February 26, 2011

పుస్తకాల్ని పైకి చదవడం గురించి

పుస్తకాల్ని పదిమందిలో పైకి చదవడం అనే కళ నాకు అబ్బలేదు. చిన్నప్పుడు క్లాసులో టీచర్లు రెండుమూడుసార్లు పాఠాల్ని పైకి చదివించిన గుర్తుంది. కానీ నాకు మందిలో మసలుకోవడమంటే వణుకు. అలాంటి సందర్భాల్లో నా నిజమైన గుణాన్ని ఎక్కువసేపు అంటిపెట్టుకు వుండలేను. అది నాకే మసకగా మారిపోతుంది. చుట్టూ జనాల అంతరంగాల్లో బహుశా నేను ఎవర్నైవుంటానని అనుకుంటానో, ఆ పొగదెయ్యాల్లాంటి ప్రతిబింబాలు నన్ను చుట్టుముట్టి శాసించడం మొదలుపెడతాయి. ఒకేసారి అన్ని "నేను"ల గోల తికమకపెడుతుంది. నిభాయించుకోలేక అభాసుపాలవుతాను. నేను క్లాసు ముందు నిలబడి పాఠం చదివిన కొన్ని సందర్భాలూ ఇలాంటివే. దీనికి తోడు నాకు నా గొంతే ఒక అడ్డం. మామూలుగా తక్కువగా మాట్లాడేవాళ్లకి తమ గొంతు వినే అవకాశం తక్కువ. ఇలా ఏదైనా పైకి చదవటం మొదలుపెట్టిన కాసేపటికే నా ధ్యాస చదవబడే విషయాన్ని వదిలి, చదువుతున్న నా గొంతు వైపు మళ్ళుతుంది. స్వరంలో హెచ్చుతగ్గులు, విషయాని కనుగుణంగా గొంతు మార్చటం... వీటిపైకి దృష్టిపోతుంది. దీంతో ఒకేసారి విషయం మీదా, వ్యక్తీకరణ మీదా శ్రద్ధ పెట్టగలిగేంతటి ఏకాగ్రత లేని నా మెదడుకు పేజీ మీద వున్న విషయం అలుక్కుపోతుంది. నేను తడబడతాను. మనకు చేతకానివి క్రమేణా మనకు నచ్చనివిగా మారిపోతాయి. నచ్చకపోవడానికి సమృద్ధిగా కారణాలు కూడా వచ్చి చేరతాయి. నావరకూ బహిరంగ పుస్తక పఠనాలు వ్యర్థ ప్రహసనాల విభాగంలోకి మళ్ళిపోయాయి. రచనను ఒకరు చదవడం, పదిమంది వినడం అనేది అసలు పుస్తకాల్ని ఆస్వాదించేందుకు పనికిరాని పద్ధతి అనీ, పుస్తకాల్ని చదవటమనేది ఒంటరిగా వున్నపుడు మాత్రమే అర్థవంతంగా సాగే పని అనీ అభిప్రాయం బలపడింది. ప్రేయసితో మాటలకు ఏకాంతం కావాలి. పుస్తకాలతో సంభాషణ కూడా అంతేనని.

