January 1, 2020

నీలం మంట


బస్సు హార్న్‌ చెవుల్లో జొరబడి, సడెన్ బ్రేక్‌కి ముందుకు తూలి, మెలకువొచ్చింది. నాతోపాటు ముందు సీట్లలో వాళ్ళూ కొంతమంది లేచారు. ఒకళ్ళిద్దరు నిలబడి ముందున్న అద్దాల్లోంచి తొంగి చూస్తున్నారు. “చిరుతపులి!” ఎవరో అన్నారు. నేను కిటికీ లోంచి బైటకి చూశాను. వెలిగే కళ్ళూ, మచ్చల తోక… చెట్ల మధ్య మాయమైంది. ఆ మృగం బస్సులో రేపిన అలజడి కాసేపు కొనసాగి మళ్ళీ కునుకుల్లోకీ, నిద్రలోకీ సద్దుమణిగింది. బస్సు అడవిలోకి ఎప్పుడొచ్చిందో తెలీదు. నేను నిద్రలోకి వెళ్ళకముందు ఇంకా ఊళ్ళూ, పొలాలూ కనపడుతున్నాయి. ఇప్పుడు మనిషి ఆధిక్యం ఏమాత్రం లేని దట్టమైన, ఎడతెగని అడవి. చెట్ల కాండాల మీద బస్సు కిటికీల వెలుగు మాయ తివాచీలాగా పాకుతోంది. ఒక చోట, దూరంగా, కొమ్మల వెనుక, ఏదో మంట. ఎవరీ అరణ్యంలో చలి కాచుకునేది… చిరుతపులులా? నిజంగా ఇది పంచతంత్రం కథలు జరిగే మాయల అడవిలాగే ఉంది. ఇప్పుడే నిద్రలో అనుభవించిన కల ఏదో, గుర్తుకు వచ్చీరాక, తోక అందని తూనీగ లాగా కవ్విస్తోంది. ఏంటది… కలలో ఆ దృశ్యం… నేను స్నిగ్ధమైన ఆడ ముఖాన్ని ఒక పొద్దు తిరుగుడు పువ్వులా పట్టుకుని నా ముఖంవైపు మెల్లగా లాక్కుంటున్నాను. ఆ ముఖంపై ముద్దులు, ముద్దుల్లో నా ఆత్రం, చెలమలో నీళ్ళు చప్పరించే మృగంలాగ. ఎవరిదా ముఖం? మహతి? ఏదో మర్చిపోయిన సంగతి గుర్తొచ్చినట్టు గుర్తొచ్చింది– ఈ ప్రయాణ గమ్యం… మహతి… ఆమె మళ్ళీ నా ఆలోచనలను ఆక్రమించింది… బస్సు చక్రాలకూ రోడ్డుకూ మధ్య కుదిరిన లయలో, సీటు మీద తల ఆడుతూ, మళ్ళీ మగతలోకి… కలలోకి… నేను అడవి మధ్యలో రోడ్డు మీద నిలబడ్డానట… అటు చూస్తే బస్సు నన్ను వదిలి వెళ్ళిపోతోంది… ఇటు చూస్తే చెట్ల మధ్య నుంచి చిరుతపులి… “చలి కాచుకుందాం” వస్తావా అని అడుగుతోంది, ఎవరిదో బాగా తెలిసిన గొంతుతో. భయమేసి మళ్ళీ మెలకువొచ్చింది. కిటికీలోంచి చూస్తే, ఒక మైలు రాయి మీద మహతి ఉంటున్న ఊరి పేరు కనపడింది. అప్రయత్నంగానే ఆ తర్వాతి మైలు రాళ్ళ మీద తరిగే దూరపు అంకెని లెక్కపెట్టడం మొదలుపెట్టాను. ఆ లెక్కలో ఉండగానే అడవిపైన ఆకాశంలో నీలిమ చేరింది. రాత్రి దేశం వదిలి పగటి దేశంలోకి అడుగుపెడుతున్నట్టు… రాత్రి కలల మీద, కాంక్షల మీద వెలుతురు పడి, అవన్నీ సిగ్గుతో మనసు మూలల్లోకి తప్పుకుంటున్నట్టు….

కాసేపటికి అడవి తెరిపినిచ్చింది. కొండల మీద అంచెలంచెలుగా పరుచుకుని పోడు భూములు. తర్వాత దగ్గర దగ్గరగా ఇళ్ళు. ఇక మళ్ళీ అడవి మొదలవుతోందేమో అనిపిస్తున్నప్పుడు, బాగా నాచుపట్టిన ఒక బిల్డింగు దగ్గర కండక్టరు బస్సు ఆపాడు. నన్నొక్కడినీ దింపి బస్సు వెళ్ళిపోయింది. రోడ్డుకి అటు అడవి, ఇటు అడవి. ఆ బిల్డింగు వైపు ఎలా వెళ్ళాలా అని దారి వెతుకుతుంటే, రోడ్డు మీదే దూరంగా నిలబడి, నవ్వుతూ చెయ్యి ఊపుతూ కనిపించింది– మహతి. అటు నడిచి వెళ్తున్నకొద్దీ, ఫొటోల్లో చూసి మనసులో ముద్రించుకున్న బొమ్మ ఒక దేహంగా మారుతూ, నా మనసు నుంచి వేరుగా, ఒక ఆమెగా, కళ్ళ ముందు, స్థిరపడింది. నైటీ మీద గళ్ళ టవల్‌ చున్నీలా కప్పుకుని, కొప్పు ముడేసుకుంది. “రండి, ప్రయాణం ఎలా జరిగింది.” వెనక్కి తిరిగి, పొదల మధ్య ఇరుగ్గా ఉన్న కాలిబాటలోంచి కిందకు దిగుతోంది. ఏమీ తయారు కాకుండా అలా నైటీలోనే వచ్చేసిందేంటి?

ఆ బిల్డింగ్‌ చెట్ల మధ్య నొక్కుకుపోయినట్టు ఉంది. ఆమెతో పాటు అదే స్కూల్లో పని చేసేవాళ్ళకి ఆ క్వార్టర్స్‌ ఇచ్చారట. అటు మూడంతస్థులు, ఇటు మూడంతస్థులు, మధ్యలో మెట్లు… చూడగానే క్వార్టర్స్‌ అని తెలిసిపోయేలా ఉంది. మహతి కింద పోర్షన్‌లోనే ఉంటోంది. ముందు చిన్నగా దడి, లోపల దడి వారన మొక్కలు, గుమ్మం పక్కన దానిమ్మ చెట్టు, దాని కింద కూర్చోటానికి చప్టా. ఇంట్లో సామాను ఈ మధ్యనే సర్దినట్టు తెలుస్తోంది.

