January 16, 2019

పొద్దున్నే హడావిడి

బాబిగాడికి లెట్రిన్‌లో ఎక్కువ సేపు కూర్చోవటమంటే ఇష్టం. అమ్మా నాన్నా ఎన్నిసార్లు తిట్టినా పద్ధతి మారలేదు. ఏవో ఊహల్లోపడి ముడ్డెండిపోయేదాకా అలాగే కూర్చుంటాడు. రెండ్రోజులుగా వర్షం పడి ఆ రోజే కాస్త ఆగింది. లోపల మటుకు వెచ్చగానే ఉంది. అప్పటికే బాబిగాడు బకెట్‍లో చెంబుతో ఎన్ని ఆటలు ఆడొచ్చో అన్నీ ఆడేశాడు. కాసేపు బకెట్ అంచు మీద చేతివేళ్ళని మనిషిలాగ నడిపించాడు. కాసేపు తడివేలితో ఎర్రటి గచ్చు మీద కార్ల బొమ్మలు గీశాడు, వాటి చేత ఏక్సిడెంట్లు చేయించి మంటలు లేపాడు. తర్వాత గోడ పగుల్లోంచి బయటికి పాకిన గాజుపురుగు ఇటువైపొస్తుందేమోనని భయపడ్డాడు. అది మళ్ళీ పగుల్లోకి వెళ్ళిపోయేదాకా దాన్నే చూస్తూ కూర్చున్నాడు, దగ్గరకొస్తే చెంబుతో నీళ్ళు కొట్టేద్దామని.

బయట దొడ్లో అంట్లు బోర్లిస్తున్న చప్పుడుతోపాటు అమ్మ గొంతు గట్టిగా వినిపించింది, “ఒరే వచ్చావా లేదా బయటికి? అంత సేపేవిట్రా లోపల. చీడ అలవాట్లూ నువ్వూని!”

ఇక తప్పదన్నట్టు చెంబు బకెట్‌లో ముంచబోయాడు. అప్పుడే బకెట్ వెనకాల నుంచి చిన్న నత్త వస్తూ కనిపించింది. నత్తని చూడటం అదే మొదటిసారి వాడికి. వెంటనే తమ్ముడ్ని పిలవాలనిపించింది గానీ ఉన్న చోటు గుర్తొచ్చింది. కొద్దిగా ముందుకు వొంగి దాని వైపు చూసాడు. చిన్న జిగురు బొమ్మలాగ వుండి మెల్లగా కదుల్తున్న ఆ జీవిని ఇదివరకు చూసింది పుస్తకంలోనే. అది తల మీద రెండు కొమ్ముల్నీ వొయ్యారంగా అటూయిటూ తిప్పుతుంటే భలే ఉంది. ముట్టుకోవాలనిపించింది గానీ వికారంగా భయంగా కూడా అనిపించింది. చూపుడు వేలు నెమ్మదిగా దానివైపు తోసి పైన పెంకుని ముట్టుకున్నాడు. నత్త చప్పున కొమ్ములు లోపలికి లాక్కుని దగ్గరగా ముడుచుకుంది. బాబిగాడు నవ్వుతూ మోకాళ్ళని కావలించుకున్నాడు. అది మళ్ళీ విచ్చుకున్నాక ఈసారి ఇంకాస్త ధైర్యం చేసి తిన్నగా కొమ్ముల్నే ముట్టుకున్నాడు. వొళ్ళంతా జలదరించింది. చేయి బకెట్లో కడిగేసుకున్నాడు.

బయట ఎవరో కుళాయి విప్పిన శబ్దం వినిపించింది. బాబిగాడు కిందకి వొంగి రేకు తలుపు కింద సందులోంచి బయటికి చూసాడు. నాన్న కుళాయి దగ్గర కాళ్ళు కడుక్కుంటున్నాడు. తర్వాత దొడ్డిగుమ్మం దాకా వెళ్ళి, చెప్పులు విప్పి, మూడు మెట్లెక్కి, గోని మీద కాళ్ళు తుడుచుకుని లోపలికి వెళ్ళాడు. తమ్ముడు లోపలి గదుల్లోంచి అరుస్తూ రావటం వినిపించింది. అమ్మ “ఏం తెచ్చారు?” అని అడుగుతోంది.

“అబ్బా బజారంతా బురద బురద! చేపలు బాలేవే. రేటు కూడా ఎక్కువ చెప్తున్నాడు. చికెన్ తెచ్చాను” అంటున్నాడు నాన్న.

