర్స్‌డే” పేజీలు తిరగేస్తున్నాడు. నేనిక (ఈ భంగిమలో) దొరికిపోయిన దొంగ కావడం ఇష్టం లేక, అదే ఊపుతో పీట చేతిలోకి తీసుకు నిలబడి, “ఎవర్నువ్వు?” అరిచాను. నా ఈ చర్యకు ప్రతిగా అతని మొహంలో కమ్ముకొచ్చిన విభ్రమ నన్ను మరింత అయోమయంలో పడేసింది. నిశ్చేష్ఠుడై నా వంక, నా చేతిలో ముక్కాలి పీట వంకా మార్చి మార్చి పరకాయిస్తున్న అతన్ని చూస్తే, నిజంగా ఇతను నాకు పరిచయస్తుడేనా, పడుకునే ముందు వరకూ నాతో ఈ గదిలోనే ఉన్నాడా, ఇప్పుడు నేనే విచిత్రంగా ప్రవర్తిస్తున్నానా అన్న అనుమానం కలిగింది. ఆ అనుమానం నా తర్వాతి ప్రశ్నలో కరుకుదనం పాలు కాస్త తగ్గించింది: “ఎవరు మీరు? ఇక్కడేం చేస్తున్నారు?”

అతని నిశ్చేష్టత ఇపుడు బలవంతపు నవ్వులోకి మారింది. నేనేదో పరాచిక మాడుతున్నట్టూ, ఇది అతన్ని నవ్వించక పోయినా (హడలగొట్టినా), ఏదో నా మర్యాద కోసం మొహానికి పులుముకున్నట్టూ ఉంది ఆ నవ్వు. ఎలాగో గొంతు పెగుల్చుకుని, నేను స్పృహలోనే ఉండి మాట్లాడుతున్నానా అన్న తన అనుమానం తీర్చుకోవడాని కన్నట్లు, “ఫణీ?!” అని పిలిచాడు. నాలో క్షణ క్షణానికీ అసహనం పెరిగిపోతుంది. అతనిది నటనో, నిజ వర్తనో అర్థం కావడం లేదు. స్టూలు అలాగే చేతిలో బిగించి పట్టుకుని, రెండడుగులు ముదుకేసి, “అవును ఫణినే... ఎవరు కావాలి?” అన్నాను బెదిరిస్తున్నట్టు. నిజానికి అతని దిట్టం చూస్తే, గట్టిగా పూనుకుంటే, నన్ను నిముషంలో నేల కంటుకు పోయేలా చేయగలడనిపిస్తుంది. కానీ అతనిలో ఏదో తగ్గుబాటు ధోరణి నన్ను తెగించేలా చేసింది. పై పెచ్చు అతని వాలకం కూడా నాలో కాస్త చులకన భావాన్ని పెంచింది. మనిషిలో ఆరడుగుల పొడవూ, నలభైయేళ్ళ వయస్సూ కనిపిస్తున్నా, మొహంలో మాత్రం ఏదో పసిదనం ఉంది. అతని చికిలింపు కళ్ళు — పెదాలతో ప్రమేయం లేకుండా — మొహానికి ఓ నిత్య దరహాస ధోరణిని ఆపాదిస్తున్నాయి. మూతి పైన పలుచగా, చివుర్లలో ఏపుగా వేలాడి ఉండే పిల్లి మీసాలు ముఖానికి మంగోలియన్ పోలికల్ని తెచ్చి పెట్టాయి.

ప్రస్తుతం పుస్తకాన్ని జాగ్రత్తగా అలమారలో పెట్టి, నన్ను సముదాయించడాని కన్నట్లు ఒక చేయి నా భుజం వైపుగా గాల్లో చాచి, ముందుకో అడుగు వేసాడు. నేను అప్రయత్నంగా ఒక అడుగు వెనక్కి వేసాను. అతను ఆగి, చేతుల్ని నిస్సహాయసూచకంగా గాల్లో చూపిస్తూ, “కూల్ ఫణీ... ఇందాకేగా మనం కలిసింది; అప్పుడే ఎలా మర్చిపోతావ్,” అంటూ ప్రశాంతంగా, సహనంతో అడిగాడు.

ఆ నిబ్బరం నాకు నషాళాని కంటేలా చేస్తుంది, “హె హ్హె! ఎందాకేగా మనం ఎక్కడ కలిసాం?” ఉడుకుమోత్తనాన్ని అణుచుకుని వెక్కిరింపుగా అడిగాను.

“ఇప్పుడే... క్షణం క్రితం వరకూ... ఇద్దరం రైల్లో మాట్లాడుకుంటూ...” గుర్తు చేసుకోమన్నట్లు ఆర్థోక్తిలో ఆపి, ప్రోత్సాహకంగా చూసాడు.

హఠాత్తుగా, నిజంగానే నా మెదడు పొరల్లో ఏదో కదలిక — నిశ్చల తటాకపు అడుగున చేప పిల్ల మెదిలినట్టు.

అతడు కొనసాగించాడు: “నేను రైలు నిడదవోల్లో ఆగాక కాస్త చెప్పమన్నాను —”

“— నేనక్కడే దిగాలీ చెప్తానన్నాను,” అంటూ అప్రయత్నంగా నేనందుకున్నాను.

ఈ ఊతానికి అతడి ముఖం వెలిగిపోయింది. ఉత్సాహంగా స్వరం పెంచుతూ, “తర్వాత ఇద్దరం కబుర్లలో పడ్డాం —” అని నన్నందుకో మన్నట్టూ ఆగాడు.

ఇప్పుడిక యవనిక తొలగి యధార్థం భళ్ళున బయట పడింది. సర్వేంద్రియాలూ సత్తువుడిగి పోగా, దీనంగా, బలహీనంగా, “అది కల!” అన్నాను మంచం పై కూలబడిపోతూ.

అతడిక తన చింతలన్నీ తొలగిపోయినట్టు దీర్ఘంగా నిట్టూర్చి, “హమ్మయ్య! కంగారు పెట్టేవ్ కదయ్యా,” అంటూ మేజా క్రింద కుర్చీని నా వైపు త్రిప్పి కూర్చున్నాడు.

నేనతని వైపోసారి చూసి తల పట్టుకు కూర్చున్నాను.

“వాట్స్ ద మేటర్ విత్ యూ?” అనునయంగా అడిగాడు.

ఎందుకో ఈ మానవాతీత పరిస్థితిని నా ప్రస్తుత విభ్రమతో సమీక్షించ బూనడం నా మానసి కారోగ్యానికి అంత మంచిది కాదనిపించింది. స్థిమితం తెచ్చిపెట్టుకొని, మేకపోతు గాంభీర్యంతో ఇలా అన్నాను: “సీ... వుయ్ హేవె సిచువేషన్ హియర్; నీ కర్థం కావట్లేదు. కాస్త నిదానపడు; ఊహుఁ దొర్లుకుంటూ పోకు అర్థమైందా.” — ఇది నన్ను నేను ఉద్దేశించి చెప్పుకున్నది బహుశా. అయినా అర్థమైందన్నట్టు తల పంకించి, పరిస్థితి గాఢత అవగతమైనవాడిలా కుర్చీలో నిటారుగా సర్దుకుని కూర్చున్నాడు.

