June 29, 2009

For the record: "అనుక్షణికం" ఆపేసాను

పదిహేను అధ్యాయాల దాకా ఓపికను ఈడ్చుకుంటూ రాగలిగాను. ఇక భరించలేకపోయాను. మొట్టమొదటి కారణం: ఇదివరకే చెప్పినట్టు రచయిత ప్రపంచాన్ని చూసే తీరుతో నాక్కలిగిన ఇబ్బంది. ఆ ఇబ్బందేంటో చెప్పటానికి ప్రయత్నిస్తాను.

నాకు అల్బెర్ట్ కామూ రచన "స్ట్రేంజర్"లో ఈ రెండు వాక్యాలు బాగా గుర్తుండిపోయాయి, నోటికొచ్చేసాయి కూడా:

"As if that blind rage had washed me clean, rid me of hope, for the first time, in that night alive with signs and stars, I opened myself to the gentle indifference of the world. Finding it so like myself—so like a brother, really—I felt that I had been happy and was happy again."

ఇవే వాక్యాలు ఈ రచనకు బ్రిటిష్ అనువాదమైన "అవుట్‌‍సైడర్"లో ఇలా నడుస్తాయి:

"As if this great outburst of anger had purged all my ills, killed all my hopes, I looked up at the mass of signs and stars in the night sky and laid myself open for the first time to the benign indifference of the world. And finding it so much like myself, in fact so fraternal, I realized that I had been happy, and that I was still happy."

(ఈ రచన చదవాలనుకునే వాళ్ళను అమెరికన్ అనువాదం "స్ట్రేంజర్"నే చదవమని చెప్తాను.)

నాకు ఈ వాక్యాలు (మొదట ఇచ్చిన అమెరికన్ అనువాదంలోనివి) ఎన్నిసార్లు మననం చేసుకున్నా పాతబడవు. విశ్వతత్త్వాన్ని ఎంత సులభంగా వ్యక్తీకరించగలిగాడో కదా అనిపిస్తుంది. ఇందులో కథానాయకుడు మీర్‌‍సాల్ట్ తను చేసిన నేరానికి కాక, సమాజం ఏది నేరమనుకుంటుందో దానికి శిక్షకు గురవుతాడు. అంటే, చేసిన హత్యకు కాక, తల్లి అంత్యక్రియల్లో ఏడవనందుకు—లేని బాధ నటించనందుకు—ఉరికంబం ఎక్కుతాడు. రేపిక ఉరి తీయబోతున్నారనగా, జైలు అధికారులు ఆనవాయితీగా అతని సెల్‌‍కు ఓ క్రైస్తవ ఫాదర్‌‍ని పంపిస్తారు. అతను మీర్‌‍సాల్ట్‌‍ని పశ్చాత్తాప పడమని, దైవపు శరణు వేడుకొమ్మని అడుగుతాడు. మీర్‌‍సాల్ట్ ఆసక్తి చూపించడు. ఫాదర్ మరీ బలవంతం చేస్తుంటే అతని కాలర్ పట్టుకుని చెడామడా దులిపేస్తాడు. మొండి జైలుగోడల మధ్య ఒంటరితనంలో ప్రపంచం పట్ల ఆనాటి వరకూ కూడగట్టుకుపోయిన ఆక్రోశాన్నంతా వెళ్ళగక్కేస్తాడు. జైలు గార్డులు వచ్చి ఇద్దర్నీ విడదీస్తారు. ఫాదర్ కంటి నిండా నీళ్ళతో వెళిపోతాడు. మీర్‌‍సాల్ట్ మళ్ళీ తన జైలు గది నిశ్శబ్దంలో మిగులుతాడు. అప్పుడు పై వాక్యాలు చెప్తాడు.

తన కోపం అంతా బయటకు కక్కేయడం వల్ల కలిగిన తేటదనంతో, ఇక ఏ ఆశా మిగలి లేదని అర్థమవగా, నిస్సత్తువగా జైలు గదిలో చప్టా మీద కూలబడతాడు. నక్షత్రపు రాశులతో వెలుగుతున్న ఆ రాత్రిలో మొట్టమొదటిసారి ప్రపంచపు దయాపూరితమైన ఉదాసీనతను చూడగలుగుతాడు, దానికి తనను సమర్పించేసుకుంటాడు. తనలోని ఉదాసీనతే ప్రపంచంలోనూ ప్రతిఫలించగా, మొదటిసారి ప్రపంచంలోని స్నేహశీలతను దర్శిస్తాడు. తను ఇప్పుడూ ఎప్పుడూ ఆనందంగానే వున్నానని గ్రహిస్తాడు. (నేనిక్కడ "ప్రపంచం" అనే పదాన్ని మనుష్య సమాజంతో, జంతు జనాభాతో, దేశ రాష్ట్ర నైసర్గిక విభజనల్తో వున్న భూమండలాన్ని ఉద్దేశిస్తూ వాడటం లేదు. మొత్తం సృష్టిని ఉద్దేశించి వాడుతున్నాను.)

పై వాక్యాల్లో మనకిప్పుడు కావాల్సిన పదం: "దయాపూరితమైన ఉదాసీనత" (gentle indifference). నిజంగా సృష్టికి మన పట్ల వుండేది ఉదాసీనతే. కానీ అది ద్వేషపూరితమైన ఉదాసీనత కాదు. దయాపూరితమైన ఉదాసీనత. సృష్టి మనలోని తప్పొప్పుల్ని ఎంచదు, మనల్ని మంచి చెడూగా విడదీయదు, మనలోని తక్కువ ఎక్కువల్ని తూకం వేయదు, మనపై ఏ తీర్పూ యివ్వదు, మనల్ని అంచనాలు కట్టదు. అందుకే, "ప్రపంచాన్ని నేను వెలివేస్సాను", లేదా "ప్రపంచం నన్ను వెలివేస్సింది" అనే వాళ్ళని చూసి నవ్వుకోక తప్పదు. ప్రపంచాన్ని వెలివేయడానికి అసలది నిన్ను పట్టుక్కూచుంటే కదా, నిన్ను పట్టించుకుంటే కదా.

పైన మీర్‌‍సాల్ట్ వాక్యాల్లో ఎవరైనా నిరాశ చూస్తారేమో. నాకైతే అంతులేని ఆశావాదం కనిపిస్తుంది. ఎందుకంటే అంతా కాదు పొమ్మన్నా సృష్టి పొమ్మనదు. అలా అని అక్కునా చేర్చుకోదు. అన్నింటికన్నా ముఖ్యంగా మనల్ని జడ్జ్ చేయదు. మనల్ని మన విచక్షణకే వదిలేస్తుంది. చూసే కళ్ళుంటే మాత్రం చుట్టూ దాని దయాపూరితమైన వాతావరణం ఎప్పుడూ ఓదార్పుగానే వుంటుంది. ఇంతకన్నా ఆశ ఏముంటుంది?

You see, I don't give a damn about Christian "Judgment Day" or Hindu "Karma phalam", or Islamic "Yawm ad-Din". I am not secular either, I am anti-religious. And my God is such a sweet guy to boot :-) He won't judge anybody on anything.

సరే ఇప్పుడు "అనుక్షణికం" గురించి మాట్లాడుతూ ఈ ప్రస్తావన అంతా ఎందుకు? ఎందుకంటే: సృష్టికర్త తన సృష్టి పట్ల చూపించే దయాపూరితమైన ఉదాసీనతే రచయిత కూడా తన పాత్రల పట్ల చూపించాలని నేననుకుంటాను. కనీసం అలా చూపించగలిగిన రచనల్నే నేను ఇష్టపడతాను. ఇక్కడే వడ్డెర చండీదాస్‌‍లోని మిసాంత్రొపిక్ ధోరణి నాకు నచ్చలేదు. అతనిది చాలా కురచ చూపు. "అనుక్షణికం" నవల మొత్తం ఓ మూలకు అణగదొక్కేసిన ఆత్మ వెళ్ళగక్కుతున్న అక్కసులా, ద్వేషంతో కూడిన సణుగుడులా అనిపించింది నాకు. నవలలో మంచి చెడులకు మధ్య మూఢ విభజనలు, తప్పొప్పుల మధ్య మొండి గుడ్డి గీతలూ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. పాత్రల్ని ఏదో ఒక మితిమీరిన ధోరణి వైపుకి నెట్టేయడం కనిపిస్తుంది. ప్రతీ పాత్ర మీద రచయిత బలవంతపు రుద్దుడు కనిపిస్తుంది. ఉదాహరణకి రవి అనే అబ్బాయి తన ప్రేమను నిర్లక్ష్యం చేస్తుండటంపై నళిని అనే అమ్మాయి స్నానం చేస్తూ చెప్పుకునే స్వగతం ఇది:

"— లక్ష్మీపుత్రులెందరో నా చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాంటే తనేమో బోడి టెక్కూ పోజూ - యేం చూసుకుని - ఆవాళ సినిమా హాల్లో చేతి మీద చెయ్యి వేస్తే, వేళ్ళని వేళ్ళలోకి తీసుకోకుండా రాయిలాగా -నాలాంటి అందగత్తె సుకుమారి ఐశ్వర్యవంతురాలు అంత అవకాశం యిస్తే - తనే ప్రవరాఖ్యుణ్ణనుకున్నాడు కాబోలు - పోనీ చెయ్యి తీసేసుకోనూ లేదు - మాదచ్ఛేత్తనం కాదూ - ఆ రోజు కారోజున హిమాయత్ సాగర్ పిక్‌‍నిక్ కెళ్ళినప్పుడు - పెద్ద చదవు వొచ్చనీ అందం వుందనీ టెక్కా, మాట్లాడవేం? అని నా అంతటిది అంటే, మహా యిదిగా పోజుగా నిశ్శబ్దంగా నవ్వి ‘అవి రెండూ నీకు లేవని యెవరన్నారు?’ అని అదోలాగా అంటాడు. నా అందం చూసి చిత్తైపోయి కవిత్వాలు రాసిన వాళ్ళున్నారు. నా దర్శనం కోసం రోజూ పదిసార్లన్నా లేడీస్ వెయిటింగ్‌‍రూమ్ చుట్టూ ప్రదక్షిణాలు చేసే వాళ్ళున్నారు -యెప్పుడన్నా నూటికీ, కోటికీ ‘నళినీ’ అనేవాడు. ఆప్యాయంగా అనేవాడు. కానీ స్త్రీని గౌరవించలేనివాడు -కానీ ఆ ముఖంలో యేదో అయస్కాంతంలాంటి ఆకర్షణ, నెలవంకలాగా - నూటికీ కోటికీ యెప్పుడన్నా నవ్వే ఆ సన్నని నవ్వు..."

