August 29, 2007

వేటూరి కల

రాత్రి ఓ కల. చిత్రంగా వచ్చిందని చెప్పను; చిత్రంగా ఉండటం కలల ప్రాథమిక లక్షణమే కాబట్టి. ఒక మబ్బు పట్టిన మధ్యాహ్నం, జనంతో క్రిక్కిరిసిన పుస్తకాల ఎగ్జిబిషన్‌లో, వేటూరి సుందర్రామ్మూర్తిగారి పాటలపుస్తకం కోసం స్టాల్స్ అన్నీ కలియదిరుగుతున్నానంట. రాబోతున్న వర్షానికి సూచనగా వీస్తున్న హోరుగాలి. నేలమీది పాలిథీన్‌కవర్లూ, చిత్తుకాగితాలూ సుళ్ళుతిరుగుతూ గాల్లోకి లేస్తున్నాయి. ఒకావిడ చీరకొంగు, నేలకు సమాంతరంగా పైకిలేచి, జెండాలావిచ్చుకుని ఎగరడం గుర్తు. ప్రతీ షాప్ ముందూ గుంపులుగా జనం. (పుస్తకాల షాపు ముందు! గుంపులుగా జనం!! Oh, the hopeful me!!!) నేనెలాగోకలాగ వాళ్ళమధ్య జొరబడి ప్రతీ స్టాల్‌లోనూ ఆ పుస్తకం గురించి ఆరా తీస్తున్నాను. అందరూ ఒకే సమాధానం: ఆయన పాటలింకా పుస్తకరూపంలో వెలువడలేదు. చివరకు విసిగి, ఆశలు వదిలేసుకుని, వెనుదిరగ నిశ్చయించుకున్నాక; ఈ స్టాల్స్ అన్నింటికీ దూరంగా, మూలగా, ఒక ఒంటరి స్టాల్ కనిపిస్తుంది. నిజానికి అది స్టాల్ కూడా కాదు; చెక్కటేబిల్‌పై పుస్తకాలుంచి, దానివెనుక చెక్క కూర్చీలో ఓ యాభై-అరవైయేళ్ళ ముసలాయన కూర్చుని ఉంటాడు. పొగమంచురంగు ఖద్దరు లాల్చీ-షరాయి, దళసరి ఫ్రేము కళ్ళజోడు, వెండిపోగుల్ని వెనక్కి దువ్వినట్టున్న కేశాలు, కూర్చున్న కుర్చీకి వ్రేలాడేసి ఉన్న బెంగాలీసంచి. నా దృష్ఠి తన దిశగా ఎప్పుడు మరలుతోందో అన్నట్లు, మరలుతుందని ముందే తెలిసినట్లు, నావైపే ప్రశాంతంగా చూస్తూంటాడు. నేనాయన వైపు చూసిన మరుక్షణం... ఆయన టేబిల్‌ముందు నించొని ఉంటాను. Time lapse. మధ్యలో ఆ టేబిల్‌దాకా నడవడం అనే ప్రక్రియని, ఈ కలతీసిన దర్శకుడెవరో ఎడిటింగ్‌లో కట్‌చేసిపడేసుంటాడు. ఆయన నిశ్శబ్దంగా ఓ లావాటి బౌండుపుస్తకాన్ని నా ముందుంచుతాడు. ముదురాకుపచ్చ రంగు అట్టమీద బంగారం రంగు అక్షరాలు. బాగా పాతది కావడంవల్ల పేజీలన్నీ లేతగోధుమవర్ణంలోకి మారిపోయి; పెళుసుగా, విరిగిపోవడానికి సిధ్ధంగా ఉంటాయి. పుస్తకాన్ని శ్రధ్ధగా, పవిత్రగ్రంధంలా నా చేతుల్లోకి తీసుకుంటాను. అంతే, అక్కడితో కలంతా శకలాలై ఎటో చెదిరిపోయింది.

