September 3, 2007

"నేను సాహిత్యాన్ని": కాఫ్కా

(ఈ వ్యాసం ఏడేళ్ల క్రితం 2007లో రాసింది. కాఫ్కా మీద తర్వాత 2013లో ఇంకా సమగ్రంగా "శిలువ మోసిన రచయిత"  పేరిట ఇంకో వ్యాసం రాశాను. ముందు అది చదవండి.) 

"నేను సాహిత్యాన్ని" (I am literature) - ఈ వ్యాఖ్యను కాఫ్కా అహంతోనో, మితిమీరిన ఆత్మవిశ్వాసంతోనో చేయలేదు. ఆయన డైరీలను (The Diaries of Franz Kafka) చదివినవారికి ఈ విషయం సులభంగానే అర్థమౌతుంది. తన అస్తిత్వానికి పరమార్థం సాహిత్యమేనని నిజంగా నమ్మాడాయన. అందుకే ఏ సాహితీ స్రష్టా సాహసించని ఆ స్టేట్‌మెంట్‌ని ఇవ్వగలిగాడు. సాహిత్యాన్ని జీవితంలో ఒక భాగంగా మాత్రమే దర్శించటంలో ఆయన విఫలమయ్యాడు. తన జీవితాన్నే సాహిత్యమయం చేసుకున్నాడు. ఆయన దృష్ఠిలో తన కలం కాగితంపై నర్తించని రోజుకి అర్థమేలేదు. It is as if he was doomed to write.

"నా మస్తిష్కంలో నేను కలిగివున్న అద్భుతప్రపంచం... చినిగి ముక్కలైపోకుండా ఎలా దానికి స్వేచ్ఛనందియ్యాలి, ఎలా నేను స్వేచ్ఛ పొందాలి. దాన్ని నాలోనే నిలుపుకోవడం లేదా సమాధి చేసేయడం కన్నా, శకలాలుగా చిధ్రమైపోయినా వెలికి తీసుకురావడమే వేయింతలు సబబైన మార్గమనిపిస్తుంది. నా జన్మహేతువిదే, ఇంతమేరకు నాకు స్పష్టంగా తెలుసు." -- (కాఫ్కా డైరీల నుండి)

మనకు ఇష్టుడైన ఒక రచయితనూ, అతని పట్ల మనకున్న ఇష్టాన్నీ పరిశీలనాత్మక దృక్పథంతో విశ్లేషించి చెప్పడం కష్టం. రచయితపట్ల మనకున్న అభిమానం; అతన్ని నిష్పాక్షికంగా, ఆబ్జెక్టివ్‌గా పరిశీలించగలిగే దృక్కోణాన్ని మసకబారుస్తుంది, కాబట్టి నేనా ప్రయత్నం చేయబోను. ఇక్కడ కేవలం కాఫ్కా పట్ల నా అభిమానాన్ని మాత్రమే వ్యక్తం చేసుకోదలిచాను.

ఫ్రాంజ్ కాఫ్కా (1883-1924) బొహేమియా రాజధాని ప్రేగ్‌లో, ఒక మధ్యతరగతి జర్మన్ యూదు (Jews) కుటుంబంలో జన్మించాడు. తండ్రి హెర్మన్ కాఫ్కా ఒక వ్యాపారస్థుడు. తండ్రీ తనయుల మధ్య అనుబంధం సంక్లిష్టమైనది. వ్యాపారాత్మక దృక్పథం, ఆర్భాటపూరితమైన మనస్తత్వం, దుందుడుకు స్వభావంగల తండ్రికి కాఫ్కా ఎన్నడూ చేరువకాలేకపోయాడు. అలాగే అంతర్ముఖుడు, సున్నిత మనస్కుడైన కాఫ్కాతోనూ అతని తండ్రి ఎపుడూ సన్నిహితంగా మెలగలేకపోయాడు. (కాఫ్కా యొక్క 'జడ్జ్‌మెంట్' కథలోని తండ్రి పాత్రలో హెర్మన్ కాఫ్కా ఛాయలు గమనించవచ్చు.) కానీ ఎన్ని విభేదాలున్నా, ఎన్ని ప్రచ్ఛన్నయుద్ధాలు కొనసాగినా కాఫ్కా తన జీవితకాలంలో చాలాభాగం తల్లిదండ్రులతో కలసి నివసించడానికే మొగ్గుచూపాడు. కాఫ్కాకు ఆరేళ్ళు వచ్చేటప్పటికే ఇద్దరు తమ్ముళ్ళూ (ఒకరు 15 నెలలకు, మరొకరు 6 నెలలకు) చనిపోయారు. ఇక మిగిలింది ముగ్గురు చెల్లెళ్ళు. చిన్నతనంలో తల్లికూడా తండ్రికి వ్యాపారవ్యవహారాల్లో సహాయపడుతూ, ఎక్కువ సమయం ఇంటి బయటే గడపవలసిరావడంతో కాఫ్కా నౌకర్ల సంరక్షణలో పెరుగుతూ, తన చెల్లెళ్ళతోనే సన్నిహితంగా మెలిగేవాడు. ముఖ్యంగా చిన్న చెల్లెలు Ottla తో అతనిది గాఢమైన అనుబంధం.