“ఊఁ! చెప్పిపుడు — నిదానంగా — చెప్పు,” అన్నాను ‘నిదానాన్ని’ సాధ్యమైనంత నిదానంగా సాగతీసి.

అతను ఉత్సాహంగా మొదలు పెట్టాడు, “వై ఫణీ...! రాత్రి ప్రయాణం. నీదీ నాదీ ఎదురు బొదురు బెర్తులు. నిడదవోలు ఎప్పుడొస్తుందని నేనడిగితే, అక్కడే దిగాలీ వచ్చినపుడు చెప్తానన్నావ్. నెమ్మదిగా మాటల్లో పడ్డాం. ఫలానా అంటే ఫలానా అనుకున్నాం. ఇంతలో — ”

అతన్ని కత్తిరించి మధ్యలో జొరబడి పోయాను, “ — ఇంతలో ఆ కలలోంచి నా కిక్కడ మెలకువ వచ్చింది. నా కిక్కడ మెలకువ వచ్చింది కాబట్టి నే నక్కడ లేను. నే నక్కడ లేను కాబట్టి నువ్విక్కడ కొచ్చేసావ్ — అంతేనా?” అతడేదో చెప్పబోయాడు. మళ్ళీ అడ్డేసాను; “వద్దు — అదే చెప్పేది — దొర్లుకు పోవద్దని! పరిస్థితి నిదానంగా సమీక్షిద్దాం: నిన్ను నా కలలో రైలు ప్రయాణంలో — లేదా నా రైలు ప్రయాణపు కలలో — తప్ప మెలకువలో ఇంతకు ముందెన్నడూ చూసిన, కలిసిన స్మృతి లేదు. ఇపుడసలు నీకు నిజంగా ఓ సొంత అస్తిత్వమంటూ ఏడిచిందా; లేక, నువ్వు కేవలం నా అల్లిబిల్లి కల అల్లిన కల్లబొల్లి మనిషివేనా అన్నది ప్రస్తుతానికో వివాదాస్పద అంశం. కాబట్టి రెండు రకాలుగానూ ఆలోచించి చూద్దాం: ఒకవేళ నీకంటూ ఒక నిజ-అస్తిత్వం ఉండి ఉంటే, బహుశా ఈ సమయానికి ఎక్కడో నిక్షేపంగా నిద్రపోతూండి ఉంటావు. ఇది కోటానుకోట్ల మెదళ్ళు మూకుమ్మడిగా కలలు కనే నిశా సమయం. కాబట్టి, ఏమో ఎవరు చెప్పొచ్చారు, యాదృచ్చికంగా ఒకరి కల మరొకరి కలని ఒరుసుకోవడం, చిక్కుపడటం... ఇలాటివేఁవన్నా సాధ్యమైతే! అలా నీ కలా నా కలా తగులుకొని నువ్వూ నేనూ ఒకే కల్లో, ఒకే రైల్లోకి వచ్చి పడి ఉండొచ్చు. నీ తప్పు లేదు. కాని అక్కడితో ఆగక, నిడదవో లెపుడొస్తుందో చెప్పకుండా నేను కల నుండి నిష్కృమించి నంతమాత్రాన, నువ్వూ నా వెనకే ఇలా నా వాస్తవిక వ్యక్తిగత జీవితంలోకి చొరబడి గలాభా చేయడం అమర్యాదకరం, కుసంస్కారం. అలాకాక, రెండో రకంగా, ఒక వేళ నీకంటూ అసలో స్వతంత్ర అస్తిత్వమే లేక, నువ్వు కేవలం నా సుషుప్తి పోత పోసిన భ్రమవే అయితే — ఇపుడే చెప్పేస్తున్నాను — నీకు నేనే మాత్రం బాధ్యత వహించ బోవటం లేదు,” అంటూ ఆయాస పడుతూ ఆగాను.

ఈ చివరి మాట చెవిన పడగానే, అతను కుర్చీని వెనక్కి నెట్టి, ధ్వజస్తంభంలా ఇంతెత్తున పైకి లేచాడు. ఉన్నట్టుండి అతని గోధుమ రంగు ముఖం రక్త సంచలనంతో జేవురించింది; కణతపై పచ్చగా ఒక నరం పైకి ఉబ్బింది. ఆవేశంతో ఊగిపోతూ ఇలా అందుకున్నాడు: “హౌ కెన్యూ సే దట్! నీకు బాధ్యత లేదా! నీ కలలకి నువ్వు జవాబుదారీ కాదా! నీకు నచ్చినట్టు విచ్చలవిడిగా కలలు కనేసి, ఇలా తమ ఆద్యంతా లెరుగని మిధ్యా అస్తిత్వాలకు జీవం పోసి, తర్వాత పూచీ లేదని మిన్నకుంటే, వాటి మానాన వాటిని వదిలేస్తానంటే — ఏం తమాషానా?” — ఈ చివరి మాట పలికేప్పుడు దున్న కుమ్మడానికి తల తాటించినట్టు తల ముందుకి తాటించాడు.

వ్యవహారం చేయి దాటుతున్నట్టు అనిపించడంతో కాస్త తగ్గాను: “అరె! మాట్లాడుతుంటే మధ్యలో వచ్చేస్తావేంటి? కూర్చో కూర్చో!” అనునయంగా అన్నాను. కూర్చున్నాడు; “నే చెప్పేదింకా పూర్తి కానే లేదు. నేను నీకు బాధ్యత వహించనని చెప్పింది బాధ్యత వహించలేక కాదు; సాధ్యం కాదు కనుక. ఇది కల కాదు. ఇక్కడ నువ్వు కుదురుకోలేవు. ఇక్కడ కొన్ని సూత్రాలుంటాయి. బంధనాలూ, పరిమితులూ ఉంటాయి — తెంచుకోలేనివి. ఉదాహరణకి కాలం; నువ్విక్కడ కలలోలా కాలపు చెరసాలను ఛేదించలేవు: ఆనందంలో ఉన్నా, విషాదంలో ఉన్నా, సమక్షంలో ఉన్నా, నిరీక్షణలో ఉన్నా గంటకు అరవై నిముషాలూ గడిపి తీరాల్సిందే. ఇక్కడ దూరమూ నీకు శత్రువే: ఆమెను చేరుకోవాలంటే నాల్గొందల కిలోమీటర్లూ రైల్లో ప్రయాణించాల్సిందే; అనుకోగానే వళ్ళో వాలలేవు. ఇక్కడ నువ్వు భూమికీ బానిసవే: గాల్లోకి ఎగిరితే తిరిగి భూమ్మీదే వాలాలి; మేఘాల్లోకి పోలేవు. ఇక్కడ హేతువు బాధా తప్పదు: ఆఫీసు కెళ్ళే బస్సెక్కితే చచ్చినట్టు ఆఫీసుకే చేరాలి; అంటార్కిటికా పోలేవు. ఒక్కటి కాదిక్కడ బాధ! ఇక్కడ స్ఖలనమే శృంగారపు గ్రాండ్ ఫినాలీ కాదు; తర్వాతి నైరాశ్యపు లోతుల్నీ అంతే తీవ్రతతో ఎదుర్కోవాలి. ఇక్కడ నిన్ను కత్తితో పొడిస్తే ఎరుపు టింటున్న ఏషియన్ పెయింట్‌లా రక్తం చిమ్మి ఊరుకోదు; తోడుగా మెలి తిప్పే బాధనూ భరించాల్సిందే. ఇక్కడ నీ స్నేహితులు, స్నేహితులే; శత్రువులు శత్రువులే. ఎందుకు సుఖాన ఉన్న ప్రాణాన్ని దుఃఖాన పెట్టుకుంటావ్! అర్థం చేసుకో.”