“ఇక్కడకు వచ్చాకే అర్థమైందండీ, ఇలాంటి వ్యవహారాలు నాకు ఎంత కష్టమో. సామాను మోసేవాడి దగ్గర్నుంచి ఎలక్ట్రీషియన్‌ దాకా, పాలవాడి దగ్గర్నించి గ్యాస్‌ తెచ్చేవాడి దాకా… అందరినీ కుదుర్చుకోవడం, వాళ్ళ చేత పని చేయించటం, ఈ నెలంతా ఎంత టెన్షన్‌ పెట్టారో ఒక్కొకళ్ళు,” చెప్తోంది.

ఒక ఏడెనిమిదేళ్ళ పిల్లాడు గుమ్మంలోకి వచ్చి నవ్వుతూ చూస్తున్నాడు. “యశ్వంత్‌, అంకుల్‌కి హాయ్‌ చెప్పు” అంది మహతి. వాడు సిగ్గుగా వచ్చి చేయి కలపబోయాడు… అమ్మ పోలిక. నేను చంకల్లో చేతులు దూర్చి పైకి లేపి ముద్దు పెట్టుకున్నాను.

స్నానం కానిచ్చాక, పిల్లాడ్నీ నన్నూ కూర్చోపెట్టి వేడివేడిగా దోసెలు వడ్డించింది. ఆ ఊరి గురించీ, అక్కడి మనుషుల గురించీ, స్కూలు గురించీ చెప్తోంది. నాకు అక్షరాల్లో మాత్రమే తెలిసిన వ్యక్తిత్వాన్ని ఈ మనిషిలో ఇమిడ్చే ప్రయత్నంలో నేనుండగానే, ఆమె మాటల్లో మరో కొత్త వ్యక్తిత్వం వ్యక్తమవుతూ, అసలు ఈ మనిషి గురించి నాకు పెద్దగా తెలీదేమో అనిపిస్తోంది. పిల్లాడ్ని ఆటలకు పంపి, ఎదురుగా సోఫాలో వచ్చి కూర్చుంది. “హ్మ్‌… చెప్పండి! ఎలా ఉంది మా ఇల్లు, మా ఆతిథ్యం?”

“ఇల్లు బావుంది. ఆతిథ్యం ఇప్పుడే కదా మొదలైంది, అపుడే ఎలా చెప్తాం?”. ఈ మాట అనగానే మనసులో దానికి ద్వంద్వార్థం అంటుకుంది. కానీ రెండో అర్థం బైటికి పొక్కకుండా, “దోసెలు మాత్రం బావున్నాయి,” అన్న మాట అతికించాను. కానీ ఆమె అసలదేం గమనించినట్టు లేదు.

ఆమె ముఖం తేటగా ఉంటుంది. పెదాలకు పరాగ్గా అంటి ఓ నవ్వు. కళ్ళు మాత్రం దిగులు వెలిగే దీగూళ్ళు.

ఇక్కడకు రావాల్సివచ్చిన పరిస్థితి గురించీ, తన వివాహ జీవితం గురించీ చెప్పటం మొదలుపెట్టింది. “ఎంతైనా పడతాం, పడొచ్చు. కానీ మనకి మనం కొంతైనా మిగలాలి కదా,” అంది.

నాకు మాత్రం ఇదంతా ఒక స్టుపిడ్‌ అడ్వంచర్‌ అనిపించింది. ఈమెయిల్స్‌లో ఈ విషయం గురించి పెద్దగా ఎప్పుడూ మాట్లాడుకోలేదు. భర్త మీద ఆమె అసంతృప్తి గురించి చూచాయగా తెలుసు. అయితే ఇలా అన్నీ వదిలి వచ్చేసేంత దూరం ఉన్నట్టు అనిపించలేదు. చాలా ఇళ్ళల్లో కనపడే తంతులాగే అనిపించింది. చెప్పుకుంటే వినటానికి ఒక చెవి కావాలంతే ఈ ఆడాళ్ళకి. నా కథల పుస్తకం నచ్చిందని మెయిల్‌ పంపిన పుణ్యానికి– సైకలాజికల్‌ కన్‌సల్టేషన్‌ బాధ్యతనేం మీద వేసుకోవాలని అనిపించలేదు. ఇక్కడో చెవి సిద్ధంగా ఉన్నట్టు ఎప్పుడూ అలుసివ్వలేదు. ఆమె ఇలా వచ్చేసిందని రాసినప్పుడు మాత్రం ఆశ్చర్యమనిపించింది. అప్పుడే మొదటిసారి కలవాలి అనిపించింది.

పదేళ్ళపాటు కొనసాగిన పెళ్ళి వాళ్ళిద్దరిదీ. పెళ్ళైన కొత్తలో ఈమె ఓ రెండేళ్ళు ఉద్యోగం చేసింది. పిల్లాడు పుట్టిన తర్వాత ఇక ఇంట్లోనే ఉండిపోయింది. ఈమధ్య ఒక ఐదేళ్ళుగా భార్యాభర్తలిద్దరి మధ్యా దూరం వచ్చేసింది. ఏడాది క్రితం భర్త ఫోనుకి ఒక అమ్మాయి బట్టల్లేకుండా పంపుకున్న ఫొటోలు కనపడ్డాయి. అడిగితే ఒప్పేసుకున్నాడు. కళ్ళమ్మటా నీళ్ళు పెట్టుకున్నాడు. ఇక మీదట అలా జరగదన్నాడు. కానీ ఆ అమ్మాయిని ఇంకా కలుస్తూనే ఉన్నాడని నెల క్రితం తెలిసింది. ఈసారి మళ్ళీ నిలదీస్తే ఆ అమ్మాయిని వదులుకోలేనని చెప్పాడు. నువ్వూ పిల్లాడూ కూడా కావాలి అన్నాడు. ఒక్క ఆ అమ్మాయి విషయంలో తన మానాన తనని వదిలేస్తే, నిన్ను బాగా చూసుకుంటానన్నాడు. మనిద్దరం ఇదివరకట్లాగే చక్కగా కలిసి ఉండొచ్చు అన్నాడు.