చదువులో కాఫ్కా చురుకైన విద్యార్థి. రసాయన శాస్త్రంపై ఆసక్తి ఉన్నా తండ్రి ఇచ్ఛమేరకు న్యాయశాస్త్రం చదివి 1906 లో పట్టభద్రుడయ్యాడు. ఈ యూనివర్సిటీ రోజుల్లోనే కాఫ్కాకు సహవిధ్యార్థి, భావిరచయిత మాక్స్‌బ్రాడ్‌తో పరిచయమైంది. ఆ తదుపరి వీరిరువురూ జీవితాంతం సన్నిహిత మిత్రులుగా మెలిగారు. చదువు పూర్తయిన తరువాత కాఫ్కా బొహేమియా రాజ్యపు 'కార్మికుల ప్రమాద భీమా సంస్థ'లో ఉద్యోగిగా చేరాడు. ఉద్యోగ విధుల్ని శ్రద్ధగానే నిర్వర్తించినా; కాఫ్కా ఈ ఉద్యోగాన్ని కేవలం తన ప్రాథమిక అవసరాలను తీర్చే 'రొట్టెకూడు ఉద్యోగం'(bread job)గానే భావించాడు. అతని ఆసక్తి అంతా సాహితీ సృజన మీదనే. ఉద్యోగ విధులు మధ్యాహ్నం రెండు గంటలకే సమాప్తమౌతుండటంతో, అతని రచనావ్యాసంగం నిరాటాంకంగా కొనసాగటానికి అవకాశం కలిగింది.

కాఫ్కా తల్లిదండ్రులిరువురివీ సహజమరణాలు కాగా, చెల్లెళ్ళతో సహా కుటుంబసభ్యులు చాలామంది, రెండవ ప్రపంచయుద్ధ సమయంలో, హిట్లర్ నియంతృత్వంలో యూదులపై పెచ్ఛరిల్లిన మారణకాండలో, కాన్సెన్‌ట్రేషన్ క్యాంపుల్లో మృతి చెందారు. కాఫ్కా మాత్రం ముందే, 1924 లో 41 సంవత్సరాల వయస్సులో, ఊపిరితిత్తుల వ్యాధి(Tuberculosis) కారణంగా మరణించాడు.

ఇక కాఫ్కా జీవితంలో ప్రణయపర్వాన్ని పరిశీలిస్తే - తన 29వ యేట కాఫ్కా తన స్నేహితుడు మాక్స్‌బ్రాడ్ గృహంలో ఒక విందులో ఫెలిసీ (Felice Bauer)ని మొదటిసారి కలిసాడు. బెర్లిన్‌లో ఒక డిక్టాఫోన్ కంపెనీకి ప్రతినిధిగా పని చేసే ఆమెతో తొలిపరిచయంలోనే ప్రేమలో పడిపోయాడు. చాలాభాగం ఉత్తరాల ద్వారా, అపుడపుడూ కలుసుకోవడాలతో కొనసాగిన వీరి ప్రేమాయణం రెండుసార్లు ఎంగేజ్‌మెంట్ అయినా, వివాహపు మజిలీని చేరుకోలేదు. దీనికి ముఖ్యకారణం కాఫ్కాకు సాహిత్యంపై ఉన్న మక్కువే. వివాహం తనను రచనా వ్యాసంగం నుండి దూరం చేస్తుందని భావించాడు కాఫ్కా. నిజానికి, తన యొక్క రచనా వ్యాసంగం పట్ల ఏ ఆసక్తీ చూపని, వేరే ఏ విధమైన కళాతృష్ణా కనపరచని సాధారణయువతి ఫెలిసీ పట్ల, కాఫ్కా కురిపించిన ఈ గాఢమైన అనురాగాన్ని; తను సభ్యుడిగా మనలేకపోతున్న బాహ్యప్రపంచంతో ఆయన చేసిన చివరి సంధి యత్నంగా విశ్లేషించవచ్చు. ఆయన తన లోపలి ప్రపంచానికి వెలుపలి ప్రపంచానికీ మధ్య ఒక వారధిని కోరుకున్నాడు. మానవ అస్తిత్వపు మరుగున దాగి ఉన్న చీకటిని, అర్థరాహిత్యాన్ని తరచి చూడగలిగే భయంకరమైన, నరకప్రాయమైన తన పరిశీలనాశక్తి నుండి తనకు విముక్తి కలిగించే వరంలా ఆమెను ఊహించుకున్నాడు. ఆ శక్తిని ఆమెకు ఆపాదించుకున్నాడు. కాని ఈ ఆకాంక్షల భారాన్ని ఆమె భరించలేకపోయింది. ఒకరకంగా అతని ఈ పరిశీలనాసక్తి వరమో, శాపమో అతనికే తెలియదు. తనని మిగతా ప్రపంచం నుండి వేరుచేసే సాహిత్య జీవితం వైపు మొగ్గు చూపాలో, అందులో ఒకడిగా కలిపివేసే కుటుంబజీవితాన్ని అనుసరించాలో అన్న సందిగ్ధం ఆయన్ని చివరి వరకూ వెంటాడింది. ఈ సందిగ్ధతే ఆయన్ను ఫెలిసీ నుండి వేరుచేసింది.

