August 18, 2008

రాయల ప్రపంచ అట్లాసు ఆధారంగా తాత్త్విక మీమాంస (పార్టు -2)

నా ముందు పోస్టులో ఈ ప్రపంచంలో ప్రతీ విషయాన్ని జస్టిఫై చేయగల ఒకే అంతస్సూత్రం గురించి, ఈ ప్రపంచాన్ని స్పష్టంగా చూపించగల ఒకే ఒక్క vantage point గురించీ ఏదో రాసేను. మొన్నో రోజు అట్లాసు తిరగేస్తుంటే అలాంటి అంతస్సూత్రం పట్టుబడిన క్షణమేదో నా మీదగా పాకిపోయినట్టనిపించింది. క్షణకాలం పాటు ఆ vantage point దగ్గర నిలబడ్డ అనుభూతి కలిగింది. క్షణం పాటే; మళ్లీ అంతా మామూలే. దీన్నే జాయిస్‌ epiphanic moment అంటాడేమో. విషయానికొస్తే, ఆ అట్లాసులో సౌరమండలాన్ని గురించి ఒక పేజీ ఉంది. అందులో సూర్యుడు, నవగ్రహాల సాపేక్ష పరిమాణాల్ని అర్థమయ్యేలా చూపించడానికి వరుసగా (ప్రక్క ప్రక్కన) వాటి బొమ్మలు వేసారు. అందులో సూర్యుడి ప్రక్కన భూమి ఎలా ఉందంటే, ఒక ఫుట్‌ బాల్‌ ప్రక్కన సగ్గుబియ్యం గింజ పెట్టినట్టు ఉంది. ఆ ప్రక్కనే మన పాలపుంత బొమ్మ వేశారు. ఈ పాలపుంతలో ఉజ్జాయింపుగా పదివేల కోట్ల నక్షత్రాలు ఉంటాయట. వీటిలో సూర్యుడెక్కడ ఉన్నాడో చిన్న బాణం గుర్తుతో సూచించారు. ఆ బాణం గుర్తు సూచించిన చోట కంట్లో నలుసంత కనపడీ కనపడనట్టున్నాడు సూర్యుడు. మన పాలపుంత ఆసియా ఖండమంతా పెద్దది అనుకుంటే, అందులో ఓ చోట గుండు సూది గుచ్చినంత స్థలం మన సౌర కుటుంబం ఆక్రమిస్తుందట. ఈ పాలపుంత లాంటి గెలాక్సీలు ప్రస్తుతం మనకి తెలిసి (అంటే మనకు టెలిస్కోపులో కనపడేవి) మరో పది కోట్లున్నాయి.

ఆ పేజీలోనే క్రింద సూర్యుడి జీవిత కాలం గురించి చిన్న పేరా రాసారు. సూర్యుడు ఇప్పటికే నడి వయస్సు కొచ్చేసిన నక్షత్రమట. వయస్సు పెరిగే కొద్దీ దీని ఆకృతి మారుతుందట. ఒక ఐదు బిలియన్‌ సంవత్సరాల తర్వాత, సూర్యుని కేంద్రకంలో ఉన్న హైడ్రోజన్‌ అంతా హీలియంగా మారిపోయాక, సూర్యుడు ఉబ్బడం మొదలుపెడతాడట. ఎంతగానంటే, ఇప్పుడున్న పరిమాణానికి మరో నూటయాభై రెట్లు పెరిగిపోతాడట. ఒక్కసారి ఊహించండి, మనం రోజూ చూసే ఆకాశంలో రోజూ చూసే సూర్యుడు నూటయాభై రెట్లు పెరిగిపోతే...! కాని ఇది ఒక ఊహే. ఎందుకంటే అది చూడటానికి మనం ఉండం కదా. మాడి మసై పోతాం. సరిగ్గా ఈ పేరా చదువుతున్నపుడే ఇందాక నేనన్న ఎపిఫానిక్‌ మూమెంట్‌ లాంటిది అనుభూతికొచ్చింది.

గత పోస్టులో నేను నన్నొక మెగలోమానియాక్‌గా అభివర్ణించుకున్నాను. నిజానికి నేనే కాదు, మనుషులంతా మెగలోమానియాక్‌లే. విశ్వంలో తమ ఉనికి గురించి అతిగా ప్రాముఖ్యతనిచ్చుకోవడం వల్లే ఇన్ని సందేహాలు, సంశయాలు. కాని మనకంత సీన్‌ లేదు. ఈ సూర్యుణ్ణే తీసుకోండి. ఈ మండే పదార్థం లేకపోతే మనం లేము. భూమిపై మానవ జాతి ఆవిర్భావానికి, మనుగడకు ఇది ఆయువుపట్టు. కాని అనంత విశ్వపు కాలగమనంతో పోల్చి చూస్తే ఈ సూర్యుని జీవితకాలం అనేది చాలా స్వల్ప కాలికమైన విషయం; సూర్యుని పుట్టక గిట్టుక అనేవి పెద్ద లెక్కలోకి రాదు. A mere fleeting phenomena. దీనిలో ఉన్న హైడ్రోజన్‌ అణువులన్నీ పూర్తిగా హీలియంగా మారిపోతే సరి, దీని పనైపోతుంది. దాంతో పాటే మన పనైపోతుంది. ఒక్కసారి ఈ కోణంలోంచి ఆలోచిస్తే మానవ జన్మ ఎంత చిన్న విషయమో, ఎంత యాదృచ్ఛికమో అర్థమౌతుంది.

ఉదాహరణకి, ఇంట్లో బ్రెడ్‌ని వాడకుండా మూల వదిలేసేమనుకోండి; కొంతకాలానికి దానిమీద బాక్టీరియా, శిలీంధ్రాలు పుడతాయి. ఆ బ్రెడ్డు మీద ఆధారపడి బతుకుతుంటాయి. మనం ఆ బ్రెడ్‌ పాకెట్‌ని బయటపడేస్తే, దాంతో ఆ బ్రెడ్‌ మీద శిలీంధ్రాలూ అంతరించిపోతాయి. బ్రెడ్‌ మీద బతకడానికి అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయి కనుక శిలీంధ్రాలు పుట్టాయి. అలాగే భూమ్మీద బతకడానికి అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయి కనుక మనం మనుషులం పుట్టాం. ఒక మనిషికి సంబంధించినంత వరకూ తన నిలవ రొట్టె, దాని మీద బతికే శిలీంధ్రాల మనుగడ ఎంత అల్పమైన విషయమో, అలాగే ఈ విశాల విశ్వానికి సంబంధించినంత వరకూ ఈ భూమి, ఈ భూమ్మీద బతికే మనుషుల మనుగడ అంతే అల్ప విషయం. హఠాత్తుగా మన గెలాక్సీలో ఏ మూలనో సంభవించిన పెద్ద పేలుడు రేపు సౌర కుటుంబాన్ని తాకి భూమి అంతా చిన్నాభిన్నమైపోయినా మన ల్ని పట్టించుకునే నాథుడెవడూ లేడు. Because, this universe— this mad, irrational universe— don't give a shit about you and your tiny little existence.