“మరేం దొబ్బుడాయీ…” అనిపించింది నాకు మనసులో. ఇద్దరిదీ ఏం ప్రేమించి చేసుకున్న పెళ్ళి ఎలాగూ కాదు. పోనీ పెళ్ళి తర్వాత ప్రేమ పుట్టిందనుకున్నా, ఏ ప్రేమా ఎల్లకాలం కొనసాగేదీ కాదు. ఆ తగులుకున్న అమ్మాయితోనూ ఎక్కువ కాలం సాగదు. మళ్ళీ ఎలాగా వెనక్కి వచ్చేస్తాడు. అప్పటిదాకా ఇంట్లో తన మానాన తను సుఖంగా బతకొచ్చు కదా, పిల్లాడ్ని చూసుకొంటూ…. ఇదేం నేను పైకి అనలేదు.

ఇలా మొదటిసారి కలిసిన మనిషికి (ఇదివరకూ ఉత్తరాల్లో ఎంత పరిచయమున్నా) తన కథంతా వెళ్ళగక్కుకునే స్వభావం ఆమెది కాదని ఆమె ఇదంతా చెప్తున్న తీరులోనే తెలిసిపోతోంది. అసలు మొదలుపెట్టడమే అదో పెద్ద విషయం కాదన్నట్టు, జస్ట్‌ ఇలా ఊరు మారి రావటానికి ఒక కారణాన్ని వివరిస్తున్నట్టు, పైపై వివరాలతో చెప్పటం మొదలుపెట్టింది. కానీ లోపలి బాధ తన ప్రమేయం లేకుండానే తన్నుకు వచ్చేసింది. కళ్ళమ్మటా నీళ్ళయితే రాలేదు గానీ మొహంలో యాతన తెలుస్తోంది. ఈ అడవిలో ఈ మాత్రం చెప్పుకోవటానికి ఎవరూ దొరికి ఉండరు.

“మొన్ననే ఫోన్‌ చేసి డైవోర్స్‌ కూడా అడిగాడు. నాకేం బెంగగా అనిపించలేదు. పిల్లాడు ఎవరి దగ్గరుండాలీ అన్న చర్చ తీసుకురాలేదు, అదే సంతోషం. యశ్వంత్‌ కూడా, మరి మనసులో బెంగేమన్నా ఉందేమో తెలీదు గానీ, పైకి మాత్రం వాళ్ళ నాన్ననేం పెద్ద గుర్తు చేసుకోడు. నిజానికి ఆ సిటీలో కన్నా ఇక్కడే ఉత్సాహంగా ఆడుకుంటున్నాడు.”

నాకామె బాధలో కలగజేసుకుని విషయాన్ని పొడిగించాలని అనిపించ లేదు. “ముందు కాస్త రెడీ అవ్వు. నాకు మీ ఊరు చూపిద్దువు గాని,” అన్నాను.

ఆమె బలవంతాన మూడ్‌ మార్చుకుంది. “సరే. బయల్దేరదాం. అన్నట్టు, రేపు మీరు వెళ్తానన్న గుడి వివరాలు కనుక్కున్నాను. ఉదయం పదకొండు తర్వాత తెరుస్తారట. పొద్దున్న ఆరింటికి బస్సు దొరుకుతుంది. మనం కాస్త పెందలాడే లేచి రెడీ అయిపోవాలి. అక్కడేమన్నా మొక్కులుంటే ఉపవాసం ఉండి వెళ్ళాలట. మీకేమన్నా మొక్కు ఉందా?”

“లేదు, ఊరికే గుడి చూద్దామని, అంతే.”

స్నానం చేసి వస్తానని వెళ్ళింది.

ఆమె గుడి విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకోవటం ఆశ్చర్యంగా అనిపించింది. నిజానికి ఆ గుడి చూట్టానికి వస్తున్నానన్నది ఒక సాకు మాత్రమే. ఆ మాత్రం గ్రహించలేకపోయిందా?

ఇందాక నేను బస్సు దిగిన రోడ్డు మీదకే వచ్చాం. పొద్దున్నొకసారి, రాత్రొకసారి వచ్చేపోయే బస్సులు తప్పించి ఆ రోడ్డు మీద వాహనాల సందడి చాలా తక్కువట. మేం ఊరివైపు కాకుండా రెండో వైపుకి నడిచాం. తూర్పు ఎండకి చెట్ల నీడలు రోడ్డు మీద పరిచి ఉన్నాయి. యశ్వంత్‌ మా ముందు పరిగెడుతున్నాడు. రోడ్డు మీద ఆకో, ఈకో ఏరుకుని మళ్ళీ వెనక్కి పరిగెత్తుకొచ్చి వాళ్ళమ్మకి చూపిస్తున్నాడు. ఒక గంట ఆ కబుర్లూ ఈ కబుర్లూ చెప్పుకుంటూ నడిచాం. ఉత్తరాల్లో నన్ను ఎంతో ఉన్నతంగా ఉద్దేశించి రాసే ఈ అమ్మాయి– ఇప్పుడు నేను ఒక మామూలు స్నేహాన్నన్నట్టు– అంత చనువుగా మాట్లాడేయటం నాకు ఒక పక్క బాగుంది, ఇంకోపక్క బాలేదు. నా అంతట నేను వచ్చి చులకనయ్యానా? ఇది బుద్ధితోనో మనసుతోనో తీసుకున్న నిర్ణయం కాదు. ఏదో గుడ్డి వాంఛ నన్ను అక్షరాల వెనుక తారాడే ఈ అమ్మాయి వైపు గుంజింది. ఇప్పుడు కూడా, ఈ పగలు గడిస్తే వచ్చే రాత్రిలోంచి, వెచ్చటి శ్వాసలు నన్ను సోకుతున్నాయి. ఈ చనువు మంచిదేనేమో, ఇద్దరం ఆ రాత్రిలోకి సులువుగా సర్దుబాటు కావటానికి.

చాలా దూరం నడిచాక, ఎడం వైపు చెట్లు పెద్దగా లేని పల్లం వచ్చింది. అది అలా దూరంగా సాగి, దాని చివర ఒక కొండ మొదలైంది.

“మనం ఆ కొండ ఎక్కగలమా?” అన్నాను.

యశ్వంత్‌, “ట్రెక్కింగ్‌ ట్రెక్కింగ్‌,” అని గెంతటం మొదలుపెట్టాడు. తను కూడా సరేనంది.