తమ్ముడు “లాలీపాప్ లాలీపాప్ లాలీపాప్!” అని అరుస్తున్నాడు.

“ఉండరా, చొక్కా అయినా విప్పనీ…. అన్నయ్యేడీ” అనడిగాడు నాన్న.

అమ్మ చెప్పింది, “దొడ్డిక్కూచుంటే ఓ పట్టాన రాడుగా ఆయన. ఏం పుణుక్కుంటాడో మరి లోపల అంతసేపు. అన్నీ ఆళ్ళ మేనమామ బుద్ధులే!”

“చిన్నోడా, అన్నయ్యని రమ్మను లాలీపాప్ తింటాడు,” అన్నాడు నాన్న.

దానికి తమ్ముడు లోపల్నించి ఏమన్నాడో సరిగ్గా వినపడలేదు.

ఇలా అందరూ వాడి గురించి మాట్లాడుకుంటుంటే అక్కడ లేకుండా వినటం బావుంది బాబిగాడికి. కానీ నాన్న బజారుకు వెళ్ళొచ్చినంతసేపూ తను ఇక్కడే ఉన్నాడని తెలిస్తే తర్వాత తిడతాడు. ఇదివరకే ఒకసారి తిట్టేడు కూడా. మళ్లా ఇదే విషయం మీద తిట్టించుకోవాలంటే సిగ్గుగా ఉంటుంది. చాటుగా బైటికెళ్ళిపోయి, లెట్రిన్‌లోంచి వచ్చి చాలా సేపయినట్టుగా నాన్న ముందు నటిద్దామని ఐడియా వచ్చింది బాబిగాడికి. పెద్ద చప్పుడు రాకుండా, అసలు నత్త వంక చూడకుండా, కడిగేసుకున్నాడు. కుళాయి గొట్టం వెనక దోపిన నిక్కరు తీసి తొడుక్కున్నాడు. తుప్పుపట్టిన తలుపు కొక్కెం కొంచె కొంచెంగా లాగాడు. వాడి మనసులోకి ఒక ప్లాను వచ్చింది: ఇంటి పక్క సందులోంచి ఇంటి ముందువైపుకి వెళ్ళాలి, అక్కడ వీధి గేటుని అందరికీ వినపడేట్టు గట్టిగా మూసి అప్పటిదాకా పక్కింట్లో ఆడుకుని వస్తున్నట్టుగా కటకటాల్లోంచి లోపలికి రావాలి, నాన్న టీ తీసుకుని పేపరు చదవటానికి కటకటాల్లోకి రాకముందే ఇదంతా జరిగిపోవాలి.

తలుపుతీసి బయటికి రాగానే వొంటి మీదకి చల్లగా గాలి తగిలింది. వొంటి మీద చొక్కా లేదని గుర్తొచ్చింది. చొక్కాలేకుండా పక్కింటికి వెళ్ళాడంటే ఎవరూ నమ్మరు. వెనకగదిలో తలుపుపక్కనున్న పెద్ద చెక్కపెట్టెలో అమ్మ మాసిన బట్టలు వేస్తుంది. వాటిల్లోంచి ఏదన్నా చొక్కా తీసుకోవచ్చు.

అప్పుడప్పుడే ఎండకి తడారుతున్న నాపరాతి నేల మీద నడుస్తూ బాబిగాడు ఇంటి గోడ వైపు వెళ్ళాడు. వంటగదిలోంచి అమ్మ పని చేస్తున్న శబ్దాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అమ్మ కిటికీ లోంచి చూస్తే కనిపించకుండా ఉంటంకోసం- కిటికీ కిందగా వొంగొని నడిచాడు. ఒక కన్ను మాత్రమే దొడ్డితలుపు అంచుని దాటించి లోపలికి తొంగిచూశాడు. వెనక గదిలోంచి హాలు, కటకటాల గది, వీధి గేటు దాకా ఖాళీగా కనిపిస్తున్నాయి. నాన్నా తమ్ముడూ పడకగదిలో ఉన్నట్టున్నారు. బాబిగాడు మూడు మెట్లెక్కి, నెమ్మదిగా వెనక గదిలోకి వచ్చాడు. మాసిన బట్టల పెట్టె వంటగది గుమ్మం పక్కన పొడవుగా బాబిగాడంత ఎత్తు ఉంది. దాని దగ్గరకు వెళ్ళి మెల్లగా మూత తీయబోయాడు.