బహుశా ఓనెల క్రితం "విశాలాంధ్రా బుక్‌హౌస్"లో వేటూరి పాటల పుస్తకం గురించి నేను చేసిన ఎంక్వైరీ ఈ కలకు కారణమై ఉండవచ్చు. లేదా, రాత్రి FM వింటూ, హెడ్‌ఫోన్స్ చెవుల్లోనే ఉంచుకొని నిద్రలోకిజారిపోయాను. ఇంకా పూర్తిగా సుషుప్తిలోకి చేరకుండా, పొలిమేరల్లో మగతగా తచ్చాడుతుంటే, నేపథ్యంలో ఎక్కడినుంచో సాధనాసర్గమ్ గొంతు "...రహస్య స్నేహితుడా" అని పాడుతూ లీలగా వినిపిస్తుంది. అది FM లోంచా లేక అదీ కలేనా అంటే ఇపుడు స్పష్టంగా చెప్పలేను. "సఖి"లోని ఈ పాట వేటూరి వ్రాసిందే. బహుశా ఇది కొంత కారణం కావచ్చు. ఆ పాటంటే నాకు చాలా ఇష్టం. కొన్ని చోట్ల, కొన్ని పదాలు అర్థం కాకపోయినా కూడా. ఉదాహరణకి "ఉల్లం చుక్క ఆరబోసే వయసే..." అంటే ఏమిటి? వేటూరికే తెలియాలి. కానీ ఆ పదాలకి అర్థం అవసరమంటారా? స్వరం, శబ్దం అంత గాఢమైన కౌగిలిలో ఏకమై తన్మయిస్తుంటే, అర్థం వెతకడం పాపమనిపిస్తుంది. ముఖ్యంగా పాట మధ్యలో:"నిండామునిమాపుల్లో నిద్దరోవు నీఒళ్ళో... గాలల్లే తేలిపోతానోయ్, ఇలా డోలలూగేనోయ్...." అంటూ కోరస్ మొదలౌతుందే, అది ఎప్పుడు విన్నా, ఎన్ని సార్లు విన్నా, వెన్నులోంచి ఏదో ఆనందపు వణుకు మొదలై, శరీరమంతా పాకిపోతుంది. రోమాంచితం చేస్తూ విద్యుత్ ప్రసారమేదో నరాల్లో ప్రవహించినట్లుంటుంది. సంగీతం, సాహిత్యం, గానం - ఈ మూడు కళల త్రివేణీ సంగమం ఇంత సామరస్యతతో పరిపూర్ణమవడం సినిమా సంగీతంలో చాలా అరుదైన సందర్భం. అసలిదంతా సరే, వేటూరి పాటల్తో ఇప్పటివరకూ పుస్తకమేదైనా వెలువడిందా లేక అంతా నా కలేనా?

August 26, 2007

దృశ్యం Vs. ఆలోచన

ఇవాళ ఉదయం హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్‌లో లోకల్‌ట్రెయిన్‌కోసం వెయిట్‌చేస్తుంటే నామైండ్‌లో ఓ చిన్న బల్బులాంటిది వెలిగింది, ఓకొత్త ఊహ స్ఫురించింది. అదేమిటో వివరించాలంటే విషయాన్ని కొద్దిగా ముందునుండీ ప్రారంభించాలి.

స్టేషన్‌కి వస్తూ వస్తూ ఇవాళ బ్లాగ్‌లో ఏమిరాయాలా అన్నవిషయమై ఆలోచనలో పడ్డాను. ఏదైనా తెలుగుపుస్తకంపై రివ్యూలాంటిది రాస్తే ఎలా ఉంటుందీ అని ఆలోచించాను. ఏ పుస్తకంపై రాయాలో, ఎలా మొదలుపెట్టాలో కూడా ఆలోచించిపెట్టుకున్నాను. తరువాత స్టేషన్‌కి చేరుకుని, మెట్లెక్కి ఫ్లాట్‌ఫాం పైకి అడుగుపెట్టి, జనాల మధ్య నిలబడి, వాళ్ళమ్మ చంకనుంచీ నన్ను వెక్కిరిస్తున్న ఓ పసిదాన్ని బదులు వెక్కిరించి, ఎండవేడికి ఫ్లాట్‌ఫాం పైన ఇనుపకప్పు నుండి సెగలుగా వస్తున్న ఉక్కపోత భరించలేక, దూరంగా చెట్లక్రిందకుపోయి కూర్చున్నాను.