తరువాత 1920 లో తన 37వ యేట, వివాహితయైన చెక్ జర్నలిస్టు, రచయిత్రి మిలెనా (Milena Jesenka)తో కాఫ్కా ప్రేమలో పడ్డాడు. కాఫ్కా రచన 'ది స్టోకర్'ను చెక్ భాషలోకి అనువదించడానికి ఆయన అనుమతి కోరుతూ మిలెనా వ్రాసిన లేఖతో ఇరువురి పరిచయం ఆరంభమైంది. వీరి ప్రణయం చాలావరకూ ఉత్తరాల ద్వారానే కొనసాగింది. కలుసుకుంది ఒక్కసారే. కాఫ్కా వివాహానికి సుముఖంగానే ఉన్నా, మిలెనా తన భర్తను విడిచిరావడానికి సిద్దపడకపోవడం వల్ల వీరిరువురి బంధం ముగింపుకు చేరుకుంది.

తన జీవితపు చివరిరోజుల్లో 40 సంవత్సరాల కాఫ్కా, 25 సంవత్సరాల కిండర్‌గార్టెన్ టీచర్ డోరా డయమంట్ (Dora Diamant)తో మరోసారి ప్రేమలో పడ్డాడు. కాఫ్కా ప్రణయానుభవాలన్నింటిలో ఇది ఆయనకు సంతృప్తినిచ్చిన అనుబంధం. జీవితపు చరమాంకంలో ఆయనకు ఇక ఏ సందిగ్దాలూ లేవు. సాహిత్యమా, సంసారజీవనమా అన్న ఊగిసలాటలు లేవు. జీవితమంతా తన తీక్షణమైన మానసిక సున్నితత్వం వల్లా, శారీరక అర్భకత్వం వల్లా అపరిమితమైన వేదనను అనుభవించిన కాఫ్కా, డోరా సాంగత్యంలో స్వచ్ఛమైన ప్రశాంతతను పొందాడు. ఇరువురూ వివాహం కూడా చేసుకోవాలనుకున్నారు. తన 41వ యేట ఊపిరితిత్తులవ్యాధి తీవ్రతరమై కాఫ్కా మరణించేవరకూ డోరా ఆయనకు తోడుగానే ఉంది, ఆమె చేతుల్లోనే ఆయన తుదిశ్వాస విడిచాడు.

ప్రపంచాన్ని, అది తొడుక్కున్న మోసపూరితమైన ఆచ్ఛాదనలను తొలగించి పారదర్శకంగా, నగ్నంగా వీక్షించగలిగే సామర్థ్యం కాఫ్కా యొక్క బలం మరియు బలహీనతగా చెప్పుకోవచ్చు. ఈ సున్నితమైన మానసికస్థితి ఆయన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. మిలెనాకు రాసిన ఒక ఉత్తరంలో ఆయన తన ఊపిరితిత్తులవ్యాధి గురించి ఇలా పేర్కొన్నాడు: 'ఎపుడైతే ఆత్మ మరియు హృదయం ఇక ఎంతమాత్రం భారాన్ని మోయలేవో, అపుడు కనీసం సమంగా పంపిణీ అయ్యేట్లు చూడటానికి, ఆ భారంలో సగభాగాన్ని ఊపిరితిత్తులు తమపైకి తీసుకుంటాయి.' ఊపిరితిత్తుల సమస్యతోపాటు ఆయన తరచు నిద్రలేమి, శిరోవేదనలతో బాధపడేవాడు. కాఫ్కా మరణం తర్వాత మిలెనా ఆయననుగూర్చి ఒక ప్రత్రికలో రాసిన Obituary లో ఇలా పేర్కొంది:

"He was too clear-sighted and too wise to be able to live; he was too weak to fight, he had that weakness of noble, beautiful people who are not able to do battle against the fear of misunderstandings, unkindness, or intellectual lies."

కాఫ్కా జీవితకాలంలో ప్రచురింపబడిన రచనలు చాలా స్వల్పం. తను మరణించే ముందు స్నేహితుడు మాక్స్‌బ్రాడ్‌కు రాసిన ఉత్తరంలో చివరికోరికగా తన అముద్రిత రచనలన్నింటినీ కాల్చేయమని కోరాడు. అదే జరిగి ఉంటే 20 శతాబ్దపు మేటి రచయితల్లో ప్రథమశ్రేణి రచయితనుగురించి మనకేమీ తెలిసేదేకాదు. కాని, స్వయంగా రచయిత అయిన మాక్స్‌బ్రాడ్ ఆ రచనల విలువను గుర్తించి, తన స్నేహితుడి కోరికను మన్నించకుండా, కాఫ్కా మరణానంతరం ఆ అముద్రిత రచనలన్నింటినీ క్రమబద్దీకరించి, పరిష్కరించి ప్రచురింపబడేలా శ్రద్ద తీసుకున్నాడు. తన జీవితకాలంలో అనామక రచయితగానే మిగిలిపోయిన కాఫ్కా, మరణానంతరం పాశ్చాత్య సాహిత్యంలో పెనువిప్లవాన్ని తీసుకువచ్చిన రచయితగా సుప్రసిద్దుడయ్యాడు. సాహిత్యానికిగల పరిధుల్ని విస్తృతంచేసి ఎందరో మేటి రచయితలకు మార్గదర్శకుడయ్యాడు.

నాకు కాఫ్కా పేరు మొదటిసారి పరిచయమైంది రచయిత కాశీభట్ల వేణుగోపాల్‌గారి "నేనూ-చీకటి"ద్వారా. సాధారణంగా నేను ఒక రచయితను(చదవడానికై) ఎన్నుకొనే విధానం ఇలా ఉంటుంది: నాకు నచ్చిన ఇతర రచయితలు - వారి రచనలలోగాని, ఇంటర్వ్యూలలోగాని - మరో రచయితను తమ అభిమాన రచయితగా పేర్కొన్నపుడు, ఆ ప్రస్తావనల ఆధారంగా మాత్రమే ఒక నూతన రచయితను నా పఠనాప్రపంచంలోకి అనుమతిస్తాను. నాకు కాశీభట్ల వేణుగోపాల్‌గారి రచనలంటే ఇష్టం. ఆయన దగ్గర ఉన్న పదసంపద, వాటితో ఆయనచేసే మంత్రజాలం నన్ను అబ్బురపరుస్తాయి. కాబట్టి ఆయన సిఫారసు ఆధారపడదగినదిగానే అనిపించింది. నేను కొన్న కాఫ్కా మొదటి పుస్తకం - ఆయన జీవించి ఉండగానే ప్రచురణకునోచుకున్న మెటమార్ఫసిస్, జడ్జ్‌మెంట్, ఇన్ ద పీనల్‌కాలనీ మొదలైన కధలతోకూడిన సంపుటి. చదవడం ప్రారంభించాను. ఇక్కడ ఒక విషయం నిజాయితీగా ఒప్పుకుంటున్నాను,కాఫ్కాతో నాది తొలిచూపు ప్రేమ కాదు. కాఫ్కా మొదట నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. సాహిత్యంపై నాలో నాటుకుపోయిన స్థిరాభిప్రాయాలూ; సాహిత్యపు పరిధి, సంభావనీయతల (Possibilities) పట్ల నాకున్న అంచనాలూ... ఇవన్నీ ఆయన ఎదురుదాడికి చాలా దెబ్బతిన్నాయి. ఇదంతా నాకేం నచ్చలేదు.