“ఏవే, టీ పట్టుకొచ్చావా” అని లోపల్నుంచి నాన్న మాట వినపడగానే చప్పున మూత మూసేసి, బట్టలపెట్టి పక్కన గోడ మూలన దాక్కున్నాడు. దొడ్డి తలుపుని తనవైపు లాక్కున్నాడు. ఇప్పుడు బట్టలపెట్టెకీ, దొడ్డి తలుపుకీ, గోడమూలకీ మధ్యన ఒక బుల్లిగదిలా ఉన్న మరుగులో బాబిగాడు ఎవ్వరికీ కనిపించడు. “ఆ వస్తున్నా” అంది అమ్మ వంటగదిలోంచి.

బాబిగాడికి వొళ్ళంతా వొణికింది. చేతుల్తో నోరు మూసేసుకుని నవ్వుకున్నాడు. ఫ్రెండ్స్‌తో పార్కులో ఆడిన దొంగా పోలీసాట గుర్తొచ్చింది. అందులో పోలీస్ పదంకెలు లెక్కపెట్టి వెతుక్కుంటా వస్తున్నప్పుడు ఇలాగే అనిపిస్తుంది. ఇది అంతకన్నా బావుంది. ఎందుకంటే అక్కడైతే దొరికిపోతే వెళ్ళి పదంకెలు లెక్కపెట్టాలంతే. ఇక్కడ మాత్రం తిడతారు. తలుపు అంచుకీ, బట్టలపెట్టె అంచుకీ మధ్యన సందులోంచి గోడకున్న కేలండరు మీద లక్ష్మీదేవి బొమ్మ కన్పిస్తోంది. ఆవిడక్కూడా కనపడకూడదన్నట్టు ఇంకాస్త వెనక్కి సర్దుకోబోయాడు. వీపు తగిలి వెనకున్న చీపురుకట్ట తలుపు మీద పడింది. కుచ్చు వైపే పడటం వల్ల చిన్నగానే చప్పుడయ్యింది. అమ్మ నడుస్తున్నట్టు కాలిపట్టీలు వినపడ్డాయి. బాబిగాడు కాసేపు ఊపిరి కూడా ఆపేసి విన్నాడు. కానీ పట్టీలు పడగ్గది వైపు వెళ్ళిపోయాయి.

“ఏడే పెద్దోడేడీ?” అన్నాడు నాన్న.

“అవునింకా రాడేంటీ?” అంది అమ్మ.

ఈసారి పట్టీలు ఇటువైపే వస్తున్నాయి. బాబిగాడు గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. పట్టీలు దొడ్లోకి వెళ్ళాయి. “రేయ్ బాబీ?” అని గట్టిగా వినపడింది. బాబిగాడి ఊహలో దొడ్లో అమ్మ తిరగటం కనిపించింది. “ఏంటిది చిత్రం… పిల్లాడేడీ!” ఈసారి అమ్మ గొంతు కాస్త గాభరాగా ఉంది. పట్టీలు అటూయిటూ తెగ తిరుగుతున్నాయి. “రేయ్ బాబీ” అని ఈసారి ఇంకా గట్టిగా వినిపించింది. బాబిగాడు ఒకే ధ్యాసగా వింటున్నాడు. పట్టీలు మూడు మెట్లెక్కి మళ్ళీ లోపలికి వచ్చాయి. తలుపు సందులోంచి అమ్మ చీర దాటి వెళ్ళటం కనిపించింది. కాసేపటికి కటకటాల తలుపు తీయటం వినిపించింది. “పిల్లాడు ఎక్కడా లేడండీ,” అంటోంది అమ్మ గొంతు. “అదేవిటే?”అంటోంది నాన్న గొంతు పడగ్గదిలోంచి.

బాబిగాడికి పొడిగా గుటకలు పడుతున్నాయి. బయటికెళ్ళి వాళ్ళ ముందు నిలబడగలిగే అవకాశం కొద్దికొద్దిగా దూరం జరుగుతున్నట్టు, వాళ్ళందరి నుంచీ వేరయిపోయి ఒక పెద్ద గొయ్యిలో కూరుకుపోతున్నట్టు ఉంది.

