November 17, 2014

లోయల్లో ఊయల
భరత్‌నగర్లో లోకల్‌రైలు దిగి ఫ్లాట్‌ఫాం చివరికి వచ్చి పట్టాలు దాటి తుప్పలమధ్య బాటలోంచి నడిస్తే వచ్చే సిమెంటురోడ్డు. వీధిలైటు పసుపుగా పరుచుకున్న చోట నిల్చున్నాను. రమణ బండి మీద వచ్చి నన్ను పికప్ చేసుకోవాలి. తర్వాత మందుబాటిలూ స్టప్ఫూ తీసుకుని, ఆయన బొమ్మలేసుకోవటానికని కొత్తగా అద్దెకుతీసుకున్న స్టూడియో చూట్టానికి వెళ్లాలి.

కాల్ చేస్తే దార్లో ఉన్నా అన్నాడు. వెయిటింగ్ ఇంతసేపని తేలినాకా మెదణ్ణి దేన్తోనో ఆక్యుపై చేసుకోవాలిగా. చుట్టూ చూస్తే… నగరపు ఈ మూల కిక్కిరిసిన నివాసాలు. కాసేపు నా రచయిత చొక్కా తగిలించుకుని అవలోకించాను. అపుడు అలవాటు తెర చప్పున జారి పరిసరాలు మేల్కొంటాయి. కానీ ఒళ్ళు దగ్గరపెట్టుకోపోతే ఏవో దొంగ కంక్లూజన్లు కిట్టించేస్తావు, దగ్గర పెట్టుకుంటే నిజంగానే ఏదో నిజం నీ తలుపు తట్టొచ్చు. అలా చుట్టూ ఆవరించి ఉన్న ఇళ్ళని – రెండుమూడు గదుల ఆస్బెస్టాస్ కప్పుల ఇళ్ళ నుంచీ, మధ్యతరగతి లైఫ్‌సేవింగ్స్ ఫలితమై కింది వాటాల్ని ఫామిలీలకి అద్దెకిచ్చే నిటారు అంతస్తుల ఇళ్ళదాకా అన్నింటినీ – చూస్తోంటే, నా సోమరి మెదడు ఏదో ఆపద్ధర్మంగా అందిన సారాంశాన్ని కక్కేయబోతోందని పసిగట్టి ఆపేసాను. రోడ్డువారన నిలబడి మాట్లాడుకుంటున్న కుర్రాళ్ళ గుంపుకేసి చూపుతిప్పితే, సాహిత్యవర్ణనలకు నప్పేట్టు ఒద్దికైనమూసల్లో ఇమడకుండా అంతా కలగాపులగంగా కనపడి, విసుగొచ్చి, ఇదంతా కట్టిపెట్టేసి, రమణగారి కొత్త పాషన్‌ప్లస్సు ఎప్పుడు వీధి మలుపు ఎపుడు తిరుగుతుందా అని చూడటంలో పడ్డాను. ఆయన కంటోర్స్‌తో సరిపోలని రెండుమూడు ఆకారాలు వచ్చి నన్ను దాటుకుంటూ పోయాకా, నిస్సందేహంగా ఆయనదైన సిల్హౌటు బండి మీద మలుపు తిరిగింది. ముఖం మొత్తాన్ని వెలిగించే (కానీ అయిందానికీ కాందానికీ చవగ్గా వాడేసే) తన సిరినవ్వుతో పలకరించి బండి చుట్టుతిప్పాడు.

వెనక ఎక్కాకా ఇద్దరం సందులూగొందుల్లోంచి పోతున్నాం. మాటలవుతున్నాయి. “నేను తాగాలని ప్లాన్ చేసుకునేం రాలేదు. ఆ ప్రోగ్రాం లేకపోయినా ఓకే” అన్నాను. ఇంటి దగ్గర బయల్దేరేటపుడు విద్య చేసిన హెచ్చరిక కొంత కారణమైతే, ప్రస్తుతం నా జేబులో ఆయనకి తీర్చాల్సిన మూడువేలూ మినహాయిస్తే విద్య శాంక్షను చేసిన నూట పది మాత్రమే ఉన్నాయి (ఒక వంద కాయితం, ఒక పది కాయితం). అందులో రైలుటికెట్టుకి పది తీసేస్తే, ఈ సిట్టింగుకి నా తరపున పెట్టుకోగలిగే ఖర్చు వందరూపాయలు మాత్రమే. అందుకే అలా మొహమాటపడ్డాను.

