February 19, 2008

'గుట్టు చెప్పిన గుండె' - ఎడ్గార్ అలెన్ పో

నిజమే! — వ్యాకులత — చాలా, చాలా భీతి గొలిపే వ్యాకులతతో ఉన్నానూ, చాన్నాళ్ళుగా ఉంటున్నాను కూడా; కాని నేను పిచ్చివాడినని ఎందుకంటావు? ఈ కలత నా ఇంద్రియాలను పదునుదేర్చింది — పాడు చేయలేదు — వాటిని మొద్దుబార్చలేదు. అన్నిటినీ మించి నా వినికిడి శక్తి సునిశితమైంది. భూమ్మీద, స్వర్గంలో అన్నీ నాకు వినబడుతున్నాయి. పాతాళంలోంచీ నాకు చాలా వినబడుతున్నాయి. ఎలా, మరి, నేను పిచ్చివాడ్నవుతాను? విను! ఎంత స్వస్థతతో, ఎంత ప్రశాంతంగా నేను మొత్తం కథను చెప్పగలుగుతానో పరిశీలించు.
మొదట ఈ ఆలోచన నా మెదడులో ఎలా ప్రవేశించిందో చెప్పడం కష్టం; కాని ఓ సారి రూపుదిద్దుకున్నాక, ఇది పగలనక రాత్రనక నన్ను వెంటాడటం మొదలు పెట్టింది. ప్రత్యేక ఉద్దేశ్యమంటూ ఏదీ లేదు. ఉద్రేకమూ ఏమీ లేదు. నాకా ముసలాడంటే ఇష్టం కూడా. అతను నన్నెపుడూ తప్పుపట్ట లేదు. అతడు నన్నెపుడూ అవమానించ లేదు. అతని బంగారం మీద నాకే కోరికా లేదు. నాకు తెలిసీ కారణం అతని కన్ను! అవును అదే! అతని కళ్ళల్లో ఒకటి రాబందు కన్నును[1] పోలి ఉంటుంది — లేత నీలం కన్ను, పైన ఒక పొర. అది నాపై పడినపుడల్లా నా రక్తం చల్లబడేది; అందుకే ఆ ముసలాడి ప్రాణం తీసేయాలని, తద్వారా ఆ కన్ను నుండి శాశ్వతంగా విముక్తి పొందాలని, నేను క్రమంగా — అంచెలంచెలుగా — ఒక నిశ్చయానికొచ్చాను.