ఈ వాదనతో అతన్ని చాలా మట్టుకు జయించానని అతని ముఖమే చెప్తుంది. చూపులు నేలకు వాల్చి ఆలోచిస్తున్నాడు. చివరకు తలెత్తి, దిగాలుగా, ఆఖరి ప్రయత్నంలా, “అయినా నాకా నలుపూ-తెలుపూ ప్రపంచం నచ్చలేదు,” అన్నాడు.

సందు దొరకడంతో నేన్రెచ్చిపోయాను: “నచ్చక చేసేదేం లేదు. నువ్వో స్వప్న శకలానివి. నాలో ఏ రెండు రాండమ్ న్యూరాన్లు యాదృచ్చికంగా రాజుకున్నాయో, నువ్వూడి పడ్డావ్. నా వాస్తవ జీవితంలోని ఎవరి ముక్కో, ఎవరి కన్నో, మరెవరి మూతో కలగాపులగమైతే పుట్టిన కిచిడీవి! యూ డోంట్ బిలాంగ్ హియర్. నిన్నెలా నీ చోటికి పంపించాలో నాకు తెలుసు,” అంటూ ఒక్క ఉదుటున కూర్చున్న వాడినల్లా దబ్‌మని మంచంపై ఒరిగి, దుప్పటి నఖశిఖ పర్యంతం ముసుగు లాగేసుకున్నాను. మళ్ళీ యిందాకటి ఆ పాడు కలలోకి వెళ్ళి అతణ్ణి ఆ మాయదారి నిడదవోల్లో దింపేసి, నేను తిరుగు రైలెక్కి గదికి చేరుకుందామన్నది నా ఆలోచన. కళ్ళు గట్టిగా బిగించి నిద్రకుపక్రమించాను. ఆలోచనల్ని, దృశ్యాల్ని ఆవలికి తోలి మెదడును చీకటి పుచ్చడానికి ప్రయత్నించాను. అతడు కుర్చీ లోంచి లేచి గొణుక్కుంటూ గదంతా పచార్లు చేస్తున్న అలికిడి మూసుకుపోతూన్న శ్రవణేంద్రియాలను లీలగా తాకుతుంది. నాకు జోల పాడటాని కన్నట్లు మంచం కూడా లయబద్దంగా ఊగ సాగింది. కాసేపటికి, అంతా ప్రశాంతమైన శూన్యం ఆవరించి పూర్తి సుషుప్తిలోకి జారిపోతున్నాననగా — నా చేతిని సందిగ్ధంగా తడుతున్నట్టు అతని స్పర్శ తగిలింది. కోపం బద్దలై “చచ్చేవ్‌రా నువ్వ”నుకుంటూ దిగ్గున లేచి కూర్చున్నాను.

నా నుండి ఇంత చురుకైన ప్రతిక్రియ ఊహించలేదనుకుంటా; ఉలిక్కిపడి వెనక్కు తగ్గాడు. రైలు కుదుపు క్రమంగా కుదుట పడుతుంది. కిటికీ మసక చీకట్లో ఏదో ప్లాట్‌ఫాం వెనక్కి జారుతూ కనిపిస్తుంది. జారి జారి, స్థిరపడింది. “ఛాయ్! ఛాయ్!” అని అరుచుకుంటూ ఓ కుర్రాడు మా కంపార్ట్‌మెంట్ దాటుకుని వెళ్ళాడు.

“నన్ను లేపుతానని చెప్పి మీరే పడుకుండిపోతే ఎలా గురువుగారూ... పదండి... ఇదే నిడదవోలట” అంటూ, భుజాన లగేజీతో, మంగోలియన్ కళ్ళు చికిలించి నవ్వుతున్నాడు.

“We are such stuff as dreams are made on; and our little life is rounded with a sleep.”
— Shakespeare

సార్థకత

బంగారు పిచ్చిక ఎగిరిపోయి చాలాసేపయింది. దాని ఈక మాత్రం ఇంకా కొమ్మ మీదే ఉండిపోయింది. ఆకుల్ని గల గల లాడిస్తూ అటువైపుగా సాగిపోయిన ఓ మంద పవనం దాన్ని స్థాన భ్రంశం చేసింది. అంచెలంచెలుగా, లోలకపు అంచులా గాల్లో ఊగుతూ, అది క్రిందకు పతనం చెందింది. గడ్డిపై పరచుకున్న ఎండుటాకుల మధ్య ఇక నిశ్చలత్వం పొందబోతోందనగా, ప్రక్కన రోడ్డుపై ఝమ్మని దాటిపోయిన కారు దాన్ని తటాలున తన వైపు లాక్కొంది. సాంగత్యం లభించినట్టే లభించి చేజారి పోతూండటంతో, కొన్ని ఎండుటాకులు ఈక వెంటే ఆపేక్షగా పైకి లేచాయి. కాని దాని వడి నందుకోలేక కాస్త దూరంలోనే, అసంతృప్తిగా, తిరిగి చతికిల బడ్డాయి. ఈక మాత్రం కారు వెంటే కొంత దూరం పయనించి, ఎదురుగాలికి రోడ్డు మధ్యగా ఉవ్వెత్తున పైకి ఎగసింది. గాల్లో సంచలనం సద్దుమణిపోగా, మళ్ళీ అదే లోలకపు ఊపుతో, రోడ్డు వైపుకు జారింది. ఈ కోలాహలమంతా భుజాన స్కూల్‌బాగ్ తో పరాకుగా రోడ్డు వారన నడుస్తున్న ఓ బుజ్జాయి కంటపడింది. పరుగులిడి తరలి వచ్చింది. ఈక ఇక రోడ్డుని తాకబోతోందనగా, తన చిట్టి అరచేతిని కాపు పెట్టి అందులో తేలికగా వాలనిచ్చింది. రెండో చేత్తో భుజాన బాగ్‌ని తొలగించి, రోడ్డు మీద పరచి, ఓ నోటు పుస్తకం బయటకు తీసింది. మధ్యకు మడత తీసి ఈకను ఒద్దికగా అందులో అమర్చింది. పుస్తకం లోపల సర్దేసి, బాగ్ భుజాన వేసుకుని ఎగురుగంటూ తనదారిన చక్కాపోయింది. ఆ బంగారు పిచ్చికకు అసలు తెలీనే తెలీదు — ఓ జ్ఞాపకంలో చిరు శకలమై తన ఈక అమరత్వాన్ని సంపాదించిందని.