కానీ ఆయన ఒకటనుకున్నాక వెనక్కి తగ్గే రకం కాదు. వైనుషాపు ముందు ఆగాక లెక్కపెట్టనవసరం లేని వందనోట్లు కొన్ని జేబులోంచి తీసి లెక్కపెడుతుంటే నేను నా వందా తీసి ఆయన చేతిలో పెట్టాను. మొహమాటంగా నవ్వుతూ “నిజానికి అవసరమే కూడా” అన్నాడు. కటకటాల కౌంటర్లోంచి చేయి పెట్టి ఏదో బ్రాండ్ పేరు అడిగి నావంక చూసి ఓకేనా అన్నాడు. నాకు ప్రిఫరెన్సులు లేవు గనుక వినపడకపోయినా సరే అనేశాను. తర్వాత అది జిన్ అని అర్థమైంది. ఎపుడూ తాగలేదు. ఐనా ఆడవాళ్ళ మందు అని దానికున్న పేరు ఇదివరకూ వినుంటం వల్ల, ఎలాగూ తాగింతర్వాత రైలెక్కి ఇంటికి వెళ్ళటం అనే ఫీటు గురించి అప్పటికే కాస్త వర్రీ అవుతున్న మూలాన, ఇదీ మంచిదేలే మరీ అవుటైపోయే పరిస్థితి రాకుండా అనుకున్నాను.

నాకు మందు ఏదన్నది పెద్ద ముఖ్యం కాదు. మరీ అంత మందుకి మరిగిన నాలిక కాదు. పక్కన తింటానికి మంచి స్టప్ఫు లేదంటే మాత్రం పెగ్గు దిగదు. రమణ అలాక్కాదు, వట్టి నీళ్లు కలుపుకుని సిగరెట్టు నంజుకుంటూ తాగేస్తాడు. అందుకే బజ్జీబండి దగ్గర బైకు ఆపాకా స్టప్ఫు విషయంలో ఎక్కడ పీనాసిగా చుట్టబెట్టేస్తాడోనని భయం పట్టుకుంది. పోనీ నేను చేయాడిద్దామా అంటే పదికాయితమే ఉంది. అందుకే తెగించి, ఇంకో అప్పు జమకని పక్కన పెట్టుంచిన రెండువేల లోంచి కొంత వాడేద్దామని, “లేపోతే ఇక్కడ ఏటీఎం ఏవన్నా ఉంటే పోదాం పదండి” అన్నాను. “ఎందుకండీ మీరు జస్ట్ ఏం కావాలో చెప్పండి” అన్నాడు. అప్పటికే కలిపున్న పిండి చూసి పకోడీ వేయమన్నాం. ఇంకా పునుకులూ, వడలు. బండివాళ్ళిద్దరూ తెలంగాణ జంట అని రమణగారికి తెలిసిపోయిందో, మరి ఈ వ్యవహారాల్లో ఆయన అంతేనో తెలీదుగానీ, నాతో మాట్లాడే ఎటూకాని యాస వదిలేసి పూర్తిగా తన యాసలోకి దిగిపోయాడు (“ఉల్లిగడ్డ ఏషినవే?”).

