June 6, 2016

‘బర్నింగ్‌ ఇష్యూ’ బారిన తెలుగు కథ

‘‘సింహాల తరఫున చరిత్రకారులు వచ్చేవరకూ వేట చరిత్ర ఎప్పుడూ వేటగాడినే కీర్తిస్తుంది’’ అన్న చినువా అచెబె మాటొకటుంది. అయితే మన తెలుగు సాహిత్యంలో అటు సింహాలూ ఇటు వేటగాళ్ల చరిత్రల్ని కూడా హైనాలే రాస్తున్నాయి. హైనాలంటే నా ఉద్దేశం ఇటీవలి తెలుగు కథకులు. హైనాలకి అంటగట్టే నీచ గుణాల్ని వీరికి ఆపాదించటం లేదు నేను. వారు ఇరుపక్షాలతోనూ సంబంధంలేని థర్డ్‌పార్టీలని చెబుతున్నాను. హైనాకు అటు వేటగాడితోనూ, ఇటు సింహంతోనూ సంబంధం ఉండదు. వేట ఫలితం మాత్రం కావాలి. ఈ కథకులు కూడా అటు పీడకులు, ఇటు పీడితుల గురించి లోతైన అవగాహన లేకున్నా కేవలం వార్తలకెక్కిన సంఘటనల నుంచి కథలు పిండుతున్నారు.

ఇది మరీ బ్రాడ్‌ జనరలైజేషన్ అనిపిస్తే క్షమార్హుణ్ని. నన్ను నేను కథకుడిగానే చూసుకుంటాను. తెలుగులో నేను ప్రేమించే కథకులూ ఉన్నారు. కానీ ఈమధ్య తెలుగు కథకు మరీ గ్రాండ్‌ థీమ్స్‌ కావాల్సొస్తున్నాయి. మామూలు మనుషుల్ని జీవిత పరిధిలో తాకే అనుభవాలు కాదు; రాష్ర్టాన్నో దేశాన్నో కుదిపే విషయాలైతేనే కథకుల పెన్నులు కదులుతున్నాయి. నిర్భయ కేసో, భూసేకరణో, బీఫ్‌ గొడవో, చివరికి చెన్నై వరదలో... ఇలాంటి సంఘటనల కోసం వెతుక్కుంటున్నాయి. పేపర్లూ, న్యూస్‌ఛానెల్సూ ఫాలో కాని వారికి కూడా ఈ కథలు చదివితే సమకాలీన సమాజంలో బర్నింగ్‌ ఇష్యూస్‌ ఏంటో అర్థమవుతాయి. తెలుగు సినిమాల గురించి కూడా ఎవరూ ‘దేని మీద తీశారూ?’ అని అడగట్లేదు, కానీ ఈ కథలు మాత్రం ‘దేని మీద రాశారూ’ అని అడిగితే జవాబులొచ్చేట్టుగా ఉంటున్నాయి. ఆ జవాబులు కూడా ‘ఏపీలో భూసేకరణ మీద’, ‘నిర్భయ కేసు మీద’, ‘రోహిత్ ఆత్మహత్య మీద’ ఇలా పత్రికల పతాక శీర్షికల్ని తలపిస్తున్నాయి.