అయితే రొట్టె మీద శిలీంధ్రాలకి మనకీ తేడా ఏంటంటే, అవి తమ జన్మ మూలాల గురించి, తమ ఉనికి పరమార్థం గురించీ ఆలోచించవు. మనిషికి మెదడు ఉంది కనుక ఆలోచిస్తాడు. ఈ ఆలోచనే మనిషి మెగలోమానియాకు అసలు కారణం. ఈ మెదడే సృష్టిలో మనిషి అస్తిత్వం కేవలం యాదృచ్ఛికమన్న నిజాన్ని మన చేత అంగీకరించకుండా చేస్తుంది. మనకి మనం ఆపాదించుకున్న ప్రాముఖ్యతే మన అసలు విలువేంటో తెలీకుండా మరుగు పరుస్తుంది. సృష్టి కాలగమనంతో సాపేక్షంగా పోల్చి చూస్తే భూమ్మీద మానవజాతి ఆవిర్భవించడానికి, అంతరించడానికీ మధ్య ఉన్న కాలం, మనకి ఒక సంవత్సరంలో అరసెకను ఎంత చిన్నదో అంత కన్నా చిన్నది. మన భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఒక రోజు పడుతుంది. మన పాలపుంత తన చుట్టూ తాను తిరగడానికి 22 మిలియన్‌ సంవత్సరాలు పడుతుందట. భూమ్మీద మనిషి ఆవిర్భవించి మాత్రం 6 మిలియన్‌ సంవత్సరాలే అవుతుంది. అంటే పాలపుంత తన చుట్టూ తాను ఒక రౌండ్‌ కొట్టే సరికే మానవ జాతి పుట్టడం అంతరించిపోవడం కూడా పూర్తయిపోతాయన్నమాట.

ఇందాక నేను చెప్పిన vantage point ఇదే. ఒక్కసారి ఇక్కడకొచ్చి నిలబడండి, చాలా వరకూ అర్థమైపోతుంది. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి తత్త్వ శాస్త్ర పుస్తకాల్లో మునిగి తేలాల్సిన అవసరం లేదనుకుంటా. రాయల ప్రపంచ అట్లాసు తిరగేస్తే చాలు; ప్రపంచం అర్థమైపోతుందని చెప్పను గానీ, ప్రపంచం అర్థం వెలకాల్సినంత గొప్పదేం కాదని అర్థమవుతుంది; అసలు దీనికంతా ఓ అర్థమూ పాడూ లేకపోయినా అంత బాధపడాల్సిందేమీ లేదని ఓదారుస్తుంది.

మన అదృష్టం ఏంటంటే, ఈ తాత్కాలిక (transient) ప్రపంచంలో మన ఉనికి అర్థ రహితం అన్న స్పృహ (awareness) మనకి నిత్యం ఉండదు. కొన్ని కొన్ని ఆకస్మిక క్షణాల్లోనే మనకి ఆ స్పృహ కలుగుతుంది. మిగతా సమయమంతా ఒకరకమైన మరుపుతో జీవితాన్ని గడిపేస్తాం. ఈ మరుపు నిజానికి ఒక వరం. ఈ మరుపే మన చేత చదువులు చదివిస్తుంది, ఉద్యోగాలు చేయిస్తుంది; పెళ్ళిల్లు, ప్రత్యుత్పత్తి, పిల్లల పెంపకం ఇవన్నీ చాలా ముఖ్యమైన విషయాలని నమ్మిస్తుంది. ఇవన్నీ అలవాటుగా చేసుకొని మనం మన ఉనికిలో అర్థరాహిత్యాన్ని మర్చిపోగలుగుతాం. అందుకే అన్నాను habit is heaven అని. అలవాటు నుంచి బయటకొచ్చి బతకాలనుకుంటే మనది చాలా ఒంటరి బతుకైపోతుంది. దాన్ని మన చుట్టూ మనుషులూ సపోర్ట్‌ చేయరు; మన చుట్టూ ఉన్న విశ్వం కూడా ఎలాంటి కాంపెన్సేషనూ చూపదు, సరికదా భయపెడుతుంది. కాని, బుజ్జగించి నిద్రపుచ్చే అలవాటనే అబద్దం కంటే, భయపెట్టినా నిజమే కావాలనే వాళ్ళు కొంతమంది ఉంటారు- శ్యామ్యూల్‌ బెకెట్‌ లాంటి వాళ్ళు. వాళ్ళ విషాదం ఈ ప్రపంచంలో అన్ని విషాదాల్లోకీ అర్థవంతమైన విషాదం.

"పుట్టుక, చావు అనే రెండు చీకటి తీరాల్ని కలుపుతూ కట్టిన వెలుగు వంతెనే జీవితం'' అంటాడు కాఫ్కా. ఒకసారి ఈ వంతెనెక్కేకా చివరిదాకా నడిచి తీరాలి. వదిలి వచ్చిన తీరం పట్ల బెంగా లేదు, వెళుతున్న తీరంపై ఆశాలేదు. అసలక్కడేముందో కూడా ఎవరికీ తెలీదు. ముందు వెనకల చీకటే. కాబట్టి వంతెన మీద నడిచే కాస్త కాలాన్ని worthwhile చేసుకోవడమే మనం చేయగలిగింది. కాని ఏం చేస్తే ఇది worthwhile అయినట్టు? వందేళ్ళు బతకమని మనల్ని ఈ ప్రపంచంలో పడేశారు బానేవుంది; what do we do now? ఈ వంతెన అన్న మెటాఫోర్‌ కన్నా "మ్యూజింగ్స్‌''లో చలం ఇంకో మంచి మెటాఫోర్‌ ఇస్తాడు.

