December 1, 2016

ఒరాంగుటాన్


ఆఫీసులో వాడొచ్చి చేరేదాకా అంతా బానే ఉండేది. మేం ఐదుగురం కలివిడిగా సందడిగా ఉండేవాళ్ళం. అసలు అది ఆఫీసు పనేనా అన్నంత సఖ్యంగా చేసుకునేవాళ్ళం. వాడొచ్చి కడివెడు పాలల్లో ఉప్పుకన్నులా కలిసేదాకా.

నలుగురూ నవ్వేచోట గుర్తు రాకూడని మనిషి. పేరెందుకు గానీ, టైపిస్టు కాబట్టి అలాగే పిలుస్తాను. వాడు రాకముందూ టైప్ మిషను ఉండేది గానీ, ముసుగేసుకుని ఓ టేబిలు మీద అలా పడుండేది. హెడ్ గుమాస్తాగారికి ఎపుడన్నా నడుం లాగినపుడు కుర్చీ లోంచి లేచి అటూయిటూ పచార్లు చేస్తూ ఆ టేబిలు మీద కూర్చుని మాతో కబుర్లు చెప్పేవారు. ఆయన మనవలే ఎపుడన్నా ఆదివారం సరదాగా ఆఫీసుకి వచ్చినపుడు ఆ మిషను మీద కవరు తీసి పేపరెక్కించి ఆడుకునేవారు. లేకపోతే దాని జోలికే ఎవరూ పోయేవాళ్ళు కాదు.

ఒక రోజు ఉన్నట్టుండి పై నుంచి నోటీసు– ప్రతి డిపార్ట్మెంటుకీ టైపిస్టుల్ని ఇస్తున్నామని. మేవేం అడగలేదు కదా మాకెందుకని హెడ్ గుమాస్తా గారూ, సీనియరసిస్టెంటు గారూ పైవాళ్ళ దగ్గరకెళ్ళి మరీ చెప్పారు. మాటొచ్చింది కదాని చెప్తున్నాను. అసలు మాకు టైపిస్టు అవసరమే లేదు. నా దస్తూరీ ముత్యాల కోవలా ఉంటుందని అంటారు మా వాళ్ళంతా. పైగా చాలా వేగంగా కూడా రాస్తాన్నేను. అక్షర దోషాలూ, గ్రామరు మిస్టేకులూ అస్సలుండవు. ఎపుడో నేను చేరకముందు ఒక ముసలాయన ఉండేవాడట టైపిస్టుగా. వాళ్ళావిడకి పాపం అనారోగ్యమైతే వాలంట్రీ రిటైర్మెంటు పెట్టుకునెళ్ళిపోయాడు. అప్పట్నించీ, ఫాను చప్పుడుకే రీసౌండొచ్చే మా పెద్ద హాల్లో ఆ దరిద్రపు టైపు మిషను మోత తప్పిందని మా సర్వేయరుగారంటూ ఉంటారు. ఎపుడో తప్పితే ఆఫీసులో ఉండని ఆయనే అలాగంటే మరి మిగతావాళ్ళ బాధ! అందుకే పైకెళ్ళి మరీ టైపిస్టు అవసరం లేదని చెప్పుకున్నారు. కానీ అందరికీ ఓ రూలూ మీకో రూలూ కుదరదన్నారంట పైవాళ్లు. ఆ తర్వాత రెండ్రోజులకే దిగబడ్డాడు కొత్త టైపిస్టు.

నేను ఉత్తపుణ్యానికి ఒకళ్ళ గురించి పొల్లుమాటనే మనిషిని కాదు. అందరితో మంచిగా ఉంటాను. తోటి మనుషుల్నీ, చేసే పనినీ ప్రేమిస్తాను. మనసులో ఒకటుంచుకుని, బైటకొకలా మాట్లాట్టం తెలీదు. నేననే కాదు, మా ఐదుగురమూ అంతే. హెడ్ గుమాస్తా గారు అప్పుడపుడూ చిరాకొచ్చినపుడు అరిచినా, దాని వెనక పనవటం లేదన్న బాధా, మళ్ళీ అందుమూలాన మేమేవన్నా పైవాళ్ళ నుంచి మాట పడాల్సి వస్తుందేమోనన్న అక్కరా తప్పిస్తే ఇంకేం ఉండదు– ఇంట్లో పిల్లల్ని గదమాయించినట్టే. ఇక సీనియరసిస్టెంటు గారైతే చెప్పనే అక్కర్లేదు. మంచి సరదా మనిషి. ఒట్టి గళ్ళచొక్కాల్లోనే ఇన్ని రంగులూ, రకాలూ మార్చొచ్చా అనిపిస్తుంది ఆయన డ్రస్సింగదీ చూస్తే. వాచీ చైను లూజుగా మణికట్టు మీద ఆడించుకుంటా ఆయన మాకు తెలిసిన సంగతుల్నే మళ్ళా జోకుల్లా పేల్చి నవ్విస్తాడు. ఇక సర్వేయరుగారు వయసుకు తగ్గట్టే కాస్త గంభీరంగా అంటీముట్టనట్టు ఉంటారు. దగ్గరకొచ్చి మెల్లిగా మాట్లాడతారు. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయంటారు కాబట్టి ఉద్యోగం చేస్తున్నాడు కానీ ఆయనకా అవసరమే లేదు. నాలుగోవాడు మణి. వాడ్ని మేవెవరం అటెండరు లాగా చూడం. బతికి చెడిన కుటుంబం నుంచొచ్చి ఈ ఉద్యోగం చేస్తున్నాడు. కాస్త పుష్టిగా వయసుకు మించి కనిపిస్తాడు కానీ ఇంకా కుర్రాడే, గెడ్డం ఓ పదిసార్లయినా గీసుండడు. వాడూ, సీనియరసిస్టెంటు గారూ కూర్చుని కత్తు కలిపారంటే ఇంక మేం పని పక్కనపెట్టి నవ్వుకుంటా కూచోవాల్సిందే.

మణి వరండాలో కూర్చుంటే ఊసుపోవటం లేదని హెడ్ గుమాస్తా గారు నా పక్కనే ఓ బల్ల వేయించారు. కానీ వాడందులో కుదురుగా ఓ నిమిషం ఎపుడైనా కూర్చుంటేనా. మొత్తం అన్ని డిపార్ట్మెంట్లూ వాడివే అన్నట్టు తిరుగుతాడు. ఎక్కడెక్కడి వార్తలూ మోసుకొస్తాడు. సర్క్యులర్లూ, నోటీసులూ పైన టైపింగ్ అవుతుండగానే మాకిక్కడ తెలిసిపోతుంటాయి. వాడి అల్లరి వెనక ఉన్న మరో మనిషి మాత్రం నాకే తెలుసు. వాడి లక్ష్యాలు, బాధ్యతలూ, కష్టాలూ… అన్నీ. ఎన్నో రాత్రుళ్ళు వాడు జీవితంలో పైకి రావటానికి ఏం చేయాలనుకుంటున్నాడో కళ్ళక్కట్టినట్టు చెప్తుంటే నేను అవన్నీ నా జీవితానికి సంబంధమున్నాయే అన్నట్టు విన్నాను.

ఇక నా గురించి పెద్దేంలేదు చెప్పుకోవటానికి. పెళ్ళయిన బ్రహ్మచారిని. ఆ మనిషి వెళిపోయిందన్న బాధేం లేదు. పనిని ప్రేమిస్తాను. మాట తెచ్చుకోను. సాయంత్రాలు పార్కులో నడవటం, కలం స్నేహితులు కొంతమందికి ఉత్తరాలు రాసుకోవటం, లేదంటే లైబ్రరీ నుంచి పుస్తకాలు తెచ్చుకుని చదువుకోవటం, రేడియోలో పాటలు వింటూ పడుకోవటం. ప్రతీదీ ఏ మోతాదులో ఉండాలో ఆ మోతాదులో ఉంది.

* * *

మనుషుల్ని వాళ్ళ రూపం బట్టి అంచనా వేయటం తప్పని నాకు తెలుసు. కానీ నేను గమనించిందేమిటంటే- ఒక మనిషి మనసు అష్టవంకర్లుగా ఉన్నప్పుడు ఆ ప్రభావం నెమ్మదిగా ఆ మనిషి రూపం మీద కూడా పడుతుంది. అందుకే మొదటిసారి చూసినప్పుడే కొత్త టైపిస్టు తేడాకొట్టేడు. చూట్టానికి మనిషి ఎత్తుగా, బలంగానే ఉంటాడు. తన ఎత్తుకి సిగ్గుపడుతున్నట్టు కొద్దిగా ఒంగి నడుస్తూంటాడు. నల్లటి ముఖం కాస్త పెద్దది కావటంతో కళ్ళూ ముక్కూ నోరూ అన్నీ ఖాళీగా సర్దినట్టుంటాయి. బుగ్గల మీద మొటిమల మచ్చలు గుంటలుపడి ఉంటాయి. ఎదర కొంత జుట్టూడిపోయి, నుదుటి మీద నరాలు వానపాముల్లా కదులుతుంటాయి. వేసుకునే బట్టల్లో ఎప్పుడూ ఓ రంగూపాడూ ఉండదు. ఒక చొక్కా వేలాడేసుకుని చేతుల దగ్గర పైకి మడతపెట్టుకుంటాడు. ఎత్తువల్ల పాంటుకి కిందెప్పుడూ చీలమండలు కనిపిస్తుంటాయి. ఇంత వర్ణించినా ఆ మనిషిలో ఏం తేడాకొట్టిందో చెప్పలేకపోతున్నాను. అతని ఫోటో తీసి చూపించినా అర్థంగాక పోవచ్చు. అతను మసలుకునే తీరులోనే ఆ అందవికారం ఉందేమో. ఎపుడూ ఏదో తడబాటుగా సంకోచంగా ఉంటాడు. కళ్ళల్లో కళ్ళుపెట్టి తిన్నగా చూడలేడు. అన్నీ పక్కచూపులు, దొంగచూపులు. చేరినకొత్తలోవుండే కంగారేమో అనుకున్నాం మొదట్లో. అలవాటయ్యాకా మాలో కలిసిపోతాడ్లే అనుకున్నాం. కానీ ఆర్నెల్లయినా అదే తీరు. హెడ్ గుమాస్తా గారు తన ధోరణేదో తనది. పని చేస్తే చాలు ఎవరెలా ఉన్నా పట్టించుకోరు. సీనియరసిస్టెంటు మాత్రం మొదట్లో అతని దగ్గరకు వెళ్ళి సరదాగా పలకరించేవారు. అలాంటప్పుడు అతని ప్రవర్తించే తీరు తేడాగా ఉండేది. ముఖమంతా తెచ్చిపెట్టుకున్న నవ్వుతో ఎంతో ఒదిగున్నట్టు సమాధానాలిచ్చేవాడు. అన్నీ ముక్తసరిగానే ఉండేవి. సీనియరసిస్టెంటు చూసిచూసి పట్టించుకోవటం మానేశారు. మొదట్లో లంచ్ కి వెళ్ళేటప్పుడు రమ్మంటే మాతోపాటు వచ్చేవాడు. మా వరసలో ఎప్పుడూ చివర్న కూర్చునేవాడు. కలిపించుకుని మాట్లాడేవాడు కాదు. మేం ఏదన్నా కదిపితే మాత్రం ముఖమంతా ఎంతో ఇదిగా మార్చేసుకుని సమాధానం చెప్పేవాడు. అదంతా నటన అని తెలిసిపోయేది. మేం మాట్లాడే మాటల్లో అతనికేం ఇంట్రస్టు లేదని తొందర్లోనే అర్థమైపోయింది. ఎపుడో అరుదుగా అతనే కలగజేసుకుని ఓ మాట అన్నా, అది కూడా ఇంట్రస్ట్ ఉండి కాదని, తన వంతుగా ఏదోటి మాట్లాడాల్సిన బరువు ఫీలయి మాట్లాడుతున్నాడని మాకనిపించేది. దాంతో పక్కనే కూర్చున్నా పట్టించుకోవటం మానేశాం. అంత పొడవైన చేతులు ఎబ్బెట్టుగా ఊపుకుంటూ మా వెనక నడుస్తుంటే మోయలేని తోకలా అనిపించేవాడు. తర్వాత్తర్వాత మెల్లిగా తనే మాతో భోజనానికి రావటం మానేశాడు.

కానీ అంత పెద్ద హాల్లో ఆ మూల అతని జాడ మరీ పట్టించుకోకుండా ఉండలేం కదా. పైగా ఆ టైప్ మిషను చప్పుడోటి. అసలు అతను మాట్లాడకపోవటాన్ని ఆ టైపు టకటకల్తో భర్తీ చేసుకుంటున్నాడేమో అనిపించేది. ఒక్కోసారి మానుంచి తనని వేరు చేసుకోవటానికి ఆ టైపు చప్పుడుని గోడలా వాడుతున్నాడేమో అనీ అనిపించేది. మా సీనియరసిస్టెంటుగారు ఏదో జోకేసినపుడో, మా మణి ఏదన్నా ఊళ్ళో విషయం మాట్లాడుతున్నప్పుడో, ఇలా మేం ఐదుగురం ఒక కుటుంబంలా సందడిగా ఉన్నప్పుడల్లా, మాలో కలవాల్సిన అవసరాన్నించి తప్పించుకోవటానికన్నట్టు ఆ టైపు మిషను మామూలుకన్నా జోరుగా టకటకలాడేది, కేరేజీ డుర్రున వెనక్కి మళ్ళేది. ఎపుడో ఒకసారి ఏదో తప్పనిసరి అవసరం వచ్చి మా టేబిళ్ళ దగ్గరకొచ్చి నిలబడి గొణిగేవాడు. రెట్టిస్తే తప్ప ఏమంటున్నాడో అర్థమయేది కాదు. చెప్పాపోవటమే, అప్పుడప్పుడూ అతని మీద జాలేసిన సందర్భాలున్నాయి. సీనియరసిస్టెంటు గారు అతను చేతులేలాడేసుకుంటూ నడిచే తీరు చూసి ఒరాంగుటాన్ అని పేరు పెట్టారు. ఒకసారి అతను లేనప్పుడు గుప్పిళ్ళు వదులుగా మూసి అతనిలా నడిచి కూడా చూపెట్టారు. అప్పుడు నవ్వొచ్చింది గానీ తర్వాత జాలేసింది. మణి కూడా లోకువ కట్టేసాడు. ఒకసారి టైపిస్టు ఏదో ఫైలడిగితే, “తీసుకోండి సార్, ఆ దుమ్ములోకి వెళ్ళటం నా వల్ల కాదు”అనేసి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి మణి నా గదికి వచ్చినపుడు వాడి కోసం ఆమ్లెట్టదీ వేస్తూ, “జీవితంలో ఏం దెబ్బలు తిన్నాడో మనకేం తెలుసురా!” అని నచ్చచెప్పాను. “నువ్వో అమాయకుడివి, పైకి అలా కనపడేవోళ్ళు చాలా డేంజరు,” అన్నాడు. వాడన్నది నిజమే, నేను ఊరికే అందర్నీ నమ్మేస్తాను.

మనుషులెపుడూ చలాకిగా, కలుపుగోలుగా ఉండాలని నేను అనుకుంటాను. భూమ్మీద పుట్టి పోయేలోగా పదిమందినీ కలేసుకోవాలి, మన పాడె లేచినపుడు అందరూ కన్నీటితో సాగనంపాలి. ఎందుకపుడూ ఏదో కోల్పోయినట్టుండాలి? ఓ చిరునవ్వుతో, ఓ ఆప్యాయమైన పలకరింపుతో గెలవలేందెవర్నీ? అదీ నా పద్ధతి. నలుగురూ ఒకలా ఉన్న చోట, ఒకడు ఎడంగా నన్నంటుకోకు నామాలకాకీ అన్నట్టుంటే బాగోదు, నిజమే. అయితే అతనికేం కష్టాలున్నాయో అనుకుని ఉండిపోయాను. సర్వేయరు గారంటే అసలిలాంటియ్యి పట్టించుకోడు. హెడ్ గుమాస్తా గారూ పెద్ద పట్టించుకనే మనిషేం కాదు గానీ, ఆ మధ్యో సారి ఆయనకీ ఒళ్ళుమండింది. ఆదివారాలెపుడైనా పనుండి ఆఫీసుకి రావాల్సొస్తే సరదాగా మనవళ్ళిద్దర్నీ వెంటబెట్టకుని రావటం ఆయనకలవాటు. ఒకరోజు ఆళ్ళ పెద్దమనవడు టైపు మిషనుతో ఆడుకుంటుంటే, అపుడే లోపలికొచ్చిన టైపిస్ట్ “ఒయ్యోయ్!” అంటూ గదమాయించేడు. నేను అప్పటికీ “మన సార్ మనవలండీ”అన్నాను కూడా. “రిబ్బను ఊడొచ్చేసిందండీ”అంటూ దాన్ని పైకెత్తి చూపించేడు. హెడ్ గుమాస్తా గారు అప్పటికైతే ఏమనలేదు. ఫైల్లో తల దూరుస్తూ “పెట్టుకోవచ్చు లేవయ్యా మాయదారి రిబ్బను”అని ఊరుకున్నారు. తర్వాత ఓ రెండ్రోజులకి టైపిస్టు కొట్టిన లెటర్లో గ్రామరు మిస్టేకులతో సహా రెడ్డింకుతో నోట్ చేసేరు. దగ్గరికి పిలిచి కడిగిపారేసారు. ఆయనకి కోపమొస్తే వీరభద్రుడే! కాయితాలు ఇలాగ మొహం మీదకు ఇసిరికొట్టేశారు. మరెందుకు దూల నోరు కాకపోతే. కిందపడిన పేపర్లన్నీ ఏరుకుని వెళ్ళి సీట్లో కూర్చున్నాడు.

ఆ రోజు సాయంత్రం ఇంటికెళిపోతున్నప్పుడు ఆఫీసు బైట రావిచెట్ల కిందున్న చప్టా మీద ఒక్కడే కూర్చుని సిగరెట్టు కాలుస్తూ కనపడ్డాడు. నేను దగ్గరికెళ్ళి కాసేపు ఈ మాటా ఆ మాటా మాట్లాడి తిన్నగా అడిగేసాను-

“అసలేంటి మీ ప్రాబ్లెం? ఏమన్నా కుటుంబ సమస్యలా?”

అతను అర్థం కానట్టు ముఖం పెట్టి “నా ప్రాబ్లెం ఏముంది సార్”అన్నాడు.

“కాదూ, ఎందుకలా డల్లుగా ఉంటారూ. హేపీగా నవ్వుతా ఉండాలండీ. కష్టాలెవరికి లేవు మన ఆఫీసులో? మన మణిగాడు మనసులో ఎన్నెన్ని బరువులు మోస్తా ఎంత సరదాగా ఉంటాడో చూడండి. బీపాజిటివ్ అండీ!” అన్నాను.

వంకర నవ్వు నవ్వి “నాకు కష్టాలేవీ లేవండీ,” అన్నాడు.

“మరెందుకలా ఎపుడూ ఏదో కోల్పోయినట్టుంటారు? ఇక్కడంతా మనవాళ్ళేనండీ. హెడ్ గుమాస్తా గారి మాట కొద్దిగా కటువనేగానీ, మళ్ళీ కష్టం వస్తే మాత్రం ఫస్టు మన పక్కనుండేది ఆయనే” అన్నాను మంచిగా.

“ఏవండీ, ఆయన అనే పొజిషన్లో ఉన్నాడు, నేను పడే పొజిషన్లో ఉన్నాను. నాకీ ఉద్యోగం అవసరం. ఇది పర్మినెంటు అయ్యేదాకా ఏ ఆఫీసు కాకి నా మీద రెట్టేసినా తుడుచుకుని పోతాను,” అన్నాడు ఓ నిర్ణయానికొ వచ్చినట్టు.

అలా మాట్లాడేసరికి నాకు చాలా బాధేసింది. హెడ్ గుమాస్తా గారి గురించి ఆయన వెనకాల కూడా ఎప్పుడూ ఓ పొల్లుమాట అనుకుని ఎరగం మేము. మనిషి అలాంటోడు.

“మీ మెంటాల్టీ మార్చుకోకపోతే మాత్రం కష్టమండీ”అని చెప్పి వచ్చేశాను.

అప్పట్నుంచీ నాకు అతని మీద జాలి కూడా పోయింది. ఎపుడన్నా ఏదో స్టేషనరీ కోసం నా టేబిల్ దగ్గరకొచ్చి గొణిగినా లేవనో, ఉన్నా కూడా నాకు కావాలనో చెప్పేసేవాడ్ని. ఒకసారి అలానే అంటే, “ఏం సార్ అన్ని పిన్నులూ వాడేస్తారా మరీని”అని గొణిగేడు. “వాడతావాఁ లేదా అన్నది కాదు సార్, నాకని ఇచ్చినవి నేను ఓ లెక్కలో ఖర్చుపెట్టుకుంటాను. ఆ లెక్క తప్పటం నాకు ఇష్టం లేదు,” అని నిక్కచ్చిగా చెప్పేశాను. అసలతని జోలికేరాని హెడ్ గుమాస్తా గారి గురించే మనసులో అలా అనుకున్నాడంటే, మన గురించి లోపల్లోపల ఏమనుకుంటున్నాడో ఆ మాత్రం ఊహించలేమా!