కథని థర్డ్‌పెర్సన్ కథనంలోంచి పాత్ర స్వగతంలోకి తీసుకెళ్తున్నామూ అన్న తేడా తెలియనివ్వకుండా స్వగతాల్ని మిగతా వచనంలో మెళకువగా ఇమడ్చాల్సింది పోయి, యిలా "అడ్డగీత (—)తో ప్రారంభవైఁన పేరాలన్నీ పరమానస ప్రవేశం [స్వగతం] తాలూకూ భోగట్టా" గా చదువుకోండీ అనడంలోనే రచయిత చేతకానితనం తేటతెల్లమవుతుంది. ఈ సంగతి పక్కన పెడితే, ఇక్కడ ఈ స్వగతం ఎవరిది? నళినిదా, రచయితదా? దీన్ని రచయితే బలవంతంగా ఆ పాత్ర నోటిలో కూరాడని కొట్టొచ్చినట్టు తెలిసిపోతుంది. రవి "నిశ్శబ్దపు" చిరునవ్వునీ, అతని ముఖంలో "నెలవంక" పోలికనీ అందంగా చూడగలిగిన అమ్మాయి, తానెంత ఇరుకుగా ఆలోచిస్తున్నానో అన్న స్పృహ ఏమాత్రం లేకుండా "నాలాంటి అందగత్తె సుకుమారి ఐశ్వర్యవంతురాలు" అన్నంత గీరగా స్వగతంలోనైనా మాట్లాడుకుంటుందా. దీనికి కారణం ఏమిటంటే "నిశ్శబ్దపు చిరునవ్వు", "నెలవంక" ఇవన్నీ రవి గురించి రచయిత అనుకుంటున్న విషయాలు. అలాగే, "అందగత్తె సుకుమారి ఐశ్వర్యవంతురాలు" కూడా నళిని గురించి రచయిత అనుకుంటున్నవే. రెండూ కలిపి స్వగతం పేరుతో ఆమె నోటిలో కూరేసాడంతే. పోనీ స్వగతాల సంగతి వదిలేద్దాం. పాత్రల కలల్ని కూడా వదల్లేదు రచయిత. ఇక్కడ ఓ మంచి పాత్ర కనే కలకీ, ఓ చెడ్డ పాత్ర కనే కలకీ తేడా చూడండి:

అనంత్ రెడ్డి అనే మంచి పాత్ర (నాకు మాత్రం మడ్డి పాత్రనిపించింది) స్వప్నరాగలీన అనే అమ్మాయి గురించి కనే కల ఇది: "మంచురాతి మీద ఆమె బట్టలేకండా కూచుని వుంటుంది గానీ నగ్నంగా కనబడదు. బట్టల్లేనట్లే అనిపించదు - బట్టలూ కనిపించవు. నగ్నత్వమూ కనిపించదు. యెదురుగా అతను నుంచుని దోసిలితో - తన దోసిటి నిండా పూలు - రంగురంగుల పూలు - తన దోసిట్లోంచి ఆమె మీద రాలుతూ వుంటాయి. రాలినపువ్వు రాలినట్లు ఆమె శరీరంలో కలిసిపోతూ వుంటుంది. యెంత సేపో, యెన్ని పూలో, యెంత కలో - కల చివర్న మెలుకువ రాదు - ఆ కలకి చివర లేదు - కల నిద్రలోనే కలిసిపోతుంది."

రామ్మూర్తి అనే చెడ్డ పాత్ర తార అనే అమ్మాయి గురించి కనే కల ఇది: "యెర్రని ముఖమల్ అమర్చిన కుర్చీలో తెల్లగా తను. తన మీద పై నుంచి రంగు రంగుల పుప్పొడి రాలుతోంది. గాజు డైనింగ్ టేబిల్ మీద నీలం పింగాణీ ప్లేట్లో దోరగా వేసిన స్తనాల జంట. వాటి మీద, పై నుంచి పెప్పరూ సాల్టూ రాలుతోంది. సిల్వర్ నైపూ ఫోర్కూ తీసుకున్నాడు. చేతిలోని నైఫ్‌తో వొక స్తనం కోసినట్లుగా గంటు పెట్టగానే, చివ్వున నెత్తురు కండ నోట్లో పడి, గొంతు సల్ఫ్యూరిక్ యాసిడ్ పడినట్లుగా కాలిపోయింది. గిజగిజా వణికిపోతూ, రెండో చేతిలోని ఫోర్క్ రెండో స్తనంలోకి గుచ్చగానే చివ్వున పాలధారలు కళ్ళలో యెగసి, జిల్లేడు పాలలా కనుచూపు పోయింది. గట్టిగా రెప్పలు మూసుకుని వొణుకుతూ గిలగిలా కొట్టుకుంటున్నట్లుగా అటుయిటూ కదిలిన కాసేపటికి, చూపు కనిపించి, గొంతు మంటపోయి దిగ్గున లేస్తాడు."

ఒహో! అయితే మంచి వాళ్ళ కలలు అంత లాలిత్యంతోనూ, చెడ్డవాళ్ళ కలలు ఇంత బీభత్సంగానూ వుంటాయన్నమాట (అసలు మంచివాళ్ళు చెడ్డవాళ్ళూ అని వేర్వేరుగా వుంటారా అన్న సంగతి పక్కనపెడితే). ఏ ఫ్రాయిడియన్ చెత్త చదివి ఈ సంగతి తెలుసుకున్నాడో మరి రచయిత. నాకైతే కేవలం తన ఊహాశక్తి ఎంత వంకర పోగలదో పరీక్షించుకుంటున్నట్టనిపించింది. మంచీ చెడూ అంటూ ఇంత మూఢ విభజన వున్న పాత్రలు గల నవల ఇక వాస్తవికతను ఏ స్థాయిలోనైనా ఎలా ప్రతిబింబించగలదు.

ఒక రచయిత తన నవలకి ఉద్దేశించిన నిర్మాణం కథాకథనాల కండరపుష్టి వెనుక అస్థిపంజరపు అల్లికలా అంతర్లీనంగా నక్కి వుండాలి. అంతేగానీ నిర్మాణాంశాలన్నీ బయటకే కనపడిపోతుంటే ఆ నవల పూర్తి రూపం చూడటానికి ఎబ్బెట్టుగా వుంటుంది. "అనుక్షణికం" చదువుతున్నంత సేపూ రచయిత వాడుతున్న ప్రతీ నిర్మాణాంశం తేటతెల్లమైపోతూ నన్ను కథలో ఓ పట్టాన లీనం కానీయలేదు. ఓ చిన్న ఉదాహరణ చెప్పుకోవాలంటే పాత్రల మేనరిజాలు:

స్వప్న రాగలీన ఎప్పుడూ "సెలయేటి జాలులో ఇసుకలో గులకరాళ్ళు కొట్టుకున్న మెత్తని సవ్వడి"తో నవ్వుతూంటుంది. ఇలా దాదాపు నాలగైదు సార్లు నవ్వింది ఈ పదిహేను అధ్యాయాల్లోనూ. ఇంకానయం, ఒక చోటైతే "ఫక్కున నీటిబుడగ చిట్లినట్టు" కూడా నవ్వేయగలిగింది. రవి ఎప్పుడూ అర చేత్తో గెడ్డం కొస రుద్దుకుంటుంటాడు. శ్రీపతి ఎప్పుడూ చూపుడు వేలి కణుపు కొసతో పెదవి నొక్కుకుంటుంటాడు. ఇవన్నీ పాఠకుని దృష్టికి రాకుండా పోవలసిన విషయాలు. వచ్చాయంటే లోపం వుందన్నమాటే. అయినా మేనరిజాల వాడకంలో కాస్త జాగ్రత్త, విచక్షణా వుండాలి. ఓ పాత్రకి నత్తి యిస్తే అతను ప్రతీ సన్నివేశంలో నట్టుతున్నట్టు చూపినా పర్లేదు; కానీ ఓ పాత్రకి పెంపుడు కుక్క యిస్తే ఇక ప్రతీ సన్నివేశంలోనూ అతను ఆ పెంపుడుకుక్కతోనే ప్రత్యక్షం కానక్కర్లేదు. అది కృతకంగా వుంటుంది.

అలాగే చదవగా చదవగా ఇందులో శృంగారం అవసరాన్ని మించి వుందనిపించింది. దానికి గజ్జల్లో కదలిక తెప్పించడమే తప్ప మరో ప్రయోజనం వున్నట్టైతే నాకనిపించలేదు.

ఇక నేను ముందు అనుకున్నట్టు ఇందులో తండ్రి పాత్రలు కార్డ్‌‍బోర్డ్ పాత్రలేమీ కాదు. దరిమిలా అన్నీ ఒక్కొక్కటిగా కథలోకి వస్తున్నాయి. అలాగే నవలకు బొత్తిగా ఓ నిర్మాణం లేకుండానూ పోలేదు. కథనం ఓ పాత్ర నుండి మరో పాత్రకు లంకె వేసుకుంటూ నడుస్తుంది. అంటే, మొదట కథనం ఓ పాత్రను అనుసరిస్తుంది; ఈ పాత్ర మరో పాత్రను కలిసినపుడు కథనం మొదటి పాత్రను వదిలేసి ఈ రెండో పాత్రను అనుసరిస్తుంది; ఈ రెండో పాత్ర మరో పాత్రని కలిస్తే అప్పుడు కథనం మళ్ళీ ఈ మూడో పాత్రను తగులుకుంటుంది. ఒక్కోసారి పాత్రకూ పాత్రకూ పరిచయం లేకపోయినా కూడా ఇలా లంకె పడటం జరుగుతుంది. ఉదాహరణకు శ్రీపతి ఓ చోట వేరే పాత్రని ఇంటి దగ్గర కలసి మాట్లాడి బయల్దేరతాడు; బస్టాపులో బస్సెక్కుతాడు:

"చార్మినార్‌‍కా కోఠీకా - అనుకుంటూ పరికించి చూశాడు బోర్డు. వయా కోఠీ అమీర్‌‍పేట. ఖాళీగానే వుంది. కూచున్నాడు. శ్రీపతి కూచున్న సీటుకి వెనక సీట్లో వెంకటావధాని కూచుని వున్నాడు. టిక్కెట్‌తో పాటు చిల్లర తీసుకుంటూవుంటే వో బిళ్ళ కిందపడి ముందుకు దొర్లి శ్రీపతి కాళ్ళ దగ్గర ఆగింది. శ్రీపతి వొంగి, తీసి, వెనక్కి తిరిగి యిచ్చాడు. `థాంక్యూ సార్' అన్నాడు వెంకటావధాని. వొకరి కొకరు తెలియదు. బస్సు యెంత వేగంగా వెడుతున్నా యెంతో నిదానంగా వెడుతూన్నట్లనిపిస్తుంది వెంకటావధానికి."

-- ఇక ఇక్కడి నుంచీ కథనం మళ్ళీ శ్రీపతిని వదిలి వెంకటావధానితో నడుస్తుంది. అయితే మధ్యలో రచయితే చొరబడి "వొకరి కొకరు తెలియదు" అని చెప్పడంలోనే తెలుస్తుంది, ఈ కంగాళీ నిర్మాణం పాఠకుణ్ణి అయోమయ పరుస్తుందన్న అనుమానం బహుశా రచయితకూ ఉందని. ఎందుకంటే పాఠకుడు అక్కడి దాకా కథను సరిగ్గా అనుసరించగలిగితే, వాళ్ళిద్దరికీ పరిచయం లేదన్న సంగతి రచయిత చెప్పకపోయినా తెలుస్తుంది.

మామూలుగా ఏ నవల్లో అయినా ముఖ్య పాత్రల పూర్వాపరాలు మొదట్లోనే చెప్పేస్తారు. ఆ పునాది మీద కథ అల్లుకుంటూ పోతారు. కానీ "అనుక్షణికం"లో ఇలా పాత్ర నుండి పాత్రకు లంకె వేసుకుంటూ పోయే ఈ నిర్మాణం వల్ల, లంకె పడినప్పుడల్లా కొత్త పాత్ర పుట్టుపూర్వోత్తరాలన్నీ ఏకరువు పెట్టాల్సి వచ్చింది. అయితే పాత్రలు లెక్కకు మిక్కిలి వుండటం వల్ల ఈ వివరాలేమీ పాఠకుని మెదళ్ళో ఓ పట్టాన నమోదు కావు. ఫలితంగా ఎవరు ఎవరో ఏం జరుగుతుందో అంతా గందరగోళంగా వుంటుంది. అసలు నాకు ఈ లంకె లేసుకుంటూ పోయే నిర్మాణం పెద్ద గొప్పగా కూడా అనిపించలేదు కూడా. కాలేజీలో కంప్యూటర్ క్లాసులో మాచేత ఫ్లోచార్టులు గీయించేవారు. ఒక పనిని మొదలుపెట్టి పూర్తి చేసేవరకూ గల క్రమాన్ని, దశల్నీ, రక రకాల సంభావనీయతల్నీ ఊహిస్తూ, వాటిని వేర్వేరు ఆకారాలుండే బాక్సుల్తో సూచిస్తూ, ఈ ఫ్లోచార్టుల్ని గీస్తారు. (మా కంప్యూటర్ క్లాసు మొత్తానికి నాకు కాస్త అర్థమైంది [నేను అర్థం చేసుకుంది] ఇది ఒక్కటే.) ఈ నవల నిర్మాణానికి సృజనాత్మకత పెద్దగా ఏమీ అవసరం లేదు; ఇలాంటి ఫ్లోచార్టులు గీయడం వస్తే చాలు.