"రేపు చచ్చే నేను— ఈ స్టేషన్లో ఎక్కి పక్క స్టేషన్లో దిగిపోయే నేను— సుఖంగా కూచోక, రైలు పెట్టెలు యెందుకు ఊడుస్తూ యీ నాలుగు నిమిషాలు గడపాలి? నాకేం తెలీదు— ఈ రైలు యెక్కడికి పోతుందో, ఏమవుతుందో. ఇది శాశ్వతమనీ, దీనికో గమ్మస్థానం వుందనీ నాకు రూఢీ యేమిటి? ఇది యే బ్రిడ్జి మీద, ఏ బాంబుల క్రింద బోల్తా పడుతుందో! నేనెందుకు నా కాలాన్ని సౌఖ్యాన్ని త్యాగం చేయాలి?''

ఇక్కడ చలం కోపం సామ్యవాదులు, సంఘ సేవకుల పట్ల. పుట్టుక అనే స్టేషన్లో ఈ జీవితం అనే రైలెక్కాం; చావు అనే స్టేషన్లో రైలు దిగిపోతాం. ఒక్కసారి దిగాక ఈ రైలుతో మనకే నిమిత్తం ఉండదు. ఇప్పుడు ఉన్న కాస్త సమయాన్ని నాకు నచ్చినట్టు గడపక సోషలిష్టులు చెప్పినట్టు రైలుని, రైల్లో మిగతా ప్రయాణికుల్నీ ఉద్దరిస్తూ ఎందుకు గడపాలి- అన్నది చలం ప్రశ్న. నిజమే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు గడపొచ్చు. చలం తోటి ప్రయాణికుల భార్యల్ని బుట్టలో వేసుకోవడంలో (లేదా "ఉద్దరించడంలో'') గడిపాడు. శ్రీశ్రీ స్లీపర్‌ క్లాస్‌ వాళ్ళని నిద్రలేపి "పదండి ముందుకు పదండి తోసుకు'' అంటూ ఎ.సి. కంపార్ట్‌మెంటు వాళ్ళమీదికి ఉసిగొల్పడంలో బిజీ అయ్యాడు. కృష్ణ శాస్త్రి రైల్లో ఇంతమంది అమ్మాయిలుండగా రైల్లో లేని ఊర్వశి కోసం వెక్కి వెక్కి ఏడుస్తూ గడిపాడు. వడ్డెర చండీదాస్‌ ప్రయాణికుల్నందర్నీ మొత్తంగా బహిష్కరించి బాత్రూంలో తలుపేసుకుని గడిపాడు. అలాగే మీరు మీ లాప్‌ టాప్‌ మీద మీటింగ్‌కి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ తయారు చేస్తూ గడపొచ్చు. ఇంకొకరు తోటి ప్రయాణికులతో పిచ్చాపాటీ మాట్లాడుతూ గడపొచ్చు. మరొకరు నిద్రపోతూ గడపొచ్చు. మరొకరు పల్లీలు నవుల్తూ గడపొచ్చు. నాకైతే తలుపు దగ్గర నుంచొని ప్రయాణించడం ఇష్టం. ఒకసారి ఢిల్లీ నుండి హైదరాబాద్‌ దాకా పూర్తి ప్రయాణాన్ని రిజర్వేషన్‌ ఉన్నా తలుపు దగ్గరే నుంచుని/కూర్చునే ప్రయాణించాను. నాకు కిటికీ సీటు కూడా సరిపోదు. ఊచలు అడ్డు రావడం ఇష్టం ఉండదు. కిటికీలోంచి ప్రదేశాల్ని చూడటం ఏదో టీవీలోంచి చూసినట్టుంటుంది. అలా కాదు, నాకా ప్రదేశాల్లో భౌతికంగా ఉన్న అనుభూతి కావాలి. తలుపు దగ్గరే అది సాధ్యమౌతుంది. నిజంగా మనం ఎపుడూ చూడని ప్రదేశాల్లోంచి వాటికి మాత్రమే ప్రత్యేకమైన ఫ్లేవర్నేదో మనలోకి తీసుకుంటూ వాటి మధ్య నుంచి వేగంగా దూసుకుపోవడం భలే అనుభూతి. రైల్లోనే అది సాధ్యం. అందుకేనేమో, నాకు రైల్లో ఉన్న ఛార్మ్‌ ఇంకెందులోనూ కనపడదు. మార్సెల్‌ ప్రోస్ట్‌ ఐతే ఇంకా అల్ప సంతోషి (లేదా— అఫ్‌కోర్స్— మనందరికన్నా తీవ్రమైన భావనా శక్తి ఉన్న వ్యక్తి). అందుకే, కేవలం రైల్వే టైంటేబిల్స్‌ చదవడంలోనే ఆ ఆనందం కలుగుతుందంటాడు: "Oh! the sweet caress of all those names of villages and towns in the railway timetables, the charming evocation of lands of lightness and life that I will never visit. . . ."

నాకు రాహుల్‌ సాంకృత్యాయనంత ధైర్యం లేదుగాని ఉంటే నా జీవితాన్ని ఫలవంతం చేసుకోవడానికి నేను వెంటనే చేయాల్సిన పనొకటుంది. ఉద్యోగాన్ని వదిలేసి దేశ దిమ్మరి. . . కాదు కాదు, ప్రపంచ దిమ్మరి కావడం. నా ఉద్దేశ్యం యాత్రికుడిలాగా కాదు; బైనాక్యులరో, కెమెరానో చేతపుచ్చుకుని, హోటళ్ళలో తింటూ, అవుట్‌ సైడర్‌గా కాదు. ఎక్కడి కెళ్తే అక్కడ ఇమిడిపోవాలి. కృష్ణ శాస్త్రి "ఆకులో ఆకునై, పూవులో పూవునై. . .'' అంటాడు చూడండి, అలా కలిసిపోవాలి. At the fatal end, I should feel at home with the world that I had lived in. ప్రపంచాన్ని చూడటం కాదు, తెలుసుకోవాలి. అది నా ఐడియల్‌ జీవితం. నా ఉద్దేశ్యంలో అదే జీవితం పరమార్థం. నాకే కాదు, ఎవరికైనా ప్రపంచాన్ని తెలుసుకోవడమే హైయ్యస్ట్‌ ఐడియల్‌. నబకోవ్‌ తనకో రచయితగా ఓ గొప్ప రచన పూర్తి చేసినప్పటికన్నా, లెపిడోప్టెరిస్టుగా ఓ సీతాకోక చిలుక జాతిని ఖచ్చితంగా నిర్థారించగలిగినప్పుడే ఎక్కువ ఆనందం కలుగుతుందంటాడు. రచయిత కేవలం ప్రపంచానికి అద్దం పడతాడు. శాస్త్రవేత్త మాత్రం ప్రపంచం చూపించే భ్రమా పూరితమైన అద్దాల్ని ఛేదించి లోపలికి దూసుకుపోతాడు. ఎలా చూసినా శాస్త్రవేత్తల తరువాతే కళాకారుల స్థానం. ఈ ప్రపంచంలో పుట్టి ఈ ప్రపంచాన్ని తెలుసుకోకుండానే చచ్చిపోతే ఎలా? అయితే మళ్ళీ ఇందులోనూ తికమక ఉంది. ప్రపంచాన్ని తెలుసుకోవడానికి స్థలం మనకు సహాయపడుతుంది గానీ, కాలం మనకు సహాయపడదు.

