September 23, 2020

ఎ పెర్ఫెక్ట్ డే ఫర్ బనానా ఫిష్

 - జె.డి. శాలింజర్ 


అడ్వర్టయిజింగ్ ఫీల్డులో పనిచేసే తొంభై ఏడుమంది న్యూయార్క్ వాళ్ళు ఆ హోటల్లోనే మకాంవేసి, లాంగ్ డిస్టాన్స్ లైన్స్ అన్నీ వాళ్ళే కబ్జా చేసేయటంతో, 507 నంబరు గదిలో ఉన్న అమ్మాయికి మధ్యాహ్నం పన్నెండు నుంచి రెండున్నర దాకా ఎదురుచూస్తే తప్ప లైన్ దొరక లేదు. ఆ సమయాన్ని ఆమె ఊరికే పోనీయలేదు. పాకెట్ సైజు మహిళల పత్రికలో “సెక్స్ స్వర్గమా నరకమా” అన్న ఆర్టికల్ చదివింది. తన దువ్వెననీ, బ్రష్షునీ శుభ్రంగా కడిగింది. బీజ్ కోటు స్కర్టుకి అంటుకున్న మరక తుడిచింది. బ్లౌజుకి బొత్తం మార్చింది. పుట్టుమచ్చ మీద కొత్తగా మొలిచిన రెండు వెంట్రుకల్ని పెరికింది. ఆపరేటర్ ఎప్పటికో ఆమె గదికి ఫోన్ కలిపే సమయానికి, ఆమె కిటికీ గూట్లో కూర్చుని ఎడమచేతి గోళ్ళకి రంగు పూస్తోంది.  

ఫోన్ మోగితే అన్నీ వదిలేసి పరిగేత్తే అమ్మాయి కాదామె. ఆ ఫోను తను పెద్దమనిషైన దగ్గర్నుంచీ మోగుతూనే వున్నట్టు చూసింది దాని వంక. 

అది మోగుతూనే ఉంది, ఆమె చిన్న బ్రష్షుతో చిటికెనవేలి గోరు మీద చంద్రవంకలు పేర్చుకుంటూ పోయింది. గోళ్ళరంగు మూత పెట్టి, లేచి నుంచొని, తన తడి—ఎడమ—చేతిని గాల్లో అటూయిటూ ఊపింది. పొడి చేత్తో, కిటికీ అంచున కిక్కిరిసిపోయున్న ఆష్ ట్రే అందుకొని, తనతోపాటు తీసుకెళ్ళి, మంచం పక్కన ఫోన్ మోగుతున్న టేబిల్ మీద పెట్టింది. శుభ్రంగా పక్కేసివున్న డబల్ బెడ్ మీద కూర్చొని—ఐదో రింగుకో, ఆరో రింగుకో—ఫోన్ ఎత్తింది. 

“హెలో,” అంది. ఎడమ చేతి వేళ్ళను విప్పారదీసి, తన సిల్కు డ్రస్సింగ్ గౌనుకి అంటుకోకుండా దూరంగా ఉంచింది. చెప్పులుగాక ఆమె ఒంటి మీదున్నది ఆ గౌను ఒక్కటే, ఉంగరాలు బాత్రూములో ఉన్నాయి. 

“మిసెస్ గ్లాస్, మీ ఫోన్ న్యూయార్కుకి కలుపుతున్నాను,” అన్నాడు ఆపరేటర్.

“థాంక్యూ,” అంది అమ్మాయి. ఆష్ ట్రేని టేబిల్ మీద సర్దింది. 

అటువైపు నుంచి ఒక ఆడ గొంతు “మ్యురియెల్? నువ్వేనా?” అంది.

 అమ్మాయి ఫోన్ రిసీవర్ ను చెవికి దూరంగా జరిపింది. “అమ్మా, అవును, నేనే. ఎలా వున్నావు?” 

“ఎంత కంగారు పడ్డానో తెలుసా నీ గురించి. ఎందుకు ఫోన్ చేయలేదు? బానే ఉన్నావా?”

“నీకు ఫోన్ చేద్దామని నిన్న రాత్రీ మొన్న రాత్రీ కూడా ట్రై చేశాను. కానీ ఇక్కడ ఫోన్లున్నాయే—’’

“మ్యురియెల్, నువ్వు బానే ఉన్నావు కదా?”

అమ్మాయి రిసీవర్ ని చెవికి ఇంకా దూరంగా జరిపింది. “బావున్నానులేవే. కానీ తెగ ఉక్కపోసేస్తోంది. ఇక్కడ జనం చెప్పుకుంటున్నారు, ఫ్లోరిడాలో ఇంత వేడి—" 

“ఎందుకు ఫోన్ చేయలేదు. నాకెంత కంగారుగా—"

“అమ్మా, తల్లీ! అలా అరవకు. బానే వినపడుతుంది నువ్వు మాట్లాడేది. నిన్న రాత్రి రెండు సార్లు ఫోన్ చేశాను. ఒకసారేమో సరిగ్గా—"

“మీ నాన్నతో అంటూనే ఉన్నాను, ఫోన్ చేస్తావని. కానీ ఆయనగారేమో— ఇంతకీ నువ్వు బానే ఉన్నావా మ్యురియెల్? నిజం చెప్పు.”

“బానే ఉన్నాను. అలా అడగటం ఆపుతావా, దయచేసి.”

“ఎప్పటికి చేరావు అక్కడికి?”

“బుధవారం, తెల్లవారజామున.”

“ఎవరు డ్రైవ్ చేశారు?”

“తనే డ్రైవ్ చేశాడు. కంగారుపడకు. చక్కగా నడిపాడు. ఆశ్చర్యమేసింది.” 

