February 16, 2019

భాగ్యలతా కాలనీ


అరుణ ఇవాళే విమానమెక్కి వెళ్ళిపోతుంది. ఇంక నాకెప్పటికీ కనపడకుండా. నేను చేసిందే అంతా. మేమిద్దరమూ ఒక జంట అన్న నమ్మకంలో ఆమె ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేసుకుంటుంటే, ఇక్కడ నేను ఇంకో అమ్మాయికి దగ్గరయ్యాను. తనతో కలిసాను కూడా. నా వంచన పొడ అరుణకి వెంటనే తగిలింది. నేను పెద్ద దాచే ప్రయత్నమూ చేయలేదు. ఇక అసలేమన్నా తనకి ఇక్కడ మిగిలున్నదా అన్నది తేల్చుకోవడానికి, ఉన్నపళంగా ప్రయాణం పెట్టుకొని ఇండియా వచ్చింది.

నిన్న పగలంతా ఏడుస్తూనే ఉంది. నా ముందే, నా గదిలో, బింకమంతా వదిలేసి, ప్రేయసికి ఉండే అధికారాలన్నీ పక్కనపడేసి. కానీ నా మనసు రెండుగా విడిపోయింది. రెండో వైపే మొగ్గు చూపుతోంది. అరుణ కన్నీళ్ళన్నీ నన్నేం తాకకుండానే రాలిపోయాయి. నిన్న రాత్రి, నేను మంచం మీద నిద్రపోతున్నాననుకొని, ఫోన్ వస్తే పక్క గదిలోకి వెళ్ళి మాట్లాడింది. ఆస్ట్రేలియా నుంచి తన దగ్గరి స్నేహితురాలితో.

“ఇక్కడ నాకంటూ ఏం లేదని అర్థమైందే. నేనేం అన్నా తన దాకా చేరటం లేదు. తను ఇంక నా మనిషి కాడు.”

నేను ఫేన్ వైపు చూస్తూ ఆ మాటలు విన్నాను. చిత్రంగా, ఆమె ప్రేమ లోతు నాకు మొదటిసారి తెలిసింది ఆ మాటల్లోనే; నా పరోక్షంలో వ్యక్తం చేసుకున్న ఆ సొంత బాధలోనే. మనసు పీకింది. కానీ లోపలే మొండిగా బలంగా ఏదో గోడ. అరుణ చాలాసేపు మాట్లాడింది. వినపడినవేవో  వినపడ్డాయి. తిరిగి గదిలోకి వచ్చేసరికి నిద్రపోయినట్టుగా కళ్ళు మూసుకున్నాను.

పొద్దున్న లేచేసరికి వేరే మనిషిలాగ ఉంది. రాత్రంతా నిద్రపోనట్టు ముఖం వడిలిపోయి ఉంది, కానీ దుఃఖమంతా బైటకు తోడేసాక మిగిలే తేటదనమూ ఉంది. నేను లేచి రెడీ అయి ఆఫీసుకి వెళ్ళిపోయాను. మధ్యాహ్నం ఒకసారి మాత్రం- రాత్రికి ఏం వండమంటావని మెసేజ్ పెట్టింది. తన చేతి వంట బాగుంటుంది. కానీ నేనిప్పుడు అధికారంగా అది చేయీ ఇది చేయీ అని చెప్పలేననిపించింది. “నీ ఇష్టం” అని మెసేజ్ పెట్టాను. సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళేసరికి తన సామానంతా సర్దేసుకొని, ఫ్రెష్‌గా స్నానంచేసి రెడీ అయి ఉంది. దొడ్డేంపు నా మాసిన బట్టలన్నీ ఉతికి ఆరేసి ఉన్నాయి. ఎందుకు ఉతికావంటే “నాకేం తోచలేదు మరి” అంది. ఇదివరకూ కూడా ఉతికిపెట్టేది కానీ ఇప్పుడు అలా ఉతకటం ఎందుకో నచ్చలేదు. ఇద్దరం నిశ్శబ్దంగా తిన్నాం. అప్పడాలు వడియాలతో సహా అన్నీ ఉన్నాయి. మొదటి ముద్దలు తింటున్నప్పుడు వంట గురించి ఏం చెప్తానో అన్నట్టు ముఖంలోకి చూసింది కానీ నాకేం చెప్పాలనిపించ లేదు.