స్థల, కాలాలంటూ రెండూ ఏవో చాలా దగ్గరి విషయాలన్నట్టూ చెప్తారు గానీ రెంటికీ చాలా దూరముంది. ఈ భూమ్మీద మనం స్థలాన్నే జయించగలం, కాలాన్ని జయించలేం. ఈ ప్రపంచంల్లో స్థలాన్నే తెలుసుకోగలం, కాలాన్ని తెలుసుకోలేం. ఉదాహరణకి, ఇంట్లో మా అమ్మ చిన్నప్పటి ఫోటో ఒకటి ఉంటుంది. ధవళేశ్వరం బాలికోన్నత పాఠశాలలో పదవతరగతి పూర్తయిన తర్వాత తీయించుకున్న గ్రూప్‌ ఫోటో. టీచర్ల వెనుక వరసగా నిలుచున్న అమ్మాయిల మధ్య, రెండు జళ్ళతో, పరికిణీ-ఓణీ వేసుకుని నుంచునుంటుంది. భలే ముద్దొస్తుంది. వీలైతే ఒక్కసారి వాళ్ళ క్లాసులోకి వెళ్ళి అందరిముందూ పదిహేనేళ్ళ ఆ రెండు జెళ్ళ పిల్లని గట్టిగా "అమ్మా'' అని పిలవాలనుంటుంది; బిత్తరపోయిన ఆ మొహాన్ని ఓసారి చూడాలనుంటుంది. చూడలేను కదా. అలాగే మా మొండిదాన్ని కూడా. ఓ పదిహేనేళ్ళ వెనక్కి పోయి, బహుశా అప్పటికి పదేళ్ళున్న తనని స్కూలు కెళ్తుంటే ఆపి, చాక్లెట్లు ఏవో ఇచ్చి మంచి చేసుకుని "మరో పదిహేనేళ్ళ తర్వాత నేన్నీకు పది పేజీల ప్రేమ లేఖ రాయబోతున్నాను దయచేసి ఒప్పుకోవే'' అని బతిమాలాలని ఉంటుంది. ఇప్పుడు జీవితాన్నే ఇచ్చేస్తానన్నా నా కక్కర్లేదంటుంది, కనీసం చాక్లెట్‌కయినా లొగుతుందేమో చూడాలి. అలాగే సరిగ్గా 1912 ఆగస్టు పదమూడో తారీకున జర్మనీలో ప్రేగ్‌ పట్టణానికి వెళ్ళాలనుంది. యథాతథంగా ఆ రోజు రెండింటికి ఆఫీసు నుండి వస్తున్న కాఫ్కాను అటకాయిస్తాను. "ఈ రాత్రి మీ ఫ్రెండ్‌ మాక్స్‌ ఓ విందు ఇవ్వబోతున్నాడు. అక్కడ మీరు మీ హృదయాన్ని కాస్త జాగ్రత్తగా దాచుకోండి, లేదంటే ఓ అమ్మాయి ఎత్తుకె ళ్ళిపోగలదు'' అని హెచ్చరిస్తాను. మళ్ళీ 2008కి తిరిగి వచ్చేసి, నా దగ్గరున్న కాఫ్కా డైరీలు తిరగేసి, ఆ ఎంట్రీ దగ్గర కాఫ్కా తనకు వీధిలో ఎదురైన ఓ అద్భుతమైన సైకిక్‌ గురించేమన్నా ప్రస్తావించాడేమో చూస్తాను. ఇదీ కాకపోతే తిన్నగా పదమూడో శతాబ్దానికి గోబీ ఎడారి వెళిపోవాలనుంది. వెళ్ళి చంఘీజ్‌ ఖాన్‌ సైన్యంలో రిక్రూట్‌ అయిపోతాను. గుర్రాలు, గుడారాలు, తార్తారు పడుచులు, చీనా చక్రవర్తి మీద యుద్ధాలు- భలే ఉంటుంది కదూ. మేధావుల అజమాయిషీ చూసి చూసి విసుగెత్తింది; ఇప్పుడు భవన నిర్మాణాల్లో కూలీలు, హోటళ్ళలో వెయిటర్లు, ఆటో డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులూ అప్పుడు సైన్యాధ్యక్ష పదవుల్లో ఉంటే ఓ సారి చూడాలనుంది. (బలవంతుడు బలహీనుణ్ణి దోచుకునే అప్పటి సమాజాన్ని బార్బేరియన్‌ సమాజం అన్నారు. కాని ఇప్పుడూ బలవంతుడు బలహీనుణ్ణి దోచుకుంటూనే ఉన్నాడు. కాకపోతే ఇదంతా ఇంటెలెక్చువల్‌ బార్బేరియనిజం.) సరే ఇలా చాలా ఆశలున్నాయి. కానీ ఏం చేస్తాం! ఈ ప్రపంచంలో బతకడానికి ఏ స్థలాన్నైనా ఎంచుకోవచ్చు, కాని కాలాన్ని మాత్రం ఎంచుకోలేం. We are all prisoners of time. ఆగండాగండి! నిజానికి ఇది కూడా సరైన వాదన కాదేమో. కాలమే కాదు, స్థలం కూడా మన చేతుల్లో లేదేమో. ఎందుకంటే, ప్రపంచంలో మనం ఎక్కడైనా బతకగలం, కాని విశ్వంలో మాత్రం భూమిపైనే బతకగలం. I guess then, we are all prisoners of space too. నువ్వు ఫలానా 1980ల్లో పుట్టి 2060 దరిదాపుల వరకూ (Oh! the greedy me!) ఫలానా భూమ్మీద బతుకు అని పడేస్తే చచ్చినట్టు బతకాలన్నమాట. ఎన్నుకునే అవకాశం ఇసుమంత కూడా లేదన్న మాట.