“తను నడిపాడా? మ్యురియెల్, నా మీద ఒట్టేయలేదూ నువ్వు—’’

అమ్మాయి మధ్యలో అడ్డొచ్చింది, “అమ్మా! చెప్పాను కదా, చక్కగా నడిపాడు. ఎక్కడా యాభై కూడా దాటించలేదు, నిజానికి.”

“చెట్ల మీదకి పోనివ్వటం... అలాంటి వేషాలేమీ వేయలేదు కదా?”

“అమ్మా, బాగానే నడిపాడని చెప్తున్నాను కదే. తెల్లగీతకి దగ్గరలోనే నడపమనీ, అదనీ ఇదనీ జాగ్రత్తలు చెప్పాను, అర్థం చేసుకున్నాడు, అలాగే నడిపాడు. చెట్ల వైపు తల కూడా తిప్పిచూడలేదు. ఇంతకీ నాన్న ఆ కారు బాగు చేయించాడా?”

“ఇంకా లేదు, వాళ్ళు ఆ ఒక్క కారుకి ఏకంగా నాలుగు వందల డాలర్లు అడుగుతున్నారు.’’

“అమ్మా... సేమోర్ నాన్నతో చెప్పాడు కదా, ఆ ఖర్చంతా తనే పెట్టుకుంటానని. ఎందుకంత కంగారు’’

“సరేలే చూద్దాం. ఇంతకీ ఎలా ఉన్నాడు?—కారులోనూ, కారు దిగాక?”

“ఫర్లేదు” అంది ఆ అమ్మాయి. 

“నిన్నింకా ఆ పేరు, ఆ చెత్త పేరుతోనే—’’

“లేదు. ఇప్పుడు ఇంకో కొత్త పేరు.”

“ఏంటది?”

“ఏదైతే ఏమయిందిలేవే.”

“మ్యురియెల్, నాకు తెలియాలి. మీ నాన్న ఎంత—’’

“సరే, సరే. ‘మిస్ స్పిరిచ్యువల్ ట్రాంప్ ఆఫ్ 1948’ అని పిలుస్తున్నాడు,” అంటూ పకపకా నవ్వింది. 

“నవ్వులాట కాదు, మ్యురియెల్. నవ్వులాట కాదు. ఘోరం. బాధేస్తుంది కూడా, ఆలోచిస్తే—’’

ఆ మాటకు అమ్మాయి అడ్డుపడింది: “అమ్మా, చెప్పేది విను. తను నాకు జర్మనీ నుంచి పంపిన కవితల పుస్తకం గుర్తుందా? అదే, ఆ జర్మన్ కవితలు. ఎక్కడ పెట్టానవీ. ఎంత గుర్తు తెచ్చుకున్నా—’’

“నీ దగ్గరే ఉంది.”

“అవునా?”

“అవునే. అంటే ఇప్పుడు నా దగ్గరుంది. ఫ్రెడీ గదిలో. ఇక్కడే వదిలేశావు. లగేజిలో సర్దుదామంటే చోటు లేదు-- ఐనా ఎందుకు? కావలంటనా?”

“లేదు. ఊరికే అడిగాడు, కారు నడుపుతున్నప్పుడు. నేను చదివానా లేదా అని అడిగాడు.”

“అది జర్మన్ భాషలో ఉంది కదే!”

అమ్మాయి కాలు మీద కాలేసుకుంది, “అవును లేవే, అయినా అది కాదు విషయం. ఈ శతాబ్దంలో ఉన్న ఒకేఒక్క గొప్ప కవి రాసిన కవితలట అవి. కనీసం అనువాదమేదైనా కొనుక్కోవాల్సిందన్నాడు. భాష నేర్చుకుంటే ఇంకా మంచిదన్నాడు.”

“ఘోరం... ఘోరమే తల్లీ. జాలేస్తుంది కూడాను. మీ నాన్న అంటున్నాడు రాత్రి—’’

“అమ్మా ఒక్కసారుండు,” అంది అమ్మాయి. లేచి కిటికీ గూట్లో ఉన్న సిగరెట్ల దగ్గరకు వెళ్ళింది, ఒకటి తీసి వెలిగించింది, మళ్ళీ వచ్చి మంచం మీద కూర్చుంది. “అమ్మా?” అంది, పొగ వదులుతూ. 

“మ్యురియెల్, చెప్పేది విను.”

“చెప్పు”

“మీ నాన్న డాక్టర్ సివెట్ స్కీ తో మాట్లాడాడు.”

“అవునా?” అంది అమ్మాయి.

“అవును. ఆయనతో అంతా వివరంగా చెప్పాడట. చెప్పానన్నాడు మరి—నీకు తెలిసిందేగా మీ నాన్న సంగతి. ఆ చెట్ల గొడవా, ఆ కిటికీ గొడవా, నానమ్మ తదనంతరం చేసుకున్న ఏర్పాట్ల గురించి అతనేమన్నాడో అదీ, ఆ అందమైన బెర్ముడా ఫొటోలని ఏం చేశాడో అదీ—అంతా చెప్పాడట.”

“ఓకే?” అంది అమ్మాయి.

“ఓకే ఏంటి! అసలు అతన్ని సైన్యం ఆసుపత్రి నుంచి రిలీజ్ చేయటమే పెద్ద తప్పన్నాడట ఆయన-- ప్రమాణపూర్తిగా చెబుతున్నా. సేమోర్ ఏ క్షణమైనా అదుపు తప్పే అవకాశం, చాలా పెద్ద అవకాశం, వుందని ఖరాఖండీగా చెప్పాడట. ప్రమాణపూర్తిగా చెబుతున్నా.”

“ఇక్కడ హోటల్లో ఒక సైకియాట్రిస్టు ఉన్నాడు,” అంది అమ్మాయి.

“ఎవరు? పేరేంటి?”

“ఏమో ఏదో ఉంది. రీజర్ అనో ఏదో. మంచి పేరున్నవాడే అంటున్నారు.”

“నేనెప్పుడూ వినలేదే.”