“కాసేపలా బయటికి వెళ్ళొద్దామా” అంది తిన్నాక.

అరుణ మీద నా మనసులో ఇదివరకటి చనువూ, ప్రేమా ఏంమారలేదు. కానీ వేరే అమ్మాయితో ఉన్నానని తనకి తెలిసాక కూడా, మళ్ళీ తనతో ఇదివరకట్లాగే ఉంటే- ఏం నీతి లేనివాడిగా చులకనైపోతానని నిగ్రహంగా అంటీముట్టనట్టుగా ఉంటున్నాను.

“మరి టైం సరిపోతుందా నీకు?”

“ఎప్పుడో పదింటికి కదా బస్సు”

భాగ్యలతా కాలనీ వీధులు ఖాళీగా అసలిది హైదరాదేనా అన్నట్టు ఉంటాయి. వీధిలైట్లకి పైన ఇంకా కొంచెం వెలుగుంది. అరుణ నన్ను మరీ అంత ఆనుకుని ఎందుకు నడుస్తుందా అని చూస్తే మలుపు దగ్గర వీధి కుక్కలు ఆడుకుంటున్నాయి. వాటిని దాటేంత వరకూ తన దృష్టి అటేపే ఉంది. తన చేతుల్లో చేతులు కలిపి మూసాను. చల్లగా చెమట్లు. నా చేతి వెంట్రుకల్ని నిమురుతూ తన చున్నీ. సామానంతా సరిగ్గా సర్దుకుందా లేదా, ఎయిర్‌పోర్ట్ తీసుకెళ్ళే బస్సు దగ్గర ఎన్నింటికి ఉండాలీ, చెక్ ఇన్ ఎన్నింటికీ, సిడ్నీలో దిగేది ఎన్నింటికీ… అవన్నీ అడిగాను, ఏదోటి మాట్లాడాలని.

అన్నీ చెప్పి అంది, “ఈ రాత్రి ఒంటిగంట దాకా నన్ను భరించు. రేపట్నుంచి నువ్వెవరో నేనెవరో…”

“నోర్ముయ్యవే”

“దట్స్ హౌ ఇటీస్… ఎందుకు కలుస్తాం? నువ్వు దేశం దాటవు. నాకు నువ్వు లేనప్పుడు ఇటొచ్చే పనేం లేదు”

“అవును కానీ… ఒకళ్ళకొకళ్ళు ఏం కాకూడదని లేదుగా.”

“నీకు కొన్ని తెలీదురా. బహుశా ఎప్పటికీ తెలీదేమో, ఒక మనిషితో కమిట్ కావటం అంటే ఏంటో…”

“… … …”

“సర్లే… బావుండు. నమ్మకంగా వుండు. జార్తగా ఉండు. ఇంక నిన్ను వెనకాల ఉండి ఎవరూ తోయరు…”

నా కళ్ళల్లో చిన్నగా నీళ్ళూరాయి. మరీ చేత్తో తుడుచుకోవాల్సిన పరిస్థితి రాకుండా అంతటితో ఆగిపోతే బాగుండుననిపించింది. రోడ్డు పక్కనున్న షాపుల్లోకి పట్టిపట్టి చూస్తున్నాను. నా కోసం ఏడ్చుకోవటానికి మాత్రం ఎప్పుడూ తయారుగా ఉంటాను.

కాలనీ మెయిన్ రోడ్డు దాటి ఇళ్ళుండే వీధుల్లోకి వచ్చాం. అవేం సందడిలేకుండా స్తబ్ధుగా ఉన్నాయి. ఉండుండి టీవీ చప్పుడో, పిల్లల మాటలో వినిపిస్తున్నాయి. గుమ్మాల్లోంచి రోడ్డు మీదకి ట్యూబ్‌లైట్ వెలుగులు, గేట్ల నీడలు. ఒక వీధిలో ఇద్దరమ్మాయిలు షటిల్ ఆడుతున్నారు. ఇళ్ళ ముందున్న పూల మొక్కలు చూస్తూ నడుస్తుంది అరుణ. పారిజాతాలు, కాశీరత్నాలు, మాలతీమాధవాలు… ఈ పేర్లన్నీ తను చెప్తే తెలిసినవే.