August 10, 2008

How I messed up an essay అను తడబడిన తాత్త్విక మీమాంస

కాఫ్కా కథొకటుంది. పేరు `ద గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనా'. చైనా గోడ నిర్మాణం ఆ కథకు నేపథ్యం. చైనా ఉత్తర భాగం నుంచీ దక్షిణ భాగం వరకూ కొన్ని వేల మైళ్ళు ఈ గోడ కట్టాలి. చైనా చక్రవర్తి ఆజ్ఞతో లక్షలమంది కూలీలు కలిసి ఆ గోడను కడుతూంటారు. కాని దాన్ని ఒక తీరుగా మొదట్లో మొదలుపెట్టి చివరికంటా కట్టుకుపోరు. మధ్యలో అక్కడ కాస్తా ఇక్కడ కాస్తా ముక్కలు ముక్కలుగా కడుతూంటారు. ఎలాగో చెప్తాను: ఒక ఇరవై మంది కూలీల గుంపు కలిసి ఇటు నుండి ఓ ఐదొందల మీటర్ల పొడవు గోడ కడతారు. ఇంతలో అటు నుండి అంతే పొడవు గోడను మరో ఇరవై మంది కూలీల గుంపు కట్టుకుంటూ వస్తారు. తర్వాత ఈ రెండూ అతికి కడతారు. అయితే అతుకులు కలిపిన తరువాత మళ్ళీ గోడను అక్కడ నుంచే కొనసాగించరు. కూలీలను వేరే చోటకు తరలించి అక్కడ వేరే ముక్క ప్రారంభిస్తారు. చక్రవర్తి రాజధాని నుండే ఈ పనంతా పర్యవేక్షిస్తూంటాడు. ఈ అతుకులు ఎక్కడ కలపాలి, గోడ ఎంత ఎత్తు కట్టాలి, ఒక ముక్క కట్టిన తర్వాత కూలీలను మళ్ళీ వేరే ముక్క కట్టడానికి ఎక్కడకు పంపాలి— ఇవన్నీ చక్రవర్తికి మాత్రమే తెలుస్తాయి. చక్రవర్తి నుంచి వచ్చే ఆదేశాల అనుసారంగా కూలీలు కడుతూపోతూంటారు.

వరసగా కాకుండా ఇలా ముక్కలు ముక్కలుగా ఎందుకు కడతారన్న దానికి నేరేటర్‌ ఓ కారణం చెపుతాడు. గోడ ఒకటీ రెండూ కాదు కొన్ని వేల మైళ్ళు కట్టాలి. అన్ని వేల మైళ్ళు అంత పెద్ద గోడను వరసాగ్గా కడుతూ పోతే పూర్తి కావడానికి చాలా కాలం పడుతుంది. అది పూర్తి కాక మునుపే కూలీల జీవితం పూర్తయిపోతుంది. చివరకు వాళ్ళు ఆ పనిని పూర్తి చేయలేకపోయామే అన్న అసంతృప్తితోనే చనిపోతారు. అలా కాకుండా ముక్కలు ముక్కలుగా కట్టారనుకోండి, ఒక ఐదువందల మీటర్ల ముక్కను ఐదు సంవత్సరాల్లో కట్టేస్తారు. ఇలాగైతే వారికి ఏదో పూర్తి చేసామన్న సంతృప్తి మిగులుతుంది. చనిపోయే ముందు తమ జీవితమంతా దేనికి ఖర్చయిందీ అని వెనక్కి తిరిగి చూసుకుంటే సమాధానంగా ఒక కాంక్రీట్‌ ఎవిడెన్స్‌లాగా వారి ముందు పూర్తయిన ఓ గోడ కనిపిస్తుంది.

నేరేటర్‌ ఈ వివరణ ఇచ్చేటపుడు నేను కథలో ఈ భాగాన్ని ప్రపంచానికి అన్వయించుకున్నాను. ఆ కూలీల స్థానంలో మనల్నుంచుకుని మొత్తం సినేరియోని ప్రపంచానికి అన్వయిస్తే, ఈ ప్రపంచమూ చైనా గోడంత భారీ నిర్మాణమే. దీన్ని మొత్తంగా చూడాలనుకుంటే చూడలేం. చూడటం అంటే నా ఉద్దేశ్యం కళ్ళతో చూడటం కాదు; ఈ ప్రపంచంలో ప్రతీ విషయాన్ని జస్టిఫై చేయగల ఒకే ఒక్క అంతస్సూత్రాన్ని (సత్యాన్ని) చూడగలగడం. అల్టిమేట్‌ ట్రూత్‌ అన్నమాట. అదెలా ఉండాలంటే, అది తెలిస్తే ఇక అంతా అర్థమైపోవాలి. ఒక్కసారి ఆ vantage point దగ్గరకెళ్ళి నిలబడ్డాక ఇక అంతా స్పష్టంగా కనపడాలి. కానీ దురదృష్టవశాత్తూ ఈ ప్రపంచానికి అలాంటి పాయింటేమీ లేదు. అక్కడ గోడ కడుతున్న కూలీలకు గోడపై పూర్తి అవగాహన లేకపోయినా, కనీసం అలాంటి అవగాహన ఉన్న వాడి క్రింద పనిచేస్తున్నారు. కనీసం ఆ చైనా గోడను పర్యవేక్షిస్తూ ఓ చక్రవర్తి ఉన్నాడు. కనీసంలో కనీసం అలా ఒకడున్నాడని అక్కడ పనిచేస్తున్న కూలీలకు తెలుసు. కానీ ఈ ప్రపంచాన్ని పర్యవేక్షిస్తూ, ఆదిమధ్యాంతం దీని అనుపానులు తెలిసిన వాడొకడున్నాడన్న పూచీ కూడా మనకి లేదు. గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఇటుకలు పేరుస్తూ పోవడమే. కట్టు! కట్టు! ఎందుక్కడుతున్నావో నీకనవసరం. కట్టడం కోసమే నువ్వు పుట్టావు. కడుతూ కడుతూ చస్తావు. నీ జీవితం ఈ మహాకుడ్యంలో చిన్న భాగం, చిన్న ముక్క. నీకు కేటాయించిన స్థలంలో నీ ముక్క వరకూ నువ్వ కట్టుకో. అది అనుకున్నట్టుగా పూర్తి చేసి సంతృప్తిగా చచ్చిపో. అంతేగాని ఏకమొత్తంగా దీన్ని చూడాలనుకుంటే, అర్థం చేసుకోవాలనుకుంటే, చివరకు అసంతృప్తితోనే చస్తావ్‌!