ఇలాంటివి రాసేవాళ్లు ఏ ధైర్యంతో రాస్తున్నారా అని ఆశ్చర్యం కలుగుతుంది. జీవితంలో కులపరంగా ఏ వివక్షా ఎదుర్కోని నన్ను కూర్చోపెట్టి దళిత కథ రాసేయమంటే రాయలేను. సొంతానికి భూమి ఉండటం అంటే ఏంటో తెలీని నన్ను భూమి పోగొట్టుకోవటం గురించి కథ రాసేయమంటే రాయలేను. ఈ మాటంటే ఒక ఎదురువాదన చేయవచ్చు. జంతువులకు లేనిదీ మనుషులకు ఉన్నదీ ఒక లక్షణం సహానుభూతి, అవతలివాళ్ల స్థానంలో మనల్ని నిలబెట్టుకొని ఆలోచించగలగటం. ఈ సహానుభూతి తోనే పీడితుల సమస్యల్ని గ్రహించి రాస్తున్నామని ఈ మాదిరి రచయితలు వాదించవచ్చు. మరో వాదన కూడా చేయవచ్చు. అదేమిటంటే ప్రతి మనిషిలోనూ రకరకాల వ్యక్తిత్వాంశలు ఉంటాయి. కొన్ని అణచివేయబడి, మరికొన్ని వ్యక్తమవుతూ ఉంటాయి. ఒకే మనిషిలో అమిత కరుణాత్మకమైన, అత్యంత క్రూరమైన అంశలు ఉండి సందర్భాన్ని బట్టి బైటపడటం, పడకపోవటం జరుగుతుంది. ఆ మనిషి రచయిత ఐతే తనలోని వేర్వేరు అంశలకే తీక్షణత దట్టించి వేర్వేరు పాత్రల్ని సృష్టించగలుగుతాడు. హామ్లెట్‌ నుంచి షైలాక్‌ దాకా అందరూ షేక్‌స్పియర్‌ లోనే ఉండుంటారు. అయితే ఇలా బర్నింగ్‌ ఇష్యూల్ని కథలుగా మలిచే రచయితలకి ఈ సుగుణాల్ని ఆపాదించలేను. కారణం చెప్తాను. నాలోంచే ఒక హంతకుడ్ని, ఆదర్శవాదిని పాత్రలుగా సృష్టించగలను. కానీ ఒక దళితుడ్ని, పత్తి రైతునీ సృష్టించలేను. ఎందుకంటే మొదటివి వ్యక్తిత్వాంశలు, రెండోవి సామాజిక ఐడెంటిటీలు. మనవి కాని సామాజిక ఐడెంటిటీలను సహానుభూతితో దగ్గరగా పరిశీలించి కొంతమేరకు అర్థం చేసుకోగలం. కానీ ఎంత లోతుకెళ్లినా జన్మతః ఆ ఐడెంటిటీని మోస్తున్నవాడిలాగా దాన్ని పూర్తిగా ఆవాహన చేసుకోగలమా? (చేసుకోగలమూ అనేవాళ్లు మనిషి లోతుల్ని తక్కువ అంచనా వేస్తున్నారనైనా అనుకోవాలి, లేదా మనిషి వర్గపరమైన స్థానమే అతని లోతులన్నింటినీ నిర్ధారిస్తుందనే మార్క్సిస్టులనైనా అనుకోవాలి). వివక్ష లోతూ విస్తారమూ తెలీని రచయితలు పైపై పరిశీలనలతో రాస్తే దాని తీవ్రతను తేలికచేసినవాళ్లవుతారు. సమస్యకు చేటు చేసినవారవుతారు. పీడితపక్షం వహించటం ఎప్పుడూ ఆదర్శమే. కానీ ‘పాపం పీడితులూ’ అన్న మన ఉదాత్తమైన సానుభూతే వాళ్లకు మంచి చేయదుగా.