ఇపుడు ప్రశాంతంగా, బ్లాగ్‌లో రాయాలనుకున్న పుస్తక సమీక్షపై కొన్ని పాయింట్లు ఆలోచించి పెట్టుకుందామని మస్తిష్కకవాటం తెరిచిచూసేసరికి... లోపల ఖాళీ వెక్కిరించింది. ఎంత గింజుకున్నా 5 నిముషాలక్రితం నేను రివ్యూ రాద్దామనుకున్న పుస్తకం ఏమిటో జ్ఞప్తికి రాలేదు! నా జ్ఞాపకశక్తిపై నాకే జాలేసింది. జ్ఞాపకాల బాక్‌ట్రాకింగ్ మొదలుపెట్టాను. ప్లాట్‌ఫాంపై ఉక్కపోత, పసిదాని వెక్కిరింత, టికెట్ కౌంటర్ దగ్గర క్యూ, స్టేషన్ బయట మెట్లెక్కుతుంటే గాజుతలుపులో కనిపించిన నా ప్రతిబింబం... ఇలా నేను రూం దగ్గర బయల్దేరేటపుడు చెప్పులు వేసుకోవడం వరకూ చాలా దూరం మస్తిష్కపు ఇరుకు దారుల్లో వెనక్కి ప్రయాణించగలిగాను. (ఇదివరకూ వీడియోక్యాసెట్‌ప్లేయర్లో సినిమాచూస్తూ రివైండ్‌బటన్ నొక్కినపుడు కార్లు వెనక్కి పరిగెడుతూ, మనుషులు వెనక్కి మెట్లెక్కుతూ వింతవింతగా దృశ్యాలు కనిపించేవి చూడండి, అలాగన్నమాట.) ఇలా జ్ఞాపకాల తిరగమోతద్వారా దృశ్యాలనైతే పునర్జీవితం చేసుకోగలిగానుగానీ, ఆలోచనల్ని పూర్తిగా రికలెక్ట్ చేసుకోలేకపోయాను. దృశ్యజ్ఞాపకాల ఎక్యురేట్ రికలెక్షన్ 80% వరకూ ఉంటే ఆలోచనకు సంబంధించిన జ్ఞాపకాల రికలెక్షన్ 20% మాత్రమే ఉంది. అంతేకాదు, ఇలా జ్ఞప్తికి తెచ్చుకున్న 20% ఆలోచనల్లోకూడా, అవి కొన్ని దృశ్యాలతో ముడిపడి ఉండటంవల్లనే తిరిగి జ్ఞాపకం చేసుకోగలిగాను. ఇలా ఆలోచనా ప్రవాహంలో వెనక్కు ఈదుదామని ఎంతప్రయత్నించినా రెండు నిముషాల క్రిందటి జ్ఞాపకంకన్నా ఎక్కువదూరం వెళ్ళలేకపోయాను. అక్కడితో లింకు తెగిపోతుంది. ఇక ఎంత మొండిగా ట్రై చేసినా విశృంఖలమైన శాఖలుగా విడివడి ఎటుపడితే అటుపోతుందే తప్ప, అవసరమైన పాయింట్‌ని ట్రాక్‌చేసి పట్టుకోలేకపోతుంది. (అసలిలా ఆలోచనల్ని వెనక్కి తవ్వితీయాలని యత్నించేదికూడా ఆలోచనే కదా! I sense a terrible glitch here in this stream of thought, but don't know exactly what it is.)

మీరూ ప్రయత్నించి చూడండి: బహుశా మీరిపుడు మీకంప్యూటర్ ముందు కూర్చుని నా బ్లాగ్ చదివే సాహసం చేస్తూండిఉంటారు. ఒకసారి బాక్‌ట్రాకింగ్ మొదలుపెట్టండి... వెనక్కి, వెనక్కి... ఇంకా వెనక్కి. నా అంచనా ప్రకారం, ఒక పదినిముషాల క్రితం మీ కళ్ళముందు ఏ దృశ్యం ఉందో మీరు ఖచ్చితంగా రికలెక్ట్ చేసుకోగలరు. మరి పదినిముషాల క్రితం మీ ఆలోచన? ప్రొద్దున్న బాత్రూంలో స్నానంచేస్తూ మీరేం ఆలోచించారు... అద్దం ముందు తలదువ్వుకుంటూ? కష్టంకదూ.