వడ్డెర చండీదాస్ దరిమిలా ఆంగ్లంలో ఏదో తత్త్వశాస్త్ర గ్రంథం రాశారని, ఆయన అంతకుమునుపు రాసిన కాల్పనిక సాహిత్యమంతా ఈ తాత్త్విక గ్రంథానికి పుట్‌‍నోట్సులాంటిది మాత్రమేననీ ఎక్కడో చదివాను. బహుశా తేడా అక్కడ జరిగుంటుంది. సాహిత్యం దేనికీ పుట్‌నోట్సు కాదు, కాకూడదు. కథ చెప్పడం రచయిత లక్ష్యం అనుకున్నపుడు, దాని వస్తువు తత్త్వశాస్త్ర సంబంధమైనా, మనస్తత్త్వశాస్త్ర సంబంధమైనా అవే ఆ కథకి పుట్‌‍నోట్స్‌‍గా వుండాలి. చాలామంది దగ్గర ఓ తప్పుడు అభిప్రాయం చూస్తాను. రచయితలకు ఫిలాసఫీ, సైకాలజీలు తెలియడం చాలాముఖ్యమని అంటుంటారు; కాన్సెప్టులంటుంటారు, ఐడియాలంటుంటారు. రచయితకు ప్రాథమికంగా కథ చెప్పడం తెలియాలి. మిగతావన్నీ అదనపు హంగులే. శ్రీపాద, మల్లాది కథల్లో తత్త్వశాస్త్ర గాఢత, మనస్తత్త్వ విశ్లేషణా పెద్దగా కనిపించవు. అయినా వాళ్ళ సాహిత్యం ఎందుకు నిలబడింది, ఎందుకు నాలాంటి వాళ్ళను యింకా అలరిస్తుంది. వాళ్ళకు ప్రాథమికంగా కథ చెప్పడం ఎలానో తెలుసు కాబట్టి. వాళ్ళు సాహిత్యాన్ని దేనికో పుట్‌‍నోట్సుగా ఉపయోగించుకోవాలని చూడలేదు కాబట్టి. వడ్డెర చండీదాస్ గొప్ప తాత్త్వికుడో మరోటో కావచ్చు. అది నేను నిర్ణయించలేను. కానీ నా దృష్టిలో అతను గొప్ప కథకుడు మాత్రం కాదు. "అనుక్షణికం" లాంటి భారీ వైఫల్యమే దానికి ఋజువు.

June 18, 2009

:-)

ఈ బ్లాగు మొదలుపెట్టినపుడు నాకు నేనే పకడ్బందీగా కొన్ని నియమాలు విధించుకున్నాను. అవేంటంటే: ఇందులో చస్తే నా గురించి రాయకూడదు. రోజువారీ జ్ఞానోదయాల గురించీ, రొడ్డకొట్టుడు జీవిత సత్యాల గురించీ అస్సలు రాయకూడదు.

మొదటి నియమం చవట నిర్ణయం అని ఈసరికే అర్థమైంది. రాస్తుంది నేను కాబట్టి ఈ రాతల్లో నేను వుండటం అనివార్యం. అసలు నా రాతల్లోనే గాక, వేరే వాళ్ళ రాతల్లోంచి ఎత్తుకొచ్చి ఇక్కడ వుంచిన కొటేషన్లలో కూడా నేను వుంటాను. అది తప్పదు. అయితే ఇదివరకట్లా, నా నిస్సారమైన జీవితాన్ని వైభవోపేతమని నన్ను నేను భ్రమింపజేసుకునేందుకు బ్లాగుని ఓ సాధనంగా వినియోగించదలచుకోలేదు. ఎవర్ని మాయ చేద్దామని ఆ అవస్థంతా! నా జీవితం ఎవరి జీవితంతోనూ పోటీ పడలేదు. నా రోజులో సింహభాగం—కనీసం విలువైనదిగా నేను గుర్తించే భాగం—పుస్తకాల సమక్షంలోనూ, లేదా పుస్తకాల్ని గురించిన ఆలోచనలతోనూ గడుస్తుంది. ఈ రెండూ లేని రోజు, అది మరొకవిధంగా ఎంత రంజుగా గడిచినా, నాకు సంపూర్ణమనిపించదు. మరైతే, జీవితం మరోవిధంగా వున్నప్పుడేమో తిరస్కరిస్తూ, ఇలావుంటే నిస్సారం అని ఆరోపించడం అన్యాయం కాదూ. Well, then, my life is happening too; in its own lonesome way.

రెండో నియమం: రోజువారీ జ్ఞానోదయాల గురించీ, రొడ్డకొట్టుడు జీవిత సత్యాల గురించీ రాయకూడదు. మొదట ఈ జ్ఞానోదయాల గురించి కొంత చెప్తాను. జీవితంలో జ్ఞానోదయాలు (జాయిస్ భాషలో చెప్పాలంటే ఎపిఫనీస్) వుండవు. ఇంకా సరిగా చెప్పాలంటే: వుంటాయి గానీ వాటికి పర్యవసానాలు వుండవు. అంటే సినిమాల్లోనో పుస్తకాల్లోనో చూపించినట్టు ఈ జ్ఞానోదయాలకు జీవిత గమనాన్ని మార్చేసేంతటి శక్తి వుండదు. నా మట్టుకు నాకు ఇలాంటి జ్ఞానోదయాలు ఇబ్బడిముబ్బడిగా కలుగుతూంటాయి. అంటే, హఠాత్తుగా ప్రపంచాన్ని గురించి, లేదా జీవితాన్ని గురించి, లేదా నన్ను గురించిన పరమ సత్యాలు నా ముందు విశ్వరూప సాక్షాత్కారం చేస్తుంటాయి. హఠాత్తుగా ఈ ప్రపంచంతో సామరస్యంగా బతకడమెలాగో తెలిసిపోతుంది; ఏదో ఆకస్మిక క్షణంలో జీవితపు మూల స్వరూపం మొత్తం మనోనేత్రం ముందు రూపుకట్టేస్తుంది; ఉన్నట్టుండి నేనెంత స్వార్థపరుణ్ణో అర్థమైపోతుంది. కానీ ఏం లాభం. ఏవీ నిలబడవు. నిలుపుకోలేను. కొంతకాలానికి మళ్ళీ యథావిధిగా వెనకటి మడ్డి మనిషిగానే మిగుల్తాను. ఇది నాకే కాదు చాలామందికి జరుగుతుంది. ఈ జ్ఞానోదయాలు కలిగించిన అవగాహనని మనం ఎక్కువసేపు నిలుపుకోలేము. ఇలాంటి క్షణికమైన జ్ఞానోదయాల వల్ల కలిగే ఆవేశంతో ఇక్కడ ఏదో రాసి మాత్రం ఏం ప్రయోజనం. (ఇలాంటి తాత్కాలిక జ్ఞానోదయాలతో కొందరు రచయితలు పుస్తకాలే రాసేస్తారు, ఆ పుస్తకాల్లోని సారాంశమంతా ఆ రచయితల్లోనూ వుంటుందని భ్రమపడి పాఠకులు మోసపోతారు కూడా; ఇది వేరే విషయం.)

ఇక జీవిత సత్యాలు ఇక్కడ ప్రవచించకూడదన్న నిశ్చయానికి కారణం: సార్వజనీనమైన జీవిత సత్యాలంటూ ఏవీ లేకపోవడం, ఎవరి జీవిత సత్యాలు వాళ్ళకే వుండడం, ఇవి చర్చలతోనూ వాదనలతోనూ తెగేవి కాకపోవడం. నా విలువలు నాకున్నప్పుడు, అవి నిజమని నమ్మకంగా తెలిసినపుడు, వాటినిక్కడ బ్లాగులో చర్చకి పెట్టడమో, ఇంకెవరికో వాటిని నిరూపించబూనడమో వ్యర్థం కదా. మనం నమ్మేది మనం నమ్ముతాం. మన నమ్మకాలు ప్రపంచాన్ని మార్చేయనక్కర్లేదు కదా. అలా ప్రపంచాన్ని మంచికో చెడుకో మార్చేయాలని చూసే మనుషుల నమ్మకాలు ఎంతటి వినాశ కారకాలో హిట్లర్, స్టాలిన్‌లాంటి వాళ్ళ కారణంగా రక్తసిక్తమైన ప్రపంచ చరిత్రే చెపుతూంది. "ఓ ప్రక్క ’మంచికో చెడుకో’ అంటూ మళ్ళా చెడు ఉదాహరణలే చెప్పి వదిలేస్తావేం; మరి గాంధీ, వివేకానందుల మాటేంటీ" అని ఎవరైనా అడగొచ్చు. గాంధీకి తన నమ్మకం పట్ల ఎంత చిత్తశుద్ధి వుందో హిట్లర్‌కీ తన నమ్మకం పట్ల అంతే చిత్తశుద్ధి వుంది. ఇదంతా విశ్వంలోని సమస్త వ్యవహారాల్లాగే బొమ్మాబొరుసూ వ్యవహారం. అంతా వ్యక్తుల్ని బట్టి మారుతుంది. వ్యక్తిగా నేనేంటో నాకు తెలుసు కాబట్టి నా నమ్మకాలు ప్రపంచాన్నో, లేక ఈ బుల్లి బ్లాగ్ప్రపంచాన్నో, ఏదో మంచి పర్యవసానానికి నడిపించేంత సత్తా వున్నవి కావని మాత్రం చెప్పగలను. ప్రపంచంలో చాలా వైపరీత్యాలకి ఒకరి నమ్మకాలు మరొకరి మీద రుద్దబోవడమే మూలకారణమని చెప్పగలను. నమ్మకాలు రుద్దబోవడం అటుంచి, కనీసం వ్యక్తం చేసుకోవడం కూడా శుద్ధ దండగని చెప్పగలను. నమ్మకాలన్నవి చప్పుడు చేయకుండా ఎవరికి వారే ఆచరించుకోవడానికి మాత్రమే అని చెప్పగలను. ఇందాక చెప్పినట్టే ఈ జ్ఞానోదయాన్ని కూడా నేను మరికాసేపట్లో మరిచిపోబోతానని ఈ కీబోర్డు గుద్ది మరీ చెప్పగలను.

సరిగ్గా ఈ పేరా దగ్గరకొచ్చేసరికి ఇది చదవబోయే వాళ్ళకి వచ్చే అనుమానమే నాకూ వచ్చేసింది. ఇదంతా ఎందుకు రాస్తున్నట్టు? బహుశా ఎందుకంటే: ఈ బ్లాగులో ఎలాంటి చచ్చుపనులైతే నేను చేయబోనని పై పేరాల్లో చెప్పానో అలాంటి చచ్చుపనే ఇక్కడ చేయబోతున్నాను. కాసేపు (నా) జీవితం గురించి నాతో నేను చర్చించుకోబోతున్నాను. నాలో నేను మథనపడబోతున్నాను. ఖర్మకాలి ఈ అంతర్మథనంలోంచి కొన్ని జీవిత సత్యాలు పైకి తేలినా తేలొచ్చు. ఆ పని చేయబోయే ముందు, "నేను మామూలుగా ఎప్పుడూ యిలాంటి ఘోరాలకి ఒడిగట్టనూ, ఈ ఒక్కసారికే ఏదో ఇలా..." అని నా (ఇసకేస్తే రాలనివ్వని) పాఠకజనసందోహానికి విన్నవించుకునేందుకు పై ఉపోద్ఘాతం అన్నమాట.