పల్లంలో గడ్డి మధ్యన కాలి బాట వుంది, ఏ మేకలు మేపుకునే వాళ్ళో నడిచే బాట. యశ్వంత్‌ ముందు పరిగెత్తాడు. ఆమె కూడా ఉత్సాహంగా నన్ను దాటి అడుగులు వేస్తుంది. తన పచ్చటి చుడీదార్‌ ఎండలో వెలుగుతోంది. మేం ఎంత నడిస్తే ఆ కొండ అంత వెనక్కి జరుగుతోందా అనిపించింది కాసేపటికి. పావుగంట నడిచి ఉంటాం. మేం నడుస్తున్న బాట మధ్యలోనే ఆగిపోయింది. తుప్పల మధ్య చూసుకుంటూ మెల్లగా నడవాల్సి వచ్చింది. “జాగ్రత్త నానా,” అంటోంది యశ్వంత్‌ని. మొత్తానికి కొండ మొదటికి చేరాం. అక్కడో మర్రి చెట్టు ఉంది. భూమ్మీద పాకిన దాని వేర్ల మీద కూర్చున్నాను. ఆమె నడుం మీద చేతులానించి నిలబడి, కళ్ళు చిట్లించి, కొండ పైకి చూస్తోంది. మగాణ్ణి నేను తోడు వచ్చాను కాబట్టి గానీ, లేదంటే ఆమె ఆ రోడ్డు వదిలి ఇంత దూరం ఎప్పటికీ రాగలిగేది కాదు. ఇంత భూమ్మీద ఆడాళ్ళు మసలుకునే చోటు ఎంత చిన్నదో కదా అనిపించింది.

“నువ్వు చేసింది పిచ్చి పనే అనిపిస్తోంది నాకు,” అన్నాను.

“ఎందుకు?”

“ఇలాంటి చోట్లు అంత సేఫ్‌ కాదు.”

ఇంకో వేరు మీద తనూ కూర్చుని, యశ్వంత్‌ని వొళ్ళోకి లాక్కుంది. “అంటే? పురుగూ పుట్రా, పులులూ సింహాలూ… అవా?”

“కాదు… మగాళ్ళు. ఈ గూడేల్లో ఉండే మనుషులు చాలా మోటుగా ఉంటారు. వాళ్ళ మొహాలు చూసావు కదా, మనకంటే ఎంత తేడాగా ఉన్నాయో. ఆ తప్పడ ముక్కులు, చాట ముఖాలు… వాళ్ళకి నీలాంటి ముఖాలు, నీ సివిలైజ్డ్‌ ఆరా, ఒక ఫాంటసీయేమో అనుకుంటాను, వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే.”

“అలా ఎప్పుడూ అనిపించలేదండీ. పాపం చాలా అమాయకంగా ఉంటారు వాళ్ళు.”

“నీ అమాయకత్వంలోంచి చూస్తే నీకలా అనిపిస్తుంది అంతే. అయినా అంతగా విడిగా ఉండాలంటే, ఆ సిటీలోనే వేరే ఇల్లు తీసుకుని, అక్కడే ఏదన్నా ఉద్యోగం వెతుక్కోవచ్చు కదా?”

“అసలు నేను తీసుకున్న నిర్ణయమే మీకు నచ్చలేదనుకుంటాను.”

తెలిసిపోయిందా! కానీ ఆ విషయం మీద నా అభిప్రాయం చెప్పాలని లేదు. “నాకు నచ్చటం నచ్చకపోవటంతో సంబంధమేముంది. నీ జీవితం, నీ ఇష్టం.”

“కానీ మీకో అభిప్రాయం ఉండే ఉంటుంది కదా. దాని గురించి అడుగుతున్నాను.”

“అది ఇర్రెలెవెంట్‌. నేనంటున్నదల్లా నువ్వు ప్రాక్టికల్‌గా ఆలోచించలేదేమో అని.”

ఆమె కాసేపు నిశ్శబ్దంగా ఉండి అంది, “నేను ఏడాది క్రితం అనుకుంటాను, మీకు మొదటిసారి ఈమెయిల్‌ పంపాను.”

“అవునూ…”

“అప్పుడు నా లైఫ్‌ ఏం బాలేదు. సునీల్‌కి ఎఫైర్‌ నడుస్తుందని తెలిసిన కొత్త. అప్పుడే మీ కథల పుస్తకం నా చేతికొచ్చింది. మీ కథలు నాకు చాలా నచ్చాయి. మీకు పెట్టిన మొదటి ఈమెయిల్‌లో ఒక కథ గురించి చాలా ఎక్కువ రాశాను, గుర్తుందా?”

గుర్తు తెచ్చుకున్నాను, “ ‘జాలిపడి వెళ్ళిపోయింది’, అదేనా?”

“అవును. ఒక అమ్మాయి గొంతుతో ఆ కథ ఎంత బాగా రాశారో అనిపించింది. అప్పుడు నేనున్న పరిస్థితిలో ఆ కథలో నన్ను నేను చూసుకున్నాను. అది నన్ను సూసైడల్‌ థాట్స్‌ నుంచి తప్పించింది.”

ఆ కథలో భర్తతో మానసికంగా దూరమైపోయిన ఒక అమ్మాయి అతను ఆఫీసుకెళ్ళాక పదో ఫ్లోరు బాల్కనీలోనే ఎక్కువ కాలం గడుపుతుంది. కింద మనుషులూ వాహనాలూ, సంతలోంచి లీలగా అరుపులూ, చీమల్లా ఆగి కదిలే ఆటోలూ… దూరంగా చిన్నగా కనపడే ప్రపంచం…  నెమ్మదిగా ఆమెకి తన చుట్టూ ప్రపంచం కూడా అదే దూరంలో కనిపించటం మొదలవుతుంది. భావనా ప్రపంచంలో బంధీ అయిపోతుంది. బాల్కనీకి పక్కన ఏసీ యూనిట్‌ మీద పావురాలు కట్టుకున్న గూడూ, ఆ గూట్లో సన్నివేశాలే ఆమెకి దగ్గరగా అనిపిస్తాయి. తన ప్రపంచం అలా చిన్నదైపోవటాన్ని భరించలేకపోతుంది. ఒక రోజు బాల్కనీలోంచి కింద ప్రపంచంవైపు దూకేస్తుంది, దాన్ని తనలోకి ఆహ్వానిస్తూ, చేతులు బార్లా చాచి…. ఆ బిల్డింగ్‌ ప్రహరీగోడకు ఇవతలే, టైల్స్ పరిచిన నేల మీద చిట్లిపోయే దాకా, ఆమె మొహంపై నవ్వు చెదరదు. అయితే దూకేముందు, తనది ఆత్మహత్య అని భర్తకి తెలీకుండా, పొరబాటున జారిపడినట్టు అక్కడ అన్నీ అమరుస్తుంది: బాల్కనీ పైన వేలాడే బర్డ్‌ ఫీడర్‌లో గింజలు నింపబోతూ పడిపోయినట్టు అక్కడో స్టూల్‌ వేస్తుంది, దాని చుట్టూ గోధుమలు చల్లుతుంది; కాలికి తగిలి పడ్డట్టు ఒక గులాబీల కుండీని కూడా కింద పడేస్తుంది. ఆ కుండీ కూడా ఆమె పక్కనే పగులుతుంది, పూలు విడి రెక్కలు చెదిరిపోతాయి. ఈ కథ చదివే ఎంతో ఫీలయి రాసింది మహతి మొదటి ఉత్తరంలో.