ఇదే ఇంతకుముందు నామైండ్‌లో సదరు బల్బు వెలగడానికి కారణమైన కరంటు: చాలావరకూ మన చేతనాతలంపై చెరగనిముద్రలు వేసిపోయేవి ఆలోచనలు కాదు... దృశ్యాలు (images). ఇదే నాకు స్ఫురించిన విషయం. ఇంతలో ట్రైనొచ్చేసింది. పుస్తక సమీక్ష సంగతి ప్రక్కనపడేసి, నాకు సంబంధించినంతవరకూ విశిష్టమైన ఈ బుల్లిసైజు డిస్కవరీనే బ్లాగ్‌లో రాసిపడేద్దామని డిసైడయ్యాను.

ప్రతీవిషయాన్ని సాహిత్యపు దృక్కోణంలో చూడటానికి ప్రయత్నించడం నాకున్న అలవాటు. కాబట్టి ఈ విషయాన్ని కూడా సాహిత్యానికి అన్వయించి చూసాను. 'ఒక రచన చదివిన తరువాత, చాలాకాలం వరకూ మన జ్ఞాపకంలో నిలిచిపోయేవి అందులోని దృశ్యపరమైన అంశాలా లేక రచయిత వ్యక్తంచేసిన ఆలోచనలూ, అభిప్రాయాలూ, భావనలూ ఇవన్నీనా?' ఎపుడో పదేళ్ళ క్రితం చదివిన యండమూరి వీరేంద్రనాథ్ "ఆనందోబ్రహ్మ" నుండీ మొదలుకొని ఈ మధ్యే చదివిన Gabriel García Márquez "Love in the time of Cholera" వరకూ నేను చదివిన చాలా పుస్తకాలను ఒకసారి పునఃస్మరణ చేసుకున్నాను. వాటి పేర్లను తలచుకోగానే నా మస్తిష్కంలో మొదట మెదిలినవి - ఆయా రచయితలు వారి రచనలలో వ్యక్తంచేసిన భావాలూ, వాళ్ళ సిధ్థాంతాలూ, ఆలోచనలూ, అభిప్రాయాలూ... ఇవేమీ కాదు. కేవలం దృశ్యాలు.

ఉదాహరణకు యండమూరి "ఆనందోబ్రహ్మ"ను తలచుకోగానే నా మెంటల్ ప్రొజెక్టర్ (మస్తిష్కపు వెండితెర)పై ఈ దృశ్యాలు కదలాడటం మొదలుపెట్టాయ్: కొత్తగా తమ ఇంట్లో అద్దెకుదిగిన మందాకినిని, ఆమె సామాన్లు సర్దుకుంటుంటే, మొదటిసారి సోమయాజి గది గుమ్మంలోంచి పరికించడం; వరండాలో నిద్రపోయిన సోమయాజికి తెలవారుజామున ఎందుకో మెలుకువవచ్చి చూస్తే ముంగిట్లో ముగ్గు దిద్దుతున్న మందాకిని; వెన్నెలరాత్రి పెంకుటింటి చూరునీడలో నిల్చుని సోమయాజికి చివరిసారి వీడ్కోలుపలుకుతున్న మందాకిని, ఆమె చెంపపై కన్నీటి బిందువు - ఇవే ఇప్పటిదాకా స్పష్టంగా నాతోఉండిపోయాయి.

బుచ్చిబాబు "చివరకు మిగిలేది"లో: కధాప్రారంభంలో, సాయంత్రం కాలువవొడ్డున గడ్డిలో పడుకుని, గడ్డిపరకలు పెరుకుతున్న దయానిధి; ఒక వర్షపురాత్రి దయానిధి ముఖాన్ని కప్పేసిన అమృతం చీకటికురులూ; చివరి అధ్యాయంలో, రాయలసీమలో, దయానిధి ఇంటిముందు చేయి (తల?) విరిగిపోయిఉన్న అతని తల్లి శిలావిగ్రహం.