కట్టించుకుని బయల్దేరాం. సందుమలుపు తిరిగేటపుడు కొండగుర్తులు చెప్పాడు, “ఇదిగో ఎస్బీఐ బాంకుకీ ఐన్‌స్టీన్ స్కూలుకి మధ్యనున్న సందండీ” అని. నాకు అసలు బజ్జీబండి దాకా ఎలా వచ్చామో కూడా గుర్తు లేదు, కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయలేదు. వీధిలైట్ల వెలుగుల్లోంచీ, వాటిని పంక్చువేట్ చేసే చీకట్లలోంచీ ఒక బుల్లి కూడలికొచ్చి ఆగాం. రమణగారి ఇంటిఓనరు ఇల్లు మలుపు దగ్గర ఉంది. ఈయనకి అద్దెకిచ్చింది మాత్రం రోడ్డు అవతల ఇరుకుగేటు దాటి వెళ్తే తప్ప కనపడని ఖాళీస్థలంలో వేసిన రేకుల షెడ్డులో రెండోగది. పక్కగదిలో ఎవరో రొట్టెలు తయారు చేస్తారట. గది తలుపు తీయగానే ఆమూల నించి ఈమూలకి పరిచిన (ఫెవికాల్తో నేలకి అంటించిన) కార్పెట్ కనిపించింది. ఈ గదిలో ఇదివరకూ కోళ్ళను ఉంచేవారట. వాటి ఎండిన రెట్టలతో గదంతా నిండిపోతే, ఈయన ఎంత కడుక్కున్నా పోకపోయేసరికి, ఆఫీసుకారిడార్లలో పరిచేలాంటి ఈ తివాచీ తెచ్చి అంటించాడు. మాటల్లో పడి యథాలాపంగా గుమ్మం దగ్గర పడున్న రెండు పెయింటింగ్స్ దాటొచ్చేశాక, ఆయన వాటిని చూపించి “ఎలా ఉన్నాయో చూస్తూండండి. నేను మీకు స్ప్రయిటు తెస్తా” అని వెళ్ళాడు. మూణ్ణాలుగు రోజుల్లో వచ్చే మహిళాదినోత్సవం సందర్భంగా ఏదో గ్రూపుఎగ్జిబిషన్ ఉంటే దానికి తన వంతుగా వేస్తున్నవి. పేరు పత్రికల్లో నానటం కోసం. మనసు నుంచి వచ్చిన సబ్జెక్టు కాదు. ఆయన మిగతా పెయింటింగ్స్‌లో ఉండే మజా లేదు.

ఈ తెలియనిగది సమక్షంలో చతికిలపడ్డాను. తివాచీ మీద వేళ్లకి అందే పీచుని పీకుతూ కాసేపూ, పాతపేపర్లు తిరగేస్తూ కాసేపూ, ఉన్న ఒకే ఒక్క అల్మరాలో (నిజానికి అది వంటగట్టు) ఆయన పేర్చుకున్న కుంచెల్నీ రంగుల్నీ కెలుకుతూ కాసేపు కూర్చున్నాను. ఆయన చెప్పింతర్వాతే నా ముక్కుకి తెలిసిన కోళ్ళవాసన, ఇప్పుడు మేం తెచ్చిన పొట్లాల్లోంచి వ్యాపిస్తోన్న కమ్మని నూనెవాసనతో రిప్లేస్ అవుతోంది. పేపర్లో క్రైంపేజీల కోసం వెతికాను, దొరక్క సినిమా పేజీల్లో రబ్బరు నడుములూ బొడ్డుల వైపు చూస్తూ కాలక్షేపం చేశాను.

ఆయన వచ్చాకా పేపర్లు పరిచి వాటి మీద పొట్లాలు విప్పి బాచీమటాలేస్కుని కూర్చున్నాం. మోడరేట్ ఫీస్టు. ఎపుడూ ఛీర్స్ సంగతి మర్చిపోతాను. ఎలాగుందో చూద్దామని ఓ సగంమూతడు రా జిన్ను ముందే నోట్లో పోసుకున్నా. చల్లటి బిట్టర్‌స్వీటు స్పిరిట్టు నాలికంతా ఇంకుతూ పోయి గొంతుద్వారం దగ్గర మంటగా అణిగింది. తాగటం కన్నా తిండి మీదే ఎక్కువ శ్రద్ధ పెట్టే నా తత్వం ఆయనకు అలవాటైపోయింది. సగం స్టప్ఫు నావైపే నెట్టేస్తాడు. గ్రౌండ్ వర్కు అంతా సిద్ధం, ఇక ఇక్కణ్ణించీ చుక్కల్లోకీ హేజీ పాలపుంతల్లోకీ ఎగరటమే తరువాయి. “చెప్పండి కబుర్లు” అన్నాడు.

(బహువచనం నుంచి బయటపడలేకపోవటానికి ఆయన తరపు నుంచి బహుశా నా మేధావితనంపై ఆయనకున్న తగని భ్రమలో మరోటో కారణం కాగా, నా తరపు నుంచీ నాకన్నా నాలుగేళ్ళు పెద్దయిన ఆయన వయసూ, ఆయన కళామూర్తిమత్వంపై నాకున్న గౌరవం, నా ప.గో.జీ తనమూ కారణం.)