ఇలాంటి గంభీరమైన సమస్యల్ని నెత్తికెక్కించుకుని అలసిపోవడం నాకో సరదా. నాకేంటంటే, కాస్త కావరం ఎక్కువ. Megalomaniac is the word for me. నా కక్కర్లేనివన్నీ నాకే కావాలనుకుంటాను. అయినా అనుకోకపోతే ఎలా? అరే యార్‌ ఇస్‌ దునియా మే పైదా హువే, ఫిర్‌ ఇసే పూరా జాన్‌కర్‌ హీ మర్‌నా చాహియే; హైకీ నహీ? మళ్ళీ ఇక్కడే పుడతామో, వేరే గెలాక్సీలో వేరే గ్రహం మీదే పుడతామో, అసలు పుట్టనే పుట్టమో ఎవడికి తెలుసు? ఒక్క ఛాన్సు, ఒకే ఒక్క ఛాన్సీ భూమ్మీద. కాబట్టి ఇక్కడ ఏది నిజమో— ఏది ఒకే ఒక్క నిజమో— తెలుసుకోవాలి కదా. అదీ నా మతం. కాని తెలుసుకోగలమా? ఈ ప్రపంచం అలా పూర్తిగా తెలుసుకునేందుకు వీలైన అమరికేనా? ఇంకా సరిగ్గా అడగాలంటే— మన మెదడు ఈ ప్రపంచాన్ని పూర్తిగా తెలుసుకునేందుకు వీలైన అమరికేనా?

నాకిప్పుడోటి గుర్తొస్తోంది. ఒకసారి నేనో పార్కులో పచ్చికలో కూర్చున్నాను. నా కాళ్ళ దగ్గర్నించీ ఒక బుల్లి గొంగళీ పురుగు పాకుతూపోతోంది. పచ్చ గడ్డి ఈనెల మీదగా నానా తంటాలు పడుతూ, చాలా నెమ్మదిగా పాకుతోంది. నిముషానికి చచ్చీ చెడీ ఓ పదంగుళాలు పాకగలుగుతోందేమో. నేను దాన్ని నా కాళ్ళ దగ్గర్నించీ రెండడుగుల దూరం వెళ్ళనిచ్చాను. అప్పుడు చేతికందుబాటులో ఉన్న ఓ ఎండుటాకు తీసుకుని అది వెళ్ళే దారిలో పడుకోబెట్టాను. అది అమాయకంగా దాని మీదకు ఎక్కింది. ఎక్కగానే ఆ ఎండుటాకును ఎత్తి మళ్ళా నా కాళ్ళ దగ్గరకే తెచ్చిపెట్టాను. అంటే అది ప్రయాణం ఎక్కణ్ణించీ ప్రారంభించిందో అక్కడికే తీసుకు వచ్చి పెట్టానన్నమాట. కానీ దానికీ సంగతి తెలీదు. తాను ఏ అంతరాయం లేకుండా నిర్విరామంగా పాకుతూ పోతున్నాననే అనుకుంటోంది. నాకు దాని మీద జాలేసింది. పాపం, ఐదు నిముషాలపాటు తాను పడిన శ్రమంతా వ్యర్థమైపోయిందన్న విషయం కూడా తెలీకుండా, ఎండుటాకు దిగి, మళ్ళీ పాకిన దారినే పాకుతూపోతోంది. అది వచ్చిన దారి గుర్తుపెట్టుకుంటుందా? "అరే! ఇందాక ఈ ఈనె మీంచే నడిచాను కదా, మళ్ళీ ఎదురొచ్చిందేంటిది''- అని అనుకుంటుందా? అనుకోలేదు. ఎందుకంటే దానికి వచ్చిన దారిని గుర్తు పెట్టుకునే మెదడు లేదు; మనలా వర్తమానాన్ని జ్ఞాపకాలుగా మార్చుకుని గతపు సంచీలో పోగేసుకునే మెదడు దానికి లేదు. తన చుట్టూ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి తగిన మెదడు దానికి లేదు.

ఇదే ఉదాహరణని మనిషికీ అన్వయించవచ్చుననుకుంటా. మన మెదడుకి గొంగళీపురుగు లాగే ఈ ప్రపంచాన్ని— లేదా ఇంకా విశాలంగా— విశ్వాన్ని అర్థం చేసుకునే సత్తా లేదు. కాని గొంగళిపురుగుకి రాని ప్రశ్నలు మనిషికే ఎందుకు వస్తాయి. గొంగళి పురుగెపుడూ భూమ్మీద తన ఉనికికి పూర్వాపరాలేమిటీ, మూలాలేమిటీ అని ఆలోచించదు. ఈగలు, దోమలు, ఆవులు, గేదెలు, కాకులు, గ్రద్దలు ఇవేవీ ఆలోచించవు. ఎందుకంటే వాటి మెదడుకి తమ జ్ఞాపకాల్ని విశ్లేషించి కాన్సెప్ట్స్‌గా తయారు చేసుకోగల శక్తి లేదు. వాటిలో వర్తమానం ఉన్నంత బలంగా గతం, భవిష్యత్తు ఉండవు. గొంగళి పురుగు సీతాకోక చిలుకగా తన తన భవిష్యత్తెలా ఉండబోతోందనే దాని గురించి కలలు కనదు. సీతాకోక చిలుక కూడా తన గొంగళిపురుగు గతాన్ని తల్చుకోదు. వాటికి బతకడం ఒక అలవాటంతే. గొంగళీ పురుగుకు పాకడం ఒక అలవాటు. ఆకులు తినడం ఒక అలవాటు. ఆకు కింద కకూన్‌లో పడుకుని సీతాకోక చిలకగా మారడం ఒక అలవాటు. సీతాకోక చిలకగా మారాక పూల మకరందాన్ని సేవించడం ఒక అలవాటు. అలా సేవిస్తూ సేవిస్తూ ఒన్‌ ఫైన్‌ మార్నింగ్‌ చచ్చిపోవడం ఒక అలవాటు. ప్రతీ గొంగళిపురుగు ఇదే చేస్తుంది. మనుషుల్లో కూడా చాలా మంది జీవించడాన్ని ఒక అలవాటుగా చేసేసుకుంటారు. చదువు, ఉద్యోగం, పెళ్ళి, ప్రత్యుత్పత్తి, పిల్లలకు మళ్ళా చదువు, వాళ్ళ ఉద్యోగాలు, ఒన్‌ ఫైన్‌ మార్నింగ్‌ చచ్చిపోవడం— ఇలా అలవాటు ప్రకారం బతికేస్తారు. అలవాటులో సౌకర్యం ఉంటుంది. వెచ్చదనం ఉంటుంది. Habit is heaven. కాని అలవాటు నుండి బయటకొస్తే మాత్రం ఏమంత సౌకర్యంగా ఉండదు——

