November 18, 2007

చట్టం ముందు

చట్టం ముందు ఒక కాపలావాడు నిలబడి ఉంటాడు. ఒక పల్లెటూరి మనిషి కాపలావాడి దగ్గరకు వచ్చి చట్టం లోపలికి వెళ్ళటానికి అనుమతిని ఇవ్వమని బతిమాలతాడు. కాని కాపలావాడు తాను ఇప్పుడు అనుమతి ఇవ్వలేనని అంటాడు. ఆ వచ్చిన మనిషి కాసేపు ఆలోచించి, అయితే తర్వాత ఎపుడైనా అనుమతి దొరుకుతుందా అని అడుగుతాడు. ‘అవకాశం ఉంది, కానీ ఇప్పుడు కాదు,’ అంటాడు కాపలావాడు. ఎప్పటిలాగే తెరుచుకొని ఉన్న చట్టం తలుపుల్లోంచి, కాపలావాడు పక్కకు జరగటంతో, ఆ మనిషి లోపలికి తొంగి చూస్తాడు. కాపలావాడు ఇది గమనించి నవ్వి అంటాడు: ‘నీకు అంత ఆత్రంగా వుంటే, నా మాట కాదని లోపలకి వెళ్ళే ప్రయత్నం చేయి. కాని ఒకటి గుర్తుంచుకో: నేను చాలా బలవంతుడ్ని. కానీ నేను చివరి అంచె కాపలావాడ్ని మాత్రమే. లోపల ఇలా గది నుండి గదికి ప్రతీ తలుపు దగ్గరా ఒక్కో కాపలావాడు నిలబడి ఉంటాడు — ప్రతీ ఒక్కడూ మునుపటివాడి కన్నా బలవంతుడే. మూడవ కాపలావాడి ముందు నిలబడటానికి నాకే ధైర్యం చాలదు.’ పల్లెటూరి నుంచి వచ్చిన మనిషి ఇలాంటి కష్టాలను ఊహించ లేదు; చట్టం అందరికీ అన్ని సమయాల్లోనూ అందుబాటులో ఉండి తీరాలని అతని ఉద్దేశం, కాని ఇక్కడ ఇలా ఉన్నికోటు వేసుకొని, మొనదేలిన పెద్ద ముక్కుతో, సన్నని పొడవైన నల్లని తార్తారు గెడ్డంతో ఉన్న ఈ కాపలావాడ్ని కాస్త దగ్గరగా పరిశీలించిన మీదట, అనుమతి దొరికేంత వరకూ ప్రవేశం కోసం ఎదురుచూడటమే మంచిదన్న నిర్ణయానికి వస్తాడు. కాపలావాడు అతనికి ఒక పీట ఇచ్చి తలుపుకి వారగా కూర్చోనిస్తాడు. ఆ మనిషి అక్కడే రోజుల తరబడి, సంవత్సరాల తరబడి కూర్చుంటాడు. పదే పదే లోపలికి అనుమతి ఇవ్వమని అడుగుతూ అభ్యర్థనలతో కాపలావాడ్ని విసిగిస్తాడు. అప్పుడప్పుడూ కాపలావాడు ఆ మనిషిని ఆరా తీస్తాడు, అతని ఇంటి గురించీ మిగతా విషయాల గురించీ అడుగుతాడు, కానీ అవన్నీ గొప్పవాళ్ళు అనాసక్తంగా అడిగే ప్రశ్నల్లా ఉంటాయి, ఎంత మాట్లాడినా చివరకు మాత్రం ఎప్పుడూ ఇంకా ఆ మనిషికి అనుమతి దొరకలేదంటూనే ముగిస్తాడు. ఈ ప్రయాణం కోసం చాలా సరంజామాతో సమృద్ధిగా వచ్చిన ఆ మనిషి, తాను తెచ్చుకున్నదంతా, అదెంత విలువైనదైనా, కాపలావాడికి లంచాలు ఇవ్వటానికి వాడేస్తాడు. కాపలావాడు అన్నీ బానే పుచ్చుకుంటాడు, కాని పుచ్చుకుంటూ: ‘ఇంకా ఏదో ప్రయత్నించకుండా వదిలేసానే అని నువ్వనుకోకుండా ఉంటానికి మాత్రమే దీన్ని పుచ్చుకుంటున్నాను,’ అనటం మానడు. ఈ అనేక సంవత్సరాల కాలంలో, ఆ మనిషి నిరంతరాయంగా కాపలావాడ్ని పరిశీలిస్తూనే ఉంటాడు. అందులో పడి మిగతా కాపలావాళ్ళ సంగతే మరిచిపోతాడు, ఈ కాపలావాడొక్కడే చట్టంలో తన ప్రవేశానికి ఏకైక అడ్డంకిగా కనిపిస్తాడు. తన దురదృష్టానికి తన్ను తానే తిట్టుకుంటాడు, వచ్చిన కొత్తల్లో బిగ్గరగానే తిట్టుకుంటాడు, కానీ తర్వాత, వయసు మళ్ళే కొద్దీ, తనలో తాను గొణుక్కోవటంతో సరిపెట్టుకుంటాడు. అతనిలో పిల్లచేష్టలు మొదలవుతాయి, సంవత్సరాల తరబడి అదే పనిగా చూడటం వల్ల కాపలావాడి కాలరు మడతలోని నల్లులను కూడా గుర్తుపట్టి, వాటిని కూడా కాపలావాడి మనసు మార్చటంలో సాయం చేయమని అడుగుతాడు. రాన్రానూ అతని కంటి చూపు మందగిస్తుంది, చుట్టూ ప్రపంచమే మసక బారుతోందో లేక తన కళ్ళే తనను మోసం చేస్తున్నాయో అర్థం కాదు. కానీ, అంత చీకటిలో కూడా, అతను చట్టపు ప్రవేశ ద్వారం నుంచి అవిరామంగా వెలువడుతున్న ఒక కాంతి పుంజాన్ని దర్శించగలుగుతాడు. ఇప్పుడు అతనిక ఎంతో కాలం బతకడు. చనిపోయేముందు, ఇన్ని సంవత్సరాల అనుభవాలూ మనసులో కూడుకొని కాపలావాడ్ని ఇంతవరకూ అడగని ఒకే ఒక్క ప్రశ్నగా రూపుదిద్దుకుంటాయి. బిర్రబిగిసిన శరీరాన్ని నిటారుగా లేపలేక, అతను కాపలావాడికి సైగ చేస్తాడు. వారిద్దరి ఎత్తుల్లో వచ్చిన తేడా వల్ల కాపలావాడు అతని వైపు వంగాల్సి వస్తుంది. ‘ఇప్పుడేం తెలుసుకోవాలి, నీకు తృప్తి అనేదే లేదు కదా!’ అంటాడు కాపలావాడు. ‘ప్రతి ఒక్కరూ చట్టంలో ప్రవేశం కోసం పరితపిస్తారు. మరి, ఇన్నేళ్ళలో, ఇక్కడ నేను తప్ప ఇంకెవరూ వచ్చి ప్రవేశానికి అనుమతి అడగలేదెందుకు?’ అని అడుగుతాడు ఆ మనిషి. అతనికి ఆఖరు గడియలు సమీపించాయని కాపలావాడు గ్రహిస్తాడు, వినికిడి మందగిస్తున్న అతని చెవుల్లోకి చేరేట్టు, గట్టిగా ఇలా అరుస్తాడు: ‘ఇంకెవ్వరూ ఇక్కడ నుంచి లోపలకు వెళ్ళలేరు, ఎందుకంటే ఈ తలుపు ఉన్నది నీ ఒక్కడి కోసమే. ఇపుడిక దాన్ని మూసేస్తున్నాను.’”

November 13, 2007

"వచన రచనకు మేస్త్రి రామకృష్ణ శాస్త్రి"

. . . అంటూ పుస్తకం చివరి అట్ట మీద రచయితను ఉద్దేశించి వాడిన నామ-విశేషణాన్ని చూసి, ప్రాస కోసం వాడిన అతిశయోక్తి కామోసనుకుంటూ, కాస్త అపనమ్మకంతోనే "మల్లాది రామకృష్ణ శాస్త్రి కథలు" మొదటి సంపుటాన్ని ప్రారంభించాను. మొదట చదివిన కథ: "కామకోటి". (విషయ-సూచిక వరుస ప్రకారం ఇది మొదటి కథ కాదు; బహుశా కథాశీర్షిక చూసి కక్కుర్తి పడి ఉంటానన్న మీ అంచనా తప్పని బుకాయించను.) ఆ కథ ప్రారంభంలో, నేరేటర్ కథ ఎత్తుకొంటున్న సందర్భంలో, ఒక పేరా ఇలా కొనసాగుతుంది:
"...క్లబ్బు నుండి అప్పుడే యింటికి వస్తున్నాను; గుమ్మానికి పెడల్ డీకొట్టకుండా, కాలితో ఆచుకుని, సీటు దిగకుండా... పని అయిపోయినా చిగురు దమ్ముల పస తెలిసిన రసికుణ్ణి గనుక పెదవులకు అంటే చురుకును సహించుకుంటూ, శేషరూపలేశమైన సిగరెట్-కన్యను బలవంతాన మరో రెండు వలపులు వలచి... మేనకకు ఉద్వాసన చెప్పి తప్పించుకున్న గాధేయుడి దర్జాతో లోపల ప్రవేశించాను."
ఈ ఒక్క పేరా సరిపోయింది నాకు—నేనొక నిపుణుడి చేతుల్లో ఉన్నానన్న నిశ్చింతను కలిగించడానికి.
సృజన-శిఖరపు పాదం దగ్గిర తడబడుతూ తచ్చట్లాడుతున్న ఒక ఔత్సాహిక ఆరోహకుడిగా, ఇలాంటి దృశ్య-చిత్రాల్ని ఆవిష్కరించడానికి తెర వెనుక ఎలాంటి ప్రయత్నం అవసర పడుతుందో నాకు ఇప్పుడిపుడే అనుభవానికొస్తుంది. అలాంటిది; ఆయనిక్కడ అలవోకగా, effortless precision తో చేస్తున్న వచన విన్యాసాలు చూస్తుంటే మూగ సంభ్రమంతో నోరెళ్ళబెట్టక తప్పింది కాదు.
బహుశా ఈ అలవోకడ కేవలం దృగ్గోచర భ్రమే కావచ్చు, ఆయన కూడా అక్షర యాగంలో చెమటోడ్చి ఉండొచ్చు; కానీ, what matters is, ఆ కష్టం ఆయన వచనంలో ఎక్కడా మచ్చుకు కూడా కనిపించదు: అంతా ఈల పాటలా తేలికగా సాగిపోతుంది.
మరొక ఉదాహరణ తర్వాతి కథ "రాజసూయం"లోంచి:
"...కారులో మొదటనే ఆమె ఎక్కి కూర్చున్నది: ఎక్కడనో పుట్టి ఏ మూలకో మాయమయే వెలుగు, ఆమె పరాకున తల కదిలించినపుడల్లా చెవుల రవలకు ఒరసి... జిల్లున తళుకు కొడుతూన్నది: కారు సాగించడానికి తంటాలు పడుతూ... చుట్టి ప్రదక్షిణంగా పరిశీలించబోతున్నపుడల్లా ఆ మెరుపు అతని చూపుకు తగిలి... బెడిసి పోతూన్నది..."
ఇక్కడ రచయిత కన్వే చేయదలచుకున్న దృశ్యం: రాత్రి పూట, రోడ్డు మీద అతడు కారు రివర్స్ చేయడానికి ప్రయత్నిస్తూ తల వెనక్కి త్రిప్పినపుడల్లా, ప్రక్క సీట్లో కూర్చున్న ఆమె చెవులకున్న రవ్వల దుద్దులపై ఎక్కడి నుండో ఓ కాంతి కిరణం పడి పరావర్తనం చెంది అతని చూపులకు మెరుపు కొడుతుంది.
ఇపుడు మరలా ఇంకోసారి పై పేరా చదవండి—
ఏ మాత్రం జటిలత్వం లేకుండా, బాషను మైనం ముద్దలా తన ఇఛ్చానుసారంగా మలచుకొంటూ; రచయిత తన మస్తిష్కంలో రూపు దిద్దుకున్న ఒక దృశ్య-చిత్రాన్ని ఎంత తేలికగా మన దాకా బదిలీ చేయగలిగాడో కదా!
ఈ సరికే మీకు అర్థమై ఉంటుంది—ఒక పాఠకుడిగా నేను అల్ప సంతోషినని: ఒక రచన నుండి నాకు నీతి అక్కర్లేదు; సో కాల్డ్ "భావుకత" అక్కర్లేదు; రచన ద్వారా విజ్ఞానాన్నీ, విషయ సంగ్రహణనూ ఆశించను; నా వ్యక్తిగత అభిప్రాయాల, సిద్థాంతాల, వాదాల సమర్థింపునూ ఆశించను—ఒక ముక్కలో తేల్చి చెప్పితే—ఒక రచనలో చక్కనైన శిల్పం, స్పష్టమైన చిత్ర సంచయం చాలు నాకు. వీటి ప్రామాణికంగానే నేను ఏ [కాల్పనిక] రచన యోగ్యతకైనా తూకం కడతాను. పదాల్లోకి రామని మొండికేస్తున్న గహమైన భావోద్వేగాల్ని (abstract emotions) చెవి మెలిపట్టి లాక్కొచ్చి అక్షరాల వరుసలో పేర్చి కూర్చుండబెట్టగలిగే కలంకుశ ధారులైన రచయితలన్నా; కలాన్ని కుంచె మాదిరి వాడుకొంటూ అక్షరాల్తో బొమ్మలల్లగలిగే చిత్రకార-రచయితలన్నా—నాకు మిక్కిలి గౌరవం. మల్లాది రామకృష్ణ శాస్త్రి అచ్చంగా అలాంటి రచయితే.
ఇక్కడ అప్రస్తుతమైనా ఒక విషయాన్ని ప్రస్తావించదలిచాను: యాదృఛ్చికంగా, శైలిలో సమీప సారూప్యత గల ఇరువురు రచయితల్ని ప్రస్తుతం నేను ఒకేసారి చదవడం సంభవించింది: మల్లాది రామకృష్ణ శాస్త్రి ఒకరు కాగా, మరొకరు బ్రిటిష్ రచయిత Henry Green (1905–1973). ఆయన శైలికి ఉదాహరణగా నేను ప్రస్తుతం చదువుతున్న ఆయన నవల "Loving" నుంచీ ఒక పేరా క్రింద ఇస్తున్నాను. ఇక్కడ, అలతి పదాలతో నాయకానాయికల (Charlie Raunce, Edith)మధ్య ఒక చుంబన దృశ్యం ఎంత సజీవంగా, మనోజ్ఞంగా ఆవిష్కృతమైందో చూడండి:
‘Oh Edie,’ he gasped moving forward. The room had grown immeasurably dark from the storm massed outside. Their two bodies flowed into one as he put his arms about her. The shape they made was crowned with his head, on top of a white sharp curved neck, dominating and cruel over the blur that was her mass of hair through which her lips sucked at him warm and heady.
‘Edie,’ he muttered breaking away only to drive his face down into hers once more. But he was pressing her back into a bow shape. ‘Edie,’ he called again.
ఈ ఇరువురు రచయితల్లోనూ నాకు కామన్‌గా కనిపించిన అంశమేమిటంటే: వచనంలో వారు ఉద్దేశ్యపూర్వకంగా వదిలేసే ఖాళీలు. అంటే—ఒక దృక్చిత్రాన్ని ఆవిష్కరించడానికి వారు ఎక్కువ పద-వివరాల్ని వినియోగించరు; పదాల అధిక మోతాదు వల్ల దృశ్యం ఉక్కిరి బిక్కిరై, పాఠకుని దాకా చేరేసరికి అంతా అలుక్కు పోయి మొదటికే మోసం వస్తుంది. దీనికి విరుగుడుగా, వీరిరువురూ తమ వచనంలో కాలిక్యులేటెడ్‌గా కొన్ని ఖాళీలను [పాఠకుడి పూరణకే] వదిలేస్తారు; కొన్ని దృశ్య-వివరాల్ని విడిచి పెట్టేస్తారు. దీని పర్యవసానంగా, వారి వచనం చదువుతుంటే—వారు పదాల్ని పేర్చి ఒక దృశ్యాన్ని సమకూర్చినట్టుండదు; ముందే సజీవంగా ఉన్న ఒక దృశ్యం పై, మరింత స్పష్టత కోసం మాత్రమే, అక్కడక్కడా పదాల్ని వెదజల్లినట్లుంటుంది. దీని వల్ల దృశ్యం, తద్వారా రచన, రచయితకు అతీతంగా [విడివడి] తమకంటూ ఒక స్వతంత్ర అస్థిత్వాన్ని కలిగి ఉన్నట్టూ; ఆ సజీవ ప్రపంచాన్ని మనదాకా చేర్చడానికి, తమ కేవలం పదాల మాధ్యమం ద్వారా శ్రమ పడుతున్న మన సహాయకులు మాత్రమే అయినట్టూ అనిపిస్తుంది. ఇక్కడ; ఇలా రచయిత మెదడులో ఊపిరి పోసుకున్న ఒక దృశ్యానికి కాంక్రీట్ రూపాన్నియ్యడానికి, ఆ దృశ్యానికి ఆయువు పట్టైన అంశాల్ని ఎక్యురేట్‌గా ఎన్నిక చేసుకోవడంలోనే రచయితల అసలు నైపుణ్యం బయట పడుతుంది. ఆ నేర్పు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి రచనల్లో స్పష్టంగా ద్యోతనమవుతుంది. అయితే—ఆయన తన బహుముఖ ప్రతిభలో ఈ పార్శ్వాన్ని, తన కథా గమనానికి ఎంత వరకూ అవసరమో అంతే వినియోగించుకున్నారు. అయినా ఇలాంటి దృక్చిత్రాలు కథకో రెండు-మూడున్నా చాలదా అనిపించింది నాకు—ఉన్నాయి కూడా.
శిల్పం విషయానికొస్తే, శాస్త్రి గారి కథలన్నీ శిల్ప పరంగా సరళంగా సాగిపోయేవే; శిల్ప సంక్లిష్టత దాదాపు ఎక్కడా కనిపించదు. ప్రతీ కథా సముచితమైన శిల్ప సంవిధానాన్ని కలిగి ఉంటుంది. (శిల్ప విశ్లేషణకు పూనుకుంటే ప్రతీ కథకీ విడిగా చేయాలి—సాధ్యం కాదు కాబట్టి ఇక్కడ వివరించడం లేదు.)
శాస్త్రి గారి కథలు చదువుతుంటే తెలుగు ఎంత సజీవమైన, స్వతంత్రమైన భాషో నాకు పూర్తిగా జ్ఞానోదయమైంది. ఈ పుస్తకం—తెలుగు భాషతో ఏమేం చేసే అవకాశం ఉందో [అన్ని పాజిబిలిటీస్‌నీ] కళ్ళ ముందు నిలిపి నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది; ఈ భాష మరీ అంత తుప్పుపట్టిన పనిముట్టేం కాదనీ, పనితనం తెలిసినవాడి చేతిలో పడితే ఎలాంటి బృహత్ సాహితీ లక్ష్యానికైనా అందివచ్చే దమ్మున్న భాషనీ నమ్మిక కలిగించింది; అంతే కాదు, ముఖ్యంగా, సిసలైన తెలుగు నుడికారపు రుచేంటో నాకు చూపించింది. రచయితలకి ఈ నుడికారం (Idiom) అనేది—దారి తెలియని ఊళ్ళో ఊరు మరిగిన వీధి-పిల్లాడి తోడు లాంటిది; విషయాన్ని చుట్టి త్రిప్పి చెప్పే కష్టాన్ని తప్పించి దగ్గరి-త్రోవల దారి చూపిస్తుంది. తెలుగు నుడికారం శాస్త్రి గారి కథల్లో కొత్త సొబగుల్ని అద్దుకుంది. నుడికారమే కాదు—రూపకాలంకారాదుల వాడుక లోనూ కిటుకులు తెలిసిన ఘటికుడాయన. కానీ వీటన్నింటినీ ఇక్కడ ఉదహరించబోవడం లేదు. ఎందుకంటే వాటిని Original context లోంచి ఎత్తుకొచ్చి ఇక్కడ విడిగా చూపిస్తే ఔచిత్యం అర్థం కాదు; తెలుసుకోవాలంటే మీరు కథలు చదివి తెలుసుకోవాల్సిందే.
పద-చిత్రాలంటే పడి చచ్చేవారూ (నాలా); లయబద్దంగా పాటలా సాగిపోయే వచనపు వన్నె మరిగిన వారూ (మళ్ళీ నాలానే); తీరైన కథాసంవిధానపు రుచి ఎరిగిన వారూ; జీవత్వంతో తొణికిసలాడే పాత్రలంటే ముచ్చట పడేవారూ; అక్షర-లక్షల విలువైన అచ్చ తెనుగు నుడికారాన్ని ఆస్వాదించగోరే వారూ—ఇలా ఎవరి అభిరుచికి తగ్గట్టు వారికి ఎంతో కొంత ఇక్కడ సలక్షణంగా లభ్యమౌతుంది. ఇక కథల్లో నీతినీ, సమాజ హితాన్నీ తరచి చూసేవారు ఈ వైపుకు రాకపోవడమే మంచిది—ఈ కథల ఔచిత్యం వారి గుడ్డి ఎడ్డి కొలమానాలకి అందదు.
ఇక శాస్త్రి గారిలో నాకు చికాకు తెప్పించిన అంశమేమంటే, his entire preoccupation with one particular subject (almost verging on to mono-mania): వేశ్యలు/సానులు/దేవదాసీలు/మేజువాణీలు—ఇంచుమించు ప్రతీ కథా వీటి చుట్టూతానే తిరుగుతుంది. రచయిత వేశ్యావృత్తిని ఒక కళగా, సామాజికావసరంగా సమర్థించడం కూడా కనిపిస్తుంది. (తన నేరేటర్‌ల ముసుగులోంచి రచయితే తన అభిప్రాయాల్ని వెల్లడి చేస్తున్నట్టయితే.) ఇక్కడ రచయిత యొక్క నైతిక దృష్ఠిపై నాకేమీ అభ్యంతరం లేదు; అతడి వ్యక్తిగత అభిప్రాయాలపై ఆసక్తీ లేదు. కానీ ఈ మోనో మానియా వల్ల వస్తు వైవిధ్యం మృగ్యమై; ప్రతీ కథా మరో కథకు, వస్తు పరంగా, దాదాపు నకల్లా కనిపిస్తుంది. అఫ్‌కోర్స్, చాలామంది రచయితలు చివరకు ఏదో ఒక సబ్జెక్ట్‌కి మోనో మానియాక్స్ గానే తేల్తారు. (నిజానికి—తమని తాము 'జాక్-ఆఫ్-ఆల్'గా నిరూపించుకో దలచి, ఏ సబ్జెక్ట్‌నీ లోతుగా తరచి చూడకుండా, ప్రతీ దాన్నీ పైపైనే పాముకుంటూ పోయేకన్నా—ఇలా ఏదో ఒక సబ్జెక్ట్‌కే అంకితమైపోయి, దాని అంతు చూడ తలపెట్టడం కూడా వాంఛనీయమేనేమో.) కానీ తను ఎన్నుకున్న సబ్జెక్ట్ దగ్గిర, ఇలా పుంఖానుపుంఖాలుగా కథలు తవ్వుకున్నా తరగని లోతు ఉందా లేదా అన్నది రచయితే ముందుగా తేల్చుకోవాల్సిన విషయం; శాస్త్రి గారు ఎన్నుకొన్న వస్తువులో ఆ గాఢత లేదని నా అభిప్రాయం. పర్యవసానంగా ఆయన కథల్లో వస్తు పరంగా ఈ పౌనఃపున్యం అధికంగా కనిపిస్తుంది. శాస్త్రి గారితో మరో చికాకేమిటంటే—ఊరకే పాఠకుల్ని బిత్తర పరచాలన్న ఉత్సాహం. (ఉదా: జంతువులతో రతికి ఉబలాటపడే యువకుడి కథ "శహన".) ఇలా రాసిన కొన్ని [తక్కువ] కథల్లో ఆ షాక్‌వాల్యూ తప్ప వేరే ఏ విలువా కనిపించదు.
శాస్త్రి గారి రచనల్లో నేను గమనించిన ఇంకో లోపం: విరామ చిహ్నాల వాడుకలో విచ్చలవిడితనం. Ellipsis (...) అవసరమైన చోట Em dash (—) వినియోగం; 'పుల్‌స్టాప్' పెట్టవలసిన చోట Ellipsis తో వాక్యాన్ని సాగదీయడం; అనవసరంగా 'కామా'ల వినియోగం; సంభాషణల్ని Quotes (" ") తో వేరు పరచకపోవడం—వీటి వల్ల వచనానికి వాటిల్లే నష్టం పరిమితమే అయినా, చదువరికి మాత్రం ఇవి పాయసంలో పలుకు రాళ్ళ లాంటి ఇబ్బందిని కలగజేస్తాయి.
శాస్త్రి గారి రచనల్ని చదవగోరే పాఠకులకు చిన్న సూచన: చదివేటపుడు ప్రక్కనో నిఘంటువుని ఉంచుకోవడం మంచిది—అంటే వచనం అంత కఠినంగా ఉంటుందని కాదు. (కఠినమైనా—సన్నివేశాన్ని, సందర్భాన్ని బట్టి అర్థం [చూచాయగానైనా] అవగతమైపోతూనే ఉంటుంది.) కాని తెలుగు భాషలోని మాధుర్యం, తేటదనం, రిచ్‌నెస్ మీకు సంపూర్ణతతో సాక్షాత్కరించాలంటే; నిఘంటువు యొక్క అదనపు సహాయం అవసర పడొచ్చునని నా ఉద్దేశ్యం. (మృదంగ వాయిద్యకారుడికి "మార్దంగికుడు" అనే అందమైన ధ్వని ఉన్న పదం ఉందని నాకు తెలియదు, మీకు తెలుసా.)
ఈ కథల సంపుటి ప్రతులు—మీది హైదరాబాద్ అయితే—"విశాలంధ్రా"లో లభ్యమౌతున్నాయి. (వెల:రూ.150/-) ఇక హెన్రీ గ్రీన్ విషయంలో మీకా ఛాయిస్ లేదు; వెతికి వెతికి "హిమాలయా"లో ఉన్న ఒకే ఒక్క పుస్తకాన్ని నేను దొరకబుచ్చుకున్నాను. (వింటేజ్ క్లాసిక్స్ విడుదల చేసిన మూడు నవలల [Loving, Living, Party Going] సంపుటి. వెల:రూ.800/-) అది కూడా ఆయన్ని గ్రాహం గ్రీన్‌తో పొరబడి తెచ్చినట్టున్నారు—పుస్తకం ఆ వరుసలో మూలుగుతుంది.