“అది కొత్తల్లో రాసిన కథ. అప్పటికి నాకింకా పెళ్ళి కూడా కాలేదు,” అన్నాను.

“కానీ నేను చదివింది నా పెళ్ళయ్యాకనే. ఆ అమ్మాయి గొంతుతో మీరు మాట్లాడినవన్నీ చాలాసార్లు నాతో నేను మాట్లాడుకున్న మాటలే.”

“ఏమో నాకైతే ఇప్పుడా కథ మీద గొప్ప అభిప్రాయమేం లేదు. నీలాగే చాలామంది నచ్చిందన్నారని పుస్తకంలో ఉంచానంతే.”

“ఎందుకు? ఆమె పడిన బాధంతా ఇప్పుడు మీకు బాధ అనిపించదా?”

నిట్టూర్చాను. “కొంతమంది ఆడాళ్ళకి అతిగా ఫీలయ్యే జబ్బు ఉంటుందనిపిస్తుంది. అలాగని వాళ్ళనీ ఏమనలేం. ఆడాళ్ళకి కొన్ని తరాల క్రితం ఉన్న సపోర్ట్‌ స్ట్రక్చర్స్‌ ఏమీ ఇప్పుడు లేవు. ఆ ఒత్తిడి ఉంది వాళ్ళ మీద.”

“ఏం సపోర్ట్‌ స్ట్రక్చర్స్‌? తిరగలీ రోకలీనా? అత్తలూ ఆడపడుచులూనా?”

“కుటుంబ వ్యవస్థ అంటేనే చెడ్డది కాదు మహతీ… అదే మన దరిద్రం. మనకు ఒకప్పుడు ఆసరాగా ఉన్నవన్నీ పాడు చేసుకున్నాం. కానీ మనం మానసికంగా ఇంకా అక్కడే ఉన్నాం. కాబట్టి కొత్తగా తెచ్చిపెట్టుకుంటున్నవాటిలోనూ కుదురుకోలేకపోతున్నాం. అటు వెనక్కి వెళ్ళలేం, ఇటు ముందుకెళ్ళి స్థిరపడటానికి టైమ్‌ పడుతుంది. ఈలోగా కొంతమంది కొట్టుకుపోతారు. సంధి దశ… యాతన తప్పదు.”

“వెనక్కి వెళ్ళటానికి అక్కడ ఏముందసలు? ఈ మాత్రం బైట పడే స్వేచ్ఛ కూడా లేకుండా, సరిపడని పెళ్ళిళ్ళలో అలాగే మగ్గిపోయి, లోపలే చచ్చిపోయి, బైట కూడా చచ్చిపోయేదాకా ఎదురుచూస్తుండటం… అంతేగా?”

“ముప్ఫయ్యేళ్ళు దాటాకా మనం మనకోసం ఆలోచించుకోకూడదు. మన తర్వాతివాళ్ళ విషయం ఆలోచించాలి. ముఖ్యంగా ఆడవాళ్ళు. ఎందుకంటే పిల్లల్ని పెంచేదీ, రాబోయే సొసైటీని తయారు చేసేదీ వాళ్ళే. వెస్ట్‌లో ఉన్న మోడల్ ఏమీ గొప్ప కాదు. అక్కడ ఆడాళ్ళు– వాళ్ళు వాళ్ళ భర్తల్ని ఎంత సులువుగా మార్చేసుకుంటారో వాళ్ళ పిల్లలు కూడా తండ్రుల్ని అంతే సులువుగా మార్చేసుకోగలరనుకుంటారు. అది జరగదు. అందుకే అక్కడ పిల్లలు అంత డిస్‌ఫంక్షనల్‌గా తయారవుతారు.”

“వాళ్ళు మనకంటే బాగానే ఉన్నారు.”

“ఏదీ టీనేజర్లు స్కూళ్ళల్లోకి తుపాకులు పట్టుకెళ్ళి ఎడాపెడా కాల్చేయటమా?”

“ఇక్కడ గన్‌ లైసెన్స్‌ అంత సులువుగా దొరికితే అంతకంటే ఘోరాలే చేసేవాళ్ళుంటారు. దొరక్కపోయినా చేస్తున్నారు, ఆడాళ్ళ మీద. నాన్న చేతిలో అమ్మ పడే హింసని చూస్తూ పెరిగే పిల్లాడు పద్ధతిగా పెరుగుతాడా, అలా చులకనవుతూ కూడా ఏమీ చేయలేని అమ్మని చూస్తూ పెరిగితే వాడికి ఆడాళ్ళ మీద గౌరవం ఉంటుందా?”

“తాగి రావటం, కొట్టడం… ఆ లెవెల్‌ హింస గురించి నేను మాట్లాడటం లేదు.”

“నేనూ దాని గురించి మాట్లాడటం లేదు.”

“మానసికమైన హింస అంటావా…? అది చాలాసార్లు ఆడవాళ్ళు కల్పించుకునేదే. పెళ్ళిలో ఇద్దరూ ఆనందంగా ఉండటం అరుదుగా జరుగుతుంది. ఎవరో ఒకళ్ళు సర్దుకోవాలి. ఆ సర్దుకునేది ఆడదైతే ఆ కుటుంబం బాగుంటుంది.”

ఆమె యశ్వంత్‌ తలలో వేళ్ళతో దువ్వుతూ అంది, “అసలు నాతో ఉత్తరాల్లో మాట్లాడిన మనిషేనా మీరనిపిస్తుంది.”

నవ్వి ఊరుకున్నాను. లోపలేదో సింహాసనం మీంచి తోసేయబడిన బాధని దిగమింగుకుని.