(ENOUGH!! I don't feel like writing it anymore. ఇప్పుడేం రాయబుద్దేయడం లేదు. అసలు ఇదంతా ఎందుకు రాయబుద్దేసిందంటే, ఇందాకే అంతర్జాలంలో ఒక వ్యాసం చదివాను. చాలా నచ్చింది. మీకందరికీ లింక్‌ ఇద్దామనుకున్నాను. కాని ఉట్టి లింకిస్తే ఏం బావుంటుందని ఈ ఉపోద్ఘాతం మొదలుపెట్టాను. మొదలు పెట్టినపుడు ఏదో అర్థవంతమైందే రాయబోయాను. కానీ ఊహూ! రాను రాను అసలు విషయానికి దూరంగా డైగ్రెస్‌ అవుతూ పోతున్నాను. చివరికి దీన్ని చివరికంటా రాస్తే "ఈ వ్యాసానికీ నువ్విచ్చిన లింకుకీ సంబంధం ఏంటని'' మీరు గదమాయించినా గదమాయిస్తారు. నిజానికి రాసే విషయంపై నేను చాలా క్లియర్‌గా ఉన్నాను. అక్షరాల దాకా వచ్చేసరికే మెదడు మబ్బైపోయింది. ఇవాళ మూడ్‌ లేదు. కాబట్టి చుప్‌ చాప్‌ లింకిచ్చేస్తున్నాను. చదువుకోండి. చదివాకా ఇలాంటి ఆలోచనలేవైనా వస్తే మీ పాట్లు మీరు పడండి.)

August 2, 2008

రోజువారీ కవిత్వం

మా రూమ్‌కి పక్క వీధిలో ఓ కిరాణా షాపుంటుంది. చాలా చిన్నది. నెలవారీ సరుకులన్నీ అక్కడే కొనేద్దామంటే కుదరదు. మగవాళ్ళు బయటకెళ్ళి సంపాదిస్తుంటే వేణ్ణీళ్ళకు చన్నీళ్ళ తోడన్నట్టు ఆడవాళ్ళు ఇంటి ముంగిలినే షాపుగా మార్చి అమ్ముతుంటారు చూడండి, అలాంటిదన్నమాట. ముందు భాగంలో ఛాతీ ఎత్తు టేబిల్‌; దాని మీద ఓ పబ్లిక్‌ ఫోను; ఫోన్‌ పక్కన గాజు సీసాల్లో కొబ్బరుండలూ (యమ్మీ!), పల్లీ ఉండలు, చెగోడీలు, చాక్లెట్లు; టేబిల్‌ వెనకాల ఫైబర్‌ కుర్చీలో షాపు ఓనరు కమ్‌ ఇంటి ఇల్లాలు; ఆమె తలపైన తీగలకి వేలాడదీసి షాంపూ, డిటర్జెంట్‌, బ్రూ కాఫీ, గుట్కా, పెన్నుల పేకెట్లు; ఆమె వెనుక వున్న ఫ్రిజ్‌లో కూల్‌ డ్రింకులు, వాటర్‌ పేకెట్లు, పాల పాకెట్లు.... ENOUGH!! I don't feel like describing this insipid image anyway; let's get down to something more enchanting.