ఇలాంటి కథలు ఎక్కువగా ఇంటర్నెట్‌ పత్రికల్లో, సోషల్‌ మీడియాలో మసలుకునే రచయితల నుంచే రావటం యాదృచ్ఛికం కాదు. మనం ప్రస్తుతం సమాచార కుమ్మరింపుతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రపంచంలో ఉన్నాం. సోషల్‌ మీడియాలో సమాచారంతో పాటు దానిపై అభిప్రాయాలూ వెల్లువలా వచ్చిపడుతూంటాయి. అటోయిటో తేల్చుకొమ్మనే విభజనలుంటాయి, నలుపూ తెలుపుల వైపు నెట్టివేతలుంటాయి. ఈ వర్చువల్‌ అవాస్తవికతలో అందరితో పాటూ రచయితలూ కొట్టుకుపోతున్నారు. నిర్భయ ఘటన తర్వాత అంతకన్నా దారుణమైన అన్యాయాలు జరిగాయి. అయితే నిర్భయ సమయంలో వెలిగినన్ని కొవ్వొత్తులు అప్పుడు వెలగలేదు. ఆ కొవ్వొత్తుల ర్యాలీల్లో పాల్గొన్నవారి ఆవేశం తర్వాత కొవ్వొత్తులంత త్వరగానూ కరిగిపోయిందనుకోవాలి. ఇలా బర్నింగ్‌ ఇష్యూల మీద ఎడాపెడా కథలు రాస్తున్న రచయితలు ఈ కొవ్వొత్తి ఉద్యమకారుల్లాంటి వారేనని నాకపిస్తుంది. వారి స్పందన తాత్కాలిక భావోద్వేగాలపై ఆధారపడినది. భావోద్వేగానికి ఇంధనం భావోద్వేగమే. దానికి కారణాలతో, మూలాలతో నిమిత్తం లేదు. ఆరేదాకా మండాలి, అంతే. అయితే సమస్య మూలాల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తే భావోద్వేగం కాదు, నిర్మాణాత్మకమైన వివేచన ఉంటుంది. అలాంటి వివేచన నప్పే ప్రక్రియ వ్యాసం. కానీ వ్యాస ప్రక్రియకు ఇక్కడ ఆదరణ లేదు. తెలుగులో రాసేవాళ్లకీ చదివేవాళ్లకీ (నిజానికి ఇప్పుడీ రెండూ వేర్వేరు వర్గాలు కూడా కాదు) కావాల్సింది నిలిచి వెలిగే కాగడాలు కాదు, రాజుకున్నంత త్వరగానూ చల్లారిపోయే అగ్గిపుల్లలు. అందుకే కథ వైపు వస్తున్నారనుకుంటున్నాను.

మనకు సంఘటనాత్మక/ ప్రాసంగిక కవిత్వం ఎప్పుడూ ఉంది. కొన్ని సందర్భాల్లో అది ఉద్యమాలకు ఊతంగానూ నిలిచింది. నినాదాలు, పాటలతో పాటు తన వంతు సాయం చేసింది. సంఘటనలకు కదిలి రాసిన శ్రీశ్రీ ‘గర్జించు రష్యా’ లాంటి కవిత్వం ఏకాంతంలో పెదాల వెనుక చదవాల్సింది కాదు. ఆ సంఘటనలకు ప్రతిక్రియగా కదిలే సమూహాల మధ్య నిల్చొని ఎలుగెత్తి చదవాల్సిన కవిత్వం. కానీ ఇటువంటి సందర్భాల్లో కథకు స్థానముందా? అదీగాక, గత రెండు మూడు దశాబ్దాలుగా తెలుగునేలను ఊగించిన ఉద్యమాలన్నీ ప్రస్తుతం సాఫల్యానికో, వైఫల్యానికో, ప్రతికూల వేగానికి మ్రాన్పడి దీర్ఘసుషుప్తిలోకో పర్యవసించాయి. రగిలే దృశ్యాలపై ఆబగా మసిలే న్యూస్‌ కెమెరాల కళ్లనే తమ అంతఃచక్షువులుగా స్వీకరించి చాలామంది కవులు కవిత్వం రాస్తున్నారు. ఇలాంటప్పుడు ఈ తరహా రచనలు ఆయా రచయితల సివిక్‌ గిల్ట్‌ను తృప్తిపరచేందుకు తప్ప దేనికి పనికొస్తున్నాయి?

