June 1, 2017

ఆఖరి రూపకం

అతను చనిపోయాడని పేపర్లో జిల్లా పేజీలో చదివాను. ప్రమాదాలూ, నేరాల వార్తల మధ్య వచ్చిన ఆ వార్తలో అతనో రచయిత అని కూడా ఎక్కడా లేదు. “రోడ్డు ప్రమాదంలో యువకుని మృతి” అన్న హెడింగ్ కింద ఇచ్చిన వివరాల్లో అతని అరుదైన పేరూ, వయసూ, ఉద్యోగమూ ఉన్నాయంతే. మరుసటి వారం సాహిత్య పేజీల్లో స్నేహితుడైన ఒక రచయితా, ఒక విమర్శకుడూ రాసిన నివాళి వ్యాసాలు తప్పితే ఇంకే చప్పుడూ లేదు. అతను రాసింది కూడా తక్కువే మరి. ఐదేళ్ళ క్రితం పన్నెండు కథలతో మొదటి పుస్తకం వచ్చింది. తర్వాత పత్రికల్లో తొలి నవలా, ఐదారు కథలూ అచ్చయ్యాయి. పుస్తకాల షాపులో పేరు చిత్రంగా అనిపించి అతని కథల పుస్తకం కొని చదివాను (“ఇరుక్కున్న రాతలు”). ఆ తర్వాత అతనేం రాసినా వెతికి చదివాను.

కానీ ఇక్కడ చెప్పదల్చుకున్నది అతని కథల గురించి కాదు. పేపరు వార్తలో ఆ ఏక్సిడెంట్ ఎక్కడ జరిగిందో రాసి, చిన్న బ్లాక్ అండ్ వైట్ ఫొటో కూడా వేసారు. రోడ్డు డివైడర్ మీద ఒరిగిపోయిన స్కూటరూ, అసహజమైన భంగిమలో పడి ఉన్న అతని శరీరమూ ఫొటోలో ఉన్నాయి. వెనక కనిపిస్తున్న బడ్డీ కొట్టును బట్టీ, ఆ పక్కన గోడ మీద అంటించిన పోస్టర్లని బట్టీ ఆ చోటు ఎక్కడో నాకు అర్థమైంది. అది మా ఆఫీసుకు దగ్గర్లోనే.