అంతక్రితం సాహిత్యం ఎలా ఉండాలన్న విషయంపై నాకు నిర్థిష్టమైన అభిప్రాయాలుండేవి: సాహిత్యమంటే సౌందర్యమని భావించేవాడ్ని; ఒక రచనలో ఆ రచయిత కనిపించాలనీ, సాహిత్యం రచయిత యొక్క ఆలోచనలనూ, మనస్తత్వాన్ని ప్రతిబింబించాలనీ నమ్మేవాడ్ని; "సాహిత్యం సమాజాన్ని ప్రతిఫలించాలీ, సమాజోద్దరణకు సాధనం కావాలీ" అని బాకా ఊదేవాళ్ళని (కొంచెం అపనమ్మకంతోనే అయినా) ఒప్పుకొనేవాడ్ని. అసలు ఇంత లోతైన విషయాలదాకా ఎందుకు, చాలామంది పాఠకుల్లానే నేనూ ఒక రచనంటే అందులో పాత్రలుండాలనీ; పాత్రలకు పేర్లుండాలనీ; పాత్రల మనస్తత్వ చిత్రణ స్పష్టంగా చిత్రింపబడాలనీ; కధానేపథ్యం, పరిసరాలూ చక్కగా వర్ణింపబడాలనీ; ఇవన్నీ కాకపోయినా, కనీసం ఒక రచనకు ప్రారంభం, ఘటన, ముగింపు అనే స్పష్టమైన విభజన ఉండితీరాలనీ - ఇలా ఒక పుస్తకం తెరిచేముందు కొన్ని ప్రాథమిక అంశాలను take it for granted గా తీసుకుని ముందుకి సాగుతాను. ఇక అసలు విషయానికొస్తే, ఇక్కడ నేను మిమ్మల్ని భయపెట్టే సంగతి ఒకటి చెప్పబోతున్నాను: కాఫ్కా రచనలు పై సూత్రాలు వేటికీ 'తందానా' అంటూ తలూగించవు, సరికదా పొగరుగా కళ్ళెగరేసి వెక్కిరిస్తాయి. అందుకే ఆయన మొదట చాలా ఇబ్బంది పెట్టాడని చెప్పింది.

నేను మొదట చదివింది, బహుశా, 'మెటమార్ఫసిస్' అనుకుంటా: ఒక ఉదయాన్నే కలత కలల నిద్రనుండీ మెలకువలోకి వచ్చిన ట్రావెలింగ్‌ సేల్స్‌మెన్ గ్రెగర్ జమ్‌జా, తను తన మంచంపై ఒక పెద్ద బొద్దింకగా మారిపోయి ఉండడాన్ని గమనిస్తాడు. ఈ సంఘటనతో కధ మొదలౌతుంది. ఇక్కడ ఈ పాత్రయొక్క అసహజమైన, భీభత్సపూరితమైన పరిస్థితి పాఠకులలో కలిగించే విభ్రమ కన్నా; మరింత అయోమయాన్నీ అసౌకర్యాన్నీ కలిగించే విషయం ఏమిటంటే - రచయిత పాఠకులతోపాటూ ఈ విభ్రాంతిని పంచుకోకపోవడం, పాఠకులలో అయోమయాన్ని గుర్తించనట్టూ, గ్రెగర్ జమ్‌జా పరిస్థితిలో ఏ అసహజత్వమూలేనట్టూ నిశ్శబ్దంగా, గంభీరంగా కధ చెప్పుకుంటూ పోవడం. ఇక్కడ నాకు కలిగిన (బహుశా చాలామందికి కలిగే) ఇబ్బంది ఏమిటంటే, ఈ భీభత్సాన్ని విడమర్చిచెప్పి, నన్ను ఆదుకోవడానికి నాకు ఆసరాగా రచయిత లేడనే ఫీలింగ్. దీనికి తోడు ఆ అద్భుతమైన శైలి. ప్రతీ వాక్యం మెదడులో ఒక స్పష్టమైన చిత్రాన్ని ఆవిష్కరిస్తుంది. మీరే చెప్పండీ, మీ మస్తిష్కంలో, ఓ మసక వెలుతుటి గదిలో పెద్ద బొద్దింకను మోసుకుంటూ (ఊహిస్తూ) పుస్తకం చదవడం సులభమైన విషయమా! ఒక తుంటరి మంత్రగాడిలా తన అక్షరాలతో మన మెదడులో బొమ్మలాటాడిస్తాడు కాఫ్కా. ఈ clustrophobic effectని భరాయించలేక ఒక్కోసారి పుస్తకాన్ని గిరవాటేయాలన్నంత అసహనం కలుగుతుంది. అయినా మంత్రముగ్దులమల్లే అక్షరాలవెంట కళ్ళను పరుగుతీయిస్తూనే ఉంటాం. కాఫ్కా తన పాఠకుల్లో ఉద్దేశపూర్వకంగా కలిగించే ఈ ఇబ్బందిని మీకు పరిచయం చేయడానికి ఆయన తన డైరీలో రాసుకున్న ఈ క్రింది రచనాభాస్యాన్ని ఉదాహరణగా ఇస్తున్నాను:

"నేను ముందే ఇద్దరు స్నేహితులతో ఆదివారం విహారయాత్రకు వస్తానని అంగీకరించి ఉన్నాను. కానీ, అసలూహించని విధంగా, మేము కలవవలసిన సమయాన్ని నిద్రలోనే గడిపివేసాను. మామూలుగా నేను సమయపాలనను ఎంత ఎంత ఖచ్చితంగా పాటిస్తానో తెలిసిన నా స్నేహితులు, ఆశ్చర్యంతో నా ఇంటికి వచ్చి, కాసేపు బయట వేచిచూసారు; చూసి చూసి చివరకు మెట్లెక్కి నా తలుపు తట్టిపిలిచారు. తత్తరపాటుతో లేచి, తటాలున మంచందిగి, దిగటంతోనే సాధ్యమైనంత వేగిరంగా ముస్తాబవటానికి ప్రయత్నించాను. నేను దుస్తులు పూర్తిగా తొడుక్కుని నా గదినుండి వెలికివచ్చేసరికి, నా స్నేహితులు దృగ్గోచరమైన ఉలికిపాటుతో ఒక్కసారి వెనక్కు జరిగారు. 'ఏమిటది నీ తలవెనకాల?' అరిచారు. నేను మేల్కొన్నప్పటినుండి నా నడుమును వెనక్కి వంగనీయకుండా ఏదో అడ్డుకుంటున్న భావన కలుగుతోంది. ఇపుడు నా చేతితో దానికై తడుముకున్నాను. అప్పటివరకూ కొంత నిశ్శబ్దం వహించిన నా స్నేహితులు, నా చేయి తల వెనుకాల ఒక ఖడ్గపు పిడిపై బిగుసుకునేసరికి, 'జాగ్రత్త, దెబ్బతగిలించుకోగలవ్!" అంటూ అరిచారు. సమీపానికి వచ్చి పరిశీలించి, తిరిగి నన్ను నా గదిలోని అద్దం దగ్గరకు తీసుకొనిపోయి, నడుందాకా దుస్తులు తొలగించి వేసారు. ఒక పొడవైన, శిలువాకారపు పిడిగల పురాతన యుద్దవీరుల ఖడ్గం ఒకటి నా వీపులో తుదకంటా చొచ్చుకుపోయి ఉంది; అయితే ఆ ఖడ్గం నా చర్మానికీ, లోపలి మాంసభాగానికీ మధ్య అద్భుతమైన నైపుణ్యంతో గుచ్చబడటం వల్ల ఎలాంటి గాయమూ కాలేదు. అంతేకాదు, ఖడ్గం దించబడిన ప్రదేశంలో నా మెడపై కనీసం పుండు కూడా లేదు; నా స్నేహితులు, అక్కడ ఖడ్గం ప్రవేశించడానికి వీలైనంత నిడివితో ఒక చీలిక ఉందనీ, కాని పొడిగా ఎండిపోయి, ఏ రక్తపుజాడా కన్పించకుండా ఉందనీ తెలిపి నన్ను కుదుటపరిచారు. ప్రస్తుతం వాళ్ళు కుర్చీల పైన ఎక్కి నిల్చొని, నెమ్మదిగా, అంగుళం అంగుళం, ఖడ్గాన్ని బయటకు లాగడం మొదలుపెట్టారు; నాకు రక్తస్రావమేమీ జరగలేదు; నా మెడపై చీలిక, ఆనవాలు దొరకని సన్ననికోతగా తప్ప మరేమీ కనిపించకుండా మూసుకుపోయింది. 'తీసుకో నీ ఖడ్గం', నా స్నేహితులు నవ్వుతూ దాన్ని నాకిచ్చారు. నేను దాన్ని భారంగా నా రెండు చేతుల్లోకీ తీసుకున్నాను; చాలా అద్భుతమైన ఆయుధం అది, బహుశా క్రూసేడర్లు వాడి ఉంటారు.

