October 4, 2011

దేవుణ్ణి అటకాయించిన మనిషి

అతణ్ణి మొదట గౌస్‌ మియా హోటల్లో చూసాను. ఆ రోజు జరిగిన గలాటాలో అతను పోషించిన పాత్ర అంత తొందరగా మర్చిపోగలనా! ఆ హోటలుకేదో వేరే పేరు వుంది, ఏదో ఫలానా 'కెఫె' అని పైన రాసి వుంటుంది గానీ, పెయింటూడొచ్చేసి చదవడానికి రాదు. అందరూ గౌస్‌ మియా పేరుతోనే దాన్ని పిలుస్తుంటారు. ఈ చిన్న మురికి హోటల్లో ఇరానీ చాయీ, ఉస్మానియా బిస్కట్లూ, సమోసాల్తో పాటూ, చవగ్గా భోజనం దొరుకుతుంది. రుచుల పట్టింపు లేకుండా కడుపు నిండడమే ముఖ్యమయినవాళ్ళు యిక్కడ తింటారు. గోడకోమూల గౌస్‌ మియా నెత్తి పైన తగిలించిన టీవీలో ఏదొస్తే అది చూస్తూ నాలిక మీంచి ఏం లోపలికి వెళ్తుందన్నదన్న ఎరుక లేకుండా పొట్ట నింపుకోవచ్చు. భోజనమైం తర్వాత పక్కనే వున్న పాన్‌బడ్డీలో సిగరెట్‌ తాగితే అంతా ఒకటే రుచి. నేనుండే సందు చివర్నే ఈ హోటలు కావటంతో నా అన్న పానాదులన్నీ దాదాపు యిక్కడే అయిపోతాయి.

ఆ రోజు అలాగే టీవీ చూస్తూ సమోసా పుణుకుతున్నాను. ఈలోగా ఐదుగురు అట్టహాసంగా లోపలికి వచ్చారు. హోటలంతా కలయజూస్తున్నారు. అదెంత హోటలుందని అదేపనిగా కలయజూడ్డానికి! వాళ్లక్కావాల్సిన వాళ్ళెవరో వెంటనే కనపడ్డారు. ఓ మూల కూర్చుని చాయి తాగుతున్న ఆ ఇద్దరు కుర్రాళ్లూ కూడా వీళ్లని చూడనే చూసారు. వెంటనే కప్పులు కింద పెట్టి లేచారు. బల్లల మధ్య నుంచి పారిపోయే ప్రయత్నం చేసారు. కానీ ఆగంతుకులు వెంటనే చుట్టూ కాసేసారు. అప్పటికీ ఇద్దర్లో ఒక కుర్రాడు టిఫిన్లూ, టీలూ సర్వు చేసే పెద్ద కిటికీలాంటి కంతలోంచి వంటగదిలోకి దూకి వెనక తోవ గూండా పారిపోయాడు. ఒకడు మిగిలిపోయాడు. ఈ ఐదుగురూ వాణ్ణి చుట్టుముట్టేసారు. వాడి మొహంలో భయం లేదు సరికదా, ఎవడో శంకరన్న పేరు చెప్పి బెదరిస్తున్నాడు. వీళ్లు "క్యా బతాయెగారే తెరీ మాక్కీ..." అని మొదట చెంపలు వాయించడంతో మొదలు పెట్టి, తర్వాత బల్లల మూల కుదేసి తన్నుల్లోకి దిగారు. అందరితోపాటూ నేనూ లేచి నా ప్లేటు సమోసాతో సహా బయట పాన్‌ షాపు దగ్గరకొచ్చేసాను. తింటూ చూస్తున్నాను. మా బస్తీలో అడపాదడపా యీ గొడవలు మామూలే. గౌస్‌ మియా కౌంటరు వెనక నుంచి లేచి వచ్చి బూతులు తిడుతున్నాడు. బయటికి పోయి కొట్టుకొమ్మని అదిలిస్తున్నాడు. వాళ్ళు గౌస్ మియాని పట్టించుకోకపోలేదు. కానీ, "నువ్వుండన్నా యీ నాకొడుకు..." అనేదో సర్ది చెప్తూనే, ఆ కుర్రాణ్ని బాదుతున్నారు. యింతలో అక్కడ ఊహించనిది ఒకటి జరిగింది. అంతదాకా నేను గమనించ లేదుగానీ నా ఎదుట టేబిల్‌ మీదే కూర్చుని ఓ బక్కపలచని రోగిష్టి మనిషి దాల్చావల్ తింటున్నాడు. కస్టమర్లందరూ గొడవకి బయటకొచ్చేసారు గానీ అతను అక్కడే కూర్చుని వున్నాడు. ఇప్పుడు ఉన్నట్టుండి లేచాడు. తిన్నగా ఆ గలాటా మధ్యలోకి వెళ్లి తన్నుల తింటున్న కుర్రాడికి తను అడ్డబడిపోయాడు. కాళ్లా వేళ్లా పడి బతిమాలడం మొదలుపెట్టాడు కొట్టవద్దని. "తూ కౌన్‌ రే" అంటూ అతణ్ణీ కలిపి కొడుతున్నారు వీళ్లు. చిత్రమేమిటంటే, అప్పటిదాకా తన్నులు తింటున్న కుర్రాడు కూడా ఇతణ్ణి తన మీద నుంచి లెమ్మని విదిలించుకుంటున్నాడు. అందరికీ కాసేపట్లోనే అర్థమైంది, అతనికీ ఈ గొడవకీ ఏ సంబంధమూ లేదని. సంబంధం లేని వాణ్ణి ఉత్తపుణ్యానికి వాళ్లు మాత్రం ఎంతని తన్నుతారు. గొడవాపి "అరె తూ బీచ్‌ మే క్యుం ఆతారే" అని అయోమయం మొహాల్తో అతణ్ణి అడుగుతున్నారు. తప్పుకోపోతే చస్తావని బెదిరించారు. అతను మాత్రం కన్నీళ్లు కార్చేస్తూ "అన్నా మనం మనం... వద్దన్నా... బాధపెట్టుకోద్దన్నా...!" అని వాళ్ల కాళ్లు పట్టుకుంటూనే వున్నాడు. ఈ అదను చూసుకుని అప్పటిదాకా తన్నులు తిన్న కుర్రాడు చటుక్కున టేబిల్స్‌ మీద ఎక్కి  ప్లేట్లు ఎడాపెడా తన్నేస్తూ పరిగెట్టి మా మధ్య నించి సందు చేసుకుని రోడ్డు మీదకి పారిపోయాడు. ఆగంతుకులకి యింకా తమ కాళ్ల దగ్గర దేకుతున్న అతణ్ణి ఏం చేయాలో తెలియలేదు. అతను కలగజేసుకోనంతవరకూ యీ సన్నివేశంలో తాము హీరోలు, యిప్పుడు విలన్లు. "అరె పోరా భయ్‌ పాగల్‌గా!" అని కాళ్లతో పక్కకి నెట్టేసి బయటికి నడుచుకుపోయారు. గందరగోళం సద్దుమణిగింది. అందరం లోపలికి వెళ్ళాం. అతను వొళ్లు దులుపుకుంటూ లేచి మళ్లీ తన కంచం దగ్గరకొచ్చి కూర్చున్నాడు. ఎవరో అతణ్ణి పిచ్చోడివా అని అడిగారు. యింకెవరో, అతని మంచికే అన్నట్టు బండబూతులు తిట్టారు. అతను తింటూనే తన జాలి గొంతేసుకుని అందర్నీ ఉద్దేశించి మాట్లాడటం మొదలు పెట్టాడు. అందరూ ఒక అమ్మకి పుట్టిన కొడుకులమే అన్నా అంటూ మొదలెట్టి మమ్మల్నీ, రోడ్డు మీద ట్రాఫిక్‌నీ, చూపుకందని నగరాన్నీ, పరివ్యాప్త సప్త సముద్రాల్నీ, కక్ష్యలో తిరిగే భూమినీ అంతట్నీ తనతో కలిపేసుకుని ఏదో పిచ్చి వాగుడు వాగాడు. కాసేపటికే అందరూ అతణ్ణి పట్టించుకోవడం మానేసారు. గౌస్‌ మియా టీవీలో ఏదో ఛానెల్‌ మార్చాడు. నా ధ్యాస అటు మళ్ళింది.

తర్వాత మళ్లీ చాన్నాళ్లకి గానీ అతను నాకు కనపడలేదు. సిటీలో ఒకసారి తారసపడిన ఏ యిద్దరి అపరిచితుల త్రోవలూ మళ్లీ ఎప్పుడుకోగాని దగ్గరకు రావు. అలా వచ్చేటప్పటికి అవతలివాళ్లని ఎపుడైనా కలిసామని కూడా మర్చిపోతాం. వాళ్లు మళ్లీ మనకు అపరిచితులే అయిపోతారు. కానీ అతణ్ణి కలిసిన సందర్భం నన్ను తొందరగా మర్చిపోనియ్యలేదు. పైగా అతణ్ణి రెండోమారు కలిసింది కూడా అలాంటి సందర్భంలోనే.

నేను ఉద్యోగానికి లోకల్‌ రైల్లో పోవాలి. మా బస్తీకున్న స్టేషనులో లోకల్‌ రైళ్లు మాత్రమే ఆగుతాయి. రాత్రి సమయాల్లో అది దాదాపు నిర్మానుష్యంగా వుంటుంది. ఒక రోజు రాత్రి రైలు దిగి వస్తుంటే అల్లంత దూరంలో ప్లాట్ఫాం మీద జనం గుంపుగా కనిపించారు. దగ్గరికి వెళ్లేసరికి మళ్లీ అతనే! మళ్లీ ఏదో గలాటాలోనే! ఇప్పుడు పాత్రధారులు యిద్దరే. ఒకడు తన్నేవాడు, ఒకడు తన్నించుకునేవాడు. తన్నుతున్నది ఒక తెల్లగడ్డం పంజాబీ ముసలాయన. తన్నించుకునేవాడు అతను. ఇద్దరూ బలహీనులే. కాబట్టి చుట్టూ వున్న వాళ్ళు తొందరగానే, తమకు వినోదపు మోతాదు చాలినంత అందిందనుకోగానే, కలగజేసుకున్నారు. ఈ తెల్లగడ్డం ముసలాయన నాకు ఓ పది రోజుల్నించీ ఈ స్టేషన్‌ ప్లాట్ఫాం మీదే కనిపిస్తున్నాడు. అతను ఉత్తరాది వాడని, ఈ ప్రదేశానికి కొత్త అని చూస్తేనే తెలుస్తుంది. ఏదో రైలు తప్పి జేబులో డబ్బుల్లేక ఇక్కడ దిగి వుండచ్చని నేననుకున్నాను. నా కంటపడిన తొలి రోజుల్లో తెల్లని బట్టల్లో మల్లెపూవులా వున్నాడు. ఆరడుగుల ఎత్తూ, దబ్బపండులాంటి ఛాయతో వుంటాడేమో... ఆ మురికి పరిసరాల్లో మరీ కొట్టొచ్చినట్టు కనపడేవాడు. పంచెకున్న పటకాలో తోలు తొడుగున్న ఓ చురకత్తి కూడా కనపడేది. కానీ చూస్తుండగానే కొన్ని రోజుల్లోనే అతని దర్జా వడలిపోయింది. పరిస్థితి అధ్వాన్నమయిపోయింది. ప్లాట్ఫాం చివర చీకటిలో రాత్రుళ్ళు గుడుంబా తాగడానికొచ్చే బస్తీ జనం కొందరు ఆయన్ని ఏడిపించడం మొదలుపెట్టారు. పట్టుసడలిన ముసలి శరీరం పట్టుసడలని పంజాబీ దర్పాన్ని కాపు కాయలేకపోయింది. వాళ్లు అతని చురకత్తిని కూడా లాగేసుకున్నారు. చూస్తుండగానే మల్లెపూవులా వుండేవాడల్లా, చెత్తకుండీలో నివసించేవాడిలా తయారయాడు.