అయితే ఒక్కడినే వున్నపుడు మాత్రం అపుడపుడూ బిగ్గరగా బయటకి చదువుతూంటాను. దీనికి కారణం వుంది. గొప్ప రచయితలేం చేస్తుంటారంటే, లేదా అప్పుడప్పుడూ ఏం చేయగలుగుతారంటే, భాష ద్వారా సాధించగలిగే అభివ్యక్తి అవధుల్ని దాటేసి, భాషకు ఆవలి భావాల్ని కూడా స్ఫురింపజేయగలుగుతారు. చూట్టానికి అచ్చులు హల్లులతో కూడిన పదాలూ, వ్యాకరణానుగుణమైన వాక్యాలూ ఏదో విషయాన్ని వ్యక్తీకరిస్తూనే వుంటాయి. కానీ దాన్ని మించిన భావమేదో అందీఅందకుండా ఆ వాక్యాల చుట్టూ ఒక ఆవిరిలానో కమ్ముకునో, వాటి వెనక నీడలా తచ్చాడుతూనో ఉంటుంది. అదేమిటాని పట్టిపట్టి అర్థంచేసుకోబోతే- ఆ ప్రయత్నం చేసినకొద్దీ ఇంకా దూరమైపోతుంది. కానీ అర్థంచేసుకోవటాన్ని మించిన అనుభవమేదో స్ఫురిస్తూనే ఉంటుంది. ఈ ఫీట్‌ని అందరు రచయితలూ అన్నిసార్లూ చేయలేరు. కొందరే, అదీ వాళ్ల సామర్థ్యపు అంచుల్ని అప్రయత్నంగా అందుకోగలిగినపుడు మాత్రమే చేయగలుగుతారు. చదువుతూ చదువుతూ వుండగా, హఠాత్తుగా ఈ ఇంద్రజాలం మనల్ని చకితుల్ని చేస్తుంది. వొళ్ళు జలదరిస్తుంది. కానీ కారణం కనిపించదు. వ్యక్తీకరణకు మూలమైన భాష అంతా కళ్ళముందే వుంటుంది, మనకు తట్టిన భావం మాత్రం ఆ భాషలో ఎక్కడినుంచి వచ్చిందో మాత్రం ఎంత తరచినా అంతుచిక్కదు. ఈ కనికట్టు రహస్యం కనుక్కోబుద్ధవుతుంది. ఇంద్రజాలికుడు తన తిరగేసిన టోపీ లోంచి పావురాల్ని వదిలేయటం ఐపోయింది, అవి తపతపా రెక్కల చప్పుడుతో ఈకలు రాల్చుకుంటూ ఆకాశంవైపు ఎగిరిపోయాయి, మనసు వివశమై చప్పట్లు కొట్టేసింది, ప్రదర్శన ముగిసింది. అంతా వెళిపోయాకా, అక్కడ బోర్లా మిగిలిన టోపీలోకి మనం ఎంత తొంగిచూస్తే మాత్రం రహస్యమేం బోధపడుతుంది? నేను ఒంటరిగా వున్నపుడు బయటికి చదివే సందర్భాలు ఇలా ఖాళీ టోపీని తిరగమరగేసి చూసే తంతు లాంటివే. నన్ను జల్లుమనేట్టు చేసిన ఆ భావం, కనిపిస్తున్న అక్షరాల్లో ఎక్కడుందా అని పదే పదే ఆ వాక్యాల్ని పైకి గట్టిగా చదువుతాను. మొదటిసారి పొందిన ఆనందాన్ని పదే పదే పునరానుభూతం చేసుకోవాలన్న ఆశ కూడా అందులో వుంటుంది. (చదివిన ప్రతిసారికీ అంతకంతకూ తరుగుతూ ఈ ఆనందం అనుభూతమవుతుంది కూడా.) కానీ ఎన్నిసార్లు చదివినా అవే పదాలూ అవే వాక్యాలూ 
వినపడి పాతబడిపోతాయే గానీ, కనికట్టు వెనక గుట్టు మాత్రం అంతుపట్టదు. పాఠకులుగానే మిగిలిపోతే ఎప్పటికీ అంతుపట్టదేమో. ఎపుడో మనమూ రాయడం మొదలుపెట్టినపుడే, ప్రేరణ అనే నీలపు మంచు పూల తుఫాన్లో మనల్ని బుద్ధి దారి పోగొట్టుకున్నప్పుడే, ఆ గుట్టు తెలుస్తుంది. అప్పుడు కూడా తెలియడమనేది వుండదు, అనుభవానికొస్తుంది, అంతే. ఈ ఇంద్రజాల రహస్యం ఆ ఇంద్రజాలికులకే తెలియదు. చేసి చూపించగలరు. ఎలాగంటే చెప్పలేరు. సాహిత్యం మనకు అందించే ఆనందపు మూలాల్ని ఎన్ని కాగ్నిటివ్ సైన్సులొచ్చినా శాస్త్రీయంగా అర్థం చేసుకోలేం.