అంతా సఖ్యంగా మంచితనంతో మసిలే చోట ఒకడు మనసు నిండా ఇలాగ విషం నింపుకున్నాడని తెలిస్తే ఎలా ఉంటుంది. ఒక్కోసారి అతని లోపల కుళ్ళు బాగా బైటపడిపోయేది. మా హెడ్ గుమాస్తా గారి యాభయ్యో పుట్టిన రోజప్పుడు జరిగిన సంగతి బా గుర్తు. మాకు ప్రతి ఏటా హెడ్ గుమాస్తా గారి పుట్టిన్రోజంటే పండగతో సమానం. పైగా అది యాభయ్యో పుట్టిన్రోజు. అంతకుముందు రోజు రాత్రే సీనియరసిస్టెంటు గారూ, మణీ బండి మీద టౌన్ కెళ్ళి పెద్ద కేకు తెప్పించి సర్వేయరు గారింట్లో ఫ్రిజ్ ఉంటే అందులో పెట్టివుంచారు. నేనూ, మణీ తెల్లారే ఆఫీసుకొచ్చేసి హాలంతా అందంగా రంగు కాయితాలయ్యీ అతికించాం. హెడ్ గుమాస్తా గారొచ్చేసరికి అంతా సిద్ధంగా చేసుంచాం. ఆయన కేకు కోస్తూండగా, మేం అంతా చుట్టూ నిలబడి బర్త్ డే సాంగ్ పాడుతుంటే వచ్చాడు టైపిస్టు. కాసేపు ఏం అర్థం కానట్టు చూస్తూ నిలబడిపోతే సీనియరసిస్టెంటు గారు “రండ్రండి”అని పిలిచారు. మా మధ్యకు వచ్చి మాతో పాటు చప్పట్లు కొట్టాడు మొక్కుబడిగా, పాటకి నోరు కూడా కదపలేదు. అదే నాకర్థం కాంది! ఏదన్నా అందరూ కలిసికట్టుగా ఓ పని చేస్తున్నప్పుడు అందులో వచ్చి కలిసిపోకుండా పక్కగా నిలబడి ప్రేక్షకుడిలా చూస్తుంటే ఎలా ఉంటాది మిగతావాళ్ళకి? అక్కడికేదో మేమంతా వెర్రోళ్లవన్నట్టు. ప్రతీ ఏటా పుట్టిన రోజుకి హెడ్ గుమాస్తా గారు స్వయంగా ఆయన చేతుల్తో కేకు ముక్కల్ని తినిపించడమూ, మేవందరం – సర్వేయరుగారంటే పెద్దాయన కాబట్టి ఆయన తప్ప మిగతా అందరం – వందనంగా ఆయన పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకోవటమూ ఓ ఆనవాయితీగా అలా సాగుతుంది. ఆ ప్రకారంగానే సీనియరసిస్టెంటు గారూ, నేనూ, మణీ వంగి దణ్ణం పెట్టుకున్నాం. ఆయన మొహమాటంగా “ఎందుకయ్యా ఇవన్నీను”అంటున్నా కానీ. తర్వాత ఆ పక్కన ఎడ్డావతారంలా నిలబడి చూస్తున్న టైపిస్టుని కూడా సీనియరసిస్టెంటు గారు కాస్త రహస్యంగానే “రండి మీరూనూ” అన్నట్టు సైగ చేసేరు. దానికతను ఏదో తాయిలం ఇవ్వబోతుంటే మొహమాటపడుతున్నట్టు మొహంపెట్టి ‘ఫర్లేదు ఫర్లేద’న్నట్టు చేతులాడిస్తూ వెనక్కు జరుగుతున్నాడు. వెనకాల ఉన్న మణి కాళ్ళు తొక్కేసరికి మణి అతన్ని కొద్దిగా ముందుకి తోసాడు. అతని చేయి అందిపుచ్చుకుని నేనే చొరవగా “ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుంటే మంచిదండీ”అని ముందుకు లాగబోయాను. అతను నా చేతిని విదుల్చుకున్నాడు. ఇక్కడేదో జరుగుతున్నదని అప్పుడే గమనించిన హెడ్ గుమాస్తా గారు “ఏంటయ్యా ఏంటి?” అని మా మధ్యలోకి వచ్చారు. “మీ బ్లెస్సింగ్స్ తీసుకోమంటే టైపిస్టుగారు మొహమాటపడుతున్నారు సార్,” అన్నాడు వెనక నుంచి మణి. హెడ్ గుమాస్తా గారు మా వైపు మందలిస్తున్న నవ్వుతో “ఏంటండి ఇదంతా,” అని, టైపిస్టుతో “ఏదో వీళ్ళ చాదస్తమాయ్యా, నువ్వెళ్లు నువ్వెళ్ళు,” అనేసన్నారు. పోనీ అపుడైనా వయసులో పెద్దాయనా, కేడర్లో పెద్దాయనా అనేసి ఓమారు వంగి ఆయన కాలు తాకుండచ్చు కదా? వాడి కుచ్చు కిరీటమేవైనా ఊడిపోతుందా? అలాగే వెనక్కి తిరిగి వెళ్ళి సీట్లో కూర్చుండిపోయాడు పెద్ద మనిషి!

ఆ తర్వాతే నేను మణితోనీ, సీనియరసిస్టెంటుగారితోనీ ఆ రోజు రావి చెట్టు దగ్గర హెడ్ గుమాస్తా గారి గురించి టైపిస్టు ఏమన్నాడో చెప్పాను. వాళ్ళిద్దరూ అవునా అని బాధపడ్డారు. నేనంటే ఊరుకున్నాను కానీ సీనియరసిస్టెంటు గారు ఊరుకుంటారా! ఆయనైతే మరీని. అప్పుడ్నించీ అదను దొరికినప్పుడల్లా టైపిస్టుకి ఏదో ఒక చురక అంటిస్తూనే ఉండేవారు. మాతో ఏదో ఊళ్ళో విషయం గురించి మాట్లాడుతూనో, లేదంటే ఏదో ప్రొసీజరు డిస్కస్ చేస్తూనో ఉన్నట్టుండి టైపిస్టు వైపు తిరిగి “ఏ సార్ అంతేనా?” అని అడిగేవారు. టైపిస్టు కాసేపు అయోమయంగా కలదొక్కేసుకుంటూంటే ఓ ఆటాడుకునేవారు. అప్పుడప్పుడూ మణి కూడా ఆయనకి తోడొచ్చేవాడు.

ఒకసారి టైపిస్టు మా ముందు నుంచీ నడిచి సీటు దగ్గరికి వెళ్తూంటే సీనియర్ అసిస్టెంటుగారు “ఏయ్, ఏంటా నడక ఒరాంగుటాన్ లాగా!” అని గట్టిగా అన్నారు. టైపిస్టు వెనక్కు తిరిగి చూడగానే, అతనివైపు ఎత్తిన చేయిని చప్పున అక్కడే ఉన్న మణి వైపు తిప్పేశారు, ఆ మాట వాడినుద్దేశించి అన్నట్టుగా. మణిగాడు కూడా చేతులేలాడేసుకుని, కాళ్ళు కొద్దిగా పంగజాపి నడిచాడు. “రికార్డు రూంలో మెట్లెక్కీ ఎక్కీ తొడలు ఒరుసుకుపోతున్నాయ్ సార్,” అని ఏదో దొంగమాటతో కప్పిపుచ్చాడు. టైపిస్టు వెనక్కి తిరిగినవాడు తలతిప్పుకుని వెళిపోయాడు, ఓ వెర్రి నవ్వు కూడా నవ్వేసి. అప్పుడు తననే అంటున్నారని అర్థమయ్యిందో లేదో కానీ, ఇలాంటి జోకుల్నే తిప్పి తిప్పి వాడటం వల్లా, పదే పదే “ఒరాంగుటన్” అన్న పేరు తనుండగానే వినపడటంతోనీ బహుశా గ్రహించే వుంటాడు. ఒక్కోసారి ఆ పదం వినపడినా, తల కూడా తిప్పకుండా ముఖం మాడ్చుకుని వెళ్ళి సీట్లో కూర్చునేవాడు. నేను అప్పటికీ అన్నాను కూడా సీనియరసిస్టెంటు గారితో, “సార్ ఆపండి సార్ మీరు మరీ చిన్నపిల్లాడిలా,” అని. అయినా ఆయన ఏదైనా మనసులో పెట్టేసుకుంటే అంతే ఇక. ఒక్కోసారి అందరికీ టీలు తెప్పించి కూడా టైపిస్టుకి తెప్పించడం మానేసేవారు.

సీనియరసిస్టెంటు గారు సెటైరేసినప్పుడల్లా అతనూ అదేలెక్కలో తిరిగి మాటకు మాటంటే బావుండేది. కానీ అతనేం మనిషో, అంతకంతకూ ముడుచుకుపోయేవాడు. అలాంటప్పుడు మాకు ఇంకా ఇంకా ఏడిపించాలనిపించేది. ఒకసారి మాతో చిట్టీల్లో కలుస్తాడేమోనని అడిగితే కలవనన్నాడు, ఎందుకనడిగితే జీతం డబ్బులు అంత మిగలవని చెప్పాడు. “ఏవండి రెండు ఫేమిలీసేఁవన్నా మెయింటైన్ చేస్తన్నారేటి?” అన్నాడు సీనియరసిస్టెంటు గారు సరదాకి. అందరూ నవ్వేసేం. అతను ముఖం అలాగే పెట్టుకుని సీనియరసిస్టెంటు గారి వైపు చూస్తున్నాడు.

“కానీ మీకే గనక ఇద్దరుపెళ్ళాలుంటే ఆళ్ళకీ ఆళ్ళకీ మధ్య కాలక్షేపం అవ్వాలే తప్ప మీతో మాత్రం కాదండోయ్,” అన్నాడు సీనియరసిస్టెంటుగారు.

“సార్ మీరు… ఎంతలో ఉండాలో అంతలో… మంచిద్సార్… ఎంతలో ఉండాలో అంతలో ఉంటే మంచిదిసార్” అన్నాడు ఆవేశంతో నత్తొచ్చేస్తుంటే.

“అయ్యో ఏంటయ్యా సాఁవీ ఈయన సీరియస్సైపోతున్నారు. రెండు ఫేమిలీసని నేనేదో కాంప్లిమెంటుగా అన్నానండీ”

“దాని గురించని అంటంలేదు. మీరీ మధ్య చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. నా మీద సెటైర్లయ్యీని. నాకర్థం కావనుకుంట్నారా ఏంటి”

“బాబూ మణీ కాస్త మంచినీళ్ళు పట్రా ఆయనికి,” అన్నారు సీనియర్ అసిస్టెంటు. తర్వాత హెడ్ గుమాస్తా వైపు చూసి ‘ఏంటి సార్ ఇది మాకు’ అన్నట్టు నవ్వారు.

హెడ్ గుమాస్తా గారు పని ఆపి టైపిస్టు వైపే చూస్తున్నారు.

టైపిస్టు ఈసారి దిగ్గున సీట్లోంచి లేచి నుంచొని హెడ్ గుమాస్తా గారి కేసి చూసి మాట్లాడుతూ, “సార్, ఇలా అంట్నానని మీరేవనుకోవద్దు. ఎవరి మర్యాదాళ్లకుంటాది. ఎలా పడితే అలా మాట్లాడితే ఎలా సార్” అని అడిగాడు న్యాయం చెప్పమని దబాయిస్తున్నట్టు.

హెడ్ గుమాస్తా గారికి వీరభద్రుడు పూనేసేడు. “ఓయ్… నువ్వు కూర్చో ముందు. ఎందుకలా రైజై పోతున్నావయ్యా? ఆఫీసన్నాకా అందరూ నీలా మొఖం గంటు పెట్టుకుని కూర్చూనుంటే పన్లవ్వవు. మనుషులు సరదాగా ఉంటే పనీ సరదాగా అయిపోద్ది. ఏంట్నీకేవన్నా మా కన్నా ఎక్కువ జీతవిస్తన్నారా తలెత్తకుండా ఊ సీరియస్ గా పని చేయమని? కొత్తగా ఒచ్చేవు కాబట్టీ, నీకు చెప్తే తప్ప అర్థవయ్యేట్టు లేదు కాబట్టీ, ఇక్కడ పద్ధతులు చెప్తున్నాను ఇను. ఇప్పటిదాకా మేవెవరం దీన్ని ఆఫీసనుకోలేదు, ఒకరికొకళ్ళం కొలీగ్సనీ అనుకోలేదు. ఇదో ఫేమిలీ, మేం ఫేమిలీ మెంబంర్స్ మి. ఒకళ్ళ మీదొకళ్ళు జోకులేసుకుంటాం, పనీ అలాగే చేసుకుంటాం. ఇప్పటిదాకా అలాగే నడిచింది. నువ్వొచ్చినంత మాత్రాన ఇక్కడ పద్ధతులేవీ మారిపోవు. నువ్వూ నలుగురిలో ఒకడిగా కలిసిపోవటం నేర్చుకో ముందు. కూర్చో ఇక!” గద్దించినట్టన్నారు హెడ్ గుమాస్తా గారు.

నేనూ నా మాటగా అన్నాను. “అలాక్కాదండీ, పోనీ మిమ్మల్నేవన్నా దూరం పెట్టేవా మేము. ఎప్పుడూ కలుపుకుందామనే చూసేం కదా. సర్లే మీరు కలాపోయేసరికి ఏమో మీకేం ప్రోబ్లెంస్ ఉన్నాయోనని అలా వదిలేసేఁవంతే” అనునయంగానే అన్నాను.

“వదిలేయటం అంటే ఇలా అయిందానికీ కాందానికీ ఎటకారాలాడ్డవాండీ?” అనడిగేడు.

సీనియరసిస్టెంటు గారు “అయ్ బాబోయ్ బాబూ మీకో దణ్ణం” అని తల మీద చేతులు చప్పట్లు చరిచి, “నేను అందరితో ఒకలా ఉండి మీతో ఒకలా ఉండ్లేను. లోపల్లోపల మీరంత ఇదైపోతున్నారని నాకు తెలీదిప్పటిదాకాని. మీకది ఇబ్బందైతే ఇదిగో ఈ రోజు నుంచి నేను నోరు మెదిపితే ఒట్టు.” అని చుట్టూతా అందరి వైపూ ఓసారి చూసి, “ఏం సార్, ఈ రోజు నుంచీ మీరు నా వైపు చూస్తే నేను కనపడతాను. నా గొంతు వినపడితే మాత్రం చెప్పుతీసుక్కొట్టండి. సరేనా,” అన్నాడు.

“మీరెందుకు మీ పద్ధతులు మార్చుకోవాలండీ. అవసరమైతే ఆయనే సీటు బైటేసుక్కూచుంటాడు రేపణ్ణించీ” అన్నాడు హెడ్ గుమాస్తా గారు వారిస్తూ.

మణి మధ్యలోకొచ్చి చాకచక్యంగా గొడవ సర్దేశాడు. టైపిస్టు మళ్ళీ ఏదో మాట్లాడబోతుంటే, “సార్ సార్! కూర్చోండి సార్ మీరు. ఎందుకూరికేని ఒకాఫీసులో ఉంటా మన్లో మనం ఆఁ?” అని ఆయన భుజం పట్టుకుని కూర్చోపెట్టేశాడు.

అతను ముఖం ఇలా పెట్టుకుని టైపు టిక్కు టిక్కులాడించేడు. కాసేపు హాల్లో అది తప్ప ఇంకో చప్పుడు లేదు.

సీనియరసిస్టెంటు గారే మళ్ళీ “ఏదో ప్రతిజ్ఞ అయితే చేస్సేను కానీ, ఊరుకొమ్మన్నంత మాత్రాన ఊరుకునే నోరు కాదు సార్ నాది, ఓ జోకు గుర్తొస్తంది చెప్మంటారా?” అనడిగేడు గిల్టీగా మొహం పెట్టి.

అందరం నవ్వేసేం.

టైపిస్టు లేచి పనున్నట్టు బయటికెళిపోయేడు.

* * *

మర్నాడు పొద్దున్న మణి పైనుంచి ఓ వార్త మోసుకొచ్చాడు. “మన టైపిస్టు గారు డిపార్ట్మెంటు మార్పించేమని అర్జీ పెట్టుకున్నారంట సార్” అన్నాడు హెడ్ గుమాస్తా గారితో. పైన బంట్రోతు ఆ లెటర్ చూపించాడట. ఆ ఉత్తరంలో చదివిన విషయాల్ని గుర్తున్న మేరకి చెప్పటానికి ప్రయత్నించాడు: “పూజ్యులైన అయ్యా… మీరు నన్ను నియమించిన విభాగము నందు నాకు అనుకూలముగా లేదు. నా సహోద్యోగులలో కొందరి వల్ల నేను నా విధులు సక్రమంగా నిర్వహించలేకున్నాను. దయచేసి నన్ను వేరే విభాగమునకు బదిలీ కావించగలరు. విధేయుడు, ఫలానా ఫలానా, టైపిస్టు, ఫలానా ఫలానా విభాగం”.

సీనియరసిస్టెంటుగారు “దయిద్రం ఒదిలింది” అన్నారు హెడ్ గుమాస్తా గారి వైపు చూస్తూ. నాకూ అలాగే అనిపించింది.

హెడ్ గుమాస్తా గారి ముఖం ఎర్రబడిపోయింది. “ఏం వదలటం అండీ. వెళ్తా వెళ్తా అంతా పెంటేట్టేసి వెళ్తేనీ” అన్నారు.

“అవున్నిజమే సార్, ఆ మాట ఆలోచించలేదు”

“ఏరా మణీ, బంట్రోతు లెటర్స్ తీసికెళిపోయేడా సార్ కేబిన్ లోకి?”

“లేద్సార్, ఇంకా సార్ రాలేదు.”

“పైకి పోయి నేనిమ్మన్నానని చెప్పి ఆ లెటరిలా తీసుకురా!”

మణి పైకి వెళ్లాడు.

“ఆ లెటరు సార్ దాకా వెళ్తే మొత్తం డిపార్ట్మెంట్లో మన పరువు పోయినట్టే కదా. అంటే మనవూఁ విషయం చెప్తావనుకోండీ. నాన్ కోపరేటివ్ గా బిహేవ్ చేస్తనాడనేసి. కానీ సార్ ఓ మాటైతే అడుగుతాడు కదా పైకి పిలిచి! మనం నిలబడి జవాబు చెప్పాలి కదా. ఎంత దయిద్రంగా ఉంటదా సిట్యువేషను?” అన్నారు.

నేనూ అవునన్నాను.

“తత్తుకొడుకున్రానీయండి చెప్తాను,” అన్నారు హెడ్ గుమాస్తా గారు.

మణి లెటరు తీసుకువచ్చే లోపలే టైపిస్టు వచ్చేశాడు. వస్తూ విష్ చేసేడు కానీ ఎవరం రెస్పాండ్ కాలేదు. మణి లెటర్ తెచ్చి హెడ్ గుమాస్తా గారి చేతుల్లో పెట్టేడు. ఆయన దబ్బపండు చాయ ముఖంలో ఏం తేడా అయినా ఇట్టే తెల్సిపోతుంది. లెటర్ చదువుతూ ఎర్రగా అయిపోయిందాయన ముఖం. టైపిస్టు మాత్రం ఇదంతా ఏం తెలీదు కాబట్టి ఏదో తన మానాన కొట్టుకుంటున్నాడు. హెడ్ గుమాస్తా గారు నిశ్శబ్దంగా లేచి టైపిస్టు టేబిల్ దగ్గరికి వెళ్లారు. టైపిస్టు ఏంటన్నట్టు లేవబోతుంటే కూర్చోమని సైగ చేసి తను కూడా పక్కనో స్టూలుంటే లాక్కుని అతనికెదురుగా కూర్చున్నారు.

“ఈ లెటరొకటి కొద్దిగా మార్చి రాయాలి. నేను డిక్టేట్ చేస్తాను మీరు కొట్టిపెట్టండి,” అంటూ టైపిస్టు లెటర్ని అతని చేతికే ఇచ్చారు. అదీ హెడ్ గుమాస్తా గారంటే!

టైపిస్టు ఆ లెటర్ ని వినయంగా చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ లెటర్లోకి తొంగి చూస్తానే మెల్లగా లేచి నుంచున్నాడు. “ఏంటి సార్ ఇది, మీ దగ్గిరికి ఎలా వచ్చింది?” అన్నాడు.

హెడ్ గుమాస్తా గారు అలాగే బల్ల మీద మోచేతులు నిలబెట్టి వేళ్ళు జతకలిపి అతని ముఖం వంక చూస్తున్నారు.

టైపిస్టు ఇంకా ముఖంలో కంగారు పెరుగుతుంటే మా అందరి వంకా చూసాడు. మళ్ళీ హెడ్ గుమాస్తా గారి వైపే చూసి, “ఏంటి సార్, ఇదెలా వచ్చింది మీ దగ్గిరికి. నేనేదో సార్ కి రాసుకున్నాను నా ప్రాబ్లెంస్…” అన్నాడు.

“ఎలా వచ్చిందో చెప్తాను. ముందు నాకు చెప్పు. సార్ నీకేవైనా చుట్టమవుతాడా?”

“లేదు”

“వేరే రకంగా ఏవన్నా పరిచయమా?”

“లేద్సార్”

“నీ డిపార్ట్మెంట్ హెడ్ ఎవరు?”

“… మీరే”

“మరి రోజూ కళ్ళు ముందుండే నాకు నీ ప్రాబ్లెం ఏంటో చెప్పకుండా నువ్వు తిన్నగా సార్కి ఎందుకు ఉత్తరం రాసేవు?”