గాల్లోకి లేచే ముందు నేల మీద తక్కుతా తారట్లాడే గాలిపటంలా కాసేపు సాగింది సంభాషణ. ఆ మహిళాదినోత్సవం పెయింటింగ్స్‌కి నేను తెలుగులో పొయెటిగ్గా రాసిన కాప్షన్ల గురించి మెచ్చుకున్నాడు. ఆ పెయింటింగ్స్‌లో నాకనిపించిన తేడాల్ని (మరీ స్పెసిఫిగ్గా చెప్పేంత అవగాహన లేదు కాబట్టి) మూగవాడి సైగల్లా పైపైన చెప్పటానికి ప్రయత్నం చేశాను. కానీ ఆయన అర్థం చేసుకోగలడు. దట్స్ ద థింగ్. తర్వాత ఆయన ఆర్ట్ ప్రపంచం మీద ఆయన, నా లిటరరీ ప్రపంచం మీద నేనూ గాసిప్ చెప్పుకుని, ఆయన పెయింటింగ్‌కి సంబంధించి అందుకున్న సత్యాల్ని నేను రచనకి, నేను రచన గురించి అందుకున్న సత్యాల్ని ఆయన పెయింటింగుకీ అన్వయించుకుంటూ, నా మీదున్న గురితో ఆయన తన మీద నమ్మకం పెంచుకుంటూ, ఆయన మీదున్న గురితో నేను నా మీద నమ్మకం పెంచుకుంటూ… చాలా మాట్లాడుకున్నాం.

సంభాషణ ఇనెవిటబుల్‌గా మా దరిద్రం వైపూ, డబ్బుసమస్య వైపూ వచ్చింది. ఇది మా రెగ్యులర్ టాపిక్కు. ప్రపంచాన్ని ఎలా జయించాలి, ఎలా సంపాదించాలి అన్నది. నాలో ఇంకా మొలకెత్తుతున్నదే గానీ, రమణగారిలో మాత్రం కరడుగట్టిన రాక్షసకాంక్ష. కానీ ఆ జయించటమూ, సంపాదించటమూ అన్నవి మళ్లా తన లెక్కల్లోనే జరగాలి అనే పట్టింపు చూస్తే ముచ్చటేస్తుంది. జయించటానికి ఆయన వైపున్న సైన్యమల్లా ఈ కొన్ని కుంచెలూ రంగులూ మాత్రమే. కానీ ఎన్నిసార్లు దెబ్బపడినా మొండిగా లేచే మెంటల్‌తనం ఉంది. కాన్వాసు ముందు ఉన్నంతసేపూ ఎలాగూ అక్కడ ఎంత మజా పొందుతున్నాం అన్న దానిమీదే దృష్టి ఉంటుంది. కానీ కాన్వాసు దాటి పక్కకు వచ్చినప్పుడల్లా ఇంటద్దె అనీ, పిల్లలకి అనుకోకుండా వచ్చిపడే జ్వరాలనీ, వాళ్ల స్కూలు ఫీజులనీ ఇలా మనుగడ బాధలు చుట్టుముడుతుంటే, సర్వైవల్ ఆటలో ముందుకెళ్లటానికి మనుషులంతా ఆధారపడే సవాలక్ష నైపుణ్యాల్లో తన ఈ కళ కూడా కేవలం ఒకటి మాత్రమే అన్నట్టు చూడక తప్పదేమో. కానీ ఒకలా చూస్తే ఆర్టిస్టు ప్రివిలేజ్డ్ ప్లేయరు. వాడి ఆటకి నియమాలు వాడే నిర్దేశించుకుంటాడు. పైగా ఈ ఆటని బతకటానికి ఆడేవాళ్ళ మందలో ఒకడు కాదు, ఆనందించటానికి ఆడే అతికొద్దిమందిలో వాడు ఒకడు. కానీ ఆటలో గెలవకముందే కూత ఆగిపోతే అనే డౌటు పట్టి నన్ను చంపుతుంది. అదే అన్నాను.