నేను దగ్గరకు వెళ్లేసరికే ముసలాయన్ని వెనక్కి లాగారు. ముసలాయన మాంచి వేడి మీద వున్నాడు. ఎవర్నీ తన మీద చేయి వేయనివ్వడం లేదు. ఎవర్నీ దగ్గరకు రానివ్వడం లేదు. తను 'దరోగా' చేసి రిటైరయ్యాననీ, దగ్గరకొస్తే చమ్డాల్లేవదీస్తాననీ పంజాబీలో బెదిరిస్తున్నాడు. అందరూ యిదెక్కడి గోల అని నవ్వుకుంటూ పక్కకి తొలగిపోతున్నారు. ఆయన్నెందుకు కెలికావని అతణ్ణి తిడుతున్నారు. అపుడే మరో అనూహ్య సన్నివేశం జరిగింది. అతను ప్రయాసగా లేచి నిలబడ్డాడు. ముసలాయన దగ్గరికి వెళ్లాడు. ముసలాయన తర్జని చూపించి బెదిరిస్తూనే వెనక్కి అడుగులు వేసాడు. అతను తన జేబులోంచి డబ్బుకాయితాలు తీసి, ముసలాయనకి యివ్వచూపాడు. ఇది ఊహించని ముసలాయన అపనమ్మకంతో ఆగాడు. కాసేపు డబ్బుల వంకా అతని వంకా మార్చి మార్చి చూసాడు. ఉన్నట్టుండి డబ్బులు లాక్కుని, తన మురికి జుబ్బా జేబులో కుక్కుకుంటూ, సణుక్కుంటూ వెనుదిరిగి వెళిపోయాడు. అదే ఆ ముసలాయన్ని నేను చివరిసారి చూడటం. ఆ డబ్బుల్తో ఎక్కడికి చేరాలో అక్కడికి చేరి వుంటాడనుకుంటాను.

అపుడే చీకటి ప్లాట్ఫాం మీదకి వెలుగు తివాచీ పరుస్తూ లోకల్‌ ట్రయిన్‌ రావడంతో చుట్టూవున్నవాళ్లలో చలనం వచ్చింది. గొడవసంగతి వదిలేసి రైలెక్కే హడావుడిలో పడ్డారు. అతనికి దెబ్బలు గట్టిగానే తగిలాయనుకుంటా కాస్త కుంటుతూ నడుస్తున్నాడు. నేనూ నెమ్మదిగా పక్కనే నడిచాను. అసలేమైందని అడిగాను. "నా బాష అర్థం కాలేదన్నా ఆయినికి, ఎక్కడికెల్లాలని అడిగా, తన్నేసాడు" అని నవ్వాడు. అలాంటి అపార్థం సాధ్యమే అనిపించింది. అసలే ముసలాయన యిక్కడి మనుషుల పట్ల చాలా అపనమ్మకంతో వున్నాడు. కొన్ని రోజులుగా వాళ్ళ వల్ల నానా బాధలూ పడి రగిలిపోతున్నాడు. ఇతని భాష, యాసా అర్థమై వుండవు. ఇతని బక్కవాలకాన్ని అలుసుగా తీసుకుని అందరిపై కసీ యితనిపై చూపించి వుంటాడు. ప్లాట్ఫాం చివరిదాకా మాట్లాడుకోకుండానే పక్క పక్కన నడిచాం. రోడ్డు మీదకెళ్లాలంటే ఇళ్ల మధ్య ఓ ఇరుకు సందులోంచి వెళ్లాలి. సందు చివర ట్రాఫిక్ వెలుగు కనిపిస్తున్నా సందు మాత్రం కటిక చీకటిగా వుంది. అతను ఆ సందులోనే ఒక ఇంటి దగ్గర ఆగి పైకి మెట్లెక్కబోయి తూలాడు. నేను దగ్గరకెళ్లి సెల్‌ఫోను లైటు మెట్ల మీద వేసాను. పైనుంటావా అని అడిగితే అవునన్నాడు. ఇంటి సైడుగోడకానుకుని కట్టిన ఆ మెట్లు తిన్నగా పై వాటాకెళ్తున్నాయి. నాకు కుతూహలం కలిగింది. పద తీసికెళ్తానన్నాను సెల్‌ఫోను లైటు మెట్ల మీద వేస్తూ. కుంటుకుంటూ, మధ్యమధ్య నా మంచితనాన్ని పొగుడుతూ, పైకి నడిచాడు. గుమ్మం పైనున్న గూట్లో తాళం చెవికోసం కాసేపు తడిమి, తలుపు తీసాడు. అలవాటుగా లోపల గుడ్డిబల్బు ఆన్ చేసి నన్ను ఆహ్వానిస్తూ కుంటుకుంటూనే వెళ్ళి చొక్కా విప్పి మేకుకి తగిలించాడు. లోపల గదికి ప్లాస్టరింగేమీ కాలేదు. ఇటుకల కట్టుబడి అంతా బయటకే కనిపిస్తుంది. గదికి ఓ మూల నేల మీద బొంత పరుపు, మరో మూల కిరోసిన్ పొయ్యితో వంట సామాను. గదిలోకి వచ్చీరాగానే కొట్టొచ్చినట్టు కనిపించేది కిటికీ ప్రక్కన వేలాడుతున్న పెద్ద పసుపురంగు మికీమౌస్ కాస్ట్యూము. దాన్ని పరకాయిస్తుండగానే అతను అక్కడున్న ఇనప కుర్చీ ఖాళీ చేసి కుర్చోమని ఇచ్చాడు. కూర్చుంటూ ఆ కాస్ట్యూము గురించి అడిగాను. "అదా! నేను బట్టల షాపులో పన్చేస్తా అనా. పండగల టఁయాల్లో ఆ తొడుగేసుకుని మా షాపు ముంగట ఎగరాల" లుంగీ నడుం చుట్టూ మొలత్రాడు బిగించి పరుపు మీద కూర్చుంటూ చెప్పాడు. ఆ స్పాంజి కాస్ట్యూము నైనా మోయగలదా అనిపించే బక్క శరీరం అతనిది. మోకాలి చిప్ప దగ్గర దెబ్బ గట్టిగా తగిలిందనుకుంటా, లుంగీ పైకి లాగి నిమురుకుంటున్నాడు. ఈనుపుల్లల్లాంటి కాళ్ళు. నా కుతూహలాన్ని దాచుకోదలచుకోలేదు. ఆ రోజు గౌస్ మియా హోటల్లో జరిగింది అతనికి గుర్తు తెచ్చి, సంబంధం లేకపోయినా ఎందుకలా వాళ్ళకు అడ్డపడ్డావని అడిగాను.