అమ్మ గొంతు ఈసారి పడగ్గదిలోంచి వినపడింది. “ఏమో మరి, దొడ్లో లేడు, సందులోనూ లేడు, బయట గచ్చు కింద కూడా చూసాను. లెట్రిన్ లోనే ఉన్నాడనుకున్నాను ఇప్పటిదాకానూ!”

“రేయ్ చిన్నోడా, అన్నయ్యేడిరా?” అంది నాన్న గొంతు.

“తెలియట్లే డాడీ,” అనేసి తమ్ముడు మళ్ళీ పులిలాగా గాండ్రిస్తున్నాడు. వాడికి ఇంకా సరిగ్గా మాటలు రాలేదు.

బాబిగాడికి బయటికి వచ్చేయాలని ఉంది, కానీ ఉన్న చోటునుంచి కదల్లేనట్టుగానూ ఉంది.

“ఏంటి కింద చూస్తున్నారు…?”

“ఒకసారిలాగే కదా మంచం కింద దూరి నిద్రపోయాడు, వెధవ”

“ఇంట్లో లేకపోతే మరి… బైటేమో వేసిన గేటు వేసినట్టే ఉంది ఏమైపోయాడు!”

“ఎంతసేపూ నీ పనులూ నీ గొడవే కాని పిల్లల మీద ధ్యాస ఉండదే బొత్తిగా…”

“నన్నంటున్నారా! నా అంట్ల పనిలో నేనున్నాను. పిల్లాడు వెళ్ళినవాడు అక్కడే ఉంటాడనుకుంటా గానీ–”

“అసలు లోపలికి వెళ్ళటం చూసావా?”

“–ఏమోనండీ తలుపు మూసుకోవటం వినపడింది వంటింట్లోంచి. మీరేమో బయటికి వెళ్లారు. చిన్నోడా చెప్పకుండా వెళ్ళడు. ఇంక వాడే అనుకున్నాను…”

“ఏదీ సరిగ్గా చెప్పవే నువ్వు!”

ఈసారి నాన్న లుంగీ తలుపు సందుని దాటి దొడ్డేంపుకి వెళ్ళటం కనిపించింది.

కాసేపు దొడ్లోంచి అమ్మా నాన్నలిద్దరూ “బాబీ!”, “రేయ్ నాన్నా!” అంటూ అరిచారు. లెట్రిన్, బాత్రూమ్ తలుపులు తెరిచారు మూసారు. తమ్ముడు కూడా వెనకాల వచ్చి “బాబీ బాబీ బాబీ!” అని సరదాగా అరుస్తున్నాడు.

“పిల్లాడు మీ ఇంటికేవన్నా వచ్చాడా వదినా?”

“లేదమ్మా, రాలేదు. మా వాళ్ళిద్దరూ కూడా ఇంట్లో లేరుగా. వాళ్ళ డాడీ బైటికి తీసికెళ్ళేరు.”

లోపలికి వెళ్ళినప్పుడు నాన్న అడుగులు గట్టిగా పడుతున్నాయి. అమ్మ పట్టీల చప్పుడు కూడా వెంట వెంటనే వినిపిస్తోంది. బాబిగాడికి ఇప్పటిదాకా ఏమూలో ఉన్న సరదా పూర్తిగా అడుగంటిపోయింది.

“ఎక్కడికండీ చెప్పులు?”

“ఉండూ… మరి ఇంట్లో లేపోతే బైట చూసి రావొద్దూ!”

“చెప్పకుండా అలా వెళ్ళడండీ…” అమ్మ గొంతు కంగారుగా ఏడ్చేలాగ ఉంది. మళ్ళీ తనే చెప్పింది: “ఆదివారం ఈ పిల్లలంతా ఆ గుడి దగ్గర పార్కులో ఆడతారు. ఒక్కసారి నాకు బడికెళ్ళటం ఆలస్యమైతే మనవాడూ అక్కడే కనిపించాడు”

“సెలవరోజు కూడా ప్రశాంతంగా ఉండనివ్వరు కదే… ఏదో వొక సంత!”

నాన్న మెట్లు దిగటం, గేటు తీయటం, స్కూటర్ స్టార్ట్ చేయటం వినిపించాయి. స్కూటర్ చప్పుడు తగ్గుతూ తగ్గుతూ ఇంక వినపడకుండా పోయింది.