ఇక్కడ "పాఠకజనసందోహం" అన్న పదబంధాన్ని కాస్త నిర్వచించుకోవాల్సిన అవసరం వుంది. పాఠకులు అనగానే తరచూ నాకో ఊహాచిత్రం స్ఫురిస్తుంటూంది. బహుశా నాకే కాదు; ప్రతీ బ్లాగరుకూ, ఆ మాటకొస్తే ప్రతీ రచయితకూ (అనుషంగికం: నేను రచయితని కాదన్న వాళ్ళని రాయిచ్చుకు కొడతా!) ఇలాంటిదే ఏదో ఒక సొంత ఊహాచిత్రం వుంటుందని నా నమ్మిక. నా ఊహాచిత్రం ఇది: శిథిలావస్థలో వున్న ఓ పేద్ద రోమన్ కొలోసియం సంజె చీకట్లలో మునిగి వుంటుంది. దాని మైదానానికి సరిగ్గా మధ్యలో ఒక మొండెమెత్తు ఉపన్యాసపు బల్ల వుంటుంది. నేను దానిపై కులాసాగా మోచేతులాన్చి మాట్లాడుతుంటాను. నన్ను ఆవరించి వున్న కొలోసియం మెట్లపై నా పాఠకులు సుఖాసీనులై నేను మాట్లాడేది వింటూంటారు. సంజె చీకట్లలో వాళ్ళ మొహాలు నాకు కనపడవు; నా మొహం వాళ్ళకి కనపడదు. వాళ్ళు నాకంటే ఎత్తులో వుంటారు. కానీ వాళ్ళందరికీ నేనే కేంద్రబిందువు. నేను మాట్లాడేది ఏదైనా సరే, వాళ్ళు నిశ్శబ్దంగా సహానుభూతితో వింటుంటారు. నా ప్రతీ వాక్యాన్నీ పదిలంగా స్వీకరిస్తారు. చప్పట్లూ వుండవు. పిల్లికూతలూ వుండవు. కేరింతలూ వుండవు. వెక్కిరింతలూ వుండవు. నిశ్శబ్దం మాత్రమే. చెప్పేది శ్రద్ధగా వినకుండా "హయ్య వీడి గోరోజనమా!", "ఏం చూసుకుని వెధవకి!", "అంతా సొల్లు", "ఎంతసేపూ వీడి సోది వీడిదే గానీ", "ఎ కేస్ ఆఫ్ డెల్యూషన్స్ ఆఫ్ గ్రాండియర్ ఐ గెస్"... ఇలా ఒకరి చెవుల్లో ఒకరు గొణుక్కునేవాళ్ళూ, నా మాటల్ని మనస్ఫూర్తిగా గాక అపనమ్మకంగా వినేవాళ్ళూ వెంటనే ఇక్కడినుంచి బహిష్కరింపబడతారు. బహుశా ఈ వాక్యం చదివీ చదవగానే అర్థమైపోవాలి: ఎవరిక్కడ వుండాలో ఎవరు వెళ్ళిపోవాలో. వెళ్ళిపోవాలని తెలిసీ ఇంకా ఇక్కడ వున్నారంటే వాళ్ళంతా పిలవని పేరంటానికి ఎగేసుకుంటూ వచ్చిన అతిథులన్నమాట. మేమెవ్వరం వాళ్ళని పట్టించుకోనే పట్టించుకోమన్నమాట. సరే ఇంక ఈ ఉప-ఉపోద్ఘాతం వదిలి అసలు విషయానికొచ్చేస్తాను.

[ఏదీ "అసలు విషయం" అంటారా? ఇక్కడ లేదు. ఇంతే సంగతి. నిన్నరాత్రి ఏదో ఉద్వేగంతో, నిజంగానే ఏదో రాయాలని ఇది మొదలు పెట్టాను. అర్థరాత్రిదాకా రాసి ఆవలింతలు కమ్మేస్తుంటే పడుకున్నాను. పొద్దున్న తెలివి తెచ్చుకుని రాసింది చదువుకుంటే, ఏం రాయబోయానో గుర్తుతెచ్చుకుంటే, జడుపొచ్చింది. అది రాయడం నిజంగా ఆత్మహత్యా సదృశం మరి. రాయాల్సిన విషయం కాదు, రాసుకోవాల్సిన విషయం. అందుకే ఇక్కడతో ఆపేస్తున్నాను. మరి ఈ తలాతోకాలేని గోలంతా ఇక్కడెందుకు ప్రచురించడం అంటే: ఇంతరాసాకా డిలీట్ చేయబుద్దేయలేదు. పైగా తలాతోకా లేకపోయినా ఈ ఉపోద్ఘాతం స్వతంత్రంగా నా బ్లాగు గురించేదో చెప్తుందనిపించింది. అందుకే పబ్లిష్ బటన్ నొక్కేయాల్సిందేనని తీర్మానించేశాను.

అసలిది రాయడం మొదలు పెట్టడానికి ఈ బ్లాగులో చదివిన పోస్టు కొంత ప్రేరణ. జపాన్ వాళ్ళు వ్యాసాన్ని Zuihitsu అంటారట. ఇందులో "hitsu" అంటే కుంచె అనీ, "zui" అంటే అనుసరించడం అనీ అర్థం; అంటే జపాన్ వాళ్ళు వ్యాసానికి "కుంచెను అనుసరించడం" అనే అర్థమిచ్చుకున్నారన్నమాట. బహుశా ఒక చిత్రకారుడు ఏ లాఘవంతో, ఎంత అలవోకగా, చిత్తరువు అంతిమరూపం పట్ల నిస్సంకోచమైన ధీమాతో తన కుంచెని కాన్వాసుపై పోనిస్తాడో, అదే తరహాలో ఆలోచనని పోతున్న దారిలో పోనిస్తూ అక్షరాలతో దాన్ని అనుసరించడమే వ్యాస లక్షణమన్నది ఈ పేరు వెనుక అంతరార్థం అయివుంటుంది. కానీ నేను నిజంగా ఈ వ్యాసం పూర్తిచేయడమంటూ జరిగితే, ఇందాక బ్లాగులో రచయిత చెప్పినట్టు ఓ self-indulgent chaos or a sermon బయటపడేదేమో. మిమ్మల్ని మరెప్పుడైనా దానికి బలిచేస్తా.]

June 12, 2009

"Adaptation" సినిమా మళ్ళీ చూడడం గురించి

చార్లీ కఫ్‌మన్ రాసిన సినిమాల్లో నాకు నచ్చేది అతని పద్దతైన ఉన్మత్తత; సొంత హద్దులున్న విశృంఖలత్వమూను. అతని సినిమాలు ఇవ్వగల పూర్తి అనుభూతిని ఒక్కసారి చూడ్డంతోనే సొంతం చేసుకోలేం. ఎందుకంటే వాటి కథలు పొరలు పొరలుగా వుంటాయి. తొలివీక్షణంలో పైపొర మాత్రమే అందుకోగలుగుతాం. మలివీక్షణాల్లో ఒక్కొక్క పొరా విడిపోవడం మొదలౌతుంది. తొలిసారి గమనింపుకు రానివి ఈ సారి స్పష్టంగా చూడగలుగుతాం.

చార్లీ కఫ్‌మన్ అభిప్రాయం ప్రకారం సినిమా ఒక మృత మాధ్యమం. నాటక మాధ్యమంలో ప్రదర్శన ప్రదర్శనకీ నటన మారొచ్చు, నటీనటులు మారొచ్చు, రంగస్థల నేపథ్యం మారొచ్చు; అంటే వీటి మార్పు ద్వారా ప్రతీ ప్రదర్శనకీ ప్రత్యేక గుర్తింపు కలిగేలా చేయొచ్చు. కానీ సినిమా అనేది ఒకేసారి తీస్తారు. ఒకసారి ఫిలింపై నమోదయిన ప్రదర్శనే పదే పదే తెరపై ప్రదర్శితమవుతుంది. కాబట్టి ఇవి దాదాపు తొలివీక్షణంలోనే ఇవ్వాల్సిన పూర్తి అనుభూతిని ఇచ్చేస్తాయి. తదుపరి వీక్షణాల్లో అనుభూతి పలచబడిపోతుంది. దీనికి విరుగుడుగా కఫ్‌మన్ తన సినిమాల్లో పలువీక్షణాలకు సరిపడా విషయ గాఢతను దట్టిస్తాడు. అతని సినిమాలు ప్రారంభం, మొదటి మలుపు, మధ్యమం, రెండవమలుపు, ఫలప్రాప్తి, ముగింపు ఇలా క్రమానుగత ధోరణిలో నడవవు. అవి మొదటిసారి చూసినపుడు చాలా అస్తవ్యస్తంగా కనిపిస్తాయి. అయితే ఈ అస్తవ్యస్తత మనల్ని సినిమాకు విముఖుల్ని చేయదు. మనముందు ఒక సవాలు నిలబెడుతుంది; చేతనైతే చిక్కుముడి విప్పుకొమ్మని కవ్విస్తుంది. ప్రేక్షకులు జడంగా సీట్లకు అతుక్కుపోయి, తెరకు కళ్ళప్పగించేసి, వరుసగా చలిస్తున్న ప్రేముల్ని మెదడులోకి జీర్ణం చేసుకున్నంత మాత్రాన అతని సినిమాలు అర్థమైపోవు; ప్రేక్షకులూ కాస్త మెదడు పెట్టవలసి వస్తుంది. ఫలితంగా సినిమా వీక్షణమన్నది క్రియేటర్‌కీ, ప్రేక్షకులకీ మధ్య ఒక సంభాషణగా మారుతుంది. ఇవి నా మాటలు కావు; అతనివే:కాలం గడిచేకొద్దీ ఏ కళాత్మక ప్రక్రియకైనా చుట్టూ గోడలు ఏర్పడిపోతాయి. ఇది ఇలాగే చేయాలి, ఇది ఇలాగే ఉండాలి అన్న అదృశ్య కట్టడి బిగిసిపోతుంది. ఫలితంగా ఆ ప్రక్రియ ఉక్కిపోయి స్రుక్కిపోయి చివరకు ఊపిరాడక చచ్చిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. అలాంటప్పుడే గోడల్ని కూలదోసే శతఘ్నులు రావాలి. ఆ ప్రక్రియకు తిరిగి ఊపిరులూదగలిగే కొత్తగాలికి మార్గం సుగమం కావాలి. నా అభిప్రాయం ప్రకారం చార్లీ కఫ్‌మన్ అలాంటి ఓ శతఘ్నిటాంకు. అతని సినిమాలు అలాంటి కొత్తగాలులు.