ఇదీ సందర్భం. నువ్వు నన్ను పిచ్చివాడని భ్రమిస్తావు. కాని నువ్వు నన్ను చూసి ఉండాల్సింది. నేనెంత తెలివిగా ముందుకు సాగానో — ఎంత జాగురూకతతో — ఎంత ముందు చూపుతో — ఎంత కుటిలత్వంతో నేను పనిలోకి మళ్ళానో నువ్వు చూసి ఉండాల్సింది. ఆ ముసలాడితో అతణ్ణి చంపక ముందు వారం రోజులూ ఉన్నంత దయగా నేనెపుడూ ఉండలేదు. ప్రతీ రోజూ రాత్రి, దాదాపు అర్థ రాత్రి, నేను అతడి తలుపును గొళ్ళెం తొలగించి తెరిచేవాణ్ణి — ఎంతో సున్నితంగా తెరిచేవాణ్ణి! తర్వాత, ఆ తలుపు చీలికలో నా తల పట్టేటంత వెడల్పు చేసాక, ఓ చీకటి లాంతరును[2], వెలుతురు బయటకు ప్రసరించకుండా మూసేసి, మొత్తం మూసేసి, లోపలకు చొప్పించేవాణ్ణి; పిమ్మట నా తలను లోనికి చొప్పించేవాణ్ణి. ఓహ్, నేను ఎంత జిత్తులమారితనంతో దాన్ని లోపలకు చొప్పించేవాడినో చూస్తే నువ్వు నవ్వుకొని ఉండేవాడివి. ముసలాడికి నిద్రాభంగం కలుగకుండా ఉండటానికి, నెమ్మదిగా — చాలా, చాలా నెమ్మదిగా, దానిని కదిల్చేవాడ్ని. అతను తన మంచం పై పడుకుని ఉండటం కనిపించేట్టుగా నా తలని చీలికలోనికి చేర్చడానికి, నాకు ఒక గంట పట్టేది. మరి! — పిచ్చివా డెవడైనా అయితే ఇంత యుక్తి చూపించేవాడా? పిమ్మట, నా తల పూర్తిగా గదిలోకి ప్రవేశించాక, లాంతరు తెరిచేవాడ్ని; జాగ్రత్తగా — ఓహ్, ఎంతో జాగ్రత్తగా — జాగ్రత్తగా (సీలలు కిర్రుమనకుండా) కేవలం ఒకే ఒక్క సన్నని వెలుగు కిరణం ఆ రాబందు కన్ను మీద పడేటట్టు లాంతరు తెరిచేవాడ్ని. ఇలా నేను ఏడు సుదీర్ఘమైన రాత్రులు చేసాను — ప్రతీ రాత్రి ఖచ్చితంగా అర్థ రాత్రి సమయానికి — కాని నాకెప్పుడూ ఆ కన్ను మూసుకునే కనిపించేది; అందువల్ల నా పని అసాధ్యమయ్యేది; ఎందుకంటే నన్ను వేధించేది ఆ ముసలివాడు కాదు, అతడి పాపిష్టి కన్ను. మళ్ళా ఉదయం మాత్రం, తెల్లవారగానే, నేను ధీమాగా గదిలోపలికి వెళిపోయేవాడ్ని; అతడ్ని ఆప్యాయంగా పేరుతో పిలుస్తూ, అతడి రాత్రి ఎలా గడిచిందో యోగ క్షేమాలడుగుతూ, ధైర్యంగా మాట్లాడేవాడ్ని. అందుకే చెప్తున్నాను, ఆ ముసలివాడు నిజంగా గొప్ప జ్ఞాని అయివుంటే తప్ప, ప్రతీ రోజూ రాత్రి, ఖచ్చితంగా పన్నెండు గంటలకు, అతడు నిద్రపోతుండగా నేను తొంగి చూస్తున్నానన్న అనుమానం కలిగే అవకాశం లేదు.

ఎనిమిదవ రోజున నేను తలుపు తెరవడంలో మామూలుగా కన్నా ఎక్కువ జాగరూకత వహించాను. నా చేతికన్నా ఓ గడియారపు నిముషం ముల్లు ఎక్కువ వేగంతో కదులుతుంది. ఆ రాత్రికి ముందెన్నడూ నేను స్వీయశక్తుల అవధుల్ని — నా వివేచనా శక్తిని — అంతగా అనుభూతించి యెరుగను. నా ఉత్సాహాన్ని అదుపులో పెట్టుకోవడం కష్టతరమయ్యింది. అసలా ఆలోచనే! — నేనక్కడ నిలబడి ఉండటం, తలుపును కొంచెం కొంచెం తెరుస్తుండటం, కాని అతనికి మాత్రం కలలో కూడా నా ఈ రహస్యపుటాలోచనల గురించీ, చర్యల గురించీ తెలిసే అవకాశం లేకపోవడం... ఈ ఊహకి సన్నగా నవ్వుకున్నాను; బహుశా అతడిది విన్నట్టున్నాడు — హఠాత్తుగా మంచంపై తుళ్ళిపడ్డట్టు కదిలాడు. ఇపుడు నేను వెనక్కి వచ్చేసి ఉంటానని నువ్వనుకోవచ్చు — ఊహుఁ, రాలేదు. అతడి గది తారులాంటి నల్లని చిమ్మ చీకట్లో ఉంది (ఎందుకంటే దోపిడీ దొంగల భయం వల్ల తలుపులన్నీ బిడాయించి వేయబడ్డాయి); కాబట్టి తలుపు తెరుచు కోవడాన్ని అతడు చూడలేడని నాకు తెలుసు; నేను దాన్ని నిలకడగా, నిలకడగా లోపలికి నెడుతూనే ఉన్నాను.

నేను నా తల పూర్తిగా లోపలికి తీసుకువచ్చి, లాంతరు తెరవబోతుంటే, నా బొటనవ్రేలు దాని లోహపు సీలపై జారింది. ముసలివాడు ఒక్క ఉదుటన మంచంపై లేచి అరిచాడు: “ఎవరది?”