ఇలా స్వప్నాల్లో బాధ్యతారాహిత్యంగా తమ ఖడ్గాలు ఝుళిపిస్తూ, అమాయకంగా శయనిస్తున్నవారిని యధేచ్ఛగా పొడుస్తూపోయే ఈ పురాతన యుద్దవీరుల విచ్చలవిడి విహారాన్ని ఎవరు సహిస్తారు?" -- (కాఫ్కా డైరీలనుండి)

కాఫ్కా కధల్లో మెటమార్ఫసిస్‌ని క్లాసిక్‌గా అభివర్ణిస్తూ ఉంటారు చాలామంది. నాకు మాత్రం దానికన్నా 'ది బర్రో' (The Burrow) బాగా నచ్చుతుంది. ఇది ఒక బొరియలోని పురుగు స్వగతం. ఈ కధ మొదటిసారి చదివినపుడు, ఎవరో మన చెవి ప్రక్కన ఎలాస్టిక్ రబ్బర్‌బాండ్‌ ఒకటి లాగి పట్టుకుని వదులుతామని (వదలకుండా) బెదిరిస్తుంటే ఎలాంటి ఉద్విగ్నత కలుగుతుందో, అలాంటి ఫీలింగ్ కల్గింది నాకు.

తన తండ్రి తనపై మోపుతున్న దారుణమైన నిందారోపణల్ని భరించలేక వంతెనపైనుండి నదిలోకిదూకి ఆత్మహత్య చేసుకునే కొడుకు కధ 'ది జడ్జ్‌మెంట్' (The Judgement). ఈ కధ రాసిన తరువాత కాఫ్కా తన డైరీలో, 1912 సెప్టెంబరు 23 తేదీన ఇలా రాసుకున్నాడు:

"ఈ కధ, 'ది జడ్జ్‌మెంట్', నేను ఒకే విడతలో 22-23 తారీఖుల మధ్య, రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల మధ్యలో రాసాను. కూర్చుని ఉండటం వల్ల నా కాళ్ళు ఎంత బిరుసెక్కిపోయినాయంటే, డెస్కు క్రింద నుండి వాటిని బయటకు తీయడమే అసాధ్యమైంది. గగుర్పొడిచే అలసట, ఆనందం... కధ నా కళ్ళ ముందే అభివృద్ది చెందిన తీరు... ఏదో నేను నీటిపై గమిస్తున్నట్టు. రాత్రిలో చాలాసార్లు నా వెన్నుపై శరీరభారాన్ని తేలికచేసుకున్నాను. ఎలా అంతా చెప్పవచ్చో, ఎలా అన్నింటికీ, అన్ని వింత ఊహల కొరకూ ఒక మహాజ్వాల వేచి చూస్తుందో, ఎలా ఆ జ్వాలలో పడి అవి ఆహుతవుతూ, మరలా ఎలా పైకి ప్రభవిస్తూంటాయో... కిటికీ బయట ఉదయపు తొలి నీలికాంతులు అలుముకోవడం, బయట వాహనమేదో కదిలిన శబ్దం, ఇద్దరు వ్యక్తులు వంతెన దాటుతున్న దృశ్యం... రెండు గంటలకు నేను చివరిసారిగా గడియారం వైపు చూసాను. పనిమనిషి మొదటిసారి గదిలోకి ప్రవేశించినపుడు నేను చివరి వాక్యం రాస్తున్నాను. గదిలో విద్యుత్‌బల్బు ఆర్పివేయడం, ఉదయపు కాంతి జొరబడటం. గుండె చివురుల్లో సన్నని మంటలు. అర్థరాత్రి దాటాక పూర్తిగా మాయమైన బడలిక. ఉద్వేగంగా నా సోదరి గదిలోకి ప్రవేశించి చదివి వినిపించడం. అంతకు ముందే, 'నేనిప్పటి వరకూ రాస్తూనే ఉన్నాను' అని పనిమనిషితో చెప్పడం. అపుడే పరిచినట్లు మడతనలగని పక్కదుప్పటి. నా నవలారచన విషయంలో నేను సిగ్గుపడవలసినంత అట్టడుగుస్థాయిలో ఉన్నానన్న నమ్మకం మరోసారి బలపడింది. రచన అంటే ఇలాగే సాగాలి: ఇలాంటి స్పష్టతతోనే; శరీరం, ఆత్మల సంపూర్ణ వికాసంతోనే." -- (కాఫ్కా డైరీలనుండి)