నేను పైన వాడిన "ప్రారంభం, మధ్యమం, ఫలప్రాప్తి, ముగింపు"లాంటి పదాలన్నీ నావికావు. పరుచూరి గోపాలకృష్ణ రాసిన "తెలుగు సినిమా సాహిత్యం: కథ - కథనం - శిల్పం" అన్న పరిశోధనా గ్రంథంలోనివి. ఇవన్నీ మళ్ళీ సిడ్‌ఫీల్డు లాంటి పాశ్చాత్య సినీ ప్రక్రియా విశ్లేషకుల దగ్గర్నించీ ఎత్తుకొచ్చినవని నాకనిపిస్తోంది. ఐదేళ్ళక్రితం నేనో సినిమా స్క్రిప్టు రాయాలని సంకల్పించాను. ఓ వస్తువు కూడా స్ఫురించింది. అప్పుడు అదో అపూర్వమైన వస్తువనిపించింది గానీ, ఇప్పుడు వెనక్కితిరిగి చూసుకుంటే రాబ్‌రీనర్ తరహా డ్రామాలు చూడగా చూడగా పుట్టిన కలగూరగంప అని తోస్తోంది. అందులో హీరో ఓ నడివయస్కుడైన సినీ రచయిత. సినిమా ప్రారంభంలోనే ఇతను ఒక యాక్సిడెంటులో కుడి చెయ్యీ, కాలూ విరగ్గొట్టుకుంటాడు. తర్వాత కాల క్రమేణా శారీరకంగా కోలుకుంటాడు, కానీ మానసికంగా కోలుకోలేకపోతాడు. తనపై తను జాలిపడుతూ, తన చుట్టూ వున్న వాళ్ళూ తనపై జాలిపడుతున్నారేమోనన్న అనుమానంతో వాళ్ళందరినీ దూరం చేసుకుంటాడు. ప్రపంచమంతా తప్పులతడకగానే కనిపిస్తుంది. అతని సెల్ఫ్‌పిటీ భరించలేక భార్య విడాకులిచ్చేస్తుంది. స్నేహితులతో కొట్లాటలు పెట్టుకుంటాడు. చివరకు ఒంటరిగా మిగులుతాడు. తనకెదురైన ఈ అనుభవాల ఆధారంగా ప్రపంచం ఎంత క్రూరమైనదో, స్వార్థపూరితమైనదో నిరూపిస్తూ ఒక సినిమా స్క్రిప్టు రాయాలనుకుంటాడు. అదే తన చివరి మాస్టర్‌పీసనీ, అది రాసాక—సినిమా సక్సెస్ అయినా, ఫెయిలయినా సరే—తాను మాత్రం ఆత్మహత్య చేస్సుకోవాలనీ నిశ్చయానికొచ్చేస్తాడు. కుడిచెయ్యి పనిచెయ్యదు గనుక, చెప్తుంటే టైపు చేయడానికి ఎవరైనా కావాలని పేపరు ప్రకటన ఇస్తాడు. ఒకమ్మాయి వస్తుంది. ఆమె హాస్టల్లో వుండి చదువుకుంటూ పార్ట్‌టైం‍గా ఈ పని ఎన్నుకుంటుంది. ఈ పాటికే అర్థమైపోయి వుండాలి: ఆమే అతన్ని రక్షించబోతుంది అని. (I was a freak for these "saviour" concepts; guess I still am.) స్క్రిప్టురాసే క్రమంలో వాళ్ళిద్దరి మధ్యా కథపై చాలా వాదోపవాదాలు నడుస్తాయి. మొదట్లో అతను ఆమెను తీసిపడేస్తాడు. కానీ ఆమెతో, ప్రపంచాన్ని ఆమె చూసే తీరుతో పరిచయమయ్యే కొద్దీ అతని దృక్పథం మారుతుంది. ఆమె ప్రపంచం పట్ల తనకున్న అమాయకపు కృతజ్ఞతనంతా క్రమేణా అతనిలోనూ నింపేస్తుంది. ఇది అతని స్క్రిప్టు పైనా ప్రభావం చూపిస్తుంది. ఆమె కలవక ముందు అతని చేతిలో దారుణమైన తలరాతలకు బలవ్వాల్సిన ఆ పాత్రలు, హఠాత్తుగా ఆనందపు పర్యవసానాలవైపు దారిమళ్ళుతాయి; విషాదాంతం అవబోయింది కాస్తా, సుఖాంతమవుతుంది; స్క్రిప్టే కాదు, అతని జీవితం కూడా. ప్రపంచంతో రాజీ కొచ్చేస్తాడు; విడిపోయిన కుటుంబంతో మళ్ళీ కలిసిపోతాడు. అదీ కథ! ఇవి ముఖ్యపాత్రలు. ఇవిగాక బోలెడన్ని ఉపపాత్రల్ని, ఉపకథల్ని కూడా ఊహించాను. ఇంత ఊహిస్తున్నప్పుడూ అసలు ఓ వయసు మళ్ళిన కుంటి హీరోతో ఎవడైనా సినిమా చూస్తాడా అన్న అనుమానం అస్సలు రాలేదు. అది సినిమాగా మారుతుందన్న నమ్మకం ఎలాగూ లేదు. కాబట్టి, నాకు తోచిన మనసుకు నచ్చిన ఈ కథకే ఓ రూపమిచ్చేద్దాం అనుకున్నాను. ఒక కథ రాసేటప్పుడు రాయడమే ఎలా దాని అంతిమ పరమార్థం అవుతుందో, అలాగే ఈ స్క్రిప్టును కూడా దానికదే పరమార్థంగా భావించి రాసేద్దామనుకున్నాను. అదే నమ్మకంతో రాసేస్తే బాగుండేదేమో. కానీ ఎంతైనా ముహూర్త సంశయాలు వుంటాయి కదా. స్క్రిప్టు రాయడం అదే మొదటిసారి గనుక కాస్త సన్నాహం వుండాలనుకున్నాను. ఓ సెకండ్‌హాండ్ పుస్తకాల షాపులో సిడ్‌ఫీల్డు రాసిన "ద స్క్రీన్ రైటర్స్ వర్క్‌బుక్" దొరికితే కొనితెచ్చుకుని చదవడం మొదలు పెట్టాను. అందులో పలు హాలీవుడ్ క్లాసిక్స్‌ని ఉదహరణగా చూపిస్తూ, సినిమా విజయవంతమవ్వాలంటే ఏమేం కొలతలుండాలో వివరిస్తాడు సిడ్‌ఫీల్డు : ఏక్ట్ - 1, సెటప్, ప్లాట్ పాయింట్ - 1, ఏక్ట్ - 2, కన్‌ప్రంటేషన్, ప్లాట్ పాయింట్ - 2, ఏక్ట్ - 3, రిజల్యూషన్... ఇవిగాక ఒకటో పించ్ సీను ఎక్కడ రావాలి, రెండో పించ్ సీను ఎక్కడ రావాలి... ఇవన్నీ వివరంగా వున్నాయందులో. ఓ రెండువారాలు దాన్ని చదవటానికి కేటాయించి, అంతా ఆకళింపు చేసుకున్నాక కూర్చుని రాయడానికి ఉపక్రమించాను. నా కథని ఆ పుస్తకంలోని కొలతలకి అనుగుణంగా సర్థడానికి ప్రయత్నించాను. ఒక సినిమాకి కావాల్సిన దాదాపు అరవై సీన్లలో ముప్ఫై సీన్లను ఊహించాను. వాటిలో పన్నెండు సీన్లదాకా రాయగలిగాను. అంతే, ఆ తర్వాత నా రక్తమాంసాలున్న కథని సిడ్‌ఫీల్డు నిర్దేశించిన కృతకమైన అస్థిపంజరానికి అనువుగా సర్దలేక, మధ్యలోనే రాయడం మానేసాను. ఆ తర్వాత ఎప్పుడూ మళ్ళీ సినిమా స్క్రిప్టు జోలికెళ్ళలేదు. విచిత్రమేమిటంటే హాలీవుడ్‌లో విజయవంతమైన చాలా చిత్రాల్లో చూచాయగా సిడ్‌ఫీల్డు నిర్దేశించిన కొలతలు ఇప్పటికీ నాకు కనిపిస్తూంటాయి. అరుదుగా చార్లీ కఫ్‌మన్ లాంటి రచయితల సినిమాల్లోనే నాకు ఏ కొలతలకూ లొంగని మొండితనం కనిపిస్తుంది. నేను కుంటి హీరో వున్న కథ గురించే సంశయించాను. కానీ అతని సినిమాల కథలు క్లుప్తంగా వింటే ఇంకా మతిపోతుంది. "బీయింగ్ జాన్ మాల్కొవిచ్"లో, ఒక పప్పెట్రీ కళాకారుడు జాన్ మాల్కొవిచ్ అనే నటుని తలలోకి ఓ తలుపు ద్వారా ప్రవేశించే మార్గాన్ని కనుగొంటాడు. "అడాప్టేషన్"లో, ఒక స్క్రీన్ రైటర్ ఒక పుస్తకాన్ని సినిమాగా అడాప్ట్ చేయలేక, దాన్ని సినిమాగా అడాప్ట్ చేయలేని తన అశక్తతనే సినిమాగా రాసేస్తాడు. "ఎటర్నల్ సన్‌షైన్ ఆఫ్ ది స్పాట్‌లెస్ మైండ్"లో, ప్రియురాలు తనకు సంబంధించిన జ్ఞాపకాల్ని ఒక సాంకేతిక ప్రక్రియ ద్వారా తుడిచేసుకుందని తెలుసుకున్న ఓ ప్రియుడు, దుగ్ధతో తనూ అదే పనిచేయబోతాడు; కానీ బాధాకరమైన జ్ఞాపకాలతో పాటు ఆనందపు గుర్తులూ తుడిచిపెట్టుకుపోతూంటే భరించలేక, ఆ సాంకేతిక ప్రక్రియకు అందకుండా తన జ్ఞాపకాల్ని కాపాడుకోవడానికి, తన మెదడులో తనే పరిగెడుతూంటాడు. ఇదే నేనన్న ఉన్మత్తత, విశృంఖలత్వమూను. ఇందుకే చార్లీ కఫ్‌మన్ సినిమాలు నాకు ఇష్టం.

"అడాప్టేషన్" సినిమాని నేను మూడేళ్ళ క్రితం మొదటిసారి హెచ్.బి.వోలో అనుకుంటా చూసాను. సినిమా పూర్తిగా అర్థం కాక పోయినా నచ్చింది; పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన సినిమా అన్న నమ్మకాన్ని కలిగించింది. సినిమా ముగింపు మాత్రం నచ్చలేదు. అప్పటి వరకూ ఒక ధోరణిలో సాగిన సినిమా, ముగింపుకొచ్చేసరికి పూర్తిగా మరోలా మారిపోతుంది. అంతవరకూ ఒక సినీ రచయిత ఒక పుస్తకాన్ని సినిమాగా అనువదించడానికి పడుతున్న కష్టం గురించీ, జీవితంలో దేని పట్లయినా గాఢమయిన అనురక్తి కలిగివుండడం గురించీ, పువ్వుల గురించీ పరిణతిగల కథనంతో సాగిన సినిమాలోకి, హఠాత్తుగా డ్రగ్స్, సెక్స్, కార్ ఛేజ్‌లూ ప్రవేశించడం విస్మయంతోపాటూ అసంతృప్తీ కలిగించింది. కానీ మొన్నీమధ్య ఈ సినిమా మరోసారి చూడడం తటస్థించింది. ఇలా అసంతృప్తి కలిగించే ముగింపు ఉద్దేశ్యపూర్వకంగా కల్పించినదని అప్పుడర్థమైంది. ఈ సినిమా వాస్తవానికీ కల్పనకీ మధ్య వేసిన నిచ్చెనలాంటిదనీ, ఎన్ని మలుపులు తిరిగినా ముగింపుకు చేర్చని లాబరింత్‌ లాంటిదనీ అవగతమైంది. ఇంత అద్భుతమైన చిత్ర రచన ఇంతకుముందు చూడలేదు; ఇకముందు చూడబోను అన్నంత అబ్బురపాటు కలిగించింది.