"అలా ఎట్లా అంటావనా. నీకూ నాకూ అందరికీ సంబంధం వుంది. అలా జరగనీకూడదనా..."

మళ్ళీ అప్పటి హోటల్లో వాగిన పిచ్చి వాగుడే మొదలుపెట్టాడు. నేను అతని విపరీత చర్యల వెనుక ఒక తాత్త్విక భూమికని ఆశిస్తున్నానని నాకు తెలియదు. కానీ అతని మాటల్లో అలాంటిదేమీ కనపడకపోయేసరికి అసహనంగా అనిపించింది. వెళిపోదామనిపించింది. అది నా మొహంలో కనిపించిందనుకుంటా. ఉన్నట్టుండి "ఉండనా నువు, నీకు చెప్తాను" అని లేచాడు. ఇందాక నాకీ కుర్చీ ఇచ్చేటపుడు దీని పైనున్న సామాను తీసి పక్కనపెట్టాడు. ఇపుడు అందులోని ఓ ప్లాస్టిక్ బాక్సులోంచి ఒక ఫోటో తీసి నా చేతికిచ్చాడు. అది బ్లాక్ అండ్ వైట్ పాస్‌పోర్టు ఫొటో. ఎవరో అమ్మాయిది. ఎనిమిది పదేళ్లుంటాయి. "ఈ పిల్ల పేరు దుర్గ అనా. మన బస్తీలో ఆ చివరాఖర మోరీల కాడ లాండ్రీవోళ్ళుంటారే. ఆళ్ల పిల్ల. ఇపుడు చచ్చిపోయింది. ఆళ్ళమ్మనడిగి తెచ్చినా యిది."  పిల్ల మొహం కళగా వుంది. పాపం అనిపించింది. ఈ ఫోటో నాకెందుకిచ్చావని అడిగాను. అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు. అతని మాట తీరు కాస్త చిత్రంగా వుంటుంది. వేర్వేరు మాండలికాల కిచిడీలా వుంటుంది. పైగా ఒక వరసలో పద్ధతిగా మాట్లాడడు. అటుపోయి ఇటుపోయి చుట్టుతిరిగి చెప్తాడు. కాబట్టి అతను చెప్పిందాని సారాంశం నేనిక్కడ చెప్తాను.

దుర్గ ఇతణ్ణి మొదటిసారి కలిసినపుడు ఈ మికీమౌస్ కాస్ట్యూము లోనే బట్టల షాపు ముందు ఎగురుతున్నాడు. ఆ రోజు బడి మానేసి చెక్కర్లు కొడుతూన్న దుర్గకి ఈ పెద్ద మికీమౌస్‌ నచ్చింది. ఆ పూటంతా దాని చుట్టూతానే తిరుగుతూ కాలక్షేపం చేసింది. ఆమెకి ఒక మనిషి అందులో వున్నాడన్న స్పృహ వుందో లేదో తెలియదు గానీ, లేనట్టే ప్రవర్తించింది. అతనూ అలాగే నటించాడు. విసుగొచ్చే దాకా ఆడి వెళ్లిపోయింది. బడి ఎగ్గొట్టడం ఆమెకి రోజువారీ దినచర్య అనుకుంటా. ఏదో నిజంగా బడికి బయల్దేరినట్టే భుజాన బాగుతో సహా అన్నీ సర్దుకుని బయల్దేరేది. కాసేపు బస్టాండులో ఏ బస్సూ ఎక్కని ప్రయాణికురాలిలాగా, కాసేపు వినాయకుడి గుడి దగ్గర ఏ కోరికా లేని భక్తురాలిలా, కాసేపు క్రికెట్ గ్రౌండ్లో ఏ పక్షమూ వహించని ప్రేక్షకురాలిలా కాలక్షేపం చేసి బడివిడిచిపెట్టే సమయానికి ఇంటికి వెళిపోయేది. ఈసారి ఆమె మజిలీల్లో ఈ బట్టలషాపు కూడా చేరింది. దాదాపు ప్రతీ పూటా ఏదో ఒక సమయంలో బట్టల షాపు దగ్గరికి వచ్చి మికీమౌస్‌ని పలకరించడం మొదలుపెట్టింది. అతను గొంతు మార్చి కవుర్లు కూడా చెప్పేవాడు. మొత్తానికి మికీమౌసూ, దుర్గా ఒకరికొకరు అలవాటయిపోయారు. ఒకరోజు మంచినీళ్ళు తాగడం కోసం ముసుగు తీసి పట్టుకున్నప్పుడు అతని అసలు రూపు చూసింది. కాసేపు అతని దగ్గరికి రావడానికి కూడా సిగ్గుపడింది. కానీ అప్పటికే యిద్దరి మధ్యా బాహ్యరూపాల కొక్కేల్ని విడిచి గాల్లో మాయలా మనగలిగే స్నేహం ఏర్పడిపోయివుండటంతో, కాసేపటికే మళ్ళీ దగ్గరకొచ్చేసింది. అడపాదడపా గదికి కూడా వచ్చి కవుర్లు చెప్పేది. అతను చేసిచ్చిన టీ తాగాక ఇంటికి వెళ్లిపోయేది. తాను చావబోతుందని దుర్గకీ తెలుసు. అందుకనేమో ఏదో ఆరిందాతనం వుండేదామెలో. తన గురించి పెద్దవాళ్ళు మాట్లాడుకునే మాటలు అడపాదడపా విన్నదో ఏమో, చావు గురించి వాళ్ళు మాట్లాడే ముదురు మాటలే మాట్లాడేది. కానీ తనకి నిజంగా చావంటే ఏంటో తెలియదు. ఒకానొక రోజు తను హఠాత్తుగా వుండటం మానేసాకా, తన తోటి ప్రపంచం మాత్రం యథావిధిగా వుంటూ పోవడమంటే ఏమిటో ఊహించలేదు. మొదట్లో తను చనిపోబోతున్నానని దుర్గ చెప్పినపుడు, అతను నమ్మలేదు. అదే పనిగా అంటంతో ఓసారి ఇంటి దాకా దింపి వాళ్ళమ్మని అడిగాడు సంగతి. ఆమె అవునంది.

తల్లి తన వంతు చేయగలిగింది చేసింది. పిల్లని తీసుకుని గాంధీ హాస్పటల్ చుట్టూ తిరిగింది. కాని వాళ్ళు చెప్పినవన్నీ విన్న తర్వాత ఆమె ఓ నరకప్రాయమైన మీమాంసని ఎదుర్కోవాల్సివచ్చింది. ఆసుపత్రి ఖర్చులన్నీ భరించి ఈ పిల్లకి చావు కొన్నాళ్ళు వాయిదా వేసి, ఎలాగూ చనిపోవడం ఖాయం కాబట్టి, తర్వాత ఆ ఖర్చుల బరువుని మిగిలిన పిల్లల భవిష్యత్తుపై మోపడమా, లేక ఇప్పుడే వైద్యం మానేసి, ఆసుపత్రి ఖర్చులు మిగుల్చుకుని, అవేవో మిగిలిన పిల్లలకి పనికొచ్చేలా చూడటమా అన్న మీమాంస అది. ఆమె రెండో మార్గాన్నే ఎన్నుకుంది.

అతిసన్నిహితుల సమక్షం మన నుంచి హఠాత్తుగా లాక్కోబడినపుడు మాత్రమే చావు స్వరూపం ఏవిటో మనకి తెలిసేది. దుర్గ చనిపోబోతోందన్న నిజానికి సంసిద్ధుడవ్వగలిగేంత సమయం అతనికి దొరకలేదు. కొన్ని నెలల్లోనే ఆమె చనిపోయింది. ప్రపంచం అంతా అతని చుట్టూ యథాతథంగానే వుందిగానీ, ప్రపంచాన్ని అర్థవంతంగా నిలబెట్టే లోపలి పునాది ఏదో కూలిపోయింది. ఇప్పుడీ పై నిర్మాణం అంతా వట్టి డొల్ల. చిన్న అపనమ్మకానికి అంతా కుప్పకూలిపోతుంది. పిచ్చితనంలోకి నెట్టేస్తుంది.

కథ యిక్కడిదాకా నాకు చెప్పాకా అతను సంయమనం కోల్పోతున్నట్టనిపించాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళి దుర్గ తనతో వున్న రోజులన్నీ గుర్తు తెచ్చుకోవడం మొదలుపెట్టాడు. నేను టైము చూసుకున్నాను. కాసేపయితే గౌస్‌మియా హోటలు కట్టేస్తాడు. రాత్రికి తిండి వుండదు. సంభాషణని మళ్ళీ దారికి తెద్దామని అతణ్ణి అనునయిస్తూ కొన్ని మాటలు చెప్పాను. ఒడుపుగా అసలు విషయానికి తీసుకొచ్చాను. కానీ నిన్ను నువ్వెందుకిలా బాధ పెట్టుకుంటున్నావని అడిగాను. సమాధానం చెప్పబోయేముందు కాసేపు నన్ను ఖాళీ కళ్ళతో చూశాడు.

"అర్థమవ్వట్లేదా అన్నా! నిన్నూ నన్నూ అలా చంపేసినా, ఏదో పాపంగా ఆలోచన చేసుంటాం, ఏదో పాపం పని చేసుంటాం, అందికే దేవుడులా చేసాడూ అనుకుంటాం. ఈ పిల్ల సంగతికొచ్చేతలికి అలా ఏవుందన్నా? అది పసిది! ఆలోచించు ఒక్కమాటు. నేనాలోచించాను. డూటీ కూడా మానేసి, తిండి తినకండా, నిద్రపోకండా ఆలోచించాను. ఒకటే అర్థవైంది. ఇక్కడ జరిగే క్రూరత్వం అన్నాయం యిదంతా, ఈ పద్ధతి లేకుండా జరిగే పతీదీ, ఆ దేవుడికి ఒప్పుదల మీదే జరుగుతుంది. ఇదంతా ఆయన యిలాగే సృష్టి చేసిపెట్టేడు. ఆయన మనల్ని సుఖం పెట్టే టఁయాలకన్నా కన్నా, బాధ పెట్టే టఁయాలే ఎక్కువ, నువ్వే చూడు. ఒక్కోపాలి ఎవళ్ళం ఏం చేయలేం. దుర్గ సంగతే చూడు. దాన్ని ఆయన సొయంగా బాధపెట్టేడు. అదాయన చేతుల్లో పవరు, తిన్నగా పసిపిల్ల మీద చూపెట్టేడు. ఆయన పవర్‌ని ఎవళం ఏం చేయలేం. కానీ యింకో రకంగా కూడా చేస్తాడు. మనలో మనకి పెట్టి, మనకి మనల్నే ఎదురు నిలబెట్టి, మనకి మనవే తోడు రాకండా చేసి బాధలు పెడతాడు. నేను ఏంటి ఆలోచించానంటే, అలాంటాటికి ఎదురెళ్ళచ్చు. దేవుడికి ఎదురెళ్ళచ్చు. ఆయన అనుకున్నదాన్ని అవకుండా చేయచ్చు. నా కళ్ళముందు ఆ కుర్రాడా రోజు తన్నులు తిన్నాడు. ఇయ్యాల్దాకా పాపం ఆ ముసలాయన ఊరూపేరూ తెలీని చోట బాధలు పడ్డాడు. మరియ్యన్నీ ఆ దేవుడు చేసిన లోకంలో జరుగుతున్నయే కదా. నేనేం చేసాను? నేనడ్డం వెళ్ళాను. అలా జరగనివ్వలేదు. నాకేం పెద్ద బలం లేపోవచ్చు. ఆ రోజు చూసావుగా నన్ను చితకబాదేసేరు. కానీ... నేను లొంగిపోతన్నానన్నా! నా మీద పడే పతీ దెబ్బా కూడా ఆయన దాష్టీకానికి ఎదురెళ్ళటవే. నేనేం చేయలేపోవచ్చు. కానీ నేనాయనకి ఎదురుంగున్నానని ఆయనకి తెలియాల! అందికే యిదంతా!" మాటలు పూర్తయేసరికి అతను చెమటలు పట్టి వున్నాడు.

బహుశా నిన్ను తనకు వ్యతిరేకంగా నియమించుకున్నదీ దేవుడేనేమో, అందామనుకున్నాను. కానీ ఎందుకో ఆ ముతక వాదన అతని ముందు వినిపించాలనిపించలేదు. చాలామంది మంచి చేయడం ద్వారా దేవుని మార్గంలో ప్రయాణిస్తున్నామని అనుకుంటారు. ఇతను మంచి చేయడం ద్వారా దేవుణ్ణి ఎదుర్కుంటున్నాను అనుకుంటున్నాడు. దేవుడున్నాడో లేదో నాకు తెలియదు. ఉన్నాడంటే మంచివాడా చెడ్డవాడా అన్న ప్రశ్నొస్తుంది. దానికి మన మంచి ఆయనకి మంచి కాదు, మన చెడ్డ ఆయనకి చెడ్డ కాదు అన్న సమాధానమొస్తుంది. లేదా అసలాయనకి మంచీ చెడ్డా లేనేలేవన్న సమాధానమొస్తుంది. కానీ మన మనుష్యజాతి మనుగడ కోసం మనకో మంచీచెడ్డా వున్నాయి. మన మంచి నిలవాలి, మన చెడ్డ పోవాలి. అది దేవుడికి మిత్ర పక్షాన నుంచుని చేసినా, వైరి పక్షాన నుంచుని చేసినా పెద్ద తేడా పడదనుకుంటాను.  పైగా ఎలాగూ ప్రేమ కన్నా ద్వేషం తీక్షణమైన భావం. అది తరుముతుంది. పని చేయిస్తుంది. అతడి చేత అదే పని చేయిస్తుంది.

కుండలో మంచినీళ్ళు ఓ గ్లాసు తను తాగి ఓ గ్లాసు నాకిచ్చాడు. నేను అతడి వాదనకు అంగీకార సూచకంగా రెండు మూడు మాటలు చెప్పాను. నువ్వున్నంత సేపే దేవుణ్ణి ఎదుర్కోగలవు, ఏదైనా చేయగలవు, కాబట్టి ప్రమాదాల్లోకి వెళ్ళవద్దని చెప్పాను. సెలవు తీసుకుని మెట్ల మీంచి తడుముకుంటూ క్రిందకి దిగి చీకటి సందులోకి వచ్చాను. ఎందుకో తల పైకెత్తి చూసాను. అతని గది కిటికీలోంచి గుడ్డి బల్బు వెలుగు కనిపిస్తోంది. తల యింకాస్త పైకెత్తి చూస్తే నగరాకాశంలో నక్షత్రాలు లీలగా వెలిసిపోయినట్టు వెలుగుతున్నాయి.

(ఈ కథ "సాహితీ స్రవంతి" మాసపత్రిక జనవరి 2012 సంచికలో ప్రచురితమైంది.)