“మీకు తెలీదాండి, నా ప్రాబ్లం ఏంటో?”

“తెలుసు… నీ ప్రాబ్లెం ఏంటో తెలుసు. అది నీకు నువ్వు తెచ్చిపెట్టుకున్నదే తప్ప బయటివాళ్ళెవరూ బాధ్యులు కాదనీ తెల్సు. కానీ నువ్వేం రాసావ్ ఈ లెటర్లో… ఆ? చదువయ్యా పైకి చదువూ? ఆళ్ళ గురించి నాలుగు మంచి మాటలు వినాలనుండదా నీ కొలీగ్స్కి?”

టైపిస్టు ఆ లెటర్ అలాగే పట్టుకుని చూస్తుంటే హెడ్ గుమాస్తా గారే బర్రున స్టూలు వెనక్కి జరుపుకుంటూ పైకి లేచి అతని చేతుల్లోంచి లెటర్ లాక్కున్నారు. అందులో రాసున్నది గట్టిగా చదివి వినిపించేరు. మధ్య మధ్యలో ఒక్కో వాక్యం దగ్గర ఆగి, ఒకసారి సీనియరసిస్టెంటు గారికేసి “ఇది మీ గురించి ఈయన అభిప్రాయవండీ,” అనీ, ఇంకోసారి నా వైపు తిరిగి, “ఇదిగో జూనియర్ అసిస్టెంటు గారు మీరు తప్పించుకుంటున్నా అనుకుంటున్నారా, చూడండి మీ గురించేం రాసేడో,” అనీ, ఇంకోసారి మణి వైపు చూస్తూ, “రేయ్, నువ్వూ తప్పిపోలేదు ఇందులో,” అనీ అంతా చదివి, “ఇట్లు, మీ విధేయుడు,” అని పూర్తి చేసారు. తర్వాత టైపిస్టు వైపు చూస్తూ ఉత్తరాన్ని ముక్కలు ముక్కలుగా చింపి ఉండలాగా చేసి అతని టేబిలు మీదే ఓ పక్కన పెట్టారు.

“నువ్వు నీ బుర్రలోకి ఏ చెత్తొస్తే ఆ చెత్త రాసేసి సార్కి పంపేవు. ఆయన ఈ తలపోటు యవ్వారమేదో నన్నే చూసుకొమ్మని పిలిచి దీన్ని నా చేతికిచ్చారు. నేను అక్కడే చెప్పుండచ్చు– నీకు పని రాదనీ, నలుగురితో కలిసి పన్చేసే గుణం లేదనీని. అక్కడే నిన్ను పీకి పారదొబ్బమని ఓ మాట అనేసి ఉండొచ్చు. కానీ ఒకడి కడుపు కొట్టే పన్లు నేనెప్పుడూ చెయ్యను. అంత నీతిలేని లంజాకొడుకుని కాదు.”

టైపిస్టు, “మీ గురించేం రాయలేదు అందులో…” అనేదో గొణగబోయాడు.

“నా డిపార్ట్మెంటు నంటే నన్ను అన్నట్టు కాదా!!” హాలంతా మార్మోగిపోయేలా అరిచేరు హెడ్ గుమాస్తా గారు. నాకైతే వళ్ళు జలదరించిపోయింది. సీనియరసిస్టెంటు గారు సీట్లోంచి లేచి, “సార్ సార్ మీరు ఆవేశపడొద్దు,” అంటూ దగ్గరకు రాబోతుంటే ఒక చేతో దగ్గరకు రావద్దన్నట్టు ఆపారు హెడ్ గుమాస్తా గారు. కొంతసేపు అలాగే నిలకడగా ఊపిరి పీల్చుకుని తర్వాత మాట్లాడేరు. “నువ్వు చేసింది లత్కోరు పని. ఓ రకంగా ఎడ్డి పని కూడా. ఎందుకంటే ఇదే ఆఫీసులో పదేళ్ళ పైన సర్వీసుంది నాకు. నన్నిక్కణ్ణించి కదిలిద్దామని ఇదిగో ఇంతమంది ట్రై చేసారు. నా ముందూ, నా వీపెనకాలా కూడాని. మరెందుకు ఏం చేయలేకపోయారు? పైకెళ్ళి నువ్వే ఏ డిపార్టుమెంటు వాళ్ళనైనా అడిగి విను నా గురించి ఏం చెప్తారో. నేను ఏ డిపార్టుమెంటులోనైనా ఇలా అడుగుపెడితే ముందు కూర్చోబెట్టి టీ తెప్పించి తర్వాత మాట్లాడతారు. ‘ఏం పుణ్యం చేసుకున్నాం సార్ ఇవాళ’ అన్నట్టు రిసీవ్ చేసుకుంటారు. నా పేరు పలికితే పనులు చేసిపెట్టే మనుషులున్నారు పైన. ఆఖరికి సార్ కూడా ఆయనింట్లో ఏదైనా ఫంక్షనుంటే ఫస్టుకంట ఇన్విటేషనొచ్చేది నాకు. ఏవనుకుంటున్నావ్… ఈ సీట్లో కూర్చుని గచ్చకాయలాడుకున్నా ననుకున్నావా ఇన్నేళ్ళూని? ఇదిగో ఇదే మొదటిసారీ ఆఖరుసారీని చెప్పటం. నువ్వుంటే ఈ సీట్లో ఉంటావు. లేకపోతే సీటు సర్దుకుని ఇంటికెళిపోతావు. రెండే దార్లు.”

అప్పటికి కాస్త ఆవేశం తగ్గి గొంతు కాస్త అనునయంగా మార్చి మాట్లాడారు. “కాదయ్యా, నీకు ఇంతకన్నా మంచి డిపార్టుమెంటూ, ఇంతకన్నా మంచి కొలీగ్సూ అసలు వేరే ఎక్కడన్నా దొరుకుతార నుకుంటున్నావా? ఇదే పని నువ్వింకెక్కడైనా చేసుంటే అప్పుడు తెలిసొచ్చును నీకు. నలుగురు మంచోళ్ళ మధ్యన మంచిగా ఉంటానికేంటయ్యా నీకు బాధ? ఆ…? కూర్చో యింక,” అని తన సీటు దగ్గరికి నడిచారు.

నాకైతే తుఫాను వెలిసినట్టే అనిపించింది. ఆయన సీట్లోకెళ్ళి కూర్చున్నాకా కూడా ఎవరం ఏం మాట్లాడలేదు. సీనియరసిస్టెంటు గారే కాసేపటి కదిలించారు, “జడిపించేహేరు సార్ మొత్తానికి,” అంటూను. “ఆయన అప్పుడపుడూ అయినా అలా విశ్వరూపం చూపిత్తేనేనండీ, మనవిలా ఉండగలిగేది,” అన్నాను నేను.

హెడ్ గుమాస్తా గారు మురిపెంగా నవ్వుతూ అన్నారు, “నన్నెవరూ గిల్లనంతవరకే నండీ,” అని.

* * *

ఆ రోజు రాత్రే ఒక విషయం జరిగింది. నేను ఆ రోజు సెకండ్ షో సినిమాకి వెళ్ళాను. ఆ ఎదవ థియేటరు ఊరంతటికీ చివార్న ఉండేది. బూతుబొమ్మలు తెచ్చేస్తూ ఉంటారు ఎక్కువగా. కానీ ఈసారి పాత సినిమా మంచిది ఒకటి తెచ్చేరు. పాటలు బాగుంటాయని వెళ్ళాను. జనం వచ్చిందే తక్కువ. వచ్చిన కొద్దిమందీ సినిమా ఇలా వదలగానే సైకిళ్ళెక్కి ఇట్టే మాయమైపోయారు. రిక్షాలు కూడా లేవు. నేను అప్పుడికే ప్రింటు బాలేని సినిమాకి ఎందుకొచ్చాంరా దేవుడా అనుకుంటున్నాను. ఇప్పుడు నడిచిపోయే కష్టం ముందుండే సరికి ఇంకా నీరసం వచ్చేసింది. సరే, బాట్రీ లైటు ఊపుకుంటూ నడిచి వెళ్తున్నాను రోడ్డు వారని. ఊళ్ళోకి వచ్చేసి, ఒక వీధిలో పోతే కుక్కలుంటాయని గుర్తొచ్చి, ఆ పక్క వీధిలోకి మళ్ళాను. అది మొత్తం ఊరికే చెడ్డపేరు తెచ్చిన వీధి. అడుగుపెడితే ఎవరూ లేరన్నట్టే అనిపించింది కానీ, కాస్త దూరం నడిచేసరికి ఏదో అలికిడి తెలిసింది. ఒకే ఒక్క వీధిలైటు ఆ చివర కనపడుతుంటే బాట్రీ లైటు ఆపేసి వడివడిగా నడుస్తుంటే, “ఓసార్ ఏవండీ జూనియరు గారు ఆగండాగండి” అని గట్టిగా వినిపించింది.

వెనక్కి తిరిగి చూస్తే ఓ ఇంటి అరుగు మీద నవారు మంచం తడికెలాగా అడ్డం నిలబెట్టి ఉంది. దాని వెనక నుంచి పంచె అంచులు చేతుల్లో ఊపుకుంటూ వీధిలోకి అడుగుపెడుతున్నాడో మనిషి. నవారు మంచం వెనక ఏవో నీడలు మాట్లాడుకుంటున్నాయి గుడ్డిదీపం వెలుగులో. ఒక నీడేదో గట్టిగా మాట్లాడింది కూడా. దానికి జవాబుగా “రేయ్ నా గ్లాసుగానీ, ముక్కలుగానీ కదిపినట్టు తెలిసిందో…” అని వెనక్కి వేలు ఊపుతున్నాడు టైపిస్టు. నా ముందుకొచ్చి నిలబడ్డాకా గుర్తు పట్టగలిగాను అతని గొంతు కానీ, వాలకం కానీ.

“నమస్తే సార్… ఇయ్యేళప్పుడు ఈ వీధమ్మటా ఎల్తన్నారు. ఆఁ ఆఁ…!” అని ఆరా తీస్తున్నట్టు వెకిలిగా నవ్వుతున్నాడు.

అసలు ఆ మనిషి అలా నవ్వగలడని, అలా మాట్లాడగలడని నేనెప్పుడూ ఊహించలేదు. సినిమా నుంచి వస్తున్నానని చెప్పాను.

“అవునా, సరేమరి పదండి మీరొక్కళ్ళూ ఒంటరిగా ఎల్లగలరా. ఉండండి ఆ లైటు దాకా దింపేహొత్తాను. అసల్రోజులేం మంచిగా లేవు,” అని కికిక్కీ మని నవ్వుతూ వాసన కొడ్తున్న వంటితో నా భుజం చుట్టూ చెయ్యి వేసాడు.

నేను విదిలించుకున్నాను. “బాగా ఎక్కినట్టుంది” అన్నాను.

“అయ్యో అదేంటండీ, మనం మనం ఫేమిలీ కదా. మరి ఏదో ఫ్రెండ్లీగా చెయ్యేస్తే తీసేస్తన్నారేంటి?” అన్నాడు.

“ఆలస్యం అయింది కదా. ఇంతకీ మీ ఇల్లు ఇక్కడేనా,” అన్నాను పొరబాట్న.

“ఆ ఇక్కడే. ఈ వీధి వీధంతా మా ఇల్లే. చాలామంది పెళ్లాలున్నారిక్కడ నాకు. మొన్నా లంజొడుకు అన్నాడు కదా… సెకండ్ ఫేమిలీ మైంటైన్ చేస్తనావా అని. థర్డ్ ఫోర్తూ కూడా ఉన్నాయిక్కడ. రండి పరిచయం చేస్తాను,” అని చెయ్యి పట్టుకుని లాగబోయాడు.

“వద్దులెండి. పొద్దున్న కలుద్దాం,” అని నేను వెనక్కి తిరిగి నడిచాను.

అయినా మళ్ళీ వెనక నుంచి వచ్చి చేయేసి మీద వాలిపోతూ వెంట అడుగులేస్తున్నాడు. “కాదండీ నాకోటి అర్థం కాకడుగుతున్నా చెప్పండి. మీరంతా ఎందుకు ఉంచుకున్న ముండల్లాగా ఎప్పుడూ ఆ హెడ్ గుమాస్తాని పిసుకుతూ ఉంటారు” అంటున్నాడు.

నేను బలం కూడదీసుకుని భుజం చుట్టూ కొండ చిలువలాగా చుట్టుకున్న అతని చెయ్యి విప్పదీసి పక్కకి విసిరేసాను. ఆ విసురుకి అంత మనిషీ, పైగా తాగున్నాడేమో, నిలదొక్కుకోలేక లుంగీ తొక్కుకుని తూలి ముందుకి పడ్డాడు మోకాళ్ళ మీద.

ఓ క్షణం ఆగి లేపుదామా అనుకున్నాను కానీ మళ్ళీ ఎందుకులెమ్మని తిరిగి నడిచాను.

వెనక నుంచి అతని అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. రేయ్ కొజ్జా నాకొడకా ఆగరా నువ్వలాగ. మీరూ మీ బతుకులూ… త్ఫూ! ఒక్కొక్కడి బాగోతం తెలుసు నాకు. ఏఁ నాకు హెడ్డాఫీసు ఎడ్రస్ తెలీదనుకుంటున్నారా ఏంట్రా? ఎక్కడికి ఏం రాయాలో, ఎలా రాస్తే మీకు తగలాల్సిన చోట తగులుద్దో నాకు బాగా తెల్సురా,” అని లేచి వెనకాల నడుస్తూ అరుస్తున్నాడు. ఇందాక అతను దిగొచ్చిన ఇంటి నుంచీ ఇంకెవరో మనుషులు వీధిలోకి వస్తూ నీడల్లాగా కనిపిస్తున్నారు. నాకు భయమేసి కాళ్ళ సత్తువ కొద్దీ పరిగెట్టేను.

అతను ఓ చోట ఆగి పోయి విరగబడి నవ్వుతున్నాడు, “రేయ్, కుచ్చిళ్ళు జారిపోతాయేమో నెమ్మదిగా పరిగెట్టు…” అంటూని.

ఇంటికెలా వచ్చానో, తలుపు తీసానో, గెడ వేసానో ఏం చేసానో, కాస్త నిమ్మళించేసరికి మంచం మీద ఉన్నాను. తర్వాత కూడా నిద్ర పట్టలేదు. ఆలోచనలు బుర్రంతా పిచ్చి గీతల్లా పాకేస్తున్నాయి. ఏం చేయబోతున్నాడు, ఏం జరగబోతుంది… ఏవో పిచ్చి భయాల్తోని ఎప్పటికోగానీ నిద్ర పట్టలేదు.

* * *

పొద్దున్న లేచిన వెంట్నే హెడ్ గుమాస్తా గారి ఇంటికి వెళ్లాను. ఎందుకో జరిగింది ఆయన చెవిన వేస్తే మంచిదనిపించింది. ఆయనప్పుడే ఆసనాలవీ పూర్తి చేసుకుని పేపరు చదువుకుంటున్నాడు. “రండ్రండ”ని కటకటాల గదిలో కూర్చోబెట్టి టీ ఇప్పించి విషయం అడిగాడు.

నేను రాత్రి జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పాను. ఆయన పడక్కుర్చీలో వెనక్కి వాలి చూపుడు వేలి చివర్న బొటన వేలు అలవాటుగా తిప్పుకుంటూ, కాళ్లాడిస్తూ అంతా విన్నారు. కాసేపటికి వినాల్సిందంతా విన్నాకా గడప వైపు ఎండలోకి పరాగ్గా చూస్తూ ఏదో ఆలోచించుకుంటూ కూర్చున్నారు. “ఓ పని చేయండి”అనేదో చెప్పబోయి, మళ్ళీ “సర్లే మీరొద్దు లెండి నేం చూసుకుంటాను,” అన్నారు. నేను సెలవు పుచ్చుకుని వచ్చేశాను.

* * *

ఆఫీసుకి ఏం జరుగుతుందా అని కాస్త కుతూహలం, కాస్త జంకుతోనే వెళ్లాను. టైపిస్టు ఇంకా రాలేదు. హెడ్ గుమాస్తా గారూ, సీనియరసిస్టెంటుగారూ ఉన్నారు. అంతా మామూలుగానే ఉంది. విష్ చేసి కూర్చుని పని మొదలుపెట్టాను.

మా ఆఫీసు బ్రిటీషు వాళ్ళ కాలంలో కట్టింది. అపుడు దొరలు నేరుగా లోపలికి గుర్రాలేసుకుని వచ్చేందుకు వీలుగా ద్వారబంధాలు అంతెత్తున కట్టారంట. అంతెత్తు గుమ్మంలోంచీ టైపిస్టు వస్తుంటే ఒక మనిషి గుర్రం మీద కూర్చున్నంత ఎత్తున్న ఆకారం వస్తున్నట్టే ఉండేది, అతను ఎంత గూనిగా, చేతులు వేలాడేసుకుని నడిచినా గానీ. అతను లోపలికి వచ్చేటప్పుడు ఎవర్నీ విష్ చేయలేదు. నా వైపైతే అసలు చూడను కూడా చూడలేదు. నిన్న రాత్రి వాలకానికీ ఇవాళ ఈ మనిషికీ అసల సంబంధమే లేదు.

కాసేపటికి హెడ్ గుమాస్తా గారు, “ఏవయ్యా, మొన్న కొట్టిపెట్టమన్నాను సర్వే రిజిస్టరు, ఇలా పట్రా?” అన్నారు.

టైపిస్టు లేచి పేపర్లు తీసుకుని హెడ్ గుమాస్తాగారి టేబిల్ దగ్గరికి వెళ్ళాడు.

ఆయన పేపర్లు కాసేపు తిప్పి చూశారు. “మధ్యమధ్య ఖాళీలు ఇయ్యెవడు నింపుతాడు?”

“నెంబర్లూ, కొలతలూ వేయాలి సార్. అయి వేరే ఫైల్లో ఉన్నాయి” అన్నాడు.

“అదే, ఆ వేరే ఫైల్లోంచి ఎవడు తెచ్చి నింఫుతాడని?”

“తర్వాత పెన్నుతో నింపుదామని…”

హెడ్ గుమాస్తా గారు ఒక్కసారి పేపర్లన్నీ అతనికి తగిలేలా విసిరేశారు. “నీకు ఫైలు నిన్ననగా ఇవ్వమన్నాను. ఈ రోజుక్కూడా సగం సగమే అయ్యింది. ఏం, ఇవి కొట్టేటప్పుడే పాత ఫైలు పక్కనపెట్టుకుని ఆ నెంబర్లు కూడా కొట్టలేవా?”

అతను కిందపడిన పేపర్ల వంక కూడా చూడకుండా అలాగే హెడ్ గుమాస్తా వైపు చూస్తున్నాడు, చేతులలాగే వేలాడేసుకుని.

“మాటంటే కోపం వచ్చేస్తుంది, బుసలు కొట్టేస్తున్నావు. మరి అలాంటప్పుడు పని సరిగ్గా చేయీ..!”

“మణిని అడిగేనండి ఫైలు. రికార్డు రూంలో ఉంది తెచ్చుకోమన్నాడు.”

“అయితే?”

“అది నా పని కాదు కద సార్.”

“ఏదెవరి పనో నేను డిసైడ్ చేస్తాను ఇక్కడ, అందుకే ఉంది.”

“కాదండీ, ఫైల్ తెచ్చియ్యాల్సిన అటెండర్ని అంటం మానేసి నన్నెందుకు అడుగుతున్నారో అర్థం కావటం లేదు…”

సీనియరసిస్టెంటుగారు మధ్యలో కల్పించుకున్నారు, “ఎందుకండీ మాటకి మాట సమాధానం… రండి నేను చూపిస్తాను ఆ ఫైలు,” అని లేచారు.

అతను వంగలేనట్టు వంగి పేపర్లన్నీ ఏరి ఒజ్జిపెట్టుకున్నాడు. రికార్డు రూం వైపు నడిచాడు. సీనియరసిస్టెంటు గారు కూడా అతని వెనక వెళ్లారు.

వాళ్ళిద్దరూ అలా లోపలికి వెళ్ళారో లేదో, ఉన్నట్టుండి మణి పక్క గుమ్మంలోంచి వచ్చి తిన్నగా రికార్డు రూం లోకి దూసుకుపోయాడు. రికార్డు రూం తలుపు దబ్బున మూసుకుపోవటం, లోపల్నుంచి పెద్ద శబ్దాలూ, అరుపులూ వినపడటం వెంటవెంటనే జరిగిపోయాయి.

నా కాళ్ళు విపరీతంగా ఒణికి కదల్లకపోయాను. హెడ్ గుమాస్తా గారు నా వైపు చూసి భరోసాగా నవ్వేరు. ఎప్పుడో గాని ఆయన అలా నవ్వటం నేను చూడలేదు. లోపల ఏదో పడిపోయిన శబ్దం వినిపించింది. అప్పుడు లేచారు హెడ్ గుమాస్తా గారు. వళ్ళోని అట్టనీ, ఫైలునీ జాగ్రత్తగా తీసి టేబిలు మీద పెట్టి, కాయితాలు ఎగిరిపోకుండా రూళ్ళ కర్ర తీసి ఒత్తుపెట్టి, పొట్టకింద కాటన్ చొక్కా మడతలు నింపాదిగా సాఫు చేసుకుని, రికార్డు రూం వైపు నడిచారు.