“మొత్తానికి నా నిర్ణయం తప్పని మీ అభిప్రాయం. అంతేనా?”

నేను ఆమె తరఫు నుంచి ఆలోచించటానికి ప్రయత్నించాను; మా మధ్య ఉన్న ఈక్వేషన్‌ ఏమాత్రం చెడగొట్టని సమాధానం కోసం వెతికాను. ఈ మొత్తం విషయం గురించి ఒక్క ముక్కలో ఏమనగలనా అని ఆలోచిస్తే, నన్ను పెద్ద నివ్వెరపరచకుండానే, నా మనసులో ఒక మాట రూపం దాల్చింది: “ఇది మగాళ్ళ ప్రపంచం” అన్న మాట. అది పైకి అనలేను కాబట్టి, నోరు పెగుల్చుకుని, ఆలోచనతో సంబంధంలేని కొన్ని ముక్కలు కక్కాను. “దట్స్‌ ద వే ఇటీజ్‌ మహతీ! నీ నిర్ణయం గురించి నేనేం చెప్పగలను. నువ్వేం బాధపడ్డావో నాకేం తెలుసు. ఐ యామ్‌ ఎ మాన్‌”.

“సరే, పదండి” అని పైకి లేచింది.

కొండ సగం దాకా ఎక్కగలిగాం. ఆమె నాతో పెద్ద మాట్లాడలేదు. తన ఆలోచనల్లో తను ఉన్నట్టు ముక్తసరి జవాబులే వచ్చాయి. నేనిక యశ్వంత్‌ని ఆడించటంలో పడ్డాను. వాడిని కొమ్మల మీద ఊగించటం, ఊడలతో ఉయ్యాల కట్టడం, చీమల పుట్టల మీదకు వొంగి వాటి రద్దీని గమనించటం….

మధ్యాహ్నం దాటాకా, ఇంక ఆకలేసి వెనక్కి వచ్చాం. భోజనాల తర్వాత ఆమె ఒకసారి స్కూలుకి వెళ్ళాలంది. సెలవు పెట్టింది కానీ ఏదో అనుకోని పని పడిందట. పిల్లాడ్ని వెంట తీసుకుపోయింది. వెళ్ళే ముందు నన్ను కాసేపు రెస్ట్ తీసుకొమ్మని, బెడ్‌రూమ్‌లో ఉన్న దివాన్‌ కాట్‌ (బహుశా పిల్లవాడు పడుకొనేది) తెచ్చి, హాల్లో వేసింది. అలా ఏ పరిచయం లేని ఆ ఇంట్లో, అడవి మధ్య, ఒక పూట గడపాల్సి వచ్చింది. మామూలుగా ఒక అతిథికి అనుమతి ఉండని తావులన్నీ, అనుమతిలేదన్న ఎక్సయిట్మెంటుతోనే, కాసేపు వెతికాను. సింక్‌ అద్దం పక్కన బొట్టు బిళ్ళలు, వెంట్రుకలు అంటిన జడ బాండ్స్‌, అల్మరాలో బట్టల కింద వాడని పాడ్స్‌… మాలతి చనిపోయాక నా ఇంట్లో కనిపించటం మానేసిన ఆడతనం మసిలే గుర్తులు.

బెడ్‌రూమ్‌లో మహతి మంచం పక్కనే వున్న పుస్తకాల అరలో నా కథల పుస్తకం కనపడింది. ఇందాక ఆమె ప్రస్తావించిన కథని ఇప్పుడు ఆమె కళ్ళతో చదవాలని ప్రయత్నించాను. పదిహేనేళ్ళ క్రితం రాసిన ఆ కథని నాలుగేళ్ళ క్రితం పుస్తకం వేసినప్పుడు తప్పించి మరలా చదవలేదు. చదవబుద్ధేయలేదు. ఇప్పుడు చదువుతుంటే ఎంత దూరంగా అనిపించిందంటే, దానిలో సరి చేయాల్సింది ఎంత కనిపించిందంటే, దాన్ని మళ్ళీ నా కళ్ళతో మాత్రమే చదవగలిగాను. పేజీలు తిరగేస్తుంటే ఒక కథలో శృంగార వర్ణన కనపడింది. అది మహతి చదివి వుంటుందని ఊహించుకుంటే, ఎక్కడో దూరంగా కామపు కిటికీ రెక్క కొట్టుకుంది…. అలా మహతి మంచం మీదే పుస్తకం తిరగేస్తూ— ప్రయాణంలో నిద్రలేకపోవటం, పొద్దున్న కొండ ఎక్కిన అలసట, ఇప్పుడు బాగా తినటం వల్ల— కళ్ళు మూతలుపడి, బండరాయిలాగా నిద్రపోయాను.

లేచేసరికి గదిలో చీకటి, కిటికీలోంచి కనపడుతున్న ఆకుల మీద గుడ్డి బల్బు వెలుగు…. తలుపు తీసాను. ముందు గుమ్మం వైపు నడిచాను. దానిమ్మ చెట్టుకు ఒక వైరు లాగి బల్బు వేలాడగట్టారు. కింద సిమెంట్‌ చప్టా మీద యశ్వంత్‌ పుస్తకం ఒకటి తెరిచి ఉంది. వాడు మాత్రం చదవటం లేదు. ఎక్కడ్నుంచో ఏరి తెచ్చిన ఎండు కొమ్మలతో చలిమంట వేస్తున్నాడు. చిట్టి చేతుల్తో చలి కాచుకుంటున్నాడు. మహతి దడి దగ్గర ఉన్న మొక్కలకి నీళ్ళు పోస్తుంది. గడప దగ్గర మెట్టు మీద కూర్చున్నాను. కంటి ముందు ఆ దృశ్యం చూట్టానికి బాగుంది.

“గట్టిగానే నిద్రపోయినట్టున్నారు” అంది నవ్వుతూ. ఆమె ప్రసన్నత నా మనసుపైకి వెన్నెల్లా ప్రసరించింది. పొద్దున్నించీ క్షణాల్ని గంటల్లా లెక్కపెట్టుకుంటున్న నాకు– ఇలా నిద్ర వచ్చి గంటల్ని క్షణాల్లాగా దాటించేయటంతో, చాలా సంతోషంగా ఉంది.

“వొళ్ళు తెలీలేదు. నీ మంచం మీదే నిద్రపోయాను. సారీ.”

“ఫర్లేదు లెండి.”