“ఇక్కడైతే అలా అంటున్నారు లేవే.”

“మ్యురియెల్ నిర్లక్ష్యంగా మాట్లాడకు దయచేసి. మేం చాలా కంగారు పడుతున్నాం నీ గురించి. మీ నాన్న నిన్న రాత్రైతే నిన్ను ఇంటికొచ్చేయమని టెలీగ్రాం ఇద్దామనుకున్నాడు, తెలుసా—"

“అమ్మా, ఇప్పుడు ఇంటికి వచ్చే సమస్యే లేదు. కాస్త తగ్గు.”

“మ్యురియెల్. ప్రమాణపూర్తిగా చెబుతున్నాను. డాక్టర్ సివెట్ స్కీ చెప్పటమైతే సేమోర్ పూర్తిగా అదుపు తప్పే అవకాశం—’’

“అమ్మా, నేను వచ్చిందే ఇప్పుడు. ఎన్నేళ్ళ తర్వాత కుదిరిందో ఇలా బైటికి రావటం. ఇంతలోనే అంతా సర్దేసుకుని ఇంటికొచ్చేయమంటే నా వల్ల కాదు. పైగా ఇక్కడ ఎండకి నా చర్మమంతా కమిలిపోయింది, అసలు కదిలే పరిస్థితే లేదు. ఇప్పుడు ప్రయాణం నా వల్ల కాదు,” అంది అమ్మాయి.

“బాగా కమిలిందా? నీ బాగ్ లో పెట్టిన ఆ ‘బ్రాంజ్’ జాడీ వాడలేదా? సంచిలోనే పెట్టాను చూడొకసారి—’’

“వాడాను. అయినా కమిలింది.”

“అయ్యో, ఎక్కడ?”

“మొత్తం అమ్మా, మొత్తమంతా.”

“అయ్యయ్యో!”

“ఫర్లేదు, బతుకుతాన్లే.”

“ముందిది చెప్పు, ఆ సైకియాట్రిస్టుకి విషయం చెప్పావా?”

“ఆ, కొద్దిగా...”

“ఏం అన్నాడు. నువ్వతనితో మాట్లాడేటప్పుడు సేమోర్ ఎక్కడున్నాడు?”

“ఓషన్ రూములో పియానో వాయిస్తున్నాడు. మేం ఇక్కడవున్న రెండు రాత్రులూ పియానో వాయించాడు.”

“ఇంతకీ సైకియాట్రిస్టు ఏం చెప్పాడు?”

“పెద్దగా ఏం చెప్పలేదు. ఆయనే తనంతట తను పలకరించాడు. ‘బింగో’ ఆడేటప్పుడు నాపక్కనే కూర్చున్నాడు. ‘పక్క గదిలో పియానో వాయిస్తున్నది మీ వారా’ అని అడిగాడు. అవునన్నాను. సేమోర్ కి వొంట్లో ఏమన్నా బాగుండటం లేదా అని అడిగాడు. అప్పుడు చెప్పాను విషయం—’’

“ఎందుకలా అడిగాడంటావ్?”

“తెలీదమ్మా. బాగా పాలిపోయినట్టున్నాడు కదా అందుకడిగాడేమో. సరే, విను. బింగో ఆటయ్యాకా, ఆయనా, ఆయన భార్యా- ‘మాతో కూర్చుంటారా’ అని అడిగారు. వెళ్ళాను. మనం బోన్విట్ షాపు విండోలో చూశాం కదా ఆ ఘోరమైన డిన్నర్ డ్రెస్సు, గుర్తుందా? నువ్వన్నావు కదా అది వేసుకోవాలంటే చాలా చిన్న చిన్న—’’

“పచ్చదా?”

“ఆ... ఆవిడ అది వేసుకుంది. పిర్రలే పిర్రలనుకో. ఆవిడ ఆ మాడిసెన్ అవెన్యూలో షాపు నడిపే సుజన్నే గ్లాస్ కీ సేమోర్ కీ ఏమన్నా చుట్టరికముందా అని పదే పదే అడిగింది.”

“ఇంతకీ ఆయనేం చెప్పాడు? ఆ డాక్టరు.”

“పెద్దగా ఏం చెప్పలేదు. మేం బారులో ఉన్నాం కదా. అక్కడంతా గోల గోల.”

“సర్లే, పోనీ నానమ్మ కుర్చీని అతనేం చేశాడో అదైనా చెప్పావా?”

“లేదమ్మా. అంత వివరాల్లోకి వెళ్ళలేదు. మళ్ళీ మాట్లాడే అవకాశం వస్తుందిలే బహుశా. ఆయనెప్పుడూ బారులోనే కూర్చుంటాడు.”

“ఒకవేళ, ఆయనేమన్నా, అతను తేడాగా ప్రవర్తించే అవకాశం ఉందనేమైనా చెప్పాడా? నిన్ను ఏమైనా చేయొచ్చనిగానీ?” 

“లేదు. అవన్నీ చెప్పాలంటే ఆయనకింకా వివరాలు తెలియాలి కదా. చిన్నప్పుడెలా ఉండేవాడూ... అలాంటి వివరాలన్నీ తెలియాలి వాళ్ళకి. చెప్పాను కదా, అక్కడ మాట్లాడటమే కష్టమైంది, గోల గోలగా వుంది,” అంది అమ్మాయి.

“సర్లే. నీ నీలం కోటెలా ఉంది?”

“ఫర్లేదు. కొన్ని చోట్ల పాడింగ్ తీసేశాను.”

“ఈ ఏడాది డ్రెస్సులెలా ఉన్నాయేం అక్కడ”

“వేరే లోకానివేమో అన్నట్టున్నాయి. ఎక్కడ చూసినా జిలుగులే...” అంది అమ్మాయి.

“మీ గది ఎలా ఉంది?”