February 19, 2008

'గుట్టు చెప్పిన గుండె' - ఎడ్గార్ అలెన్ పో

నిజమే! — వ్యాకులత — చాలా, చాలా భీతి గొలిపే వ్యాకులతతో ఉన్నానూ, చాన్నాళ్ళుగా ఉంటున్నాను కూడా; కాని నేను పిచ్చివాడినని ఎందుకంటావు? ఈ కలత నా ఇంద్రియాలను పదునుదేర్చింది — పాడు చేయలేదు — వాటిని మొద్దుబార్చలేదు. అన్నిటినీ మించి నా వినికిడి శక్తి సునిశితమైంది. భూమ్మీద, స్వర్గంలో అన్నీ నాకు వినబడుతున్నాయి. పాతాళంలోంచీ నాకు చాలా వినబడుతున్నాయి. ఎలా, మరి, నేను పిచ్చివాడ్నవుతాను? విను! ఎంత స్వస్థతతో, ఎంత ప్రశాంతంగా నేను మొత్తం కథను చెప్పగలుగుతానో పరిశీలించు.
మొదట ఈ ఆలోచన నా మెదడులో ఎలా ప్రవేశించిందో చెప్పడం కష్టం; కాని ఓ సారి రూపుదిద్దుకున్నాక, ఇది పగలనక రాత్రనక నన్ను వెంటాడటం మొదలు పెట్టింది. ప్రత్యేక ఉద్దేశ్యమంటూ ఏదీ లేదు. ఉద్రేకమూ ఏమీ లేదు. నాకా ముసలాడంటే ఇష్టం కూడా. అతను నన్నెపుడూ తప్పుపట్ట లేదు. అతడు నన్నెపుడూ అవమానించ లేదు. అతని బంగారం మీద నాకే కోరికా లేదు. నాకు తెలిసీ కారణం అతని కన్ను! అవును అదే! అతని కళ్ళల్లో ఒకటి రాబందు కన్నును[1] పోలి ఉంటుంది — లేత నీలం కన్ను, పైన ఒక పొర. అది నాపై పడినపుడల్లా నా రక్తం చల్లబడేది; అందుకే ఆ ముసలాడి ప్రాణం తీసేయాలని, తద్వారా ఆ కన్ను నుండి శాశ్వతంగా విముక్తి పొందాలని, నేను క్రమంగా — అంచెలంచెలుగా — ఒక నిశ్చయానికొచ్చాను.

ఇదీ సందర్భం. నువ్వు నన్ను పిచ్చివాడని భ్రమిస్తావు. కాని నువ్వు నన్ను చూసి ఉండాల్సింది. నేనెంత తెలివిగా ముందుకు సాగానో — ఎంత జాగురూకతతో — ఎంత ముందు చూపుతో — ఎంత కుటిలత్వంతో నేను పనిలోకి మళ్ళానో నువ్వు చూసి ఉండాల్సింది. ఆ ముసలాడితో అతణ్ణి చంపక ముందు వారం రోజులూ ఉన్నంత దయగా నేనెపుడూ ఉండలేదు. ప్రతీ రోజూ రాత్రి, దాదాపు అర్థ రాత్రి, నేను అతడి తలుపును గొళ్ళెం తొలగించి తెరిచేవాణ్ణి — ఎంతో సున్నితంగా తెరిచేవాణ్ణి! తర్వాత, ఆ తలుపు చీలికలో నా తల పట్టేటంత వెడల్పు చేసాక, ఓ చీకటి లాంతరును[2], వెలుతురు బయటకు ప్రసరించకుండా మూసేసి, మొత్తం మూసేసి, లోపలకు చొప్పించేవాణ్ణి; పిమ్మట నా తలను లోనికి చొప్పించేవాణ్ణి. ఓహ్, నేను ఎంత జిత్తులమారితనంతో దాన్ని లోపలకు చొప్పించేవాడినో చూస్తే నువ్వు నవ్వుకొని ఉండేవాడివి. ముసలాడికి నిద్రాభంగం కలుగకుండా ఉండటానికి, నెమ్మదిగా — చాలా, చాలా నెమ్మదిగా, దానిని కదిల్చేవాడ్ని. అతను తన మంచం పై పడుకుని ఉండటం కనిపించేట్టుగా నా తలని చీలికలోనికి చేర్చడానికి, నాకు ఒక గంట పట్టేది. మరి! — పిచ్చివా డెవడైనా అయితే ఇంత యుక్తి చూపించేవాడా? పిమ్మట, నా తల పూర్తిగా గదిలోకి ప్రవేశించాక, లాంతరు తెరిచేవాడ్ని; జాగ్రత్తగా — ఓహ్, ఎంతో జాగ్రత్తగా — జాగ్రత్తగా (సీలలు కిర్రుమనకుండా) కేవలం ఒకే ఒక్క సన్నని వెలుగు కిరణం ఆ రాబందు కన్ను మీద పడేటట్టు లాంతరు తెరిచేవాడ్ని. ఇలా నేను ఏడు సుదీర్ఘమైన రాత్రులు చేసాను — ప్రతీ రాత్రి ఖచ్చితంగా అర్థ రాత్రి సమయానికి — కాని నాకెప్పుడూ ఆ కన్ను మూసుకునే కనిపించేది; అందువల్ల నా పని అసాధ్యమయ్యేది; ఎందుకంటే నన్ను వేధించేది ఆ ముసలివాడు కాదు, అతడి పాపిష్టి కన్ను. మళ్ళా ఉదయం మాత్రం, తెల్లవారగానే, నేను ధీమాగా గదిలోపలికి వెళిపోయేవాడ్ని; అతడ్ని ఆప్యాయంగా పేరుతో పిలుస్తూ, అతడి రాత్రి ఎలా గడిచిందో యోగ క్షేమాలడుగుతూ, ధైర్యంగా మాట్లాడేవాడ్ని. అందుకే చెప్తున్నాను, ఆ ముసలివాడు నిజంగా గొప్ప జ్ఞాని అయివుంటే తప్ప, ప్రతీ రోజూ రాత్రి, ఖచ్చితంగా పన్నెండు గంటలకు, అతడు నిద్రపోతుండగా నేను తొంగి చూస్తున్నానన్న అనుమానం కలిగే అవకాశం లేదు.