* * *

ఆయన కూడా రికార్డు రూంలోకి వెళ్ళిపోయాకా హాల్లో నేనొక్కడ్నే మిగిలాను. బల్లల మీద కాయితాల గాలికి కదులుతున్నాయి. కిటికీ రెక్క కొట్టుకుంటోంది. అది తెరుచుకున్నప్పుడు బయట రావిచెట్టు ఆకులు ఎండలో కనిపిస్తున్నాయి. నా గుండె అదురు కాస్త తగ్గింది.

లోపల చప్పుళ్ళు తగ్గాయి. ఇక సత్తువ తెచ్చుకుని లేచాను. రికార్డు రూం బరువైన తలుపు లోపలకి తోస్తే లోపల్నించి సీనియరసిస్టెంటుగారి ముఖం తొంగి చూసింది.

“ఏంటిసార్, ఏమవుతుంది,” అన్నాన్నేను కంగారుగా.

ఆయన చిన్నగా నవ్వి, సరే రండి అన్నట్టు చేత్తో సైగ చేసి తలుపు వారగా తెరిచారు. వెళ్ళాను.

లోపల ఒక పెద్ద ఫైళ్ళ చెక్క అల్మరా మొత్తం ఓ పక్కకి ఒరిగిపోయి ఉంది. టైపిస్టు గోడకి ఆనుకుని కూలబడిపోయున్నాడు. మణి అతని జుట్టు పట్టుకుని కిందకీ పైకీ గుంజుతున్నాడు. హెడ్ గుమాస్తా గారు అతని ముందు అడ్డంగా నిల్చుని చేతులు నడుం మీద ఆన్చి, “నీయ్యమ్మా లంఝకొడకా… నీదసలు మనిషిపుట్టుకేనారా, మనిషివేనా నువ్వసలు” అని తిడుతున్నారు. సీనియరసిస్టెంటు గారు తలుపు వేసేసి నా పక్కకి వచ్చి నిల్చున్నారు. నేను ఆయన వైపు చూసేసరికి నవ్వుతూ చేతులు ఒరాంగుటాన్ లాగా పెట్టి పక్కలకి ఊగినట్టు నడుస్తూ టైపిస్టు ముందుకెళ్లాడు.

టైపిస్టు లేవటానికి ప్రయత్నం చేస్తుండటంతో మణి తన మోకాలు అతని మెడ మీద వేసి ఇంకా కిందకి నొక్కుతున్నాడు. టైపిస్టు ఒక్కసారిగా వికృతంగా అరుపుల్లాగా ఏడవటం మొదలుపెట్టాడు. అతని ఏడుపు మొహాన్ని మాకు చూపించటానికి మణి జుట్టుతో అతని తల వెనక్కి వంచాడు.

టైపిస్టు ముఖమంతా చెమట్లూ, కన్నీళ్ళూ, పెదాల్దగ్గిర రక్తంతో కలిసిపోయి బందబందగా వుంది. గొంతుకాయ పైకీ కిందకీ కదుల్తోంది.

ఎలాగో బలమంతా కూడదీసుకుని దిగ్గున లేచాడు. మీదకు రాబోతున్న సీనియరసిస్టెంటు గారిని గెంటేసి తలుపువైపు పరిగెత్తాడు నా పక్కనుంచి.

నాకు అంత బలం ఎలా వచ్చిందో నాకే తెలీదు- అప్పటికే నన్ను దాటిపోయిన అతని కాలర్ని వెనక నుంచి పట్టుకున్నాను. ఇంకో చెయ్యి మెడ చుట్టూ బంధం వేశాను. కానీ ఆ ఎద్దులాంటి మనిషి నన్నూ తనతో తలుపు దాకా లాక్కుపోయాడు. నా ఒక కాలు తలుపుకి తన్నిపెట్టి అతన్ని కింద పడేసాను. అతని వీపు మీంచి నేను పైకి లేస్తుంటే మణీ, సీనియరసిస్టెంటు గారూ, హెడ్ గుమాస్తా గారూ నా వైపు కదిలారు, మెచ్చుకోలుగా చూస్తూ.

June 6, 2016

‘బర్నింగ్‌ ఇష్యూ’ బారిన తెలుగు కథ

‘‘సింహాల తరఫున చరిత్రకారులు వచ్చేవరకూ వేట చరిత్ర ఎప్పుడూ వేటగాడినే కీర్తిస్తుంది’’ అన్న చినువా అచెబె మాటొకటుంది. అయితే మన తెలుగు సాహిత్యంలో అటు సింహాలూ ఇటు వేటగాళ్ల చరిత్రల్ని కూడా హైనాలే రాస్తున్నాయి. హైనాలంటే నా ఉద్దేశం ఇటీవలి తెలుగు కథకులు. హైనాలకి అంటగట్టే నీచ గుణాల్ని వీరికి ఆపాదించటం లేదు నేను. వారు ఇరుపక్షాలతోనూ సంబంధంలేని థర్డ్‌పార్టీలని చెబుతున్నాను. హైనాకు అటు వేటగాడితోనూ, ఇటు సింహంతోనూ సంబంధం ఉండదు. వేట ఫలితం మాత్రం కావాలి. ఈ కథకులు కూడా అటు పీడకులు, ఇటు పీడితుల గురించి లోతైన అవగాహన లేకున్నా కేవలం వార్తలకెక్కిన సంఘటనల నుంచి కథలు పిండుతున్నారు.

ఇది మరీ బ్రాడ్‌ జనరలైజేషన్ అనిపిస్తే క్షమార్హుణ్ని. నన్ను నేను కథకుడిగానే చూసుకుంటాను. తెలుగులో నేను ప్రేమించే కథకులూ ఉన్నారు. కానీ ఈమధ్య తెలుగు కథకు మరీ గ్రాండ్‌ థీమ్స్‌ కావాల్సొస్తున్నాయి. మామూలు మనుషుల్ని జీవిత పరిధిలో తాకే అనుభవాలు కాదు; రాష్ర్టాన్నో దేశాన్నో కుదిపే విషయాలైతేనే కథకుల పెన్నులు కదులుతున్నాయి. నిర్భయ కేసో, భూసేకరణో, బీఫ్‌ గొడవో, చివరికి చెన్నై వరదలో... ఇలాంటి సంఘటనల కోసం వెతుక్కుంటున్నాయి. పేపర్లూ, న్యూస్‌ఛానెల్సూ ఫాలో కాని వారికి కూడా ఈ కథలు చదివితే సమకాలీన సమాజంలో బర్నింగ్‌ ఇష్యూస్‌ ఏంటో అర్థమవుతాయి. తెలుగు సినిమాల గురించి కూడా ఎవరూ ‘దేని మీద తీశారూ?’ అని అడగట్లేదు, కానీ ఈ కథలు మాత్రం ‘దేని మీద రాశారూ’ అని అడిగితే జవాబులొచ్చేట్టుగా ఉంటున్నాయి. ఆ జవాబులు కూడా ‘ఏపీలో భూసేకరణ మీద’, ‘నిర్భయ కేసు మీద’, ‘రోహిత్ ఆత్మహత్య మీద’ ఇలా పత్రికల పతాక శీర్షికల్ని తలపిస్తున్నాయి.

ఇలాంటివి రాసేవాళ్లు ఏ ధైర్యంతో రాస్తున్నారా అని ఆశ్చర్యం కలుగుతుంది. జీవితంలో కులపరంగా ఏ వివక్షా ఎదుర్కోని నన్ను కూర్చోపెట్టి దళిత కథ రాసేయమంటే రాయలేను. సొంతానికి భూమి ఉండటం అంటే ఏంటో తెలీని నన్ను భూమి పోగొట్టుకోవటం గురించి కథ రాసేయమంటే రాయలేను. ఈ మాటంటే ఒక ఎదురువాదన చేయవచ్చు. జంతువులకు లేనిదీ మనుషులకు ఉన్నదీ ఒక లక్షణం సహానుభూతి, అవతలివాళ్ల స్థానంలో మనల్ని నిలబెట్టుకొని ఆలోచించగలగటం. ఈ సహానుభూతి తోనే పీడితుల సమస్యల్ని గ్రహించి రాస్తున్నామని ఈ మాదిరి రచయితలు వాదించవచ్చు. మరో వాదన కూడా చేయవచ్చు. అదేమిటంటే ప్రతి మనిషిలోనూ రకరకాల వ్యక్తిత్వాంశలు ఉంటాయి. కొన్ని అణచివేయబడి, మరికొన్ని వ్యక్తమవుతూ ఉంటాయి. ఒకే మనిషిలో అమిత కరుణాత్మకమైన, అత్యంత క్రూరమైన అంశలు ఉండి సందర్భాన్ని బట్టి బైటపడటం, పడకపోవటం జరుగుతుంది. ఆ మనిషి రచయిత ఐతే తనలోని వేర్వేరు అంశలకే తీక్షణత దట్టించి వేర్వేరు పాత్రల్ని సృష్టించగలుగుతాడు. హామ్లెట్‌ నుంచి షైలాక్‌ దాకా అందరూ షేక్‌స్పియర్‌ లోనే ఉండుంటారు. అయితే ఇలా బర్నింగ్‌ ఇష్యూల్ని కథలుగా మలిచే రచయితలకి ఈ సుగుణాల్ని ఆపాదించలేను. కారణం చెప్తాను. నాలోంచే ఒక హంతకుడ్ని, ఆదర్శవాదిని పాత్రలుగా సృష్టించగలను. కానీ ఒక దళితుడ్ని, పత్తి రైతునీ సృష్టించలేను. ఎందుకంటే మొదటివి వ్యక్తిత్వాంశలు, రెండోవి సామాజిక ఐడెంటిటీలు. మనవి కాని సామాజిక ఐడెంటిటీలను సహానుభూతితో దగ్గరగా పరిశీలించి కొంతమేరకు అర్థం చేసుకోగలం. కానీ ఎంత లోతుకెళ్లినా జన్మతః ఆ ఐడెంటిటీని మోస్తున్నవాడిలాగా దాన్ని పూర్తిగా ఆవాహన చేసుకోగలమా? (చేసుకోగలమూ అనేవాళ్లు మనిషి లోతుల్ని తక్కువ అంచనా వేస్తున్నారనైనా అనుకోవాలి, లేదా మనిషి వర్గపరమైన స్థానమే అతని లోతులన్నింటినీ నిర్ధారిస్తుందనే మార్క్సిస్టులనైనా అనుకోవాలి). వివక్ష లోతూ విస్తారమూ తెలీని రచయితలు పైపై పరిశీలనలతో రాస్తే దాని తీవ్రతను తేలికచేసినవాళ్లవుతారు. సమస్యకు చేటు చేసినవారవుతారు. పీడితపక్షం వహించటం ఎప్పుడూ ఆదర్శమే. కానీ ‘పాపం పీడితులూ’ అన్న మన ఉదాత్తమైన సానుభూతే వాళ్లకు మంచి చేయదుగా.

ఇలాంటి కథలు ఎక్కువగా ఇంటర్నెట్‌ పత్రికల్లో, సోషల్‌ మీడియాలో మసలుకునే రచయితల నుంచే రావటం యాదృచ్ఛికం కాదు. మనం ప్రస్తుతం సమాచార కుమ్మరింపుతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రపంచంలో ఉన్నాం. సోషల్‌ మీడియాలో సమాచారంతో పాటు దానిపై అభిప్రాయాలూ వెల్లువలా వచ్చిపడుతూంటాయి. అటోయిటో తేల్చుకొమ్మనే విభజనలుంటాయి, నలుపూ తెలుపుల వైపు నెట్టివేతలుంటాయి. ఈ వర్చువల్‌ అవాస్తవికతలో అందరితో పాటూ రచయితలూ కొట్టుకుపోతున్నారు. నిర్భయ ఘటన తర్వాత అంతకన్నా దారుణమైన అన్యాయాలు జరిగాయి. అయితే నిర్భయ సమయంలో వెలిగినన్ని కొవ్వొత్తులు అప్పుడు వెలగలేదు. ఆ కొవ్వొత్తుల ర్యాలీల్లో పాల్గొన్నవారి ఆవేశం తర్వాత కొవ్వొత్తులంత త్వరగానూ కరిగిపోయిందనుకోవాలి. ఇలా బర్నింగ్‌ ఇష్యూల మీద ఎడాపెడా కథలు రాస్తున్న రచయితలు ఈ కొవ్వొత్తి ఉద్యమకారుల్లాంటి వారేనని నాకపిస్తుంది. వారి స్పందన తాత్కాలిక భావోద్వేగాలపై ఆధారపడినది. భావోద్వేగానికి ఇంధనం భావోద్వేగమే. దానికి కారణాలతో, మూలాలతో నిమిత్తం లేదు. ఆరేదాకా మండాలి, అంతే. అయితే సమస్య మూలాల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తే భావోద్వేగం కాదు, నిర్మాణాత్మకమైన వివేచన ఉంటుంది. అలాంటి వివేచన నప్పే ప్రక్రియ వ్యాసం. కానీ వ్యాస ప్రక్రియకు ఇక్కడ ఆదరణ లేదు. తెలుగులో రాసేవాళ్లకీ చదివేవాళ్లకీ (నిజానికి ఇప్పుడీ రెండూ వేర్వేరు వర్గాలు కూడా కాదు) కావాల్సింది నిలిచి వెలిగే కాగడాలు కాదు, రాజుకున్నంత త్వరగానూ చల్లారిపోయే అగ్గిపుల్లలు. అందుకే కథ వైపు వస్తున్నారనుకుంటున్నాను.

మనకు సంఘటనాత్మక/ ప్రాసంగిక కవిత్వం ఎప్పుడూ ఉంది. కొన్ని సందర్భాల్లో అది ఉద్యమాలకు ఊతంగానూ నిలిచింది. నినాదాలు, పాటలతో పాటు తన వంతు సాయం చేసింది. సంఘటనలకు కదిలి రాసిన శ్రీశ్రీ ‘గర్జించు రష్యా’ లాంటి కవిత్వం ఏకాంతంలో పెదాల వెనుక చదవాల్సింది కాదు. ఆ సంఘటనలకు ప్రతిక్రియగా కదిలే సమూహాల మధ్య నిల్చొని ఎలుగెత్తి చదవాల్సిన కవిత్వం. కానీ ఇటువంటి సందర్భాల్లో కథకు స్థానముందా? అదీగాక, గత రెండు మూడు దశాబ్దాలుగా తెలుగునేలను ఊగించిన ఉద్యమాలన్నీ ప్రస్తుతం సాఫల్యానికో, వైఫల్యానికో, ప్రతికూల వేగానికి మ్రాన్పడి దీర్ఘసుషుప్తిలోకో పర్యవసించాయి. రగిలే దృశ్యాలపై ఆబగా మసిలే న్యూస్‌ కెమెరాల కళ్లనే తమ అంతఃచక్షువులుగా స్వీకరించి చాలామంది కవులు కవిత్వం రాస్తున్నారు. ఇలాంటప్పుడు ఈ తరహా రచనలు ఆయా రచయితల సివిక్‌ గిల్ట్‌ను తృప్తిపరచేందుకు తప్ప దేనికి పనికొస్తున్నాయి?

కళాకారుల పని సమస్యలకు పరిష్కారాలు వెతకటం కాదని, సమస్యలను విశదంగా ఎత్తిచూపటం మాత్రమేనని చెహోవ్‌ అంటాడు. ‘ఆయా కార్యరంగాల్లోని నిపుణులు మాత్రమే పరిష్కరించగలిగే విషయాల్లో రచయిత వేలుపెట్టకూడదు. అతనికి అర్థంకాని విషయం జోలికి వెళ్లటం వల్ల ఏ మంచీ జరగదు’ అని ఒక ఉత్తరంలో రాస్తాడు. నేటి కథకులు తమవి కాని సమస్యల్నీ, తమకు పూర్తిగా అవగాహనలేని ఐడెంటిటీల్ని తీసుకుని కథలు చెబుతున్నారు. తమ అవగాహనా లోపం వల్ల అనివార్యంగా వచ్చే ఖాళీల్ని అనాయాసమైన ఉదాత్తతతోనో, సెక్యులరిజం, మార్క్సిజం వంటి సైద్ధాంతిక దృక్పథాలతోనో పూడ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మానవ వ్యవస్థలు ఎంతో శ్రమించి నాగరికతకు నప్పే విధంగా కొన్ని దృక్పథాల్ని తయారుచేసుకొన్నాయి. కానీ ఈ కథకుల విషయంలో అవి సమస్యను లోతుకెళ్లి అర్థం చేసుకొనే శ్రమను తప్పించుకొనేందుకు సాకులుగా మాత్రమే పనికొస్తున్నాయి. ఉదాహరణకి, కులమత వ్యవస్థలపై సెక్యులర్‌ దృక్పథం చూపే పాటి అవగాహన ఉంటే చాలు-- బీఫ్‌ గొడవ నుంచి రోహిత్ కుటుంబంలో ఈక్వేషన్ల దాకా అన్నిటికీ జవాబులు దొరికేసినట్టే. ఎంచుకోవటానికి ఏదో ఒక పక్షం లభించేసినట్టే. ఇక పక్షాలు నిర్ధారణ అయిపోయాక కథ పుట్టించటం ఎంతసేపు? నువ్వు మార్క్సిస్ట్‌వైతే రాజ్యం విలన్; నువ్వు సెక్యులరిస్ట్‌వైతే హిందూత్వ విలన్; ఈమధ్య మొలుచుకొస్తున్న రైటిస్ట్‌ కథకుల్లో ఒకడివైతే అసలు సంస్కరణే నీ విలన్ (టిపికల్‌గా వీరిది ‘‘అన్నీ విశ్వనాథ సాహిత్యంలోనే ఉన్నాయిష’’ అనే బాపతు). ఈ కథల్లో పాత్రలు కూడా ఇలాంటి ఐడియలాజికల్‌ చదరంగం ఆడేందుకు పనికొచ్చే పావుల్లా మాత్రమే ఉంటాయి. చదరంగంలో పదహారు బంటులకూ ఏమాత్రం వ్యక్తిత్వాలుంటాయో ఈ పాత్రలకీ అంతే ఉంటాయి. నలుపా తెలుపా అన్న ఒక్క తేడానే వాటి వ్యక్తిత్వాల్ని నిర్ధారించేది. మరే ఛాయల్నీ ఆమోదించే ప్రసక్తే లేదు. ఫలితంగా ఇలాంటి కథలు జరిగిన సంఘటనల్ని తిరిగి కాయితంపై ఆడిస్తూ ఒక పక్షాన్ని మంచిగానూ, మరో పక్షాన్ని చెడుగానూ తీర్మానించటానికే పనికొస్తున్నాయి. రక్తమాంసాలున్న మనుషుల జోలికెళ్తే మంచీ చెడులు అంత సులువుగా తేలేవి కావు గనుక, ఈ కథకులు భావజాలాలకే మనుషుల ముసుగేసి, ఇరు వైపులా ఆట తామే ఆడేసి సమస్యలకు పరిష్కారాలు చెప్పేస్తున్నారు. ఏదో చేశామన్న తృప్తిని మాత్రం పొందుతున్నారు. సామాజికస్పృహతో కొడవటిగంటి, రావిశాస్త్రి, పతంజలి కథలు రాస్తున్నప్పుడూ దినపత్రికల్లో బర్నింగ్‌ ఇష్యూలకు కొదవ లేదు. వారూ చదివి చలించే ఉంటారు. కానీ ఎప్పుడూ ఇలా కథలతో కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించిన గుర్తు లేదు. ఒట్టి సంఘటనల్ని గాక, వాటి వెనుక సమస్యల్ని, సమస్యల్లో మనుషుల్నీ, మనుషుల్ని నడిపించిన కారణాల్నీ పట్టుకొనే ప్రయత్నం చేశారు. వ్యవస్థలో అబ్సర్డిటీ చూసినపుడల్లా ‘పిలక తిరుగుడు పువ్వు’ కథ గుర్తుకు రావచ్చు. వ్యవస్థపై తేలిన పైపై తెట్టునే పతంజలి కథలోకి తీసుకొని ఉంటే ఆ ప్రభావం ఉండేది కాదు.

దృక్పథాలు, నిబద్ధతల పేరిట ఇంకా దబాయింపు సెక్షన్‌లు అమల్లో ఉన్నాయంటే నమ్మకం కలగకపోవచ్చు. ఆమధ్య ఒక సమావేశానికి వెళ్లాల్సి వచ్చింది. తెలుగు కథావరణంలో పరపతి కండువాలున్న కొందరు బుజుర్గ్‌ లోగ్‌ కలిసి యువ రచయితల్ని పిలిచి ఎందుకు, ఏమిటి, ఎలా రాస్తున్నారో చెప్పమన్నారు. వారిలో నేను ఎడిట్‌ చేసిన ఒక వెబ్‌పత్రికకు కథ పంపిన రచయిత కూడా ఉన్నాడు. చిన్న గమ్మత్తయిన ఆలోచనతో రాసిన ఆ కథ బాగుంటుంది. ఇప్పుడీ సమావేశంలో అతని వంతు వచ్చాక ఉన్నదున్నట్టు చెప్పుకొచ్చాడు. కొత్తల్లో కథలకు డబ్బులిస్తారని తెలిసి రాశాననీ, తర్వాత ఎలా రాస్తే పత్రికలు వేసుకుంటున్నాయో అలా రాశాననీ, కథలు చెప్పటంలో మజా తెలిశాకా రాసే తీరులో మార్పువచ్చిందనీ నిజాయితీగా వెల్లడించుకున్నాడు. ఈ పాపానికి తర్వాత మాట్లాడిన పెద్దవాళ్లు అతడ్ని ఓ రౌండ్‌ దులిపొదిలేశారు. డబ్బు కోసం రాయటం నీచమనీ, అతను మార్కెట్‌ శక్తులకు బానిసనీ, అతనికి నిబద్ధత (అంటే మన తెలుగులో ‘మార్క్సిస్టు నిబద్ధత’) లేదనీ విమర్శించారు. అతను తర్వాత మైకు తీసుకుని క్షమాపణగా మున్ముందు నేర్చుకుంటానన్నాడు. నేను ఊపిరి పీల్చుకున్నాను. ఇక మీదట అతనికి చుట్టూ జీవితంలో కళ్లు చెదరగొట్టే వైవిధ్యాన్ని ఓపిగ్గా జల్లెడపట్టాల్సిన బాధ తప్పింది. రోజూ న్యూస్‌పేపర్‌ వేయించుకొంటే చాలు. ఫేస్‌బుక్‌లో ఏ ఇష్యూ ట్రెండింగ్‌లో ఉందో గమనిస్తుంటే సరిపోతుంది.