“ఓహ్…! కాడమల్లి పూలు” అంది. అప్పటికిక నేను ఇబ్బందిగానే పట్టుకున్న తన చేతిని లాక్కొని చెట్టు కిందకి వెళ్ళింది. “ఈ చెట్టు దాటుతుంటే భలే వాసనొస్తుంది తెలుసా! ఇలా రా.”

రోడ్డు దాటి వెళ్ళాను.

“ఏడ్చేడ్చి నాకు రొంప… నీకే తెలియాలి వాసన.”

చెట్టు కింద నిలబడి పైకి చూసాను. గుబుర్ల లోంచి తెల్లగా పొడవాటి జూకాల్లాగా వేలాడుతున్నాయి పూలు. ఆకుల కన్నా అవే ఎక్కువున్నట్టున్నాయి. కళ్ళు మూసి గట్టిగా పీల్చుకున్నాను. “వీటినే కదా నైట్ క్వీన్ అంటారు?”

“నీ బొంద… అవి వేరు.”

ఏదో బండి ఈ రోడ్డు మీదకి మలుపు తిరిగింది. ఎవరిదో ఇంటి ముందు అలా నిల్చోవటం బాగోదని ముందుకి నడిచాను. అరుణ నేల మీద పూలు కొన్ని ఏరుకుని నా పక్కకు పరిగెత్తుకొచ్చింది.

“చూడు చూడు…” అంది ముక్కు దగ్గర పూలబొత్తి పెడుతూ.

“అబ్బా తుమ్ములొస్తాయే…”

“ఛీ! మొరటోడా…”

ఆకాశం ఇప్పుడు పూర్తిగా చీకట్లో ఉంది. వీధిలైట్లు లేని చోట నక్షత్రాలు బాగా కనిపిస్తున్నాయి. మేం మలుపు తిరిగిన వీధిలో గుమ్మాలేం లేవు, ఇంటి వారలే ఉన్నాయి, కిటికీలూ మూసి ఉన్నాయి. ఇద్దరం సిటీ నుంచి తప్పిపోయి ఎక్కడికో వచ్చేసినట్టు ఉంది. దూరంగా హైవే మీద పెద్దబళ్ళ హారన్లు మాత్రం అప్పుడప్పుడూ లీలగా వినిపిస్తున్నాయి.

“నేనొచ్చేసాక మనిద్దరం ఇక్కడే కాస్త పెద్దిల్లు తీసుకుని ఉంటామనుకున్నాను. నాకు నచ్చిందీ ప్లేసు.”

తన ఆలోచనలో తనూ, తన ఆలోచన ఊహిస్తూ నేనూ నడిచాం.

నిట్టూర్చింది. “ఏవో ప్లాన్స్ వేసేసుకున్నానురా. అన్నీ పాడు చేసేసావు. మళ్ళీ అంతా కొత్తగా కట్టుకోవాలి.”

ఆమె ఇక్కడ ఏడవద్దని మనసులో ప్రార్థించుకున్నాను. దూరంగా కాస్త సందడి ఉన్న వీధి కనిపిస్తోంది. అటు త్వరగా వెళ్ళాలనిపించింది.

“ఎనీవే… ఇవాళ… ఐ ప్రామిస్డ్ మై సెల్ఫ్… ఏడవను”

భుజం మీద కొలిచినట్టుగా చేయి వేసాను.

“ఛీటర్!” విదిలించుకుంది.

“ఓయ్…?”

“గో టూ హెల్… నాకూ ఆఫీసులో పాపం ఆ గుర్విగాడు రెండేళ్ళ నుంచీ తెగ ట్రై చేస్తున్నాడు. వాడికి ఒకె చెప్పేస్తా. నాకూ ఆప్షన్లున్నాయి”

“మంచిది”

“నువ్వు చూసావుగా వాడ్ని. మొన్న టెన్ కె రన్‌ అప్పుడు పంపిన ఫొటోస్‍లో ఉంటాడు నాతో పాటు.”