“నిజమేనండీ, ఎలాగైనా సంపాదించాలి. ఒక్కోసారి భయమేస్తుంది. ఉన్నట్టుండి నాకేదైనా అయి చనిపోతే విద్య పరిస్థితి ఏంటని…” అన్నాను.

ఈ భయానికి కొంత పూర్వరంగం ఉంది. చావుని తల్చుకుని నేనెప్పుడూ పెద్ద భయపడలేదు, కానీ ఇప్పుడు నా చావు తర్వాత విద్య జీవితాన్ని ఊహించుకోవటానికి భయపడుతున్నాను. ఇదంతా నిజానికి విద్యే నాలో (అప్రయత్నంగానే) ఎక్కిస్తుందేమో. ఆరోగ్యం మీద నా అశ్రద్ధ తనకు మరీ విసుగుతెప్పించినపుడల్లా అంటుంది: “నీకేదన్నా అయితే తర్వాత నేనుండనురా. నాకింకేం లైఫ్ ఉంది. చచ్చిపోతానంతే” అని. నిజమే, తనకి నేను తప్ప అబ్సొల్యూట్‌గా ఎవరూ లేరు. ఎంత లేరంటే, నేను లేకపోయిం తర్వాత తను బతకాల్సిరావటాన్ని నేనే ఊహించలేను. నన్ను పాలించే రాణిని, ఎవరి పంచనో దిక్కులేకుండా. కానీ జరిగేది అదే. తన కుటుంబం మొత్తాన్ని శాశ్వతంగా శత్రువుల్ని చేసుకుని ఇటు నా కుటుంబానికీ చేరువ కాలేక… ఎటూ కాని ఈ స్థితిలోకి తెచ్చి… నేన్నిజంగా ఆమెను తీసుకొచ్చి మంచే చేశానా అనిపిస్తుంది. ఏం చేయాలి అంటే జవాబు తెలిసిందే: కనీసంలో కనీసం, సంపాదించాలి. అపుడనిపిస్తుంది, అసలైన పురుషార్థం భార్యాపిల్లల కోసం కూడబెట్టడమేనని. కానీ ఈ రాతలతో ఏం రాలతాయి. నిజంగా ఇంకేదైనా చేసి సంపాదించగలిగితే ఖచ్చితంగా అదే చేయాలి. ఒకప్పుడు నాకు చావుభయమంటే రాయాల్సినవి రాయకుండా చచ్చిపోవటమనే. కానీ ఇప్పుడు నా తదనంతరం అన్నీ అమర్చిపెట్టకుండా చచ్చిపోతానేమోనన్నదే పెద్ద భయమైపోయింది. ఇదంతా తల మీదకి ఒత్తిడిని దించుతుంది. క్రూరమైన దయావిహీనమైన భావాల్నైనా ఆసరా తీసుకోవాలనిపిస్తుంది. మొన్నొకసారి నా ఆరోగ్యం మాటొచ్చి మళ్ళీ తను అదే మాట అనబోతే, “నేనంటూ లేకపోయాక, నువ్వేమైతే నాకేవిటే” అన్నాను. అది నన్నామె అర్థం చేసుకునే ట్రాన్స్‌ఫరెంట్ క్షణాల్లో ఒకటి. “నువ్వెంత స్వార్థపరుడివిరా!” అని అనగలిగింది.