*
(Published in Andhra Jyothy 'Vividha' page on June 20, 2016)

May 1, 2016

కత్తి భయం

(కినిగెలో పని చేస్తున్నప్పుడు చిన్న చిన్న జాన్ర కథల్ని స్వేచ్ఛానువాదం చేసి మారు పేరు మీద వేద్దామని ఈ కథతో మొదలుపెట్టాను. కినిగె ఆగిపోయాకా దీన్ని 'వాకిలి'కి ఇచ్చాను. ఈ కథకు మూలమైన కథ మీద నాకే ఆసక్తీ లేదు. అది చిన్నదనీ, పేరున్న డాషియెల్ హామెట్ రాసిందనీ మాత్రమే ఎంచుకున్నాను. కానీ అనువదించేటప్పుడు నాకు తెలిసిన వాతావరణం కొంతవచ్చి కలిసింది. అందుకని ఇక్కడ పబ్లిష్ చేస్తున్నాను.)

ఆదివారం కాబట్టి ఓల్డుమాంకు ఓ క్వార్టరూ, అరకిలో చికెనూ గదికి తెచ్చుకున్నాడు రాములు. మందులోకి పావుకిలో ఫ్రై చేసుకున్నాడు, ఇంకో పావుకిలో అన్నంలో కలుపుకుతింటానికి వండుకుందామనుకున్నాడు. ఉల్లిపాయలు తరుగుతుండగా, తలుపు తోసుకుని లోపలికి వచ్చాడు మల్లేషన్న. లక్కపిడతల గదిలోకి రాక్షసాకారం దూరినట్టుంది.

రాములు పని ఆపి ఇటు తిరిగాడు. “అన్నా, ఇలా వచ్చావ్? కూచో” అంటూ గదిలో ఉన్న ఒక్క రేకు కుర్చీ అటు జరిపాడు.

మల్లేషన్న కూర్చున్నాడు. అతని మొహం రాయిలాగా గరుగ్గా ఉంది. వేసుకున్న తెల్లచొక్కా బానపొట్ట మొదలయ్యేదాకా బొత్తాలు విప్పి వుంది. అక్కడ రుద్రాక్షమాల వేలాడుతోంది. మణికట్టుకి కాశీతాడు, కడియాలు ఉన్నాయి.

“చికెను పీసులున్నయి తింటవా?” అన్నాడు రాములు.

“బాలాజీ గాన్ని తీసుకుపోయిర్రు,” అన్నాడు మల్లేషు. అది వార్త చెప్తున్నట్టు లేదు, నిలదీస్తున్నట్టుంది.

“ఎవరే!” అన్నాడు రాములు.

“నీకు తెల్వదా?” ఒక కనుబొమ్మ ఎగరేస్తూ అన్నాడు మల్లేషు.

“నాకెట్ల తెలుస్తదన్నా. సండే మనం గది దాటిపోం,” అంటూ చికెను పీసులున్న కంచం అతని చేతికందియ్యబోయాడు రాములు.

“నీ యవ్వ నకరాలూ!” అంటూ విసిరికొట్టేసరికి కంచం ఎగిరి గోడకి తగిలి కిందపడింది.

రాములు తుళ్ళిపడ్డాడు. కంచం గింగిరాలు తిరుగుతున్న శబ్దానికి మొహం చిట్లిస్తూ, “ఏమైందన్నా!” అన్నాడు.

మల్లేషు కుర్చీలోంచి ఇంతెత్తున లేచి ఢీకొనేంత దగ్గరగా వచ్చాడు. వెనకడుగేస్తున్న రాముల్ని కాలర్ పట్టుకుని దగ్గరగా గుంజుకున్నాడు. ఇద్దరి ఎత్తుల్లో తేడా వల్ల రాములు కాలి వేళ్ళ మీద నిలబడాల్సి వచ్చింది. “రేయ్… ముసల్నాకొడకా. గలీజు మాటలు రానీకు. బాలాజీగాన్ని రాత్రి పోలీసులు పట్టుకున్నరు. గది గుడ సరుకు దాచిన కాడ్నే పట్టుకున్నరు. అక్కడ దాచిపెట్టినమని బయటోనికెవ్వనికి తెల్వదు. నీకు తప్ప.”

రాములు బట్టతల మీంచి చెమటచుక్కలు జరజర జారిపోతున్నాయి. “అన్న! నేనెవ్వరికి చెప్పలేదే. ఒట్టే–”

“థూ నీ!” అంటూ కాలర్ వదుల్తూనే విసురుగా ముందుకు నెట్టడంతో రాములు నేల మీద పడ్డాడు. “రేయ్, పోలీసోళ్ళ దగ్గరికెళ్ళింది నువ్వో కాదో నాకు ఇంకా ష్యూర్ గా తెల్వక ఆగుతున్నా సూడు. ఒకడు తప్పు జేసిండని సక్కంగ తెల్వకుండ నేను వాని జోలికి పోను. నువ్వో కాదో తెల్వనీకి నాకు పెద్ద టైం పట్టదు. కానీ నువ్వేనని తెల్సిందే అనుకో…,” అని ఆగి,పొత్తికడుపు దగ్గర చొక్కా పైకెత్తాడు. అక్కడ పొట్టకీ, బెల్టూకీ మధ్య ఇరికి ఒక కత్తి పిడి కనిపించింది.

రాములు చూపు అక్కడే ఆగిపోయింది.

మల్లేష్ నాలిక మడతపెట్టి చూపుడువేలు ఆడిస్తూ వెనక్కి తిరిగి వెళ్లాడు. వెళ్తూ తలుపు పక్కన నీళ్ళ కుండని పచ్చడిగా తన్నేసి వెళ్ళిపోయాడు.

రాములు పడిన చోట నుంచి లేచి కూర్చున్నాడు. అతని వళ్ళు వణకుతోంది. మొన్న జేమ్స్ ప్రసాద్ గాడి శవాన్ని మోసుకొస్తున్నప్పుడూ ఇలాగే వణికింది. జేమ్స్ ప్రసాదు గాడి పెళ్ళాం వాడు కనపడటం లేదని గగ్గోలు పెడితే రాములూ ఇంకో ఇద్దరూ కలిసి రోజంతా వెతికారు. రైలు పట్టాల పక్కన తుప్పల్లో జేమ్స్ ప్రసాద్ శవం దొరికింది. మెడ తెగ్గోయడంతో తల ఓపక్కకి అసహజంగా ఒరిగింది. రక్తం కంకర్రాళ్ల మీద నల్లగా ఎండిపోయింది. ఈ జేమ్సు ప్రసాద్ చనిపోక రెండ్రోజుల ముందు కల్లుకంపౌండులో ఇదే మల్లేష్ తమ్ముడైన బాలాజీతో గొడవపడ్డాడు. చివర్లో పోలీసులకి రిపోర్టిస్తానని బెదిరించి దూకుడుగా బయటకు వచ్చేశాడు. ఇంతాజేసి పోలీస్టేషన్ వైపు పోయిందీ లేదు పాడూ లేదు. కానీ, అన్నదమ్ములు రిస్కు తీసుకోదల్చుకోలేదు.

అప్పట్నించీ జేమ్సు ప్రసాద్ శవం రాములుకి పదే పదే గుర్తుకు వస్తోంది. వచ్చినప్పుడల్లా భయంతో బుర్రేం పన్చేయటం లేదు. ఇందాక మల్లేష్ ముందు కూడా అదే పరిస్థితి. లేదంటే తన అమాయకత్వాన్ని నిరూపించుకునేవాడే.

రాములు నెమ్మదిగా పైకి లేచి నేల మీద పడ్డ చికెను ముక్కలన్నీ కంచంలోకి ఎత్తుకున్నాడు. వంటగట్టు మీదున్న మందు బాటిలూ, స్టీలుగ్లాసూ తీసుకుని నీళ్ళ కోసం కుండ వేపు వెళ్ళబోయినవాడల్లా పగిలిన పెంకులు చూసి ఆగిపోయాడు. గొణుక్కుంటూ ఉల్లిపాయల కడుగునీళ్ళున్న దాక తీసుకుని గది మూలకి పోయి కూర్చున్నాడు. అక్కడేం లేకపోయినా గోడ వైపే చూస్తుండిపోయాడు. జేమ్సు ప్రసాద్ గతే తనకూ పడుతుందా! చటుక్కున లేచి తలరుద్దుకుంటూ అటూయిటూ పచార్లు చేశాడు. కాసేపటికి తాను ఊరికే పచార్లు చేస్తున్నానని గుర్తొచ్చి మళ్ళీ మూలకొచ్చి కూర్చున్నాడు. పెగ్గు కలుపుకుని, గుటకేసి, గోడకి తల జారేసి కళ్ళు మూసుకున్నాడు. ఆ చీకట్లో ఒక నిజం ముందుకి తన్నుకొచ్చి నిలబడింది. అవును,తను మళ్ళీ ఇక్కడ్నించీ పారిపోబోతున్నాడు! జీవితమంతా పరిగెట్టినట్టే మళ్ళీ పరిగెట్టబోతున్నాడు! ముప్ఫయ్యేళ్ల క్రితమే వెనకడుగు వేయకుండా ఉంటే ఇప్పుడు ఎదిరించి నిలబడగలిగే ఒక అవకాశం అయినా ఉండేది.

ముప్ఫయ్యేళ్ళ క్రితం వైజాగ్ రెల్లి వీధిలో ఒక పేకాట పాకలో గొడవ పెద్దదైంది. గొడవకొచ్చిన వాడు చేపలపడవ మీద కళాసి. మాటా మాటా పెరిగింది. ఇద్దర్నీ ఎగదోయడానికి జనం చుట్టూ చేరడంతో కొట్టుకోవడానికి ఒక చిన్న గోదా లాంటి స్థలం కూడా తయారైంది. రాములు ఎదురుతిరగడానికీ, వెనక్కితగ్గడానికీ మధ్య ఊగిసలాడుతున్నాడు. సరిగ్గా అప్పుడే కళాసీ పంట్లాం వెనుక నుంచి కత్తి తీశాడు. దూలానికి వేలాడుతున్న గుడ్డిబల్బు కాంతిలో తళుక్కుమన్న దాని మొన ఇంకా రాములు జ్ఞాపకంలో వెలుగుతోంది. అది తనలో ఏదో ధైర్యపు నరాన్ని శాశ్వతంగా తెంచేసింది. వెనక్కి తిరిగి జనాన్ని తప్పించుకుంటూ, వాళ్ళ గేలి నవ్వులకు దూరంగా పాక నుండి బయటకు వచ్చేశాడు. ఆ రాత్రి కళాసీ బాగా తాగి వెర్రెత్తి తన కోసం పేటంతా గాలిస్తున్నాడని తెలిసి రాత్రికి రాత్రే ఊరు వదిలిపారిపోయాడు.

అప్పటి నుండీ మొదలైంది, కత్తి అంటే భయం. అంతకుముందు రాములు అంత పిరికివాడు కాదు. నిజానికి తుపాకీ అన్నా అంత భయం లేదు. తుపాకీదేముంది, తూటా సూటిగా దూసుకుపోతుంది. ఆయువుపట్టుకి కన్నం పడితే నొప్పి తెలిసేలోగా ప్రాణం పోతుంది.

కానీ కత్తి అలా కాదు. పదునైన ఇనుము వంట్లో కండని వేరు చేస్తూ లోతుగా చొరబడితే తళుక్కుమనే బాధ. చొరబడి ఊరుకోదు, తూటాలాగా సూటిగా పోదు. దాన్ని చేతిలో ఉంచుకున్న వాడి క్రూరత్వాన్ని బట్టి ఎలా తిప్పితే అలా మెలితిరుగుతుంది. కన్నం చేసి ఊరుకోదు, కెలికి కకావికలం చేస్తుంది.

అందుకే ఆ రోజు పారిపోయాడు. కానీ అది ఒకసారితో ఆగలేదు.

మనం భయపడుతున్నామని తెలిస్తే కుక్కలు ఇంకా వెంటపడతాయని చిన్నప్పుడు రాములుకి ఎవరో చెప్పారు. కత్తులు కూడా అలాగే అతని వెంటపడ్డాయి ఎక్కడకు వెళ్ళినా.‘కత్తిపోటు వల్ల యువకుడి దుర్మరణం’ లాంటి వార్తలు చదివినా అతని ఊహలు వికృతమైన బాధతో మెలితిరిగేవి. తర్వాత బెజవాడలో ఉండగా రెండు గ్రూపుల మధ్య గొడవలో అతను ఇరుక్కున్నాడు. అతను పని చేసే బారు ఓనరు కూతుర్ని ఎవరో ఏడిపించడంతో ఆయన కొందరు మనుషుల్ని పంపిస్తూ రాముల్ని కూడా వెంట వెళ్ళమన్నాడు. బయల్దేరినవాళ్ళు ఆ అమ్మాయి చదివే కాలేజీకి వెళ్ళి ఏడిపించిన కుర్రాళ్ళని బయటకు లాగి కొట్టారు. ఒకడ్ని మంగలి షాపుకి లాక్కుపోయి గుండు కూడా కొట్టించారు. అన్ని తన్నుల్లో రాములూ ఓ తన్ను తన్నాడేమో. తన్నులు తిన్నవాళ్ళకి పొలిటికల్ బలం ఉంది. నాల్రోజుల తర్వాత బారు ఓనర్ని, ఆయన ఫామిలీని ఇంట్లో ఉండగానే కాల్చేశారు. చివరకు ఇదంతా కులాల గొడవగా తయారై, ఆ ఏరియాలో కర్ఫ్యూ కూడా మొదలైంది. అతనితో పాటు గొడవకు వెళ్ళిన వాళ్ళలో ఇద్దర్ని వీధుల్లో నరికేశారని ఆ మధ్యాహ్నమే తెలిసింది. చీకటి పడేదాకా ఓ కన్‌స్ట్రక్షన్ సైటులో దాక్కున్నాడు. తన గదీ, సామానూ, చీటీల మీద రావాల్సిన డబ్బూ అంతా వదిలేసుకుని రాత్రికి బొంబాయికి రైలెక్కేశాడు.

బొంబాయి కూర్లా ఏరియాలో ఒక లాడ్జిలో పనికి కుదిరాడు. పక్కన ఇండస్ట్రియల్ ఏరియాల నుండి స్క్రాపు కూడా కలెక్ట్ చేసేవాడు. కొన్నేళ్ళకు స్టేషన్ దగ్గర టిఫినుబండి నడిపే శ్రీదేవి తో కలిసి ఉండటం మొదలుపెట్టాడు. ఇద్దరూ ఆదివారాలు మంచి బట్టలేసుకుని బీచికి వెళ్ళడం, పావ్ బాజీ తిని, సినిమా చూసి రాత్రెప్పుడో రైలెక్కి గదికి రావడం… రోజులు బాగా గడుస్తున్నాయనుకున్నాడు. ఈలోగా అక్కడ లోకల్ భాయ్ దగ్గరి టపోరీల్లో ఒకడు ఆమెను కోరుకున్నాడు. వాడి కాలర్ పట్టుకుని తన్నటం అటుంచి తను ప్రవర్తించిన తీరుకి శ్రీదేవి చూసిన చూపు రాములుకి ఇంకా గుర్తుంది. ప్రేమగా నవ్వే పెదాలు జుగుప్సగా విచ్చుకోవడం చూశాడు. అయినా అవతలివాడికి ఎదురెళ్ళలేకపోయాడు.

తర్వాత అక్కడ్నించి మళ్ళీ వెనక్కి బెంగుళూరు, చెన్నై, తిరుపతి… చివరికి హైదరాబాద్. ఇప్పుడు ఇక్కడ్నించి కూడా…

కానీ ఇదివరకటి కన్నా ఈ సారి శ్రమ ఎక్కువ. అప్పుడంటే వయసులో ఉన్నాడు. ఒక ప్లేసు మారిపోగానే ఇంకో ప్లేసు ఆకట్టుకునేది. ఏ ప్లేసైనా ఒకటే అనిపించేది. ఇప్పుడలా కాదు.

రాములు వయసులో లేడు. ఇప్పుడిప్పుడే ఈ ఫతేనగర్ ఏరియాలో సెటిలైపోదాం అనుకుంటున్నాడు. ఇక్కడ తనకు లోటేమీ లేదు. చుట్టూ చాలా ఫ్యాన్ల ఫాక్టరీలున్నాయి. బోలెడంత స్క్రాప్ దొరుకుతుంది. కాలవ పక్కన చిన్న బడ్డీ పెట్టుకున్నాడు, స్క్రాపు కలెక్ట్ చేసి డీలర్లకు అమ్ముకుంటున్నాడు. ఇదే బిల్డింగు చివరగదిలో బయట వంటపనులకి వెళ్ళే ఫాతిమా దగ్గరకు రాత్రుళ్ళు వెళ్తుంటాడు. ఈ మధ్య ఆమె దగ్గరకి ఓ మెకానిక్కు కూడా వెళ్తున్నాడని తెలిసింది. అమాయకపుది, దానికేం తెలీటం లేదు. ఎప్పటికైనా తెలిసొచ్చి తన గదికి మకాం మార్చేస్తుంది. అప్పుడు ఈ ఒంటి గది కాస్తా ఇల్లవుతుంది. తను ఈ వయసులో ఇక డబ్బు సంపాదించలేడని రాములుకి అర్థమైంది. జీవితం అలా సాగిపోతే చాలనుకుంటున్నాడు. మొన్నటి దాకా అలాగే సాగింది కూడా.

మొన్నే రాములు ఖర్మ కొద్దీ ఒక రోజు కల్లుకంపౌండులో బాలాజీ గాడు తగిలాడు. ఏదో మాటలు కలిసాయి. డబ్బు సంపాయించటం గురించి టాపిక్కొచ్చింది. బాగా తాగి వున్న బాలాజీ అంతకుముందు రాత్రి కొంతమంది కుర్రాళ్ళతో కలిసి రైల్వే సరుకు దొంగిలించటం గురించి చెప్పాడు. ట్రాక్ రిపెయిర్ల కోసం తెచ్చిన బోల్టులూ, ఫిష్ ప్లేట్లూ, లైనర్లూ ఇంకా చాలా పెద్ద ఇనుప మెటీరియల్ తెచ్చి ఒక చోట దాచారు. వాటిని కొంటానికి ఒక డీలర్ కూడా దొరికాడట. ఇదంతా వాడికి తనతోనే ఎందుకు చెప్పుకోవాలని అనిపించిందో రాములుకి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు వాడి అన్న వచ్చి బెదిరించిన తీరుని బట్టి ఆ విషయాన్ని వాడు పంచుకున్న అతి కొద్దిమందిలో తను ఒకడు. మొత్తానికి ఇప్పుడు ఆ సరుకు దాచిన చోటుని పోలీసులు ఎలా పట్టేసారో పట్టేశారు. కేసు ఋజువైతే బాలాజీగాడు ఐదేళ్ళు బొక్కలోకి పోవడం ఖాయం.

మల్లేష్ నిజంగానే తప్పు ఎవరిదో తేల్చుకోకుండా తన జోలికి రాడు. కానీ తప్పొప్పులు నికరంగా తేల్చగలిగే తెలివితేటలు మల్లేష్ కి ఉన్నాయన్న నమ్మకం రాములుకి లేదు. ఆ మొండి వెదవకి ఇప్పుడు కావాల్సిందల్లా తన తమ్ముడ్ని బొక్కలోకి తోయించిన వాళ్ళ మీద కసి తీర్చుకోవడం. దాని కోసం ఎక్కువకాలం ఓపికపట్టే రకం కాదు. ఈలోగా రాములే దోషి అని తేల్చుకునేందుకు అన్ని కారణాలూ వాడే కల్పించుకుంటాడు. బ్రిడ్జి కింద పిట్టలోళ్ళు కొంతమంది మల్లేష్ ఏం చెప్తే అది చేస్తారు. ఐదువేల సుపారీకి మనుషుల్ని చంపేసే రకాలు వాళ్ళు. జేమ్సు ప్రసాద్ ని వాళ్ళతోనే చంపించి ఉంటాడు మల్లేష్.