Ayn Rand "Atlas Shrugged"లో: కధానాయిక Dagny Taggart రైల్లో ప్రయాణిస్తుంటే కిటికీ లోంచి, వేగంగా వెనక్కి కదలిపోతూ, కనిపిస్తున్న టెలిగ్రాఫిక్ పోల్స్; కార్మికుల సమావేశంలోంచి అర్థాంతరంగా పైకిలేచి 'I am going to stop the engine of this world' (or something to that effect) అని వెళిపోతున్న John Galt; అట్లాంటిస్‌కు హెలికాఫ్టర్‌లో పయనమౌతున్న Dagny కి, క్రింద ఏరియల్‌వ్యూలో, ఒకే ఊడ్పులోఆరిపోతూ కనిపించిన న్యూయార్క్‌నగరం లైట్లు.

చలం "మైదానం": ఒక మిట్టమద్యాహ్నపువేళ నేరుగా రాజేశ్వరిఇంట్లోకి దూసుకువచ్చి, ఆమెను తన కౌగిలిలో ఊపిరాడకుండా నలిపేస్తున్న అమీర్; కాలువలో నగ్నంగా ఈతకొడ్తూన్న అమీర్, రాజేశ్వరి.

Dostoevsky "Crime & Punishment": తన ఇరుకుగదిలో, దాదాపు పిచ్చితనపు అంచులకు చేరిపోయి, జ్వరంతో వణుకుతున్న Raskolnikov; తన నేరాన్ని ఒప్పేసుకుని లొంగిపోవడానికి సిద్దమై పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కుతున్న Raskolnikov; వికటంగా నవ్వుతున్న Svidrigáilov.

... ... ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలా ప్రతీపుస్తకంలోనూ నాకు ఇప్పటివరకూ గుర్తుండిపోయినవి ఆయా రచయితల ఆలోచనలూ, సిద్థాంతలూ కావు. కేవలం images మాత్రమే.

నిజానికి 'Atlas Shrugged', 'Crime & Punishment', 'చివరకు మిగిలేది ' మొదలైన రచనల్లో దృశ్యసంబంధమైన వివరాలకన్నా; రచయితల సిద్థాంతప్రవచనాలూ, అభిప్రాయాలే ఎక్కువ భాగాన్ని ఆక్రమిస్తాయి. But I remember the images in their novels more vividly than their ideas. 'అట్లాస్‌ష్రగ్గ్‌డ్' మొదటిసారి చదివినపుడు అయాన్‌రాండ్ ఐడియాస్‌కీ, ఆమె ఆబ్జెక్టివిజం సిద్థాంతానికీ నేను చాలా ప్రభావితుడ్నయ్యాను. అవి చాలాకాలం నాతోనే ఉండిపోతాయని భావించాను. కానీ అలా జరగలేదు. ఇపుడు ఆ నవలలోని సిద్థాంతపరమైన భాగాలన్నీ, నా దృష్టిలో కేవలం పేరాలకు పేరాలు అనవసరంగా కూరిన అర్థంలేని చెత్తగానే మిగిలిపోయాయి.ఈ జ్ఞానోదయం, నాలో ఇప్పుడిప్పుడే వేళ్ళూనుకుంటున్న ఒక అభిప్రాయాన్ని మరింత బలపరిచింది: రచన అంటే రచయిత తన మెదడులోని అభిప్రాయాల, భావాల, సిద్థాంతాల చెత్తనంతా కాగితంపై కుప్పేసి ఒలకబోయడంకాదు. నా దృష్టిలో రచన అంటే 'రచయిత తన అంతరంగ ప్రపంచాన్ని స్పష్టమైన చిత్రాలతో ఆవిష్కరించడం.' అలాంటి రచనలే చిరకాలం, కడవరకూ మనతో మన జ్ఞాపకాల్లో మిగిలేవి.

Finally, what I want to say here is that from a work of art (literature at least), what remains with us forever is not the ideas, it is the images. Images outlast the ideas. (Of course, here I am talking only about fiction.)

August 20, 2007

సౌందర్య రాహిత్యం

"As Phaneendra Kumar awoke one morning from uneasy dreams, he found himself transformed in his bed into a gigantic machine."