ఆమెకి తోటపని వాళ్ళ నాన్న నేర్పించాడట. నాన్నంటే ఆమెకి చాలా ఇష్టమని మాటల్లో తెలుస్తోంది. పుట్టింటి వైపుకి, అట్నించి బాల్యం వైపుకి ఆమె మాటలు మళ్లాయి. ఆ మాటల వెనుక మెదిలే తలపోతల వల్ల ఆమెలో కలుగుతోన్న సంతోషం– పొద్దున్న మా మధ్య నడిచిన చర్చ వల్ల కలిగిన చేదేమన్నా ఉంటే దాన్ని చెరిపేస్తుందనిపించింది. అందుకే అడిగి మరీ బాల్యం గురించి ఇంకా మాట్లాడించాను. ఆ మాటల్లో ఆమె పరికిణీ లంగాల్లోని పిల్లగా స్ఫురించటం ఒక బోనస్‌.

కలలోలాగా కాలం గడుస్తోంది. కునికిపాట్లు పడుతున్న పిల్లాడ్ని తన గదిలో మంచం మీద పడుకోబెట్టింది. వంటగదిలో గ్యాస్‌స్టవ్‌ మీద నాకు చపాతీలు వేస్తోంది. నేను నీళ్ళు తాగటానికన్న సాకు మీద వంటగదిలోకి వచ్చి అక్కడే ఉండిపోయాను. గోడకానుకుని నిలబడి, ఆమెను మాట్లాడిస్తున్నాను. ఆమె అందం ప్రజ్వలించి సెగలు సన్నగా నన్ను తాకుతున్నాయి…. చెవి కింద సాగిన మెడ, చున్నీ కింద ఊపిరి పొంగు, అర చేతుల చెమట, నా కడుపు కింద నీలం మంట….

మాటలు కాసేపు ఆగితే, ఆగనిచ్చి, నిశ్శబ్దాన్ని సావకాశంగా సాగనిచ్చి, అప్పుడన్నాను. “ఫొటోలు నువ్వు ఇంత అందంగా ఉంటావని చెప్పలేకపోయాయి.”

ఆమె పరాగ్గా నా వైపు చూడబోయి, ఈలోగా అర్థమైనట్టు, చూడకుండానే నవ్వింది, “అవునా?” అంది.

“అవును. ఇంకోటేమిటంటే– నీ నవ్వు కూడా చాలా బావుంటుంది. కానీ కళ్ళలోనే, దిగులు, ఎందుకు?”

ఆమె రెండో చపాతీ పెనం మీంచి తీసి ప్లేటులో వేసింది. కూర గరిటెతో వడ్డించింది. ప్లేటు నా వైపు అందిస్తూ, “వెళ్ళండి, తినండి,” అంది, నా వైపు చూడకుండా… ముఖంలో వెన్నలాంటి కాఠిన్యం, వేడికి కరిగిపోయేది….

ప్లేటు పుచ్చుకోవటానికన్నట్టు ముందుకు జరిగి, ఇంక మిగిలిన ఆ కాస్త దూరమూ ఒక మాయ దూరంలాగా చప్పున తగ్గిపోతే, ఆమె చేయి పట్టుకుని, రెండో చేయి మెడ మీద వేయబోతోంటే–

అరిచి, వెనక్కి గెంతింది. పళ్ళాలేవో పడి, పెద్ద చప్పుడు.

“ఏమైంది, ఏంటి?” ఊరడింపుగా అన్నాను.

“అవతలకు వెళ్ళండి! ముట్టుకోవద్దు.” నా వైపు చూడటం లేదు, చూపుడు వేలు మాత్రం చూపిస్తోంది.

బెట్టు? ఇంకొంచెం దువ్వాలా?

“ప్లీజ్‌, ఒక్కసారి” ముందుకు వెళ్ళాను.

ఆమె రెండడుగులు వెనక్కు వేసి, గట్టు మీద చేతికందిన స్పూను పట్టుకుని, వెంటనే అది పడేసి చాకు పట్టుకొని, నా వైపు ఎత్తి చూపించింది. “మర్యాదగా చెప్తున్నా. నేనేం చేస్తానో నాకే తెలీదు.”

మతిపోయి నిలబడ్డాను. చపాతీ పళ్ళెం గట్టు మీదకు విసిరేశాను. వెనక్కి తిరిగి వెళ్తుంటే, మెదడులో అంతా కలగాపులగం. ఇలా జరిగే అవకాశముందా? మరి ఎందుకా ఉత్తరాలు, ఏమిటా చనువు? వెధవని చేసి, ఈ స్థితికి నన్ను దిగలాగి… ఎందుకు, ఏమొస్తుంది?

గదిలోకి వచ్చి దివాన్ కాట్ మీద కూలబడ్డాను.

ఆమె పిల్లాడు పడుకున్న గదిలోకి పోయి, గట్టిగా తలుపు వేసుకుంది.

సారీ చెప్పాలా, నా తప్పేం లేని దానికి? పొద్దున్న నేను మాటలు జారటం… “అసలు నాతో ఉత్తరాల్లో మాట్లాడిన మనిషేనా మీరనిపిస్తోంది” అంది కదా… ఒకవేళ అందుకా? తన బాధనర్థం చేసుకోనందుకా?

సమయం గడ్డకట్టినట్టు, సమయంలో ఇరుక్కుపోయినట్టు.

కాసేపటికి తలుపు తెరిచి, ఇటు చూడను కూడా చూడకుండా, వంటగదిలోకి వెళ్ళిపోయింది. స్టవ్‌ కట్టడం మర్చిపోయింది లాగుంది. మళ్ళీ వచ్చి, లోపలికి వెళ్ళబోతూ, మనసు మార్చుకున్నట్టు, గుమ్మం దగ్గర ఆగి, వెనక్కి తిరిగింది, “ఎందుకు వచ్చారు మీరసలు ఇక్కడికి. ఇదే ఉద్దేశమా?”

ఆమె కళ్ళల్లో కన్నీళ్ళుంటాయేమోనని వెతికాను, లేవు. రాజీవైపు వెళ్తామా? మాటలు పొందికగా కుదిరి మంచం వైపుకి తీసుకెళ్తాయా?

“ఛా, అదేం కాదు. నువ్విలా అన్నీ వదిలి వచ్చేసావంటే బాధగా అనిపించింది. ఎంత బాధపడుంటే ఈ నిర్ణయం తీసుకునుంటావా అనిపించింది. ఒకసారి నేనున్నాను అని చెప్పాలనిపించింది.”