“ఊ”

“ఎలా ఉన్నాడు?”

“బావున్నాడు. నా కన్నా బానే వున్నాడు.”

“పొయెట్రీ కూడా రాస్తాడంట.”

“అబ్బో”

నాలో ఒక మూల- ఈ టాపిక్‌ని పొడిగించి నిజంగానే ఆమెకి జీవితం నాతోనే అయిపోలేదన్నట్టు ఊరటగా మాట్లాడాలని ఉంది. కానీ ఇంకో మూల- అసలు అరుణ ఈ టాపిక్  తెచ్చిందే నేను ఇలాంటివాటికి ఈర్ష్య కూడా పడనంతగా తన నుంచి దూరమైపోయానని ఖాయం చేసుకోవటానికేమో అనిపించింది. ఇదివరకూ కూడా ఇలాగే “వాడు బావున్నాడు, వీడు లైనేస్తున్నాడు” అని చెప్పి ఉడికించేది. కానీ ఇప్పుడు నేను కలగని ఈర్ష్య కలిగినట్టు నటించలేను. అసలలా ఈర్ష్య కలక్కపోవటమే అరుణ మీద నా ఫీలింగ్‍లో ఏదో మార్పొచ్చిందనటానికి ఒకేవొక్క ఋజువులాగ అనిపించింది. తనకి నా ప్రసక్తిలేని జీవితాన్ని నిజంగానే కోరుకుంటున్నాను.

“నీకెవరో నాకన్నా మంచోడే వస్తాడ్లేవే”

“మీ ఆశీర్వాదం ఉంటే ఇకనేం”

తన నుంచి వెటకారం… కొత్తగా ఉంది.

కొంచెం సందడిగా ఉన్న వీధిలోకి వచ్చాం. రోడ్డుకవతల కుడివైపు ఆంజనేయస్వామి దేవాలయంలో ఏదో భజన జరుగుతోంది. ఇద్దరం అప్రయత్నంగా అటు మళ్ళాం. గోడలన్నీ సింధూరం రంగు వేసి ఉన్నాయి. బయటి గోడకి ఆనుకొని ఒక చప్టా ఉంది. ఇద్దరం దాని మీద కూర్చున్నాం. భజనలో ఉన్నవాళ్ళంతా ముసలివాళ్ళు. డప్పులు, చిడతలు కొడుతూ ఎంతో లీనమై పాడుతున్నారు. ఆ నమ్మకాల వలయం చూట్టానికి బాగుంది. అరుణ లోపలికి వెళ్ళి ప్రసాదం తెచ్చింది. నా గుప్పిట్లోకి కొంత పంచింది. గుడి ఎదుట మా ముందు చిన్న బల్బుల తోరణం ఉంది. ఆ వెలుగులో అరుణ వంక చూస్తే, తను నా వంకే చూస్తోంది. నేను ప్రసాదం వైపు చూసి దాన్ని ఒద్దిగ్గా సర్ది నోట్లో వేసుకున్నాను. తను చేత్తో నా మీసానికంటిన మెతుకేదో దులిపింది.

చిన్నప్పుడు వాళ్ళ ఊళ్ళో జరిగే అమ్మవారి ఉత్సవాల గురించి, అక్కడ పిల్లల సందడి గురించి చెప్పింది. చుట్టాల పిల్లలెప్పుడూ ఈ పిల్లని నాన్న కూచి అనీ, బాగా గీర అనీ కలవనిచ్చేవారు కాదు. ఈ పిల్ల ఫిర్యాదులన్నీ దాచుకొని నాన్న వచ్చాకా చెప్పటానికి గేటు దగ్గర గేటుకి వేలాడుతూ ఎదురుచూసేది. ఆమె ముఖం వంక చూస్తూ, పరధ్యానంగా ఊ కొడుతూ, నేను ఆడవాళ్ళ గురించి ఆలోచించాను. వాళ్ళ ప్రేమ గురించీ, అందులో ఉండే అక్కర గురించీ, బాధ్యత గురించీ…. అరుణ నాలో పసితనాన్ని ఇష్టపడింది. చూడాలనుకున్నప్పుడు నాలో పెద్దరికాన్నీ చూసుకుంది. కానీ ఆ పసితనం నిజానికి బాధ్యతల బరువు తెలియనితనం అనీ, ఆ పెద్దరికం కూడా పైపైన ఒక పెళుసు పెంకులాంటిదేననీ తెలుసుకోలేకపోయింది. తను నాలో ఊహించుకున్న మూర్తి మాత్రం ఒక ఆదర్శంలాగ నాలో ముద్రపడిపోయింది, ఎదగమని చెబుతూ. ఎప్పటికైనా ఆ మూర్తిని ధరించి నిభాయించుకోగలనేమో….