దీన్నైతే ఎంతసేపైనా వర్ణించొచ్చు. ఈ పిల్ల పేరు సాయి. రెండున్నరేళ్ళ వయస్సుంటుంది, రెండడుగుల ఎత్తుంటుంది, మూణ్ణాలుక్కేజీలు బరువుంటుంది. తెల్లగా, బొద్దుగా ఉంటుంది కాబట్టి నేచురల్‌గానే ముద్దుగా ఉంటుంది. ఇంకా పుట్టెంట్రుకలు తీయలేదు. అవి బంగారం రంగులో మెరిసిపోతూ, ముఖ్‌మల్‌ పోగుల్లా మెత్తగా ఉంటాయి (ఒకసారి నేనక్కడ ఫోన్‌ చేసుకుంటున్నపుడు నా కాళ్ళ దగ్గరికి వచ్చి నిల్చుంటే ఊరికే దాని తల తడిమాను; దానికి నచ్చలేదనుకుంటా కళ్ళు చికిలించి, ఏదో చేదు తిన్నట్టు ముఖం పెట్టింది). నేనీ రూమ్‌లో దిగిన కొత్తలో ఈ పిల్ల ఎప్పుడు చూడు, వాళ్ళమ్మ- అంటే ఆ షాపావిడ కూతురు- భుజం మీదే మకాం ఉండేది. ఆవిడ భుజాన్ని జాకెట్టులోంచి చప్పరిస్తూ చొంగతో తడిపేస్తూండేది. ఈ మధ్యే నడక నేర్చి ఆ వీధిని ఎక్స్‌ప్లోర్‌ చేయడం మొదలు పెట్టింది. కాని ఇంకా పూర్తిగా నడకబ్బలేదు. అందుకే ప్రతీ అడుక్కి ఫుల్‌ బాటిల్‌ తాగిందాన్లా ముందుకి వెనక్కీ ఓసారి ఊగుతుంది. ఇక పడుతుందనుకునేలోగా పట్టు దొరకబుచ్చుకుని రెండో అడుగేసేస్తుంది. వాళ్ళ ఇంట్లో దీన్ని పట్టించుకునేంత తీరికెవరికీ లేదనుకుంటా, ఈ మధ్యన ఇదెప్పుడూ రోడ్డు మీదే బలాదూరు తిరుగుతోంది. నేను రోజూ డ్యూటీకి ఆ రోడ్డు మీంచే వెళ్తాను కాబట్టి నాకు చాలాసార్లు ఎదురుపడుతోంది. ఎదురుపడినప్పుడల్లా పలకరిస్తుంటాను. మొదట్లో నేను మామూలుగా పిల్లలకిచ్చే పలకరింపే ఈ పిల్లకీ ఇచ్చేవాణ్ణి. అంటే నాలిక బయట పెట్టి వెక్కిరించడమో; వాళ్ళు వెళ్ళే దారికి కావాలని అడ్డు నిల్చుని, "ఎవరబ్బా'' అని వాళ్ళు తలెత్తి చూస్తే వెకిలి నవ్వు నవ్వడమో... ఇలాంటివన్నమాట. చాలా మంది పిల్లలు వీటికి పడిపోతారు. కానీ అబ్బే, ఈ పిల్ల కిలాంటి పిల్ల చేష్టలు అస్సలు నచ్చవు. నేను వెక్కిరిస్తే అది చూసే చూపు చూడాలి! "గ్రో అప్‌ మాన్‌!'' అన్నట్టు చాలా జాలిగా, condescending గా చూస్తుంది. ఈ చిన్న చూపు భరించలేక కాస్త మర్యాద నేర్చుకున్నాను. "హ ల్లో సాయీ'' ఛీర్‌ఫుల్‌గా అరవడమో, లేపోతే చెయ్యి ఊపడమో చేయడం మొదలుపెట్టాను. ఒక్కోసారి నవ్వుతూ రెస్పాండవుతుంది; ఒక్సోసారి మాత్రం- దాని మూడ్‌ బాగ లేకపోవడమో, ఏదన్నా ముఖ్యమైన పనిలో ఉన్నపుడో- అస్సలు పట్టించుకోదు. ఫరెగ్జాంపుల్‌, మొన్నామధ్య నేనలా వెళ్ళేప్పుడు సాయి వాళ్ళింటి బయటి గచ్చు మీద నుంచుని, ఉచ్చపోసి, ఎడం కాలితో అలుకుతుంది. ఇప్పుడేవైందే నీ పెద్దరికం అని లోపల అనుకుని, దగ్గరకెళ్ళి, "ఏయ్‌ ఏంటే వెధవ పని?'' అని అడిగాను. తలెత్తి "ఓస్‌ నువ్వేనా'' అన్నట్టు చూసి మళ్ళీ తన అలకడంలో పడిపోయింది. ఏం చెప్తాం ఇలాంటి మనుషులకి!

పిల్లల్ని పలకరించేటప్పడు పెద్ద ఇబ్బందేమిటంటే వాళ్ళతో పాటు పక్కనున్న పెద్ద వాళ్ళని కూడా మొహమాటానికి పలకరించాలి. ఉదాహరణకి బస్సులో పక్క సీటులోనో, పార్కులోనో ఎవరన్నా పిల్లలు కనిపించారనుకో, దాన్ని "చిచ్చీ బుచ్చీ'' అంటూనే పక్కనున్న పెద్ద వాళ్ళతో "ఎన్నేళ్ళండీ, అల్లరి బా చేస్తుందండీ'' అని మాట్లాడుతూండాలి. But that kills all the fun. దీని వల్ల ఆ పిల్లలు కూడా మనల్ని పెద్ద వాళ్ళతో జమ కట్టేసి మనతో జట్టు కట్టడానికి సంకోచిస్తారు. మనల్ని వాళ్ళ ప్రపంచం నుంచి వెలివేస్తారు. ఈ సాయితో నా ఫ్రెండ్షిప్‌ పెరగక పోవడానికి కారణం ఇదే. వాళ్ళమ్మతోనూ, షాపులోని వాళ్ళ అమ్మమ్మతోనూ మాట్లాడేందుకు బాచిలర్‌గాణ్ణి నాకేం టాపిక్స్‌ ఉంటాయి. అప్పటికీ షాపు కెళ్ళే అవసరం వచ్చినప్పుడల్లా ఆ షాపుకే వెళ్తూంటాను; పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళ విషయాలేవో మాట్లాడుతూ, కనిపిస్తే సాయిని పలకరిస్తూంటాను. కానీ ఇదేం బావుంటుంది. ఇద్దరిదీ మహా అయితే ముఖ పరిచయంగా మిగిలిపోతుంది. కాని బోడి ముఖ పరిచయం ఎవడిక్కావాలి! ఈ మధ్య వాళ్ళ ఇంటి పక్క ఇల్లు కూలగొట్టి మళ్ళీ కడుతున్నారు. దాని కోసం ఇసక తెచ్చి పోసారు. సాయికిదో పెద్ద ఆట స్థలం అయిపోయింది. ఇరవైనాలుగ్గంటలూ ఆ ఇసకలోనే ఉంటోంది. తవ్వుతుంది, పూడుస్తుంది, కడుతుంది, కూలదోస్తుంది, ఏదేదో చేస్తుంది. దాని బుల్లి ప్రపంచానికి ఇప్పుడా ఇసక గుట్టే పెద్ద హిమాలయాల్లా కనిపిస్తోంది. మూణ్ణాలుగు రోజులుగా నన్నసలు పట్టించుకోవటమే మానేసింది. దాన్ని దాటి వెళ్తూన్నపుడల్లా నా ఆఫీసు బేగ్‌ అవతల పడేసి దాంతో కాసేపు ఆడదామని ఉంటుంది. అంటే పెద్ద వాళ్ళు పిల్లలతో ఆడినట్టు కాదు, పిల్లలు తోటి పిల్లలతో ఆడినట్టు. అంటే, ఇసుక గూడు తవ్వడంలో దాని కష్ట సుఖాల్ని పంచుకుంటూ, గోపురం ఎంత ఎత్తుండాలో గంభీరంగా చర్చించుకుంటూ, సాధ్యాసాధ్యాల్ని ఇద్దరం బేరీజు వేసుకుంటూ, ఒక కొలీగ్‌లా దానితో కలిసి పనిచేయడమన్నమాట. కాని వాళ్ళమ్మా వాళ్ళతో పాటు వీధి జనమంతా నన్ను చిత్రంగా చూస్తారు. ఏం చేయగలం. దాని మానాన అది ఆడుకుంటూంటే నా మానాన నేను చుప్‌ చాప్‌ ఆఫీసుకి పోతుంటాను. Sometimes, it sucks to be a big man. It really does!!