ఆమె పెదాలపై వెటకారం, విరక్తి కలిసిన నవ్వు. “మీకసలు నా సమస్యే చాలా తేలిగ్గా అనిపించింది కదా. మీకు నా నిర్ణయం వొళ్ళు బలుపు నిర్ణయం. మరి దేనికి సానుభూతి?”

“నువ్వు సరిగా అర్థం చేసుకోలేదు”

“అతిగా ఫీలయ్యే జబ్బు?”

“అది నీ గురించి అనలేదు.”

“ఒకటి చెప్పండి… మీ ఆవిడ… చనిపోయిందన్నారు కదా, మూడేళ్ళ క్రితం, సముద్ర స్నానం చేస్తూ, అలల్లో కొట్టుకుపోయి? ఆవిడకి ఈదటం రాదా?”

తను అంటున్నదేమిటో– ఆగి అర్థం చేసుకుని, మాట్లాడాల్సి వచ్చింది. “ఈత వస్తే ఎందుకు చనిపోతుంది?”

“ఏమో…”

నాలో చివ్వున ఏదో తలుపు తెరుచుకుని అర్థంకాని అన్వయంలేని దృశ్యమేదో ఎదురుపడ్డట్టు… “అంటే?”

జవాబివ్వకుండా చేతులు కట్టుకుని నా మొహంలోకి చూస్తోంది, దేన్నో ఆశిస్తున్నట్టు.

ఎన్నో రాత్రులు పదునుగోళ్ళతో నా నిద్రను రక్కిన రక్కసి అనుమానం– ఇప్పుడు ఈమె గొంతులో మాటలు తొడుక్కొంది. “అంటే? ఈతొచ్చినా ఈదకుండా…”

భుజాలెగరేసింది. లోపలికెళ్ళి తలుపేసుకుంది.

ఆ తలుపుని పిడికిళ్ళతో బద్దలుగొట్టి లోపలికి వెళ్ళి దాని జడపుచ్చుకుని గోడకేసి కొట్టాలన్నంత కోపం….

తలుపు దగ్గరకు వెళ్ళాను. చీలికలోంచి వినపడేట్టు మాట్లాడాను. “నీకు నా గురించి కానీ నా కుటుంబం గురించి కానీ ఏమీ తెలీదు, నేను ఉత్తరాల్లో చెప్పిన రెండు ముక్కలూ తప్ప. అతిగా ఊహించుకుని నోటికొచ్చినట్టు మాట్లాడకు, నీకంత చనువు నేనివ్వలేదు. నీకు నా మీద ఇంట్రస్ట్‌ ఉందనుకున్నాను, లేదని తెలిసింది, అక్కడితో అయిపోయింది. అవును, అంటే అంటాను; అతిగా ఫీలయ్యే జబ్బున్న ముండలే మీరందరూ. నువ్వు మాత్రం? నీ మొగుడు అంత మంచి ఏరియాలో, పదో ఫ్లోర్‌లో, త్రిబుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌ కొనటానికి నానా చంకలూ నాకి కూడబెట్టి ఉంటాడు. ఇంటికొస్తే నువ్వూ, నీ ఫీలింగ్సూ, కంప్లయింట్సూ చూసి మొహం మొత్తి ఉంటుంది. కాస్త సరదాగా ఉండే ఇంకొకత్తి ఎవర్తో తగిలి వుంటుంది. పద్ధతైనోడు కాబట్టి తప్పు ఒప్పుకున్నాడు, ఒక బలహీనతకి లొంగిపోయి ఇల్లు పాడు చేసుకోవాలనుకోలేదు. మంచోడు కాబట్టి నిన్ను వదులుకోవాలనుకోలేదు, అన్నీ అమర్చిపెట్టినా కుంగిపోవటం తప్ప ఇంకోటి తెలీని నీలాంటి మనిషిని–”

“టక్‌… టక్‌…”

అటువైపు నుంచి తలుపు మీద ముణుకులతో కొట్టిన చప్పుడు.

మాట్లాడింది, “నన్ను హర్ట్‌ చేసేంత సీన్‌ నీకు లేదు. ఇంకేం చప్పుడు చేసినా చుట్టుపక్కలాళ్ళకి ఫోన్‌ చేసి రప్పించాల్సి వస్తుంది. రాత్రికి పడుకోనిస్తున్నా, సంతోషించు. పొద్దున్న నేను లేచేసరికి నా ఇంట్లో ఉంటే మాత్రం బాగోదు. ఆరింటికి ఫస్ట్‌ బస్సు.”

పిడికిళ్ళతో తలుపు పగలగొట్టాలనిపించినా, కోపం ఆపుకున్నాను. “నీ ముష్టి ఇంట్లో పడుకోవాల్సిన ఖర్మేం పట్టలేదు!”

చకచకా బట్టలు బాగ్‌లో కూరేసుకుని, లుంగీ నుంచి ఫాంట్‌లోకి మారి, బైటకు వచ్చేశాను. గడప మీదకొచ్చాకా గుర్తొచ్చింది, ఈ వెధవ ఊళ్ళో లాడ్జీలు కూడా ఉండవని.

పిచ్చి కోపం– మెట్ల మీద కూర్చున్నాను– పెరడంతా వెన్నెట్లో ఉంది, ఇందాకటి దాకా ఎంతో రంజైన సొత్తు దాచుకున్నట్టు రెచ్చగొట్టిన ఈ పరిసరాలు, ఇప్పుడీ వెన్నెట్లో చచ్చుబడి, శవంలాంటి చల్లదనంతో….

పక్కనుంచి వేడి గాలి తాకింది, ఏదో వెలిగింది. చలిమంట… దాదాపు ఆరిపోయిందే, మళ్ళీ రాజుకుంటోంది. ఇప్పుడే వీచిన గాలికి ఒక్కసారి భగ్గుమంది. అందులో ఏదో కాలుతోంది, ఏమిటది? దగ్గరకు వెళ్ళి చూసాను.

ఇందాక ఆమె బైటికొచ్చింది స్టవ్ కట్టడానికి కాదు. అప్పుడే విరబూచిన పసుపు రంగు మంటలో, నా కథల పుస్తకం. ఆ మంట మొదట్లో ఒక నీలం మంట పాకుతోంది– బ్యాక్ కవర్ మీద ఉన్న నా ఫొటోని కాలుస్తూ, మసిగా మారుస్తూ.

((()))

Published in Rastha January 1st 2020