అరుణ నా చేతిని వొళ్ళోకి తీసుకుంది. అరచేతికంటిన ప్రసాదపు తడిని చున్నీతో తుడిచింది. గోటి అంచుతో రేఖల్ని చదవటం మొదలుపెట్టింది.

“నీకు పిల్లలున్నార్రోయ్! ఒక బుడ్డోడో బుడ్డదో…”
* * *

అరుణ జీవితంలోకి వచ్చాకనే నాకు విమానాశ్రయం పరిచయమైంది. ఇక్కడే ఎన్నోసార్లు ఏదో ఒక గోడ మలుపులో తను మాయమవటం చూసాను, ఏదో ఒక గోడ అంచు దాటి మళ్ళీ ప్రత్యక్షం అవటమూ చూసాను. మొదటిసారి కలిసినప్పుడు రెస్టారెంట్లో అరుణ చేతి వేళ్ళతో ఆడుకోవటం, వాటి సున్నితత్వానికి ఆశ్చర్యపోవటం గుర్తుంది. అంత ప్రయాణం చేసొచ్చినా తన ముఖం ఆరోగ్యంతో వెలిగిపోవటం గుర్తుంది. ఇవాళ అరుణ ముఖం బాగా అలిసిపోయినట్టు ఉంది. పెద్ద మాట్లాడుకోవటానికేం మిగలనట్టు కూర్చున్నాం. ఎంతో ఆత్మీయమైన అపరిచితులం. కళ్ళూ వేళ్ళూ మాత్రం అలవాటింకా పోనట్టు తడుముకున్నాయి. ఇంక వెళ్ళకపోతే విమానం తప్పిపోతుందనేంత దాకా బయటే ఆగింది. వెళ్ళేముందు, నా కళ్ళల్లోకి- వాటిలో కనిపించేదేదో బాగా జ్ఞాపకం ఉంచుకోవాలన్నట్టు చూసింది. చెంప నిమిరి, ట్రాలీ నెట్టుకుంటూ గుమ్మం వైపు నడిచింది. నేను అద్దాలకు ఇటువైపు తచ్చాడాను. అరుణ లోపలికి నడవటం, కౌంటర్ దగ్గర నిలబడి మాట్లాడటం అంతా కనిపిస్తోంది. మళ్ళీ అదే గోడ… ఏవో ప్రకటనలు మెరుస్తున్న గోడ… దాన్ని దాటగానే అరుణ నాకు ఇంక కనపడకుండాపోయే గోడ… దాటే ముందు ఆగి చూసింది… ఇద్దరికీ తెలుసు, మనసిచ్చిపుచ్చుకున్న మనుషులుగా ఒకర్నొకరం ఇదే ఆఖరుసారి చూసుకోవటమని. అరుణ వెళ్ళిపోయింది. ఆ గోడ అంచుని చూస్తూ ఉండిపోయాను. కదులుతున్న కాలంలో నిలబడి, వర్తమానం అలా నిరామయంగా గతంగా మారిపోతుంటే, దూరం జరిగిపోతుంటే, కళ్ళు కదిలి…. వెనక్కి వచ్చేటప్పుడు ఎయిర్‌పోర్టు బస్సులో చుట్టూ ఎవరూ లేని చోటు చూసుకుని కూర్చున్నాను.

(రస్తా మేగజైన్ ఫిబ్రవరి 16న ప్రచురితం)