నేను కదల్లేదు; మాట్లాడ లేదు. ఒక పూర్తి గంట ఒక్క కండరం కదల్చలేదు. ఈ పర్యంతం, లోపల అతడు నడుం వాల్చిన అలికిడీ విన రాలేదు. ఇంకా మంచం మీద కూర్చునే ఉన్నాడు; వింటున్నాడు – నేను విన్నట్టే, రాత్రి తర్వాత రాత్రి, గోడల్లో కంచరపురుగుల[3] శబ్దాలు.

ప్రస్తుతం నాకో సన్నని మూలుగు వినపడింది. నాకర్థమైంది; అది మృత్యుభీతితో మూల్గిన మూలుగు. అది వేదన వల్లనో, విచారం వల్లనో వెలువడే మూలుగు కాదు — కాదు, కాదు! — ఆత్మ పూర్తిగా భీతావహ మైనపుడు దాని అట్టడుగు లోతుల్లోంచి వెలువడే సన్నని, పూడుకుపోయిన ధ్వని. నాకు తెలుసా ధ్వని. చాలా రాత్రులు, సరిగ్గా అర్థరాత్రి, ప్రపంచమంతా నిద్రపోయినపుడు, నా రొమ్ముల్లోంచీ ఇలాంటి ధ్వనే వెల్లువెత్తేది; దాని మారుమ్రోతతో నన్ను కలచి వేసే భయాలు మరింత గాఢతరమయ్యేవి. నాకు ఖచ్చితంగా తెలుసా ధ్వని. నాకు తెలుసు యిపుడు ముసలివాడే స్థితిలో ఉన్నాడో; అతనిపై జాలి పడ్డాను, మనసులో మాత్రం నవ్వుకున్నాను. నాకు తెలుసు — మొదటి శబ్దం వెలువడినప్పటి నుండి, తను తన మంచంపై మొదటిసారి కదిలినప్పటి నుండి, అతడు మెలకువగానే పడుకొని ఉన్నాడు. అప్పటినుండీ అతనిలో భయాలు కూడగట్టుకుంటూనే ఉన్నాయి. అవన్నీ అర్థరహితమని నమ్మించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, కాని వల్ల కావట్లేదు. “ఇది పొగగూటిలో గాలి తప్ప మరేం కాదు — నేలపై పరిగెడుతున్న చుంచు అయివుంటుంది,” లేదంటే, “ఒకమారు కీచుమని మిన్నకున్న కీచురాయి బహుశా” — ఇలా అతడు తనకు తాను నచ్చ చెప్పుకుంటున్నాడు. అవును, ఈ ఊహలతో అతడు ఉపశమిల్ల ప్రయత్నిస్తున్నాడు; కాని అంతా చివరకు నిష్పలంగానే తోస్తుంది. అంతా నిష్పలమే; ఎందుకంటే మృత్యువు, అతడిని సమీపించే యత్నంలో, ముందుగా తన నల్లని నీడతో అతడి ఎదుట తచ్చాడింది; అది తన ఎరను నలువైపులా చుట్టుముట్టింది. ఈ అదృశ్యమైన నీడ యొక్క శోకగ్రస్త ప్రభావమే అతడి చేత — చూడక పోయినా, వినక పోయినా — ఆ గదిలో నా తల ఉనికిని గ్రహించేట్టు చేసింది.

సుదీర్ఘ సమయం చాలా సహనంతో వేచి చూసాక, అతడు తిరిగి నడుం వాల్చిన జాడలేవీ వినిపించకపోవడంతో, నేను లాంతరులో చిన్న — చాలా, చాలా చిన్న చీలిక తెరవాలన్న నిశ్చయానికి వచ్చాను. నువ్వూహించలేవు ఎంత గుట్టు గుట్టుగా తెరవడం మొదలుపెట్టానో. చీలిక నుండి ఒకే ఒక్క, సాలీడు దారం లాంటి, పల్చని కిరణం బయటకు చిమ్మి ఆ రాబందు కన్నును తాకే వరకూ, తెరుస్తూనే వచ్చాను.