ఎనిమిదవ రోజున నేను తలుపు తెరవడంలో మామూలుగా కన్నా ఎక్కువ జాగరూకత వహించాను. నా చేతికన్నా ఓ గడియారపు నిముషం ముల్లు ఎక్కువ వేగంతో కదులుతుంది. ఆ రాత్రికి ముందెన్నడూ నేను స్వీయశక్తుల అవధుల్ని — నా వివేచనా శక్తిని — అంతగా అనుభూతించి యెరుగను. నా ఉత్సాహాన్ని అదుపులో పెట్టుకోవడం కష్టతరమయ్యింది. అసలా ఆలోచనే! — నేనక్కడ నిలబడి ఉండటం, తలుపును కొంచెం కొంచెం తెరుస్తుండటం, కాని అతనికి మాత్రం కలలో కూడా నా ఈ రహస్యపుటాలోచనల గురించీ, చర్యల గురించీ తెలిసే అవకాశం లేకపోవడం... ఈ ఊహకి సన్నగా నవ్వుకున్నాను; బహుశా అతడిది విన్నట్టున్నాడు — హఠాత్తుగా మంచంపై తుళ్ళిపడ్డట్టు కదిలాడు. ఇపుడు నేను వెనక్కి వచ్చేసి ఉంటానని నువ్వనుకోవచ్చు — ఊహుఁ, రాలేదు. అతడి గది తారులాంటి నల్లని చిమ్మ చీకట్లో ఉంది (ఎందుకంటే దోపిడీ దొంగల భయం వల్ల తలుపులన్నీ బిడాయించి వేయబడ్డాయి); కాబట్టి తలుపు తెరుచు కోవడాన్ని అతడు చూడలేడని నాకు తెలుసు; నేను దాన్ని నిలకడగా, నిలకడగా లోపలికి నెడుతూనే ఉన్నాను.

నేను నా తల పూర్తిగా లోపలికి తీసుకువచ్చి, లాంతరు తెరవబోతుంటే, నా బొటనవ్రేలు దాని లోహపు సీలపై జారింది. ముసలివాడు ఒక్క ఉదుటన మంచంపై లేచి అరిచాడు: “ఎవరది?”

నేను కదల్లేదు; మాట్లాడ లేదు. ఒక పూర్తి గంట ఒక్క కండరం కదల్చలేదు. ఈ పర్యంతం, లోపల అతడు నడుం వాల్చిన అలికిడీ విన రాలేదు. ఇంకా మంచం మీద కూర్చునే ఉన్నాడు; వింటున్నాడు – నేను విన్నట్టే, రాత్రి తర్వాత రాత్రి, గోడల్లో కంచరపురుగుల[3] శబ్దాలు.

ప్రస్తుతం నాకో సన్నని మూలుగు వినపడింది. నాకర్థమైంది; అది మృత్యుభీతితో మూల్గిన మూలుగు. అది వేదన వల్లనో, విచారం వల్లనో వెలువడే మూలుగు కాదు — కాదు, కాదు! — ఆత్మ పూర్తిగా భీతావహ మైనపుడు దాని అట్టడుగు లోతుల్లోంచి వెలువడే సన్నని, పూడుకుపోయిన ధ్వని. నాకు తెలుసా ధ్వని. చాలా రాత్రులు, సరిగ్గా అర్థరాత్రి, ప్రపంచమంతా నిద్రపోయినపుడు, నా రొమ్ముల్లోంచీ ఇలాంటి ధ్వనే వెల్లువెత్తేది; దాని మారుమ్రోతతో నన్ను కలచి వేసే భయాలు మరింత గాఢతరమయ్యేవి. నాకు ఖచ్చితంగా తెలుసా ధ్వని. నాకు తెలుసు యిపుడు ముసలివాడే స్థితిలో ఉన్నాడో; అతనిపై జాలి పడ్డాను, మనసులో మాత్రం నవ్వుకున్నాను. నాకు తెలుసు — మొదటి శబ్దం వెలువడినప్పటి నుండి, తను తన మంచంపై మొదటిసారి కదిలినప్పటి నుండి, అతడు మెలకువగానే పడుకొని ఉన్నాడు. అప్పటినుండీ అతనిలో భయాలు కూడగట్టుకుంటూనే ఉన్నాయి. అవన్నీ అర్థరహితమని నమ్మించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, కాని వల్ల కావట్లేదు. “ఇది పొగగూటిలో గాలి తప్ప మరేం కాదు — నేలపై పరిగెడుతున్న చుంచు అయివుంటుంది,” లేదంటే, “ఒకమారు కీచుమని మిన్నకున్న కీచురాయి బహుశా” — ఇలా అతడు తనకు తాను నచ్చ చెప్పుకుంటున్నాడు. అవును, ఈ ఊహలతో అతడు ఉపశమిల్ల ప్రయత్నిస్తున్నాడు; కాని అంతా చివరకు నిష్పలంగానే తోస్తుంది. అంతా నిష్పలమే; ఎందుకంటే మృత్యువు, అతడిని సమీపించే యత్నంలో, ముందుగా తన నల్లని నీడతో అతడి ఎదుట తచ్చాడింది; అది తన ఎరను నలువైపులా చుట్టుముట్టింది. ఈ అదృశ్యమైన నీడ యొక్క శోకగ్రస్త ప్రభావమే అతడి చేత — చూడక పోయినా, వినక పోయినా — ఆ గదిలో నా తల ఉనికిని గ్రహించేట్టు చేసింది.

సుదీర్ఘ సమయం చాలా సహనంతో వేచి చూసాక, అతడు తిరిగి నడుం వాల్చిన జాడలేవీ వినిపించకపోవడంతో, నేను లాంతరులో చిన్న — చాలా, చాలా చిన్న చీలిక తెరవాలన్న నిశ్చయానికి వచ్చాను. నువ్వూహించలేవు ఎంత గుట్టు గుట్టుగా తెరవడం మొదలుపెట్టానో. చీలిక నుండి ఒకే ఒక్క, సాలీడు దారం లాంటి, పల్చని కిరణం బయటకు చిమ్మి ఆ రాబందు కన్నును తాకే వరకూ, తెరుస్తూనే వచ్చాను.

ఆ కన్ను విప్పార్చుకుని ఉంది — బార్లా తెరుచుకుని ఉంది. దాన్ని చూడటం తోటే నాలో ఆగ్రహం పెల్లుబికింది. నేను దాన్ని పరిపూర్ణ స్పష్టతతో చూసాను — అంతా మబ్బు నీలం, పైన నా ఎముకల్లోని మజ్జనే వణికించేంతటి వికృతమైన ముసుగు; కాని నాకు ముసలాడి ముఖం, శరీరం యేదీ గోచరించ లేదు: ఎందుకంటే, ఏదో అంతః ప్రేరేపణ కొద్దీ అన్నట్టు నేనా కిరణాన్ని సరిగ్గా ఆ దరిద్రగొట్టు మచ్చ మీదే వదిలాను.