అంతకుముందు ఓ రోజు రాత్రి నన్ను నేను హింసించుకుంటూ కల్పించుకున్న వికృతోహల ప్రభావం కూడా ఆ మాట వెనుక ఉండొచ్చేమో ఆమెకు తెలీదు, నాకూ తెలీదు. ఆ రోజు ఆమె పక్కనే పడుకున్నాను. చిన్నపిల్లలా సగంనోరు తెరిచి ఒత్తిగిలి పడుకుంది. ఎలాగో తన ప్రపంచం మొత్తానికి నన్నే కేంద్రకం చేసేసుకున్న జీవి. ఆ కేంద్రకం కూలిపోతే? నేనిలా ఇక నిద్ర లేవకుండా చచ్చిపోతే? తెల్లవారేకా ఆమె మామూలుగా లేచి, నేను యథావిధిగా రాత్రి పొద్దోయేదాకా ఏదో పుణుక్కుని ఆలస్యంగా పడుకుని ఉంటాననీ, అందుకే ఇంకా లేవలేదనీ అనుకుంటూ, తాను లేచి స్నానాలవీ కానిచ్చేసి, టిఫిన్ చేయటంలో పడి, ఈలోగా నన్నులేపి మొహం కడిగించేస్తే వేడిగా తింటాను కదా అని బెండ్రూంలోకి వచ్చి, ఎంత పిలిచినా పలక్కపోతే కుదిపి, నిరోధంలేని దేహపు కదలికల వల్ల నెమ్మదిగా మొదలైన అనుమానాన్ని తనే మళ్ళీ బయటకి అదిలిస్తూ, కానీ అది పెనుభూతమై పెరుగుతుంటే ఏమీ చేయలేక, అర్థం విప్పార్చుకుంటున్న నిజాన్ని వెనక్కు మళ్ళించలేక, నన్ను అటూయిటూ కదిపి, నాడి పట్టుకుని చూసి, అప్పటికే చల్లబారిన నా ఛాతీకేసి చెవి ఆన్చి, జీవం ఖాళీ చేసి వెళ్ళిపోయింతర్వాత మిగిలిన పదార్థమాత్రపు దేహంలో రక్తసంచలనాలూ లబ్‌డబ్‌లూ ఏమీ లేని గడ్డకట్టిన నిశ్శబ్దాన్ని మాత్రమే వినగలిగి, తనొక శవంతో ఉన్నానని అర్థమై, బహుశా క్షణమాత్రం పాకే లేకి భయానికి లజ్జితురాలై, దాన్ని కప్పిపుచ్చేందుకు ఒక్కసారి కవటాలు వదిలేస్తే వచ్చిపడిన ప్రేమావేశం నా చల్లటి దేహంపై ఫెటిల్లున కన్నీరై పగిలి, బరువుమాత్రమే మిగుల్చుకున్న నా తలని తన వళ్ళోకి తీసుకుని, చెంపలుకారేలా ఏడ్చి, ఆ ఏడుపు అందరికీ వినపడుతుందనీ, వినపడాలనీ, ఎవరో ఒకరు చెంతనుండాలనీ… స్టవ్ మీద మాడిపోతున్న ఉప్మా, అపార్ట్‌మెంటు కారిడార్ల నిండా పాకుతున్న ఏడుపు, కాసేపు ప్రేమతోనూ, కాసేపు తన స్థితి తలుచుకుని, కాసేపు ఈ శవాన్ని ఏం చేయాలనీ…. ఉత్త కట్టెలాంటి శరీరాన్ని డిస్పోస్ చేయటానికి ఎంత ఖర్చవుతుంది, ఏటీఎంలో ఉన్నదెంత, చుట్టూ నా పరిచయస్తులూ, స్నేహితులూ తనకి ఏమీ కాని వారు, ఈలోగా రింగవుతున్న ఫోను లిఫ్ట్ చేస్తే తను వారం క్రితం జాకెట్లు కుట్టడానికిచ్చిన టైలరావిడ కుట్టడం పూర్తయిందనీ వచ్చి తీసుకెళ్లమనీ అంటుంటే, ఈ వినాశనపు సూచనైనా లేని ఓ గతంలోకి పోర్టల్ తెరుచుకున్నట్టయి, వీలైతే ఫోన్లోంచి దూరి అక్కడికి వెళిపోవాలనిపిస్తుంటే, ఆ దారిని ఈ చావుతో కలుషితం చేయబుద్దేయక, రేపు వచ్చి తీసుకుంటానని చెప్పి పెట్టేసి, చాపమీద నిటారుగా పడుకోబెట్టి తెల్లటిగుడ్డతో కప్పివున్న నా వైపు చూస్తూ…. కళ్ళు నిండాయి నాకు, ఆ చిన్నగా నోరు తెరిచి సన్నగా గురకపెడుతున్న బుజ్జితల్లిని చూసుకుంటూ, ఇదంతా చెరిపేసుకుని, ఎప్పటికో పడుకుంటాను. తెల్లారి లేచాకా ఇదంతా ఏమీ చెప్పకుండా సందర్భం కల్పించిమరీ కామెడీగా అంటాను, “నువ్వు మాత్రం సుమంగళిగానే చచ్చిపోవే బాబూ” అని.