చార్లీ కఫ్‌మన్ సినిమాల్లో కథలు సమయానుక్రమంగా సాగవు. కథనం కాలగతిలో ముందు వెనుకలకు దూకుతూ నడుస్తుంది. అందుకే ఈ సినిమా కథల్ని పరిచయం చేయడం కష్టం. అయినా ప్రయత్నిస్తాను. సినిమా కథ క్లుప్తంగా చెప్పాలంటే: చార్లీ కఫ్‌మన్‌కి ఓ పుస్తకం ఇచ్చి దాన్ని సినిమాగా అడాప్ట్ చేయమన్నారు. చాలా ప్రయత్నించి, దాన్ని సినిమాగా మార్చలేక, అలా మార్చలేని తన వైఫల్యాన్నే సినిమాగా మలిచాడు చార్లీ కఫ్‌మన్. అంటే ఇందులో ముఖ్యపాత్ర అతనిదే (తెరపై ఈ పాత్ర పోషించింది నికొలస్ కేజ్.) కథలో కొంత భాగం నిజంగా జరిగిందే. ఆ వాస్తవ నేపథ్యాన్ని ముందు ఇక్కడ ఇస్తున్నాను:

డిసెంబర్ 21, 1993 లో ఫ్లోరిడా పోలీసులు జాన్‌లరోష్ అనే పూల సేకర్తను, అతనితోపాటూ ముగ్గురు నేటివ్ అమెరికన్లను అరెస్టు చేసారు. ఈ నలుగురూ కలిసి ప్రభుత్వ రక్షితప్రాంతమైన "ఫకాహచీ పార్క్‌" అనే బురదగుంటలతో కూడిన అటవీప్రాంతంలో అరుదైన ఆర్కిడ్ పూలను దొంగిలింబోతూ యిలా పట్టుబడిపోయారు. "ఘోస్ట్ ఆర్కిడ్"గా పిలిచే అంతరించిపోతున్న ఆర్కిడ్ జాతి పువ్వు కూడా వీళ్ళు దొంగిలించిన పూల జాబితాలో వుంది. నేటివ్ అమెరికన్లను ఇలాంటి నేరంపై అరెస్టు చేసే చట్టాలు ఫ్లొరిడాలో లేకపోవడంతో, వాళ్ళను వదిలేసి జాన్‌లరోష్‌ను అరెస్టు చేసారు పోలీసులు. సుశాన్ ఓర్లీన్ అనే "న్యూయార్కర్" పత్రికా విలేకరి ఈ ఆర్కిడ్ పూల దొంగతనం గురించి పేపర్లో చదివి, ఆసక్తి కలిగి, జాన్‌లరోష్‌పై జరుగుతున్న కోర్టు విచారణకు హాజరయింది. ఇక్కడ వాళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడింది. జాన్‌లరోష్‌కు ఆర్కిడ్ పూల పట్ల వున్న అనురక్తి ఆమెను ఆశ్చర్యపరచింది. జీవితంలో తనకు దేనిపట్లా లేనంత గాఢానురక్తి అతనికి ఆర్కిడ్ పూల పట్ల వుండడం గమనించిందామె. సినిమాలో దీన్ని ప్రతిబింబించే కల్పిత సన్నివేశం ఇదిగో:

(John Laroche: What’s so wonderful is that every one of these flowers has a specific relationship with the insect that pollinates it. There’s a certain orchid looks exactly like a certain insect. So the insect is drawn to this flower: its double, its soul-mate; and wants nothing more than to make love to it. After the insect flies off, it spots another soul-mate flower and makes love to it, thus pollinating it. And neither the flower nor the insect will ever understand the significance of their love making. I mean, how could they know that because of their little dance, the world lives? But it does. By simply doing what they’re designed to do, something large and magnificent happens. In this sense, they show us how to live. How the only barometer you have is your heart. How when you spot your flower, you can’t let anything get in your way.)

సుశాన్‌ను జాన్‌లరోష్ బాగా ఆకట్టుకున్నాడు. అతని జీవితం గురించీ, అతని వ్యక్తిత్వం గురించీ, ఆర్కిడ్ పూల సేకరణ గురించీ, అందులో కష్టనష్టాల గురించీ, అరుదైన ఘోస్ట్ ఆర్కిడ్ గురించీ ఆమె ఒక పత్రికావ్యాసం రాసింది. ఇది జనవరి 23, 1995 లో ప్రచురితమైంది. తర్వాత్తర్వాత ఆమె ఈ వ్యాసాన్ని "ద ఆర్కిడ్ థీఫ్" అనే పుస్తకంగా కూడా విస్తరించింది. ఇది బెస్ట్‌సెల్లర్‌గా అమ్ముడుపోయింది. కొలంబియా పిక్చర్స్‌ అనే చిత్ర నిర్మాణ సంస్థ దీన్ని సినిమాగా నిర్మించాలనుకుంది. ఈ పుస్తకాన్ని సినిమాగా అనువదించే బాధ్యతను చార్లీ కఫ్‌మన్‌కు అప్పగించింది. ఇదీ ఈ చిత్రానికి సంబంధించిన వాస్తవ నేపథ్యం.

దీంతో సినిమా మొదలవుతుంది. ఇందాక చెప్పిన జాన్‌లరోష్, సుశాన్ ఓర్లీన్‌ల కథ—అంటే ఏ పుస్తకాన్నైతే సినిమాగా అనువదించమని చార్లీ కఫ్‌మన్‌కు అప్పగించారో ఆ పుస్తకం "ద ఆర్కిడ్ థీఫ్" కథ—ఇప్పుడు మొదలయ్యే చార్లీ కఫ్‌మన్ కథకు మధ్య మధ్యలో వస్తూంటుంది. చార్లీ కఫ్‌మన్ మొదట ఈ సినిమాపై చాలా ఆసక్తి వ్యక్తం చేస్తాడు. ఒక స్టుడియో ఎగ్జిక్యుటివ్ ఈ కథని (పుస్తకంలో లేని విధంగా) జాన్‌లరోష్, సుశాన్‌ల మధ్య ప్రేమ కథగా మార్చవచ్చేమో అని సూచిస్తే, అతనిలా ప్రతిస్పందిస్తాడు: "నేను దీన్ని హాలివుడ్ రకం సినిమాగా మార్చి పాడు చేయాలనుకోవడం లేదు. దీన్ని ఆర్కిడ్ల దోపిడీకి సంబంధించిన సినిమాగానో, లేదంటే ఆర్కిడ్లను పాపీ పువ్వులుగా మార్చి దీన్ని డ్రగ్స్ సినిమాగానో తయారుచేయాలనుకోవడం లేదు. ఒక సినిమా పూర్తిగా పూలగురించే ఎందుకుండకూడదు? ఈ సినిమాలో సెక్సూ, క్రైమూ చొప్పించాలనుకోవడం లేదు. తుపాకులూ, కార్ చేజులూ ఇరికించడమో, పాత్రలు గొప్ప గొప్ప జీవిత సత్యాలు తెలుసుకోవడమో, పరిణితి చెంది ఒకరిపై ఒకరు ఇష్టం పెంచుకోవడమో, ఆటంకాలు అధిగమించి చివర్లో విజయం సాధించడమో... ఇలా నాకిష్టం లేదు. ఎందుకంటే, ఈ పుస్తకం అలా లేదు. జీవితం కూడా అలా వుండదు..." అంటాడు.

ఇలాంటి ఆలోచనలతో అతను సినిమా రచన ప్రారంభిస్తాడు. ఇక్కడ అసలు చార్లీ కఫ్‌మన్‌కీ తెర మీద కఫ్‌మన్‌కీ ఉన్నతేడా ఏమిటంటే, ఈ తెరమీద కఫ్‌మన్‌కి ఒక కవల సోదరుడు కూడా ఉంటాడు. అతని పేరు డొనాల్డ్ కఫ్‌‍మన్. డొనాల్డ్ సినిమా ప్రారంభంలోనే కొన్నాళ్ళు చార్లీతో కలిసి వుండటానికి అతని అపార్ట్‌మెంట్‌‌లో మకాం పెడతాడు. ఉన్నపళాన తనకు కూడా అన్నయ్యలాగే స్క్రీన్‌ప్లే రచయిత కావాలనుందని ప్రకటిస్తాడు. అతనిలో రచనా ప్రతిభ ఏమీ వుండదు; కానీ అమాయకుడు, భోళామనిషి, మంచి దద్దమ్మ. అన్నయ్య తనను ఎంత చీదరగా చూసినా దులిపేసుకుంటాడు. అనుకున్నదే తడవు స్క్రీన్‌ప్లే రచనల్లో మెళకువలు తెలుసుకోవడం కోసం ఒక స్టోరీ సెమినార్‌కి వెళ్ళడమూ మొదలు పెడతాడు. చార్లీ కఫ్‌మన్‌కి మాత్రం సినిమాల పట్ల ఇలాంటి దృక్పథం నచ్చదు. ఇలాంటి సెమినార్ల వల్ల ప్రయోజనమేమీ వుండదనీ, సినిమాలు ఎలా రాయాలన్నదానిపై నియమాలు ఏవీ లేవనీ, రచన అంటే తెలియని దారుల్లోకి ప్రయాణం లాంటిదనీ తమ్ముణ్ణి మందలిస్తాడు ("writing is a journey into the unknown"). డొనాల్డ్ మాత్రం యధావిధిగా రాబర్ట్‌మెకీ అనే అతను నిర్వహించే స్టోరీ సెమినార్లకు హాజరవడమే కాక, సీరియల్ కిల్లింగ్‌ కాన్సెప్ట్‌నీ మల్టిపుల్ పెర్సనాలిటీ డిజార్డర్‌ కాన్సెప్ట్‌నీ కలిపి "త్రీ" అనే పేరుతో ఓ థ్రిల్లర్ స్క్రిప్టు రాయడం మొదలు పెడతాడు. ఈ కవల సోదరుల మధ్య సన్నివేశాలు సరదాగా వుంటాయి. ఉదాహరణకి:

Donald: Anyway, listen, I meant to ask you, I need a cool way to kill people.

Charlie: [looks at him wearily]

Donald: Don't worry, for my script.

Charlie: I don't write that kind of stuff.

Donald: Oh, come on man, please? You're the genius.

Charlie: Okay! Here you go: The killer's a literature professor. He cuts off little chunks from his victims' bodies until they die. He calls himself "the deconstructionist".

[Ofcourse, victims are books; and he is joking. But Donald doesn't get it.]

Donald: That's kinda good. I like that.

Charlie: See, I was kidding, Donald.

Donald: Oh! Okay, Sorry. [smiles] You got me! [silent for a second, and then] Do you mind if I use it though.

చార్లీ వ్యక్తిగత జీవితంలో చాలా అభద్రతాభావనలతో బాధపడుతుంటాడు. "Fat, old, bald, ugly, repulsive" అన్నవి అతను తన ముందు తరచూ చేర్చుకునే విశేషణాలు. ఈ ఇన్‌సెక్యూరిటీల కారణంగానే గర్ల్‌ఫ్రెండ్‌ అమీలియాతో అతని ఎనిమిది నెలల అనుబంధం క్రమేణా పలచబడిపోతూంటుంది. నిశ్శబ్దంగా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూన్నప్పుడు, ఇక ముద్దే తరువాయి అన్న ఆశింపు ఆమె కళ్ళల్లో కనపడుతున్నా (ప్రేక్షకులూ ఊహిస్తున్నా), ముద్దు పెట్టుకోవడానిక్కూడా సంశయిస్తాడు. కొత్త వ్యక్తులతో అయితే సరిగా మాట్లాడను కూడా మాట్లాడలేడు. కానీ వాళ్ళని ఊహించుకుని మంచంపై వెల్లకిలా పడుకుని మాస్టర్‌బేషన్ మాత్రం చేసుకుంటూంటాడు. వీటన్నింటికీ తోడు స్క్రిప్టు బాధ ఒకటి! ఎంతో నమ్మకంతో మొదలుపెట్టినా, అతనికి దాన్ని ఎలా రాయాలో అర్థం కాదు. దీనికి కారణం: పుస్తకంలో నాటకీయమైన కథంటూ ఏదీ వుండదు. అందులో సింహభాగం సుశాన్ ఓర్లీన్ తన జీవితంపై తాను చేసుకున్న విషాదపు పరిశీలనలతోనూ, ఆర్కిడ్ పూల వర్ణనలతోనూ, ఇంకా బోల్డెన్ని శాఖాచంక్రమణాలతోనూ నిండి వుంటుంది. అంతా నేరేషనే తప్ప సన్నివేశాలంటూ పెద్దగా వుండవు. దీన్ని సినిమాగా ఎలా మలచాలన్నది చార్లీకి అర్థం కాదు. మరోపక్క అతని తమ్ముడు డొనాల్డ్ మాత్రం స్టోరీ సెమినార్లో రాబర్ట్ మెకీ ఇచ్చే సలహాల సాయంతో తన థ్రిల్లర్ స్క్రిప్టును శరవేగంతో రాసేస్తుంటాడు. ఈ నూన్యత చార్లీని బాధిస్తుంది. ఇంకోపక్క అతని ఏజెంటు తొందరగా స్క్రిప్టు పూర్తి చేయమని పీకలమీదకెక్కి కూర్చుంటాడు; పుస్తకంలో రాయడానికి కథేమీ కనిపించకపోతే అతన్నే ఒకటి పుట్టించమంటాడు. ఈ పరిస్థితుల్లో, ఓ సారి సుశాన్‌ని నిజంగా కలుసుకునే అవకాశం వచ్చినా, రచయితలు తాము రాస్తున్న పాత్రల్ని కలుసుకోవడం మంచిది కాదని చెప్పి తప్పించుకుంటాడు. తర్వాత తన పిరికితనాన్ని తనే తిట్టుకుంటాడు. తన గురించి తప్ప మరెవ్వరి గురించీ రాయలేని తన అశక్తతను నిందించుకుంటాడు. అప్పుడే అతనికి ఉపాయం తడుతుంది. పుస్తకాన్ని అడాప్ట్ చేయడం మానేసి, పుస్తకాన్ని అడాప్ట్ చేయడంలో తను పడుతున్న ప్రయాస, వేదనల్నే సినిమా కథగా రాసేస్తే!