అది వెళ్ళిన కాసేపటి తర్వాత, “ఒరే బాబీ… బాబితల్లీ!” అని అమ్మ అరుపు గట్టిగా వినిపించింది. అమ్మ ఒక్కతే ఇంట్లో నిలబడి అంత గట్టిగా అరవటం చిత్రంగా భయంగా అనిపించింది బాబిగాడికి. ఏడుపు మొహం పెట్టేశాడు. మోకాళ్ళు ఊరికే గోకేసుకుంటున్నాడు.

“అమ్మా… అన్న ఏరే, ఏంచేశారే?” అంటున్నాడు తమ్ముడు.

తమ్ముడి ముద్దు మొహం గుర్తొచ్చి ఎంతో బెంగగా అనిపించింది బాబిగాడికి. వాళ్ళెవ్వరినీ తిరిగి కలవలేనంత దూరం వచ్చేసినట్టుంది. ఏడుపు ఉగ్గబట్టుకుంటుంటే చెంపలు నొప్పెడుతున్నాయి.

“వచ్చేస్తాడమ్మా అన్న, ఇక్కడే ఎక్కడికో వెళ్ళుంటాడు… పద వెతుకుదాం మనమూను”

కాసేపటికి ఇల్లంతా నిశ్శబ్దంగా అయిపోయింది. ఎవరూ లేరని తెలుస్తోందిగానీ బయటకి రావాలంటే ధైర్యం చాలటం లేదు. పడగ్గదిలోంచి వస్తున్న ఫాను చప్పుడొక్కటీ వింటూ అలాగే కూర్చున్నాడు. మొత్తానికి కాసేపటికి ధైర్యం కూడేసుకుని తలుపు ఓరగా తెరిచి చూసాడు. వీధిగేటు తెరిచొదిలేసి ఉంది. వెళ్దామా వద్దా అని ఊగిసలాడి నెమ్మదిగా పైకి లేచాడు. తలుపు జరిపి బయటికి వచ్చాడు. టప్ మని చప్పుడైతే హళ్ళిపోయి వెనక్కి చూసాడు. చీపిరి కింద పడి వుంది. గుమ్మాలు దాటి వచ్చి చల్లగా తాకిన గాలికి వాడి వొళ్ళు వొణికింది.

నాన్న ఆఫీసుకెళ్ళాక ఒక్కోసారి పడుకున్న తమ్ముడిని బాబిగాడికి అప్పజెప్పి వాళ్ళమ్మ పక్కింటికి వెళ్ళేది. కానీ ఇంట్లో ఇలా మరీ ఒక్కడూ ఎప్పుడూ లేడు. పైగా ఇప్పుడు తనకి ఎవ్వరితోనీ సంబంధం లేదు. అసలీ ఇంటితోనే సంబంధం లేదు. వెనకగదిలోంచి హాల్లోకి వచ్చాడు. ఇందాకటి దాకా వాడు ఆడుకున్న హాలు ఇప్పుడు కొత్తగా పరిచయం లేనట్టు కనిపించింది. సోఫాలో తుపాకీ బొమ్మ కూడా ఎవరిదో అన్నట్టు ఉంది. వీధిలోకి చూస్తే పెంకుటింటి చూరు మీంచి వేలాడున్న దిష్టి కొబ్బరికాయ మీద రాక్షసుడి బొమ్మ ఇటు చూసి నవ్వుతోంది. బయట మళ్ళీ మబ్బేసి వాతావరణం అంతా మారిపోయింది. అలాగే కటకటాల గది గడప దాకా నడుస్తూ వచ్చాడు. ఇంతలో ప్రహరీగోడ మీంచి అమ్మ తల, అమ్మ ఎత్తుకున్న తమ్ముడి తల, ఇంకెవరిదో తల వస్తూ కనిపించాయి. చప్పున పరిగెత్తి పడగ్గదిలోకి పారిపోయాడు. గది కాస్త చీకటిగా ఉంది. ఎక్కడ దాక్కోవచ్చా అని చుట్టూ చూసాడు. నాన్న టేబిలు మీద టీకప్పు పక్కన లాలీపాప్ కనపడింది. ఒక క్షణం వాడి మనసు అటు ఉవ్విళ్ళూరింది. అప్పుడే బయట గేటు మూస్తున్న చప్పుడైంది. ఇంకేం ఆలోచించకుండా మంచం కిందకి దూరిపోయాడు.

బయట గచ్చు మీంచి మాటలు వినిపిస్తున్నాయి. పక్కింటి ఆంటీ గొంతు వినపడుతోంది. “కానీ రోజులసలే బాగా లేవురా” అంటోంది. అమ్మ ఏదో మాట్లాడబోయి ఏడ్చేయటం మొదలుపెట్టింది.