పేపర్లో అతని ఏక్సిడెంట్ వార్త చదివిన రోజు మధ్యాహ్నం ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్తూ కాసేపు బండి అక్కడ ఆపాను. బడ్డీ కొట్టు దగ్గరకెళ్ళి నిల్చున్నాను. ఇక్కడ్నించి చూస్తే డివైడర్ మీద పెచ్చులేచిన గుంట కొత్తగా కనిపిస్తోంది. పేపర్లో రాసిందాని ప్రకారం అతను వెంటనే చనిపోలేదు, కాసేపు కొన ప్రాణాలతో ఉన్నాడు. అంబులెన్స్ రాకముందే చనిపోయాడు. బహుశా చుట్టూ చేరినవాళ్ళు అతని శరీరాన్ని– చెదిరి సున్నితంగా మారి, రక్తమంటిన శరీరాన్ని– ఏం చేయాలో, ఎక్కడకు కదపాలో ఇంకా నిర్ణయించుకోకుండానే చనిపోయి వుంటాడు. దాదాపు ఇదే టైముకి. ఇప్పుడు ఈ రోడ్డు మీద పెద్ద ట్రాఫిక్ ఉండదు, జనం మసిలేదీ తక్కువే. అతని చుట్టూ చేరినవాళ్ళలో ఈ బడ్డీ కొట్టతనూ, ఈ కొట్టు కస్టమర్లూ తప్పితే ఇంకెవరూ ఉండుండరు. కొట్టు దగ్గర కూల్ డ్రింక్ తాగుతున్న ఈ మనిషి సీసా అలాగే వదిలేసి పరిగెత్తేవాడా, లేక జిహ్వ చాపల్యం కొద్దీ జరిగింది చూసాకా కూడా మిగిలిన రెండు గుక్కలూ తాగేసి పరిగెత్తేవాడా. టిప్పరూ, స్కూటరూ గుద్దుకున్న శబ్దానికి ఆ చెత్తకుండీ కెలుకుతున్న వీధికుక్క తోకను కాళ్ళ మధ్య దోపుకుని పారిపోయేది. కరెంటు తీగల మీది పావురాలు ఎగిరిపోయేవి. ఎన్నింటినో చూసి కవిత్వం చేసిన అతని కళ్ళు ఆఖరిసారి చూసే దృశ్యం ఇదని రాసిపెట్టి ఉంది. చావు లాక్కొని పోయే ఆఖరి క్షణాల్లో మొత్తం జీవితం అంతా బొమ్మలాటలా కళ్ళ ముందు మెదులుతుందని అంటారు. ఆ మాట నేను నమ్మను. గతాన్ని నెమరు వేసుకోవటం అన్నది తీరుబడి సమయాల్లో చేసే పని. చావంత పెద్ద ప్రయాణం ముందు పెట్టుకుని ఎవరూ ఆ పని చేయరు. అదే స్థితిలో నేనుంటే బహుశా నా వెనక మిగిలిపోయే భార్యాబిడ్డల పరిస్థితి తల్చుకుంటాను, వాళ్ళు బావుండాలని దేవుడ్ని ప్రార్థిస్తాను. అతను మాత్రం ఖచ్చితంగా ప్రార్థించి ఉండడు. అతనికి పెళ్ళాం పిల్లలు లేకపోవటం ఒక్కటే కాదు దానికి కారణం. తన జీవితం ఆధారంగా రాసుకున్నాడనిపించిన మొదటి నవలలో (“తప్పిపోయిన దారులు”) అతను దేవుడి మీద నమ్మకం ఎలా పోయిందో వివరంగా రాసుకున్నాడు. అతనికి పదిహేను పదహారేళ్ళొచ్చే సరికే అబ్బిన నాస్తికత్వానికి సైన్సూ హేతువూ కారణాలు కాదు. ఆ వయస్సులో అతని బుద్ధి ఉన్నట్టుండి హద్దుల్ని ఒప్పుకోవటం మానేసింది. పటాల్లో దేవతల బొమ్మల గురించి పాడు ఆలోచనలు చేయటం, మంత్రాల మధ్యలో బూతులు చొప్పించటం మొదలుపెట్టింది. ఈ ఆలోచనల తిరుగుబాటు అప్పటిదాకా పెద్దల ఒరవడిని అమాయకంగా దిద్దుతూ వచ్చిన అతని మనస్సుని యాతన పెట్టింది. వాటి నుంచి బయటపడటానికి హేతువు కాకతాళీయంగా అందించిన నాస్తికత్వాన్ని ఒక ఆసరాగా అందిపుచ్చుకొన్నాడంతే. ఈ ఆపద్ధర్మ నాస్తికత్వం సహజంగానే ఎక్కువ కాలం మిగల్లేదు. అలాగని అతని మనసు తిరిగి భక్తి వైపుకీ మరల లేదు (“సొంతిల్లు కూలిపోయింది” అని రాసుకున్నాడు). చివరికి ఏదో మానవాతీతాన్ని నమ్ముతూనే, దాన్ని రాళ్ళ చుట్టూ జరిగే తంతుతో పోల్చుకోలేని స్థితికి వచ్చి ఆగాడు. కానీ మనసులో తిరిగి వెళ్ళలేని పాత భక్తి పట్ల ఒకలాంటి ఎడబాటు మాత్రం మిగిలిపోయింది. కాలేజీలో తనతో పాటు నాస్తికత్వాన్ని జెండాలాగా తిప్పుకు మోసిన ఒక స్నేహితుడు జీవితంలో తర్వాత ఏవో ఒడిదుడుకులు రాగానే చప్పున ఆధ్యాత్మికతకు లోబడిపోయాడనీ, ఇపుడు ప్రవచనాలకు కూడా హాజరవుతాడనీ తెలిసినపుడు, అతను ఒక స్నేహితుడ్ని మౌఢ్యానికి కోల్పోయానే అని బాధపడుతూనే, తనకు పూర్తిగా మూసుకుపోయిన ఆధ్యాత్మికత అనే తలుపుల్లోంచి లోపలికి పిలుపందుకున్న స్నేహితుడ్ని చూసి ఈర్ష్య కూడా పడతాడు. అలాంటి మనిషి ఆఖరి క్షణాల్ని ప్రార్థన కోసం ఖర్చుపెట్టి ఉండడు. నమ్మేందుకు ఒక రాయిని పోగొట్టుకుని, తప్పిపోయిన దారుల్లో అనాథలా దేవులాడి, ఎప్పటికో ఆ రాయి స్థానంలో సృష్టి సకలాన్నీ తెచ్చి నిలుపుకున్నాడని అతను తన నవలలోని హీరో గురించి రాసుకున్నాడు (అతనూ రచయితే): “అతని మనసులో పెద్ద మాటలూ, పెద్ద అభిప్రాయాలూ చెరిగిపోయాయి. జీవితం తడుముకుని తల మోదుకోవాల్సిన మొండి శిల కాదనీ, ఏరుకునేందుకు ఒడ్డున గులకరాళ్ళను విడిచిపెడుతూ పారే ఏటి ప్రవాహమనీ అనిపించింది. మంచనీ చెడనీ, అందమనీ వికారమనీ, సంతోషమనీ విచారమనీ ఇలా భాషతో వేరుచేయటం పోయింది. ప్రకృతి వైనాలూ, కాలం లోంచి సృష్టి నడక, మనుషుల స్వభావాలూ చర్యలూ బంధాలూ నిర్మాణాలూ... వీటి పైన అభిప్రాయపడటం కాదు, ఇష్టపడటమో అసహ్యించుకోవటమో కాదు, ఇవన్నీ ప్రార్థనలో నమ్మకం బరువుతో కంపించే ఉచ్చారణల్లా మారాయి. ఇది అతను పాటించే ఒక మతమైంది” అని ఉంటాయి ఆ నవల్లో వాక్యాలు. అందుకనే చావు ఎలాగూ ఖాయమని తెలిసిన ఆ క్షణాల్లో అతను పెద్ద పెద్ద విషయాల గురించి ఆలోచించి ఉండడు. గుద్ది వెళిపోతున్న టిప్పర్ వెనక రాసి ఉన్న మాటల్నీ, తన వైపు పరిగెడుతూ వస్తున్న పాదాల్నీ, రోడ్డు మీద కొమ్మల కదిలే నీడల్నీ, ఎగురుతున్న పావురాల్నీ, ఆ పైన మబ్బుల్నీ మాత్రమే మనసులోకి తీసుకుని ఉంటాడు. బహుశా జీవం ఆర్చుకుపోతున్న అతని మెదడు కణజాలంలో ఏదో పదం, ఏదో వాక్యం, అతనికే చెల్లిన ఏదో రూపకం తళుక్కుమనివున్నా ఆశ్చర్యం లేదు. అతని చావు నన్నిలా కదిలించటానికి కారణం కూడా ఆ రూపకాలే. నాకు ఎంతో దగ్గరగా అనిపించిన ఆ వాక్యాల్ని నిర్మించగలిగే చేవ వున్న ఆ మనసు అర్ధాంతరంగా ఎక్కడా లేకుండా మాయమైపోయిందే అని. అతని మీద వచ్చిన రెండు నివాళి వ్యాసాల్లో కూడా “సమాజ శ్రేయస్సుని కాంక్షించిన అతని కలం ఆగిపోవటం పెద్ద లోటు” లాంటివే రాసారు. అతడ్నించి ఇక అందబోని రూపకాల గురించీ, అతనికే చెందిన చూపు గురించీ ఎవరూ బాధ పడలేదు. వాక్యం వాక్యం ఆగి చదువుకున్నవాడిగా నాకు ఆ చూపు విలువ తెలుసు. అతనికీ తెలిసే ఉంటుంది. తను మాత్రమే చెప్పగలిగే కథలేవో చెప్పకుండానే వెళ్ళిపోతున్నానని.