జేమ్స్ ప్రసాద్ గుర్తుకురాగానే గ్లాసు మొత్తం ఎత్తి పోసేసుకుని ఒక్క ఉదుటున లేచాడు రాములు. మూలనున్న ఇనుప ట్రంకు పెట్టి గది మధ్యకి లాగాడు. ముఖ్యమైనవన్నీ అందులో సర్దటం మొదలుపెట్టాడు. తప్పదు, అయినా ఏ ప్లేసైతే ఏముంది బతకటానికి. ఇక్కడ్నించి ఇంకో చోటుకి. అక్కడ ఎవడైనా కత్తి చూపిస్తే మళ్ళీ ఇంకో చోటుకి. పరిగెడుతూనే ఉంటాడు. ఒరిస్సా, కలకత్తా, ఢిల్లీ… పరిగెత్తేంత సత్తువ లేదు కానీ పరుగు అతని ఒంట్లో ఒక భాగమైపోయింది.

వణుకుతున్న వేళ్ళతో ఆయాసపడుతూ సర్దేశాడు. కిటికీ లోంచి చీకటి పడటం తెలుస్తోంది. చప్పుడు చేయకుండా ఫతేనగర్ స్టేషన్ పోయి రైలెక్కితే సికింద్రాబాద్ చేరుకుంటాడు. అక్కడ్నించి బొచ్చెడు రైళ్ళు దొరుకుతాయి. మెట్ల వైపు నడుస్తూంటే ఫాతిమా గదికి తాళం వేసి కనిపించింది. ఆమె రావటానికి ఇంకో గంట పడుతుంది. కానీ వీడ్కోలు చెప్పేందుకు ఆగాలనిపించలేదు. వండకుండా మిగిలిన పావుకిలో మాంసం వున్న కవర్ని ఆమె తలుపు గెడకి తగిలించాడు. మెట్లు దిగి కిందకు వచ్చేశాడు.

***

రాములు పెట్టె భుజం మీద మోసుకుంటూ బ్రిడ్జి పక్కన సందులోంచి పట్టాల మీదకు వచ్చాడు. కీచురాళ్ళ శబ్దం మధ్య నుంచి నడుస్తున్నాడు. దూరంగా ఫతేనగర్ లోకల్ రైల్వే స్టేషన్ కనిపిస్తోంది. ఫ్లాట్ఫాం చివర డల్లుగా వెలుగుతున్న ఒక ట్యూబులైటు కింద కూర్చుని గుడుంబా తాగుతూ కొంతమంది కనపడుతున్నారు. రాములు బరువుతో ఒగుర్చుకుంటూ ఫ్లాట్ ఫాం ఎక్కబోయిన వాడల్లా ఉన్నట్టుండి ఆగిపోయాడు. కొంత దూరంలో నేల మీద సిట్టింగేసిన ముగ్గురిలో ఒకడు మల్లేష్!

రాములు బిక్కచచ్చిపోయాడు. వెంటనే వెనక్కి తిరిగి అటు వైపు ప్లాట్ఫాం దిక్కు నడిచాడు. వెలుతులు పెద్దగా లేదు కాబట్టి మల్లేష్ తనను చూసివుండకపోవచ్చు.

కానీ అవతలి ప్లాట్ఫాం మీదకు అడుగుపెడుతుండగానే తనది అడియాస అని అర్థమైపోయింది.

మల్లేష్ అటు పక్క లేచి నిల్చోవడం తన కను కొలకుల్లోంచి తెలుస్తోంది. ప్రాణాలన్నీ తోడేస్తూ మల్లేష్ పిలుపు వినపడింది.

“రేయ్… రాములు!”

రాములు వినపడనట్టు నడుస్తున్నాడు.

“నిన్నేరా. నీయవ్వరేయ్!”

ఇక ఆగక తప్ప లేదు. అటు తిరిగి చూశాడు.

మల్లేష్ కొద్దిగా తూలుతూ అటు వైపు ఫ్లాట్ ఫాం దిగి ఇటువైపు వస్తున్నాడు.

రాములుకి పారిపోదామా అనిపించింది. మల్లేష్ గాడు పరిగెత్తలేడు, కానీ మల్లేష్ తో పాటు కూర్చున్నవాళ్ళు కూడా పైకి లేచి ఇటొస్తున్నారు, వాళ్ళు చూట్టానికి కుర్రాళ్ళ లాగే ఉన్నారు.

చేసేదిలేక పెట్టె కింద పెట్టి నిల్చున్నాడు.

మల్లేష్ పట్టాలు దాటి ప్లాట్ ఫాం పైకి ఎక్కుతున్నాడు. మొహం వెటకారంగా నవ్వుతోంది. “మనుషుల్ని గుర్తువట్ట లేనంత ఎక్కేషిందనుకుంట్నావ్ ర నాకు?”

“లేదన్నా.. ఇక్కడకే. సనత్ నగర్ పోతున్న.”

దగ్గరకు వచ్చి భుజం మీద చేయి వేశాడు మల్లేష్. “నువ్వు ఎక్కడికన్న పోబై. పిలిస్తే ఆగల్నా లేదా? బలిసిందిరా నీకు. నీ దోస్తు జేమ్సుగాడిట్లనే ఎగస్ట్రాలు చేశిండు సచ్చే ముంగట.”

ఆ మాట తర్వాత రాములుకి ఇక ఏం వినపడలేదు. చప్పున వెనక్కి తిరిగి పరిగెత్తాడు. రెండడుగులు వేశాడో లేదో తలకి వెనుక నుంచి ఏదో వచ్చి గట్టిగా తాకింది. తల పట్టుకుని నేలజారిపోతున్న రాముల్ని మల్లేష్ తో పాటు వచ్చినవాళ్ళలో ఒకడు మెడ వెనకనుంచి చేయి వేసి నిటారుగా నిలబెట్టాడు. కదలకుండా పట్టుకున్నాడు.

మల్లేష్ నెమ్మదిగా వచ్చి రాములు ముందు నిలబడ్డాడు. పక్కవాడి వైపు చూస్తూ, “నువ్ జెప్పరా.. ఈని తప్పేం లేకుంటె ఎందుకు ఉర్కుతుండ్రా ఈడు?” అంటూ, బెల్టు దగ్గర చేయి పెట్టాడు.

అది సర్దుకోవడానికో, గోక్కోవడానికో, లేక కత్తే తీయడానికో రాములుకి తెలీదు. మధ్యాహ్నం అక్కడ కత్తి చూసిన సంగతి మాత్రం గుర్తొచ్చిందంతే. వెనకవాడు పట్టుకుని ఉండగానే ఒక కాలు మల్లేష్ వైపు ఆడించాడు.

ఆ దెబ్బ మల్లేష్ పొట్టకి తగిలి అతనో అడుగు వెనక్కి వేశాడు. అక్కడే ఒక క్షణం పాటు నిలబడ్డాడు. ఆవేశంతో ఒగురుస్తూ పక్కన నిల్చున్నవాడ్ని, “రేయ్ ఇటియ్యరా బై!” అని అడిగాడు. పక్కవాడు జేబులోంచి తీసిచ్చిన కత్తి అందుకుని “సచ్చినవ్ రా ఇయ్యాల నువ్వు” అంటూ పెనుగులాడుతున్న రాములు పీక పట్టుకున్నాడు. రెండో చేత్తో కత్తిని రాములు పొట్టలోకి దింపాడు.

రాములు కేక ఆ ఖాళీ ప్లేసులో గట్టిగా వినపడింది. వెనక ఉన్నవాడు వదిలేయటంతో రాములు కిందపడిపోయాడు. విచ్చుకున్న కళ్ళతో తలెత్తి మల్లేషు వైపు చూశాడు.

మల్లేష్ తో వచ్చిన ఇద్దరూ నడుం మీద చేతులు వేస్కొని తొంగి చూస్తున్నారు. ఒకడు “అట్ల పొడిసినవేందన్నా!” అంటున్నాడు.

“కాలెత్తుతుండ్రా లంజొడ్కు!” అంటున్నాడు మల్లేష్.

ఇంకొకడు వెనక్కి తిరిగి ఫ్లాట్ఫాం వైపు చూశాడు. ఇటు వైపు పరిగెత్తుకుంటూ వస్తున్న కొన్ని అడుగుల శబ్దం వినపడుతోంది.

“అన్నా… పా! రచ్చయితది ఇక్కడ!”

కాళ్ళు కదిలాయి. ముగ్గురూ వచ్చిన తోవనే వెనక్కి మళ్ళారు.

ఈలోగా పరిగెత్తుకొస్తున్న కాళ్ళు రాములు దగ్గరికి వచ్చి ఆగాయి. షెడ్డు పాషా, వాడి దగ్గర పన్చేసే కుర్రాడూ, ఇంకెవరో ఇద్దరు ముగ్గురున్నారు.

ఒకడు రాముల్ని లేపి కూర్చోబెట్టాడు. “ఏమైందన్నా” అని అడుగుతున్నారు ఎవరో. రాములు పట్టాలు దాటుతున్న మల్లేష్ వైపే చూస్తున్నాడు.

మల్లేష్ వెనక్కి తిరిగి చూస్తూ దాటుతున్నాడు. పక్కనున్నవాడు మల్లేష్ చేతుల్లోంచి రక్తం ఓడుతున్న కత్తిని లాగి తుప్పల్లో పడేశాడు.

రాములు చొక్కా ఎత్తి చూసుకున్నాడు. అక్కడ బనీన్ అంతా రక్తంతో తడిసిపోయి వుంది. కానీ అంతా మొద్దుబారిపోయి ఉంది. నొప్పేం తెలీటం లేదు.

“ఇంతేనా” అని గొణుక్కున్నాడు.

పక్కవాడు “ఏందీ” అని అడిగాడు అర్థం కానట్టు.

రాములు కళ్ళు మెరుస్తున్నాయి. ఒక్క ఉదుటున పైకి లేచాడు. “ఇంతేనా!” అని గట్టిగా అరిచాడు. చుట్టుపక్కల వాళ్ళు దూరంగా జరిగారు.

పట్టాలు దాటుతున్న మల్లేష్ కూడా ఆగాడు.

రాములు అతని వైపు నడుస్తూ…

“నీయవ్వ దీనికారా భయపడింది

దీనికా భయపడింది

దీనికా”

- అని అరిచాడు. మల్లేష్ వైపు దూసుకెళ్ళాడు.

రాములుకి ఏం కాలేదని మల్లేష్ కి అర్థమైంది. రాములు చేత తన్నించుకున్న పౌరుషం మళ్ళీ రెచ్చిపోయింది. పక్కవాళ్ళు వెనక్కి లాగుతున్నా ఆగలేదు.

ఇద్దరూ పట్టాల మధ్య కలుసుకున్నారు.

రాములు మల్లేష్ మీదకు చెయ్యెత్త బోయాడు.

మల్లేష్ దాన్ని రాములు వీపు వెనక్కే మడిచి ఓ గెంటు గెంటాడు.

రాములు తుప్పల్లోకి తూలి పడ్డాడు.

అక్కడ కనపడింది కత్తి. వణుకుతున్న చేతుల్తో దాన్ని ఒడిసిపట్టుకున్నాడు. అతని పిడికిలి చల్లారిన ఇనుములా పిడి చుట్టూ బిగుసుకుంది. తటాల్న లేచి మల్లేష్ మీదకు వచ్చాడు.

మల్లేష్ మళ్ళీ రాముల్ని గెంటబొయ్యాడు. కానీ అరచేయి సర్రున కోసుకుపోయింది. రాములు కత్తి ఆడిస్తూ మల్లేష్ చుట్టూ గెంతుతున్నాడు. మల్లేష్ తో వచ్చిన కుర్రాళ్ళిద్దరూ అతడ్ని పట్టుకునే ప్రయత్నం చేసినా అందలేదు. వాళ్లలో ఒకడు రాముల్ని వెనక నించి పొడిచాడు. అయినా కాచుకోవడానికి ప్రయత్నించ లేదు. వెనక్కి కూడా తిరగలేదు. మల్లేష్ చుట్టూ పూనకంలా గెంతుతూ కత్తి ఆడిస్తున్నాడంతే. ఒక్కోసారి ఈ కత్తి పోట్లు గాల్లోకి దిగుతున్నాయి, ఒక్కోసారి మల్లేష్ ని తాకుతున్నాయి.

మల్లేష్ ఒక పోటు కాచుకోబోయి రైలుపట్టా తగిలి తూలిపడ్డాడు. రాములు వెంటనే అతని మీదకెక్కి కూర్చున్నాడు. ఈసారి కత్తిని ప్రాణాంతకమైన తావుల్లో దించాడు. మల్లేష్ లో క్రమంగా ప్రతిఘటన తగ్గింది. శరీరం చావు ముందు కదలికలేవో చేస్తోంది. రాములు పైకి లేచి బిత్తరపోయి చూస్తున్న కుర్రాళ్ళ వైపు తిరిగాడు. అతని ముఖం మీది రక్తమూ, వెర్రితనమూ చూసి వాళ్ళు భయపడి పరిగెత్తారు. రాములు వెంటపడబోయి ప్లాట్ ఫాం మీద పడిపోయాడు. పైకి లేవబోయి కుప్పకూలిపోయాడు.

కాసేపు చుట్టూ అరుపులు వినపడ్డాయి. దగ్గరకొచ్చిన కొన్ని అడుగులు అతడ్ని తాకేందుకు భయపడి చుట్టు తిరిగాయి. ఎవరో భుజాల కింద చేతులు వేసి వెల్లకిలా పడుకోబెట్టారు. కొన్ని చేతుల మీద గాల్లోకి లేవటం రాములుకి తెలిసింది. తర్వాత స్పృహ తప్పింది.

మెలకువ వచ్చేసరికి కళ్ళకి తెల్లటి వెలుగు తగిలింది. అతనో కదులుతున్న అంబులెన్సులో ఉన్నాడు. అతని కాళ్ళ దగ్గర తెల్లటి కోటు వేసుకు కూర్చున్న యువకుడు అతని మీదకు వంగి చూసి ఇంకొకతనితో ఏదో చెప్తున్నాడు. రాములు తల తిప్పి చూశాడు. అంబులెన్సు రెండో గోడకి ఆనించి వున్న స్ట్రెచర్ మీద ఒక శవం ముసుగేసి వుంది. ఆ తెల్లటి ముసుగు కింద నుంచి ఒక చేయి కాశీతాడు, కడియాలతో వేలాడుతోంది.

రాములు లేవబోయాడు. తెల్లకోటు యువకుడు రాములుని మధ్యలోనే ఆపి, వెనక్కి పడుకోబెడుతూ, అనునయంగా మీదకి వంగి చెప్తున్నాడు, “ఏం కాలేదు, కంగారు పడకు. హాస్పిటల్ కి వచ్చేస్తున్నాం.”

రాములు అది కాదన్నట్టు చేయాడిస్తూ అన్నాడు, “నాకు ఏదో ఒక మందిచ్చేయండి సార్. నేను బానే వున్నాను. హాస్పిటల్ కి వద్దు.”

“వచ్చేశాం. ఇంకెంతో దూరం లేదు.”

“లేదు లేదు మీకు అర్థం కాటం లేదు. దూరం అని కాదు, నాకు టయిం లేదు. నేను వెళ్ళాలి.”

“ఎక్కడికీ వెళ్ళక్కర్లేదు. కేసేం అవదు. ఫస్ట్ వీడే పొడిచాడని అక్కడ అంతా చెప్తున్నారు,” అన్నాడు ఆ యువకుడు మల్లేష్ శవం వైపు చూపిస్తూ.

రాములు ముఖం బాధగా పెట్టి, డాక్టర్ కి అర్థమయ్యేట్టు చెప్పే ప్రయత్నం చేశాడు: “అది కాదు డాట్టరు. మీకర్థం కాటం లేదు. నేను చాలా చోట్లకి ఎళ్ళాలి. ఎక్కడెక్కడ బతికేనో అక్కడకల్లా ఎళ్ళాలి. మొత్తం బతుకంతా మళ్ళీ ఎనక్కెళ్ళాలి. వైజాగు, బొంబాయి… చాలా చోట్లకి పోవాలి. చాలా మందిని కలవాలి. చాలామందికి ఎదురెళ్ళాలి. నేనేంటో చెప్పాలి నాకొడుకులకి. టయిం లేదు డాట్టరు. నాకు ఏదో మందిచ్చేయండి. ఇక్కడ దింపేయండి…” అంటూ తలాడిస్తున్నాడు.

అతని మాట సణుగుడులోకి మారిపోయింది, అర్థం కాని ప్రేలాపనలోకి దిగిపోయింది, ఆడుతున్న తల నెమ్మదిగా ఆగిపోయింది.

(Retelling of Dashiell Hammett’s Afraid of a Gun - వాకిలిలో ప్రచురితం)

February 1, 2016

చేదుపూలు

1

పేరుకి మరీ దూరం పోకుండా ప్రసాదు అనుకుందాం. చీకట్లో ఇరుకుమెట్లు అలవాటైన వేగంతో ఎక్కి తన గది ఉన్న అంతస్తుకి చేరుకున్నాడు ప్రసాదు. ఎదురింటి గడప మీద నైటీలో కూర్చుని కూతురికి జడేస్తున్న ఎదురింటావిడ అతడ్ని చూడగానే ముఖం గంటుపెట్టుకుని, విసురుగా లేచి, కూతుర్ని లోపలికి లాక్కువెళ్ళి తలుపు వేసుకుంది. ప్రసాదుకి ఒళ్ళు మండింది: “కొజ్జాది ఈమధ్య ఇలా నంగి నాటకాలెందుకు ఆడుతుందో అర్థం కావటం లేదు.”

చిరుద్యోగులూ, బడ్డీకొట్ల వ్యాపారస్తులూ ఎక్కువగా ఉండే ఈ బిలో మిడిల్‌క్లాసు బస్తీలో, ఒక రంగులుమాసిన పెచ్చులూడిన మూడంతస్తుల బిల్డింగులో, ప్రసాదు పెళ్ళి చేసుకునేంత వయసు వచ్చినా, పెళ్ళాన్ని పోషించేంత జీతం రావటం లేదు కాబట్టి బ్రహ్మచారి జీవితం గడుపుతున్నాడు. నగరం చేరినప్పుడు జవసత్వాలతో ఉన్న ఆశలు తర్వాత వట్టిపోయాయి. ఒక చిన్న డయాగ్నస్టిక్ సెంటరులో లాబ్ టెక్నీషియనుగా పని చేస్తున్నాడు. పగలు రక్తపు ట్యూబులూ, ఉచ్చ బాటిళ్ళు, స్పిరిట్ వాసనలూ, ప్రింటరు చప్పుళ్ళ మధ్య పనివేళల్ని గడుపుతాడు. రాత్రుళ్ళు చాపపై వెల్లకిలా పడుకుని, బీటలు వారిన వ్యక్తిత్వపు పగుళ్ళలోంచి అసమర్థతలు విషప్పురుగుల్లా పెల్లుబుకటాన్ని దృశ్యం ఇంకని కళ్ళతో చూస్తూ, నిద్రలోకి జారుకుంటాడు. ఈ రాత్రీ అంతకుమించి ప్లాన్స్ లేవు. తలుపేయగానే ఎదురింటావిడ సంగతి మర్చిపోయాడు. కర్రీపాయింటు నుంచి తెచ్చిన కూరల పాకెట్లని బల్ల మీద ఉంచి, తడి సిగరెట్టుపీకలూ ఖాళీ క్వార్టరుబాటిళ్ళూ ఉన్న సింకులో బియ్యాన్ని కడిగి, కరెంటు కుక్కర్లో పెట్టాడు. నడుముకి తువ్వాలుతో చాప మీద కూర్చొని పాత ఆదివారం మాగజైన్ తిరగేశాడు.

ఇన్ని గదుల నగరంలో సన్నివేశ వైవిధ్యానికి కొదవేముంది. అందం, మలినం, ఆనందం, దైన్యం గోడలతో వేరైన ఒకే రంగంపై ఏకకాలంలో పరిణమిస్తూ ఉంటాయి. అవతలి జీవితాలు ఫర్నిచర్ జరిపినపుడు మాత్రమే తెలుస్తాయి. మహాఅయితే కొట్లాటలూ, టీవీ పాటలు, పసివాళ్ళ ఏడుపులూ, ప్లంబింగ్ అజీర్తి శబ్దాలు… అసలు లోకమే లీలగా వినిపించే లారీల మోత.

తువ్వాలు పైకి జరిపి మోకాలు గోక్కుంటూ ఎవరో సెలెబ్రిటీ జీవితంలో ఉత్తేజవంతమైన మలుపు గురించి చదువుతోంటే సెల్‌ఫోను మోగింది. “ఎలైజా కరుణ కాలింగ్…” అని రావటం చూశాడు. ఆదివారం మేగజైన్ కప్పిన పరాయి వాస్తవాల పొర చిరిగి, అతని మెదడులో కామపు అర తెరుచుకుంది.