ఈ ఉపాయంతోనే తనను తాను స్క్రిప్టులో రాసేసుకుంటాడు. ఇంతలో తమ్ముడు డొనాల్డ్ తన స్క్రిప్టు పూర్తయిందని చెప్పి తీసుకువస్తాడు. అందులో అతను నిజంగానే, ఇంతకుముందు చార్లీ చెప్పినట్టు, హంతకునికి శరీరాల్ని ముక్కలు ముక్కలుగా కోసే మేనరిజాన్ని ఇస్తాడు. ఆ సలహా ఇచ్చినందుకు చార్లీకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇలా అంటాడు:

Donald: I also want to thank you for your idea. It was very helpful. I changed it a little. Now the killer cuts off body pieces and makes his victims to eat them. It is kinda like... Caroline [his girl friend] has this great tattoo of a snake swallowing it's own tail, and —

Charlie: — Ouroboros!

Donald: I don't know what that means.

Charlie: The sanke, it's called Ouroboros.

[it dawns upon him suddenly how stupid is the thing he has done]

Charlie: I am insane! I am Ouroburos. I have written myself into my screenplay.

Donald: That's kinda weird, huh?

Charlie: It's self-indulgent. It's narcissistic. It's solipsistic. It's pathetic. I am pathetic. I am fat, and pathetic.

Donald: [comforting him] I am sure you had good reasons, Charles. You are an artist.

Charlie: The reason is because I am too timid to speak to the woman who wrote the book. Because I am pathetic. Because I have no idea how to write. Because I can't make flowers fascinating. Because I suck.

ఈ జ్ఞానోదయం కలగగానే అతను వెంటనే వెళ్ళి పుస్తక రచయిత సుశాన్ ఓర్లీన్‌ని కలవాలనుకుంటాడు. ఆమె ఆఫీసుకి వెళతాడు. కానీ ఆమె ఎదురుపడినా మాట్లాడలేకపోతాడు. నిరాశగా తిరిగి వచ్చేస్తాడు. ఇంతలో అతని ఏజెంటు ఫోన్‌చేసి డొనాల్డ్ రాసిన థ్రిల్లర్ స్క్రిప్ట్‌ను తాను అందుకున్నాననీ, అది అద్భుతంగా ఉందనీ, వీలయితే చార్లీ కూడా స్క్రిప్ట్ విషయంలో డొనాల్డ్ సహాయం తీసుకుంటే మంచిదనీ సలహా ఇస్తాడు. దీంతో చార్లీ ఆత్మవిశ్వాసం పూర్తిగా అడుగంటిపోతుంది. చివరి ప్రయత్నంగా తమ్ముడు డొనాల్డ్ వెళ్ళిన స్టోరీ సెమినార్‌కు తనూ వెళతాడు. అక్కడ రాబర్ట్ మెకీ సినిమాలు ఎలా వుండాలన్న దానిపై చాలా చెప్తాడు: ఒక పాత్ర ఆలోచనలు చెప్పడానికి వాయిస్‌వోవర్లు ఏ చవటైనా రాసేయగలడనీ (దాదాపు ఈ సినిమా అంతా వాయిస్‌వోవర్లతోనే నడుస్తుంది; నిజానికి రాబర్ట్‌మెకీ ఇలా చెప్పేముందే ఓ వాయిస్‌వోవర్ వుంటుంది), సినిమా అంటే ఖచ్చితంగా ఓ సంఘర్షణ ఉండాలనీ, ముఖ్యపాత్రకి ఓ లక్ష్యం ఉండితీరాలనీ... ఇలా చాలా చెప్తాడు. ఉండబట్టలేక చార్లీ లేచి ఓ ప్రశ్న అడుగుతాడు. ఒకవేళ రచయిత పెద్దగా ఏ సంఘటనలూ జరగని కథ చెప్పాలనుకుంటే, పాత్రలు మొదటి నుండి చివరిదాకా మారక, వాటికి ఏ జ్ఞానోదయాలూ కలుగక అవి సినిమా పర్యంతం ఫలితంలేని సంఘర్షణతో అసంతృప్తితో కొనసాగే కథ చెప్పాలనుకుంటే, పెద్దగా ఏమీ సంభవించని వాస్తవ ప్రపంచాన్ని ప్రతిబింబించేలా కథ చెప్పాలనుకుంటే, అప్పుడెలా అని ప్రశ్నిస్తాడు. వాస్తవ ప్రపంచంలో పెద్దగా ఏమీ సంభవించదన్న దానికి సమాధానంగా మెకీ: ప్రతీరోజూ జనం చస్తూంటారనీ, ఊచకోతలూ, యుద్ధాలు, అవినీతీ ప్రతీ రోజూ సంభవిస్తుంటాయనీ, ప్రతీ రోజూ ఎక్కడో అక్కడ విధ్వంసానికి నిర్ణయాలు జరుగుతుంటాయనీ, పరులకోసం త్యాగాలు జరుతుంటాయనీ, జనం ప్రేమని కనుగొంటారనీ, ప్రేమని పోగొట్టుకుంటారనీ, ఎవరో ఒకరు ఆకలితో చస్తుంటారనీ... రోజువారీ జీవితంలో ఇవన్నీ చూడలేకపోతే, నీకు జీవితమంటేనే ఏమిటో తెలియదనీ... విరుచుకుపడతాడు.

ఇది విన్న చార్లీ బెంబేలెత్తిపోతాడు. సెమినార్ ముగిసిన తర్వాత మెకీని కలిసి తన స్క్రిప్టు గురించి చెప్తాడు. తాను స్క్రిప్టుగా అడాప్ట్ చేయడానికి తంటాలు పడుతున్న "ద ఆర్కిడ్ థీఫ్" పుస్తకాన్ని చదివి వినిపిస్తాడు. సుశాన్ ఓర్లీన్ తను చూడాలనుకున్న ఘోస్ట్ ఆర్కిడ్‌ని చూడలేకపోవడంతో ఆ పుస్తకం ముగుస్తుంది. ఈ కథ నిరాశ గురించని చెప్తాడు చార్లీ. మెకీ ఇది పనిజేయదంటాడు; పుస్తకంలో లేని డ్రామా సినిమాలో జత చేయాలంటాడు. కానీ ఇప్పటికే సమయం మించిపోయిందటాడు చార్లీ. ఏ సినిమాకైనా చివరి అంకం ముఖ్యమనీ, చివరి అంకంలో ప్రేక్షకులని అబ్బురపరచగలిగితే విజయం సాధించినట్టేననీ చెప్తాడు మెకీ; అలాగే పాత్రలు మారాలనీ, ఆ మార్పు కూడా వాటిలోంచే రావాలనీ ఉపదేశిస్తాడు:

Charlie: [reads from the book] "—but a little fantastic and fleeting and out of reach."

McKee: Then what happens?

Charlie: Well, that's the end of the book. I wanted to present it simply, without big character arcs or sensationalizing the story. I wanted to show flowers as God's miracles. I wanted to show that Orlean never saw the blooming Ghost orchid. It was about disappointment.

McKee: I see.... That's not a movie. You gotta go back, put in the drama.

Charlie: I can't go back. I've got pages of false starts and wrong approaches. And I am way past my dead line.

McKee: Tell you a secret. A last act makes a film. Wow them in the end, and you got a hit. You can have flaws, problems, but wow them in the end, and you've got a hit. Find an ending. But don't cheat. And don't you dare bring in a deus ex machina. Your characters must change. And the change must come from them.

ఇది విన్న తర్వాత చార్లీకి ధైర్యం వస్తుంది. తన తమ్ముడు డొనాల్డ్‌ చేత కూడా అప్పటి వరకూ రాసింది చదివించి, సలహా చెప్పమంటాడు. ముందు సుశాన్‌ని కలిసి ఆమె ఎలాంటిదో తెలుసుకోవాలంటాడు డొనాల్డ్. ఆమెను కలవడం తనవల్ల కాదంటాడు చార్లీ. ఇద్దరూ కవలలే కాబట్టి చార్లీ పేరుతో తనే వెళ్ళి కలుస్తానంటాడు డొనాల్డ్. అన్నట్టే సుశాన్‌ను కలిసి ఆమెను కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. సుశాన్ పుస్తకం చదివితే జాన్ లరోష్‌ పట్ల ఆమెకు ఆకర్షణ వున్నట్లు తనకనిపించిందనీ, ఇది నిజమేనా అనీ అడుగుతాడు. ఆమె అలాంటిదేమీ లేదంటుంది. ఈ ఇంటర్వూ ముగిసిన తర్వాత డొనాల్డ్ చార్లీ దగ్గరికి వచ్చి ఆమె అబద్దం చెపుతుందంటాడు. నిజమేంటన్నది మనమే తెలుసుకుందామంటాడు. ఇది మొదలు ఇద్దరూ కలిసి చిన్నసైజు గూఢచారుల్లా తయారవుతారు. ఆమెపై రహస్యంగా నిఘా వేస్తారు; ఆమెను రహస్యంగా అనుసరిస్తారు. నిజంగానే ఆమెకీ జాన్‌లరోష్‌కీ వివాహేతర సంబంధం వుందని తెలుసుకుంటారు. అంతేగాక జాన్‌లరోష్ ఆమెకి డ్రగ్స్ అలవాటు చేసాడనీ తెలుసుకుంటారు. అయితే వీళ్ళ గూఢచర్యం వెంటనే విఫలమవుతుంది. రహస్యంగా పొంచి చూస్తున్న చార్లీ ఆ ఇద్దరికీ పట్టుబడిపోతాడు. అతను తన పుస్తకాన్ని అడాప్ట్ చేస్తున్న రచయిత అని గుర్తించి సుశాన్ బెంబేలెత్తిపోతుంది. తాను డ్రగ్స్ తీసుకోవడం, తన ఈ వివాహేతర సంబంధం బయట పడితే పరువు పోతుందనీ కాబట్టి వీటికి సాక్షి అయిన చార్లీని చంపేయాలనీ అంటుంది సుశాన్. ఆమె, లరోష్ కలిసి చార్లీని తుపాకీతో బెదిరిస్తూ "ఫకాహచీ" దగ్గర నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్తారు. చార్లీని తుపాకీతో కాల్చేయబోతున్నారనగా, అప్పటివరకూ అవకాశం కోసం పొంచి వున్న డొనాల్డ్ ముందుకు దూకి రక్షిస్తాడు. ఇద్దరూ కలిసి అడవిలోకి పారిపోతారు. సుశాన్, లరోష్‌లు చీకట్లో ఫ్లాష్‌లైట్లతో ఇద్దర్నీ వెతుకుతూంటారు. ఓ బురదగుంటలో ప్రాణాలు బిగబట్టుకుని కూర్చుంటారు ఇద్దరు కవలలూ. చార్లీకి ప్రాణభయం పెరిగిపోతూంటుంది:

Charles: [trembling and mumbling] I don’t want to die Donald. I have wasted my life. God, I have wasted it.

Donald: You did not! And you are not gonna die.

Charles: I wasted it. I admire you Donald, you know. I spent my whole life paralyzed, worrying about what people think of me. And you… you're just oblivious.

Donald: [in offended tone] I'm not oblivious!

Charles: No, you don't understand. I mean that as a compliment.

Donald: [stares]

Charles: There was this time in high school. I was watching you out the library window...you were talking to Sarah Marsh.

Donald: Oh, God, I was so in love with her.

Charles: I know. And you were flirting with her, and she was being really sweet to you.