ఇపుడు అసలు విషయం. ఈ మధ్య నా ఒంటరి పఠనాల్లోకి ఇంకొకర్ని ఆహ్వానించాను. కొన్నిసార్లు ఆత్మీయుల సమక్షంలో అయినా సరే అదేపనిగా గడపాలంటే ఏదో ఒక సాకు కావాలి. ఇలా పుస్తకాలు చదివి వినిపించటమనే సాకు మాకు దొరికింది. నేను "వేయి పడగలు" లాంటి చాలా అన్‌-రొమాంటిక్ రచనలే చదివి వినిపిస్తున్నా, చాలా బాగుంటోంది. వేరేవాళ్ల దగ్గర యిలా ఏ సెల్ఫ్‌కాన్షస్‌నెస్సూ లేకుండా చదవగలగడం నాకు కొత్త. మరొకరి సమక్షంలో కూడా మన ఏకాంతాన్ని మనం ఆనందించగలిగేంతటి చనువు కొందరితో ఎన్నేళ్ల సాంగత్యంలోనూ ఏర్పడదు, మరి కొందరితో ఇట్టే ఏర్పడిపోతుంది. అది నాకు ఈ పఠనాల్లో కొత్త మజానిస్తోంది. అంతేకాదు, నేను ఆనందిస్తూ తననీ ఆనందింపజేస్తూ చదవాలి గనుక, రచనల్ని మరింత లోతుగా చదవగలుగుతున్నాను.

మనుషుల మధ్య లౌక్యం పునాదిగా ఏర్పడే సుహృద్భావ వాతావరణం నా మనసుకి వాంతి తెప్పిస్తుంది. అందులో నేనెపుడూ భాగం కాలేను. అలాంటి సందర్భాల్లో spoilsport పదవి వద్దన్నా నన్ను వరిస్తుంది. ఈ పదవి నిర్వహించడం నాకెంతగా అలవాటైపోయిందంటే, ఎపుడన్నా స్వచ్ఛమైన సుహృద్భావ వీచికలు నా వైపు వీచినా, నేను ముక్కు మూసుకుని అనుమానంగా చూస్తుంటాను. మనిషి అలాంటి కరడుగట్టిన గుల్లలోకి ముడుచుకుపోయి వుండటం ఎక్కువ కాలం కొనసాగితే, ఇక తనంతట తాను బయటకి రావడం చాలా కష్టం. గుల్ల బద్దలుకొట్టి మనల్ని బయటకి లాగటానికి ఎక్కువమంది అవసరమూ లేదు. సత్యం పునాదిగా ఒక్క స్నేహమే అయినా చాలు. 
షోపనార్ గురించి నీషే అంటాడు: "He was an out and out solitary; there was not one really congenial friend to comfort him -- and between one and none there gapes, as always between something and nothing, an infinity." బయటకు లాగబడ్డాకా కూడా మనం స్నేహంగా మసలుకోగలిగేది ఆ ఒక్క వ్యక్తితోనే కావచ్చు. కానీ నీషే అన్నట్టు ఒక్క స్నేహితుడుండటానికీ, ఎవరూ లేకపోవడానికీ మధ్య అనంతమైన అంతరం నోరుతెరిచి వుంటుంది. ప్రపంచమంతా పరుషత్వంతో పొడిచినా, ఒక్క స్నేహపు ఊరట చెంతనుంటే చాలు, పెద్ద బాధ వుండదు. ఈ చిన్ని స్నేహ వృత్తంలో ఒక ప్రపంచాన్నే పుట్టించుకోవచ్చు. అక్కడ నువ్వు నీలా మసలు కోవచ్చు. ఇంతకీ నేనీ పేరా ఎందుకు రాస్తున్నాను? ఏమీ లేదు. నేను నాలా వున్నపుడు చాలా ధీమాగా వుండగలను. చాలా ధీమాగా పుస్తకాల్ని పైకి చదవగలను. వాటిల్లో కథనాన్నే కాదు, మధ్యలో వున్న సంభాషణల్ని కూడా ఆయా పాత్రల గొంతులు అనుకరిస్తూ చదివేయగలను. అలాగని నాకిపుడే తెలిసింది. వచనాన్ని ఏకాంతంలో ఎవరికి వారే చదుకోవాలి తప్ప పైకి చదవకూడదంటాడు హెన్రీ గ్రీన్:

Prose is not be read aloud but to oneself alone at night, and it is not quick as poetry but rather a gathering web of insinuations… Prose should be a long intimacy between strangers with no direct appeal to what both may have known. It should slowly appeal to feelings unexpressed, it should in the end draw tears out of the stone…

కానీ మరొకరి సమక్షంలో కూడా మనతో మనం మసలుకోగలిగే ఏకాంతాన్ని అందుకోగలిగినపుడు, వచనాన్ని బయటకి చదివినా ప్రభావం పోదంటాను. ప్రస్తుతం తనకు నేను "వేయి పడగలు", తను నాకు "మ్యూజింగ్స్" చదివి వినిపించుకుంటున్నాం. "వేయిపడగలు" ఇద్దరం చదవలేదు. నేను ఇదివరకోసారి మొదలుపెట్టాను గానీ, బయటేవో ఒత్తిళ్ల వల్ల మధ్యలో పక్కనపెట్టేసాను. "మ్యూజింగ్స్" ఇదివరకూ చదివాను, మళ్ళీ చదవాలని చాన్నాళ్ళనుంచీ అనుకుంటున్నాను. రెండూ పెద్ద పుస్తకాలే కాబట్టి ఇవి చాన్నాళ్ళు కొనసాగే పఠనాలు. అందుకని మొనాటనీ రాకుండా మధ్య మధ్యలో కథలూ కవితలూ కూడా ఇరికిస్తున్నాం. ఈ పఠనాల్లో నేను రచనల వైనాల్ని మరింత తీక్ష్ణంగా గమనించగలుగుతున్నాను. ఏ రచయితకారచయితకుండే ప్రత్యేకమైన సాధనాల్ని గుర్తించగలుగుతున్నాను. వచనపు లయని మరింత ఆస్వాదించగలుగుతున్నాను.

"
వేయి పడగలు" యిప్పటిదాకా చదివినంతవరకూ చూస్తే నాకు యిలాంటిదే మరో నవల గుర్తుకు వస్తోంది. అది స్పానిష్ రచయిత గాబ్రియెల్ గార్సియా మార్కెజ్ రాసిన "ఒన్ హండ్రెడ్ యియర్స్ ఆఫ్ సొలిట్యూడ్". "వేయి పడగ"ల్లోనూ ఒక ఇతిహాసపు భారీతనం వుంది. బోలెడంత మేజిక్ రియలిజం కూడా వుంది. సుబ్బన్న పేట గ్రామ నిర్మాణంలో "గోవు - వేయి పడగల పాము" వృత్తాంతమూ, రామేశ్వరశాస్త్రి బ్రాహ్మణుడై వుండీ అన్ని కులాల స్త్రీలనీ పెళ్లాడి గ్రామం చేత అంగీకారం పొందబడటమూ, పసిరిక పాత్ర చిత్రీకరణా, ఇంకా అనేక వర్ణనల్లో అది స్పష్టంగా కన్పిస్తుంది. అంతేకాదు, విశ్వనాథ దీన్ని మార్కెజ్ కన్నా ప్రభావవంతంగా ఉపయోగించుకుంటాడు. ఎందుకంటే ఆయన మార్కెజ్ లాగా మేజిక్ రియలిజం పేరిట ఇమేజినేషన్ని గాల్లో అర్థంలేని దొమ్మరాటలు ఆడించడు. వేయిపడగల్లో ఎన్ని మానవాతీతమైన విచిత్రాలు జరిగినా నేపథ్యంలో వాటికి రచయిత ఉద్దేశించిన పరమార్థమేదో తచ్చాడుతుంది. 