అతనికి ప్రయత్నించి ఆడవాళ్ళని దక్కించుకునే చురుకూ, శ్రద్ధా, ఆత్మవిశ్వాసమూ లేవు. అలాగని నిర్లక్ష్యం చేసేంత నింపాదైన కామమూ కాదు. కొనుక్కునేంత అనైతిక తెగువా లేదు. ప్రయత్నించకపోలేదు. అప్రతిహత కామపు ఈదురు అతడ్ని ఒకసారి రైల్వేస్టేషను వెనుక చీకటి సందుల్లోకి విసిరికొట్టింది. ఒక మైకా మెరుపుల ఆడతనం కనిపిస్తే దాదాపు బేరం తెగేదాకా తీసుకొచ్చాడు. కానీ పని కాకముందే పచ్చనోటు బయటకు తీయటమనే ఎడ్డి పని చేశాడు. బెరుకు వాసన ఇట్టే పసిగట్టే అధోజగత్ వృకోదరుడు ఒకడు ఉన్నట్టుండి నీడల్లోంచి రంగప్రవేశం చేసి నోట్లు లాక్కున్నాడు, వచ్చిన దారిన వెళ్ళమన్నాడు. రొచ్చు పనిలో మళ్ళా ధర్మాగ్రహానికి తావు లేదు కనుక కిమ్మనకుండా వచ్చేశాడు. ఇంకెపుడూ అటు పోలేదు. ఊళ్ళో ఒకసారి నపుంసకత్వానికి బలైన ఒక కొత్తకోడలి ఆరాటానికి పూచిన పువ్వుని ఆమెకు అందుబాటులో ఉన్నాడన్న ఒకేవొక్క అర్హత వల్ల రెండు మూడుసార్లు ఆబగా కోసుకోగలిగాడు (మెట్లకీ, డాబాకీ మధ్యనున్న సన్‌షేడ్ మీద, సన్నజాజి పందిరి మరుగు; కింద కటకటాల గదిలోంచి ఆమె మావగారి దగ్గు వినపడగానే తొట్రుపడి స్ఖలనం). సుఖం తెలిసిన ఆమె ఎపుడో పండగలకి మాత్రమే ఊరొచ్చే ఇంతోసి మగతనం కోసం ఓపిక పట్టలేక అలమటిస్తుంటే, ఈలోపులో తావి తగిలిన మరో తుమ్మెద బలమైన ప్రొబొసిస్ తో ఆమెను తెంపుకుపోయింది.

ఆ తర్వాత ఎలైజా కరుణ వచ్చేదాకా అతనికి మరో ఆడది తెలియదు. అది కూడా సొంత ప్రజ్ఞ కాదు. ప్రసాదుకి చంఘిజ్ ఖాన్ లాంటి మిత్రుడొకడు ఉన్నాడు. పెద్ద అందగాడు కాకపోయినా, చేసేది కారు మెకానిక్కు పనే అయినా, ఏదో సహజాత అభినివేశంతో, సానబెట్టిన అనాది కిటుకులతో చుట్టూ ఆడతనానికి లోటు లేకుండా చూసుకునేవాడు. అతనికి పరిచయమయ్యే నాటికి జీవితంలో మంద తప్పిన దూడ ఎలైజా. అందంలేని కారణంగా ఏ జాణతనమూ అబ్బని బేల కవిత్వం. భర్త ఉత్తపుణ్యానికి వదిలేశాడు. ఒక కెమికల్ ఫాక్టరీలో పని చేస్తూ, ఇంటరు చదువుతున్న కూతురుతో నెట్టుకొస్తుంది. చంఘిజ్ ఖాన్ ఆమెలో అణగారిన ఆశల్ని చెదరగొట్టి లేపి, మర్చేపోయిన మగ ఆసరాని చవి చూపించాడు. వయస్సూ అనుభవాల డిగ్నిటీ అంతా పణంగా పెట్టి అతడ్ని అల్లుకుపోయింది. కానీ ఛంఘిజ్ ఖాన్ తనకే అర్థం కాని దేన్నో ఆడదానిలో వెతుకుతూ, అది దొరక్కపోతే నిరాశ బదులు రెట్టించిన తహతహతో ఇంకో మనిషి వైపు పోతూ ఉండేవాడు. వాడి బాధ వాడిది. ఒకర్ని దాటి వెళిపోయింతర్వాత, కన్నీటి కోసం జబ్బ అందించటం లాంటి మొహమాటాలు పెట్టుకునేవాడు కాదు. ఎలైజా విషయంలో ఆ బాధ్యత కొన్ని మలుపులు తిరిగి ప్రసాదు మీద వచ్చి పడింది. అప్పటికే పేగు తెగిన గుడ్డిదైన్యంతో అగ్గగ్గలాడుతున్న ఎలైజా, ఆ పతనంలో అట్టడుక్కు చేరి ప్రసాదుని తాకింది. కనీసం ప్రసాదు అలా అనుకున్నాడు. మొదట్లో, పులి మిగిల్చిన కళేబరాన్ని వంగొంగి తోక ముడుచుకు తినే హైనా తట్టేది. అయినా ఆమెని చేరువ కానిచ్చాడు. రణవిధ్వంసానంతర శిథిల వనంలా ఉంది అప్పుడు. ఎన్నాళ్ళో కాలేదు, నెల క్రితం. ఫ్యాక్టరీకి కూడా తిన్నగా వెళ్ళలేకపోయేది, కూతురికి ఏం వండి పెట్టేదో ఆమెకే తెలియాలి. అటు అందమూ, ఇటు భద్రజీవితమూ లేని ఈ మనిషి ఏ కొంచెమూ రాటుదేలకుండా జీవితంలో ఇంత దూరం ఎలా రాగలిగిందా అని ఆశ్చర్యమేసేది. ఆమె వున్న పరిస్థితిలో ఏమాశించి ప్రసాదు వైపు వచ్చిందో తెలియదు కానీ, అతను మాత్రం బాధ్యతలేని ఉత్సుకత తోనూ, తర్వాత ఎటూ దక్కే అవకాశమున్న ఒంటి రాపిడి కోసమూ ఆమెను చేరనిచ్చాడు. అది తప్ప ఇవ్వటానికి ఆమె దగ్గర ఏదీ లేదనిపించేది. వయసులో అందంగా ఉండేదేమో, ఇప్పుడు లేదు. నిలువు సిజేరియన్ కోతల కాలం నాటి ఆడది, చర్మంపై మెలనిన్ నీడలు, యోని ముతక పువ్వు.

ప్రసాదు ఫోను ఎత్తి మాట్లాడుతూ చిన్న బాల్కనీలోకి వచ్చాడు. కింద స్ట్రీట్‌లైటు వెలుతుర్లోంచి లజ్జగా తొలగి నీడల్లో తచ్చాడుతోంది ఎలైజా. “ఎవరూ లేరు పైకి రమ్మ”న్నాడు.

కాసేపటికి ఆమె అరిగిన హవాయి చెప్పుల తపతపలు, పట్టీల ఘలఘలలూ గుమ్మం దాకా వచ్చి నెర్వస్ నిశ్శబ్దంతో ఆగాయి. తలుపు తీశాడు. నవ్వుతూ లోపలికి వచ్చింది. ఈ నెల రోజుల్లోనూ వీళ్ళ బంధం తీరు చాలా మారింది. మొదట్లో ప్రసాదు “ఎందుకొచ్చిన గోలరా భగవంతుడా” అనుకునేదాకా ఏడ్చేది. ఒక్కోసారి అతని కింద ఉన్నప్పుడు కూడా. ఇప్పుడైతే చంఘిజ్ ఖాన్ ప్రసక్తే రావటం లేదు.

బల్ల మీద ఉన్న కూరల పాకెట్లు చూసి, “అయ్యో, కూరలు తీసుకునేముందు నాకు చెప్పద్దాయ్యా?” అంటూ చెంగు చాటు నుంచి గిన్నె తీసి ఇచ్చింది. టమటాపులుసు మధ్యలో గోంగూర పచ్చడిముద్ద ఒత్తి ఉంది. ఇద్దరూ గోడకి జారగిలబడి కూర్చున్నారు. ప్రసాదు కడుపు లోనీ, కడుపు కిందా ఆకలితో కాలుతున్నాడు. ఆమె గోమునీ, బెట్టునీ, నప్పని కన్నె హొయళ్ళనీ పట్టించుకునేంత సహనం లేదు.

కొంతసేపటి తర్వాత, లోపలికి వెళ్ళి అన్నం కంచంలో పెట్టి తెచ్చుకుని, చాప మీద కూర్చుని తింటున్నాడు. ఆమె నామకహా ఆచ్ఛాదనలతో బోర్లా పడుకుని తలగడ మీంచి అతను తినటాన్ని చూస్తోంది. చూపులో మురిపెం, మాటలో అల్లరి ఉన్నాయి. అతనికి మాత్రం స్ఖలనానంతర వైరాగ్యంతో అదంతా చిరాకుగా ఉంది.

ఇప్పుడు కాదు, ఆమెకు మరో గాయాన్ని బహుమతిగా ఇచ్చి సాగనంపినపుడూ కాదు, ఆమెను మర్చిపోతున్న కాలానికి “ఆమెను మర్చిపోవడం” అనేంత పెద్ద పేరు కూడా పెట్టకుండా మర్చిపోయినపుడు కూడా కాదు–ఎప్పుడో ఈ కాలాన్ని వెనక్కి తిరిగి చూసేంత దూరానికి చేరుకున్నాకా, జీవితం ఇవ్వగల బహుమతుల్లోని అరిపేదతనం పూర్తిగా తెలిసొచ్చాకా, అప్పుడు మాత్రమే ఆమె పూర్ణ స్వభావంతో గోచరమైంది. వ్యక్తిత్వ మొక్కటే కాదు. అందం కూడా. ముఖ్యంగా ఆమె ముఖం. పక్క మీద ఆత్రం తీరిన తర్వాత ఇద్దరూ ఎదురుబొదురు ఒత్తిగిలి పడుకుని కాసేపు కబుర్లు చెప్పుకునేవారు. ఆ భంగిమలో దేహంపై భూమ్యాకర్షణ ఎప్పటిలా కింద నుంచి కాక పక్కల నుంచి పనిచేయటం వల్ల, ఆమె చెంపలకీ, వాటి మధ్య పొదిగున్న చెమ్మ కళ్ళకీ అపూర్వమైన పసి మెరుగు వచ్చి చేరేది. నవ్వు సాంద్రతరమయ్యేది. వయసు మాయమైపోయేది. ఆమెతో పాటు ఒత్తిగిలి పడుకున్నవాళ్ళకి తప్పితే ఇంకెవరికీ కనిపించని అందమది. ఈ బహుమతి విషయంలో జీవితం అతనితో ఉదారంగానే వ్యవహరించింది. పంపకాలు సమంగా జరగని స్తనాలతో, పొట్టతో, పీలకాళ్ళతో కాక, ఆమె స్వభావానికి అమిరే పసితనంతోనే ఆమెను జ్ఞాపకంలో దాచుకోగలిగాడు.

గోంగూర పచ్చడి ప్రత్యేకమైన శ్రద్ధతో తయారైందని తెలుస్తోంది. తింటూండగా తలుపు చప్పుడైంది. అతను కంగారుపడి ఆమెను కంగారు పెట్టాడు. ఆమె దొరికినవన్నీ చుట్టబెట్టుకుని వంటగదిలోకి పరిగెత్తింది. అతను దేవుడే వచ్చినా ఏదోటి చెప్పి పంపేయాలన్న నిశ్చయంతో తలుపు దగ్గరకు నడిచాడు. చిన్న సందులా దాన్ని తెరిచాడు. ఎదురింటావిడ కూతురు.

“పెన్సిలుందా అంకుల్?” అని అడుగుతూనే, అతని వెనక నుంచి ఏమైనా కనిపిస్తుందేమో అన్నట్టు చూస్తోంది.

లేదని తలుపు వేసేశాడు.

మాలోకంగా బుర్ర గోక్కుంటూ ఇటు తిరిగాడు.

లోపల్నుంచి ఎలైజా అతని పిరికి కంగారును వెక్కిరిస్తూ ఆపుకోలేని లేని నవ్వుతో బయటకు వచ్చి, అరకొరగా వేలాడుతున్న చవక సిల్కుచీర ఆమె వేగానికి ఎన్నో చెంగులై ఎగురుతుంటే, వాస్తవమూ స్వప్నమూ స్మృతీ ఇవన్నీ గడప చేరువే అన్నట్టు అధిగమించి, బతికిన ఎడారి విస్తారంలో అతను ఏరుకున్న చక్కందనపు పేలికల దొంతరలో ఆ క్షణపు తానో మనోజ్ఞ చిత్తరువువై నిలుస్తూ, పిల్లాడ్ని చేసి అక్కున చేర్చుకుంది.

2

మరుసటి రోజు ప్రసాదు ఆలస్యంగా నిద్ర లేచాడు. పక్క మీద కొన్ని వడలిన కనకాంబరాలు తప్పితే ఎలైజాతోసహా రాత్రి జాడలేం లేవు. స్నానానికి సిద్ధమవుతుంటే తలుపు చప్పుడైంది. చొక్కా వేసుకు వెళ్ళి తీశాడు. పక్కింటావిడ. అరవయ్యేళ్ళుంటాయి, పొలుసుల చర్మం, పెదవుల మూలల్లో తెల్లగా ఏదో వికారం, స్నానం చేసినా పాచి కడగనట్టుండే ముఖం. ప్రసాదు ఏమిటని అడక్కముందే మొదలుపెట్టింది. పొద్దున్న ఎదురింటావిడ ప్రసాదుని ఎన్నెన్ని మాటలందో ఏకరువుపెట్టింది. ఇదంతా ఎదురింటి తలుపుకున్న తాళంకప్పకు వినపడినా ప్రమాదమే అన్నట్టు గుసగుసగా మాట్లాడింది. “పడుకున్నావామ్మా! అదే అనుకున్నాను బైటికి రాడేంటా అని. రాత్తిళ్ళు నీ గదికి ఎవరెవరో వస్తున్నారంట. ఇవాళ ఏదోటి తేల్చేస్తా అంటా పోయింది ఆఫీసుకి. అదేదో తేల్చుకున్నాక కదా నోరు పారేసుకోవాలి… అయ్యదాని నోరు అదేం నోరు బాబోయ్! మేము పడతానే ఉన్నాం చూస్తున్నావు కదా. ఆమె నోట్లో పడొద్దు నాయనా, మా బాబువి, జాగ్రత్త” అంటూ, బహుశా తనకున్న సందేహాల్నీ భయాల్నీ కూడా ఎదురింటావిడ మీదకి నెట్టేస్తూ మాట్లాడింది. తెచ్చిపెట్టుకున్న అక్కరతో పెదాలు ముందుకు చాచి, ఏదో నిలకడ లేని మృగాన్ని బెరుగ్గా సవరదీస్తున్నట్టు ఆమె మాట్లాడుతున్న తీరు చూస్తే ప్రసాదుకి ముఖం పగలగొట్టాలనిపించింది. ఆమె చెప్పిన విషయం లోపల్లోపల ఆందోళన కలిగిస్తున్నా, పైకి మాత్రం అదేమంత లెక్కపెట్టతగింది కాదన్నట్టు ప్రవర్తించి, ముక్తసరి జవాబులతో తలుపు మూశాడు.

కానీ ఆ రోజు లాబ్‌లో పని చేస్తున్నప్పుడు ఈ విషయం గుర్తొస్తూనే ఉంది. పరధ్యాసగా ఒక డబ్బాకి స్టిక్కర్ అతికించకుండానే యూరిన్ శాంపిల్ కి ఇచ్చేయబోయాడు. ఫ్రంటాఫీసులో పన్చేసే పిట్టవాటం రిసెప్షనిస్టు కపటంతెలీని చనువుతో తను కొత్తగా వేసుకున్న గోళ్ళ రంగు ఎలా ఉందో చెప్పమని చేతులాడించినపుడు, ఆమె తెల్లటి వేళ్ళకు మట్టిరంగు ఏమాత్రం నప్పకపోయినా బానేవుందన్నట్టు అనాలోచితంగా తలాడించాడు. ఊహల్లో ఎదురింటావిడని రకరకాలుగా ఎదుర్కుంటూనే ఉన్నాడు.

ఆమెతో ఇంట్లో దిగిన కొత్తలోనే ఒకసారి పేచీ అయింది. అన్నీ ఫ్యామిలీసే ఉన్న ఆ అంతస్తులో ప్రసాదు ఒక్కడే బ్యాచిలరుగా దిగాడు. చెరోవైపూ రెండేసి చొప్పున నాలుగువాటాలు ఉంటాయి. మధ్యన ఓ రెండుఅంగల వెడల్పుతో చిన్న ఉమ్మడి నడవా. మిగిలిన మూడిళ్ళ ఆడవాళ్ళూ రోజుకొకరి చొప్పున వంతులు వేసుకుని ఆ నడవాని శుభ్రం చేస్తారు. ఇంట్లో దిగిన కొన్నాళ్ళ దాకా అసలు ఇలాంటి ఒప్పందమొకటి నడుస్తోందన్న సంగతే ప్రసాదు గమనించలేదు. ఒక రోజు ఉదయం లేచేసరికి, బయట ఊడ్చే చప్పుడుతో పాటు గట్టిగా మాటలు కూడా వినిపిస్తున్నాయి. కాసేపటికి తన గురించేనా అన్న అనుమానం కలిగి తలుపు తీశాడు. “ఎవరు పడితే వాళ్ళు స్టయిలుగా తొక్కుకుంటూ పోతున్నారు పైకీ కిందకీ. కడగరూ పెట్టరు. మాకే పట్టిందా ఖర్మ?” అంటూ, ఏ మొక్కుబడి మర్యాదా లేకుండా మొదటి పరిచయంలోనే అతడ్ని బద్ధవిరోధిగా నిలబెట్టేసింది. అంత జోరెందుకో ప్రసాదుకి అప్పుడైతే అర్థం కాలేదు గానీ, సంసారంలో ఇరుక్కుపోయిన ఆమెకి బాదరబందీల్లేని తన బ్రహ్మచారి మనుగడే ఒక వెక్కిరింతలా చిర్రెత్తిస్తుందేమోనని తర్వాత అనిపించింది. ఆ నడవా కడగటంలో పెద్ద అభ్యంతరం ఏమీ లేదు గానీ, “ఈ బండది ఇంత దురుసుగా చెప్తే తను చేయాలా” అన్న మనస్తాపంతో ఏదో తిక్కగా మాట్లాడి తలుపు వేసేశాడు. అలా ఇద్దరి మధ్యా శత్రుత్వానికి శంకుస్థాపన జరిగిపోయింది. ఆమె అంతటితో ఊరుకోలేదు. ఆ మరుసటి రోజు నుంచి ప్రసాదు నిద్ర చెదిరేలా కొబ్బరీను చీపురుతో తలుపు మీద చప్పుడు చేస్తూ ఊడ్చటం, తలుపు సందుల్లోంచి నీళ్ళు లోపలికి చిమ్మేలా కడగటం చేసేది. ఇక భరించలేక, పక్కింటావిడ ఇచ్చిన సలహాతో ఒక పనిమనిషిని పెట్టుకున్నాడు. దొరక్క దొరికిన ఆ అర్భకపు పనిమనిషి అస్తమానూ నాగాలు పెట్టడం వల్ల చాలాసార్లు ప్రసాదే లేచి ఊడ్చాల్సి వచ్చేది. పని నుంచి వచ్చాకా విశ్రాంతిగా గడపాల్సిన గది దగ్గర లేనిపోని తంపులెందుకని ప్రసాదు ఎంత వెనక్కి తగ్గినా, ఎదురింటావిడ మాత్రం జన్మాంతర కక్షలున్నట్టే ప్రవర్తించేది.

అడపాదడపా అటునుంచి అతని ఉనికి అంచుల్ని తాకుతూనే ఉన్న పరుషమైన సెగల వల్ల, ఆమె గురించి కొంతైనా ఆలోచన ఖర్చుచేయక తప్పలేదు. పనిగట్టుకుని అంచనా వేసిందెన్నడూ లేదు గానీ, అంతరంగంపై ఆమె దౌర్జన్యపు చొరబాట్లు వదిలిన ముద్రల్ని బట్టి ఆమె కథ ఒకటి అతని దగ్గర పోగుపడింది. అతన్నే చెప్పమంటే అది పెన్నులో విషం నింపి రాసిన కథే అవుతుంది మరి: ఆమె చూట్టానికి చామనచాయలో బరువైన బంతిలా ఉంటుంది. ఏదో ఉద్యోగం చేస్తుంది; ఇస్త్రీ చీర, హ్యాండుబాగూ, పువ్వుల గొడుగుతో బయల్దేరటాన్ని బట్టి ఏదో ప్రైవేటు గుమాస్తా ఉద్యోగం అనిపిస్తుంది. ఇరుగుపొరుగుతో ఆమె మాటల్లో, తెచ్చిపెట్టుకున్న నాజూకు వినిపించేది; ఆ నాజూకుతనం ఎక్కడ అమరుతుందో ఆ వర్గాన్ని చేరాలన్న ఆశ–గుమ్మం వారనున్న ప్లాస్టిక్ క్రోటన్స్ నుంచి కూతురితో మాట్లాడే కొన్ని ఇంగ్లీషు ముక్కల దాకా–వ్యక్తమయ్యేది. ఇలాంటి పైపై సూచనల్ని బట్టి ప్రసాదు కసిగా ఆమెకో గతాన్ని కూడా ఊహించాడు: బహుశా నాన్న గారాబం కింద మగతోబుట్టువులతో సమానంగా పెరిగి, ఎన్నో ఆశలతో యవ్వనం దాటి, పెళ్ళయిన తర్వాత చుట్టూ ఎటు చూసినా ఇరుకు సరిహద్దులు నిట్రాటల్లా మొలుస్తుంటే, చివరికి ఈ పేద బస్తీలోకి వచ్చి పడి, వేసవిలో బండరాయిలాగా అసంతృప్తితో కాలుతున్నదేమో. ఈ క్రమంలో మృదుత్వం పోగొట్టుకుంది. ఆమె పిలకజడలో పువ్వులుంటాయి, బుగ్గలపై పౌడరుంటుంది, మనిషి కాస్త సౌమ్యురాలై ఉంటే ముఖంలో ఇప్పటికీ కనిపించే ఆడతనపు అవశేషాలు ఎంతోకొంత ప్రభావాన్ని కలిగించేవే; అదేం లేకపోవటంతో, ప్రసాదు ఎపుడైనా తన ఏకాకి ఒగుర్పుళ్ళలో ఊహలకి మరీ కరువాసిపోయి ఆమెకు మానసికంగా బట్టలిప్పినా, సుమో యోధుడు పొజిషన్లోకొచ్చి నిల్చున్నట్టే కనిపించి, అతని గుప్పిట్లోని వేడి బలుపు కాస్తా చల్లగా ముడుచుకుపోయేది. ఆమె భర్త మొదట్లో ఏమన్నా పైచేయికి ప్రయత్నించాడో లేదో తెలియదు కానీ, ఇప్పడు మాత్రం చేతులెత్తేసినట్టే కనిపిస్తాడు. బహుశా అతని ఉద్యోగం కుటుంబానికి ఏమీ ఒనగూర్చేది కాదేమో, లేదా పక్క మీద ఆమెని ద్రవింపజేసే చేవ లేదేమో, లేదా ఆమెని చాచి కొట్టింతర్వాత చివుక్కుమని తిరిగొచ్చే పశ్చాత్తాపాన్ని ఎక్కువకాలం ఎడంగా ఉంచటం చేత కాలేదేమో. మొత్తానికి ఏదో ఒక పాయింటు దగ్గర అతని చేతకానితనాన్ని మారుమాటలేకుండా ఖాయం చేసి, కుటుంబానికి ఆమె పురుషాంగమైంది. ప్రస్తుతం దద్దరిల్లే ఆమె వ్యక్తిత్వ ప్రదర్శనల వెనుక నీడలా నిశ్శబ్దంగా తచ్చాడుతూ ఉంటాడు భర్త.