“బానే ఉంది. ఓ మోస్తరంతే. యుద్ధానికి ముందు దిగామే- ఆ గది దొరకలేదు. జనం కూడా బీభత్సంగా ఉన్నారులే ఈసారి. డైనింగ్ రూములో పక్కన కూర్చున్న వాళ్ళనో, పక్క టేబిల్ వాళ్ళనో చూడాలి...  అందరూ ట్రక్కుల్లోంచి దిగి వచ్చినట్టున్నారు,” అంది అమ్మాయి.

“అన్నిచోట్లా అలాగే ఉందిలేవే. ఇంతకీ నీ బల్లెరినా డ్రెస్ ఎలా ఉంది?”

“మరీ పొడవైంది. నీకు చెప్పానుగా మరీ పొడవని.”

“మ్యురియెల్, ఇంకొక్క సారి అడుగుతున్నాను— నువ్వు బానే ఉన్నావు కదూ?”

“అమ్మా, తొ౦భయ్యోసారి చెప్తున్నాను, బానే వున్నానూ!”

“ఇంటికి రావాలనిపించటం లేదా అయితే?”

“లేదు.”

“నిన్న రాత్రి మీ నాన్న అంటున్నాడు— నువ్వొక్కదానివే ఎక్కడికైనా వెళ్ళిపోయి, కాస్త ప్రశాంతంగా పరిస్థితి గురించి ఇంకోమాటు ఆలోచించుకునే పళమైతే, ప్రయాణం ఖర్చులు ఆయన పెట్టుకుంటాడట. నువ్వు చక్కా ఎక్కడికైనా ఓడలో వెళ్ళవచ్చు. మేమిద్దరం అనుకోవటమైతే—’’

అమ్మాయి కాలి మీద కాలు మార్చుకుంది, “వద్దు. అమ్మా, నీకు తెలీటం లేదు ఇప్పుడీ ఫోన్ కాల్ ఖర్చు ఈ పాటికి—’’

“ఈ కుర్రాడి కోసం నువ్వు యుద్ధం పూర్తయ్యేవరకూ ఎలా ఎదురుచూసావో తల్చుకుంటే, మిగతా వాళ్ళతో పోలిస్తే, అంటే ఆ పిచ్చి పెళ్ళాలున్నారే, వాళ్ళు ఎలా—’’

“అమ్మా, ఇక ఫోన్ పెట్టేస్తే మంచిది. సేమోర్ ఏ క్షణమైనా రావొచ్చు,’’ అంది అమ్మాయి.

“ఎక్కడున్నాడేవిటి ఇప్పుడు?”

“బీచ్ లో.”

“బీచ్ లోనా? ఒక్కడేనా? తిన్నగా ఉంటాడంటావా?”

“అమ్మా, నువ్వు తనేదో పెద్ద ఉన్మాది అన్నట్టు మాట్లాడుతున్నావు.”

“నేను అలా అనలేదు, మ్యురియెల్.”

“నాకలాగే వినపడుతోంది. అక్కడ తను చేసేదేం లేదు. పడుకుంటాడంతే. బాత్ రోబ్ కూడా విప్పడు.”

“బాత్ రోబ్ విప్పడా? ఎందుకు?”

“ఏమో, బాగా పాలిపోయి వున్నాడు కదా, అందుకేమో.”

“దేవుడా! ఎండ తగలటమే మంచిది అతనికి. చెప్పకపోయావా?”

“నీకు తెలుసుగా సేమోర్ సంగతి, అడ్డమైనవాళ్ళంతా తన పచ్చబొట్టు చూడటం తనకిష్టం లేదంటాడు,” అంటూ అమ్మాయి మళ్ళీ కాలు మీద కాలు మార్చుకుంది.

“తనకి పచ్చబొట్టు ఏం ఉన్నట్టు గుర్తు లేదే? సైన్యంలో ఉన్నప్పుడేమైనా పొడిపించుకున్నాడా?”

అమ్మాయి లేచి నిల్చుంది, “కాదులేమ్మా, ఇదిగో, నేను నీకు రేపు కాల్ చేస్తాను, వీలైతే.”

“మ్యురియెల్, నేను చెప్పేది విను.”

“చెప్పు,” అంది అమ్మాయి, బరువుని కుడి కాలు మీదకి మార్చుకుంది. 

“అతనేమన్నా తేడాగా ప్రవర్తించినా, తేడాగా మాట్లాడినా, నీకు అర్థమవుతోందిగా, మరుక్షణం నాకు కాల్ చేయాలి. సరేనా?”

“అమ్మా, నాకు సేమోర్ గురించి భయమేమీ లేదు.”

“మ్యురియెల్, ముందు నాకు మాటియ్యి.”

“సరే, మాటిస్తున్నా. ఉంటా ఇక. నాన్నని అడిగానని చెప్పు,” అని ఫోన్ పెట్టేసింది. 

* * *

“సీ - మోర్ - గ్లాస్, డిడ్ యు సీ మోర్ గ్లాస్?” అంది సిబిల్ కార్పెంటర్. ఆమె అదే హోటల్లో వాళ్ళమ్మతో ఉంటోంది.

“ఏయ్ బుజ్జమ్మా, ఆపింక సోది. అమ్మకి కోపం తెప్పిస్తున్నావ్. కదలకు, ప్లీజ్.” 

మిసెస్ కార్పెంటర్ సిబిల్ భుజాల మీద sun-tan ఆయిల్ పోసి, సున్నితమైన, పక్షి రెక్కల్లాంటి భుజం ఎముకలపైన రుద్దుతోంది. సిబిల్ పూర్తిగా ఊదిన పెద్ద బీచ్ బంతి మీద పడిపోతుందేమో అన్నట్టు కూచుంది, సముద్రం వైపు ముఖంపెట్టి. పసుపు రంగు టూ-పీస్ బాతింగ్ సూటు వేసుకుంది. నిజానికి ఆ రెండు ముక్కల్లో ఒక ముక్క ఆమెకి ఇంకో తొమ్మిది పదేళ్ళ దాకా అవసరం పడదు.

