July 23, 2018

రాబర్ట్ వాల్సర్ (1878-1956): రోజువారీ కవిత్వం

 ‘‘రాబర్ట్‌ వాల్సర్‌కి ఒక లక్షమంది పాఠకులు గనక ఉన్నట్టయితే ఈ ప్రపంచం ఎంతో బాగుపడేది,’’ అంటాడు ‘సిద్ధార్థ’ నవలా రచయిత హెర్మెన్‌ హెస్సే. అలాగని రాబర్ట్‌ వాల్సర్‌ కలంపట్టి ప్రపంచం బాగు కోసం పూనుకున్నవాడేం కాదు. బహుశా ఆయన్ని చదివి ఆనందించగలిగే పాఠకులు ఆయనలాగే ప్రపంచాన్ని పెద్ద ఫిర్యాదులేం లేకుండా, దాని దయను పెద్ద ఋజువులేం లేకున్నా నమ్ముతూ, దాన్ని మరీ గంభీర దృష్టితో కాకుండా పిల్లల తుంటరితనంతోను కుతూహలం తోను చూడగలరని హెర్మెన్‌ హెస్సే భావం అయ్యుండొచ్చు.

రాబర్ట్‌ వాల్సర్‌ (Robert Walser) స్విట్జర్లాండ్‌లో బెర్న్‌ అనే ప్రాంతంలో 1878లో పుట్టాడు. ఎనిమిదిమంది పిల్లల్లో ఒకడు. నాన్నకి ఒక స్టేషనరీ షాపు ఉంది. పదిహేనేళ్ళకే స్కూలు మానేసి చిన్నాచితకా ఉద్యోగాలు చేసాడు. కవిత్వం రాయటం మొదలుపెట్టాడు. 27 ఏళ్ళ వయస్సులో బెర్లిన్‌లో చిత్రకారుడిగా పనిచేస్తున్న అన్నయ్య దగ్గరికి వెళ్ళాడు. అక్కడ సేవకుల (బట్లర్‌) ఉద్యోగాలకోసం తర్ఫీదు ఇచ్చే స్కూల్లో చేరాడు. ఒక చోట బట్లర్‌గా పనిచేసాడు కూడా. కానీ రచనల ద్వారా వస్తున్న సంపాదనతో బతికేయవచ్చనిపించి ఆ పని మానేసాడు. విరివిగా చిన్నచిన్న వచన ఖండికలు రాసాడు. మూడు నవలలు రాసాడు. చాలా పేరూ వచ్చింది. అయితే నగర జీవితంలో కుదురుకోలేకపోయాడు. నిజానికి బెర్లిన్‌లో ఉండుంటే అక్కడి మేధావుల సర్కిల్‌లోకి సాదరంగానే వెళ్ళగలిగేవాడు, స్థాయికి తగ్గ పనేదో చేస్తూ బానే బతకగలిగేవాడు. కానీ- ఏమాత్రం సాహిత్య వాతావరణం లేని సొంత ఊళ్ళో తను జన్మతహ ఏ వర్గానికి చెందుతాడో వారి మధ్యనే ఉండటానికి ఇష్టపడ్డాడు. కొన్నాళ్ళు అక్కతోపాటు ఉన్నాడు. తర్వాత ఒంటరిగా చిన్న చిన్న అద్దె గదుల్లో బతకటం మొదలుపెట్టాడు.