ఎంత ఒంటరిగా అనిపించి ఉంటుంది! ఇళ్ళల్లో, ఆసుపత్రుల్లో తెలిసినవాళ్ళు చుట్టూ ఉండగా చనిపోవటం వేరు, ఇలా రోడ్డు మీద ఒంటరిగా చనిపోవటం వేరు. కానీ ఇంకోలా ఆలోచిస్తే, చనిపోవటం అంటేనే ఆ చనిపోయే ఒక్కడూ ఒంటరిగా చేయాల్సిన పని. ఎలాగూ ఎవరూ వచ్చి సాయం చేయలేనప్పుడు, ఆ క్షణాన పక్కన ఉన్నవాళ్ళు తెలిసినవాళ్ళయితే ఏంటి, తెలియనివాళ్లైతే ఏంటి. తెలిసినా తెలియకపోయినా, ఆ ఆఖరి ప్రయాణంలో చెంత నుండి సాగనంపే ఆఖరి మనుషులు వాళ్ళే కాబట్టి, వాళ్ళ మీద ఎంతో కొంత ఆత్మీయత కలుగుతుందేమో. ఆ క్షణాన అదే కుటుంబం అనిపిస్తుందేమో. ఏం చేయలేక అతని చావుని ఎదురుచూస్తూ చుట్టూ నిలబడిన వాళ్ళని అతను అలాగే ఆత్మీయంగా అనుకుని ఉంటాడా…. ఒకవేళ పారిపోయిన టిప్పర్ డ్రైవరే అక్కడ వచ్చి నిలబడినా….

బడ్డీ కొట్టు దగ్గర ఒక టీ పుచ్చుకొని, సిగరెట్ తాగి, బండి స్టార్ట్ చేశాను. రోడ్డు మీద రాసుకుంటూ పోయే ట్రాఫిక్ మధ్య వెళ్తున్నప్పుడు, ఒకర్నించి ఒకరికి పొంచివుండే ప్రమాదాలకు వెంట్రుకవాసిలో మాత్రమే దూరంగా తప్పుకుపోతున్నప్పుడు, ఒకసారి చుట్టూ తెప్పరిల్లి చూసుకున్నాను: నన్ను దాటుకొని బైక్ మీద పోయిన కుర్రాడూ, నా వెనక హార్న్ కొడుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవరూ, వారగా ఫుట్పాత్ మీద చెరుకు రసం అమ్మే ముసలాయనా, ఈ పక్క కార్లో కనిపిస్తున్న తండ్రీ కూతుళ్ళూ… ఈ రోడ్డు మీద వెళ్తున్నంత సేపూ ఇదో క్షణక్షణం సభ్యుల్ని మార్చుకునే తాత్కాలిక కుటుంబం కదా అనీ, వీళ్ళలో ఎవరైనా సరే నాకు అత్యంత ఆత్మీయులయ్యే అవకాశం ఉంది కదా అనీ….

Published in : vaakili.com, June 2017 issue. 

0 స్పందనలు:

మీ మాట...