“దగ్గరకెళ్ళి చూస్తే ఇంతాజేసి సిల్కు హాండ్ కర్చీఫ్ అంతే. ఎలా కట్టుకుందో తెలిస్తే బావుండును. ఎంత ముచ్చటగా ఉందో,” అంది మిస్ కార్పెంటర్ పక్కన బీచ్ కుర్చీలో కూర్చున్నావిడ. 

“వినటానికైతే ముచ్చటగానే ఉంది. సిబిల్, కదలకు నాన్నా,” అంది మిసెస్ కార్పెంటర్. 

“డిడ్ యు సీ మోర్ గ్లాస్?” అంది సిబిల్. 

మిసెస్ కార్పెంటర్ నిట్టూర్చింది. “అయిపోయింది,” అంటూ సన్-టాన్ ఆయిల్ సీసాకి మూత పెట్టింది. “సరే, బుజ్జమ్మా, పో పరిగెత్తు. అమ్మ కాసేపు హోటల్ లోకి వెళ్ళి మిసెస్ హబ్బెల్ తో మార్టీనీ తాగుతుంది సరేనా. నీకు ఆలివ్ తీసుకొస్తాను.”

ఇలా అదను దొరకగానే సిబిల్ బీచ్ సమంగావున్న చోటు నుంచి కిందకు పరిగెత్తింది, తర్వాత చేపలవాళ్లుండే వైపుకి నడిచింది. మధ్యలో ఒకచోట సగంకూలిన మెత్తటి కోటలోకి కాలు దించటానికి ఆగింది. కాసేపట్లోనే హోటల్లో ఉండేవాళ్ల కోసం కేటాయించిన చోటు నుంచి దూరంగా వచ్చేసింది. 

అలా ఒక పావు మైలు నడిచాక, మళ్ళీ బీచ్ మెత్తటి భాగం వైపు పైకి పరిగెత్తింది. అక్కడ వెల్లకిలా పడుకున్న ఒక అబ్బాయి ముందుకి వచ్చి ఆగింది. 

“నీళ్ళల్లోకి వెళ్తున్నావా, సీ మోర్ గ్లాస్?” అంది. 

ఆ అబ్బాయి ఉలిక్కిపడ్డాడు, చేయి బాత్ రోబ్ కాలర్ లోకి వెళ్ళింది. బోర్లా తిరిగి, కళ్ళని కప్పిన రుమాలుని కిందపడనిచ్చి, కళ్ళు చికిలిస్తూ సిబిల్ వైపు చూశాడు.

“హే, హెల్లో, సిబిల్.”

“నీళ్ళల్లోకి వెళ్తున్నావా?”

“నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏంటి విశేషాలు?” అన్నాడు.

“ఏంటీ?” అంది సిబిల్.

“విశేషాలేంటీ అంటున్నాను? ఏం జరుగుతోంది ఇవాళ?”

“మా నాన్న రేపు ఇమానం మీద వస్తున్నాడు,” అంది సిబిల్, కాళ్లతో ఇసుక తన్నుతూ.

 “పిల్లా, మొహం మీదకి తంతున్నావ్,” అంటూ, సిబిల్ పాదం మీద చేయి వేశాడు. “హ్మ్.. ఇక మీ నాన్న రావాల్సిన టైమేలే. ఎప్పుడొస్తాడాని ఎదురుచూస్తున్నా,” అన్నాడు.

“ఆవిడేది?” అంది సిబిల్. 

“ఆవిడా?” జుట్టులోంచి ఇసుక దులుపుకున్నాడు, “ఏమో ఎవరికి తెలుసు సిబిల్. వంద చోట్లలో ఎక్కడో ఒక చోట ఉండొచ్చు. హెయిర్ డ్రెస్సర్ దగ్గర జుట్టు ‘మింక్’ డై చేయించుకుంటుండొచ్చు. పేద పిల్లల కోసం గదిలో కూర్చొని బొమ్మలు తయారు చేస్తూండొచ్చు.” తన రెండు గుప్పిళ్ళను ఒకదాని మీద ఒకటి పేర్చి పైగుప్పిట మీద చుబుకం ఆన్చాడు. “ఆ సంగతొదిలేయ్, ఇంకేదన్నా అడుగు సిబిల్. నీ బాతింగ్ సూట్ భలే ఉందే. నాకీ ప్రపంచంలోకెల్లా బాగా నచ్చిందేమన్నా ఉంటే అది నీలం రంగు బాతింగ్ సూటు.”

సిబిల్ అతని వైపు అలాగే చూసింది, తర్వాత ముందుకొచ్చిన తన బొజ్జ వైపు చూసుకుంది. “ఇది పసుపు,” అంది. 

“అవునా...? దగ్గరకు రా కాస్త.” సిబిల్ ఒక అడుగు ముందుకేసింది. “చూసావా, నాకు కళ్లానటం లేదు! నువ్వే కరెక్టు.”

“నీళ్ళల్లోకి వెళ్తున్నావా?”

“వెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను. తీవ్రంగానే ఆలోచిస్తున్నాను సిబిల్, నమ్మూ నమ్మకపో.”

అతను అప్పుడప్పుడూ తలగడలా వాడే రబ్బరు తెప్పని సిబిల్ కాలితో పొడిచింది. “ఇందులో గాలి తగ్గిపోయింది,” అంది. 

“అవును, ఎవరొప్పుకున్నా ఒప్పుకోకపోయినా, అందులో గాలి తగ్గిపోయింది.” అతను గుప్పిళ్ళు తీసేసి చుబుకాన్ని ఇసుకమీద ఉంచాడు, “సిబిల్, ఎలా ఉన్నావు? నీ గురించేదన్నా చెప్పు,” అన్నాడు. తన రెండు చేతుల్నీ ముందుకు చాపి సిబిల్ పాదాల్ని అరిచేతుల్లోకి తీసుకున్నాడు, “నా రాశి మకరం. మరి నీదేంటి?” అన్నాడు. 