మరోపక్క అతని రచనలకి డిమాండ్‌ తగ్గుతూ వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధకాలంలోనూ, ఆ తర్వాతా- ప్రపంచాన్ని కవితాత్మక ధోరణిలో పరికించే వాల్సర్‌ తరహా రచనలకు ఆదరణ తగ్గింది. అతను మాత్రం రాయటం మానలేదు. తరుగుతున్న సంపాదనకు తగ్గట్టు ఖర్చులూ తగ్గించుకున్నాడు. కానీ సరైన దుస్తులు కూడా వేసుకోలేని స్థితికి వచ్చాకా, చుట్టుప్రక్కలవాళ్ళ చూపులు, ఈసడింపులు భరించటం కష్టమైంది. ఒక నవలలో చుట్టూ ఉన్న సమాజంలో కుదురుకోలేకపోతున్న ఒక పాత్ర గురించి వాల్సర్‌ ఇలా రాస్తాడు: ‘‘అతను ఎప్పుడూ మంద తప్పిన మేకపిల్లలా ఉండేవాడు. జనం బతకటం ఎలాగో నేర్పిద్దామని అతన్ని బాధ పెట్టేవారు. దానికి తగ్గట్టే ఏ రక్షణా లేనట్టు ఉండేవాడు. చెట్టు మీద మిగతా ఆకులకన్నా వేరేగా కనిపిస్తుందన్న కారణంగా పిల్లాడు కర్రతో కొట్టి తెంపేసే చిన్న ఆకులా ఉండేవాడు. ఇంకోలా చెప్పాలంటే, రండి నన్ను బాధపెట్టండి పిలుస్తున్నట్టు.’’

గడవటం అంతకంతకూ కష్టం కావటంతో ఉద్యోగంలో చేరాడు కానీ ఎన్నాళ్ళో నిలుపుకోలేకపోయాడు. బాగా తాగేవాడు. రాత్రుళ్ళు నిద్రపట్టేది కాదు. చెవుల్లో ఎవరో మాట్లాడుతున్నట్టు, అరుస్తున్నట్టు వినిపించటం మొదలైంది. పిడుగులు పడుతున్నట్టు, ఎవరో పీక నులిమేస్తున్నట్టు భ్రమలు పెరిగాయి. ఆత్మహత్యకూ విఫలయత్నం చేశాడు (‘‘నాకు కనీసం ఉరితాడు పేనుకోవటం కూడా చేతకాదు’’). చివరకు తన్ను తాను సంభాళించుకునే స్థితిలో లేడనిపించింది. అక్క సలహాతో 1928లో యాభయ్యేళ్ళ వయసులో ఒక మానసిక చికిత్సాలయంలో చేరాడు.

అదిమొదలు, అలాంటి చికిత్సాలయాల్లోనే దాదాపు పాతికేళ్ళ పాటు, చనిపోయేవరకూ జీవితాన్ని గడిపేసాడు. నిజంగా అతని మతి చెడిందా లేదా అన్నది ఇప్పటికీ ఎవరికీ నికరంగా తెలీదు. ఆయన ఆ తర్వాత రాసిన రచనల్లో అందుకు సూచలేం కనపడవు. డాక్టర్లు కూడా ఒక సందర్భంలో కొన్నాళ్ళు బయట గడిపి చూడమని సలహా ఇచ్చారు. కానీ తన ఇష్టాయిష్టాల్తో నిమిత్తం లేకుండా ఒక పద్ధతి ప్రకారం సాగిపోయే ఈ జీవితమే వాల్సర్‌కి నచ్చింది. ‘‘ఆసుపత్రిలో నాకు కావాల్సిన నిశ్శబ్దం దొరుకుతోంది. ఉన్నా లేనట్టే ఎవరికీ కనిపించకుండా మాయమైపోగలుగుతున్నాను’’ అని చెప్పుకున్నాడు.

ఆసుపత్రికి వచ్చే వంటసరుకుల్ని సర్దటం, ఉత్తరాల్ని విడదీయటం, కాయితం సంచుల్ని తయారు చేయటంలాంటి పనులుచేస్తూ ఉండేవాడు. ఇవి లేనప్పుడు బయట నడవటానికి పోయేవాడు. నడవటం అంటే వాల్సర్‌కి ఎంత పిచ్చి ఇష్టమంటే, ఊళ్ళకు ఊళ్ళు దాటి అలా నడుస్తూనే ఉండేవాడు. 1956లో క్రిస్మస్‌ రోజున ఇలాగే బయల్దేరి నడుస్తూనే మంచులో కుప్పకూలిపోయాడు. అప్పుడు పోలీసులు తీసిన ఫోటోలు కొన్ని ఆయన ఆఖరి క్షణాల్ని చూపెడతాయి. మంచులో కొంతదూరం సాగిన ఒక జత పాదముద్రల చివర వాల్సర్‌ శవం ఉంటుంది.