ఆ కన్ను విప్పార్చుకుని ఉంది — బార్లా తెరుచుకుని ఉంది. దాన్ని చూడటం తోటే నాలో ఆగ్రహం పెల్లుబికింది. నేను దాన్ని పరిపూర్ణ స్పష్టతతో చూసాను — అంతా మబ్బు నీలం, పైన నా ఎముకల్లోని మజ్జనే వణికించేంతటి వికృతమైన ముసుగు; కాని నాకు ముసలాడి ముఖం, శరీరం యేదీ గోచరించ లేదు: ఎందుకంటే, ఏదో అంతః ప్రేరేపణ కొద్దీ అన్నట్టు నేనా కిరణాన్ని సరిగ్గా ఆ దరిద్రగొట్టు మచ్చ మీదే వదిలాను.

నేను నీకు చెప్పలేదూ నువ్వేది పిచ్చితనమని భ్రమిస్తున్నావో అది కేవలం ఇంద్రియాల సునిశితత్వం అని? — ఇప్పుడు, చెప్తున్నాను విను, ఓ ధ్వని నా చెవులను తాకింది — సన్నని, మెల్లని, చురుకైన ధ్వని — ఒక గడియారాన్ని నూలు గుడ్డలో చుట్టబెడితే వెలువడే ధ్వని లాంటిది. నాకు ఈ ధ్వని కూడా తెలుసు. ఇది ఆ ముసలాడి గుండె కొట్టుకుంటున్న ధ్వని. దుంధుబుల మ్రోత ఒక సైనికుడిలో ధైర్యాన్నెలా ఉత్తేజితం చేస్తుందో, ఇది అలా నాలో ఆగ్రహాన్ని మరింత అధికం చేసింది.

అయినా నన్ను నేను సంభాళించుకుని స్థిరంగా నిలబడ్డాను. ఊపిరి నిలిపి వేసాను. లాంతరును నిశ్చలంగా పట్టుకున్నాను. ఆ కిరణాన్ని ఎంత నిలకడగా కన్ను మీదనే నిలిపి ఉంచగలనో ప్రయత్నించాను. ఇంతలో ఆ గుండె యొక్క రౌరవ ఘోష ఉదృతమైంది. ప్రతీ క్షణానికీ దాని వడి పెరుగుతూ పెరుగుతూ పోతుంది; మరింత బిగ్గర బిగ్గరగా ధ్వనిస్తుంది! బహుశా ముసలివాడిలో భయం ఉఛ్ఛస్థాయిని చేరి ఉంటుంది! మరింత బిగ్గరగా, అవును, ప్రతీ క్షణానికి బిగ్గరగా ధ్వనిస్తుంది! — శ్రద్దగా వింటున్నావా? యిదివరకే చెప్పాను నేను వ్యాకులంగా ఉన్నానని: యిప్పుడూ అదే స్థితి నాది. దీనికి తోడు ఈ నిశీథిలో, ఎటూ కాని సమయంలో, ఈ పురాతన గృహపు భయంకర నిశ్శబ్దాన్ని చీలుస్తూ పెచ్చరిల్లుతున్న ఈ వింత శబ్దం నన్ను అవధుల్లేని భయ భీతుల్లో ముంచివేసింది. అయినా ఇంకొన్ని నిముషాలు నన్ను నేను సంభాళించుకుని స్థిరంగా నిల్చొన్నాను. కాని ఈ ఘోష బిగ్గరగా, మరింత బిగ్గరగా పెరుగుతూనే ఉంది! ఆ గుండె బద్దలౌతుందేమో ననిపించింది. ఇపుడు నన్నో కొత్త ఆందోళన చుట్టుముట్టింది — ఈ శబ్దం ఇరుగుపొరుగుకు వినపడితే! ముసలాడికి మృత్యుగడియ సమీపించింది! ఒక్క పొలికేకతో, లాంతరు భళ్ళున తెరిచి, గదిలోకి దుమికాను. అతడు ఒక్కసారి అరిచాడు — కేవలం ఒకే సారి. నేను క్షణంలో అతడ్ని నేల మీదకు ఈడ్చి, బరువైన పరుపును అతడి మీదకు లాగేసి నొక్కాను. అప్పటికి పని ముగిసిందనిపించి, ఉల్లాసంగా నవ్వుకున్నాను. కాని, చాలా నిముషాల పాటు, నొక్కుకుపోయిన ధ్వనితో గుండె కొట్టుకుంటూనే ఉంది. అయితే ఇది నన్నంతగా వేధించలేదు; యిది గోడ బయటకు వినిపించదు. క్రమ క్రమంగా యిదీ సద్దుమణిగింది. ముసలాడు చనిపోయాడు. నేను పరుపు తొలగించి శవాన్ని పరీక్షించాను. అవును, అతను పూర్తిగా చనిపోయాడు. నేను గుండె మీద చేయి వేసి కొన్ని నిముషాల పాటు పట్టి ఉంచాను. స్పందన లేదు. అతను పూర్తిగా చనిపోయాడు. అతని కన్ను ఇంక నన్ను బాధించదు.