విశ్వనాథ ఉపమానాలు ఒక క్రమ పద్ధతిని అనుసరించి సాగుతాయి. ఆయన తెచ్చే పోలికలన్నీ కథలో ఆయా సన్నివేశాలతో సన్నిహితమైన సంబంధాన్ని కలిగివుంటాయి. ఉదాహరణకు శివాలయంలో జరిగే ఒక సన్నివేశంలో, శుక్లాష్టమి వెన్నెలకు తెచ్చిన ఉపమానాలన్నీ శివుని సంబంధించినవే:
శుక్లాష్టమి వెన్నెల శివజటాటవీ నటన్మందాకినీ నవస్మేర వీచీ రామణీయకము వోలె, అంబికా ప్రసన్నాపాంగరేఖా ప్రసారము వోలె, విఘ్ననాయకుని ఏకదంత సితచ్ఛటా స్వచ్ఛతంబోలె శైవమహాత్మ్యమై విరిసెను.

దేవదాసి అనే పాత్రని వర్ణించేటపుడు, ఉపమానాలన్నీ విష్టువుకు సంబంధించినవే వుంటాయి:
దాని తెల్లని పలువరుస సుదర్శనాయుధపు టంచులవలె పదునుపెట్టి నట్లుండెను. దాని చెవులు శ్రీకారములై పాంచజన్యము లట్లుండెను. దాని కన్నులు కమలములు. దాని నాసిక కౌమోదకి. దాని భ్రూయుగము శార్ఙము ద్విథా విభక్తమైనట్లుండెను. దాని మూర్తి వికుంఠమై మనోజ్ఞమయ్యెను. [కౌమోదకి = విష్ణువు గద; శార్ఙము = విష్ణువు విల్లు]

చలం "మ్యూజింగ్స్"లో ఇదివరకూ ప్రపంచం మీద కోపాన్నే ఎక్కువ చూసాను. ఇపుడు నిష్పలమైన బక్క కోపం చివరకు ఎకసెక్కపు హాస్యంలోకి పరిణితి చెందిన వైనాన్నీ గమనించి ఆస్వాదించగలుగుతున్నాను.
చాలామంది సముద్రం వొడ్డుకి ఎందుకు వొస్తారంటే, మార్పు కోసం. ఆఫీసు నించీ, వంటిళ్ల నించీ, నలుగురూ వస్తే యెవరన్నా తెలిసినవారిని కలుసుకోవచ్చుననీ, చల్లగాలిలో విశ్రాంతిగా కబుర్లు చెప్పుకోవచ్చుననీ బైబిల్ని యింగ్లీషు కోసం చదివే వాళ్ల లాగు.
-- -- --
సౌందర్యం శృంగారం ఏమి వ్రాసినా, బూతూ, వ్యభిచారంగా పరిణమిస్తున్నాయి యీ క్షుద్ర విమర్శకులకి. ... పవిత్రంగా ఆధ్యాత్మికంగా, పరిణయంగా, అగ్నిసాక్షిగా, స్త్రీతో ఏం సంబంధం పెట్టుకుంటావు? విమర్శకుడా! చేతులూ, పెదిమలూ, తొడలూ పనిచెయ్యకుండా, ఎట్లా మోహిస్తావు, ప్రేమిస్తావు స్త్రీని. అదేదో ఆ రహస్యం కొంచెం చెబుదూ? నీరసంగా, ఏడుస్తో, తిడుతూ కళ్లు మూసుకుని, పాపకార్యం సాగిస్తున్నావా, మహామునీ! అనుభవించి పోతున్నారనా, ఆగ్రహం!

"
మ్యూజింగ్స్"లోని కవిత్వాన్ని కూడా ఇపుడు మరింత దగ్గరకి తీసుకోగలుగుతున్నాను:
ఈ పక్షి పాట యెట్లా వూపుతోందో ఈ పరిసరాల్ని! ఈ కుర్చీలు కూడా ఆ పాటకి ప్రకంపిస్తున్నాయి. ఏనాడో, ఏ బర్మా అరణ్యాల్లోనో, టేకు మానులై వున్న రోజుల్లో తమ శాఖల మీద కూచుని పాటలతో రంజింపజేసిన పక్షుల రుతాలు జ్ఞాపకం రావడం లేదు కదా యీ కుర్చీలకి?