ఈ భయమే రమణ గారి ముందు ఆ మాటల్లో బయటపడింది. అవి ఆయనకూ తగిలాయి. తన జీవితంలోకి చూసుకునేలాగా. “అవునండీ” అని వాళ్లావిడ గురించీ, పిల్లల గురించీ తల్చుకున్నారు. “నాకేమన్నా ఐతే విజయ నిజంగా దిక్కులేని పరిస్థితిలో కెళిపోతుంది. పిల్లలు రోడ్డు మీద బతుకుతూ గవర్నమెంటూ స్కూళ్ళలో చదివీ చదవకా అల్లరిచిల్లరగా… అసలు ఊహించుకుంటేనే భయంగా ఉంటుంది.”

“నిజంగా మనం బతికున్నప్పుడు వాళ్ళు గవర్నమెంటు స్కూళ్ళల్లోనే చదువుతున్నా ఫర్లేదనిపిస్తుంది కానీ, మనం లేకుండా మాత్రం వాళ్ళని అలా ఊహించుకోలేం” అన్నాను.

తన ఆలోచన తాలూకు కొనసాగింపునే విన్నట్టు వెంటనే తలూపి ఒప్పుకున్నాడు.

చెల్లెల్ల పెళ్ళికి పెద్ద వడ్డీల్తో తెచ్చిన అప్పుల బరువు ఆయన మీద పడి ప్రతీ నెలా సంపాదన లోంచి పాతికవేలు వడ్డీలే గుంజుకుంటుంటే ఏ నెలకా నెలే టైట్‌రోప్ వాకింగ్ చేస్తున్నారు. నా మాటలు ఆయనలో నిద్రాణంగా ఉన్న భయాన్ని లేపాయి. ఆ భయం నాకన్నా తీవ్రంగా ఉండి ఉంటుంది. ఏడాది క్రితం అనుకుంటా, ఒకరోజు నేను ఎందుకో వాళ్ల ఇంట్లో ఉన్న సందర్భంలోనే ఆయనకి ఉన్నట్టుండి ఛాతీ నెప్పి విపరీతంగా వచ్చింది. ఇంట్లో వాళ్ళు హార్ట్ ట్రబులేమన్నానేమో అని భయపడ్డారు, కన్నీరుపెట్టుకున్నారు. ఎక్కడో పెద్ద ప్రయివేటు హాస్పిటల్లో తెలిసినవాళ్ల ద్వారా కార్టియాక్ చెకప్పుకి వెళ్ళాం ఇద్దరం. ఆ రోజంతా ఏవో టెస్టులతో హాస్పిటల్లోనే గడిచిపోయింది. ఆయన్ని సెక్షన్నుంచి సెక్షన్ కి తిప్పుతూ చెకప్స్ ఏవో చేస్తూనే ఉన్నారు. ఛాతీకి సెన్సర్లు తగిలించి ట్రెడ్మిల్ మీద పరిగెత్తించటం, ఇంకా అలాంటివి. భయమేమన్నా ఉంటే అది ఆయన మొహం మీద కనపడనీయలేదు, నాతో పంచుకోలేదు కూడా. ఉత్కంఠ మాత్రం ఉందనిపించింది. రిజల్ట్స్ కోసం ఆ తెల్లటి కారిడార్లలో ఎదురుచూస్తూ కూర్చున్నప్పుడు ఆయనన్న మాటల్నిబట్టి సిగరెట్టూ మందూ మోతాదు తగ్గించటం గురించి నిజంగా ఆలోచిస్తున్నట్టే కనపడింది. సాయంత్రానికి రిజల్టు వచ్చింది. స్ట్రోక్ అయితే కాదు గానీ, ఆయన గుండె దగ్గర కొలెస్టరాల్ శాతం మాత్రం ఎక్కువుందని తేలింది. మందులూ, ఎక్సర్సయిజూ చెప్పారు. బయటైతే పడ్డాడు, కానీ ఆ సంఘటన చావెంత చేరువో గుర్తు చేసిందనుకుంటా. ఈమధ్యే తాగితాగి చిన్నవయసులో చచ్చిపోయిన దళితకవి గురించి రెండుమూడుసార్లు ప్రస్తావిస్తే అలా అనిపించింది.