మంచం కింద నుంచి చూస్తుంటే బాబిగాడికి బయటి నేల మీద తమ్ముడు ఆడుకుని వదిలేసిన ఎలిఫెంట్, టైగర్ బొమ్మలు కనిపిస్తున్నాయి. టైగర్‌ ఎలిఫెంట్ కాలు కొరికేస్తోంది. ఆ బొమ్మలు మసగ్గా అయిపోతూ బాబిగాడి కళ్ళని కన్నీళ్ళు కమ్మేశాయి. బయట అమ్మ ఏడుపు ఎక్కువయ్యే కొద్దీ ఇక్కడ వాడి ఏడుపూ పెరిగిపోయింది. కడుపులోంచి దుఃఖం గిట్టకరచిన పళ్ళ మధ్య నుంచి తన్నుకొచ్చేస్తుంది. నోరు నొక్కేసుకుని, గచ్చు చల్లదనానికి కాళ్ళు కడుపులోకి ముడుచుకొని, ఏడుస్తున్నాడు. రియ్యీ రియ్యీ మని తిరుగుతున్న ఫాను చప్పుడులో వాడి వెక్కిళ్ళు కలిసిపోతున్నాయి. ఏడ్చేకొద్దీ ఆకలి కూడా వేస్తోంది.

ఎక్కడ్నించో స్కూటర్ చప్పుడు దగ్గర దగ్గరగా వచ్చి ఇంటి ముందాగింది. నాన్న మాటలు వినపడ్డాయి. అమ్మ ఇంకా పెద్ద పెట్టున ఏడ్చేస్తోంది. చెప్పులు విడిచి నాన్నతోపాటు ఇంకెవరో కూడా హాల్లోకి వచ్చారు. ఆయన నాన్నతో మాట్లాడటం మొదలుపెట్టాక అది వినటం కోసమన్నట్టుగా అమ్మ ఏడుపు ఆపుకుంది.

“ఆలస్యం చేస్తే అస్సలు లాభం లేదురా. మన చేయి దాటిపోవచ్చు. పిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్ళు తిరుగుతున్నారని విన్నాను. నా మాటవిని వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్ళిపోవటం మంచిది.”

“అంతేనంటావా?”

“అంతేరా… మన ప్రయత్నం మనం చేద్దాం. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు.”

“అవును తమ్ముడూ, అస్సలు ఆలస్యం వద్దు. వెంటనే ప్రయత్నిస్తే దొరికేస్తారు. మొన్నలాగే టీవీలో చూసాను ఒక పిల్లోడినీ…”

“సరే అయితే పదరా. అక్కా, దీన్ని మీ ఇంటికి తీసుకుపో. కాస్త దగ్గరుండు ఏమనుకోకు.”

“ఏవండీ, ఏంటండీ ఇదీ…!”

“నువ్వూరికే ఏడవకు బుజ్జీ… ఎక్కడికీ పోడు వచ్చేస్తాడు. అక్కతో వెళ్ళు, అమ్మవు కదూ!”

ఉన్నట్టుండి పడగ్గదిలోకి రెండు చిన్ని పాదాలు వచ్చాయి. తమ్ముడు తన ఎలిఫెంట్‌నీ, టైగర్‌నీ తీసుకెళ్ళటానికి వచ్చి కిందకి వొంగాడు. వాడి చూపు ఇటు మళ్ళింది. అక్కడ కనపడేదేంటా అన్నట్టు తల ఓ పక్కకి వాల్చి, నోరు తెరిచి చూస్తున్నాడు. వాడి కళ్ళలో చిన్నగా మొదలైన నవ్వుతో ముఖం అంతా విప్పారింది. పైకి లేచి నిలబడ్డాడు. బాబిగాడికి మంచం అంచు కింద నుంచి తన వైపు చూపిస్తున్న తమ్ముడి వేలు కనిపిస్తోంది. తమ్ముడి మాటలూ వినపడ్డాయి.

“అమ్మా… అన్న అన్న అన్న!”

హల్లోంచి కాలి పట్టీలు పరిగెత్తిన చప్పుడు. ఇంకొన్ని జతల పాదాల చప్పుడు కూడా.

(రస్తా మేగజైన్ జనవరి 16 న ప్రచురితం)