Donald: I remember that.

Charles: And then, when you walked away, she started making fun of you with Kim Canetti. And it was like they were laughing at me! You didn't know it at all. You seemed so happy.

Donald: I knew. I heard them.

Charles: Well, how come you were so happy?

Donald: I loved Sarah, Charles. It was mine, that love. I owned it. Even Sarah didn't have the right to take it away. I can love whoever I want.

Charles: But she thought you were pathetic!

Donald: [smiles] That was her business, not mine. You are what you love, not what loves you. That's what I have decided a long time ago.

Charles: [becomes silent]

Donald: What's up?

Charles: Thank you.

ఈ సంభాషణతో చార్లీలో మార్పు వస్తుంది. బురదగుంటలోనే ఆ రాత్రి తెల్లవారుతుంది. పొద్దున్న లేచి, శత్రువులు వెళ్ళిపోయుంటారని భావించి బయటకి వస్తారు ఇద్దరూ. కానీ ఇంకా అక్కడే కాచుకుని వున్న సుశాన్, లరోష్‌లు వీళ్ళపై కాల్పులు జరుపుతారు. డొనాల్డ్‌కు గుండు తగులుతుంది. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళాలన్న తొందరలో కారు వేగంగా నడపబోయి వేరే కారుని గుద్దుతాడు చార్లీ. ఈ ప్రమాదంలో డొనాల్డ్ చచ్చిపోతాడు. ఈలోగా అక్కడికి చేరుకున్న లరోష్ తుపాకీతో చార్లీని మళ్ళా బురదగుంటలోకి తరుముతాడు. చార్లీ చివరకి ఎటూ కాకుండా అతనికి దొరికిపోతాడు. ఇక తుపాకీ పేల్చబోతున్నాడనగా అకస్మాత్తుగా ఓ మొసలి వచ్చి లరోష్‌పై దాడి చేస్తుంది. లరోష్ చచ్చిపోతాడు. సుశాన్ అతన్ని కావలించుకుని ఏడుస్తుండగా చార్లీ పారిపోతాడు.

ఈ సంఘటనతో—ముఖ్యంగా డొనాల్డ్‌కీ తనకూ మధ్య చివరి సంభాషణతో—చార్లీలో మార్పు వస్తుంది. మనల్ని అవతలి వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన ప్రేమ మనదేనని తెలుసుకుంటాడు. దూరమైపోయిన తన గర్ల్‌ప్ర్రెండు అమీలియాని లంచ్‌కి కలిసి ఎట్టకేలకు తన ప్రేమ ప్రకటిస్తాడు. ఆమెను ముద్దు కూడా పెట్టుకుంటాడు. ఆమె వెళిపోయిన తర్వాత కారులో కూర్చుని, తన స్క్రిప్టును ఎలా పూర్తి చేయాలో కూడా నిర్ణయించుకుంటాడు. అందులో చివరి వాక్యం ఇది:

"Kaufman drives off from his encounter with Amelia, filled for the first time with hope"

అతను కారు నడుపుకుంటూ పోవడంతో సినిమా ముగుస్తుంది. ఈ ముగింపు దృశ్యానికి నేపథ్యంలో చనిపోయిన డొనాల్డ్ తన థ్రిల్లర్ స్క్రిప్టులో వాడాలనుకున్న పాట "హేపీ టుగెదెర్" వస్తూంటుంది:

ఇదీ కథ. మొదట చూసినప్పుడు నాకు నచ్చలేదన్నది ఈ ముగింపే. స్టుడియో ఎగ్జిక్యుటివ్‌తో తన మొదటి సంభాషణలో చార్లీ ఈ సినిమాలో ఏమేమి ఉండకూడదని చెపుతాడో అవన్నీ ముగింపుకొచ్చేసరికి చేరిపోతాయి. సెక్సు, డ్రగ్సూ, తుపాకులూ, కార్ చేజ్‍లూ అన్నీ వచ్చేస్తాయి. పాత్ర్రలు గొప్పగొప్ప జీవిత సత్యాలు తెలుసుకుని మారడం కూడా జరుగుతుంది. ఆటంకాలు అధిగమించి చివర్లో విజయం సాధించడమూ జరుగుతుంది. ఇదంతా నాకు కృతకంగా అనిపించింది. రెండోసారి చూసినప్పుడు అర్థమైంది ఇలా కృతకంగా వుండటం కూడా స్క్రీన్‌ప్లేలో ఓ భాగమేనని. సినిమా కృతకంగా మారేది చార్లీ సెమినార్‌కు హాజరై రాబర్ట్ మెకీ సలహా విన్నాకనే. సినిమా మొదట్లో ఎలా వున్నా చివరి అంకంలో ప్రేక్షకులని అబ్బురపరిస్తే విజయం ఖాయమంటాడు మెకీ. ఆ సలహా తర్వాతనే సినిమా ధోరణి ఇలా మారిపోతుంది. అంటే చార్లీయే కావాలని సినిమాలో ఇవన్నీ ఇరికిస్తున్నాడు.

మనం చూస్తున్న సినిమాని ఆ సినిమాలోని పాత్రే రాయడం, చూడ్డానికి సినిమాలోని కథా గమనానికి లొంగి వున్నట్టూ కనిపిస్తున్న పాత్రే కథాగమనాన్ని నిర్దేశిస్తూండటం, మన కళ్ళ ముందే మనం చూస్తున్న సినిమా ఆవిష్కరించబడటం... ఇదంతా మొత్తం సినీ చరిత్రలోనే ప్రేక్షకులు ఇదివరకూ అనుభవించని అనుభూతి (నాకు తెలిసి). మనం మంగలిషాపులో క్షవరానికి కూర్చున్నప్పుడు ముందో అద్దం వెనకో అద్దం ఉంటాయి. ముందు అద్దంలోని మన బింబం వెనక అద్దంలో ప్రతిబింబించడం, ఈ వెనుక అద్దం యావత్తూ మళ్ళీ ముందు అద్దంలో ప్రతిబింబితమవడం, ఇప్పుడు ముందు అద్దం (వెనుక అద్దపు ప్రతిబింబంతో సహా) మళ్ళీ వెనుక అద్దంలో ప్రతిబింబితమవడం ... ఇలా ప్రతిబింబాలు అనంతంగా విస్తరించుకుంటూ పోతాయి. ఈ సినిమా చూస్తున్నప్పుడూ అలాంటి భావనే ఏదో కలుగుతుంది. ఈ ఉదాహరణ సరైందా కాదా అన్నది నా ఆలోచనకు అందడం లేదు. సినిమా మొదట్లో స్టుడియో ఎగ్జిక్యుటివ్‌తో చార్లీ ఇలా అంటాడు:

"I would wanna let the movie exist, rather than be artificically plot-driven. "

నిజంగా ఈ సినిమా ద్వారా అదే చేసి చూపించాడు చార్లీ కఫ్‌మన్. దాదాపు అన్ని సినిమాల్లోనూ టైటిల్స్ ముగిసాక సినిమా ప్రారంభం అవుతుంది. కానీ ఈ సినిమాలో టైటిల్స్‌తోనే సినిమా ప్రారంభమైపోతుంది. ఎందుకంటే, సినిమా టైటిల్స్‌లో స్క్రీన్‌ప్లే అని వున్న చోట "చార్లీ కఫ్‌మన్ అండ్ డొనాల్డ్ కఫ్‌మన్" అని రెండు పేర్లూ కనిపిస్తాయి. కల్పిత పాత్రయిన డొనాల్డ్‌తో తన స్క్రీన్‌ప్లే క్రెడిట్ ఎందుకు పంచుకున్నాడు చార్లీ కఫ్‌మన్? మొత్తం సినిమా ఊహ ఈ టైటిల్‌తో తేటతెల్లమైపోతుంది. ట్రాంపెలోయ్ (trompe l'oeil) చిత్రాలంటారు కదా! ఒక బొమ్మలో మరొక బొమ్మ ఉండే పెయింటింగ్స్. ఈ సినిమా కూడా అంతే. ఇదో సినిమాలో సినిమా లాంటిది. (ఈ సినిమాకు ఆస్కార్లలో ఉత్తమ స్క్రీన్‌ప్లే నామినేషన్ దక్కినప్పుడు అందులో డొనాల్డ్ కఫ్‌మన్ పేరుకూడా వుంది.)

అంతేకాదు సెమినార్లలో ఇచ్చిన సలహాలు పాటించి తన సినిమాని తానే కృతకంగా మార్చుకున్న పాత్రని చూపించడం ద్వారా, సినిమాల విషయంలో ఇలాంటి సలహాలు, నిర్మాణ నియమాలూ ఎందుకు చెల్లవో కూడా అన్యాపదేశంగా చెప్పగలిగాడు చార్లీ కప్‌మన్. నా ఆల్‌టైమ్ ఫేవరెట్ల జాబితాలో ఇప్పటికే చార్లీ కఫ్‌మన్ చిత్రం ఒకటి వుంది. ఇది కూడా చేర్చుకుంటున్నాను. బహుశా చార్లీ కఫ్‌మన్ రాసిన, రాయబోయే ప్రతీ సినిమానీ చేర్చుకోవాల్సి వస్తుందేమో.

సినిమాలో నటీనటవర్గం కూడా అచ్చంగా పాత్రలకు అమరింది. ఇంత బాగా నటించే సత్తా వుండీ నికొలస్ కేజ్ "ఘోస్ట్ రైడర్", "బాంకాక్ డేంజరస్" లాంటి దరిద్రగొట్టు సినిమాలెందుకు ఎన్నుకుంటాడన్నది నాకు అర్థం కాదు. జాన్‌లరోష్‌గా నటించిన క్రిస్‌కూపర్‌కి ఈ సినిమాకి గానూ ఉత్తమ సహాయనటునిగా ఆస్కార్ వచ్చింది, కాబట్టి అతని నటన గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పుకోనక్కర్లేదు. అలాగే మెరిల్ స్ట్రీప్ గురించీ ప్రత్యేకంగా ఏం చెప్పనక్కర్లేదు. ఈ సినిమా కోసం పారితోషికం తగ్గించుకుని మరీ నటించిందట. కనిపించిన కొన్ని, తక్కువ నిడివి సన్నివేశాల్లోనే మనసు లాగేసుకుంటుంది. ముఖ్యంగా ఈ డ్రగ్స్ తీసుకునే సన్నివేశం, ఇందులో డయల్‌టోన్‌ని అనుకరించే ప్రయత్నం... ఎన్ని సార్లు చూసినా పెదాలపై చిరునవ్వు మొలుస్తుంది. ఆమే ఈ సన్నివేశంలో అంటున్నట్టు: fucking amazing!

ఔరా, ఈ పరిచయాలు ఎంత నిష్పలం! ఇంత చెప్పినా సినిమాలోని గారడీని ఇక్కడకు తీసుకురాలేకపోయానని తెలుస్తోంది. అయినా తన బ్లాగుకి "అక్షరాపేక్ష" అని పేరు పెట్టుకున్నవాడు ఒక సినిమా గురించి ఇన్ని అక్షరాలు ఖర్చు చేసేడంటే, ఆ సినిమాలో ఏదో సరుకుందీ అని చదివినవాళ్ళకి అర్థం అవుతుందనుకుంటా. అవ్వాలి మరి!

(Charlie Kaufman & Spike Jonze interview on "Adaptation")

June 2, 2009

(ఒక పదం from a work in progress)

కనుదోయి చెమరించెరా కన్నా కన్నా!

వెన్నలు దొంగిలి అమ్మల దోచివే

కన్నెల గుండెల దొరతమ్మున పట్టితివా

వెన్నెల వేణువుల యమునా సికతమ్ముల

సొబకుకాడవని సొక్కిలి, నా సొబగు పొక్కిలి మీటి,

జడకుప్పెల తప్పించి జాజులు తురిమి,

చెవి నల్లన మెల్లన పిలిచి...

నల్లనయ్యా ఇది నీకు చెల్లదయ్యా

-- కాశీభట్ల వేణుగోపాల్