-- -- --


ఆ గడ్డి మధ్య ఒక్కటే యెర్రని పువ్వు గాలిలో ఊగుతూ అలసిన నా దృష్టిని ఆపి పలకరించింది. అప్పుడే క్రొత్తగా భూమిని బద్దలు చేసుకుని, ముఖాన్నెత్తి, ఎండనీ, చెట్లనీ, చూసి పకపక నవ్వుతో తను కూడా బతుకులోకి దూకాననే సంతోషంతో గంతులు వేసి ఆడుతోంది. ఈ బిడ్డను చూసి చుట్టూ వున్న ముసలమ్మ చెట్లు బోసి చిగుళ్లు బైట పెట్టి ఆనందిస్తున్నాయి.

ఇలాంటివన్నీ నేను ఒక్కడ్నే కూర్చుని చదువుకున్నా గమనించేవాణ్ణేమో. కానీ మరో దగ్గరి మనిషితో కలిసి చదువుతున్నపుడు వట్టి గమనింపుతో ఆగిపోం, గమనించినవాటిని వారితో కలిసి సెలబ్రేట్ చేసుకోబుద్ధవుతుంది. అది పఠనానందం పక్కన శతసహస్రగుణకాన్ని తెచ్చి పెడుతుంది. 
. . .

14 comments:

 1. "....మనకు చేతకానివి, క్రమేణా మనకు నచ్చనివిగా మారిపోతాయి..."

  ఈ విషయం అందరికీ అనుభవమే కాని నిజాయితీగా ఒప్పుకునే వాళ్ళు తక్కువ.

  మీ వ్యాసం బాగున్నది. కథ చదువుతుంటే వినటంలో కలిగే ఆనందాన్ని గమనించే ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం వారు 1980 లో "నవలా స్రవంతి" అని ఒక చక్కటి కార్యక్రమంలో కొడవటిగంటివారి చదువు నవల, ఉన్నావ వారి మాలపల్లి నవల మున్నగునవి అద్భుతంగా వినిపించి అప్పటి శ్రోతలను రంజింప చేసారు. ఆ రికార్డింగులు ఎక్కడన్నా దొరికితే ఎంత బాగుండును! ఇప్పుడు అమెరికా యూరప్పుల్లో ఆడియో బుక్స్ ఎన్నో ఉన్నాయి. కీ. శే. శ్రీ ముళ్ళపూడి వారు కూడా తన కోతి కొమ్మచ్చి అనే తన ఆత్మకథను ఆడియో పుస్తకంగా విడుదల చెశారు. ఈ ఒరవడిలోనే మనకు తెలుగులో అన్ని మంచి పుస్తకాలకు ఆడియో పుస్తకాలుగా చక్కగా చదివే వాళ్ళ గొంతులలో రావాలని నా ఆకాంక్ష.

  ReplyDelete
 2. your post is a Wow!!

  ఇంకొకరికి చదివి వినిపించే సాహసం చేయలేదుగానీ. నేనెప్పుడూ బిగ్గరగానే చదువుతాను పుస్తకాలను. అక్షరాలలో పొందుపర్చబడ్డ భావాలను గొంతుద్వారా మరింత సజీవంగా చేయడం నాకిష్టం.

  మీ పోశ్టు బాగుంది దాన్ని మీ శైలి డామినేట్ చేసింది ఒక దశలో కవిత్వమనిపించింది. Yes. I mean it.

  అయితే బైబిల్ని ఇంగ్లీషు కోసం చదివడం ఆల్రెడీ అంగీకరించబడ్డ పిచ్చన్నమాట. ఇన్నాళ్ళూ నేనొక్కణ్ణే అనుకున్నాను :)

  @శివ గారు:
  పుస్తకాలు చదవడంలో వున్న ఆనందం ఆడియో వర్షన్లు వినడంలో వుంటుందంటే నేనొప్పుకోను.