నేను నీకు చెప్పలేదూ నువ్వేది పిచ్చితనమని భ్రమిస్తున్నావో అది కేవలం ఇంద్రియాల సునిశితత్వం అని? — ఇప్పుడు, చెప్తున్నాను విను, ఓ ధ్వని నా చెవులను తాకింది — సన్నని, మెల్లని, చురుకైన ధ్వని — ఒక గడియారాన్ని నూలు గుడ్డలో చుట్టబెడితే వెలువడే ధ్వని లాంటిది. నాకు ఈ ధ్వని కూడా తెలుసు. ఇది ఆ ముసలాడి గుండె కొట్టుకుంటున్న ధ్వని. దుంధుబుల మ్రోత ఒక సైనికుడిలో ధైర్యాన్నెలా ఉత్తేజితం చేస్తుందో, ఇది అలా నాలో ఆగ్రహాన్ని మరింత అధికం చేసింది.

అయినా నన్ను నేను సంభాళించుకుని స్థిరంగా నిలబడ్డాను. ఊపిరి నిలిపి వేసాను. లాంతరును నిశ్చలంగా పట్టుకున్నాను. ఆ కిరణాన్ని ఎంత నిలకడగా కన్ను మీదనే నిలిపి ఉంచగలనో ప్రయత్నించాను. ఇంతలో ఆ గుండె యొక్క రౌరవ ఘోష ఉదృతమైంది. ప్రతీ క్షణానికీ దాని వడి పెరుగుతూ పెరుగుతూ పోతుంది; మరింత బిగ్గర బిగ్గరగా ధ్వనిస్తుంది! బహుశా ముసలివాడిలో భయం ఉఛ్ఛస్థాయిని చేరి ఉంటుంది! మరింత బిగ్గరగా, అవును, ప్రతీ క్షణానికి బిగ్గరగా ధ్వనిస్తుంది! — శ్రద్దగా వింటున్నావా? యిదివరకే చెప్పాను నేను వ్యాకులంగా ఉన్నానని: యిప్పుడూ అదే స్థితి నాది. దీనికి తోడు ఈ నిశీథిలో, ఎటూ కాని సమయంలో, ఈ పురాతన గృహపు భయంకర నిశ్శబ్దాన్ని చీలుస్తూ పెచ్చరిల్లుతున్న ఈ వింత శబ్దం నన్ను అవధుల్లేని భయ భీతుల్లో ముంచివేసింది. అయినా ఇంకొన్ని నిముషాలు నన్ను నేను సంభాళించుకుని స్థిరంగా నిల్చొన్నాను. కాని ఈ ఘోష బిగ్గరగా, మరింత బిగ్గరగా పెరుగుతూనే ఉంది! ఆ గుండె బద్దలౌతుందేమో ననిపించింది. ఇపుడు నన్నో కొత్త ఆందోళన చుట్టుముట్టింది — ఈ శబ్దం ఇరుగుపొరుగుకు వినపడితే! ముసలాడికి మృత్యుగడియ సమీపించింది! ఒక్క పొలికేకతో, లాంతరు భళ్ళున తెరిచి, గదిలోకి దుమికాను. అతడు ఒక్కసారి అరిచాడు — కేవలం ఒకే సారి. నేను క్షణంలో అతడ్ని నేల మీదకు ఈడ్చి, బరువైన పరుపును అతడి మీదకు లాగేసి నొక్కాను. అప్పటికి పని ముగిసిందనిపించి, ఉల్లాసంగా నవ్వుకున్నాను. కాని, చాలా నిముషాల పాటు, నొక్కుకుపోయిన ధ్వనితో గుండె కొట్టుకుంటూనే ఉంది. అయితే ఇది నన్నంతగా వేధించలేదు; యిది గోడ బయటకు వినిపించదు. క్రమ క్రమంగా యిదీ సద్దుమణిగింది. ముసలాడు చనిపోయాడు. నేను పరుపు తొలగించి శవాన్ని పరీక్షించాను. అవును, అతను పూర్తిగా చనిపోయాడు. నేను గుండె మీద చేయి వేసి కొన్ని నిముషాల పాటు పట్టి ఉంచాను. స్పందన లేదు. అతను పూర్తిగా చనిపోయాడు. అతని కన్ను ఇంక నన్ను బాధించదు.

నువ్వు నన్ను ఇంకా పిచ్చివాడిననే అనుకుంటున్నట్టయితే, నేనీ కళేబరాన్ని మరుగు పరచడానికి తీసుకున్న చురుకైన ముందుజాగ్రత్తలన్నీ వివరించిన తరువాత, యిక ఎంతమాత్రం అలా అనుకోవు. రాత్రి గడుస్తూండగా, నేను వేగంగా — కాని నిశ్శబ్దంగా — పనిలో నిమగ్నమయ్యాను. అన్నింటికన్నా ముందు నేను శవాన్ని ముక్కలు చేసాను. అతని తలనీ, చేతుల్నీ, కాళ్ళనీ నరికేసాను.

తర్వాత గది నేలలోంచి మూడు పలకల్ని[4] పెల్లగించి, మొత్తాన్ని క్రింద దూలాల మధ్య పేర్చాను. తర్వాత పలకల్ని తిరిగి యథారీతిన ఎంత యుక్తిగా, ఎంత కుత్సితంగా సర్దానంటే, ఏ మానవ నేత్రం — చివరికి అతడిది కూడా — అక్కడ ఏ తేడా పసిగట్ట లేకపోయేది. అక్కడ కడగడానికేం లేదు — ఏ మచ్చా — ఏ రక్తపు చుక్కా మిగల్లేదు. ఆ విషయంలో నేను చాలా జాగ్రత్త వహించాను. అంతా ఓ తొట్టిలో పిండేసాను — హ! హ్హ! హ్హా!

నేనీ పనులన్నింటికీ ముగింపు పలికే సరికి నాలుగయ్యింది — ఇంకా అర్థరాత్రి చీకట్లు అలుముకుని ఉన్నాయి. గడియారం గంట కొట్టడం తరువాయి, వీధి తలుపు తట్టిన చప్పుడు వినిపించింది. నేను తేలిక పడిన హృదయంతో దాన్ని తెరవడానికి వెళ్ళాను — ఇప్పుడిక నేను భయపడేందు కేముంది? లోనికి ప్రవేశించిన ముగ్గురు వ్యక్తులు, చక్కని హుందాతనంతో, తమని తాము పోలీసు అధికారులుగా పరిచయం చేసుకున్నారు. పొరుగువాడెవరికో రాత్రి ఒక అరుపు వినబడింది; పోలీసు కార్యాలయానికి సమాచారం అందింది; ప్రస్తుతం వారు (అధికారులు) ఈ పరిసరాల్ని తనిఖీ చేయడానికి నియమింపబడినవారు. 