ప్రసాదుకి బ్రహ్మచారి కొంపలు అలవాటే, బ్రహ్మచారుల గాలే పాతివ్రత్య భంగమన్నట్టు తొలగిపోయే కొందరి చిత్రమైన నకరాలూ కొత్త కాదు. కానీ తానే లక్ష్యంగా కురుస్తున్న ఇంత ధారాళమైన ద్వేషం కొత్త. ఆ ద్వేషం తనకు అందుతోందని ఆమెకు సరిగా తెలిసేలా చేయకపోవటం వల్లనేమో, పదే పదే ప్రదర్శించటానికి తయారయ్యేది. ఈమధ్య మరీ ఎక్కువైంది. దానికి కారణం ఎలైజానే అని తట్టినా తట్టనట్టే ఉన్నాడు. అతను కనపడినపుడు తలుపు వేసుకోవడం, అతని గదికి ఫ్రెండ్ ఎవరైనా వస్తే చాలు లోపల బారు ఓపెన్ కాబోతున్నట్టు ముఖం చిట్లించి జడ్జ్ చేయటం, కూతూహలంగా చూస్తున్న కూతుర్ని ఏదో చెడు ప్రభావాన్నించి కాచుకోవటానికన్నట్టు రెక్కపట్టుకుని లోపలికి లాగేయటం లాంటివి చేస్తోంది. ఆమెలో అంతకంతకూ వికృతంగా ప్రతిఫలిస్తున్న తన రూపం చూసుకున్నప్పుడల్లా అతనికి అసహ్యం వేసేది. ఇద్దరికీ పడ్డ ఈ లంకె వల్ల బయటవున్నప్పుడు కూడా ఆమె గుర్తు రావడం మొదలైంది. అతని ఆలోచనలు లలితంగా సాగుతున్నప్పుడు వాటిపై ఉమ్మేసి వెక్కిరించేందుకు ఆమె మనస్సాక్షి వేషంలో లోపలికి చొరబడేది. అతనిలో పెరిగిన కసికి నిదర్శనం ఒకానొక పగటివూహ: ఆమె ఉద్యోగానికి వీధిలో నడిచి వెళ్తున్నప్పుడు వెనక నుంచి హెల్మెట్ ముసుగులో బైకు మీద వెళ్ళి తల మీద మొట్టడం.

ఆ సాయంత్రం క్లినిక్ నుంచి వస్తున్నప్పుడు ప్రసాదు మనసు తుఫాను సూచనలతో గుబులుగా ఉన్న తీరంలా ఉంది. పెళుసు ధైర్యాన్ని కవచంగా ధరించి ఇంటికి వచ్చాడు. మెట్ల ఎత్తు పెరిగినట్టు బరువుగా ఎక్కాడు.

నడవాలో ఇదివరకూ లేని బల్బు ఒకటి పసుపుగా వెలుగుతూ ఆ చోటుకి కొత్తగా రాత్రి వ్యక్తిత్వాన్నిస్తోంది. ఎదురింటావిడ గడప మీద నైటీలో, జడలో దువ్వెనతో కూర్చుంది, అతడ్ని చూసి కదలబోయిన కూతురి భుజం మీద చేత్తో నొక్కింది. ఆ పిల్ల పెద్దాళ్ళ కోసమన్నట్టు లేని కలవరాన్ని నటించబోయింది కానీ, బాల్యపు దిలాసా వల్ల అది అణిచిపెట్టిన చిరునవ్వుగా మాత్రమే వ్యక్తమైంది. పక్కింటి ముసలావిడ కర్టెన్ పట్టుకుని ఏదో మాట్లాడుతున్నదల్లా పొయ్యి మీద పాలు గుర్తు చేసుకుని వెనుదిరిగి వెళ్ళిపోయింది. వెన్ను మీద దృష్టి బరువు మోస్తూ ప్రసాదు తాళం ఎలాగో తీసి లోపలికి చేరి తలుపు వేశాడు. లైటు వేసి, కూరలు బల్ల మీద పెట్టాడు. రాగానే బట్టలు మార్చుకునే అలవాటు మర్చిపోయి, ఇంకా నడవాలోనే తచ్చాడుతున్న మనసుని మోసుకుంటూ, అలికిడి కాకుండా పచార్లు చేస్తున్నాడు. పక్కింటావిడ పాలు కట్టేసి గుమ్మం దగ్గరికి వచ్చినట్టుంది; ఎదురింటావిడ గొంతు మళ్ళీ మొదలైంది. ఆమె మాటల్లో కొన్ని మూసిన తలుపు దాటి వచ్చి అతని చెవుల్ని కటువుగా తాకాయి: “సిగ్గూశరం”, “సంసారులకొంప”, “మర్యాదగా బతుకుతున్నాం”… ఇలాంటివి. ప్రసాదు లోంచి అప్పటికే ఒకడు బయటికొచ్చి, తలుపు తీసివెళ్ళి, దెబ్బలాడేస్తున్నాడు, ప్రసాదుని కూడా రమ్మని గుంజుతున్నాడు. అతని లోపలి దిటవుతో నిమిత్తం లేకుండా కాళ్ళు వణుకుతుంటే, అదేదో ఆకలి వల్ల అయినట్టు, కుర్చీలో కూలబడి, కూరల పాకెట్టు ఒకటి విప్పి, ఉత్తి బంగాళదుంప వేపుడు తింటున్నాడు. ఆమె ఊదరగొట్టడం ఆపలేదు. కాసేపటికి, ఊపిరి తీసుకోవాల్సి వచ్చిందో, అనదల్చుకున్నదంతా అనేసిందో మరి, నెమ్మదించింది. ప్రసాదు ఊరటగా నిట్టూర్చేంతలోనే, మరి పక్కింటావిడ ఏమని ఎగదోసిందో కానీ, ఉన్నట్టుండి గొంతు పెంచి ఒక మాటంది. అది ప్రసాదు చెవులు రిక్కించకుండానే వినపడింది:

“ఆ… ఊరుకోండాంటీగారూ మీరు! ఎవత్తి పద్ధతైన ఆడదో, ఎవత్తి బోకు లంజో నాకు తెలీదా. ముఖం చూసి చెప్తా.”

అస్తిత్వ కేంద్రంలో గుచ్చుకున్న ఈ అవమానంతో అతని ఛాతీ లోంచి మొదలైన వేడి ప్రకంపన ఒళ్ళంతా రోమాంచితం చేస్తూ కళ్ళల్లో ఎరుపు చారల తడిగా ఉబికింది. అతడ్ని అదుపు చేయాలని అన్ని నరాలూ కలవరంగా మూగుతుండగానే, విచక్షణ వడివడిగా చేరి భుజాన చేయి వేసి ఆపేలోగానే, విసురుగా లేచి, తలుపు తీసి, వాళ్ళ ముందుకొచ్చి నిలబడ్డాడు.

“ఏంటి?” అన్నాడు.

ఆమె గడప మీంచే కళ్ళు చిన్నవి చేసి అంది, “ఏంటేంటి?”

“ఎవరి గురించి మాట్లాడుతున్నారు?”

ఆమె పక్కింటావిడ వైపు తలతిప్పి, “ఏంటాంటీ ఈయన ఆడోళ్ళ మధ్య కొచ్చి దూరుతున్నాడు?” అంది.

పక్కింటావిడ కళ్ళలో ఎదురుచూసిన దొమ్మరాట మొదలైందన్న సంతోషం దొరికేస్తున్నా, మాటలో మాత్రం దయనీ పెద్దరికాన్నీ పలికింపజేస్తూ, నచ్చచెప్తున్నట్టు మూతి ముందుకు తెచ్చి అంది, “అయ్యో చెడ్డగా ఏం అనలేదు బాబూ, అక్కయ్య బాధపడుతుంది, చిన్న కుర్రాడివీ, పెళ్ళదీ అవ్వాల్సినవాడివీ, ఏంటిలా పాడైపోతున్నాడు పాపం అంటూను. ఆమెదంతా ముక్కుసూటి కదా, చెప్పటం చేతకాక–”

ఆమె మాటల్ని మధ్యలోనే కట్ చేస్తూ పైకి లేచింది ఎదురింటావిడ, “ఓ ఆంటీ! ఏంటి అక్కయ్యంటున్నారా! నా తమ్ముడే ఇట్లాంటి వేషాలేస్తే చెప్పుదీసుక్కొట్టి దార్లోకి తెస్తా. ఇది ఫ్యామిలీలుండే చోటు, ఉంటే పద్ధతిగా ఉండమనండి, లేదంటే ఖాళీ చేసి వెళ్ళిపొమ్మనండి. అంతేగాని, లంజలకొంపలో బిహేవ్ చేసినట్టు చేస్తా అంటే ఊరుకునేది లేదు,” అతను అక్కడ లేనేలేనట్టు, పక్కింటావిడతో గట్టిగా పట్టిపట్టి మాట్లాడింది.

“ఊరుకోక ఏం జేస్తావ్. నా ఇంట్లో ఏం జరిగితే నీకెందుకు, ఎవరొస్తే నీకెందుకు. నీ ఇంటికి ఎవరొస్తున్నారో నేను చూస్తున్నానా?” అన్నాడు ప్రసాదు.

“ఇదిగో నువ్వు మాటలు తిన్నగా రానీ,” అతని వైపు తిరిగి చూపుడు వేలు ఆడిస్తూ అంది.

ప్రసాదు అప్పటికే జ్వరప్రలాప దశకు వచ్చేశాడు. “ఏం చేస్తావ్ లేకపోతే?” అంటూ, ఏ క్షణమైనా పట్టు విడిచేట్టున్న కాళ్ళతో, ఒక అడుగు ముందుకు వేశాడు.

పక్కింటావిడ ఇక తన సరదా తీరిపోయినందుకో, లేక పోషించటానికి కొత్త పాత్ర దొరికినందుకో తెలియదు గానీ, ఆ క్షణం ప్రసాదు పాలిట దేవతే అయ్యి మధ్యలోకి వచ్చి కలగజేసుకుంది, “ఓయ్… ఏందల్లా మీరిద్దరూ. ఓయమ్మో నువ్వు లోపలికి పో ముందు,” అంటూ ఎదురింటావిడ భుజం మీద బహుశా అంతకుముందెన్నడూ లేని చొరవతో చేయేసింది. ఆమెని మెత్తగా గుమ్మం వైపు తోస్తోంది.

ఆమె కూతుర్ని నడుముకు చేరవేసుకుని గుమ్మం వైపు కదుల్తూ, యింకా చూపుడువేలు ప్రసాదు కేసి ఆడిస్తూనే, “ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు. పోలీసు కంప్లయింటు ఇస్తా ఏమనుకున్నావో,” అంది. “మీరుండండాంటీ,” అంటూ పక్కింటావిడని విదుల్చుకుని లోపలికి వెళ్ళింది.

పక్కింటావిడ ఈసారి అభాసుపాలైన ప్రసాదు వైపు వచ్చి, అతని వీపును తాకుతూ, అవసరం లేనంత మెల్లగా, “పో నాయనా లోపలికి పో! నేను మాట్లాడతాలే,” అంటూ గుమ్మం వైపు తోస్తోంది.

ప్రసాదు వెనక్కి తగ్గనివాడిలా–తనలాగే ఎదురింటావిడ కూడా తలుపు వెనక నక్కి వింటుందని ఊహించుకుంటూ–గట్టిగా అన్నాడు, “కాదండీ ఎక్కువ చేస్తుందామె. నేను ఎపుడైనా ఆమె జోలికి వెళ్లానా. ఏదో రిక్షావోడితో మాట్లాడినట్టు మాట్లాడుద్దేంటీ?” అనటం అన్నాడే కానీ, మళ్ళీ ఈ మాట మీద రెచ్చిపోయి ఎదురింటావిడ ఎక్కడ తలుపు తీసుకు వస్తుందో అన్న జంకు కలిగింది, “ఉండండి, నేను బయటకు వెళ్తున్నాను,” అంటూ పక్కింటావిడ చేయి తీసేసి మెట్లు దిగి చీకట్లోకి వెళ్ళిపోయాడు. ఆవిడ కాసేపలాగే నిలబడి, అపనమ్మకం నవ్వుతో తల అడ్డంగా ఆడిస్తూ, ఇంట్లోకి వెళ్ళిపోయింది, నడవాలో లైటు ఆరిపోయింది.

ప్రసాదు ఆ రాత్రి టిక్కెట్లు దొరికిన ఏదో థియేటర్లోకి దూరి, సభ్య సమూహం మధ్య వెచ్చగా కూర్చుని, ఎలైజా కరుణ చేసిన పన్నెండు కాల్సూ ఎత్తకుండా కసిగా నొక్కిపారేస్తూ, ఆమెతో సంబంధానికున్న విలువ ఇంకో అద్దెయిల్లు వెతుక్కునే కష్టం పాటి చేస్తుందా అని తర్కించుకుంటూ, తెర మీది దృశ్యాల్నే తప్ప కథ గ్రహించకుండా సినిమా చూడ్డం పూర్తి చేశాడు; రాత్రెప్పుడో మున్సిపాలిటీ వర్కర్లు చలిలో కాఫీలు ఊదుకుంటూ తాగుతున్న వేళకి, ఇక ఆలోచనల దారంచుట్టల్ని విప్పలేక అలసిన బుర్రతో గది చేరి నిద్రపోయాడు.

మరుసటి రోజు పొద్దున్న జరిగిన సన్నివేశాన్ని మాత్రం ఊహించలేదు. తలుపు చప్పుడైతే బిక్కుబిక్కుమంటూనే తీశాడు. బయట ఒక బురఖా ఆవిడ తనని ఇంటి ఓనరుగా పరిచయం చేసుకుంది. ప్రతి నెలా అద్దె ఆమె అకౌంటులో జమ చేసినపుడు ఫోన్లో బొంగురు గొంతు వినడమే తప్ప, మనిషిని ఎప్పుడూ చూడలేదు. బాంకు రశీదులో రాసే పేరుని బట్టి “ఫాతిమా”గా పరిచయం. ఆ బొంగురు గొంతుకీ, ఎందుకో ఆమె పేరుకీ నప్పేట్టే తెల్లగా, బొద్దుగా ఉంది. ఆమె వెంట ఎవరో పన్నెండేళ్ళ పిల్ల ఉంది. తర్వాత ఫాతిమా ప్రవర్తనని బట్టి, తనలాంటి వాడితో మాట్లాడుతోంది కాబట్టి ఆ పిల్లని తోడు తెచ్చుకుందేమో అనిపించింది ప్రసాదుకి. మర్యాదగానే మాట్లాడింది, కానీ చెప్పదల్చుకుంది చెప్పేసింది. ఎదురింటావిడ ఈమధ్య రోజూ ఫోన్లు చేసి ప్రసాదు గదికి ఆడాళ్ళని తెచ్చుకుంటున్నాడనీ, ఫ్రెండ్స్ తో కలిసి తాగుతున్నాడనీ చెప్తోందట. ఆమె పోరు భరించలేకపోతున్నాననీ, నిన్నటికి నిన్న పోలీస్ కంప్లయింటు ఇస్తానని రాద్ధాంతం చేసిందనీ, కాబట్టి ప్రసాదు ఖాళీ చేస్తే ఎవరన్నా ఫ్యామిలీకి ఇచ్చుకుంటాననీ చెప్పింది. చెప్పి వెళ్ళిపోయింది.

ప్రసాదు రోషపు ఊపిర్ల మధ్య చాలాసేపు కదలకుండా కూర్చున్నాడు.

3

కాసేపటికి గట్టిగా నిశ్వసించి కుర్చీ లోంచి లేచాడు, తలుపు తీసి, నడవా దాటి, ఎదురింటావిడ తలుపు తట్టాడు. తలంటిన జుట్టు తువ్వాల్లో చుట్టుకుంది, బొట్టులేని బోసి నుదుటికి అటూయిటూ కనుబొమ్మలు తడిగా అతుక్కుపోయి వున్నాయి. ఆమె వెనకాల ఎవరూ కనపడలేదు. “ఏంటి,” అంది. అతను ఆమెను వెనక్కు నెడుతూ లోపలికి వచ్చి, తలుపు బోల్టు వేసి, “అసలు నేనంటే నీకెందుకే అంత కసీ?” అంటూ ఆమెని అమాంతం మంచం మీదకు తోసి–

–లేదు, అలాంటిదేం జరగలేదు. కొన్నాళ్ళకే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు.

చాలాకాలం తర్వాత, ఒక ఉక్కపోస్తున్న వేసవి సాయంత్రం రన్నింగ్ బస్సు ఎక్కి చోటు లేక నిలబడితే, ఒకావిడ కూర్చోమన్నట్టు పక్కకు జరిగింది. సీటు దొరికిందన్న తొందరలో కూర్చున్నాకా గుర్తుపట్టాడు ఎదురింటావిడని. ఆమె గుర్తుపట్టాకనే కూర్చోమందో, కూర్చున్నాక గుర్తుపట్టిందో తెలీదు గానీ, “ఎక్కడుంటున్నావ్” అని బానే అడిగింది. ప్రసాదు చెప్పాడు. అంతటితో ఆగలేదు. పెళ్ళయిందాని అడిగి, పెళ్ళాంతో మంచిగా ఉంటున్నావా లేక… అని పరాచికమాడి, అప్పటి గొడవల్ని మళ్ళీ గుర్తుకు తెచ్చి, “నాకు నిజంగానే ఓ తమ్ముడు ఉన్నాడు. నువ్వలా చేస్తుంటే నాకు వాడే గుర్తొచ్చి బాధగా ఉండేది” అంటూ–

–లేదు, అలాక్కూడా ఏమీ జరగలేదు. అతను మళ్ళీ ఎదురింటావిడ్ని ఎప్పుడూ చూడలేదు. ఇవి అతనిలోని జెకిల్ అండ్ హైడ్‌లు మూడ్‍ని బట్టి సరఫరా చేసే కొన్ని ఊహలంతే. ఆమె మీద ద్వేషం అలానే ఉంది. ఇప్పటికీ ఆమె ఎపుడైనా జ్ఞాపకం వస్తే, దాంతోపాటే బైకు మీద వెళ్ళి మొట్టినట్టు ఊహ కూడా వస్తుంది. ఎంత స్పష్టంగా అంటే, ఇపుడది ఊహగా కాక జ్ఞాపకంగా మారిపోయింది.

ఆ ఇల్లు మారాకా ఎలైజా కరుణని పూర్తిగా పక్కన పెట్టేశాడు. సిమ్ మార్చినంత సులభంగా మర్చిపోయాడు. కానీ కాలం గడిచిన కొద్దీ ఆమె ప్రభావం నెమ్మదైన వరద మట్టంలా అతని చుట్టూ పెరిగింది. నకళ్ళ వంటి రోజుల్ని అలవాటు మత్తులో నెట్టుకొస్తున్నప్పుడు, కొన్ని క్షణాలు మాత్రం ఆమె చెలికత్తెలై చుట్టుముట్టేవి, గడియారపు పెత్తనం నుంచి అతడ్ని లాఘవంగా తప్పించి తలపులవనంలోని ఆమె చెంతకు చేర్చి మాయమయ్యేవి. తలచుకునేవాడు: “ఎలా ఉంది, ఇప్పటికైనా రాటుదేలిందా, ఒత్తిగిలి పడుకున్న ఆమె అందాన్ని ఇంకెవరైనా కనిపెట్టగలిగారా, కూతుర్ని చక్కగా పెంచిందా, ఆమెకో కొడుకు కూడా ఉంటే ఎంత బాగుండేదీ…” ఇలా అని.

*

'వాకిలి'లో ప్రచురితం