  ReplyDelete
 3. @Indian Minerva,

  మీ అభిప్రాయం మీది. నా అభిప్రాయం నాది. రెండూ కలవాలనీ లేదు. రెండిటిలోనూ ఒక్కటే సరైనదీ అని అనటానికీ లేదు.

  సాహిత్య అభిలాష అనేక రకాలు. వాటిల్లో ఒకరు భావయుక్తంగా చదువుతుండగా వినటం ఒకటి. నేను ఈ ఆనందాన్ని పొందినవాణ్ని కాబట్టి (ఆకాశవాణి వారి ధర్మాన) నాకు ఆ ఇష్టం ఏర్పడింది.

  ReplyDelete
 4. @ Indian mineva,

  రేడియోలో పుస్తకాలు చదివి వినిపించడం అనేది శారదా శ్రీనివాసన్ వంటి ప్రతిభ గల కళాకారులు చేస్తే బాగుంటుంది! భావ ప్రకటన,panctuations సరిగ్గా ఫాలో అవడం, పాత్ర స్వభావాన్ని, కథ అంతరార్థాన్ని అర్థం చేసుకుని చదువుతారేమో వాళ్ళు!

  ఎంత బాగా చదివినా నాకు మాత్రం పుస్తకాలు ఎవరికి వాళ్లు చదువుకుంటేనే ఇష్టం!"ఇద్దరూ కల్సి పుస్తకాలు చదువుకోవడం" అనే కాన్సెప్ట్ రంగనాయకమ్మ గారి పుస్తకాల్లో కనిపిస్తుంది. ఇది కూడా నాకు అర్థం కాదు. ఒకేసారి ఎలా చదవగలుగుతాం ఒక పేజీని? ముందూ వెనకా అవదూ?

  చదివాక ఒక పుస్తకం గురించో కవిత, లేదా కథ గురించి అభిప్రాయాలు విపులంగా పంచుకోవడం, ఆ పుస్తకాల్లోని సంభాషణలు కోట్ చేసుకోడం ఇవన్నీ బాగుంటాయి.

  ఈ మధ్య కోతి కొమ్మచ్చి పుస్తకాన్ని బాలూ చదివారని అది బాగా ఆదరణ పొందిందని విన్నాను. కొంచెం నేను కూడా వినాను. కానీ ముళ్ళపూడి వెంకట రమణ లాంటి పదునైన కలం గల రచయిత మాటల్లో విరుపుల్ని, చెణుకుల్ని చమత్కారాలని చదివి అనుభవించి అర్థం చేసుకుని ఆనందించడంలో ఉన్న ఆనందం ఈ ఆడియో వినడంలో నాకు కలగలేదు. బాలూ కూడా రమణ మాటల్లోని చమత్కారాల్ని "పన్" ని పూర్తిగా గొంతులో పలికించలేకపోయారనిపించింది. ఇది ముళ్ళ పూడి మీద నాకున్న అభిమానం స్థాయి కావొచ్చు!

  నవలలు కవితా సంకలనాలు ఇవి కూడా బిగ్గరగానే చదువుతారా మీరు?

  స్కూల్లో ఉన్నపుడు మాత్రం క్లాసు పుస్తకాలు పైకి చదివే దాన్ని నేను. తర్వాత ఆ అలవాటు వదిలించుకున్నాను.

  ReplyDelete
 5. @ RK,

  When did i ever go anywhere to come back again!

  @ శివ, Indian Minerva,

  థాంక్యూ! నేను ఆడియోబుక్స్ ఇంతదాకా వినలేదు. "How Proust Can Change your life" అనే పుస్తకానికి ఆడియో వెర్షన్ విన్నాను గానీ, ఏమో ఎక్కలేదు. సగంలో పక్కన పెట్టేసాను. ఏమైనా ఒక పుస్తకం ఇచ్చే ఇంటిమసీ ఇవి ఇవ్వగలవా అనేది అనుమానమే. అయితే అది ఆయా చదివేవాళ్లు కలిగించగల ఆత్మీయానుభూతి మీదా, ఆ రచన సత్తా మీదా కూడా ఆధారపడి వుంటుందనీ, "ఆడియో బుక్స్ అంటే యిలా" అని జెనరలైజ్ చేసి చెప్పలేమనీ అనుకుంటాను.