నేను నవ్వాను — ఇప్పుడిక భయపడేందు కేముంది? ఆ పెద్దమనుషుల్ని సాదరంగా లోనికి స్వాగతించాను. ఆ అరుపు నేనే కలలో అరిచానన్నాను. ముసలివాడు ప్రస్తుతం దేశంలో లేడని చెప్పాను. నా అతిథులకు గృహమంతా తిప్పి చూపించాను. వారిని తనిఖీ చేసుకోమన్నాను — బాగా తనిఖీ చేసుకోమన్నాను. నేను వారిని, నిదానంగా, అతని గదికి తీసుకు వెళ్ళాను. లోపల భద్రంగా, చెక్కు చెదరకుండా ఉన్న అతని సంపదల్ని వారికి చూపించాను. నా విశ్వాసపు అత్యుత్సాహంలో నేను, ఆ గదిలోకి కుర్చీలు తెచ్చి, అలసట తీరేదాక వారిని యిక్కడే విశ్రమించమని కోరాను; నా పరిపూర్ణ సాఫల్యం అందించిన వెర్రి ధీమాతో నేను స్వయంగా నా కుర్చీని సరిగ్గా హతుడి శవం విశ్రమిస్తున్న స్థలం మీదనే వేసుకున్నాను.

అధికారులు సంతృప్తి చెందారు. నా ప్రవర్తన వారికి నమ్మకం కలిగించింది. నేను చాలా చలాకీగా ఉన్నాను. వారు కూర్చుని, కుశల ప్రశ్నలేస్తుంటే, నేను కులాసాగా సమాధానాలిచ్చాను. కాని, కాసేపటికి, నాలో సత్తువ జారిపోతున్న భావన కల్గింది, వారు వెళిపోతే బాగుండు ననుకున్నాను. నా తల నొచ్చడం మొదలైంది; చెవుల్లో ఏదో మ్రోత మోగుతుంది. కాని, వారింకా కూర్చునే ఉన్నారు, ఇంకా కబుర్లాడుతూనే ఉన్నారు. ఆ మ్రోత మరింత స్పష్టమయ్యింది — అది కొనసాగుతుంది, ఇంకా స్పష్టమయ్యింది. ఈ భావనను అధిగమించడనికి నేను మరింత ధారాళంగా మాట్లాడ సాగాను; కాని అది కొనసాగుతూనే వుంది, మరింత స్పష్టత పొందింది. చివరకు, కాసేపటికి, ఆ శబ్దం నా చెవుల్లోనిది కాదని నా కర్థమయ్యింది.

నాలో సత్తువ ఇప్పుడు మరింత సన్నగిల్లిందనడంలో అనుమానం లేదు; కాని నేను మరింత వాగ్దాటితో, మరింత హెచ్చు స్వరంతో మాట్లాడతూనే వున్నాను. అయినా ఆ ధ్వని పెరుగుతూనే ఉంది — నేనేం చేసేది? అది సన్నని, మెల్లని, చురుకైన ధ్వని — అచ్చం ఒక గడియారాన్ని నూలుగుడ్డలో చుట్టబెడితే వెలువడే ధ్వని లాంటిది. నాకు ఊపిరాడటం కష్టమయ్యింది — అయినా అధికారులు దాన్ని వినలేదు. నేను మరింత వేగంగా, మరింత తీవ్రంగా మాట్లాడ సాగాను; కాని ఆ శబ్దం క్రమంగా అధికమయింది. నేను పైకి లేచాను; స్వల్ప విషయాలపై — హెచ్చు స్వరంతో, తీవ్ర భంగిమలతో — వాదులాడటం మొదలుపెట్టాను; కాని ఆ శబ్దం క్రమంగా అధికమయ్యింది. వాళ్ళెందుకు వెళ్ళిపోరు? వాళ్ళ పరిశీలనలు నాలో ఆగ్రహాన్ని కలిగిస్తున్నట్లు నేను పెద్ద పెద్ద అంగలతో గదిలో అటూ ఇటూ పచార్లు చేసాను — కాని శబ్దం క్రమంగా అధికమయ్యింది. భగవంతుడా! నేనేం చేసేది? నేను బుసలు కొట్టాను — నేను ప్రలాపించాను — నేను దూషించాను! నేను కూర్చున్న కుర్చీని తిరగేసి, పలకలపై వికృతమైన ధ్వనితో రుద్దాను; కాని శబ్దం నలువైపులా ఉధృతమైంది, ఎడతెగకుండా అధికమవుతూనే ఉంది. అది మరింత బిగ్గరగా — బిగ్గరగా — బిగ్గరవుతూనే ఉంది! అయినా ఇంకా ఆ వ్యక్తులు ఉల్లాసంగా కబుర్లాడుతూనే ఉన్నారు; నవ్వుతున్నారు. వారికి వినబడకపోవడం సాధ్యమేనా? భగవంతుడా! — కాదు, కాదు! వాళ్ళు విన్నారు! — వాళ్ళు అనుమానించారు! వాళ్ళకు తెలుసు! — వాళ్ళు నా భయాన్ని ఎగతాళి చేస్తున్నారు! — యిలా ఆలోచించాను, అలా అలోచించాను. కాని ఈ యాతన కన్నా ఏదైనా సుఖమే! ఈ నీచమైన పరిహాసం కన్నా ఏదైనా సహ్యమే! నేనింక ఈ కపటమైన నవ్వుల్ని భరించలేను! నాకు బిగ్గరగా అరవాలనిపించింది లేదంటే  చచ్చిపోవాలనిపించింది! — మళ్ళీ యింకోసారి — మళ్ళీ! విను! బిగ్గరగా! బిగ్గరగా! బిగ్గర బిగ్గరగా! — 

“దుర్మార్గులారా!” నేనరిచాను, “ఇక నటించొద్దు! నేన్నా అకృత్యాన్ని ఒప్పుకుంటున్నాను! — పలకల్ని పెల్లగించండి! — ఇదిగో, ఇదిగో! — ఇదే కొట్టుకుంటున్న వాడి వికృతమైన గుండె!”

** ** **

వివరణలు:


[1] రాబందు కన్ను(Vulture's eye):
ముసలివాడి కన్ను బహుశా ఇలా ఉండొచ్చు.

[2] లాంతరు (Lantern):
[3] కంచరపురుగు (deathwatch beetle):
ఈ పురుగు పాత కలపలో చేరి తన దవడలతో లోపల కొరుకుతూ, లేదా కొడుతూ గడియారపు టిక్ టిక్ ధ్వని చేస్తుంది. ఇది జత కట్టడానికి చేసే ఈ ధ్వనిని కొన్ని పాశ్చాత్య దేశాల్లో మృత్యుశకునం గా భావిస్తారు.
[4] నేలపలకలు (Floorboards): 
ముసలివాణ్ణి పూడ్చిపెట్టింది ఇలాంటి పలకల క్రిందనే. 