నువ్వు నన్ను ఇంకా పిచ్చివాడిననే అనుకుంటున్నట్టయితే, నేనీ కళేబరాన్ని మరుగు పరచడానికి తీసుకున్న చురుకైన ముందుజాగ్రత్తలన్నీ వివరించిన తరువాత, యిక ఎంతమాత్రం అలా అనుకోవు. రాత్రి గడుస్తూండగా, నేను వేగంగా — కాని నిశ్శబ్దంగా — పనిలో నిమగ్నమయ్యాను. అన్నింటికన్నా ముందు నేను శవాన్ని ముక్కలు చేసాను. అతని తలనీ, చేతుల్నీ, కాళ్ళనీ నరికేసాను.

తర్వాత గది నేలలోంచి మూడు పలకల్ని[4] పెల్లగించి, మొత్తాన్ని క్రింద దూలాల మధ్య పేర్చాను. తర్వాత పలకల్ని తిరిగి యథారీతిన ఎంత యుక్తిగా, ఎంత కుత్సితంగా సర్దానంటే, ఏ మానవ నేత్రం — చివరికి అతడిది కూడా — అక్కడ ఏ తేడా పసిగట్ట లేకపోయేది. అక్కడ కడగడానికేం లేదు — ఏ మచ్చా — ఏ రక్తపు చుక్కా మిగల్లేదు. ఆ విషయంలో నేను చాలా జాగ్రత్త వహించాను. అంతా ఓ తొట్టిలో పిండేసాను — హ! హ్హ! హ్హా!

నేనీ పనులన్నింటికీ ముగింపు పలికే సరికి నాలుగయ్యింది — ఇంకా అర్థరాత్రి చీకట్లు అలుముకుని ఉన్నాయి. గడియారం గంట కొట్టడం తరువాయి, వీధి తలుపు తట్టిన చప్పుడు వినిపించింది. నేను తేలిక పడిన హృదయంతో దాన్ని తెరవడానికి వెళ్ళాను — ఇప్పుడిక నేను భయపడేందు కేముంది? లోనికి ప్రవేశించిన ముగ్గురు వ్యక్తులు, చక్కని హుందాతనంతో, తమని తాము పోలీసు అధికారులుగా పరిచయం చేసుకున్నారు. పొరుగువాడెవరికో రాత్రి ఒక అరుపు వినబడింది; పోలీసు కార్యాలయానికి సమాచారం అందింది; ప్రస్తుతం వారు (అధికారులు) ఈ పరిసరాల్ని తనిఖీ చేయడానికి నియమింపబడినవారు. 

నేను నవ్వాను — ఇప్పుడిక భయపడేందు కేముంది? ఆ పెద్దమనుషుల్ని సాదరంగా లోనికి స్వాగతించాను. ఆ అరుపు నేనే కలలో అరిచానన్నాను. ముసలివాడు ప్రస్తుతం దేశంలో లేడని చెప్పాను. నా అతిథులకు గృహమంతా తిప్పి చూపించాను. వారిని తనిఖీ చేసుకోమన్నాను — బాగా తనిఖీ చేసుకోమన్నాను. నేను వారిని, నిదానంగా, అతని గదికి తీసుకు వెళ్ళాను. లోపల భద్రంగా, చెక్కు చెదరకుండా ఉన్న అతని సంపదల్ని వారికి చూపించాను. నా విశ్వాసపు అత్యుత్సాహంలో నేను, ఆ గదిలోకి కుర్చీలు తెచ్చి, అలసట తీరేదాక వారిని యిక్కడే విశ్రమించమని కోరాను; నా పరిపూర్ణ సాఫల్యం అందించిన వెర్రి ధీమాతో నేను స్వయంగా నా కుర్చీని సరిగ్గా హతుడి శవం విశ్రమిస్తున్న స్థలం మీదనే వేసుకున్నాను.