“షరోన్ లిప్షుజ్ ని నీ పియానో సీటు మీద కూర్చోపెట్టుకున్నావంట కదా, అది చెప్తుంది?” అంది సిబిల్. 

“షరోన్ లిప్షుజ్ అలా చెప్పిందా నీకు?”

సిబిల్ గబగబా తలాడించింది. 

అతను ఆ పిల్ల పాదాలను విడిచిపెట్టాడు, చేతులు దగ్గరకు లాక్కున్నాడు, ముఖాన్ని కుడి ముంజేతి మీద పక్కకు వాల్చాడు. “ఒక్కోసారి తప్పదని నీకూ తెలుసు కదా సిబిల్. నేను అక్కడ పియానో వాయిస్తున్నాను. నువ్వెక్కడా కనిపించ లేదు. అప్పుడు షరోన్ లిప్షుజ్ వచ్చి నా పక్కన కూర్చుంది. వచ్చి కూర్చుంటే ఏం చేయను చెప్పు, తోసేయమంటావా?”

“అవును.”

“అమ్మో, అలా చేయలేం గానీ..., అదిగాక ఇంకేం చేశానో చెప్తాను.”

“ఏంటి?”

“తను నువ్వే అనుకున్నాను.”

సిబిల్ వెంటనే తల వొంచుకుని ఇసుక తవ్వుతోంది. “నీళ్ళల్లోకి వెళ్దాం,” అంది. 

“సరే, నీ మాట కాదనలేను,” అన్నాడు.

“ఈసారి తోసేయ్,” అంది సిబిల్.

“తోసేయనా, దేన్ని?” 

“షరోన్ లిప్షుజ్.”

“ఆహ్, షరోన్ లిప్షుజ్నా? ... మళ్ళీ మళ్ళీ ఎలా పైకి తేలుతుందో కదా ఆ పేరు... జ్ఞాపకాల్నీ కోరికల్నీ కలగలిపేస్తూ,” అన్నాడు. చప్పున పైకి లేచాడు. సముద్రం వైపు చూశాడు. “సిబిల్, మనం ఒక పని చేద్దాం. మనకి బనానా ఫిష్ దొరుకుతాయేమో చూద్దాం.”

“ఏంటీ?”

“అరిటిపండు చేపలు..” అంటూ, తన బాత్ రోబ్ ముడి తీశాడు. రోబ్ విప్పాడు. అతని భుజాలు తెల్లగా సన్నగా వున్నాయి. చెడ్డీ రంగు రాయల్ బ్లూ. బాత్ రోబ్ ను నిలువుగా ఒక మడతపెట్టి, తర్వాత అడ్డంగా మూడు మడతలు పెట్టాడు. ఇందాక కంటి మీద కప్పుకున్న రుమాలు తీసి ఇసక మీద పరిచాడు. మడిచిన బాత్ రోబ్ ను దాని మీద పెట్టాడు. వొంగి, రబ్బరు తెప్పని తీసుకుని, కుడి చంకలో దోపుకున్నాడు. ఎడమ చేత్తో సిబిల్ చేయి అందుకున్నాడు. 

ఇద్దరూ సముద్రం వైపు దిగటం మొదలుపెట్టారు.

“నీ సుదీర్ఘ జీవితంలో-- చాలా అరటిపండు చేపలూ చూసే ఉంటావనుకున్నానే,” అన్నాడు. 

సిబిల్ తల అడ్డంగా ఊపింది.

“చూడలేదూ? అసలెక్కడ నువ్వు ఉండేది?”

“తెలీదు,” అంది సిబిల్.

“ఎందుకు తెలీదు, తెలిసే ఉంటుంది, తెలిసి తీరాలి. షరాన్ లిప్షుజ్ కి తను ఎక్కడ ఉంటుందో తెలుసు, తెలుసా? ఇంతాజేసి ఆ పిల్లకి మూడున్నరేళ్ళే.”

సిబిల్ నడవటం మానేసి, తన చేతిని అతని చేతిలోంచి లాక్కుంది. ఇసుక లోంచి ఒక మామూలు నత్తగుల్ల తీసుకుని అతిశ్రద్ధగా చూడటం మొదలుపెట్టింది. తర్వాత కింద పారేసింది. “విర్లీవుడ్, కనెక్టికట్,” అని, మళ్ళీ నడవటం మొదలుపెట్టింది, బొజ్జ ముందుకిపెట్టి.

“విర్లీవుడ్, కనెక్టికట్.... అంటే విర్లీవుడ్, కనెక్టికట్ కి దగ్గర్లో ఉంటుంది ఆ ఊరేనా?” అన్నాడు. 

సిబిల్ అతని వైపు చూసింది. “అక్కడే ఉంటా నేను, విర్లీవుడ్, కనెక్టికట్” అంది విసుగ్గా. అతనికంటే ముందు పరిగెత్తింది, తన ఎడమ కాలిని ఎడమ చేత్తో పట్టుకుని మూడుసార్లు గెంతింది. 

“ఎంత సులువుగా తేల్చేశావ్,” అన్నాడు. 

సిబిల్ కాలు వదిలేసింది. “నువ్వు ‘లిటిల్ బ్లాక్ సాంబో’ చదివావా?” అంది.

“భలే అడిగావే, నిన్న రాత్రే దాన్ని చదవటం పూర్తి చేశాను.” కిందకి వొంగి సిబిల్ చేయి చేత్తో అందుకుని, “నీకేమనిపించింది చదివాక?” అన్నాడు.

“పులులు ఆ చెట్టు చుట్టూ తిరిగాయా?”