కళ్ళుతెరవగానే ఉవ్వెత్తున మీదపడే తమస్సు. ఉదయాన పక్కమీద నిద్ర లేవగానే ఇంచుమించు Gregor Samsa లాగే ఉంటుంది నా మనస్థితి. 'ఛత్... లేచామా, బోల్టులు బిగించుకున్నామా, మరమానవులమై ఈ యంత్రనగరానికి మనవంతు ఊడిగం చేసామా! మరలా పక్క మీద వాలామా!' ఇదే తంతు. జీవితం కన్నా కలలే colourfulగా ఉండడం జాలిగొలిపే విషయం కదూ.

మనస్సు ఎక్కడో సతత హరితారణ్యాల సందిట్లో స్వేచ్ఛావిహారానికై ఉవ్విళ్ళూరుతుంటే, తనువుమాత్రం ఏ ట్రాఫిక్ జాంలోనో చిక్కుకుని; ఎదుటివాడి కారు నంబర్ ప్లేటూ, పక్కవాడి బైక్ మీద వాలికూర్చున్న అమ్మాయిసీటూ తప్ప కళ్ళకు మరోదృశ్యం కనిపించక విలవిల్లాడుతుంది. ఇక్కడ విషయం ట్రాఫిక్ జాముల సమస్య కాదు. అర్థంపర్థంలేని బిజీలోపడి ప్రకృతికి ఎంతదూరం జరిగిపోతున్నామా అన్నది. రెండు చేతులూ విహ్వలంగా చాచి బారెడు ఆకాశాన్ని కొలిచేందుకు బయలే లేకుండా పోయిందే ఈ నగరంలో అన్న బాధ. అంతా ఇరుకు... ఇరుకు... ఇరుకు.

ప్రకృతి మాత్రం ఏంచేస్తుంది, మనం ఈ ఇరుకులో మగ్గిపోవడానికే మక్కువ చూపిస్తుంటే. నియాన్ లైట్ల జోరుముందు నిండుపౌర్ణమిరోజునకూడా వెలవెలబోతూన్న చంద్రుడు, పాపం జాలిగా మొహం ముడుచుకుంటాడు. అడ్వర్టైజింగ్ హోర్డింగుల మధ్య చిక్కుకున్న రంగులవానవిల్లు, పేలవంగా ఓనవ్వు నవ్వి, ఫాక్టరీ పొగల్లో మసకబారి మాయమైపోతుంది. నేలకు చక్కిలిగింతలు పెడదామని ఉత్సాహంగా కురిసిన వర్షంకూడా, అంతటా సిమెంటుగచ్చులూ, తార్రోడ్లే కనిపించేసరికి, విసుక్కుని అండర్ గ్రౌండ్ డ్రైనేజీల్లోకి ఇంకిపోతుంది.

ఒక్కోసారి అనిపిస్తుంది, నేనో కింగ్ కాంగ్ నై ఈ నగరాన్నంతా కసాపిసా తొక్కేసి, అడవుల్లోకి పారిపోవాలని. కానీ ఏంచేస్తాం... there is no way out. అయినా నేనొకరకంగా అదృష్టవంతుడ్నే. పల్లెవాతావరణంలో పెరగడంవల్ల, కనీసం నాకు ప్రకృతితో సాంగత్యమంటే ఏమిటో తెలుసు. తాటిముంజెలబళ్ళ్లూ, రావిచెట్టు ఉయ్యాళ్ళూ, మామిడితోటల్లొ దొంగతనాలూ, మావిచిగురు మాటునుండి కోయిల కూతలూ... ఈ జ్ఞాపకాలన్నీ, పాతపుస్తకపు పేజీల్లో భద్రంగా దాచుకున్న నెమిలీకల్లా, ఎప్పటికీ నాతోనే ఉండి పోతాయి. కానీ ఈ యంత్రనగరం లో పుట్టిపెరిగినవాళ్ళని తల్చుకుంటేనే కొద్దిగా జాలేస్తుంది. ప్రపంచం ఇలానేకాక మరోలాగ ఉంటుందనీ, ఉండచ్చనీ తెలియదు వాళ్ళకి. ఈ లోహప్రపంచాన్నే లోకమనుకుంటారు. మల్టీఫ్లెక్సుల్లోనూ, మౌంట్ ఒపెరాల్లోనూ శెలవు గడపడమే విశ్రాంతి అనుకుంటారు.