వాల్సర్‌ రచనల్ని అభిమానించిన, ఆయన శైలి నుంచి ఎంతో కొంత అందిపుచ్చుకున్న మరో ప్రసిద్ధ జర్మన్‌ రచయిత ఫ్రాంజ్‌ కాఫ్కా చనిపోయాకా తన రచనల్ని కాల్చేయమని స్నేహితుడికి చెప్పాడు. అయినా స్నేహితుడు కాల్చడనీ, తన రచనలు బయటి ప్రపంచాన్ని ఎలాగో చేరతాయనీ ఆయనకు ఏమూలో నమ్మకం వుండేవుంటుంది. కానీ అసలు బయట ఎవరైనా చదువుతారన్న స్పృహలేకుండా అచ్చంగా తన కోసమే రాసుకున్న రచయితలు ఎవరన్నా ఉంటే వాల్సర్‌ ఆ అరుదైన సమూహంలో ఒకడని అనిపిస్తుంది. ఎందుకంటే పిచ్చాసుపత్రిలో చేరాకా కూడా వాల్సర్‌ రాస్తూనే ఉన్నాడు. పెన్ను వాడటం మానేసి త్వరగా చెరిగిపోయే పెన్సిల్‌తో రాయటం మొదలుపెట్టాడు. ఆలోచనతో పోటీపడి వేగంగా రాసేందుకు తనే ఒక సొంత షార్ట్‌హేండ్‌ శైలిని తయారు చేసుకున్నాడు. ఆయన చనిపోయాకా ఇలా క్లుప్తం చేసిన పదాలతో, చిన్ని చిన్ని అక్షరాల్లో ఇరికించి రాసిన వందల కాయితాలు బయటపడ్డాయి. ముప్ఫైపేజీల్లో ఒక నవల రాసేడంటే ఎంత ఇరికించి రాసేవాడో అర్థం చేసుకోవచ్చు. ఈ రాతనీ, ఆయన షార్ట్‌హాండ్‌ శైలినీ డీకోడ్‌ చేయటానికే పబ్లిషర్స్‌కు చాలా ఏళ్ళు పట్టింది. వీటిని ‘మైక్రోస్ర్కిప్ట్స్‌’ పేరిట ఈమధ్యనే ప్రచురించారు.

వాల్సర్‌ జీవితమంతా దిగులుతోవలోనే గడిచినా, ఆయనకి ప్రపంచంపై అక్కసేమీ ఉన్నట్టు రచనల్లో కనిపించదు. పైగా అదంటే ఎంత ఇష్టమంటే, రాన్రానూ అందులోంచి ఒక కథ పుట్టించాల్సి రావటం కూడా దాన్ని నేరుగా కావలించుకునేందుకు ఒక అడ్డమే అయింది. కథల మీద తన అయిష్టత గురించి ఇలా చెప్పుకొచ్చాడు: ‘‘కథని బాగా అల్లటంలో ఆరితేరినవాళ్ళన్నా, ప్రపంచంలో ఎవర్నైనా సరే పాత్రలుగా తీసేసుకోగలిగే రచయితలన్నా నేను చప్పున దూరం జరుగుతాను. రోజువారీ విషయాల్ని మచ్చిక చేసుకుంటే చాలు, బోలెడు కవిత్వాన్ని విరజిమ్మే అందమూ, ఐశ్వరమూ వాటికి ఉన్నాయి.’’ వాల్సర్‌ వచన ఖండికలు చాలావరకూ అటు కథా కాదు, ఇటు వ్యాసమూ కాదన్నట్టు సాగుతాయి. బయోగ్రాఫికల్‌ స్కెచెస్‌ అనవచ్చు. ఎవరో తీరుబడిగా నడుస్తూ కాలక్షేపం కోసం మనసులో కల్పించుకునే ఉబుసుపోని ఊహలన్నింటినీ అప్పటికప్పుడు వాక్యాల్లోకి తర్జుమా చేసినట్టు ఉంటాయవి. కుతూహలంతో మెరిసే రెండు కళ్ళు ప్రపంచాన్ని ఆత్మీయంగా దర్శిస్తున్నట్టు ప్రతి వాక్యంలోనూ తెలుస్తుంది.

(ఆంధ్ర జ్యోతి వివిధలో)


0 స్పందనలు:

మీ మాట...