“తిరిగాయా! ఇక అసలు ఆగవేమో అనుకున్నాను. అన్ని పులుల్ని నేనెప్పుడూ చూడలేదు.”

“ఆరు పులులే కదా,” అంది సిబిల్.

“ఆరు పులులే కదానా! ఆరంటే తక్కువా?” అన్నాడు.

“నీకు మైనం అంటే ఇష్టమేనా?” అని అడిగింది.

“ఏంటీ?” 

“మైనం.”

“చాలా ఇష్టం, నీకు?”

సిబిల్ తలూపింది. “నీకు ఆలివ్స్ అంటే ఇష్టమేనా?” అని అడిగింది.

“ఆలివ్స్, అవును. ఆలివ్సూ, మైనమూ. ఆ రెండూ లేకుండా బైటకు అడుగు కూడా పెట్టను.” 

“నీకు షరాన్ లిప్షుజ్ అంటే ఇష్టమా?” అనడిగింది సిబిల్.

“అవునవును. ఇష్టమే. ఆ పిల్లలో నాకు బాగా నచ్చేదేమిటంటే, తను ఎప్పుడూ లాబీలో ఉండే కుక్కపిల్లల్ని ఏడిపించదు. ఆ కెనడా ఆవిడతో ఉంటుందే ఒక టాయ్ బుల్ డాగ్, దాన్ని ఎప్పుడూ ఏడిపించదు. నువ్వు నమ్మవేమో కానీ, కొంతమంది పిల్లలు ఆ కుక్కని బుడగలు కట్టే పుల్లలతో పొడుస్తున్నారు. షరాన్ అలా ఎప్పుడూ చేయదు. అందుకే తనంటే నాకు బాగా ఇష్టం.” అన్నాడు.

సిబిల్ మాట్లాడలేదు. 

“నాకు మైనం నమిలితే బాగుంటుంది,” అంది చివరికి.

“ఎవరికి బాగోదు,” కాళ్లను నీట్లో తడవనిచ్చాడు. “అమ్మో! చాలా చల్లగా ఉంది,” అన్నాడు. తన రబ్బరు తెప్పని నీళ్ళల్లో విడిచిపెట్టాడు. “ఆగాగు, సిబిల్. కాస్త ముందుకెళ్దాం, అప్పుడూ,” అన్నాడు.

సిబిల్ నడుంలోతుకి వచ్చేదాకా ఇద్దరూ నీళ్లల్లో నడిచారు. యువకుడు ఆ పిల్లని చేతుల్లోకి ఎత్తుకొని బుడగతెప్ప మీద బోర్లా పడుకోబెట్టాడు. 

“నువ్వెప్పుడూ బాతింగ్ కాప్ పెట్టుకోవా?” అని అడిగాడు.

“వదలకు, పట్టుకో, గట్టిగా,” గదమాయించింది సిబిల్. 

“మిస్ కార్పెంటర్. నేనేం చేయాలో నాకు తెలుసు. మీరు చెప్పనక్కర్లేదు. కాస్త కళ్ళు తెరిచి అరటిపండు చేపలు ఏమన్నా ఇటు వస్తున్నాయేమో చూడండి చాలు. దిసీజ్ ఎ పెర్ఫెక్ట్ డే ఫర్ బనానా ఫిష్,” అన్నాడు. 

“నాకేం కనిపించటం లేదు,” అంది సిబిల్. 

“కనపడవు మరి. అవీ, వాటి అలవాట్లూ చాలా చిత్రంగా ఉంటాయి.” అతను తెప్పని ఇంకా ముందుకు తోస్తున్నాడు. నీళ్ళు ఇప్పుడు దాదాపు అతని ఛాతీదాకా వచ్చాయి. “పాపం వాటి జీవితం చాలా కష్టంగా గడుస్తుంది. నీకు తెలుసా సిబిల్, అవేం చేస్తాయో?”

సిబిల్ తల అడ్డంగా ఊపింది.

“చెప్తాను విను. అవి ఈదుకుంటూ ఈదుకుంటూ బోలెడు అరటిపళ్ళు ఉండే ఒక కలుగులోకి పోతాయి. లోపలికి ఈదుకెళ్ళే ముందు చూట్టానికి మామూలు చేపల్లాగే ఉంటాయి. కానీ ఒక్కసారి లోపలకి దూరాకా, అవి పందుల్లాగే బిహేవ్ చేస్తాయి. నీకు తెలుసా, కొన్ని అరటిపండు చేపలైతే ఆ అరటిపళ్ళ కలుగులోకి దూరి ఏకంగా డెబ్బై ఎనిమిది అరటిపళ్ళ దాకా తినేస్తాయి.” అతను తెప్పనూ, దాని మీదున్న ప్రయాణికురాలిని సముద్రమధ్యం వైపు ఒక్కో అడుగు ముందుకు జరుపుతూ మాట్లాడుతున్నాడు, “అంత లావైపోయాకా అవి ఇక ఆ కలుగులోంచి బైటకి రాలేవు, గుమ్మంలోంచి పట్టవు.”

“ఎక్కువ దూరం వద్దు. వాటికి ఏమవుతుంది?” అంది సిబిల్.

“వేటికి ఏమవుతుంది?”

“అరటిపండు చేపలు.”

“ఎప్పుడూ..? అవి అరటిపళ్లు ఎక్కువ తినేసి ఇక అరటిపళ్ళ కలుగులోంచి బైటకి రాలేనప్పుడా?”

“అవును.”

“చెప్పటానికి మనసొప్పటం లేదు సిబిల్, కానీ, చెప్తాను. అవి చచ్చిపోతాయి.” 

“ఎందుకూ?”

“ఎందుకంటే, వాటికి అరటిపండు జ్వరం వస్తుంది. అది చాలా భయంకరమైన జబ్బు.”

“అల వస్తుంది,” అంది సిబిల్ బెరుగ్గా. 