బహుశా అందుకే నీ ప్రేమలో పడిపోయానేమో... రంగురంగుల ప్లాస్టిక్ పూల మధ్య స్వచ్ఛంగా పరిమళించే పచ్చ సంపెంగలోని అందం ఉంది నీలో, సహారా ఉక్కపోతలో ఒయాసిస్సు చల్లదనం ఉంటుంది నీ నవ్వులో. My melancholic mermaid, impossible ice-maiden, demure darling... ప్రపంచాన్ని పక్కకు నెట్టేసి ప్రేమించగలను నిన్ను... ఎందుకు అర్థం కాదు నీకు?

August 16, 2007

మేనిఫెస్టో


I value little those much vaunted rights
that have for some the lure of dizzy heights;
I do not fret because the gods refuse
to let me wrangle over revenues,
or thwart the wars of kings; and 'tis to me
of no concern whether the press be free
to dupe poor oafs or whether censors cramp
the current fancies of some scribbling scamp.
These things are words, words, words. My spirit fights
for deeper Liberty, for better rights.
Whom shall we serve—the people or the State?
The poet does not care—so let them wait.
To give account to none, to be one's own
vassal and lord, to please oneself alone,
to bend neither one's neck, nor inner schemes,
nor conscience to obtain some thing that seems
power but is a flunkey's coat; to stroll
in one's own wake, admiring the divine
beauties of Nature and to feel one's soul
melt in the glow of man's inspired design
—that is the blessing, those are the rights!

ఇది రష్యన్ రచయిత పుష్కిన్ రాసిన కవిత. ఇందులో కవిగా ఏవి తనకు ముఖ్యమో ఏవి ముఖ్యం కావో చెప్తున్నాడు; తన మేనిఫెస్టో స్పష్టం చేస్తున్నాడు. వ్లదీమర్ నబకొవ్ "రష్యన్ రైటర్స్, సెన్సార్స్, రీడర్స్" అనే తన ఉపన్యాసానికి ముగింపుగా ఈ కవితని — "కవులకే గాక కవులను ప్రేమించే వారందరికీ వర్తిస్తుంద"ని చెప్తూ — ఉదహరించాడు. దీన్ని ఇక్కడ ఇవ్వడానికి ఒక కారణం ఉంది. ఇది ఒక పాఠకుని బ్లాగు. అందుకే పాఠకునిగా నా అభిరుచిని ప్రతిఫలించే ఈ కవితని ఇక్కడ ఇస్తున్నాను."

To give account to none, to be one's own
vassal and lord, to please oneself alone,
to bend neither one's neck, nor inner schemes,
nor conscience to obtain some thing that seems
power but is a flunkey's coat; to stroll
in one's own wake, admiring the divine
beauties of Nature and to feel one's soul
melt in the glow of man's inspired design
—that is the blessing, those are the rights!"

— అదీ ఈ బ్లాగు ప్రారభంలో నా ఉద్దేశ్యం.

1. ఈ బ్లాగ్ లో ఏమి రాయాలన్న విషయంపై నేను ఎటువంటి పరిమితులూ విధించుకోలేదు. ఒక్కోసారి హృదిగదుల్లో, చీకటి మూలల్లో ఏవేవో భావాలు - అక్షరాల అంగీలు, పదాల పట్టుపంచెలూ ధరించి "మేమూ ఉన్నామంటూ" సందడి చేస్తాయి. నాకైతే వీటి భాధ మరీ ఎక్కువై పోయింది. వీటిని బయటికి తన్ని తరిమేయడానికి నాకీ బ్లాగింగ్ ఒక మంచి ఉపాయం లా కనిపిస్తుంది. ఇంతవరకూ తెలుగులో బ్లాగింగ్ చేసే సదుపాయం ఉందని తెలియదు. నేను ఇంగ్లీషు లో రాయగలను. కానీ ఎపుడు ప్రయత్నించినా, నా భావాల జెట్ వేగంతో నా ఇంగ్లీషు పరిజ్ఞానం పోటీపడలేక వెనకనే చతికిలపడుతుంది. (ఎంతైనా అరువు తెచ్చుకున్న భాష, అమ్మ నేర్పిన భాషతో ఎలా సాటిరాగలదు!)