వ్యసనంలో సీనియారిటీ పరంగా చూస్తే ఎక్కువ భయపడాల్సింది ఆయనే. కానీ చచ్చిపోయాకా వెనక మిగిలేవాళ్ల పరిస్థితిలో దైన్యత విషయానికొస్తే నా పరిస్థితే అధ్వాన్నమనిపించింది. కానీ ఇదంతా భూమ్మీద మసిలేవాళ్ళకి తప్పని తాపత్రయమే తప్ప ఎవరు చచ్చిపోయినా తోటివాళ్ల బతుకు ఆ చిన్న కుదుపు తర్వాత అలా సాగిపోతూనే ఉంటుందేమో. ఐనా మన దగ్గరివాళ్ళెప్పుడూ మన ఆధ్వర్యంలోనే బాగున్నారని నమ్మాలనుకుంటాం. ఒకవేళ ఇప్పుడలా ఉన్నట్టు లేకపోయినా వాళ్ళని బాగుండే స్థితికి తీసుకెళ్లగలమని నమ్ముతాం.

ఎన్ని పెగ్గులు దాటినా జిన్ను తాగటానికి తియ్యగా బానే ఉంది గానీ, తలకైతే ఎక్కటం లేదు. నిద్రలేమితో ఉన్నవాడ్ని పట్టివూపే మత్తులా ఉందంతే. కానీ రమణగారు తన కుటుంబం గురించి మాట్లాడుతున్నప్పుడు నా కళ్ళల్లో తాగుబోతుకన్నీళ్ళు చిప్పిల్లాయి. మా రెగ్యులర్ సిట్టింగుల్లోలా ఈరోజు పాలపుంతల్లోకి ఎగరలేదు. స్టప్ఫు ఎప్పుడో అయిపోయింది. మందుకూడా కావొచ్చింది. కాసేపు కూర్చుంటే తాగింది సక్రమంగా ఎక్కి ఇంకాస్త బెటర్ మూడ్లోకి వెళ్ళేవాళ్లమేమో. ఒక తీరైన ముగింపుకి చేరినట్టుండేది. కానీ నా ఆఖరు రైలు పదిన్నరకి. బస్సుల్లో వెళ్లొచ్చు గానీ, ఈ స్థితిలో బస్సులవీ మారాలంటే భయం. ఆయన్ని తొందరపెట్టాను.

పేపర్ల అంచులు దాటి తివాచీ పీచులో ఇరుక్కుపోయిన తిండి తునకల్తో సహా అనీ పేపర్లలో చుట్టబెట్టి ఏరి బయటపడేశాం. ఆయన తన 12 X 6 స్టూడియోకి తాళం వేశాడు. ఇద్దరం బండి ఎక్కి బయల్దేరాం. ఇందాకటి సిమెంటు రోడ్డు మీదకు తెచ్చి దింపాడు. నా జేబులో పదికాయితమే మిగిలింది. ఎందుకన్నా మంచిదని చిల్లర అడిగాను, ఆ ఫూలిష్ మనిషిని. ఏ వందైతే నిజంగా అవసరమే అన్నాడో అందులో ఓ యాభైపదులు తీసి మళ్ళీ నాకే ఇచ్చాడు. తుప్పలబాట మధ్య నుంచి తూలి నడుస్తూ మధ్యలో ఆగి, కాళ్ల మీద చిమ్ముతుందేమో అన్న లెక్కకూడా ఉండని ఈ డెలిషస్ స్థితిలో ఉచ్చతన్నించి, పట్టాలెక్కి ఫ్లాట్‌ఫాం మీదకొచ్చాను. లంచ్‌బాక్సులు భుజాల్నేసుకుని ఆఖరి రైలు కోసం ఎదురుచూస్తున్న కొందరు ఓవర్‌టైం జీవులు తప్ప పెద్దగా జనం లేరు. ఏ క్షణాన రైలొచ్చేస్తుందో అన్న కంగారుతో టికెట్‌కౌంటరు వైపు త్వరగా నడుస్తున్నాను. సోబరుగా ఉన్నోడి కంటే కూడా జాగ్రత్తగా అడుగులు వేస్తూ.

(Published in Kinige Patrika under the a pseudonym)