“మనం దాన్ని అస్సలు పట్టించుకోవద్దు. లెక్కే చేయొద్దు. ఫోజు కొడదాం ఇద్దరం,” అన్నాడు. అతను సిబిల్ అరికాళ్ళను తన చేతుల్తో కిందకి నొక్కి ముందుకి తోశాడు. ఆ తెప్ప అలను పైనుంచి దాటుతూ పోయింది. నీళ్ళు సిబిల్ బంగారు రంగు జుట్టుని తడిపాయి, కానీ ఆమె అరుపులో ఉప్పొంగిందంతా ఆనందమే. 

తెప్ప మళ్ళీ సమంగా సర్దుకోగానే, సిబిల్ తడిగా తప్పడగా అంటుకున్న ఒక జుట్టు పాయని కంటి మీంచి తుడుచుకుని, “ఒకటి చూశాను,” అంది. 

“ఏం చూశావు, బంగారం?”

“అరటిపండు చేప”

“మైగాడ్, నిజమా! దానికి నోట్లో అరటిపళ్ళేమన్నా ఉన్నాయా?”

“అవును. ఆరున్నాయి,” అంది సిబిల్.

అతను ఉన్నట్టుండి సిబిల్ తడి కాళ్ళలో ఒకదాన్ని, తెప్ప మీంచి వేలాడుతున్నదాన్ని, ఎత్తిపట్టుకుని అరికాలి వొంపులో ముద్దుపెట్టుకున్నాడు.

“ఓయ్!” అంది ఆ అరికాలి యజమాని, వెనక్కి తిరిగి. 

“నువ్వే ఓయ్! పద వెనక్కి పోదాం. చాలా ఇక?”

“చాల్లేదు!”

“తప్పదు,” అంటూ, ఆ తెప్పను ఒడ్డు వైపు, సిబిల్ దిగిపోయేవరకూ, లాక్కువెళ్ళాడు. తర్వాత దాన్ని మోసుకెళ్ళాడు. 

“గుడ్ బై,” అంది సిబిల్, ఏ చింతా లేకుండా హోటల్ వైపు పరిగెత్తింది. 

 * * *

అతను బాత్ రోబ్ తొడుక్కుని, గట్టిగా ముడివేసి, రుమాలు జేబులో దోపుకున్నాడు. బందగా, బరువుగా వున్న రబ్బరుతెప్పని చంకలో దోపుకున్నాడు. ఒక్కడే ఆ మెత్తటి వేడి ఇసుకలో కాళ్ళీడ్చుకుంటూ హోటల్ వైపు నడిచాడు. 

సముద్ర స్నానాలు చేసొచ్చేవాళ్ళకోసం హోటల్ మేనేజ్మెంటు కేటాయించిన సబ్ మెయిన్ ఫ్లోరులో, ముక్కుకి జింక్ ఆయింట్మెంటు పూసుకున్న ఒకామె అతనితో పాటు లిఫ్టులోకి వచ్చింది. 

లిఫ్టు కదలటం ప్రారంభించాక, అతను, “నా పాదాల వంక చూస్తున్నట్టున్నారు,” అన్నాడు. 

“ఏంటీ?” అందామె. 

“మీరు నా పాదాల వంక చూస్తున్నట్టున్నారూ అన్నాను.”

“కాదు, నేల వంక,” అని, లిఫ్టు తలుపుల వైపు ముఖం తిప్పుకుంది.

 “నా పాదాల వంక చూడాలనిపిస్తే చూడాలనిపించిందని ఒప్పుకోవచ్చు. అలా నక్కి దొంగ చూపులు చూడాల్సిన పన్లేదు.”

“త్వరగా తెరవండి ప్లీజ్,” అందామె, లిఫ్ట్ ఆపరేట్ చేస్తున్న అమ్మాయితో. 

లిఫ్టు తలుపులు తెరుచుకున్నాయి, ఆమె వెనక్కి చూడకుండా బైటకి వెళ్ళిపోయింది.

“నా పాదాలు అందరి పాదాల్లాగే ఉన్నాయి. ఎందుకు వాటిని గుడ్లప్పగించి చూడాలో నాకర్థం కాలేదు,” అని, “ఫైవ్ ప్లీజ్,” అన్నాడు. రోబ్ జేబులోంచి తన గది తాళం తీశాడు.

ఐదో అంతస్తులో లిఫ్ట్ నుంచి బైటికి వచ్చాడు, వరండాలో నడిచాడు, 507 నంబరు గదిలోకి వెళ్ళాడు. గదంతా కొత్త లెదర్ లగేజీ, గోళ్ళ రంగు రిమూవర్ వాసన.

అతను డబల్ బెడ్ లో ఒకదాని మీద నిద్రపోతున్న అమ్మాయి వంక చూశాడు. తర్వాత అక్కడున్న రెండు లగేజీల్లో ఒకదాని దగ్గరకు వెళ్ళి, దాన్ని తెరిచి, అందులో నిక్కర్లూ బనీన్ల కింద నుంచి ఒక ఆర్టుగీస్ కాలిబర్ 7.65 ఆటోమాటిక్ పిస్టల్ తీశాడు. మేగజైన్ బైటకి వదిలాడు, దాని వంక చూశాడు, మళ్ళీ లోపలికి దోపాడు. పిస్టల్ కాక్ చేశాడు. తర్వాత డబల్ బెడ్ లో ఖాళీగా వున్న వైపు వెళ్ళి కూర్చున్నాడు, అమ్మాయి వైపు చూశాడు, పిస్తోలు గురి పెట్టుకుని, తన కుడి కణతల్లోంచి తూటా దూసుకుపోయేట్టు కాల్చుకున్నాడు.

(1948లో ‘న్యూయార్కర్’లో పబ్లిష్ అయింది)


0 స్పందనలు:

మీ మాట...