అధికారులు సంతృప్తి చెందారు. నా ప్రవర్తన వారికి నమ్మకం కలిగించింది. నేను చాలా చలాకీగా ఉన్నాను. వారు కూర్చుని, కుశల ప్రశ్నలేస్తుంటే, నేను కులాసాగా సమాధానాలిచ్చాను. కాని, కాసేపటికి, నాలో సత్తువ జారిపోతున్న భావన కల్గింది, వారు వెళిపోతే బాగుండు ననుకున్నాను. నా తల నొచ్చడం మొదలైంది; చెవుల్లో ఏదో మ్రోత మోగుతుంది. కాని, వారింకా కూర్చునే ఉన్నారు, ఇంకా కబుర్లాడుతూనే ఉన్నారు. ఆ మ్రోత మరింత స్పష్టమయ్యింది — అది కొనసాగుతుంది, ఇంకా స్పష్టమయ్యింది. ఈ భావనను అధిగమించడనికి నేను మరింత ధారాళంగా మాట్లాడ సాగాను; కాని అది కొనసాగుతూనే వుంది, మరింత స్పష్టత పొందింది. చివరకు, కాసేపటికి, ఆ శబ్దం నా చెవుల్లోనిది కాదని నా కర్థమయ్యింది.

నాలో సత్తువ ఇప్పుడు మరింత సన్నగిల్లిందనడంలో అనుమానం లేదు; కాని నేను మరింత వాగ్దాటితో, మరింత హెచ్చు స్వరంతో మాట్లాడతూనే వున్నాను. అయినా ఆ ధ్వని పెరుగుతూనే ఉంది — నేనేం చేసేది? అది సన్నని, మెల్లని, చురుకైన ధ్వని — అచ్చం ఒక గడియారాన్ని నూలుగుడ్డలో చుట్టబెడితే వెలువడే ధ్వని లాంటిది. నాకు ఊపిరాడటం కష్టమయ్యింది — అయినా అధికారులు దాన్ని వినలేదు. నేను మరింత వేగంగా, మరింత తీవ్రంగా మాట్లాడ సాగాను; కాని ఆ శబ్దం క్రమంగా అధికమయింది. నేను పైకి లేచాను; స్వల్ప విషయాలపై — హెచ్చు స్వరంతో, తీవ్ర భంగిమలతో — వాదులాడటం మొదలుపెట్టాను; కాని ఆ శబ్దం క్రమంగా అధికమయ్యింది. వాళ్ళెందుకు వెళ్ళిపోరు? వాళ్ళ పరిశీలనలు నాలో ఆగ్రహాన్ని కలిగిస్తున్నట్లు నేను పెద్ద పెద్ద అంగలతో గదిలో అటూ ఇటూ పచార్లు చేసాను — కాని శబ్దం క్రమంగా అధికమయ్యింది. భగవంతుడా! నేనేం చేసేది? నేను బుసలు కొట్టాను — నేను ప్రలాపించాను — నేను దూషించాను! నేను కూర్చున్న కుర్చీని తిరగేసి, పలకలపై వికృతమైన ధ్వనితో రుద్దాను; కాని శబ్దం నలువైపులా ఉధృతమైంది, ఎడతెగకుండా అధికమవుతూనే ఉంది. అది మరింత బిగ్గరగా — బిగ్గరగా — బిగ్గరవుతూనే ఉంది! అయినా ఇంకా ఆ వ్యక్తులు ఉల్లాసంగా కబుర్లాడుతూనే ఉన్నారు; నవ్వుతున్నారు. వారికి వినబడకపోవడం సాధ్యమేనా? భగవంతుడా! — కాదు, కాదు! వాళ్ళు విన్నారు! — వాళ్ళు అనుమానించారు! వాళ్ళకు తెలుసు! — వాళ్ళు నా భయాన్ని ఎగతాళి చేస్తున్నారు! — యిలా ఆలోచించాను, అలా అలోచించాను. కాని ఈ యాతన కన్నా ఏదైనా సుఖమే! ఈ నీచమైన పరిహాసం కన్నా ఏదైనా సహ్యమే! నేనింక ఈ కపటమైన నవ్వుల్ని భరించలేను! నాకు బిగ్గరగా అరవాలనిపించింది లేదంటే  చచ్చిపోవాలనిపించింది! — మళ్ళీ యింకోసారి — మళ్ళీ! విను! బిగ్గరగా! బిగ్గరగా! బిగ్గర బిగ్గరగా! — 