February 3, 2008

వీడ్కోలు

రైలు కూత పెట్టింది. కిటికీ బయట వొంగినిల్చొని, ఆమెతో ఒక అందమైన ఆవరణలో సోలిపోయి ఏదో మాట్లాడుతున్నవాడల్లా... పరిసరాల్లోకి మేల్కొన్నాడు. ప్లాట్‌ఫాం, అనౌన్సుమెంట్లు, జనం రద్దీ. అప్పటిదాకా ప్రయత్నపూర్వకంగా మనసు అంచులవైపుకి నెట్టేసిన ఆలోచన ఇపుడు నల్లని నీడలాగా మళ్ళా మధ్యలోకి తోసుకొచ్చింది: ఆమె వెళ్ళిపోతోంది! నిజానికి ఆమె వెళ్ళిపోవటం, తర్వాత ఒంటరిగా రోజులు ఈడ్చుకురాగలగటం... వీటన్నిటి కంటే ముందు, అసలు రైలు వెళ్ళిపోయిన మరుక్షణం ప్లాట్‌ఫాం మీద ఒక్కడే మిగిలి వుంటాడన్న స్ఫురణే సత్తువ తోడేస్తుంది. అరగంట క్రితం ఆటోలో స్టేషన్‌కు వస్తుంటే, తన ఎడమ భుజంపై బరువుగా వాలిన తల నుంచి చామంతుల పచ్చి వాసన; తన గరుకు చెంపపై గాలికి చెదిరిన వెంట్రుకల చక్కిలిగిలి. పది నిముషాల క్రితం వరకూ ప్లాట్‌ఫాం మీది సిమెంటు బెంచీలో ఇద్దరూ కూర్చుని, చేతులు ముడేసుకుంటే అరచేతుల్లో వెచ్చదనం; పక్క బెంచీలో వాళ్ళమ్మ వొళ్ళో ముభావంగా, అలౌకికంగా బొటనవేలు చప్పరిస్తూన్న రెండేళ్ళ అపరిచితుడి ధ్యాస ఇటు మళ్ళించటానికీ, కాస్త నవ్వించటానికి తామిద్దరూ పోటాపోటీగా పడ్డ పాట్లు.... ఇపుడు కొద్ది క్షణాల్లో ఈ రాక్షస యంత్రం ఆమెనీ, ఆమెతనాన్నీ దూరంగా తీసుకు పోతుంది. మళ్ళీ వచ్చిన దారినే, శూన్యం తోడుగా, ఇంటికి వెళ్ళాలి. ఆమె వేరే ధ్యాసలో ఏదో మాట్లాడుతుంది. అతని కనుగుడ్లపై కన్నీటి పొర ఊరటం మొదలైంది. చేత్తో తుడిచేసుకునే వాడే కాని, ఒకవేళ ఆమె ఇప్పటిదాకా చూడకపోయుంటే అలా తుడుచుకోవటం ద్వారా దొరికిపోతాడేమోనన్న సంకోచం. ఈ దీనావస్థలో తన మీద తనకు కలిగిన జాలి కన్నీటి ఊటని ఇంకాస్త పెంచింది. మట్టం ఏ క్షణమైనా రెప్పలు దాటి చెంపలమీదకి పొంగేలా ఉంది. అదృష్టంకొద్దీ ఆమె పక్కన కూర్చున్న వాళ్ళు ఏదో అడిగితే అటు తిరిగింది. ఈ కాస్త సందులో తనివితీరా కళ్ళు తుడుచుకున్నాడు. రైలు సందిగ్ధంగా కదిలి, ఆగి, మరలా కదిలింది. చుట్టు ప్రక్కల కిటికీల దగ్గిర వున్న జనాల్లో సందడి పెరిగింది. వీడ్కోలు మాటలు (కొన్ని ఆ క్షణంకోసమని ముందే దాచి పెట్టుకున్నవీ, కొన్ని అప్పటికప్పుడు తట్టినవీ) ముక్కలు ముక్కలుగా వినపడుతున్నాయి: "చేరగానే ఫోన్...", "టాబ్లెట్స్ జాగ్రత్తగా...", "అంకుల్న డిగానని...", "ఏసేహీ కభీ, ఈద్ కా చాంద్...". ఆమె ఏదో ఆశింపుగా కళ్ళలోకి చూస్తుంది. తనకి మాత్రం మాట పెగలడం లేదు. కిటికీ ఊచలమీద ఉన్న ఆమె చేతిపై చేయి వేసి, రైలుతో పాటు నడిచాడు. అంత కదలికలోనూ ఇద్దరి చూపులూ మాత్రం అతుక్కుపోయున్నాయి. రైలు స్పీడు పెరిగింది. వేగంగా నడుస్తున్నాడు. జనాలు అడ్డొస్తున్నారు. తను మాత్రం చేతిపై నుండి చేయి తీయకుండా, నడకా పరుగూ కలిపి తోసుకొస్తున్నాడు... "ఆగిపోరా!" జాలిగా అంది. ఊచలమీంచి చేయి తీసేసి నిలిచిపోయాడు. ఆ పెట్టె మిగతా పెట్టెల్లో కలిసి ముందుకు వెళిపోయింది. ఆమె ఊచలకు మొహం అదిమి పెట్టి తొంగి చూస్తోంది. ఎదర పట్టాలు అతనికి ఎడంగా ఒంపు తిరిగి ఉండటం వల్ల ఆ మలుపులో ఆమె కిటికీ మాయమై పోయింది. కానీ ఊచల మధ్య నుంచి బయటపెట్టిన చేయి మాత్రం ఇంకా తననుద్దేశించి ఊగుతోంది. క్షణం క్రితం తన చేతిలో ఉన్న చేయి, ఇపుడు దూరంగా సంబంధం లేకుండా గాల్లో ఊగుతూ.... ఇదేమన్నా మార్చలేని విధా? తల వొంచి తీరాలా? రైలు స్పీడు ఇంకా అందుబాటులోనే ఉంది. ఉన్నపళంగా పెరిగెట్టి అందిన భోగీలోకి ఎక్కేస్తే. మరి టికెట్...? హూ గివ్సె షిట్! తెగింపు ఓ కొలిక్కి రాక ముందే రైలు వెళ్ళిపోయింది. చివరి భోగీ వెనుక తాపడమై ఉన్న ఎర్రని బల్పు అతని పిచ్చి ఆలోచనల్ని వెక్కిరిస్తున్నట్టు వెలిగి ఆరుతుంది. అతను కాసేపలాగే శిల్పంలాగ నిలబడ్డాడు. నిట్టూర్చి, వెనుదిరిగాడు. ప్లాట్‌ఫాం, అనౌన్సుమెంట్లు, జనం రద్దీ.