కళాకారుల పని సమస్యలకు పరిష్కారాలు వెతకటం కాదని, సమస్యలను విశదంగా ఎత్తిచూపటం మాత్రమేనని చెహోవ్‌ అంటాడు. ‘ఆయా కార్యరంగాల్లోని నిపుణులు మాత్రమే పరిష్కరించగలిగే విషయాల్లో రచయిత వేలుపెట్టకూడదు. అతనికి అర్థంకాని విషయం జోలికి వెళ్లటం వల్ల ఏ మంచీ జరగదు’ అని ఒక ఉత్తరంలో రాస్తాడు. నేటి కథకులు తమవి కాని సమస్యల్నీ, తమకు పూర్తిగా అవగాహనలేని ఐడెంటిటీల్ని తీసుకుని కథలు చెబుతున్నారు. తమ అవగాహనా లోపం వల్ల అనివార్యంగా వచ్చే ఖాళీల్ని అనాయాసమైన ఉదాత్తతతోనో, సెక్యులరిజం, మార్క్సిజం వంటి సైద్ధాంతిక దృక్పథాలతోనో పూడ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మానవ వ్యవస్థలు ఎంతో శ్రమించి నాగరికతకు నప్పే విధంగా కొన్ని దృక్పథాల్ని తయారుచేసుకొన్నాయి. కానీ ఈ కథకుల విషయంలో అవి సమస్యను లోతుకెళ్లి అర్థం చేసుకొనే శ్రమను తప్పించుకొనేందుకు సాకులుగా మాత్రమే పనికొస్తున్నాయి. ఉదాహరణకి, కులమత వ్యవస్థలపై సెక్యులర్‌ దృక్పథం చూపే పాటి అవగాహన ఉంటే చాలు-- బీఫ్‌ గొడవ నుంచి రోహిత్ కుటుంబంలో ఈక్వేషన్ల దాకా అన్నిటికీ జవాబులు దొరికేసినట్టే. ఎంచుకోవటానికి ఏదో ఒక పక్షం లభించేసినట్టే. ఇక పక్షాలు నిర్ధారణ అయిపోయాక కథ పుట్టించటం ఎంతసేపు? నువ్వు మార్క్సిస్ట్‌వైతే రాజ్యం విలన్; నువ్వు సెక్యులరిస్ట్‌వైతే హిందూత్వ విలన్; ఈమధ్య మొలుచుకొస్తున్న రైటిస్ట్‌ కథకుల్లో ఒకడివైతే అసలు సంస్కరణే నీ విలన్ (టిపికల్‌గా వీరిది ‘‘అన్నీ విశ్వనాథ సాహిత్యంలోనే ఉన్నాయిష’’ అనే బాపతు). ఈ కథల్లో పాత్రలు కూడా ఇలాంటి ఐడియలాజికల్‌ చదరంగం ఆడేందుకు పనికొచ్చే పావుల్లా మాత్రమే ఉంటాయి. చదరంగంలో పదహారు బంటులకూ ఏమాత్రం వ్యక్తిత్వాలుంటాయో ఈ పాత్రలకీ అంతే ఉంటాయి. నలుపా తెలుపా అన్న ఒక్క తేడానే వాటి వ్యక్తిత్వాల్ని నిర్ధారించేది. మరే ఛాయల్నీ ఆమోదించే ప్రసక్తే లేదు. ఫలితంగా ఇలాంటి కథలు జరిగిన సంఘటనల్ని తిరిగి కాయితంపై ఆడిస్తూ ఒక పక్షాన్ని మంచిగానూ, మరో పక్షాన్ని చెడుగానూ తీర్మానించటానికే పనికొస్తున్నాయి. రక్తమాంసాలున్న మనుషుల జోలికెళ్తే మంచీ చెడులు అంత సులువుగా తేలేవి కావు గనుక, ఈ కథకులు భావజాలాలకే మనుషుల ముసుగేసి, ఇరు వైపులా ఆట తామే ఆడేసి సమస్యలకు పరిష్కారాలు చెప్పేస్తున్నారు. ఏదో చేశామన్న తృప్తిని మాత్రం పొందుతున్నారు. సామాజికస్పృహతో కొడవటిగంటి, రావిశాస్త్రి, పతంజలి కథలు రాస్తున్నప్పుడూ దినపత్రికల్లో బర్నింగ్‌ ఇష్యూలకు కొదవ లేదు. వారూ చదివి చలించే ఉంటారు. కానీ ఎప్పుడూ ఇలా కథలతో కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించిన గుర్తు లేదు. ఒట్టి సంఘటనల్ని గాక, వాటి వెనుక సమస్యల్ని, సమస్యల్లో మనుషుల్నీ, మనుషుల్ని నడిపించిన కారణాల్నీ పట్టుకొనే ప్రయత్నం చేశారు. వ్యవస్థలో అబ్సర్డిటీ చూసినపుడల్లా ‘పిలక తిరుగుడు పువ్వు’ కథ గుర్తుకు రావచ్చు. వ్యవస్థపై తేలిన పైపై తెట్టునే పతంజలి కథలోకి తీసుకొని ఉంటే ఆ ప్రభావం ఉండేది కాదు.