“దుర్మార్గులారా!” నేనరిచాను, “ఇక నటించొద్దు! నేన్నా అకృత్యాన్ని ఒప్పుకుంటున్నాను! — పలకల్ని పెల్లగించండి! — ఇదిగో, ఇదిగో! — ఇదే కొట్టుకుంటున్న వాడి వికృతమైన గుండె!”

** ** **

వివరణలు:


[1] రాబందు కన్ను(Vulture's eye):
ముసలివాడి కన్ను బహుశా ఇలా ఉండొచ్చు.

[2] లాంతరు (Lantern):
[3] కంచరపురుగు (deathwatch beetle):
ఈ పురుగు పాత కలపలో చేరి తన దవడలతో లోపల కొరుకుతూ, లేదా కొడుతూ గడియారపు టిక్ టిక్ ధ్వని చేస్తుంది. ఇది జత కట్టడానికి చేసే ఈ ధ్వనిని కొన్ని పాశ్చాత్య దేశాల్లో మృత్యుశకునం గా భావిస్తారు.
[4] నేలపలకలు (Floorboards): 
ముసలివాణ్ణి పూడ్చిపెట్టింది ఇలాంటి పలకల క్రిందనే. 

February 3, 2008

వీడ్కోలు

రైలు కూత పెట్టింది. కిటికీ బయట వొంగినిల్చొని, ఆమెతో ఒక అందమైన ఆవరణలో సోలిపోయి ఏదో మాట్లాడుతున్నవాడల్లా... పరిసరాల్లోకి మేల్కొన్నాడు. ప్లాట్‌ఫాం, అనౌన్సుమెంట్లు, జనం రద్దీ. అప్పటిదాకా ప్రయత్నపూర్వకంగా మనసు అంచులవైపుకి నెట్టేసిన ఆలోచన ఇపుడు నల్లని నీడలాగా మళ్ళా మధ్యలోకి తోసుకొచ్చింది: ఆమె వెళ్ళిపోతోంది! నిజానికి ఆమె వెళ్ళిపోవటం, తర్వాత ఒంటరిగా రోజులు ఈడ్చుకురాగలగటం... వీటన్నిటి కంటే ముందు, అసలు రైలు వెళ్ళిపోయిన మరుక్షణం ప్లాట్‌ఫాం మీద ఒక్కడే మిగిలి వుంటాడన్న స్ఫురణే సత్తువ తోడేస్తుంది. అరగంట క్రితం ఆటోలో స్టేషన్‌కు వస్తుంటే, తన ఎడమ భుజంపై బరువుగా వాలిన తల నుంచి చామంతుల పచ్చి వాసన; తన గరుకు చెంపపై గాలికి చెదిరిన వెంట్రుకల చక్కిలిగిలి. పది నిముషాల క్రితం వరకూ ప్లాట్‌ఫాం మీది సిమెంటు బెంచీలో ఇద్దరూ కూర్చుని, చేతులు ముడేసుకుంటే అరచేతుల్లో వెచ్చదనం; పక్క బెంచీలో వాళ్ళమ్మ వొళ్ళో ముభావంగా, అలౌకికంగా బొటనవేలు చప్పరిస్తూన్న రెండేళ్ళ అపరిచితుడి ధ్యాస ఇటు మళ్ళించటానికీ, కాస్త నవ్వించటానికి తామిద్దరూ పోటాపోటీగా పడ్డ పాట్లు.... ఇపుడు కొద్ది క్షణాల్లో ఈ రాక్షస యంత్రం ఆమెనీ, ఆమెతనాన్నీ దూరంగా తీసుకు పోతుంది. మళ్ళీ వచ్చిన దారినే, శూన్యం తోడుగా, ఇంటికి వెళ్ళాలి. ఆమె వేరే ధ్యాసలో ఏదో మాట్లాడుతుంది. అతని కనుగుడ్లపై కన్నీటి పొర ఊరటం మొదలైంది. చేత్తో తుడిచేసుకునే వాడే