ఇక కాఫ్కా నవలల విషయానికికొస్తే ఆయన రాసిన మూడు నవలలూ (The Trial, Amerika, The Castle) అసంపూర్ణాలే. మూడింటినీ కలిపి 'Triology of Loneliness' అని పిలుస్తారు. వీటిని నేను ఇక్కడ పెద్దగా ప్రస్తావించబోవట్లేదు. ఎందుకంటే, వీటి గురించి నేను రాయడం మొదలుపెడితే ఈ పోస్టు పరిమాణం మరో రెండు రెట్లు పెరుతుంది. ఒకటి మాత్రం చెప్తాను: కాఫ్కా యొక్క జీనియస్ ఆయన కధల్లో కన్నా నవల్లో బాగా కనిపిస్తుంది. ఆ భావ స్పష్టత, ఆ lucidity of thought నన్ను ఎంతగా ఆకట్టుకున్నాయంటే, 'ది ట్రయల్' నవలను చదువుతూ అందులో కొన్ని పేరాల్ని, ఏదో భగవద్గీతలో పద్యాల్ని వల్లించినట్టు, గట్టిగా బయటకే చదివేసేవాడ్ని. మూడు నవలల్లో 'Amerika' డికెన్సియన్ శైలిలో, సరళమైన కథనంతో సాగిపోయే కధ కాగా, 'The Trail', 'The Castle' మాత్రం తమ సంక్లిష్టతతో మీకు నిజమైన కాఫ్కాను పరిచయం చేస్తాయి.

కాఫ్కాను ప్రతీవాదం తనలో కలుపుకోవాలని ప్రయత్నించింది. అస్తిత్వవాదులు, అధివాస్తవికతావాదులు, చివరకు క్రైస్తవమతవాదులు, సామ్యవాదులు కూడా ఆయన్ని, ఆయన రచనల్నీ తమ తమ వాదాలకు అనుగుణంగా ప్రొజెక్టు చేసుకున్నారు. చివరకు ఆయన్ని ఏ చట్రంలో ఇమడ్చాలో అర్థంకాక, 'Kafkaesque' అంటూ ఆయన శైలికి ఒక విశేషణాన్నే తగిలించి వదిలేశారు. కానీ నా అభిప్రాయం ఏమిటంటే వీటన్నింటికన్నా ముందు ఆయన బేసిక్‌గా ఒక కళాకారుడు. ఆయన రచనల్ని parables గా భావించి, వాటిలో గూడార్థాలు వెతికి చెప్పేవాళ్ళ గొడవంతా హంబక్. ఆయన రచనల్లో ఏ గూడార్థాలూ, సింబల్స్ లేవు. ఆయన తనదైన ప్రపంచానికి, తన కళానైపుణ్యాన్ని జోడించి అద్భుతమైన రచనల్ని అందించాడు. ఈ కోణంలో ఆయనను చదవండి, ఆయన విశిష్టత ఏమిటో అవగతమౌతుంది. అంతేకాదు, ఆయన్ని చదవబోయేముందు, 'సాహిత్యం ఎలా ఉండాలీ' అన్నదానిపై మీకున్న preconceptions అన్నింటినీ ప్రక్కనబెట్టేయండి. మీ పఠనానుభవం సులభతరమౌతుంది.

కాఫ్కాను ఎక్కడినుంచి చదవడం మొదలు పెట్టాలీ అన్న సందిగ్దంలో ఉన్న ఔత్సాహిక పాఠకులకు, మొదట ఆయన డైరీలనుండి ప్రారంభించమని సలహా ఇస్తాను. ఆ విధంగా ఆయన రచనలను ఏ కోణంలో చదవాలీ అన్నది అర్థమౌతుంది. అంతేకాదు, అసలు ఒక రచయితకు తన రచనావ్యాసంగం పట్ల ఉండాల్సిన నిబద్ధత ఏంటో అవగతమౌతుంది.

కాఫ్కాను గురించి కొన్ని ఆసక్తికరమైన లింక్స్:

1) సంక్షిప్త జీవిత చరిత్ర ఛాయాచిత్రాలతో.

2) 'మెటమార్ఫసిస్'పై ప్రముఖ రష్యన్-అమెరికన్ రచయిత వ్లదీమర్ నబకొవ్ యొక్క విశ్లేషణాత్మక వ్యాసం.

3) కొన్ని కాఫ్కా కొటేషన్స్.
: