June 16, 2014

'తెరిచున్న గుమ్మం' - సాకీ

“అత్త వస్తుంది, మీరు కూర్చోండి మిస్టర్ నటెల్. ఈలోగా నాతో కబుర్లు చెప్పితీరాలి,” అందా పదిహేనేళ్ల ఆరిందా.

ఇంటావిడ వచ్చేలోగా ఈ పిల్లతో మర్యాదపూర్వకంగా ఏదో ఒకటి మాట్లాడక తప్పలేదు నటెల్‌కు. కానీ లోపల్లోపల – అసలు ఇలా అపరిచితుల ఇళ్లకు పలకరింపులకు హాజరవటం వల్ల తన నరాలజబ్బుకు కలిగే మంచేమన్నా ఉందా అని సందేహపడ్డాడు. దాని విరుగుడు కోసమే అతను పట్టణం వదిలి ఈ మారుమూల పల్లెకు మకాం మార్చింది.

ఇక్కడకు వచ్చేముందు అతని అక్క ఇక్కడున్న తన పరిచయస్తులందరికీ ఫోన్ చేసి చెప్పింది. “లేదంటే నీ సంగతి నాకు బాగా తెలుసు. ఇల్లు వదిలి బయటకు వెళ్లవు, ఎవ్వరినీ పలకరించవు. ఒక్కడివీ లోపలే మగ్గిపోతావు, ఇంకా దిగులు పెంచుకుంటావు” అన్నది.

“మీకిక్కడ ఎంతమంది తెలుసు?” అడిగింది ఆరిందా.

“ఎవ్వరూ తెలియదు. మా అక్కగారు నాలుగేళ్ల క్రితం దాకా ఇక్కడే ఉండేవారు. ఆవిడ కొంతమంది పేర్లు చెప్పి కలుసుకొమ్మంది. వాళ్లతో ముందే ఫోన్లో మాట్లాడింది,” అన్నాడు నటెల్.

“అయితే మీకు మా అత్త గురించి ఏమీ తెలియదన్నమాట,” సాగదీస్తూ అడిగింది ఆ పిల్ల.

“పేరూ, చిరునామా మాత్రమే తెలుసు,” అన్నాడు. ఈ మిసెస్ సాపల్టన్ వివాహితా, లేక విధవరాలా అన్న మీమాంసలో ఉన్నాడతను. ఇంటి వాతావరణం చూస్తే మాత్రం అక్కడక్కడా మగవాళ్లు మసిలే సూచనలు కనపడుతున్నాయి.

“ఐతే పాపం మూడేళ్ల క్రితం అత్తకు జరిగిన ఘోరం గురించి మీకు తెలీదన్నమాట,” అంది దవడ వేలాడేసి మూతిని సున్నాలా చుట్టి.

“ఏమైంది?” ఘోరం అనే మాటకి అతని నరాలు గుంజాయి. ఈ ప్రశాంతమైన పచ్చని ప్రదేశంలో ఆ మాట అతికినట్లనిపించలేదు.

“ఈ అక్టోబరు సాయంత్రం బయట చల్లగా ఉన్నా ఆ గుమ్మం ఎందుకు తెరిచి ఉంచామో తెలుసా?” అంటూ వారనున్న గదిలో, బయట పచ్చికబయల్లోకి తెరుచుకున్న గుమ్మం వైపు చూపించింది.

“అక్టోబరు వచ్చిందన్నమాటే గానీ వాతావరణం వెచ్చగానే ఉంది. ఇంతకీ ఆ గుమ్మానికీ నువ్వు చెప్తున్న ఘోరానికీ ఏమన్నా సంబంధం ఉందా?” అన్నాడు నటెల్.

“మూడేళ్ల క్రితం ఇదే రోజు, ఆ గుమ్మంలోంచే ఆవిడ భర్త, ఇద్దరు తమ్ముళ్లూ వేటకు వెళ్లారు. తుపాకులు ఊపుకుంటూ తుళ్లుతూ వెళ్లారు. అడవిలో ఏరు దాటుతుండగా ఒక ఊబి వాళ్లని లోపలికి లాగేసింది. ముగ్గురూ ఒకేసారి… పోయారు. శవాలు కూడా చిక్కలేదు.”

ఈ విషయం చెప్తుంటే ఆ పిల్ల గొంతులో ఆరిందాతనం మాయమై గద్గదమైంది. “పాపం అత్త! పిచ్చిదైపోయింది. ఇంకా వాళ్లు తిరిగి వస్తారనే నమ్ముతోంది. వాళ్లతో పాటూ వెళ్ళి చచ్చిపోయిన వేటకుక్కతో సహా ముగ్గురూ ఎలా వెళ్లినవాళ్లు అలాగే అదే గుమ్మం గుండా వెనక్కు వస్తారని ఆమె ఆశ. అందుకే ప్రతీ ఏటా ఈ రోజు దాన్ని అలాగే తెరిచి ఉంచుతుంది. నన్ను కూర్చోపెట్టి వాళ్లెలా వెళ్లారో పూసగుచ్చినట్టు చెప్తూంటుంది. ఆమె భర్త తెల్లని కోటు భుజం మీద వేసుకున్నాడు, తమ్ముళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకుని నడిచారు, చిన్న తమ్ముడు రోనీ ‘బెర్టీ ఎందుకలా గెంతుతావ్…’ అన్న పాట పాడుతూ వెళ్లాడు, అతను అత్తని ఏడిపించటానికి ఆ పాట పాడతాడు, ఆ పాట అంటే అత్తకు అస్సలు ఇష్టం ఉండదు. మీకు తెలుసా, ఇలాగా నిశ్శబ్దంగా ఉన్న సాయంత్రాలు నాకు గుబులుగా ఉంటుంది, ఆ గుమ్మంలోంచి వాళ్లు నిజంగా నడుచుకుంటూ వచ్చేస్తారేమో అని–”

ఆ ఊహకే వణికిపోతున్నట్టు మాట్లాడటం ఆపేసింది. అప్పుడే వాళ్ల అత్త మిసెస్ సాపల్టన్ లోపలికి వచ్చింది. అతణ్ణి అలా కూచోబెట్టినందుకు క్షమాపణలు చెప్పాక అంది, “వెరా మిమ్మల్నేం విసిగించటం లేదు కదా?”

“లేదు. ఏవో కబుర్లు చెప్తోంది.”

“ఆ గుమ్మం తెరిచి ఉంచితే మీకేం ఇబ్బంది లేదనుకుంటాను. మా ఆయన, ఇద్దరు తమ్ముళ్లూ వేట నుంచి రావాలి. వాళ్లకు ఈ గుమ్మం లోంచి రావటం అలవాటు. ఇవాళ బురదగుంటల్లోకి పోయారు. ఇక వచ్చి మొత్తం తివాచీలన్నీ పాడు చేస్తారు.”

తర్వాత ఆమె ఈ వాతావరణంలో బాతుల వేట ఎంత బాగుంటుందో చెప్పటం మొదలుపెట్టింది. నటెల్ కు గాభరా పెరిగిపోతుంది. వీలైనంత తొందరగా ఈ సంభాషణ భూతాల మీంచి పక్కకు మళ్లితే బాగుండుననిపించింది. ఆమె మాట్లాడేది తనతోనే ఐనా, మధ్య మధ్యలో ఆమె దృష్టి తనను దాటుకుని ఆ గుమ్మం వైపుకు మళ్లుతూండటం అతను గమనించకపోలేదు. సరిగ్గా తాను ఈ రోజే పలకరించటానికి రావటం ఖర్మకాక మరేమిటి.

“నా విషయంలో డాక్టర్లందరూ ఒకే మాటన్నారు. పూర్తి విశ్రాంతి తీసుకోమన్నారు, ఏ రకమైన మానసికాందోళననూ దరి చేరనీయవద్దన్నారు, ఒత్తిడి నుంచి వీలైనంత దూరంగా ఉండమన్నారు,” అని ప్రకటించాడు నటెల్. అస్సలు పరిచయం లేని వాళ్లు కూడా మన అనారోగ్యానికి సంబంధించిన వివరాలు కోసం తపించిపోతుంటారన్న భ్రమలో పడి కొట్టుకునే చాలామందిలో అతనూ ఒకడు. “పథ్యం విషయంలో మాత్రం తలో మాటా అన్నారు,” అంటూ కొనసాగించాడు.

ఆవలింతని అతికష్టం మీద దిగమింగిన గొంతుతో, “అవునా?” అంది మిసెస్ సాపల్టన్. ఉన్నట్టుండి ఆమె ముఖకవళికల్లో అప్రమత్తత వచ్చింది. కానీ అది నటెల్ చెప్తున్న విషయం గురించి కాదు.

“హమ్మయ్యా వచ్చేసారు!” అంది గట్టిగా, “పోనిలే కరెక్టుగా టీ సమయానికి చేరుకున్నారు. చూట్టానికి మొత్తం బురదలో స్నానం చేసినట్టున్నాయే వాలకాలు!”

నటెల్ ఉలిక్కిపడ్డాడు, తర్వాత సానుభూతి పంచుకునే ముఖంతో మేనకోడలు వెరా వైపు చూశాడు. ఆ పిల్ల మిడిగుడ్లేసుకుని బిక్కచచ్చిపోయినట్టు తెరిచిన గుమ్మం వైపు చూస్తోంది. వెన్నుపూస నుంచి జలదరింపు పైకి పాకుతుంటే, అతను కూడా ఆమె చూస్తున్న వైపే తిరిగాడు.

చిక్కబడుతోన్న సంధ్య చీకట్లలోంచి మూడు ఆకారాలు పచ్చిక బయలుపై నడుస్తూ గుమ్మం వైపు వస్తున్నాయి; వాళ్లందరూ తుపాకులు మోస్తున్నారు, వాళ్లలో ఒకరి భుజం మీద తెల్లని కోటు ఉంది. వాళ్ల అడుగుల్లో అడుగులేస్తూ ఒక వేట కుక్క అనుసరిస్తోంది. నిశ్శబ్దంగా వారు ఇంటికి చేరువవుతున్నారు. ఉన్నట్టుండి వాళ్లలో ఒక గొంతు బిగ్గరగా “బెర్టీ ఎందుకలా గెంతుతావ్…” అని పాడటం మొదలుపెట్టింది.

నటెల్ వెర్రి వేగంతో తన ఊతకర్ర, టోపీ చేతుల్లోకి తీసుకున్నాడు. హాలు తలుపు, గులకరాళ్లు పరిచిన బాట, బయటి గేటూ… ఇవి మాత్రమే అతని ఉన్మత్త పలాయనంలో గుర్తున్న కొన్ని మజిలీలు. అతన్ని తప్పించబోయి రోడ్డు మీద ఎదురొచ్చిన సైకిలతను పక్కనున్న తుప్పల్లోకి పోయాడు.

“ఇదిగోనే వచ్చేశాం. బురదగానే ఉంది గానీ, కాస్త ఆరింది. ఇంతకీ ఎవరతను మేం వస్తూంటే అలా పరిగెత్తుకెళ్ళిపోయాడు?”

“చాలా చిత్రమైన మనిషి. పేరు మిస్టర్ నటెల్. తన రోగాల గురించి తప్ప ఇంకేం మాట్లాడడు. ఏంటో మీర్రావటం చూసాడో లేదో కనీసం వీడ్కోలు కూడా చెప్పకుండా ఏదో దెయ్యాన్ని చూసినట్టు పరిగెత్తాడు.”

“దెయ్యాన్ని కాదు, బహుశా కుక్కని చూసి అనుకుంటా,” అంటూ చెప్పడం మొదలుపెట్టింది మేనకోడలు నెమ్మదిగా, “ఆయనకి కుక్కలంటే చాలా భయమని చెప్పాడు నాతో. ఒకసారి ఒక కుక్కల గుంపు ఆయన వెంటపడితే గంగానది ఒడ్డునున్న స్మశానం లోకి పారిపోయాడట. పరిగెడుతుంటే కొత్తగా తవ్విన ఒక సమాధి గోతిలో పడిపోయాడట. ఆ రాత్రంతా ఆయన్ని బయటకు రానివ్వకుండా కుక్కలు ఆ గోతి చుట్టూనే మొరుగుతూ తిరిగాయట. ఎవరైనా జావకారిపోతారు అలాంటి పరిస్థితి వస్తే.”

అప్పటికప్పుడు కథలల్లటం ఆమె ప్రత్యేకత.

* * *


(సాకీ కథ “ఓపెన్ విండో”కు అనువాదం. కినిగె పత్రికలో వేరే పేరు మీద ప్రచురితమైంది.) 

0 స్పందనలు:

మీ మాట...