2. నా అంతరంగపు భావతరంగాల్ని ఈ బ్లాగ్ ద్వారా ఏ మేరకు బహిరంగం చేయవచ్చు, ఎంతవరకూ నాకై నేను మిగుల్చుకోవాలి అన్న విషయమై నేనింకా ఒక నిశ్చయానికి రాలేదు. అసలు నా నిశ్చయం సంగతి ఎలా ఉన్నా, చదువరుల్లో నిశితపరిశీలకులైన వారికి అక్షరాలమాటున దాగివున్న నన్ను తూకంవేసి లెక్కగట్టేయడం ఏమంత కష్టంకాదు. అదేమంత భయపడాల్సిన విషయమూ కాదు. తనని తాను బయటపెట్టుకోవడానికి వెరచేవాడెవడూ రచన చేయలేడు. (అయితే... ఒక రచన యొక్క పరమార్థం రచయిత తనని తాను వెలిబుచ్చుకోవడం మాత్రమే అయిఉండకూడదని నా అభిప్రాయం.) ఈ బ్లాగ్ నన్ను నేను బయట పెట్టుకోవడానికో, నా భావాలను పదుగురితో పంచుకోవడానికో, గుర్తింపు కోసమో, ఏదో మార్పు తీసుకురావడానికో రాయడం లేదు. ఈ బ్లాగ్ ని కేవలం చదవబడటం కోసం మాత్రమే రాస్తున్నా. I just want it to be read... that's all.

3) ఇక నా శైలివిషయమై కొన్ని వివరణలు: రాసేది గద్యమైనా పదాలలో ప్రాసకోసం ప్రయాసపడటం నాకున్న పాత జబ్బు. (ఈ వాక్యమే నిదర్శనం.) ఎంత వదిలించుకోవాలన్నా నావల్ల కాలేదు. దీనివల్ల శైలి కొంత కృతకంగా అనిపించినా బ్లాగానుభావులు... భరించేయండి! మస్తిష్కంలోకి చొచ్చుకుని వచ్చే ఇంగ్లీషుపదాల్ని నివారించి, అయినంతలో తెలుగులోనే రాయాలన్న నిశ్చయంతో ఉన్నాను. దీనికి ఎంతవరకూ నిబద్దుడనై ఉంటానన్న విషయంలో నా అనుమానాలు నాకున్నాయి. (అసలు నా భావాలకీ, తెలుగు భాషకి మధ్య కంపేటబిలిటీపైనే నాకు అనుమానం; బహుశా నా తెలుగు పరిజ్ఞానానికున్న పరిమితులవల్ల కావచ్చు.)

4) చివరగా చిన్న 'డిస్ క్లెయిమర్ ' లాంటిది: నేను ఎక్స్ క్లూజివ్ గా ఏ వాదానికీ చెందను. ఈ బ్లాగ్ ద్వారా ఏమైనా అభిప్రాయాలు, వాల్యూజడ్జిమెంట్స్ లాంటివి వెలిబుచ్చడం జరిగితే అవి నా వ్యక్తిగత భావనలు మాత్రమే. వాటికై నేను ఎవరి సమర్థింపునూ లేదా విమర్శనూ ఆశించడంలేదు. అంతేకాదు ఒక సంచికలోని నా అభిప్రాయాన్ని మరోసంచికలో నేనే సవరించవచ్చు లేదా ఖంఢివచ్చు. ఈ విషయమై నాకునేను ఏ పరిమితులూ వింధించుకోలేదు. ఈ ప్రపంచంచంలో సార్వజనీన, సార్వకాలీన సత్యాలంటూ ఏమీ ఉండవు. సమయాన్ని, సందర్భాన్నీ, వ్యక్తుల్నీబట్టి సత్యమూ పరిణామంచెందుతుంది. నాకు నిజమనిపించింది నేనురాస్తాను. అదే ఈ బ్లాగ్ ప్రక్రియలో వెసులుబాటు కూడా.