  @ సుజాత,

  ఒకే పేజీలోకి ఇద్దరు తొంగి చూసి చదవడమైతే అలాగే అవుతుంది. కానీ నేను జంట పఠనాలన్నది ఇద్దరు వ్యక్తులు పక్క పక్కన కూర్చొని ఒకరు చదివి వినిపిస్తుంటే ఒకరు వినడం. దాని గురించే నేను రాసింది కూడా. Wonderful experience depending on the kindness of providence that could grant you a kindred soul!

  ReplyDelete
 6. మనకి ఇష్టమైనవి/మనమిష్టంగా చేసేవి క్రమేణా మనని నిష్ణాతులుగా చేస్తాయి. ఆడియో వర్షన్లుగా పుస్తకాలనో, నాటికలనో వినటమన్నది ఇక్కడ వచ్చింది కనుకా - ఆకాశవాణిలో ప్రసారితమైన చలం రచన "పురూరవ" శ్రవ్య నాటిక లింక్ [ఈమాట సౌజన్యంతో] ఇస్తున్నాను http://www.eemaata.com/em/issues/200811/1350.html వినటంలోని హాయికి, ఆస్వాదనకి ఇదొక చక్కని తార్కాణం. చలం గారినే ముగ్ధుల్ని చేసిందట శారదా శ్రీనివాసన్ నవ్వు.

  ఇకపోతే, పక్క పక్కన కూర్చుని చదవటం లో ఒక విధమైన ఆత్మీయమైన చర్య నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతుంది- మనసుని నిలకడగా ఉంచుతుంది. నిజానికి కాసేపటికి దృష్టిపథంలో మిగిలేది ఆ కథాపరమైన పాత్రలే, అంతగా లీనమవగలము. ఈ జంట పఠన భాగస్వామిని కనుకా నా స్వానుభవాన్ని కూడా పంచాను.

  ReplyDelete
 7. చాలా నిజం. పురూరవ వింటున్నప్పుడు శారదా శ్రీనివాసన్ గారి గొంతు, ఆవిడ పలికే విధానం, ముఖ్యంగా ఆవిడ నవ్వు, వేరే లోకాలకి తీసుకెళ్ళిపోతాయి. నాయిస్ కాన్సలేషన్ హెడ్ఫోన్స్ పెట్టుకొని కొంచెం చీకట్లో కళ్ళు మూసుకుని వినండి పురూరవని, గంధర్వ లోకంలోకెళ్ళి రాకపోతే నా మీదొట్టు :-) నేనలాగే విన్నా, అయిపోయాక కనురెప్పల బరువుకి కళ్ళు తెరవలేకపోయాను!!

  ReplyDelete
 8. చాలా బావుందండీ.. ఇంతకన్నా ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలీట్లేదు! చదవడంలో ఒక కొత్త అధ్యాయాన్ని పరిచయం చేశారు!

  ReplyDelete
 9. కొత్తపాళి గారు ఎవరినో శభాష్ అని మెచ్చుకున్నారు ఎవరబ్బా అని వచ్చి టపా చూస్తె మంచి ఆహ్లాదం కలిగింది.....థాంక్స్ మెహెర్ గారు.

  ReplyDelete
 10. మెహెర్ రచన తాత్వికం. మార్మికం. ఇప్పుడు ఈ నిషా నుంచి తనని తాను చూసుకోవడం మొదలెట్టారేమో ఆనందంలో కోల్పోవాలో తెలిసిపోతోంది అతనికి. మెహెర్ మాటలు నాకు మాత్రమేనా, అందరికీ అలాగే అనిపిస్తాయా...అచ్చం నన్ను నేను చూసుకున్నట్టు... అవి నా మాటలే అన్నట్టూ...

  ReplyDelete
 11. Nato naku vachina gapni gurtu chesinatlu vundi Chala rojulninchi musings malli chadavalani anukuntunnanu ippudu book vedukutanu

  ReplyDelete