దృక్పథాలు, నిబద్ధతల పేరిట ఇంకా దబాయింపు సెక్షన్‌లు అమల్లో ఉన్నాయంటే నమ్మకం కలగకపోవచ్చు. ఆమధ్య ఒక సమావేశానికి వెళ్లాల్సి వచ్చింది. తెలుగు కథావరణంలో పరపతి కండువాలున్న కొందరు బుజుర్గ్‌ లోగ్‌ కలిసి యువ రచయితల్ని పిలిచి ఎందుకు, ఏమిటి, ఎలా రాస్తున్నారో చెప్పమన్నారు. వారిలో నేను ఎడిట్‌ చేసిన ఒక వెబ్‌పత్రికకు కథ పంపిన రచయిత కూడా ఉన్నాడు. చిన్న గమ్మత్తయిన ఆలోచనతో రాసిన ఆ కథ బాగుంటుంది. ఇప్పుడీ సమావేశంలో అతని వంతు వచ్చాక ఉన్నదున్నట్టు చెప్పుకొచ్చాడు. కొత్తల్లో కథలకు డబ్బులిస్తారని తెలిసి రాశాననీ, తర్వాత ఎలా రాస్తే పత్రికలు వేసుకుంటున్నాయో అలా రాశాననీ, కథలు చెప్పటంలో మజా తెలిశాకా రాసే తీరులో మార్పువచ్చిందనీ నిజాయితీగా వెల్లడించుకున్నాడు. ఈ పాపానికి తర్వాత మాట్లాడిన పెద్దవాళ్లు అతడ్ని ఓ రౌండ్‌ దులిపొదిలేశారు. డబ్బు కోసం రాయటం నీచమనీ, అతను మార్కెట్‌ శక్తులకు బానిసనీ, అతనికి నిబద్ధత (అంటే మన తెలుగులో ‘మార్క్సిస్టు నిబద్ధత’) లేదనీ విమర్శించారు. అతను తర్వాత మైకు తీసుకుని క్షమాపణగా మున్ముందు నేర్చుకుంటానన్నాడు. నేను ఊపిరి పీల్చుకున్నాను. ఇక మీదట అతనికి చుట్టూ జీవితంలో కళ్లు చెదరగొట్టే వైవిధ్యాన్ని ఓపిగ్గా జల్లెడపట్టాల్సిన బాధ తప్పింది. రోజూ న్యూస్‌పేపర్‌ వేయించుకొంటే చాలు. ఫేస్‌బుక్‌లో ఏ ఇష్యూ ట్రెండింగ్‌లో ఉందో గమనిస్తుంటే సరిపోతుంది.

*
(Published in Andhra Jyothy 'Vividha' page on June 20, 2016)