కాని, ఒకవేళ ఆమె ఇప్పటిదాకా చూడకపోయుంటే అలా తుడుచుకోవటం ద్వారా దొరికిపోతాడేమోనన్న సంకోచం. ఈ దీనావస్థలో తన మీద తనకు కలిగిన జాలి కన్నీటి ఊటని ఇంకాస్త పెంచింది. మట్టం ఏ క్షణమైనా రెప్పలు దాటి చెంపలమీదకి పొంగేలా ఉంది. అదృష్టంకొద్దీ ఆమె పక్కన కూర్చున్న వాళ్ళు ఏదో అడిగితే అటు తిరిగింది. ఈ కాస్త సందులో తనివితీరా కళ్ళు తుడుచుకున్నాడు. రైలు సందిగ్ధంగా కదిలి, ఆగి, మరలా కదిలింది. చుట్టు ప్రక్కల కిటికీల దగ్గిర వున్న జనాల్లో సందడి పెరిగింది. వీడ్కోలు మాటలు (కొన్ని ఆ క్షణంకోసమని ముందే దాచి పెట్టుకున్నవీ, కొన్ని అప్పటికప్పుడు తట్టినవీ) ముక్కలు ముక్కలుగా వినపడుతున్నాయి: "చేరగానే ఫోన్...", "టాబ్లెట్స్ జాగ్రత్తగా...", "అంకుల్న డిగానని...", "ఏసేహీ కభీ, ఈద్ కా చాంద్...". ఆమె ఏదో ఆశింపుగా కళ్ళలోకి చూస్తుంది. తనకి మాత్రం మాట పెగలడం లేదు. కిటికీ ఊచలమీద ఉన్న ఆమె చేతిపై చేయి వేసి, రైలుతో పాటు నడిచాడు. అంత కదలికలోనూ ఇద్దరి చూపులూ మాత్రం అతుక్కుపోయున్నాయి. రైలు స్పీడు పెరిగింది. వేగంగా నడుస్తున్నాడు. జనాలు అడ్డొస్తున్నారు. తను మాత్రం చేతిపై నుండి చేయి తీయకుండా, నడకా పరుగూ కలిపి తోసుకొస్తున్నాడు... "ఆగిపోరా!" జాలిగా అంది. ఊచలమీంచి చేయి తీసేసి నిలిచిపోయాడు. ఆ పెట్టె మిగతా పెట్టెల్లో కలిసి ముందుకు వెళిపోయింది. ఆమె ఊచలకు మొహం అదిమి పెట్టి తొంగి చూస్తోంది. ఎదర పట్టాలు అతనికి ఎడంగా ఒంపు తిరిగి ఉండటం వల్ల ఆ మలుపులో ఆమె కిటికీ మాయమై పోయింది. కానీ ఊచల మధ్య నుంచి బయటపెట్టిన చేయి మాత్రం ఇంకా తననుద్దేశించి ఊగుతోంది. క్షణం క్రితం తన చేతిలో ఉన్న చేయి, ఇపుడు దూరంగా సంబంధం లేకుండా గాల్లో ఊగుతూ.... ఇదేమన్నా మార్చలేని విధా? తల వొంచి తీరాలా? రైలు స్పీడు ఇంకా అందుబాటులోనే ఉంది. ఉన్నపళంగా పెరిగెట్టి అందిన భోగీలోకి ఎక్కేస్తే. మరి టికెట్...? హూ గివ్సె షిట్! తెగింపు ఓ కొలిక్కి రాక ముందే రైలు వెళ్ళిపోయింది. చివరి భోగీ వెనుక తాపడమై ఉన్న ఎర్రని బల్పు అతని పిచ్చి ఆలోచనల్ని వెక్కిరిస్తున్నట్టు వెలిగి ఆరుతుంది. అతను కాసేపలాగే శిల్పంలాగ నిలబడ్డాడు. నిట్టూర్చి, వెనుదిరిగాడు. ప్లాట్‌ఫాం, అనౌన్సుమెంట్లు, జనం రద్దీ.